Jump to content

పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి


పోతన తెలుగు భాగవతము
చతుర్ధ స్కంధము

తెభా-4-1-క.
శ్రీ విలసితధరణీతన
యాదన సరోజ వాసరాధిప! సిత రా
జీదళనయన! నిఖిల ధ
రార నుత సుగుణధామ! రాఘవరామా!

టీక:- శ్రీవిలసితధరణీతనయావదనసరోజవాసరాధిప = శ్రీరామ {శ్రీవిలసిత ధరణీ తనయా వదనసరోజ వాసరాధిప - శ్రీ (లక్ష్మీదేవివలె, శుభకరమైన) విలసిత (ప్రకాశముగల) ధరణీ (భూదేవి యొక్క) తనయా (పుత్రిక, సీతాదేవి) వదన (మోము అనెడి) సరోజ (పద్మమునకు) వాసరాధిప (వాసరములకు (పగళ్ళకు) అధిపతి, సూర్యుడా), శ్రీరామ}; సితరాజీవదళనయన = శ్రీరామ {సితరాజీవ దళ నయన - సిత (తెల్లని) రాజీవ (తామరపువ్వు) దళ (రేకుల) వంటి నయన (కన్నులు గల వాడు), శ్రీరామ}; నిఖిల ధరావర నుత సుగుణధామ = శ్రీరామ {నిఖిల ధరావర నుత సుగుణధామ - నిఖిల (సమస్తమైన) ధరావర (రాజుల) చేత నుత (స్తోత్రము చేయబడిన) గుణములకు ధామ (నిలయ మైనవాడ), శ్రీరామ}; రాఘవరామా = శ్రీరామ {రాఘవరామా - రాఘవ (రఘు వంశమునకు చెందిన) రామ, శ్రీరామ}.
భావము:- శ్రీమహాలక్ష్మీతేజోరూపి, ఓర్పుకు మారుపేరైన భూదేవి పుత్రిక అయిన సీతదేవి మోము అనే పద్మాన్ని ప్రకాశింపజేసే దినకరుని వంటి వాడు; తెల్ల తామర పూరేకుల వంటి కన్నులు గలవాడు; సమస్తమైన రాజులు అందరిచేత స్తుతింపబడే సుగుణాలతో అలరారేవాడు; అయినట్టి ఓ రఘువంశపు శ్రీరామ! నీకు వందనములు.

తెభా-4-2-వ.
మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యానవైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; “అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.
టీక:- మహనీయ = గొప్ప; గుణ = గుణములు గలవారిలో; గరిష్ఠులు = ఉత్తములు; అగు = అయినట్టి; ఆ = ఆ; ముని = యోగులలో; శ్రేష్ఠులు = గొప్పవారల, శౌనకాదుల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = సవివరముగ చెప్పు; వైఖరీ = నేర్పు; సమేతుండు = కలిగినవాడు; ఐన = అయినట్టి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; ప్రాయోపవిష్టుండు = దేహము విడుచు దీక్షలోనున్నవాడు; ఐన = అయినట్టి; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రున్ = రాజున {నరేంద్రుడు - నరులకు ప్రభువు, రాజు}; కున్ = కు; శుక = శుకుడు అనెడి; యోగీంద్రుడు = యోగులలో శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూతమహర్షి ఇలా అన్నాడు. "శుకమహర్షి ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజుతో ఇలా అన్నాడు.