పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/పూర్ణి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-3-1052-చ.
కసుతా మనో విమల సారస కోమల చంచరీక! చం
శరదిందు కుంద హర తార మరాళ పటీర చంద్రికా
వినుత యశోవిశాల! రఘువీర! దరస్మిత పద్మపత్ర లో
! నిటలాంబకప్రకటచాపవిఖండన! వంశమండనా!

టీక:- జనక = జనకుని; సుతా = పుత్రిక యొక్క; మనస్ = మనస్సు అనెడి; సారస = పద్మము నందలి; కోమల = మృదువైన; చంచరీక = తుమ్మెదా; చందన = చందనము; శరత్ = శరత్కాలపు; ఇందు = చంద్రుని; కుంద = మల్లెపువ్వు; హర = శివుని; తార = చుక్కల; మరాళ = హంస; పటీర = మంచిగంధము; చంద్రికా = వెన్నెలల వంటి; వినుత = స్తుతింపబడిన; యశస్ = కీర్తి; విశాల = విరివిగా కలవాడా; రఘు = రఘువంశపు; వీర = వీరుడా; దరస్మిత = చిరునవ్వుకల; పద్మ = పద్మముల; పత్ర = రేకుల వంటి; లోచన = కన్నుల కలవాడా; నిటలాంబక = శంకరుని {నిటలాంబకుడు - నిటలము (నుదురు) అందు అంబకము (కన్ను) కలవాడు, శివుడు}; ప్రకట = ప్రసిద్ధమైన; చాప = విల్లును; విఖండ = విరిచినవాడా; వంశ = వంశమును; మండనా = అలంకారము అయినవాడా.
భావము:- జానకీదేవి యొక్క స్వచ్ఛమైన హృదయకమలంలో విహరించే భ్రమరమైనవాడా! చందనంవలె, శరచ్చంద్రునివలె, మొల్లపువ్వువలె, పరమశివునివలె, ముత్యంవలె, హంసవలె, గంధంవలె, వెన్నెలవలె తెల్లనై అంతటా వ్యాపించిన కీర్తి కలవాడా! చిరునవ్వు లొలికే కమల దళాలవంటి కన్నులు కలవాడా! శివుని ధనుస్సును విరిచినవాడా! సూర్యవంశాన్ని అలంకరించినవాడా!

తెభా-3-1053-త.
మపావన! విశ్వభావన! బాంధవప్రకరావనా!
ధిశోషణ! సత్యభాషణ! త్కృపామయ భూషణా!
దురితతారణ! సృష్టికారణ! దుష్టలోక విదారణా!
ణిపాలన! ధర్మశీలన! దైత్యమర్దన ఖేలనా!

టీక:- పరమ = అత్యుత్తమమైన; పావన = పవిత్రత కలవాడా; విశ్వ = విశ్వమంతటను; భావన = తలచుకొనబడువాడా; బాంధవ = బంధువుల; ప్రకర = సమూహములకు; అవన = కాపాడువాడా; శరధి = సముద్రమును; శోషణ = ఆవిరిచేసినవాడా; సత్య = సత్యము; భాషణ = మాట్లాడువాడా; సత్ = మంచి; కృపా = దయతో; మయ = కూడుట అను; భూషణా = భూషణము కలవాడా; దురిత = పాపులను; తారణ = తరింప చేయువాడా; సృష్టి = సృష్టికి; కారణా = కారణము అయినవాడా; దుష్ట = దుష్టులగు; లోక = జనులను; విదారణ = సంహరించువాడా; ధరణి = భూమిని; పాలన = పాలించునాడా; ధర్మ = ధర్మబద్ధమైన; శీలన = శీలము కలవాడా; దైత్య = రాక్షసులను; మర్దన = శిక్షంచుట అను; ఖేలనా = క్రీడ కలవాడా.
భావము:- పరమపవిత్రా! విశ్వభావనా! సముద్రశోషణా! సత్యభాషణా! అపార కృపాగుణ భూషణా! దురితాలనుండి గట్టెక్కించేవాడా! సకల లోకాలను సృష్టించేవాడా! దుండగులను చీల్చి చెండాడేవాడా! ధరిత్రిని పాలించేవాడా! ధర్మాన్ని లాలించేవాడా! దైత్యులను నిర్మూలించేవాడా!

తెభా-3-1054-మాలి.
దివిజగణశరణ్యా! దీపితానంతపుణ్యా!
ప్రవిమల గుణజాలా! క్తలోకానుపాలా!
తిమిర దినేశా! భానుకోటిప్రకాశా!
కులయహితకారీ! ఘోరదైత్యప్రహారీ!

టీక:- దివిజ = దేవతల; గణ = సమూహమునకు; శరణ్యా = శరణమగువాడా; దీపిత = ప్రకాశించెడి; అనంత = అనంతమైన; పుణ్యా = పుణ్యములు కలవాడా; ప్రవిమల = మిక్కిలి స్వచ్ఛమైన; గుణ = సుగుణముల; జాలా = సమూహములు కలవాడా; భక్త = భక్తులగు; లోకాన్ = జనులను; అనుపాలా = పరిపాలించువాడా; భవ = సంసారము అనెడి; తిమిర = చీకటికి; దినేశ = సూర్యుడా {దినేశుడు - దినము (పగలు)నకు ఈశుడు (ప్రభువు), సూర్యుడు}; భాను = సూర్యులు; కోటి = కోటిమందికి సమానమైన; ప్రకాశా = ప్రకాశము కలవాడా; కువలయ = భూమండలమునకు; హిత = మేలు; కారీ = చేయువాడా; ఘోర = భయంకరమైన; దైత్య = రాక్షసులను; ప్రహారీ = సంహరించువాడా.
భావము:- దేవతలకు ఆశ్రయమైనవాడా! అనంత పుణ్యాలతో ప్రకాశించేవాడా! సుగుణాలు కలవాడా! భక్తులను కాపాడేవాడా! సంసారమనే అంధకారానికి సూర్యునివంటివాడా! కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేవాడా!భూమికి మేలు చేకూర్చేవాడా! దుష్టులైన రాక్షసులను నాశనం చేసేవాడా!

తెభా-3-1055-గ.
ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబయిన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందు విదురనీతియు విదురుని తీర్థాగమనంబును యుద్ధవ సందర్శనంబును కౌరవ యాదవ కృష్ణాది నిర్యాణంబును గంగాద్వారంబున విదురుండు మైత్రేయునిం గనుగొనుటయు విదుర మైత్రేయ సంవాదంబును జగదుత్పత్తి లక్షణంబును మహదాదుల సంభవ ప్రకారంబును మహదాదులు నారాయణు నభినందించుటయు విరాడ్విగ్రహ ప్రకారంబును శ్రీమహాభాగవత భక్తి కారణంబగు పద్మసంభవు జన్మప్రకారంబును బ్రహ్మతపంబును బరమేష్టికిఁ బుండరీకాక్షుండు ప్రత్యక్షంబగుటయు బ్రహ్మకృతం బైన విష్ణుస్తోత్రంబును గమలసంభవుని మానససర్గంబును బరమాణువుల పుట్టువును భూర్భువస్సురాది లోకవిస్తారంబును గాల దివస మాస వత్సరాది నిర్ణయంబును నాయుఃపరిమాణంబును జతుర్యుగ పరిమాణంబును బద్మసంభవు సృష్టిభేదనంబును సనకాదుల జన్మంబును స్వాయంభువమనువు జన్మంబును శ్రీహరి వరాహావతారంబును భూమ్యుద్ధరణంబును సూకరాకారుండైన హరిని విధాత స్తుతించుటయు దితి కశ్యప సంవాదంబును గశ్యపుండు రుద్రుని బ్రశంసించుటయుఁ గశ్యపువలన దితి గర్భంబు ధరించుటయుఁ దత్ప్రభావంబునకు వెఱచి దేవతలు బ్రహ్మసన్నధికిం జని దితిగర్భప్రకారంబు విన్నవించుటయు సనకాదులు వైకుంఠంబున కరుగుటయు నందు జయవిజయుల కలిగి సనకాదులు శపించుటయు శ్రీహరిదర్శనంబును సనకాదులు హరిని నుతించుటయు బ్రాహ్మణ ప్రశంసయు హిరణ్యకశిపు హిరణ్యాక్షుల జన్మప్రకారంబును హిరణ్యాక్షుని దిగ్విజయంబును సవనవరాహ హిరణ్యాక్షుల యుద్ధంబును బ్రహ్మస్తవంబును హిరణ్యాక్ష వధయు నమరగణంబులు శ్రీహరి నభినందించుటయు హరి వరాహావతార విసర్జనంబు సేయుటయును దేవ తిర్యఙ్మనుష్యాదుల సంభవంబును గర్దమమహాముని తపంబునకు సంతసించి శ్రీహరి ప్రత్యక్షంబగుటయుఁ గర్దముండు స్వాయంభువమనుపుత్రి యైన దేవహూతిం బరిణయం బగుటయు దేవహూతి పరిచర్యలకు సంతసిల్లి కర్దముండు నిజయోగ కలితం బగు విమానంబు నందు నిలిచి సహస్రదాసీపరివృత యైన దేవహూతింగూడి భారతాది వర్షంబులు గలయంగ్రుమ్మరుటయు దేవహూతి గర్దమునివలనఁ గన్యకానవకంబును గపిలుని గనుటయు దత్కన్యకావివాహంబులును గర్దముని తపోయాత్రయుఁ గపిల దేవహూతి సంవాదంబును శబ్దాదిపంచతన్మాత్రల జన్మప్రకారంబును బ్రహ్మాండోత్పత్తియు విరాట్పురుష కర్మేంద్రియ పరమాత్మ ప్రకారంబును బ్రకృతిపురుష వివేకంబును నారాయణుని సర్వాంగస్తోత్రంబును సాంఖ్యయోగంబును భక్తియోగంబును జీవునకైన గర్భసంభవ ప్రకారంబును జంద్ర సూర్య మార్గంబును బిత్రుమార్గంబును దేవహూతి నిర్యాణంబును గపిలమహాముని తపంబునకు జనుటయు నను కథలు గల తృతీయస్కంధము సంపూర్ణము.
టీక:- ఇది = ఇది; శ్రీ = శ్రీ; పరమేశ్వర = భగవంతుని {పరమేశ్వరుడు - ఉత్కృష్టమైన ఈశ్వరుడు}; కరుణా = దయవలన; కలిత = పుట్టిన; కవితా = కవిత్వ రచనలో; విచిత్ర = విశేషమైన చిత్రములు కలవాడును; కేసనమంత్రి = కేసనమంత్రికి; పుత్ర = పుత్రుడును; సహజ = స్వాభావికమైన; పాండిత్య = పాండిత్యము కలవాడును; పోతనామాత్య = పోతనామాత్యునిచే; ప్రణీతంబున్ = చక్కగా రచింపబడినది; ఐన = అయినట్టి; శ్రీ = శుభకరమైన; భాగవతంబున్ = భాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = లో; విదురనీతియు = విదురనీతియును; విదురుని = విదురుని యొక్క; తీర్థా = తీర్థములకు; ఆగమనంబును = ప్రయాణములును; ఉద్ధవ = ఉద్ధవుని; సందర్శనంబునున్ = సందర్శించుటయును; కౌరవ = కౌరవులు; యాదవ = యాదవులు; కృష్ణ = కృష్ణుడు; ఆది = మొదలైనవారి; నిర్యాణంబునున్ = మరణములును; గంగా = గంగ; ద్వారంబునన్ = వద్ద; విదురుండు = విదురుడు; మైత్రేయునిన్ = మైత్రేయుని; కనుగొనుటయున్ = దర్శించుటయును; విదుర = విదురుని; మైత్రేయ = మైత్రేయుని; సంవాదంబును = సంభాషణములును; జగత్ = విశ్వము యొక్క; ఉత్పత్తి = సృష్టి; లక్షణంబునున్ = రహస్యములును; మహత్ = మహత్తు; ఆదుల = మొదలగువాని; సంభవ = పుట్టుక; ప్రకారంబునున్ = విధములును; మహత్ = మహత్తు; ఆదులు = మొదలగునవి; నారాయణున్ = నారాయణుని; అభినందించుటయున్ = స్తుతించుటయును; విరాడ్విగ్రహ = విరాడ్విగ్రహము యొక్క; ప్రకారమును = వివరములును; శ్రీమహాభాగవత = శ్రీమహాభాగవత; భక్తిన్ = భక్తియోగమునకు; కారణంబున్ = కారణము; అగు = అయిన; పద్మసంభవు = బ్రహ్మదేవుని {పద్మసంభవుడు - పద్మమున సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; జన్మ = పుట్టుక; ప్రకారంబునున్ = వివరములును; బ్రహ్మ = బ్రహదేవుని; తపంబున్ = తపస్సును; పరమేష్టి = బ్రహ్మదేవుని {పరమేష్టి - పరమము (ఉత్తమమైన) ఇష్టి (యజ్ఞము) అయినవాడు, బ్రహ్మదేవుడు}; కిన్ = కి; పుండరీకాక్షుండు = విష్ణుమూర్తి {పుండరీకాక్షుడు - పుండరీకముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; ప్రత్యక్షంబున్ = ప్రత్యక్షము; అగుటయున్ = అగుటయును; బ్రహ్మ = బ్రహ్మదేవునిచే; కృతంబున్ = చేయబడినది; ఐన = అయినట్టి; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; స్తోత్రంబునున్ = స్తోత్రమును; కమలసంభవుని = బ్రహ్మదేవుని {}; మానస = మనస్సునుండి జరిగిన; సర్గంబును = సృష్టియును; పరమాణు = పరమాణువుల; పుట్టువును = పుట్టుకయును; భూః = భూలోకము; భువః = భువర్లోకము; సువః = సువర్లోకము; ఆది = మొదలగు; లోక = లోకముల; విస్తారంబునున్ = విస్తరిల్లుటయును; కాల = కాలము; దివస = దినము; మాస = నెలలు; వత్సర = సంవత్సరములు; ఆది = మొదలగువాని; నిర్ణయంబును = నిర్ణయమును; ఆయుఃపరిమాణంబునున్ = ఆయుఃపరిమాణములును; చతుర్యుగ = చతుర్యుగముల; పరిమాణంబునున్ = పరిమాణమును; పద్మసంభవు = బ్రహ్మదేవుని; సృష్టి = సృష్టిలోని; భేదనంబునున్ = భేదములును; సనక = సనకుడు; ఆదుల = మొదలగువారి; జన్మంబును = పుట్టుకయును; స్వాయంభువ = స్వాయంభువ; మనువు = మనువు యొక్క; జన్మంబునున్ = పుట్టుకయును; శ్రీహరి = విష్ణుమూర్తి; వరహావతారంబునున్ = వరహావతారమును; భూమి = భూమియొక్క; ఉద్ధరణంబునున్ = ఉద్ధరణమును; సూకర = వరాహము యొక్క; ఆకారుండు = ఆకారము కలవాడు; ఐన = అయిన; హరిని = విష్ణుమూర్తిని; విధాత = బ్రహ్మదేవుడు; స్తుతించుటయునున్ = స్తోత్రముచేయుటయును; దితి = దితి; కశ్యప = కశ్యపుల; సంవాదంబునున్ = సంభాషణములును; కశ్యపుండు = కశ్యపుడు; రుద్రునిన్ = శంకరుని; ప్రశంసించుటయున్ = స్తుతించుటయును; కశ్యపు = కశ్యపుని; వలనన్ = వలన; దితి = దితి; గర్భంబున్ = గర్భమును; ధరించుటయున్ = ధరిచుటయును; తత్ = దాని; ప్రభావంబున్ = ప్రభావమున; కున్ = కు; వెఱచి = భయమంది; దేవతలు = దేవతలు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; సన్నిధికిన్ = సమీపమున; కిన్ = కి; చని = వెళ్ళి; దితి = దితి యొక్క; గర్భ = గర్భము యొక్క; ప్రకారంబున్ = విధమును; విన్నవించుటయున్ = తెలుపుటయును; సనక = సనకుడు; ఆదులు = మొగలగువారు; వైకుంఠమున్ = వైకుంఠమున; కున్ = కు; అరుగుటయున్ = వెళ్ళుటయును; అందున్ = అక్కడ; జయ = జయుడు; విజయుల్ = విజయుల; కున్ = ఎడల; అలిగి = కోపించి; సనక = సనకుడు; అదులు = మొదలగువారు; శపించుటయున్ = శపించుటయును; శ్రీహరి = శ్రీమహావిష్ణువు; దర్శనంబునున్ = దర్శనమును; సనక = సనకుడు; ఆదులు = మొదలగువారు; హరిని = విష్ణుమూర్తిని; నుతించుటయున్ = స్తుతించుటయును; బ్రాహ్మణ = బ్రాహ్మణులను; ప్రశంసయున్ = ప్రశంసించుటయును; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుడు; హిరణ్యాక్షుల = హిరణ్యాక్షుల; జన్మ = పుట్టుక; ప్రకారంబునున్ = విధమును; హిరణ్యాక్షుని = హిరణ్యాక్షుని; దిగ్విజయంబునున్ = దిక్కులను జయించుటయును; సవన = యజ్ఞ; వరాహ = వరాహము; హిరణ్యాక్షుల = హిరణ్యాక్షుల; యుద్ధంబునున్ = యుద్ధమును; బ్రహ్మ = బ్రహ్మదేవుని; స్తవంబునున్ = స్తవమును; హిరణ్యాక్ష = హిరణ్యాక్షుని; వధయున్ = సంహారమును; అమర = దేవతా; గణంబులు = సమూహములు; శ్రీహరిన్ = విష్ణుమూర్తిని; అభినందించుటయున్ = స్తుతించుటయును; హరి = నారాయణుడు; వరాహావతార = వరాహావతారమును; విసర్జనంబున్ = ఉపసంపారమును; చేయుటయున్ = చేయుటయును; దేవ = దేవతలు; తిర్యక్ = జంతువులు; మనుష్య = మనుష్యులు; ఆదుల = మొదలగువారి; సంభవంబునున్ = సృష్టియును; కర్దమ = కర్దముడు అనెడి; మహా = గొప్ప; ముని = ముని; తపంబున్ = తపస్సున; కున్ = కు; సంతసించి = సంతోషించి; శ్రీహరి = విష్ణుమూర్తి; ప్రత్యక్షంబున్ = ప్రత్యక్షము; అగుటయున్ = అగుటయును; కర్దముండు = కర్దముడు; స్వాయంభువ = స్వాయంభువ; మను = మనువు యొక్క; పుత్రి = కూతురు; ఐన = అయిన; దేవహూతిన్ = దేవహూతిని; పరిణయంబున్ = వివాహము; అగుటయున్ = చేయుకొనుటయును; దేవదూతి = దేవహూతి; పరిచర్యల్ = పరిచర్యల్; కున్ = కు; సంతసిల్లి = సంతోషించి; కర్దముండు = కర్దముడు; నిజ = తన యొక్క; యోగ = యోగ శక్తిచే; కలితంబున్ = సృష్టింప బడినది; అగు = అయిన; విమానంబున్ = విమానము; అందున్ = లో; నిలిచి = వసించి; సహస్ర = వేయిమంది; దాసీ = దాసీలుతో; పరివృత = సేవింపబడుతున్నది; ఐన = అయిన; దేవహూతిన్ = దేవహూతితో; కూడి = కలిసి; భారత = భారతవర్షము; ఆది = మొదలగు; వర్షంబులున్ = వర్షములను; కలయన్ = కలియ; గ్రుమ్మరుటయున్ = తిరుగుటయును; దేవహూతి = దేవహూతి; కర్దముని = కర్దముని; వలనన్ = వలన; కన్యకా = ఆడపిల్లలు; నవకంబునున్ = తొమ్మండ్రుగురిని; కపిలునిన్ = కపిలుని; కనుటయున్ = జన్మనిచ్చుటయును; తత్ = ఆ; కన్యకా = ఆడపిల్లల; వివాహంబులును = వివాహములును; కర్జముని = కర్దముని; తపస్ = తపస్సు కోసమైన; యాత్రయున్ = యాత్రయును; కపిల = కపిలుని; దేవహూతి = దేవహూతీల; సంవాదంబునున్ = సంభాషణములును; శబ్దాది = శబ్దము మొదలగు; పంచతన్మాత్రల = పంచతన్మాత్రల; జన్మ = పుట్టుక; ప్రకారంబునున్ = విధమును; బ్రహ్మాండ = బ్రహ్మాండము; ఉత్పత్తియున్ = పుట్టుటయును; విరాట్పురుష = విరాట్పురుషుని; కర్మేంద్రియ = కర్మేంద్రియములు; పరమాత్మ = పరమాత్మల; ప్రకారంబునున్ = విధమును; ప్రకృతి = ప్రకృతి; పురుష = పురుషుల; వివేకంబును = జ్ఞానమును; నారాయణునిన్ = విష్ణుమూర్తి యొక్క; సర్వ = సమస్తమైన; అంగ = అవయవముల; స్తోత్రంబునున్ = స్తోత్రమును; సాంఖ్యాయోగంబును = సాంఖ్యాయోగమును; భక్తియోగంబునున్ = భక్తియోగంబును; జీవున్ = జీవుని; కిన్ = కి; ఐన = అయిన; గర్భ = గర్భమున; సంభవ = ఉండు; ప్రకారంబునున్ = విధమును; చంద్ర = చంద్రలోక; సూర్య = సూర్యలోక; మార్గంబునున్ = గతులున్; పితృ = పితృలోక; మార్గంబునున్ = గతియును; దేవహూతి = దేవహూతి; నిర్యాణంబునున్ = మరణమును; కపిల = కపిలుడు అను; మహా = గొప్ప; ముని = ముని; తపంబున్ = తపస్సున; కున్ = కు; చనుటయున్ = వెళ్ళుటయును; అను = అనెడి; కథలు = కథలు; కల = కలిగినట్టి; తృతీయస్కంధము = తృతీయస్కంధము; సంపూర్ణము = సంపూర్ణము.
భావము:- ఇది పరమేశ్వరుని కరుణచేత పొందిన కవితా వైచిత్ర్యం కలవాడూ, కేసనామాత్యుని పుత్రుడూ, సహజపాండిత్యుడూ అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీమహాభాగవతం అనే మహాపురాణంలో విదురనీతి, విదురుని తీర్థయాత్ర, ఉద్దవ సందర్శనం, కౌరవ యాదవ శ్రీకృష్ణాదుల నిర్యాణం, గంగాద్వారంలో విదురుడు మైత్రేయ మహామునిని దర్శించడం, విదుర మైత్రేయుల సంవాదం, జగదుత్పత్తి లక్షణం, మహదాదుల సంభవ ప్రకారం, మహదాదులు నారాయణుని అభినందించడం, విరాడ్విగ్రహ ప్రకారం, శ్రీ మహాభాగవత భక్తి కారణమైన బ్రహ్మదేవుని జన్మప్రకారం, బ్రహ్మదేవుని తపస్సు, బ్రహ్మకు విష్ణుదేవుడు ప్రత్యక్షం కావడం, బ్రహ్మ చేసిన విష్ణుస్తోత్రం, బ్రహ్మదేవుని మానససర్గం, పరమాణువుల పుట్టుక, భూలోక భువర్లోక సువర్లోకాల విస్తారం, దిన మాస సంవత్సరాది కాల నిర్ణయం, ఆయువు యొక్క పరిమాణం, నాలుగు యుగాల పరిమాణం, బ్రహ్మదేవుని సృష్టిభేదనం, సనక సనందనాదుల జననం, స్వాయంభువ మనువు జననం, శ్రీహరి యొక్క వరాహావతారం, భూమిని ఉద్ధరించడం, వరాహరూపంలో ఉన్న హరిని బ్రహ్మ స్తుతించడం, దితి కశ్యపుల సంవాదం, కశ్యపుడు రుద్రుని ప్రశంసించడం, కశ్యపుని వలన దితి గర్భాన్ని ధరించడం, దాని ప్రభావానికి భయపడి దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి దితిగర్భప్రకారాన్ని విన్నవించడం, సనకాదులు వైకుంఠానికి వెళ్ళడం, అక్కడ జయవిజయులపై కోపించి శపించడం, శ్రీహరి దర్శనం, బ్రాహ్మణ ప్రశంస, సనకాదులు హరిని స్తుతించడం, హిరణ్యకశిపుని హిరణ్యాక్షుని జన్మప్రకారం, హిరణ్యాక్షుని దిగ్విజయం, యజ్ఞవరాహమూర్తికి హిరణ్యాక్షునకు యుద్ధం, బ్రహ్మ స్తవం, హిరణ్యాక్షుని వధ, దేవతలు శ్రీహరిని అభినందించడం, శ్రీహరి వరాహావతారాన్ని విసర్జించడం, దేవతలు తిర్యక్కులు మనుష్యుల పుట్టుక, కర్దమ మహాముని తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షం కావడం, కర్దముడు స్వాయంభువ మనువు కుమార్తెయైన దేవహూతిని పెండ్లాడడం, దేవహూతి సేవలకు సంతోషించిన కర్దముడు తన యోగబలంతో సృష్టించిన విమానంలో వేలకొలది దాసీజనంతో కూడిన దేవహూతితో కలిసి భారతం మొదలైన వర్షాలన్నీ తిరగడం, దేవహూతి కర్దముని వలన తొమ్మిదిమంది కుమార్తెలను కపిలుడనే కుమారుని కనడం, ఆ తొమ్మిదిమంది కన్యకల వివాహం, కర్దముని తపోయాత్ర, కపిలునికి దేవహూతికి జరిగిన సంవాదం, శబ్దం మొదలైన పంచతన్మాత్రల జన్మప్రకారం, బ్రహ్మాండం యొక్క పుట్టుక, విరాట్పురుషుని కర్మేంద్రియ పరమాత్మల స్వరూపం, ప్రకృతి పురుష వివేకం, నారాయణుని సర్వాంగ స్తోత్రం, సాంఖ్యయోగం, భక్తియోగం, జీవుని యొక్క గర్భసంభవ ప్రకారం, చంద్ర సూర్య మార్గం, పితృమార్గం, దేవహూతి నిర్యాణం, కపిల మహాముని తపస్సుకు వెళ్ళడం అనే కథలు కలిగిన తృతీయస్కంధం ఇది.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!