Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ధన్వంత ర్యామృత జననము

వికీసోర్స్ నుండి

ధన్వంతర్యామృతజననము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-292-వ.
మఱియుం దరువం దరువ న ప్పయోరాశి యందు.
టీక:- మఱియున్ = ఇంకను; తరువంతరువన్ = చిలుకగాచిలుకగా; ఆ = ఆ; పయోరాశి = సముద్రము; అందున్ = లో.
భావము:- అలా ఇంకా చిలకగా చిలకగా ఆ పాలసముద్రంలోంచి. . .

తెభా-8-293-సీ.
రుణుండు దీర్ఘ దోర్దండుండు గంబుకం-
రుఁడు పీతాంబరధారి స్రగ్వి
లాసిత భూషణాలంకృతుం డరుణాక్షుఁ-
డున్నతోరస్కుఁ డత్యుత్తముండు
నీలకుంచిత కేశ నివహుండు జలధర-
శ్యాముండు మృగరాజ త్త్వశాలి
ణికుండలుఁడు రత్నమంజీరుఁ డచ్యుతు-
నంశాంశ సంభవుం మలమూర్తి

తెభా-8-293.1-ఆ.
భూరియాగభాగ భోక్త ధన్వంతరి
నఁగ నమృత కలశ స్తుఁ డగుచు
నిఖిలవైద్యశాస్త్ర నిపుణుఁ డాయుర్వేది
వేల్పు వెజ్జుఁ గడలి వెడలి వచ్చె.

టీక:- తరుణుండు = ప్రాయములోనున్నవాడు; దీర్ఘదోర్దండుడున్ = ఆజానుబాహుడు; కంబు = శంఖమువంటి; కంధరుడు = కంఠముగలవాడు; పీత = పట్టు; అంబర = బట్టను; ధారి = ధరించినవాడు; స్రక్ = పూలదండలుతో; విలాసిత = విలసిల్లుతున్న; భూషణ = ఆభరణములు; అలంకృతుండున్ = అలంకరింపబడినవాడు; ఉన్నత = ఎత్తైన; ఉరస్కుడు = ఎదగలవాడు; అతి = మిక్కిలి; ఉత్తముండు = ఉత్తముడు; నీల = నల్లని; కుంచిత = వంకీల; కేశ = శిరోజముల; నివహుండు = సమూహముగలవాడు; జలధర = మేఘమువంటి; శ్యాముండు = నల్లనిదేహముగలవాడు; మృగరాజ = సింహమువంటి; సత్త్వశాలి = శక్తిగలవాడు; మణికుండలుడు = మణులు పొదిగిన కుండలములుగలవాడు; రత్నమంజీరుడు = రత్నాల అందెలవాడు; అచ్యుతున్ = విష్ణుని; అంశ = అంశతోపుట్టిన; అంశసంభవుండు = అవతారుడు; అమలమూర్తి = స్వచ్ఛమైన స్వరూపుడు;
భూరి = అతిపెద్ద; యాగ = హవిస్సులందలి; భాగ = భాగమును; భోక్త = పొందువాడు; ధన్వంతరి = ధన్వంతరి; అనన్ = అనెడి పేరుగలవాడు; అమృత = అమృతపు; కలశ = పాత్ర; హస్తుడు = చేత ధరించినవాడు; అగుచున్ = అగుచు; నిఖిల = సర్వ; వైద్యశాస్త్ర = వైద్య శాస్త్రవిషయముల; నిపుణుడు = నేర్పుగలవాడు; ఆయుర్వేది = ఆయుర్వేదకర్త; వేల్పు = దేవతలకు; వెజ్జు = వైద్యుడు; కడలిన్ = సముద్రమునుండి; వెడలి = బయటకు; వచ్చె = వచ్చెను.
భావము:- అమృత కలశం చేత పట్టుకుని ధన్వంతరి అనే దివ్యపురుషుడు విష్ణువు అంశతో జనించి, ఆ పాల కడలిలోనుండి వెలుపలుకి వచ్చాడు. ఆ దివ్యపురుషుడు మంచి ప్రాయం కలవాడు; ఆజానుభావుడు; శంఖం వంటి కంఠమూ, ఎఱ్ఱని కళ్ళూ, ఎత్తైన రొమ్మూ, నల్లని తల వెంట్రుకలూ, మేఘవర్ణపు దేహమూ కలవాడు; పట్టువస్త్రాలూ, పూలమాల, మెరుస్తున్న నగలూ, మణులు పొదిగిన మకరకుండలాలూ, రత్నాల అందెలూ, మొదలైన అలంకారాలు ధరించిన వాడు; సింహం వటి శక్తియక్తులు కలవాడు. అతడు బహుయోగ్యుడు; పవిత్రమైన యజ్ఞాలలో హవిర్భాగాన్ని పొందువాడు; సమస్తమైన వైద్యశాస్త్రాలలోను ఆరితేరినవాడు; దేవతా ప్రముఖుడు.

తెభా-8-294-వ.
తదనంతరంబ
టీక:- తదనంతరంబు = తరువాత.
భావము:- అలా ధన్వంతరి అమృత కలశం ధరించి కడలి వెలుపలికి రాగానే. . .

తెభా-8-295-ఆ.
తనిచేత నున్న మృత కుంభము చూచి
కెరలు పొడిచి సురలఁ గికురుపెట్టి
పుచ్చికొనిరి యసుర పుంగవు లెల్లను
మాఱులేని బలిమి మానవేంద్ర!

టీక:- అతని = అతని యొక్క; చేతన్ = చేతిలో; ఉన్న = ఉన్నట్టి; అమృత = అమృతపు; కుంభమున్ = పాత్రను; చూచి = చూసి; కెరలుపొడిచి = విజృంభించి; సురలన్ = దేవతలను; కికురుపెట్టి = వంచించి; పుచ్చుకొనిరి = తీసుకొనిరి; అసుర = రాక్షసులలో; పుంగవులున్ = శ్రేష్ఠులు; ఎల్లన్ = అందరును; మాఱులేని = తిరుగులేని; బలిమిన్ = బలముతో; మానవేంద్ర = రాజ.
భావము:- పరీక్షన్మహారాజా! ధన్వంతరి చేతిలోని అమృతకలశాన్ని రాక్షసులు చూసారు. దేవతలను త్రోసిపుచ్చి, సాటిలేని బలంతో చెలరేగి, ఎగబడి ఆయన చేతులలోని కలశాన్ని లాక్కున్నారు.

తెభా-8-296-వ.
వెండియు.
టీక:- వెండియు = అటుపిమ్మట.
భావము:- అలా అమృతాన్ని అపహరించి . . . .

తెభా-8-297-ఆ.
చావులేని మందు క్కఁగ మన కబ్బె
నుచుఁ గడవ నసుర లాఁచి కొనిన
వెచి సురలు హరికి మొలు పెట్టిరి సుధా
పూర్ణఘటము పోయెఁ బోయె ననుచు.

టీక:- చావు = మరణము; లేని = లేని; మందు = ఔషధము; చక్కగ = చక్కగ; మన = మన; కున్ = కు; అబ్బె = లభించెను; అనుచున్ = అనుచు; కడవన్ = పాత్రను; అసురలు = రాక్షసులు; ఆచికొనిన = లాక్కొనిపోగా, అపహరించగా; వెఱచి = భయపడి; సురలు = దేవతలు; హరి = విష్ణుని; కిన్ = కి; మొఱలుపెట్టిరి = ఆర్తధ్వానములుచేసిరి; సుధా = అమృతముతో; పూర్ణ = నిండిన; ఘటమున్ = పాత్ర; పోయెఁబోయెన్ = పొయింది; అనుచు = అనుచు.
భావము:- “మనకు చావు లేకుండా చేసే మందు సులువుగా దొరికేసింది” అంటూ అసురులు అమృత భాండాన్ని లాక్కుపోయారు. దేవతలు భయంతో “అమృతం నిండా ఉన్న కుండ పోయింది, పోయింది” అంటూ విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు.

తెభా-8-298-వ.
ఇట్లు శరణాగతులైన వేల్పుల దైన్యంబు పొడగని భృత్యుజన కామదుండగు నప్పరమేశ్వరుండు "మీరలు దుఃఖింప వలవ దేను నా మాయాబలంబునంజేసి మీ యర్థంబు మరల సాధించెద"నని పలికె; దత్సమయంబున న య్యమృతపూరంబు నేమ త్రావుదు మని తమకించు దైత్యదానవ జనంబుల లోపల నమంగళంబగు కలి సంభవించిన కతంబునఁ బ్రబలులగు రక్కసులు విలోకించి సత్త్రయాగంబు నందు నడచు చందంబునఁ దుల్యప్రయాస హేతువులగు సురలును సుధా భాగంబున కర్హు లగుదురు గావునఁ బంచి కుడుచుట కర్తవ్యం; బిది సనాతనంబగు ధర్మంబగుటంజేసి య య్యమృత కుంభంబు విడువుండని దుర్భలులగు నిశాచరులు జాతమత్సరులై ప్రబలు లైన తమవారల వారించుచున్న సమయంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; శరణాగతులు = శరణు వేడినవారు; ఐన = అయిన; వేల్పుల = దేవతల యొక్క; దైన్యంబు = దీనత్వమును; పొడగని = పరికించి; భృత్య = భక్తులైన; జన = వారి; కామదుండు = కోరికలనిచ్చువాడు; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = విష్ణుమూర్తి; మీరలు = మీరు; దుఃఖింపన్ = బాధపడ; వలదు = వద్దు; ఏను = నేను; నా = నా యొక్క; మాయా = మాయ యొక్క; బలంబునన్ = శక్తి; చేసి = వలన; మీ = మీ యొక్క; అర్ధంబున్ = కోరికను; మరల = తిరిగి; సాధించెదన్ = సంపాదించెదను; అని = అని; పలికెన్ = చెప్పెను; తత్ = ఆ; సమయంబునన్ = సమయమునందు; ఆ = ఆ; అమృత = అమృత; పూరంబున్ = రసమును; నేమ = మేమే; త్రావుదుము = తాగెదము; అని = అని; తమకించు = త్వరపడెడి; దైత్య = దైత్యుల; దానవ = దానవుల; జనంబు = సమూహముల; లోపల = అందు; అమంగళంబు = అశుభకరము; అగు = అయిన; కలి = కలి; సంభవించినన్ = కలిగిన; కతంబునన్ = కారణముచేత; ప్రబలులు = మిక్కిలిబలశాలులు; అగు = అయిన; రక్కసులు = రాక్షసులు; విలోకించి = చూసి; సత్రయాగంబు = పెద్దయజ్ఞము; అందున్ = లో; నడచు = అనుసరించెడి; చందంబునన్ = విధముగనే; తుల్య = సమముగా; ప్రయాస = శ్రమపడుటకు; హేతువులు = కారణులు; అగు = అయిన; సురలును = దేవతలుకూడ; సుధా = అమృతపు; భాగంబున్ = వాటాకు; అర్హులు = తగినవారు; అగుదురు = అవుతారు; కావునన్ = కనుక; పంచి = పంచుకొని; కుడుచుట = తినుట, తాగుట; కర్తవ్యంబు = తగినపని; ఇది = ఇది; సనాతనంబు = పురాతమైనది; అగు = అగు; ధర్మంబు = ఆచారము; అగుటన్ = అగుట; చేసి = వలన; ఆ = ఆ; అమృత = అమృతపు; కుంభంబున్ = పాత్రను; విడువుడు = విడిచిపెట్టండి; అని = అని; దుర్బలులు = బలహీనులు; అగు = అయిన; నిశాచరులు = రాక్షసులు; జాత = కలిగిన; మత్సరులు = మాత్సర్యముగలవారు; ఐ = అయ్యి; ప్రబలులు = అతిశయించినవారు; ఐన = అయిన; తమ = వారి; వారలన్ = వారిని; వారించుచున్న = అడ్డుకుంటున్న; సమయంబునన్ = సమయమునందు.
భావము:- భక్తుల కోరికలను తీర్చు పరమేశ్వరుడు అయిన విష్ణుమూర్తి, దేవతలు పెట్టే మొరలు ఆలకించి, ఇలా అన్నాడు “మీరేం బాధ పడనక్కర లేదు. మీకోరిక నెరవేరేలా నా మాయాబలంతో పరిస్థితులను మరల్చుతాను.” ఆ సమయంలో రాక్షసులు ఆ అమృతాన్ని తామే త్రాగేద్దాం అని అనుకున్నారు. కానీ, రాక్షసులలో కలి పురుషుని మాయ ఆవహించి, అమంగళకరమైన కలహం బయలుదేరింది. బలహీనులైన వారు కొందరు సత్రయాగం వంటి గొప్ప యాగాలలో ఎలా అయితే పడిన శ్రమకు తగినంత భాగాలు వేసుకుని పంచుకోవటం న్యాయం. ఇది తరతరాలుగా పూర్వంనుంచీ వస్తున్న ధర్మం. కాబట్టి అమృతకలశాన్ని వదిలిపెట్టండి అని చెప్తూ, జాతి మాత్సర్యంతో రెచ్చిపోతున్న రాక్షసులను అడ్డుకున్నారు. ఆ సమయంలో.

తెభా-8-299-ఆ.
కని చేత నుండ నొకఁడు బలిష్ఠుఁడై
పుచ్చికొనిన వానిఁ బొదుగఁ బట్టి
యంతకంటె నధికుఁ మృత కుంభము నెత్తి
కొంచుఁ బాఱెఁ బరులుఁ గుయ్యిడంగ.

టీక:- ఒకని = ఒకతని; చేతన్ = చేతులో; ఉండన్ = ఉండగా; ఒకడు = మరొకతను; బలిష్టుడు = బలముకలవాడు; ఐ = అయ్యి; పుచ్చికొనిన = తీసుకొనగా; వానిన్ = అతనిని; పొదుగన్ = చుట్టుముట్టి; పట్టి = పట్టుకొని; అంతకంటెన్ = అంతకంటెను; అధికుండు = ఎక్కువగలవాడు; అమృత = అమృతపు; కుంభమున్ = పాత్రను; ఎత్తికొంచు = లాక్కొని; పాఱెన్ = పరుగిడెను; పరులు = ఇతరులు; కుయ్యిడంగన్ = మొత్తుకొనగా;
భావము:- ఒకడి చేతిలో ఉన్న అమృతకలశాన్ని ఇంకొక బలవంతుడు లాక్కున్నాడు. వాని కంటె బలవంతుడు ఒడిసి పట్టి లాక్కుని, పారిపోయాడు. తక్కినవారు అరిచారు.