పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గజేంద్రుని దీనాలాపములు
గజేంద్రుని దీనాలాపములు
←గజేంద్రుని కొలను ప్రవేశము | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
విష్ణువు ఆగమనము→ |
తెభా-8-70-మ.
పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి, సం
శిథిలంబై, తన లావు వైరిబలముం జింతించి, మిథ్యామనో
రథమిం కేటికి? దీని గెల్వ సరి పోరం జాలరా దంచు స
వ్యథమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్.
టీక:- పృథు = అధికమైన; శక్తిన్ = బలముతో; గజము = ఏనుగు; ఆ = ఆ; జలగ్రహము = మొసలి; తోన్ = తోటి; పెక్కు = అనేక; ఏండ్లు = సంవత్సరములు; పోరాడి = పోరాటము చేసి; సంశిథిలంబు = పూర్తిగా నశించినది; ఐ = అయ్యి; తన = తన యొక్క; లావు = సామర్థ్యము; వైరి = శత్రువు యొక్క; బలమున్ = శక్తిని; చింతించి = తరచి చూసికొని; మిథ్యా = వ్యర్థమైన; మనోరథము = కోరిక; ఇంక = ఇంకను; ఏటికిన్ = ఎందుకని; దీనిన్ = దీనిని; గెల్వన్ = జయించుటకు; సరి = సమానంగా; పోరన్ = పోరుటకు; చాలరాదు = సాధ్యము కాదు; అంచున్ = అనుచు; సవ్యథము = దుఃఖముతో కూడినవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను; పూర్వ = పూర్వము చేసిన; పుణ్య = పుణ్యము యొక్క; ఫల = ఫలిత మైన; దివ్య = దివ్య మైన; జ్ఞాన = జ్ఞానము యనెడి; సంపత్తి = సంపదల; తోన్ = తోటి.
భావము:- గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు. దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకాదు.” అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన జ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగేడు.
తెభా-8-71-శా.
"ఏ రూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్
వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్
లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.
టీక:- ఏ = ఏ; రూపంబునన్ = రీతిగా; దీనిన్ = దీనిని; గెల్తున్ = జయించెదను; ఇటమీద = ఇకపైన; ఏ = ఏ; వేల్పున్ = దేవుడిని; చింతింతున్ = ప్రార్థించెదను; ఎవ్వారిన్ = ఎవరిని; చీరుదున్ = పిలిచెదను; ఎవ్వరు = ఎవరు; అడ్డము = శరణము; ఇక = ఇంక; ఈ = ఈ; వారిప్రచారోత్తమున్ = మొసలిని {వారిప్రచారోత్తము - వారి (నీటి)యందు ప్రచార (తిరిగెడి) ఉత్తము, మొసలి}; వారింపన్ = అడ్డగించుటకు; తగు = తగినట్టి; వారలు = వారు; ఎవ్వరు = ఎవరు; అఖిల = సమస్తమైన; వ్యాపార = కార్యములలోను; పారయణుల్ = నేర్పరులు; లేరే = లేరా; మ్రొక్కెదన్ = కొలిచెదను; దిక్కుమాలిన = నిరాశ్రయుడనై; మొఱ = మొరపెట్టగా; ఆలింపన్ = వినుటకు; ప్ర = విశేషమైన; పుణ్యాత్మకుల్ = పుణ్యవంతమైన ఆత్మ గలవారు.
భావము:- “ఈ మొసలిని ఏ విధంగా జయించగలను? ఇకపై నేను ఏదేవుణ్ణి ప్రార్థించను? ఎవరిని పిలవాలి? ఎవరు నన్ను రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా. అట్టి వారికిమొరపెట్టుకుంటాను.
తెభా-8-72-శా.
నానానేకపయూధముల్ వనములోనం బెద్దకాలంబు స
న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ
ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే
కీ నీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా!
టీక:- నానా = అనేకమైన; అనేకప = ఏనుగుల; యూధముల్ = సమూహములు; వనము = అడవి; లోనన్ = అందు; పెద్ద = చాలా; కాలంబు = కాలము; సన్మానింపన్ = గౌరవించుండగ; దశలక్షకోటి = పదిలక్షలకోట్ల; కరిణీ = ఆడ యేనుగులకు; నాథుండను = పతిని; ఐ = అయ్యి; ఉండి = ఉండి; మత్ = నా యొక్క; దానా = మద; అంభస్ = జలముచే; పరిపుష్ట = చక్కగా పెరిగిన; చందన = గంధపు; లతాంత = తీవ లందలి; ఛాయలన్ = నీడల; అందున్ = లో; ఉండన్ = ఉండ; లేక = లేకపోయి; ఈ = ఈ; నీర = నీటిపైని; ఆశన్ = ఆశతో; ఇటు = ఈవైపునకు; ఏల = ఎందుకు; వచ్చితిన్ = వచ్చితిని; భయంబు = భయమేస్తోంది; ఎట్లో = ఏలాగో; కదే = కదా; ఈశ్వరా = భగవంతుడా.
భావము:- చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.
తెభా-8-73-ఉ.
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
టీక:- ఎవ్వని = ఎవని; చేన్ = వలన; జనించు = పుట్టునో; జగము = విశ్వము; ఎవ్వని = ఎవని; లోపలన్ = లోపల; ఉండున్ = ఉండునో; లీనము = కలిసిపోయినది; ఐ = అయ్యి; ఎవ్వని = ఎవని; అందున్ = లోనికి; డిందున్ = లయము పొందునో; పరమేశ్వరుడు = అత్యున్నతమైన ప్రభువు; ఎవ్వడు = ఎవడో; మూల = ప్రధాన; కారణంబు = కారణభూతుడు; ఎవ్వడు = ఎవడో; అనాదిమధ్యలయుడు = ఆదిమధ్యాంతలలో శాశ్వతముగా నుండువాడు; ఎవ్వడు = ఎవడో; సర్వమున్ = అన్నియును; తాన = తనే; ఐన = అయిన; వాడు = వాడు; ఎవ్వడు = ఎవడో; వానిన్ = వానిని; ఆత్మ = నా యొక్క; భవున్ = ప్రభువును; ఈశ్వరున్ = భగవంతుని; నేన్ = నేను; శరణంబు = శరణము; వేడెదన్ = కోరెదను.
భావము:- ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.
తెభా-8-74-క.
ఒకపరి జగములు వెలి నిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
సకలార్థ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.
టీక:- ఒకపరి = ఒకసారి; జగములు = లోకములను; వెలినిడి = బయటపెట్టి, సృష్టించి; ఒకపరి = ఒకసారి; లోపలికిన్ = తన లోపలికి; కొనుచున్ = లయము చేసికొనుచు; ఉభయంబున్ = ఆ రెండు లోకములును; తాను = తనే; ఐ = అయ్యి; సకల = సమస్తమైన; అర్థ = విషయములకు; సాక్షి = అతీతముగ చూచువాడు; అగున్ = అయినట్టి; ఆ = ఆ; అకలంకున్ = దోషములు లేనివానికి; ఆత్మమూలున్ = పరమాత్మను; అర్థిన్ = కోరి; తలంతున్ = ధ్యానము చేసెదను;
భావము:- ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.
తెభా-8-75-క.
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
టీక:- లోకంబులున్ = లోకములు; లోకేశులున్ = లోకాలను పాలించేవారు; లోకస్థులు = లోకములలో నుండువారు; తెగిన = నశించిన తరువాత; తుదిన్ = కడపట; అలోకంబున్ = కనబడనిది, గుడ్డిది; అగు = అయిన; పెంజీకటి = గాఢాంధకారము; కిన్ = నకు; అవ్వలన్ = ఆవతల; ఎవ్వండు = ఎవడు; ఏక = అఖండమైన; ఆకృతిన్ = రూపముతో; వెలుగున్ = ప్రకాశించునో; అతనిన్ = అతనిని; ఏన్ = నేను; సేవింతున్ = కొలచెదను.
భావము:- లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.
తెభా-8-76-క.
నర్తకుని భంగిఁ బెక్కగు
మూర్తులతో నెవ్వఁ డాడు? మునులు దివిజులుం
గీర్తింప నేర? రెవ్వని
వర్తన మొరు లెఱుఁగ? రట్టివాని నుతింతున్.
టీక:- నర్తకుని = నటుని; భంగిన్ = వలె; పెక్కు = అనేకమైనవి; అగు = అయిన; మూర్తుల్ = రూపముల; తోన్ = తోటి; ఎవ్వడు = ఎవరైతే; ఆడున్ = నడిపిస్తుంటాడో; మునులు = ఋషులు; దివిజులున్ = దేవతలు; కీర్తింపన్ = స్తుతించుటకు; నేరరు = సరిపోరో; ఎవ్వనిన్ = ఎవని; వర్తనమున్ = ప్రవర్తనలను; ఒఱులు = ఇతరులు; ఎఱుగరు = తెలియరో; అట్టి = అటువంటి; వానిన్ = వానిని; నుతింతున్ = సంస్తుతించెదను.
భావము:- అనేక వేషాలు వేసే నటుడి లాగ పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తుంటాడో? ఋషులు దేవతలు ఎవరి గొప్పదనాన్ని వర్ణించ లేరో? ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో? అట్టి ఆ మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను.
తెభా-8-77-ఆ.
ముక్తసంగులైన మునులు దిదృక్షులు
సర్వభూత హితులు సాధుచిత్తు
లసదృశవ్రతాఢ్యులై కొల్తు రెవ్వని
దివ్యపదము వాఁడు దిక్కు నాకు.
టీక:- ముక్త = పరిత్యజించిన; సంగులు = తగులములు గలవారు; ఐన = అయిన; మునులు = మునులు; దిదృక్షులున్ = దేవుని దర్శింపగోరువారు; సర్వ = సమస్తమైన; భూత = ప్రాణుల; హితులు = మేలు కోరువారు; సాధు = మంచి; చిత్తులు = మనసు గలవారు; అసదృశ = సాటిలేని; వ్రత = దీక్షలు కలవారిలో; ఆఢ్యులు = శ్రేష్ఠులు; ఐ = అయ్యి; కొల్తురు = సేవించెదరు; ఎవ్వని = ఎవని; దివ్య = దివ్యమైన; పదమున్ = పాదములను; వాడు = వాడు; దిక్కు = శరణము; నాకు = నాకు.
భావము:- ప్రపంచంతో సర్వ సంబంధాలు వదలివేసిన మునులు, భగవద్దర్శనం కోరేవారు, సమస్తమైన జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు సాటిలేని వ్రతాలు ధరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు అగు గాక.
తెభా-8-78-సీ.
భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా-
హ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొఱకునై-
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నా పరేశునకు, ననంతశక్తికి, బ్రహ్మ-
కిద్ధరూపికి, రూపహీనునకునుఁ,
జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికినిఁ-
బరమాత్మునకుఁ, బరబ్రహ్మమునకు,
తెభా-8-78.1-ఆ.
మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ
గాని శుచికి, సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.
టీక:- భవమున్ = పుట్టుక; దోషంబున్ = పాపము; రూపంబున్ = ఆకారము; కర్మంబున్ = కర్మలు; ఆహ్వయమును = పేరు; గుణములు = గుణములు; ఎవ్వని = ఎవని; కిన్ = కైతే; లేక = లేకుండగ; జగములన్ = భువనములను; కలిగించు = సృష్టించుట; సమయించు = నశింపజేయుటల; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; నిజ = తన; మాయన్ = మాయచే; ఎవ్వడు = ఎవడైతే; ఇన్నియున్ = వీటన్నిటిని; తాల్చున్ = ధరించునో; ఆ = ఆ; పరేశున్ = అత్యున్నత ఫ్రభువు; కున్ = నకు; అనంతశక్తి = అంతులేని శక్తిమంతుని; కిన్ = కి; బ్రహ్మ = సృష్టికర్త; కిన్ = కి; ఇద్ధరూపి = సర్వాధిష్ఠానమైనవాని {ఇద్ధరూపి – ప్రసిద్ధమైన రూపములు కలవాడు. సర్వాధిష్ఠానమైనవాడు}; కిన్ = కి; రూపహీనున్ = రూప మేదీ లేనివాని; కునున్ = కు; చిత్రచారుని = విచిత్రమైన వర్తన గలవాని; కిన్ = కి; సాక్షి = సర్వమును చూచువాని; కిన్ = కి; ఆత్మరుచి = స్వయంప్రకాశుని; కినిన్ = కి; పరమాత్మున = అత్యున్నత ఆత్మ యైనవాని; కున్ = కు; పరబ్రహ్మమున్ = అతీతమైనబ్రహ్మ; కున్ = కి;
మాటలను = భాషతో; ఎఱుకలన్ = తెలివిడితో; మనములన్ = ఊహలతో; చేరంగన్ = అందుకొన; కాని = సాధ్యముకాని; శుచి = పరిశుద్ధుని; కిన్ = కి; సత్త్వ = సత్త్వగుణముతో; గమ్యుడు = దరిజేర గలవాడు; అగుచున్ = అగుచు; నిపుణుడు = నేర్పరుడు; ఐన = అయినట్టి; వాని = వాని యొక్క; నిష్కర్మత = ఫలాపేక్షలేని కర్మల; కున్ = కు; మెచ్చున్ = మెచ్చుకొను; వాని = వాని; కిన్ = కి; నేన్ = నేను; ఒనర్తున్ = చేసెదను; వందనములు = నమస్కారములు.
భావము:- భగవంతుడికి పుట్టుక, పాపము, ఆకారం, కర్మలు, నామలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింపజేయడానికి తన మాయా ప్రభవంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపం గలవాడు, ఏ రూపం లేనివాడు, చిత్రమైన ప్రవర్తన కల వాడు, సర్వసాక్షి, ఆత్మప్రకాశ మైన వాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు ఊహలకు అందని వాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిజేర దగినవాడు మరియు నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చువాడు అయినట్టి ఆ దేవదేవునికి నేను నమస్కారాలు చేస్తాను.
తెభా-8-79-సీ.
శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి-
నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు; ఘోరునకు గూఢునకు గుణధర్మికి-
సౌమ్యున కధిక విజ్ఞాన మయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు-
క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి-
య జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి
తెభా-8-79.1-ఆ.
నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి, మహోత్తరునకు,
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.
టీక:- శాంతున్ = శాంతి స్వరూపుని; కిన్ = కి; అపవర్గ = మోక్ష మందలి; సౌఖ్య = సౌఖ్యమును; సంవేది = బాగుగా తెలిసినవాని; కిన్ = కి; నిర్వాణ = మోక్షమునకు; భర్త = అధిపతి యైనవాని; కున్ = కి; నిర్ విశేషున్ = తనకు మించిన విశిష్టతలు లేనివాని; కున్ = కి; ఘోరున్ = దుష్టులకు భయంకరుని; కున్ = కి; గూఢున్ = సంసారబద్ధులకు అందరానివాని; కున్ = కు; గుణధర్మి = త్రిగుణముల ధర్మము గలవాని; కిన్ = కి; సౌమ్యున్ = వైషమ్యాదులు లేనివాని; కిన్ = కి; అధిక = విశేషమైన; విజ్ఞానమయున్ = విశిష్ఠ జ్ఞానము గలవాని; కిన్ = కి; అఖిల = సర్వ; ఇంద్రియ = ఇంద్రియ కార్యములను; ద్రష్ట = సాక్షిగా చూచెడివాని; కున్ = కి; అద్యక్షున్ = నిర్వికార అధిపతి; కిన్ = కి; బహు = వివిధము లైన; క్షేత్ర = జీవాత్మలకు; జ్ఞున్ = ఏకైక జ్ఞాత; కున్ = కు; దయ = దయ యనెడి; సింధు = సముద్రమువంటి; మతి = మనసు కలవాని; కిన్ = కి; మూలప్రకృతి = మూలపురుషుని {మూల ప్రకృతి - మూలాధార (ప్రధాన) ప్రకృతి (ఉపాదానభూతము కారణవిశేషము) ఐనవాడు}; కిన్ = కి; అఖిల = సకల; ఇంద్రియ = ఇంద్రియములను; జ్ఞాపకున్ = నడిపించెడివాని; కున్ = కి; దుఃఖ = దుఃఖమును; అంత = నశింపజేయుటలో; కృతి = నేర్పరుని; కిన్ = కి.
నెఱిన్ = చక్కగా; అసత్యము = అసత్యము; అనెడి = అనెడి; నీడ = నీడ; తో = తో; వెలుగుచున్ = ప్రకాశించుతు; ఉండు = ఉండెడి; ఎక్కటి = ఒంటరి; కిన్ = కి; మహోత్తరున్ = మిక్కిలి గొప్పవాని; కున్ = కి; నిఖిల = సమస్తమునకు; కారణున్ = బీజమైనవాని; కున్ = కి; నిష్కారణున్ = తనకి కారణభూతులు లేనివాని; కున్ = కి; నమస్కరింతున్ = నమస్కరించెదను; నన్ను = నన్ను; మనుచు = కాపాడుట; కొఱకు = కోసము.
భావము:- భగవంతుడు శాంతస్వరూపుడు. పరలోక సౌఖ్యప్రదాత. మోక్షానికి అధిపతి. నిర్విశేషుడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్దులకు అందనివాడు. సర్వ గుణ ధర్మాలు కలవాడు. సరళ స్వభావి. విశేషమైన జ్ఞానము కలవాడు. సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు. సమస్తానికి ప్రభువు. బహు క్షేత్రజ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. సర్వానికి ఆది మూల పురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. సకల ఇంద్రియాలకు నియామకుడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి. మిక్కిలి గొప్పవాడు. సమస్తానికి ఆది బీజం అయినవాడు. తనకి మూల కారణం ఏది లేనివాడు. అట్టి ఆ దేవ దేవునికి నన్ను కాపాడ మంటూ నమస్కరిస్తున్నాను.
తెభా-8-80-క.
యోగాగ్ని దగ్ధకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక స
ద్యోగ విభాసిత మనముల
బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్.
టీక:- యోగా = యోగ మనెడి; అగ్ని = నిప్పులలో; దగ్ధ = కాల్చివేయబడిన; కర్ములు = పూర్వకర్మలు గలవారు; యోగి = యోగి; ఈశ్వరులు = శ్రేష్ఠులు; ఏ = ఏ; మహాత్మున్ = గొప్పవానిని; ఒండు = ఇతర మేమి; ఎఱుంగక = ఎరుగక; సత్ = చక్కటి; యోగ = యోగాభ్యాసముచే; విభాసిత = ప్రకాశించెడి; మనములన్ = మనసు లందు; బాగుగన్ = చక్కగా; వీక్షింతురు = దర్శింతురో; అట్టి = అటువంటి; పరమున్ = సర్వాతీతుని; భజింతున్ = సేవించెదను.
భావము:- యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వ కర్మలను కాల్చివేసి. ఇతరమైనది మరేది తలచకుండ ప్రకాశించే తమ మనసులలో ఆ దేవదేవుని చూస్తు ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను.
తెభా-8-81-సీ.
సర్వాగమామ్నాయ జలధికి, నపవర్గ-
మయునికి, నుత్తమ మందిరునకు,
సకలగుణారణిచ్ఛన్న బోధాగ్నికిఁ-
దనయంత రాజిల్లు ధన్యమతికి,
గుణలయోద్దీపిత గురు మానసునకు, సం-
వర్తితకర్మనిర్వర్తితునకు,
దిశ లేని నా బోఁటి పశువుల పాపంబు-
లడఁచువానికి, సమస్తాంతరాత్ముఁ
తెభా-8-81.1-ఆ.
డై వెలుంగువాని, కచ్ఛిన్నునకు, భగ
వంతునకుఁ, దనూజ పశు నివేశ
దారసక్తు లయినవారి కందఁగరాని
వాని కాచరింతు వందనములు.
టీక:- సర్వ = సమస్తమైన; ఆగమ = శాస్త్రములకు; ఆమ్నాయ = వేదములకు; జలధి = సముద్రమువంటివాని; కిన్ = కి; అపవర్గ = మోక్షము యొక్క; మయుని = స్వరూపమైనవాని; కిన్ = కి; ఉత్తమ = ఉత్తమత్వమునకు, పుణ్యు లందు; మందిరున్ = నివాసమైనవాని, వసించువాని; కిన్ = కి; సకల = సర్వ; గుణా = గుణములు యనెడి; ఆరణిన్ = రాపిడికొయ్యలలో; ఛన్న = దాగి యున్న; బోధ = జ్ఞానము యనెడి; అగ్ని = అగ్ని వంటివాని; కిన్ = కి; తనయంత = తనంతతానే; రాజిల్లు = ప్రకాశించెడి; ధన్యమతి = ధన్యమైన జ్ఞానము గలవాని; కిన్ = కి; గుణ = గుణములు; లయ = లయ మగుటచేత; ఉద్ధీపిత = ప్రకాశించెడి; గురు = గొప్ప; మానసున్ = మనసు గలవాని; కున్ = కి; సంవర్తిత = పునర్జన్మలకు కారణమైన; కర్మ = కర్మను; నిర్వర్తితున్ = మరలించెడివాని; కున్ = కి; దిశ = దిక్కు; లేని = లేనట్టి; నా = నా; పోటి = వంటి; పశువుల = జంతువుల; పాపంబుల్ = పాపములను; అడచు = అణచివేయు; వాని = వాని; కిన్ = కి; సమస్త = సమస్తము నందును; అంతరాత్ముడు = లోనుండెడి ఆత్మ యైనవాడు; ఐ = అయ్యి.
వెలుంగు = ప్రకాశించెడి; వాని = వాని; కిన్ = కి; అవిచ్ఛిన్నున్ = నాశనము లేనివాని; కిన్ = కి; భగవంతున = షడ్గుణైశ్వర్యములు కలుగుటచే పూజనీయు డైనవాని {షడ్గుణములు - 1వాత్సల్యము 2భవశోషణము 3ఉదారత్వము 4అభయప్రదానము 5ఆపత్కాల సంరక్షణము 6అక్షయపదము అనెడివి విష్ణుదేవుని షడ్గుణములు (మరియొకవిధముగ) భగవంతుని షడ్గుణైశ్వర్యములు 1మహాత్మ్యము 2ధైర్యము 3యశస్సు 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము}; కున్ = కి; తనూజ = సంతానము; పశు = పశువులు; నివేశ = ఇండ్లు; దార = భార్యల యందు {దార - వ్యు. దౄ – వాదారణే , దౄ (ణిచ్) – ఆర్ – టాప్, కృ.ప్ర., అన్నదమ్ముల నుండి వేఱుపఱచునది, భార్య}; సక్తులు = వ్యామోహము గలవారు; అయిన = ఐన; వారి = వారల; కిన్ = కు; అందరాని = తెలియ సాధ్యము గాని; వానిన్ = వాని; కిన్ = కి; ఆచరింతున్ = చేసెదను; వందనములు = నమస్కారములు.
భావము:- పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూప మైన సముద్రము వంటివాడు. మోక్షస్వరూపుడు. గొప్ప గుణాలకు నిలయ మైన వాడు. ఆరణి కొయ్యలలోని అగ్నివలె సుగుణాలలో దాగి ఉండేవాడు. స్వయం ప్రకాశకుడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయాన్ని సృష్టిని నడిపేవాడు. నాలాంటి ఏ దిక్కులేని జీవుల పాపాలను శమింపజేసేవాడు. సర్వులలోను ఆత్మ యై వెలగువాడు. నాశనం లేనివాడు. పూజింప దగినవాడు. భార్యా పుత్రులు ఇల్లు పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నమస్కారాలు చేస్తాను.
తెభా-8-82-వ.
మఱియును.
టీక:- మఱియునున్ = ఇంకను.
భావము:- ఇంతేకాకుండా,
తెభా-8-83-సీ.
వరధర్మకామార్థ వర్జితకాములై;-
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి క;-
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు?-
రానందవార్ధి మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక-
భద్రచరిత్రంబుఁ బాడుచుందు?
తెభా-8-83.1-ఆ.
రా మహేశు, నాద్యు, నవ్యక్తు, నధ్యాత్మ
యోగగమ్యుఁ, బూర్ణు, నున్నతాత్ము,
బ్రహ్మమయిన వానిఁ, బరుని, నతీంద్రియు,
నీశు, స్థూలు, సూక్ష్ము నే భజింతు."
టీక:- వర = ఉత్తములైన; ధర్మకామార్థ = పురుషార్థ త్రయము యెడ {పురుషార్థములు - 4 అవి ధర్మార్థకామము లనెడి త్రయము మరియు మోక్షము}; వర్జిత = విడిచిన; కాములు = ఆసక్తి గలవారు; ఐ = అయ్యి; విబుధులు = జ్ఞానులు; ఎవ్వని = ఎవని నైతే; సేవించి = కొలిచి; ఇష్ట = కోరుకొన్న; గతిన్ = ఉత్తమగతిని; పొందుదురు = పొందెదరో; చేరి కాంక్షించు = ఆశ్రయించు; వారి = వారల; కిన్ = కి; అవ్యయ = నాశములేని; దేహమున్ = శరీరమును; ఇచ్చున్ = ఇచ్చెడివాడు; ఎవ్వడు = ఎవడో; కరుణన్ = దయతో; ముక్త = ముక్తు లైన {ముక్తులు - సంసారబంధములనుండి విముక్తి పొందినవారు}; ఆత్ములు = వారు; ఎవ్వని = ఎవని నైతే; మునుకొని = పూని; చింతింతురు = ధ్యానించెదరో; ఆనంద = ఆనంద మనెడి; వార్ధి = సముద్రము నందు; మగ్న = మునిగిన; అంతరంగులు = మనస్సులు గలవారు; ఏకాంతులు = అనన్యభక్తులు; ఎవ్వనిన్ = ఎవరి నైతే; ఏమియున్ = ఏదీ; కోరక = కోరకుండగ; భద్ర = భద్రత నిచ్చెడి; చరిత్రంబు = చరిత్రలను; పాడుచుందురు = కీర్తించెదరో; ఆ = ఆ.
మహేశున్ = గొప్ప ప్రభువును; ఆద్యున్ = ఆదిదేవుని; అవ్యక్తున్ = తెలిసికొన వీలుకాని వాని {అవ్యక్తః- అగోచరుడు, అనేకమైన మూర్తులు ధరించినను ఇట్టివాడని ఎఱుగరానివాడు, శ్రీశ్రీశంకరభాష్యం విష్ణుసహస్రనామం 722వ నామం}; అధ్యాత్మ = పరబ్రహ్మజ్ఞాన; యోగ = యోగసాధనచే; గమ్యున్ = చేరదగ్గవాని; పూర్ణున్ = పరిపూర్ణుని {పూర్ణః- సర్వము తన యందే కలవాడు. సకల కామములు, శక్తులతో సంపన్నుడు, శ్రీశ్రీశంకరభాష్యం విష్ణుసహస్రనామములలో 685వ నామం}; ఉన్నతాత్మున్ = పరమాత్ముని; బ్రహ్మము = బ్రహ్మము; అయిన = తానే యయిన; వానిన్ = వానిని; పరుని = సర్వమున కితరమైన వాని; అతీంద్రియున్ = ఇంద్రియముల కతీతమైన వాని {అతీంద్రియః- ఇంద్రియముల ద్వారా గ్రహించుటకు వీలుకానివాడు, ఇంద్రియగోచరములగు శబ్దాదులు లేనివాడు. శ్రీశంకరభాష్యం విష్ణుసహస్రనామములలో 169వ నామం}; ఈశున్ = జగన్నియంతను; దూరున్ = ప్రకృతికి దూరమైనవాని; సూక్ష్మున్ = పరమాణురూపుని {సూక్ష్మః- సర్వవ్యాపి, సర్వగతం సుసూక్ష్మం, శ్రీశ్రీశంకరభాష్యం విష్ణుసహస్రనామములలో 457వ నామం}; నేన్ = నేను; భజింతున్ = స్తుతింతును.
భావము:- ఇంతేకాకుండా, దేవదేవుడు ధర్మం కామం ధనం అన్నిటి మీద ఆశలు విడిచేసిన పండితుల పూజ లందుకొని వారు కోరుకొన్న ఉత్తమ వరాలు ప్రసాదిస్తాడు. భక్తితో దరిజేరి కోరిన వారికి దయతో నాశనంలేని శరీరాన్ని ఇస్తాడు. ఆనంద సాగరంలో మునిగిన మనస్సులు కల ఏకాంతిక ముక్తులు ఆ దేవదేవుని అనునిత్యం ఆరాధిస్తారు. వారు దేవదేవుని పవిత్ర మైన చరిత్రను కోరికలేమి లేకుండ కీర్తిస్తుంటారు. ఆ మహా దేవుడు సృష్టికన్న ఆద్యుడు. ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, అధ్యాత్మ యోగం వలన చేరదగినవాడు. పరిపూర్ణుడు. మహాత్ముడు. బ్రహ్మస్వరూపుడు. సర్వానికి పరమైనవాడు. ఇంద్రియములకు అతీతమైనవాడు. స్థూలస్వరూపుడు, సూక్ష్మ రూపుడు. అట్టువంటి ఆ పరాత్పరుని నేను సేవిస్తాను.
తెభా-8-84-వ.
అని మఱియు నిట్లని వితర్కించె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఇలా; అని = అని; వితర్కించె = తరచి పలికెను.
భావము:- గజరాజు ఇంకా ఇలా అనుకోసాగాడు.
తెభా-8-85-సీ.
"పావకుండర్చుల, భానుండు దీప్తుల-
నెబ్భంగి నిగిడింతు, రెట్ల డంతు
రా క్రియ నాత్మకరావళిచేత బ్ర-
హ్మాదుల, వేల్పుల, నఖిలజంతు
గణముల, జగముల, ఘన నామ రూప భే-
దములతో మెఱయించి తగ నడంచు,
నెవ్వఁడు మనము బుద్ధీంద్రియంబులుఁ దాన-
యై, గుణ సంప్రవాహంబు నెఱపు,
తెభా-8-85.1-తే.
స్త్రీ నపుంసక పురుష మూర్తియునుఁ గాక,
తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక,
కర్మ గుణ భేద సదసత్ప్రకాశిఁ గాక,
వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.
టీక:- పావకుండు = అగ్ని; అర్చులన్ = జ్వాలలను; భానుండు = సూర్యుడు; దీప్తులన్ = వెలుగును; ఎబ్బంగిన్ = ఏవిధముగనైతే; నిగిడింతురు = ప్రసరింపజేసెదరో; ఎట్లు = ఏ విధముగ; అడంతురు = అణచివేయుదురో; ఆ = ఆ; క్రియన్ = విధముగనే; ఆత్మ = తన; కరావళి = కిరణముల; చేతన్ = చేత; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులన్ = మున్నగువారిని; వేల్పులన్ = దేవతలను; అఖిల = సమస్తమైన; జంతు = జీవ; గణములన్ = జాలమును; జగములన్ = భువనములను; ఘన = గొప్ప; నామ = పేర్లు; రూప = స్వరూపముల; భేదముల్ = భేదముల; తోన్ = తోటి; మెఱయించి = పుట్టించి; తగన్ = తగినట్లు; అడంచున్ = అణచివేయునో; ఎవ్వడు = ఎవడైతే; మనమున్ = మనసు; బుద్ధి = బుద్ధి; ఇంద్రియంబులున్ = ఇంద్రియములును; తాన = తనే; ఐ = అయ్యి; గుణ = త్రిగుణములను {త్రిగుణములు - 1సత్త్వ 2రజస్సు 3తమస్సు}; సంప్రవాహంబున్ = చిక్కటి వ్యాప్తిని; నెఱపున్ = నిర్వహించునో.
స్త్రీ = స్త్రీలింగ; నపుంసక = నపుంసకలింగ; పురుష = పుల్లింగ; మూర్తియునున్ = రూపము; కాక = కాకుండగ; తిర్యక్ = జంతువుల; అమర = దేవతలను; నర = నరుల; ఆది = మొదలగువారి; మూర్తియునున్ = రూపును; కాక = కాకుండగ; కర్మ = కర్మల; గుణ = గుణముల; భేద = భేదములకు; సదసత్ = ఉండుట లేకుండును; ప్రకాశి = బయలుపరచువాడు; కాక = కాకుండగ; వెనుకన్ = ఆ పిమ్మట; అన్నియున్ = సర్వమును; తాన్ = తనే; అగు = అయ్యెడి; విబుధున్ = విజ్ఞానిని; తలంతు = ధ్యానించెదను.
భావము:- అగ్ని మంటలను, సూర్యుడు వెలుగుని ప్రసరింజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాలచేత బ్రహ్మదేవుడు మొదలైన దేవత లను, సకల జీవరాసులను, సమస్త లోకాలను నానా విధాలైన నామ రూప భేదాలతో సృష్టించి లయింపజేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయ్యి గుణాలను ప్రవర్తింప జేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరులు మొదలగు వారిలో వేటి ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణ భేదాలకి సత్తు అసత్తులకి అతీతుడు. అంతే కాకుండా అవన్ని కూడ తానే అయ్యి ఉంటాడు. అటువంటి ఆ ప్రభువును నేను స్మరిస్తాను.
తెభా-8-86-క.
కలఁ డందురు దీనుల యెడఁ,
గలఁ డందురు పరమయోగి గణముల పాలం,
గలఁ డందు రన్నిదిశలను,
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
టీక:- కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; దీనుల = ఆర్తుల; యెడన్ = వెంట; కలడు = ఉంటాడు; అందురు = అనెదరు; పరమ = అత్యుత్తమమైన; యోగి = యోగుల; గణముల = సమూహముల; పాలన్ = అందు; కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; అన్ని = సర్వ; దిశలను = దిక్కు లందును; కలడు = ఉన్నాడు; కలండు = ఉన్నాడు; అనెడి = అనబడెడి; వాడు = వాడు; కలడో = ఉన్నాడో; లేడో = లేడో.
భావము:- దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!
తెభా-8-87-సీ.
కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ-
గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ-
బడిన సాధుల కడ్డపడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ-
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల-
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
తెభా-8-87.1-తే.
అఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
ఆదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?
టీక:- కలుగడే = సహాయముగా రాడేమి; నా = నా; పాలిన్ = విషయములో; కలిమి = ఉండుటను; సందేహింపన్ = అనుమానించను; కలిమి = సంపద కలుగుట; లేములు = పేదరికములు; లేకన్ = చూడక; కలుగు = సహాయపడెడి; వాడు = వాడు; నాకున్ = నా యాపదకు; అడ్డపడన్ = సహాయపడుటకు; రాడె = రాడా యేమి; నలిన్ = అధికముగ; అసాధువుల్ = దుర్జనుల; చేన్ = చేతిలో; పడిన = చిక్కినట్టి; సాధుల్ = సజ్జనుల; కున్ = కు; అడ్డపడెడి = సహాయపడెడి; వాడు = వాడు; చూడడే = చూడడా యేమి; నా = నా యొక్క; పాటున్ = దురవస్థను; చూపులన్ = ఇతర చూపులు; చూడక = చూడకనే; చూచువారలన్ = తననే చూచువారిని; కృపన్ = దయతో; చూచువాడు = చూచెడివాడు; లీలన్ = లీల; తోన్ = తోటి; నా = నా యొక్క; మొఱన్ = ఆర్తనాదమును; ఆలింపడే = వినడా యేమి; మొఱగుల = దీనుల; మొఱలు = ఆర్తనాదములను; ఎఱుంగుచున్ = తెలియుచు; తన్ను = తననుతానే; మొఱగు = మరచు; వాడు = వాడు.
అఖిల = సర్వ; రూపముల్ = రూపములు; తన = తన యొక్క; రూపము = స్వరూపము; ఐన = అయిన; వాడు = వాడు; ఆది = మొదలు; మధ్య = మధ్య; అంతములున్ = తుదిలు; లేక = లేకుండగ; అడరు = అతిశయించెడి; వాడు = వాడు; భక్తజనములన్ = భక్తు లైనవారిని; దీనులన్ = దీనుల; పాలి = అండగా నుండెడి; వాడు = వాడు; వినడె = వినడా యేమి; చూడడె = చూడడా యేమి; తలపడె = రక్షింప తలచడా యేమి; వేగన్ = శ్రీఘ్రమే; రాడె = రాడా యేమి.
భావము:- నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యం పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?
తెభా-8-88-క.
విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్."
టీక:- విశ్వకరున్ = జగత్తుని సృష్టించెడివానిని {విశ్వకర్మా అని విష్ణుసహస్రనామాలులో 50వ నామం, విశ్వరచన చేయగల్గినవాడు, జగత్తు సర్వము ఎవని క్రియయైనవాడు, విష్ణువు}; విశ్వదూరునిన్ = జగత్తుకి అతీతముగ నుండువానిని; విశ్వాత్మునిన్ = జగత్తు తన స్వరూపమన వానిని {విశ్వాత్మా - విష్ణుసహస్రనామంలో 225వ నామం, విశ్వమునకు ఆత్మ యైనవాడు}; విశ్వవేద్యున్ = లోక మంతటికి తెలుసుకొనదగ్గ వానిని; విశ్వున్ = లోకమే తానైన వానిని {విశ్వః - విష్ణుసహస్రనామాలులో 1వ నామం, దృశ్యమాన జగత్తంతయు తానైనవాడు}; అవిశ్వున్ = లోకముకంటె భిన్నమైనవాని {అవిశ్వ - దృశ్యమాన జగత్తంతకు విలక్షుణుడగు విష్ణువు అవిజ్ఞాత}; శాశ్వతున్ = శాశ్వతముగ నుండు వానిని {శాశ్వతః - విష్ణుసహస్రనామాలులో 56వ నామం, సర్వకాలము లందున్న వాడు}; అజున్ = పుట్టుక లేనివానిని {అజః - విష్ణుసహస్రనామాలులో 95వ నామం, 204వ నామం, 521వ నామం, ఏకాలమందును జన్మ లేనివాడు}; బ్రహ్మ = బ్రహ్మదేవునికి; ప్రభున్ = ప్రభువైన వానిని {ప్రభుః - విష్ణుసహస్రనామాలులో 35వ నామం, 299వ నామం, సర్వశక్తి సమన్వితుడు, సర్వక్రియల యందును సామర్థ్యాతిశయము కలవాడు}; ఈశ్వరునిన్ = లోకము నడిపించువానిని {ఈశ్వరః - విష్ణుసహస్రనామాలులో 36వ నామం, 74వ నామం, ఎవరి సహాయము లేకనే సమస్త కార్యములు నెరవేర్చగలవాడు, నిరుపాధికమైన ఐశ్వర్యము కలవాడు}; పరమ = సర్వశ్రేష్ఠమైన; పురుషున్ = పురుషుని; నేన్ = నేను; భజియింతున్ = స్తుతించెదను.
భావము:- ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మ అయిన వాడు. లోకంలో బాగా తెలుసుకోదగిన వాడు లోకమే తానైన వాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధి నాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.
తెభా-8-89-వ.
అని పలికి, తన మనంబున నగ్గజేంద్రుం డీశ్వర సన్నిధానంబు కల్పించుకొని యిట్లనియె.
టీక:- అని = అని; పలికి = అనుచు; తన = తన యొక్క; మనంబునన్ = మనసులో; ఆ = ఆ; గజేంద్రుండు = గజేంద్రుడు; ఈశ్వర = భగవంతుని; సన్నిధానంబున్ = ఆశ్రయమును; కల్పించుకొని = ఏర్పరుచుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా గజేంద్రుడు భావించుకొని భగవంతుని తన మనస్సులో సంకల్పించుకొని ఇలా ప్రార్థంచాడు.
తెభా-8-90-శా.
"లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
టీక:- లావు = శక్తి; ఒక్కింతయున్ = కొంచెము కూడ; లేదు = లేదు; ధైర్యము = ధైర్యము; విలోలంబు = తగ్గి; అయ్యెన్ = పోయింది; ప్రాణంబులున్ = ప్రాణములు; ఠావుల్ = స్థానములనుండి; తప్పెన్ = చలించిపోతున్నాయి; మూర్ఛ = మగత; వచ్ఛెన్ = వస్తున్నది; తనువున్ = శరీరము; డస్సెన్ = అలసిపోయింది; శ్రమంబున్ = కష్టముగా; అయ్యెడిన్ = ఉన్నది; నీవే = నీవు మాత్రము; తప్పన్ = తప్పించి; ఇతఃపరంబు = మరింకొకరుని; ఎఱుంగన్ = తెలియను; మన్నింపన్ = ఆదుకొన; తగున్ = తగినవాడను; దీనునిన్ = దీనావస్థ నున్నవాడను; రావే = రమ్ము; ఈశ్వర = భగవంతుడ; కావవే = కరుణించుము; వరద = వరముల నిచ్చెడివాడ; సంరక్షింపు = కాపాడుము; భద్రాత్మక = శుభమే తానైనవాడ.
భావము:- దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!
తెభా-8-91-క.
విను దఁట జీవుల మాటలు
చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో
యను దఁట పిలిచిన సర్వముఁ
గను దఁట సందేహ మయ్యెఁ గరుణావార్ధీ!
టీక:- వినుదువు = వింటావు; అట = అట; జీవుల = ప్రాణుల; మాటలు = పిలుపులు; చనుదువు = వెళ్ళెదవు; అట = అట; చనరాని = వెళ్ళ సాధ్యముకాని; చోట్లన్ = ప్రదేశముల కైనను; శరణార్థుల్ = ఆర్థనాదము చేసెడివారి; కున్ = కి; ఓయనుదువు = మారుపలుకెదవు; అట = అట; పిలిచినన్ = పిలిచినట్టి; సర్వమున్ = సర్వులను సర్వావస్థలను; కనుదువు = చూచెదవు; అట = అట; సందేహమున్ = అనుమానము; అయ్యెన్ = కలుచున్నది; కరుణావార్ధీ = దయాసముద్రుడా.
భావము:- ఓ దయాసాగరా! నీవు సర్వ ప్రాణుల పిలుపులు వింటావట. వారిపై దయ చూపడానికి పోరాని చోట్లకు ఐనా పోతావట. శరణన్న వారికి వెంటనే ఓయ్ అని అంటావుట. కాని ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది.
తెభా-8-92-ఉ.
ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విమలప్రభావ! రా
వే! కరుణింపవే! తలఁపవే! శరణార్థిని నన్నుగావవే!"
టీక:- ఓ = ఓ; కమలాప్త = నారాయణ {కమలాప్తుడు - కమల (లక్ష్మీదేవికి) ఆప్తుడైనవాడ, విష్ణువు}; ఓ = ఓ; వరద = నారాయణ {వరదుడు - వరములను ఇచ్చువాడు, విష్ణువు}; ఓ = ఓ; ప్రతిపక్షవిపక్షదూర = నారాయణ {ప్రతిపక్షవిపక్షదూరుడు - ప్రతిపక్ష (శత్రుపక్షము) యందును విపక్ష (వైరము) విదూర (లేనివాడు), విష్ణువు}; కుయ్యో = ఓ; కవియోగివంద్య = నారాయణ {కవియోగివంద్యుడు - కవులచేతను యోగులచేతను వంద్యుడు (కీర్తింపబడువాడు), విష్ణువు}; సుగుణోత్తమ = నారాయణ {సుగుణోత్తముడు - సుగుణములు గల ఉత్తముడు, విష్ణువు}; ఓ = ఓ; శరణాగతామరానోకహ = నారాయణ {శరణాగతామరానోకహ - శరణాగత (శరణువేడినవారికి) అమర (దేవ, కల్ప) అనోకహ (వృక్షమువంటివాడు), విష్ణువు}; ఓ = ఓ; మునీశ్వరమనోహర = నారాయణ {మునీశ్వరమనోహరుడు - మునీశ్వరుల మనసులను హర (దొంగిలించినవాడు), విష్ణువు}; ఓ = ఓ; విమలప్రభావ = నారాయణ {విమలప్రభావుడు - విమల (స్వచ్ఛమైన) ప్రభావుడు (మహిమ గలవాడు), విష్ణువు}; రావే = రమ్ము; కరుణింపవే = దయచూపుము; తలపవే = భావించుము; శరణార్థిని = శరణుకోరెడివాడను; నన్నున్ = నన్ను; కావవే = కాపాడుము.
భావము:- ఓ కమలాక్షుడా! ఓ వరాలు ఇచ్చే ప్రభూ! శత్రువులపై కూడ వైరం లేనివాడా! పండితులచే నమస్కారాలు అందుకొనే వాడా! ఉత్తమ సుగుణాలు కలవాడా! శరణు కోరు వారికి కల్పవృక్షం వంటివాడా! మునీంద్రులకు ప్రియమైనవాడా! నిర్మలమైన మహిమ కల వాడా! నా మొర విను. వెంటనే రా. కనికరించు. కరుణించి శరణు వేడుతున్న నన్ను కాపాడు.
తెభా-8-93-వ.
అని పలికి మఱియు "నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుఁడైన నన్నుఁ గాచుఁ గాక"యని నింగి నిక్కి చూచుచు, నిట్టూర్పులు నిగడించుచు, బయ లాలకించుచు నగ్గజేంద్రుండు మొఱచేయుచున్న సమయంబున.
టీక:- అని = అని; పలికి = మొరపెట్టుకొని; మఱియున్ = ఇంకను; అరక్షిత = దిక్కులేనివారిని; రక్షకుండు = కాపాడెడివాడు; ఐన = అయిన; ఈశ్వరుండు = పరమేశ్వరుడు; ఆపన్నుడు = ఆపదలో నున్నవాడు; ఐన = అయిన; నన్నున్ = నన్ను; కాచుగాక = కాపాడుగాక; అని = అని; నింగిన్ = ఆకాశమువైపు; నిక్కి = సాగి; చూచుచున్ = చూచుచు; నిట్టూర్పులున్ = నిట్టూర్పులను {నిట్టూర్పు - నిడి (దీర్ఘమైన) ఊర్పు (శ్వాస), మనసులోని శ్రమకు సంకేతము}; నిగడించుచు = విడుచుచు; బయలాలకించుచు = నిశ్చేష్టమగుచు {బయలాలకించు - బయలు (శూన్యములోనికి) ఆలకించు (విను), నిశ్చేష్టమగు}; ఆ = ఆ; గజేంద్రుండు = గజేంద్రుడు; మొఱచేయుచున్న = ఆక్రోశించుచున్న; సమయంబునన్ = సమయములో.
భావము:- ఇలా ప్రార్థించి “రక్షణ లేనివారిని రక్షించే ఆ భగవంతుడు నన్ను కాపాడుగాక!” అని గజరాజు మొరపెట్టుకొన్నాడు. ఆకాశం వైపు నిక్కి నిట్టూర్చాడు. ఆకాశానికి చెవులు అప్పజెప్పి ఆక్రోశించాడు. ఆ సమయంలో.