పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గజేంద్రుని కొలను ప్రవేశము
గజేంద్రుని కొలను ప్రవేశము
←గజేంద్రుని వర్ణన | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
కరిమకరులయుద్ధము→ |
తెభా-8-43-వ.
ఇట్లనన్య పురుష సంచారంబై నిష్కళంకంబైన యప్పంకజాకరంబుఁ బొడగఁని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అనన్యపురుషసంచారంబు = ఎవరు దరిజేరనిది {అనన్యపురుషసంచారము - అనన్య(అనితరమైన) పురుష (వారి) సంచారము (సంచారము గలది), ఎవరు దరిజేరనిది}; ఐ = అయ్యి; నిష్కళంకంబు = నిర్మలము; ఐన = అయిన; ఆ = ఆ; పంకజాకరంబున్ = తామరకొలనును; పొడగని = చూసి;
భావము:- ఆ మదగజాలు, ఇతరులు ఎవరు తిరగని ఆ నిర్మలమైన పద్మాల సరస్సును చూసాయి.
రహస్యార్థం: ఇలా ఏకాంతం, నిస్సంకల్పం, విశుద్ధం అయి ఉన్న ఆ మానస సరోవరం చూసి,
తెభా-8-44-సీ.
తోయజగంధంబుఁ దోఁగిన చల్లని-
మెల్లని గాడ్పుల మేను లలరఁ
గమల నాళాహార విమలవాక్కలహంస-
రవములు చెవుల పండువులు చేయ
ఫుల్లదిందీవరాంభోరుహా మోదంబు-
ఘ్రాణరంధ్రంబుల గారవింప
నిర్మల కల్లోల నిర్గతాసారంబు-
వదన గహ్వరముల వాడు దీర్పఁ
తెభా-8-44.1-తే.
త్రిజగ దభినవ సౌభాగ్య దీప్తమైన
విభవ మీక్షణములకును విందు చేయ
నరిగి, పంచేంద్రియ వ్యవహారములను
మఱచి మత్తేభయూధంబు మడుఁగుఁ జొచ్చె.
టీక:- తోయజ = పద్మముల; గంధంబున్ = పరిమళములో; తోగిన = మునిగిన; చల్లని = చల్లని; మెల్లని = మెల్లని; గాడ్పులన్ = గాలులవలన; మేనుల్ = దేహములు; అలరన్ = హాయిగొనగా; కమల = తామర; నాళ = తూళ్ళను; ఆహార = తినుటచే; విమల = స్వచ్ఛమైన; వాక్ = పలుకుల; కలహంస = కలహంసల; రవములు = శబ్దములు; చెవుల = చెవులకు; పండువులు = పండుగలు; చేయన్ = చేయుచుండగ; పుల్లత్ = తెల్ల; ఇందీవర = కలువల; అంభోరుహ = పద్మముల; ఆమోదంబు = సువాసనలు; ఘ్రాణ = ముక్కు; రంధ్రంబులన్ = కన్నములను; గారవింపన్ = తృప్తిగలిగించగ; నిర్మల = స్వచ్ఛమైన; కల్లోల = అలలనుండి; నిర్గత = వెలువడిన; ఆసారంబున్ = నీటితుంపరుల జడి; వదన = నోరు యనెడి; గహ్వరముల = గుహల; వాడు = దప్పిక; తీర్పన్ = తీర్చగా.
త్రిజగత్ = ముల్లోకములకు; అభినవ = సరికొత్త; సౌభాగ్య = సొగసుతో; దీప్తము = కాంతివంతము; ఐన = అయిన; విభవము = వైభవము; ఈక్షణముల్ = కన్నుల; కునున్ = కు; విందు = వేడుక; చేయన్ = చేయగ; అరిగి = వెళ్ళి; పంచేంద్రియ = జ్ఞానేంద్రియము లైదింటి {పంచేంద్రియములు - 1త్వక్ 2శ్రోత్ర 3 ఘ్రాణ 4జిహ్వా 5చక్షువులు}; వ్యవహారములను = వర్తనలు; మఱచి = మరిచిపోయి; మత్త = మద; ఇభ = గజముల; యూధంబు = గుంపు; మడుగున్ = సరోవరమునందు; చొచ్చెన్ = ప్రవేశించెను.
భావము:- ఇతరులు ఎవరు తిరగని ఆ నిర్మలమైన పద్మాల సరస్సును చూసిన ఆ మదగజాలు, వాటి దేహాలకి పద్మాల వాసనల తో కూడిన చల్లని పిల్లగాలులు హాయి కలిగించాయి. తామర తూళ్ళు తిన్న రాయంచల కలకలారావాలు చెవులపండుగ చేస్తున్నాయి. విరిసిన తెల్ల కమలాలు కలువల సువాసనలు ముక్కులకు తృప్తి కలిగిస్తున్నాయి. స్వచ్ఛమైన అలలనుండి వెలువడిన నీటి తుంపరలు దప్పిక తీరుస్తున్నాయి. ముల్లోకాలకి సరికొత్త సౌభాగ్యాన్ని పుట్టించే ఆ సరస్సు యొక్క శోభ కళ్ళకి ఆనందం కలిగిస్తోంది. దాంతో ఆ మత్తేభాలు తమ పంచేంద్రియ జ్ఞానాలను మరచి ఆ మడుగులోకి దిగాయి.
రహస్యార్థం: ఇలా ఏకాంతం, నిస్సంకల్పం, విశుద్ధం అయి ఉన్న ఆ మానస సరోవరం చూసి, పూర్వకృత సత్ వాసనలతో స్థూల, సూక్ష్మ కారణ శరీరత్రయం అలరారుతుండగా; గుటీచక, బహూదక, హంస, పరమ హంస (ఆశ్రమ విశేషాలు) సన్యాసులలో శ్రేష్ఠులు అయిన పరమ హంసల బ్రహ్మ విచారణా, శ్రవణా ఆనందాలు కలుగగా; శుద్ధ సాత్విక మగు వృత్తుల (ప్రాణాయామ శ్వాసలు) చేత నాసికా రంధ్రాలు పూర్ణీభవించగా; సత్సంకల్ప కల్లోల (పరిణామ) జలాలచేత జిహ్వా చాపల్యం శాంతించగా; అవస్థా త్రయంతో కూడి ఉండే ఇంద్రియ వ్యాపారాల అధిదేవతలను ఆయత్త పరచి; మానస కాసారం ప్రవేశించాడు.
తెభా-8-45-క.
తొండంబులఁ బూరించుచు
గండంబులఁ జల్లుకొనుచు, గళగళరవముల్
మెండుకొన వలుఁదకడుపులు
నిండన్ వేదండకోటి నీటిం ద్రావెన్.
టీక:- తొండంబులన్ = తొండములలోనికి; పూరించుచున్ = నీళ్ళు పీల్చి నింపుతూ; గండంబులన్ = గండఫలకములపై; చల్లుకొనుచు = చల్లుకొంటు; గళగళ = గడగడ మనెడి; రవముల్ = శబ్దములు; మెండుకొనన్ = అతిశయించుతుండగ; వలుద = విశాలమైన; కడుపులు = పొట్టలు; నిండన్ = నిండగ; వేదండ = ఏనుగుల; కోటి = సమూహము; నీటిన్ = నీటిని; త్రావెన్ = తాగినవి.
భావము:- ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్ళు నింపుకొని చెక్కిళ్ళ మీద జల్లుకొన్నాయి. గట్టిగా గళగళ మని చప్పుళ్ళు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపులు నిండా నీళ్ళు తాగాయి.
రహస్యార్థం: జీవుడు కామంచే ఆకర్షింపబడకుండా ఉన్నంత వరకూ అవిద్యావశుడు అయి ఉన్నప్పటికీ, ఆత్మానుసంధాన పరుడు అయి ఉంటాడు. ఎలా అంటే, నేను బ్రహ్మం అయ్యాను అనే వృత్తి (జ్ఞానం) పూరకం అంటారు అదే తొండాలతో పూరించటం. అట్టి వృత్తిచేత వాయువును, ఆజ్ఞ యందు నిలుపుతూ దశవిధ నాదానుసంధానం (గళగళ రవాలు), వాయువును కుంభించి, పూరించి (కడుపులు నిండన్), నిశ్చలత్వంతో మానసకాసారంలో తాదాత్మాకార వృత్తులతో ఉన్నాడు.
తెభా-8-46-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = అప్పుడు.
భావము:- ఆ సమయంలో,
తెభా-8-47-మ.
ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి, పూరించి, చం
డభ మార్గంబున కెత్తి, నిక్కి, వడి నుడ్డాడించి పింజింప నా
రభటిన్ నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్
నభమం దాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్.
టీక:- ఇభలోకేంద్రుడు = గజేంద్రుడు {ఇభలోకేంద్రుడు - ఇభ (ఏనుగుల) లోక (సమూహమునకు) ఇంద్రుడు (పతి), గజేంద్రుడు}; హస్త = తొండముల; రంధ్రములన్ = కన్నములలోనికి; నీరు = నీటిని; ఎక్కించి = పీల్చుకొని; పూరించి = నింపుకొని; చండభమార్గంబున్ = ఆకాశముపై {చండభమార్గము - సూర్యుని మార్గము, ఆకాశము, పైవైపు}; కిన్ = కి; ఎత్తి = ఎత్తి; నిక్కి = సాచి; వడిన్ = వేగముగ; ఉడ్డాడించి = పుక్కిలించి; పింజింపన్ = చిమ్మగా; ఆరభటిన్ = పెద్ద శబ్దముతో; నీరము = నీటి; లోనన్ = లోనుండి; పెల్లు = పెల్లుమని, తీవ్రముగ; ఎగసి = ఎగిరి; నక్ర = పీతలు; గ్రాహ = మొసళ్ళు; పాఠీనముల్ = చేపలు; నభము = ఆకాశమందు; ఆడెడు = తిరిగెడు; మీన = మీనరాశి; కర్కటములన్ = కర్కాటకరాశులను; పట్టెన్ = పట్టుకొన్నవి; సురల్ = దేవతలు; మ్రాన్పడన్ = నిశ్చేష్టులుకాగా.
భావము:- ఆ సమయంలో, గజరాజు తొండంలోకి నీళ్ళు పీల్చు కొన్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి, నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి ఆ నీటితో పాటు పై కెగసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటకరాశిని పట్టుకొన్నాయి. దేవతలు అది చూసి ఆశ్చర్య చకితులు అయ్యారు.
రహస్యార్థం: ఇలా జీవుడు మానససరస్సులోని సంకల్పాలను పరిపక్వ స్థితిని కలచివేస్తుంటే, ఈశ్వరుడిలోని సూక్ష్మవృత్తులతో ఐక్యం అయ్యేడు.
తెభా-8-48-వ.
మఱియు న గ్గజేంద్రంబు నిరర్గళవిహారంబున.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ఆ; గజేంద్రంబు = గజేంద్రుడు; నిరర్గళ = అడ్డులేని; విహారంబునన్ = విహరించుటలో.
భావము:- మరి ఆ సరోవరంలో గజేంద్ఱ్ఱుడు అడ్డులేకుండా విహరించ సాగాడు.
తెభా-8-49-సీ.
కరిణీకరోజ్ఝిత కంకణచ్ఛటఁ దోఁగి-
సెలయేటి నీలాద్రి చెలువుఁ దెగడు
హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల-
వేయిగన్నులవాని వెరవు సూపుఁ
గలభసముత్కీర్ణ కల్హార రజమునఁ-
గనకాచలేంద్రంబు ఘనతఁ దాల్చు
గుంజరీ పరిచిత కుముద కాండంబుల-
ఫణిరాజ మండన ప్రభ వహించు
తెభా-8-49.1-ఆ.
మదకరేణు ముక్త మౌక్తిక శుక్తుల
మెఱుఁగు మొగిలుతోడ మేలమాడు
నెదురులేని గరిమ నిభరాజ మల్లంబు
వనజగేహకేళి వ్రాలునపుడు.
టీక:- కరణీ = ఆడ యేనుగుల; కర = తొండములచేత; ఉత్+జిత = చిమ్మబడిన; కం = నీటి; కణ = బిందువుల; ఛటన్ = ధార లందు; తోగి = తడసిపోయి; సెలయేటి = సెలయేళ్ళతో కూడిన; నీలాద్రి = నీలగిరి; చెలువున్ = వలె; తెగడున్ = పరిహసించును; హస్తినీ = ఆడు ఏనుగుల; హస్త = తొండములచేత; విన్యస్త = ఉంచబడిన; పద్మంబులన్ = పద్మములతో; వేయిగన్నులవాని = ఇంద్రుని {వేయికన్నులవాడు - వెయ్యి కన్నులు గలవాడు, సహస్రాక్షుడు, ఇంద్రుడు}; వెరవు = అతిశయమును; చూపున్ = చూపించును; కలభ = గున్న యేనుగులచే; సమ = అధికముగ; ఉత్కీర్ణ = జల్లబడిన; కల్హారరజమునన్ = కలువల పుపొడితో {కల్హారము - సౌగంధికము, ఇంటుక ఎఱుపు తెలుపు కలిగి మిక్కిలి పరిమళము కలిగిన కలువ}; కనకాచలేంద్రంబు = మేరుపర్వతము యొక్క {కనకాచలేంద్రము - కనక (బంగారు) ఆచల (కొండలలో) ఇంద్రము (గొప్పది), మేరుపర్వతము}; ఘనతన్ = గొప్పదనమును; తాల్చున్ = ధరించును; కుంజరీ = ఆడ యేనుగులచే; పరిచిత = సమర్పించిన; కుముద = తెల్ల కలువల; కాండంబులన్ = తూళ్ళతో; ఫణిరాజమండన = పరమశివుని {ఫణిరాజమండనుడు - ఫణి (సర్పములలో) రాజ (శ్రేష్ఠములచే) మండన (అలంకరింపబడిన వాడు), శివుడు}; ప్రభన్ = ప్రకాశమును; వహించున్ = ధరించును.
మద = మదించిన; కరేణు = ఆడయేనుగులచే; ముక్త = వేయబడిన; మౌక్తిక = ముత్యపు; శుక్తులన్ = చిప్పలతో; మెఱుగు = మెరుపుల; మొగిలు = మబ్బుల; తోడన్ = తోటి; మేలమాడున్ = సరసము లాడును; ఎదురులేని = తిరుగులేని; గరిమన్ = గొప్పదనముతో; ఇభ = ఏనుగుల; రాజ = పతులలో; ఇంద్రము = గొప్పది; వనజగేహ = మడుగు నందు {వనజగేహము - వనజము (పద్మములకు) గేహము (ఆకరము), సరోవరము}; కేళిన్ = క్రీడించుటకు; వ్రాలున్ = దిగెడి; అపుడు = సమయములో.
భావము:- అలా గజరాజు ఎదురులేకుండా పద్మాల సరోవరంలో ఈదుతున్నాడు. అప్పుడు, ఆడ ఏనుగులు అతనిమీద నీళ్ళు చల్లాయి. ఆ నీటి లో తడిసిన అతడు సెలయేళ్ళతో ఒప్పిన నీలగిరిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతని దేహం నిండా కలువపూలు నింపాయి. వాటితో సహస్రాక్షుడైన ఇంద్రునిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతని పై కమలాల పుప్పొడి చల్లాయి. దానితో అతడు బంగారు కొండలా గొప్పగా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతనిపై కలువ తూండ్లు పరిచాయి. వాటితో అతడు సర్పాలు ధరించిన శివునిలా ప్రకాశిస్తున్నాడు. ఆడ మత్తేభాలు అతనిమీద ముత్యాలచిప్పలు వేసాయి. దానితో అతడు మెరుపుతీగలతో కూడిన మేఘాన్ని మించిపోయాడు.
రహస్యార్థం: ఆ జీవుడు, ప్రతిబంధాలు ఏవీ లేకుండా జ్ఞానంలో విహరిస్తూ, ఏనుగు నీలాద్రి మున్నగు రూపాలు పొందినట్లు, మూలాధారాది చక్రాలలో వాయువును బంధించి నపుడు, ఆయా దేవతా వర్ణాలను పొంది తుదకు పరమం అందు ఐక్యం అయ్యాడు.
తెభా-8-50-వ.
మఱియు నా సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిధ విహారవ్యాకులిత నూతన లక్ష్మీవిభవయై యనంగ విద్యానిరూఢ పల్లవ ప్రబంధపరికంపిత శరీరాలంకార యగు కుసుమ కోమలియునుం బోలె వ్యాకీర్ణ చికుర మత్తమధుకర నికరయు; విగతరస వదనకమలయు; నిజస్థాన చలిత కుచరథాంగ యుగళయు; లంపటిత జఘనపులినతలయునై యుండె; నంత.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ఆ; సరోవర = మడుగు యనెడి; లక్ష్మి = శోభ; మద = మదించిన; గజేంద్ర = గజేంద్రుని; వివిధ = నానా; విహార = సంచారముల; వ్యాకులిత = కలతపెట్టబడిన; నూతన = సరికొత్త; లక్ష్మీ = శోభల; విభవ = వైభవములు గలది; ఐ = అయ్యి; అనంగ = కామకళా; విద్యా = శాస్త్రము నందు; నిరూఢ = ప్రసిద్ధమైన; పల్లవ = విటుని; ప్రబంధ = చౌసీతి(40)బంధాలచే; పరికంపిత = మిక్కిలి చలించిన; శరీరాలంకార = దేహాలంకారములు గలది; అగు = అయిన; కుసుమకోమలియున్ = పూలవంటి సుకుమారి; పోలె = వలె; వ్యాకీర్ణ = చెదరిన; చికుర = ముంగురులువంటి; మత్త = మదించిన; మధుకర = తుమ్మెదల; నికరయున్ = సమూహము గలది; విగతరస = వడలిన; వదన = మోమువంటి; కమలయున్ = ఎఱ్ఱతామర గలది; నిజ = తమ; స్థాన = స్థానమునుండి; చలిత = చెదరిపోయిన; కుచ = వక్షోజములువంటి; రథాంగ = చక్రవాకముల; యుగళయున్ = జంట గలది; లంపటిత = నలిగిన; జఘన = పిరుదులువంటి; పులినతలయున్ = ఇసుకతిన్నెలు గలది; ఐ = అయ్యి; ఉండె = గోచరించుచున్నది; అంత = అంతట.
భావము:- అంతేకాక ఆ గజరాజు చేసిన విశేషమైన సంచారాలతో ఆ మడుగు చక్కదనాలు చెదిరి కొత్తందాలు సంతరించుకొంది. గడుసువాడైన విటునితో రతిక్రీడ చేస్తూ అతని కౌగిళ్ళలో చిక్కి వణుకుతున్న కుసుమ సుకుమారిలా చక్కగా ఉంది. మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురులుగా, రసాన్ని కోల్పోయిన పద్మాలు ముఖంగా, చక్రవాకాలు తమ స్థానాలనుండి చెదిరిన స్తనాలుగా, నలిగిన ఇసుక తిన్నెలు అలసిన పిరుదులుగా కనిపిస్తున్నాయి.