Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/విష్ణువు ఆగమనము

వికీసోర్స్ నుండి

విష్ణువు ఆగమనము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-94-ఆ.
విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు డ్డపడక
విశ్వమయుఁడు, విభుఁడు, విష్ణుండు, జిష్ణుండు
క్తియుతున కడ్డడఁ దలంచె.

టీక:- విశ్వ = జగత్తు యంతయును; మయత = నిండి యుండుట; లేమిన్ = లేకపోవుటచేత; వినియున్ = విన్నప్పటికిని; ఊరక = స్పందించకుండగ; ఉండిరి = ఉన్నారు; అంబజాసన = బ్రహ్మదేవుడు; ఆదులు = మున్నగువారు; అడ్డపడక = సాయపడకుండ; విశ్వమయుడు = నారాయణుడు {విశ్వమయుడు - జగత్తంతను నిండి యున్నవాడు, హరి}; విభుడు = నారాయణుడు {విభుడు – వైభవము గలవాడు, హరి}; విష్ణుండు = నారాయణుడు {విష్ణువు – విశ్వమున వ్యాపించినవాడు, హరి}; జిష్ణుండు = నారాయణుడు {జిష్ణుడు - జయించు శీలము గలవాడు, హరి}; భక్తియుతున్ = భక్తి గలవాని; కిన్ = కి; అడ్డపడ = సాయపడవలెనని; తలచె = భావించెను.
భావము:- ఆ సమయంలో బ్రహ్మదేవుడు మొదలగు వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేకపోవుటచేత గజరాజు మొర వినబడినా వారు అడ్డుపడకుండ ఊరికే ఉండిపోయారు. విశ్వమంతా వ్యాపించే వాడు, ప్రభువు, విజయశీలి ఐన విష్ణువు భక్తు డైన గజరాజును రక్షించాలని నిశ్చయించుకొన్నాడు.

తెభా-8-95-మ.
వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్ప పర్యంక రమావినోది యగు నాన్నప్రసన్నుండు వి
హ్వ నాగేంద్రము "పాహిపాహి"యనఁ గుయ్యాలించి సంరంభియై.

టీక:- అల = అక్కడ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబు = పట్టణము; లోన్ = అందు; నగరి = రాజ భవన సముదాయము; లోన్ = అందు; ఆ = ఆ; మూల = ప్రధాన; సౌధంబు = మేడ {సౌధము - సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}; దాపల = దగ్గర; మందార = మందార పూల; వన = తోట; అంతర = లోపల; అమృత = అమృత జలపు; సరస్ = సరోవరము; ప్రాంత = సమీపమున గల; ఇందుకాంత = చంద్రకాంత; ఉపల = శిల (పైన); ఉత్పల = కలువల; పర్యంక = పాన్పుపై నున్న; రమా = లక్ష్మీదేవితో; వినోది = వినోదించు చున్న వాడు; అగున్ = అయిన; ఆపన్న = కష్టాలలో నున్న వారిని; ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు; విహ్వల = విహ్వలము చెంది నట్టి {విహ్వలము - భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట}; నాగేంద్రము = గజేంద్రుడు; పాహి పాహి = కాపాడు కాపాడు; అనన్ = అను; కుయ్యాలించి = మొర ఆలించి; సంరంభి = వేగిరపడు తున్న వాడు; ఐ = అయ్యి.
భావము:- ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సుంది. దానికి దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు.

తెభా-8-96-మ.
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
రివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం న్నింపఁ; డాకర్ణికాం
ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాప్రోత్థితశ్రీకుచో
రిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

టీక:- సిరి = లక్ష్మీదేవి; కిన్ = కైనను; చెప్పడు = చెప్పుట లేదు; శంఖ = శంఖము; చక్ర = సుదర్శన చక్రము; యుగమున్ = జంటను; చేదోయి = చేతులు రెంటి యందు; సంధింపడు = ధరించుటలేదు; ఏ = ఏ; పరివారంబునున్ = సేవకులను; చీరడు = పిలువడు; అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగము (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}; పన్నింపడు = సిద్ధపరుప నియమించడు; ఆకర్ణిక = చెవిదుద్దుల; అంతర = వరకు జారినట్టి; ధమ్మిల్లమున్ = జుట్టుముడిని; చక్కనొత్తడు = చక్కదిద్దుకొనుట లేదు; వివాద = ప్రణయకలహము నందు; ప్రోత్థిత = పైకిలేచుచున్న; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; కుచ = వక్షము; ఉపరి = మీది; చేలాంచలము = చీరకొంగు; ఐనన్ = అయినను; వీడడు = వదలిపెట్టుట లేదు; గజ = గజేంద్రుని; ప్రాణ = ప్రాణములను; అవన = కాపాడెడి; ఉత్సాహి = ఉత్సాహము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

తెభా-8-97-వ.
ఇట్లు భక్తజనపాలన పరాయణుండును, నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును నగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి, లక్ష్మీకాంతా వినోదంబులం దగులు సాలించి, సంభ్రమించి దిశలు నిరీక్షించి, గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి, [నిజపరికరంబు మరల నవధరించి] గగనంబున కుద్గమించి వేంచేయు నప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; భక్త = భక్తులైన; జన = వారి; పాలన = రక్షించుట యందు; పరాయణుండును = ఏకాగ్రమైన ఆసక్తి గలవాడు; నిఖిల = సర్వ; జంతు = జీవుల; హృదయ = హృదయము లనెడి; అరవింద = పద్మముల యందు; సంస్థితుండును = వసించువాడు; అగు = ఐన; నారాయణుండు = విష్ణుమూర్తి {నారాయణుండు - ఉదకము స్థానముగా గల వాడు, హరి}; కరికులేంద్ర = గజేంద్రుని {కరికులేంద్రుడు - కరి (ఏనుగు) కుల (సమూహమునకు) ఇంద్రుడు (ప్రభువు), గజేంద్రుడు}; విజ్ఞాపిత = మొరపెట్టుకొన్న; నానవిధ = వివిధములైన; దీన = ఆర్తి గల; ఆలాపంబులు = ప్రార్థనలు; ఆకర్ణించి = విని; లక్ష్మీకాంత = లక్ష్మీదేవితో; వినోదంబులన్ = సరససల్లాపము లందు; తగులు = ఆసక్తి; చాలించి = ఆపివేసి; సంభ్రమించి = త్వరపడి; దిశలు = దిక్కులవైపు; నిరీక్షించి = దీర్ఘముగ చూచి; గజేంద్ర = గజేంద్రుని; రక్షా = రక్షించెడి; పరత్వంబున్ = కార్యలగ్నమును; అంగీకరించి = స్వీకరించి; [నిజ = తన; పరికరంబున్ = ఆయుధములను; మరల = మళ్ళీ; అవధరించి = పూని;] గగనంబునన్ = ఆకాశమున; కున్ = కు; ఉద్గమించి = బయలుదేరి; వేంచేయున్ = వెళ్ళు; అప్పుడు = సమయము నందు.
భావము:- హరి భక్తులను ప్రోచుట యందు అనురక్తి గలవాడు. సర్వ ప్రాణుల హృదయాలనే పద్మాలలో నివసించేవాడు. ఆయన గజేంద్రుని మొరలన్నీ విన్నాడు. లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు. ఆత్రుత చెంది అటునిటు చూసి గజేంద్రుని కాపాడుట అనే బరువైన బాధ్యత తీసుకొని [అటుపిమ్మట ఆయుధాలను అవధరించి] ఆకాశమార్గాన బయలుదేరాడు. ఆ సమయంలో.
గమనిక :- ఈ 8-60-వ. నందలి "[నిజపరికరంబుల నవధరించి]" పాఠ్యభాగము ప్రక్షిప్తదోషము కానోపును. ఏలననా, తరువాత చెప్పిన "తనవెంటన్ సిరి.." మున్నగు పద్యములలో శంఖచక్రాదులు కూడా వెనుక వస్తున్నట్లు చెప్పబడింది. కనుక ఇక్కడ ఆయుధాలను ధరించుట పొసగదు. పోతనామాత్యులవారు చేసినది ఆంధ్రీకరించుట కాని సాధారణ అనువదించుట కాదు. వారు ఈ ఘట్టంలో తన స్వతంత్రను ప్రదర్శిస్తూ విస్తరించిరి అనిన విషయమి లోకవిదితము. ముందు కాలంలో ఎప్పుడో వ్యాసమూలముతో అనుసంధించుకుంటూ, ఈ "[నిజపరికరంబుల నవధరించి]" ప్రక్షిప్తము చేయడము జరిగి ఉండనోపు. అందుచేత, దీనిని [కుండలీకరణంము] చేయుడమైనది.

తెభా-8-98-మ.
వెంటన్ సిరి; లచ్చివెంట నవరోవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ, శంఖ, చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్య వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

టీక:- తన = అతని; వెంటన్ = వెనుక; సిరి = లక్ష్మీదేవి; లచ్చి = లక్ష్మీదేని; వెంటన్ = వెనుక; అవరోధ = అంతఃపుర స్త్రీ; వ్రాతమున్ = సమూహమును; దాని = వాని; వెన్కనున్ = వెనుక; పక్షీంద్రుడు = గరుత్మంతుడు {పక్షీంద్రుడు - పక్షులకు ఇంద్రుడు (ప్రభువు), గరుడుడు}; వాని = అతని; పొంతను = పక్కనే; ధనుస్ = విల్లు {విష్ణుమూర్తి - (అ)ఆయుధములు 1ధనుస్సు శాఙ్గము 2గద కౌమోదకి 3శంఖము పాంచజన్యము 4చక్రము సుదర్శనము 5కత్తి నందకము (ఆ)రథము శతానందము (ఇ)సేనానాయకుడు విష్వక్సేనుడు}; కౌమోదకీ = కౌమోదకి యనెడి గద; శంఖ = శంఖము; చక్ర = చక్రముల; నికాయంబునున్ = సమూహము; నారదుండు = నారదుడు; ధ్వజినీకాంతుండు = విష్వక్సేనుడు {ధ్వజినీకాంతుండు - (విష్ణుమూర్తి యొక్క) ధ్వజినీ (సేనా) కాంతుడు (నాయకుడు), విష్వక్సేనుడు}; రాన్ = రాగా; వచ్చిరి = వచ్చితిరి; ఒయ్యన = శ్రీఘ్రముగ; వైకుంఠ = వైకుంఠ మనెడి; పురంబునన్ = పట్టణము నందు; కలుగు = ఉండెడి; వారు = వారు; ఆబాలగోపాలమున్ = సర్వులును.
భావము:- అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించటం కోసం లక్ష్మీదేవి కొంగు వదలను కూడ వదలకుండా తటాలున బయలుదేరటంతో
విష్ణువు వెనుక లక్ష్మీ దేవి, ఆమె వెనకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడుడు, ఆయన పక్కనే విల్లూ గదా శంఖచక్రాలు నారదుడు విష్వక్సేనుడు వస్తున్నారు. వారి వెనువెంట వరసగా వైకుంఠపురంలో ఉన్న వాళ్ళందరు కూడా వస్తున్నారు.
ఇది పోతనగారు ప్రసాదించిన పరమాద్భుత అమృత గుళికలలో ఒకటి. పండిత పామరుల నోళ్ళలో తరచుగా నానుతుండే పద్యం. నడకలో భావంలో ఉత్తమ స్థాయి అందుకున్నది. చదువుతుంటేనే వేగంగా పయనమౌతున్న విష్ణుమూర్తి వెనుక అంత వేగంగాను వెళ్తున్న లక్ష్మీదేవి సూదిమొనగా గల బాణంములుకు లాగ అనుసరిస్తున్న పరివారం మనోనేత్రానికి దర్శనమిస్తుంది. *{విష్ణుమూర్తి - (అ) ఆయుధములు 1ధనుస్సు శాఙ్గము 2గద కౌమోదకి 3శంఖము పాంచజన్యము 4చక్రము సుదర్శనము 5కత్తి నందకము (ఆ) రథము శతానందము (ఇ) సేనానాయకుడు విష్వక్సేనుడు (ఈ) వాహనం గరుత్మంతుడు}

తెభా-8-99-వ.
తదనంతరంబ, ముఖారవింద మకరందబిందు సందోహ పరిష్యందమానానం దేందిందిర యగు న య్యిందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవ్యానచేలాంచల యై పోవుచు.
టీక:- తదనంతరంబ = తరువాత; ముఖ = ముఖము యనెడి; అరవింద = పద్మము యందలి; మకరంద = పూతేనె; బిందు = చుక్కల; సందోహ = సమూహము; పరిష్యందమాన = స్రవించుచుండగ; ఆనంద = ఆనందిస్తున్న; ఇందిందిర = తుమ్మెదలు గలది; అగున్ = అయినట్టి; ఆ = ఆ; ఇందిరాదేవి = లక్ష్మీదేవి యొక్క; గోవింద = నారాయణుని {గోవిందుడు - భూమి గోవుల స్వర్గము వేదములను పొందెడివాడు, హరి}; కరా = చేయి యనెడి; అరవింద = పద్మముచే; సమాకృష్యమాణ = లాగబడుతున్న; సంవ్యాన = వస్త్రపు, ఉత్తరీయపు; చేలాంచల = కొస (కొంగు) గలవాడు; ఐ = అయ్యి; పోవుచున్ = వెళ్తూ.
భావము:- అప్పుడు పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరందం బిందువులు వంటి తియ్యటి చెమట బొట్లకు తుమ్మెదలు ఆనందంతో ముసిరాయి. విష్ణుమూర్తి తన పైట కొంగు పట్టుకొని లాక్కుపోతుంటే వైకుంఠుని వెన్నంటి పోతూ ఇలా అనుకుంది.

తెభా-8-100-మ.
" వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాస్త్రీ జనాలాపముల్
వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?
నుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం
ని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్."

టీక:- తన = తను; వేంచేయు = వెళ్ళుతున్న; పదంబున్ = చోటును; పేర్కొనడు = చెప్పుట లేదు; అనాథ = దిక్కులేని; స్త్రీ = మహిళ లైన; జన = వారి; ఆలాపముల్ = మొరలను; వినెనో = విన్నాడేమో; మ్రుచ్చులు = దొంగలు; మ్రుచ్చలించిరో = దొంగతనము చేసిరేమో; ఖలుల్ = నీచులు; వేద = వేదములు; ప్రపంచంబులన్ = సమస్తమును; దనుజ = రాక్షస; అనీకము = మూకలు; దేవతానగరి = అమరావతి {దేవతానగరి - దేవతల రాజధాని, అమరావతి}; పైన్ = మీదికి; దండెత్తెనో = యుద్ధమునకు వెళ్లారేమో; భక్తులన్ = భక్తులను; కని = చూసి; చక్రాయుధుడు = విష్ణుమూర్తి {చక్రాయుధుడు - చక్రము ఆయుధముగా గల వాడు, విష్ణువు}; ఏడీ = ఎక్కడ ఉన్నాడు; చూపుడు = చూపించండి; అని = అని; ధిక్కారించిరో = దబాయించిరేమో; దుర్జనులు = దుష్టులు.
భావము:- “ఎందుచేతనో విభుడు తాను వెళ్ళే చోటు చెప్పటం లేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో? దుర్మార్గులు ఐన దొంగలు ఎవరైనా వేదాలను దొంగిలిచారేమో? దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దాడి చేసారేమో? విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటు దుర్మార్గులు భక్తులను బెదిరిస్తున్నారో ఏమో?” అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది.

తెభా-8-101-వ.
అని వితర్కించుచు.
టీక:- అని = అని; వితర్కించుచు = మిక్కిలి విచారిస్తూ.
భావము:- అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది.

తెభా-8-102-శా.
తాటంకాచలనంబుతో, భుజనటద్ధమ్మిల్లబంధంబుతో,
శాటీముక్త కుచంబుతో, నదృఢచంత్కాంచితో, శీర్ణలా
లాటాలేపముతో, మనోహరకరాగ్నోత్తరీయంబుతోఁ,
గోటీందుప్రభతో, నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్.

టీక:- తాటంకా = కర్ణాభరణముల; ఆచలనంబు = అధికమైన కదలికల; తోన్ = తోటి; భుజ = భుజములపై; నటత్ = నాట్య మాడుతున్న; ధమ్మిల్లబంధంబు = జుట్టుముడి; తోన్ = తోటి; శాటీ = పమిటనుండి; ముక్త = విడివడిన; కుచంబు = స్తనముల; తోన్ = తోటి; అదృఢ = బిగుతు తగ్గి; చంచత్ = చలించుచున్న; కాంచీ = ఒడ్డాణము; తోన్ = తోటి; శీర్ణ = నుసిరాలుచున్న; లాలాట = నుదిటి యందలి; లేపము = పూత; తోన్ = తోటి; మనోహర = భర్త {మనోహరుడు - మనః (మనసును) హరుడు (దొంగిలించినవాడు), భర్త}; కరా = చేతి యందు; ఆలగ్న = చిక్కుకున్న; ఉత్తరీయంబు = పమిట; తోన్ = తోటి; కోటి = కోటిమంది; ఇందు = చంద్రుల; ప్రభ = కాంతి; తోన్ = తోటి; ఉరోజ = స్తనముల యొక్క; భర = బరువువలన; సంకోచత్ = చిక్కిపోయిన; విలగ్నంబు = నడుము; తోన్ = తోటి;
భావము:- గజేంద్రుని కాపాడాలని పరుగు పరుగున వెళ్తున్న భర్త వెంట కోటి చంద్రుల కాంతి నిండిన ముఖంతో లక్ష్మీదేవి వెళుతోంది. అప్పుడు ఆమె చెవి లోలకులు కదుల్తున్నాయి. భుజాల మీద వీడిన కొప్పుముడి చిందు లేస్తోంది. స్తనాలపై పైటకొంగు తొలగిపోయింది. ఒడ్డాణం వదులై పోయింది. నుదిటి మీద రాసుకొన్న లేపనం చెదిరిపోయింది. మోము కోటి చంద్రుల కాంతితో నిండిపోయింది. స్తనాల భారంతో నడుం చిక్కిపోయింది. ఆమె పైట కొంగు ప్రియభర్త చేతిలో చిక్కుకొనే ఉంది.

తెభా-8-103-క.
డిగెద నని కడువడిఁ జను;
డిగినఁ దను మగుడ నుడుగఁ ని నడ యుడుగున్;
వెవెడ సిడిముడి తడఁబడ
డు గిడు; నడుగిడదు జడిమ డు గిడునెడలన్.

టీక:- అడిగెదన్ = అడిగెదను; అని = అని; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగ; చనున్ = వెళ్ళును; అడిగినన్ = అడిగినప్పటికిని; తను = అతను; మగుడ = మారుపలుకులు; నుడుగడు = పలుకడు; అని = అని; నడన్ = నడచుట; ఉడుగును = విరమించును; వెడవెడ = తొట్రుపడుతూ; సిడిముడిని = చీకాకుతో; తడబడన్ = తడబడుతూ; అడుగు = అడుగు; ఇడున్ = వేయును; అడుగున్ = అడుగు; ఇడదు = వేయదు; జడిమన్ = జడత్వముతో; అడుగున్ = అడుగులను; ఇడు = వేసెడి; ఎడలన్ = సమయములలో.
భావము:- అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదా మని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది.
కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి –
ఈ పద్యం చూస్తున్నామా వింటున్నామా చదువుతున్నామా అనిపిస్తుంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు. భావాన్ని స్ఫురింపజేసే పద ధ్వని. ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కంద పద్యం ప్రయోగం. ఆహా ఏమి పద్యం కాదు అమృత గుళిక.

తెభా-8-104-సీ.
నిటలాలకము లంట నివుర జుంజుమ్మని-
ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు;
ళులఁ జోపఁగఁ జిల్క ల్ల నల్లన చేరి-
యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు;
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం-
దాకినీ పాఠీనలో మెసఁగు;
మీన పంక్తుల దాఁట మెయిదీఁగతో రాయ-
శంపాలతలు మింట రణిఁ గట్టు;

తెభా-8-104.1-ఆ.
శంపలను జయింపఁ క్రవాకంబులు
కుచయుగంబుఁ దాఁకి క్రొవ్వుజూపు;
మెలఁత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె
లదవర్ణు వెనుకఁ నెడునపుడు.

టీక:- నిటల = నుదుట; అలకులు = ముంగురులు; అంటన్ = అంటుకొనగ; నివురన్ = చక్కదిద్దబోతే; జుంజుమ్ము = జుంజుం; అని = అనెడి ఝంకారములతో; ముఖ = ముఖము యనెడి; సరోజము = పద్మము; నిండ = అంతటను; ముసురున్ = కప్పును; తేంట్లు = తుమ్మెదలు; అళులన్ = తుమ్మెదలను; జోపగన్ = తోలగా; చిల్కలు = చిలుకలు; అల్లనల్లన = మెల్లగా; చేరి = సమీపించి; ఓష్ఠ = పెదవి యనెడి; బింబ = దొండపండు; ద్యుతులు = కాంతులను; ఒడియన్ = ఒడిసిపట్టుకొన; ఉఱుకున్ = దూకును; శుకములన్ = చిలుకలను; తోలన్ = తోలగా; చక్షుః = కన్నులు యనెడి; మీనముల్ = చేపల; కున్ = కు; మందాకినీ = ఆకాశగంగలోని; పాఠీన = చేపల; లోకమున్ = సమూహము; ఎసగు = విజృంభించును; మీన = చేపల; పంక్తులన్ = సమూహములను; దాటన్ = దాటగా; మొయి = దేహము యనెడి; తీగ = తీవ; తోన్ = తోటి; రాయన్ = రాసుకుపోవుటకు; శంపా = మెఱుపు; లతలున్ = తీగలు; మింటన్ = ఆకాశములో; సరణి = వరుసలు; కట్టున్ = కట్టును.
శంపలను = మెఱుపులను; జయింపన్ = జయించుటకు; చక్రవాకంబులున్ = చక్రవాకపక్షులు; కుచ = స్తనముల; యుగంబున్ = జంటను; తాకి = ఎదుర్కొని; క్రొవ్వు = బలమును; చూపున్ = చూపుతున్నవి; మెలత = స్త్రీ; మొగిలు = మేఘము; పిఱిది = వెనుకనుండు; మెఱుగు = మెరుపు; తీవయున్ = తీగను; పోలెన్ = వలె; జలదవర్ణున్ = మేఘము వంటి రంగు వాని; వెనుకన్ = వెంట; చనెడు = వెళ్ళెడి; అపుడు = సమయము నందు.
భావము:- మేఘం వెంట మెరుపు తీగ వలె లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంట వెళ్ళసాగింది. ఆ సమయంలో ఆమె నుదుటి మీది ముంగురులను చక్కదిద్దుకోబోతే, పద్మంలాంటి ఆమె మోము నిండా తుమ్మెదలు ముసురుకున్నాయి. వాటిని తోలుతుంటే, ఆమె పెదవులను చూసి దొండపం డనుకొని చిలుకలు వచ్చి చేరాయి. చిలకలని తోలుతుంటే, చేపల లాంటి ఆమె కన్నులను చూసి ఆకాశగంగ లోని పెనుచేపలు ఎగసి పడ్డాయి. చేపలను తప్పించుకోగానే ఆమె శరీరపు మెరుపు చూసి ఆ దేహలతని ఒరుసుకోడానికి మెరుపు తీగలు బారులు తీరాయి. మెరుపు తీగలను దాటగానే, చక్రవాకపక్షుల జంటలు మిడిసి పాటుతో గుండ్రటి ఆమె స్తనద్వయాన్ని తాకాయి.

తెభా-8-105-మ.
వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్, సురారాతి జీ
సంపత్తి నిరాకరిష్ణుఁ, గరుణార్ధిష్ణుఁ, యోగీంద్ర హృ
ద్వవర్తిష్ణు, సహిష్ణు, భక్తజనబృంప్రాభవాలంకరి
ష్ణు, వోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్, జిష్ణు, రోచిష్ణునిన్.

టీక:- వినువీథిన్ = ఆకాశమార్గము నందు; చనుదేరన్ = వెళ్ళుతుండగా; కాంచిరి = దర్శించిరి; అమరుల్ = దేవతలు; విష్ణున్ = హరిని {విష్ణువు - విశ్వమున వ్యాపించి యుండువాడు, నారాయణుడు}; సురారాతిజీవనసంపత్తినిరాకరిష్ణున్ = హరిని {సురారాతిజీవనసంపత్తినిరాకరిష్ణుడు - సుర (దేవతల) ఆరాతి (శత్రువుల యొక్క) జీవనసంపత్తి (బ్రతుకుదెరువు)ను నిరాకరిష్ణుడు (నిరాకరించెడివాడు), విష్ణువు}; కరుణావర్ధిష్ణున్ = హరిని {కరుణావర్ధిష్ణుడు - కారుణ్యము వృద్ధి యగు స్వభావము గల వాడు, విష్ణువు}; యోగీంద్రహృద్వనవర్తిష్ణున్ = హరిని {యోగీంద్రహృద్వనవర్తిష్ణుడు - యోగీంద్రుల హృదయము లనెడి వన (తోటలలో) వర్తిష్ణుడు (మెలగెడువాడు), విష్ణువు}; సహిష్ణున్ = హరిని {సహిష్ణుడు - సహన స్వభావము గల వాడు, విష్ణువు}; భక్తజనబృందప్రాభవాలంకరిష్ణున్ = హరిని {భక్తజనబృందప్రాభవాలంకరిష్ణుడు - భక్తజనుల బృంద (సమూహములను) ప్రాభవ (గొప్పదనము)తో అలంకరిష్ణుడు (అలంకరించెడి వాడు), విష్ణువు}; నవోఢోల్లసదిందిరాపరిచరిష్ణున్ = హరిని {నవోఢోల్లసదిందిరాపరిచరిష్ణుడు - నవోఢ (కొత్తపెళ్ళికూతురు) వలె ఉల్లసత్ (ఉల్లాసము గల) ఇందిరా (లక్ష్మీదేవికి) పరిచరిష్ణుడు (పరిచారునిగా ఉండు వాడు. కలిసి విహరించు వాడు), విష్ణువు}; జిష్ణున్ = హరిని {జిష్ణువు - జయించు స్వభావముగల వాడు, విష్ణువు}; రోచిష్ణునిన్ = హరిని {రోచిష్ణుడు - ప్రకాశించెడి స్వభావము గల వాడు, విష్ణువు}.
భావము:- విష్ణుమూర్తి రాక్షసుల బతుకు తెరువులను నశింప జేసే వాడు, దయా రసంతో మించేవాడు, మహాయోగుల హృదయా లనే వనాలలో విహరించేవాడు, గొప్ప ఓర్పుగల వాడు, భక్తుల గొప్పదనాన్ని పెంపొందించేవాడు, నవయౌవనంతో వెలుగొందే లక్ష్మీదేవితో కలిసి విహరించే వాడు. జయశీలుడు, మహా కాంతిమంతుడు. అట్టి భగవంతుడిని ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూసారు.

తెభా-8-106-వ.
ఇట్లు పొడగని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పొడగని = దర్శించి.
భావము:- అలా గజేంద్రుని కాపాడటానికి వెళుతున్న విష్ణుమూర్తిని దేవతలు కనుగొని

తెభా-8-107-మ.
"నుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
నినాదం బదె; చక్ర మల్లదె; భుజంధ్వంసియున్ వాఁడె; క్ర
న్న యేతెంచె"నటంచు వేల్పులు "నమోనారాయణాయేతి"ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.

టీక:- చనుదెంచెన్ = వచ్చినాడు; ఘనుడు = గొప్పవాడు; అల్ల = అక్కడి; వాడె = అతడే; హరి = విష్ణువు; పజ్జన్ = పక్కనే; కంటిరే = చూసితిరా; లక్ష్మిన్ = లక్ష్మీదేవిని; శంఖనినాదంబు = పాంచజన్య శంఖధ్వని; అదె = అక్కడ నున్నదే; చక్రము = సుదర్శనచక్రము; అల్లదె = అక్క డున్నదే; భుజంగధ్వంసియున్ = గరుత్మంతుడు; వాడె = అతడే; క్రన్ననన్ = వరుసగా; ఏతెంచెన్ = వచ్చిరి; అట = అని; అంచున్ = అనుచు; వేల్పులు = దేవతలు; నమో = నమస్కారము; నారాయణ = నారాయణునికి; ఇతి = ఇది యనెడి; నిస్వనులు = పలికెడివారు; ఐ = అయ్యి; మ్రొక్కిరి = నమస్కరించిరి; మింటన్ = ఆకాశము నందు; హస్తిదురవస్థావక్రికిన్ = హరికి {హస్తిదురవస్థావక్రి - హస్తి (ఏనుగు యొక్క) దురవస్థ (ఆపదను) వక్రి (మరలించెడివాడు), విష్ణువు}; చక్రికిన్ = హరికి {చక్రి - చక్రము ఆయుధముగా గల వాడు, విష్ణువు}.
భావము:- గజేంద్రుని ఆర్తి బాపటానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీమహావిష్ణువును చూసి దేవతలు
“అదిగదిగో మహనీయుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు. అతని వెనుకనే శ్రీమహాలక్ష్మి వస్తున్నది చూడండి. అదిగో పాంచజన్య శంఖధ్వని. సర్పాలను సంహరించేవాడు గరుత్మంతుడు అదిగో చూడండి వెంట వస్తున్నాడు.” అనుకుంటు “నారాయణునికి నమస్కారం” అంటు నమస్కారాలు చేస్తున్నారు.

తెభా-8-108-వ.
అ య్యవసరంబునఁ గుంజరేంద్రపాలన పారవశ్యంబున దేవతానమస్కారంబు లంగీకరింపక మనస్సమాన సంచారుం డై పోయిపోయి, కొంతదూరంబున శింశుమారచక్రంబునుం బోలె గురుమకరకుళీర మీనమిథునంబై; కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్ఛ మకరకచ్ఛపంబై; భాగ్యవంతుని భాగధేయంబునుంబోలె సరాగ జీవనంబై; వైకుంఠపురంబునుంబోలె శంఖచక్ర కమలాలంకృతంబై; సంసార చక్రంబునుంబోలె ద్వంద్వసంకుల పంక సంకీర్ణంబై యొప్పు నప్పంకజాకరంబుఁ బొడగని.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; కుంజరేంద్ర = గజేంద్రుని; పాలన = పరిపాలించెడి; పారవశ్యంబునన్ = మైమరపుచేత; దేవతా = దేవతల యొక్క; నమస్కారంబులన్ = నమస్కారములను; అంగీకరింపక = స్వీకరింపకుండగ; మనస్సమాన = మనోవేగముతో సమానముగ; సంచారుండు = వెళ్ళువాడు; ఐ = అయ్యి; పోయిపోయి = వెళ్ళివెళ్ళి; కొంత = కొంత; దూరంబునన్ = దూరము నందు; శింశుమారచక్రంబున్ = ఆకాశ మందలి రాసుల చక్రము, మొసళ్ళ నివాసము; పోలెన్ = వలె; గురు = గురుగ్రహము, పెద్దపెద్ద; మకర = మకరరాశి, మొసళ్ళు; కుళీర = కర్కాటకరాశి, పీతలు; మీన = మీనరాశి, చేపల; మిథునంబు = మిథునరాశి, జంటలు; ఐ = కలది యై; కిన్నరేంద్రుని = కుబేరుని; భాండాగారంబునున్ = ధనాగారము; పోలెన్ = వలె; స్వచ్ఛ = స్వచ్ఛమైన, తెల్లని; మకర = మకర మనెడి నిధి గలది, మోసళ్ళు గలది; కచ్చపంబు = కచ్చప మనెడి నిధి గలది, తాబేళ్ళు గలది; ఐ = అయ్యి; భాగ్యవంతుని = అదృష్టవంతుని; భాగధేయంబునున్ = సుఖజీవితము; పోలెన్ = వలె; సరాగ = అనురాగంతో కూడిన, ఎఱ్ఱని; జీవనంబున్ = జీవితము గలది, నీరు గలది; ఐ = అయ్యి; వైకుంఠ = వైకుంఠము యనెడి; పురంబునున్ = పురము; పోలెన్ = వలె; శంఖ = పాంచజన్యము, శంఖములు; చక్ర = సుదర్శనము, చక్రవాకములు; కమలా = లక్ష్మీదేవిలతో, కమలములతో; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐ = అయ్యి; సంసారచక్రంబునున్ = సంసారసాగరము; పోలెన్ = వలె; ద్వంద్వ = జలచర జంటలుతో, సుఖదుఃఖాది ద్వంద్వములు; సంకుల = కలకబారిన, వ్యాపించిన; సంకీర్ణంబు = చిక్కని బురద గలది, మిక్కిలి చిక్కులు గలది; ఐ = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; ఆ = ఆ; పంకజాకరంబున్ = మడుగును {పంకజాకరము - పంకజము (పద్మములకు) ఆకరము (నివాసము), సరోవరము}; పొడగని = కనుగొని;
భావము:- ఆ సమయంలో గజేంద్రుడిని రక్షంచాలని వెళ్తున్న తొందరలో, విష్ణుమూర్తి దేవతల మొక్కులు అందుకోలేదు. అలా మనోవేగంతో వెళ్ళి, ఏనుగు మొసలి పోరాడుతున్న మడుగుని చూసాడు. ఆ మడుగులో శింశుమార చక్రంలో లాగ గొప్ప మొసళ్ళు, పీతలు, చేపలు జంటలు జంటలుగా ఉన్నాయి. కుబేరుని ధనాగారంలోని కచ్చపం అనే నిధి వంటి శ్రేష్ఠమైన తాబేళ్ళు ఉన్నాయి, ధనవంతుని సుఖజీవనంలోని అనురాగం లాగ ఎఱ్ఱని జీవనం (నీరు) నిండుగా ఉంది, వైకుంఠం వలె శంఖం, చక్రం (చక్రవాక పక్షులు), కమల (లక్ష్మి) లతో అలంకరింపబడి ఉంది. సుఖ దుఃఖాలనే ద్వంద్వాలతో నిండిన సంసారం వలె జలచరాల జంటలతో కలచబడిన బురద కలిగి యుంది.