Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/కడలిలో నావను గాచుట

వికీసోర్స్ నుండి

కడలిలో నావనుగాచుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-721-వ.
అంతకు మున్న సత్యవ్రతుండు మహార్ణవంబులు మహీవలయంబు ముంచు నవసరంబున భక్త పరాధీనుం డగు హరిఁ దలంచుచు నుండ నారాయణ ప్రేరితయై యొక్క నావ వచ్చినం గనుంగొని .
టీక:- అంత = దాని; కున్ = కి; మున్న = ముందు; సత్యవ్రతుండు = సత్యవ్రతుడు; మహార్ణవంబులు = మహాసముద్రములు; మహీవలయంబున్ = భూమండలమును; ముంచు = ముంచేసెడి; అవసరంబునన్ = సమయమునందు; భక్త = భక్తులకు; పరాధీనుండు = లొంగువాడు; అగు = అయిన; హరిన్ = విష్ణుమూర్తిని; తలంచుచున్ = స్మరించుచు; ఉండన్ = ఉండగా; నారాయణ = విష్ణునిచే; ప్రేరిత = ప్రేరేపింబడినది; ఐ = అయ్యి; ఒక్క = ఒక; నావ = ఓడ; వచ్చినన్ = రాగా; కనుంగొని = చూసి.
భావము:- సత్యవ్రతుడు ప్రళయ కాలం వచ్చి సముద్రజలాలు భూలోకాన్ని ముంచివేయడానికి ముందే భక్తులకు తోడునీడైన భగవంతుణ్ణి ధ్యానించుతున్న సమయంలో శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడకి వచ్చింది.

తెభా-8-722-మ.
ని సత్యవ్రతమేదినీదయితుఁ డోజం బూని మ్రాన్దీఁగె వి
త్తముల్ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై
ముని సంఘంబులుఁ దాను నెక్కి వెఱతో మున్నీటిపైఁ దేలుచుం
నియెన్ ముందట భక్తలోక హృదలంర్మీణమున్ మీనమున్
.
టీక:- చని = వెళ్ళి; సత్యవ్రత = సత్యవ్రతుడు యనెడి; మేదినీదయితుడు = రాజు {మేదినీదయితుడు - మేదిని (భూమికి) దయితుడు (భర్త), రాజు}; ఓజన్ = ఉత్సాహముతో; పూని = యత్నించి; మ్రాన్ = చెట్ల; తీగె = తీవల; విత్తనముల్ = బీజములను; పెక్కులు = అనేకము; నావ = ఓడ; పైన్ = మీద; ఇడి = పెట్టి; హరిన్ = విష్ణుమూర్తిమీది; ధ్యానంబు = ధ్యానము; తో = తో; దాని = దాని; పైన్ = మీదకి; ముని = ఋషుల; సంఘంబులున్ = సమూహములు; తానున్ = అతను; ఎక్కి = ఎక్కి; వెఱ = వెఱపు; తోన్ = తోటి; మున్నీటి = సముద్రము; పైన్ = పైన; తేలుచున్ = తేలుతూ; కనియెన్ = కనుగొనెను; ముందటన్ = ఎదురుగా; భక్త = భక్తులు; లోక = అందరిని; హృత్ = ఆకర్షించెడి; అలంకర్మీణమున్ = పనియందు నేర్పరియైన వానిని; మీనమున్ = మీనావతారమును.
భావము:- సత్యవ్రతుడు ఉత్సాహంతో ఆ ఓడ దగ్గరకు వెళ్ళి, అనేక ఓషధులను విత్తనాలను దాని మీదకి ఎక్కించాడు. విష్ణువును స్త్రోత్రం చేస్తూ మునులతో పాటు ఆ నావను ఎక్కాడు. భయంభయంగా సముద్రం మీద తేలుతూ పోతున్నాడు. అప్పుడు భక్తలోకాన్ని ఆకర్షించుటలో నేర్పరితనము కలిగిన చేపను (మీనావతారుని) ఎదురుగా చూచెను.

తెభా-8-723-వ.
కని జలచరేంద్రుని కొమ్మున నొక్క పెనుఁ బాపత్రాటన నావఁ గట్టి, సంతసించి డెందంబు నివురుకొని తపస్వులుం దాను నా రాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడం దొడంగె .
టీక:- కని = దర్శించి; జలచరేంద్రుని = మీనావతారుని; కొమ్మునన్ = కొమ్మునకు; ఒక్క = ఒక; పెను = పెద్ద; పాప = పాము యనెడి; త్రాటను = తాడుతో; నావన్ = ఓడను; కట్టి = కట్టేసి; సంతసించి = సంతోషించి; డెందంబున్ = గుండెలుమీద; నివురుకొని = మెల్లగారాసుకొని; తపస్వులున్ = ఋషులు; తానున్ = అతను; ఆ = ఆ; రాచపెద్ద = మహారాజు; మీనాకారుండు = మీనరూపుడు; అగు = అయిన; వేల్పుఱేనిన్ = మహాదేవుని; ఇట్లు = ఈ విధముగ; అని = అనుచు; పొగడన్ = స్తుతించ; తొడగెన్ = సాగెను.
భావము:- అలా కనబడిన మహా మీనరూపుని కొమ్ముకు సత్యవ్రతుడు ఒక పెద్ద పామును త్రాడుగా చేసి ఆ ఓడను కట్టివేసాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకున్నాడు. ఋషులతోపాటు అతడు విష్ణువును ఈవిధంగా పొగడసాగాడు. . .

తెభా-8-724-మ.
"లోఁ బుట్టు నవిద్య గప్పికొనుడుం న్మూలసంసార వి
భ్రములై కొందఱు దేలుచుం గలఁగుచున్ ల్వెంటలన్ దైవ యో
మునం దే పరమేశుఁ గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై
ప్రదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మమ్మీశ్వరా!

టీక:- తమ = వారి; లోన్ = అందు; పుట్టున్ = పుట్టెడి; అవిద్యన్ = అజ్ఞానము; కప్పికొనుడున్ = ఆవరించుకొనును; తత్ = దాని; మూలన్ = వలన; సంసార = భవబంధములందు; విభ్రములు = మిక్కిలిభ్రమలోపడినవారు; ఐ = అయ్యి; కొందఱు = కొంతమంది; తేలుచున్ = కొట్టుకుపోతూ; కలగుచున్ = కలతచెందుతూ; పలు = అనేక; వెంటలన్ = విధములుగా; దైవ = అదృష్టము; యోగమున్ = కలసివచ్చుట; అందున్ = పొందును; ఏ = ఏ; పరమేశున్ = భగవంతుని; కొల్చి = సేవించి; ఘనులు = గొప్పవారు; ఐ = అయ్యి; కైవల్య = మోక్షము; సంప్రాప్తులై = చక్కగాపొందినవారు; ఐ = అయ్యి; ప్రమదంబున్ = అనందమును; అందుదురు = అందుకొనెదరు; అట్టి = అటువంటి; నీవు = నీవు; కరుణన్ = దయతో; పాలింపుము = కాపాడుము; మమ్మున్ = మమ్ములను; ఈశ్వరా = భగవంతుడా.
భావము:- “ఓ భగవంతుడా! తమలో పుట్టిన అజ్ఞానం ఆవరించడం వలన కొందరు ఆ అజ్ఞాన మూలమైన సంసారంలో పడి చిక్కుకుని మోసపోయి కలతపడతారు. అటువంటివారు అదృష్టం వలన పరమాత్ముడవు అయిన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోషపడతారు. ఆవిధంగా అందరిని ఆదరించే నీవు మమ్ములను కాపాడు.

తెభా-8-725-ఉ.
న్నులు గల్గువాఁడు మఱి కాననివారికిఁ ద్రోవఁ జూపఁగాఁ
న్న తెఱంగు మూఢునకు న్మతిఁ దా గురుఁడౌట సూర్యుఁడే
న్నులుగాఁగ భూతములఁ గాంచుచు నుండు రమేశ! మాకు ను
ద్యన్నయమూర్తివై గురువవై యల సద్గతిజాడఁ జూపవే
.
టీక:- కన్నులున్ = కళ్ళు; కల్గు = ఉన్న; వాడు = వాడు; మఱి = అసలు; కానని = కనబడని; వారి = వారల; కిన్ = కు; త్రోవన్ = దారి; చూపగాన్ = చూపుటకు; చన్న = వెళ్ళెడి; తెఱంగున్ = విధముగ; మూఢున్ = మూర్ఖుని; కున్ = కి; సత్ = మంచి; మతిన్ = మనసుతో; తాన్ = అతను; గురుడు = గొప్పవాడు; ఔటన్ = అగుటచేత; సూర్యుడే = సూర్యుడే; కన్నులున్ = కళ్ళు; కాగన్ = అయ్యుండ; భూతములన్ = జీవులను; కాచుచున్ = కాపాడుతు; ఉండున్ = ఉండును; రమేశ = విష్ణుదేవా {రమేశుడు - రమ (లక్ష్మీదేవి) ఈశుడు (పతి), విష్ణువు}; మా = మా; కున్ = కు; ఉద్యన్నయమూర్తివి = ఉద్ధరించెడివాడవు; ఐ = అయ్యి; గురువవున్ = మార్గదర్శకుడవు; ఐ = అయ్యి; అల = అలానే; సత్+గతిన్ = ఉత్తమగతులకు; జాడన్ = దారిని; చూపవే = చూపము.
భావము:- లక్ష్మీపతీ! హరీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తూ ఉంటావు. జ్ఞానం లేనివానికి దుర్భుద్ధి కలవానికి నీవే తండ్రివి. కాబట్టి కన్నులు ఉన్నవాడు కన్నులు లేనివాడికి దారి చూపిన విధంగా మమ్ములను ఉధ్దరించు. గురుడవై మాకు దారి చూపించు.

తెభా-8-726-క.
ఇంలముతోడి సంగతి
బంగారము వన్నె గలుగు భంగిని ద్వత్సే
వాంగీకృతుల యఘంబులు
భంగంబులఁ బొందు ముక్తి ప్రాపించు హరీ!

టీక:- ఇంగలము = అగ్ని; తోడి = తోటి; సంగతిన్ = చేరికవలన; బంగారము = బంగారము; వన్నె = మెరుగును; కలుగు = పొందెడి; భంగిని = విధముగ; త్వత్ = నిన్ను; సేవా = పూజించెడి; అంగీకృతుల = ఒప్పుకునే వారల; అఘంబులున్ = పాపములు; భంగంబులన్ = నాశనమగుటను; పొందున్ = పొందును; ముక్తి = మోక్షము; ప్రాపించున్ = లభించును; హరీ = విష్ణుమూర్తీ.
భావము:- హరీ! విష్ణుమూర్తీ! బంగారం అగ్నితో చేరడం వలన మేలైన మెరుగు పొందుతుంది. ఆ విధంగానే నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై మోక్షం లభిస్తుంది.

తెభా-8-727-క.
హృయేశ! నీ ప్రసన్నత
దివేలవపాలి లేశభాగము కతనం
ద్రిశేంద్రత్వము గలదఁట;
తుది నిను మెప్పింప నేది దొరకదు శ్రీశా!

టీక:- హృదయేశ = నారాయణ {హృదయేశుడు - హృదయ (ఆత్మలకు) ఈశ (ప్రభువు), విష్ణువు}; నీ = నీ యొక్క; ప్రసన్నతన్ = అనుగ్రహముయొక్క; పదివేలవపాలి = పదివేలోవంతు 1/10000; లేశ = చిన్న; భాగము = భాగము; కతనన్ = వలన; త్రిదశేంద్రత్వమున్ = దేవేంద్రపదవి; కలదు = కలుగును; అట = అట; తుదిన్ = చివరకు; నినున్ = నిన్ను; మెప్పింపన్ = మెప్పించినచో; ఏది = ఎట్టిభాగ్యము; దొరకదు = లభించకుండును; శ్రీశా = విష్ణుమూర్తీ {శ్రీశ - శ్రీ (లక్ష్మి) ఈశ (పతి), విష్ణువు}.
భావము:- పరమాత్మా! హరీ! నీవు హృదయకుహరంలో ఉండే ఈశ్వరుడవు. నీ అనుగ్రహంలో పదివేలవంతులో ఒక లేశ భాగం వలన దేవేంద్రపదవి కలుగుతుందట. ఇక నీన్ను మెప్పిస్తే, లభించని భాగ్యం ఏముంటుంది?

తెభా-8-728-క.
పెవాఁడు గురు డటంచును
గొగాని పదంబు చూపఁ గుజనుండగు నీ
నె త్రోవ నడవ నేర్చిన
మఱ లేనట్టిపదమునందు దయాబ్ధీ!

టీక:- పెఱవాడు = పనికిమాలినవాడు; గురుడు = గొప్పవాడు; అంచున్ = అనుకొనుచు; కొఱగాని = పనికిరాని; పదంబున్ = దారిని; చూపన్ = చూపించగా; కుజనుండు = చెడిపోయినవాడు; అగున్ = అయిపోవును; నీ = నీ యొక్క; నెఱ = మంచి; త్రోవన్ = దారిలో; నడవన్ = వెళ్ళుట; నేర్చిన = తెలిసినచో; అఱమఱ = భేదము; లేని = లేనిది; అట్టి = అటువంటి; పదమున్ = ముక్తిని; అందున్ = చెందును; దయాబ్ధి = నారాయణా {దయాబ్ధి - దయకు సముద్రమైనవాడు, విష్ణువు}.
భావము:- దయాసముద్రుడవు అయిన శ్రీమహావిష్ణువా! పనికిమాలినవాడిని గొప్ప వాడు అనుకొని దరిచేరేవారు చెడిపోతారు. నిన్ను నమ్ముకొని మంచిమార్గంలో నడవగలిగితే సందేహం లేకుండా అభేద రూపమైన ముక్తిని పొందుతాడు.

తెభా-8-729-మ.
చెలివై చుట్టమవై మనస్థ్సితుఁడవై చిన్మూర్తివై యాత్మవై
నై కోర్కులపంటవై విభుఁడవై ర్తిల్లు నిన్నొల్లకే
లువెంటంబడి లోక మక్కట; వృథా ద్ధాశమై పోయెడిన్
నిలువన్ నేర్చునె హేమరాశిఁ గనియున్ నిర్భాగ్యుఁ డంభశ్శయా!

టీక:- చెలివి = స్నేహితుడవు; ఐ = అయ్యి; చుట్టమవు = బంధువవు; ఐ = అయ్యి; మనస్థ్సితుడవు = మనసునందు మెదలెడివాడవు; ఐ = అయ్యి; చిన్మూర్తివి = జ్ఞానస్వరూపివి; ఐ = అయ్యి; ఆత్మవు = ఆత్మవు; ఐ = అయ్యి; వలను = అండవు; ఐ = అయ్యి; కోర్కులన్ = కోరికలను; పంటవు = పండించెడివాడవు; ఐ = అయ్యి; విభుడవు = ప్రభువవు; ఐ = అయ్యి; వర్తిల్లు = ప్రవర్తిల్లెడి; నిన్నున్ = నిన్ను; ఒల్లకన్ = అంగీకరించకుండగ; ఏ = ఏవో; పలువెంటన్ = పెక్కింటిపై పేరాశతో; లోకము = లోకులు; అక్కట = అయ్యో; వృథా = అనవసరముగ; బద్ధాశము = లోభములకు లొంగినవారు; ఐపోయెడిన్ = ఐపోయెదరు; నిలువన్ = నిలబెట్టుకొనుటను; నేర్చునే = దక్కించుకొనగలడా, లేడు; హేమ = బంగారపు; రాశిన్ = ముద్దను; కనియున్ = లభించినను; నిర్భాగ్యుడు = అదృష్టహీనుడు; అంభశ్శయా = మత్యావతారా {అంభశ్శయుడు - అంభస్ (నీట) శయుడు (పరుండు వాడు), మత్స్యావతారుడు, విష్ణువు}.
భావము:- నారాయణా! మత్య్యావతారా! నీవు స్నేహితుడుగా, బంధువుగా, జ్ఞానస్వరూపుడుగా, మానవుల మనస్సులోనే మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభువు అయి కోరికలు పండిస్తావు. అటువంటి నిన్ను ఆనుసరించకుండా, లోకం ఏవేవో అనవసరపు పేరాశలకు బంధీ అయిపోయి పరుగులు పెడుతుంది. అదృష్టహీనుడు బంగారు రాశి లభించినా దక్కించుకోలేడు కదా.

తెభా-8-730-ఆ.
నీరరాశిలోన నిజకర్మ బద్ధమై
యుచితనిద్రఁ బొంది యున్న లోక
మే మహాత్ముచేత నెప్పటి మేల్కాంచు
ట్టి నీవు గురుఁడ గుట మాకు
.
టీక:- నీరరాశి = సముద్రము; లోనన్ = అందు; నిజ = తన; కర్మ = కర్మములకు; బద్ధము = లోబడినవాడు; ఐ = అయ్యి; ఉచితనిద్రన్ = నిద్రలోబడుట; పొంది = పొంది; ఉన్న = ఉన్నట్టి; లోకము = జగత్తును; ఏ = ఏ; మహాత్మున్ = మహాత్ముని; చేతన్ = వలన; ఎప్పటి = ఎప్పుడును; మేల్కాంచున్ = మేల్కొనునో; అట్టి = అటువంటి; నీవు = నీవు; గురుడవు = గురువవు; అగుటన్ = అగుట; మా = మా; కున్ = కు.
భావము:- కర్మఫలానికి లోబడి సముద్రంలో మునిగి కూరుకుపోయిన లోకాన్ని మేలుకొలిపే మహాత్ముడవు నీవు. నీవు దేవతలకు ప్రభువవు. అటువంటి నీవు మాకు గురువవు అయ్యావు.

తెభా-8-731-క.
లింపుము విన్నప మిదె
వేలుపు గమిఱేని నిన్ను వేఁడికొనియెదన్
నాలోని చిక్కు మానిచి
నీలోనికిఁ గొంచుఁ బొమ్ము నిఖిలాధీశా!

టీక:- ఆలింపుము = వినుము; విన్నపము = మనవి; ఇది = ఇదిగో; వేలుపు = దేవతల; గమి = సమూహమునకు; ఱేని = ప్రభువవు; నిన్నున్ = నిన్ను; వేడికొనియెదన్ = వేడుకొనెదను; నా = నా; లోని = అందలి; చిక్కున్ = సంకటములను; మానిచి = పోగొట్టి; నీ = నీ; లోని = లోపలి; కిన్ = కి; కొంచుబొమ్ము = తీసుకొనిపో; నిఖిలాధీశ = నారాయణా {నిఖిలాధీశుడు - నిఖిల (సమస్తమునకు) అధీశ (పై అధికారి), విష్ణువు}.
భావము:- ఓసర్వేశ్వరా! దేవధిదేవా! మా విన్నపాలు మన్నించమంటూ ప్రార్థిస్తున్నాను. నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి చేర్చుకోమని వేడుకుంటున్నాను.

తెభా-8-732-వ.
అని యిట్లు సత్యవ్రతుండు పలికిన సంతసించి మత్స్యరూపంబున మహాసముద్రంబున విహరించు హరి పురాణపురుషుం డగుటం జేసి సాంఖ్యయోగక్రియాసహితయగు పురాణసంహిత నుపదేశించె; నమ్మహారాజు ముని సమేతుండై భగవన్నిగదితంబై సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు విని కృతార్థుం డయ్యె; నతం డిమ్మహాకల్పంబున వివస్వతుం డనం బరఁగిన సూర్యునకు శ్రాద్ధదేవుండన జన్మించి శ్రీహరి కృపావశంబున నేడవ మనువయ్యె; అంత నవ్విధంబున బెనురేయి నిండునంతకు సంచరించి జలచరాకారుండగు నారాయణుండు తన్నిశాంత సమయంబున .
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; సత్యవ్రతుండు = సత్యవ్రతుడు; పలికిన = పలుకగా; సంతసించి = సంతోషించి; మత్స్యరూపంబునన్ = మత్స్యావతారముతో; మహాసముద్రంబునన్ = మహాసముద్రమునందు; విహరించు = క్రీడించెడి; హరి = విష్ణుమూర్తి; పురాణపురుషుండు = ఆదివిష్ణుడు; అగుటన్ = అగుట; చేసి = వలన; సాంఖ్యయోగ = సాంఖ్యయోగము; క్రియా = ఆచరణతో; సహిత = కూడినది; అగు = అయిన; పురాణసంహితన్ = పురాతనవేదభాగమును; ఉపదేశించెన్ = ఉపదేశించెను; ఆ = ఆ; మహారాజు = మహారాజు; ముని = మునులతో; సమేతుండు = కూడి ఉన్నవాడు; ఐ = అయ్యి; భగవత్ = భగవంతునిచే; నిగదితంబు = చెప్పబడినది; ఐ = అయ్యి; సనాతనంబు = అతిపురాతనము; అగు = అయిన; బ్రహ్మస్వరూపంబున్ = బ్రహ్మజ్ఞానమును; విని = విని; కృతార్థుండు = ధన్యుడు; అయ్యెన్ = అయ్యెను; అతండు = అతడు; ఈ = ఈ; మహాకల్పంబునన్ = మహాకల్పమునందు; వివస్వతుండు = వివస్వతుడు; అనంబరగిన్ = అనెడిపేరుకలవాడైన; సూర్యున్ = సూర్యున; కున్ = కు; శ్రాద్ధదేవుండు = శ్రాద్ధదేవుడు; అనన్ = అనబడువాడై; జన్మించి = పుట్టి; శ్రీహరి = విష్ణుమూర్తి; కృపా = దయ; వశంబునన్ = వలన; ఏడవ = ఏడవ (7); మనువు = మనువు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; ఆ = ఆ; విధంబునన్ = విధముగ; పెనురేయి = ప్రళయకాలము; నిండున్ = పూర్తి అగు; అంతకున్ = అంతవరకు; సంచరించి = విహరించి; జలచరాకారుండు = మత్స్యావతారుడు; అగు = అయిన; నారాయణుండు = విష్ణువు; తత్ = ఆ; నిశాంత = కల్పంతెల్లవారుఝాము {నిశాంతము - నిశ (రాత్రి, ప్రళయము) అంతము (చివర), కల్పము ఉదయించబోవుసమయము}; సమయంబునన్ = సమయమునందు.
భావము:- ఈ విధంగా సత్యవ్రతుడు ప్రార్థన చేయగా విని, మత్స్య రూపంతో సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగంతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించాడు. మునులతోపాటు సత్యవ్రతుడు భగవంతుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని ధన్యుడైయ్యాడు. సత్యవ్రతుడు ఈకల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుట్టి విష్ణువు దయవల్ల ఏడవమనువు అయ్యాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతమూ ఆవిధంగా విష్ణువు మత్స్య స్వరూపంతో తిరుగుతున్నాడు.

తెభా-8-733-మ.
కంభోనిధి రోసి వేదముల కుయ్యున్ దైన్యముం జూచి వేఁ
ఱు లల్లార్చి ముఖంబు సాఁచి బలువీఁకందోఁక సారించి మే
న్మెయన్ దౌడలు దీటి మీస లదరన్ మీనాకృతిన్ విష్ణుఁ డ
క్కటిం దాఁకి వధించె ముష్టిదళితగ్రావున్ హయగ్రీవునిన్
.
టీక:- ఉఱక = ఊరికే; అంభోనిధిన్ = సముద్రమున; రోసి = వెదకి, రోషపడి; వేదముల = వేదముల; కుయ్యున్ = మొరను; దైన్యమున్ = దీనత్వమును; చూచి = చూసి; వేన్ = వేగముగా; గఱులు = రెక్కలు; అల్లార్చి = కొట్టుకొని; ముఖంబున్ = నోరు; సాచి = తెరిచి; పలువీకన్ = ఉత్సాహముతో; తోకన్ = తోకను; సారించి = జాడించి; మేన్ = దేహము; మెఱయన్ = మెరిచెడివిధముగ; దౌడలున్ = దౌడలను; దీటి = చక్కజేసికొని; మీసలన్ = మీసములు; అదరన్ = అదురుతుండగా; మీనాకృతిన్ = మత్స్యరూపమున; విష్ణుడు = నారాయణుడు; ఆ = ఆ; కఱటిన్ = వంచకుని; తాకి = ఎదుర్కొని; వధించెన్ = సంహరించెను; ముష్టి = పిడికిలి; దళిత = దెబ్బతో; క్రావున్ = కక్కినవానిని; హయగ్రీవునిన్ = హయగ్రీవుని.
భావము:- వేదాలు బాధతో మొరపెట్టుకోవడాన్ని ఆ కాళరాత్రి ముగిసే తెల్లవారుజామున విష్ణుమూర్తి కన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి, నోరు తెరిచాడు; ఉత్సాహంతో తోక ఊగించాడు; మేను మెరపించాడు; దౌడలు చక్క జేసుకున్నాడు; మీసాలు కదిలించాడు; దుష్టుడూ మహాబలిష్టుడూ ఐన హయగ్రీవుణ్ణి హతమార్చాడు.