నారాయణీయము/సప్తమ స్కంధము/25వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
సప్తమ స్కంధము
25వ దశకము - శ్రీనృసింహావిర్భావ వర్ణనం
25-1-శ్లో.
స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపోః కర్ణౌ సమాచూర్ణయన్
ఆఘూర్ణజ్జగదండకుండకుహారో ఘోరస్తనాభూద్రవః।
శ్రుత్వా యం కిల దైత్యరాజహృదయే పూర్వం కదా౾ ప్యశ్రుతం
కంపః కశ్చన సంపపాత చలితో౾ప్యంభోజభూర్విష్టరాత్।।
1వ భావము:
హిరణ్యకశిపుడు తన కత్తితో, ఆ స్తంభమును అట్లు పగులగొట్టగా, ఆ స్తంభమునుండి అతి భయంకరమైన ధ్వని వెలువడెను. ఆ ధ్వనితో బ్రహ్మాండగోళ అంతర్భాగమంతయూ దద్ధరిల్లెను. హిరణ్యకశిపుని కర్ణభేరి పగిలిపోయెను. అంతకు పూర్వమెన్నడును అట్టిధ్వని వినియుండని ఆ అసురుని హృదయము - అవ్యక్తమగు ఆవేదనతో కంపించెను. ఆ ధ్వనికి, పద్మసంభవుడగు బ్రహ్మదేవుని పీఠము సహితము చలించెను.
25-2-శ్లో.
దైత్యేదిక్షు విసృష్టచక్షుషి మహాసంరంభిణి స్తంభతః
సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తేవిభో!
కింకిం భీషణమేతదద్భుతమితి వ్యుద్ర్భాంతచిత్తే౾సురే
విస్ఫూర్జద్ధవళోగ్రరోమవికసద్వర్ష్మా సమాజృంభథాః।।
2వ భావము:
స్తంభమునుండి అట్లు ఘోరనాదము వెలువడుటకు కారణమేమియో తెలియక - ఆ దైత్యుడు విచలితుడై అన్నిదిక్కులను పరికించుచుండెను. భగవాన్! అప్పుడు ఆ స్తంభమునుండి బయటకు వచ్చుచున్న నీ ( నరకేసరి) రూపమును ఆ అసురుడు చూచెను. "ఆహా! ఇదియేమి? ఇది నరుని రూపము కాదు! మృగరూపమునూ కాదు! ఈ రూపము అత్యద్భుతముగను, భయంకరముగను ఉన్నది", అని తలచి ఆ రాక్షసుడు విభ్రాంతుడయ్యెను. ప్రభూ! 'ఉగ్రనరసింహమూర్తి' రూపమున విస్పుటించిన నీవు, తెల్లని నిక్కపొడుచుకొనిన రోమములతో ప్రకాశించుచూ విజృంభించితివి.
25-3-శ్లో.
తప్తస్వర్ణసవర్ణఘూర్ణదతిరూక్షాక్షం సటాకేసర-
ప్రోత్కంపప్రనికుంబితాంబరమహో జీయాత్ తవేదం వపుః।
వ్యాత్తవ్యాప్తమహోదరీసఖముఖం ఖడ్గోగ్రవల్గన్మహా-
జిహ్వనిర్గమదృశ్యమానసుమహాదంష్ట్రాయుగోడ్డామరమ్।
3వ భావము:
ప్రభూ! కరిగించిన బంగారు వర్ణముతో మెరయుచూ, మహోగ్రతీక్షణ వీక్షణములతో కన్నుల నటునిటు త్రిప్పుచు 'ఉగ్రనరసింహరూపమున'- ఆ అసురునికి కనిపించితివి. ఆ రూపమున ఉన్న నీవు, నీ మోముపై పరచుకొన్న జూలును విదల్చగా, ఆ కాంతి ఆకాశమునకెగసి మిక్కిలి ప్రకాశించెను. దీర్ఘముగా తెరవబడిన నీ నోరు ఒక విశాలమగు కొండగుహను తలపించెను. బయటకు చాచిన నీ నాలుక కొన , వాడియైన కత్తిమొనవలె నున్నది. ఆ నాలుకకు ఇరువైపులా బయటకు పొడుచుకొని వచ్చిన రెండు కోరలతో, ఉద్భవించిన ఆ నీ రూపము, ప్రభూ! అత్యద్భుతమైనది మరియు భయంకరమైనది.
25-4-శ్లో.
ఉత్సర్పద్వలిభంగభీషణహనుం హ్రస్వస్థవీయస్తర-
గ్రీవం పీవరదోశ్శతోద్గతనఖక్రూరాంశుదూరోల్బణమ్।
వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘనప్రధ్వాననిర్ధావిత-
స్పర్ధాలుప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః।।
4వ భావము:
ఓ! ఉగ్రనరసింహమూర్తీ! నీ దవడల ముడతలు ముఖముపైకి ఎగబ్రాకి ప్రస్ఫుటించుచుండగా నీవు భీకరముగా గర్జించితివి. నరకేసరి రూపమున ఉన్న నీ కంఠము చిన్నదిగా ఉండి బహు ధృఢముగా నున్నది. నీ బాహువులు నూరు హస్తముల శక్తికలిగి బలిష్టముగా నున్నవి. నీ చేతి నఖముల (గోళ్ళ) కాంతి నీ రౌద్రమునకు ప్రతీకగా మెరయుచూ దూరమునకు కూడా కనిపించుచుండెను. నీ ఘర్జన ధ్వని - దట్టమగు వర్షాకాలపు కాలమేఘ గర్జనవలె అంబరమును దాటి వినిపించు చుండెను. అట్టి నీ ఉగ్ర రూపమును చూచి నీ శత్రువులగు ఆ అసురులు (భయబ్రాంతులై) చెల్లాచెదురుగా పారిపోయిరి. ప్రభూ! అట్టి నీ 'ఉగ్రనరసింహ' రూపమునకు నేను నమస్కరించుచున్నాను.
25-5-శ్లో.
నూనం విష్ణురయం నిహన్మ్యముమితి భ్రామ్యద్గదాభీషణం-
దైత్యేంద్రం సముపాద్రవంతమధృథా దోర్భ్యాం పృథుభ్యామముమ్।
వీరో నిర్గలితో౾ థ ఖడ్గఫలకౌ గృహ్ణన్ విచిత్రశ్రమాన్
వ్యావృణ్వన్ పునరాపపాత భువనగ్రాసోద్యతం త్వామహో।।
5వ భావము:
తన ఎదుట ఉగ్రరూపమున ఉన్నది 'విష్ణువే’ నని నిశ్చయించుకొనిన ఆ హిరణ్యకశిపుడు, భయంకరముగా తన గదను అటునిటు త్రిప్పుచు, నిన్ను వధించవలెనని, వేగముగా నిన్ను సమీపించెను. ఆ రాక్షసరాజును అధైర్య పరచుచు, శ్రీ హరీ! నీవతనిని నీ రెండు చేతులతో గట్టిగా పట్టుకొంటివి. హిరణ్యకశిపు డపుడు నీ చేతులనుండి జారి, ఖడ్గమును డాలును ధరించి తిరిగి వచ్చెను. ప్రభూ! జగత్తునే కబళించగలిగిన - ఉగ్రరూపమున ఉన్న నీవు విజృంభించగా - ఖడ్గము డాలు చేతబట్టి ఆ రాక్షసవీరుడు నిన్ను వధించవలెనని విచిత్ర విన్యాసములు చేయసాగెను.
25-6-శ్లో.
భ్రామ్యంతం దితిజాధమం పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాం జవాత్
ద్వారే౾ థోరుయుగే నిపాత్య నఖరాన్ వ్యుత్ఖాయ వక్షోభువి।
నిర్భిందన్నధిగర్భనిర్భరగలద్రక్తాంబుబద్ధోత్సవం
పాయం పాయముదైరయో బహు జగత్సంహారిసింహారవాన్।।
6వ భావము:
ప్రభూ! నరసింహమూర్తీ! ఆ హిరణ్యకశిపుడు ఖడ్గమును డాలును చేతబట్టి నిన్ను వధించవలెనని తిరుగుచుండగా, ఆ దైత్యాధమునిని, వేగముగా నీ చేతులతోనెత్తి పట్టుకొని - ముందుగా ద్వారము పైన కూర్చుని, నీ తొడల పైన పడవేసుకొని, నీ గోళ్ళతో అతని వక్షస్ధలమును చీల్చివేసితివి. అట్లు వధించబడిన హిరణ్యకశిపుని శరీరమునుండి స్రవించు రక్తధారలను ఆనందముతో పదేపదే త్రావుచు జగత్తు భీతిల్లుచుండగా నీవు భయంకర సింహనాదము చేసితివి.
25-7-శ్లో.
త్యక్త్వాతం హతమాశు రక్తలహరీసిక్తోన్నమద్వర్ష్మణి
ప్రత్యుత్పత్య సమస్తదైత్యపటలీం చాఖాద్యమానేత్వయి।
భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోలశైలోత్కరం
ప్రోత్సర్పత్థచరం చరా చరమహో! దుః స్థామవస్థాందధౌ।।
7వ భావము:
హిరణ్యకశిపుని సంహరించి శీఘ్రమే నీవతని శరీరమును వదలివేసితివి. రుధిరధారలతో తడిసి, ప్రభూ! మహోన్నతమైన నీ శరీరమంతయూ రక్తసిక్తమయి ఉండెను. మహోగ్రరూపముననున్న నీవు, పిదప, మిగిలిన అసుర సమూహమును తినివేయ నారంభించితివి. అప్పుడు భూమి కంపించెను. సముద్రము అల్లకల్లోలమయ్యెను. పర్వతశిఖరములు మిక్కిలి చలించెను. దేవతలు వారివారి స్థానములను వదిలి పారిపోవసాగిరి. అక్కటా! సమస్త జగత్తుకు దుస్థితి కలిగెను కదా!
25-8-శ్లో.
తావన్మాంసవపాకరాళవపుషం ఘోరాంత్రమాలాధరం
త్వాం మధ్యే సభమిద్దరోషముషితం దుర్వారగుర్వారవమ్।
అభ్యేతుం నశశాక కో౾పి భువనే దూరేస్థితా భీరవః
సర్వే శర్వవిరంచవాసనముఖాః ప్రత్యేకమస్తోషత।।
8వ భావము:
ఉగ్రనరసింహమూర్తీ! నీవు హిరణ్యకశిపుని సంహరించిన పిదప - ఆ రాక్షసుని మాంసముతోను, రక్తముతోను తడిసిన నీ శరీరము మిక్కిలి భీతావహముగా నుండెను. హిరణ్యకశిపుని ప్రేగులను నీవు మెడలో వేసుకొని, అతని సభామధ్యమున కూర్చొని వారింపశక్యముగాని భీకర ఘర్జనలతో మితిమీరిన రోషముతో కనిపించితివి. అప్పుడు నిన్ను దరిచేరు ధైర్యము ఎవరికినీ లేకుండెను. భయముతో ఎల్లరూ నీకు దూరముగా నుండిరి. ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, శివుడు ఒక్కొక్కరు వచ్చి నిన్ను స్తుతించసాగిరి.
25-9-శ్లో.
భూయో౾ప్యక్షత రోషధామ్ని భవతి బ్రహ్మజ్ఞయా బాలకే
ప్రహ్లాదే పదయోర్నమత్యపభయే కారుణ్యభారాకులః
శాంతస్త్వం కరమస్య మూర్ధ్ని సమధాః స్తోత్ర్తైరథోద్గాయతః
తస్యాకామధియో౾ పి తేనిథ వరం లోకాయ చానుగ్రహమ్।।
9వ భావము:
అయిననూ ప్రభూ! ఉగ్రనరసింహమూర్తీ! నీ క్రోధము ఉపశమించలేదు. అప్పుడు, బాలుడయిన 'ప్రహ్లాదుడు', బ్రహ్మదేవుని ఆదేశముతో, నిర్భయముగా నిన్ను సమీపించి నీకు ప్రణమిల్లెను. భక్తుడైన ప్రహ్లాదుని కరుణించి శాంతించితివి; ఆ బాలుని శిరమున నీ హస్తము నుంచితివి. అంతట ప్రహ్లాదుడు నిన్ను స్తుతించి బిగ్గరగా నీ స్తోత్రములను గానము చేయసాగెను. ఏ వరములను కోరకనే నీవు ప్రహ్లాదునికి వరములను ప్రసాదించితివి మరియు లోకములను అనుగ్రహించితివి.
25-10-శ్లో.
ఏవంనాటితరౌద్రచేష్టిత ! విభో! శ్రీతాపనీయాభిద
శ్రుత్యంతస్ఫుట గీతసర్వమహిమన్నత్యంత శుద్ధాకృతే!
తత్తాదృజ్ఞిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరో లంఘయేత్
ప్రహ్లాదప్రియ! హేమరుత్పురపతే! సర్వామయాత్ పాహిమామ్।।
10వ భావము:
పరమ శుద్ధ స్వరూపా! నరసింహమూర్తీ! ప్రహ్లాద రక్షణార్ధము నీవు నీ రౌద్రరూపమును ప్రదర్శించితివి. అనంత శక్తిస్వరూపా! నీ మహత్యము - 'శ్రీ తాపనీయోపనిషత్తు' నందు కీర్తించబడినది. లోకేశ్వరా! సకలలోకములలోను నిన్ను మించినవారు లేరు. ప్రహ్లాదప్రియా! గురవాయూరు పురపతీ! సకల వ్యాధులనుండి నన్ను రక్షింపుము.
సప్తమ స్కంధము పరిపూర్ణం
25వ దశకము సమాప్తము.
-x-