నారాయణీయము/అష్టమ స్కంధము/26వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||

అష్టమ స్కంధము[మార్చు]

26వ దశకము - గజేంద్రమోక్షణము వర్ణనం

26-1-శ్లో.
ఇంద్రద్యుమ్నః పాండ్యఖండాధిరాజస్త్వద్భక్తాత్మా చందనాద్రౌ కదాచిత్।
త్వత్సేవాయాం మగ్నధీరాలులోకే నైవాగస్త్యం ప్రాప్తమాతిథ్యకామమ్।।
1వ భావము
పూర్వము ఒకానొకప్పుడు పాండ్యదేశపు రాజయిన 'ఇంద్రద్యుమ్నుడు' మలయపర్వతముపై, ప్రభూ! నారాయణమూర్తీ! నిన్ను పూజించుచూ నీ సేవయందు నిమగ్నుడైయుండెను. ఆ సమయమున 'అగస్త్యమహర్షి' ఆ మహారాజు అతిధ్యమును అపేక్షించి అచ్చటకు వచ్చెను. నీ సేవలో నిమగ్నుడై యున్న ఆ ఇంద్రద్యుమ్నుడు అగస్త్యుని రాకను గమనించలేకపోయెను.

26-2-శ్లో.
కుంభోద్భూతిస్సంభృతక్రోధభారః స్తబ్ధాత్మ త్వం హస్తిభూయం భజేతి।
శస్త్యా౾ థైనం ప్రత్యగాత్ సో౾పి లేభే హస్తీంద్రత్వం త్వత్స్మృతి వ్యక్తిధన్యమ్।।
2వ భావము
తన రాకను గమనించక - స్తబ్దముగానున్న 'ఇంద్రద్యుమ్నుని' చూచి, కుంభసంభవుడయిన 'అగస్త్యుడు' అవమానభారముతో క్రుద్ధుడై - ఆ మహారాజును 'ఏనుగుగా' జన్మించమని శపించెను. శాపవశమున ఏనుగుగా జన్మించిననూ, ప్రభూ! నారాయణమూర్తీ! ఆ మహారాజు (శాప సమయమున) నీ నామస్మరణలో లీనమైయుండుటచే గజసమూహములకు రాజయి, ఆ ఏనుగులమధ్య ' ఇంద్రునివలె' ప్రకాశించుచుండెను.

26-3-శ్లో.
దుగ్ధాంభోధేర్మధ్యభాజి త్రికూటే క్రీడన్ శైలే యూథపోఖీయం వశాభి:।
సర్వాన్ జంతూనత్యవర్తిష్ట శక్యా త్వద్భక్తానాం కుత్ర నోత్కర్షలాభ:।।
3వ భావము
జంతువులలో శక్తిమంతుడు, గజసమూహములకు నాయకుడు అయిన ఆ గజేంద్రుడు - ఆడ ఏనుగుల గుంపుతో మరియు ఇతర గజసమూహములతోను కలిసి క్షీరసముద్రమునకు మధ్యనున్న త్రికూట పర్వతముపై విహరించుచు - క్రీడించుచుండెను. ప్రభూ! నారాయణమూర్తీ! నీభక్తులు ఎచ్చట ఉన్నను - వారికి ఉన్నత స్థానము లభించకుండునా? (లభించేతీరును).

26-4-శ్లో.
స్వేన స్థేమ్నా దివ్యదేశత్వ శక్త్యా సో౾యం ఖేదానప్రజానన్ కదాచిత్।
శైలప్రాంతే ఘర్మతాంత: సరస్యాం యూథైస్సార్థం త్వత్ప్రణున్నో౾భిరేమే।।
4వ భావము
ప్రభూ! నారాయణమూర్తీ! ఆ గజేంద్రుడు స్వతహాగా బలాఢ్యుడు; నివసించుచున్న స్థలము మిక్కిలి మహిమాన్వితమయినది. దానితో ఆ గజరాజుకు ఎట్టి కష్టములు లేకుండెను. ఒక వేసవిదినమున ఆ గజేంద్రుడు తన ఏనుగులగుంపుతో కలిసి ఆ పర్వతసానువులయందు విహరించుచు సూర్యతాపమునకు అలసిపోయెను. బడలిక తీర్చుకొనుటకై అచ్చటనున్న ఒక సరస్సున దిగి నీరు త్రాగుచు క్రీడించసాగెను. ప్రభూ! అది నీ ప్రేరణచేతనే జరిగియుండును.

26-5-శ్లో.
హూహూస్తావత్ దేవలస్యాపి శాపాత్ గ్రాహీభూతస్తజ్జలే వర్తమాన:।
జగ్రాహైనం హస్తినం పాదదేశే శాంత్యర్థం హి శ్రాంతిదో౾సి స్వకానామ్।।
5వ భావము
ఆ సరస్సున 'హూహూ' అను నామము గల ఒక గంధర్వుడు - 'దేవలముని' శాపమున 'మొసలి' రూపముతో నివసించుచుండెను. ఆ మొసలి - గజేంద్రుని పాదమును గట్టిగా పట్టుకొనెను. ప్రభూ! నారాయణమూర్తీ! నీ భక్తులకు శాంతిని ప్రసాదించుటకే కదా నీవు అశాంతిని (కష్టములను) కూడా కలిగింతువు (అంతయూ నీ లీలయే!).

26-6-శ్లో.
త్వత్సేవాయా వైభవాద్దుర్నిరోధం యుధ్యంతం తం వత్సరాణాం సహస్రమ్।
ప్రాప్తేకాలే త్వత్పదైకాగ్ర్యసిద్ధ్యై వక్రాక్రాంతం హస్తివర్యం వ్యధాస్త్యమ్।।
6వ భావము
ప్రభూ! నారాయణమూర్తీ! నిన్ను సేవించిన భాగ్యమున - గజేంద్రుడు ఆ మొసలితో వేయి సంవత్సరములు నిరంతరముగా పోరాడెను. అంతట ఆ గజేంద్రునికి పుణ్యలోకప్రాప్తి కాలము ఆసన్నమయ్యెను. అప్పుడు ఆ గజేంద్రునికి నీ పాదపద్మముల యందు ఏకాగ్రచిత్తము కలుగుటకై - అతని శక్తి తగ్గి, మకరికి వశమగుస్ధితిని నీవే కల్పించితివి.

26-7-శ్లో.
ఆర్తివ్యక్తప్రాక్తనజ్ఞానభక్తిః శుండోత్ క్షిప్తైః పుండరీకైస్సమర్చన్।
పూర్వాభ్యస్తం నిర్విశేషాత్మనిష్ఠం స్తోత్రశ్రేష్ఠం సో౾న్వగాదీత్ పరాత్మన్।।
7వ భావము
ప్రభూ! నారాయణమూర్తీ! అశక్తుడైన గజేంద్రుని హృదయము వేదనాభరితముకాగా అతనిలో నిభిడీకృతమై ఉన్న భక్తి జ్ఞానములు బహిర్గతమయ్యెను. తోడనే, ఆ సరస్సునగల తామరపువ్వులను తన తొండముతో ఎత్తి నీకు సమర్పించుచు - పూర్వము తను అభ్యసించిన ' పరబ్రహ్మ తత్వమును' ( ఏ విశేషమూ ఆపాదించబడని నిర్విశేషము) స్తోత్రముచేయుచు నిన్ను స్మరించసాగెను.

26-8-శ్లో.
శ్రుత్వాస్తోత్రం నిర్గుణస్థం సమస్తం బ్రహ్మేశాద్యైర్నాహమిత్యప్రయాతే।
సర్వాత్మా త్వం భూరికారుణ్యవేగాత్ తార్ క్ద్యారూఢః ప్రేక్షితో౾భూఃపురస్తాత్।।
8వ భావము
గజేంద్రుని స్తోత్రములను వినిన బ్రహ్మ, శివుడు మెుదలగు దేవతలు, గజేంద్రుడు - నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరబ్రహ్మను ప్రార్ధించుచుండెనే గాని తమని కాదని భావించి, స్పందంచక మిన్నకుండిరి. అప్పుడు, ప్రభూ! నారాయణమూర్తీ! సర్వాత్ముడవైన నీవు ఆ గజేంద్రుని కరుణించి తక్షణమే గరడవాహనుడవై అతని ఎదుట సాక్షాత్కరించితివి.

26-9-శ్లో.
హస్తీంద్రం తం హస్తపద్మేన ధృత్వా చక్రేణ త్వం నక్రవర్యం వ్యదారీః।
గంధర్వే౾స్మిన్ ముక్తశాసే స హస్తీ త్వత్సారూప్యం ప్రాప్య దేదీప్యతే స్మ।।
9వ భావము
ప్రభూ! నారాయణమూర్తీ! సుదర్శన చక్రముతో ఆ మకరిని ఖండించితివి. నీ దయతో ఆ 'హూహూ' గంధర్వుడు శాపవిముక్తుడయ్యెను. నీవు నీ కరపద్మములతో ఆ గజేంద్రుని నిమిరితివి, గజేంద్రుడు నీ సారూప్యమును పొంది ప్రకాశించెను.

26-10-శ్లో.
ఏతద్వృత్తం త్వాం చ మాం చ ప్రగేయో గాయేత్ సో౾యం భూయసే శ్రేయసే స్యాత్।
ఇత్యుక్త్వైనం తేన సార్థం గతస్త్వం ధిష్ణ్వం విష్ణో! పాహి వాతాలయేశ!।।
10వ భావము
"నిన్ను, నన్ను తలుచుకొని ఈ వృత్తాంతమును ఉదయముననే ఎవరు గానము చేయుదురో, వారు అత్యంత శ్రేయస్సును పొందుదురు" అని గజేంద్రునితో పలికి - ప్రభూ! నారాయణమూర్తీ! సారూప్యుడైన ఆ గజేంద్ర సహితముగా నీ స్థానమైన విష్ణులోకమును చేరితివి. గురవాయూరుపురాధీశా! నన్ను రక్షింపుము.

ెఅష్టమ స్కంధము
26వ దశకము సమాప్తము.
-x-
 

Lalitha53 (చర్చ) 16:15, 9 మార్చి 2018 (UTC)