నారాయణీయము/సప్తమ స్కంధము/24వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
సప్తమ స్కంధము
[మార్చు]24వ దశకము - ప్రహ్లాదచరిత్ర వర్ణనం
24-1-శ్లో.
హిరణ్యాక్షే పోత్రిప్రవర వపుషాదేవ! భవతా
హతే శోకక్రోధగ్లపితధృతిరేతస్య సహజః
హిరణ్య ప్రారంభః కశిపురమరారాతిసదసి
ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్ధం మురరిపో!।
1వ భావము:
వరాహరూపమున హిరణ్యాక్షుని సంహరించి (ధరణిని ఉద్ధరించి) ఘనకీర్తిని పొందిన, ఓ వరాహమూర్తీ! హిరణ్యాక్షుడట్లు నీచే వధించబడగా; ఆ హిరణ్యాక్షుని సోదరుడు, దితి కశ్యపుల కుమారుడు, హిరణ్య నామమును ప్రారంభమున కలవాడు అగు హిరణ్యకశిపుడు, సోదరుని మరణముచే కలిగినభాధతో - శోకము, క్రోధము కలగగా, ఆవ్యధతో తన మనోనిగ్రహమును కోల్పోయెను. మధుసంహారీ! విష్ణుమూర్తీ! అప్పుడు, హిరణ్యకశిపుడు నిన్నువధింతునని దేవతలకు శత్రువులగు రాక్షసుల సభలో ప్రతిజ్ఞచేసెను.
24-2-శ్లో.
విధాతారం ఘోరం స ఖిలు తపసిత్వా న చిరతః
పురస్సాక్షాత్కుర్వన్ సురనరమృగాద్యైరనిథనమ్।
వరంలబ్ద్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం
పరిక్షుందన్నింద్రాదహరత దివం త్వామగణయన్।
2వ భావము:
హిరణ్యకశిపుడు (నిన్ను సంహరించవలెనను కోరికతో నీ బొడ్డుతమ్మిన పుట్టిన) బ్రహ్మదేవునికై ఘోర తపస్సుచేసెను. బ్రహ్మదేవుడు శీఘ్రమే సాక్షత్కరించి వరము కోరుకొనుమనగా - దేవతలు, నరులు, మృగములు మొదలగు ప్రాణులచే తనకు మరణము సంభవించకుండునట్లు వరమును కోరెను. ఆ వరగర్వముతో, భగవాన్! నిన్ను ఎంతమాత్రము లక్ష్యపెట్టక, నిన్నే రక్షకుడుగా తలచు - జగత్తునంతను భాధించసాగెను; దేవేంద్రుని నుండి స్వర్గలోకమును హస్తగతము చేసుకొనెను.
24-3-శ్లో.
నిహంతుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చ రిపోః
బహిర్దృష్టేరంతర్దధిథ హృదయే సూక్ష్మ వపుషా।
నదన్నుచ్చైస్తత్రాప్యఖిలభువనాంతే చ మృగయన్।
భియా యాతం మత్వా స ఖిలు జితకాశీ నివవృతే।।
3వ భావము:
పిదప - హిరణ్యకశిపుడు భగవాన్! నిన్ను వధించవలెనని వైకుంఠమునకు వచ్చెను. బాహ్యదృష్టితో వెదకుచున్న ఆ రాక్షసునికి నీవు కనపడలేదు. సూక్ష్మరూపముతో తన (హిరణ్యకశిపుని) హృదయమునందే అంతర్హితుడవైయుండిన నిన్ను - అంతర్దృష్టిలేని, ఆ అసురుడు చూడలేకపోయెను. గట్టిగా అరచుచూ, సకలలోకములందును నిన్ను వెదకసాగెను. అయిననూ కానలేకపోయెను. తనకు భయపడి నీవు ఎచ్చటికో (పారి) పోయి ఉందువని భావించి వెనకకు మరలెను.
24-4-శ్లో.
తతో౾ స్య ప్రహ్లాదః సమజనిసు తో గర్భవసతౌ
మునేర్వీణాపాణేరధిగతభవద్భక్తిమహిమా।
స వై జాత్యాదైత్యః శిశురపి సమేత్య త్వయి రతిం
గతస్త్వద్భక్తానాం వరద! పరమోదాహరణతామ్।।
4వ భావము:
వరదా! ఆ హిరణ్యకశిపునికి 'ప్రహ్లాదుడు' అను పుత్రుడు కలిగెను. ఆ ప్రహ్లాదుడు తల్లి గర్భమున నుండగనే వీణాపాణియగు నారదమునీంద్రుని నుండి , నీ (భగవత్) భక్తి మహిమలను తెలుసుకొనెను. జన్మచే రాక్షసుడేయైనను, ఆ ప్రహ్లాదుడు బాల్యమునుండియూ నీ భక్తుడు; నీ భక్తిలోని ఆనందముననుభవించు భక్తులకు ఆదర్శరూపుడు.
24-5-శ్లో.
సురారీణాం హాస్యం తవచరణదాస్యం నిజసుతే
స దృష్ట్వా దుష్టాత్మా గురుభిరశిశిక్షచ్చిరమముమ్।
గురుప్రోక్తం చాసావిదమిదమభద్రాయ దృఢమి-
త్యపాకుర్వన్ సర్వం తవచరణభక్త్యైవ వవృధే।।
5వ భావము:
శ్రీహరీ! నీ భక్తుడగు ప్రహ్లాదుడు - అసురులు హేళనచేయు నీ పాదసేవయందు అనురక్తుడగుట చూచి, హిరణ్యకశిపుడు సహించలేకపోయెను. గర్వాంధుడై (నీనుండి ప్రహ్లాదుని మనసును మరల్చవలెనని), గురువులవద్ద చిరకాలము ఉంచి శిక్షణ ఇప్పించెను. గురువులు భోధించునది - (ఆత్మకు) భద్రము కాదని ధృఢనిశ్చయము చేసుకొనిన ప్రహ్లాదుడు వారి భోధనలను తిరస్కరించుచుండెను. నీ చరణములయెడ భక్తి మాత్రమే ప్రహ్లాదుని హృదయమున వృద్ధిచెందుచుండెను.
24-6-శ్లో.
అధీతేషు శ్రేష్ఠం కిమితి పరిపృష్టే౾థ తనయే
భవద్భక్తిం వర్యామభిగదతి పర్యాకులధృతిః।
గురుభ్యో రోషిత్వా సహజమతిరస్యేత్యభివిదన్
వధోపాయానస్మిన్ వ్యతనుత భవత్పాదశరణే।।
6వ భావము:
ఒకనాడు హిరణ్యకశిపుడు "నీవు చదివిన చదువుల సారమేమి?" అని ప్రహ్లాదుని ప్రశ్నించెను. అంతట ప్రహ్లాదుడు (శాశ్వత ఆనందమునకు) "శ్రీహరి భక్తియే శ్రేష్టమని" పలికెను. ప్రహ్లాదుడట్లు హరిని కీర్తించుట విని , క్రోధముతో హృదయము కలవరపడగా, హిరణ్యకశిపుడు గురువులను నిందించెను. పిమ్మట - ప్రహ్లాదుని స్వతఃసిద్ధమగు బుద్ధియే దీనికి కారణమని గ్రహించి, శ్రీహరీ! నీపాదములే తనకు రక్ష అని నమ్మి ఆరాధించు ఆ ప్రహ్లాదుని చంపు ఉపాయములను ఆలోచించసాగెను.
24-7-శ్లో.
స శూలైరావిద్ధః సుబహుమథితో దిగ్గజగణైః
మహాసర్పైర్దష్టో౾ప్యనశనగరాహారవిధుతః।
గిరీంద్రావక్షిప్తో౾ ప్యహహా! పరమాత్మన్నయి విభో!
త్వయి న్యస్తాత్మత్వాత్ కిమపి న నిపీడామభజత।।
7వ భావము:
తండ్రి (హిరణ్యకశిపుడు) - ప్రహ్లాదుని పలుమార్లు శూలములచే పొడిపించెను. ఏనుగుల సమూహముచే తొక్కించెను. మహాసర్పములచే కరిపించెను. ఆహారము యిడకుండా పస్తులుంచెను. విషాహారము తినిపించెను. కొండలపైనుండి త్రోసివేయించెను. అయిననూ - ఆహా! పరమాత్మా! ఆత్మతత్వమును పూర్తిగా గ్రహించిన, నీ భక్తుడగు ప్రహ్లాదుడు మాత్రము ఇసుమంతయూ బాధననుభవించలేదు.
24-8-శ్లో.
తతశ్శంకావిష్టః స పునరతిదుష్టో౾స్య జనకో
గురూక్త్యా తద్గేహే కిలవరుణపాశైస్తమరుణత్।
గురోశ్చాసాన్నిధ్యే స పునరనుగాన్ దైత్యతనయాన్
భవద్భక్తేస్తత్త్వం పరమమపి విజ్ఞానమశిషత్।।
8వ భావము:
అట్లు జరుగుటకు (తన ప్రయత్నములు వ్యర్ధమగుటకు) కారణమేమియని, విచారించిన హిరణ్యకశిపుడు, దానికి తన శత్రువగు విష్ణువే కారణమని సందేహించెను. క్రూరస్వభావియగు హిరణ్యకశిపుడప్పుడు తనగురువుల మాటవిని, ప్రహ్లాదుని వరుణపాశముతో ఆ గురువుల గృహమునందే బంధించెను. గురువులు గృహమునందు లేనిసమయమున, ప్రహ్లాదుడు తన సహచర అసురపుత్రులకు భక్తి-పరతత్వ జ్ఞానములను భోధించుచుండెను.
24-9-శ్లో.
పితా శృణ్వన్ బాలప్రకరమఖిలం త్వత్ స్తుతిపరం
రుషాంధః ప్రాహైనం కులహాతక! కస్తేబలమితి।
బలంమే వైకుంఠస్తవ చ జగతాం చాపి స బలం
స ఏవ త్రైలోక్యం సకలమితి ధీరో౾యమగదీత్।।
9వ భావము:
ప్రభూ! విష్ణుమూర్తీ! బాలురందరూ నీ స్తుతి స్తోత్రములను గానము చేయుచున్నారని వినిన హిరణ్యకశిపుడు క్రోదాంధుడై ప్రహ్లాదుని పిలిచి ఇట్లు ప్రశ్నించెను. "వంశనాశకుడా! నీకు (నీవిట్లు ప్రవర్తించుటకు) బలమెవ్వరు?". అని అడగగా ప్రహ్లాదుడిట్లనెను. "ఓ తండ్రీ! నీకును – నాకును - ఈ సకల జగత్తునకును బలము ఆ వైకుంఠుడే! త్రిలోకములకు - సకలమూ అతడే!" అని ప్రహ్లాదుడు ధైర్యముగా పలికెను.
24-10-శ్లో.
అరే! క్వా౾సౌ క్వా౾సౌ సకలజగదాత్మా హరిరితి
ప్రభింతే స్మ స్తంభం చలితకరవాలో దితిసుతః
అతః పశ్చాద్విష్ణో! న హి వదితుమీశో౾స్మి సహసా
కృపాత్మన్! విశ్వాత్మన్! పవనపురవాసిన్! మృడయ మామ్।।
10వ భావము:
అంతట, హిరణ్యకశిపుడు ఆ బాలునితో ఇట్లనెను. "అరే! నీవు జగములకు ఆత్మరూపుడని చెప్పుచున్న ఆ శ్రీహరి ఎక్కడ? ఎక్కడున్నాడతడు?" అని గర్జించుచూ - ఖడ్గమును చేతబట్టి, అక్కడ ఉన్న ఒక స్తంభమును పగులగొట్టెను. అంతట ఏమిజరిగెనో ! ప్రభూ! నేను శీఘ్రమే చెప్పలేక పోవుచుంటిని. కరుణాంతరంగా! విశ్వాత్మా! పవనపురవాసీ ! నా బాధలనుండి నన్ను రక్షింపుము.
సప్తమ స్కంధము
24వ దశకము సమాప్తము.
-x-