నారాయణీయము/షష్ఠ స్కంధము/23వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
షష్ఠ స్కంధము

23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనం

23-1-శ్లో.
ప్రాచేతసస్తు భగవన్నపరో హి దక్షః
త్వత్సేవనం వ్యధితసర్గవివృద్ధికామః।
ఆవిర్భభూవిథ తదా లసదష్టబాహుః
తస్మై వరం దదిథ తాం చ వధూమసిక్నీమ్।
1వ భావము.
భగవాన్ ! ప్రచేతసులకు 'దక్షుడు' అను ఒక పుత్రుడు కలడు. ఇతడు దక్షప్రజాపతి కాక 'వేరొక దక్షుడు'. ప్రజాసృష్టిని వృద్ధి చేయవలయునను కోరికతో అతను నిన్ను సేవించుచుండెను. ప్రభూ! అష్టభుజములు కలిగిన రూపముతో ప్రకాశించుచూ – ఆ దక్షునికి నీవు సాక్షాత్కరించితివి. అతడు కోరిన వరములను అనుగ్రహించుటయేగాక అతనికి 'అసక్ని' అను భార్యను కూడా ప్రసాదించితివి.

23-2-శ్లో.
తస్యాత్మజాస్త్వయుతమీశ! పునస్సహస్రం
శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః
నైకత్ర వాసమృషయే స ముమోచ శాపం
భక్తోత్తమస్త్వృషిరనుగ్రహమేవ మేనే।।
2వ భావము.
ఈ దక్షునికి ప్రప్రథమంగా పదివేల మంది పుత్రులు కలిగిరి. పిదప మరియెుక వేయి మంది పుత్రులు జన్మించిరి. వారికి నారదమహర్షి నీ (నారాయణుని) మార్గమును ఉపాసించమని ఉపదేశించెను. అది (తనపుత్రులు ప్రజాసృష్టిని విడిచి పుచ్చుట) మెచ్చని దక్షుడు - “స్థిరనివాసములేక సదా సంచరించు” మని నారదమహర్షిని శపించెను. నీ భక్తులలో ఉత్తముడగు నారదమహర్షి - ఆ దక్షుని శాపమునకు వెరువక, ఆశాపమును అనుగ్రహముగా స్వీకరించెను.

23-3-శ్లో.
షష్ట్యా తతో దుహితృభిస్సృజతః కులౌఘాన్
దౌహిత్రసూనురథ తస్య స విశ్వరూపః।
త్వత్ర్సోత్రవర్మితమజాపయదింద్రమాజౌ
దేవ! త్వదీయమహిమాఖలు సర్వజైత్రః।।
3వ భావము.
పిమ్మట, దక్షుడు తన అదితి మున్నగు అరువది కుమార్తెల ద్వారా ప్రజాసృష్టి వివృద్ది గావించెను. ఆక్రమమున, అదితి కశ్యపులకు ద్వారా కలిగిన 'త్వష్ట' అను దౌహిత్రునికి (కుమార్తె కుమారునికి) 'విశ్వరూపుడు' అను పుత్రుడు కలిగెను. ప్రభూ! ఆ విశ్వరూపుడు నీ స్తోత్రకవచమును (నారాయణ కవచమును) దేవేంద్రునిచే పఠింపజేసెను. నీ ఈ 'స్తోత్రకవచము' మిక్కిలి మహిమాన్వితమయినది. సకల విజయసిద్ధిదాయకమైనది.

23-4-శ్లో.
ప్రాక్ శూరసేనవిషయే కిల చిత్రకేతుః
పుత్రాగ్రహీ నృపతిరంగిరసః ప్రభావాత్।
లబ్ద్వైకపుత్రమథ తత్ర హతే సపత్నీ-
సంఘైరముహ్యదవశస్తవ మాయయా౾ సౌ।।
4వ భావము.
ఒకానొకప్పుడు శూరసేన రాజ్యమును 'చిత్రకేతుడు' అను రాజు పరిపాలించుచుండెను. పుత్రులులేని ఆరాజుకు, 'అంగీరస' ముని అనుగ్రహమున పుత్రసంతానము కలిగెను. చిత్రకేతుని ఇతర భార్యలు (అసూయతో) ఆ పుత్రుని వధించిరి. మాయామోహితుడై, భగవాన్! 'చిత్రకేతుడు' దుఖః వివశుడయ్యెను.

23-5-శ్లో.
తం నారదస్తు సమమంగిరసా దయాళుః
సంప్రాప్యతావదుపదర్శ్య సుతస్య జీవమ్।
కస్యాస్మిపుత్ర ఇతితస్య గిరావిమోహం
త్యక్త్వా త్వదర్చనవిధౌ నృపతిం న్యయుంక్త।।
5వ భావము.
అట్లు దుఃఖించుచున్న 'చిత్రకేతుని' వద్దకు, దయాళువయిన నారదమహర్షి , ' అంగీరస' మునితో కలిసి వచ్చి - ఆ మృతశిశువు ఆత్మను రావించెను. ఆ యాత్మ చిత్రకేతునితో ఇట్లనెను. "దేహముండు వరకు నీ పుత్రుడనగు నేను - ఆ దేహము త్యజించిన పిదప ఎవరి పుత్రుడను!?" అని ప్రశ్నించెను. ఆవాక్కులతో మోహమువీడి 'చిత్రకేతుడు' విరక్తుడయ్యెను. నిన్ను (నారాయణుని) అర్చించమని, నారదమునీంద్రుడు అప్పుడు, 'చిత్రకేతునికి' ఉపదేశించెను.

23-6-శ్లో.
స్తోత్రం చ మంత్రమపి నారదతో౾థలబ్ద్వా
తోషాయ శేషవపుషో నమ తే తపస్యన్।
విద్యాధరాధిపతితాం స హి సప్తరాత్రే
లబ్ద్వా౾ప్యకుంఠమతిరన్వభజద్భవంతమ్।।
6వ భావము.
నారదుడు 'చిత్రకేతునికి'- నీ (నారాయణుని) స్తోత్రమును మరియు మంత్రమును ఉపదేశించెను. 'చిత్రకేతుడు' నిన్ను 'శేషుని' రూపమున అర్చించుచూ తపస్సాచరించెను. నీ అనుగ్రహముచే ఆ మంత్రప్రభావమున, ఏడుదినములలోనే 'చిత్రకేతునికి' - విద్యాధరాధిపతి పదవి సిద్ధించెను. అయిననూ భగవాన్! చిత్రకేతుడు ధృఢభక్తితో నిన్నే ఉపాసించుచుండెను.

23-7-శ్లో.
తస్మై మృణాళధవళేన సహస్రశీర్ణా
రూపేణ బద్ధనుతిసిద్ధగణావృతేన।
ప్రాచుర్భవన్నచిరతో నుతిభిః ప్రసన్నో
దత్త్వా౾త్మతత్వ్తమనుగృహ్య తిరోదధాథ।
7వ భావము.
అప్పుడు 'ప్రభూ! తెల్లతామరతూడునుబోలిన శరీరము కలిగినది - వేయి పడగలతో ప్రకాశించునది, స్తుతి స్తోత్రములతో సిద్ధులచే అర్చించబడునది అగు నీ "ఆదిశేషుని" రూపమున, ఆ 'చిత్రకేతునికి' సాక్షాత్కరించితివి. చిత్రకేతుని స్తోత్రములకు ప్రసన్నుడవై అతనికి ఆత్మతత్వమును ఉపదేశించి శీఘ్రమే అంతర్హితుడవయితివి.

23-8-శ్లో.
త్వద్భక్తమౌళిరథ సో౾పి చ లక్ష లక్షం
వర్షాణి హర్షులమనా భువనేషు కామమ్।
సంగాపయన్ గుణగణం తవ సుందరీభిః
సంగాతిరేకరహితో లలితం చచార।।
8వ భావము.
ప్రభూ! విద్యాధరాధిపతియైన ఆ 'చిత్రకేతుడు' నీ భక్తులలో అగ్రగణ్యుడు. అట్టి 'చిత్రకేతుడు', నీ గుణగణములను కీర్తించుచు, నీ కీర్తనలను గానముచేయుచూ, సౌందర్యవతులగు విధ్యాధర స్త్రీబృందముతో కలిసి ఎల్లెడలా సంచరించెను; మహదానందముగా అట్లు కొన్ని లక్షల సంవత్సరములు గడిపెను. మనస్సున అన్ని బంధములు త్యజించి - జితేంద్రుడై, భక్తియోగమార్గ మాధుర్యమును ఆస్వాదించుచు తరించెను.

23-9-శ్లో.
అత్యంతసంగవిలయాయ భవత్ప్రణున్నో
నూనం స రౌప్యగిరిమాప్య మహత్సమాజే।
నిశ్శంకమంకకృతవల్లభమంగజారిం
తం శంకరం పరిహసన్నుమయా౾భిశేపే।।
9వ భావము.
భగవాన్! నీవు 'చిత్రకేతునికి' పరిపూర్ణ నిస్సాంగత్యమును (సాంగత్యరహిత నిశ్చలత్వమును) అనుగ్రహింప దలచితివి. అప్పుడు 'చిత్రకేతుడు' నీ ప్రేరణచే కైలాసగిరికి వెళ్ళెను. అచ్చట ముఖ్య మునిగణములెల్లరూ పరివేష్టించియుండిరి. ఆ మహాసభలో శంకరుడు ఉమాదేవిని తన తొడభాగముపై కూర్చుండబెట్టుకొనియుండెను. ఆ దృశ్యమును చూచి పరిహసించగా - 'చిత్రకేతుడు' ఉమాదేవి శాపమునకు (అసుర జన్మకు) గురియయ్యెను.

23-10-శ్లో.
నిస్సంభ్రమస్త్వయమయాచితశాపమోక్షో
వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధీ।
భక్త్యాత్మతత్త్వకథనైస్సమరే విచిత్రం
శత్రోరపి భ్రమమపాస్య గతః పదం తే।।
10వ భావము.
'చిత్రకేతుడు' పార్వతి శాపముచే తనకు ప్రాప్తించిన అసురజన్మకు కలవరపడలేదు; శాపవిముక్తిని కోరి ప్రార్ధించలేదు. 'వృత్రాసుర' రూపమును స్వీకరించి 'ఇంద్రునితో' యుద్ధమునకు తలబడెను. అందు 'ఇంద్రునికి' (శత్రువేయైనను), భక్తితత్వమును మరియు ఆత్మతత్వమును భోధించెను; శత్రువునకు కూడా - మాయచే ఆవహించిన భ్రమను తొలగించిన - "చిత్రకేతుని" వృత్తాంతము పరమ ఆశ్చర్యకరము. ప్రభూ! తుదకు ఆ విష్ణుభక్తుడు నీ సాన్నిధ్యమును పొందెను.

23-11-శ్లో.
త్వత్సేవనేన దితిరింద్రవధోద్యతా౾పి
తాన్ ప్రత్యుతేంద్రసుహృదో మరుతో౾భిలేభే।
దుష్టాశయే౾పి శుభదైవ భవన్నిషేవా
తత్తాదృశస్త్వమవ మాం పవనాలయేశ!
11వ భావము.
దేవేంద్రుని సంహరించు అసురశక్తికల కుమారుడు కావలెనని, ప్రభూ! 'దితి' (కశ్యపుని భార్య) నిన్ను సేవించెను. కాని దానికి బదులుగా దేవతా స్వరూపులైన పుత్రులను దితికి ప్రసాదించితివి. ఆ పుత్రులు (మరుత్తులు) దేవేంద్రునితో శత్రుత్వమునకు బదులు మిత్రత్వమును అవలంభించిరి. ఉపాసనా ఆశయము ఏదయినను - భక్తితోచేయు నీ సేవ, శుభఫలమునే ఇచ్చును కదా!. అట్టి మహిమగలిగిన గురవాయూరుపురాధీశా! నన్ను రక్షింపమని - నిన్ను ప్రార్ధించుచున్నాను.

షష్ఠ స్కంధము పరిపూర్ణం
23వ దశకము సమాప్తము.
-x-
 

Lalitha53 (చర్చ) 16:05, 9 మార్చి 2018 (UTC)