నారాయణీయము/నవమ స్కంధము/33వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||

నవమ స్కంధము[మార్చు]

33వ దశకము - అంబరీషోపాఖ్యానము

33-1-శ్లో.
వైవస్వతాఖ్యమనుపుత్ర నభాగజాత-
నాభాగనామక నరేంద్రసుతో అంబరీషః।
సప్తార్ణవావృతమహీదయితో౾ పి రేమే
త్వత్సంగిషు త్వయి చ మగ్నమనాస్సదైవ॥
1వ భావము:-
వైవస్వత మనువు పుత్రుడు నభాగుడు; ఆ నభాగుని పుత్రుడు నాభాగుడు; ఈ నాభాగుని పుత్రుడే 'అంబరీషుడు'. నారాయణమూర్తీ! అంబరీషుడు సప్తసముద్రములు ఆవరణగాగల భూమండలమును పరిపాలించు మహాచక్రవర్తే అయినను నీయందు ధృఢమైన భక్తికలవాడు; సదా నీభక్తుల సేవయందే నిమగ్నుడైయుండెడువాడు.

33-2-శ్లో.
త్వత్ప్రీతయే సకలమేవ వితన్వతో౾స్య
భక్త్యైవ దేవ న చిరాదభృథాః ప్రసాదమ్।
యేనాస్య యాచనమృతే౾ప్యభిరక్షణార్ధం
చక్రం భవాన్ ప్రవితతార సహస్రధారమ్॥
2వ భావము:-
ప్రభూ! అంబరీషుడు తన మనసును నీయందే లగ్నము చేసుకొని, తను చేయు సకలకర్మలను భక్తితో నీకు అర్పించు చుండెను; అచిర కాలముననే నీకు మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యెను. ప్రభూ! నీవు సంతసించి, ఆ అంబరీషునకు, రక్షణార్ధము, వేయిఅంచులుగల చక్రాయుధమును అనుగ్రహించితివి.

33-3-శ్లో.
స ద్వాదశీవ్రతమథో భవదర్చనార్థం
వర్షం దధౌ మధువనే యమునోపకంఠే।
పత్న్వా సమం సుమనసా మహతీం వితన్వన్
పూజాం ద్విజేషు విసృజన్ పశుషష్టికోటిమ్.॥
3వ భావము:-
నారాయణమూర్తీ! అంబరీషుని భార్యకూడా నీయందు నిర్మలమైన భక్తికలిగిన సాధ్వి. అంబరీషుడు ఆమెతో కలిసి యమునానదీ తీరమునగల మధువనమునందు 'ద్వాదశీవ్రతమును' ఒక సంవత్సరకాలముగా భక్తితో ఆచరించుచుండెను; విప్రులను పూజించి వారికి అరువది కోట్ల గోవులను దానముచేసెను.

33-4-శ్లో.
తత్రా౾థ పారణదినే భవదర్చనాంతే
దుర్వాససాస్య మునినా భవనం ప్రపేదే।
భోక్తుం వృతశ్చ స నృపేణ పరార్తిశీలో
మందం జగామ యమునాం నియమాన్ విధాస్యన్॥
4వ భావము:-
నారాయణమూర్తీ! 'ద్వాదశీవ్రతము' ముగిసి, తీర్ధప్రసాదములను స్వీకరించు ( పారణ) ద్వాదశ ఘడియలు ఆసన్నమయ్యెను. ఆసమయములో 'దూర్వాస మహాముని' అంబరీషుని రాజప్రసాదమునకు వచ్చెను. అంబరీషుడు - ఆ మునీశ్వరునిని తనతో కలిసి భుజించ వలసినదని కోరెను. 'దూర్వాసుడు' అందుకు అంగీకరించి, భోజనమునకు ముందు ఆచరించు నియమములను నిర్వర్తించుకొని వత్తునని యమునానదికి వెడలెను; స్నానాది కార్యక్రమములను కాలాతీతముగా నిర్వర్తించసాగెను.

33-5-శ్లో.
రాజ్ఞా౾థ పారణ ముహుర్తసమాప్తిఖేదాద్
వారైవ పారణమకారి భవత్పరేణ।
ప్రాప్తో మునిస్తదథ దివ్యదృశా విజానన్
క్షిప్యన్ కృధోద్దృతజటో వితతాన కృత్యామ్॥
5వ భావము:-
'దూర్వాసుడు' యమునానదినుండి తిరిగివచ్చుట ఆలస్యమగుచుండెను. ఇంతలో ద్వాదశి తిథి ఉండగనే పారణ (ఉపవాసము ముగించి ప్రసాదము స్వీకరించుట) చేయవలసి ఉండిన, ద్వాదశఘడియలు దాటిపోవుచుండెను. సమయము మించినచో చేసిన వ్రతము నిష్ప్రయోజనమగునని తలచి, ప్రభూ! నారాయణమూర్తీ! నీ భక్త పరాయణుడగు అంబరీషుడు (స్వల్ప) తీర్ధమును స్వీకరించి పారణ జరిపెను. దివ్యదృష్టితో ఇది గ్రహించిన 'దూర్వాసుడు' (తనను భోజనమునకు పిలిచి వేచియుండలేదని నిందించి) క్రోధముతో తన జట నుండి ఒక పాయను తీసి 'కృత్యను' (హింసాత్మక శక్తిని) సృష్టించి ఆ 'అంబరీషుని' పైకి వదిలెను.

33-6-శ్లో.
కృత్యాం చ తామసిధరాం భువనం దహంతీం
అగ్రే౾భివీక్ష్య నృపతిర్న పదాచ్చకంపే।
త్వద్భక్తబాధమభివీక్ష్య సుదర్శనం తే
కృత్యానలం శలభ యన్మునిమన్వధావీత్॥
6వ భావము:-
'దూర్వాసునిచే' సృష్టించబడిన ఆ 'కృత్య' - ఖడ్గము ధరించి లోకమునెల్లా దగ్ధము గావించుచూ విలయము సృష్టించసాగెను. అయినను 'అంబరీషుడు' ఎంతమాత్రమూ చలించక స్థిరముగా నిన్నే ప్రార్ధించుచుండెను. అప్పుడు ప్రభూ! నారాయణమూర్తీ! నీవు ప్రసాదించిన (వేయి అంచులు కలిగిన) సుదర్శన చక్రము - నీ భక్తుని కష్టమునుచూచి- మండుచున్న జ్వాలలతో ఆ ' కృత్యను' (దుష్ట శక్తిని) దహించివేసెను; 'దూర్వాసముని' వెంటపడి అతనిని తరమసాగెను.

33-7-శ్లో.
ధావన్నశేషభువనేషు భియా స పశ్యన్
విశ్వత్రచక్రమపి తే గతవాన్ విరించమ్।
కః కాలచక్రమతిలంఘయతీత్యపాస్తః
శర్వం యయౌ స చ భవంతమవందతైవ॥
7వ భావము:-
'దూర్వాసుడు' ఆ సుదర్శన చక్రమును తప్పించుకొనుటకై సకల లోకములను తిరగసాగెను. బ్రహ్మదేముని శరణుకోరెను. కాలచక్రమును అధిగమించుట ఎవరితరము? అనిపలికి 'బ్రహ్మ' మిన్నకుండెను. దూర్వాసుడు శివుని వద్దకు వెళ్ళగా, ప్రభూ! నారాయణమూర్తీ! 'పరమ శివుడు' - దేవదేవుడవైన నిన్ను తలుచుకొని నమస్కరించెను గాని ఆ 'దూర్వాసుని' రక్షించలేదు.

33-8-శ్లో.
భూయో భవన్నిలయమేత్య మునిం నమంతం
ప్రోచే భవానహమృషే నను భక్తదాసః।
జ్ఞానం తపశ్చ వినయాన్వితమేవ మాన్యం
యాహ్యంబరీషపదమేవ భజేతి భూమన్॥
8వ భావము:-
విశ్వేశ్వరా! అంతట, ఆ 'దూర్వాసముని', నీ స్ధానమయిన వైకుంఠము చేరి నిన్ను శరణుకోరెను. ప్రభూ! అప్పుడు దూర్వాసునితో నీవు ఇట్లంటివి. "నేను భక్తులకు దాసుడను. తపస్సైనను, జ్ఞానమేయైననూ వినయముతో కలిసి ఉండినచో గౌరవము; శక్తి ఉండును (అది నీలో లోపించినది). నిన్ను రక్షించువాడు అంబరీషుడు మాత్రమే; నీవు అతనినే శరణువేడుము", అని పలికితివి.

33-9-శ్లో.
తావత్ సమేత్య మునినా స గృహీతపాదో
రాజా౾ పసృత్య భవదస్త్రమసావనౌషీత్।
చక్రే గతే మునిరదాదఖిలాశిషో౾స్మై
త్వద్భక్తిమాగసికృతే౾పి కృపాం చ శంసన్॥
9వ భావము:-
'దూర్వాసుడు (గర్వమణిగినవాడై), అంబరీషుని వద్దకు తిరిగివచ్చి, అతని పాదములకు సాగిలపడబోయెను. అంతట, నీ భక్తుడయిన అంబరీషుడు, దూరముగా తొలగి, ప్రభూ! నారాయణమూర్తీ! నీ సుదర్శనచక్రమును స్తుతించెను. వెనువెంటనే, ఆ సుదర్శనచక్రము దూర్వాసుని వదలి వెడలిపోయెను. అప్పుడు దూర్వాస మునీంద్రుడు - అపకారము తలపెట్టిన వానిపైకూడా 'కరుణ చూపిన భక్తుడవని' అంబరీషుని ప్రశంసించెను; ఆశీర్వదించెను

33-10-శ్లో.
రాజా ప్రతీక్ష్య మునిమేకసమామనాశ్వాన్
సంభోజ్య సాధు తమృషిం విసృజన్ ప్రసన్నమ్।
భుక్త్వా స్వయం త్వయి తతో౾పి దృఢం రతో౾భూత్
సాయుజ్యమాప చ సమాం పవనేశ।పాయాః॥
నవమ స్కంధము
10వ భావము:-
సుదర్శనచక్రము ఆ దూర్వాసమునిని తరుముచు తిరిగి తిరిగి, అంబరీషుని వద్దకు చేరుటకు ఒక సంవత్సర కాలము పట్టెను. ఆ సంవత్సరకాలమూ, అంబరీషుడు నిరాహారుడై ఆ మునీశ్వరుని రాకకై ఎదురు చూచుచుండెను. ఆ ముని తిరిగిరాగా - ఆహారమొసగి ఆ ముని భుజించిన పిమ్మట తానును భుజించెను. మునుపటికంటెను నీయందు ధృడభక్తితో అంబరీషుడు తన శేషజీవితమును గడిపి, పిదప, ప్రభూ! నారాయణమూర్తీ! నీ సాయుజ్యమును పొందెను. అంతటి మహిమాన్వితుడవయిన ఓ! గురవాయూరు పురవాసా! నన్ను కాపాడుము.


33వ దశకము సమాప్తము.
-x-
 

Lalitha53 (చర్చ) 14:07, 11 మార్చి 2018 (UTC)