Jump to content

నారాయణీయము/ద్వితీయ స్కంధము/7వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
ద్వితీయ స్కంధము

7వ దశకము - హిరణ్య గర్భోత్పత్తి, వైకుంఠ ఆది వర్ణన

7-1-శ్లో.
ఏవం దేవ! చతుర్దశాత్మకజగద్రూపేణ జాతః పునః
తస్యోర్ధ్వం ఖలు సత్యలోకనిలయేజాతో౾సి ధాతా స్వయమ్।
యం శంసంతి హిరణ్యగర్భమఖిల త్రైలోక్యజీవాత్మకం
యో౾భూత్ స్ఫీతరజో వికారవికసన్నానాసిసృక్షరసః||
1వ. భావము:
దేవా! చతుర్దశభువనములు నీ యందే నెలకొనగా, విరాట్పురుష రూపములొ ఆవిర్బవించిన నీవు సకలలోకములకు పైలోక మగు సత్యలోకమున స్వయముగా ధాత (విధాత /bబ్రహ్మ) రూపమును ధరి౦చితివి. త్రిలోకములలోని సమస్త జీవులకు జీవాత్మ రూపుడైన ఆ ధాతను 'హిరణ్యగర్బుడు' అని, వేదములు పేర్కొనినవి. ప్రకృతి వలన ఏర్పడిన రజోగుణ కారణముగా, ధాత య౦దు నానా సిసృక్షారస (అనేక రూపములతొ -అనేక విధములగా) సృష్టి చేయవలయునను కోరిక జని౦చినది.

7-2-శ్లో.
సో౾యం విశ్వవిసర్గదత్తహృదయః సంపశ్యమానస్స్యయం
బోధం ఖల్వనవాప్య విశ్వవిషయం చింతాకులస్తస్థివాన్
తావత్త్వం జగతాం పతే! తప తపేత్యేవం హి వైహాయసీం
వాణీమేనమశిశ్రవః శ్రుతిసుఖాం కుర్వంస్తపః ప్రేరణామ్||
2వ. భావము:
జగత్పతీ! ప్రకృతి వలన ఏర్పడిన రజోగుణ ప్రభావముతో సృష్టిచేయుటకు ధాత స౦కల్పి౦చియు, విశ్వసృష్టి విషయమున జ్ఞానమును పొ౦దలేకపోయెను. ఆ సమయమున, చి౦తనా వ్యాకులుడైన బ్రహ్మ హృదయమునకు ప్రేరణను, చెవులకు ఆన౦దమును కలిగి౦చుచు "తపస్సు! తపస్సు! " అను ఆకాశవాణి వాక్కులను నీవు వినిపించితివి.

7-3-శ్లో.
కో౾సౌ మామవదత్ పుమానితి జలాపూర్ణే జగన్మండలే
దిక్షూద్వీక్ష్య కిమప్యనీక్షితవతా వాక్యార్థముత్పశ్యతా।
దివ్యం వర్షసహస్రమాత్తతపసా తేన త్వమారాధితః
తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుంఠమేకాద్భుతమ్||
3వ భావము:
"తపస్సు!తపస్సు!" అని ఉచ్ఛరించిన రూపము కొరకు ధాత పలు దిక్కులను పరికించగా, పూర్తిగా జలముతో ఆవరించబడిన జగన్మండలమును వీక్షించి, ఏ విధమయిన రూపమును కనుగొన లేకపోయెను.ధాత తనకు వినిపించిన వాక్కునకు అర్ధమును, దాని ప్రేరణను గ్రహించి, వేయి దివ్య వర్షముల కాలము తపస్సు ఆచరించి, నిన్ను ఆరాధించెను. అప్పుడు ధాతకు, నీవు నీ స్ధాన మగు అద్భుతమయిన వైకుంఠమును దర్శింప చేసితివి.

7-4-శ్లో.
మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యోబహిః
శోక క్రోధ విమోహ సాధ్వసముఖా భావాస్తు దూరం గతాః।
సాంద్రానందఝరీ చ యత్ర పరమజ్యోతిః ప్రకాశాత్మకే
తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠరూపం విభో!
4వ. భావము:
విభూ! మాయ వలన ఏవిధమయిన మార్పు చెందనిది, జగత్తునకు అతీతముగా ప్రకాశించునది, శోకము, క్రోధము, మోహము, భయము మొదలగు భావములకు అతీతమయినది, పరమోన్నత మగు జ్యోతి రూపముతో ప్రకాశించునది, పరిపూర్ణమయిన జ్ఞానానందరస ప్రవాహమునకు నిలయమైన వైకుంఠమును నీవు ధాతకు దర్శింపచేసితివి.

7-5-శ్లో.
యస్మిన్ నామ చతుర్భుజా హరిమణి శ్యామావదాతత్విషో
నానాభూషణరత్న దీపితదిశో రాజద్విమానాలయాః।
భక్తిప్రాప్తతథావిధోన్నతపదా దీవ్యంతి దివ్యా జనాః
తత్ తే ధామ నిరస్తసర్వశమలం వైకుంఠరూపం జయేత్||
5వ. భావము:
చతుర్భుజములను కలిగినవారు, నీలమణి వర్ణమును పోలిన దేహకాంతి గలవారు, తాము ధరించిన రత్నాభరణ విశేషములచే దిక్కులను దీప్తివంతము చేయువారు, రాజభవనములను పోలిన గృహములను కలిగినవారు, విమానాలయములలో విహరించువారు, ఉత్తమ భక్తి ఫలితముగా ప్రాప్తించిన ఉన్నత స్ధానమును పొందినవారు అగు దివ్య జనులతో విలసిల్లునది మరియు నీకు నిలయమై రూపము దాల్చిన ఆ వైకుంఠము సర్వ పాపములను హరించి జయించును.

7-6-శ్లో.
నానాదివ్య వధూజనైరభివృతా విద్యుల్లతాతుల్యయా
విశ్వోన్మాదన హృద్య గాత్రలతయా విద్యోతితాశాంతరా।
త్వత్పాదాంబుజ సౌరభైకకుతుకాల్లక్ష్మీ స్స్వయం లక్ష్యతే
యస్మిన్ విస్మయనీయ దివ్యవిభవం తత్ తే పదం దేహిమే||
6వ. భావము:
విభూ! దివ్య స్త్రీజన సమూహముచే పరివేష్టించబడి, లక్ష్మీదేవికి నిలయమై, మెరుపుతీగను పోలిన దేహకాంతితో జగత్తును మై మరపించు రూప లావణ్యములతో దిగంతములను సైతము ప్రకాశింపచేయునది, శ్రీమహావిష్ణువు పాదారవింద పరిమళమును ఆస్వాదించు ఆసక్తిచే స్వయముగా సాక్షాత్కరించు లక్ష్మిదేవికి స్ధానమయినది, దివ్య వైభవముతో శోభిల్లుచూ, విస్మయమును కలిగించు వైకుంఠము నందు నాకు స్ధానమును అనుగ్రహించుము.

7-7-శ్లో.
తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం
భాస్వత్కోటి లసత్కిరీట కటకాద్యాకల్పదీప్రాకృతి।
శ్రీవత్సాంకిత మాత్తకౌస్తుభమణిచ్ఛాయారుణం కారణం
విశ్వేషాం తవ రూపమైక్షత విధిస్తత్తే విభో! భాతు మే||
7వ. భావము:
విభూ! వైకుంఠమున, రత్నఖచిత సింహాసనమును అధివసించి, కోటి సూర్యు కాంతుల సమానమైన కాంతితో ప్రకాశించు కిరీటమును, కటకములు మొదలగు ఆభరణములను ధరించి; వక్షస్ధలమున శ్రీవత్సముతో అరుణవర్ణ శోభితమయిన కౌస్తుభమణితో అలంకృతమైన నీ రూపము బ్రహ్మదేవునికి గోచరించెను. విభూ! విశ్వసృష్టికి కారణమయిన ఆ రూపమును నాకును సాక్షాత్కరింప చేయ మని నిన్ను ప్రార్ధింతును.

7-8-శ్లో.
కాలాంభోదకళాయకోమలరుచాం చక్రేణ చక్రం దిశాం
ఆవృణ్వాన ముదార మందహసితస్యంద ప్రసన్నానం।
రాజత్కంబు గదారి పంకజధర శ్రీమద్భుజామండలం
స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో! మద్రోగముద్వాసయేత్||
8వ. భావము:
విభూ! కాలమేఘచ్చాయను నీలికలువపువ్వుల కోమలత్వమును కలిగిన నీ రూపమున ప్రకాశించు కాంతి, చక్రభ్రమణమై సకలదిశలను ఆవరించునది. మందహాసము నొలికించు ప్రసన్న వదనముతో, శంఖు, చక్ర, గదా, పద్మములతో విరాజిల్లు భుజమండలము కలగిన నీ రూపము, సృష్టికర్తకు ఆనందమును కలిగించినది. అట్టి నీ రూపమును, నా రోగమును హరింపజేయ మని ప్రార్ధించుచున్నాను.

7-9-శ్లో.
దృష్ట్వా సంభృతసంభ్రమః కమలభూస్త్వత్పాదపాథోరుహే
హర్షావేశ వశంవదో నిపతితః ప్రీత్యా కృతార్థీభవన్।
జానాస్యేవ మనీషితం మమ విభో! జ్ఞానం తదాపాదయ
ద్వైతాద్వైత భవత్స్వరూప పరమిత్యాచష్ట తం త్వాం భజే||
9వ. భావము:
నీ రూపమును దర్శించిన కమలోద్బవునకు తడబాటు కలుగగా, హర్షావేశమును పొ౦ది, నీ పాదపద్మముల చె౦త సాగిలపడెను. నీ రూపమును దర్శి౦చి, కృతార్థు డైన బ్రహ్మదేవుడు, ‘విభూ! ద్వైత రూప జ్ఞూనమును, అద్వైత తత్వమును నాకు ప్రసాది౦చి, నా అభీష్టమును నెరవేర్చుము՚ అని వేడుకొనెను. అట్టి బ్రహ్మదేవుడు దర్శించిన నీరూపమును నేను ప్రార్ది౦తును.

7-10-శ్లో.
ఆతామ్రే చరణే వినమ్రమథ తం హస్తేన హస్తే స్ప్రుశన్
బోధస్తే భవితా న సర్గవిధిభిర్భంధో౾పి సంజాయతే।
ఇత్యాభాష్య గిరం ప్రత్యోష నితరాం తచ్చిత్తగూఢస్స్వయం
సృష్ఠౌ తం సముదైరయః స భగవన్నుల్లాసయోల్లాఘతామ్||
10వ. భావము:
తామ్రవర్ణమును కలిగిన నీ పాదద్వయమువ చె౦త వినమ్రుడై నిలచిన బ్రహ్మదేవుని హస్తమును, నీ హస్తముతో స్పృశించి, "బ౦ధము స౦భవి౦చని విధముగా నీవు విశ్వసృష్టిని జరపగలవు“ అని పలికితివి. స్వయముగా బ్రహ్మదేవుని చిత్తమున నిగూఢముగా నీవే నిలచి, సృష్టిని నిర్వర్తి౦పచేసితివి. భగవాన్! నాకు ఆరోగ్యమును ప్రసాది౦చమని నిన్ను వేడుకొనుచున్నాను.

-x-

Lalitha53 (చర్చ) 15:24, 7 మార్చి 2018 (UTC)