నారాయణీయము/ద్వితీయ స్కంధము/6వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||
ద్వితీయ స్కంధ

6వ దశకము - విరాట్పురుషుని జగదాత్మ తత్వ వర్ణనం

6-1-శ్లో.
ఏవం చతుర్దశజగన్మయతాం గతస్య
పాతాళమీశ! తవపాదతలం వదంతి।
పాదోర్ధ్వదేశమపి దేవరసాతలం తే
గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్||
1వ భావము.
జగదీశ్వరా! అద్భుతముగా ఆవిష్కరించబడిన నీ విరాడ్రూపమునకు, పాతాళము పాదతలమనియు, రసాతలము పాదాగ్రమనియు, మహాతలము నీ చీలమండలు అనియు చెప్పబడుచున్నది.

6-2-శ్లో.
జంఘే తలాతలమథో సుతలం చ జానూ
కించోరుభాగయుగళం. వితలాతలే ద్వే।
క్షోణీతలం జఘనమంబరమంగ! నాభిః
వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే!
2వ భావము.
చక్రపాణీ! తలాతలము నీ కాలి పిక్కలనియు, సుతలము నీ మోకాళ్ళునియు , వితలము అతలము అను రెండులోకములు నీతొడలభాగములనియు, నీ కటి ప్రదేశము భూతలమనియు, ఆకాశము నీ నాభియనియు మరియు నీ వక్ష స్ధలము ఇంద్రలోకమనియు చెప్ప బడుచున్నది.

6-3-శ్లో.
గ్రీవా మహస్తవ ముఖం చ జనస్తపస్తు
ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యమ్।
ఏవం జగన్మయతనో! జగదాశ్రితైర-
ప్యన్న్యెర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే||
3వ భావము.
మహర్లోకము నీ కంఠముగా, జనలోకము నీ వదనముగా, తపోలోకము నీ ఫాలభాగముగా, సత్యలోకము నీ శిరస్సుగా, లోకములనాశ్రయించి యుండు విశేషములు నీ ఇతర అవయవములుగా ఆవిర్భవించిన భగవంతుడా! నీకు నమస్కారము.

6-4-శ్లో.
త్వద్ర్బహ్మరంధ్రపదమీశ్వర! విశ్వకంద!
ఛందాంసి కేశవ ఘనాస్తవ కేశపాశాః।
ఉల్లాసి చిల్లియుగళం ద్రుహిణస్య గేహమ్
పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే||
4వ భావము.
విశ్వమునకు మూలమయిన ఈశ్వరా! నీ బ్రహ్మ రంధ్రము వేదములకు నెలవు. మేఘములు నీ కేశపాశములు. కనుబొమలు బ్రహ్మ లోకము. నీ కనురెప్పలు రాత్రి పగలు. కేశవా! సూర్యచంద్రులను నీ నేత్రములుగా కలిగి ఉన్నావు.

6-5-శ్లో.
నిశ్శేషవిశ్వరచనా చ కటాక్షమోక్షః
కర్ణౌ దిశో౾శ్వియుగళం తవ నాసికే ద్వే।
లోభ త్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ
తారాగణాశ్చ రదనాః శమనశ్చ దంష్ట్రా||
5వ భావము.
భగవాన్! ఈ అనంత సృష్టి రచనకు నీ కటాక్షవీక్షణ ప్రేరితమే కారణము. విశ్వమునకు నీ చెవులు దిక్కులు. అశ్వినీ దేవతలు నీ రెండు నాసికాపుటములు. లోభము లజ్జ నీ పైపెదవి మరియు క్రింది పెదవులు. నక్షత్రములు నీదంతములు. యముడు నీ కోర.

6-6-శ్లో.
మాయావిలాసహసితం శ్వసితం సమీరో
జిహ్వా జలం వచనమీశ! శకుంతంపంక్తిః।
సిద్ధాదయస్స్వరగణా ముఖరంధ్రమగ్నిః
దేవా భుజా స్తనయుగం తవ ధర్మదేవః||
6వ భావము.
జగదీశ్వరా! మాయ నీ ధరహాసము. వాయువు నీ శ్వాస. జలము నీ నాలుక. ఆకాశమున పక్షుల సమూహములు చేయు ధ్వనులు నీ పలుకులు. సిద్ధులు, దేవతల వాక్కులకు నీ స్వరగణము మూలము. అగ్ని నీ ముఖము. దేవతలు భుజుములు. ధర్మదేవత నీ వక్షస్ధలము.

6-7-శ్లో.
పృష్ఠం త్వధర్మ ఇహదేవ! మనస్సుధాంశుః
అవ్యక్తమేవ హృదయాంబుజ మంబుజాక్ష!
కుక్షిస్సముద్రనివహా వసనం తు సంధ్యే
శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః||
7వ భావము.
దేవా! విరాడ్రూపమున నీ వీపు అధర్మమునకు, మనస్సు చంద్రునికి, అవ్యక్తమగు పద్మము హృదయమునకు, ఉదరము సముద్రములకు స్దానములయినవి. ప్రాతః సంధ్యలు నీ వస్త్రములు. ప్రజాపతి నీ ఉపస్ధేంద్రియము. మిత్రుడు నీ పాయ్వింద్రియము.

6-8-శ్లో.
శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే
హస్త్యుష్ట్రసైంధవముఖా గమనం తు కాలః!
విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు-
చారూరుయుగ్మచరణం కరుణాంబుధే! తే||
8వ భావము.
నీ విరాడ్రూపమున మృగములు నీ శ్రోణీస్ధలము. ఏనుగులు, ఒంటెలు, గుర్రములు మొదలగునవి నీ కాలిగోళ్ళు. కాలగమనము నీ నడక. కరుణారససాగరా! విప్రులు మొదలగు వర్ణవ్యవస్ధకు నీ ముఖపద్మము, బాహువులు,కాళ్ళు, పాదములు మూలము.

6-9-శ్లో.
సంసారచక్రమయి! చక్రధర! క్రియాస్తే
వీర్యం మహాసురగణో౾స్థికులాని శైలాః।
నాడ్యస్సరిత్సముదయస్తరవశ్చ రోమ
జీయాదిదం వపురనిర్వచనీయమీశ!
9వ భావము.
చక్రధరా! విశ్వసృష్టి చక్రమున జనన మరణములు నీ సృష్టిక్రియ. సురాసుర మహాపరాక్రమము నీ వీర్యము. పర్వతములు నీ ఎముకలు. నదులు నీ నాడులు. వృక్షములు నీ రోమములు. జగథీశా! నిర్వచించుటకు అలవికాని నీ రూపము నా యందు ప్రకాశించుగాక!

6-10-శ్లో.
ఈదృగ్జగన్మయవపుస్తవ కర్మభాజాం
కర్మావసానసమయే స్మరణీయమాహుః।
తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే
వాతాలయాధిప! నమో౾స్తు నిరుంధి రోగాన్||
10వ భావము.
జగన్మయమగు నీ రూపమును, కర్మబద్ధులగు దేహధారులు కర్మావసానసమయమున స్మరించదరు. గురవాయూరు పురాధీశా! నీ అంతరాత్మ అయిన శుద్ధసత్వగుణ రూపమునకు నమస్కరింతును. నా రోగమును హరించుము.

-x-

Lalitha53 (చర్చ) 15:23, 7 మార్చి 2018 (UTC)