నారాయణీయము/తృతీయ స్కంధము/9వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము

9వ దశకము - జగత్సృష్టి ప్రకార వర్ణనము

9-1-శ్లో.
స్థితస్స కమలోద్భవస్తవ హి నాభిపంకేరుహే
కుతస్స్విదిదమంబుధావుదితమిత్యనాలోకయన్।
తదీక్షణకుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః
చతుర్వదనతామగాద్ వికసదష్టదృష్ట్యంబుజామ్||
ప్రళయాన౦తర సృష్టి ఆరంభకాలమున, ఆదిశేషునిపై శయనించి యున్న నీ నాభి ను౦డి పద్మము ఉద్భవించినది. ఆ పద్మముపై ఆసీనుడై యున్న బ్రహ్మదేవునకి, ఆ మహసముద్రమున పద్మము ఎట్లు వచ్చెనో అవగతము కాలేదు. ఆ పద్మమునకు ఆధారము తెలుసుకొనవలయునను కుతూహలముతో, ՚బ్రహ్మదేవుడు՚ తన ముఖమును అన్ని దిక్కులకు త్రిప్పి వీక్షించెను. ఆ కారణముననే బ్రహ్మదేవునకు నాలుగు ముఖములు, వికసించిన పద్మదళములను బోలిన ఎనిమిది నేత్రములు కలిగినవి.

9-2-శ్లో.
మహార్ణవవిఘార్ణితం కమలమేవ తత్ కేవలం
విలోక్య తదుపాశ్రయం తవ తనుం తు నాలోకయన్।
క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం
కుతస్స్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్||
ఆ మహజలార్ణవమున బ్రహ్మదేవుడు, నీటిపై తేలియాడు పద్మమును మాత్రమే చూడగలిగెను గాని, ఎంత ప్రయత్నించినను ఆధారమైన నీ రూపమును మాత్రము కనుగొనలేకపోయెను. నిస్సహయస్థితిలో పద్మముపై ఆసీనుడైన ‘ బ్రహ్మదేవుడు՚, ఆ పద్మమునకు మరియు తన ఉనికికి కారణమైన రూపము ఏదియొ తెలియక చింతాక్రాంతుడయ్యెను.

9-3-శ్లో.
ఆముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవేత్
ఇతి స్మ కృతనిశ్చయః స ఖలు నాళరంధ్రాధ్వనా।
స్వయోగబలవిద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీః
త్వదీయమతిమోహనం న తు కళేబరం దృష్టవాన్||
ఆ పద్మమునకు మరియు తన ఆవిర్బవమునకు కారణమైన రూపము తప్పక ఉండవలయునని నిశ్చయుంచుకొనిన బ్రహ్మ, ఆ పద్మనాళరంధ్ర మార్గమున తన యోగజ్ఞాన శక్తి నైపుణ్యముతో ప్రవేశించెను. అట్లు ప్రవేశించియు బ్రహ్మదేవుడు అత్యంత మనోహహరమైన నీ రూపమును మాత్రము దర్శించలేకపోయెను.

9-4-శ్లో.
తతః సకల నాళికావివరమార్గగో మార్గయన్
ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్।
నివృత్య కమలోదరే సుఖనిషణ్ణ ఏకాగ్రధీః
సమాధిబలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ||
అట్లు, బ్రహ్మదేవుడు, ఆ పద్మనాళమునకు గల అన్ని రంధ్రమార్గములను నూరు సంవత్సరముల కాలము అన్వేషించియు ఎవనినీ కానలేక పోయెన. అప్పుడు పద్మజుడు వెనుకకు మరలివచ్చి, పద్మముపై సుఖాసీనుడై ఏకాగ్రచిత్తముతో నీ అనుగ్రహము కొఱకు ధృఢ సమాధి యోగమును ఆశ్రయించెను.

9-5-శ్లో.
శతేన పరివత్సరైర్ధృఢసమాధిబంధోల్లసత్-
ప్రబోధ విశదీకృతః స ఖలు పద్మినీ సంభవః।
అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా
వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగ భాగాశ్రయమ్||
నూరు దివ్యసంవత్సరముల కాలము ధృఢ సమాధి యోగ స్థితి యందు ఉన్న బ్రహ్మదేవుడు, జ్ఞానము వికసించినవాడై - ఇంతకు ముందు తనకు కానరానిది, అద్భుతమైనది మరియు శేషతల్పము పై పవళించి యున్న నీ దివ్యమంగళ రూపమును తన అంతఃర్ దృష్టితో దర్శించి సంతోష భరితుడయ్యెను.

9-6-శ్లో.
కిరీటమకుటోల్లసత్కటకహారకేయూరయుఙ్
మణిస్ఫురితమేఖలం సుపరివీతపీతాంబరం।
కళాయకుసుమప్రభం గళతలోల్లసత్కౌస్తుభం
వపుస్తదయి! భావయే కమలజన్మనే దర్శితమ్||
దేదీప్యమానమైన కిరీటము, భుజకీర్తులు, కడియములు, హారములు, మణిఖచిత మొలనూలు, కంఠమున ప్రకాశించు కౌస్తుభమణి, పసిడివర్ణశోభితమైన పీతాంబరమును ధరించి, నీలికలువ పూల కాంతితో ప్రకాశించు నీ రూపమును బ్రహ్మదేవుడు దర్శించెను. అట్టి నీ అద్వితీయ రూపమును నేనును భావనచేసి ధ్యానింతును.

9-7-శ్లో.
శ్రుతి ప్రకరదర్శిత ప్రచురవైభవ! శ్రీపతే!
హరే! జయజయప్రభో! పదముపైషి దిష్ట్యా దృశోః।
కురుష్వ ధియమాశు మే భువననిర్మితౌ కర్మఠాం
ఇతి ద్రుహిణవర్ణితస్వగుణబృంహిమా పాహిమామ్||
"నా అదృష్టవశమున నిన్ను దర్శించితిని. నన్ను అనుగ్రహించి విశ్వమును సృష్టించు జ్ఞానమును, శక్తిని నాకు ప్రసాదింపుము " అని పలికి, బ్రహ్మదేవుడు నీ గుణములను, మహిమలను కీర్తించెను. అట్లు బ్రహ్మ చేతను, వేదముల చేతను కీర్తింపబడిన ఓ హరీ! నన్ను రక్షింపుము.

9-8-శ్లో.
“లభస్వ భువనత్రయీరచనదక్షతామక్షతాం
గృహాణ మదనుగ్రహం కురుతపశ్చ భూయోవిధే!
భవత్వఖిలసాధనీ మయి చ భక్తిరత్యుత్కటే”
త్యుదీర్య గిరమాదధా ముదితచేతసం వేధసం||
బ్రహ్మతో - “నా అనుగ్రహమున త్రిలోకములను సృష్టించు సమర్ధత; అక్షయ మగు జ్ఞానశక్తి నీకు లభించగలదు. ఓ విధీ! సకల కార్య సిద్ధకై అత్యంత భక్తితో తపస్సు చేయుము", అని పలికి, బ్రహ్మదేవుని హృదయమునకు నీవు సంతోషమును కలుగజేసితివి.

9-9-శ్లో.
శతం కృతతపాస్తతః స ఖలు దివ్యసంవత్సరాన్
అవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికమ్।
ఉదీక్ష్య కిల కంపితం పయసి పంకజం వాయునా
భవద్బలవిజృంభితః పవనపాథసీ పీతవాన్||
నూరు దివ్యసంవత్సరములు తపస్సుచేసి; బ్రహ్మదేవుడు పూర్వముకన్నా అధికమైన జ్ఞానశక్తిని పొందెను. ‘బ్రహ్మ‘ తనకు ఆశ్రయమైన పద్మము వాయువువలన కంపించుట చూచి, తన తపోబలముతో విజృంభించి ఆ వాయువును, పద్మము చుట్టూ ఆవరించి యున్న జలమును పూర్తిగా త్రాగివేసెను.

9-10-శ్లో.
తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ సః
ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజానిర్మితౌ ।
తథావిధకృపాభరో గురుమరుత్పురాధీశ్వరా!
త్వమాశు పరిపాహి మాం గురుదయోక్షితైరీక్షితైః||
నీ అనుగ్రహముచే, బ్రహ్మ, ఆ పద్మమునుండి భువనత్రయములను సృష్టించి; పిదప, జీవ సృష్టి యందు తన దృష్టిని నిలిపెను. దయానిధీ! గురవాయూరు పురాధీశా! నీ దయార్ధ్రదృష్టిని నాపై ప్రసరింపజేసి నన్ను రక్షింపుము.

తృతీయ స్కంధము
9వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 10:39, 8 మార్చి 2018 (UTC)