నారాయణీయము/తృతీయ స్కంధము/10వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము

10వ దశకము - సృష్టి బేధ వర్ణనము

10-1-శ్లో.
వైకుంఠః వర్దితబలో౾ర్థ భవత్ప్రసాదాత్
అంభోజయోనిరసృజత్ కిల జీవదేహాన్।
స్థాస్నూని భూరుహమయాణి తథా తిరశ్చాం
జాతిర్మనుష్యనివహానపి దేవభేదాన్||
1వ భావము.
వైకుంఠ వాసా! నీ అనుగ్రహము వలన లభించి వృద్ధి చెందిన శక్తిచే పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు, భూమి నుండి జన్మించి స్ధిరముగా ఒకే ప్రదేశమున నిలిచి యుండు వృక్షములను (స్థావరములు), ఆహారాది విషయము లందు మాత్రమే జ్ఞానము కలిగిన జంతువులను (తిర్యక్ ప్రాణులు), మానవ సమూహములను మరియు దేవతల యెక్క సృష్టిని ఆరంభించెను.

10-2-శ్లో.
మిథ్యాగ్రహాస్మి మతిరాగవికోపభీతిః
అజ్ఞానవృత్తిమితి పంచవిధాం స సృష్ట్వా।
ఉద్దామతామసపదార్థవిధానదూనః
తేనే త్వదీయచరణస్మరణం విశుద్ధైః||
2వ భావము.
అంతట బ్రహ్మదేవుడు- అజ్ఞానముచే కలుగు ఐదు అంశములను సృష్టించెను. అవి: 1. మిధ్యాగ్రహము (సత్యమును గ్రహించలేక అసత్యమును సత్యమని భ్రమించుట) 2. అస్మిమతి (నేను అను భావన, అహంభావము) 3. రాగము (ప్రీతి, ఇష్టము) 4. వికోపము (కోపము) 5. భీతి (భయము). అట్టి తమోగుణ ప్రధానమైన అంశములను సృష్టించినందులకు తదువరి విచారించిన వాడై, ఆ పాప విముక్తి కొరకు బ్రహ్మ, నీ చరణములను ఆశ్రయించెను.

10-3-శ్లో.
తావత్ ససర్జ మనసా సనకం సనందం
భూయస్సనాతనమునిం చ సనత్కుమారమ్।
తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానాః
త్వత్పాదభక్తిరసికా జగృహుర్న వాణీమ్||
3వ భావము.
ఆ పిమ్మట, బ్రహ్మ, భగవద్ధ్యానపూరితమైన మనస్సుతో సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు అను మునులను సృష్టించి - ప్రజలను సృజించ మని వారిని నియోగించెను. కాని, వారు భక్తిపారవశ్యముతో నీ పాదములను సేవించుట యందు నిమగ్నులై, ‘లోక సృష్టి చేయుడని’ పలికిన బ్రహ్మ వాక్కులకు స్పందించలేదు.

10-4-శ్లో.
తావత్ ప్రకోపముదితం ప్రతిరుంధతో౾స్య
భ్రూమధ్యతో౾జని మృడో భవదేకదేశః।
“నామాని మే కురు పదాని చ హా విరించే”
త్యాదౌ రురోద కిల తేన స రుద్ర నామా||
4వ భావము.
తన వాక్కులను నిరాదరించిన తన మానస పుత్రులపై కలిగిన ఆగ్రహమును అణచుకొనుటచే, అప్పుడు బ్రహ్మదేవుని కనుబొమల మధ్య నుండి నీ అంశముతో 'మృడుడు' జనించెను. ఆ 'మృడుడు’ ప్రభవించిన మరుక్షణమే తనకు నామములను, స్ధానములను కల్పించమని రోదించెను. ఆ విధముగా రోదించిన మృడునికి ‘రుద్రుడు՚ అను నామము కలిగెను.

10-5-శ్లో.
ఏకాదశాహ్వయతయా చ విభిన్నరూపం
రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్త్వా।
తావంత్యదత్త చ పదాని భవత్ర్ర్పణున్నః
ప్రాహ ప్రజావిరచనాయ చ సాదరం తమ్||
5వ భావము.
బ్రహ్మదేవుడు ఆ రుద్రునికి పదకొండు రూపములను, పదకొండు నామములను కల్పించెను. ఆ పదకొండు రూపములకు పదకొండుగురు స్త్రీలను (పత్నులను), పదకొండు స్థానములను ఇచ్చెను. పిమ్మట, ప్రజలను సృష్టించమని ఆదరముతో పలికి, వారిని లోకసృష్టి కార్యమున నియమించెను.

10-6-శ్లో.
రుద్రాభిసృష్టభయదాకృతిరుద్ర సంఘ
సంపూర్యమాణు భువనత్రయ భీతచేతాః
“మా మా ప్రజాః సృజ తపశ్చర మంగళాయే”
త్యాచష్ట తం కమలభూర్భవదీరితాత్మా||
6వ భావము.
రుద్రుడు భయంకరాకృతి కలిగిన ప్రాణులను సృష్టించుట ప్రారంభించెను. త్రిలోకములు ఆ భయంకర ప్రాణులచే నిండిపోవుచుండగా బ్రహ్మదేవుడు భీతిచెందెను. నీ ప్రేరణచే బ్రహ్మ, రుద్రునితో “నీవు ప్రాణులను సృష్టించవలదు. లోకమునకు శుభము కలుగించు తపస్సు ఆచరించుము“ అని పలికెను.

10-7-శ్లో.
తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిః
తత్రాంగిరాః క్రతుమునిః పులహః పులస్య్తః।
అంగాదజాయత భృగుశ్చ వశిష్ఠ దక్షౌ
శ్రీనారదశ్చ భగవన్ భవదంఘ్రిదాసః||
7వ భావము.
పిమ్మట, సృష్టి యందు ఆసక్తి చే బ్రహ్మ- మరీచి, ఆత్రి, అంగిరుడు, క్రతుముని, పులవుడు, పులస్త్యడు, భృగువు, వశిష్టుడు, దక్షుడు మరియు నారదులను తన నుండి సృష్టించెను. వారిలో నారదుడు నీ పాదపద్మములకు దాసుడు.

10-8-శ్లో.
ధర్మాదికానభిసృజన్నథ కర్దమం చ
వాణీం విధాయ విధిరంగజసంకులో౾భూత్।
త్వద్బోధితైస్సనకదక్షముఖైస్తనూజైః
ఉద్బోధితశ్చ విరరామ తమో విముంచన్||
8వ భావము.
అనంతరము ధర్మాధి దేవతలను, కర్ధముడుని సృష్టించెను. సరస్వతిని తానే సృష్టించినను ఆమెపై బ్రహ్మదేవునికి మోహము కలిగెను. అప్పుడు; నీచే ప్రేరేపింపబడిన సనకుడు, దక్షుడు మెుదలగు తన కుమారుల ఉద్భోదతో, బ్రహ్మ, అజ్ఞాన ప్రేరితమైన తమోగుణ ప్రవృత్తిని వదిలి వేసెను.

10-9-శ్లో.
వేదాన్ పురాణనివహానపి సర్వవిద్యాః
కుర్వన్ నిజాననగణాచ్చతురాననో౾సౌ
పుత్రేషు తేషు వినిధాయ స సర్గవృద్దిమ్
అప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితో౾భూత్||
9వ భావము.
బ్రహ్మదేవుడు, లోకసృష్టిచేయు కార్యమునుండి రుద్రుని విరమింపజేసి, తన మానస పుత్రులను లోకసృష్టికి నియమింపవలయునని తలచి, తన నాలుగు ముఖముల నుండి సకలవేదములను, సకలపురాణములను, సకలవిద్యలను వెలువరించెను. అట్లు వెలువడిన వేదజ్ఞానరాశిని తన మానస పుత్రులకు అందజేసెను. అయినను లోకమున ప్రజాసృష్టి జరగలేదు. అంతట బ్రహ్మ, నీ పాదపద్మములను ఆశ్రయించెను.

10-10-శ్లో.
జానన్నుపాయమథ దేహమజో విభజ్య
స్త్రీపుంసభావమభజన్మను తద్వధూభ్యామ్।
తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం
గోవింద! మారుతపురాధీప! రుంధిరోగాన్.||
10వ భావము.
గోవిందా! నీ ప్రేరణచే బ్రహ్మ, తన దేహమును రెండుగా విభజించి, ఒక భాగమునుండి పురుషుని, మరియెక భాగమునుండి స్త్రీని అవతరింప జేసెను. ఆ విధముగా మనువు, అతని పత్ని మరియు వారివలన సకల మానవజాతి నీ వలననే వృద్ధి పొందెను. గురవాయూరు పురాధీశా! మానవావతరణకు కారణమైన నిన్ను నావ్యాధిని కూడా నివారించమని ప్రార్దించు చున్నాను.

తృతీయ స్కంధము
10వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 10:40, 8 మార్చి 2018 (UTC)