Jump to content

నారాయణీయము/అష్టమ స్కంధము/29వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
అష్టమ స్కంధము

29 – దశకము - మోహినీ అవతారము వర్ణనం

29-1-శ్లో.
ఉద్గచ్ఛతస్తవ కరాదమృతం హరత్సు
దైత్యేషు తానశరణాననునీయ దేవాన్।
సద్యస్తిరోదధిథ దేవ।భవత్ప్రభావాత్
ఉద్యత్స్వయూథ్య కలహా దితీజా బభూవుః॥
1వ భావము:-
'ధన్వంతరి' రూపమున, నారాయణమూర్తీ! నీవు అమృత కలశమును చేతబట్టి (పాలసముద్ర గర్భమునుండి) వెలుపలకు వచ్చుచుండగా అసురులు, ఆ అమృత కలశమును లాగుకొని పోయిరి. నిస్సహాయులైన దేవతలు నిన్ను శరణుజొచ్చిరి. నీవు వారిని అనునయించి, తక్షణమే అంతర్ధానమైతివి. అసురులు (నీ ప్రభావమున) అమృతము కొరకు వారిలోవారు కలహించుకొనసాగిరి.

29-2-శ్లో.
శ్యామాం రుచా౾పి వయసా౾పి తనుం తదానీం
ప్రాప్తో౾సి తుంగకుచమండలభంగురాం త్వమ్।
పీయూషకుంభకలహం పరిముచ్య సర్వే
తృష్ణాకులాః ప్రతియయుస్త్వదురోజకుంభే॥
2వ భావము:-
(అసురులు అట్లు కలహించుకొనుచుండగా) ప్రభూ! నారాయణమూర్తీ! నీవు (క్షణకాలముననే) ధగద్ధగీయ మగు శరీరకాంతితో, యవ్వనవతియగు స్త్రీరూపమును ధరించి అచ్చటకు వచ్చితివి. ఆ అసురుల దృష్టి అంతయూ అప్పుడు, 'జగన్మోహినీ' రూపమున ఉన్న నీ వక్షస్ధల సౌందర్యమువైపునకు మరలెను.

29-3-శ్లో.
కా త్వం మృగాక్షీ౾విభజస్వ సుధామిమామి-
త్యా రూఢరాగవివశనాభియాచతో౾మూన్।
విశ్వస్యతే మయి కథం కులటా౾స్మి దైత్యాః
ఇత్యాలసన్నపి సువిశ్వసితానతానీః॥
3వ భావము:-
ప్రభూ! నారాయణమూర్తీ! నీ 'జగన్మోహినీ' రూపమునకు వివసులై అసురులు నీతో ఇట్లనిరి. “ఓ మృగాక్షీ! నీపట్ల మేము అనురక్తులమైతిమి - ఈ అమృతమును మాకు సమముగా పంచి యిమ్ము”, అని పదేపదే నిన్ను ప్రాధేయపడసాగిరి. అప్పుడు దానవులతో నీవు “నేనసలే కులటను - నన్నెట్లువిశ్వసింతురు?” అని విలాసముగా పలికి, ఆ అసురులు నిన్ను మరింత విశ్వసించునట్లు చేసుకొంటివి.

29-4-శ్లో.
మోదాత్సుధా కలశమేషు దదత్సు సా త్వం
దుశ్చేష్టితం మమ సహధ్వమితి బ్రువాణా।
పంక్తిప్రభేదవినివేశితదేవదైత్యా
లీలావిలాసగతిభిః సమదాస్సుధాం తామ్॥
4వ భావము:-
ప్రభూ! ఆ అసురులు నీ మోహినీ రూపమునకు దాసులై నిన్ను పూర్తిగా విశ్వసించి - ఆ అమృత కలశమును నీకు ఇచ్చిరి. “ఈ అమృతమును సురాసు రులిరువురికి సమముగా పంచెదను, అట్లుపంచుటలో లోపమేమైన జరిగినను నన్ను సహించి మన్నించవలె"- అని వినయముగా పలికితివి. దానికి అసురులు అంగీకరించగా - నీవు దేవదానవులను (ఇరుపంక్తులలో) వేర్వేరుగా ఆసీనులను చేసి, అమృతమును (దేవతల నుండి) పంచుట ప్రారంభించితివి.

29-5-శ్లో.
అస్మాస్వియం ప్రణయినీత్యసురేషు తేషు
జోషం స్థితేష్వథ సమాప్య సుధాం సురేషు।
త్వం భక్తలోకవశగో నిజరూపమేత్య
స్వర్భానుమర్దపరిపీతసుధం వ్యలావీః॥
5వ భావము:-
మోహిని తమయందే పూర్తిగా అనురక్తయై ఉన్నదని నమ్మిన దానవులు (తమ వంతుకై ఎదురుచూచుచూ) మౌనముగా వేచియుండిరి. ప్రభూ! అమృతమునంతయూ నీవు సురులకే పంచివేయసాగితివి. అసురులకు పంచలేదు. అసురులలోని, 'రాహువు' మాత్రము, దేవతల పంక్తిలో కూర్చుని అమృతమును గ్రహించసాగెను. ప్రభూ! అది గమనించిన నీవు, చక్రాయుధముతో ఆ రాహువు శిరస్సును ఖండించి, తక్షణమే నీ స్వస్వరూపమును పొందితివి.

29-6-శ్లో.
త్వత్తస్సుధాహరణయోగ్యఫలం పరేషు
దత్త్వాగతే త్వయి సురైః ఖలు తే వ్యగృహ్ణన్।
ఘోరే౾థ మూర్ఛతి రణే బలిదైత్యమాయా-
వ్యామోహితే సురగణే త్వమిహవిరాసీః॥
6వ భావము:-
ప్రభూ! నీ హస్తమునుండి అమృతభాండమును అపహరించిన, ఆ అసురులకు వారికి తగిన ప్రతిఫలమును ఇచ్చి (అమృతము దక్కనీయక) నీవు నిష్క్రమించితివి. నీవట్లు నిష్క్రమించగా, అసురులు దేవతలతో యుద్ధమునకు దిగిరి. ఆ ఘోరయుద్ధమున అసురుల చక్రవర్తియగు 'బలి' - 'మాయను' పుట్టించి, దేవతలనెల్లరను మూర్చితులను చేసెను; దేవతలు నిస్తేజస్కులయిరి. ప్రభూ! నారాయణమూర్తీ! అప్పుడు నీవు మరల ప్రత్యక్షమయితివి.

29-7-శ్లో.
త్వంకాలనేమిమథ మాలిముఖాఞ్జ ఘంత్థ
శక్రో జఘాన బలిజంభబలాన్ సపాకాన్।
శుష్కార్ధ్రదుష్కరవధే నముచౌ చ లూనే
ఫేనేన నారదగిరా న్యరుణో రణం తమ్॥
7వ భావము:-
ప్రభూ! ఆ ఘోరయుద్ధమున, నీవు 'కాలనేమి', 'మాలి' అను ఘోర రాక్షసులను వధించితివి. 'బలి, జంభాసురుడు, వలుడు, పాకుడు' మొదలగు రాక్షసులను - ' ఇంద్రుడు' వధించెను. 'నముచి' అను అసురుడు -' తడి' ఆయుధముతోగాని, 'పొడి' ఆయుధముచేతగాని తనకు మరణము వాటిల్లకుండు నట్లు వరమును పొందియుండెను. అది తెలుసుకొనిన 'ఇంద్రుడు' జలఫేనము (నీటి నురుగు) ప్రయోగించి, 'నముచి'ని హతమార్చెను. అప్పుడు 'నారదమహర్షి' చేసిన ఉపదేశముతో ఇరుపక్షములు యుద్ధమును విరమించిరి.

29-8-శ్లో.
యోషావపుర్దనుజమోహనమాహితం తే
శ్రుత్వా విలోకనకుతూహలవాన్ మహేశః।
భూతైస్సమం గిరిజయా చ గతః పదంతే
స్తుత్వా౾బ్రవీదభిమతం త్వమథో తిరోధాః॥
8వ భావము:-
ప్రభూ! నారాయణమూర్తీ! అమృతకలశమునుండి దానవుల దృష్టిని మరల్చుటకే నీవు 'మోహినీ' రూపమును ధరించితివి. అట్టి నీ అద్భుత రూపముగురించి వినిన 'పరమశివునికి' నీ మోహినీ రూపము చూడవలెననెడి ఆసక్తి గలిగెను. తోడనే శివుడు తన పరివారముతో - గిరిజాసమేతముగా నీవద్దకు వచ్చి నిన్ను స్తోత్రములతో కీర్తించెను. నీ మోహినీరూపమును చూడవలెననెడి తన కోరికను వెల్లడించగా నీవు అంతర్ధానమయితివి.

29-9-శ్లో.
ఆరామసీమని చ కందుకఘాతలీలా-
లోలాయమాననయనాం కమనీం మనోజ్ఞామ్।
త్వామేష వీక్ష్య విగలద్వసనాం మనోభూ-
వేగాదనంగరిపురంగ। సమాలిలింగ॥
9వ భావము:-
ప్రభూ! అప్పుడు నీవు మోహినీ రూపము ధరించి అచ్చట ఉద్యానవనమున బంతిని ఎగురవేయుచు - చంచలదృక్కులతో కన్నులనటునిటు త్రిప్పుచు మనోహర రూపమున - శివునికి కనిపించితివి. ఆ ముగ్ధమనోహర రూపమును చూచి – మన్మధునినే దహించిన శివుడు, నీ మోహినీ రూపమునకు ఆకర్షితుడై , ఆర్తిగా నిన్ను ఆలింగనము చేసుకొనెను.

29-10-శ్లో.
భూయోఖీపి విద్రుతవతీముపధావ్య దేవో
వీర్య ప్రమోక్ష వికసత్పరమార్థబోధః।
త్వన్మానితస్తవ మహత్వ్తమువాచ దేవ్యై
తత్తాదృశస్త్వమవ వాతనికేతనాథ!॥
10వ భావము:-
ప్రభూ! నారాయణమూర్తీ! నీవు మహేశ్వరుని నుండి తప్పించుకొని పరుగిడసాగితివి. శివుడు నిన్ను వెంబడింపసాగెను. అప్పుడు ఆ పరమశివునికి భావప్రాప్తి కలిగెను. వెనువెంటనే మహేశ్వరునికి వాస్తవము ఎరుకకు వచ్చెను; పరమార్థజ్ఞానము కలిగెను. నీవు శివుని గౌరవించితివి. శివుడు తన పత్నియగు పార్వతీదేవికి నీ మహత్యమును తెలిపెను. అట్టి మహిమాన్వితుడవగు గురవాయూరుపురవాసా! నా రోగమునుండి నన్ను రక్షింపుము.

అష్టమ స్కంధము
29వ దశకము సమాప్తము.
-x-
 

Lalitha53 (చర్చ) 16:20, 9 మార్చి 2018 (UTC)