నారాయణీయము/అష్టమ స్కంధము/30వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

||శ్రీమన్నారాయణీయము||
అష్టమ స్కంధము

30వ దశకము - వామనావతారము వర్ణనం

30-1-శ్లో.
శక్రేణ సంయతి హతో౾పి బలిర్మహాత్మా
శుక్రేణ జీవితతనుః క్రతువర్ధితోష్మా।
విక్రాంతిమాన్ భయనిలీనసురాం త్రిలోకీం
చక్రే వశే స తవ చక్రముఖాదభీతః॥
1వ భా:వము:-
దేవా! మహాత్ముడగు 'బలిచక్రవర్తి' దేవదానవయుద్ధమున ఇంద్రుని చేతిలో నిహతుడైనను - దైత్యులకు గురువగు శుక్రాచార్యునిచే పునర్జీవితుడయ్యెను. అట్లు పునర్జీవితుడయిన 'బలి' అనేక క్రతువులు చేసి మరింత శక్తిమంతుడయ్యెను. ప్రభూ! నీ సుదర్శనచక్రమునకుకూడా వెరువనంత బలాఢ్యుడై - బలి త్రిలోకములను వశపరచుకొనెను. బలి పరాక్రమమునకు భయపడి దేవతలు దాగుకొనిరి.


30-2-శ్లో.
పుత్రార్తిదర్శనవశాదదితిర్విషణ్ణా
తం కాశ్యపం నిజపతిం శరణం ప్రపన్నా।
త్వత్పూజనం తదుదితం హి పయోవ్రతాఖ్యం
సా ద్వాదశాహమచరత్ త్వయి భక్తిపూర్ణా॥
2వ భా:వము:-
బలిచక్రవర్తికి భయపడి దేవలోకమును వీడిన దేవతల దుస్థితిని చూచి వారి తల్లియగు 'అదితి' మిక్కిలి వ్యధచెందెను. వారిక్షేమముగోరి ఆమె తన భర్తయగు 'కశ్యప మహామునిని' ప్రార్ధించెను. ప్రభూ! నారాయణమూర్తీ! కశ్యపమహర్షి ఆమెను 'పయోవ్రతమును' భక్తితో ఆచరించి నిన్ను పూజించమని ఆదేశించెను. 'అదితి' సంపూర్ణభక్తితో పండ్రెండు దినములు ఆ వ్రతమును ఆచరించి నిన్ను పూజించెను.

30-3-శ్లో.
తస్యా వధౌ త్వయి నిలీనమతేరముష్యాః।
శ్యామశ్చతుర్బుజవపుః స్వయమావిరాసీః।
నమ్రాం చ తామిహ భవత్తనయో భవేయం
గోప్యం మదీక్షణమితి ప్రలపన్నయాసీః।
3వ భా:వము:-
'అదితి' తనచిత్తమును నీయందేనిలిపి వ్రతమాచరించి, తన పూజను ఆచరించగనే, ప్రభూ! నారాయణమూర్తీ! నీవు - నీలవర్ణముతో, చతుర్భుజములతో ప్రకాశించు రూపమున ఆమెకు ప్రత్యక్షమయితివి. 'అదితి' నీకు వినమ్రముగా నమస్కరించెను. నీవు సాక్షాత్కరించిన విషయము ఎవరికీ తెలపవలదనియు, ఆమెకు (అదితికి) నీవే పుత్రునిగా జన్మింతువనియు తెలిపి; అంతర్ధానమైతివి.

30-4-శ్లో.
త్వం కాశ్యపే తపసి సన్నిదధత్ తదానీం
ప్రాప్తో౾సి గర్భమదితేః ప్రణుతో విధాత్రా।
ప్రాసూత చ ప్రకటవైష్ణవదివ్యరూపం
సా ద్వాదశీశ్రవణ పుణ్యదినే భవంతమ్॥
4వ భా:వము:-
ప్రథమముగా నీవు తాపసి అయిన కశ్యపునియందు నీ తేజస్సు రూపొందించి, 'అదితి' గర్భమున ప్రవేశించితివి. అప్పుడు బ్రహ్మదేముడు నిన్ను స్తుతించెను. వైష్ణవ చిహ్నములు కలిగిన దివ్యరూపముతో, ప్రభూ! నారాయణమూర్తీ! నీవు శ్రవణ ద్వాదశి (శ్రవణద్వాదశి అంటే శ్రవణ నక్షత్ర యుక్తమైన భాద్రపద శుద్ధ ద్వాదశి) పుణ్యదినమున - 'అదితి' గర్భమున జన్మించితివి.

30-5-శ్లో.
పుణ్యాశ్రమం తమభివర్షతి పుష్పవర్షైః
హర్షాకులే సురకులే కృతతూర్యఘోషే।
బద్ద్వాంజలిం జయజయేతి నుతః పితృభ్యాం
త్వం తత్ క్షణే పటుతమం వటురూపమాధాః॥
5వ భా:వము:-
ప్రభూ! ఆ పుణ్యదినమున పుణ్యప్రదేశమగు కశ్యపుని ఆశ్రమమున నీవు జన్మించినప్పుడు, దేవతలు పుష్పవృష్టిని కురిపించిరి; ఆనందముతో దుంధుభులు మ్రోగించిరి; చేతులు జోడించి నీ తల్లితండ్రులు అదితి కశ్యపులు నిన్ను స్తుతించిరి. తక్షణమే నీవు మిక్కిలి పటుత్వముగల వటువు (బ్రహ్మచారి) రూపమును ధరించితివి.

30-6-శ్లో.
తావత్ప్రజాపతిముఖైరుపనీయ మౌంజీ-
దండాజినాక్షవలయాదిభిరర్చ్యమానః।
దేదీప్యమానవపురీశ కృతాగ్నికార్యః
త్వం ప్రాస్థిథా బలిగృహం ప్రకృతాశ్వమేధమ్॥
6వ భా:వము:-
అప్పుడు, కశ్యప ప్రజాపతి మొదలగువారు నీకు ఉపనయనము జరిపిరి; మౌంజి (ముంజ ధర్భలతో చేసిన మొలత్రాడు), దండ కమండలములు, కృష్ణాజినము (జింకచర్మ ఆసనము) మరియు జపమాలను నీకు ఇచ్చిరి. నీవు వాటిని ధరించి - దేదీప్యరూపముతో - బ్రహ్మచారివియై అగ్నికార్యమును నెరవేర్చితివి. ప్రభూ! అంతట నీవు "వామనావతారమున" - అశ్వమేధయాగము చేయుచున్న 'బలిచక్రవర్తి' గృహమునకు వెళ్ళుటకై ఆ ప్రదేశమును విడిచితివి.

30-7-శ్లో.
గాత్రేణ భావిమహిమోచితగౌరవం ప్రాక్
వ్యావృణ్వతేవ ధరణీం చలయన్నయాసీః।
ఛత్రం పరోష్మతిరణార్ధమివాదధానో
దండం చ దానవజనేష్వివ సన్నిధాతుమ్॥
7వ భా:వము:-
ప్రభూ! నారాయణమూర్తీ! 'వామనావతారమున' వటువుగా ప్రకాశించుచున్న నీ దివ్యమంగళరూపము - కాగలకార్యమును సూచించుచుండెను. నీవట్లు నడిచివెళ్ళుచుండగా నీపరాక్రమము ప్రకటించుచున్నదా అనునట్లు భూమికంపించసాగెను. నీశిరసున ధరించిన ఛత్రము - శత్రుపరాక్రమ తాపమును (వేడిని) నిలవరించుచున్నట్లును, నీ చేతనున్న దండము దానవులను దండించుటకే అనునట్లును - నీరూపము ప్రజ్వరిల్లుచుండెను.

30-8-శ్లో.
తాం నర్మదోత్తరతటే హయమేధశాలాం
ఆసేదుషి త్వయి రుచా తవ రుద్ధనేత్రైః
భాస్వాన్ కిమేష దహనో ను సనత్కుమారో
యోగీ ను కో౾ యమితి శుక్రముఖైః శశంకే॥
8వ భా:వము:-
నర్మదానదికి ఉత్తరతీరమున 'బలిచక్రవర్తి' అశ్వమేధయాగమును నిర్వహించుచుండెను. ప్రభూ! వామనమూర్తీ! ఆ యాగశాలను నీవు నమీపించుచుండగా 'శుక్రుడు' మొదలగు వారు నిన్ను చూచిరి. నీదివ్యతేజస్సుకు వారి కన్నులు మిరిమిట్లుగొలిపెను. ఈ బ్రహ్మచారి ' సూర్యుడో! అగ్నియో! లేక సనత్కుమార యోగియో!' - 'యజ్ఞ సందర్శనార్ధము వచ్చుచుండెనా!' అని సందేహింపసాగిరి.

30-9-శ్లో.
ఆనీతమాశు భృగు భిర్మహాసాభిభూతైః
త్వాం రమ్యరూపమసురః పులకావృతాంగః ।
భక్త్యా సమేత్య సుకృతీ పరిషిచ్య పాదౌ
తత్తోయమన్వధృత మూర్ధని తీర్ధతీర్ధమ్॥
9వ భా:వము:-
ప్రభూ! అట్లువచ్చుచున్న నీ దివ్యరూపమును చూచి - శుక్రుడు మొదలగువారు ఆశ్చర్యచకితులై, నిన్ను బలిచక్రవర్తి వద్దకు తోడ్కొని వెళ్ళిరి. 'వామనావతారమున' ఉన్న ఓ! నారాయణమూర్తీ! నిన్ను చూచిన 'బలి' పులకాంకితుడై భక్తితో నిన్ను సమీపించెను. అనేక సుకృతములను చేసిన ఆ చక్రవర్తి నీ పాదములను కడిగి, సకలతీర్థములకు మించిన ఆ ఉదకమును తన శిరస్సున ధరించెను.

30-10-శ్లో.
ప్రహ్లాదవంశజతయా క్రతుభిర్ద్విజేషు
విశ్వాసతో ను తదిదం దితిజో౾పి లేభే।
యత్తే పదాంబు గిరిశస్య శిరో౾భిలాల్యం
స త్వం విభో। గురుపురాలయ పాలయేథాః॥
10వ భా:వము:-
బలిచక్రవర్తి - ప్రహ్లాద వంశమున జన్మించినవాడు అగుటవలన కావచ్చును; అనేక క్రతువులను చేసినవాడగుట వలన కావచ్చును; లేదా విప్రులయెడ భక్తివిశ్వాసములు కలిగియుండుటవలన కావచ్చును; మరియే ఇతర కారణమో కావచ్చును, కాని, ప్రభూ! నారాయణమూర్తీ! 'బలి' దైత్యుడే అయిననూ - పరమశివుని శిరమును సహితము పావనము చేసిన నీ పాదోదకమును తనశిరస్సున ధరించునంతటి భాగ్యశాలి అయ్యెను. ఆహాః అంతటి మహిమాన్వితుడవయిన ఓ! గురవాయూరు పురాధీశా నన్ను రక్షింపుము.

అష్టమ స్కంధము
30వ దశకము సమాప్తము.
-x-