Jump to content

నారాయణీయము/అష్టమ స్కంధము/28వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
అష్టమ స్కంధము

28వ దశకము - లక్ష్మీస్వయంవరము వర్ణనం

28-1-శ్లో.
అమృతోత్పత్తి గరలం తరలానలం పురస్తాజ్జలధేరుద్విజగాల కాలకూటమ్।
అమరస్తుతివాదమోదనిఘ్నో గిరిశస్తన్నిపపౌ భవత్ప్రియార్థమ్॥
1వ భావము:-
దేవదానవులు మధించుచున్న క్షీరసాగరమునుండి ప్రప్రథమముగా బడబానలము ఆవిర్భవించి- 'కాలకూటవిషము' వెలువడెను. అప్పుడు (భీతిల్లిన) దేవతలు పరమశివుని (పరమేశ్వరుడు మాత్రమే ఆ గరళమును గ్రహించగలడని తెలిసి) స్తోత్రములతో స్తుతించిరి. ప్రసన్నడైన శివుడు ఆగరళమును స్వీకరించి, ప్రభూ! నీకు ఆనందము కలిగించెను.

28-2-శ్లో.
విమథత్సు సురాసురేషు జాతా సురభిస్తామృపిషు న్యధాస్త్రిధామన్।
హయరత్నమభూదథేభరత్నం ద్యుతరుశ్చాప్సరసః సురేషుతాని॥
2వ భావము:-
త్రిధామా! భగవాన్! దేవదానవులట్లు క్షీరసాగరము మధించుచుండగా 'సురభి' అను కామధేనువు పుట్టెను. ఆ గోరత్నమును నీవు ఋషులకు అనుగ్రహించితివి. ఆ తరువాత వచ్చిన 'ఉచ్చైఃశ్రవము' అను అశ్వమును, కల్పవృక్షమును మరియు అప్సరసలను - నీవు దేవతలకు ఇచ్చితివి.

28-3-శ్లో.
జగదీశ భవత్పరా తదానీం కమనీయా కమలా బభూవ దేవి।
అమలామవలోక్య యాం విలోలః సకలో౾ పి స్ప్రుహయాంబభూవ లోకః
3వ భావము:-
జగదీశా! కమలాలయైన లక్ష్మీదేవి, పిమ్మట ఆ క్షీరసాగరమునుండి ఉద్భవించెను. ఆమె మిక్కిలి మనోహర రూపముతో ప్రకాశించుచుండెను. ఆమె నిర్మలరూపమును చూచి, దేవదానవులిరువురు ఆకర్షితులై, ఆమెను కోరుకొనుచుండిరి.

28-4-శ్లో.
త్వయి దత్తహృదే తదైవ దేవ్యై త్రిదశేంద్రో మణిపీఠికాం వ్యతారీత్।
సకలోపహృతాభిషేచనీయైః ఋషయస్తాం శ్రుతిగీర్భిరభ్యషించన్॥
4వ భావము:-
ప్రభూ! ఆ దేవదానవులట్లు లక్ష్మీదేవిని కోరుకొనుచుండిరి. కాని ఆమె తనహృదయమును నీకుమాత్రమే అర్పించెను. దేవేంద్రుడు ఆ దేవిని, మణి పీఠమున ఆసీనురాలినిచేయగా - దేవదానవులు సమర్పించిన ఉత్తమ అభిషేక ద్రవ్యములతోను, వేదవాక్కులతోను - ఋషులు ఆ లక్ష్మిదేవిని అభిషేకించిరి.

28-5-శ్లో.
అభిషేక జలానుపాతి ముగ్ధత్వదపాంగైరవ భూషితాంగవల్లీమ్।
మణికుండలపీతచేలహారప్రఖైస్తామమరదయో౾న్వ భూషన్॥
5వ భావము:-
నారాయణమూర్తీ! ఋషులట్లు లక్ష్మీదేవిని అభిషేకించుచుండగా, నీవు నీ ముగ్ధమనోహర వీక్షణములను ఆమెపై ప్రసరింపజేసితివి. దేవాంగనలు - పూలతీగనుబోలిన శరీరము కలిగిన ఆ లక్ష్మీదేవిని - మణికుండలములతోను, కంఠహారములతోను మరియు పీతాంబరముతోను అలంకరించిరి.

28-6-శ్లో.
వరణస్రజమాత్తభృంగనాదాం దధతీ సా కుచకుంభమందయానా।
పజశింజితమంజునూపురా త్వాం కలితవ్రీడవిలాసమాససాద॥
6వ భావము:-
పిమ్మట ఆ లక్ష్మీదేవి వరమాలను చేతబట్టి నడిచి వచ్చుచుండెను. అప్పుడు తుమ్మెదలు ఆ వరమాలను చుట్టుముట్టి ఝంకారము చేయసాగెను. కాలి అందియలు శ్రావ్యమయిన సున్నిత శబ్దము చేయుచుండగా - కుచభారముతో మందగమనయై ఆ లక్ష్మీదేవి - వయ్యారముగా నడచుకొని వచ్చి, ప్రభూ! నారాయణమూర్తీ ! నిన్ను సమీపించెను.

28-7-శ్లో.
గిరిశద్రుహిణాదిసర్వదేవాన్ గుణభాజో౾ప్యవిముక్తదోషలేశాన్|
అవమృశ్య సదైవ సర్వరమ్యే విహితా త్వయ్యా నయా౾పి దివ్యమాలా॥
7వ భావము:-
ప్రభూ! శివ, బ్రహ్మాది దేవతలు అందరు సద్గుణులే; అయిననూ వారికి లేశమాత్ర దోషమైనను ఉండి ఉండవచ్చును; కాని (గుణాతీతుడవైన) నీవు ఏదోషము లేని సకలసద్గుణ సంపన్నుడవు. అది ఎరిగిన లక్ష్మీదేవి, వారినందరిని వదిలి వరమాలను నీకే సమర్పించెను.

28-8-శ్లో.
ఉరసాతరసా మమానిథైనాం భువనానాం జననీమనన్య భావామ్।
త్వదురో విలసిత్తదీక్షణశ్రీపరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వమ్॥
8వ భావము:-
నారాయణమూర్తీ! ప్రభూ! అప్పుడు నీవు- నీయందే లగ్నమయిన మనస్సుతో నీదరిచేరిన ఆ జగన్మాతను తక్షణమే చేపట్టి నీ హృదయమున నిలుపుకొంటివి. నీవక్షస్థలమున నెలకొన్న ఆ లక్ష్మీదేవి తన కరుణాకటాక్షవీక్షణములతో ఈ విశ్వమంతటకూ సదా పుష్టిని కలిగించుచున్నది.

28-9-శ్లో.
అతిమోహనవిభ్రమా తదానీం మదయంతీ ఖిలువారుణీ నింగాత్।
తమసః పదవామదాస్త్వమేనామతిసమ్మాననయా మహాసురేభ్యః
9వ భావము:-
ప్రభూ! అతిమోహము, భ్రాంతి, మదము మొదలగు తమోగుణ ప్రధాతయగు 'వారుణీదేవి' ( మద్య దేవత) పిదప ఆ క్షీరసాగరమునుండి వెలుపలకు వచ్చెను. ఆమెను నీవు ఆదరముతో అసురులకు అనుగ్రహించితివి.

28-10-శ్లో.
తరుణాంబుదసుందరస్తదా త్వం నను ధన్వంతరిరుత్థితో౾అంబురాశేః
అమృతం కలశే వహాన్ కరాభ్యాం అఖిలార్తిం హర మారుతాలయేశా।
అష్టమమ స్కంధము
10వ భావము:-
ప్రభూ! నారాయణమూర్తీ! అనంతరము, తొలకరి మేఘమువలె నీవు అత్యంత సుందరరూపమున, నీ రెండు హస్తములతో అమృతకలశమును ధరించి "ధన్వంతరి" రూపమున క్షీరసాగరమునుండి వచ్చితివి. అట్టి గురవాయూరుపురాధీశా! నా సకలరోగములను హరించి రక్షింపుము - అని నిన్ను నేను ప్రార్ధించుచున్నాను.

28వ దశకము సమాప్తము.
-x-
 

Lalitha53 (చర్చ) 16:19, 9 మార్చి 2018 (UTC)