తెలుగు వాక్యం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ తెలుగు మహాసభ ప్రచురణ

తెలుగు వాక్యం

రచయిత

చేకూరి రామారావు

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి

కళాభవన్, సైఫాబాద్

హైదరాబాదు

ప్రపంచ తెలుగు మహాసభ ప్రచురణ

తెలుగు వాక్యం

రచయిత

చేకూరి రామారావు

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి

కళాభవన్, సైఫాబాద్

హైదరాబాదు

ప్రథమ ముద్రణ

1975

© ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ

హైదరాబాదు

మూల్యము రూ. 3_00

ముద్రణ: శివాజీ ప్రెస్, సికింద్రాబాదు

ముందుమాట

ఎన్నో ఏళ్ళుగా అనుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్న పర్వసమయం ఆసన్నమవుతున్నది. ప్రపంచంలోని తెలుగువారి ప్రతినిధు లందరిని ఒకచోట సమీకరించవలెనని పెద్దలందరూ కన్నకలలు ఫలిస్తున్న శుభసమయమిది. రాబోయే ఉగాది రెండువేల అయిదువందల సంవత్సరాల తెలుగు జాతి చరిత్రలో మరపురాని మధుర ఘట్టము కాగలదు.

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవాహన రాజుల కాలం నుండి తెలుగు ప్రజలకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. భారత దేశంలో తెలుగు మాట్లాడే ప్రజలు దాదాపు ఐదుకోట్లకు పైగా ఉన్నారు. హిందీ మాట్లాడేవారి తరువాతి స్థానం తెలుగువారిదే. బౌద్దపూర్వ యుగంనుంచి ఇటీవల బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనాయుగం వరకూ తెలుగువారు పెద్దఎత్తున ప్రపంచం నలుమూలలకూ వలస వెళ్ళడం జరిగింది. అట్లా వెళ్ళిన తెలుగువారు తమ భాషా సంస్కృతి సంప్రదాయాలను ఆయా జాతీయ జీవన విధానాలతో మేళవించి, వాటిని సుసంపన్నం చేస్తూ ఉన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన లక్ష్యం తెలుగు ప్రజల, తెలుగు అభిమానుల ప్రతినిధులను ఒక వేదికమీద సమావేశపర్చడం. జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక రంగాలలో తెలుగువారు చేయవలసిన కృషినిగూర్చి చర్చించి, నిర్ణయించుకోవడానికీ, తద్వారా వివిధ చైతన్య స్రవంతులను ఏకోన్ముఖంచేసి మన సాంస్కృతిక సంబంధాలను దృఢతరం చేసుకోవడానికి ఈ మహాసభలు దోహదకారులు అవుతవి. అంతేకాక ఈ మహాసభలు ఆర్ద్రమైన భావసమైక్యతకు ప్రాతిపదికలై తెలుగుజాతిని సమైక్యం చేయగలవనీ, ఆ విధంగా జాతీయ అభ్యుదయానికి తోడ్పడగలవనీ విశ్వసిస్తున్నాను.

1975 ఏప్రిల్ 12వ తేదీన, తెలుగు ఉగాది రోజున, ప్రారంభమై ఒక వారం రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో వివిధ దేశాలనుంచీ, వివిధ రాష్ట్రాలనుంచీ, యునెస్కొవంటి అంతర్జాతీయ సంస్థలనుంచి విచ్చేసిన ప్రముఖులు ప్రతినిధులుగానో, పరిశీలకులుగానో పాల్గొంటారు. ఈ మహాసభల సమయంలో చర్చాగోష్ఠులు, ప్రదర్శనలు, ప్రచురణలు మొదలైన కార్యక్రమమాలు జరుగుతాయి. దేశ విదేశాలలోని తెలుగువారి సంస్కృతి, తెలుగు భాషా సాహిత్యాల కళల అభివృద్ధి, వైజ్ఞానిక సాంకేతిక ప్రగతి మొదలైన విషయాలపై చర్చాగోష్ఠులు జరుగుతవి. తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని వివిధ కోణాలనుంచి ప్రస్ఫుటం చేసే ఒక ప్రదర్శన ఏర్పాటు అవుతున్నది. తెలుగువారి సమగ్ర స్వరూపాన్ని సందర్శించడానికి వీలైన సంగ్రహాలయాన్ని (మ్యూజియంను) స్థాపించడానికి ఈప్రదర్శన బీజ భూతమవుతుంది. తెలుగువారి సంస్కృతిని నిరూపించే సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజుల పాటు సాగుతవి. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలను విశదం చేసే ప్రత్యేక సంచికలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దు భాషలలో విడుదల అవుతాయి. ఈ కార్యక్రమాలలో భాగమే ఈ గ్రంథ ప్రచురణ.

తెలుగు ప్రజలు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన వివిధ రంగాలలో సాధించిన మనవిజయాలను విశదం చేసే గ్రంథాలు అనేకం ఈ మహాసభల సమయంలో విడుదల అవుతాయి. ఈ గ్రంథాలను రచించి, సకాలంలో మాకు అందించిన రచయితలందరకూ నా కృతజ్ఞతలు. ఈ గ్రంథాలను ప్రచురించే భారం వహించడానికి ముందుకువచ్చిన అకాడమీ అధినేతలను అభినందిస్తున్నాను. తెలుగువారి విశిష్టతలను విశదంచేసే ఈ గ్రంథాలు సహృదయు లందరి ఆదరణ పొందగలవని విశ్వసిస్తున్నాను. అయితే, ఇంత మాత్రం చేతనే ప్రపంచ తెలుగు మహాసభల ఆశయాలు సఫలం కాగలవని నేను అనుకోవడంలేదు. చేయవలసినది ఇంకా ఎంతో ఉంది. ఈ మహాసభల సందర్భంగా నెలకొల్పబడనున్న ‘అంతర్జాతీయ తెలుగు విజ్ఞాన సంస్థ’ మహాసభల ఆశయ సాధనకు పూనుకొనడమే కాక జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలను దృఢతరం చేయగలదని నమ్ముతున్నాను.

జలగం వెంగళరావు

అధ్యక్షులు

ప్రపంచ తెలుగు మహాసభలు.

పరిచయము

సహస్రాబ్దాలుగా ప్రవర్ధమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగుదేశపు నలుచెరగుల పరిచితము చేయు సంకల్పములో 1975 వ సంవత్సరమును తెలుగు సాంస్కృతిక సంవత్సరముగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించినది. అందుకు అనుగుణమైన కార్యక్రమాలను నిర్వహింపజేయటయేగాక, ప్రపంచములోని వివిధ దేశాలలో నివసించుచున్న తెలుగువారి సాంస్కృతిక ప్రతినిధులందరును ఒకచోట సమావేశమగు వసతిని కల్పించుటకై 1975, ఏప్రిల్ 12 (తెలుగు ఉగాది) మొదలుగ ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబాదున జరుగునటుల ప్రభుత్వము నిర్ణయించినది. అందుకు ఒక ఆహ్వానసంఘము ఏర్పాటయినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి మాన్యశ్రీ జలగం వెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు, విద్యాశాఖామంత్రి మాన్యశ్రీ మండలి వెంకటకృష్ణారావుగారు దాని కార్యనిర్వాహకాధ్యక్షులు. ఆర్థికమంత్రి మాన్యశ్రీ పిడతల రంగారెడ్డిగారు ఆర్థిక, సంస్థా కార్యక్రమాల సమన్వయసంఘాల అధ్యక్షులు.

ఆ సంఘము, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున వచ్చువారికి తెలుగుజాతి సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకు అనువుగ ఆంధ్ర భాషా, సాహిత్య, కళా, చరిత్రాదికములను గురించి ఉత్తమములు, ప్రామాణికములునగు కొన్ని లఘు గ్రంథములను ప్రకటించవలెనని సంకల్పించి, ఆ కార్యనిర్వహణకై 44 మంది సభ్యులుకల ఒక విద్వత్‌సంఘమును, శ్రీ నూకల నరోత్తమరెడ్డిగారి అధ్యక్షతన నియమించినది. ఆ విద్వత్‌సంఘము ఆ లఘు గ్రంథముల వస్తువుల నిర్దేశించి వాని రచనకై ఆయారంగములందు పేరుగనిన ప్రముఖులను రచయితలుగ యెన్నుకొనినది. ఈ విధముగ సిద్ధమైన గ్రంథములలో భాషా, సాహిత్య, చారిత్రక విషయములకు సంబంధించిన వానిని ప్రకటించు బాధ్యతను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వహింప వలసినదిగ ప్రపంచ తెలుగుమహాసభా కార్యనిర్వాహకాధ్యక్షులు మాన్యశ్రీ, మండలి వెంకటకృష్ణారావుగారు అకాడమీని కోరిరి. మహాసభా సఫలత కొరకై కృషిచేయు సంకల్పముతో ఈ బాధ్యతను వహించుటకు అకాడమీ సంతోషముతో అంగీకరించినది.

ఆ విధముగ ప్రకటింపబడిన గ్రంథశ్రేణిలో ఈ తెలుగు వాక్యం అను గ్రంథమును, రచించినవారు చేకూరి రామారావుగారు ఆంధ్ర పాఠకలోకమునకు సుపరిచితులు. వారికి మేము కృతజ్ఞతాబద్ధులము. గ్రంథమును నిర్దుష్టముగ, చక్కగ ముద్రించిన శివాజీ ప్రెస్ వారికి మా కృతజ్ఞత.

హైదరాబాదు,
31-3-1975

దేవులపల్లి రామానుజరావు కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ.

ముందుకు పోయే ముందు

ఆధునిక భాషాశాస్త్ర పద్ధతుల్లో తెలుగు భాషమీద పరిశోధన ప్రారంభమై ఎంతోకాలం కాలేదు. అందులో వాక్య నిర్మాణ పరిశీలన మరీ ఇటీవలిది.

తెలుగు వాక్యాన్ని నేను అర్థం చేసుకోటానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇప్పటికి ఇది ఒక మజిలీ. దాదాపు పదేళ్లనుంచి తెలుగు వాక్యం గురించి నేను చేస్తున్న పరిశీలనను నా జాతి జనులతో పంచుకోవాలని చేసిన ప్రయత్నం ఇది. ఇందులో ఎక్కువ భాగం — ముఖ్యంగా సంశ్లిష్ట వాక్యాలనుంచి — నా ఆలోచనల ప్రతిబింబాలే. ఇందులో కొన్ని అభిప్రాయాలు అక్కడక్కడా వ్యాసాల రూపంలో అచ్చయినా ఈ పుస్తకంలోకి వచ్చేటప్పటికి కొన్ని మార్పులు జరిగినై. అవి, చేదర్థకాలను గురించి, అనుకృతిని గురించి ఈ పుస్తకంలోనే తొలిసారిగా చెప్పిన అభిప్రాయాలు చాలా ఉన్నై. ఆ అధ్యాయాల్లో చేసిన కొన్ని ప్రతిపాదనలు తెలుగు భాషా పరిమితిని దాటి ఇతర భాషలకు కూడ వర్తించగలవన్న ఆశ లేకపోలేదు. ఏ శాస్త్రం ప్రతిపాదనైనా నిల్చేది అంతకన్నా మేలైన ప్రతిపాదన వచ్చేటంతవరకే. అట్లాంటి కొత్త ప్రతిపాదలను ప్రేరేపించటమే ఈ పుస్తకానికి ప్రధాన లక్ష్యం.

విషయ ప్రతిపాదన పదునుగా ఉండాలంటే సాంకేతిక పదజాలం తప్పనిసరి అవుతుంది. అది మితిమీరితే విషయం దురవగాహమై పాఠకులకు చికాకు కలిగిస్తుంది. ఇందులో అట్లాంటి పదజాలాన్ని చాలా పరిమితం చెయ్యటానికి విశేషంగా ప్రయత్నించాను.

భాషను గురించి తెలుసుకోగోరే జిజ్ఞాసువులకు ఈ పాటికే పరిచయం అయి ఉంటయ్యన్న ఉద్దేశంతో గుప్తనిర్మాణం, వ్యక్తనిర్మాణం; గర్భివాక్యం, గర్భ వాక్యంవంటి కొన్ని మాటలను ఆక్కడక్కడా వాడాను. సూత్రాల క్రమవర్తనను ఒకటి రెండు చోట్ల ప్రస్తావించాను. ఈ మాత్రం సాంకేతికతను పాఠకులు భరించ గలరనుకుంటాను అధిక వివరణ కావల్సివస్తుందనీ, అచ్చువెయ్యటంలో చిక్కులు వస్తయ్యనీ, ఇట్లాంటి పరిశీలనకు అవసరమైన చెట్టు బొమ్మల్ని (Phrase markers) వెయ్యలేదు.

ఈ పుస్తకంలో వ్యాకరణ సమ్మతమైన వాక్యాలను వ్యాకరణ విరుద్ధమైన వాక్యాలతో పోల్చిచూపటంద్వారా వివరించటానికి ప్రయత్నించాను. వ్యాకరణం అంటే వ్యవహర్తలను ఇట్లా మాట్లాడమని గాని, రచయితలను ఇట్లా రాయమని గాని శాసించే లిఖిత సూత్రాల పుస్తకం అనే అర్థంలో వాడటం లేదు. భాషా వ్యవహారంలో వ్యవహర్తలు పాటించే నియమావళి అనే అర్థంలో వాడుతున్నాను. ఈ నియమాలు వ్యవహర్తల మనస్సులో అజ్ఞానంగా ఉంటై. వాటిని జాగ్రత్తగా గ్రహించి వ్యక్తరూపం ఇయ్యటమే భాషాపరిశోధకులు చేసేపని.

వ్యాకరణ సమ్మతిని నిర్ణయించటానికి పనిముట్లు ఉండవు. భాషా పరిశీలన ద్వారా పరిశోధకుడు ఏర్పర్చుకున్న అంతర్దృష్టి తప్ప వేరే ఆధారంలేదు. అదీగాక వ్యాకరణ సమ్మతి వ్యవహర్తల, ప్రాంతాలనుబట్టి, అలవాట్లనుబట్టి, నమ్మకాలను బట్టి ఉండవచ్చు. అందువల్ల ఈ పుస్తకంలో కొన్ని వాక్యాల వ్యాకరణసమ్మతి, ఆసమ్మతులను గురించి నేను చేసిన నిర్ణయాలతో కొందరు పాఠకులు ఏకీభవించక పోవచ్చు. అంతేగాక ఉదాహృత వాక్యాలకు సందర్భాలు కేవలం ఊహ్యాలే గనుక సమ్మతి, ఆసమ్మతులలో వ్యత్యాసం రావటం సహజం. అందుకోసం సాధ్యమైనంత సహజంగా ఉండే ఉదాహరణలను ఎన్నుకోటానికి చాలాచోట్ల ప్రయత్నించాను.

పూర్తిగా వ్యాకరణ విరుద్ధమనితోచిన వాక్యాలకు, అక్కడ ఉద్దిష్టమైన అర్థాన్ని ఇయ్యలేని వాక్యాలకు, పువ్వు గుర్తుంచాను. వ్యాకరణ సమ్మతి సందేహమని తోచిన వాక్యాలముందు ప్రశ్నార్థక చిహ్నం ఉంచాను. ఒక సంఖ్యముందు పువ్వు గుర్తుంటే అందులో ఉదాహరించిన వాక్యాలన్నీ వ్యాకరణ విరుద్ధాలనీ (లేక ఉద్ధిష్టార్థబోధకసమర్థాలు), a, b, c, d అనే అక్షరాలముందుంటే కేవలం ఆ వాక్యాలు మాత్రమే వ్యాకరణ విరుద్ధాలనీ ఉద్దేశించాను. ఈ పద్ధతి ప్రశ్నార్థక చిహ్నం విషయంలో కూడా పాటించబడింది.

ఇందులో ముఖ్యంగా పరిశీలించింది ఆధునికభాషలో వ్యవహరించటానికి వీలున్న వాక్యాలను. ఈ పరిశీలన ఆధునిక రచనాభాషకుకూడా వర్తిస్తుంది. వాక్య నిర్మాణంలో ప్రాచీననాధునికభాషలమధ్య భేదం స్వల్పం. అందువల్ల ఈ సూత్రీకరణలలో చాలావరకు ప్రాచీనభాషకుకూడా వర్తిస్తై. అది సూచించటానికి అందుబాటులో ఉన్న ప్రాచీనాధునిక రచనల్లోనుంచి కొన్ని ప్రయోగాల్ని అక్కడక్కడ ఉదాహరించాను. కొన్ని సూత్రీకరణలు ఇతర ద్రావిడ భాషలకు కూడా వర్తించవచ్చు. భాషలమధ్య వాక్యనిర్మాణ విషయంలో అధికసామ్యం ఉండటమే ఇందుక్కారణం.

ఈ రచనలో అక్కడక్కడ కర్మణి వాక్యాలను ప్రయోగించాను. కర్మణి వాక్యాలమీద నాకు ప్రత్యేకమైన మోజేమీలేదు. అకారణమైన ద్వేషమూ లేదు. సకర్మక వాక్యాల్లో కర్తృప్రాధాన్యాన్ని తగ్గించటానికి భాషలు అనుసరించే ఒక పద్ధతి కర్మణి ప్రయోగం. ఇది ఇతర మార్గాలద్వారా సాధించవచ్చు గాని, తెలుగులో క్రియా విభక్తులు అందుకు ఆటంకం. రచనా భాషలో, ముఖ్యంగా పరిశోధనా వ్యాసంగంలో ఉత్తమ పురుష కర్తృక వాక్యబాహుళ్యం తప్పించుకోటం కష్టం. ఒక్కోసారి ఆ వాక్యాలు రచయిత అభీష్టానికి విరుద్ధంగా అహంకార ద్యోతకాలు కావచ్చు. ఆ ప్రమాదం నుంచి కాపాడు కోటానికి కర్మణి వాక్యాలు రచయితలకు కవచాల్లాంటివి. ఆ ఉద్దేశంతోటే ఈ పుస్తక రచనలో కర్మణి వాక్యాలు వాడబడినై .

ఈ రచనలో సంస్కృత పద బాహుళ్యాన్ని కూడా ఆయిష్టంగానే గుర్తించాను. తెలుగు వ్యాకరణ సంప్రదాయం మంచికో, చెడ్డకో సంస్కృత మార్గంలోనే మొదలయి పెరుగుతూ వచ్చింది. ఆ సంబంధాన్ని ఇవాళ ఆమాంతంగా తెంచుకోటం అంత సులభంగా సాధ్యమయ్యేది గాదు. అందువల్ల ఇందులో కొత్తగా వాడిన పరిభాషకూడా ఆ మార్గంలో తయారుచేసిందే. సమాస కల్పనలో, సరూప సంగ్రహ పదనిర్మాణంలో సంస్కృత భాషలో ఉన్న సౌకర్యమే బహుశా ఇందుక్కారణ మనుకుంటాను.

ఈ పుస్తకంలో ఏ అధ్యాయమూ ఏమాత్రం సమగ్రం కాదని ఎవరైనా వెంటనే గ్రహించగలరు. ఏ రెండు ఉదాహృత వాక్యాలను తీసుకున్నా, మళ్ళీ ఇంతకు రెండింతలు గ్రంథం రాయొచ్చు. అంటే నేను రాయగలనని కాదు. అంత విషయం ఉంటుందని. తెలుగు వాక్యాన్ని గురించి ఇంతవరకు తెలుగులో ఒకపాటి పుస్తకమైనా లేనందువల్ల, అసమగ్రంగా నైనా ఇప్పటివరకు గ్రహించినంత మట్టుకు ఒకచోట కూరిస్తే తెలుసుకోదల్చుకున్న వాళ్లకు, మరింత కృషి చేయ్యదల్చుకున్న వాళ్లకూ ఉపయోగిస్తుంది గదా అని ఈ సాహసానికి పూనుకున్నాను. ఇంకా కొన్నేండ్లు కృషిచేస్తే ఇంతకన్నా సమగ్రమైన, విపులమైన పెద్దపుస్తకం రాయటానికి వీలుపడొచ్చు. ఇంతకుముందే సూచించినట్టుగ ఈ పుస్తకంలో ప్రతిపాదించిన విషయాలు శాశ్వత సత్యాలనే భ్రమ (అసలు శాశ్వత సత్యాలనేవి ఉంటే) నాకు లేదు.

దారిన నడుస్తున్నప్పుడో, ఏ అల్పాహారమో పానీయమో సేవిస్తున్నప్పుడో శాస్త్రవిషయాలను ముచ్చటించుకోటం భాషాపరిశోధకులకు అలవాటు. ఆ విధంగా తెలుగు వ్యాకరణాంశాలను గురించి మా గురువుగారూ (భద్రిరాజు కృష్ణమూర్తిగారు) నేనూ తరచు చర్చించుకుంటుంటాం. ఒకరి ప్రతిపాదనలకు ఇంకొకరు విరుద్ధోదాహరణలు చూపించటం ఆ చర్చల్లో ఒక భాగం. దానివల్ల సూత్రీకరణలు పదును దేరతై. ఈ పుస్తకంలో చేసిన కొన్ని సూత్రీకరణలకు అట్లాంటి లాభం జరిగింది. ఫలానివని ఇప్పుడు వేరు చెయ్యటం కష్టమైనా, క్త్వార్థక వాక్యాల్ని గురించి, నామ్నీకరణాల్ని గురించి చెప్పిన కొన్ని అంశాలు అట్లా బాగుపడ్డట్టు స్పష్టంగా గుర్తు. మిగతావాటికి కూడా అట్లాంటి లాభం జరిగితే అవికూడా నిస్సందేహంగా మెరుగయ్యేవే. కాని సమయాభావం అట్లా జరగనియ్యలేదు

విస్కాన్సిన్ యూనివర్సిటీ (మేడిసన్) లో ఒక పుష్కరం కిందట నేను భాషాశాస్త్రం చదువుకొనేటప్పుడు జెరల్డ్ కెలీ గారు నాకు ఉపాధ్యాయులు. తెలుగు భాషను ఆధునిక పద్ధతుల్లో పరిశీలిస్తూ ఆయన అమెరికన్ విద్యార్థులకు పాఠాలు చెపుతుండేవారు. ఉద్యోగరీత్యా నేనా క్లాసుల్లో కూర్చునే అవసరం కలిగింది. ఆ తరవాత అట్లాంటి క్లాసులు పూర్తిగా నాకే వదిలేసేవారు. అప్పుడు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానా లియ్యటంకోసమైన సొంతంగా ఆలోచించాల్సి వచ్చేది. ఈ విధంగా తెలుగుభాషా నిర్మాణాన్ని గురించి శాస్త్రీయంగా ఆలోంచిచటానికి నాకు దారిచూపి ప్రేరణ కలిగించిన ఉపాధ్యాయులు కెలీగారికి ఈ పుస్తకం అంకితమియ్యటం ఈ సందర్భంలో ఆయన్ను గుర్తుచేసుకోటం కోసమే గాని ఇది ఆయనకు అంకితమియ్యదగిన ఉద్గ్రంథం అనే ఉద్దేశంతో కాదు.

కెలీగారు 1963 నుంచి కోర్నెల్ యూనివర్సిటీలో భాషా శాస్త్రాచార్యులుగా ఉంటున్నారు. చదువులోను, విద్యార్థి ఉద్యమాల్లోనూ చురుగ్గా పనిచేస్తూ కూడా, అంత చురుగ్గా ఈ పుస్తకానికి అచ్చుకోసం శుద్ధ ప్రతిని త్వర త్వరగా తయారు చేసి ఇచ్చిన ఆయిలోని (<అయినవోలు) ఉషాదేవికి చాలా రుణపడి ఉన్నాను. ఈ అమ్మాయి భాషా శాస్త్రం ఎమ్. ఏ. రెండో భాగం చదువుతున్నది. విషయం మీద అభిలాష, నామీద అభిమానం వల్ల ఈ పని శ్రమ అనుకోకుండా సంతోషంగా చేసింది.

చే.రా.

1975 మార్చి 8.

TO

PROFESSOR GERALD KELLEY

విషయసూచిక

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
1

26

74

98

105

110

ఇతర కాపీలు[మార్చు]

  • భారత డిజిటల్లో లైబ్రరీ వారి మూడు ప్రతులు.[1], [2], [3]

Public domain
ఈ కృతి భారత ప్రభుత్వ w:భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా, రచయిత/ముద్రాపకుల అనుమతితో ఆర్ధిక లావాదేవీలు లేకుండా స్కాన్ చేసి సర్వర్లపై వుంచడం ద్వారా 2007-2017 మధ్యకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంచబడింది. కొన్ని సమస్యలవల్ల DLI సర్వర్ తాత్కాలికంగా అందుబాటులో లేకున్నా ఈ కృతులు USA కేంద్రంగా పనిచేసే ఆర్కీవ్ లో లభ్యమవుతున్నాయి. హక్కుదారుల ఉద్దేశాన్ని గౌరవిస్తూ, DLI స్కాన్ కంటే మెరుగుగా యూనికోడ్ కు మార్చి ప్రజలకు అందుబాటులో చేయటానికి లాభనిరపేక్షంగా పనిచేసే తెలుగు వికీసోర్స్ సాయపడుతుంది కావున వికీసోర్స్ లో వుంచబడుతున్నది. ఈ కృతిని చదువుకోవటానికి తప్పించి వేరే విధంగా వాడుకొనేవారు సంబంధిత హక్కుదారులను సంప్రదించవలసింది. ఈ విషయమై హక్కుదారులు ఆక్షేపమేమైనా తెలిపితే వికీసోర్స్ నిర్వాహకులు కృతిని తొలగిస్తారు.