Jump to content

తెలుగు వాక్యం/సంయుక్త వాక్యాలు

వికీసోర్స్ నుండి

4. సంయుక్త వాక్యాలు

కొన్ని సమాన ప్రతిపత్తి గల వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే సంయుక్త వాక్యమవుతుంది. వాక్య సంయోగాన్ని సూచించటానికి ఇంగ్లీషులో and, or, but వంటి శబ్దాలను. హిందీలో ఔర్ , యా, మగర్ వంటి శబ్దాలనూ ప్రయోగిస్తారు. ఈ శబ్దాలు వాక్య సంయోగాన్నే కాక పద, పదబంధ సంయోగాన్ని కూడా సూచిస్తై. పై శబ్దాలు వాక్యాల మధ్య భిన్న సంబంధాల్ని వ్యక్తం చేస్తై. and అనే శబ్దం సంకలన సంబంధాన్ని, or శబ్దం వికల్ప సంబంధాన్ని, but వైరుధ్యాన్ని సూచిస్తై. తెలుగులో అన్నిచోట్లా ఇట్లాంటి శబ్ద ప్రయోగం లేదు.

4.11 : తెలుగులో రెండు వాక్యాలను ఒకదాని తరవాత ఒకటి ప్రయోగించి వాటి మధ్య సంబంధాలు ఆర్థాన్ని బట్టే గ్రహిస్తాం. సంకలన సంబంధంలో ప్రత్యేకమైన శబ్దంలేదు. వాక్యం చివరలో స్వరోచ్చారణ ద్వారా ఈ సంబంధం వ్యక్త మవుతుంది.

(227)

a. సుబ్బారావు తెలివైనవాడు, సుజాత అందమైనది.
b. సుజాత తెలివైనదీ, అందమైనదీ.

(227) a లో కలిపిన రెండు వాక్యాల్లో సమానాంశ లేదు. ఆ రెంటినీ ఒక వాక్యంగా భావించినా, రెండు వాక్యాలుగా భావించినా భేదం లేదు. అట్లాంటి భేదాన్ని సూచించే శబ్దాలు కూడా లేవు. (227) b. ని ఒక వాక్యంగా భావించటానికి వీలుంది. రెండిటిలోనూ కర్త (ఉద్దేశ్యం) ఒకటే అయినప్పుడు సనామ బంధలోపం జరిగింది. ఈ రెండూ కలిపి ఒకే వాక్యం అనటానికి ఇంకో ఆధారం ఉంది.

  c. సుజాత తెలివైనది. సుజాత అందమైనది.
  d. సుజాత తెలివైనది. ఆమె అందమైనది (కూడా),

  • e. సుజాత తెలివైనదీ, ఆమె అందమైనదీ-

(227) b, c లను పోల్చి చూస్తే ఈ భేదం తెలుస్తుంది. b లో సనామబంధ లోపం జరిగింది. అది వ్యాకరణ సమ్మతం. (e) లో సర్వనామీకరణం జరిగింది. ఏకకర్తృకమైన వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా చేసినప్పుడు సనామ బంధలోపం జరిగి తీరాల్సిందేకాని సర్వనామీకరణం జరగటానికి వీల్లేదు. సమాన ప్రతిపత్తిగల వాక్యాలను కలిపినప్పుడు ఆఖ్యాతాలు ఏ వరసలో వచ్చినా అర్థం మారదు.

(228)

a. సుజాతకు డబ్బుంది, తెలివి ఉంది.
b. సుజాతకు తెలివి ఉంది, డబ్బు ఉంది.
c. సుజాత పొడగరి, రూపసి.
d. సుజాత రూపసి, పొడగరి.

4.12 : స్థితిబోధకమైన ఆఖ్యాతాలున్నప్పుడే ఇట్లాంటి పరివర్తన, అర్థ భేదాన్ని కలిగించదు. వ్యాపార, పరిణామ బోధకమైన వాక్యాలు కలిపినప్పుడు పూర్వపూర్వ క్రియలు పూర్వపూర్వ వ్యాపారబోధకాలవుతై. అంటే వాక్యంలో పూర్వవ్యాపారం, కాలంలో కూడా పూర్వవ్యాపారాన్నే బోధిస్తుంది. వాక్యాలను విడివిడిగా ఉంచినా కలిపినా అర్థవ్యత్యయం ఇట్లాగే ఉంటుంది.

(229)

a. సుజాత ఇంటికి వచ్చింది, చీరమార్చుకుంది, పొయ్యిమీద కాఫీకి నీళ్ళు పెట్టింది.

b. సుజాత ఇంటికివచ్చి, చీర మార్చుకుని, పొయ్యిమీద కాఫీకి నీళ్ళు పెట్టింది.

c. సుజాత ఇంటికి వచ్చింది. ఆ తరవాత చీర మార్చుకుంది. ఆ తరవాత పొయ్యిమీద కాఫీకి నీళ్ళు పెట్టింది.

(229) a, b వాక్యాలను c వాక్యపు గుప్త నిర్మాణం నుంచి నిష్పన్నం చెయ్యవచ్చు. అంటే a, b ల అర్థం c అర్థంతో సమానం. అందువల్ల ఈ వాక్యాల్లో ఆఖ్యాతాలు క్రమ వ్యత్యయాన్ని సహించవు, (229) b వంటి వాక్యాలు ఇంతకు ముందు పేజీల్లో సంశ్లిష్ట వాక్యాలుగా వ్యవహరించబడ్జె. ఇక్కడ సంయుక్తవాక్యా తుల్యాలుగా పరిగణించబడుతున్నై. గుప్త నిర్మాణ సంయుక్త వాక్యాలనుంచి నిష్పన్నమైన వ్యక్త నిర్మాణపు సంశ్లిష్ట వాక్యాలుగా వీటిని పరిగణించవచ్చు. (229) a, b లు రెండిట్లోనూ సనామబంధం లోపం జరుగుతుంది కాని, సర్వ నామ్నీకరణం జరగదు. 4.13 : క్రమ వ్యత్యయాన్ని సహించే వాక్యాలు తరవాత శబ్దప్రయోగాన్ని సహించవు. "సుజాత తెలివైనది, ఆతరవాత అందమైనది” అనేవాక్యం సాధ్యమైనా సుజాత గుణాల్ని వర్ణించే వక్త ఆ గుణాల్లో తాను దేన్ని ప్రధానంగా పరిగణిస్తున్నాడో చెప్పుతుంది కాని, ఆ గుణాల కాల భేదాల్ని సూచించదు.

4.14: సంయుక్త పదబంధాలను కూడా సంయుక్త వాక్యాలనుంచి నిష్పన్నం చెయ్యవచ్చు. సమరూపకాలైన పదబంధాల్లో ఒకదానికి లోపం చెయ్యటంద్వారా ఇది జరుగుతుంది. ఆ ప్రక్రియ కింది వాక్యాల్లో చూడవచ్చు.

(230)

a. సుజాత సినిమాకు వెళ్లింది, సుశీల సినిమాకు వెళ్ళింది.
b. సుజాత, సుశీల - సినిమాకు వెళ్ళింది, సినిమాకు వెళ్ళింది.
c. సుజాత, సుశీల, సినిమాకు వెళ్ళారు.
d. సుశీల, సుజాత సినిమాకు వెళ్ళారు.

4.15: (230) లో c, d వాక్యాల్లో నామ బంధాలు క్రమవ్యత్యయం జరిగినా అర్థభేదం రాలేదు. కాని ఈ వాక్యాలు విడిగా భిన్నార్థ బోధకాలు, ఆ భిన్నార్థాలు కింది వాక్యాల్లో వ్యక్తమవుతున్నై.

(231)

a. సుజాత, సుశీల కలిసి సినిమాకు వెళ్ళారు.
b. సుజాత, సుశీల విడివిడిగా సినిమాకు వెళ్ళారు.

ఒకే సినిమాకు వెళ్ళారా, వేరు వేరు సినిమాలకు వెళ్ళారా అనేది వదిలేసినా వాళ్లు కలిసి వెళ్ళారా ? విడివిడిగా వెళ్ళారా అనేది (230) లో వ్యక్తం కాలేదు. భిన్న కర్తృకాలైన ఏకవ్యాపార మున్నప్పుడల్లా ఇల్లాంటి అస్పష్టత వాక్యంలో ఉంటుంది.

ఒకే వాక్యం బహు కర్తృకమూ, బహు కర్మకమూ అయినప్పుడు కర్తృ సంఖ్యను, కర్మ సంఖ్యనూ బట్టి ఈ అస్పష్టత పెరుగుతుంది. ఉదాహరణకు ఈ కింది వాక్యాలు చూడండి.

(232)

a. సుజాత సుశీల బజారు నుంచి పండ్లూ కూరగాయలు తెచ్చారు.
b. సుజాత బజారు నుంచి పండ్లు తెచ్చింది.
   సుశీల బజారునుంచి కూరగాయలు తెచ్చింది.

C. సుశీల బజారు నుంచి పండ్లూ, కూరగాయలు తెచ్చింది.
d. సుజాత బజారు నుంచి పండ్లూ కూరగాయలు తెచ్చింది.

(232) లో a కి b, c లలో ఏదైనా మూలవాక్యం కావచ్చు. భిన్న మూలకం కావటం వల్లనే భిన్నార్థాలు వస్తున్నై .

4.16 : పారస్పర్యాన్ని బోధించే క్రియలున్నప్పుడు అట్లాంటి వాక్యాల్నుంచే సంయుక్త పదబంధాల్ని సాధించాల్సి ఉంటుంది.

(233)

a. సుజాత, సుశీల తిట్టుకున్నారు.
b. సుజాత సుశీలను తిట్టింది, సుశీల సుజాతను తిట్టింది.

(233) a కి b ని మూలవాక్యంగా ప్రతిపాదించాల్సి ఉంటుంది.

4.17 : భిన్న ప్రశ్నార్థక శబ్దాలున్న వాక్యాలను కలిపేటప్పుడు సమకియల లోపం జరగదు.

(234)

   a. సుజాత ఎప్పుడొస్తుంది? సుజాత ఎందుకొస్తుంది?
   b. సుజాత ఎప్పుడొస్తుంది? ఎందుకొస్తుంది?
? c. సుజాత ఎప్పుడు, ఎందుకొస్తుంది?

సమ ప్రశ్నార్థక శబ్దాలు, సమక్రియలూ ఉన్నప్పుడు అట్లాంటి లోపం జరుగుతుంది.

(235)

a. సుజాత ఎప్పుడొస్తుంది? సుశీల ఎప్పుడొస్తుంది?
b. సుజాత, సుశీల ఎప్పుడొస్తారు?

- ప్రశ్నల్లాగే - ప్రశ్నలు కూడా ఒకచోట చేర్చటం వల్లనే సంయుక్త ప్రశ్నలు ఏర్పడతై . వాక్య సంయోగాన్ని సూచించే పదమేమీ ఉండదు.

(236)

a. ప్రతిమనిషికి, తిండి గుడ్డ నీడైనా ఉండాలా?
   కాని మిగలాలా? మరీ బ్రతకాలా?

b. చెప్పేదంతా చేస్తున్నారా? చేసిందంతా చెప్తున్నారా?

4.21 : వికల్పార్థాన్ని సూచించటానికి వాక్యాల మధ్య లేక , లేకపోతే అనే శబ్దాలు ప్రయుక్తమవుతై. వాక్య వికల్పం పదబంధ వికల్పంగా పరివర్తన చెందినప్పుడు వికల్పాన్ని చెప్పిన పదబంధాలన్నిటికీ శబ్దం చేరుతుంది.

(237)

a. (i) సుబ్బారావు రేపువస్తాడు, లేక ఎల్లుండి వస్తాడు,
        లేక నాలుగు రోజుల తరవాత వస్తాడు.
    (ii) సుబ్బారావు రేపో, ఎల్లుండో, నాలుగు రోజుల తర్వాతనో
         వస్తాడు.

b. (i) రేపు సుజాత ఊరికి వెళ్తుంది, లేక సుశీల ఊరికి వెళ్తుంది ,
       లేక సుమిత్ర ఊరికి వెళ్తుంది.
   (ii) రేపు సుజాతో, సుశీలో, సుమిత్రో ఊరికి వెళ్తారు.
        ( ! వెళ్తుంది.)

4.22 : పై వాక్యాల్లో ఆఖ్యాతేతర పదాలమధ్య వికల్పం చెప్పబడింది. ఆఖ్యాతాలమధ్య వికల్పం రెండురకాలుగా ఉంటుంది. నిశ్చయార్థక, వ్యతిరేకార్థక ఆఖ్యాతాలమధ్య ఉండొచ్చు. లేక భిన్న ఆఖ్యాతాలమధ్య ఉండొచ్చు. (226) వాక్యాల్లోa (i) కి a (ii) ని (b) (i) కి (b) (ii) మూలవాక్యాలుగా చూపించబడినై. ఆఖ్యాతాలమధ్య వికల్పత్వాన్ని చెప్పినప్పుడు ఇట్లా కుదరదు.

(238)

a. అతను వ్యాపారస్తుడో, భూస్వామో, పైరవికారో కాంగ్రెసు నాయకుడో?

b. సుజాత వంట చేస్తున్నదో, ఆలంకరించు కుంటున్నదో, చదువు కుంటున్నదో.

4.23 : ఈ పై వాక్యాలు పైనఇచ్చిన విధంగా ప్రయోగార్హాలుగా కనిపించటం లేదు. ఆ వాక్యాల తరవాత నాకుతెలియదు, ఎవరికితెలుసు, నీకెందుకు, ఎవరిక్కావాలి, మనకెందుకు ? వంటి వాక్యభాగాలను చేరిస్తే ప్రయోగార్హాలవుతై. వికల్పంగా క్రియారహిత వాక్యాలకు కాదు శబ్దాగమం, క్రియాసహిత వాక్యాలకు లేదు శబ్దాదేశం జరుగుతై .

(239)

a. (i) అతను కాంగ్రెసు నాయకుడు అవునో, కాదో.
   (ii) ఆతను కాంగ్రెసు నాయకుడో, కాదో.

b. (1) అతను రేపు వస్తాడో, రాడో.
   (ii) అతను రేపు వస్తాడో, లేదో.

(239) వాక్యాలకు యథాతథంగా ప్రయోగించవచ్చు. (238) వాక్యాల సందర్భంలో ఉదాహరించిన నాకు తెలీదు వంటి వాక్యాలను చేర్చినా చేర్చవచ్చు.

(238) వాక్యాల్లో వికల్పాఖ్యాతాలమధ్య లేక శబ్దాన్ని ఉపయోగిస్తే ప్రయోగ యోగ్యాలవుతై. లేక శబ్ద యుక్త వాక్యాలనుంచి వికల్ప వాక్యాలను నిష్పన్నంచేస్తూ లేక శబ్దాన్ని (237), (239) వాక్యాల్లో లోపింపజేసి, భిన్నా ఖ్యాతాలమధ్య లోపంచెయ్యకుండా ఉండటం (238) వాక్యాలను సాధించటంలో ఒక పద్ధతి. ఈ పద్ధతి సరిపోతుందో లేదో చెప్పటం కష్టం. -ప్రశ్నలమధ్య వికల్పం చెప్పినప్పుడు వాటిమధ్య లేక శబ్దం లేకుండానే వికల్పబోధ జరుగుతుంది.

(240)

a. అతను పైరవి కారా ? (లేక ) కాంగ్రెసు నాయకుడా ?
b. సుజాత వంట చేస్తున్నాదా? (లేక) అలంకరించుకుంటున్నదో

4.24 : -శబ్దయుక్త ప్రశ్నలమధ్య వికల్పబోధ ఉండదు. -శబ్దం క్రియేతర శబ్దాలనుంచి ప్రశ్నార్థక శబ్దాలను నిష్పన్నం చేస్తుంది. ఒక్కొశబ్దం ఒక్కోరకపు వర్గానికిగుర్తు. ఉదాహరణకు ఎప్పుడు : కాలవాచిక్రియా విశేషణం; ఎక్కడ : స్థలవాచి క్రియావిశేషణం; ఎందుకు? హేతు సూచకక్రియా విశేషణం; ఎట్లా : రీతిబోధక క్రియావిశేషణం; ఎవరు? : నామవాచకం. భిన్న ప్రవర్తన కలిగిన శబ్దాలమధ్య వికల్పబోధ ఉండదు.

4.31 : రెండు వాక్యాలమధ్య వైరుధ్య సూచనకు కాని శబ్దం ఉపయోగిస్తారు.

(241)

a. అతను లక్షలు సంపాయిస్తాడు. కాని పైసా ఖర్చు పెట్టడు.
b. ఆమె బాగా పాడుతుంది. కాని అందంగా ఉండదు.
c. అతను డాక్టరు, కాని ఇంజక్షను చెయ్యటం రాదు.

వక్త ఉద్దేశానికి భిన్నమైన విషయప్రతిపాదన జరిగినప్పుడు కాని శబ్దం ఆ వైరుధ్యాన్ని వ్యక్తంచేస్తుంది. ఉదాహరణకు (241) a లో “డబ్బు సంపాయించే వాళ్ళు ఖర్చు పెడతారు” అని వక్త అభిప్రాయం. దానికి విరుద్ధమైన ప్రతిపాదన రెండో వాక్యంలో జరిగింది. అట్లాగే (b) లో బాగాపాడే అమ్మాయి అందంగా ఉండాలని వక్త ఆశించాడు. (C) లో డాక్టరయిన వాడికి ఇంజక్షన్ ఇయ్యటం వచ్చి ఉండాలని అభిప్రాయపడటం సహజం. (241) a, b, c లలో వాటిని ఒక వాక్యంగా పరిగణించినా, భిన్న వాక్యాలుగా పరిగణించినా భేదమేమీలేదు. కాని శబ్దం గాని అనే రూపంగా మారుతుంది. క్రియారహిత వాక్యాలకు శబ్దం అంతంలో చేరుతుంది. (c లో లాగా) (230) a, b, c లలో వాక్యాలను కలపకముందు కాని శబ్దం బదులు అయితే , అయినా అనే శబ్దాలను ఆర్థభేదం లేకుండావాడొచ్చు. కాని వాటిని కలిపినప్పుడు కాని శబ్దమే ప్రయోగించాలి.

4.32 : కాని కి పూర్వపర వాకల్యను వ్యత్యస్తంచేసినా ప్రధానార్థబోధకి కాని, వైరుధ్యబోధకి కాని భంగంరాదు. వైరుధ్యబోధలో ఉపయోగించే కాని, క్రియేతర శబ్దాల మధ్య వికల్పబోధకుకూడా ఉపయోగిస్తుంది.

(242)

a. నేను రేపుగాని ఎల్లుండిగాని మీ ఇంటికి వస్తాను.
b. అబద్ధాలు చెప్పగలిగిన వాళ్ళుగాని, డబ్బు ఖర్చు పెట్ట గలిగిన వాళ్ళుగాని ఎన్నికల్లో గెలుస్తారు.