Jump to content

తెలుగు వాక్యం/సంశ్లిష్ట వాక్యాలు

వికీసోర్స్ నుండి

2. సంశ్లిష్ట వాక్యాలు

ఒక ప్రధానవాక్యానికి కొన్ని ఉపవాక్యాలుచేరడంవల్ల సంశ్లిష్ట వాక్యాలు ఏర్పడుతై. సంశ్లిష్ట వాక్యాల్లో ప్రధానవాక్యం క్రియాసహితమైతే ఒకటికన్నా ఎక్కువ క్రియలను గుర్తు పట్టవచ్చు. ఉపవాక్యాల్లో క్రియ సాధారణంగా అసమాపక క్రియ అయి ఉంటుంది. మరికొన్నిటిలో క్రియ భావార్థకనామంగాగాని, క్రియా జన్యవిశేషణంగా కాని ఉంటుంది. ఈ చెప్పిన క్రియారూపాల్లో పురుషబోధ ఉండదు. అసమాపక క్రియల్లో అయినా, వ్యాపారం జరిగే తీరును గురించే ఉంటుంది. కాలబోధ ప్రధాన క్రియను అనుసరించి ఉంటుంది. క్రియాజన్య విశేషణంలో కాలబోధ ఉంటుంది. క్రియలన్నింటికీ వ్యతిరేకరూపాలుకూడా ఉంటై. అని తో ప్రయోగించే అనుకరణల్లోనూ, పరోక్ష ప్రశ్నల్లోను ఉపవాక్యంలోకూడా సమాపక క్రియే ఉంటుంది. ప్రధాన వాక్యాన్ని గర్భివాక్యంగానూ ఉపవాక్యాన్ని గర్భవాక్యంగానూ భాషాశాస్త్రంలో వ్యవహరిస్తారు.

2.1 అసమాపక క్రియలు; క్త్వార్థకం :

తెలుగులో (మిగతా భారతీయభాషల్లోకూడా) ప్రధాన క్రియకన్నా ముందు జరిగినట్లు భావించే వ్యాపారాలను సూచించటానికి అసమాపక క్రియలను వాడతారు. దీనికి క్త్వార్థక క్రియ అనే పేరు సాంప్రదాయికంగా ఉంది. ధాతువుకు అనే ప్రత్యయం చేర్చటంవల్ల తెలుగులో క్వార్ధక క్రియ ఏర్పడుతుంది. క్రియాంత భాషల్లో అసమాపక క్రియలన్నీ ప్రధానక్రియకు పూర్వమే ఉంటై. పూర్వపూర్వ వ్యాపారాలను సూచించటానికి క్త్వార్థక క్రియ ప్రయోగించపడుతుంది. ప్రధానక్రియ సూచించే వ్యాపారంతోపాటే జరిగే వ్యాపారాలను బోధించటానికి వాడే అసమాపక క్రియను శత్రర్థకక్రియ అంటారు. ఇది ధాతువులకు తూ అనే ప్రత్యయాన్నీ, (కొందరి భాషలో ఇది తా అనే రూపంతో ఉంటుంది.) చేర్చటంవల్ల ఏర్పడుతుంది.. 'వచ్చు" అను ధాతువును ఉదాహరణంగా తీసుకొంటే క్వార్ధక క్రియ 'వచ్చి' అని. శత్రర్థక క్రియ వస్తూ అని ఉంటుంది.

2.11 వాక్యంలో క్వార్ధక, శత్రర్ధక క్రియలు ఉన్నప్పుడు ప్రధాన, అప్రధాన క్రియలకు రెండింటికి ఒకేకర్త ఉంటుంది. దీన్నే క్త్వార్ధకం విషయంలో "సమానాశ్రయంబులం బూర్వకాలంబునం దివర్ణకంబగు" (క్రియ. 3) అని బాల వ్యాకర్త గుర్తించి సూత్రించారు. ఈ నియమాన్ని సూచించే కింది వాక్యాలని గమనించండి.

(55)

సుజాత అన్నం తిని నిద్రపోయింది.


(56)

సుజాత అన్నం తింటూ నిద్రపోయింది.

వేరువేరు కర్తలున్న ఈ కింది వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

* (57)

సుజాతా అన్నంతిని సుశీల నిద్రపోయింది.


* (58)

సుజాత అన్నం తింటూ సుశీల నిద్రపోయింది.

ఈ రకమైన వాక్యాల్లో ఒకే కర్తను సూచించాలంటే, కర్తృపదంగా ఒక నామాన్నే (నామబంధాన్ని) వాడాలి. భిన్న నామాలుంటే ఒకే కర్తను సూచించ లేవు. అందువల్ల అట్లాంటివి వ్యాకరణ సమ్మతాలు కావు.

* (59)

ఆ అమ్మాయి అన్నంతిని సుజాత నిద్రపోయింది.


* (60)

ఆ అమ్మాయి అన్నం తింటూ సుజాత నిద్రపోయింది.

ఈ రకమైన వాక్యాల్లో కర్తృపదాలు రూపైకత, అర్థైకత ఉన్న నామాలే ఉండాలని, వాటిల్లో ఒకటి నిత్యంగా (సనామబంధంలోపం సూత్రంచేత) లోపించాలని పై వాక్యాలనిబట్టి తెలుస్తుంది. ఈ లోపించే వాక్యం గర్భివాక్యంలోదా? గర్భ వాక్యంలోదా ! అనే ప్రశ్నకు ఈ వాక్యంలో సమాధానం దొరకదు. ఎందుకంటే లోపించగా మిగిలిన క్రియ ప్రధానవాక్యంతోనూ ఉండవచ్చు, ఉపవాక్యంతోనూ ఉండవచ్చు.

(61)

సుజాత అన్నం తిని నిద్రపోయింది.


(62)

అన్నం తిని సుజాత నిద్రపోయింది.

ఈ రకమైన వాక్యాలు ఏకకర్తృకంగా ఉండాలనే నియమాన్ని బాలవ్యాకర్త కూడా గుర్తించినట్లు గమనించాం. కాని బాల వ్యాకర్తపైన పేర్కొన్న సూత్ర వివరణలో "సమాన కర్తృకంబు లనక సమానాశ్రయంబులనుటంజేసి చైత్రుని చేత మైత్రుండు, కొట్టంబడిమడిసె." అని చెప్పాడు దీన్ని బట్టి ఈ రకవు వాక్యాల్లో గుప్తనిర్మాణపుకర్తల్లో ఏకత్వం ఉండాలని బాలవ్యాకర్త ఉద్దేశించినట్టు కనిపిస్తుంది. కాని కొట్టంబడి అనే క్రియకు చైత్రుడు ఆశ్రయం (“కర్తకుచేత వర్ణకంబగు"). మైత్రుడు ఆశ్రయంకాదు. కర్మణిసూత్రంవల్ల ఏర్పడిన కర్త. అంటే వ్యక్త నిర్మాణపు కర్త. క్త్వార్థకాది క్రియలున్న వాక్యాల్లో సమాన కర్తృకాలంటే క్త్వార్థక సూత్రం వర్తించేటప్పుడున్న కర్తలనే అర్థం చెప్పుకోవాలి. గుప్తనిర్మాణంనుంచే క్త్వార్థక క్రియ లేర్పడవచ్చు. కర్మణి సూత్రప్రవర్తన తరవాత (కర్మణిసూత్రం వల్ల గుప్తనిర్మాణంలో కర్తృకర్మలకు వ్యత్యయం ఏర్పడుతుంది ) ఉన్న కర్తలలో సమానతనిబట్టికూడా క్త్వార్థక మేర్పడవచ్చు. దీన్నిబట్టి "సమాన కర్తృక" మనే నియమాన్ని గుప్తవ్యక్త నిర్మాణాల్లో ఏ ఒక్కదానికి ప్రత్యేకంగా నిబంధించకుండా, క్త్వార్థకసూత్రం వర్తించేటప్పుడున్న కర్తలనే అర్థం చెప్పుకోవాలి. ఈ క్రింది వాక్యాలనుబట్టి ఈ నియమ ప్రవర్తనను గుర్తించవచ్చు.

(63)

సుజాత (సుబ్బారావుసు) తిరస్కరించి బాధపడింది.


(64)

సుజాత (సుబ్బారావుచేత) తిరస్కరించబడి బాధపడింది.

పై రెండు వాక్యాల్లో గుప్తనిర్మాణపు కర్తలు వేరనే విషయం స్పష్టమే. (63)లో సుజాత, (64)లో సుబ్బారావు గుప్తనిర్మాణపు (వ్యాపారాశ్రయమైన) కర్తలు. అయినా రెండుచోట్లా క్త్వార్థక క్రియ సాధ్యమయింది.

కర్మణి సూత్రం (64)లో ఉపవాక్యానికి వర్తించింది. ప్రధాన వాక్యంలో సకర్మకక్రియ ఉంటే అక్కడ కూడా వర్తించవచ్చు. రెండు చోట్లా వర్తించిన ఈ క్రింది వాక్యాన్ని గమనించండి.

(65)

సుజాత సుబ్బారావుచేత తిరస్కరించబడి అవమానించ బడింది.

క్త్వార్థక క్రియ, ప్రధానక్రియ సన్నిహితంగా ఉన్నపుడు క్త్వార్థకంలో కర్మణి క్రియారూపాన్ని సూచించే 'పడు' ధాతురూపాన్ని లోపింపజేసినా ప్రధాన క్రియ నుంచి కర్మణి అర్థాన్ని గ్రహిస్తుంది.

(66)

సుజాత సుబ్బారావుచేత తిరస్కరించి అవమానించబడింది.

(65) (66) వాక్యాలు సమానార్థకాలు. రెండిట్లో క్రియలకు గుప్త నిర్మాణ కర్త సుబ్బారావు; కర్మ సుజాత. వాక్యం (66)లో సుబ్బారావుచేత అనే పద బంధాన్ని లోపింపజేస్తే అది భిన్నార్థబంధకం అవుతుంది.

(67)

సుజాత తిరస్కరించి అవమానించబడింది.

ఈ వాక్యానికి రెండర్థాలున్నై. ఒక అర్థంలో ఇది (65) (66) వాక్యాలకు సమానం. అంటే సుజాత రెండు క్రియలకు గుప్తనిర్మాణ కర్మగానే వ్యవహరిస్తుంది. రెండో అర్థంలో సుజాత ఎవర్నో తిరస్కరించిందని, ఆ 'ఎవరో' సుజాతని అవమానించారని భావం. అంటే క్త్వార్థకక్రియకు కర్త అనీ, ప్రధాన క్రియకు కర్మ అనీ తెలుస్తుంది. వాక్యంలో క్త్వార్థకక్రియ, ప్రధానక్రియ సన్నిహితంగా ఉన్నప్పుడే ఈ విధంగా రెండర్థాలు వస్తై. రెండు క్రియలూ వ్యవహితమైనప్పు డిట్లా రెండర్థాలు రావు.

(68)

సుజాత తిరస్కరించి ఘోరంగా అవమానించ బడింది.

ఈ వాక్యానికి రెండర్థాలు రావు, సుజాతా క్త్వార్థక క్రియకు కర్త. ప్రధాన క్రియకు కర్మ.

క్త్వార్థక క్రియ ప్రధాన క్రియకన్నా ముందు జరిగే వ్యాపారాన్ని సూచిస్తుంది.. అందువల్ల ఈ వాక్యాలు 'తరవాత' అనే పదం ఉన్న వాక్యాలతో సమనార్థ కాలవుతై.

(69)

a. సుజాత ఆన్నం తిని నిద్రపోయింది.
b.. సుజాత అన్నం తిని, తరవాత నిద్రపోయింది.
C. సుజాత అన్నం తిన్న తరవాత నిద్రపోయింది.

(69)లో సూచించిన మూడు వాక్యాల్లోనూ సుజాత రెండు వ్యాపారాలను నిర్వహించిందనీ, అందులో మొదటిది అన్నం తినటం, రెండోది నిద్రపోవటం అనీ అర్థం.

క్త్వార్థక వాక్యాల్లో ఏకకర్తృక నియమం సరైనదే అయినా కొన్ని విరుద్దమైన ప్రయోగాలు కనిపిస్తున్నై. ఉదాహరణకు :

(70)

గొర్రెల్ని తినేవాడు పోయి బర్రెల్ని తినేవాడు వచ్చాడు.

భిన్నకర్తృకమైన ఈ పైవాక్యం వ్యాకరణ సమ్మతమే. ఈ పైవాక్యం ఒక తెలుగు సామెత. కాని ఇట్లాంటి ప్రయోగాలు కేవలం సామెతల్లోనే సాధ్యమని అనుకోనక్కర్లేదు.

(71)

వాడుపోయి వీడెవ్వడు? వీడు హాయిగా నవ్వడు.

అని దాశరధి కృష్ణమాచార్యులుగారి ప్రయోగం ఒకటి ఉంది. “వీడెవ్వడు" అనే రూపానికి “వీడెవడోవచ్చాడు" అని అర్థం. సామాన్య భాషలో ఇట్లాంటివి సాధ్యమేనని కింది వాక్యాలు నిరూపిస్తున్నై.

(72)

a. బెంగాల్లో కాంగ్రెసువాళ్ళు ఓడిపోయి కమ్యూనిస్టులు గెల్చారు.
b. ఆంధ్రలో సంజీవరెడ్డి పడిపోయి బ్రహ్మానందరెడ్డి పైకివచ్చాడు.

ఏరకమైన క్రియ లున్నప్పుడు ఇట్లాంటి వాక్యాలు సాధ్యమో తెలియటం లేదు. పరస్పర విరుద్ధబోధ ఉన్న క్రియలున్నప్పుడు ఈ వాక్యాలు భిన్న కర్తృకతను సహిస్తయ్యని తోస్తున్నది.

2.12 : క్త్వార్థక క్రియతో ఉన్న వాక్యం ఒక్కోసారి ప్రధాన క్రియకు విశేషణంగా ప్రవర్తిస్తుంది. అప్పుడు క్త్వార్థక క్రియాసహిత వాక్యాల్లో తరవాత అనే పదం ఉండదు. తరవాత అనే పదం ఉన్న వాక్యాలతో ఇవి సమానార్థకాలు కావు. ఈ కింది వాక్యాల్లో అర్థబోధను గమనిస్తే ఈ విశేషాలు గ్రహించవచ్చు.

(73)

a. సుజాత ఆఫీసుకు జడ వేసుకుని వెళ్ళింది.
b. సుజాత జడవేసుకుని ఆఫీసుకు వెళ్లింది.
c. సుజాత జడవేసుకున్న తరవాత ఆఫీసుకు వెళ్ళింది.

పై మూడు వాక్యాల్లో b, c సమానార్థకాలు. కాని (73)a ఈ రెండింటితో సంపూర్ణ సమానార్థకం కాదు. (73)a లో క్త్వార్థక క్రియ ప్రధాన వ్యాపారం నిర్వహించేటప్పుడు కర్త ఉన్నస్థితిని తెలియజేస్తున్నది. ప్రధాన క్రియకు సన్నిహిత స్థితిలో ఈ అర్థం (73a) లో స్ఫురిస్తున్నది. ఉచ్చారణలో వ్యవధానాన్ని సూచిస్తే ఇది (73 b, C) లతో సమానార్థకం కావచ్చు.

ధాతువుకు అకుండా అనే ప్రత్యయాన్నిచేరిస్తే వ్యతిరేక క్త్వార్థకరూపం ఏర్పడుతుంది. ఇది ఎప్పుడూ కర్తృస్థితి బోధకంగానే ప్రవర్తిస్తున్నట్టు తోస్తున్నది. ఇదే నిజమైతే కేవల వ్యాపారపూర్వికతా బోధలో వ్యతిరేకరూపం లేదనే చెప్పాల్సి ఉంటుంది.

(74)

a. సుజాత ఆఫీసుకు జడవేసుకోకుండా వెళ్ళింది.
b. సుజాత జడవేసుకోకుండా ఆఫీసుకు వెళ్ళింది.

ఈ రెండు వాక్యాల్లోనూ వ్యతిరేక క్త్వార్థకం స్థితి బోధకంగానే ప్రవర్తిన్నట్టు కనిపిస్తున్నది.

ప్రధానక్రియలో వ్యతిరేకబోధ క్త్వార్థక క్రియాసహితవాక్యాలు భిన్నార్థ బోధకా సమర్థాలవుతై.

(75)

సుబ్బారావు ఇడ్లీ తిని కాఫీ తాగలేదు.

ఈ పై వాక్యంలో రెండర్థాలున్నై, ఆ అర్థాలు ఈ కింది వాక్యాల్లో వ్యక్తమవుతై .

(76)

సుబ్బారావు ఇడ్లీ తిన్నాడు కాని కాఫీ తాగలేదు.


(77)

సుబ్బారావు ఇడ్లీ తినికాదు కాఫీ తాగింది.

రెండో అర్థంలో (వాక్యం (77)కు సమానార్థంలో) “ఇడ్లీతిని" అనే పదం మీద ఊనిక ఉంటుంది.

2.13 కొన్ని క్రియలు క్త్వార్థకరూపంలో ప్రధానక్రియకు సన్నిహితంగా ఉండి వ్యాపారం రీతిని బోధిస్తై. ఈ రకమైన క్రియలను ఉపవాక్యాలుగా వేరు చెయ్యటంకూడా కష్టమవుతుంది. నడిచివెళ్లు, తీసుకువెళ్లు, తీసుకురా , లాగితన్ను వంటివి ఇట్లాంటివి. నన్నయగారి భారతభాగంలో “పావనములైన శిరోజములం దెమల్చి పాపావహు డీడ్చితెచ్చె' (సభా-2-216) అనే ప్రయోగంలో ఈ రకమైన క్రియను చూడవచ్చు. ఇవికాక క్త్వార్థకక్రియతో ఉన్న ఉపవాక్యాలు ప్రధానవాక్యానికి రీత్యర్థక విశేషణాలుగా ప్రవర్తించటం, ఈ కింది వాక్యాల్లో చూడవచ్చు.

(78)

a. ఆ ఇంజనీరు లంచాలు తిని సంపాయించాడు.
b. ఆ పంతులుగారు ప్రైవేట్లు చెప్పుకుని బ్రతుకున్నాడు.

ఈ పై వాక్యాల్లో క్త్వార్థక క్రియ ప్రధాన వ్యాపారరీతీకన్నా సాధనాన్నే బోధిస్తున్నది. కరణకారకానికి అవసరమైన సాధనాల్లో మూర్తమూ, అమూర్తమూ అనే విభాగాన్ని అంగీకరిస్తే ఇక్కడ క్త్వార్థక క్రియలను ప్రధానవ్యాపారానికి అమూర్త సాధనాలని ప్రతిపాదించవచ్చు. ఈ పై వాక్యాల్లో క్రమంగా “లంచాలు తినటంద్వారా, ప్రైవేట్లు చెప్పుకోటంద్వారా " అని క్త్వార్థక క్రియస్థానంలో ప్రయోగించినా అదే అర్థం వస్తుంది. బహుశా కింది వాక్యాలకుకూడా ఇదే రకమయిన వ్యాఖ్య అనువర్తించవచ్చు.

(79)

a. సుజాత రిక్షా ఎక్కి సినిమాకు వెళ్ళింది.
b. సుజాత బస్సెక్కి బెజవాడ వెళ్ళింది.

2.14 : ఈ క్త్వార్థక క్రియ ఒక్కొక్కప్పుడు ప్రధానక్రియకు హేత్వర్థక మవుతుంది. ఏ రకమయిన నియమాలున్నపుడు హేత్వర్థం వస్తుందో చెప్పటం కష్టం. ఈ కింది వాక్యాలని ముందుగా పరిశీలించండి.

(80)

a. సుబ్బారావు పాఠంచెప్పి అలిసిపోయాడు.
b. సుజాత భర్తతో పోట్లాడి బాధ పడుతున్నది.
c. సుబ్బారావు కోడిగుడ్లు తిని బలిశాడు.
d. సుబ్బారావుకు కోడిగుడ్లు తిని అజీర్తి చేసింది.

పై నాలుగు వాక్యాల్లోనూ కర్తచేసిన వ్యాపారానికి కర్తే అనుభోక్తగా (experiencer) ప్రధానవాక్యంలో సూచించబడింది. పై వాక్యాలవల్ల హేత్వర్థంలో వ్యక్త నిర్మాణపుకర్తలు ఒకటిగా ఉండాలనే నియమంలేదు కాని, ఒక వ్యాపా రానికి కర్త అయి ప్రాణి రెండోవ్యాపారానికి అనుభోక్తగా ఉండాలనే నియమం ఉంది. అందువల్లనే ఈ కింది వాక్యం వ్యాకరణ విరుద్ధమయింది

(81)

సుబ్బారావు పాఠం చెప్పి సుజాత అలసిపోయింది.

(80) లో సూచించిన వాక్యాలలో ప్రధానక్రియ దేహమనః పరిణామ బోధకం కావటం కూడా విశేషం. ఒక ప్రాణికి కలిగిన అనుభవం (experience) అదే ప్రాణి నిర్వహించే వ్యాపారానికి కాని, అదేప్రాణికి జరిగిన ఇంకో అనుభవానికి గాని హేతువు కావచ్చు. అప్పుడు అనుభవబోధకమైన మొదటిక్రియ క్త్వార్థక రూపంలో ఉంటుంది.

(82)

a. సుబ్బారావు కోపం వచ్చి పెళ్లాన్ని కొట్టాడు
b. సుజాతకు జలుబుచేసి జ్వరం వచ్చింది.

పై రెండు వాక్యాల్లోనూ క్త్వార్థకక్రియ బోధించే అనుభవాలకు ప్రాణి వాచకాలు అనుభోక్తలు. (82) a. లో ప్రదాన క్రియావ్యాపారానికి ప్రాణివాచక నామం కర్త. (82) b. లో ప్రధాన క్రియకు (కూడా) అనుభోక్త.

పై వాక్యాలను బట్టి ఈ కింది విశేషాలని గమనించవచ్చు. హేత్వర్థబోధ ఉన్న వాక్యాల్లో ప్రధాన క్రియగాని, క్త్వార్థక క్రియగాని, ఏదో ఒకటైనా దేహ మనః పరిణామ బోధకమైన క్రియ అయివుండాలని, అట్లాంటి క్రియకు అనుభోక్తగా ఉన్న నామమే ఇంకో క్రియకు అనుభోక్తగాగాని, కర్తగాగాని ఉండాలని తెలుస్తుంది. క్త్వార్థక వాక్యాలు భిన్నప్రాణి వాచకనామాలను కర్తలుగాగాని, అనుభోక్తలుగా గాని సహించవని చెప్పవచ్చు. అనుభోక్తలనుగూడా కర్తలుగా గుప్తనిర్మాణంలో ప్రతిపాదిస్తే క్త్వార్థక క్రియాసహిత వాక్యాలు ఏకకర్తృకాలుగా ఉండాలనే నియమాన్ని నిలుపుకోవచ్చు. అప్పుడు వ్యాపారాశ్రయత్వానికి విపులమైన ఆర్థం చెప్పుకోవాలి. అంటే నాకు జలుబు చేసింది అనే వాక్యంలో నేను అనే శబ్దాన్నే కర్తగా గుర్తించి కొన్ని క్రియా సందర్భాల్లో కర్తకు కు వర్ణకం వ్యక్తనిర్మాణంలో చేరుతుందని చెప్పటం ఒక పద్ధతి. క్త్వార్థక క్రియలు ఏక కర్తృకమై ఉండాలనే నియమం అప్పుడు గుప్తనిర్మాణ నియమం (deep structure constraint) అవుతుంది. అయితే అట్లాంటి నియమానికి ఇంతకు పూర్వం చర్చించిన కర్మణి వాక్యాలు విరుద్ధమవుతై. అక్కడ ఏక కర్తృక నియమం క్త్వార్థక సూత్రం వర్తించేటప్పటి నియమంగా గుర్తించాం. ఏ రకమైన వ్యాకరణ ప్రక్రియను అనుసరించినా ఎక్కడో ఒకచోట వ్యాకరణంలో అనుభోక్తృ సంబంధాన్ని గుర్తించాల్సి వస్తుంది.

పైన ప్రతిపాదించిన అనాభోక్తృ నియచూనికి విరుద్ధంగా కూడా కొన్ని వాక్యాలు కనిపిస్తున్నై.

(83)

a. సుజాత భర్తతో పోట్లాడి పుట్టింటి కెళ్ళింది.
b. సుజాత జ్వరం వచ్చి కాలేజీకి వెళ్లింది.

(83) (a) లో రెండు క్రియలకూ సుజాత కర్త. అయినా హేత్వర్థం వచ్చింది. అయితే పోట్లాడు వంటి క్రియలను పారస్పర్యార్థ బోధకాలుగా ఊహించ వచ్చు. అప్పుడు సుజాతను పోట్లాడు అనే క్రియకు కర్తగాను, అనుభోక్తగాను కూడా వ్యాఖ్యానించవచ్చు. ఉదాహరణకు ఈ కింది వాక్యంలో అనుభవబోధకత లేకపోవటంవల్ల హేత్వర్థం లేదు.

(84)

సుజాత భర్తను తిట్టి పుట్టింటికి వెళ్ళింది.

(83) (b) లో సుజాత అనుభోక్త. అయినా ఇక్కడ హేత్వర్థం లేదు. అందువల్ల అనుభోక్తృ సంబంధం ఉన్నప్పుడల్లా హేత్వర్థం వస్తుందని చెప్పలేం. ఈ వాక్యంలో (83b) హేత్వర్థానికి బదులు అప్యర్థం వస్తుంది. సుజాతకు జ్వరం వచ్చినా కూడా కాలేజి వెళ్ళింది అనే వాక్యార్థంతో (83) (b) సమానం. (83)(b)లో ప్రధాన క్రియ వ్యతిరేక క్రియ అయితే హేత్వర్థం వస్తుంది.

(85)

సుజాత జ్వరం వచ్చి కాలేజికి వెళ్ల లేదు.

దీన్నిబట్టి హేత్వర్థం వచ్చినప్పుడు అనుభోక్తృ సంబంధం అవసరమైనా, ఏ వ్యాపారాలకు (వ్యాపారాభావాలకుకూడా) కార్యకారణసంబంధం ఉందో వ్యవహర్తల పరిజ్ఞానాన్ని బట్టి సాంఘికమైన అలవాట్లను బట్టి మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈ వాక్యాల్ని చూడండి.

(86)

a. సుజాత భర్తతో పోట్లాడి పుట్టింటికి వెళ్లింది.
b. సుజాత భర్తతో పోట్లాడి సినిమాకి వెళ్లింది.

(86) (a)లో ఉన్న హేత్వర్థం (86) (b) లో లేక పోవటానికి కారణం ఆ భాషా సమాజంలోఉన్న సాంఘికమైన అలవాట్లు. వ్యాపారభావంకూడా హేత్వర్థంకావచ్చు. అప్పుడు క్త్వార్థక రూపానికి హేత్వర్థక వ్యతిరేక క్త్వార్థకం. ఉపయోగించబడుతుంది. ఇది ధాతువుకు అక అనే ప్రత్యయాన్ని చేర్చటంవల్ల ఏర్పడుతుంది.

(87)

సుబ్బారావు అన్నం తినక చిక్కిపోయాడు.

హేత్వర్థం లేనిచోట అక ప్రత్యయాంతరూపంవల్ల ఆధునికభాషలో వాక్యం వ్యాకరణ విరుద్ధమవుతుంది.

*(88)

సుబ్బారావు అన్నం తినక కాలేజికి వెళ్ళాడు.

తినకుండా అనే రూపం ఉపయోగిస్తే పై వాక్యం వ్యాకరణ సమ్మతమవుతుంది. ప్రాచీనభాషలో హేత్వర్థం లేనిచోట కూడా ఇట్లాంటిరూపం ఉండేదని "బ్రాహ్మణుల కవజ్ఞసేయక శమత్వంబు చేకొనుము" (అది. 67-129) అనే నన్నయ ప్రయోగంవల్ల తెలుసుకోవచ్చు. ఆధునికభాషలోకూడా కొన్నిచోట్ల హేత్వర్థం లేకుండా అక ప్రత్యయాంతరూపాలు కనిపిస్తున్నై.

(89)

a. ఊరికే నస పెట్టక తొందరగా రా,
b. బజారులో అటూయిటూ దిక్కులు చూడక సరిగ్గా నడువు.

బహుశా విధ్యర్థక వాక్యాల్లో ఇట్లాంటి ప్రయోగాలు సాధ్యం కావచ్చు. అక ప్రత్యయం కొన్నిరకాల అవ్యయాల, క్రియాపదాల నిర్మాణంలోకూడా ఉపయోగించ బడుతుంది. ఉదా : తినక ముందు, తినకపోతే, తినకతప్పదు. బహుకాలం చెయ్యని వ్యాపారాన్ని (లేనిస్థితిని) సూచించటానికి ఈ అక ప్రత్యయాంతరూపాన్ని ద్విరుక్తిలో ప్రయోగిస్తారు.

(90)

a. లేకలేక లోకాయి పుడితే లోకాయి కన్ను లొట్ట పోయింది.
b. పోకపోక పోతే వాళ్ళింట్లో టీ నీళ్ళుకూడా పొయ్యలేదు.

2.14 : ఇంతవరకూ పరిశీలించిన వాక్యాలు ప్రాణివాచక నామాలతో ముడివడిఉన్నై. అట్లాకాకుండా కేవల ఆప్రాణివాచకాలు కర్తృపదాలుగా ఉన్నప్పుడుకూడా క్త్వార్థక క్రియారూపం ప్రయోగించబడుతుంది. వస్తుస్థానభేదం వస్తుస్థితి భేదానికి హేతువవుతుంది.

(91)

అద్దం కిందబడి పగిలింది.

కొన్ని ప్రకృతిసిద్ధంగా జరిగే వ్యాపారాలు (సంఘటనలు) కూడా వస్తుస్థితి భేదానికి హేతువుకావచ్చు.

(92)

a. ఈయేడు గాలివాన వచ్చి మామిడిపండ్లు రాలిపోయినై .
b. వరదలు వచ్చి పంటలు దెబ్బతిన్నై.
c. చెరువు గట్టు తెగి పొలాలు మునిగి పోయినై .

ఒకదానితో ఒకటి సంబంధం లేకపోయినా రెండు ప్రకృతిసిద్ధమైన వ్యాపారాలను క్త్వార్థకక్రియను ఉపయోగించి చెప్పవచ్చు. అప్పుడు ఆనంతర్యార్థక మవుతుంది.

(93)

వాన కురిసి, ఎండ కాసింది.

2.15 : క్త్వార్థకక్రియ తరవాత కొన్ని పరిమితవాక్యాలు, సాధారణంగా వ్యతిరేకార్థక ప్రతిపాదకాలు, వస్తై.

(94)

a. ఈ రోజుల్లో తెలుగు సాహిత్యం చదివి ఏం లాభం?
b. పౌర హక్కుల్ని గురించి పోలీసులకు చెప్పి ప్రయోజనం లేదు.

వీటిల్లోకూడా హేత్వర్థాన్ని గుర్తించవచ్చు. పై వాక్యాల్లో చదవటంవల్ల, చెప్పటంవల్ల అనే రూపాలను క్త్వార్థక క్రియకుబదులు వాడవచ్చు. హేత్వర్థంలో క్త్వార్థకక్రియ ఉన్నప్పుడు ప్రయోజనరాహిత్య సూచకమైన ఏ వాక్యమైనా రావచ్చు నన్నమాట. ఈ రకమైన వాక్యాలకు కర్త్రనుభోక్తృ నియమాలేవీ వర్తించవు.

2.16 : ఇవికాక క్త్వార్థకక్రియకు ఇంకో విశేషమైన ప్రయోజనం ఉంది. మొదటి (ఉప) వాక్యంలో క్వార్థక క్రియ ఉన్నప్పుడు ప్రధానవాక్యం కాలగమన బోధకం కావచ్చు.

(95)

సుజాత స్నానంచేసి వారం రోజులయింది.

వారం రోజులు రూపాన్నిబట్టి బహువచననామం అయినా ఇక్కడ ఏకవచన నామంగా - అంటే వారంరోజుల కాలంగా అన్వయించుకోవాలి. అందువల్ల చివరి క్రియ ఏకత్వ బోధకంగానే ఉంటుంది. అయింది బదులు అవుతుంది అని ప్రయోగించినా భూతకాలబోధకమే అవుతుంది. ఈ వాక్యంలో వారంరోజులు బదులు కాలవరిమాణాన్ని సూచించే ఏ నామాన్నైనా ఉపయోగించవచ్చు. మానార్థకం కాని నిన్న, మొన్న వంటి మాటల మాత్రం ప్రయోగార్హం కావు. ఈ పై వాక్యం ప్రధానార్థబోధలో ఈ కింది వాక్యానికి సమానం.

(96)

సుజాత వారం రోజులకిందట స్నానం చేసింది.

పైన కాలపరిమాణాన్ని గురించి చెప్పిన నియమాలే ఈ వాక్యానికికూడా వర్తిస్తై,

(95), (96) వాక్యాలకున్న సంబంధాలు చాలాభాషల్లో సమానం. ఇట్లాంటి వాక్యాలు ఈ రకపు నంబంధాలతో అన్ని భాషల్లో ఉండవచ్చు.

(95) లో క్త్వార్థకానికి వ్యతిరేకరూపంకూడా ప్రయోగించవచ్చు. అప్పుడు. వాక్యం ఇట్లా ఉంటుంది.

(97)

సుజాత స్నానం చెయ్యక వారం రోజు లయింది.

(95) కీ (97) కీ అర్థబోధలో భేదం ఉంది. (95)లో సుజాత వారంరోజుల కిందట స్నానంచేసినట్టు మాత్రమే తెలుస్తుంది. తరవాతకూడాచేసి ఉండవచ్చు. చేసి ఉండకపోవచ్చు. (97) లో వారంరోజులపాటు స్నానంచెయ్యలేదని అర్థం. (97) ని (98) కి సమానార్థకంగా గ్రహించవచ్చు.

(98)

సుజాత వారం రోజులనుంచీ స్నానం చేయ్యలేదు.

ఈ వాక్యాల్లో వ్యతిరేక క్త్వార్థకం అన్నిరకాల క్రియలతోనూ సాధ్యంకాదు. ఉదాహరణకు ఈ కింది వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

*(99)

a. అతను చనిఫోక నెల రోజు లయింది.
b. అతనికి పెళ్ళికాక రెండేళ్లయింది.


*(100)

a. అతను నెల రోజుల నుంచీ చనిపోలేదు.
b. అతనికి రెండేళ్ల నుంచీ పెళ్ళి కాలేదు.

పునఃపునస్సంభవ యోగంలేని వ్యాపారాలను బోధించే క్రియలవల్ల 99, 100 లలో వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలయినై. ఈ కారణంవల్లనే ఈ కింది వాక్యాలు కూడా వ్యాకరణ విరుద్ధాలు.

*(101)

a. అతను విషం తాగక నెల రోజు లయింది.
b. అతనికి కలరా రాక రెండేళ్లయింది.

విషంతాగినా చనిపోకుండా ఉండి, విషంతాగటం కొన్ని రకాల వ్యాధులకు విరుగుడైతే (101) (a) వ్యాకరణ సమ్మతమవుతుంది. అట్లాగే కలరా అనేది ఇప్పుడున్నంత భయంకరమైన వ్యాధిగాకాక నేటి జలుబులాంటిది అయివుంటే అప్పుడు (101) (b) వ్యాకరణ సమ్మతమవుతుంది. (99) (b), (100) (b) లు కూడా ఒకవ్యక్తి అలవాటుగా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే వ్యాకరణ సమ్మత మవుతై . అంటే ఈ వాక్యాల వ్యాకరణసమ్మతి సామాజిక పరిస్థితులమీద ఆధారపడి ఉంటుందని గ్రహించవచ్చు.

2.17 : కొన్ని ప్రకృతిసిద్ధమైన సంఘటనలు క్త్వార్థక క్రియారూపంలో కాలార్థబోధలో ప్రయుక్తమవుతై.

(102)

a. అతను పొద్దెక్కి నిద్ర లేస్తాడు.
b. ఆమె పొద్దుగూకి ఇంటికి వెళ్తుంది.
C. అతడు చీకటిబడి యింటికి వచ్చాడు.

ఈ కింది వాక్యాలు వ్యాకరణ విరుద్దాలు.

*(103)

a. అతను ఫ్యాక్టరీ కూత కూసి నిద్ర లేస్తాడు.
b. ఆమె వాన కురిసి ఇంటికి వచ్చింది.
c. వాడు దీపాలుపెట్టి ఇంటికి వచ్చాడు.

(102) లో వాక్యాలు వ్యాకరణ సమ్మతాలయి (103) లో వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు కావటానికి కారణాలు ఈ విధంగా ఊహించవచ్చు. (102) లో వ్యాపారాలన్నీ ప్రకృతిసిద్ధాలు. అంతేకాక నియత సమయ ప్రవర్తితాలు (rhythmic). (103) (a), (b)లలో క్త్వార్థక క్రియలు నియత సమయ ప్రవర్తితాలైనా ప్రకృతిసిద్ధంకావు, (103) (b) లో ప్రకృతిసిద్ధమైనా నియతసమయ ప్రవర్తితం కాదు.

క్త్వార్థక క్రియాప్రయోగం ద్రావిడభాషల్లో విశేషమైనది. వీటిల్లో పూర్వ వ్యాపార బోధకత, హేత్వర్థం. కాలగమన బోధకత ఆర్యభాషల్లో కూడా ఉన్నై.

2.2 : శత్రర్థకం : క్త్వార్థక క్రియకున్న విశేష ప్రయోజనాలు శత్రర్థ క్రియకులేవు. ఏక కర్తృకంగా ఏకకాలంలో జరిగే వ్యాపారాలు బోధించటం శత్రర్థక క్రియల ప్రధాన ప్రయోజనం, క్త్వార్థక క్రియలాగే శత్రర్థక క్రియకూడా ప్రధాన క్రియకు రీతిబోధక విశేషణంగా ప్రవర్తిస్తుంది.

(104)

a. సుజాత నవ్వుతూ మాట్లాడుతుంది.
b. సుబ్బారావు ఏడుస్తూ పాఠం చెపుతాడు.

ఈ రకమైన రీతిబోధ అన్ని శత్రర్థ క్రియలకూ లేదు. ఉదాహరణకు,

(105)

a. సుజాత మాట్లాడుతూ ఊరికే నవ్వుతుంది.
b. సుబ్బారావు పాఠం చెపుతూ నెత్తి గోక్కుంటాడు.

ఈ వాక్యాల్లోకూడా ఏక కర్తృనియమం గుప్త నిర్మాణ నియమంగా కనవడదు. ఉదాహరణకు ఈ వాక్యంలో క్రియలు గుప్త నిర్మాణంలో ఏక కర్తృకాలు కావు.

(106)

ప్రభుత్వాలు ప్రజలచేత ఎన్ను కోబడుతూ ప్రజల్ని పీడిస్తుంటై.

స్థూలదృష్టితో శత్రర్థక ప్రధానక్రియలు ఏకకాలంలో జరుగుతున్నట్టు చెప్పినా ఇది నిజంకాదు. రెండు వ్యాపారాల నడుమ వ్యవధి లేనపుడు కూడా శత్రర్థక క్రియ ప్రయోగించబడుతుంది. (106) లో ఈ రకమైన అర్థాన్ని చూడవచ్చు. అట్లాగే ఈ కింది వాక్యంలో కూడా,

(107)

సుబ్బారావు ఊరికి వెళ్తూ మా యింటికి వచ్చాడు.

ఇక్కడ 'వెళ్లబోతూ' అని అర్థం.

నియతసమయ ప్రవర్తితాలయిన ప్రకృతిలో మార్పుల్ని పురస్కరించుకుని చేసే కాలబోధలో క్త్వార్థకంలాగే శత్రర్థకం కూడా ప్రయుక్త మవుతుంది.

(108)

a. అతను పొద్దు పొడుస్తూనే పొలం పనుల కెళతాడు.
b. చీకటి పడుతూనే ఇంటికొస్తాడు.

ఏవార్థ జోధక ప్రత్యయం లేకుండా ఈ వాక్యాలు ప్రయోగంలో లేవు.

2.31 : చేదర్థకం : ధాతువుకు తే అనే ప్రత్యయాన్ని చేరిస్తే చేదర్థక రూపం ఏర్పడుతుంది. కొన్ని మండలాల్లో ధాతువులో అసాధ్యమైన అచ్చులు ఈ ప్రత్యయం ముందు హ్రస్వ కారాలుగా మారతై, మారని క్రియారూపాలు కాకినాడ, విజయనగర ప్రాంతాలవైపు వినిపిస్తై. ప్రధానవాక్యంలో వ్యాపారం ఉపవాక్యాల వ్యాపారాలమీద ఆధారపడ్డట్టుగా చేదర్థక వాక్యాలలో భావించబడు తుంది. ఆధారదళంలో తే ప్రత్యయాంత క్రియారూపం ఉంటుంది. చేదర్థక రూపానికి వ్యతిరేకరూపం అక పోతే అనే రూపాన్ని చేర్చటంవల్ల ఏర్పడుతుంది. చేదర్థక క్రియ ఉన్నప్పుడు ప్రధానవాక్యంలో భవిష్యద్బోధక క్రియ ఉండటం సాధారణ స్థితి.

(109)

a. వానలు కురిస్తే పంటలు పండుతై .
b. అడక్కపోతే అమ్మ అయినా పెట్టదు.
C. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా?

2.32 : ప్రధాన వాక్యంలో భూతకాలిక వ్యాపార సమాప్తిని సూచించే సమాపక క్రియ ఉన్నప్పుడు చేదర్థక క్రియ రెండు వ్యాపారాలను క్రమానుగతిని కాని, హేత్వర్థాన్ని కాని సూచిస్తుంది.

(110)

a. వాళ్లింటికి వెళితే సుజాత మంచి కాఫీ ఇచ్చింది.
b. సుబ్బారావు వస్తే సుజాత చివాట్లు పెట్టింది.

2.33 : సంభావ్యమైన వ్యాపారాల మధ్యేకాని, సమాప్తినందిన వ్యాపారాల మధ్య చేదర్థ బోధకత లేదని దీనివల్ల తెలుసుకోవచ్చు. భూతకాలంలో సంభావ్యమైన వ్యాపారాలమధ్య చేదర్థం - (conditionality) బోధించాలంటే సమాప్తిని బోధించని క్రియారూపం ఉండాలి. అలాంటి క్రియ తెలుగులో లేనందువల్ల క్రియా జన్య విశేషణం మీద నిర్మించబడ్డ నామం ఉపయోగించ బడుతుంది. సంభావ్యమాన భూతకాల వ్యాపారాలతో చేదర్థకబోధ చేసేటప్పుడు ఉండు ధాతువును అను ప్రయుక్తం చేసినా అర్థంలో మార్పురాదు.

(111)

a. జ్వరం తగ్గితే కాలేజికి వచ్చేవాడు .
b. జ్వరం తగ్గితే కాలేజీకి వచ్చి ఉండేవాడు.
C. జ్వరం తగ్గి ఉంటే కాలేజికి వచ్చేవాడు.
d. జ్వరం తగ్గి ఉంటే కాలేజికి వచ్చి ఉండేవాడు.

ఈ పైవాక్యాలన్నీ సమానార్థకాలు. వ్యతిరేక చేదర్థకానికి కూడా ఇట్లాంటి అవకాశమే ఉంది. ప్రధానవాక్యంలో ఆఖ్యాతానికి, నామానికి లాగే వ్యతిరేకరూపం ఉంటుంది. ప్రధాన ఉపవాక్యాల రెండిట్లోనూ వ్యతిరేక క్రియ ఉంటే ఈ వ్యతిరేకార్థం వస్తుంది. (111) లో వాక్యాల్లో వ్యక్తమయిన రెండు వ్యాపారాలు జరలేదు. కేవల సంభావ్యాలు. జరిగినదానికి, సంభావ్యానికి వైరుధ్యం (111) వాక్యాల్లో గమనించవచ్చు. భవిష్యత్క్రియా వాక్యాల్లో ఇట్లాంటి వైరుధ్యం ఉండదు.

2.34 : చేదర్థక క్రియ తరవాత కొన్ని ప్రత్యయాల్లాంటి ఆపదాలు ప్రయోగించవచ్చు. అప్పుడు ప్రధానక్రియ నామ్నీకృత మవుతుంది.

(112)

a. జ్వరం తగ్గితేనా వాడు కాలేజికి వచ్చేది ?
b. జ్వరం తగ్గితేకదా వాడు కాలేజికి వచ్చేది ?

ఒక అర్థంలో (112) లో వాక్యాలు (111) లో వాక్యాలకు సమానార్థకాలు. “జ్వరం తగ్గలేదు. కాలేజికి రాలేదు ” అని. రెండోఅర్థంలో కేవల భవిష్యదర్థం ఈ భిన్నార్థబోధకతకి కారణం. (112) లో నామ్నీకృతమైన క్రియారూపం (111) లోని ప్రధాన వాక్యంలో క్రియ అయినా కావచ్చు. కేవల భవిష్యద్బోధక క్రియ అయినా కావచ్చు. (113) లో ఈ క్రమం చూపించబడుతుంది.

(113)

a. జ్వరం తగ్గితే వాడు కాలేజికి వస్తాడు. + ఆ →
b. జ్వరం తగ్గితే + ఆ వాడు కాలేజి వస్తాడు →
c. జ్వరం తగ్గితేనా వాడు కాలేజికి వచ్చేది →
d. వాడు కాలేజికి వచ్చేది జ్వరం తగ్గితేనా?

క్రియా నామ్నీకృతమైతే పదక్రమ వ్యత్యయం జరగటం సామాన్య వాక్యాల్లో గమనించాం. అదే ప్రక్రియ ఇక్కడ కూడా (113) (d) లో చూడవచ్చు. (111) లో వాక్యాల్లో చివరిపదం నామ్నీకృత రూపంకాదు. అందువల్ల ఆ వాక్యాల్లో (113) (d) లాంటి పదక్రమ వ్యత్యయాన్ని సహించవు. ఉదాహరణకు ఈ కింది వాక్యం అవ్యవహితంగా ప్రయోగించినప్పుడు వ్యాకరణసమ్మతం కాదు.

*(114)

వాడు కాలేజికి వచ్చేవాడు, జ్వరం తగ్గితే.

2.35 : ఇంతవరకూ చర్చించిన వాక్యాలతో ఒకే వాక్యంలో వ్యక్తమయిన రెండు విషయాల మధ్య వైరుధ్యం లేదు. చేదర్థకరూపం తరవాత తప్ప, కాని, అనే శబ్దాలను చేరిస్తే అట్లాంటి వైరుధ్యం ఏర్పడుతుంది. ఆ వైరుధ్యాన్ని ఈ వాక్యాలు సహించవు గనుక అప్పుడు ప్రధాన వాక్యంలో క్రియ వ్యతిరేక క్రియగా మారుతుంది.

(115)

a. ఉత్పత్తి పెరిగితేకాని (తప్ప) ధరలుతగ్గవు.
b. ఎంతో బతిమిలాడితేగాని కిష్టప్ప అన్నం తినలేదు.

ప్రధానక్రియ వ్యాపార సమాప్తిని సూచిస్తే చేదర్థక క్రియకూడా వ్యాపారం జరిగినట్టుగానే సూచిస్తుంది. ప్రధాన వ్యాపారం సంభావ్యమానమైతే చేదర్థక క్రియ కూడా అదే సూచిస్తుంది. ఈ భేదం (115) a, b ల మధ్య చూడవచ్చు. ఈ వాక్యాల్లో వ్యతిరేక క్రియ వ్యతిరేకార్థం కాదు.

2.36 : చేదర్థక వాక్యంలో ఏక , భిన్న కర్తృకనియమం లేదు. అయినా ఏక కర్తృక మైనప్పుడు ప్రధానవాక్యంలో భవిష్యద్బోధక క్రియ ఉంటే వ్యాకరణ సమ్మతమవుతుంది. సమాప్తిని సూచించే భూతకాలిక క్రియ ఉంటే వ్యాకరణ విరుద్ధ మవుతుంది.

(116)

  a. సుజాత సినిమాకి వెళ్తే పల్లీలు తింటుంది.

  • b. సుజాత సినిమాకి వెళ్తే పల్లీలు తిన్నది.

(116) లో (b) భిన్నకర్తృకమైతే వ్యాకరణ నమ్మత మవుతుంది. ప్రధాన వాక్యం ప్రశ్నార్థకమైనా వ్యాకరణ సమ్మతమవుతుంది. హేత్వర్థబోధ ఉన్నప్పుడు. భూతకాలిక క్రియా యోగంలో చేదర్థక వాక్యాలు ఏక కర్తృకతను సహిస్తై.

(117)

సుబ్బారావు కోడిగుడ్లు తింటే బలిశాడు.

హేత్వర్థ బోధలో క్త్వార్థక, చేదర్థక వాక్యాలకు సంబంధముంది. హేత్వర్థ బోధను కలిగించే నియమాలు రెంటికి సమానం.

2.37 : క్రియారహిత వాక్యాలకు చేదర్థయోగంలో అగు ధాతురూపం చేరుతుంది.

(118)

అతడు దిగంబర కవి అయితే బట్టలు వేసుకున్నాడేం?

ఈ పై వాక్యంలో ప్రశ్నార్థక శబ్దం తీసేస్తే (116) (b) లాగా వ్యాకరణ విరుద్ధ మవుతుంది.

చేదర్థక క్రియలున్న వాక్యాల్లో ప్రధాన వాక్యస్థానంలో కేవల ప్రశ్నార్థక శబ్దాలుకూడా వస్తై.

(119)

a. ప్రజలకు తిండి లేకపోతే ఏం?
b. అధికార్లకు సలాములు కొట్టకపోతే ఎట్లా?
C. గుడ్డికన్ను మూస్తే ఎంత? తెరిస్తే ఎంత?

2.38 : క్రియాజన్య విశేషణం మీద అట్టు చేరిస్తే ఏర్పడ్డ నామానికి ఉంటే , అయితే అనే శబ్దాల్లో ఒకదాన్ని చేర్చి చేదర్థకాన్నీ తయారు చేయవచ్చు. అట్లాంటి వాక్యాల్లో ప్రధాన వాక్యంలో క్రియ భూతకాలికం కాగూడదు.

(120)

 a. నువ్వు రేపు పొద్దున వచ్చేట్టుంటే డబ్బిస్తాను.
 b. నువ్వు నిన్న సాయంకాలం వచ్చినట్టుంటే సినిమాకు వెళ్ళేవాళ్ళం.

  • c. నువ్వు నిన్న సాయంకాలం వచ్చినట్టుంటే సినిమాకి వెళ్లాం.

పై వాక్యాల్లో (c) వ్యాకరణ విరుద్ధం.

2.41 : అప్యర్ధకం : ధాతువుకు ఇనా అనే ప్రత్యయాన్ని చేర్చటంవల్ల, అవ్యర్థక క్రియ ఏర్పడుతుంది. రెండు వాక్యాలకు మధ్య నిరనుబంధ బోధకత ఉన్నప్పుడు మొదటి వాక్యంలో అప్యర్థక క్రియ ఉంటుంది, అందుకే ఒక్కోసారి రెండు వ్యాపారాల మధ్య వైరుధ్యం కూడా ఉంటుంది. అందువల్ల తరచుగా ఏవైనా ఒక క్రియలో వ్యతిరేక బోధకత కూడా ఉంటుంది.

(121)

a. వాడికి చదివినా మార్కులు రాలేదు.
b. వాడికి చదివినా మార్కులు రావు.

ఈ పై వాక్యాల్లో అప్యర్థక క్రియకు బదులు చేదర్థక క్రియకు కూడా అనే శబ్దాన్ని చేర్చి వాడిన అర్థభేదం రాదు.

(122)

a. వాడికీ చదివితే కూడా మార్కులు రాలేదు.
b. వాడికి చదివి కూడా మార్కులు రావు.

2.42 : క్రియాజన్య విశేషణంతో తయారయిన నామం చేదర్థకంలోలాగే (చూ. వాక్యాలు 111.) ఇక్కడ కూడా ప్రధానాఖ్యాతంగా ప్రయోగించవచ్చు.

(123)

a. వాడికి చదివినా మార్కులు వచ్చేవి కావు.
b. వాడికి చదవకపోయినా మార్కులు వచ్చేవి.

2.43 : ఈ అప్యర్థక వాక్యాల్లో ఒక్కోసారి భిన్నార్థాలు వస్తై.

(124)

ఆయన డబ్బు తీసుకున్నా మార్కులు వేసేవాడు కాదు.

ఈ పై వాక్యానికి మూడు రకాల అర్థాలున్నై. అవి ఈ కింద సూచించబడుతున్నై.

(125)

a. ఆయన డబ్బు తీసుకున్నా మార్కులు వేసే మనిషి కాదు.
b. ఆయన డబ్బు తీసుకునేవాడు కాని మార్కులు వెయ్యలేదు.
c. ఆయన డబ్బు తీసుకోలేదు, మార్కులు వెయ్యలేదు.

చివరి ఆఖ్యాతానికున్న భిన్నవ్యాకరణ ప్రవృత్తులవల్ల ఈ భేదం వచ్చింది. కేవల నామ ప్రవర్తనవల్ల (125a)లో అర్థం వచ్చింది. భూతకాలంలో అలవాటును సూచించే ఆఖ్యాతంగా ఈ రూపానికి ప్రవృత్తి ఉండటంవల్ల (125b)లో అర్థం వచ్చింది. అపిచేదర్థకాల్లో భూతకాల సంభావ్యమాన వ్యాపారాన్ని సూచించే ప్రవృత్తివల్ల (125c)లో అర్థం వచ్చింది. (123 a, b) లకీ (125) a లో సూచించిన అర్థం లాంటిది లేదు కాని b, c లలో సూచించిన అర్థాలకు తుల్యమైన అర్థాలున్నై.

2.44 : చేదర్థకంలో లాగే మిగతా అసమాపక క్రియా రూపాలన్నిటికీ కాని శబ్ద ప్రయోగం చెయ్యవచ్చు. కాని అవ్యర్థంలో కాని శబ్ద ప్రయోగంవల్ల అర్థంలో మార్పుండదు.

(126)

a. ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గవు.
b. ఉత్పత్తి పెరిగినా దాని ధరలు తగ్గవు.

ఇంతకు పూర్వమే చెప్పినట్లుగా అప్యర్థక వాక్యాల్లో వ్యాపారాల మధ్య నిరనుబద్ధత (disjunction) వ్యక్తమవుతుంది. క్త్వార్థక, శత్రర్థక, చేదర్థకాది మిగతా వాక్యాల్లో వ్యాపారాల మధ్య సానుబద్ధత వ్యక్తమవుతుంది. అందువల్ల అక్కడ కాని శబ్దప్రయోగంవల్ల ఈ అనుబంధం దెబ్బ తింటుంది. తనకు పూర్వ మున్న అసమాపక క్రియకు కాని శబ్దం వైరుధ్యాన్ని సమకూరుస్తుంది. అందువల్ల ఆ వాక్యాల్లో అసమాపక క్రియతో కాని శబ్దప్రయోగం సమాపక క్రియలో వ్యతిరేకతని కోరుతుంది. అసమాపక క్రియలోనే వ్యతిరేకత ఉంటే కాని శబ్దం ప్రయోగార్హం కాదు. అందువల్ల కాని శబ్దంతో ఉన్న ఈ కింది వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

*(127)

a. అతను అన్నం తినకగాని కాలేజికి వెళ్తాడు .
b. ఉత్పత్తి పెరగకపోతేగాని ధరలు తగ్గుతై

పై వాక్యాల్లో ప్రధానక్రియ వ్యతిరేకంలో ఉన్నాగాని తప్పేఅవుతై. దీన్ని బట్టి ఆప్యర్థక క్రియావాక్యాలు నిరనుబద్ధతను (disjunction),. అవ్యర్థకేతర అసమాపక క్రియావాక్యాలు సానుబద్ధతను (conjunnction) వ్యక్తం చేస్తయ్యని తెలుస్తుంది.

2.45 : కాని , అయినా అనే శబ్దాలకు శబ్దరీత్యా అను ధాతువుతో సంబంధముంది. మొదటిది వ్యతిరేక క్రియాజన్య విశేషణం. రెండోది అవ్యర్థ రూపం. ఈ రెండూ ఇతరత్రా కూడా నిరనుబద్ధతను బోధించ గలవు. కలమయిన , పెన్సిలయిన ; కలంగాని, పెన్సిల్ గాని ఆనే పదబంధాలు కలమో, పెన్సిలో అనే పదబంధానికి నిరనుబంధ బోధతో సమానం. రెండు ప్రతిపాదిత విషయాల మధ్య వైరుధ్య మున్నట్టు భావించినప్పుడు కూడా ఈ శబ్దాల ప్రయోగం జరుగుతుంది. ఉదాహరణకు ఈ కింది వాక్యాలు చూడండి.

(128)

a. మనది ప్రజాస్వామ్య దేశం. అయినా పౌరహక్కులు లేవు.
b. ఆయన చాలా గొప్ప పండితుడు. కాని కొద్దిగా కొసవెర్రి ఉంది.

2.46 : చేదర్థక క్రియకులాగే అప్యర్థక క్రియ తరవాత కూడా కొన్ని పదబంధాలు ప్రధాన వాక్యాల స్థానంలో వస్తై.

(129)

a. గుడ్డికన్ను మూసినా ఒకటే, తెరచినా ఒకటే.
b. కవిత్వానికి ఛందస్సు లేకపోయినా ఫరవాలేదు.
c. ఈ రోజుల్లో కష్టపడి చదివినా ప్రయోజనం లేదు.

2.47 : క్త్వార్థకాది అసమాపక క్రియా వాక్యాలు సానుబంధ బోధకాలనీ,. అప్యర్థక వాక్యాలు నిరనుబంధ బోధకాలనీ, పూర్వం సూచించబడింది. ఈ అనుబంధ భేదాల్నిబట్టి క్త్వార్థక, శత్రర్థక, చేదర్థక భేదాలు ఏర్పడ్డై. క్త్వార్థకం వ్యాపార ఆనుపూర్విక సంబంధాన్ని, శత్రర్థకం నమసామయిక సంబంధాన్ని తెలియజేస్తై. ఆ రెంటికీ ఏకకర్తృకాది నియమాలు కొన్ని సమానంగా ఉన్నై. ఆ రెండూ ప్రధాన వ్యాపారానికి రీత్యర్థక విశేషణాలుగా ప్రవర్తించటం కూడా చూశాం. చేదర్థక అప్యర్థక భేదం వ్యాపారాధార నిరాధార భేదాన్ని బట్టి ఏర్పడింది, ఆర్థికంగా అప్యర్థక వాక్యాలను చేదర్థక వాక్యాలకు వ్యతిరేక సమ రూపాలుగా భావించవచ్చు. ఈ రెంటికీ కొన్ని సామ్యాలున్నై. భూతకాలిక సంభావ్యమాన వ్యాపారసూచక అఖ్యాత ప్రయోగం రెంటికీ సమానం. ఈ రెంటికీ ఏక కర్తృక నియమం లేదు.

2.5 : ఇవికాక వ్యాపారాలమధ్య కాలవ్యవధికత, అవ్యవధికత, హేతువు, మొదలైనవి ఉపవాక్యాల ద్వారా వ్యక్తమవుతై. ఉపవాక్యాల్లో అన్నంతక్రియ క్రియమీదగానీ, అక ప్రత్యయాంతావ్యయం మీదగానీ, ధాతుజవిశేషణం మీద గానీ కొన్ని ప్రత్యయాలకు, అవ్యయాలను చేర్చటంవల్ల ఈ అర్థాలు సాధ్యమవుతై .

(130)

a. సుజాత నిద్ర లేవగానే కాఫీ తాగుతుంది.
b. సుజాత నిద్ర లేచిన వెంటనే కాఫీ తాగుతుంది.

c. సుబ్బారావు కాఫీ తాగకముందు సిగరెట్టు కాలుస్తాడు.
d. సుబ్బారావు కాఫీ తాగేముందు సిగరెట్టు కాలుస్తాడు.
e. సుబ్బారావు కాఫీ తాగేటప్పుడు సిగరెట్టు కాలుస్తాడు.
f. సుబ్బారావు కాఫీ తాగిన తరవాత వక్కపొడి వేసుకుంటాడు.

ఈ పై వాక్యాల్లో రెండు వ్యాపారాల మధ్య ఉన్న కాల సంబంధం వ్యక్త మవుతున్నది.

ఈ వాక్యాలు ఏకకర్తృకాలు కావచ్చు, భిన్న కర్తృకాలు కావచ్చు. వాటిల్లో ఉపయోగించే ప్రత్యయాలు, అవ్యయాలు, క్రియారూపంతో కొన్ని విధినిషేధాలను బట్టి చేర తై. ఉదాహరణకు, తాగిన ముందు, తాగుతున్న ముందు, తాగనిముందు , తాగే వెంటనే , తాగని వెంటనే , తాగే తరవాత , తాగని తరవాత మొదలైన రూపాలు లేవు.

2.61 : అన్నంత క్రియ బట్టి (< పట్టి) శబ్దాన్ని ప్రయోగించి హేత్వర్థంలో ఉపవాక్యంగా వాడవచ్చు. క్రియారహిత వాక్యాలకు అగు ధాతువు అన్నంత రూపమైన కా అనుబంధించబడుతుంది.

(131)

a. అతను కాపీ కొట్టబట్టి ప్యాసయ్యాడు.
b. ఆయన పెద్దవాడు గాబట్టి ఏం చేసిన చెల్లుతుంది.

2.62 : బట్టి తో వ్యతిరేక క్రియారూపాలు లేవు. ఈ అసమాపక క్రియకు వ్యతిరేక రూపం అక ప్రత్యయాంత రూపం . మీద పోబట్టి చేర్చటంవల్ల ఏర్పడుతుంది.

(132)

a. మీరు సమయానికి రాకపోబట్టి పనికాలేదు.
b. మొగుడు ప్రయోజకుడు కాకపోబట్టి భార్య ఉద్యోగం చేయాల్సి వచ్చింది.

2.63 : బట్టి తో ఉన్న వాక్యాల్లో అన్ని రకాల ప్రధాన వాక్యాలు ఉండవు. ఉదాహరణ విధి, ప్రశ్నలు ప్రధాన వాక్యాలుగా ఈ కింది వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

(133)

* a. మీరు సమయానికి రాబట్టి తినండి.
* b. మీరు నమ్మకంగా చెయ్యబట్టి ఏం సాధించారు?

పై వాక్యాల్లో * a లో 'వచ్చారు కాబట్టి' అని, b లో చేశారు కాఇట్టి అని వాడితే వ్యాకరణ సమ్మతాలవుతై. హేత్వర్గాన్ని సూచించే ఈ బట్టి క్రియ వ్యాపార పరిసమాప్తిని, సహజస్థితిని మాత్రమే సూచించగలదు. సంభావ్యమాన వ్యాపారాన్ని సూచించలేదు. అట్టాంటి వాక్యాలను కాబట్టి తోనే అనుసంధించాలి.

(134)

మీ ఆవిడ రేపు వస్తుంది కాబట్టి మీకు దిగులు లేదు.

2.64 : రెండు వాక్యాలమధ్య హేతుసంబంధం ఉన్నప్పుడు ప్రధాన వ్యాపారాన్ని సూచించే వాక్యం కాబట్టి తో మొదలుకావచ్చు. అట్లాంటి రెండు వాక్యాలను కలిపినప్పుడు పూర్వక్రియతో అనుసంధించిన కాబట్టి వికల్పంగా అన్నంత క్రియమీద బట్టి తో ఆసమాపక క్రియగా ఏర్పడుతుందని సూచించుకో వచ్చు. పైన సూచించిన విధినిషేధాలననుసరించి అట్లాంటి రూపాలు సాధించుకో వచ్చు.

2.65: ప్రధాననాక్యం కాలగమనాన్ని సూచించేదయినప్పుడు ఈ బట్టి క్రియ వ్యాపార పర్యంతార్థాన్ని సూచిస్తుంది.

(135)

a. మీరు సిగరెట్లు కాల్చబట్టి ఎన్నాళ్లయింది?
b. ఆమె మెడిసిన్ చదవబట్టి పదేళ్లవుతున్నది.

అర్థబోధలో (135) లో వాక్యాలు (136) వాక్యాలతో సమానార్థకాలు.

(136)

a. మీరు ఎన్నాళ్లనుంచి సిగరెట్లు కాలుస్తున్నారు.
b. ఆమె పదేళ్లనుంచి మెడిసిన్ చదువుతున్నది.

(135) (136) లతో సూచించిన వాక్యాల సంబంధం క్త్వార్థకవాక్యాల విషయంలో (చూ. 2.16) సూచించిన సంబంధం లాంటిది. అయితే ఒక భేదం ఉంది. అవు క్రియతోనూ, కిందట అనే అవ్యయంతోనూ మానార్థక కాలబోధక నామం మాత్రమే రాగలదు. కాని నుంచి ఆనే ప్రత్యయంతో అట్లాంటి నియమం వర్తిస్తున్నట్టు లేదు.

(137)

* a. అతను నిన్న కిందట సిగరెట్లు కాల్చాడు.

b. అతను నిన్నటి నుంచి సిగరెట్లు కాలుస్తున్నాడు.
* c. అతను సిగరెట్లు కాల్చబట్టి నిన్న అవుతున్నది.

అయితే (136) వాక్యాల్లోకూడా బట్టి వాడవచ్చు. అప్పుడు కిందట అనే శబ్దానికి వర్తించిన నియమాలే వర్తిస్తై. ఉదాహరణకు—-

(138)

* b. అతను నిన్నబట్టి నాతో మాట్లాడటం లేదు.
* b. అతను నాతో మాటాడక పోబట్టి నిన్న అయింది.

అయితే నుంచి కి బట్టి కి పూర్తిగా దొరకని అర్థభేదంకూడా ఏమన్నా ఉండొచ్చు. (136) వాక్యాలలోక్రియ వ్యాపార అపరిసమాప్తిని సూచిస్తున్నది. అందువల్ల ఆ వాక్యాల్లోగాని, బట్టి- వాక్యాల్లోగాని, పునఃపున స్సంభవయోగంలేని వ్యాపారాలనుబోధించే క్రియలు రావు. అట్లాంటి క్రియలుండటం వల్ల ఈ కింది వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు .

*(139)

a. ఆ ముసలాయన పదేళ్ల నుంచీ చనిపోతున్నాడు.
b. ఆ ముసలాయన పదేళ్ళ బట్టి చనిపోతున్నాడు.
c. ఆముసలాయన చనిపోబట్టి పదేళ్లవుతున్నది.

వ్యతిరేక క్త్వార్థక ప్రయోగానికి ఇట్లాంటి నియమమే ఉన్నట్టు ఇంతకు ముందు గుర్తించాం. అందువల్ల అక పో బట్టి తో నిర్మించిన వ్యతిరేకరూపానికి, వ్యతిరేక క్త్వార్థకానికి ఈ కాలగమన ప్రయోగంలో భేదం లేదు.

(140)

a. నేను ఐస్‌క్రీం తినకపోబట్టి రెండేండ్లు అయింది.
b. నేను ఐస్‌క్రీం తినక రెండేళ్లయింది.

2.65 : క్త్వార్థక, వ్యతిరేకక్త్వార్థక ప్రయోగంవల్ల హేత్వర్థం రావటం గుర్తించాం. బట్టి - ప్రయోగంవల్లకూడా హేత్వర్థం వస్తుంది. అందువల్ల ఈ వాక్యాలన్నీ తుల్యార్థకాలవుతై. కాని ఏకార్థకాలయినట్లు కనబడదు. ఈ కింది వాక్యాలకు పోల్చిచూడండి.

(141)

a. సుబ్బారావు కోడిగుడ్లు తిని బలిశాడు.
b. సుబ్బారావు కోడిగుడ్లు తినబట్టి బలిశాడు.
c. కిష్టప్ప అన్నం తినక చిక్కిపోయాడు.
d. కిష్టప్ప అన్నం తినక పోబట్టి చిక్కిపోయాడు.

పై వాక్యాలలో a, c లలో లేని హేతుప్రాధాన్యం b, d లలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇంకా ఇతర భేదాలుకూడా ఉండొచ్చు.

2.70 : నామ్నీకరణాలు : ఒక వాక్యాన్ని మరో వాక్యంలో నామపదం స్థానంలో ప్రయోగించినప్పుడు కొన్ని మార్పులు జరుగుతై. ఆ మార్పుల్ని నామ్నీకరణ విధానం అంటారు.

2.71 : విభక్త్యర్థనామ్నీకరణం : ఒక సామాన్య వాక్యంలో క్రియకు పూర్వం నామపదాలు భిన్నకారకార్థాలను సూచిస్తై. అవి విభక్తి ప్రత్యయాలద్వారా వ్యక్తమవుతై. ఆ నామాల్లో దేనినైనా ఉద్దేశ్యంచేసి మిగతా వాక్య భాగాన్ని విధేయం చేసేపద్ధతి విభక్త్యర్థ నామ్నీకరణం. ఈ ప్రక్రియలో ఉద్దేశ్యం చెయ్యబడిన పదబంధం క్రియకు పరస్థానానికి జరుగుతుంది. అప్పుడు క్రియ విశేషణంరూపంగా మారుతుంది. దాన్నే క్రియాజన్యవిశేషణమని ప్రాచీనులు వ్యవహరించారు. క్రియా నంతర స్థానానికి జరిగిన పదబంధంలో ఉన్న విభక్తి ప్రత్యయం ఈ ప్రక్రియలో లోపిస్తుంది. అయినా విభక్త్యర్థాన్ని గ్రహించగలుగుతాం. ఈ రకంగా నిష్పాదించిన నామబంధాన్ని ఇంకో వాక్యంలో నామంగా ప్రయోగించవచ్చు. ఈ కింది ఉదాహరణలు గమనిస్తే పై విషయాలు స్పష్టమవుతై.

(142)

సుజాత తెడ్డుతో భర్తను కొట్టింది →
? a. సుజాత తెడ్డుతో కొట్టిన భర్త.
  b. సుజాత భర్తను కొట్టిన తెడ్డు.
  c. భర్త ను తెడ్డుతో కొట్టిన సుజాత.

పైన నిష్పన్నం చేసిన నామబంధాల్లో క్రమంగా భర్త, తెడ్డు, సుజాత అనే నామాలు ఉద్దేశ్యాలు. వీటికి మూలవాక్యంలో ఉన్న విభక్తులు లోపించినా వాటి కారకార్థాలకు లోపం కలగలేదు. అదే ఈ ప్రక్రియలో ఉన్న విశేషం.

పై నామబంధాల్లో (a). ఆధునికసమాజంలో వ్యాకరణ సమ్మతంకాదు. అందుక్కారణం ఈనాటి సమాజంలో చట్టబద్ధమైన బహుభర్తృకాచారం లేక పోవటం. అట్లాంటి సమాజంలో ఇది వ్యాకరణ సమ్మతమే. వ్యాకరణ నమ్మతికి సామాజికమైన అలవాట్లకు, వ్యక్తిగతమైన నమ్మకాలకు ప్రమేయం ఉంటుందని కూడా ఈ ఉదాహరణ నిరూపిస్తుంది. బహుత్వబోధకవకాశంలేని నామం ఈ ప్రక్రియలో ఉద్దేశ్యంగా ఉండటానికి అర్హంకాదనేది ఇక్కడ గ్రహించాల్సిన వ్యాకరణ విశేషం.

వాక్యంలో ఉద్దేశ్యంగా జరిగేది కేవలనామపదంకాదని, విశేషణాదికాలతో కూడిన నామబంధం అనీ ఈ కింది ఉదాహరణనుచూస్తే తెలుస్తుంది.

(143)

సుజాత మద్రాసులో (ఒక) జరీ అంచు పచ్చపట్టు చీరకొన్నది.
→సుజాత మద్రాసులో కొన్న జరీ అంచు పచ్చపట్టు చీర .

ఇట్లాంటి నిష్పన్న నామాలు భిన్నార్థకబోధకాలవుతై. పై వాక్యానికి రెండర్థాలున్నై. (1) సుజాత ఒక పట్టుచీరకొన్నది. అది కొన్నది మద్రాసులో (2) సుజాత కొన్ని పట్టుచీరలుకొన్నది. అందులో ఒకటి మద్రాసులో కొన్నది. (మిగతావి కంజీవరంలోనో, ధర్మవరంలోనో మరెక్కడో కాని ఉండవచ్చు.)

మూల వాక్యంలో కర్తృపదంకాని, కర్మపదంగాని ఏ అడ్డంకులు లేకుండా ఈ నామ్నీకరణలో ఉద్దేశ్యాలుకావచ్చు. కాని మిగతా విభక్తులలో అన్నిటికీ ఇట్లాంటి అవకాశం లేదు.

2.711 : తో అనే విభక్తి తెలుగులో బహుళార్థాల్లో ప్రయుక్తమవుతుంది. వాటిల్లో ప్రధానమైనది కరణార్థం. ఈ అర్థంలో నామ్నీకరణం సాధ్యం. కాని ఇతరార్థాల్లో సాధ్యం కాదు.

(144)

a. సుజాత కలంతో పరీక్ష రాసింది.
            → సుజాత పరీక్ష రాసిన కలం.
b. సుజాత శ్రద్ధతో పరీక్ష రాసింది.
            → * సుజాత పరీక్షరాసిన శ్రద్ధ.
c. సుజాత జ్వరంతో పరీక్ష రాసింది
            → * సుజాత పరీక్షరాసిన జ్వరం.

పై వాక్యాల్లో తో (a) లో కరణార్థంలోనూ, (b) లో రీత్వర్థంలోనూ, (c)లో కర్తృదేహస్థితి బోధకంగాను ఉపయోగించబడింది. కరణేతరార్థాల్లో నామ్నీకరణం నిరాకృతమయింది. . తో వచ్యర్థధాతువుల అముఖ్య కర్మతోనూ, మూల పదార్థార్థంలోనూ, స్థితి హేతుకంగాను, ప్రతిక్రియాపేక్షక క్రియాప్రయోగంలో కర్మపదంతోనూ, నహార్థంలోను ప్రయుక్తమవుతుంది. వీటిల్లో కొన్నిటితో మాత్రమే నామ్నీకరణం సాధ్యమవుతుంది.

(145)

a. నేను ఆ అమ్మాయితో ఒక రహస్యం చెప్పాను.
       → నేను రహస్యం చెప్పిన అమ్మాయి.
            ( * నేను చెప్పిన అమ్మాయి)
b. ఈ బల్ల కట్టెతో చేశారు.
          → ఈ బల్ల చేసిన కట్టె.
C. సుజాత తలనొప్పితో బాధపడుతున్నది.
               → ? సుజాత బాధపడుతున్న తల నొప్పి.
d. సుజాత పనిమనిషితో పోట్లాడుతుంది.
               → సుజాత పోట్లాడే పనిమనిషి.
e. సుజాత స్నేహితులతో క్లబ్బుకి వెళ్లింది.
               → * సుజాత క్లబ్బుకి వెళ్లిన స్నేహితులు.

(145) (a) లో చెప్పు అనే క్రియతో అమ్మాయి అనే నామం ముఖ్య కర్మగానూ, అముఖ్యకర్మగాను రావచ్చు. (ముఖ్యకర్మ : ఆ అమ్మాయిని గురించి నీకు చెప్పాను.) నిష్పన్న నామబంధంలో ముఖ్యకర్మను బోధించే నామం లేకపోతే ఉన్ననామమే ముఖ్యకర్మస్థానాన్నీ ఆక్రమిస్తుంది. అందులో (145) (a) లో బ్రాకెట్లలో సూచించిన నామబంధం ఉద్దేశించిన ఆర్థాన్నీ బోధించదు. (c) లో తో అనుభోక్తృ దేహస్థితి హేతువును సూచిస్తుంది. తలనొప్పులలో రకరకాలను భావించి నప్పుడు (c) లో నిష్పన్న మైన నామం వ్యాకరణ సమ్మతమవుతుంది. (e) లో సహార్థంలో తో ప్రయుక్తమయింది. ఈ అర్థంలో నామ్నీకరణ సాధ్యంకాదు.

2.712 : కు విభక్తికూడా తెలుగులో బహుళార్థాల్లో ప్రయుక్తమవుతుంది. దానార్థక క్రియలతోను, వచ్యర్థక క్రియలతో అముఖ్యకర్మబోధకంగా, గమనార్థక క్రియలతో గమ్యసూచకంగానూ, అన్త్యర్థకక్రియతో స్వామ్యార్థంలోను, దేహమనస్థితి బోధకంగానూ, బాంధవ్యార్థంలోను, దేహమనఃస్థితులకు హేతు బోధలోనూ, కాలార్థంలోనూ ఇట్లా రకరకాల అర్థాల్లో ఈ విభక్తి ప్రయుక్త మవుతుంది, అముఖ్యకర్మ, గమ్య, స్వామ్యార్థాల్లో నామ్నీకరణసాధ్యం. ఈ కింది: ఉదాహరణల్లో స్పష్టమవుతుంది.

(146)

a. సుజాత బ్రాహ్మడికి ఆవును దాన మిచ్చింది.
             → సుజాత ఆవును దానమిచ్చిన బ్రాహ్మడు.
b. సుజాత ఊరికి వెళ్ళింది.
             → సుజాత వెళ్లిన వూరు.
c. వాళ్ళకు రెండు ఇళ్ళున్నై .
             → వాళ్ల కున్న రెండు ఇళ్ళు.
d. నేను వాళ్లకు తెలుసు.
             → నేను తెలిసిన వాళ్ళు.

ఈ కిందివి వ్యాకరణ విరుద్ధాలు.

(147)

a. ఆతను చలికి వణుకుతున్నాడు .
              → ? ఆతను వణుకుతున్న చలి.
b. రూపాయికి నాలుగు పండ్లు ఇస్తారు.
              → * నాలుగు పండ్లిచ్చే రూపాయి.

కొన్ని నామ్నీ కరణాలు విశేషనామానికి బదులు సామాన్య నామాన్ని కోరతై -

(148)

a. అతను ఎల్లుండి వస్తాడు.
              → * a. అతను వచ్చే ఎల్లుండి.
                     b. అతను వచ్చే రోజు.
.
b. ఆమె పది గంటలకి వస్తుంది.
             → * a. ఆమె వచ్చే పది గంటలు.
                    b. ఆమె వచ్చే టైము.

c. పక్కింటామె పంచదారకు వచ్చింది.
             → * a. పక్కింటామె వచ్చిన పంచదార
                    b. పక్కింటామె వచ్చిన పని.

d. ప్రసాదు మద్రాసు వెళ్ళాడు
               → * a. ప్రసాదు వెళ్ళిన మద్రాసు.
                      b. ప్రసాదు వెళ్ళిన పూరు.

స్వామ్యార్థంలో నిష్పన్నమైన నామంలో ఉన్న కు బదులు వికల్పంగా గల శబ్దం ఆదేశమవుతుంది.

(149)

a. డబ్బున్న వాళ్లు → డబ్బుగల వాళ్ళు.
b. పిల్లలున్న వాళ్ళు → పిల్లలు గలవాళ్ళు,
c. తెలివున్న వాడు → తెలివిగల వాడు.

2.713 : గురించి అనే విభ క్తి నేటి భాషలో కర్మార్థంలోను, ప్రయోజనార్థంలోను ఉపయోగిస్తారు. కర్మార్థంలోనే నామ్నీకరణం సాధ్యం.

(150)

a. నేను సుజాతను గురించి చెప్పాను.
              → నేను చెప్పిన సుజాత.
b. అతను డబ్బు గురించి వచ్చాడు
              → • అతను వచ్చిన డబ్బు.

2.714 : నుంచి అనే విభక్తి వ్యాపారాదిని సూచిస్తుంది. ఆ అర్థంలో నామ్నీకరణం సాధ్యంకాదు.

(151)

అతను కాలేజి నుంచి ఇంటికి వచ్చాడు
                   → * అతను ఇంటికి వచ్చిన కాలేజి.

కాని నుంచి తో ఉన్న ఈ కింది వాక్యాలనుంచి నామ్నీకరణం సాధ్యమయింది.

(152)

a. అత్తగారు బావినుంచి నీళ్ళు తెచ్చింది
                → అత్తగారు నీళ్ళు తెచ్చిన బావి.

b. మా ఆవిడ మార్కెట్ నుంచి అరటి పండ్లు తెచ్చింది
               → మా ఆవిడ అరటిపండ్లు తెచ్చిన మార్కెట్

c. సుజాత చెట్టునుంచి పువ్వులు కోసింది
               → సుజాత పువ్వులు కోసిన చెట్టు.

ఈ పై వాక్యాల్లో నుంచి కి బదులు (a) లో లో నుంచి, (b) లో దగ్గర నుంచి, (c) లో మీద నుంచి అని వికల్పంగా ప్రయోగించవచ్చు. అందే (151) లో లేని అధికరణార్థం (152) లో ఉంది. (152) లో నుంచి కర్మపదం యొక్క ఆధార పదాన్ని సూచిస్తున్నది. ఈ అర్థంలో మాత్రమే నుంచి తో నామ్నీకరణం సాధ్య మయింది.

ఒక తెలుగు సినిమాలో దిగివచ్చిన దేవలోకానికే తిరిగి వెళ్ళింది. అనే డైలాగు ఉంది. దిగివచ్చిన దేవలోకం అనే నామబంధానికి మూలవాక్యం ఆమె దేవలోకంనుంచి దిగి వచ్చింది, అనేదే అయిఉండాలి. ఇక్కడ కూడా నుంచి కి లో నుంచి అనే అర్థం చెప్పుకోవచ్చు.

సి. విజయలక్ష్మి రచించిన కారుచీకటికి కాంతిరేఖ అనే పుస్తకంలో శవం వెళ్ళిన ఇల్లులా అనే ప్రయోగం ఉంది. దీనికి మూల వాక్యం ఇంటినుంచి శవం వెళ్లింది అనే అయి ఉండాలి. ఇక్కడ కూడా నుంచికి లోనుంచి అనే అర్థం చెప్పుకోవాలి. దాశరథి రంగాచార్యులుగారి మాయజలతారు అనే నవలలో పీనుగు వెళ్లిపోయిన ఇల్లులా అనే ప్రయోగానికీ ఇట్లాంటి విపరణే ఇయ్యాల్సి ఉంటుంది. దీన్నిబట్టి, అధికరణార్థబోధ ఉన్న నుంచి తో నామ్నీకరణం జరుగుతుందని తెలుసుకోవచ్చు.

2.715: లో, మీద అనే విభక్తులు అధికరణార్థాన్ని సూచిస్తై. ఈ అర్థాల్లో నామ్నీకరణ సాధ్యం.

(153)

a. మా ఆవిడ భరిణెలో డబ్బు దాచి పెడుతుంది.
               → మా ఆవిడ డబ్బు దాచిపెట్టే భరిణె.

b. మా ఆవిడ పరుపు కింద డబ్బు దాచిపెడుతుంది.
               → * మా ఆవిడ డబ్బు దాచిపెట్టే పరుపు

c. చింతచెట్టు మీద చిలక కూర్చున్నది.
               → చిలక కూర్చున్న చింత చెట్టు.

d. చింత చెట్టు కింద చిలక కూర్చున్నది.
              → * చిలక కూర్చున్న చింతచెట్టు.

పైన ఉదాహరించిన వాటిలో (b), (d) లలో నిష్పన్న మైన నామబంధాలు మూల వాక్యార్థాల్ని వ్యక్తం చెయ్యలేక పోతున్నై. (a), (c) లో వ్యక్తం చెయ్య గలుగుతున్నై. ఇందుక్కారణం లో, మీద అనేవి సామాన్య (Unmarked) అధికరణాన్ని బోధిస్తై. అంతేకాక ఇవి ఆధారాధేయాల సంశ్లేషను కూడా సూచిస్తై. ఆధారాధేయాల సంశ్లేషబోధ ఉన్న విభక్తులతోనే అధికరణలో నామ్నీకరణం సాధ్యమవుతుందని సూత్రించుకోవచ్చు.

లో, మీద వైషయికాధికరణలో కూడా ప్రయుక్తమవుతై. ఆ ఆర్థాల్లోను నామ్నీకరణం సాధ్యమవుతుంది

(154)

a. మంత్రిగారికి సాహిత్యంలో ప్రవేశం ఉంది.
               → మంత్రిగారి ప్రవేశము ఉన్న సాహిత్యం.

b. సుజాతకు నైలెక్సు చీరల మీద మోజు ఉన్నది.
              → సుజాతకు మోజున్న నైలెక్సు చీరలు.

కాలార్థంలో లో ప్రయోగించినప్పుడు నిష్పన్న నామబంధంలో విశేష నామానికి బదులు సామాన్యనామం వస్తుంది.

(155)

మాకు 1959 లో పెళ్లి అయింది
            → మాకు పెళ్లి అయిన సంవత్సరం.
             * మాకు పెళ్లి అయిన 1959.

2.716 : ఈ విభక్త్యర్థక నామ్మీకరణంలో గమనించాల్సిన విశేషం ఇంకోటి ఉంది. నేను తిన్న అన్నం అనే నామబంధంలో కర్తృబోధక శబ్దాన్ని తీసేసి తిన్న అన్నం అన్నా తిను అనే క్రియకు, అన్నం అనే నామానికి ఉన్న వ్యాకరణ సంబంధాల్లో మార్పురాదు.

నేను చంపిన పులి అనే నామబంధంలో పులి చంపు అనే క్రియకు కర్మ. అందులో నుంచి నేను శబ్దాన్ని తొలగించి, చంపిన పులి అంటే పులి అనే శబ్దాన్ని కర్మగా కాక కర్తగా అర్థం చేసుకుంటాం.

అట్లాగే నేను డబ్బుపెట్టిన పెట్టె అనే నామబంధంలో పెట్టె అనే నామం పెట్టు అనే క్రియతో అధికరణ కారక సంబంధంలో ఉంది. డబ్బు అనే పదం తీసేసి నేను పెట్టిన పెట్టె అంటే పెట్టె ను కర్మకారకంగా అర్థం చేసుకుంటాం. దీన్నిబట్టి అధికరణ, కర్మ, కర్తృ కారకాల్లో ఉత్తరోత్తరం బలీయమని తెలుస్తుంది. ఒక నామ పదానికి క్రియతో ఒకటికన్నా ఎక్కువ కారక సంబంధాలుండే అవకాశం ఉన్నప్పుడు పూర్వకారక బోధక పదాభావంలో ఉత్తరోత్తర కారకార్థానికే ప్రాధాన్య మెక్కువని గ్రహించవచ్చు. భిన్నకారక సంబంధాలుండే పదాలు దొరికినప్పుడు మిగతా కారకాలకు కూడా ఈ అంతరువుల్లో స్థిరస్థానం కలిగించ వచ్చు.

2.717 : సమాసాలనుకూడా ఈ విధమైన నామ్నీకరణాల నుంచి నిష్పన్నం చెయ్యవచ్చు. ఉదాహరణకు: మాకు ఇల్లుందిమాకున్న జల్లుమా ఇల్లు. కాని సమాసాల్లో క్రియ లోపించటం వల్ల బహుళార్థ బోధకాలవుతై . ఉదాహరణకు ప్రభుత్వ కవులు అనే సమాసానికి “ప్రభుత్వంలో ఉద్యోగం చేసే కవులు", "ప్రభుత్వం పోషించే కవులు", "ప్రభుత్వం కోసం రాసే కవులు", “ప్రభుత్వం అభిమానించే కవులు" ఇట్లా చాలా అర్థాలు రావచ్చు. ఈ అర్థాలు అప్పటి సామాజికుల అలవాట్లనుబట్టి ఉంటై. సమాజంలో వచ్చే మార్పుల్ని బట్టి సమాసాల అర్థాలుంటై. ఉదాహరణకు నేడు వాడుకలో ఉన్న వంటింటి పత్రికలు, రేడియో కవులు, రేడియో నాటికలు, పండగ కవులు, విప్లవకవులు ఇట్లాంటివే. పండగల ప్రత్యేక సంచికలకు కవిత్వం రాసేకవులు అనే అర్థంలో ఇటీవల సాహిత్య విమర్శలో పండగ కవులు అనే సమాసం వాడుకలో ఉంది. 'విప్లవ కవిత్వం రాసే కవులు' అనే అర్థంలో విప్లవ కవులు అనే సమాసం వాడుకలో ఉంది. ఈ సమాసాలను వ్యాకరణ ప్రక్రియద్వారా వాక్యం నుంచి నిష్పన్నం చెయ్యటం కష్టం.

2.718 : విభక్త్యర్థక నామ్నీ కరణంలో అన్ని రకాల అర్థాలలో నామ్నీ కరణం సాధ్యం కాదని తెలుసుకున్నాం. ఇదే పనిని చాలా అర్థాల్లో చేసే వ్యాకరణ ప్రక్రియ యత్తదర్థక వాక్యప్రయోగం. విభక్త్యర్థక నామ్నీకరణం ద్రావిడ భాషల్లో ప్రచురం, ఆర్యభాషల్లో విరళం, (ఒరియా, బెంగాలీ భాషల్లో విభక్త్యర్థక నామ్నీ కరణం విస్తారంగానే ఉంది.) ఆర్యభాషల్లో యత్తదర్థక వాక్య ప్రయోగం అధికం. ఈ కింది వాక్యాల్లో యత్తదర్థక ప్రక్రియను చూడవచ్చు.

(156)

a. నేను ఒక అమ్మాయితో సినిమాకు వెళ్లాను.
 → నేను ఏ అమ్మాయితో సినిమాకు వెళ్లానో ఆ అమ్మాయి.

b. అతను కాలేజీనుంచి ఇంటికి వచ్చాడు.
→ అతను ఏ కాలేజి నుంచి ఇంటికి వచ్చాడో ఆ కాలేజీ.

ఉద్దేశ్యంగా చేసిన నామానికి ముందు తదర్థబోధక శబ్దం, విధేయంగా మారిన భాగానికి మొదట యదర్థక బోధక శబ్దం చేరి అనే శబ్దంతో అను సంధించ బడటం ఇక్కడ జరిగే ప్రక్రియ.

యత్తదర్థ బోధక వాక్యాల ప్రణాళిక విభక్త్యర్థ నామ్నీకరణం కన్నా విపులమైనా, వీటిల్లోనూ కొన్ని విధి నిషేధాలున్నై, ఉదాహరణకు

*(157)

a. “సుజాత ఏ జ్వరంతో పరీక్ష రాసిందో ఆ జ్వరం"
b. “సుజాత ఏ శ్రద్ధతో పరీక్ష రాసిందో ఆ శ్రద్ధ".
C. “సుజాత ఏ భర్తను తెడ్డుతో కొట్టిందో ఆ భర్త".
d. "పక్కింటామె ఏ పంచదారకు వచ్చిందో ఆ పంచదార".

ఇట్లాంటి నామబంధాలు ఈ ప్రక్రియలో అయినా వ్యాకరణ సమ్మతాలు కావు.

ద్రావిడ భాషల్లో విభక్త్యర్ధక నామ్నీకరణల్లో నయినా, యత్తదర్థ వాక్యాల్లో నయినా విధేయ, ఉద్దేశ్యాల క్రమం నియతం, స్థిరం. నామానికి వచ్చే విశేషణాలు సిద్ధాలయినా, వాక్య నిష్పన్నాలయినా, నామ పదానికి పూర్వమే వస్తై. క్రియాంత భాషల్లో ఇట్లాగే వస్తై.

2.72 : భావార్థక నామ్నీ కరణాలు : క్రియలు వ్యాపారాలను (processes), స్థితులను (states), చర్యలను (actions) సంఘటనలను (events) తెలియజేస్తై. ధాతువుకు భావార్థంలో - అటం (కొందరి వ్యవహారంలో అడం) అనే ప్రత్యయం చేరుతుంది. ఇట్లా తయారయిన నామం ఇంకో వాక్యంలో ఆయా అర్థాల్లో ప్రయుక్తమయింది.

2.721 : వ్యాపారార్థక నామంగా ప్రవర్తించినప్పుడు కొన్ని క్రియలకు కర్తగానూ, ప్రాణివాచకకర్త అవసరమైన క్రియలతో కర్మగానూ ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాదిని, అంతాన్ని సూచించే క్రియలతో ఈ నామం ప్రయుక్త మవుతుంది.

(158)

a. వాన కురవటం మొదలయింది.
b. వంట చెయ్యటం పూర్తి అయింది.
c. తెలుగులో కావ్యాలు రాయటం పదకొండో శతాబ్దంలో ప్రారంభ
మయింది.
d. వరి నాటటం పూర్తి అయింది.

పై వాక్యాలలో వానకురవటం లాంటివి కర్తృ నిరపేక్షకమైన వ్యాపారాలు. మిగతా వ్యాపారాలు కర్త్రపేక్షకాలు. అయినా ఇక్కడ కర్తృపదానికి ప్రాధాన్యం లేదు. క్రియానిష్పన్న నామాలేకాక. సిద్ధనామాలు కూడా వ్యాపార బోధకాలు ఉన్నై. పెండ్లి జరిగింది, పరిశోధన చేస్తున్నారు, ఎన్నికలు పూర్తి అయినై , నాటకం మధ్యలో ఆగిపోయింది, యుద్ధం భీకరంగా జరుగుతున్నది , వంటి వాక్యాల్లో నామాలు వ్యాపారార్థక నామాలు. ప్రధాన క్రియకు వ్యాపార నిర్వాహకకర్త అవసరమైతే ఆ కర్త భావార్థకనామంగా మారిన ఉపవాక్యంలో కర్తతో అభిన్నమై ఉండాలి.

(159)

a. సుజాత వంటచెయ్యటం పూర్తి చేసింది.
b. సుజాత అలంకరించుకోటం ప్రారంభించింది.

పై వాక్యాలలో వ్యక్తమయిన రెండు వ్యాపారాలకు కర్తృ పదం ఒకటే ఉండాలి. వీటి గుప్తనిర్మాణం సమబోధక, సమరూపకమైన నామాలను కర్తృ పదాలని ప్రతిపాదించి, అందులో ఒకదాన్ని సూత్రంచేత లోపింపచెయ్యాలి. ఎందు కంటే ఏకాశ్రయంగా భావించినా భిన్న నామాలుగాని, ఏకరూపాలుగా ఉన్న నామ ద్వయంగాని ఈ వాక్యాల్లో కర్తలుగా ఉండటానికి వీల్లేదు. నియమోల్లంఘన జరగటంవల్ల ఈ కింది వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

*(160)

a. సుజాత వంటచెయ్యటం సుమిత్ర పూర్తి చేసింది.
b. సుజాత అలంకరించుకోటం సుజాత మొదలు పెట్టింది.

ప్రాణి వాచక కర్తృపదాల్ని అపేక్షించే సకర్మక క్రియలు ప్రధాన వాక్యంలో ఉన్నప్పుడు వాటికి కర్మస్థానంలో వచ్చే ఉపవాక్యాల్లో క్రియలుకూడా అట్లాంటివే అయి ఉండాలనీ, వాక్యాలు ఏకకర్తృకాలయి ఉండాలని పై వాక్యాలను బట్టి తెలుస్తుంది. 2. 722 : స్థితిబోధక క్రియలనుగాని, సంఘటనాత్మక క్రియలనుగాని నామ్నీకరించి వ్యాపారాద్యంతాలను సూచించే క్రియలతో వాడలేం.

*(161)

a. ఆమె అందంగా ఉండటం మొదలు పెట్టింది.
b. ఆమె పొట్టిగా ఉండటం పూర్తి చేసింది.
c. ఆమె నల్లగా ఉండటం పూర్తి అయింది.
d. వాడికి కాలు విరగటం ప్రారంభమయింది.
c. వాడు బావిలో పడటం పూర్తి అయింది.

చివరి రెండు సంఘటనబోధకాలు (events} కావటంవల్ల ఈ వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

భావార్థకాలు సంఘటనాత్మక నామాలుగా ప్రవర్తించినప్పుడు 'జరుగు' అనే క్రియతో వ్యాకరణ సమ్మతాలవుతై.

(162)

a. వాడికి కాలు విరగటం జరిగింది.
b. వాడు బావిలో పడటం జరిగింది.

‘జరుగు' అనే క్రియతో సంఘటన, వ్యాపారార్థక నామాలు కర్తృ పదాలుగా రాగలవు.

2.723 : భావార్థక నామాలు ప్రధాన వాక్యంలో వ్యాపారబోధక నామంగానే గాక జ్ఞానార్థక క్రియలతో అభ్యసనార్థక నామంగా రాగలదు.

(163)

a. నాకు వచన పద్యాలు రాయటం వచ్చు.
b. మా ఆవిడ మిషను కుట్టటం నేర్చుకుంటున్నది.

ఈ పై వాక్యాలలో మిషనుకుట్టటం వచనపద్యాలు రాయటం అనే నామాలను ఉపవాక్యాలుగా, అంటేవాక్యంనుంచి నిష్పన్నమైనట్టుగా భావించ నక్కర్లేదు. అభ్యసనార్హంగా భావించిన ఏ వ్యాపారాన్నైనా, క్రియ అయితే నామ్నీకరించి ఇక్కడ వాడవచ్చు. అయితే ప్రాణి నిర్వహించే వ్యాపారబోధక క్రియలయితేనే ఇట్లా నామ్నీకరించటం సాధ్యం. అందువల్ల వీటిని గుప్త నిర్మాణంలో ప్రాణివాచకకర్త ఉన్న వాక్యాలుగా భావిస్తే వ్యాకరణ ప్రక్రియ తేలిక అవుతుంది. 2.724: ప్రధానవాక్యంలో గ్రహణేంద్రియ వ్యాపారబోధక (Perception verbs) క్రియలున్నప్పుడుకూడా భావార్థకనామంగా ఉపవాక్యం కర్మపదంగా వస్తుంది. అప్పుడు ప్రధాన ఉపవాక్యాలు భిన్నకర్తృకంగా ఉండాలి. చూచు, విను వంటివి ఇంద్రియ వ్యాపారబోధక క్రియలు. చూచు అనే క్రియకు దృశ్యమాన పదార్థబోధకమూ, విను అనే క్రియకు శ్రవ్యమాన పదార్థబోధక (ధ్వనియుక్త) నామం కర్మ పదాలుగా ఉండాలి.

(164)

a. రవీంద్రభారతిలో సుజాత నాట్యం చెయ్యటం చూశాను.
b. దొంగ అటువేపుగా పరిగెత్తటం చూశాను.
c. రేడియోలో సుమిత్ర పాడటం విన్నాను.
d. మా ఆవిడ వంటింట్లో గిన్నెలు పగలకొట్టటం చూశాను, (విన్నాను.)
* e. సుజాత ఆలోచించటం విన్నాను.
* f. సుజాతకు ఆకలి వెయ్యడం చూశాను.

పై వాక్యాల్లో ఆలోచించు అనే వ్యాపారం ద్రవ్యమానం, ఆకలివేయు అనే వ్యాపారం దృశ్యమానం కాకపోవటంవల్ల e, f లు వ్యాకరణ విరుద్ధాలయినై . పగలగొట్టు అనే వ్యాపారం దృశ్యమానమూ, ద్రవ్యమానమూ కావటంవల్ల (d) లో చూచు, విను అనే రెండు క్రియలూ సాధ్యమయినై. పై వాక్యాల్లో (c)కి రెండర్థా లున్నై. (1) రేడియోలో సుమిత్ర పాట విన్నాను. (2) రేడియోలో సుమిత్ర పాడిందని విన్నాను. చూచు క్రియతో ఇట్లాంటి భిన్నార్థాలుండవు. ప్రత్యక్ష వ్యాపారమే దృశ్యమానమవుతుంది. శ్రవణేంద్రియంతో వ్యాపారాన్ని ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా గ్రహించవచ్చు. విను అనే క్రియకు శ్రవణేంద్రియంద్వారా చప్పుడును గ్రహించటం అనే అర్థమేకాక ఒక విషయాన్ని భాషద్వారా ఇంకొకరు చెప్పగా గ్రహించటం అనే అర్థం కూడా ఉంది.

పై వాక్యాల్లో భావార్థక నామాలను క్రియాజన్య విశేషణాలుగామార్చి ఆ క్రియలనుబట్టి దృశ్యం, ధ్వని, విషయం అనే నామాలకు విధేయాలుగాచేసినా అర్థంలో మార్పురాదు. ఉదాహరణకు (d) లో పగలగొట్టినదృశ్యం, పగలగొట్టిన ధ్వని, పగలగొట్టిన విషయం అని మూడర్థాల్లోనూ ప్రయోగించవచ్చు.

(164) లో ఉదాహరించిన వాక్యాలు భిన్న కర్తృకాలు కావాలని చెప్ప బడింది. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అవి ఏకకర్తృకాలు కావచ్చు. ఒక సినిమా హీరో తను నటించిన సినిమాను తనే చూసినప్పుడు 'నేను హీరోయిన్‌తో నాట్యం చెయ్యటంచూశాను, నేను హీరోయిన్‌తో , డ్యూయట్ పాడటం విన్నాను అని అనవచ్చు. అట్లాగే కలలో జరిగిన ఘట్టాలను చెప్పేటప్పుడుకూడా ఈ రకపు వాక్యాలు వాడవచ్చును.

భావార్థకనామంలో కాలబోధకతలేదు. ప్రధానవాక్యంలో క్రియబోధించేకాలాన్నే భావార్థకనామానికి అన్వయించుకోవాలి. నువ్వురావటం ఎప్పుడు? అనే ప్రశ్నకు నువ్వు వచ్చింది ఎప్పుడు? నువ్వు వచ్చేది ఎప్పుడు? అని రెండు రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు.

2. 7251 : కొన్ని వాక్యాల్లో నామాలు ఆఖ్యాతాలుగా ప్రవర్తిస్తై.

(165)

a. నాకు కాఫీ అలవాటు.
b. నాకు నిద్ర ఇష్టం.
c. నాకు లెక్కలు కష్టం.

ఈ పై వాక్యాలలో కాఫీ, నిద్ర , లెక్కలు అనే నామాలు వ్యాపారార్థకంగా ప్రయుక్తమయినై . వాటికి కాఫీతాగటం, నిద్రపోవటం, లెక్కలు చెయ్యటం అని అర్థాలు చెప్పుకోవాలి.

2. 7252 : ఇట్లాంటి వాక్యాల్లో ఆఖ్యాతాలను రెండు రకాలుగా విభజించాలి. కొన్నిట్లో ప్రధాన వాక్యంలో అనుభోక్త, భావార్థక నామానికి కర్త ఒకటిగా ఉండాలి. కొన్నిటికి అక్కర్లేదు. ప్రధాన ఉపవాక్యాల్లో అనుభోక్త-కర్తలు ఒకటిగా లేని ఈ వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

*(166)

a. నాకు నువ్వు సినిమాలు చూడటం అలవాటు .
b. నాకు నువ్వు అబద్దా లాడటం మామూలు.
c. నాకు నువ్వు లెక్కలు చెయ్యటం తేలిక .
d. నాకు నువ్వు ఈ మెట్లు ఎక్కటం కష్టం.

ప్రధాన ఉపవాక్యాలుగా అనుభోక్త-కర్తలు ఒకటిగా లేకపోయినా ఈ క్రింది వాక్యాలు వ్యాకరణ సమ్మతాలు.

(167)

a. నువ్వు నాదగ్గర పుస్తకం తీసికెళ్ళటం (నాకు) గుర్తు.
b. నాకు పిల్లలు అల్లరి చెయ్యటం ఇష్టం.

ప్రధాన వాక్యంలో అనుభోక్తతో సమంగా ఉపవాక్యంలో కర్త ఉంటే (166)లో వాక్యాలు వ్యాకరణ సమ్మతమవుతై. ఇట్లాంటి వాక్యాల్లో భావార్థక నామాన్ని తొలగించినా అర్థభంగం కలగదు. (165) లో వాక్యాలు అట్లా ఏర్పడినవే. కాని (167)a లో భావార్థక నామాన్ని లోపింపజెయ్యటానికి వీల్లేదు. . గుర్తు క్రియా రహితంగా ప్రయోగించినప్పుడు విద్యమాన ప్రాగ్వ్యాపారమే విషయం కాగలదు. మిగతా ఆఖ్యాతాలకు ప్రత్యేక కాలనియమం లేని వ్యాపారాలే విషయాలుగా వస్తై. అట్లాంటి చోటనే భావార్థక నామాలను లోపింపజేసినా ఆర్థ భంగం రాదు..

2. 7261 : ఏక వాక్యంలో కూడా క్రియ కొన్నిచోట్ల భావార్థక నామంగా మారుతుంది. ఆ ప్రక్రియ కింది వాక్యాల్లో చూడవచ్చు.

(168)

a. మీరు ఎప్పుడు వస్తారు? → మీరు రావటం ఎప్పుడు?
b. మీరు ఎక్కడికి వెళ్తారు? → మీరు వెళ్లటం ఎక్కడికి?
c. మీరు ఎందుకు వస్తారు? → మీరు రావటం ఎందుకు?

బాణం గుర్తుకు ఎడం పక్కన ఉన్న వాక్యాలకు కుడి పక్కన ఉన్న వాక్యాలకు అర్థభేదం లేదు. కాని ఎడం పక్క వాక్యాలలో భూతకాలక్రియ ఉంటే ఈ రకం నామ్నీకరణం సాధ్యమయినట్టు కనపడదు. పై నామ్నీకృత వాక్యాల్లో ఎప్పుడు వచ్చారు? ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వచ్చారు? అనే అర్థాలు రావటం లేదు. కాలబోధను సూచించే పదసాహాయ్యం లేనప్పుడు భావార్థక నామం భూతేతర కాలబోధక మవుతుందని చెప్పుకోవాలి. ప్రశ్నార్థక శబ్దానికి ప్రాధాన్య వివక్ష ఈ నామ్నీకరణ సార్థక్యం.

2. 7262 : ఈ రకపు నామ్నీకరణ ప్రశ్నార్థక శబ్దాలన్నిటికి సాధ్యమవు తున్నట్టు లేదు.

*(169)

a. మీరు ఏం చేస్తారు? → మీ తేవటం ఏమిటి ?
b. మీ ఇంటికి ఎవరు వస్తారు?→ మీ ఇంటికి రావటం ఎవరు ?

ప్రశ్నార్థక శబ్దం నామాన్ని సూచించేట్టయితే ఈ నామ్నీకరణ సాధ్యం కాదని పై వాక్యాల్ని బట్టి గ్రహించవచ్చు.

2.7263 : ప్రశ్నాభావంలో కూడా ఈ నామ్నీకరణం జరుగుతుంది. కాని భావార్ధక నామం తరవాత వచ్చిన పదబంధానికి ఏదైనా ప్రాధాన్యసూచకమైన శబ్దాన్ని అనుబంధించినప్పుడే అది వ్యాకరణ సమ్మత మవుతుంది.

(170)

a. నేను హైదరాబాదులో ఉంటున్నాను
                → నేను ఉండటం హైద్రాబాద్‌లోనే.

b. మేం మద్రాసుకు వెళ్తున్నాం
              → మేం వెళ్లటం మద్రాసుకే.

c. వాళ్లు రేపు వెళ్తారు
                → వాళ్ళు వెళ్లటం రేపే.

ఇంతకు పూర్వం సామాన్య వాక్యాల్లో చర్చించిన (చూ. 1.12, 1-26) ప్రాధాన్య వివక్షామూలక నామ్నీకరణంలో భాగమే ఇది. కాకపోతే ప్రాధాన్యాన్ని వివక్షించటానికి పదక్రమ వ్యత్యయమే కాక ప్రాధాన్యాన్ని సూచించే శబ్దాలు (, , అట, కాదు - ఇత్యాదులు) ఇక్కడ పదక్రమ వ్యత్యయం తరవాత కూడా అవసరమే కావటం విశేషం. కర్తృ, కర్మ పదాలను సూచించే నామాలను ఇట్లా వ్యత్యయం చెయ్యటానికి వీల్లేకపోవటం అధికనియమం. (168) వాక్యాల్లో ఇట్లాంటి శబ్దం విడిగా లేకపోయినో కిమర్థక శబ్దం ఇట్లాంటి పాత్రను నిర్వహిస్తున్నది. భావార్థక నామంతో ఇట్లాంటి వ్యత్యయం భూతకాలపు అర్థాన్ని ఇయ్యలేక పోవటం ఇక్కడ గమనించాల్సిన ఇంకో విశేషం.

2. 727 : మిగతా నామ్నీకరణాలకన్నా భావార్థక నామ్నీకరణం ఇంకో విధంగా కూడా విశిష్టమైనది. మామూలు సిద్ధనామాల్లాగే భావార్థక నామానికి వివిధార్థాల్లో నామవిభక్తులు చేరతై. మిగతా మకారాంత నామాల్లాగే కు, ను విభక్తులు పరమైనప్పుడు మకార లోపమూ, పూర్వస్వర దీర్ఘమూ, జరిగి, ని ఆగమంగా వస్తుంది. ఈ ఆగమం తర్వాత నామం ఇకారాంతం కావటంవల్ల కు, ను లు కి, ని లు అవుతై. భావార్థకనామం అమూర్తనామం. అందువల్ల అమూర్తనామంతో సాధ్యమయ్యే ఆర్థాలే విభక్తిపరమైనప్పుడు వస్తై. 2.72711 : ప్రధాన వాక్యంలో సమాపక క్రియ భౌతిక వ్యాపార బోదకమైనప్పుడు లక్ష్యార్థంలో అటమంతనామానికి కి విభక్తి చేరుతుంది. ఈ అర్థం ప్రధాన, ఉపవాక్యాలు ఏకకర్తృకాలైనప్పుడే వస్తుంది.

(171)

a. మా ఆవిడ పక్కింటామెతో హస్కుకొట్టటానికి వెళ్లింది.
b. సుబ్బారావు డబ్బులడుక్కోవటానికి వచ్చాడు.
C. అతను బతకటానికి చిన్న కొట్టు పెట్టుకున్నాడు.
d. సుజాత మధ్యాహ్నం తినటానికి రొట్టెలు తెచ్చుకుంటుంది.

ఈ పై వాక్యాల్లో కి విభక్తి కి బదులు ఇదే అర్థంలో కోసం అనే శబ్దం ప్రయోగించవచ్చు.

2.72712 : కి విభ క్తి చేరిన అటమంత నామం మనో వ్యాపార బోధక మైన ప్రధాన క్రియకు కారణం అవుతుంది.

(172)

a. నలుగుర్లోకి రావటానికి ఆమె సిగ్గుపడుతుంది.
b. ఇంగ్లీషులో మాట్లాటానికి అతను భయపడతాడు.
c. వానలో బయటికి వెళ్లటానికి సందేహిస్తున్నాను.
d. పరీక్షఫీజు కట్టటానికి తటపటాయిస్తున్నాడు.

ఈ రకమైన ఈ ఆర్థభేదం ఈ కింది వాక్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన క్రియను భౌతిక వ్యాపారంగానూ, మనోవ్యాపారంగానూ వ్యాఖ్యానించవచ్చు

e. అతను విదేశాలు వెళ్లటానికి కష్టపడుతున్నాడు.

ఈ పై వాక్యంలో కష్టపడు భౌతికవ్యాపార మైనప్పుడు వెళ్ళటానికి అనేది. లక్ష్యమవుతుంది. మనోవ్యాపారమైనప్పుడు (ఉదాహరణకు తనవాళ్లందరినీ - వదిలి వెళ్ళాల్సి వచ్చినందుకు) కారణమవుతుంది.

లక్ష్యార్థంలో ఉపవాక్యంలో వ్యక్తమైన వ్యాపారం కర్తకు ఇచ్ఛాపూర్వకం. కాని మనోవ్యాపార క్రియలు ప్రధాన వాక్యంలో ఉన్నప్పుడు ఉపవాక్యంలో వ్యక్తమైన వ్యాపారం ఇచ్ఛాపూర్వకం కావచ్చు, కాకపోవచ్చు. 2.72713 : ప్రధాన వ్యాపారం స్థితిబోధకమైనప్పుడు కి విభక్తి పరమైన భావార్థకనామం పై రెండు అర్థాలకన్నా భిన్నమైన అర్థంలో కనిపిస్తుంది. ఈ అర్థంలో వాక్యం మొత్తాన్ని అస్త్యర్థక క్రియకు కర్తగా భావించవచ్చు.

(173)

a. అతనికి మనుష్యులతో మాట్లాడటానికి (time) టైం లేదు.
b. నాకు రాసుకోటానికి తీరిక ఉండటం లేదు.
c. కాలేజిలో చదువుకోటానికి వీలుండదు.

పై వాక్యాలన్నిటిలో ప్రధానవాక్యంలో కర్తతోగాని, అనుభోక్తతోగాని, ఉపవాక్యంలో కర్త అభిన్నమయి ఉండాలి.

2.7272 : అధికరణార్థకమైన లో, మీద అనే విభక్తులతో భావార్థక నామం ప్రయోగించినప్పుడు కూడా ఈ నియమం వర్తిస్తుంది.

(174)

a. నిద్రపోవటంలోనే అతను రోజంతా గడుపుతాడు.
b. కష్టపడటంలోనే సౌఖ్యముంది.
c. భావకవులకు ఏడవటంలోనే సుఖముంది.

2.7273 : భావార్థకం తరవాత తో వస్తే పూర్వ వ్యాపార సమాప్తిని, పరవ్యాపారారంభాన్ని తెలియజేస్తుంది. కేవలస్థితి బోధక ఆఖ్యాతాలనించి, నిష్పన్న మైన అటమంత రూపాలు ఈ అర్థంలో ప్రయోగ యోగ్యాలు కావు. ఈ అర్థంలో తో తోటి అనే రూపంలో రావచ్చు. సాధారణంగా ఈ రూపంమీద ఏ వార్థకమైన శబ్దం వస్తుంది. ఈ వాక్యాల్లో ఏకకర్తృక నియమం లేదు.

(175)

a. అమె అన్నం తినటంతోటే నిద్రపోతుంది.
b. నన్ను చూడటం తోటే వాడి మొహం తెల్లబడ్డది.
c. పిల్లలు క్లాసుకి రావటం తోటే టీచరు పాఠం మొదలు పెడుతుంది.
* d. ఆమె అందంగా ఉండటంతోటే అతను పెళ్ళికొప్పుకున్నాడు.
* e. ఆమెకు తలనొప్పిగా ఉండటంతోటే నేను వెళ్ళాను.

పై వాక్యాలు (d, e) లు వ్యాకరణ విరుద్ధం కావటానికి నామ్నీకృతాఖ్యాతం స్థితిబోథకం కావటమే. మనోవ్యావార బోధక క్రియలతో నామ్నీకరించినప్పుడు ఈ ఆర్థంలో వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు , కాకపోయినా, అంత సహజంగా కనపడటం లేదు.

f. ఆమె సిగ్గుపడటంతోటే నేను బయటికి వెళ్ళాను.
e. అతను సందేహించటంతోనే నేను చెప్పటం మానేశాను.
h. సుజాత విచారించటంతోటే భర్త ఓదార్చాడు .

భావార్థకనామం + తోనే, తోటే అని ప్రయోగించిన వాక్యాలు ఆన్నంత క్రియ + గానే ఆనే అసమాపక క్రియ ఉన్న వాక్యాలతో సమానార్థకాలవుతై.

(176)

a. ఆమె అన్నం తినటంతోనే నిద్రపోతుంది.
b. ఆమె అన్నం తినగానే నిద్ర పోతుంది.

భావార్థక నామంతో కేవలం తో అనే శబ్దం మాత్రమే ప్రయోగించినప్పుడు ప్రధానక్రియలో వ్యాపారానికి హేతువు (? దోహదకారి) అవుతుంది.

(177)

a. జ్వరం రావటంతో ఆమె మూలబడ్డది.
b. ఎవరూ గదమాయించే వాళ్ళు లేకపోవటంతో పిల్లల అల్లరి
ఎక్కువయింది.
c. కార్మికులు సమ్మె చెయ్యటంతో ఫ్యాక్టరీ మూతబడింది.

2.728 : కొన్ని ప్రాంతాల్లో కొన్ని అర్థాల్లో అటమంత రూపాలకు బదులు తచ్ఛబ్ద (అది > ది) నామ్నీకరణ రూపాలు వాడతారు. ప్రత్యేక కాలబోధ లేని క్రియాజన్య విశేషణంమీద అది అనే శబ్దంలో మొదటి అచ్చులోపించగా మిగిలిన ది రూపం చేర్చటంవల్ల ఈ నామం ఏర్పడుతుంది.

a. మీరు వచ్చేది ఎప్పుడు?
b. నలుగుర్లోకి వచ్చేదానికి ఆమె సిగ్గుపడుతుంది.
c. ఆమె హస్కు కొట్టేదానికి పక్కింటి కెళ్ళింది.
d. వాడికి తినేదానికి టైం లేదు.

2.73 : తచ్చబ్దనామ్నీకరణం : క్రియాజన్య విశేషణం నామ్నీకరణంలో ఉపయోగించే పద్ధతిని కొంత విభక్త్యర్థక నామ్నీకరణంలో చూశాం. అక్కడ ఒక వాక్యంలో ఏదైనా నామాన్ని ఉద్దేశ్యంగా చేయదల్చుకున్నప్పుడు ఆ నామానికి మొత్తం వాక్యం విశేషణంగా ప్రవర్తించటం గమనించాం. మొత్తం వాక్యాన్ని వాక్యాంతర్భాగమైన నామానికి విశేషణం చేసినప్పుడు వాక్యంలో కాలబోధననుసరించి క్రియ విశ్లేషణ రూపాన్ని గ్రహిస్తుంది. వాక్యంలో క్రియ ప్రధానం కాబట్టి క్రియ విశేషణంగా మారిందంటే వాక్యమే విశేషణంగా మారినట్టు.

2.731 : అట్లాకాకుండా మొత్తం వాక్యాన్నే ఒక నామబంధంగా ప్రయోగించినప్పుడుకూడా క్రియాజన్య విశేషణం ప్రయుక్త మవుతుంది. అప్పుడు క్రియాజన్య విశేషణం ఏ నామానీకీ విశేషణం కాక అది అనే శబ్దాన్ని గ్రహించి నామంగా మారుతుబది. ఏ విశేషణం తరవాతైనా అది అనే శబ్దంలో ప్రథమ స్వరలోపం జరిగిం ది అనే రూపంతో ఉంటుంది. మంచి + అది > మంచిది, వచ్చే + అది > వచ్చేది. తెలుగులో అది అనే శబ్దానికి బహుళార్థాలూ, వివిధ ప్రయోజనాలో ఉన్నై. ఈ నామ్నీకరణంలో అది అంటే వాక్యంలో చెప్పిన విషయ సర్వస్వం అని అర్థం. ఈ కింది వాక్యాల్లో తచ్ఛబ్ద ప్రయోగాన్ని చూస్తే ఈ విషయం గ్రహించవచ్చు.

(178)

a. సుబ్బారావు మీతో పోట్లాడింది నాకు తెలుసు.
b. సుజాత రోజూ క్లబ్బుకి వెళ్ళేది నే నెరుగుదును.
c. సుజాతా సుబ్బారావులు మాట్లాడుకోనిది ఎవరికీ తెలీదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. సమాపక క్రియల్లో చూపించే కాలబోధకతకూ, క్రియాజన్య విశేషణ రూపాలకు ఏకైక సంబంధం (one to one correspondence) లేదు. ఉదాహరణకు వ్యతిరేకంలో ఒకే ఒక్క రూపం ఉంటుంది. ఏ కాలంలో అయినా ఆ ఒక్క రూపాన్నే అన్వయించుకోవాలి.

(179)

సుజాత (నిన్న, ఇవాళ, రేపు) మీటింగుకు రానిది నాకు తెలుసు.

పై వాక్యంలో రానిది అనే నామ్నీకృత రూపానికి పూర్వరూపం “రాలేదు, రావటం లేదు, రాదు" అనే వాటిల్లో ఏదైనాకావచ్చు. వచ్చేది అనే నామ్నీకృత రూపానికి 'వస్తున్నది, వస్తుంది' అనే రూపాల్లో ఏదైనా మూలరూపంకావచ్చు.

2.732 : క్రియలేని వాక్యాలను ఇట్లా నామ్నీకరించాలంటే ఆ వాక్యాలకు అవు (<అగు) ధాతువును అనుబంధించాలి. కాలాదిక బోధలోకూడా అగు ధాతువును అను ప్రయుక్తం చెయ్యాలని పూర్వమే చెప్పబడింది. క్రియలేని వాక్యాలు 'స్థితి' బోధకాలు. కాలబోధలో అగు ధాతువుచేర్చినప్పుడు 'పరిణామ' బోధకాలవుతై. నామ్నీకరణం రెంటికీ సాధ్యమే. అందువల్ల నామ్నీకతమైన క్రియారహిత వాక్యాలకు స్థితిపరంగాను, పరిణామపరంగాను అర్థం చెప్పవచ్చు.

(180)

a. అతను డాక్టర్ అయింది నాకు తెలుసు.

ఈ పై వాక్యానికి కింది వాక్యాల్లో వ్యక్తమయ్యే రెండర్థాలూ ఉన్నై.

b. అతను డాక్టరు అయ్యాడని నాకు తెలుసు. (పరిణామం.)
c. అతను డాక్టరు అని నాకు తెలుసు (స్థితి).

అయితే భూతకాల ప్రత్యయ యుక్తమయినప్పుడే ఈ భిన్నార్థబోధ ఉంటుంది. మిగతా క్రియాజన్య విశేషణాలు ప్రయోగించినప్పుడు పరిణామార్థం ఒక్కటే వస్తుంది.

d. అతను డాక్టరు ఆయ్యేది నాకు తెలుసు.
e. అతను డాక్టరు అవుతున్నది నాకు తెలుసు.

వ్యతిరేక క్రియా జన్యవిశేషణం ప్రయోగించినప్పుడు మళ్ళీ రెండర్థాలు సాధ్యమే.

f. అతను డాక్టరు కానిది నాకు తెలుసు.

కానిది అనే నామ్నీకృతరూపానికి కాలేదు, కాదు అనే రెండింట్లో ఏదైనా మూలరూపం కావచ్చు.

క్రియాజన్య విశ్లేషణం కేవలధాతువునుంచి కాలబోధక యుక్తమైన క్రియా రూపాలనుంచి నిష్పన్నమైనట్లుగా భావించాలి. లేకపోతే క్రియాజన్య విశేషణంలో కాలాదికాది అర్థాలకు గతి కలిగించలేం. కాని క్రియారహిత వాక్యాలకు కాలబోధ లేదు. అయినా క్రియాజన్యవిశేషణంతో నామ్నీకరణం సాధ్యమయింది. స్థితిబోధలో కూడా నామ్నీకరణం సాధ్యమయిందన్నమాట. అయితే విశేషణరూపంలో మాత్రం భూతకాలిక ప్రత్యయంఉంది. కేవల నామ్నీకరణ ప్రయోజనమాత్రంగానే ఈ ప్రత్యయం ఉంటుంది. అంటే వాక్యాన్ని (దానితోపాటు క్రియను) విశేషణంగా చెయ్యటమే దీని ప్రయోజనం. 2.733: తెలుగులో కొన్ని క్రియలు కాలబోధకప్రత్యయం లేకుండానే ప్రయుక్తమవుతై. వాటికి తచ్ఛబ్ధంతో నామ్నీకరణం సాధ్యంకాదు. ఈ క్రియలు ప్రాయికంగా అనుబంధ క్రియలు.

(181)

a. ఈ దేశంలో స్వేచ్ఛగా ఉపవాసం ఉండవచ్చు.
b. ఈ దేశంలో స్వేచ్చగా మాట్టాడకూడదు.

పై వాక్యాలనుంచి • ఉండవచ్చింది అనే నామ్నీకృతరూపాన్ని నిష్పన్నం చెయ్యలేం. అట్లాగే * మాట్లడ గూడ నిది అనేది ఈ ఆర్థంలో సాధ్యమవుతున్నట్టుగా తోచదు

2.734 : పై వాక్యాల్లో ప్రయుక్తమైన అది అనే శబ్దం వాక్యవిషయాన్ని సూచిస్తుంది. కాని అది కి చాలా ప్రయోజనాలున్నై. అందులో ఒకటి సర్వ నామంగా ప్రయోగించటం. విభక్త్యర్థ నామ్నీకరణంలో ఉద్దేశ్యంగా మారిన నామానికి అది ఆదేశంగా రావచ్చు. లేక మొత్తం వాక్య విషయాన్నే సూచించవచ్చు.

(182)

 
a. నువ్వు ఢిల్లీనుంచి తెచ్చింది నాకు తెలుసు.

ఈ పైవాక్యానికి కింది వాక్యాలు రెండూ అర్థాలే.

b. నువ్వు ఢిల్లీ నుంచి తెచ్చావని నాకు తెలుసు.
C. నువ్వు ఢిల్లీనుంచి ఏం తెచ్చావో నాకు తెలుసు.

ఈ రకమైన భిన్నార్థబోధక్రియ సకర్మకమైనప్పుడే సాధ్యం. ఇంకోరకంగా చేస్తే ఉద్దేశ్యనామం మనుష్యవాచకేతర కర్మపదం అయినప్పుడే ఇట్లాంటి అర్థభేదం వస్తుంది.

2.735 : ఈ రకమైన నామ్నీకరణం విధ్యాదులకు సాధ్యంకాదు. కేవల నిశ్చయార్థక వాక్యాలకు, వాటి వ్యతిరేకర్థాదులతో సహా ఈ నామ్నీకరణం సాధ్యమవుతుంది. కిమర్ధక ప్రశ్నలతో ఉన్న వాక్యాలకు ఈ రకమైన నామ్నీకరణం చెయ్యొచ్చుకాని, అది వాక్య విషయ సర్వస్వ బోధకంకాదు. ఉదాహరణకు ఈ కింది వాక్యం చూడండి.

(183)

మీ యింటికి ఎవరు వచ్చిందీ తెలుసు.

ఈ పై వాక్యంలో తచ్ఛబ్దం (అది>ది) ప్రశ్నార్థక శబ్దార్థానికే పరిమితం. వాక్యం బోధించే విషయ సర్వస్వాన్ని బోధించే నామ్నీకరణాన్ని విషయార్థక నామ్నీకరణం అంటారు. విషయార్థక నామ్నీకరణం జరిగినప్పుడు ప్రధానవాక్యంలో శ్రవణ, బుద్ధ, వచ్యర్థకాది విషయ సంగ్రహణార్థక ధాతువులే క్రియలుగావస్తై.

ఏకవాక్యంలో ప్రాధాన్య వివక్షకోసం క్రియ తచ్చబ్దంతో నామ్నీకృతమయ్యే పద్ధతి పూర్వమే చెప్పబడింది. (చూ. 1.27.)

2.8 : పరోక్ష ప్రశ్నలు : ఏ భాషలో నయినా ప్రశ్నార్థక వాక్యాలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1. (నూతన) విషయాపేక్షక ప్రశ్నలు. 2. విషయ నిర్థారక ప్రశ్నలు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు. ఎందుకు, ఎట్లా, ఏమిటి (ఏం) మొదలైన ప్రశ్నార్థక శబ్దాలతో వచ్చేవి, విషయాపేక్షక ప్రశ్నలు. అనే శబ్దాంతంగా వచ్చేవి విషయ నిర్థారక ప్రశ్నలు. మొదటి రకం ప్రశ్నలకు సమాధానంగా నూతన విషయ బోధక పదాలు, వాక్యాలు సమాధానాలుగా అపేక్షితాలు. రెండోరకం ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే అవును, కాదు అనే పదాలతో వ్యక్తం చెయ్యొచ్చు. శ్రోతకు సమాధానాలు తెలియనప్పుడు ఏ ప్రశ్నకైనా ఏమో అనే శబ్దం సమాధానంగా ఇయ్యవచ్చు. అంటే ఏమో అనే శబ్దాన్ని ఒక వ్యవహర్త సమాధానంగా వాడితే అడగబడిన ప్రశ్నకు సమాధానం తనకు తెలీదు అని చెప్పటం అతని ఉద్దేశంగా మనం గ్రహించవచ్చు.

2.81 : ప్రశ్నార్థక పదయుక్తమైన ప్రశ్నలను ఇంకో వాక్యంలో ఇమిడ్చి చెప్పాలంటే వాక్యాంతంలో శబ్దాన్ని అనుసంధించాలి. ఆ శబ్దంతో వచ్చే ప్రశ్నల్ని ఇమడ్చాలంటే ఏమో శబ్దాన్ని అనుసంధించాలి.

(184)

a. సుజాత పూరి నుంచి ఎప్పుడొస్తుందో నీకు తెలుసా ?
b. సుజాత పూరినుంచి వచ్చిందేమో నీకు తెలుసా ?

పై వాక్యాలనిబట్టి - శబ్ధయుక్త ప్రశ్నలకు శబ్దానికి, - శబ్దయుక్త ప్రశ్నలకు ఏమో శబ్దానికి ఉన్న సంబంధాన్ని గ్రహించవచ్చు. సంశ్లిష్ట వాక్యనిర్మాణంలో - శబ్దయుక్త ప్రశ్నలకు - శబ్దాన్ని ఆగమంగానూ, - శబ్దయుక్త ప్రశ్నలకు ఏమో శబ్దాన్ని ( - శబ్దానికి) ఆదేశంగానూ చెప్పవచ్చు. రెండు చోట్ల ఏమో (ఏం + ) శబ్దాన్ని ప్రతిపాదించి -శబ్ద ప్రశ్నలతో వచ్చినప్పుడు ఏమో > ఓ అనే మార్పును సూచించవచ్చు. రెంటిమధ్య పెద్ద భేదం లేదు. శబ్దం వాక్యంలో కాని, పదంలోకాని శబ్దాన్ని అపేక్షిస్తుంది. అది లేనిచోట (ఆ-శబ్ద ప్రశ్నలు) ఏం అనే శబ్దాన్ని అదనంగా ప్రతిపాదించాలి.

2.82 : ప్రశ్నకు సమాధానం చెప్పమని శ్రోతను అడగటం పృచ్ఛకుని లక్ష్యం. అందువల్ల సుజాత ఊరినుంచి ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నకు సుజాత ఊరినుంచి ఎప్పుడు వస్తుందో నాకుచెప్పు అనీ, సుజాత ఊరినుంచి వచ్చిందా? అనే ప్రశ్నకు సుజాత ఊరినుంచి వచ్చిందేమో నాకు చెప్పు అనీ అర్థాలుగా గ్రహించవచ్చు. ఈ పద్ధతిలో ఆలోచిస్తే ప్రత్నక్ష ప్రశ్నలను పరోక్ష ప్రశ్నలనుంచి లోపకార్యం ద్వారా నిష్పన్నం చెయ్యవచ్చు

పరోక్ష ప్రశ్నల్లో ప్రధాన వాక్యంలో క్రియ కనుక్కోను, చూచు, తెలియు, వంటి విషయసేకరణ సంబంధి కావాలి.

2.83 : ఏమో శబ్దంతో ఉన్న వాక్యాల్లో ప్రధాన వాక్యం ప్రశ్న, విధి, వ్యతిరేక , భావి బోధక వాక్యాలే రాగలవు.

(185)

సుజాత ఊరినుంచి వచ్చిందేమో చూడు (చూశావా, చూడలేదు. )

పై వాక్యాల్లో చూశాను అని ప్రయోగిస్తే ఆ వాక్యాన్ని వ్యాకరణ సమ్మతంగా గ్రహించటం కష్టం.

ఓ-శబ్దయుక్త వాక్యాలకు (-ప్రశ్నలు) ఇట్లాంటి నిబంధన ఉన్నట్టు లేదు.

(186)

a. సుజాత ఎక్కడుందో చూశాను.

ఈ పై వాక్యానికి ఈ కింది రెండు వాక్యాలూ సమానార్థకాలు.

b. సుజాత ఎక్కడుందో ఆచోటు చూశాను.
c. సుజాత ఉన్నచోటు చూశాను.

ఈ వాక్యాల్లో (b) యత్తదర్థక వాక్యం. (c) విభక్త్యర్థక నామ్నీకరణం ద్వారా ఏర్పడింది. అంటే (178) (a) ని 187) b నుంచి నిష్పన్న మైనట్లుగా భావించవచ్చు. (177) లాంటి వాక్యాలకు. సమానార్థకమైన యత్తదర్థక వాక్యాలు కాని, విభక్త్యర్థక నామ్నీకరణ వాక్యాలుగాని లేవు. 2.84 : వ్యవహారంలో ఏమో, శబ్దయుక్త వాక్యాలు సామాన్యవాక్యాలుగా (అశ్లిష్ట) కూడా ప్రయోగం అవుతుండై.

(188)

a. సుజాత ఎప్పుడు వస్తుందో:
b. సుజాత వచ్చిందేమో:

వ్యవహరించే విధానాన్నిబట్టి ఈ పై వాక్యాలు భిన్నార్థకాలు కావచ్చు. ఒక అర్థంలో శ్రోతనుంచి సమాధానాన్ని అపేక్షించే పరోక్ష ప్రశ్నలవుతై. మరో అర్థంలో వక్త తనకు తాను (సమాధానాపేక్ష లేకుండా) వేసుకున్న ప్రశ్నలవుతై. రెండో అర్థంలో పై వాక్యాలను కిందివిధంగాకూడా వ్యవహరించవచ్చు.

c. సుజాత ఎప్పుడు వస్తుందో ఏమో?
d. సుజాత వచ్చిందో ఏమో?

మొదటి అర్థంలో ఈ కింది విధంగా వ్యవహరించవచ్చు.

e. సుజాత ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా ?
f. సుజాత వచ్చిందేమో నీకు తెలుసా ?

ఈ సూచించిన అర్థభేదం ఉన్నట్టయితే (178) లో (a) (b) లకు క్రమంగా (c, d) లు, (e, f) లు మూలవాక్యాలుగా ప్రతిపాదించటం ద్వారా ఆర్థభేదానిక్కారణం చూపించవచ్చు.

ఆ ప్రశ్నలకీ ఏమో శబ్దానికి - ప్రశ్నలకీ - శబ్దానికీ సంబంధం చూపించబడింది. రెండు - ప్రశ్నలమధ్య వికల్పాన్ని చెప్పినప్పుడు పరోక్ష ప్రశ్నల్లో - శబ్దమే వస్తుంది.

(189)

a. సుజాత Ph. D. చేస్తుందో, పెళ్ళి చేసుకుంటుందో తెలీదు.
b. సుజాత ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో తెలీదు.

2.85 : క్రియకు నిశ్చయ వ్యతిరేకాల మధ్య వికల్పాన్ని చెప్పినప్పుడు వ్యతిరేక క్రియకు లేదు వికల్పంగా ఆదేశం అవుతుంది. క్రియారహిత వాక్యాల్లో స్థితి బోధకాలకు కాదు శబ్దం, పరిణామ బోధకాలకు లేదు ఆ దేశం అవుతుంది. కాలభేదంతో సంబంధం లేకుండానే ఈ ఆదేశం జరుగుతుంది. ఆ ప్రక్రియ ఈ కింది వాక్యాల్లో చూడవచ్చు. ఈ ఆదేశ కార్యాలు పరోక్ష ప్రశ్నల్లోనూ, ప్రత్యక్ష ప్రశ్నల్లోనూ కూడా జరుగుతై.

(190)

a. సుజాత ఊరినుంచి రేపు వస్తుందో లేదో తెలీదు.
b. సుబ్బారావు మంచివాడో కాదో తెలీదు.
c. రెడ్డిగారు ప్రిన్సిపాలు అవుతాడో లేదో తెలీదు.

పై వాక్యాల్లో (b) లో అవును శబ్దాన్ని వికల్పంగా మొదటి ప్రశ్నకు చేర్చుకుని అవునో కాదో అనవచ్చు.

2.86 : ఏం శబ్దాన్ని నిర్దేశక వాక్యాలకిచేరిస్తే 'ఎందుకు' అనే అర్థం వస్తుంది. ఉదాహరణకు నువ్వు మొన్న రాలేదేం? అంటే ఎందుకురాలేదు అని అర్థం.

ప్రశ్నార్థకమైన , శబ్దాలు ఒకే వాక్యంలో రావు.* ఆయన ఎప్పుడు వస్తాడా? అనే వాక్యం ప్రశ్నార్థకంగా తప్పు.

2.87 : ఒక - ప్రశ్నకు, -ప్రశ్నకు వికల్పం చెప్పటం సాధ్యం కాదు. కాని వికల్పత్వాన్ని చెప్పిన రెండు ప్రశ్నలున్నప్పుడు - ప్రశ్నతో వికల్పం సాధ్యమవుతుంది.

(191)

a. సుజాత ఎప్పుడు వస్తుందో, రాదో తెలీదు.
b. సుజాత ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో తెలీదు.

(191) (a) లో “ఎప్పుడురాదో" అనే అన్వయించుకుంటే వాక్యం వ్యాకరణసమ్మతమవుతుంది.

-శబ్దం రెండు వాక్యాల మధ్యేకాక పదాలమధ్య, పదబంధాలమధ్యగూడా వికల్పాన్ని సూచించటానికి ప్రయోగించబడుతుంది.

(192)

సుజాత ఇంజనీరునో డాక్టరునో పెళ్లిచేసుకుంటుంది. ప్రశ్నార్థకమైన
-శబ్దంకూడా క్రియేతరశబ్దాల కిట్లాగే చేర్చవచ్చు.


(193)

సుజాత ఇంజనీరునా? డాక్టరునా? పెళ్లి చేసుకుంటుంది?

(192), (193) వాక్యాల మధ్య కొన్ని సమానాంశాలున్నై. రెండింట్లోనూ సుజాతపెళ్ళి చేసుకుంటుంది అనే భాగం సమానం. రెంటి మధ్య వికల్పనంబంధం ఉంది. (193)తో పోలికఉన్న నిర్మాణంనుంచి (192) ను నిష్పన్నంచేయటం సాధ్యంకావచ్చు.