తెలుగు వాక్యం/సామాన్య వాక్యాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెలుగు వాక్యం

1. సామాన్య వాక్యాలు

వాక్యాలను ఏ భాషలోనైనా సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలుగా విభజించవచ్చు. ఒక వాక్యంలో నిర్దిష్టస్థానంలో ఇంకొక వాక్యాన్ని చేరిస్తే సంశ్లిష్ట వాక్యం ఏర్పడుతుంది. ఒక వాక్యంతో ఇంకొక వాక్యాన్ని చేరిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఒక వాక్యంతో ఇంకొక వాక్యాన్ని చేర్చినప్పుడు కొన్ని మార్పులు జరుగుతై. ఈ మార్పుల అనంతరమే సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు ప్రయోగార్హాలు అవుతై . ఈ దృష్టితో చూసినప్పుడు సంశ్లిష్ట, సంయుక్త వాక్యాల్లో సామాన్య వాక్యలక్షణాలుండటం ఆశ్చర్యంకాదు. అందువల్ల తెలుగు వాక్య నిర్మాణాన్ని గురించి విపులంగా పరిశీలించటానికి సామాన్య వాక్యాన్ని గురించి ముందుగా తెలుసు కోటం అవసరం.

ఈ సామాన్య వాక్యాల్లోకూడా మళ్ళీ భేదాలున్నై. ఈ సామాన్య వాక్యాల్లో అతి సామాన్యమైన దాన్ని నిశ్చయార్ధకం అంటారు. సామాన్యవాక్యాన్ని కొన్ని మార్పులు చెయ్యటంద్వారా (ఆగమాదేశ వ్యత్యయాది కార్యాలు) వ్యతిరేక, ప్రశ్న, కర్మణి- మొదలైన వాక్య భేదాల్ని సాధించొచ్చు. ఇవి కాక విధి, సంప్రార్థ నాద్యర్థక వాక్యాలుకూడా ఉన్నై. ఒక వాక్యానికి కిల, సంబుద్ధ్యాద్యర్ధక ప్రత్యయాలు చేర్చటంవల్ల సామాన్యవాక్యంలో మరి కొన్ని ఆర్ధభేదా లేర్పడతై.

తెలుగు వాక్యాల్లో చెప్పుకోదగిన ఇంకో భేదం ఉంది. కొన్ని వాక్యాలు క్రియారహితాలు, కొన్ని క్రియాసహితాలు.

1.11 : క్రియారహితవాక్యాలు : క్రియారహితవాక్యాల్లో కొన్ని సహజంగా క్రియలేని వాక్యాలు, మరికొన్ని క్రియ లోపించిన వాక్యాలు ఉంటై. సహజంగా క్రియలేని వాక్యాల్లో రెండు నామబంధాలుంటై. అందులో ఒకటి ఉద్దేశ్యం, ఇంకోటి విధేయం. ఉద్దేశ్య విధేయనామాలు రెండూ ఏకవస్తు బోధకాలు. ఉద్దేశ్య నామాలు ఏ నామాలైనకావచ్చు. సర్వనామాలుకూడా కావచ్చు. విధేయనామాలు సిద్ధనామాలు, విశేష్యాలనుంచి సాధించిన నామాలుఉంటై. విధేయనామాలు ఉద్దేశ్య నామాల్ని గురించి సాధారణంగా ఏదో ఒక విశేషాన్ని బోధిస్తే, ఉద్దేశ్య, విధేయ నామాలు రెండూ విశేషణపద పూర్వకమై ఉండవచ్చు. ఈ విశేషణాలలో వాటిల్లో భేదాల్ని బట్టి వాటిక్రమం ఉంటుంది. ఈ కింది వాక్యాలు క్రియారహిత వాక్యాలకు ఉదాహరణలు. ఇట్లాంటి వాటిని సమీకరణ వాక్యాలంటారు.

(1)

a. ఆయన ప్రొఫెసరుగారు,
b. ఆమె మంచి టీచరు.

విధేయనామంలో విశేషణాలున్నప్పుడు విశేషణాల తర్వాత ఉన్న నామాల్ని లోపింపజేయవచ్చు. అయితే విధేయ పదబంధం విశేషణాల్ని యథాతథంగా సహించ లేదు గనుక లోపించిన నామానికి సరిపోయే లింగ, వచన బోధక ప్రత్యయాలు చేర్చాల్సి ఉంటుంది. ఈ ప్రత్యయాలను సర్వనామ రూపాలనుంచి నిష్పన్నమైనట్లుగా భావించవచ్చు. ఈ ప్రత్యయాలకు మూలం తదర్థబోధకమైన ప్రథమ పురుష సర్వనామాలు. ఇట్లాంటి ప్రత్యయసహితమైన విశేషణాలే సాధ్యనామాలు. ఈ కింది వాక్యాలలో ఈ ప్రక్రియ చూపబడుతున్నది.


(2)

a. ఆ ప్రొఫెసరు మంచి ప్రొఫెసరు -> ఆ ప్రొఫెసరు మంచివాడు.
b. ఆ టీచరు మంచి టీచరు -> ఆ టీచరు మంచిది.
c. ఆ విద్యార్ధులు మంచి విద్యార్ధులు -> ఆ విద్యార్ధులు మంచి వాళ్ళు.
d. ఆ కుర్చీ కొత్త కుర్చీ -> ఆ కుర్చీ కొత్తది.
e. ఆ చీరలు పట్టు చీరలు -> ఆ చీరలు పట్టువి.

ఈ పైన ఉపయోగించిన వాడు, వాళ్ళు అనే ప్రత్యయాలు సర్వనామాలతో సమానం. 'ది', 'వి' ప్రత్యయాలు అది, అవి అనే సర్వనామాలనుంచి మొదటి అచ్చులోపింపగా ఏర్పడిన రూపాలు.

ఈ క్రియారహితవాక్యాలు ప్రథమ, మధ్యమ - పురుష బోధకాలుకూడా కావచ్చు. అయినపుడు విధేయనామం పురుషవచన, భేదాన్నిబట్టి తద్బోధకమైన ప్రత్యయాన్ని గ్రహిస్తుంది. సహజనామంతో బాటు సాధ్యనామంకూడా ఈ ప్రత్యయాలను గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ కింది వాక్యాలలో ఉదాహృతం.

(3)

a. నేను విద్యార్థిని.
b. మేము విద్యార్ధులము.
c. నువ్వు విద్యార్థిని.
d. మీరు విద్యార్ధులు,
e. మనము విద్యార్ధులము.

పై వాక్యాలలో ని, ము, అనే ప్రత్యయాలు క్రమంగా ఉత్తమ పురుష, ఏకవచన బోధకాలు. పు మధ్యమ పురుష ఏకవచన ప్రత్యయం. మధ్యమపురుష బహువచనానికి, ప్రథమపురుష బహువచనంకన్నా భిన్న మైనరూపంలేదు. ఈ ప్రత్యయాలు ము, ను, వు, లు. ఇవి ఇకారాంతనామాల తర్వాత మి, ని, వి గా మారతై. ఇది స్వర సమీకరణంవల్ల జరిగిన మార్పు.

1.12 ప్రాధాన్య వివక్షననుసరించి పై వాక్యాలలో ఉద్దేశ్య, విధేయ వ్యత్యాసం జరగవచ్చు. ఆ వ్యత్యాసం కింది ఉదాహరణలలో చూడవచ్చు.

(4)

a. నువ్వు గాడిదవు -> గాడిదవు నువ్వు.
b. నేను సుబ్బారావును -> సుబ్బారావును నేను.
c. మేము తెలుగు వాళ్ళం -> తెలుగు వాళ్ళం మేము.

పదక్రమంలో ఈ మార్పు ప్రాధాన్య వివక్షకోసంవచ్చింది. ఈ మార్పువల్ల ఆఖ్యాతస్థానానికి (Predicate-position) చేరిన నామం అధిక ప్రాధాన్యాన్ని వహిస్తుంది. ప్రాధాన్య వివక్షకు పదక్రమవ్యత్యాసం తెలుగుభాష అనుసరించే మార్గాలలో ఒకటి. ఇంకొకమార్గం క్రమవ్యత్యాసం లేకుండా ప్రాధాన్యాన్ని చెప్పదలచుకొన్న పదాన్ని ఉచ్చారణలో ఊనికతో నొక్కి పలకటం. ఇదికాక ప్రశ్నార్ధకాది రూపాలను ఉద్దిష్ట నామానికి చేర్చటం ఇంకో పద్ధతి. ఈ పద్ధతి ముందుముందు వివరించబడుతుంది. ఈ క్రియారహిత వాక్యాలలో ఉద్దేశ్య, విధేయనామాలు ఏకవస్తుబోధకాలైనా ఏకరూపకాలుకావు. సాధారణంగా రెండూ సర్వనామాలుగా ఉండవు. కాని కొన్ని అర్ధవిశేషాలలో ఇట్లాంటివి కన్పిస్తాయి. అట్లాంటప్పుడు ఏవార్థకమైన ప్రత్యయం వీటిల్లో ఒక నామానికి చేరుతుంది. ఈ కింది వాక్యాలు అందుకు ఉదాహరణాలు.

(5)

a. వాడే వీడు.
b. అతనే ఇతను.

c. గాడిద గాడిదే, గుర్రం గుర్రమే.
d. నేను నేనే, నువ్వు నువ్వే.

1.13 : ఈ క్రియారహిత వాక్యాలలో విధేయాలుగా వచ్చిన కొన్ని విశేషణాలు నామాలుగా మారకుండానే ప్రయుక్త మయ్యేవికూడా ఉన్నై. అట్లాంటి విశేషణాలను ఇంతకు ముందు ఉదాహరించిన వాటికన్నా భిన్నంగా గ్రహించాల్సి ఉంటుంది. అటువంటి వాటిల్లో కొన్ని ఈ కింది వాక్యలలో గుర్తించవచ్చు.

(6)

a. ఆ కొండ ఎత్తు.
b. ఈ బావి లోతు.
c. ఆ అమ్మాయి పొడుగు.
d. ఈ అబ్పాయి పొట్టి.
e. ఈ గది వెడల్పు,

ఈ పై వాక్యాలలో విశేషణాలు నిజానికి విశేషణాలయినా, వీటికి విశేష్యాలుగా ప్రయోగాలు కన్పిస్తున్నై ఉదాహరణకు,

(7)

ఈ బావి లోతు - 6 అడుగులు.
ఆ కొండ ఎత్తు - 2000 అడుగులు.
ఆ అమ్మాయి పొడుగు - 5 1/2 అడుగులు.
ఈ గది వెడల్పు - 20 అడుగులు

కాని పొట్టి అనే విశేషణాన్ని ఈ పై విధంగా ఉపయోగించడానికి వీలు లేదు. ఈ పై విశేషణాలు పదార్థం లేక ద్రవ్యం అవకాశంలో ఆక్రమించే స్థానాన్ని సూచించేవిగా కన్పిస్తున్నాయి. ఈ లక్షణానికి ప్రత్యయరహితంగా విధేయస్థానంలో ఉపయోగించటానికి ఏమైనా సంబంధం ఉందేమో చెప్పటం కష్టం. ఈ క్రియా రహిత వాక్యాలలో తులనాత్మక వాక్యాలు ఇంకోరకం. ఈ వాక్యాలలో 'తో ' 'కంటె' వంటి ప్రత్యయాలు కూడా చేరతై.

(8)

a. అతను నాకంటె పెద్ద.
b. అతని కన్నా నేను చిన్న
c. అతను నాతో సమానం.

ఇట్లాంటి వాక్యాలలో విధేయనామం మానార్థకంగా ఉంటుంది. (6) లో ఉదాహరించిన పొడుగు, పొట్టి, లోతు, ఎత్తు. వంటి వన్నీ ఈ రకపు వాక్యాలలో ప్రయోగించవచ్చు.

1.14 : ఇవి కాక మరికొన్ని విభక్తి బంధాలు కూడా క్రియా రహిత వాక్యాలలో కన్పిస్తున్నై. ఉదాహరణకు ఈ కింది వాటిని పరిశీలించండి.

(9)

a. హైదరాబాదు నాకు కొత్త.
b. అతను ఈ ఊరికి పెద్ద.
c. మాతమ్ముడు మాలో పొడుగు.

ఈ పై వాక్యాలలో విధేయస్థానంలో ఉన్నవి విశేషణాలు. ఇవి విశేష్యాలుగా ప్రయుక్తమైనట్లు కన్పిస్తున్నై, అంటే కొన్ని పదాలను విశేషణ విశేష్యోభయ పదాలుగా గ్రహించాలేమో !

కొన్ని క్రియారహిత వాక్యాలు సంబంధ బోధకాలుగా కన్పిస్తై. వీటిల్లో సంబంధాన్ని సూచించే కు - విభక్తి బంధం కూడా ఉంటుంది .

(10)

a. అతను నాకు తమ్ముడు.
b. ఇతను నాకు స్నేహితుడు.
c. ఈమె నాకు స్నేహితురాలు.

1.15 : ఇంతవరకు ఉదాహరించిన వాక్యాలలో, క్రియ లేకపోవటమే కాకుండా కాలబోధకత లేకపోవడం కూడా గమనించవచ్చు. కాలాన్ని బోధించాల్సి వచ్చినప్పుడు ఈ వాక్యాలకు అవు అనే క్రియను అనుబంధించాలి. అప్పుడు ఇతర వాక్యాలకులాగే . ఈ వాక్యాలకు కూడా భిన్నకాలాలను బోధించే క్రియారూపా లుంటై అట్లాంటి వాటిలో కొన్ని ఈ కింద ఉదాహరించిన వాక్యాలు.

(11)

a. అతను మంత్రి.
b. అతను మంత్రి అయ్యాడు.
c. అతను మంత్రి అవుతాడు.

ఇట్లాంటి వాక్యాలకు వ్యతిరేకార్థంలో కాలబోధకత లేనపుడు కాదు అనే వ్యతిరేకరూపం చేరుతుంది. ఈ రూపాన్ని అన్ని పురుషలలోను ప్రయోగించవచ్చు. అట్లా కాకుండా లింగ, పురుష, భేదాన్ని వివక్షించవచ్చు. అప్పుడా భేదాల్నిబట్టి కాను, కాము, కావు, కాడు, కాదు, కారు అనే రూపాలు చేరతై. ఈ రూపాలు భవిష్యదర్థంలో నిత్యంగా చేరతై. అందువల్ల ఇట్లా చేరిన రూపాలుగల వాక్యాలు భిన్నకాలార్థ బోధక సమర్థాలవుతాయి. ఉదాహరణకు - అతను మంత్రి కాడు అనే వాక్యానికి అతను ఇప్పుడు మంత్రి కాదు, అతను ఇక మంత్రి కాడు అన్న రెండర్థాలు ఉన్నై. ఈ రకపు వాక్యాలకు అరుదుగా విధి, సంప్రార్థనాది రూపాలు కూడా ఉంటై. అప్పుడు కా, కాండి , (కండి) అనే ఏకవచన, బహువచన రూపాలు వ్యతిరేక విధిలో ఉభయ వచనాలలోను కావద్దు అనే రూపం చేరతై .

ఉదాహరణ:

(12)

a. నువ్వు కలెక్టరువికా.
b. మీరు మంచి పౌరులు కండి,
c. మీరు ప్రజా వ్యతిరేకులు కావద్దు.

కొన్ని మండలాలలో కా అనే రూపానికి బదులు, కాలబోధక, వ్యతిరేక , అవ్యతిరేక రూపాలు రెండిట్లోను అవు అనే రూపం కన్పిస్తుంది..

1.16 : ఈ క్రియారహిత వాక్యాలకు అంతంలో అనే దీర్ఘాచ్చును చేరిస్తే ప్రశ్నార్థక వాక్యాలు ఏర్పడతై. వాక్యార్థాన్ని రకరకాలుగా మార్చే కిలార్థ కాది రూపాలు గూడా ఇట్లాంటి వాక్యాల చివర చేర్చొచ్చు, వ్యతిరేకార్థకం గాని, ప్రశార్థకం గాని, కిలార్ధకాదులు గాని వక్తృవివక్షనుబట్టి ఉద్దేశ్య నామానికి కూడా చేర్చవచ్చు. ఇట్లా చేర్చటం వలన ఉద్దేశ్య నామాలకి ప్రాధాన్యం ఏర్పడుతుంది. అంటే ప్రాధాన్య వివక్షకు పదక్రమ వ్యత్యాసమేకాక ఈ పేర్కొన్న వ్యతిరేక , ప్రశ్న, కిలార్థకాలను చేర్చటం కూడా ఒక పద్ధతి అన్నమాట. పదక్రమ వ్యత్యాసంలో ఉద్దేశ్య నామాన్ని ఆఖ్యాత స్థానానికి బరపటం వలన ఈ ప్రాధాన్యం ఏర్పడుతున్నది. ఆఖ్యాత స్థానంలో ఉన్న పదం ఆస్థానాన్నిబట్టి సహజంగానే ప్రధానమైనదని దీని అర్థం.

1.17 : క్రియాలోపం వల్లగూడా కొన్ని క్రియారహిత వాక్యాలు ఏర్పడతాయని పూర్వం సూచించ బడింది. వీటిల్లో కొన్ని ఉండు అనే క్రియ లోపించటం వల్ల ఏర్పడినవి. ఈ క్రింది వాక్యసమూహం ఈ రకపు వాక్యాలకు ఉదాహరణం.

(13)

a. నీకు పిల్లలు ఎంతమంది?
b. ఆమెకు అన్నలు ఇద్దరు.

మరికొన్ని వాక్యాలలో లోపించిన క్రియ అవు. లాగా కనిపిస్తున్నది. అవి సాధారణంగా సంబంధార్థక బోధకాలు.

(14)

a. అతను నాకు తమ్ముడు.
b. ఆమె నాకు మేనత్త.

ఈ వాక్యాలలో కాలబోధతో సంబంధం లేకుండా అవుతాడు, అవుతుంది అనే క్రియలను ప్రయోగించవచ్చు. ఇట్లా ప్రయోగించినపుడు కొంత ఆర్థభేద మున్నట్లు కన్పిస్తుంది. ఉదాహరణకి అతను నాకు తమ్ముడు అవుతాడు అన్నప్పుడు అతను నాకు సొంత తమ్ముడు కాదు , వరసకు తమ్ముడవుతాడు అని అర్థం కావచ్చు. ఇది తెలుగువారి చుట్టరికపు పద్ధతివల్ల ఏర్పడిన అర్థభేదం.

1.18 : మరికొన్ని వాక్యాలలో లోపించిన క్రియ ఇంకో వాక్యం నుంచి నిష్పన్న మయినట్లుగా కన్పిస్తుంది. అప్పుడా లోపించిన క్రియ ఆ వాక్యపు గుప్త నిర్మాణాన్ని బట్టి మాత్రమే. చెప్పగలము.

(15)

a. నాకు కాఫీ అలవాటు.
b. ఈ పాఠం కష్టం.

ఈ పై వాక్యాలలో తాగటం, చదవటం అనే క్రియలు క్రమంగా లోపించి నట్లు గ్రహించగలం.

1.19 : కొన్ని వాక్యాలలో ఆఖ్యాత పదం విధేయనామంగా కనిపించినా, అర్థాన్ని బట్టి క్రియగానే గుర్తించాల్సి ఉంటుంది.

(16)

a. అతను రోజూ మా యింటికి వచ్చేవాడు.
b. ఆమె రోజూ వీణ వాయించేది.

ఈ పై వాక్యాలు పైకి క్రియారహిత వాక్యాలుగా కనిపించినా, వచ్చేవారు, వాయించేది అనే రూపాలు భూతకాలంలో జరిగిన శత్రర్థ వ్యా పారాన్ని సూచిస్తున్నది. అందువల్ల వీటిని క్రియలుగానే గుర్తించాల్సి ఉంటుంది. 1.20 : క్రియాసహిత వాక్యాలు : క్రియాసహిత సామాన్య వాక్యాలలో క్రియ వాక్యాంతంలో వస్తుంది. క్రియలలో చాలారకాలు విభాగాలు చేయవచ్చు. అందులో ఒక విభాగం సకర్మక అకర్మక క్రియాభేదం. సకర్మక క్రియ కర్మపదాపేక్షికం. అకర్మకక్రియ కర్మపద నిరపేక్షకం. ఉండు, పోపు, వచ్చు వంటి క్రియలు అకర్మకాలు, కొను, తిను, చేయు వంటివి సకర్మకాలు. సకర్మకాలలో కొన్ని ద్వికర్మకాలు. అంటే ఈ క్రియలకు రెండు కర్మపదాలుంటాయి. రెండు కర్మలున్నప్పుడు ఒకదాన్ని ముఖ్యకర్మ అని, రెండవదాన్ని అముఖ్య కర్మ అని అంటారు. ఇవికాక క్రియలను వాటి ఆర్థాలను బట్టి స్థితిబోధకాలని, గతిబోధకాలని, సంఘటన బోధకాలని, వచ్యర్థకాలని చాలా రకాలుగా విభాగాలు చేయవచ్చు. చేయవచ్చునంటే వాక్యనిర్మాణ విధానంలో, ఈ విభాగానికి ప్రమేయముంటుందని అర్థం. తెలుగు క్రియలకు . ఇట్లాంటి విభాగం సుష్ఠుగా జరగలేదు. విశేషమైన పరిశోధన జరిగితేగాని ఇట్లాంటి విభాగం సాధ్యంకాదు, జరిగినంత మటుకు కొంతలో కొంత ఈ రచనలో అక్కడక్కడ ప్రసక్తమవుతుంది.

1.21 : వాక్యంలో ప్రధాన విభాగం నామబంధం, ఆఖ్యాత బంధం. ఆఖ్యాత బంధంకూడా నామబంధమయితే ఇంతకుపూర్వం చర్చించిన క్రియారహిత వాక్యాలు నిష్పన్నమవుతై. ఆఖ్యాతబంధం క్రియాసహితమైతే అకర్మక, సకర్మక భేదం ప్రవర్తిత మవుతుంది. సకర్మక క్రియాబంధంలో ఇంకో నామబంధం ఉండొచ్చు. క్రియాబంధంలో ఉన్న నామబంధం ఆ క్రియకు కర్మ అవుతుంది. క్రియాబంధంలో భాగం కాని నామబంధం కర్తృపద మవుతుంది. దీన్ని బట్టి వాక్యంలో కర్తృ, కర్మ పదాలుగా రాగలిగిన సామర్ధ్యం నామ పదానికున్నట్లు తెలుస్తున్నది.

వాక్యాంలో దేశకాల బోధకాలైన పదబంధాలుకూడా ఉంటై. ఇవికాక కొన్ని రకాల క్రియావిశేషణాలు, కారకబంధాలు కూడా ఉండవచ్చు. కర్తృకారకం కాక మిగతా కారకాల్ని సూచించే పదబంధాలు ఆఖ్యాత బంధంలో భాగాలుగా ఇక్కడ పరిగణించబడుతున్నై. వీటిల్లో కర్మకారకాన్ని బోధించే పదం కర్మపదం. మిగతావి కరణ, అధికరణాది కారకాలను బోధించే పదబంధాలు. పైన పేర్కొన్న పదాలన్ని ఒకే సామాన్య వాక్యంలో రావడానికి వీలుంది. ఇట్లావచ్చినప్పుడు ఈ పదాలస్థానం క్రమ నిరపేక్షకం కాదు. కర్తృపదం వాక్యాదిని, క్రియాపదం వాక్యాంతంలో వస్తుందని పూర్వమే తెలుసుకున్నాము. కర్మపదం క్రియకు పూర్వం ఉంటుంది. అముఖ్య కర్మపదం ముఖ్యకర్మకంటే ముందు వస్తుంది. దానికంటే ముందు స్థలబోధక పదం, దానికంటే ముందు కాలబోధకపదం వస్తై. క్రియావిశేషణం క్రియకంటే ముందు, కర్మపదం తర్వాత వస్తుంది. ఈ పదాల వరస పైన చెప్పిన పద్ధతిలోవస్తే ఇందులో ఏ పదానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉండదు. ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని చెప్పవలసి వచ్చినపుడు ఆ పదాన్ని క్రియాపదానికి సన్నిహితంగా జరపటం ఒక పద్ధతి. ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలను పరిశీలిస్తే ఈ ప్రాధాన్యం తెలుస్తుంది.

(17)

a. నేను రేపు మద్రాసులో అరవ సినిమాకి వెళతాను.
b. నేను మద్రాసులో అరవ సినిమాకి రేపు వెళతాను.
c. నేను రేపు అరవసినిమాకి మద్రాసులో వెళతాను.

పై వాక్యాల్ని పరిశీలిస్తే మొదటిది సాధారణంగా ఉండే పదక్రమం అని, దానికి వ్యతిక్రమం జరిగినపుడు క్రియాపదానికి సన్నిహితంగా ఉన్నపదం కొంత ఎక్కువ ప్రాధాన్యం వహిస్తుందని తెలుస్తుంది. క్రియాపదం. సాన్నిహిత్యం ఈ ప్రాధాన్యానికి కారణం. ఒక్కోసారి కర్తృపదం కూడా క్రియాపద సన్నిహిత మైనపుడు అధిక ప్రాధాన్యాన్ని వహిస్తుంది.

(18)

a. కిట్టు పకోడీలు తిన్నాడు.
b. పకోడీలు కిట్టు తిన్నాడు.

ఈ రెండు వాక్యాలలో మొదటిది సాధారణ పదక్రమం. దీనికి వ్యతిక్రమం జరిగినప్పుడు కర్తృపదానికి ప్రత్యేక ప్రాధాన్యం వస్తున్నది. మొదటి వాక్యంలో ఒక మనిషి ఒక వ్యాపారం చేసినట్లు మాత్రమే సూచితమయింది. రెండో వాక్యంలో వ్యాపారాశ్రయమైన నామం నిర్దిష్టమైంది. అంటే రెండో వాక్యానికి 'పకోడీలు తిన్నది కిట్టు, మరొకరు కాదు' అన్న అర్థం ఉంది. మొదటి వాక్యంలో అట్లాంటి అర్థం లేదు. మొదటి వాక్యంలో 'పకోడీలు ఇంకొకరు కూడా తిని ఉండవచ్చు' అన్న భావం ఉంది. దీన్ని ఉద్దేశ్యవిధేయ పద్ధతిలోకూడా చెప్పవచ్చు. మొదటి వాక్యంలో కిట్టు ఉద్దేశ్యం. రెండవ వాక్యంలో పకోడీలు ఉద్దేశం. రెండు వాక్యాలలోను కర్త ఒకటే. అది కిట్టు అనే నామపదం. దీన్నిబట్టి తెలుగులో పదక్రమ వ్యత్యయం వల్ల ఉద్దేశ్య విధేయాలు మారతాయని, క్రియాపదానికి సన్నిహితంగా జరిగిన నామానికి ప్రాధాన్యం ఉంటుందని తెలుసుకోవచ్చు. కర్తృ, కర్మపదాలు నామబంధాలే అవుతయ్యని ఇంతకు ముందే చెప్పబడింది. ఉద్దేశ్య విధేయాలకు ఈ రకమైన, నిబంధన లేదు. ఈ కింది వాక్యాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.

(19)

a. వంట ఇంట్లో బొద్దింకలున్నై.
b. బొద్దింకలు వంటఇంట్లో ఉన్నాయి.

పై వాక్యాలలో ఒక దాంట్లో వంట ఇంట్లో అనేది ఉద్దేశ్యం. ఇంకొక దాంట్లో బొద్దింకలు అనేది ఉద్దేశ్యం.

ప్రాచీనుల మతం ప్రకారం వక్తకు, శ్రోతకు తెలిసింది ఉద్దేశ్యం. వక్తకు మాత్రమే తెలిసింది విధేయం. ఆధునిక పద్ధతి ఇందుకు విరుద్ధమైనది కాదు. తెలుగు వాక్యాలలో మొదట ఉద్దేశ్యం వస్తుంది. తర్వాత విధేయం వస్తుంది. కొన్ని వాక్యాలలో కర్త, ఉద్దేశ్యం ఒకటే కావచ్చు. మరికొన్ని వాక్యాలలో దీనికి భిన్నంగా వ్యత్యాసం జరగవచ్చు.

1.22 : కొన్ని వాక్యాలకు కర్తృపద నిర్ణయం కష్టం. కాని ఉద్దేశ్యపదం సులభంగా గ్రహించవచ్చు. దీనికి కారణం ఉద్దేశ్యపదం సాధారణంగా పదాదిన వస్తుంది. ఈ కింది వాక్యాలలో కర్తృపదాన్ని నిర్ణయించ లేము. మొదటిపదం ఉద్దేశ్యంగా గుర్తించటం సులభమే.

(20)

a. నాకు చలిగా ఉంది.
b. ఆమెకు భయంగా ఉంది.
c. అతనికి కష్టంగా ఉంది.
d. మాకు సంతోషంగా ఉంది.

ఈ పై వాక్యాలలో మొదటిపదం ఉద్దేశ్యం. కాని కర్మపదం ఫలానిదని చెప్పటం కష్టం. వ్యక్త నిర్మాణంలో కర్తలేదు. గుప్తనిర్మాణంలో కర్తను సూచించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపించదు. ఇట్లాంటి వాక్యాలలో ఉద్దేశ్యాన్ని అనుభోక్త (experiencer) గా భావించవచ్చు. అనుభవం (experience) దేహ, మనఃస్థితి బోధకం కావటం విశేషం. మరికొన్ని వాక్యాలలో వికల్ప వాక్య పద్ధతిని బట్టి కర్తృ పదాన్ని గుర్తించవచ్చు.

(21)

a. నాకు ఆకలిగా ఉంది.
b. నాకు ఆకలి అవుతున్నది.
c. నాకు దప్పికగా ఉంది.
d. నాకు దప్పిక అవుతున్నది.
e. నాకు తలనొప్పిగా ఉంది.
f. నాకు తలనొప్పి వేస్తున్నది.

ఈ పై వాక్య సమూహంలో సరివాక్యాలలో ఉద్దేశ్యపదానికి, క్రియాపదానికి మధ్యనున్న పదాన్ని కర్తృపదంగా గుర్తించవచ్చు. అయితే ఇది వ్యక్తనిర్మాణపు కర్త (surface subject). గుప్త నిర్మాణం (deep-structure) లో కర్తను గుర్తించవలసిన అవసరం ఉందో లేదో చెప్పటం వెంటనే సాధ్యంకాదు. ఒకవేళ అట్లా చెప్పితే అనుభోక్తనే కర్తగా చెప్పాల్సి రావచ్చు. ఈ పై వాక్యాలలోకూడా అనుభవ బోధక నామాలు దేహ, మనఃస్థితి బోధకాలే కావటం విశేషం. ఈ రకమైన వాక్యాలు ఇంకా పరిశీలనకు లొంగలేదు.

1.23 ఆఖ్యాతబంధంలో ప్రధానమైనది క్రియా పదం. ఈ క్రియాపదం ద్వారానే కాలబోధకత వ్యక్తమవుతుంది. కాలబోధను స్థూలంగా భూత, భవిష్యత్, వర్తమానాలుగా విభజించవచ్చు. ఆయా కాలాలలో కాలబోధను సూచించే ప్రత్యయాలు చేరతై. కాలబోధక ప్రత్యయాల తర్వాత కర్తృపదంలో ఉన్న లింగ పురుష వచన భేదాన్ననుసరించి క్రియావిభక్తులు చేరతై, నేటి , తెలుగులో భవిషద్బోధ, తధ్ధర్మబోధ ఒకే క్రియద్వారా జరుగుతుంది. “అతను మాంసం తింటాడు" అనే వాక్యంలో తింటాడు అనే క్రియకు వేరే పదసహాయం లేనప్పుడు 'అతను ఎప్పుడూ మాంసాహారే' అనిగాని, 'అతను ఇక ముందు మాంసం తింటాడు' - అనిగాని అర్థాలు కావచ్చు. తెలుగులో వర్తమానార్ధక క్రియ శత్రర్థక బోధకంకూడా అవుతుంది. శత్రర్ధకబోధ ఇతరకాలాలలో చెప్పాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన కాలబోధ ఇతర పదాలద్వారా చెప్పాల్సి ఉంటుంది. ఏ పదసహాయమూ లేనపుడు ఈ క్రియ వర్తమానార్ధకమే అవుతుంది. అతను వస్తున్నాడు అనే వాక్యానికి ఇతర పదాల సహాయమూ, వాక్య ప్రయోగ సందర్భ సహాయము లేనప్పుడు అతను ఇప్పుడు వస్తున్నాడు అనే అర్ధం చెప్పాల్సి ఉంటుంది. ఇతర కాలాల బోధలో ఆ కాలాల్ని సూచించే నిన్న, మొన్న, రేవు, ఎల్లుండి వంటి పదాల అవసరం ఉంటుంది. ఈ కాలాలకు వ్యతిరేక బోధకూడా ఉంటుంది. భూతకాల వ్యతిరేకబోధ అన్నంత క్రియకు అన్ని పురుషలలోను లేదు అనే రూపం చేర్చటంవల్ల ఏర్పడుతుంది. వర్తమాన వ్యతిరేకక్రియ భావార్ధకరూపానికి లేదు అనేరూపం చేర్చటంవల్ల ఏర్పడుతుంది, భవిష్యద్ వ్యతిరేకక్రియ అన్నంతరూపానికి క్రియావిభక్తులు చేర్చటంవల్ల ఏర్పడుతుంది. వీటి నిర్మాణ విశేషాలు పద నిర్మాణచర్చలో భాగాలు కావటంవల్ల ఇక్కడ విశేషించి చెప్పలేదు.

1:241 ప్రశ్నార్ధక వాక్యాలు రెండురకాలు. విశేష విషయాపేక్షకాలు, విశేషవిషయ నిరపేక్షకాలు. క్రియారహితవాక్యాల గురించి చెప్పినవుడు పేర్కొన్న ప్రశ్నలు విశేషవిషయ నిరపేక్షకాలు. అవి వాక్యాంతంలో ఆ అనే రూపాన్ని చేర్చటంవల్ల ఏర్పడతాయి. విశేషవిషయాపేక్షకాలు ప్రత్యేకపదార్ధకపదంద్వారా వ్యక్తమవుతాయి. ఈ రకపు ప్రశ్నలు ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎవరు, ఏమిటి మొదలైన రూపాలవల్ల ఏర్పడతై. ఈ పదాలు క్రియకు సన్నిహితంగా పూర్వస్థానంలో వస్తై. ఈ కింది వాక్యంలో ఈ ప్రశ్నాభేదాలు ఉదాహరించబడుతున్నై.

(22)

a. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా ?
b. భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది ?

విషయాపేక్షక ప్రశ్నలలో ఏ విషయాన్ని ప్రశ్నించినా ఆ ప్రశ్నపదం క్రియకు సన్నిహితంగా చేరుతుంది. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు. ఎవరు, మొదలైన ప్రశ్న పదాలు ఈ రకపు ప్రశ్నలలో క్రియాపదానికి పూర్వం సన్నిహిత స్థానంలో ఉంటై. వాక్యం మొత్తాన్ని ప్రశ్నించే అనే రూపం వాక్యాంతంలో చేరుతుంది. అనే రూపం వాక్యంలో ఇతర పదాలకుకూడా చేరవచ్చు. అట్లా చేరినపుడు వాక్యంలో క్రియ నామ్నీకృతమవుతుంది. ఆ క్రియకు పురుషబోధతో నిమిత్తం లేకుండా 'ది' అనే ప్రత్యయం చేరుతుంది. ఈ ప్రక్రియాగతిని . క్రింది వాక్యాలలో చూడవచ్చు

(23)

అతను ఊరికి వెళ్ళాడు -- a. అతనా ఊరికి వెళ్ళింది.
                                  b. అతను ఊరికా వెళ్ళింది.

1.242 విధ్యర్ధబోధక క్రియలలో కర్త ఎప్పుడు మధ్యమ పురుష సర్వ నామమే. ఈ సర్వనామం ఏకవచనమైనపుడు క్రియ ధాతురూపంలోనే ఉంటుంది. ఈ ధాతువులకు ఆదేశరూపాలుంటే ఆ రూపాలే ప్రయుక్తమవుతై. వచ్చుకు- రా, తెచ్చుకు_తే, ఇచ్చుకు- ఇయ్, చచ్చుకు- చావు, లేచుకు-లే, పోవుకు-పో- ఆదేశ రూపాలు: విధ్యర్ధక క్రియకు బహువచనంలో అండి అనే ప్రత్యయం చేరుతుంది. తెలంగాణా మాండలికాలలో న్రి, ండ్రి, ండి అనే ప్రత్యయాలుచేరతై. చెప్పుండ్రి , చెప్పున్రి, రాండ్రి, రారి అనేరూపాలు తెలంగాణా వ్యవహారంలో ఉన్నై. వ్యతిరేక వీధిలో ధాతువుకు అదంతరూపం మీద వద్దు అనే ప్రత్యయం ఉభయపురుషల లోను చేరటం సాధారణం. అయితే దీనికి బదులుగా భిన్న ప్రత్యయాలతో భిన్న రూపాలు కనిపిస్తున్నై. చెప్పకు, చెప్పగాకు, చెప్పబాకు, చెప్పబోకు, చెప్పమాకు, చెప్పమోకు, చెప్పవాకు అనే రూపాలు ఏకవచనంలో విన్పిస్తున్నాయి. వీటిమీద అండి చేరిస్తే బహువచనరూపాలు ఏర్పడతై. అన్ని క్రియలకు విధిరూపాలుండవు. ఇది ఆ క్రియల అర్థాన్నిబట్టి నిర్ణీతమవుతున్నట్లు కన్పిస్తున్నది. ఎరుగు, కొను ప్రయోగంలేని తెలుసు, డోకు వంటి కొన్ని క్రియలకు. వ్యవహారంలో విధి ప్రయోగాలు లేవు.

1.243 : క్రియలలో ఉన్న అకర్మక, సకర్మక ప్రేరణ భేదాలు వాక్య నిర్మాణంలో వ్యక్తమవుతై. అకర్మక వాక్యంలో ఉన్న కర్తృపదం, సకర్మక వాక్యంలో కర్మ అవుతుంది. కొన్ని క్రియలు సహజంగా సకర్మకాలు, కొన్ని క్రియలు ప్రత్యయాదులచేత సకర్మకాలుగా మారతై . అట్లా మారిన క్రియలకు పైన చెప్పిన సూత్రం వర్తిస్తుంది. సకర్మక క్రియలుకూడా ప్రత్యయాలవల్ల ప్రేరణ క్రియలుగా మారతై, సకర్మక వాక్యంలో ఉన్న కర్తృపదానికి ప్రేరణలో చేత అనే వర్ణకం చేరుతుంది. ఈ సంబంధాన్ని కింది వాక్యాలలో చూడవచ్చు.

(24)

a. కార్మిక నాయకుడు చనిపోయాడు.
b. గూండాలు కార్మిక నాయకుణ్ణి చంపారు.
c. యజమాని గూండాలచేత కార్మిక నాయకుణ్ణి చంపించాడు.

పై వాక్యాలలో మూడవదాంట్లో యజమాని ప్రేరకుడు. గూండాలు కర్త. కార్మిక నాయకుడు కర్మ . కార్మిక నాయకుడు అకర్మక వాక్యంలో కర్త, సకర్మ వాక్యంలో కర్మ. అయితే ఈ విభజన చాలా స్థూలదృష్టితో చేసినది. ఒక వాక్యంలో ఒకే నామపదం క్రియతో అన్వయించినపుడు దాన్ని స్థూలదృష్టితో కర్త అంటు న్నాము. లోతుగా పరిశీలిస్తే ఇంతకన్నా విశేషమైన సంబంధాలను గుర్తించాల్సి ఉంటుంది. నిజానికి పై మూడు వాక్యాలలోను కార్మిక నాయకుడు అనే పదానికి క్రియతో ఒకే సంబంధముంది. చనిపోపు అనే వ్యాపారానికి అనుభోక్త మూడు వాక్యాలలోను కార్మిక నాయకుడే, వాక్యాలలో క్రియావ్యాపారానికి అందులో నామ పదానికి ఉన్న పాత్రనుబట్టి ఈ సంబంధాన్ని నిర్ణయించాలి. ఉదాహరణకి ఈ కింది వాక్యాలని పరిశీలించండి.

(25)

a. అన్నం ఉడికింది.
b. వంటమనిషి అన్నం వండింది.
c. యజమానురాలు వంటమనిషిచేత అన్నం వండించింది.

ఈ వాక్య సమూహంలో మూడిట్లోను అన్నం అనేదాని పాత్ర ఒకటే. ఇది వ్యాపార ఫలితంగా వచ్చే పదార్థం. మొదటి వాక్యంలో అన్నం కర్త కాదు, స్థూలదృష్టితో మాత్రమే కర్త అవుతుంది. ఇట్లాగే ఈకింది వాక్యాలను కూడా పరిశీలించండి.

(26)

a. తలుపు తీసి ఉంది.
b. మా అబ్బాయి తలుపు తీశాడు.
c. మా అబ్బాయిచేత తలుపు తీయించాను.

పై వాక్యాలలో తలుపు కర్త కాదు. క్రియ తలుపు ఉన్న స్థితిని సూచిస్తుంది. వాక్య నిర్మాణంలో వివిధ రీతుల్ని పరిశీలించాలంటే క్రియా వ్యాపారాలతో, లేక స్థితులతో నామపదాలకున్న అంతర్గత సంబంధాలను సమగ్రంగా తెలుసుకోవాలి.

1.244 : కొన్ని వాక్యాలలో ప్రేరణార్థక క్రియ వాక్యభేదాన్ని బట్టి ఒకే నామంతో భిన్న సంబంధాలను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకి ఈ కింది వాక్యాలు చూడండి.

(27)

a. సుబ్బారావు రామారావుని చదివిస్తున్నాడు.
b. సుబ్బారావు రామారావుచేత చదివిస్తున్నాడు.

వీటిల్లో మొదటి వాక్యానికి రెండర్థాలున్నాయి. ఒక అర్థంలో రామారావు చదువుకి అవసరమైన డబ్బు పెట్టుబడి సుబ్బారావు పెడుతున్నాడు అని. రెండో అర్థం రెండో వాక్యంలో సూచించిన దానితో సమానం. అంటే రామారావు చదవటానికి సుబ్బారావు పక్కనే ఉండి ప్రేరేపిస్తున్నాడు అని అర్థం. బహుశా ఈ అర్థభేదం చదువు అనే క్రియలోనే ఉండవచ్చు. ఒక అర్థంలో చదువుకు ఒక కాల పరిమితి ఉన్న కోర్సు అని కావచ్చు. రెండో అర్థంలో 'ఒక పుస్తకం' అని అర్థం కావచ్చు. అట్లాగే ఇంకో రకమైన ఆర్థభేదం ఈ కింది వాక్యాలలో చూడవచ్చు.

(28)

a. మా స్నేహితుడు నన్ను కాలేజీదాకా నడిపించాడు.
b. మా స్నేహితుడు నా చేత కాలేజీ దాకా నడిపించాడు.

ఈ పై వాక్యాలలో మొదటి దానికి రెండర్థాలున్నాయి. ఒకటి స్నేహితుడు నేను నడవడానికి భౌతికంగా ఆసరాగా ఉన్నాడని, రెండు, నేను నడవడానికి అతడు ప్రేరకుడుగా ఉన్నాడని. రెండో వాక్యానికి ఈ రెండో అర్థమే ప్రసిద్ధం. పై వాక్యాలనుబట్టి వాక్యాలలో ప్రేరక సంబంధాలు క్రియావ్యాపారానికి నామ పదాలకి ఉన్న సంబంధాన్నిబట్టి నిర్ణయ మవుతయ్యని తెలుస్తుంది .

1.245 : తెలుగులో కర్మణి వాక్యాలకు వ్యవహారంలో ప్రయోగం తక్కువ. కర్మణి వాక్యాలలో కర్తరి వాక్యాలలోని కర్తృ, కర్మపదాలు వ్యత్యస్తమవుతై. అట్లా వ్యత్యస్తమైనపుడు కర్తకు చేత వర్ణకం వస్తుంది. కర్తరి వాక్యంలో కర్మపదానికి, కర్మణి వాక్యంలో ప్రాధాన్యం వస్తుంది. ఈ కింది వాక్యాలలో ఇది సూచించబడింది.

(29)

a. కెలీగారు తెలుగు వ్యాకరణం రాశారు.
b. తెలుగు వ్యాకరణం కెలీగారిచేత రాయబడింది.

రెండవ వాక్యంలో ప్రధానమైంది తెలుగు వ్యాకరణం. తెలుగులో కర్మణి వాక్యాలు రచనా భాషలోను, కొన్ని రకాల ఉపన్యాసాలలోను, ఉపన్యాసాలవంటి కొన్ని సంభాషణలలోను మాత్రమే కనిపిస్తున్నాయి, కర్త ప్రాధాన్యం తగ్గించటమే కర్మణి వాక్యాల ప్రయోజనం. వ్యవహారంలో కర్తృ పదాన్ని యథేచ్ఛగా లోపింప జేయటానికి అవకాశం ఉంది. కనుక తెలుగు వ్యవహారంలో కర్మణి వాక్యాలకంత ప్రాచుర్యం లేదు. అయితే తెలుగు క్రియలో కర్తను బోధించే ప్రత్యయం ఉంటుంది. అందువల్ల రచనా భాషలో ఈ అవసరం కొంత కన్పిస్తుంది. 1.246 : తెలుగులో ఆత్మార్థక వాక్యాలు ధాతువులకు, కొను అనే ధాతువు చేర్చటం వలన ఏర్పడుతుంది. ఈ కొను కు మిగతా క్రియల్లాగే కాల బోధక. ప్రత్యయాలు, కర్తృబోధక. క్రియా విభక్తులు చేరతై. కొను ను స్థూల దృష్టితో ఆత్మార్థబోధకమన్నా , మరికొన్ని అర్ధాలు కూడా దీని ద్వారా వ్యక్తమవుతై. కొను పరిగ్రహణంలో ధాతువులకేకత్వం లేదు. కొన్ని ధాతువులు కొను తో మాత్రమే ప్రయోగార్హాలు. ఊరుకొను, పుచ్చుకొనువంటి ధాతువు లట్లాంటివి. కొన్ని ధాతువులు కొను ను అంగీకరించవు. ఎరుగు, కూర్చుండు, తిను, పెరుగు,. పోవు, వచ్చు, వెళ్ళు వంటి ధాతువులు అట్లాంటివి. ధాతువుల ఆర్థపరిశీలన సమగ్రంగా జరిగినప్పుడు కొను పరిగ్రహణంలో ప్రవర్తించే విధివిశేషాలను గుర్తించటం సాధ్యం కావచ్చు. ధాతువుకు కొను చేరినపుడు వ్యాపారాన్ని కర్తృ ప్రయోజనపరంగా అన్వయించాలి. ఈ కింది వాక్యాలలో ఈ అర్థ భేదాన్ని గ్రహించవచ్చు.

(30)

a. వాళ్ళు పాలు అమ్ముతారు.
b. వాళ్ళు పాలు అమ్ముకొంటారు.
c. అతను పాఠం చదువుతున్నాడు.
d. అతను పాఠం చదువు కొంటున్నాడు.

పై వాక్యాలలో కొను ప్రయోగం ఉన్న క్రియలు వ్యాపార ప్రయోజనం కర్తకోసం అని తెలియజేస్తై. కొన్ని క్రియలకు కొను చేరినపుడు పారస్పర్యార్థం వస్తుంది. ఈ అర్థంలో కర్తృపదం బహువచన నామమై ఉండాలి. ఈ పారస్పర్యార్థం సహజంగా ధాతునిష్ఠమై ఉండి బహువచన నామం కర్తగా ఉన్నప్పుడు కొను ద్వారా వ్యక్తమవుతుంది. కొట్టుకొను, తిట్టుకొను, మాట్లాడుకొను, పోట్లాడుకొను, వంటి క్రియలు బహువచన నామ కర్తృత్వంతో పారస్పర్యార్థ బోధకాలవుతాయి. ఈ క్రింది వాక్యాలలో ఈ అర్థభేదాన్ని గమనించవచ్చు.

(31)

అతను (తన్ను తాను) తిట్టుకొన్నాడు.
వాళ్ళు బజారులో తిట్టుకొన్నారు.
అతను తనలో తాను మాట్లాడుకొంటున్నారు.
వాళ్ళు ఆ గదిలో మాట్లాడుకొంటున్నారు.

అకర్మకంగా ఉన్న కొన్ని ధాతువులు కొను చేర్చటం వల్ల సకర్మకమవు తాయి. తెలుసు అకర్మకక్రియ, తెలుసుకొను సకర్మక క్రియ. ఇవికాక మరికొన్ని అర్థభేదాల్ని కూడా గమనించవచ్చు. అను అంటే బయటికి మాట్లాడటం, అనుకొను అంటే ఆలోచించటం అడుగు అంటే ప్రశ్నించటం, అడుక్కొను అంటే యాచించటం. పడు అంటే పతనం కావడం, పడుకొను అంటే విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవటం.

1.247 : కొను లాగే మరికొన్ని ధాతువుల్ని క్రియలకు చేర్చటం వలన కొన్ని విశేషార్థాలు వ్యక్తమవుతై. ఇదంతమైన క్రియలకు పెట్టు చేర్చటంవలన పరప్రయోజనార్థమూ, పోవు, వేయు చేర్చటం వలన పరిపూర్ణార్థమూ వస్తై. ఈ కింది వాక్యాలు ఈ అర్థాలకు ఉదాహరణలు.

(32)

a. మా అన్నయ్య బజారునుంచి నాకు చాక్లెట్లు తెచ్చిపెట్టాడు.
b. గాలివాన వచ్చి మామిడి పండ్లు రాలిపోయినై .
c. వ్యాపారస్తులు ధాన్యాన్ని దాచివేశారు.

1.248 : ఇతరభాషలలో పరిపరి విధాలుగా వ్యక్తమయే విశేషార్థాలు తెలుగులో ధాతువిస్తరణ ప్రక్రియద్వారా వ్యక్తం కావటం విశేషమైనది. ఆత్మార్థం, పరప్రయోజనార్థం ఇంగ్లీషులో నామపదాల ద్వారా వ్యక్తమవుతై. తెలుగులో ధాతువులద్వారా వ్యక్తమవుతై. తెలుగులో అన్నంత క్రియకు కొన్ని ధాతువులను చేర్చటంవల్ల కొన్ని విశేషార్థాలు వ్యక్తమవుతై. వీటిని ఇంగ్లీషులో Modals అంటారు. వివిధార్థాలు ఈ క్రింది వాక్యాలలో పదాహృత మవుతున్నై.

సామర్థ్యార్థం : కల, కలుగు.

(33)

అతను పన్నెండు ఇడ్లీలు తినగలడు .

కల ప్రయోగించినపుడు వాక్యంలో ప్రత్యేకంగా కాలబోధ లేకపోతే వాక్యం తద్ధర్మార్థకం అవుతుంది. దీన్ని భవిష్యత్ కాలంలో కూడా ప్రయోగించవచ్చు. కాలబోధ ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు కలకు కలుగు ఆదేశమవుతుంది. వ్యతిరేకంలో కల కు లే, కలుగు కు లేక పో ఆదేశమవుతాయి.

అనుమత్యర్థం : ఇచ్చు

(34)

నన్ను లోపలికి రానియ్యి.

ఈ అర్థంలో ఇచ్చు ప్రయోగించినపుడు ప్రధానక్రియకు కర్త అయిన నామం ద్వితీయా విభక్తి రూపంలో ఉంటుంది. ఇచ్చు క్రియకు కర్త ప్రథమావిభక్తిలో ఉంటుంది. భిన్న క్రియలకు భిన్నకర్తలున్న ఈ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా భావించవచ్చు. ఈ వాక్యంలో ఇచ్చు క్రియను దానార్థంలో ఉన్న ఇచ్చు కన్న భిన్నంగా భావించాలి.

సంభావన, అనుమతి: వచ్చు.

(35)

మా మామయ్య రేపు ఊరినుంచి రావచ్చు.


(36)

మీరిక బయటికి వెళ్ళవచ్చు.

(35) లో 'రా' కు వ్యతిరేకంలో 'రాకపో' అనే రూపం ఆదేశమవుతుంది. (36) లో వచ్చు కు రాదు, కూడదు అనే రూపాలు ఆదేశమవుతై. ఈ రెండర్థాలలోను ఈ క్రియలకు కాలబోధక ప్రత్యయాలు కాని, క్రియా విభక్తులుగాని చేరవు.

సంవిధి (తప్పనిసరి) వలయు > ఆలి, ఆల

(37)

a. రేపు సాయంకాలం నేను ఊరికి వెళ్ళాలి.
b. మీరు మాయింటి కొకసారి రావాలి.

అన్నంతరూపం దీర్ఘాంతమయితే 'వ' కారం ఆగమం అవుతుంది. ఈ రూపాలకి వ్యతిరేకంలో అన్నంత రూపంలో ఉన్న ప్రధాన క్రియకు అక్కరలేదు అవసరం లేదు అనే పదాలు చేర్చటం వల్ల ఏర్పడతై. ఈ క్రియారూపం సహజంగా భవిష్యదర్థ బోధకం. కాలబోధ ప్రత్యేకంగా చెయ్యదలచుకుంటే ఈ క్రియకు ఉండు, వచ్చు అనే క్రియలను అనుబంధించాలి. దీనికి ది అనే క్రియా విభక్తి మాత్రమే చేరుతుంది. ఈ కింది ఉదాహరణలను పరిశీలించండి.

(38)

a. పాలకులకోసం సైనికులు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది.
b. దేశంకోసం ప్రజలు మాత్రమే కష్టాలను భరించాల్సి వచ్చింది .

వలయు కు ఉండు, వచ్చు లను అనుబంధించినప్పుడు వలసి అని అవుతుంది. అదే వ్యవహారంలో ఆల్సి అని ఉంటుంది.

అసామర్థ్యం : చాలు. చాలు అనే క్రియ అన్నంత క్రియకు అనుబంధింపబడి అశక్తతను చూపిస్తుంది. దీనికి వ్యతిరేకంలో మాత్రమే ప్రయోగం ఉంటుంది. చాలు కు అన్నంత రూపంలో అన్ని క్రియావిభక్తులు చేరతై . దీనికి భవిష్యత్తులోనే ప్రయోగం ఉంటుంది.

(39)

స్వార్థపరులైన నాయకులు ప్రజలకు మేలుచేయజాలరు.

చాలు అనే క్రియతో ఈ రకమైన ప్రయోగాలు కావ్యభాషలో ఎక్కువగా ఉన్నై, ఆధునిక బాషలో కొన్ని తెలంగాణా జిల్లాలలో మాత్రమే వినిపిస్తై.

తక్షణ భవితవ్యం : పోవు.

(40)

నేను ఊరికి వెళ్ళబోతున్నాను.

ఈ క్రియ అనుసంధించినపుడు మిగతా క్రియలకు లాగే అన్ని కాలాలలోనూ రూపాలుంటై.

నిషేధార్థం : వద్దు.

(41)

చెప్పుడు మాటలు వినవద్దు.

ఈ రకమైన వాక్యం సాధారణంగా మధ్యమ పురుషకర్తృకంగా ఉంటుంది. తెలంగాణాలో కొందరి వ్యవహారంలో ప్రధమోత్తమ పురుష కర్తృకంగా కూడా ఉండవచ్చు.

1.25 : నిశ్చయార్థక వాక్యాలన్నిటికీ వ్యతిరేక వాక్యాలుంటై. క్రియా సహిత వాక్యాలలో వ్యతిరేక క్రియాప్రయోగం వల్ల వ్యతిరేక వాక్యాలు ఏర్పడతై. ఆ క్రియారూపాలు కాలభేదాల్ని బట్టి వేరువేరుగా ఉంటై. అన్నంత క్రియారూపం మీద లేదు అనే శబ్దాన్ని ప్రయోగిస్తే భూతకాల వ్యతిరేక క్రియలు, ఆటమంత భావార్థక రూపాలమీద లేదు అనే శబ్దాన్ని ప్రయోగిస్తే వర్తమాన వ్యతిరేక క్రియా రూపాలు ఏర్పడతై. ఈ రెండు రూపాల్లోనూ కర్తృబోధను సూచించే క్రియా విభక్తులుండవు. అంటే , అన్ని పురుషలలోనూ ఒకేరూపం నిశ్చలంగా ఉంటుంది. లేదు అనే శబ్దం క్రియాసహిత వాక్యాలతో ఏర్పడ్డ ప్రశ్నలకు వ్యతిరేకంలో ఇచ్చే సమాధానాలన్నింటికి వాక్యాదిని అవ్యయంగా ఉపయోగించవచ్చు, లేదు శబ్దంలో లే ఉండు ధాతువుకు భూతకాల వ్యతిరేకంలో వచ్చే ఆదేశరూపం; దు అమహద్విభక్తి. అయినా ఈ పైన చెప్పిన ప్రయోగాల్లో లేదు అవ్యయంగానే ఉపయుక్త మవుతుంది. వ్యతిరేక భవిష్యత్క్రియ అన్నంత క్రియారూపం మీద క్రియావిభక్తులను చేర్చటంవల్ల ఏర్పడుతుంది.

1.26 : వాక్యంలో క్రియేతర శబ్దాలకు ప్రాధాన్యాన్ని సూచించే కొన్ని పద్ధతులు ఇంతకు ముందే పేర్కొన బడై . ఇంకొక పద్ధతి వాక్యంలో క్రియేతర శబ్దాన్ని ఆఖ్యాత స్థానానికి జరపటం. అప్పుడు అట్లా జరిగిన పదం విధేయ మవుతుంది; మిగతా వాక్యభాగమంతా ఉద్దేశ్యమవుతుంది. ఈ నామ్నీకృత రూపం క్రియాజన్య విశేషణం మీద ది అనే ప్రత్యయం చేర్చటంవల్ల ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను ప్రాధాన్య వివక్షామూలక నామ్నీకరణం అనవచ్చు. అది ఈ క్రింది వాక్యాలలో ఉదాహరించబడుతుంది.

(42)

a. సుబ్బారావు నిన్న పట్నంనుంచి పిల్లిపిల్లను తెచ్చాడు.
b. సుబ్బారావు నిన్న పట్నం నుంచి తెచ్చింది పిల్లిపిల్లను.
c. సుబ్బారావు నిన్న పిల్లిపిల్లను తెచ్చింది పట్నంనుంచి.
d. సుబ్బారావు పట్నంనుంచి పిల్లిపిల్లను తెచ్చింది నిన్న.
e. నిన్న పట్నంనుంచి పిల్లిపిల్లను తెచ్చింది సుబ్బారావు.

పై వాక్యాలలో ప్రధానార్థం ఒకటే అయినా ఆఖ్యాత స్థానానికి జరిగిన పదానికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది.

ప్రశ్నార్థక శబ్దాలున్న వాక్యాల్లో కూడా ఈ రకమయిన మార్పు జరుగుతుంది. ఆ వాక్యాలలో ప్రశ్నార్థక శబ్దం విధేయమై ఆఖ్యాత స్థానానికి జరిగినప్పుడు అటమంత భావార్థక రూపం కూడా ప్రయోగించవచ్చు.

(43)

a. మీరు ఊరికి ఎప్పుడు వెళ్తారు?
b. మీరు ఊరికి వెళ్ళటం ఎప్పుడు?

భావార్థక రూపంలో కాలబోధ లేదు. సందర్భాన్నిబట్టే కాలాన్ని గ్రహించాల్సి ఉంటుంది. 1.27 : తెలుగు వాక్యాలలో కొన్ని రకాల అర్థ ప్రభేదాలను కలిగించగల శబ్దాలు కొన్ని ఉన్నై. ఇవి ప్రత్యేక వదాలు కావు. సాధారణంగా వాక్యంతంలో చేరతై. వీటిని వాక్యంలో దాదాపు ఏ పదానికైనా తగిలించవచ్చు. అట్లాంటి శబ్దాలు కొన్ని. 1. అంట > అట> ; 2. కదా, కదూ, కదే, గా; 3. , వే, రా, రోయ్, ఓయ్; 4. అండి; 5. లే; 6. ఏమో, ; 7. ; 8. .

పై వాటిల్లో అట తర్వాత మిగతా ఏ శబ్దాలయినా రావచ్చు. వీటిల్లో రెండో వాటికి కిలార్థకాలని, మూడోవాటికి సంబుద్ధ్యర్థకాలని, నాలుగో దానికి గౌరవార్థకమని, ఐదోదానికి నిరాదరణార్థకమని, ఆరో వాటికి సందేహార్థకాలని, ఏడో దానికి ప్రశ్నార్థకమని పేర్లు, ఎనిమిది సంఖ్యతో సూచించినది. క్రియ మీద వచ్చినపుడు ఆశ్చర్యార్థకం, మిగతా పదాలమీద వచ్చినపుడు అవధారణార్థకం, అవుతుంది.

వీటిలో అటకు అనుకృతిలో ప్రయోగించే అని కి సామ్యం ఉంది. అట ప్రయోగించిన వాక్యాలను అనుకరణ వాక్యాలుగానే నిరూపించవచ్చు. వక్త ప్రయోగించిన వాక్య విషయం తను స్వయంగా చెపుతున్న విషయం కాదని. ఇంకొకరు చెప్పిన విషయాన్ని తాను చెప్తున్నట్లుగా భావించవలసి ఉంటుందని వక్త ఉద్దేశించినపుడు అట ప్రయోగం జరుగుతుంది.

అట శబ్దప్రయోగంలో వ్యవహర్తల మధ్య కొన్ని భేదాలున్నట్లు కన్పిస్తున్నది. గ్రామీణ వ్యవహారంలో అంట అనే రూపం ఎక్కువగా కన్పిస్తున్నది. పట్టణాలలో కొందరి భాషలో అట, మరికొందరి భాషలో అనే రూపాలున్నై. ఈ రచయిత భాషలో సాధారణ వ్యవహారంలో అంట , బయటి వ్యవహారంలో అట ఉన్నై. ప్రయోగం మాత్రం లేదు.

అట ప్రయోగించిన ఈ కింది వాక్యాలను పరిశీలించండి.

(44)

a. శ్రీమతి సుజాతారావుగారు సిగరెట్లు కాలుస్తారట.
b. నేను నిద్దరలో కలవరించానట.
c. నువ్వు మీపై అధికారికి మస్కా కొడుతున్నావట.

మొదటి వాక్యంలో చెప్పిన విషయానికి తన బాధ్యత ఏమిలేదని తానె క్కడో విన్న విషయాన్ని మాత్రమే చెప్పుతున్నానని వక్త ఉద్దేశం. రెండో వాక్యంలో చెప్పిన విషయాన్ని గురించి వక్తకు ప్రత్యక్ష జ్ఞానం లేనట్లు అట సూచిస్తున్నది. మూడో వాక్యంలో కూడా శ్రోతను గురించి వక్త పరోక్షంగా గ్రహించిన విషయాన్ని సూచిస్తున్నది. వాక్యంలో విషయానికి వక్షకు ప్రత్యక్ష జ్ఞాన రాహిత్యాన్ని సూచించటానికి అట ప్రయోగించబడుతుంది.

వాక్యాలలో -శబ్దంతో ఉన్న ప్రశ్నార్థక పదం ఉన్నప్పుడు - ప్రశ్నార్ధక పదం లేనప్పుడు ఏమో అనే రూపాలు సందేహార్థంలో చేరతై .

(45)

a. అతనెప్పుడు వస్తాడో?
b. అతను రేపు వస్తాడేమో.

అటాదులు ఒకే వాక్యంలో ఒకటికన్నా ఎక్కువ ఒకదానిపక్కన ఒకటి రావచ్చు. ఈ కింది వాక్యాలలో అట్లాంటి క్రమం కొంతవరకు తెలుస్తుంది.

(46)

a. ఆమె అందరితో పోట్లాడుతుందట గదరా?
b. అతడు మర్యాదగా మాట్లాడతారటనా?
c. అతను రేపు సాయంకాలం వస్తాడేమోగదూ?
d. నువ్వు చెప్పింది అతనేనా?
e. అతను రేపు వస్తాడేమోలే,

ఈ అటాదులు వాక్యంలో ఏ పదానికైనా తగిలించవచ్చునని ఇంతకు ముందు. చెప్పబడింది. ఇట్లా తగిలించబడిన పదాలు వాక్యంలో ప్రాధాన్యాన్ని వహిస్తై. అప్పుడు ప్రాధాన్యాన్ని పొందిన పదం ఆఖ్యాత స్థానానికి జరగకుండానే క్రియ నామ్నీకృత మవుతుంది.

(47)

a. అతను నిన్న వచ్చింది.
b. అతనా నిన్న వచ్చింది.

పై వాక్యాలలో మొదటిది వ్యాకరణ విరుద్ధం. ప్రాధాన్యాన్ని సూచించిన రెండవవాక్యం వ్యాకరణ సమ్మతం. అంటే ప్రాధాన్యబోధ లేకుండా క్రియ నామ్నికృతం కాదని అర్థం. పై వాక్యంలో ప్రశ్నార్థకమైన ఆ ఉపయోగించబడింది. అటాదుల్లో ఏవి ప్రయోగించినా ఫలితమిదేనని స్పష్టం. అంతేకాక ఈ అటాదులు. వాక్యంలో క్రియేతరమైన ఏ పదానికి తగిలించినా ఇదే ఫలితం వస్తుంది. ఈ శబ్దాలు క్రియారహిత వాక్యాలలో కూడా ఇదే పద్ధతిలో ప్రయోగించవచ్చు. ఇక్కడలాగే అక్కడకూడా ఈ శబ్దాలు చేర్చినపుడు పదక్రమంలో మార్పు వికల్పమవుతుంది. వీటిల్లో కొన్ని సంయుక్త వాక్యాలలో అసమాపక క్రియలకు కూడా చేరతై. అప్పుడుకూడా సమాపక క్రియ నామ్నీకృత మవుతుంది. ఈ కింది ఉదాహరణలలో ఈ ప్రక్రియ చూపించబడుతుంది.

(48)

a. అతను మెట్లు దిగుతూనట కిందపడింది.
b. నువ్వు కాఫీ తాగి కదా బజారుకు వెళ్ళేది?
c. నువ్వు చేస్తానంటే గదా పనిచెప్పేది?
d. ప్రజల్ని మోసం చెయ్యటమేగదా ప్రభుత్వాలు చేస్తున్నది?

ఈ పై వాక్యాలలో అసమాపక క్రియలైన శత్రార్థక, క్వార్థక, చేదర్థక, భావార్థక క్రియలమీద అటాదులు ప్రయోగించబడినై. ఆ కారణంగా సమాపక క్రియలు నామ్నీకృతాలు అయినై.

1.28 : వాక్యంలో కర్తృపదానికి, క్రియకు ఉన్న సంబంధం క్రియ బోధించే వ్యాపారాన్ని బట్టి ఉంటుంది. ఆ సంబంధాల ననుసరించి నామపదాల్ని ప్రాణి, అప్రాణి వాచకాలుగా; మూర్త, అమూర్త బోధకాలుగా ; మనుష్య, మనుష్యేతర వాచకాలుగా, ఘన, ద్రవపదార్థ వాచకాలుగా విభజించాల్సి ఉంటుంది, ఇవి కాక వేరే విభాగాలు కూడా అవసరం కావచ్చు, ఉదాహరణకి వాక్యాలు చూస్తే అట్లాంటి విభాగాల ఆవశ్యకత తెలుస్తుంది.

(49)

a. కర్ర విరిగింది.
b. కాయితం చినిగింది.
c. అద్దం పగిలింది.
d. ఇల్లు కడిగారు.
e. గుడ్డలుతికారు.

పై వాక్యాలలో ఒక్కొక్క నామానికి, క్రియావ్యాపారానికి ఉన్న పరస్పర సంబంధం తెలుస్తుంది. ఈ సంబంధాలన్నీ సంపూర్ణంగా గ్రహించినపుడే సమగ్రమైన తెలుగు వ్యాకరణం సాధ్యమవుతుంది. 1.29 : కర్మపదాలు ప్రాణివాచకాలై నపుడు, ద్వితీయావిభక్తి ప్రత్యయ మైన ను, ని లను గ్రహిస్తుంది. ఇవికాక భిన్నార్థాలలో భిన్నవిభక్తి ప్రత్యయాలు నామాలకు చేరుతుంటై. వాటిల్లో కొన్ని ఈ కింది ఉదాహరించబడు తున్నై.

1. కు ; కి : సంబంధార్థం, స్వామ్యార్థం, సంప్రదానార్థం, ప్రయోజనార్థం, గమ్యార్థం.

(50)

a. ఆమెకి ఇద్దరు పిల్లలు.
b. అతనికి రెండిళ్ళున్నై.
c. నీకు పిల్ల నెవరిస్తారు.
d. చల్లకువచ్చి ముంత దాచట మెందుకు ?
e. ఆతను ఊరికి వెళ్ళాడు.

ఇవికాక చాలా చాలా అర్థాలలో ఈ విభక్తి ప్రయోగించబడుతుంది.

(51)

a. నాకు వందరూపాయలు కావాలి.
b. నీకు ఎవరు చెప్పారు?
c. ఆమె పిల్లికి భయపడుతుంది.
d. అతను చలికి వణుకు తున్నాడు.
e. నాకు హిందీ రాదు.
f. రేపు పదిగంటలకు వస్తాను.

2. నుంచి : ఆపాదానార్థం, హేత్వర్థం, ఏకదేశ పృథక్కరణం.

(52)

a. అతను అమెరికానుంచి వచ్చాడు.
b. అతను పదేళ్ళ నుంచి మెడిసిన్ చదువుతున్నాడు.
c. నీనుంచి మాటలు పడాల్సి వచ్చింది.
d. అతను చెట్టునుండి పువ్వులు కోశాడు.

3. తో : కరణార్థం, సహార్థం, రీత్యర్థం, దేహమనఃస్థితి బోధకం.

(53)

a. అతను పెన్సిలుతో పరీక్ష రాసాడు.
b. ఆతను కమలతో పరీక్షకు వెళ్ళాడు.
c. అతను శ్రద్ధతో పాఠాలు చదివాడు.

d. అతను జ్వరంతో పరీక్ష రాసాడు.
e. అతను నా మీద కోపంతో మా యింటికి రాలేదు.

ఈ చివరి వాక్యానికి రెండర్థాలున్నాయి. ఒకటి : నామీద కోపంవల్ల మా యింటికి రాలేదు అని, రెండు : మా యింటికి వచ్చాడు కాని కోపంగా లేడని.

ఈ పై వాక్యాలలో కరణార్థం తప్ప మిగతా అర్థాలను బోధించే వాక్యాలను ఏక వాక్యాలుగా కాక, భిన్న వాక్యాల సంయోగం వల్ల నిష్పన్నమైనట్లుగా భావించ వచ్చు. చివరి వాక్యంలో ఉన్న ఆర్థ భేదం కూడా ఈ విషయాన్నే సూచిస్తుంది.

4. లో : అధికరణార్థం.

(54)

a. రచయితలకు తెలుగు దేశంలో సంపూర్ణ స్వేచ్ఛలేదు.
b. 1956 లో విశాలాంధ్ర ఏర్పడింది.
c. తెలుగు పత్రికలో ఆంధ్రపత్రిక పురాతనమైనది.
d. అతనికి ఆటలలో ఆసక్తి ఎక్కువ.

ఈ పైన ఇచ్చినవికాక వరకు , దాకా, గురించి, బట్టి, వంటి విభక్తి ప్రత్యయాలు చాలా ప్రయోగంలో ఉన్నై. కంటె, కన్నా అనే ప్రత్యయాలు తులనార్థంలో ఉన్నై. ప్రయోజనార్థంలో కోసం ఉంది. దేశకాలంలో భిన్న సంబంధాలను బోధించే ముందు, వెనక , తరువాత, కింద , పైన, పైకి, మీద, పక్క, వైపు, తట్టు, బయట, లోపల ఇట్లాంటివి చాలా పదాలు నామపదానికి చేరతై. వీటిల్లో కొన్ని మళ్ళీ విభక్తులను గ్రహిస్తాయి. పై నుంచి, పైకి, వెనక నుంచి , వెనక్కీ, ఇట్లాంటివి దేశకాలబోధక శబ్దాలకు నుంచి, కు చేర్చటంవల్ల ఏర్పడతై. గమనార్థక క్రియలున్నప్పుడు వాక్యంలో ఈ రకమైన రూపాలు నామం తరువాత ప్రయోగించబడతై. పైన పేర్కొన్న విభక్తులు ఆయా ధాతువుల ననుసరించి నామాలకి చేరతై. అవి గ్రహించే కారకబంధాల్ని బట్టి క్రియలను విభజించటం ఒక పద్ధతి.