తెలుగు వాక్యం/తెలుగు వాక్యం : కొన్ని ముఖ్య లక్షణాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

5. తెలుగు వాక్యం : కొన్ని ముఖ్య లక్షణాలు

5.11 : భాషాలక్షణ పరిశీలనలో మూడు పద్ధతులను గుర్తించొచ్చు. 1. ఏకభాషా లక్షణ పరిశీలన (Characterology) 2. బహుభాషా లక్షణ పరిశీలన (Typology) 3. సర్వభాషా లక్షణ పరిశీలన (Universals) ఒక భాషకు లభ్యమాన మవుతున్న వ్యాకరణాలను బట్టిగాని, స్వయం పరిశీలనవల్లగాని గ్రహించిన విషయాలను ఏకభాషా లక్షణాలుగా పరిశీలిస్తారు. ఒక భాషలో కనిపించే లక్షణాలు కొన్ని భాషల్లో కనిపించవచ్చు, కొన్నిట్లో కనిపించకపోవచ్చు. ఉదాహరణకు తెలుగులో స్వరసమీకరణం అనే లక్షణం ఉన్నది. ఈ లక్షణం టర్కిష్, నూపే, యావల్మనీ వంటి ఇతర భాషల్లోనూ ఉంది. ఇంగ్లీషు, హిందీ భాషల్లో లేదు. ఒక భాషకు ప్రత్యేక లక్షణం అవునా కాదా? ఆంటే ఇతర భాషలతో పోల్చి చెప్పాల్సిందే. ఒకే లక్షణం భిన్నభాషల్లో కనిపించిందంటే అది ఏకభాషా పరిమితి నతిక్రమించిందన్నమాట. అది కొన్ని భాషల్లోనే కనిపిస్తే భాషలు అనుమతించే ( లేక అవలంబించే) పద్ధతుల్లో అది ఒకటి అని గ్రహించాలి. ఇట్లాంటి కొన్ని లక్షణాల్నిబట్టి భాషలను విభజించవచ్చు. ఇది బహుభాషా లక్షణ పరిశీలన. ఒక భాషలో కనిపించే లక్షణం ఆ భాషకుగాని, కొన్ని భాషలకుగాని పరిమితం కాకపోతే దాన్ని సర్వభాషా లక్షణంగా అనుమానించాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలనూ పరిశీలించిన వారెవ్వరూ లేరు. సర్వభాషా లక్షణ పరిశీలన అంటే అన్ని భాషల్లోనూ ఉండటానికి వీలున్న లక్షణాల పరిశీలన అని. ఉదాహరణకు అన్ని భాషల్లోనూ వక్తనూ శ్రోతనూ సూచించే పదాలు, ఉంటయ్యని చెప్పటానికి అన్ని భాషలనూ పరిశోధించక్కర్లేదు. బహుభాషా పరిశీలనవల్ల సజాతీయ సంబంధం (genetic relationship) గాని, ప్రాంతీయ సంబంధం (areal relationship) గాని, లేని భాషల్లో పరిశీలించినంత మట్టుకు కొన్ని లక్షణాలు పునః పునరాగత మవుతుంటే వాటిని సర్వభాషా లక్షణాలుగా ప్రతిపాదించవచ్చు. ఆ ప్రతిపాదనలు ఇతర శాస్త్రప్రతిపాదనల్లాగే తరవాత పరిశీలనకు నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు. ఈ పుస్తకంలో సర్వభాషా లక్షణాలుగా అనుమానించదగిన కొన్ని లక్షణాలు ప్రస్తావించబడినై . (చూ. 2.16; 3.1; 3.2; 3.31). సర్వభాషా లక్షణాలు క్రమక్రమంగా భాషా నిర్వచనంలో భాగమయిపోతై. 5.12 : ఏ దృష్టితో చూసినా ఏకభాషా లక్షణ పరిశీలన అన్నిటికీ మూలం. ఇతర భాషలతో పోల్చి చూసి భాషల మధ్య భేదసామ్యాలను కనుక్కోటానికి ఈ పరిశీలన అవసరం. ఆ దృష్టితో తెలుగులో ముఖ్యమని తోచిన అంశాలు ఈ అధ్యాయంలో క్రోడీకరించబడుతున్నై. వీటిల్లో చాలావరకు ఇతర ద్రావిడ భాషల్లో కనిపించవచ్చు. మరికొన్ని ఇతరేతర భాషల్లో కూడా ఉండవచ్చు. తెలుక్కి మాత్రమే పరిమితమైనవి ఇవి అని ప్రస్తుతం నిర్ధారణ చెయ్యటం కష్టం.

5.21 : సాధారణమైన సకర్మక వాక్యంలో పదక్రమాన్ని అనుసరించి ప్రపంచ భాషలను మూడు ప్రధానమైన వర్గాలుగా విభజించవచ్చునని పరిశీలకులు గుర్తించారు. అవి : 1. క్రియాది, 2. క్రియా మధ్యమం, 3. క్రియాంత భాషలు. క్రియాపదం ప్రథమేతరంగా వచ్చే భాషల్లో కర్త తరవాతనే కర్మ ఉంటుంది. క్రియాది భాషల్లో మాత్రం కర్మ తరవాత కర్త వచ్చేభాషలు కొన్ని ఉన్నై. ద్రావిడ భాషలన్నీ క్రియాంత భాషలు. భారతీయ భాషల్లో చాలావరకు క్రియాంత. భాషలే. మేఘాలయ రాష్ట్రంలో వ్యవహరించే “ఖాసీ" క్రియా మధ్యమ భాష. హిందీని గుప్తనిర్మాణంలో క్రియా మధ్యమ భాషగా పరిగణించాలని ఒక ప్రతిపాదన ఉన్నది.

5.23 : వాక్యంలో కొన్ని విశేషాలు ఈ పదక్రమాన్ని బట్టి ఉంటై. క్రియాంత భాషలు ప్రాయికంగా పరవిహిత ప్రత్యయ భాషలు. క్రియాది భాషలు పూర్వవిహిత ప్రత్యయభాషలు. క్రియా మధ్యమభాషల్లో రెండు రకాలూ ఉన్నై క్రియాంత భాషల్లో నామవిశేషణాలు నామానికి పూర్వం, క్రియా విశేషణాలు క్రియకు పూర్వం వస్తై. కారకాల్ని సూచించే విభక్తి ప్రత్యయాలు, ప్రత్యయ తుల్యపదాలు నామపదం తరవాతనే వస్తై. టర్కిష్, జాపనీస్, జార్జియన్ భాషలు ద్రావిడ భాషల్లాగే క్రియాంత భాషలు

5.31 : తెలుగులో పదక్రమాన్ని గురించి ఇంకా కొన్ని విశేషాలు చెప్పవచ్చు. అముఖ్యకర్మ ముఖ్యకర్మకు పూర్వమే ఉంటుంది . ముఖ్యకర్మ ప్రశ్నార్థక శబ్దాలు వచ్చినప్పుడు తప్ప ఎప్పుడూ క్రియను అంటిపెట్టుకునే ఉంటుంది. ప్రశ్నార్థక పదాలు క్రియకు ఎప్పుడూ సన్నిహితంగా ఉంటై. ఉపవాక్యాలు ప్రధాన వాక్యానికి పూర్వమే ఉంటై. ఆనుకృతాంశం అనుకర్త వాక్యానికి పూర్వమే ఉంటుంది. సంఖ్యావాచక పదాలు, ఇతర పరిమాణార్థక పదాలూ నామపదానికి పూర్వపరస్థానాలు రెండిట్లోనూ రాగలవు. ఉదా : ఆమెకు చాలా చీరలున్నై : ఆమెకు చీరలు చాలా ఉన్నై. క్రమ వ్యత్యయం ప్రాధాన్య వివక్షకు అవలంబించే ప్రధానమైన పద్ధతి. క్రియకు దగ్గరగా జరిగే వాటికి ప్రాధాన్యం హెచ్చు. క్రియను నామ్నీకరించి ప్రాధాన్యం చెప్పదల్చుకున్న వాటిని ఆ ఖ్యాతృ స్థానానికి జరపటంకూడా ఒక పద్ధతి. సమీకరణ వాక్యాల్లో కేవల వ్యత్యయమే ప్రాధాన్యాన్ని బోధిస్తుంది. వ్యవహృతాంశంమీద వక్త్రభిప్రాయాన్ని సూచించే అటాదిశబ్దాలు తెలుగులో ఉన్నై, ఇవిసాధారణంగా వాక్యాంతంలో వచ్చినా ప్రాధాన్యవివక్షలో వాక్యంలో ఏ పదానికైనా తగిలించవచ్చు. అప్పుడు కూడా వికల్పంగా పదక్రమ వ్యత్యయం జరుగుతుందీ

5.32 : తెలుగులో క్రియ చాలా ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది. వాక్యాలను అనుసంధించే శబ్దాలు చాలావరకు క్రియలనుంచే నిప్పన్నమయినై . అనుకృతిలోవచ్చే అని అను ధాతునిష్పన్నం. అయితే, అయినా, కాని, కాకపోతే కాదు, కదా - వంటి మాటలు అగు ధాతు నిష్పన్నాలు. ఆత్మార్థం పారస్పరార్థం (కొను). పదార్థం (పెట్టు) పూరణార్థం (-పోవు. - వేయు) వంటి చాలా అర్థాలు ధాతువిస్తరణ ప్రక్రియ ద్వారా సాధించబడతై. క్త్వా, శతృ, ఆపి, చేదాటి వివిధోప వాక్యాలు క్రియల్లో మార్పుల వల్లనే ఏర్పడతై . (ఇంగ్లీషులో వీటికి క్రియేతర శబ్దాలు వాడతారు. ఇతర భాషల్లో relative clause అనే పద్ధతి తెలుగులో ప్రథానంగా క్రియాజన్య విశేషణం ద్వారా వ్యక్తమవుతుంది. తెలుగులో relative pronouns లేవు. ఈ రకమైన పద్ధతి తెలుగులో ఉన్న విధినిషేషాధాలతోనే బెంగాలీ భాషలో ఉంది. ఒరియాలో కూడా ఉండవచ్చు, కాని ఇతర ఆర్యభాషల్లో విరళంగా మాత్రమే ఉంది.

5.33 : తెలుగులో సమీకరణ వాక్యపద్ధతి (equative sentences) విశేషమైనది. ఈ రకమైన వాక్యాలు అన్ని భాషల్లో ఉన్నా తెలుగులో క్రియా రహితంగా ప్రయోగించటం విశేషం. ద్రావిడభాషల ప్రభావంవల్ల కాబోలు ఈ పద్ధతి ఒరియా, బెంగాలీబాషల్లోఉంది. కాని ఇతర ఆర్యభాషల్లో కనిపించదు. ఇదే పద్ధతి రష్యన్‌వంటి స్లావిక్‌భాషల్లోనూ కనిపిస్తుంది. క్రియలేని సమీకరణ వాక్యాలగుప్త నిర్మాణంలో అవు వంటి క్రియ క్రియను కొందరు ప్రతిపాదిస్తారు. కాని అర్థగ్రహణకు. అవసరంలేని అవు ను గుప్తనిర్మాణంలో ప్రతిపాదించటం అనవసరం. క్రియలేని ఈ వాక్యాలకు క్త్వాశత్రపిచేదాద్యర్థాల్లో అవు ధాతు నిష్పన క్రియారూపాలు అనుబద్ధమవుతై. క్రియావాక్యాలు ప్రాధాన్య వివక్షలో క్రియనామీకృతమై సమీకరణ వాక్యాలుగా మారటంకూడా తెలుగులో ఈ రకపు వాక్యాల ప్రాధాన్యాన్ని సూచిస్తున్నది.

5.341 : తెలుగు వాక్యాల్లో కర్త ఉద్దేశ్యం ఒకటి కానక్కర్లేదు. తెలుగు లో కర్త కన్ను ఉద్దేశ్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. కొన్ని వాక్యాలకు వ్యక్త నిర్మాణంలో కర్తను గుర్తించటంకూడా కష్టమే. ఇంగ్లీషు వంటి వాక్యాల్లో వ్యక్త నిర్మాణంలో కర్తృపద ప్రాధాన్యం ఎక్కువ. ఏమీలేకపోతే it వంటి నిరర్థక శబ్దాన్నైనా కర్తగా ఉపయోగిస్తారు. కర్తృపదాన్ని లోపింప జెయ్యటానికి ఇంగ్లీషులో సాధారణంగా వీలుండదు. తెలుగులో సందర్భాన్నిబట్టి గ్రహించగలిగిన ఈ పదాన్నైనా లోపింపజెయ్యవచ్చు. తెలుగులో “ఎవరక్కడ ? "' "నేను" అనే సంభాషణ సాధ్యమయితే ఇంగ్లీషులో “Who is there : “ it is me' అనాలి తెలుగులో పదక్రమవ్యత్యయానికి ఉద్దేశ్య విధేయ వ్యత్యయంవల్లవచ్చే అర్థ ప్రాధాన్యముంది. కాని ఇంగ్లీషులోలాగా కర్తృకర్మ పదాల సంబంధ వ్యత్యయం జరగదు. ఇంగ్లీషుపదక్రమానికి ప్రత్యేక వ్యాకరణ ప్రయోజనంఉంది. తెలుగు పదక్రమానికి అట్లాంటి ప్రయోజనంలేదు. ఇంగ్లీషుభాష పదక్రమవ్యత్యయాన్ని అంతగా సహించదు. తెలుగుభాష ప్రాధానవివక్షకోసం పదక్రమ వృత్యయాన్ని ఉపయోగించుకుంటుంది.

5.342 : తెలుగుభాషలో స్వామ్య, అనుభోక్త్రాద్యర్థాల్లో నామానికి కు- విభక్తి చేరుతుంది. ఉదా:- ఆమెకు పదిచీరలున్నై, నాకుజలుబుచేసింది, నాకు సంతోషంగా ఉంది, అతనికి లాటరీలో లక్షరూపాయలువచ్చినై , వాడికి బజార్లో పార్కర్ కలం దొరికింది, నీకు తెలుసు – ఇట్లాంటి వాక్యాల్లో కు-బంధానికి బదులు ఇంగ్లీషులో కర్తృపదాన్ని వాడతారు. తెలుగులో ఉన్నటువంటి పద్ధతే తరతమ భేదాలతో ఇతర భారతీయ భాషల్లో కూడా కనిపిస్తుంది. స్లాలిక్ భాషల్లో కూడా కర్తృపద ప్రాధాన్యం తక్కువ.

5.35 : తెలుగులో అనుకరణ విధానం అతి విస్తృతమయింది. కేవలం భాషేకాక భాషేతరాంశాలుకూడా తెలుగులో అనుకృత మవుతున్నై. ఇంద్రియ గ్రహణ యోగ్యమైన ప్రతిదీ తెలుగులో అనుకరణయోగ్యమే. ప్రత్యక్ష పరోక్షాను కృతులు రెండింట్లోనూ ఆనుకరణసూచకం (అని శబ్దం) ఉంటుంది. (ఇది అనుధాతునిష్పన్న క్రియా అవ్యవహితయోగంలో. వికల్పంగా లోపిస్తుంది) పరోక్షానుకృతిలో ఉత్తమపురుష ప్రధానవాక్యంలోని కర్తను కాపీ (copy) చేసి. మారినప్పుడు క్రియానిభక్తి ఉత్తమపురుషనుంచి మారకుండా అట్లాగే ఉంటుంది. ఇది క్రియావిభక్తి విధానం విస్తృతంగా ఉన్న భాషలన్నిట్లోనూ ఇట్లాగే ఉండొచ్చు, తెలుక్కి ప్రత్యేకమైనాకావచ్చు. తెలుగులో కర్త్రుద్ధరణసూత్రం అనుకృతవాక్యం సమీకరణ వాక్యమైనప్పుడే ప్రవర్తిస్తునట్టు కనిపిస్తున్నది. హేత్వర్థంలో అని శబ్ద ప్రయోగంకూడా ద్రావిడభాషల ప్రత్యేకతగానే కనిపిస్తున్నది. ఆర్యభాషల్లో ఇట్లాంటి పద్ధతిలేదు. దక్కనీ ఉర్దూలోమాత్రం తెలుగుప్రభావంవల్ల కాబోలు కనిపిస్తున్నది.

5.36 : ఏకకర్తృక వ్యాపార సమసామయికానుపూర్విక సంబంధాలు తెలుగులోను, ఇతర ద్రావిడ భాషల్లోను అసమాపక క్రియల ద్వారా వ్యక్తమవుతై . క్త్వార్థక వాక్యాలు, హేత్వర్థక రీత్యర్థకాలు కూడా అవుతై వీటిలో కొన్ని ఆర్య భాషలకు కూడా పాకినై.

5.37 : తెలుగులో సంయుక్త వాక్యాలకూ, అసంయుక్త వాక్యాలకూ భేదం స్వల్పం. సంకలనార్థంలో క్త్వార్థక వాక్యాలే సంయుక్త వాక్యప్రయోజనంలో ప్రవర్తిస్తై. పదబంధ నంయోగంలో సంయోగ సూచకం సంయోజక పదబంధాలన్నిటికీ పరంలో ప్రత్యయంలాగా వస్తుంది. కొన్ని భాషల్లో పూర్వంలో వస్తుంది. ఇంగ్లీషులో and, or, but అనే పదాలను వాటికి పరంలో ఉన్న పదాలకు సన్నిహితమైనవిగా భావిస్తారు,

5.4: ఇవిగాక ఇంకా చాలా విశేషాలను ప్రస్తావించవచ్చుగాని, ఏది విశేషం అని నిర్ణయించుకోటం కష్టం. ఈ పైన పేర్కొన్నవి సర్వభాషా సామాన్యాలు కావు. ఇవి తెలుగులోనూ, ఇతర ద్రావిడ భాషల్లోనూ మాత్రమేకాక ఎక్కడో దూర తీరాల్లో ఉన్న భాషల్లో కూడా కనిపించవచ్చు. భాషలు భిన్నత్వాన్ని నిలుపుకుంటూనే ఏకత్వాన్ని సూచిస్తై. మానవత్వాన్ని పూర్తిగా ప్రతిబింబించేది భాష. మనుషుల్లోనూ, భాషల్లోనూ భేదాలున్నా మనుషులంతా ఒకటే, భాషలన్నీ ఒకటే.