Jump to content

స్వీయ చరిత్రము - ప్రథమ భాగము/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

రెండవ ప్రకరణము - విద్యార్థిదశ.

క్రీస్తుశకము 1860 మొదలుకొని 1870 వ సంవత్సరమువఱకు.

వేసవికాలపుసెలవు లయినతరువాత రెండవ యర్థసంవత్సరమునందే పాఠశాలలో నేను బ్రవేశించినను సంవత్సరాంతమునఁ బరీక్ష జరగునప్పటికి తోడి బాలుర నందఱిని మించి చక్కఁగా బరీక్షయందుఁ దేఱి మాతరగతిలో మొదటిబహుమానమును బొందితిని. ఆసంవత్సర మాకస్మికముగా మాపాఠశాలామందిరము పరశురామప్రీతి యయిపోయినందున నాయగ్రబహుమాన పుస్తకముసహిత మగ్ని హోత్రునికే యర్పిత మయిపోయినది. అప్పటినుండి కడవఱకును పాఠశాలలో నేను బహుమతి పొందనితరగతి లేదు. పాఠశాల కాలిపోయినతరువాత నూతనభవనము నిర్మింపఁబడువఱకును గొంతకాలము పాఠశాల చిత్రవస్తుప్రదర్శనశాలలోఁ బెట్టఁబడినది. అక్కడ నేను రెండవ తరగతిలోఁ జదువఁ జొచ్చితిని. అప్పటికే నాకుఁ దెలుఁగుపుస్తకములయందభిలాషము హెచ్చినది. అందుచేతఁ బాఠశాలకుఁ బోయియుండిన కాలమునందుఁ దప్ప మిగిలిన కాలమునం దంతటను మాయింటఁ గల తాటాకుపుస్తకములనే చదువుచుండసాఁగితిని. ఇట్లు తాటాకులపుస్తకములను మరఁగి యింగ్లీషు పుస్తకముల నుపేక్షించుచుండుటచూచి పెక్కుతడవలు నాతల్లియు ముత్తవతల్లియు నన్ను నయమున భయమున మందలించి కార్యముగానక మాయింటికి సమీపమునందే వాసము చేయుచుండిన కానుకొలను రామచంద్రుఁడుగారను పేరుగల మా యుపాధ్యాయునియొద్దకుఁ బోయి నే నింట నింగ్లీషుపుస్తకములను ముట్టుచుండుటయే లేదనియు నన్ను శిక్షింపవలసినదనియు నొకనాఁ డాయనను వేఁడుకొనిరి. నే నింగ్లీషుపాఠ మొప్పగింపనిదిన మొక్కటియు లేదనియు, నేను నాతరగతిలోఁ బ్రతిపాఠమునందును మొదటివాఁడను గానో రెండవవాఁడను గానో యుందు ననియు, చక్కఁగాఁ జదువుచు నల్లరి యెట్టిదో యెఱుఁగనివాని నెట్లుదండింతు ననియు, అయినను మీవాని మీఁద నిఁకముం దొకకన్నువేసి చూచుచుండెదననియు చెప్పి యాయన వారిని బంపివేసెను. ఆయన చెప్పినట్లు నే నల్లరిచేయక, అయోగ్యముగాఁ బ్రవర్తింపక, పాఠశాలలో నుపాధ్యాయులకెల్లఁ బరమవిధేయుఁడ నయియే యుండెడివాఁడను. అది పోనిండు. పయియ ట్లుభయులలోనెవ్వరు చెప్పినదియు నసత్యము కాదు. నే నింటికడ నింగ్లీషుపాఠములను జదువ కుండుటయు సత్యమే; పాఠశాలలోఁ బాఠములఁ జక్కఁగా నొప్పగించు చుండుటయు సత్యమే; ఏకసంధాద్విసంధాగ్రాహుల కుండుబుద్ధివి శేషము కొంత కలవాఁడ నగుటచేత నే నింటినుండి పాఠశాలకుఁబోవుచు నొకసారియో రెండుసారులో దారిలోఁ బాఠమును జూచినంతమాత్రముననే నా కది ముఖస్థమయి యప్పటికి తప్పులులేక యప్పగింప శక్తుఁడ నగుచుంటిని. ఇట్లు నాప్రతిభావిశేషమే నా కశ్రద్ధను సోమరితనమును నేర్పి, యీవఱకు సూచించినట్లు కొంతవఱకు నన్నుఁ జెఱిచినది. నే నప్పుడు చదివిన పాఠము నప్పటి కప్పగింపశక్తుఁడ నగు చుండినను, చదివినచదువు దృఢముగా మనస్సునఁ బట్టక కొన్నిదినము లగునప్పటికిఁ జదువనట్టే యుండి మరల మొదటికి వచ్చుచుండెడివాఁడను. ఏకరీతిని స్థిరముగాఁ బాటుపడక సోమరిగానుండు సూక్ష్మబుద్ధికంటె నిరంతరము నేకరీతిని బాటుపడుచు, అనలసుఁడుగా నుండు మందబుద్ధియే లోకమునకును దనకును నెక్కువమేలును జేయఁగలవాఁడగును. లోకమునకు మహోపకర్తలయి ప్రసిద్ధికెక్కినమహా పురుషులందఱును నిరంతరకర్మశూరు లయిన సామాన్యధీశాలులుగాని కేవల ప్రతిభామాత్రమాన్యు లయినవారుగారు. బుద్ధిసూక్ష్మత కుద్యోగశీలత తోడు పడినపక్షమున నత్యధికప్రయోజనకరము కావచ్చును. నేను గొన్నిసమయములయందు దారి నడచునప్పుడు పాఠములు చదువలేకపోయినను, నా వంతు మొట్టమొదటనే రాక యొకరిద్ద ఱొప్పగించినతరువాత వచ్చినపక్షమునఁ బాఠమును - నిర్దుష్టముగా నొప్పగింపఁ గలిగెడివాఁడను. చదువనినాఁ డెప్పుడైన నుపాధ్యాయుఁడు మొదటనే నన్న ప్పగింపు మనినయెడల నేను వెంటనే పుస్తకము చేతఁబుచ్చుకొని దిగువకుఁ బోయి చదివి యైదునిమిషములలోపలఁ దప్పులులేక యొప్పగింపఁ గలిగెడివాఁడను.

ఈకాలములో నాకుఁ బురాణములు చదువుపిచ్చి యంతకంతకు ముదురఁ జొచ్చినది. విశ్వామిత్రుఁడు బ్రహ్మసృష్టికిఁ బ్రతిసృష్టి చేసినట్టును, అగస్త్యుఁడు సముద్ర మాపోశనము గొన్నట్టును, కపిలుఁడు దృష్టిమాత్రన సగరపుత్రుల నఱువదివేవుర భస్మరాసులఁ జేసినట్టును, తపోమహత్త్వములనుగూర్చి చదువుచున్న ప్పు డెల్లను, నాకుఁ జిత్తోద్రేకము గలిగి నే నెప్పుడు తపస్సునకుఁ బూనుదునా యెప్పు డామహిమలను మించినమహిమలను బొందుదునా యని తహతహపడుచుందును. చెట్టు లేని దేశములో నాముదపుచెట్టే మహావృక్షమనఁ బరఁగినట్టు మూఢులయిన నా యీడుబాలురలో నేనేమో తెలిసినవాఁడ నయినట్టు పరిగణింపఁబడుచుంటిని. అందుచేత నావెఱ్ఱియూహలఁ గొన్నిటి నితరబాలురతలలకుసహిత మెక్కింపఁ గలిగితిని. పిన్న లలోను పెద్దలలోనుగూడ నేవెఱ్ఱికిఁ దగిన యావెఱ్ఱివా రేకాలమునందును నుండక మానరు. ఈతపోవర్ణన లన్నియు దివాస్వప్నము లనుకోక సత్యములని నమ్మి నేను భ్రమపడి యితరులను నాభ్రమలోఁ బడవేయఁ దొడఁగితిని. నాభ్రమలో ననాయాసముగాఁ బడినవారు నాసహపాఠులయిన రాచర్ల వెంకటరామయ్య గారును కనపర్తి లక్ష్మయ్యగారును హోతా వీరభద్రయ్యగారును. వారు ముగ్గురును వయస్సుచేత నాకంటెఁ బెద్దవారు. తపోమహిమయొక్క ప్రాశస్త్యమును వారికి బోధించి, హిమవత్పర్వతముమీఁదఁ దపస్సు చేయునట్లు పథక మేర్పఱిచి, వారిని ముగ్గురిని బ్రయాణము చేసితిని. వీరిలోఁ గడపటి యతఁడు హిమగిరియందలి సంజీవనౌషధములను సువర్ణకరణమూలికలను సహితము సంపాదింపవలయునని యుపదేశించెను. మానసక్షేత్రములయందు నేను నాటిన భ్రాంతిభీజము లంకురించి తీఁగలు సాగి యల్లుకొని తలకెక్కి వెఱ్ఱులను జేయఁగా, వా రల్పకాలములోనే యుత్సాహమునందు నన్ను మించినవారయి యచిరతపోమహిమాఢ్యులు కాఁ గోరి, ప్రయాణ మెప్పు డెప్పు డని కాల విలంబాసహిష్ణులయి నన్నేత్వరపెట్ట మొదలుపెట్టిరి. దేహదౌర్బల్యమునుబట్టి దూరదేశయాత్రకు సాహసము చేయలేక హృదయ మిట్టట్టు లూఁగ నే నిదిగో నదిగో యని జాగు చేయసాగితిని. ఒకనాఁటి సాయంకాలము వారిలో నిరువురు నాయొద్దకు వచ్చి రేపే ప్రయాణమని చెప్పిరి. నేను వారివెంట రాఁజాలనంటిని. అంతట వారు నాతో మరల మాటాడక, యింటివద్దఁ బాఠశాలకుఁ బోయెదమని చెప్పి భోజనములు చేసి పుస్తకములు పట్టుకొని పాఠాశాలదారినే తపోగమన ప్రాతంభులయి యుత్తరాభిముఖముగా వెడలిరి. సాయంకాలము వేళకు వారిండ్లకు రాకపోఁగా బంధువులు వెదక నారంభించి మూడవయతనిని పిఠాపురమువద్దనే పట్టుకొని యింటికిఁ గొనివచ్చిరి. విజయనగరము వఱకును బోయినతరువాత రెండవయతఁడు మొదటియాతనితోఁ దగవులాడి మురుగులమ్ముకొని వెనుకమరలెను. మొదటియతఁడు కొంతదృఢ మనస్కుఁడయి ముందుకుసాగి దారిబత్తెమునకయి వెండిమొలత్రాడమ్ముకొని జగగ్నాథమువఱకును బోయి యాత్రచేసికొని పోయినదారినే మరలివచ్చెను. ఈ ప్రకారముగా నామానసికయాత్రతోను మిత్రులదేహయాత్రతోను మాతపోయాత్రావ్రత ముద్యాపన మయినది. అంతటితో నాకుఁ దపశ్శక్తియందలి విశ్వాసము చెడలేదుగాని తపోవనగమనోత్సాహము మాత్రము భగ్న మయినది.

నాకావఱకే వివాహమునకుఁ గన్యనిచ్చెదమని వచ్చి పలువురు గృహస్థులు తిరిగిపోవ నారంభించిరి. అనేకకన్యలను జూచి తుదకు నాతల్లియు పెదతండ్రిగారును గలిసి యాలోచించి మాపట్టణమునకు రెండు మైళ్ళదూరములో నున్న కాతే రను గ్రామమునందున్న యద్దంకివారి పడుచును నాకు వివాహము చేయుటకయి యేర్పాటుచేసిరి. వరుఁడు వధువును వధువు వరునిఁ జూచి తమయిష్టము వచ్చినవారి నేర్పఱుచుకొనక తమయావజ్జీవసుఖదుఃఖములతో సంబంధించిన పెండ్లియేర్పాటును పూర్ణముగా నితరుల కేల విడ వ వలయునని హిందూదేశ బ్రాహ్మణాచారప్రభావ మెఱుఃగనివారికి సందేహము తోఁచ వచ్చును. ఏమీ! స్వయంవరణభాగ్యమా! అట్టి మహాభాగ్యము హిందూదేశములోని బ్రాహ్మణులకు స్వప్నావస్థయందును లేదు. ఒకవేళ ముం దెన్న డైనఁ గలుగవచ్చు నేమోకాని యిప్పటికి లేదు. మాలోని విద్యావిభూషితులగు మహానుభావులు వివేకదీపమువంక నైనఁ జూడ నొల్లక కన్నులు మూసికొని పూర్వచారమహాభూతమునకే సేవ చేయుచు వచ్చు చున్నంతవఱకు మనదేశమున కట్టిపుణ్యము ముందును గలుగదు. పండితపామరభేదము లేక మావా రెల్లరును నాచారమునకు దాసులు. ఆచారపిశాచ మావేశించినచో వారికి దయయు ధర్మమును సత్యమును సత్కర్మమును సర్వమును పరిత్యాజ్యములు. పూర్వు లాదియందు బాల్యవివాహ మన్న పేరే యెఱిఁగియుండరు. వేదములయం దతి బాల్యవివాహమన్న మాటయే మృగ్యము. ఆస్వాభావికమైన యీ యతిబాల్య వివాహపీడ యాచారపిశాచావేశబలముచేత వచ్చినదేకాని విధివిహితమయినది కాదు. మావారు వివాహనిశ్చయము చేయునప్పటికిఁ బండ్రెండేండ్లవాఁడనైన నాకు వివాహోద్దేశ మేతిన్నఁగాదెలియదు. నాకంటెను నాలుగేండ్లు చిన్నదయిన నాభార్యకు మొదలే తెలిసియుండదని వేఱుగఁ జెప్పవలయునా ? నాకుఁ బదుమూఁడవయేటను నాసహధర్మచారిణికిఁ దొమ్మిదవయేటను బొమ్మల పెండ్లివలె మావివాహమహోత్సవము నడచినది. పిండివంటలు తినుటయు వాద్యములు వినుటయు వేశ్యలనృత్యమును గనుటయు మాకప్పు డాహ్లాదకరములు గానే యుండియుండును. సర్వానర్థమూలకమయిన బాల్యవివాహమువలన మాకుమాత్ర మనర్థము లంతగాఁ గలుగక యీశ్వరానుగ్రహమువలన మాదాంపత్యము సంతోషదాయకమే యయినది. వివాహ మయిన సంవత్సరము లోపలనే నాభార్యకు స్ఫోటకము వచ్చెనుగాని యాచెడురోగమువలన నంగవైకల్యముగాని తిరుగంటి కులి యాడించినట్లు మొగమునిండ గుంటలు పడుటగాని కలుగలేదు; వివాహమయిన రెండుసంవత్సరములకే నాకును బ్రాణము పోవలసినంతవ్యాధి వచ్చెనుగాని ప్రాణాపాయము కలుగలేదు. మాయిరువురకు నిట్టియాపదలు తప్పుట భగవత్కటాక్షమువలనఁగాని బాల్య వివాహాఖ్యమహాశక్తియొక్క శుభవీక్షణముచేతఁ గాదు. నాపెండ్లిలో మావారేవ్యయములను తగ్గించినను బోగముమేళమున కగు వ్యర్థవ్యయమును మాత్రము చేయక మానినవారు కారు. వేశ్యలు లేకున్న వివాహమునకు శోభయే లేదఁట! గృహస్థులగౌరవమునకు భంగము కలుగునఁట ! నలుగురిలో తలవంపులఁట ! మౌఢ్యజన్యములయిన యిట్టివిపరీతాభిప్రాయములకు మేరయెక్కడిది? విత్తమిచ్చి వేడుకకయి వేశ్యలను గొనివచ్చి పవిత్రములయిన యట్టిశుభ కార్యములను కులటాసాంగత్యముచే నపవిత్రము చేసెడి యీదురాచారము రూపుమాపెడు భాగ్యము భరతఖండమున కెప్పుడు కలుగునో! సంతతసత్ఫల దాయకమయిన పాతివ్రత్యకల్పతరుప్రవృద్ధికి మూలమయిన వివాహసంబంధ మెక్కడ ? పాత్రివ్రత్యదివ్యపాదమూలచ్ఛేదమునకు వరుపురుగు లనఁదగిన వేశ్యాంగనలసంబంధ మెక్కడ ? నాపెండ్లి కొక్కటికాదు మావా రొకటియు మాయత్తవారొకటియు రెండు బోగముమేళములను బెట్టిరి. నాభార్య యద్దంకి పట్టాభిరామయ్యగారి కొమారిత. తల్లి చిన్నతనములోనే కాలముచేసినందున మేనమామయు కా తేరికరణమునగు వెన్నేటి వేంకటరత్నము గారే యాచిన్నదానిని బెంచినాకిచ్చి వివాహము చేసిరి. సంతానము లేనివారయినందునఁ దమ మేనకోదలియం దాయనయు భార్యయుఁ దమ కడుపునఁ బుట్టినసంతానమునం దుండుదానికంటెను నెక్కువప్రేమ గలవారయి పెంచిన మోహముచేత పెట్టుపోఁతలయం దేలోపమును గలుగనీయక దయ చూపు చుండిరి. ఆచిన్నది పల్లెలలోనే పుట్టి పెరిఁగినదయినను మేనమామగారు బడికిఁ బంపుచుండుటచేతఁ బెండ్లినాటికే తెలుఁగు కొంత చదివినది. వివాహ దినములలో వేడుకకయి మాయిరువుర నొక్కచోటఁ గూరుచుండఁబెట్టి మాచేత రుక్మిణీకళ్యాణములోని పద్యములను జదివించుట నాకిప్పటికిని స్మరణకు వచ్చుచున్నది. వివాహమునిమిత్తమయి క్రొత్తనగలుకొన్ని చేయించినను నాతల్లి నాలుగైదువందల రూపాయలు వెలగల తన నగలను కోడలికిఁ బెట్టినది. నాభార్యకు జననీజనకులు పెట్టిన పేరు బాపమ్మ యయినను వివాహ మ యినతరువాత మాతల్లి యా పేరుమార్చి రాజ్యలక్ష్మియని తనతల్లి పేరు పెట్టినది. ఈ ప్రకారముగా ద్వాదశవర్ష పూర్తి యయినతరువాత నేను బ్రహ్మచర్యాశ్రమమును విడిచి 1861 వ సంవత్సరమునందు గృహస్థాశ్రమమునందుఁ బ్రవేశించితిని.

నా పెండ్లి యయినతరువాత నాపెదతండ్రిగారి భార్యకును నాతల్లికిని తగవులాట లారంభమయినవి. ఇరువురకును మనస్తాపము లావఱకే యుండినను నావివాహానంతరమునఁగాని యవి రగులుకొని ప్రజ్వరిల్లి ప్రకాశము కాలేదు. ఒకయింట నూఱు జుట్లిముడును గాని రెండుకొప్పు లిముడవన్న సామెత యందఱు నెఱిఁగినదే కదా. ఇద్దఱాడువా రొక్కచోటఁ జేరినచోఁ బనిలేని పాటగా నేదోయొకవిషయమున శుష్కకలహములు పొడచూపక మానవు. ఇప్పటి మనదేశపుస్త్రీలలోఁ గానఁబడుచున్న యీకలహప్రియత్వమునకుఁ బ్రధానకారణము స్వప్రయోజనపరత్వముచేత దూరాలోచన మట్టుపడినవారు తమతరుణీమణులను విద్యాగంథవిహీనురాండ్రనుగాఁ జేయుటవలన వారి నాశ్రయించియున్న మౌఢ్యభూతావేశదోషమేకాని సహజకోమలమైన స్త్రీస్వభావము కాదు. స్త్రీలహృదయము లజ్ఞానాంధకారబంధురములయి మౌఢ్య మహారాక్షసదుష్పరిపాలనమునకు లోఁబడి యున్నంతవఱకు నానావగుణపిశాచము లచ్చటనుండి తొలఁగిపోవు. గృహము మహారణ్యసదృశముగాక భూతలస్వర్గము వలె నుండఁగోరినయెడల పురుషులు గృహిణులను విద్యావతులనుగాఁజేసి జ్ఞానదీపప్రభావముచేత నజ్ఞానతిమిరముతొలఁగించి దుర్గుణదురాచార సర్పశార్దూల సంచారములకు వారిహృదయకుహరములయందుఁ జోటులేకుండఁ జేయవలెను.

ఈగృహచ్ఛిద్రములకు మూలకారణ మెవ్వరని యడిగినచో వీరేయని నిర్ధారణము చేయుట సుసాధ్యము కాకపోయినను మొత్తముమీఁద నాతల్లిదే యెక్కువ తప్పిదమనిచెప్పవచ్చును. గడనలేనివారిని వారిబిడ్డలను తమభర్తలు పోషించుచున్నప్పుడు వారియెడల భర్తలెంత యనురాగము గలవారయినను భార్యలుకొంత యసూయగలవారయి యట్టి యనుపోష్యులయెడ ననాదరము చూపుటయు వారినిజూచి విసుగుకొనుటయు నెంత మంచివారిలోనైనఁగొంత వఱకు సహజముగా నుండును. నా పెద్దతల్లి యిట్టియసహనచిహ్నముల నేమాత్రము కనఁబఱిచినను నాతల్లి యోర్చుకొని యూరకుండునది కాకుండెను. తనకుమారుఁడు పెద్దవాఁడయి విద్యాబుద్ధులఁ బడసి సంపాదించి పెట్ట శక్తుడగువఱకును కష్టముల కోర్చుకొని యడఁగి యుండి నెమ్మదిగా కాలము గడపుకోవలె నన్న దూరాలోచనయు శాంతస్వభావమును లేనిదయి మత్సరమే ప్రధానముగాఁగైకొని నాతల్లి యితరులు తన్నొక్కమాట యన్న తోడనే తా నితరులను పదిమాటలని కలహమును బెంచుచు స్వతంత్రప్రకృతిని జూపునదిగా నుండెను. నాతల్లి కోపస్వభావమును స్వతంత్రబుద్ధియు వాక్పారుష్యమును గలదయినను, దయార్ద్రహృదయమును పరోపకారచింతయు సత్యశీలతయు ధైర్యశాలిత్వమును పూనిన కార్యమునందలి స్థిరపృవృత్తియి నామె కలంకారములుగా నుండెను. అందుచేత నామె దీర్ఘక్రోథము కలదిగాక యొకవేళ నెవ్వరిమీఁద నైనను దురాగ్రహపడి తిట్టినను, అచిరకాలములో నే యా కోపమును మఱచి వారిని పలుకరించి వారితో మరల మంచిమాట లాడుచుండును; తనకు విరోధులుగా నుండినవారికైనను కష్టము వచ్చినయెడల పిలువకయే పోయి తోడుపడుచుండెను; తనకడుపు కట్టుకొనియైనను తనకున్న దానిలోనే యన్నా తురులయి వచ్చిన బీదలకుఁ బెట్టుచుండెను. తల్లిగుణములు బిడ్డలకు వచ్చునని పెద్దలు చెప్పినమాట యసత్యము కాదుగదా. ఆమె గుణములలోఁ గొన్ని నాకును బట్టుపడినవి. ప్రకృతిచేత నేనును కోపస్వభావము గలవాఁడనే; సాధారణముగా నేనెంత శాంతచిత్తుఁడను గాఁ గానఁబడినను నాకు కోప మతిశీఘ్రముగా వచ్చును; ఒరులు చెడుపని చేసినప్పుడు నాకు కోప మాగదు; నే నప్పుడు పరుషభాషణములు సహితము పలుకుదును. నే నెన్నియో సారులు పశ్చాత్తాపపడి యీదుర్గుణమును మాన్పుమని యీశ్వరుని ప్రార్థించినను మానవలెనని ప్రయత్నించినను నన్నీ యవగుణముల నేటికిని విడిచిపెట్టకున్నది. వయస్సెంత వచ్చినను బుద్ధి యెంత హెచ్చినను స్వభావము మాఱదు కాఁబోలును! కాఁబట్టియే బాహ్యశత్రువులను వేవురనైనను నిరాయాసముగా జయింపవచ్చును గాని యొక్క యంతశ్శత్రువును నిర్జించుట యతిప్రయాసము మీఁదఁగాని శక్యము కాదని బుద్ధిమంతు లనేకులు చెప్పియున్నారు.

నీవు కార్యార్థినివిగాన మాటకు మాఱుమాటాడాక మౌనము వహించి కలహమును జంపి వేయవలసినదని యెవ్వ రెన్ని విధముల హితము చెప్పినను నాజనని హితులమాటలు చెవిని బెట్టక తన పట్టినపట్టును విడువక "కుటుంబద్రవ్యములో నర్ధభాగమునకు కర్తయయిన కొమారుఁడు నాకుండఁగా నొరులచేత రోఁతమాటలు పడుచు వారికి దోసిలియొగ్గి దైన్యము వహించి యస్వతంత్రజీవనము చేయవలసినగతి నా కేమిపట్టినది?" అని వీరాలాపములు పలుకుచు ఖడ్గవాదిని యయి పోరాటమునకు వెనుకంజ వేయకుండెను. ఆహా ! మూర్ఖతాపిశాచావేశ పరవశలయి యుండువారికి వివేకముండదుగదా? ఇట్లు కొంతకాలమువఱకు నా పెదతండ్రిగారు తమయుద్యోగకార్య నిర్వహణానంతరము సాయంకాల మింటికి రాఁగానే యాయన చెవిని బడునని తఱచుగా మన స్తాపకరములైన గృహ కలహవార్తలు తప్ప మఱి యేవియు లేకుండెను. ఆయన కారణములేని యీశుష్కకలహములను వారించుటకయి నయమున భయమున సర్వవిధములఁ బ్రయత్నముచేసి చూచెనుగాని దేనివలనను కార్యము లేక పోయెను. భార్యపైని కోపపడిన భార్యకు కోపము; మఱదలిపైని కోపపడిన మఱదలికి కోపము. ఈయుభయకోపములకు నడుమ నాయనకు మనస్తాపము. ఇటువంటి విషమసంధిలో కార్యనిర్వాకులైన గృహయజమానులకుఁ గలుగు మనో వైకల్య మింతయంతయని చెప్ప శక్యము కాదు. తగవులాడెడి యిరువురును తమదే న్యాయపక్షమనియు తప్పిదమంతయు నెదుటివారిదే యనియు భావింతురు. అందుచేత వారెవ్వ రెంతచెప్పినను వినక పురుషు డింట నున్నంతవఱకును లో లోపల రాఁజుచున్న క్రోధాగ్నిని పైకి వెడలనీయక మ్రింగి పునః కలహకరణోపాయము నాలోచించుచు నిశ్శబ్దముగా నున్నను, పురుషుఁడిల్లు వెడలఁగానే వెడలఁ గ్రక్కి యేదో కారణాభాసమును కల్పించుకొని వెనుకటి కల హకథలనెల్ల మరలఁ ద్రవ్వుకొని ద్విగుణముగా వాక్కలహమునకు డీకొని నోరు నొప్పియెత్తువఱకును పోరాడి యలసి రాత్రి గృహ యజమానునకు నివేదింపవలసిన క్రమమును యోచించుచు నప్పటి కూరకుందురు. ఇట్టి గృహచ్ఛిద్రములు నిత్యకృత్యములయి గృహమరణ్యసదృశమయినప్పుడు గృహపతికి మనశ్శాంతి యెక్కడిది? గాఢనిద్ర యెక్కడిది? సుఖ మెక్కడిది? నా పెదతండ్రిగారికి నాయందుఁ గల ప్రేమమునకు పరిమితిలేదు. అందుచేత నన్ను వేఱు పెట్టి యసహాయస్థితిలో నుంచుటకాయన కణుమాత్రము నిష్టము లేకుండెను. ఆయన నన్నుఁజూచి యెన్నియోసారులు కన్నుల నీరుపెట్టుకొని దుఃఖింపఁ జొచ్చెను. ఎంత దుఃఖించిన నేమికార్యము? కుటుంబకలహమును మాన్పి నెమ్మదిని గలిగించుటకు చరస్థిరరూపమైన ద్రవ్యమును విభజించి యిచ్చి నన్ను వేఱు పెట్టుటకంటె నుపాయాంతర మేదియు నాయన మనస్సునకు గోచరము కాలేదు. నాజననియు సొత్తు పంచియిచ్చి తమ్ము వేఱు పెట్టవలసినదనియే కోరుచుండెను. అదియే యప్పటి కాయనకును యుక్తమని తోఁచెను. నా పెదతండ్రిగా రొకసారి భాగములు పంచుటకు వస్తువులపట్టికను వ్రాయవలెనని కూరుచుండి, చేతులాడక కంట తడిపెట్టుకొనుచు కాగితమును కలమును క్రిందఁ బడవైచి గదిలోనికిఁ బోయి మంచముమీఁదఁ బరుండి దుఃఖింపఁ దొడఁగెను. ఈదుఃఖపాటంతయు నాయనకు నామీఁదఁ గలయవ్యాజాను రాగముచేతనేకాని స్వాధీనమయి యున్న సొమ్ము పంచియియ్యవలసి వచ్చునన్న విచారముచేత లేశమునుగాదు. సొత్తు పంచియియ్యక కలహము లడఁగుజాడ కనఁబడలేదు. అందుచేత మరలఁ గొన్ని దినముల కాయన 1862 వ సంవత్సరము ఆగష్టునెలలో నొకనాఁడు నాభార్య మేనమామను మఱియొక బంధువును మాత్రము పిలిపించి వారి నొద్ద నుంచుకొని భాగములపట్టికను వ్రాసి నాసగ పాలు నాకిచ్చి వేసెను. నావంతుకు మేడగల పెద్దయిల్లోకటియు, మున్నూఱు రూపాయల వెలగలపాత్రసామగ్రియు, నాలుగైదువందల రూపాయల వెండి బంగారపునగలును, ఏఁబదియైదు రూపాయల ఋణమును వచ్చెను. అటుతరు వాత నాపాలికి వచ్చిన గృహములోనే నాజనని నాకువేఱుగ వంటచేసిపెట్ట నారంభించెను. ఇట్లు పృథగ్భాండాశనము చేయుచున్నను, నాపెదతండ్రిగారు మాకు సర్వవిధముల సాయము చేయుచునే యుండిరి. ఎట్లు చేయకుండఁ గలుగుదురు? కన్న ప్రేమకంటె పెంచినప్రేమ యెక్కువగదా! మేము వేఱుపడినట్లు సహిత మితరులకు తెలియకుండవలెననియే యాయన యభిమతము. గృహ కలహములచేత తల్లిని బిడ్డను గొంతకాలము వేఱుగ నుంచవలసి వచ్చినదని యాయన యడిగినవారితోఁ జెప్పుచువచ్చెను. ఒక కాగితముమీఁద వస్తువులపట్టికను వ్రాసిసంతకములు చేయించుటయే కాని దానిని ముద్రకాగితముమీఁద వ్రాయనేలేదు. దాయవిభాగమునమావశ్యకమైన విభాగపత్రమును వ్రాయలేదు. ఆపట్టికను నాపెదతండ్రిగారు తనయొద్దనే యుంచుకొనిరి. ఈవిభాగము లయినతరువాత కొలఁదికాలములోనే నా పెదతండ్రిగారు తమయుద్యోగధర్మమునుబట్టి గ్రామాంతరమునకుఁ బోవలసినవారయిరి. అంతటితో తొంటికుటుంబకలహములన్నియు నంతరించినవి; కుటుంబయజమూనునకును తదితరకుటుంబస్థులకును గూడ మనశ్శాంతియు నైసర్గిక ప్రేమానుబంధదృఢత్వమును మరల దినదినక్రమమున వర్థిల్లఁజొచ్చినవి. అవిభక్తకుటుంబములలో నంతఃకలహము లుద్భవిల్లి యైకమత్యము చెడి సుఖభంగము గలిగినప్పుడు కుటుంబ స్నేహమును మరల నెలకొల్పుటకు వేఱుపడుటయే యుత్తమసాథనము. వేఱు వేఱుగా దూరమున నుండుటచేత నొండొరులతోడ తగవులాడుట కవకాశముండదు. తగవులాట లెప్పుడుండవో యప్పుడే యావఱకు శోషిల్లి ప్రాణావశిష్టమయి యుండిన స్వాభావికస్నేహలత నిర్మూలముగాక పునరుజ్జీవనమునొంది యల్పకాలములోనే తలయెత్తి కాలక్రమమున కొనలుసాగి వర్ధిల్లి ఫలప్రదమగును. కలిసి యుండినప్పు డైకమత్యమును బరస్పరానురాగమును లేనివా రనేకులు విభక్తులయినతరువాత బహుకుటుంబములలో మరల నన్యోన్యమైత్రిని బడసినవారయి పరస్పరసహాయులయి సుఖించుచున్నారు. నాభాగమునకు వచ్చినయిల్లు చెన్నపురివంటి స్థలములో నుండె నేని నెలకు నలువది యేఁబది రూపాయలయద్దె రాఁదగినదైనను, రాజమహేంద్రవరములో సహిత మిప్పు డాయింటిమీఁద మాసమునకు పదు నేనురూపాయలు వచ్చు చున్నను, ఆకాలమందు నాలుగు రూపాయలుమాత్రమే వచ్చుచుండెను. అప్పుడు నాలుగురూపాయలతోనే బీదకుటుంబములు సుఖజీవనము చేయవచ్చును. ఆకాలమునందు భోజనపదార్థము లన్నియు మిక్కిలి చౌక; ఒక్కరూపాయ యిచ్చిన నిప్పుడు వచ్చువాని కంటె నాలుగురెట్లెక్కువగా వచ్చుచుండెను. నాపాలికివచ్చిన యక్కఱకు మాలిన వస్తువు లేవేవో యమ్మివేసి నాతల్లి మాయప్పుల నప్పుడే తీర్చి వేసెను. ఆమె యటుతరువాత సహితము పదిరూపాయలైనను ఋణ మెప్పుడును జేయలేదు. ఆమె గృహకృత్యనిర్వహణమునందు మిక్కిలి సమర్థురాలు; ఒక్క రాగి కాసైనను వ్యర్థముగా నెప్పుడును వ్యయపెట్టలేదు; సమస్త విషయములలోను సుఖలోపము కలుగకుండ మితవ్యయము చేయుచుండెను. తన కడుపు కట్టుకొనియైనను నాకేలోపమును గలుగకుండ నన్న వస్త్రాదులకు జరపుచుండెను. నాతల్లిమిక్కిలి యభిమాన వంతురాలగుటచేత సాయము చేయుఁడని యెప్పుడు నెవ్వరి నడుగ నొల్లకుండెను. మాయం దత్యంతప్రేమము గలిగి మేనమామకుమారుఁడైన తనబావగారిని సహితము తోడుపడుమని యామె యడుగ లేదు. అయినను మాపెదతండ్రిగారు తమ వంతుగృహముమీఁద వచ్చిన యద్దెను గూడ పుస్తకములనిమిత్తమును విద్యనిమిత్తమును నాకే యిచ్చు చుండిరి. ఇది గాక యప్పుడప్పుడు మాకు కొంత ధనసాహాయ్యమును సహితము చేయుచువచ్చిరి.

ఈకాలమునందు నేను జేసినయకార్య మొకటికలదు. అది నామనసు నెంతోకాలము బాధించుచుండెను; నాతల్లిని మోసపుచ్చి నేనుజేసిన నా చిన్ననాటి మోసకార్యమునకై నేను పలుమా ఱనుతాపపడితిని. దీనిని జదువు బాలురు నాదుశ్చేష్టవలన బుద్ధితెచ్చుకొని తా మట్టివంచనము నెప్పుడు జేయక జాగరూకులయి యుండ నేర్చుకొనుట కనుకూలపడు నన్న తలంపుతో దాని నిక్కడ వ్రాయుచున్నాను. నాకాంధ్రభాషాకావ్యపఠనమునం దత్యా సక్తికలిగియుండెనని యీవఱకే చెప్పియున్నాను. బ్రహ్మశ్రీ - ఓగిరాల జగన్నాధముగా రప్పుడు నూతనముగా రచించినసుమనోమనోరంజన ప్రబంధము నంతను మూఁడవతరగతిలోఁ జదువుకొనుచుండినప్పుడే కాగితములమీఁద వ్రాసికొంటినని నాచదువరులు విన్నప్పుడు నాకుఁ దెలుఁగునందుఁ గల యభిలాషాధిక్యమును వేఱుగఁ జెప్ప నక్కఱలేకయే తెలిసికోఁగలరు. ఆంధ్రకావ్యములలో నెల్లను వసుచరిత్ర ముత్తమ మైనదని పలువురు చెప్పుచు వచ్చిరి. అందుచేత దాని నేలాగున నైనఁ జదువవలెనని నామనస్సువ్విళ్ళూరఁ జొచ్చెను. మాయింటఁ గల తాటాకుల పుస్తకములనెల్లను విప్పిచూచితినిగాని వసుచరిత్ర మందుఁ గానరాలేదు. అప్పుడేమి చేయుటకును తోఁచనివాఁడనయి, నాతల్లి నడుగుదునా మానుదునా యన్న సందేహముచే డోలాందోళనమానసుఁడనయి కొన్ని దినములు నాలో నేను తలపోసి, తుదకు సాహసముచేసి యొకనాఁడు మెల్లగా నామెను డాయఁబోయి వసుచరిత్రమును కొనిపెట్టుమని దీనముగా వేఁడితిని. అది నాపాఠపుస్తకము కాదని యెఱిఁగినదయి యామె నాకోరికను చెల్లింపక నిరాకరించెను. ఇట్లాశాభంగము నొందినవాఁడనైనను, అంతటితో నిరాశచెంది యూరకుండక యేలాగుననైనను వసుచరిత్రమును గొని చదువవలెనని నిశ్చయించుకొంటిని. ఎట్లు కొనఁగలుగుదును ? అప్పుడాపుస్తకము వెల నాలుగురూపాయల యెనిమిదణాలు; నాచేత నెనిమిదణాలకంటె నెక్కువగాలేవు; నాతల్లి నడిగిన నేమియు నిచ్చుజాడ కనఁబడలేదు; న్యాయమార్గమున నంతవిత్తము నార్జించుటకును నాకప్పు డాధారము కనఁబడలేదు. అందుచేత నాయొద్ద నున్న యెనిమిదణాలును తోడనే పుస్తకవిక్రేతచేతిలోఁ బెట్టి, తరువాత నెల కెనిమిదేసి యణాలచొప్పున ప్రతిమాసము నిచ్చుచుండు పద్ధతిమీఁద పుస్తకమునుకొని చదువవలెనని, నాకప్పు డొక్కదురాలోచన తోఁచినది. నెలనెలకు నెనిమిదేసి యణాలచొప్పున నిచ్చు చుండుటకు సహితము నా కప్పుడు శక్తిలేదు. కాఁబట్టి ప్రతిదినమును వేళకు భోజనముచేసి పాఠశాలకుఁ బోవుచున్నట్లు నటించుచు నెక్కడనో కూరుచుండి సాయం కాల మింటికి వచ్చుచుండుటకును, పాఠశాలజీతమునిమిత్తమిచ్చెడి యెనిమిదణాలును పుస్తకము నిమిత్తము వ్యయ పెట్టుచుండుటకును, నిశ్చయించితిని. ఇటు చేయుట పాపకార్యమని నాయంతరాత్మ నన్ను దూషింపఁ జొచ్చెను గాని పుస్తకపఠనాశామహాభూత మింతలో నడ్డపడి నాకు సహాయమయి యుద్రేకించి, తనసమ్మోహనశక్తిచేత నప్పటికి దాని నోరడఁచి నిద్రపుచ్చి నా దుర్బుద్ధిని ప్రోత్సాహపఱిచినది. పుస్తకపఠనాభిలాషము నన్న వివేకిని జేయఁగా నేను వెంటనే పుస్తకవిక్రేతయగు పందిరి మహాదేవుఁడను వైశ్యునికడకుఁ బోయి, నావాంఛను దెలిపితిని. నాయతిలాలసత్వమును జూచి కనికరించి, పుస్తకము వెల పూర్ణముగా తీఱువఱకును తన పుస్తకవిక్రయశాలలోనే నేను కూరుచుండి దానిని చదువుకొనుచుండునట్లు సమయ మేర్పఱచి, ఆయా పణికుఁడు నాప్రార్థన మంగీకరించెను. ఆవఱకు నాయొద్దనున్న యెనిమిదణాలును నాకప్పుడు నెలజీతముకొఱకిచ్చిన యెనిమిదణాలును జేర్చి యొకరూపాయ పుస్తకవిక్రయికున కిచ్చి యాతనియంగడిలోనే కూరుచుండి యతికుతూహలముతో పుస్తకమును జదువ నారంభించితిని. నేను పాఠశాలకుఁ బోకుండుట రెండవనెలలోనే నాసహపాఠులవలన నాతల్లికిఁ దెలిసినది. వంచనము బయలఁబడక చిరకాల మెప్పుడును దాఁగియుండ నేరదు. అప్పుడామె నన్ను మందలించి, అడిగినతోడనే సత్యము చెప్పినందునకును జీతమును గొనిపోయి మధురాహారములకయి వెచ్చ పెట్టక పుస్తకక్రయమునకు వ్యయపెట్టి నందునకును గొంత సంతోషించి, మిగత సొమ్మిచ్చి నా కాపుస్తకమును గొని పెట్టి, నన్ను మరలఁ బాఠశాలకు బంపెను. దుర్బుద్ధి పొడమినప్పుడు వేగిరపడి యిటువంటి దురాచరణములయందుఁ బ్రవేశింపకుండ వారించుటకయి బాలుర కిది యొక మహోపదేశ మగునుగాక! ఈ యపరాధమునకయి నా ప్రియజనని పుత్రవ్సాల్యముచేత నన్ను మన్నించి యూరకున్నను, కొంతకాలము నిద్రించియుండి మరల మేలుకొన్న నా యంతరాత్మమాత్ర మట్లు చేయక నిర్దయమయి నన్ను నిందింపఁ జొచ్చెను. నాయంతరాత్మవలనిబాధచేతనే యని చెప్పలేనుగాని యే హేతువుచేతనో యీపని జరిగిన శీఘ్రకాలములోనే చేసిన నేరమునకు దండనమో యనునట్లు నాకు వ్యాధి యారంభ మయినది. ఒక్కసారి భగవన్నామస్మరణము చేసిన మాత్రముననే యీజన్మమునఁ జేసినవేగాక బహుజన్మసంచితములయిన సమస్త పాపములును నిర్మూలములగునన్న యప్పటి నావిశ్వాసమువలన నిత్యమును దేవతాసందర్శన సంస్మరణములు చేయుచుండెడి నా కాయల్పదుష్కృతదోష మప్పుడే పోయెననియే నమ్మకము కలిగెను. అందుచేత నంతరాత్మ నన్ను బాధించుట మానివేసినది. అయినను నా వ్యాధిమాత్రము తగ్గక యంతకంతకు వృద్ధినొంద సాగినది. నాకు శైశవమునుండియు నుండిన దగ్గునకు తోడుగా నజీర్ణాతిసారరోగములుకూడ నన్నా శ్రయించినవి. ఇంగ్లీషువైద్యులును తెలుఁగు వైద్యులునుకూడ బహుమాసములు నా కనేకౌషధము లిచ్చిరిగాని యెవరి మందువలనను రోగ మించుకయు నివారణముకాలేదు. శరీరములోని రక్తమాంసములు హరించిపోయి శల్యావశిష్టుఁడనై నేను పూచికిపుడకవలె నయితిని. వ్యాధి యసాధ్యమైనదని భావించి, నాజీవితాశలేనివారయి తామే మాట దక్కించుకొనుట కిష్టములేక చికిత్సమానుకొని యొకరితరువాత నొకరుగా వైద్యులందఱు నన్ను చేయివిడిచిరి. నాబంధువులు మొదలగు నెల్లవారును నాబ్రతుకునందు నిస్పృహులయి యిఁక మనుష్య ప్రయత్నమువలనఁ గార్యము లేదని దైవపరులయి యుండిరి. ఈప్రకారముగా 1863 వ సంవత్సరాంతము నుండి 1864 వ సంవత్సరాంతమువఱకును నేను మరణజీవితములమధ్య నూఁగులాడుచుంటిని. ప్రతినిమిషమును మృత్యుదేవత నన్ను నోరవేసికొని పోవఁ జూచుచుండియు నే నొక్కొకబళమునకయినను జాలనని యేమో విడిచి పెట్టుచుండెను. నే నప్పుడు మృత్యుముఖమునుండి వెలువడి మరల భూమిపై నడుగుపెట్టఁ గలుగుట నిర్హేతుకజాయమానమైన యీశ్వరానుగ్రహవిశేషము వలననే కాని యౌషధప్రభావముచేతఁ గాదని చెప్పవచ్చును. ఘనవైద్యులు నన్ను విడిచి పెట్టినతరువాత మాయింటి సమీపముననే వాసము చేయుచుండి నట్టియు మొదటినుండియు నాకు మందు లిచ్చుచుండినట్టియు గండ్రాపు వెంకన్న గా రనెడు వైద్యశిఖామణి నాకు కూరగాయవైద్యము చేయుచువచ్చెను. ఏదైననేమి? వ్యాధిని కుదిర్చినదే దివ్యౌషధము. తుద కాయన వైద్యము వలననే దేహస్వాస్థ్యము కలిగినది. నే నప్పుడు జీవించుట యతిమానుషమైన పరమాద్భుతకర్మ మని యాయన యే పలుమాఱు నాతో ననుచు వచ్చెను. 1865 వ సంవత్సరారంభమున నాకు వ్యాధి నిమ్మళించినను, తరువాతఁ గొన్ని నెలలకుఁ గాని జవసత్త్వములు గలిగి పాఠశాలకుఁ బోవ శక్తుఁడను గాకుంటిని. ఆసంవత్సరము వేసవికాలపు సెలవు లయినతరువాత దొరతనము వారిమండలపాఠశాలయం దావఱకు విడిచి పెట్టిన మూఁడవతరగతిలోనే నేను మరలఁ బ్రవేశించితిని. నా కప్పుడు గల మేధావిశేషమునుగూర్చి యీ వఱకే సూచన చేసియున్నాను. నే నాఱుమాసములే యాతరగతిలోఁ జదివినను సంవత్సరాంతమునందు జరిగినపరీక్షలో నేనే మొదటివాఁడ నైతిని. సంవత్సరపరీక్షలో నాకు వచ్చినసంఖ్య నాతరువాతివానికి వచ్చినదానికంటె నూఱు హెచ్చుగా నుండెను. ఇందులకుఁ గారణము పాఠపుస్తకమును నే నొక్కసారి చదువఁగానే యందలివిషయము లన్నియు నాకు ముఖస్థములయి తత్కాలమునకు స్ఫురణకు వచ్చుచుండుటయే. సంవత్సరపరీక్షయందాతరగతి కేర్పఱుపఁబడిన పరమసంఖ్య 360. ఈసంఖ్యలో మూడవవంతుకు తక్కువ కానిసంఖ్యను దెచ్చుకొన్న విద్యార్థుల నందఱిని పరీక్షాసిద్ధులనుగా పరిగణించి పైతరగతికిఁ బంపి, బాలురు తెచ్చుకోవలసినదానిలో నల్పిష్ఠ సంఖ్యయైన మూడవవంతును (120) తెచ్చుకోనివారి నందఱిని మరలఁ బూర్వపు తరగతిలోనే యుంచుచుండెడివారు. ప్రతిబాలునకును తనతరగతిలో సంవత్సరము పొడుగునను వచ్చెడిసంఖ్య నంతను మొత్తముచేసి, అందఱిలో నధిక సంఖ్యను దెచ్చుకొన్న బాలుని సంఖ్యను సంవత్సరపరీక్షా పరమసంఖ్యతో (360) సమ్మనముగాఁ జేసి, తక్కినవారిసంఖ్యలను యథాభాగములుగా తగ్గించుచుందురు. ఇట్లి చేసినప్పుడు నావి యాఱునెలల సంఖ్యలే యగుటచేతను తక్కినవారివి సంవత్సరసంఖ్య లగుటచేతను నేను నాతరగతిలో తొమ్మిదవవాఁడ నైతిని. ఈసంవత్స రార్జితసంఖ్యయు సంవత్స రాంతపరీక్షాసంఖ్యయు నొకటిగాఁ జేర్చి యెక్కువసంఖ్య వచ్చిన మొదటి ముగ్గురికిని బహుమానము లిచ్చుచుండిరి. ఇట్లు చేర్చినసంఖ్యనుబట్టి యాసంవత్సరము నాతరగతిలో నేనే ప్రథముఁడ నైతిని. అందుచేత నాకోరికప్రకారముగా పయిసంవత్సర మంతయు నాకు జీతము లేకుండ విద్య చెప్పున ట్లేర్పాటు చేసిరి. పుస్తకరూపబహుమానము కావలెనో విద్యావేతనరాహిత్యరూప బహుమానము కావలెనో కోరుకొనెడి స్వాతంత్ర్యము ప్రథముఁడుగాఁ గృతార్థుఁ డయినవాని కుండెను. ఆసంవత్సరము మొదలుకొని పాఠశాలలోఁ జదువుకొన్నంతకాలమును నేను చదువునిమిత్తము జీత మియ్యవలసిన యావశ్యకమే లేకపోయెను.

నాలవతరగతిలోఁ జదువుకొనుచున్న కాలములో నన్నుఁగూర్చి నేను విశేషముగాఁ జెప్పుకొనవలసినదేదియు లేదు. తెలివిగలవాఁడననియు, పాపభీతియు దైవభక్తియుఁ గలవాఁడననియు, ఆడినమాట తప్పనివాఁడననియు, సాధువర్తనముగలవాఁడననియు, సత్యము పలుకువాఁడననియు, భావించి పాఠశాలయందలి బాలురందఱు నాయందతిమాత్రగౌరవము కలవారయి యుండిరి. తోడిబాలురకు నాయెడలఁగల యవ్యాజసౌహార్దమునకు నిదర్శనముగా నొక వృత్తాంతము నిందుఁ బొందుపఱుచు చున్నాను. ఒకనాఁడు మధ్యాహ్న కాలమున మామండలన్యాయాధిపతియైన హెన్రీ మారీసుదొరగారు పాఠశాలను జూచుటకయి యాకస్మికముగా వచ్చిరి. ప్రధానోపాధ్యాయుఁ డాయనను వెంటఁ బెట్టుకొనిపోయి యన్ని తరగతులనుజూపి వచ్చినతరువాత దొరగారు పాఠశాలలోని బాలురలో నెల్ల సత్ప్రవర్తనముగలవా రెవ్వరో వారిపేరు వ్రాయవలసినదని విద్యార్థుల కందఱికిని కాగితపుముక్కల నిప్పించిరి. ఎవ్వరి పేరు వ్రాయుదమని యితరులతో నాలోచించుటకు వారి కప్పు డవకాశము లేదు. అందుచేత బాలురందఱును నెవరికిఁ దోఁచినపేరులు వారు వ్రాసి యియ్యఁగా, ఆకాగితపుముక్కల నన్నిటిని పోగుచేసి యందువ్రాయఁబడిన నామ ధేయములనుజదివినప్పు డధికసంఖ్యగల బాలురు నాపేరు వ్రాసినట్లేర్పడెను. ఎవ్వరి పేరైనను వ్రాయుమని కోరినప్పుడు బాలురు సాధారణముగా నున్నత వర్గములోని వారిపే రొకటి వ్రాయుట స్వాభావికము. అట్టి స్థితిలో పై తరగతిలోని వారి నందఱిని విడిచి పెట్టి విద్యార్థులు దిగువ తరగతిలోనున్న నన్ను పేర్కొనుట వారికి నాయెడలఁగల సదభిప్రాయమును సూచించుచున్నది. సద్వర్తనముకొఱకై యొక బహుమానము నియ్యఁ దలఁచుకొని దొరగా రిట్లు పేరులువ్రాయించిరి. ఆబహుమానము నాకేవచ్చినదని చెప్పనక్కఱయుండదు. అప్రయత్నముగా వచ్చిన దగుటచేతను సత్ప్రవర్తనమును గూర్చినదగుట చేతను నా కాబహుమాన మిప్పటికిని నధికప్రీతికరమై యున్నది. ఆదొరగారు పదిరూపాయల విలువగల పుస్తకములు నన్నుఁ గోరుకొమ్మన్న ప్పుడు పై తరగతికిఁ గావలసిన పుస్తకములను నిఘంటువు నొకదానిని నేను గోరుకొంటిని. ఆనిఘంటువుపై దొరగారు స్వహస్తముతో వ్రాసిన వ్రాఁతను జూచుకొన్నప్పుడెల్లను నాకు సంతోషము కలుగుచుండును. అందుచేతనే నాకు బహుమానములుగా వచ్చిన యితర పుస్తకముల నన్నిటిని బోఁగొట్టుకొన్నను సద్వర్తనము నిమిత్తమయి బహుమానముగా నియ్యఁబడిన యా నిఘంటువునుమాత్ర మిప్పటికిని పదిలముగా భద్రపఱిచియున్నాను. ఈ దొరగా రింగ్లండుదేశ చరిత్రమును హిందూదేశచరిత్రమును రచియించి, ఉపకారవేతనమునొంది యింగ్లండునకు బోయినతరువాత హిందూదేశమునందుండిన ఘనులవృత్తాంతములు మొదలైనవి వ్రాసి యిప్పటికిని సజీవులయియున్న ప్రసిద్ధపురుషులు. ఈదొరగారు మా గోదావరిమండలములో న్యాయాధిపతులుగా నుండినంతకాలమును సద్వర్తనమునకై ప్రతిసంవత్సరమును విద్యార్థులకు బహుమానము లిచ్చుచు వచ్చిరి. కాని తరువాత తరువాత ధనికులుగాను ప్రబలులుగాను నుండిన యనర్హులు సహితము విద్యార్థులను ప్రార్థించియు పీడించియు తమ పేరులు వ్రాయించుకొనుచు వచ్చుటచేత నట్టిబహుమానములయందలి గౌరవ మంతకంతకు తగ్గి పోవుచువచ్చినది. విద్యార్థులు నాయం దిట్లు సదభిప్రాయముగలవారై యుండినను ఆకాలమునందు నే నసత్యము నెన్నఁడును బలుక లేదని చెప్పఁజాలను. అప్పుడు నే నాడిన యొక యసత్యమునుగూర్చి యిందు వ్రాయక విడుచుట న్యాయము కాదు. ఆకాలమునం దిరువదిరూపాయలకు మించిన దొరతనమువారి యుద్యోగముల కర్హులనుగాఁ జేసెడిది సామాన్యపరీక్ష యని యొకటియుండెను. అది యింగ్లీషును, తెలుఁగును, రెండు వేఱు వేఱుశాఖలు కలదిగానుండెను. విద్యార్థు లింగ్లీషులోఁ గాని, దేశభాషలోఁగాని, ఉభయభాషలలోనుగాని పరీక్షకుఁ బోవచ్చును. ఈ పరీక్షయందుఁగాని సర్వకలాశాలాప్రవేశపరీక్షయందుఁగాని కృతార్థు లైనంగాని యెవ్వరును విశేషపరీక్షలకు పోఁగూడదు. సామాన్య పరీక్షాప్రశ్న పత్రములను జూచినప్పుడు నా కవి సులభములుగా కనఁబడినందున నా కాపరీక్షకుఁ బోవలెనని యత్యంతకుతూహలము కలిగెను. అయినను నా యుద్యమమున కొక్క ప్రతిబంధ మప్పు డనివార్యమై యడ్డుపడెను. పదునెనిమిది సంవత్సరములు దాఁటినవారుగాని యాపరీక్షకు పోఁ గూడదు. నా కప్పటికి పదు నెనిమిది సంవత్సరములు నిండలేదు. అప్పుడు నాకు నాజన్మసంవత్సర మేదో తెలియకపోయినను, నాజన్మపత్రమును నే నెన్నఁడును జూచి యుండక పోయినను, నాకు పదు నెనిమిదేండ్లు దాఁట లేదనిమాత్రము నే నెఱుఁగనివాఁడను గాను. అయినను శీఘ్రముగాఁ బరీక్షాసిద్ధుఁడను గావలెనన్న బాల్య చాపలముచేత నేను పరీక్షకు పోవుట మానక నావయస్సు పందొమ్మిది సంవత్సరములని కాఁబోలును ప్రార్థనాపత్రమునందు వ్రాసి పంపితిని. ఇంగ్లీషువైద్యుఁడు సహితము నేను స్ఫోటకపడితి ననియు నావయస్సు పందొమ్మిది సంవత్సరము లనియు నిర్ణయపత్ర మిచ్చెనుగాని యంతమాత్రముచేత నేను దోషిని గాకపోను. ఆసంవత్సరమే నే నుభయభాషలలోను పరీక్షాసిద్దుఁడనై, ఉత్తర సర్కారులలో కృతార్థులైనవారలో రెండవవాఁడనై నిలిచితిని. ఇట్లు పరీక్ష యందు చరితార్థత నొందుటగాని వైద్యపట్టము నందిన రాజకీయోద్యోగి పరీక్షించి పందొమ్మిది సంవత్సరములని నిర్ణయించుటగాని నన్న నృతదోషము నుండి రక్షింప నేరదు. ఆకాలమునందు బుద్ధిపూర్వకముగా నాడిన యసత్య మిదియొక్కటియేయని నానమ్మకము. ఈయసత్య దోషమునకై నే నిటీవల పెక్కుతడవలు పశ్చాత్తాపపడితిని. ఇప్పటివలెఁ గాక కొన్ని విషయములలో నబద్ధమాడ వచ్చుననియు, అవృతదురితము గాయత్రీమంత్రజపాదులవలనఁ బోవుననియు, బహువారపురాణపఠనదూషితమై యుండిన నాహృదయమున కప్పుడు సిద్ధాంతమైయుండెను. ఇట్టి దురాచరణములు పెద్దలవే యయినను పిన్న వారు వానిని ఆత్మానందవినాశకములైన మహావిషయములనువలెఁ బరిత్యజించి యసత్యము నెప్పుడును జిహ్వాగ్రమునకు రానీయక, సత్యము నే ప్రాణాధికముగా గ్రహించి, సదా సత్యాదరముగలవారై మెలఁగవలయును. "నా నృతాత్సాతకంపర"మని పెద్దలు ఘోషించియున్నారుగదా!

నాయందు మంచియభిప్రాయము గలవారు నాసహపాఠులైన విద్యార్థులుమాత్రమేకారు; ఉపాధ్యాయులకును నాయం దట్టిసదభిప్రాయమే ఉపాధ్యాయులలోఁ గొందఱు నాయం దతిదయయు పక్షపాతమును గలవారై యుండిరి. మామండలపాఠశాలలోని యప్పటి తెలుఁగు పండితులైన పులిపాక గురుమూర్తిశాస్త్రిగా రాంధ్రమునం దంతపాండిత్యము గలిగినవారు కారు. ఆయనకంటె నాకే తెలుఁగునం దెక్కువజ్ఞానము కలదని యప్పటిబాలుర యభిప్రాయము. ఆయాంధ్రోపాధ్యాయుఁడు మా తరగతిలోని బాలురకు పాఠములు నాచేతనే చెప్పించి యెప్పుడునున న్నగ్రస్థానమునందుఁ గూర్చుండఁబెట్టెడివాఁడు. ఎప్పుడేని బడికి పోక మానినప్పు డామఱునాఁడు నే నధమస్థానమునందుఁ గూర్చుండవలసినవాఁడ నైనను, ఏదోప్రశ్న వేసి యా యుపాధ్యాయుఁ డొక్కసారిగా నన్ను కడనుండి మొదటికిఁ బంపుచుండెడి వాఁడు; ఒక వేళ నడుమనుండిన బాలురలో నెవ్వఁడైన సరియైన యుత్తరము చెప్పినను వినిపించుకోక యతఁ డట్లేచేసెడివాఁడు; అటువంటిసమయములలో నేను లేచి యాబాలుఁడు సరియైన యుత్తరము చెప్పి యుండుటచే నాస్థానమునకతఁడే యర్హుఁడని చెప్పినను మా శాస్త్రి గారియొద్దఁ గార్యము లేకుండెను. మా పాఠశాలాప్రధానో పాధ్యాయులకును నానడతను బట్టియు తెలివినిబట్టి యు నాయం దపరిమితాదరము కలిగియుండెను. మాకుఁ గొంతకాలము వైయాపురి మొదల్యారిగారు ప్రధానోపాధ్యాయులుగానుండిరి; ఆయనకు గణితశాస్త్ర పరిజ్ఞానము విశేషముగా నుండినను భాషాజ్ఞానముమాత్ర మల్పమై యుండెను. ఇంగ్లీషుపద్యకావ్యములయం దాయన కర్థముకాని భాగములకుఁ గొన్ని సమయములయందు నేను సరియైన యర్థము చేయుచుండఁ గలుగుట చూచి యింగ్లీషు నందు నేను గట్టివాఁడనని యాయన యెల్లరతోను జెప్పుచుండెడివాఁడు. ఆయన తరువాత మాకు శ్రీ చెంగల్వ కుప్పుస్వామిశాస్త్రులవారు ప్రధానోపాధ్యాయులుగా వచ్చిరి; వారి కింగ్లీషునందు మంచిపాండిత్య మున్నను గణితశాస్త్రపాండిత్య మల్పమైయుండెను; ఆయన చేయ లేని లెక్కలను నేను జేయఁ గలుగుచుండుట చూచి గణితశాస్త్రమునందు నేను గట్టివాఁడనని యాయన యెల్లరతోను జెప్పి నన్ను మెచ్చుకొనుచుండెడివారు. నిజముచేత నేను తెలుఁగునందుఁ గాని యింగ్లీషునందు గాని లెక్కలయందు గాఁని భూగోళశాస్త్ర దేశచరిత్రాదులయందుఁగాని దేనియందును న్యూనత లేనివాఁడనయి యుంటిని. దేశపటములను వ్రాయుటయందు తక్కిన బాలురకంటె నా కెక్కువ నైపుణి కలిగియుండెను. నా కప్పుడు గ్రహణ ధారణ శక్తులును బుద్ధిసూక్ష్మతయు నసాధారణములుగా నుండినను వానివలన ఫలములేకుండఁ జేయుటకై యలసభావమును నిరంతరకృషిరాహిత్యమును గూడ నన్నాశ్రయించి పీడించు చుండెను. అప్పటి సాధారణాశక్తి కొక్కదృష్టాంతమును వినుఁడు. నేను రెండవతరగతిలో నో మూడవతరగతిలోనో చదువుకొనుచుండినకాలములో నా పెదతండ్రిగారును ములుకుట్ల గంగన్న గారును గలిసి మా యింట రాత్రులు ప్రాడ్వివాక (డిస్ట్రిక్టు మునసబు) పరీక్షకుఁ జదువుకొనుచుండెడివారు. నేను పరుండెదు మంచము వారు చదువుకొనెడు స్థలమునకు సమీపముననే వేయఁబడియుండెను. అందుచేత వారు చదివెడిది నేను పరుండి వినుచుండెడివాఁడను. వారు మఱునాఁడు చదువుట కారంభించునప్పుడు పుస్తకమును క్రిందఁబెట్టి ముందు గా గతదినము చదివినదాని చింతనము చేయుచుండెడివారు. అటు చేయునప్పుడు రాజశాసనప్రకరణభాగములలో నేదియైనను వారికి స్మరణకు రాకపోయెనేని నే నందుకొని మంచముమీఁదనుండి చెప్పుచుండెడివాఁడను. నా ధారణాశక్తికి వా రాశ్చర్యపడుచుండెడివారు. ఆ సంవత్సరముననే వా రిరువురును తత్పరీక్షాసిద్ధులైరి. ఈపరీక్షలో ధన్యతఁ బడసినతరువాత నా పెద తండ్రిగారికి ప్రాడ్వివాక సభలో ప్రధానవిలేఖకోద్యోగ మైనది. అందుచేత రాజమహేంద్రవరమును విడిచి కొంతకాల మాయన పెద్దాపురములోను, అమలాపురములోను; ఏలూరిలోను, ఉండుచు వచ్చిరి. ఆకాలమునందు నేనును నాతల్లియు వేసవికాలపు సెలవులలోను శీతకాలపు శెలవులలోను బోయి వారి యొద్దనే యుండుచుండెడివారము. అప్పుడు నా పెదతల్లియు తల్లియు నొండొరులతో మాటాడుచు లోపల మనస్స్పర్ధ యొక వేళ నడఁగియున్నను పైకి మైత్రి కలిగియే యుండెడివారు. అందుచేత మే మవిభక్తకుటుంబమువలెనే యుండెడివారముగాని విభక్తకుటుంబమువలె నుండుచుండలేదు. నాలవతరగతిలోను సంవత్సరాంతపరీక్షలో నేనే మొదటివాఁడనైతిని. పరీక్షాప్రశ్నముల కేర్పఱుపఁబడిన పరమసంఖ్య 480లో నాకు వచ్చినసంఖ్య 420. అప్పటి పాఠశాలాపరీక్షకులైన బవర్సుదొరగారు నా తెలివి కద్భుతపడి నన్ను ప్రత్యేకముగా తమగదిలోనికిఁ బిలిపించి చేరువను గూర్చుండఁబెట్టుకొని, ఆదరముతో నా వీపుమీఁద తట్టి, యిచ్చటఁ బ్రవేశపరీక్షం దేఱినతరువాత చెన్న పురికిఁ బోయి పట్టపరీక్షవఱకును తప్పక చదువవలసినదని హితబోధచేసిరి. పరీక్షయందు వరుసగా రెండుసంవత్సరములు ప్రథఁముఁడుగాఁ, దేఱినవానికి పుస్తక బహుమాన మిచ్చుటయే కాక సంవత్సరకాలము జీతము లేకుండ చదువుకొన నిచ్చుచుండిరి. ఆసంవత్సర బహుమానసమయమునందు సద్వర్తనము నిమిత్తమయి యిచ్చిన పుస్తకములును పరీక్షయందగ్రపదమును బడసినందున కిచ్చిన పుస్తకములునుగలిపి నేను మోయలే నన్ని యాయెను. ప్రవేశపరీక్షతరగతిలోఁ జదువునప్పుడు నేను పాఠశాలలో జీత మియ్యవలసిన పని లేపోయెను. 1867 వ సంవత్సరమునందు నే నయిదవతరగతిలో ననఁగా ప్రవేశపరీక్షతరగతియందు చదువుచుండినను నా కాసంవత్సరము చదువు సాగనేలేదు. మాపెదతండ్రిగారు రోగపడి యేలూరినుండి యౌషధసేవనిమిత్తమయి రాజమహేంద్రవరమునకు వచ్చి కొన్ని మాసములు వ్యాధిబాధితులయి యుండి లోకాంతరగతు లయిరి. ఆయన రోగపీడితులయి యున్న కాలములో మందుల కొఱకును వైద్యులకొఱకును తిరుగుచుండుటచేతను, ఆయనవ్యాధివలన నాకుఁ గలిగిన మనోవ్యాధిచేతను, నేను పాఠశాలకు సరిగా పోవుచుంటయు పాఠములు చదువుటయు తటస్థింపలేదు. నాపితృవ్య మరణానంతరమున పాఠశాలను విడిచి పనిలోఁ బ్రవేడింపుమని మాబంధువు లనేకులు నన్ను ప్రేరేపించిరి; వా రావిధముగా నాతల్లితోఁజెప్పి యామెచేతను నాకుఁ జెప్పించిరి. నాకు చదువు మానుటయం దెంతమాత్రము నిష్టము లేకపోయినను నాతల్లియొక్కయు బంధువులయొక్కయు ప్రేరణమువలన నాపూనికను విడిచి పనిలోఁబ్రవేశించుట కొడఁబడి, నాకు బహుమాన మిచ్చి నాయం దాదరము చూపుచుండిన మండలన్యాయాధిపతి యగు మారీసుదొరగారిని పనినిమిత్తమయి పోయి చూచితిని. నేను సామాన్యపరీక్షయందుఁ దేఱియున్న వాఁడ నగుటచేత రాజకీయోద్యోగమునకు యోగ్యుఁడ నయియే యుంటిని. ఆకాలమునం దాపరీక్ష యందుఁ గృతార్థు లయినవారు దొరకుటయు దుర్లభముగానే యుండెను. మారీసుదొరగారు నాకు బహుమాన మిచ్చినప్పటినుండియు నప్పుడప్పుడుపోయి యాయనను జూచుచుండెడివాఁడను. ఆయనయు నావిద్యా క్షేమములనుగూర్చి యడిగి నన్నాదరించు చుండెడివాఁడు. మా పెదతండ్రిగారు లోకాంతరగతులయినతరువాత నేను బోయి దర్శనము చేసినప్పుడు దొరగా రాయనమృతికి విచారించి మంచిమాటలతో నన్నూఱడించి, ఆయేర్పాటులో కడపటిదానిని నా కిచ్చెదనని వాగ్దానము చేసిరి. అప్పుడు మండలన్యాయసభలో సిరస్తాదారుగా నుండిన నెప్పల్లె లక్ష్మీనారాయనప్పగారు మాశాఖవాఁడును మాకుటుంబమునకు పరమాప్తుఁడునునయి యుండెను. ఆయన యాపని తప్పక నాకే యి ప్పించెదనని చెప్పెను. ఇట్లుండఁగా రెండుమూడుదినముల కాపని పరీక్షాసిద్దుఁడు కాని మఱియొకని కియ్యఁబడినట్టు నాకుఁ దెలిసినది. ఇది యెట్లయ్యెనాయని విచారింపఁగా సిరస్తాదారుగారు నూఱు రూపాయలు పారితోషికముగా స్వీకరించి యాపని యాతనికి వేయించినట్టు తెలియవచ్చినది. రూపాయలగాలి సోఁకినప్పుడు వానిముందఱ బంధుత్వమును మిత్రత్వమును సమస్తమును తృణ కణములవలె నెగిరిపోవలసినవే గదా! నేను మరలఁ బోయి దొరగారిని జూచినప్పుడు నీకింత చిన్న తనములోఁ బని యేల యనియు, చదివి గొప్పపరీక్ష లిచ్చినతరువాతఁ దామే గొప్పపని నిచ్చెద మనియు, చెప్పి నన్నుఁ బంపి వేసిరి. ఆ పనియే నా కప్పుడయియుండినయెడల నెలకు పదిరూపాయలచొప్పున సద్యఃఫలము లభించియుండును. ఆపని నాకుఁ గాకుండుట యీశ్వరుఁడు నామంచి కొఱకే చేసెననవచ్చును. ఆపనిలోనే యుండుట తటస్థించెనేని, శ్లేష్మములోఁ బడిన యీఁగవలె రేయింబగళ్ళు బండపనిలో మునిఁగి కొట్టుకొనుచు నిరంతర శరీరక్లేశపీడితుఁడనై పరోపకార చింత లేక నే నెట్టిదురవస్థలో నుండియుందునో ! ఈశ్వఁరు డీలోకములో సర్వమును మనమేలుకొఱకే చేయును. అట్లాశాభంగము కలుగుట కలుక పొడమినవాఁడ నయి, ముందెప్పుడును న్యాయసభలో లేఖకోద్యోగమునందుఁ బ్రవేశింపకుండునట్లు శపథముచేసికొని, మరలఁ బాఠశాలకుఁ బోవ నారంభించితిని. ఇది యిట్లుండఁగా నడుమ మఱి యొక విచిత్రకథ సంభవించి నావిద్యకు వేఱువిఘ్నము నాపాదించెను. అప్పుడున్న ప్రధామోపాధ్యాయుఁడైన వైయాపురి మొదల్యారిగా రింగ్లీషుభాష యందు విశేష సాహిత్యము లేనివారగుటచేత, పరీక్షకు, నిర్ణీతమైన యింగ్లీషు పద్యకావ్యమును చక్కఁగా బోధించుటకు సమర్థులుగాక యుండిరి. అట్టియసమర్థుఁ డాయున్నత పదమునందుండుట క్రమము కాదని నాకుతోఁచెను. ఎక్కడనేయక్రమము కనఁబడినను నాది సహించి యూరకుండెడి స్వభావము కాదు; ఆయక్రముమునకుఁ బ్రతిక్రియను జూచువఱకును నామనస్సున కూఱట కలుగదు. అంచేత విద్యార్థులలాభము నిమిత్తమాయన నక్కడ నుండి పంపి వేసి సమర్థుఁడైన మఱియొకరి నాయనస్థానమునకు రప్పించుట కర్తవ్యమని నాకు నిశ్చితాభిప్రాయము కలిగినది. నాసహపాఠులైన యితర బాలురతో నాలోచింపఁగా వారును నాయభిప్రాయముతో నేకీభవించిరి. నాకొక యభిప్రాయము పుట్టుటకును దానిని నెఱవేర్ప బూనుటకును నడుమ తడవు విశేషముగా నుండదు. అందుచేత తోడనే విద్యా విచారణాధికారి గారికిఁ బంపు నిమిత్త మింగ్లీషున నొక సంఘ విజ్ఞాపనము వ్రాసి దానిపైని మాతరగతిలోనివారిచేత వ్రాళ్లుచేయించి, తక్కిన తరగతిలోని బాలురచేత వ్రాళ్లు చేయించుటకై నాబాల్య సఖుఁడును మాక్రింది తరగతిలో చదువుకొను చున్న వాఁడును హీమవత్పర్వతముమీఁది తపశ్చరణమునకై వెడలిన మువ్వురిలో నొకఁడునునైన కనపర్తి లక్ష్మయ్యగారిచేతికిచ్చి యొక భానువారము నాఁడా విజ్ఞాపనపత్రమును బంపితిని. ఈలోపల నేలాగుననో యీ విజ్ఞాపన పత్రవార్త మాప్రధానోపాధ్యాయునికిఁ దెలిసి, ఏదో మిషచేత దానినితెచ్చి తన కిమ్మని మాతరగతిలోనే చదువుకొనుచుండిన మొండ్రేటి రామచందుఁడను నాతనిని బ్రేరేచి యొడఁబఱిచెను. అతఁడు తా నందు వ్రాలుచేసి తెచ్చునట్లు నటించి, నామిత్రునిచేతిలోనుండి విజ్ఞాపనపత్రమును గైకొని తనయింటిలోనికిఁ దీసికొనిపోయి, దొడ్డిదారిని తిన్నఁగా నడిచి దానిని మాప్రధానోపాధ్యాయునికిచ్చెను. ఇట్లు మోసపోయి నామిత్రుఁడు దీన వదనముతో మాయింటికివచ్చి జరిగిన కధను నాకు దెలిపెను. నే నంతటితో నిరుత్సాహుఁడనుగాక నా మిత్రుని నేమియు ననక, నాయొద్దనున్న మాతృకనుజూచి మఱియొక ప్రతిని వ్రాసి సంతకములు చేయించి పంపవచ్చునని చెప్పి యాతని నింటికిఁ బంపివేసితిని. ఆమఱునాఁడు యథా ప్రకారముగా పాఠశాలకుఁ పోయినప్పుడు మా ప్రధానోపాధ్యాయుఁడు చేత బెత్తము పట్టుకొని నాలవ తరగతిలోనికిఁ బోయి నామిత్రుని గొడ్డును బాఁదినట్లు బాఁదెను. అది చూచినప్పుడు నామనస్సునకు సహించరాని నిర్వేదము కలిగెను. నా కెంతబాధ కలిగినను నే నోర్చుకొనియుండఁ గలుగుదునుగాని యితరులకు నిష్కార ణముగా బాధ కలిగినప్పుడు సహించియుండఁజాలను. అందులోను నానిమిత్త మొరులకు బాధ కలిగినప్పుడు నామనస్సెట్లు పరితపించునో వివరించుటకు బాష చాలదు. స్వవిషయమున నే నెట్లు బాధ కోర్చుకొనఁ గలుగుదునో తెలుపుటకై నాచిన్న నాఁడు నడచిన యొకసంగతి నిచట సంక్షేపముగాఁ జెప్పెదను.

పది పండ్రెండేండ్లప్రాయమునం దొకప్రాతఃకాలమున మాదొడ్డిలోని పాదునచిక్కుడుకాయలు కనఁబడఁగా వానిని గోయఁ జూచితినిగాని క్రిందినుండి నా కవియందలేదు. కాఁబట్టి నేను కాయలకయి పందిరిగుంజపయి కెక్కితిని. ప్రాఁతదగుటచేత నడిమికి విఱిగిపోయి యాగుంజ నేలవ్రాలఁగా దానితో పయినుండి నేనును నేలఁ గూలితిని. అప్పు డాగుంజయొక్క విఱిగిన వాఁడియయినభాగము నాయఱకాలిలో గ్రుచ్చుకొని లోఁతుగా దిగి కాలి నుండి నెత్తురుప్రవాహము కట్ట నారంభించినది. నేను వెంటనే లేచి కూరుచుండి యేడువక యెవ్వరిని బిలువక ధైర్యమవలంబించి నాపై బట్టతీసి గట్టిగా కాలికి చుట్టఁబెట్టి, మెల్లగా మామేడమీఁదికిఁబోయి తలుపులోపల వేసికొని కట్టువిప్పు, గాయములో విఱిగియున్న కఱ్ఱముక్కలను దీసివేసి, మరల కట్టు కట్టుకొని తలుపుతీసి యొక గదిలో మూలఁ బరుంటిని. నేను వేళకు భోజనమునకు రాకపోవుటచేత మావాండ్రు నన్ను వెదకి యెక్కడను గానక కడపట మేడమీఁదికివచ్చి నేను కట్టు విప్పినచోటను కాఱియున్న రక్తమును జూచి భయపడి, నన్ను పిలిచియు బదులుగానక నేనున్న గదిలోనికి వచ్చి యొకమూల నొదిగిపరుండియున్న నన్నుఁజూచి, కారణమును దెలిసి చికిత్స చేయించిరి. అప్పటి గాయపుమచ్చ యిప్పటికిని నా యెడమపాదమున నంగుళము వెడల్పునఁ గనఁబడుచున్నది.

ప్రధానోపాధ్యాయుఁ డట్లు నామిత్రుని గొట్టినప్పుడు దీనికిఁ బ్రతివిధాన మేమిచేయవలెనా యని యాలోచించుచు నేను పరధ్యానముతో నుండఁగా అతఁడు మాతరగతిలోనికి వచ్చి కోప మాపుకొనలేక నన్ను "బుద్ధిహీనుఁడా" యని తిట్టెను. ఆమాటయనఁగానే చివాలున లేచి నేను తరగతిని విడిచి యావలికిఁబోయితిని. నా వెంబడినే నాతరగతిలోని బాలురందఱును తమస్థలమునువిడిచి వెలుపలికివచ్చి నాతోఁ గలిసి యిండ్లకుఁబోయిరి. ఆప్రధానోపాధ్యాయుఁ డాదినమువఱకును నన్నెప్పుడును చిన్న మెత్తుమాట యనక యెంతో గౌరవముతోఁ జూచుచుండెడివాఁడు. తెలివి గలవాఁడనని మాత్రమేకాక శాంతచిత్తుఁడ ననియు వినయపరుఁడ ననియు సాధువర్తనుఁడననియుఁగూడ నాయం దాయనకు విశేషప్రేమము. ఆసంఘవిజ్ఞాపనములో నా వ్రాలు మొట్టమొదటఁ జూచువఱకును తనప్రియశిష్యుఁడనైన నే నింతపని చేయుదునని యాతఁడు స్వప్నావస్థయందును దలఁచియుండలేదు. నేను సాధారణముగా శాంతస్వభావము గలవాఁడనే యయినను, న్యాయవిషయమున నాగ్రహకారణము కలిగినప్పుడు నాయుద్రేకమునకును పట్టుదలకును పరిమితి యుండదు. అప్పుడు నేను గురువనియు బంధు వనియు స్వేహితుఁ డనియు బలయుతుఁ డనియు జూడక పూనినకార్యమునందు దీక్షవహించి కడవఱకును పని చేయుదును. సంతకము లయిన విజ్ఞాపనపత్రము పోవుట, మిత్రునకు దండనము కలుగుట, నాకు నాతరగతిలోని వారిముందఱ నవమానము కలుగుట మిదలైనవిఘ్నము లనేకములు ప్రధమప్రయత్నములోనే కలిగినను నేను లేశ మాత్రమును జంకక, ఆప్రధానోపాధ్యాయుని నక్కడనుండి పంపివేయువఱకును నిశ్శంకముగా పని చేయవలయునని నిశ్చయించుకొంటిని. నామాటలను వినునపుడు నాసహపాఠులకును సఖులకునుగూడ వీరావేశము కలుగుచుండును. ఈ విషయమున మాపాఠశాలలోని సహాయోపాధ్యాయులుకూడఁ గొందఱు మమ్ము ప్రోత్సాహపఱిచిరి. మేము కట్టుకట్టి మఱునాటినుండి పాఠశాలకుఁ బోవ మానితిమి. మఱుసటినాఁడు ప్రధానోపాధ్యాయుఁడు పాఠశాలకుఁ బోవునప్పటికి వట్టిబల్ల లేకాని పిల్లలు లేకుండిరి. అతఁ డది చూచి లోపల భయపడినను పయికి లేని గాంభీర్యము పూని వెంటనే పాఠశాలకు రానియెడల పేరులు తీసివేసెద ననియు, రెండుదినములలోపల రానివారి నందఱిని కొట్టెద ననియు, మొదట బెదరించి చూచెను; తరువాత మాంచిమాటలాడుచు తోడనే వచ్చినవారిని క్షమించి బహుమానము లిచ్చెదనని వర్తమానము పంపెను; అటుపిమ్మట బాలురను వేఁడుకొనియు వారిని మందలించి పంపుఁడని సంరక్షకులకు వ్రాసియు మరల బాలురను పాఠశాలకు రప్పించుటకయి బహు ప్రయత్నములు చేసెను. ఎంత చేసినను చేసినప్రయత్నము లన్నియు భగ్నములయి భస్మములోని యాహుతు లయ్యెను. అంతట నతఁడు విఫలమనోరథుఁ డయి తొందరపడి చేసినపనికి సావకాశముగా పరితాపపడుచుండెను. మేము మఱునాఁడే సంఘవిజ్ఞాపనపత్రములను మరల సిద్ధముచేసి వానిమీఁద ప్రధానోపాధ్యాయునకును సంరక్షకులకును భయపడి కొందఱు వ్రాళ్ళు చేయకపోయినను, అధిక సంఖ్యాకులచేత వ్రాళ్ళు చేయించి యొకప్రతిని విద్యావిచారణ కర్తకు చెన్నపురికిని, ఇంకొకప్రతిని పాఠశాలాపరీక్షకునకు విశాఘపట్టణమునకును, బంపితిమి. అంతేకాక యాదినముననే విద్యావిచారణకర్తయగు కర్నల్ మగ్డానల్డుదొరగారికిని, పాఠశాలాపరీక్షకులగు గ్రిగ్గుదొరగారికిని, తంత్రీవార్తలనుగూడఁ బంపితిమి. వెంటనే రాజమహేంద్రవరమునకుఁ బోయి విచారణ చేయవలసినదని విద్యావిచారణకర్తగారు పాఠశాలాపరీక్షకునకు వ్రాసి, మా విజ్ఞాపనపత్రమును వారికిఁ బనిపిరి. గ్రిగ్గుదొరగారు కొన్ని దినములలో రాజమహేంద్రవరమునకు వచ్చి మమ్మందఱిని పిలిపించి విచారణ చేసి, వైయాపురి మొదల్యారిగారిని వేఱొకచోటికిఁ బంపి వేయవలసినదని పయికి వ్రాసిరి. అందుచేత విద్యావిచారణాధికారిగారు వైయాపురిమొదల్యారిగారిని నరసాపురమునకుఁ బంపి, అక్కడనుండి చెంగల్వ కుప్పుస్వామి శాస్త్రులవారిని రాజమహేంద్రవరమండల పాఠశాలకు పధానోపాధ్యాయునిఁ గాఁ బంపిరి. అటు తరువాత మే మందఱమును మరల పాఠశాలకుఁ బోయి చేరితిమి. మొదటి విజ్ఞాపనపత్రము నెత్తుకొని పోయి ప్రధానోపాధ్యాయుని కిచ్చినవిద్యార్థి యితరవిధ్యార్థులధాటికి తాళలేక రాజమహేంద్రవరములో నుండి చదువుట యసాధ్య మయినందున మాపాఠశాలను విడిచి విశాఖపట్టణమునకుఁ బోయి యచ్చటి ప్రభుత్వము వారిబోథనాభ్యసన పాఠశాలలోఁ జేరెను. 1868 వ సంవత్సరములో నేను మరలఁ బాఠశాలలోఁ జేరినను, నాకా సంవత్సరమునను చదువు జరగలేదు. మా పెత్తండ్రిగారి మరణానంతరమున చరరూపమైన సొత్తంతయు పట్టుకొని యాయనభార్య తనపుట్టినింటికిఁ బోయెను. అప్పు డామెకు సంతానములేదు. మరణకాలమునకు మా పెదతండ్రిగారికి ఋణము లేమియు లేకపోవుటయేకాక కొంత రొక్కముకూడ నుండెను. మా పెదతండ్రిగారివంతునకు వచ్చినగృహభాగము మిక్కిలి విశాలమయి పట్టణ మధమునం దుండెను. అందుచేత దాని నెట్లైన నపహరింపవలెనని ప్రముఖు లనేకులు దానిమీఁద కన్ను వేసియుండిరి. ఆయిల్లు మా పెత్తల్లి యనంతరమున నాకు రావలసినదిగా నుండెను. ఆయింటి నపహరింపవలె నని కన్ను వేసియున్న వారిలో నొక రిద్ద ఱది విక్రయింపుమని నా పెదతల్లిని ప్రోత్సాహపఱిచిరి. ఆమె దానిని విక్రయించి చేరిన రొక్కమును దీసికొనిపోవలెనని ప్రయత్నించెను గాని వితంతువిక్రయమగుటచేతను, దాని కనంతరకర్తనైన నేను జీవించి యుండుటచేతను, క్రయము చెల్ల నేరదని శంకించి యెవ్వరును తగినవెల యిచ్చి కొనసాహసింపకుండిరి. అందుచేత నామె యెంతతక్కువ మొత్తమునకైనను విక్రయించి రొక్కము చేసికోవలెనని చూచుచుండఁగా, పాపభీతిలేని యొక గొప్పగృహస్థుఁ డాయి ల్లామెవద్ద నతిహీనక్రయమునకు వ్రాయించుకొని, ఆయల్పధనమునైన నప్పు డామె కియ్యక భర్తయొక్క యుత్తరక్రియలనిమిత్తము ఋణములు చేసినట్టుగా నెవ్వరికిని దెలియ కుండ నిష్టులైన వారిపేర దొంగపత్రములు వ్రాయించి, వారిచేత నామె పుట్టినింటివారి గ్రామమునకు చేరువనుండిన న్యాయస్థానములో వ్యాజ్యములు వేయించి తీర్పులను బడసెను. ఈసంగతి నాతల్లికిఁ దెలిసి నన్నుఁదీసికొని వృద్ధుఁడును బంధుఁడునైన యొక న్యాయవాదికడకుఁ బోయి, తదనంతరస్వామ్యమునిమిత్తము వ్యాజ్యము తెచ్చి గృహవిక్రయము నాపింప వలసినదని యాయనను వేఁడెను. మా గృహరహస్యములను బూర్ణముగాఁ దెలిసినవాఁడైన యాన్యాయవాది కొంచెముసే పాలోచించి, యావఱకు జరిగినవిభాగము క్రమమయినది కాదనియు, విభాగపత్ర ము పుట్టకపోవుటచేత నది చెల్లఁదగినదిగాక ధర్మశాస్త్రప్రకారము జరగనట్లే భావింపఁబడ వలసినదనియు, ఎమేమో హేతువులు చెప్పి యభియోగపత్రమును వ్రాసి దానిపైని నాచేత వ్రాలు చేయించి, అనుగతన్యాయసభలో వ్యాజ్యము వేసెను. అప్పుడు నాకు వ్యవహార మేమో ధర్మశాస్త్ర మేమో తెలియనే తెలియదు. మాయింటితీర్పంతయు నా తల్లియే చక్క పెట్టుచుండెను. న్యాయాధిపతి విచారణచేసి యావఱకు జరగినది క్రమమయినవిభాగమే యనియు, అభియోగము తేవలసినక్రమ మదికాదనియు, ప్రతివాది యనంతరమున గృహస్వామ్యమునిమిత్తము వ్యాజ్యము తెచ్చుకోవలసిన దనియు, అక్రమముగా నామె తనపైని చేయించుకొన్న తీర్పులను రద్దు పఱుచుటకయి వేఱుగ వ్యాజ్యములు తెచ్చుకోవలసినదనియు, వ్రాసి మావ్యాజ్యమును కొట్టి వేసెను. అంతటితోనైన నూరకుండక యాన్యాయవాదియే మండలన్యాయసభలో దానిపై నుపర్యభియోగము చేయించెను. మండలన్యాయాధిపతి దానిని సహితము కొట్టివేసి రెండు న్యాయసభలలోను ప్రతివాదికైన కర్చు లిచ్చుకో వలసినదని తీర్పు చెప్పెను. ప్రతివాది కిచ్చుకోవలసిన కర్చులక్రిందను న్యాయవాది కిచ్చినవియు ముద్రకాగితములకైనవియు నైనవ్యయములక్రిందను నాభార్యకుండిన నాలుగైదువందల రూపాయల నగలను విక్రయింపవలసి వచ్చినది. తదనంతరకర్తృత్వము నిమిత్తమును, అన్యాయముగా పొందిన తీర్పులను రద్దు పఱుచుకొను నిమిత్తమును,వ్యాజ్యములు తెమ్మని న్యావాదులుమాత్రమే కాక యితరులును నన్ను ప్రేరణచేసిరి. అప్పటికి నేను స్వతంత్రుఁడ నయి సంపాదింప నారంభించి యుండుటచేతను, వ్యవహారములకెక్కి వ్యర్థముగా ధనవ్యయము చేయుట నా కిష్టము లేకపోవుటచేతను, నాపక్షమే తీర్పు పుట్టినను నాజీవితకాలములో నా కాసొత్తువచ్చుట సందేహమగుట చేతను, నేను మరల వ్యాజ్యములలో దిగలేదు. స్థిరద్రవ్యము విషయమయి యక్రమముగా పొందిన తీర్పులను రద్దుచేసికొనుట కప్పటి న్యాయశాసనమునుబట్టి పండ్రెండేండ్లు గడువుండినందున, ఈలోపల నే నెప్పుడు వ్యాజ్యము తెత్తు నోయను భీతిచేత నిల్లు తనపేరవ్రాయించుకొన్నతఁడు దానితోఁ జేరినస్థలములో నిండ్లు కట్టింపకయే మృతుఁడయ్యెను. పండ్రెండేండ్లు గడచినతరువాత నాతనిభార్య యందులో గృహములు కట్టించి యిప్పు డద్దెల కిచ్చినది. నా పెదతండ్రిగారిభార్య యిప్పటికిని సజీవురాలయి నాకంటె నెక్కువదార్ఢ్యము కలదయి యున్నది.

ఈకాలమునకే నేను తెలుఁగున కవిత్వము చెప్పుట కారంభించితిని. మతమునకు నీతిప్రధానమనియు, నీతిమాలినవాఁడు నిజమైనభగవద్భక్తుఁడు కాఁ జాలఁడనియు, చిత్తశుద్ధిగలిగి యీశ్వరానుగ్రహమును బడయుటకు నీతిపరుఁడైయుండుట యావశ్యకమనియు, నేను మొదటినుండియు నమ్మియుండిన వాఁడనైనను, నే నేకేశ్వరోపాసకుఁడను గాక యప్పటివఱకు విగ్రహారాధకుఁడనైయే యుంటిని. అప్పుడు నాకుపవాసములును వ్రతములును భగవత్ప్రీతికరములనియే నమ్మకముండెను. ప్రత్యేకాదశినాఁడును గోపాలస్వామి యాలయములోనిభజనకుఁ బోయి రాత్రులు ప్రొద్దు పోయినదాఁక మేలుకొని యుండి యింటికి వచ్చు చుండెడివాఁడను; శివరాత్రినాఁడు ప్రాతఃకాలమున కోటిలింగ క్షేత్రమునకుఁబోయి స్నానముచేసివచ్చి నిరాహారుఁడనై ప్రదోష సమయము మొదలుకొని రాత్రి యెంతో ప్రొద్దుపోయినదాఁక మార్కండేయస్వామి యాలయములో కాలక్షేపముచేసి వచ్చెడివాఁడను; ఒక శివరాత్రినాఁడు జాగారము సహితము చేసితిని. కవిత్వము చెప్పుట కారంభింపఁగానే మొట్టమొదట గోపాలస్వామిమీఁద నొకటియు, మార్కండేయస్వామిమీఁద నొకటియు, రెండు కందపద్యశతకములను జెప్పితిని. ఆరెండుశతకములును చిరకాలము క్రిందటనే యెట్లో నశించినవి. అవి యిప్పుడున్నను ప్రశస్తముగా నుండియుండవు గాని చిన్న ప్పటికవిత్వ మెట్లుండెనో తెలిసికొనుటకుమాత్ర మాధారములైయుండును. వీనిలో మొదటిది మార్కండేయశతకము; దానిలోఁ బ్రతిపద్యాంతమునందును "మార్కండేయా" యని యుండును. రెండవది గోపాలశతకము; దానిలోఁ బ్రతిపద్యాంతపాదమును "శ్రీరాజమహేంద్ర వరపురీ గోపాలా" యనియుండును. ఈకడపటిశతకములోని యీక్రింది పద్యమొకటి మాత్ర మభాగ్యోపాఖ్యానములో మొదట వేయుటచేత నిప్పటికి నిలిచియున్నది.

                 క. శ్రీరమణీహృల్లోలా, కారుణ్యలతాలవాల కాంచనచేలా
                    ఘోరాహవజయశీలా, శ్రీరాజమహేంద్రవరపురీగోపాలా.

ఈశతకములు బాగుగ లేవనియు, ఛందోవ్యాకరణదోష భూయిష్ఠములనియు, నే నుపేక్షించి యొకమూలఁ బాఱవేయుటచేతనే నశించిపోయినవి. నే నప్పుడు శైవవైష్ణవ మతములలో దేనియందును విశేషపక్షపాతము లేనివాఁడనై, శివకేశవులు సమానులన్న విశ్వాసముతో నుభయుల నారాధించుచు, వేదాంతమునం దెక్కువ యభిరుచిగలవాఁడనై యుండెడివాఁడను. మంత్ర ప్రభావమునందును బరమవిశ్వాసముగలవాఁడనై వేలకొలది గాయత్రీజపము చేయుచు నుండుటయేకాక యాంజనేయమంత్రమును రామమంత్రమును ఉపదేశమునొంది బహువారములు పునశ్చరణముచేసితిని. మంత్రమహిమవలన దయ్యములు వదలిపోవునని నమ్మి, వానిని బ్రత్యక్షముగాఁ జూడవలెనన్న యభిలాషముతో దయ్యములు పట్టినవన్న వారియిండ్ల కెల్లనుబోవుచు భూత వైద్యులు చేయు మంత్రతంత్రములనెల్లఁ జూచుచు మంత్రవేత్తల నాశ్రయించుచుండెడివాఁడను. భూతవైద్యుల నెందఱినో యనుసరించి యొక్క భూతమునైనను జూపుఁడని యెన్ని విధముల వేఁడినను నా కొక్కరును జూపినవారుకారు. ఒక భూతవైద్యుఁడుమాత్రము నాకు దయ్యమును జూపెదననిచెప్పి, ఒకనాటిరాత్రి నన్ను దూరముగా నూరివెలుపలి కొకమఱ్ఱిచెట్టు వద్దకుఁ గొనిపోయి, చూపక "చూపినచో నీవు జడిసికొందువు" అని చెప్పి తప్పించుకొనఁజూచెను. నేనెంతమాత్రము జంకక "నేను జడిసికోను. నా యందనుగ్రహించి తప్పక చూపుము" అని వేఁడి ధైర్యముతో నిలువఁబడితిని. అంతట నతఁడు "నీవు భయపడక పోయినను ప్రభుత్వమువారివలన నాకు చిక్కు వచ్చును. నేను చూపను" అని చెప్పి నాకాశాభంగము కలిగించి వెడలిపోయెను. దయ్యములు స్మశానవాటికలయం దర్ధ రాత్రసమయమున సంచారము చేయుచుండునని యెల్లవారును జెప్పుచుండుటచేత వానిని జూడవలె నన్న యుత్కంఠతో ననేకపర్యాయములు నిశాసమయమున పడకనుండి లేచి యెవ్వరితోను జెప్పక మాపట్టణములో 'నెఱ్ఱరాళ్ళ' సమీపముననున్న స్మశాన భూమి కొంటిగాఁ బోయితిని. పాముకఱుచునో, తేలుకుట్టునో, దొంగలు కొట్టుదురో, అనుభయము తక్క పిశాచభయమెంతమాత్రమును లేక విపుల మనోరథుఁడనై తిరిగి వచ్చుచుండెడివాఁడను. ఈ సంగతి యితరులతోఁ జెప్పఁగా వారు పిశాచగణములలోఁ బుట్టినవారికిఁగాని దయ్యములు కనఁబడవని నాకు సమాధానము చెప్పెడివారు. ఇప్పటివలెఁ గాక నాచిన్నతనము నందు దయ్యములయందలి విశ్వాస మెల్లవారికి నత్యధికముగా నుండెను. అప్పుడు దయ్యములేనియిల్లు లేనే లేదని చెప్పవచ్చును. ఎవ్వరు క్రొత్తగా చచ్చినను వారు దయ్యములయి తిరుగుచుండిరని యెల్లవారును జెప్పుకొనుచుండిరి. దయ్యములను పాఱఁద్రోలుమంత్రగాండ్ర సంఖ్యయు నిప్పటికంటె నప్పుడు శతగుణాధికముగా నుండెను. ఏదియైన వింతసంగతిని విన్నచో శోధించి దానినిజమును గనుఁగొనవలె ననియు, విన్న దాని నెల్ల విశ్వసింపఁ గూడదనియు, విశ్వసించినదాని ననుసరించి ప్రవర్తింపవలెననియు, నాకు మొదటినుండియు నైసర్గి కాభిరతియై యుండెనుగాని యాలోచన లేక యొరులు చెప్పున ట్లెల్లను నడచు స్వభావ మెప్పుడును లేదు. అందుచేత నేను గొన్ని సమయములయం దహంభావమును స్వచ్ఛందచారిత్వమును గలవాఁడనయి యితరులయభిప్రాయములయందు గౌరవముంచ కుండెడివాఁడను. నా కాకాలమునందు విద్యార్థులుమాత్రమేకాక కొంద ఱుపాధ్యాయులును మిత్రులుగా నుండిరి. ఒకనాఁడు సాయంకాలము నేనును నామిత్రులగు కొంద ఱుపాధ్యాయులును విద్యార్థులును గలిసి యూరిబైటికి సంచారార్థము పోయితిమి. అట్లు క్రోశదూరముపోయి సూర్యాస్తమయసమయమున వెనుక మరలి మేము నడచెడురథ్య రెండుశాఖ లయినచోటికి వచ్చి నిలిచితిమి. అం దొక దారి యంగళ్లవాడనుండి పట్టణమునకుఁ బోవును; ఇంకొకదారి గోదావరి యొడ్డునుండి పట్టణమునకుఁ బోవును. ఇం దేదారిని బోవుదమని మాలోమాకు పశ్నవచ్చినది. నే నొక్కఁడను నదీతీరవీధినుండి పోవుదమంటిని; తక్కిన వారందఱును విపణివీధినుండి పోవుదమనిరి. అప్పుడు నాతోడివారు విపణి మార్గమునుబట్టి, నేను వెంటవత్తునేమోయని తిరిగితిరిగి చూచుచు మెల్లఁగా నడవసాగిరి; నేను వారిమార్గము ననుసరింపక తిన్నఁగా గోదావరియొడ్డునుండి పోయి యిల్లుచేరితిని. వాడుకప్రకారము మఱునాఁడును మే మావైపునకే సంచారార్థము పోయి మరలి వచ్చునప్పు డేశాఖామార్గమున పట్టణమునకుఁ బోవలెనని మే మాస్థలముననే మగుడ శంకించుకొంటిమి. గతదినమునందు వలెనే నాఁడును మా కభిప్రాయ భేదము కలుగఁగా నే నొక్కఁడను గోదావరిదారిని నడవఁ దొడఁగితిని. నా మిత్రు లంతట తమపట్టు విడిచి నాకు లోఁబడినవారయి, నే నితరులు చెప్పినట్టు విననివాఁడనని పలుకుచు నామార్గము ననుసరించిరి. ఇట్టి పట్టుదలను ధర్మాచరణముతో సంబంధించిన ముఖ్యాంశములలోఁ జూపుట యావశ్యకమును కర్తవ్యము నే యైనను, ధర్మభంగము లేని యిటువంటి యల్పాంశములలోఁ జూపుట యనాదరణీయమును మూర్ఖత్వమును నగును. నీతికిని సత్యమునకును ధర్మమునకును భంగము కలుగని విషయములలో నెల్లను బహుజనవాక్యమును మాననీయముగా భావించి తదనుసారముగా పెద్దలకు లోఁబడి నడచుట కర్తవ్యమని తెలుపుటకే దీని నిందుఁ జెప్పితినిగాని నేను జేసినపని మంచిదని చెప్పుటకయికాదు. దీనివలన సాధారణముగా బాల్యమునుండియు నాది పట్టినపట్టు విడుచుస్వభావము కాదని తేటపడును. ఈకాలమునందే నాకు నాపూర్వవిశ్వాసములు కొన్ని మాఱుట కారంభించుటయు సంభవించెను. నామిత్రులగు చల్ల పల్లి రంగయ్య పంతుల వారియొద్దనుండియో మఱియెవ్వరియొద్దనుండియో కేశవచంద్రసేనులవారి యుపన్యాసములు కొన్ని పుచ్చుకొని చదివితిని. ఆయుపన్యాసములు చదువుట వలన నే నావఱకు సత్యములని నమ్ముచుండిన కొన్ని విషయములనుగూర్చి సం దేహము కలిగెను. ఆసమయమునం దాత్మూరి లక్ష్మీనరసింహముగారు బందరు నుండి మామండలపాఠశాలకు ద్వితీయోపాధ్యాయులుగా వచ్చిరి. వారు బ్రహ్మసమాజమతమునం దప్పు డభినివేశము గలవారు. అందుచేత వా రామత సిద్ధాంతములను విద్యార్థుల కప్పుడప్పుడు బోధించుచుండెడివారు. ఆయన ప్రోత్సాహమువలన మాలో మే ముపయుక్తము లయిన విషయములనుగూర్చి వారమునకొకసారి కూడి చర్చించుటయు విద్యార్థులలో నొక సమాజము నేర్పఱుచుకొంటిమి. నేనుగాక నామిత్రులగు కనపర్తి లక్ష్మయ్యగారును మఱి యిద్దఱు ముగ్గురునుమాత్ర మాసమాజమునకు వచ్చుచుండిరి. మే మయిదాఱుగురమును లక్ష్మీనరసింహముగారి యింటివద్దఁగాని మాయింటివద్దఁ గాని సమావేశమగుచుంటిమి. ఆకాలమునందు నలుగు రొకచోటఁ గూడి సభ చేయుటయే గొప్ప తప్పిదముగా నుండెను. మేము వీధిలోనుండి పోవునప్పుడు మమ్ము వ్రేలితోఁ జూపి "మీటింగువాళ్ళు వీళ్లేనర్రో" యని మూఢులు తమలోఁ దాము చెప్పుకొనుచు వచ్చిరి. అందుచేత మేము మాలోపల తలుపులు వేసికొని కూరుచుండియే సభ చేసికొనెడివారము. ఆయేడును సంవత్సరాంత పరీక్షలో నాకు పుస్తక బహుమానము వచ్చెను. నే నాసంవత్సరము సర్వకలాశాలాప్రవేశపరీక్షకుఁ బోయితినిగాని కృతార్థుఁడను గాలేదు.

1869 వ సంవత్సరమునందు నన్ను మరల రోగ మాశ్రయింప దగ్గును దౌర్బల్యమును హెచ్చయ్యెను. అందుచేత నేను చదువుటకుఁగాని పని చేయుటకుఁగాని యశక్తుఁడ నయి యుంటిని. నే నప్పుడు మంచ మెక్క లేదుగాని కొన్నిదినములు రోగపీడితుఁడనయి యింటనే యుండుచు దేహము కొంచెము స్వస్థపడినప్పుడు పద్యములు చెప్పుచు నుంటిని. చిన్నప్పటినుండియు నా యూహ లెప్పుడును శక్యాశక్య విచారము లేక యున్నతపదమునకయి పాఱుచుండెడివి. పురాణములను జదువునప్పుడం దభివర్ణింపఁబడిన మహర్షులవలె ఘోరతపస్సు చేసి తపోమహిమను బడయవలెనని వాంఛించుచుంటిని. కావ్యములను జదువునప్పుడు మహాకవినయి యుత్తమకావ్యములను రచియింపవలె నని కోరుచుంటిని. ఐనను నామనస్సైశ్వర్యాధికారములనిమిత్త మెప్పుడును ప్రాఁకులాడుచుండెడిది కాదు. అచ్చ తెనుఁగుకావ్యముల నొకరిద్దఱే రచియించిరని యెఱిఁగి యుంటిని; నిరోష్ఠ్యకావ్యము నొక్కకవియే రచియించెనని వినియుంటిని; నిర్వచన కావ్యము నొక్కకవియే రచియించియుండెనని తెలిసికొనియుంటిని. అందుచేత సామాన్య కవులు పోయిన మార్గమునఁ బోవక యీమూడు లక్షణములు నొక్క కావ్యమునందే కూర్చి యసాధ్యమైన క్రొత్త త్రోవను త్రొక్కవలెనని నాకప్పుడు సంకల్పము జనియించెను. సాధారణముగా నాకు సంకల్ప ముదయించుటకును తదనుసారముగా కార్యారంభమున కుధ్యమించుటకును చిరకాల మంతర ముండదు. ఇట్లు సంకల్పోదయము కాఁగానే లోకానుభవశూన్యుఁడను పాండిత్యవిరహితుఁడను నగునే నెక్కడ లోకానుభవశాలులైన విద్వాంసులకును దుస్సాధ్యమగు మహాకావ్యరచన యెక్కడనని శంకింపక, బాల్యచాపలముచే సాహసము చేసి "శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచననైషధ" మను పేర నలచరిత్రమును జేయఁబూనితిని. ఇది ప్రౌఢకావ్యము కాకపోయినను నాపూనినప్రతిజ్ఞ నెట్లో నిర్వహించి కృతకృత్యుఁడను కాఁగలిగితిని. ఈకాలమునందే "రసిక జనమనోరంజన"మను పేర వొక మిశ్రప్రబంధమునుగూడఁజేయ నారంభించితిని.

ఆకాలమున చిత్రపు కామరాజుగారు మండలన్యాయసభలో దొరతనమువారి న్యాయవాదిగా నుండిరి. ఇతరవిషయములందు సమర్థులైనను, ఆయన యింగ్లీషు రానివారగుటచేత మండలకరగ్రాహితోను తదితరహూణాధికారులతోను నింగ్లీషున నుత్తర ప్రత్యుత్తరములను జరపుటకు సమర్థుఁడైన యొక లేఖకుఁ డాయనకు గావలసి యుండెను. నెల కిరువదిరూపాయల జీత మిచ్చెదననియు, ప్రాతఃకాలమునమాత్రము మూడు గంటలసేపు తనయింటివద్ద పని చేయవలసిన దనియు, ఆయన నన్ను కోరెను. నేనంగీకరించి యాపనిలోఁ బ్రవేశించితిని. ఆయన వేశ్యల నుంచుకొనుట గౌరవావహమని భావించెడు పూర్వ నాగరికకోటిలోనివాఁడు; నేను క్రొత్తకొత్తగా మాఱుచు వేశ్యావిష యమున భిన్నాభిప్రాయము చెందిన నవనాగరిక బృందములోనివాఁడను. అది గాక ఛాందసుఁడనుగా నున్న కాలములోసహితము దుర్నీ తిపయి నాకు సహజ ద్వేషము; అప్పుడు సహితము దుర్నీ తిపరులను చూచినప్పుడు నాతల కంటగించుచుండెను. నే నాయనయింటివద్ద పని చూచుచున్న కాలములో సహితము కొన్ని సమయములయం దాయన యుంచుకొన్న వేశ్య నిశ్శంకముగా వచ్చి సరసను గూర్చుండి యాయనతో సరససల్లాపము లాడుచువచ్చెను. అది సరిపడక నామనస్సు నన్ను బాధించుచు వచ్చెను.. అందుచేత మొదటి నెల జీతము పుచ్చుకోఁగానే నే నాపని మానివేసితిని. వేశ్యాసంగమదోషము మాట యెట్లున్నను, కామరాజుగారు నావిషయమున సర్వవిధముల దయతోను గౌరవముతోను మెలఁగుచు వచ్చిరనియు నా కెప్పుడును కోపకారణము నణుమాత్రమును గలిగింపలేదనియు నే నిచ్చటఁ జెప్పవలసియున్నది. అటు తరువాత రాజమహేంద్రవరమండల పాఠశాలకు ప్రధానోపాధ్యాయులైన బారోదొరగారివద్దను, కారాగృహములపై నధికారియైన కెప్టెన్ హాల్లెట్టు దొరగారివద్దను, తెలుఁగుచెప్పుటకయి పని కుదిరితిని. వా రిరువురివలనను నాకు నెలకు ముప్పదియైదురూపాయలు వచ్చెడివి. 1869 వ సంవత్సరమున నేను పరీక్షకుపోలేదు. 1870 వ సంవత్సరమునందు బారోదొరవారు ప్రకటించు చుండిన 'గోదావరీ విద్యాప్రబోధిని' (Godavery Educationist) అను మాసపత్రికకు నేను తెనుఁగున వ్రాయుచుంటిని. నాశుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచననైషధ మాపత్రికయందే మొదట కొంచెముభాగము ప్రకటింపఁబడినది. నేను పాఠశాలలో చదువకయే 1870 వ సంవత్సరమున సర్వకలాశాలాప్రవేశ పరీక్షకుఁ బోయి కృతార్థుఁడ నయితిని.

ఈప్రకరణమును ముగింపకముందు దీనిం జదివెడు యువజనులకు మిత్ర సంగ్రహమునుగూర్చి కొంచెము హెచ్చరిక చేయవలసియున్నది. పదునాఱు సంవత్సరములు మొదలుకొని యిరువదిసంవత్సరములవఱకును మనకు సుగుణములుగాని దుర్గుణములుగాని పట్టుపడ నారంభించి తరువాత నవి స్థిరపడిపో వును. స్థిరపడినతరువాత వానిని మార్చుకొనుట బహుతర ప్రయాససాధ్యము గాని సుసాధ్యము కాదు. సామాన్యముగా సుగుణదుర్గుణములు మనసహావాసులైన మిత్రులనుబట్టి యలవడును. కాఁబట్టి యాకాలమునందు మిగుల జాగరూకులమయి శక్యమయినంతవఱకు సన్మిత్రసంపాదనమునకయి ప్రయత్నింప వలయును. ఈవిషయమయి స్వానుభవము నొక్కింత చెప్పెదను. మా బంధువులే యొకరు మాయింట కాపుర ముండెడివారు. ఆకుటుంబ యజమానున కించుమించుగా నాయీడే గల యొకకుమారుఁ డుండెను. ఇరువురమును పదునెనిమిదేండ్లు ప్రాయము గలవార మగుటచేతను, ఏకగృహముననే సర్వదా యుండెడివార మగుటచేతను, బంధుత్వసంబంధము గలవార మగుటచేతను మే మొండొరులతో మైత్రి గల వారమయి యుంటిమి. వినోదమునకయి యప్పుడప్పుడు మే మిరువురమును చీట్లాడుచుండెడివారము. శైశవమునుండియు నేను దుర్బలశరీరుఁడ నగుటచేత దేహాయాస కరములయిన యాటలపొంతఁ బోవక, చీట్లు, దశావతారి, చదరంగము, మొదలయిన కాయకష్ట మక్కఱలేని యాటలతో విరామముగల యప్పుడు ప్రొద్దు పుచ్చు చుండెడివాఁడను. ఆయాటలయం దప్పుడు నేను గొంత నేర్పరి నయియు నుంటిని. నామిత్రుఁడును నేనును మొట్టమొదట పందెము లేకయే చీట్లాడుచుండినను, తరువాత ప్రప్రధమమున చింతగింజలును తదనంతరమున గవ్వలును బెట్టి యాడఁ జొచ్చితిమి. అప్పుడు పదునాఱుగవ్వలవెల యొకదమ్మిడీకి సమానముగా నుండెను; గవ్వలిచ్చి యప్పు డంగడిలో నేవస్తువునైనను గొనవచ్చును. ఏదుర్వృప్తియైన నారంభము కాకయే యుండవలెనుగాని కొంచె మారంభమైనతరువాత ముందుకు సాగక యారంభించిన చోటనే నిలువదు. నామిత్రుని ప్రోత్సాహము చేత గవ్వలు దమ్మిడీలయినవి; దమ్మిడీలు డబ్బులయినవి. నేను సాధారణముగా నోడిపోయెడివాఁడను గాకపోయినను, వేడుక కొఱకే యారంభమయిన మాచీట్లాట కడపట జూదముక్రింద పరిణమించినది. ఈయాటలవలన నేను రెండుమూడురూపాయలను గెలిచితిని. ఈయాటకయి యతఁ డొకసారి నన్ను మాయింటినుండి తనమిత్రుని యింటికిఁ గొనిపోయెను. ఆతనిమిత్రు లాతనివలెనే విద్యాగంధము లేని దుర్వ్యాపారులు. ఈసోమరిబృందముతోఁ గలిసి నేను పెక్కుమాఱులు డబ్బు పెట్టి జూద మాడితిని. నామిత్రుఁడును మిత్రుని మిత్రులును గలసి చీట్లాటకు మంచిస్థలము చూపెదము రమ్మని యొకబోగము వానియింటికి నన్నుఁ దీసికొనిపోయిరి. ఆదినమున నొకముసలిజూదరిమాత్రమే మాతోచీట్లాడెనుగాని మఱుసటిదినమునందు వాఁడు తనకూఁతురయిన పడపు పడఁతినిగూడఁ గొని వచ్చి యాటకుఁ గూర్చుండఁబెట్టెను. ఇంకను గొంత కాల మీదారినేయనుసరించి యుండినయెడల నేను నీతిమాలిన నిర్భాగ్యుఁడనయి చెడియుందునుగాని యీశ్వరానుగ్రహమువలన నింతలోఁ దెలివి తెచ్చుకొని, కడచినదాని కనుతాపపడి వెంటనే నాదుర్వ్యాపారమునుండి మరలుకొని, నామిత్రునితోడి సాంగత్యమును విడిచి పెట్టితిని. పయిదానివలన సత్ప్రవర్తనమునకు సజ్జనసాంగత్య మావశ్యకమని ఫలితార్థము తేలుచున్నది. స్వభావముచేత నెంతమంచివాఁ డయినను దుర్జనసాంగత్యములోఁ బడిపోయి దుర్వ్యసనములలోఁ దగులుకొన్న పక్షమునఁ దనవివేకమును గోలుపోయి తాను పూనిన వ్యాపారమే మంచి దనుకొనునంతటి దుస్థ్సితిలోనికి వచ్చి మానహీనుఁడయిన దుష్టుఁ డగును. ఇది మనస్సునం దుంచి బాగుపడఁ గోరువారు దుస్సంగదూరు లగుటకు సర్వవిధములఁ బాటు పడవలయును.