స్వీయ చరిత్రము - ప్రథమ భాగము/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

స్వీయ చరిత్రము

మొదటిప్రకరణము - బాల్యదశ.

క్రీస్తుశకము 1848 మొదలుకొని 1860 - వ సంవత్సరమువఱకు.

భరతఖండమునందలి పురాతనము లయినపట్టణములలో నొక్కటియయి, రాజరాజనరేంద్రాది చాళుక్యచక్రవర్తులకు రాజధాని యయి, ఆంధ్రకవితా కల్పలత కాలవాలమయి, నన్నయభట్టారకాది కవిగ్రామణులకు వాసభూమి యయి, గోదావరీతీరమునందు సర్వవిధములఁ బ్రసిద్ధి కెక్కియున్న రాజమమహేంద్రవరము నందలి యస్మత్పితామహార్జితమైన స్వగృహమునందు కీలక నామసంవత్సర చైత్రశుద్ధత్రయోదశీ భానువారమునాడు (అనఁగా క్రీస్తుశకము 1848 వ సంవత్సరము ఏప్రిల్ నెల 16 వ తేదిని) సూర్యోదయానంతరమున మూడుగడియలకు నేను జననమొందితిని. మాయిల్లు రాజమహేంద్రవరములో నున్న పెద్దయిండ్లలో నొకటి. దానితో సమాన మయిన యిండ్లాపట్టణములో రెంటిమూటికంటె నధికముగా లేకుండెను. నా పెదతండ్రిగారును నేనును సమభాగములుగాఁ బంచుకొన్నను, నాపాలికి వచ్చిన యర్థభాగమే రాజమహేంద్రవరములోని బహుగృహములకంటె మిక్కిలి పెద్దదిగానున్నది. నేను జన్మించినగది నాపాలికి వచ్చిన మేడయింటిలోనే యుండి నాయధీనములోనే యున్నది. ఆగదికిని మాగృహములోని యొక చావడికిని నడుమఁ గల గోడను దీసివేసి యేకముగా నొక విశాల భోజనశాలనుగా మార్చి మే మిప్పుడు దానిని భోజనగృహముగా వాడుకొనుచున్నాము. నారాజ శేఖరచరిత్రము నందలి రాజశేఖరుఁడు గారి గృహవర్ణన మించుమించుగా మా గృహవర్ణనమే. పూర్వార్జితమైన యంత విశాలభవనమును గలిగియుండుటయే కొంతవఱకు మాపూర్వు లున్నతస్థితిలో నున్న వారని తెలుప వచ్చును. ఆ గృహరాజమును గట్టించినమాతాతగారు మహాసుప్రసిద్ధులయి కొంతకాలము సంస్థానాధిపతుల యొద్ద దివానుగా నుండిరి. మాపూర్వులు సహితము సంస్థానాధిపతులును "దేశపాండ్యా"లును నయి పెక్కు కావ్యములను ముఖ్యముగా శైవగ్రంధములను గృతుల నందినవారయి యుండిరి. స్వయోగ్యత లేకయే పూర్వుల గొప్పతనమును బట్టి తమకు గౌరవము కలుగ వలయునని భావించెడు మనీషికోటిలోనివాఁడను గాకపోవుటచేత వారియుత్కృష్టతను వర్ణించుటకు నే నిందుఁబ్రయత్నింపను. మాతాతగా రగు వీరేశలింగముగారు మిగుల ధర్మాత్ములనియు, భూదానాదులు చేసి కీర్తివడసినవారనియు, చెప్పుట మాత్ర మిప్పటి కథాంశమునకుఁ జాలియుండును. అయినను నాబుద్ధిచాపల మేమోకాని మాతాతగారి ఖ్యాతినిగూర్చి స్వానుభవమువలన నే నెఱిఁగిన యొకచిన్న యంశము నిచ్చట సంక్షేపరూపమున నైనను జెప్ప మానఁజాలకున్నాను. ఇరువదియైదుసంవత్సరముల ప్రాయమప్పుడు నేను ధవళేశ్వరములో నాంగ్లోదేశభాషాపాఠశాలకుఁ బ్రధానోపాధ్యాయుఁడనుగా నుండి మండు వేసవికాలములో నాసహపాఠియు బాల్యసఖుఁడును నగు నొక మిత్రునిఁ జూచుటకయి కాకినాడకుఁ బోయి యచ్చటినుండి పడవలో నెక్కి మరల వచ్చు చుంటిని. అప్పుడు కాకినాడకాలువలోఁ దగినంతనీరులేదు. పడవవాడ్రెంతో ప్రయాసపడి మోకాలిలోఁతు నీటిలో పడవ నీడ్చుచుండిరి. ఇట్లు పడవ మెల్లఁగా నొకగ్రామసమీపమునకు వచ్చునప్పటికి మిట్టమధ్యాహ్న మయ్యెను; దుస్సహమయిన యెండవేఁడిమిచేత నిప్పులు చెరుగుచు వడగాడ్పులు వెచ్చగా నొకచెవినుండి యొక చెవికిఁ గొట్టుచుండెను; తీక్ష్ణతపతాపముచేతఁ బడవలోనున్నవారికి తడియాఱి నోళ్ళెండుచుండెను. ఆఁకలికిఁ దాళఁజాలక మలమలమాడుచు శిశువులు విలపింపఁజొచ్చిరి; సాయంకాల మగునప్పటికిఁగాని, పడవ ధవళేశ్వరము చేరునట్టు కనఁబడలేదు. ఇట్టిస్థితిలోఁ బడవవాండ్రను బతిమాలుకోఁగా వాండ్రు గ్రామములోనికిఁ బోయి భొజనము చేసి వచ్చువఱకును పడవ నక్కడ కట్టిపెట్టి యుంచుట కొప్పుకొనిరి. మా వారు నన్ను గారాబముతోఁ బెంచి మొదటినుండియు పని చేయనీయకుండుటచే వ్యర్థుఁడనైనవాఁడ నగుటచేత వంట చేసికొనుట యైనను నాకుఁ జేత కాకుండెను. భోజనము పెట్టినచోఁ దాను వంట చేసిపెట్టెద నని పడవలోని బ్రాహ్మణుఁ డొకఁడు నాతోఁ జెప్పెను. నే నాబ్రాహ్మణుని వెంటఁబెట్టుకొని నిప్పులు గురియుచున్న యాయెండలో పావుక్రోసుదూరములోనున్న యా యూరికి నడచి కరణముయొక్క యిల్లుచేరితిని. ఆయూరిపే రిప్పుడు నాకు జ్ఞప్తికి రాలేదు. ఆయూర నొక్కకరణముయొక్క యిల్లుదక్క వేఱు బ్రాహ్మణగృహము లేదఁట. ఆ యెండలో నెట్లో యాగృహమునకు దేహములు చేరవైచి, రామాయణ పారాయణము చేయుచున్న గృహపతిని జూచి భోజనార్థమై వచ్చితిమని చెప్పితిమి. వారియింట నింకను భోజనములు కాక పోయినను తాము డబ్బు పుచ్చుకొని యన్నముపెట్టువారము కామనియు, ఊరక పెట్టుటకు వలనుపడ దనియు, ధనముగైకొని భోజనము పెట్టు పూటకూటియిల్లు తమగ్రామమున లేదనియు, చెప్పి శీఘ్రముగా నింకొకయూరికిఁ బొండని మాకాయన హితోపదేశము చేసెను. కోమటియింటికిఁ బోయి బియ్యము మొదలయినవి కొనితెచ్చుకొనెద మనియు, కొంచెము తావుచూపి పాకముచేసికొనుటకు పాత్రసామగ్రియైన నియ్యవలసినదనియు, మేమాగృహస్థుని వేఁడుకొంటిమి. అతఁడు వలసినచో మృణ్మయపాత్రములను దెచ్చుకొని యొకపంచను వంట చేసికొనవచ్చునని యనుజ్ఞ యిచ్చెను. అప్పుడేమి చేయుటకును తోఁచక యాలోచించుచున్న నన్నుఁ జూచి, కుండలములు వేసికొని యొకపీటమీఁదఁ గూరుచుండి వాల్మీకిరామాయణమున కర్థము చెప్పుచున్న యొకవృద్ధబ్రాహ్మణుఁడు "మీయింటిపే రేమి?" అని యడిగెను. "కందుకూరివారు" అని నేను బదులు చెప్పితిని. "మీపేరెవరు?" అని యాయన మరల ప్రశ్న వేసెను. నాపేరు చెప్పితిని. అప్పు డాయన మాతాతగారిపేరు చెప్పి "మీకాయన బంధువులా?" అని యడిగెను. "ఆయన మా తాతగారే" యని చుట్టఱికమును దెలిపితిని. ఆమాట వినఁగానే యాయన పీటమీఁదనుండి లేచి నాకు పీట వేసి, యంతవఱకును నిలువఁబడియున్న నన్నుఁ గూర్చుండ వేఁడికొని, గౌరవముచూపి, మాతాతగారిని బహువిధముల శ్లాఘించి తనకాయన మాన్య మిచ్చి సత్కరించినవార్తను కరణముగారితోఁజెప్పెను. ఆయన తాను పారాయణముచేయుచుండిన రామాయణమును పీటపైఁ బెట్టి తత్క్షణమే లోపలికిఁబోయి యేమేమోయేర్పాటుచేసి యయిదాఱు నిమిషములలో మరలవచ్చి, నాయెడల నతిమాత్రాదరమును జూపుచుఁ దానెఱుఁగక చేసిన యవజ్ఞను క్షమింపుమని నన్ను వేఁడుకొనెను. ఈ సంభాషణమునకు ఫలముగా మాకు గంటలోపలనె కమ్మని యావునేతితోను గట్టి పెరుగుతోను రెండుకూరలతోను పిండివంటతోను సుఖభోజనము లభించెను. భోజనానంతరమున నే నాగృహపతికిని ముసలిబ్రాహ్మణునకును నమస్కారములుచేసి నాకృతజ్ఞతను దెలిపి సెలవు గైకొనిపోయి పడవ యెక్కి సాయంకాలమునకు ధవళేశ్వరముచేరి గృహము ప్రవేశించితిని. నేను పుట్టుట కొక్క సంవత్సరము పూర్వమే లోకాంతరగతులగుటచేత నాతాతగారిని నే నెఱుఁగకపోయినను, అటువంటి పితామహునకుఁ బౌత్రుఁడ నన్నగర్వ మీవృత్తాంతము స్మరణకు వచ్చినప్పు డెల్ల నిప్పటికిని నామనస్సులోఁ గలుగుచుండును.

నావివాహము మొదలైన శుభకార్యములకుముం దెల్లను నాపెదతండ్రి గారు నాజన్మపత్రమును జ్యోతిష్కుల కెల్లఁ జూపుచు సుముహూర్తములు పెట్టించుచు వచ్చినను, జ్యోతిశ్శాస్త్రములోని ముహూర్తజాతకభాగముల యందలి నమ్మకము నాకు చిరకాలము క్రిందటనే చెడినందున నేను స్వతంత్రుఁడ నయినతరువాత నాజన్మపత్రమును జూచుటకయినను నేనెన్నఁడును బ్రయత్నము చేసియుండలేదు. నాజన్మపత్రిక నాయొద్దనున్నదనికూడ నేనెఱుఁగకుంటిని. కొన్ని సంవత్సరముల క్రిందట నొక పనికయి మాయింటనున్న ప్రాఁతకాగితములను వెదకుచుండఁగా నా పెదతండ్రిగారి మామగారయిన బుద్ధిరాజు కనకరాజుగారిచేత వ్రాయఁబడిన నాజన్మపత్రిక యొకటి యాకస్మికముగా నాకంటఁ బడెను. దానిఫలవిషయమయి నాకెంతమాత్రమును విశ్వాసము లేకపోయినను సత్యాన్వేషుల విమర్శకయి యుపయోగపడవచ్చునని నా జాతకచక్రము నిందుఁ బొందుపఱుచుచున్నాను— నే నారంభదశలో జ్యోతిశ్శాస్త్రమునం దత్యంతవిశ్వాసము కలవాఁడనే యైనను, జన్మపత్రికలలో దీర్ఘాయుష్మంతులగుదురని చెప్పఁబడినవారనేకు

లల్పాయుష్కులగు చుండుటయు, మహాధనాఢ్యు లగుదురని చెప్పఁబడిన వారనేకులు దరిద్రులగుచుండుటయు, సంతానవంతు లగుదురన్న వారనేకులు సంతానహీను లగుచుండుటయు, చిరకాలసువాసిను లగుదురన్న కాంతలు పలువురు బాలవితంతువు లగుచుండుటయు, సుమూహూర్తములు పెట్టుకొని జేసిన కార్యములు పెక్కులు భగ్నము లగుచుండుటయు, చూచుచు వచ్చిన కొలఁదిని నా కీజ్యోతిషవిషయమయి యంతకంతకు నమ్మకము తగ్గి లోకానుభవ మధికమయినతరువాత పూర్ణముగా నశించెను. నా నమ్మకము చెడుటకుఁ గల కారణములను వివరించుట కిది సమయము కాదు. స్థూలముగా నొక్క యంశమును విచారింపుఁడు. మనదేశములో వివాహములకు మంచి ముహూర్తములు పెట్టుకొనని వారెవ్వరుందురు? వధూవరులజాతకములను బరీక్షించి చూచుకొనక లగ్న నిశ్చయము చేయువారెవ్వరుందురు? సుముహూర్తములను బెట్టుకొని జన్మపత్రములనుబట్టి దీర్ఘాయుష్మంతులయినవరుల నేర్పఱుచు కొని వివాహకార్యములు నడపునప్పుడు వివాహితలలో లక్షలకొలఁది బాలవితంతువులేల కావలెను? అట్టిచోట్ల నెల్ల జాతకబల మేమగును? ముహూర్తబల మేమగును? జ్యోతిశ్శాస్త్రవిశ్వాసము లేని పశ్చిమఖండ వాసులలోని వివాహములకంటె జ్యోతిశ్శాస్త్రమర్యాద నతిక్రమింపక చేయఁబడు మనలోని వివాహము లేవిషయమున నధిక సుఖప్రదములుగా నున్నవి? జన్మపత్రములలో వ్రాయఁబడిన ఫలములలోఁ గొన్ని కాకతాళీయములుగాఁ గలుగుట తటస్థించినను, గొన్ని యైనను దప్పిపోవుచుండుటచేత నట్టిశాస్త్రము విశ్వాస యోగ్యమైనది కాదని నాదృఢనిశ్చయము.

పూర్వోదాహృతమయిన మత్పితామహుని నామధేయమునుబట్టియు నా పేరునుబట్టియు మాపూర్వులు శైవులైన ట్టూహింపఁ దగియున్నదిగదా? అస్మత్ప్రపితామహునివఱకును మాపూర్వులందఱు లింగధారులయి వీరశైవులయియే యుండిరి. కేవలవీరశైవులగుటయేకాక మాపూర్వులలోని శైవమతోన్మాదు లయినవారు కొంద ఱధికారప్రాబల్యమునుబట్టి స్మార్తుల కనేకులకు బలవంతముగా లింగములు గట్టి వారిని శైవమతప్రవిష్టులనుజేసిరి. మాపూర్వులు శైవబ్రాహ్మణులలోని యాఱువేల నియోగిశాఖలోఁ జేరినవారు. అందుచేత వారు స్మార్తు లయిననియోగులతో సంబంధబాంధవ్యములను జేసికొనుచుండిరి. నాముత్తాతగారయిన చంద్రమౌళిగారికి స్మార్తులలోని శ్రీచూర్ణధారుల (నిలువుబొట్టువారి) కన్య నిచ్చుట తటస్థమైనది. ఆదంపతుల కుదయించిన మత్పితామహులగు వీరేశలింగముగారు వైష్ణవమతాభిమాను లైన మేనమామల ప్రోత్సాహముచేతనో మఱి యే హేతువుచేతనో తాము లింగధారణమును మానివేసి సంస్కారమునకు మొదట దారి తీసిరి. పితామహాగత మగుటచేతఁ గాఁబోలును వారిపేరింటివాఁడ నగు నాకును బాల్యమునుండియుఁ దత్సంస్కారవాసన యించుక సోఁకినది. మాతాతగారి జన్మభూమి యేలూరు. అక్కడనే వారికిఁ బూర్వార్జితము లయినభూములును గృహములును నుండెను. మాయింటిపేరునుబట్టి మాపూర్వు లాదియందు నెల్లూరుమండలములోని కం దుకూరుపురనివాసులయి యుండినట్టును, అటుతరువాత మహమ్మదీయుల కాలములో నుద్యోగధర్మమునుబట్టి యేలూరునకు వచ్చినట్టును, దెలియవచ్చుచున్నది. మహమ్మదీయప్రభుత్వముయొక్క క్షీణదశతోనే మాపూర్వులయధికారప్రాబల్యము సహితము క్షీణించినది. తరువాతఁ బ్రభుత్వమునకు వచ్చిన యింగ్లీషుదొరతనమువారు మహమ్మదీయుల కాలములో సంపాదించి మా పూర్వులనుభవించుచుండిన చిన్న జాగీరులను గైకొనివారికిఁ గొన్ని తరములవఱకును నుపకారవేతనముల నిచ్చుచు వచ్చిరి. ఇట్లుపకారవేతనము లనుభవించిన వారిలోని కడపటియతఁడు నేను పెద్దవాఁడ నయినతరువాతనే కాలధర్మము నొందెను. మావారిలోఁ గొందఱిప్పటికిని గొన్ని గ్రామములను గలవారయి యున్నారుగాని యప్పులపాలయి యుండుటచేత వారి ప్రస్తుతస్థితి యంత బాగుండలేదు. మా సన్నిహితజ్ఞాతు లింకొకరు గంజాముమండలములో సంస్థానాధిపతులుగ నున్నారుగాని యా సంస్థానము వంశపరంపరాగత మయినది గాక యిటీవల సంపాదింపఁబడిన దని వినుచున్నాను.

ఆకాలమునందు కాలువలయాధారము లేనందున మాన్యక్షేత్రములు వాన లనుకూలముగా కురిసినసంవత్సరము పండవలసినవిగాను, కురియని సంవత్సర మెండవలసినవిగాను, ఉండెను. ఆకాలమునందు భూములపైని దొరతనము వారికిఁ గట్టవలసిన పన్నులు చెల్లుటయే దుర్ఘటముగా నుండుచు వచ్చెను. అందుచేత భూములయాదాయమును నమ్ముకొని స్వస్థలమునందే యుండుట కవకాశము లేక మాతాతగారు రాజాశ్రయమును బొంది స్వగ్రామమును విడిచి రాజమహేంద్రవరమునకు వచ్చి కొంతకాలమున కక్కడ మిక్కిలి ప్రబలులయి విశేషధనార్జనము చేసి రాజభవన మనఁదగినంత మహాసౌధమును గట్టి యచ్చటనే స్థిరనివాస మేర్పఱుచుకొనిరి. ఆయిల్లు వ్యాపించినంత మేరలో దాని కెదుటి శ్రేణిలో నుత్తరదిక్కున నాఱిండ్లును దూర్పువైపున నైదిండ్లును గలిగియుండుట తద్గృహవైశాల్యాధిక్యమును దెలుపును. ఆయిల్లేఁబండ్రు సుఖ
వాసము చేయుటకయినను జాలినదైనను మాతాతగా రత్యుచ్చదశలో నున్నప్పుడది చాలక యింకను వృద్ధిచేయవలెనని కలపఁ దెప్పించి నిలువఁ జేసిరఁట! బెల్లమున్న చోట నీఁగలు ముసురునట్లు తమవాఁ డొకడు మంచిదశలో నున్నప్పు డెక్క డెక్కడివో తరములనాటి బంధుత్వములు తెలుపుకొనుచు వచ్చి బంధువులాతని నాశ్రయింతురు. అట్టి చుట్టములతో మాతాతగారియిల్లు సదా నిండియుండెడిదఁట! ఇట్లు మహోన్నతదశలో నున్నకాలమునం దాయన పూర్వార్జితము లయినభూములను జ్ఞాతులకుఁ గొన్నిటిని విడిచిపెట్టి తక్కిన వానిని విద్వాంసులకు దానము చేసెను. ఎల్లకాలమును దినము లేకరీతిగా నుండవు. వెన్నెలదినము లయినతరువాత చీఁకటిదినములు రాకుండునా? ఆకాలమునందు రాజకీయనియోగులలోఁ బరోత్కర్షాసహిష్ణుత సర్వసామాన్య మయుయుండెను. చూచువారికన్నులు కుట్టునట్టుగా నంత గొప్పయిల్లు కట్టుట చూచి యోర్వలేక యసూయాపరులగు తోడినియుక్తులు కొందఱు కుతంత్రములు పన్ని కొండెములు చెప్పి తమ కపటప్రయోగమునై పుణిచేత మా తాతగారిని పనినుండి తొలఁగించునట్లు చేసిరఁట! అప్పుడాయన యాశ్రిత భరణమును స్వకుటుంబభరణమును పూర్వార్జితవిత్తముతోనే చేయవలసివచ్చెను. ఆయన తా నార్జించినధనమును విశేషముగా నిలువచేసికొనలేదు. బంధుపోషణము నిమిత్తమును దానధర్మములనిమిత్తమును సంపాదించిన విత్తములో విశేషభాగము నెప్పటిదప్పుడే యాయన వెచ్చ పెట్టుచుండెను. అంతేకాక తన పెద్దకొమారుని ప్రథమవివాహమును మహావైభవముతో నడపి యన్న ప్రదానములు భూరిదానములు మొదలయినవానికయి ధనవ్యయ మత్యధికము గాఁ జేసెను. రొక్క మధికముగాఁ జేర్పఁ గలుగుట కాయన మొదటినుండియు పెద్దపనులనే చేసినవాఁడు కాఁడు. చిన్న పనితో నే యారంభించి స్వసామర్థ్యము చేతఁ గ్రమక్రమముగా వృద్ధినొంది కడపట గొప్పపనికి వచ్చెను. ఆకాలమునందలి యల్పసంస్థానాధిపతులయొద్ద నున్న గొప్ప యధికారులకు నూఱు రూపాయల జీత మిచ్చుట యిప్పుడు పదివే లిచ్చుట కంటెను గొప్ప. అది యట్లుండఁగా వారుధనకాములు గాక కీర్తికాములయి పండితుల నాదరించియు దానధర్మములు చేసియు విశేషయశోధనమును సంపాదించినవారు. ఆయనయొద్దఁ బురాణము చెప్పెడు శాస్త్రులయొద్దనే నేను గాళిదాసత్రయమును జదివినాఁడను. ఆయన యాంధ్రభాషాభిమానము గలవారయి యింట భోజనము పెట్టి జీతము లిచ్చి సమర్థు లయినవారిని నిలిపి వారిచేత భారతభాగవత రామాయణములను గొన్ని పురాణములను గొన్ని ప్రబంధములను వ్రాయించిరి. ఆతాటాకులపుస్తకములు కొన్ని నాకాలములోనే శిథిలములయినవి; అచ్చు పడినతరువాతఁ గొన్నిటిని నేనే యితరులకు దానము చేసితిని. ఆపదలు రా నారంభించినప్పు డొక్కదానితోఁ బరిసమాప్తి కాదు. ఆయన పని పోయి యార్జనము లేక యున్న కాలములోనే పూర్వ మంతవైభవముతో వివాహము చేసిన ప్రధమకుమారునికి కళత్రవియోగము తటస్థించెను. కుమారునకు మరల వివాహము చేయవలె నన్న ప్రయత్నములో నుండఁగానే యొక నాఁటిరాత్రి భోజనము చేసి శయనించినతరువాత గుండెలలో నొప్పి వచ్చి తెల్లవారునప్పటికి మాతాతగా రాకస్మికముగా స్వర్గస్థు లయిరి. మరణకాలమునం దాయనకు జననియైన యక్కమ్మగారును, భార్యయైన కామమ్మగారును, జ్యేష్ఠపుత్రుఁడు వేంకటరత్నముగారును,ద్వితీయపుత్రుఁడు సుబ్బారాయఁడు గారును, ఉండిరి. నేను ద్వితీయపుత్రునిపుత్రుఁడను. నా పెదతండ్రి గారికి వయ్యస్సప్పుడిరువదియైదేండ్లు; తమ్ముఁడన్న గారికంటె మూడునాలుగు సంవత్సరములు చిన్నవాఁడు. సిరి చచ్చినను చిన్నెలు చావవన్న లోకోక్తి యున్నదేకదా! విత్త మంతగా లేక పోయినను సాధారణముగా గొప్పయింటఁ బుట్టినవారి కుండెడుగర్వమును మేము పనినిమిత్త మితరుల నాశ్రయింతుమా యన్న దురభిమానమును మాత్రము మా తండ్రులను విడిచినవికావు. మా పెదతండ్రిగారి ద్వితీయవివాహముతో మున్నున్న విత్తము కొంతయు నంతరించినది. తరువాత గృహవ్యయములనిమిత్తమయి మా తండ్రులు మొట్ట మొదట మాతాతగా రిల్లు పెంపు చేయుటకొఱకు నిలువయుంచిన కలపను విక్రయించి వేసిరి; పిమ్మట దొడ్డిలో పడమటివైపుది కొంతభాగ మమ్మివేసిరి; అటుపైని వెండిబంగారపువస్తువులను విక్రయముచేయసాఁగిరి. ధనదేవత పలాయన మయిన తరువాత దానిని విడిచి గర్వ మొంటిగా చిరకాలము నిలిచియుండనేరదు. గర్వము తమ్ము విడిచి తొలఁగఁగానే తాము దురభిమానమును విడిచి మా తండ్రు లుద్యోగములనిమిత్తము కృషిచేయ నారంభించిరి. అన్న దమ్ము లిరువురును సంస్కృతమునఁ బంచకావ్యములను ముగించిరి; తెలుఁగునందు మంచి సాహిత్యము కలవారయి యొకవిషయమునుగూర్చి చక్కఁగా వ్రాయుటకును చిక్కువ్రాఁత నైన ననర్గళముగాఁ జదువుటకును సమర్థులయి యుండిరి; ఇంగ్లీషుభాషయందును గొంతజ్ఞానము కలవారయి చదువుటకును వ్రాయుటకును మాటాడుటకును నేర్చియుండిరి. వా రుభయులలో మా పెదతండ్రి గారు కోపస్వభావము గలవారు; మా తండ్రిగారు శాంతస్వభావము గలవారు. మొట్టమొదట మాతండ్రిగారికి కాకినాడలోని మండలకరగ్రాహికార్యస్థానము నందు పిఠాపురసంస్థానసంబంధమున స్థిరమైన లేఖకోద్యోగము దొరకినది. మాపెదతండ్రిగారి కప్పుడప్పుడు పత్రికావహన కార్యస్థానమునందును యంత్ర కారశాఖయందును నల్పకాలికము లయినపను లగుచుండెను.

చిన్న తనములోనే మాతండ్రిగారికి మేనత్తకొమారిత నిచ్చి వివాహము చేసిరి. మాతాతగారిచెల్లెలు స్త్రీ శిశువును గని కాలము చేసినందున, పున్నమ్మ యనెడి యాచిన్న దానిని ముత్తవ యగు నక్కమ్మగారును మేనమామ యగు మాతాతగారును పెంచి పెద్దదానినిఁ జేసిరి. ఈడు తగ దనియు నెదురు మేనఱిక కూడదనియు కొందఱు కొన్ని యాక్షేపణలు చేసినను పాటింపక పెంచినప్రేమచేత విడిచి యుండలేకయు జననియొక్క యాజ్ఞను ద్రోసివేయ లేకయు వయస్సునం దొక్కయేఁడుమాత్రమే చిన్నఁదయినను మాతాతగా రాచిన్న దానిని తమద్వితీయపుత్రుఁ డయిన మాతండ్రిగారికే యిచ్చి పెండ్లి చేసిరి. ఈదంపతులే నాకు జననీజనకులు. ఆకాలమునం దెల్లవారికిని దయ్యముల యందలివిశ్వాస మత్యధికము. స్త్రీలలో నొకప్పుడును దయ్యముపట్టనివారెక్కడనో కాని లేకయుండిరి. ఎవ్వరికేవ్యాధి వచ్చినను వైద్యునియింటికిమాఱుగా ముందుగా భూతవైద్యుని యింటికో సోదెచెప్పువాని యింటికో పరుగెత్తు చుండిరి. ఏయింట నేపురుషుఁడు మరణము నొందినను, ఏతరుణి మరణము నొందినను, దయ్యమయి తిరుగుచుండు నని స్త్రీ పురుషసామాన్యముగా నెల్ల వారును నమ్ముచుండిరి. అందులోను మాతల్లి దయ్య మావహించి పీడించుచున్నదని భ్రాంతి నొంది నిద్రాహారములు సరిగా లేక శుష్కించి బాధపడుచుండెనఁట! మాతాతగా రెంద ఱెందఱనో భూతవైద్యులను మంత్రశాస్త్రవేత్తలను రప్పించి చికిత్స లెన్ని చేయించినను మారణహోమము లెన్ని చేయించినను ప్రాఁత భూతము విడువఁగానే క్రొత్తభూత మొకటి యా వేశించుచు వచ్చుటచేత నామె కృశించుచునే యుండెను గాని భూతము లామె నెప్పుడును బూర్ణముగా విడిచిపోలేదఁట! ఇటువంటి దుర్బలయువతిగర్భమున జనించినవాఁడ నగుటచేత శిశుదశలోసహితము నేను దుర్బలుఁడనుగానే యుంటినఁట! అట్టి నాస్వాభావిక దేహదౌర్బల్యమునకుఁ దోడు పురిటిలోనే దగ్గొకటి పట్టుకొని యప్పటినుండి యిప్పటివఱకును నన్ను విడువక బాధించుచున్నది. పురిటి దినములలోఁ దాను జేసిన యపథ్యదోషము నాదగ్గునకుఁ గారణమని నాతల్లి నాతో నెన్ని యోసారులు చెప్పి నేను కాసబాధచేశ్రమపడుచున్న ప్పుడు నన్నుఁగూర్చి పరితపించుచుండెను. ఈ దగ్గిట్లుండఁగా నాఱు నెలలప్రాయమప్పుడు నాకు స్ఫోటకము వచ్చినది. ఏఁబదిసంవత్సరములకు మునుపు వచ్చిన పోటకపుమచ్చలు కొన్ని యిప్పటికిని స్పష్టముగా నాముఖముమీఁదఁ గనఁబడుచున్నవి. అప్పు 'డాపా టెంత యుగ్రమయినదిగా నుండెనో చెప్ప నక్కఱలేకయే దీనినిబట్టి యెల్లవారికిని విశదము కావచ్చును. అప్పు డెల్ల వారును నాజీవితముదెస నిరాశ చేసికొనిరఁట! కన్నులు మూఁతపడఁగా నొక దినమెల్ల నేను కాలుచేయిసహిత మాడింపక నిర్జీవప్రతిమవలె నుంటినఁట! చచ్చితి ననుకొన్న నే నెట్లు మరల బ్రతుకఁ గలిగితినో తనకే యాశ్చర్యము కలిగించెనని పలుకుచు నాజనని తా నప్పుడు నానిమిత్తమయి పడినమనోవేదనయు మ్రొక్కుకొన్న మ్రొక్కులును మసూరిరోగము వచ్చినవారిని గూర్చిన ప్రసంగము వచ్చినప్పుడు తోడివారితోఁ జెప్పి నన్ను వారికిఁ జూపుచు వచ్చెను. ఇటువంటి పనికిమాలిన దుర్బలమానవునిచేతఁ గూడ గొంతపని చేయింపవచ్చునని చూపుటకుఁ గాఁబోలును బరమకృపాళుఁ డైనపరమేశ్వరుఁ డామెప్రార్థనల నాలకించి నన్ను భూమిమీఁద నిలుప ననుగ్రహించెను. నాలుగైదుసంవత్సరములప్రాయము వచ్చువఱకును నన్నుఁగూర్చి చెప్పుకో వలసిన దేదియు నాకు స్ఫురణకు రాలేదు. అన్న మెంతయెక్కువగాఁ దిన్న నంతబలియుదురన్న నమ్మకము కలదయి యజ్ఞానముచేత నాప్రియమాత నన్ను శీఘ్రముగా బలిపింపవలెనన్న యుత్కంఠతోను సచ్చింతతోను నాకన్న మెక్కువగాఁ బెట్టి నోటిలోనిముద్దను మ్రింగకున్న ప్పుడు మిరెపుకాయలగుండ నానాలుకకు రాచుచుండుటయు నోటిలోనిముద్ద మ్రింగి కారముచే నే నేడ్చినప్పుడు నెత్తిమీఁద మొట్టుచుండుటయు నెందుచేతనోకాని నేఁడు జరిగినట్టుగా నామనస్సున దృఢముగా నాటుకొని యిప్పటికిని మఱపునకు రాకున్నవి. బిడ్డలయందలి యతిప్రేమచేతఁ దల్లు లెప్పుడు నిట్టియవివేక కార్యములను జేయకుండుదురు గాక!

నాకు నాలుగేండ్లప్రాయమప్పుడు మాతండ్రిగా రపాయస్థలమునందు కురుపువేసి కాకినాడలో పరమపదించుట సంభవించినది. అప్పుడు నాకు మరణ మనఁగా నేమో తెలియదు. మాతండ్రిగారి శవమును గాని శవమును ప్రేతభూమికిఁ గొనిపోవుటగాని నన్ను చూడనియ్యక స్మశానవాటిక నుండి మా పెదతండ్రిగారు మఱల వచ్చువఱకును మావారు నన్ను మఱియొకరియింటికిఁ బంపి వేసిరి. నే నింటికి వచ్చినప్పుడు నన్నుఁజూచి మాయింట నున్నవా రేడ్వఁదొడఁగుట చూచి మొగము చిన్న చేసికొని వారితో నేనును నేడ్చితినే కాని వా రేల యేడ్చెదరో నే నేల యేడ్వవలయునో నే నప్పుడేమియు నెఱుఁగను. ఏడుపు చాలించినతరువాత నేల యేడ్చితి రని మావారి నడిగి వారిని మరల నేడిపించుటయేకాని వారివలన నాప్రశ్నమున కుత్తరమును గానక యీవలకు వచ్చి మావారేల యేడ్చెదరని యచ్చట నున్న వారి నడిగితిని. మీనాన్న గారు పోయినారని యొకరు చెప్పఁగా "ఎక్కడకుఁబోయినారు? మరల నెప్పుడువత్తురు?" అని నే నెఱుఁగనిప్రశ్నలు వేయఁ దొడఁగితిని. మాతండ్రిగారిని "నాన్న" యనియు, పెదతండ్రిగారిని "బాబాయి" యనియు పిలుచుట నాకు వాడుక. నాకు నాతండ్రిగారికంటె పెదతండ్రి గారివద్దనే చన వెక్కువ. అందుచేత నాకప్పుడు పితృవియోగ దుఃఖము మనసున నాటలేదు. నా పెదతండ్రిగారు న న్నె ప్పుడును క్రింద దింపక యెత్తుకొని తా నెక్కడకుఁ బోయినను వెంటఁ గొనిపోవుచు, అంగళ్ళవాడకుఁ గొనిపోయి నాకు చిఱుతిండి కొనిపెట్టుచుండెడివారు. ఆయన యొక్క దినము కంటఁ బడకపోయినపక్షమున నేను బెంగ పెట్టుకొని యాయననిమిత్త మేడ్చు చుండెడివాఁడను. మాతండ్రిగారి యుత్తరక్రియ లయినతరువాత మే మందఱమును కాకినాడ విడిచి వచ్చి రాజమహేంద్రవరము చేరితిమి.

ఆకాలమునందు గోదావరికాలువలు క్రొత్తగా త్రవ్వుచుండిరి. అప్పుడు కాలువలపనిపై నధికారము వహించియుండిన యొకదొరవద్ద నా పెదతండ్రి గారికి లేఖకోద్యోగము దొరకినది. ఆయన మొట్ట మొదట నొంటిగాఁ బోయి కొన్ని మాసము లున్న మీఁదట కుటుంబమును దనయొద్దకు రప్పించుకొనుట కయి మనుష్యులను బంపెను. మాతాతగారితల్లి నట్టింటఁ బడి కాలు విఱుఁగఁ గొట్టుకొన్నందున, ఆమెయుపచారార్థముగా కోడ లామెవద్ద నుండవలసిన దయ్యెను. అందుచేత మాతాతతల్లిని మాతండ్రితల్లిని గృహమున నట్టెయుంచి, మానిమిత్తము వచ్చిన మనుష్యులవెంట బైలుదేఱి యయిదేండ్లవాఁడ నయిన నేనును నాతల్లియు పెదతల్లియు నొకపల్లకిలోఁ గూరుచుండి పోవుచుంటిమి మాతల్లులు తమయిరువురి నడుమను నన్నుఁ బరుండఁబెట్టుకొనిరి. ఇట్లు కొంత దూరము ప్రయాణము సాగినతరువాత మార్గమధ్యమునం దొకకాలువ దాఁట వలసి వచ్చెను. అప్పు డాకాలువలో ఱొమ్ములలోఁతు నీరు బాఱుచుండెను. లోపలివారికి నీరు సోఁకకుండునట్లుగా బోయలు పల్లకిని చేతులపై నెత్తుకొని నీటిలో దిగి నడచుచుండిరి. ఆసమయమునం దెట్లో నేను నాతల్లిపైనుండి దాఁటి కాలువలోఁబడి ప్రవాహవేగమునఁ గొట్టుకొనిపోవుచుంటిని. పల్లకిలో నున్నవారు నేను నీటిలోఁ బడుట కనిపెట్టనే లేదు. పల్లకిని మోయుచున్న బోయవాఁ డొకఁడు చూచి పల్లకిని విడిచి పరుగెత్తి, యొక్కమునుక వేసి కొంచెము నీరు త్రాగియున్న నన్నుఁ బట్టుకొని పైకిఁదీసి పల్లకిలోని నా తల్లులకొప్పగించెను. మృత్యుముఖమునఁ బడి వెలువడినది యీ జలగండముతో నిది మూఁడవసారి. ఇట్లిన్ని సారులు పరమేశ్వరుఁడు తననిర్హేతుకజాయమాన కటాక్షముచేత నన్న కాలమృత్యువునుండి రక్షింప ననుగ్రహించుటను నేను బొత్తిగా వ్యర్థము చేయలేదని దీనిం జదువువారు భావింపఁగలిగెడుపక్షమున నన్ను నేను ధన్యతమునిగాఁ బరిగణించుకొనెదను.

కొంతకాలము నా పెదతండ్రిగారగు వేంకటరత్నముగారు రాజమహేంద్రవరములోనే పనిలోనుండిరి. అక్షరాభ్యాసమైన తరువాత నేను మొట్ట మొదట మాయింటికిన్నూఱుగజముల దూరములోనున్న గోపాలస్వామి యాలయములో నుండిన యొక చదువులబడికిఁ బంపఁబడితిని. ఆబడిపంతులయిన పులిపాక అమ్మిరాజుగారు తొఱ్ఱినోటివాఁ డగుటచేత నాతఁడు ముక్కుతో మాటాడెడివాఁడు. ఆయనయొద్ద నేమి నేర్చుకొంటినో నే నిప్పుడు చెప్పలేనుగాని గురుఁడెట్టివాఁడో శిష్యుఁ డట్టివాఁ డగునన్న న్యాయముచేత గురువుగారి ముక్కుమాటలు నేర్చుకొన్నాననిమాత్రము నేను నిశ్చయముగాఁ జెప్పఁగలను. ఆయనమాటలను జూచి వెక్కిరించుచు వచ్చుటచేత నా కట్టి దురభ్యాసము పట్టుపడియుండును. ముక్కుతో మాటాడుట మానివేయవలసినదని తరువాత నా పెదతండ్రిగా రనేకపర్యాయములు నాముక్కు నలుపుచు వచ్చుట నాకెప్పటికిని మఱపునకు రాదు. చిన్న నాఁటి యాముక్కు మాటలు నాకు మఱికొన్ని సంవత్సరములకుఁగాని పూర్ణముగాఁ బోలేదు. ఏ దురభ్యాస మయినను మొదట వచ్చుట సులభముగాని తరువాతఁ బోవుట యంత సులభము కాదు. ఆలోచన లేని బాల్యదశయందు దురభ్యాసము లవలీలగా నలవడును. కాఁబట్టి బాలురు తామేదురభ్యాసములను జేసికొనక మిగుల జాగరూకులయి యుండవలెను. ఆరంభదశలో నత్యల్పమయిన దనుకొన్న దురభ్యాసమే కాలక్రమమున బలపడి కొంతకాలమునకు స్వభావమయి కడపట మార్చుకొనుట కెంతోకష్టసాధ్య మగును. బాలుర తోడివా రేమి చేయుదురో దానిని దామును జేయఁ జూతురు. పొడుమును పొగచుట్టయు నలవాటగుట యీవిధముగానే. ఈయనబడిలో నే నక్షరములును, గుణితమును, ఎక్కములును నేర్చుకొని పుస్తకము పట్టియుందును. అల్పకాలములోనే యీయయ్యవా రిహలోకయాత్రను విడిచినందున, తదనంతరము మా యింటికిసమీపమున తిరుమెళ్లవారిలోపల నున్న సోమరాజుగారి బడికి మా వారు నన్నుఁ బంపిరి. గూనివాఁ డగుటచేత నీయనను గూని సోమరాజుగారని సాధారణముగాఁ బిలిచెడివారు. ఈయన మొదటిపంతులవలెఁ గాక తెలుఁగు నందుఁ గొంత పాండిత్యము గలవాఁడయి పిల్లలచేత పెద్దపుస్తకము (పురాణము) నుగూడఁ జదివించి యర్థము చెప్పుచు వచ్చెను. నాచేతఁ బ్రథమమున నర్థసహితముగా బాలరామాయణమును నమరనిఘంటువును చదివించిరిగాని యాసంస్కృతగ్రంథపఠనమువలన నా కప్పు డంతగా లాభము కలుగ లేదు. అటుతరువాత వాచకమును వ్రాఁతయుఁ గాక రుక్మిణీకల్యాణమును, సుమతి శతకమును, కృష్ణశతకమును, ఆంధ్రనామసంగ్రహమును, నాచేత రోఁకటి పాటగా వల్లెవేయించిరి. నేను వీధిబడులలో నేర్చుకొన్న దంతయు నింతే. ఇంతటితోఁ దెలుఁగుచదువు పూర్తియైనదని మావారు నన్ను బడి మానిపించి రాజకీయోద్యోగమునకుఁ గావలసిన పనిని నేర్చుకొనుటకయి తాలూకా కచేరీలో గుమాస్తాగా నున్న మాబంధువులగు పోతరాజు రఘురామయ్యగారి యొద్ద నన్నొప్పగించిరి. నేను ప్రతిదినమును మధ్యాహ్నమున మావీధి చివరనే యున్న తాలూకా కచేరికిఁ బోయి యాయన చెప్పినపని చేయుచుంటిని. ఈ ప్రకారముగా సంవత్సరమో రెండుసంవత్సరములో వ్యర్థము లయినవి. ఈకాలములో దూరి సోమయాజులుగారు ప్రాతఃకాలమునందు మాయింటికి వచ్చి నాకు రఘువంశమును జెప్పుచుండిరి; సాయంకాలమునందు మాపెద తండ్రిగారే నాకింగ్లీషక్షరములను, గుణితమును, మాటలను నేర్పుచుండిరి. ఆకాలమునందుఁ బరీక్షలు లేనందున, దొరతనమువారికొలువు నపేక్షించు వారు రాజకీయకార్యస్థానములకుఁ బోయి పని నేర్చుకొనుచు నధికారుల ననుసరించి తిరుగుచుండెడువారు. ఇంతలోహిందూదేశ రాజ్యనిర్వహణభారమును తూర్పిండియా సంఘమువారినుండి తప్పించి శ్రీమహారాజ్ఞిగారే స్వయముగా వహించినతరువాత దేశభాషలలోను నింగ్లీషుభాషలోను సామాన్య పరీక్షలును విశేషపరీక్షలును గొన్ని యేర్పఱుపఁబడినవి. అటుతరువాత నల్ప కాలములో నే 1860 వ సంవత్సరమున మావారు నన్ను దొరతనమువారి మండల పాఠశాల కింగ్లీషునేర్చుకొనుటకయి పంపిరి.

నే నింగ్లీషుపాఠశాలలోఁ బ్రవేశించునప్పటి కయినను దేహము దృఢపడి కండపుష్టిఁగలవాఁడనై యుండక పెద్దగాలివేసిన నెగిరిపోవునట్లు సన్నముగా పూచికిపుడకవలె నుండెడివాఁడను. ఇట్లుండుటకుఁ గొంతవఱకు మావారికి నాపయిఁ గల యతిప్రేమయే కారణమని చెప్పవచ్చును. అతిదయచేతనే నాతల్లియుఁ బెదతండ్రియు నాకన్నమును చిఱుతిండియు నధికముగాఁ బెట్టి నాజీర్ణాశయమును గొంతవఱకు దుర్బలపఱిచినారు; అతిదయచేతనే నాపితామహియు ప్రపితామహియు నన్ను గడప దాఁటనీయక చదువు విషయమున నాతల్లి యొకతిట్టు తిట్టినను నా పెదతండ్రి యొక దెబ్బకొట్టినను జగడమాడి యెత్తుకొని మోచి నాశరీరమును దుర్బలపఱిచినారు. అందుచేత నాకప్పు డజీర్ణ వ్యాధిచిహ్నములు పొడచూపుటయేకాక పీనసరోగ మొకటి క్రొత్తగా న న్నాశ్రయించినది. పడిసెముచేత దినమునకు వేయితుమ్ములు తుమ్ముచుండెడివాఁడను. ఈపీనసపిశాచి ప్రియతముఁడనైన నన్నీ వార్ధకదశ యందును విడిచి పోఁజాలకున్నది. మొత్తముమీఁద మావారందఱును స్వభావ దుర్బలమగు నాశరీర మెండ సోఁకినఁ గందిపోవు ననియు, ఆటలాడిన నలసి పోవుననియు, పనిచేసిన బడలిచిక్కి పోవుననియుఁ దలఁచి, దేహపరిశ్రమమున కవకాశమియ్యక యాటలకయినను విడువక సదా యిల్లు కదలనీయక యేదో వ్రాయుమనియో చదువుమనియో పనిచెప్పి యొకచోట నన్నుఁ గూరుచుండఁ బెట్టుచు వచ్చిరి. నిర్బంధించి చేయించుపనియం దెప్పుడును శ్రద్ధానురాగము లుండవు గనుకను, విరామము లేక సదా యొక్కపనినే చేయుచుండుట విసుఁగును బుట్టించును గనుకను, నాకు నియమింపఁబడిన పనియందు నేను శ్రద్ధాళువును గాక యుపేక్షాపరుఁడనై యుత్సాహశూన్యుఁడనై సర్వదా పని చేయుచున్నట్లే నటించుచు నెట్లో ముగించెడివాఁడను. చదువ నియమించిన పాఠము రెండుమూఁడుసారులు చదువునప్పటికే వచ్చినను, వ్రాయ నియమించినకాగితములు గంటలోనే ముగింపఁ గలిగినను, దినమంతయు చదువు చున్నట్టును వ్రాయుచున్నట్టును నటించుచు, చేతిలో పుస్తకమునో తొడమీద కాగితములనో పెట్టుకొనిమాటల కారంభించెడివాఁడను. నాతో మాటాడువా రెవ్వ రందు రేమో వినుఁడు. యథేచ్ఛముగా మాటాడుకొనుటకు బాలురకు బాలురేకావలసియుందురుకదా? మాయింట నితరబాలురులేరు. అందుచేతఁ బ్రధమ బాల్యావస్థలో నున్న నేను వార్ధక్య మనెడు ద్వితీయబాల్యావస్థలో నున్న నా ప్రపితామహి పరుండుగదిగుమ్మమువద్దఁ జేరి మెల్లఁగా నామెతో నేవో మాటలు వేయుచుండెడివాఁడను. కాలువిఱిఁగి సదా మంచముమీఁదనే పరుండి యుండెడి యామెయు కాలము జరగక నాతో నేదో పుక్కిటి పురాణము సేసి ప్రొద్దు పుచ్చుకొను చుండెడిది. ఈప్రసంగమధ్యమున మాయమ్మ యక్కడకు వచ్చి మేము కథలు చెప్పుకొనుచుండగా జూచిన పక్షమున, పాఠము నుపేక్షించుచున్నందునకు నన్నుఁ దిట్టి మాటలు పెట్టి నందునకు ముత్తవమీఁద కోపపడి, పోవుచుండును. ఆమె దాఁటిపోఁగానే మరల మేము మాలోకాభిరామాయణమును మొదలుపెట్టెడివారము. నే నింగ్లీషు నారంభించుటకు ముందే సంభవించిన యామె కైలాసప్రాప్తితో మా బాలవృద్ధకథా కాలక్షేపములు పరిసమాప్తి నొందినవి. బ్రాహ్మాణాచారాను సారముగా గర్భాష్టమునం దనఁగా నేడవయేటనే నాకుపనయనము జరగినది. నేను బ్రహ్మోపదేశమును బొందినది మొదలుకొని త్రికాలములయందును యుక్తసమయము నందు సంధ్యావందనము చేయుచు గాయత్రి నెంతో శ్రద్ధతో శతవారములు ప్రతిదినమును జపించుచుంటిని. సహస్రగాయత్రి చేసినదినములును గొన్ని కలవు. అప్పుడప్పుడు సాయంకాలముల గోదావరికిఁ బోయి యస్తమించుచున్న సమయములో సూర్యన కర్ఘ్యప్రదానము చేసి సంధ్యవార్చి ప్రదోషకాలమున మార్కండేయస్వామి యాలయమునకును వెనుక వేణుగోపాలస్వామి యాలయమునకును బోయి వచ్చు చుందును. త్రిరేఖలుదీర్చి దట్టముగా ముఖముమీఁదను ఱొమ్ముమీఁదను భుజములమీఁదను విభూతిపెండెకట్లు సవరించి, శుద్ధశ్రోత్రియునివలె బిళ్ళగోచి పెట్టి బట్ట గట్టుచుందును. ఒక్కప్రొద్దులును నుపవాసములును నుండలేకపోయినను, ఏకాదశినాఁటిరాత్రి ప్రొద్దుపోయినదాఁక మేలుకొనుటయేకాక యొక సంవత్సరము శివరాత్రినాఁడు జాగారముసహితము చేసితిని. ఏవానకాలపు చదువో యింట రఘువంశములో నైదుసర్గములు చదివియుండుటచేతను గూని సోమరాజుగారి బడిలో నాంధ్రనామసంగ్రహమును జదివి పురాణముల యర్థమును వినుచువచ్చుటచేతను గొంచె మర్థజ్ఞానము కలవాఁడనయి, మాయింట నున్న ప్రాఁతతాటాకుల పుస్తకములను దీసి చదువ నారంభించితిని. ఆకాలమునందు యుద్ధములను గూర్చియు తపస్సులను గూర్చియు చదువుట నాకెక్కువ యిష్టముగా నుండెను. ఋషులయొక్క మహిమలనుగూర్చి చదువునప్పుడు వారివలెఁ దపస్సు చేసి మహిమలు సంపాదింపవలెనని పలుమాఱు నాకు బుద్ధి పుట్టు చుండును. భారతములో నాకత్యంతప్రియము లగు భాగములు విరాటపర్వములోని యుత్తరగోగ్రహణమును భీష్మద్రోణకర్ణ శల్య పర్వములును. శ్రీమద్భాగవతములోని సప్తమస్కంధమును దశమస్కంధమును నాకుఁ బ్రియతమము లయినవి. మా పెదతండ్రిగారికి మునసబుకోర్టులో స్థిరమయినపనియయి యాయన గ్రామాంతరములయం దుండుచు వచ్చుటచేత నింట నొంటిగా నున్న నా కీగ్రంధపఠనాదుల కవకాశము కలిగినది. కాఁబట్టి నే నింగ్లీ షారంభించుటకుముందే నాకు ఛాందసవృత్తి బలియ నారంభించినది. నేను భక్తుఁడ నగుచున్నాఁడనని సంతోషించి నాతల్లి మొదలయినవారు నన్ను నిష్ఠాపరత్వమునుండి మరల్పఁ జూడక ప్రోత్సాహపఱుచుచు వచ్చిరి. ఎవ్వనికైన నొకవిషయమున నొకన్యూనత యున్న పక్షమున నింకొకవిషయమున నాధిక్యమును గలిగించి యీశ్వరుఁ డాలోపమును పూరించునని విద్వాంసులు చెప్పుదురు. ఈసత్యమును నాదృష్టాంతముచేఁ గొంతవఱకు స్థాపింపవచ్చును. ఆకాలమునందు నాకు దేహబల మెంత తక్కువగా నుండెనో బుద్ధిబల మంత యెక్కువగా నుండెనని చెప్పవచ్చును. నా కాపిన్న వయస్సునఁ గల గ్రహణ ధారణశక్తులసాధారణము లయినవి. అయినను నాకు వానివలన విశేషలాభము కలుగుటకు మాఱు గాఁ గొంతవఱకు నష్టియే కలిగినదని చెప్పవచ్చును.