Jump to content

స్వీయ చరిత్రము - ప్రథమ భాగము/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడవ ప్రకరణము.

ఉపాధ్యాయత్వ పత్రికావిలేఖకత్వప్రథమదశ.

క్రీస్తుశకము 1870 మొదలుకొని 1880 వ సంవత్సరమువఱకు.

బారోదొరగారు రోగపడి 1870వ సంవత్సరాంతమున రాజమహేంద్రవరమునుండి తమ ప్రధానోపాధ్యాయత్వమును కల్లికోటయందలి రాజకీయ పాఠశాలకు మార్చుకొని వెడలిపోయిరి. 1871వ సంవత్స రారంభమున ప్రథమశాస్త్ర పరీక్షతరగతి పెట్టఁబడినందున నేనందుఁ జేరి నాలుగైదుదినము లుంటినిగాని యింతలో బారోదొరగారికి బదులుగా కళ్లికోటనుండి వచ్చుచుండిన దొరగారు దారిలో స్వర్గస్థు లగుటచేత రాజమహేంద్రవరమునఁ బ్రథమశాస్త్రపరీక్షతరగతి యెత్తివేయఁబడెను. ప్రవేశపరీక్షయందుఁ గృతార్థుఁడ నైన కొన్ని నెలలలోనే 1871వ సంవత్సరము చైత్రమాసములో కాఁబోలును నేను రాజమహేంద్రవరమునందలి దొరతనమువారి మండలపాఠశాలలో నప్పటి ప్రధానోపాధ్యాయులయిన కుప్పుస్వామి శాస్త్రులవారి సాయమువలన నెల కిరువదియైదురూపాయల జీతముమీఁద సహాయోపాధ్యాయుఁడనుగా నియమింపఁబడితిని. అల్పకాలికమైన యాపని సంవత్సరకాల ముండి నిలిచిపోయినది. పనిలో నున్న కాలములో నేను గొన్ని తరగతుల కింగ్లీషును లెక్కలును హిందూదేశ చరిత్రమును చెప్పుచుండెడివాఁడను. ఆకాలమునందు సహితము నాయెడల విద్యార్థులకు భయభక్తులును సహోపాధ్యాయులకు గౌరవము నుండెను. నేను బాలురను నీతివర్తనమునందు ప్రోత్సాహపఱుచుచు, ఎవ్వరి విషయమునను పక్షపాతము చూపక, సమబుద్ధితో వర్తించుచుండెడివాఁడను. ఏలూరి లక్ష్మీనరసింహముగారు, దురిసేటి శేషగిరిరావు పంతులుగారు, వేపా కృష్ణమూర్తి పంతులుగారు మొదలయినవా రప్పుడు నాలవతరగతిలో నా వద్ద చదువుకొనుచుండెడివారు. ఇందలి కడపటివారి యన్న గా రయిన వేపా రామమూర్తి పంతులుగా రాకాలములో మాపాఠశాలలో ద్వితీయోపా ధ్యా యులుగా నుండిరి. అందుచేత తక్కినయుపాధ్యాయు లాయనతమ్ముఁ డొకవేళ తమతరగతిలో నల్లరి చేసినను చూచి చూడనట్లు పేక్షించి యూర కుండెడివారు. ఒకనాఁడు కృష్ణమూర్తిపంతులుగారు నాలవతరగతి నాయొద్దనున్నప్పు డేదో కొంచెమవిధేయతను గనఁబఱుపఁగా, నేనించుకయు సందేహింపక తత్క్షణమే యాయనను బల్లపై నెక్కించి నిలువఁబెట్టితిని. నాలుగైదు నిమిషములైనతరువాత నాతోడి యుపాధ్యాయుఁ డొకఁడు నావద్దకు వచ్చి, రహస్యమని చెప్పి నన్నావలికిఁ గొనిపోయి "యాచిన్నవాఁడు రామమూర్తి పంతులుగారి తమ్ము"డని చెప్పెను. "అవును. నేనెఱుఁగుదును" అని చెప్పి యచట నిలువక నాతరగతిలోనికి వచ్చితిని. నామిత్రుఁ డూహించినట్లుఁగా రామమూర్తిపంతులుగారు నాపైని కోపపడక, సాయంకాల మైదుగంటలకు పాఠశాల విడిచిపెట్టఁగానే నాయొద్దకువచ్చి, తనతమ్ముఁడని మోమోటపడక స్వకృత్యమును నిర్వహించినందులకు నన్నభినందించి తమకృతజ్ఞతను దెలిపిరి. శిక్షితులైన కృష్ణమూర్తిపంతులుగారు సహితము నాపైని గినుకపూనక యాదరము నే కలిగియుండిరనుటకు 1876వ సంవత్సరమునందు చెన్న పురి రాజకీయ శాస్త్రపాఠశాల (ప్రెసిడెన్సీ కాలేజి)లో ప్రథమశాస్త్రపరీక్షతరగతిలో చదువు కొనుచు చిరకాలమునకు తమంత నాపేరవ్రాసిన లేఖలో "భగవత్కృపచేత మీ రస్థిభారము వేసిన యల్పజ్ఞానమువలననే నే నీసంవత్సరము ప్రథమశాస్త్ర పరీక్షలోఁ దేఱవచ్చును. నాజీవితకాలములో మిమ్మెప్పుడును గౌరవింపకుండఁ జాలను" [1] అనునర్థము వచ్చునట్లు వ్రాయుటయే సాక్ష్యముగానున్నది. ఈ వఱకుఁ జెప్పినట్లు న్యాయసభలలో కొలువు కుదురఁగూడదని నేను శపథము చేసికొన్న తరువాత, సేవకవృత్తిలేక స్వతంత్రుఁడనుగా నుండవచ్చునన్న యా శతో నాకు న్యాయవాదియై పనిచేయవలెనని కోరికయుండెడిది. అందుచేత నేను దానికిఁ గావలసిన పరీక్షలకుఁ జదువ యత్నించితిని. మండలపాఠశాలలో నాతో సహోపాధ్యాయుఁడును బాల్యములో నాసహాధ్యాయియు మా బంధువును నగు చల్లపల్లి బాపయ్యపంతులుగారు నాకు పరమమిత్రుఁడుగా నుండెను. పాఠశాలలో నుపాధ్యాయులుగానున్న కాలములో మే మిరువురమును గలసి విశేషపరీక్షలకుఁ జదువ నారంభించితిమి. 1871వ సంవత్సరము శ్రావణమాసములో జరగిన దండశాసనోన్నతపదపరీక్ష (Criminal, Higher Grade)కు మే మిరువురమును బోయితిమి. మేమాపరీక్షలో లబ్ధ విజయులమైనట్టు మఱుసటి సంవత్సరమునం దనఁగా 1872వ సంవత్సరమున్ రాజకీయ వ్యవహారపత్రికయందుఁ బ్రకటింపఁబడినది.

ఈకాలమునాటికి నాపూర్వవిశ్వాసములు కొన్ని మార్పు చెందుచుండినట్టు చెప్పియుంటినిగదా. దయ్యములు పట్టినవన్న వారియిండ్లకుఁ దఱుచుగాఁబోయి వారిచేష్టలను నటనలను లక్షణములను పరీక్షించుచుండుటచేతను మంత్రవేత్తల మనువారు చేయుకుతంత్రములను మాయలను శోధించుచుండుటచేతను భూతావేశమునందు నాకు నమ్మకముపోయినది. ఈకాలమునందు జ్యోతిశ్శాస్త్రములోని ముహూర్తజాతకభాగములయందును, శకునములు మొదలైనవానియం దునుగూడ నాకు విశ్వాసము పూర్ణముగా చెడినది. నమ్మకములేనివానిని పామరుల సంతుష్టికై నమ్మినట్లు నటించి యాచరించుచుండుట సాధారణముగా నాస్వభావమునకు సరిపడదు. విశ్వాసములేని దానియందు విశ్వాసములేనట్టు చెప్పుటయు, ఆవిశ్వాసరాహిత్యమును మాటలచేతనేగాక చేష్టలయందును జూపుటయు, నాకు స్వాభావికము. నాయవిశ్వాసమును లోకమునకుఁ జూపుటకును నాకవకాశము శీఘ్రముగానే కలిగినది. మాదొడ్డిలోనున్న యరఁటి చెట్టొకటి యే హేతువుచేతనో కొననుండివేయక నడుమనుండి చీల్చుకొని పువ్వుపైకివచ్చి గెలవేసినది. ఇట్లు చెట్టుమధ్యనుండి గెలవేయుట యరిష్టసూచక మనియు, వెంటనే చెట్టు కొట్టివేయవలసినదనియు, ఇరుగుపొరుగులవారును దైవజ్ఞులును బంధువులునుగూడ నాతో బహువిధములఁ జెప్పిరి. ఎవ్వ రెన్ని విధములఁ జెప్పినను వారిమాటలు చెవినిబెట్టక యేమిజరగునో చూతమని యాచె ట్టట్టే యుంచితిని. ఆరంభదశలోఁ గొంతకాలము గుంపులుగుంపులుగావచ్చి జను లావింతనుజూచి పోవుచువచ్చిరి. కొన్ని నెలలకు కాయ లెదిగి కూరకక్కఱకువచ్చినతరువాత కాయలు కోసికొని దూటనిమిత్తము చెట్టు కొట్టివేయించితిని. ఆసమయమునందే మాయింటిదూలముయొక్క కొన నున్న తొఱ్ఱలో తేనె పట్టుపట్టెను. ఇంట తేనెపట్టుపట్టఁగూడదనియు, అట్లు పట్టుట యశుభసూచకమనియు, దానిని తీసివేయించి దోషపరిహారార్థముగా బ్రాహ్మణులచేత శాంతికర్మ చేయింపవలసినదనియు, ఎల్లవారును పై యట్లే చెప్పిరి. పై యట్లే మొండొడ్డి యెల్లవారిహితబోధలను నిరాకరించి చలింపక చట్టువలె నిలిచితిని. నాతల్లియు ముత్తవయుఁగూడ నాతోఁ జెప్పిచూచిరి గాని యీబండవానితోఁ జెప్పినకార్యము లేదని తుదకు విసిగియూరకుండిరి. మండలపాఠశాలలోని పని నిలిచిపోయినతరువాత నాకు 1872వ సంవత్సరము జ్యేష్ఠమాసములో కోరంగియను గ్రామమునందుఁ గల యింగ్లీషుపాఠశాలలో నెలకు ముప్పదిరూపాయల జీతముగల ప్రధానోపాధ్యాయత్వము లభించినది. ఆపనికిఁ బోవునప్పుడు మంచిదినముచూచి మంచి ముహూర్తము పెట్టుకొని పొమ్మని యితరులును మావారునుగూడ నన్ను బలాత్కారము చేసిరి. వారి నిర్బంధమును లక్ష్యము చేయక యమావాస్యనాఁడు బైలుదేఱిపోయి పనిలోఁ బ్రవేశించితిని. ఆపాఠశాలకుఁ గార్యనిర్వాహకులుగానున్న యిరువురిలో నొకరు మాతాతగారియొద్ద కొలువులోనుండిన యాతనికుమారుఁడును చుట్టమును సముద్రశుల్క పర్యవేక్షకుఁడును (Sea Custom Superintendent) అగు బలిజేపల్లి నారాయణమూర్తిగారు. పోఁగానే నేను వారియింట నే దిగితిని. అమావాస్యనాఁ డేల బైలుదేఱితివని నన్నాయన యడిగెను. ఈశ్వరుఁడు చేసిన దినములన్నియు సమానముగానే మంచివయినప్పు డేదినమున బైలుదేఱిన నేమని నేను బదులుచెప్పితిని. అందుపైని జ్యోతిశ్శాస్త్రవిషయమున మా యిరువురకును వాదమయ్యెను. ఇట్లావిషయమునఁ గొన్ని దినములు వితర్కము జరుగునప్పటి కాయన యేఁబదియేండ్లు దాఁటిన వృద్ధుఁడే యైనను, ఆయనకు సుముహూర్తాదులయందలి నమ్మకము ముక్కాలుమువ్వీసము పోయినది.

1870వ సంవత్సరమునందే "గోదావరీవిద్యాప్రబోధిని"కి నేను వ్రాయుచుంటినని తెలిపియున్నాను. కోరంగికిఁ బోకపూర్వము నేను రాజమహేంద్రవరములో నుండినప్పుడే మచిలీ బందరునందలి పురుషార్థప్రదాయినికి గ్రంథములు వ్రాసి పంపనారంభించితిని. నాపద్యకావ్యముల ననేకులు శ్లాఘించి యాకాలమునందలి వార్తాపత్రికలలో వ్రాసియున్నారు. నే నప్పటికి శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచననైషధమును, రసికజనమనోరంజనుమును, ముగించి శుద్ధాంధ్రోత్తరరామాయణమును జేయ నారంభించియుటిని. నా గ్రంధరచనను గూర్చి యింకొక ప్రకరణమునందు వ్రాయఁదలఁచుకొంటినిగాన దాని నిందు విడిచిపెట్టెదను. కోరంగికిఁ బోయినతరువాతఁగూడఁ బురుషార్థప్రదాయినికి వ్రాయుచునే యుంటిని. నేను రచియింప మొదలుపెట్టిన యచ్చ తెలుఁగు సభాపర్వములోని కొంతభాగము బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నముపంతుల వారిచేఁ జెన్న పట్టణములోఁ బ్రకటింపఁబడుచుండిన యాంధ్రభాషాసంజీవనిలోఁ బ్రచురింపఁబడినది. నేనక్కడనున్న కాలములో విశేషపరీక్షలలో నొకటియగు రెండవతరగతి భాషాంతరీకరణపరీక్ష (Translation, Lower Grade)కు 1872వ సంవత్సరము ఆశ్వయుజమాసములో ఇంగ్లీషు తెలుఁగు భాషలయందుఁ బోయి కృతార్థుఁడనైతిని. మొదటితరగతి భాషాంతరీకరణ పరీక్షకుఁ బోవువారు రెండుదేశభాషలను నేర్చియుండవలెను. ఒక్క యల్పాంశము తక్క నే నచ్చటనున్న కాలములో విశేషముగాఁ జెప్పవలసినదేదియు లేదు. నాతల్లికి పిశాచభ్రమ యుండుచువచ్చెనని మొదటిప్రకరణముననే చెప్పితిని. ఆమె కాభ్రమము పూర్ణముగాఁ బోవక మరణకాలమువఱకు నప్పుడప్పుడు కలుగుచునే యుండెడిది. కాని నేను దయ్యములవిషయమునఁ దఱచుగా సంభాషించుచువచ్చుటచేత 1876 సంవత్సరమునకుఁ దరువాతమాత్రము కలుగలేదు. అట్టిభ్రమకలిగినప్పుడు తన్ని వారణార్థమై భూతవైద్యుఁ డను వాని నెవ్వనినో పిలిపించి తత్కాలమున కేదో తంత్రము చేయించుచు వచ్చినంగాని కార్యము లేకుండెను. కోరంగిలోనున్న కాలములో సహితము నా మాత కట్టిభ్రమము కలుగుచు నేవచ్చెను. అక్కడివారు గొప్పభూతవైద్యుఁడని నాయొద్ద కొకయోగిని గొనివచ్చిరి. ఆ బ్రాహ్మణయోగి మిక్కిలి కండపుష్టి గలవాఁడు; పూటకు సేరుబియ్యపు అన్నమునకు తక్కువ కాకుండ తినెడువాఁడు; గడ్డమును గోళ్ళును బెంచినవాఁడు. కాలికి కఱ్ఱపావలు తొడిగి, చేత బెత్తమునుబట్టి, కాషాయవస్త్రములనుగట్టి, నొసట గొప్పకుంకుము బొట్టుపెట్టి, చూచుటకు మహాభయంకరముగా నుండెడివాఁడు; గంజాయి త్రాగెడువాఁడు; ముప్పదికిని నలువదికిని నడిమిప్రాయముగల యాపురుషుని నావద్దకుఁ గొనివచ్చినప్పుడు నాకు మంత్రములయందుఁ గాని దయ్యములయందుఁగాని నమ్మకము లేకపోయినను, నే నాతని మాయింట నుంచుకొని భోజనము పెట్టెదననియు, నాతల్లిదేహము స్వస్థపడినతరువాత మంచి బహుమానము చేసెదననియు, చెప్పితిని. ఆతఁ డందున కొప్పుకొని మాయింటఁ బ్రవేశించెను. ప్రవేశించినది మొదలుకొని యతఁడు 'మే' మని స్వవిషయమున బహువచనప్రయోగము చేసికొనుచు, 'నీ' వని యితరులవిషయమున నేకవచనప్రయోగము చేయుచు, గర్వము చూపఁ దొడఁగెను. నేను దాని కోర్చుకొని యాతఁ డడిగినదాని నెల్ల స్వల్పమగుటచేత నిచ్చుచువచ్చితిని. అందుపైని నేను దనకులోఁబడితి ననుకొని యంతకంత కత్యాశాపరుఁడయి యతఁడు పెక్కు మిషల మీఁద నావద్దనుండి ధనము లాగఁజూచెను. నాతల్లిశరీరము స్వస్థపడినపిమ్మటఁ గాని నేనేమియు నియ్యనని నిరాకరించితిని. అప్పుడతను కన్ను లెఱ్ఱ చేసి నావంక క్రూరదృష్టితోఁ జూచెను. నేను భయపడక యాతనియవివేకమును తలఁచినప్పుడు నవ్వు రాఁగా పకపకనవ్వితిని. అందుమీఁద నతఁడు మఱింత రోషము వచ్చినవాఁడయి కాఱులు ప్రేల నారంభించెను. అప్పుడు నేనును పట్టరాని కోపము గలవాఁడనయి చేరువనున్న మాపాఠశాలభటునిచేత మెడ పట్టించి యాయోగీశ్వరుని వీధిలోనికి గెంటించితిని. అతఁడు దండతాడితభుజంగమువలె రోఁజుచు, నన్ను శపించుచు, ఏమి చేసెదనో రేపీ వేళకు చూడుమని బెదరించుచు, వేఱొకచోటికిఁ బోయెను. అట్లు పోయి యతఁ డొక యింట నొకగది పుచ్చుకొని యలికి మ్రుగ్గుపెట్టి యం దేదోయంత్రము వేసి, ప్రయోగముచేసి నన్ను చంపెదనని పలుకుచు, స్నానముచేసి తలవిరయఁబోసికొనివచ్చి యుపవాసముతోఁ గూర్చుండి నిష్ఠాపరుఁడై యేదోమంత్రజపము చేయనారంభించెను. అది చూచి, నామిత్రులు భయపడి నాయొద్దకు వచ్చి, అట్టియభిచారవేత్తతో తగవులాడుట క్షేమకరము కాదనియు, తమమాట విని యాతనిపాదములమీఁదఁ బడి వేఁడికొని చేసిన యపచారమునకై క్షమార్పణము చేయవలసినదనియు, నాకు హితము చెప్పిరి. వా రెన్ని విధములఁ జెప్పినను వారిమాటలు వినక, ఆమూఢుఁడు నన్నేమి చేయఁగలఁడో చూతమని చెప్పి, వచ్చినవారిని వచ్చినట్టే పంపి వేసితిని. ఆయోగి రాత్రివఱకును భోజనములేక కొబ్బరికాయలనీళ్లు త్రాగి యట్టే యుండి యొంటిగా చీఁకటిలో "హ్రీం" "హ్రాం" అని కేకలు వేయుచుండెను. అతఁ డర్థరాత్రముదాఁక నట్లే యుండి యాహారము లేకపోవుటచేతనో నారికేళజలము పైత్యము చేయుట చేతనో నిద్రమత్తుచేతనో గంజాయిమైకముచేతనో మఱి యేహేతువుచేతనో తూలి క్రిందఁ బడిపోయి, తన్నెవ్వరో త్రోచిపడవేసినట్టు భ్రమించి జడిసికొనెను; భీతిచేత నాతనికి వెంటనే భయజ్వరము వచ్చెను. ఒకరిని జడిపింపఁ బోయి తానే జడిసికొన్నట్లు మఱునాటి ప్రాతఃకాలమునఁ దన్నుఁ జూడవచ్చినవారితో నెల్లను నేను శరభసాళ్వమును దనమీఁధఁబ్రయోగము చేసితి ననియు, ఆదేవత వచ్చి తాను బంపుచుండిన దేవతనెత్తి యడఁచి తన్నుఁ గ్రిందఁ బడవేసె ననియు, ఆదేవత తన్ను శీఘ్రముగానే చంపు ననియు, ఆయోగి చెప్పసాగెను. నాకు మంత్రమహిమయందలి విశ్వాసము పోయినతరువాతనే నాతల్లియొక్కభ్రమను నివారించునిమిత్తమయి నేను శరభసాళ్వ మంత్రము నుపదేశ మయితిని. ఆసంగతి నంతకుఁ బూర్వమే యాయోగి విని యుండి యిట్లు బ్రమసియుండును. నేను రెండుదినము లుపేక్షించి యూరకుంటినిగాని యతఁ డంతకంతకు బలహీనుఁడయి సంధిలో నన్నే పలవరించు చుండినట్టు విని జాలినొంది, ఆతనిభ్రమ పోఁగొట్టుటకయి యాతనియొద్దకుఁ బోయి నే నేమియుఁ జేయలేదని నమ్మఁ బలికి ధైర్యము చెప్పి, ఆతనిని మా యింటికిఁ గొనివచ్చితిని. ఈ నాలుగుదినములలోనే యేనుఁగువంటి వాఁడు పీనుఁగువంటివాఁ డయి యా దయ్యాలపోతుబ్రాహ్మణుఁడు మాయింటికి వచ్చిననాఁ డరసోలెడుబియ్యపు అన్నమునైనను తినలేకపోయెను. క్రమక్రమముగా నన్న హితము కలిగి యతఁడు యథాస్థితికి వచ్చుటకు నెలదినములు పట్టినది. తమమంత్రములయందు పటిమ లేదని యెఱిఁగి ధనార్జనమునకయి మాయ వేషములు వేసి పరులను మోసపుచ్చుచుండువారు సహిత మితరుల మంత్రముల యందు పాటవము కలదని నమ్ముచుందురు. అతఁడు పూర్ణముగా స్వస్థపడిన తరువాత నాతని కొక క్రొత్తబట్ట కట్టఁబెట్టి యొకరూపయ రొక్కమిచ్చి పంపి వేసితిని. శరభసాళ్వమంత్రము నెఱుఁగ నపేక్షించువారు నారాజశేఖర చరిత్రమునందుఁ జూడవచ్చును.

1874 వ సంవత్సరమునం దాషాడమాసమున నేను కోరంగిలోని పనిని విడిచి, నాస్వస్థలమగు రాజమహేంద్రవరమునకు నాలుగుమైళ్ల దూరములో నున్న ధవళేశ్వరమునందలి యాంగ్లోదేశభాషాపాఠశాలలో నెలకు రు 44-0-0 ల జీతము గల ప్రధానోపాధ్యాయత్వమునందుఁ బ్రవేశించితిని. ఇక్కడ నున్న కాలములో సహితము బ్రహ్మశ్రీ - కొక్కొండ వేంకటరత్నము పంతులవారును వారిపక్షమువారును స్త్రీవిద్యానిషేధవాదులయి, స్త్రీల విద్యకుఁ బ్రతికూలముగా నాంధ్రభాషాసంజీవనిలో వ్రాయుచుండఁగా, నేను వారికిఁ బ్రతిపక్షమును బూని స్త్రీవిద్యావిధాయకవాది నయి వారివాదమును ఖండించుచు స్త్రీలవిద్య కనుకూలముగాఁ బురుషార్థప్రదాయినికి వ్రాయుచుంటిని. ఈ వాదప్రతివాదములలో నాయుత్తరములను గొన్నిటిని పద్యరూపమునసహితము వ్రాసితిని. అప్పటి నాపద్యము లెట్లుండునో తెలియుటకయి యొక లేఖ నుండి కొన్ని పద్యముల నిం దుదాహరించుచున్నాను.

            శా. శ్రీమార్తాండమరీచిరోచి యనఁ గాఁ జెన్నై దివాంధావళిం
                భ్రామన్ గ్రాల్పురుషార్థదాయినిపతీ ! పద్యాళి సంజీవనిన్
                శ్యామాలోకము కెల్ల విద్య వలదం చష్టావధాన్యాహ్వయుల్
                తా మీమాసము వెల్ల డించుటలు మోదం బొప్ప వీక్షించి తే ?

            చ. మునుపటివారు చెప్పినది మొక్కలపున్మది పూని సర్వముం
               గొనఁ జనదంచు నామతముకూడ లవంబును గాదు, కాని యెం
               దును మనబుద్ధికూడఁ గడుఁ దూరిచి యారయుచుంట ముఖ్యమై
               చనును హితహితంబులపసల్ గని దుష్కృత ముజ్జగింపఁగన్.

           మ. అయినన్ ముద్దియవిద్దియంగుఱిచి యెందై నం దగం దొంటియా
               నయవేదుల్ తగదంచు వాదములు పూనం గంటిమే మీవలెన్ ?
               దయ మీఱంగను జెప్పుఁ డయ్య యలసిద్ధాంతంబు లెందైన మీ
               నయనానందము చేసెనేమొ వినఁగన్ గౌతూహలం బయ్యెడున్.

           ఉ. వింతగ వాద మేల యవివేకులపోలిక ? స్త్ర్రీలవిద్య సి
               ద్ధాంతమె చేసినారు మనతద్ జ్ఞులు పూర్వులు ; వేద మొక్క టే
               యింతులు చూడఁ గూడ దని రింతె ; పురాణచయంబు స్త్రీలకై
               యెంతయుఁ జేయుటల్ స్మృతులు నెల్లపురాణము లొత్తి చెప్ప వే.

మనవారు సాధారణముగా యుక్తియుక్తముగాను సప్రమాణము గాను వాద ప్రతివాదములుచేయుట మాని నడుమ వక్తవ్యాంశమును విడిచి యన్యోన్యదూషణమునకు దిగుదురు. స్త్రీవిద్యానిషేధవాదులు స్వవాద దౌర్బల్యమునుబట్టి కాఁబోలును ముందుగాఁ బ్రతివాదిదూషణమున కారంభించిరి. అప్పుడు నేనును సైరణ వహింపక స్వాభావికా గ్రహమునుబట్టియు యౌవనాహంకారమునుబట్టియు విజిగీషాదురతిశయమునుబట్టియు ద్విగుణముగా దూషణమునకుఁ బ్రతిదూషణముచేయఁ గడఁగితిని. పంతులవారు ప్రయోగించిన వాక్ప్రహరణము మృదుత్వము కలదిగాక మోటయి పైని బండదెబ్బకొట్టునదిగా నుండెడిది; నాది కొంతమార్దవము కలదగుటచేత వాఁడియయి లోఁతుగాఁ దూఱి మనస్సిన కెక్కువ నొప్పి కలిగించునదిగా నుండెడిది. ఆయన కృతివిమర్శనీ సమాజమని పేరుపెట్టి తామే మద్విరచితగ్రంధదోషాణ్వేషణమునకు దిగఁగా, నేను గుణాగుణప్రదర్శనీసమాజ మని పేరుపెట్టి తద్విరచితగ్రంథదోషాణ్వేషణములకుఁ గడఁగితిని. అప్పుడు క్రొత్తగా మిత్రులు గా నేర్పడిన బయపునేడి వేంకటజోగయ్యగారు మొదలయినవారు కొందఱు నా కీవాదమునందు సహాయు లయియుండిరి. ఈవాగ్యుద్ధమునందు సహితము నే నే జయ మొందితినని యప్పటివారనేకు లభిప్రాయపడినను, అప్పటి నా వ్రాఁతలు చూచిన నిప్పుడు నాకే సిగ్గగుచున్నది. నన్నెంద ఱెన్ని దూషణములు చేసినను, ఎన్ని పరిహాసములు చేసినను, ఈ కాలమునం దట్టివ్రాతఁలు వ్రాసియుండను. ఇరువురు తగవులాడుచుండఁగాఁ జూచుట పయివానికి వేడుకగానుండునుగాన, శుష్కకలహమును జంపివేయఁ జూడక యేదో పక్షముచేరి వివాదము పెంచుటకే పలువురు ప్రయత్నించుచువచ్చిరి. ఇట్లు పత్రికాముఖమున ఘోరవాక్కలహము నడచుచున్నను, పంతులవారును నేనును మనస్సులలోపల ద్వేషము లేనివార మయి పరస్పరసుహృద్భావముతో నుత్తరప్రత్యుత్తరములను జరుపుకొనుచునే యుండెడివారము.

1875 వ సంవత్సరమునందు నేను సంక్షేపలేఖన (Precis Writing) పరీక్షయం దింగ్లీషునఁ గృతార్థుఁడ నైతిని. ఈపరీక్షనిమిత్తము నేను రాజమహేంద్రవరమునకుఁ బోయి యుండినప్పుడే నా కచ్చటిరాజకీయ శాస్త్రపాఠశాలాధ్యక్షులగు మెట్కాపుదొరగారితోడి ప్రథమపరిచయము కలిగినది. ఆకాలమునం దాయన తెలుఁ గభ్యసించుచుండిరి. అప్పుడు వారి కేదో వాక్యార్థవిషయమున సందేహము కలుగఁగా, ఎవ్వరి నడిగినను తృప్తికరముగా తీర్పలేకపోయిరఁట. నే నాసందేహమును తీర్పఁగలనని యావఱకు కుప్పుస్వామి శాస్త్రులవారు చెప్పియుండుటచేత, పాఠశాలాభవనములో నేను పరీక్షాప్రశ్నముల కుత్తరములు వ్రాయుచుండఁగా వారిరువురును గలిసి నాయొద్దకు వచ్చిరి. దొరగారు తమసందేహమును దెలిపినప్పుడు నాకు తోచినసమాధానము చెప్పఁగా, వారత్యంతసంతుష్టులయి వెడలిపోయిరి. వారి కప్పుడే నాయందు మంచియభిప్రాయము కలిగెను. సంక్షేపలేఖనపరీక్షయందుఁ గృతార్థుఁడ నగుటచేత నే ననుగతదండధాయి (Sub - Magistrate) పదమున కర్హుఁడనైతిని. రైవిన్యాసోన్నత పదపరీక్ష (Revenue, Higher Grade) కుఁ బోయి జయ మొందినయెడల సహాయకరగ్రాహి (Deputy Collector) పదమున కర్హుఁడనయి యుందును. ఆపరీక్షకప్పుడు రెండేపుస్తకములై నను నే నాశాఖయందుఁ బ్రవేశింపఁదలఁచుకోనందున, ఆపరీక్షకుఁ బోలేదు. వ్యావహారికోన్నతపదపరీక్ష (Civil, Higher Grade) యందుఁ గృతార్థుఁడ నైనయెడల, మొదటితరగతి న్యాయవాదిత్వమునకును అనుగత న్యాయాధిపతి (Sub - Judge) పదమునకునుగూడ నర్హుఁడనయి యుందును. న్యాయవాదిని గావలెనని తలంపు గొనియున్నప్పు డాపరీక్ష కొకసారి పోయినను, తరువాత నామిత్రులైన న్యాయవాదులు కొందఱు తమపనిలోను నిజమైన స్వతంత్రత లేదనియు, అందు న్యాయముగాఁ బ్రవర్తించి ధనార్జనము చేయుట యసాధ్యమనియు, తాము స్వయముగా సాక్షుల కసత్యము బోధింపకపోయినను సత్యము కానట్టు తెలిసియు సత్యమయినట్టు వాదింపవలసి యుండుననియు, చెప్పినందున న్యాయవాదిపదమునందును రోఁత పుట్టి రెండవసారి యాపరీక్షకుఁ బోవమానుకొంటిని. ఏపనియు లేక స్వతంత్రజీవనము నైనను చేయవలెను, లేదా పాపకార్యముల కంతగా నవకాశము లేని యుపాధ్యాయత్వమునం దైనను ఉండవలెను, అని నే నప్పుడు నిశ్చయము చేసికొంటిని.

మొట్టమొదట స్త్రీ విద్యామండనవాదము నన్యపత్రికాముఖముననే జరపుచు వచ్చినను, నాయూహలను లోకమునకు వెల్ల డించుటకయి స్వకీయమైన వృత్తాంతపత్రికయొకటి యుండుట యుక్తమని భావించి, 1874 వ సం వత్సరము ఆశ్వయుజమాసము నుండి "వివేకవర్ధని" అను నామముతో నాలుగు పెద్దపుటలు గలయొక చిన్న మాసపత్రికను తెలుఁగునఁ బ్రకటింప నారంభించితిని. ఆకాలమునందు మా గోదావరి మండలములో దొరతనమువారిది తక్క వేఱు ముద్రాయంత్రము లేకపోవుటచేత నాపత్రిక నప్పుడు చెన్న పురిలో బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులవారి సంజీవ నీముద్రాక్షరశాల యందు ముద్రింపింప నారంభించి, అక్కడ యుక్తకాలమునందు పత్రిక వెలువడకపోవుటచేత మూడుమాసము లైనతరువాత శ్రీధరముద్రాక్షరశాలకు మార్చి పత్రికను ద్విగుణముచేసి 17 పుటలు గలపుస్తకరూపమునఁ బ్రకటింప మొదలు పెట్టితిని. మాపత్రికాముఖమునకు తిలకముగాను పత్రికానిర్వహణమునందు మాకు మార్గప్రదశ్శకముగాను ఉండుటకయి,

            క. ఒరు లేయని యొనరించిన, నరవర యప్రియము తనమనంబున కగుఁ దా
               నొరులకు నవి సేయకునికి, పరాయణము పరమధర్మపదముల కెల్లన్.

అను భారతనీతివాక్యరత్నమును మేము మాకు మూలసూత్రమునుగాఁ గై కొంటిమి. మాపత్రికయొక్క నామధేయమువలనను మేము గైకొన్న పురస్కృత వాక్యమువలనను మా పత్రికోద్దేశ మెల్లరకుఁ దెల్లము కాఁదగి యున్నను, చతుర్థమాస పత్రికాదియందు నన్నుఁ గూర్చియు నాపత్రికనుగూర్చియుఁ బ్రకటించుకొన్న పద్యమువలన మఱింత స్పష్టమగునని దాని నిందు క్రిందఁ బొందు పఱుచుచున్నాను.

            సీ. బ్రాహ్మణుండను హూణభాష నేరిచి యందు
                          నేఁ బ్రవేశపరీక్ష నిచ్చి నాఁడ !
               నాంధ్రముననొకింత యభిరుచిగలవాఁడ
                          దేశాభివృద్ధికై లేశమైన !
               బ్రాలుమాలక పాటుపడ నిచ్ఛఁగలవాఁడఁ
                          గవితాపటిమఁ గొంత గలుగువాఁడ !

                నోపిక సర్వజనోపయుక్తములైన
                        విషయమ్ములును నీతివిషయములును !

                సులభశైలి నందఱకును దెలియునట్లు
                కఠినసంధులు లోనుగాఁ గలవి విడిచి !
                వ్రాయుదు నొకప్పు డన్యదేశీయములును
                లోనుగాఁ గలవానినిఁ బూనికూ ర్తు.

ఈపత్రికాప్రకటనమునందు నాయుద్దేశములు భాషాభివృద్ధియు దేశాభివృద్ధియు ముఖ్యముగా రెండు. నే నేర్పఱచుకొన్న భాషాభివృద్ధి మార్గము తెలుఁగుభాషలో మృదువైన సులభశైలిని సలక్షణమైన వచనరచన చేయుట; దేశాభివృద్ధిమార్గము జనులలోఁగల దురాచారదుర్వర్తనములఁ బాపియు వృద్ధి పద్ధతులను జూపియు వారి నధిక నీతిమంతులను గాఁజేసి దేశము నున్నతస్థితికిఁ దెచ్చుటకయి శక్తివంచన లేక పాటుపడుట. దేశాభివృద్ధి కలుగుటకయి విద్యా విషయమునను, వ్యవహారవిషయమునను, కులాచార విషయమునను, నీతి విషయమునను, మతవిషయమునను నానాముఖములఁ గృషి చేయవలయుననియేకాని యొక్క రాజ్యాంగవిషయములయందే పనిచేయుట నాయుద్దేశము కాదు. మానవదేహములోని కరచరణాదిసమస్తావయవములును యథా ప్రమాణముగా పెరుగుటయే వృద్ధికాని యొక్కతలయో కాలో యత్యధికముగా పెరుగుట వృద్ధికాక రోగమయినట్లే దేశవిషయములోఁ గూడ జనులు నీతిమతకులాచారాదులైన సమస్తాంగములయందును సమానముగా నభ్యున్నతి నొందుటయే వృద్ధిగాని యితరాంగములకు భంగము కలుగునట్లుగా నొక్క రాజ్యాంగముల యందేగాని యొక్క బుద్ధిప్రచారమునందే గాని యుత్కర్షము నొందుట క్షేమకరమైన దేశాభివృద్ధికాదని నాయభిప్రాయము రాజ్యాంగవిషయమున నెక్కడనో దూరమున నున్న పరిపాలకులను వారిశాసనములను దూషించుటకంటె సమీపముననుండి రాజశాసనములను నడుపువారి దోషములను వెల్లడిచేయుట యథికప్రయోజనకరమని నానమ్మకము. దొరతనమువారికిఁ జెల్లింపవలసిన నేల పన్నుల మొత్తమునకంటె నీ రిచ్చెడు రాజపురుషుల కియ్యవలసిన లంచముల మొత్త మెక్కువయినప్పుడు నేలపన్ను కొంచెము తగ్గింపఁబడిన మాత్రముననే కాపుల కేమి మేలిమి కలుగఁబోవును ? వ్యాజ్యపు మొత్తమునకంటె న్యాయాధిపతికి సమర్పింపవలసిన యుపాయనమే యధికమయినప్పుడు వాది యభియోగపత్రమునకుఁ బెట్టవలసిన ముద్రకాగితముల మూల్యపరిమితి తగ్గింపఁబడిన మాత్రముననే గెలుపొందియు నతఁడేమి లాభ మనుభవింపఁ గలుగును ? చేసిన యపరాధమునకయి శిక్షాస్మృతినిబట్టి కట్టవలసిన ధనదండనమునకంటె దోషిని దండింపక విడుచుటకును నిర్దోషిని దండించుటకును దండవిధాయి స్వీకరించెడు ముడుపే యెక్కువయినప్పుడు దండశాసనములయందు మంచిమార్పులు కలిగింపఁబడిన మాత్రముననే నూనప్రాణరక్షణము కలవారయి ప్రజలెట్టు సుఖమనుభవింపఁ గలుగుదురు ? ఆకాలమునందు రాజకీయోద్యోగులలో లంచములు పుచ్చుకొనుట సర్వసాధారణము ; పుచ్చుకొను కుండుట మృగ్యము. లంచము తప్పుగాక యుద్యోగధర్మమనియె యెల్లవారినమ్మకము. కాఁబట్టి రాజకీయొద్యోగులలోని యీ యక్రమమును మాన్పఁ బూనుట మా పత్రికోద్దేశములలో నొకటి. లంచము లిచ్చెడు ప్రజలలోను పుచ్చుకొనెడి యధికారులలోను నీతిగౌరవము వర్ధిల్లక లంచము లడఁగవు. కాఁబట్టి జనులలో నీతి మానమును వృద్ధిచేయుట యింకొక యుద్దేశము. వేశ్యాగమవాదులు దురాచారము లని కులములో భావింపఁబడకుండునంతవఱకు నీతి యెట్లు తలయెత్తి వర్ధిల్లఁ గలుగును ? కాఁబట్టి కులాచారములను చక్కఁబఱుపఁ బూనుట మఱియొకయుద్దేశము. తులసీ రుద్రాక్షమాలాది బాహ్య చిహ్న ధారణమునకంటె సత్ప్రవర్తనము మతమున కధికావశ్యకమని జనులలో విశ్వాసము కుదురువఱకును మతము పరిశుద్ధమయి దురాచారనివారకము కానేరదు. కాఁబట్టి పరిశుద్ధమత సిద్ధాంతములను బోధించుట వేఱొకయుద్దేశము. ఇట్టిసదుద్దేశములతో మావివేకవర్ధని మొదటవెలువడినది. ఆస్తిక్యము, వివేకము, సత్యము, అహింస, మొదలైనవియే మొదటిపత్రికలయందు వెలువడిన యుపన్యాసములు. నే నప్పటికే బహుదేవతారాధనమును విడిచి యేకేశ్వరోపాసనమును బూనిన వాఁడనై యుంటిని. వివేకవర్ధని మొదటి మూడు పత్రికలనుండియు వరుసగా నొక్కొక్కటిచొప్పునఁ గైకొనఁబడిన యీక్రిందిపద్యములవలన నాపరిశుద్ధాస్తికభావము తేటపడవచ్చును -

           సీ. అక్ష్యాదిబాహ్యేంద్రియాగోచరుండయి
                      యాత్మస్వరూపుఁడై యలరువాఁడు !
              సచరాచరంబైన సర్వసృష్టికి నాది
                      కారణుండయి చాలఁ గ్రాలువాఁడు !
              దుష్టశిక్షణమును శిష్టరక్షణమును
                      నాత్మకృత్యములుగ నమరువాఁడు !
              సర్వజ్ఞుఁడయియుండి జనులెందుఁ గావించు
                      సుకృతదుష్కృతములఁ జూచువాఁడు !

              నిత్యుఁ డీశ్వరుఁ డభవుండు నిర్మలుండు
              నాదుపత్రికారత్నంబు నాదరమునఁ |
              బ్రబలఁగాఁ జేసి యెల్లెడ వాసి కెక్క
              నించు కంతదయ ననుగ్రహించుఁ గాత ! ||

           సీ. ఎవ్వనియిచ్చమై నెల్లజగమ్ములుఁ
                      గలుగుచు వెలయుచుఁ బొలియుచుండు |
              నెవ్వనికట్టడి నేప్రొద్దు విడువక
                      విన్నున ఱిక్కలు వ్రేలుచుండు |
              నెవ్వనిగొనముల నెంతవలంతులుఁ
                      గడముట్టఁ దెలియంగఁ గానకుందు |
              రెవ్వనియానతి నించుకైనను మేర
                      మీఱక సంద్రముల్‌మించి నిలుచు |

                నెవ్వఁ డాకసంబున నేల నెల్లనీళ్ల
                మెలఁగు పులుఁగుల మొగముల మీలగములఁ |
                దగినయోరెంబుఁ గలిగించి నెగడఁ జేయు
                నట్టిదేవర మమ్ముఁ జేపట్టుఁ గాత !||

            సీ. తనకృపారసవృష్టి దాసుల తాపంబు
                        లణఁగించి నెగడించుఘనుఁ డెవండు |
               తనదివ్య తేజంబునను భక్త జనతమో
                        ని చయంబు మాయించునినుఁ డెవండు |
               తనశీతలాలోకమునఁ గువలయమును
                        వెలయించుచల్లని వేలు పెవఁడు |
               తనజగద్వ్యాపకత్వంబుమై లోకాళిఁ
                        బాలించునలజగత్ప్రాణుఁ డెవఁడు |

               అట్టిపరమేశ్వరుండు దయాసముద్రుఁ
               డాదరాయత్తచిత్తుఁడై హర్ష మెసఁగ |
               మాదు విన్న ప మాలించి మఱచిపోక
               మమ్ము ననిశమ్మును భృశమ్ము మనుచుఁ గాత ! |

లంచములు తగవన్న, రాజకీయోద్యోగులకుఁ గోపము; వేశ్యాంగనా సంగము నీతి గాదన్న, శృంగారనాయకులకుఁ గోపము ; పూర్వాచారమును మార్చుకోవలెనన్న, పామరజనులకుఁ గోపము ; నీతిమాలిన బాహ్యవేషములు మతవిరుద్ధములన్న, ఆచార్య పురుషులకుఁ గోపము. మాపత్రికోద్దేశమును నిశ్శంకముగా నిర్వహింపవలసినచో నిన్ని కోపములను సరకు చేయకుండవలెను. తన మీఁదఁ బడినయీభారమును మావివేకవర్ధని కొంతవఱ కయినను నిర్వహింపఁ గలిగినదో లేదో ముందుముందు చెప్పఁబోయెడు దానినిబట్టి మాచదువరులే తమకుఁ దోఁచినయభిప్రాయముల నేర్పఱుచుకొందురు గాక !

స్త్రీవిద్యనుగూర్చి యాంధ్రభాషాసంజీవనిలోను పురుషార్థప్రదాయినిలోను వాదప్రతివాదములు నడుచుచుండినట్లు ముందే చెప్పఁబడెనుగదా. స్త్రీ విద్యా విషయక ఖండనవాద మాంధ్రభాషాసంజీవనిని విడిచిపెట్టక యందే నెగడుచున్నను మండనవాదము మాత్రము పురుషార్థప్రదాయినినుండి తరలివచ్చి వివేకవర్ధనిని జేరినది. పత్రికాముఖమున నిట్లు మాటలపోరాటము జరుగుచుండఁగా దానివాసన ధవళేశ్వరమునందలి మహాజనులనుగూడ సోఁకి శీఘ్రముగానే యావాదమును ఫలోన్ముఖమునకుఁ దెచ్చినది. నేను ధవళేశ్వరమునందు సభలు చేసి బాలికావిద్యాభ్యాసమువలని లాభములనుగూర్చి పలుమాఱు ప్రసంగించుచు రాఁగా, మొదట వృద్ధఘటములలోఁ గొంత ప్రాతికూల్యము పొడ చూపినను క్రమక్రమముగా నడుగంటిపోయి కడకక్కడిప్రముఖుల కనేకులకు బాలికలకు విద్య యావశ్యక మన్న నిశ్చయము కలిగెను. కర్తవ్యతావిషయమున దృఢనిశ్చయము కలిగినతరువాత కార్యారంభమునకు తడవుపట్టదుగదా. అందుచేత నక్కడిప్రముఖు లందఱును తమలోఁ దాము చందాలు వేసికొని, 1874 వ సంవత్సరము సెప్టెంబరు నెలలో నొక బాలికాపాఠశాలను స్థాపించి దానికి బ్రహ్మశ్రీ మల్లాది అచ్చన్న శాస్త్రులవారిని ప్రధానోపాధ్యాయులనుగా నేర్పఱిచిరి. మ-రా-శ్రీ దాసరి రామన్న నాయఁడుగారు నెలకు నాలుగు రూపాయలచొప్పునను, ద్రోణమురాజు కృష్ణయ్యగారు రెండురూపాయలచొప్పునను, గాదిరాజు ప్రకాశరావుగారు మొదలయినవారు రూపాయలచొప్పునను చందాలువేసిరి. అప్పుడట్లు చందాలతో స్థాపింపఁబడిన యాబాలికా పాఠాశాల తరువాత స్థానిక సంఘమువారి సంరక్షణమునకుఁ బాత్రమయి యిప్పటికిని నవిచ్ఛిన్నముగా జరగుచున్నది. పురుషులలో సహితము విద్య యత్యల్పముగా నుండిన యాకాలములో నొకచిన్నగ్రామములోనివారు చందాలు వేసికొని బాఠశాలను స్థాపించిరనుట కొంత వింతగానే తోఁచవచ్చును గాని సత్కృత్య ప్రభావమును దలఁచినప్పు డసాధ్య మేదియు లేదు.

స్త్రీవిద్యయొక్క యావశ్యకమును గూర్చియు బాలికాపాఠశాలాస్థాపనమును గూర్చియు మొదట సమకూర్పఁబడిన యాసభలే తరువాత మతవిషయములును నీతివిషయములును దేశక్షేమాభివృద్ధులకు వలయు నితరవిషయము లును మాటాడుచుండుటకై యొకస్థిరమయిన సమాజముగా నేర్పడి నే నక్కడ నున్నంతకాలమును ప్రతిభానువారమునాఁడును సభలు జరుగుచు వచ్చినవి.

నే నప్పుడు పద్యములను వచనమువలెనే యాశుధారగాఁ జెప్పఁగలిగెడివాఁడను. అందుచేత ధవళేశ్వరములోని నామిత్రులు కొందఱు న న్నష్టావధానము చేయవలసినదని కోరిరి. వారికోరిక నంగీకరించి నేను కాపురమున్న వీణమువారిలోపల నొకదినమున కతిపయమిత్రబృందసమక్షమున అష్టావధానము చేసితిని. నా కది ప్రథమప్రయత్న మే యైనను, చూచినమిత్రుల నద్భుత ప్రమోదములపాలు చేసినది. అష్టావధానవార్త నాఁడే గ్రామమునం దంతట వ్యాపింపఁగా, ఆయూరనున్న యుద్యోగస్థులు మొదలయినవా రందఱును తమకుఁ దెలియనందునఁ దా మాదినమునఁ జూడఁ దటస్థింప లేదనియు నొంకొకసారి యష్టావధానమును బహిరంగస్థలములోఁ జేసి చూపవలసినదనియు, నన్నుఁ బ్రార్థించిరి. వారిమాట తీసివేయలేక పయివారమున మాపాఠశాలా మందిరమునఁ జేసెదనని చెప్పితిని. ఆసంగతి యెట్లో రాజమహేంద్రవరమువఱకును వ్యాపించి యప్పుడు (1874 వ సంవత్సరమున) నామిత్రులగు బ్రహ్మశ్రీ వావిలాల వాసుదేవశాస్త్రి గారిచేత నిట్లుత్తరము వ్రాయించినది. -

             "గీ. రాజమాన్యులు మఱి రాజపూజితగుణు | లాంధ్రగీర్వాణకవితావిహార
                 కందు|కూరి వీరేశలింగముగారి కడకు | లీల ధవళేశ్వరంబున స్కూలులోన.

              క. అష్టావధాన మేమో | తుష్టిని మీ రందుఁ జేయుదురటంచును నా
                 యిష్టసఖునిచే వింటిని | స్పష్టము గాఁ దెలియఁజేయవలయుం జుండీ."

నేను సంస్కృతమునందుఁగూడ ననుష్టుప్‌శ్లోకములు చేయ నారంభించితిని గాని నా కాభాషయందలి పాండిత్య మత్యల్పమయిన దని భావించి తరువాత మానివేసితిని. మొదట మాయిరువురకును పద్యరూపముననే యుత్తర ప్రత్యుత్తరములు నడచెడికాలములో నే నాయనకు వ్రాసిన యొక యుత్తరమునందు రెండుసంస్కృతశ్లోకములు చేసి వేసినందున పయిపద్యములోని భ్రమ యాయనకుఁ గలిగినది. నేను జేసిన సంస్కృతశ్లోకములు కొన్ని మద్వి రచితబ్రాహ్మవివాహమునం దున్నవి. చేసిన వాగ్దానప్రకారముగా నిర్ణయింపఁ బడినదినమున మాపాఠశాలామందిరమునం దష్టావధానమును మొదటసారి కంటెఁ గొంచెము హెచ్చుగాఁ జేసితిని. అప్పుడు చేసిన యవధానములివి - 1. కవిత్వము, 2. వ్యస్తాక్షరి, 3. నిషేధాక్షరి, 4. సమస్యాపూరణము, 5. చతురంగవినోదము, 6. చీట్లాట, 7. సంభాషణము, 8. పుష్పపరిగణనము. కవిత్వము పదిమందికి వారువారు కోరినపద్యములో కోరినవిషయమునుగూర్చి యొక్కొక్కయక్షరము చొప్పున విడిచినయక్షరమును మరల నడుగకుండఁ జెప్పితిని. ఆంధ్రగీర్వాణభాషలలో ముప్పదిరెండేసి యక్షరములకు మించని పద్యభాగమును శ్లోకమును విడికాగితములమీఁద వ్రాయించి, అక్షరములపైని వరుసయంకెలు వేయించి, కత్తరించిన ముక్కలను కలిపివేసి కవిత్వము చెప్పునప్పుడు నడుమనడుమ నేదో యొకముక్క నిచ్చుచు రాఁగా కడపట నన్నిటిని జేర్చి మనసులో వరుసగా కూర్చుకొని వా రిచ్చినవాక్యములను జదివి రెండు భాషలలో వ్యస్తాక్షరి చెప్పితిని. చరణమొకటికి రెండేసితావులలో వారు నిషేధించిన యక్షరములు విడుచుచు వచ్చి యొక్కొక్కయక్షరము చొప్పునఁ జెప్పి పద్యమును పూరించితిని. వారు సమస్యగా నిచ్చిన పద్య పాదమున కనుగుణముగా నర్థము వచ్చునట్లాలోచించి యష్టావధానమధ్యమున నొక్కొక్కచరణము చొప్పునఁ బద్యము చేసి సమాస్యాపూరణము గావించితిని. ఈనడుమనే యింకొకమిత్రునితో చతురంగ మాడు చుంటిని; నడుమ నడుమ బంటునో మంత్రినో గుఱ్ఱమునో యేనుఁగునో రాజునో శకటమునో త్రోయుచు నేదో యెత్తువేయుచుండుటతప్ప చతురంగక్రీడయందు నా కేదియు కష్ట మగపడలేదు. చీట్లాటయు నిట్టిదేగాని వచ్చినపట్లలోనిసంఖ్య లెక్క పెట్టుటలో నించుక కష్టమున్నది. నే నొక్కయాటలోను లెక్క తప్పఁబెట్ట లేదుగాని నాయెదుటిపక్షమువారు వినోదము చూచుసందడిలో లెక్క మఱచిపోవుచువచ్చిరి. మధ్యమధ్య జరిగిన సంభాషణములో నెదుటివా రడిగినప్రశ్నలకు నేను సదుత్తరము లిచ్చుచు వచ్చితిని. ఈపను లన్ని యుఁ జేయుచుండిన కాలములోనే నావెనుక నొకరు కూరుచుండి నావీఁపు మీఁద, నప్పుడప్పు డొకపువ్వు వేయుచురాఁగా, ఆపుష్పములసంఖ్యయు సరిగానే చెప్పితిని. ఈపనియంతయు ముగియుటకు రెండుగంటల కాలము పట్టినది. అష్టావధానము చేయఁగలుగుట ధారణాశక్తిచేత ననుకోక సామాన్యజనులు మంత్రశక్తియని భ్రమించి, కాదని నామిత్రులు చెప్పినను నమ్మక, నాకుచ్ఛిష్టగణపతి యుపాసన యున్నదని నేను గోఁచి పెట్టుకొంటినో లేదో యని నా వెనుకకువచ్చి కొందఱు చూడసాగిరి. ఇది జరిగినతరువాత రాజమహేంద్రవరములోని మిత్రులక్కడఁగూడ జేయవలసినదని నన్నడిగిరి. అందు చేత నే నొకభానువారమునాఁడు రాజమహేంద్రవరమున విశాలమయిన మా యింటిచావడిలోనే యష్టావధానము చేసితిని. నే నష్టావధానము చేయుదు నన్న వృత్తాంతము పట్టణములోఁ దెలిసి జనులు గుంపుగుంపులుగా వచ్చి మూఁగఁ జొచ్చిరి. అప్పుడు తావు చాలక మావీధితలుపులు మూసివేయవలసి వచ్చినది. అష్టావధానము ముగిసినతరువాత తలనొప్పి వచ్చి యారాత్రి నే నెంతో బాధపడితిని. ఊరక పామరుల వేడుకకొఱకుఁ దక్క దీనివలన లోకమునకుఁ గాని నాకుఁగాని నిజమైనప్రయోజనము లేదని భావించి, తరువాత నెంద ఱెన్ని విధములఁ బ్రార్థించినను మేదస్సునకు వేదనాకరమైన యష్టావధానమును జేయ మానితిని.

మావివేకవర్ధని తన కాఱుమాసములు వచ్చినదిమొదలు గొప్పవారిలోని, దుర్నీతిని మాన్పుటకయి ప్రయత్నింప నారంభించినది. అప్పుడు మామండల న్యాయసభలో న్యాయవాదిగా నుండినవా రొక రొక వేశ్యకు కన్నెఱికము చేయఁగా, వివేకవర్ధని దానిని ప్రకాశపఱిచి యాఘనుని సిగ్గుపడునట్లు చేసినది. ఆరసిక పురుషుఁ డప్పటి కేమియుఁ జేయలేకపోయినను తన్న వమాన పఱిచినందునకు మనస్సులో ద్వేషము వహించి పగ తీర్చుకొనుటకయి సమయముకొఱకు వేచియుండెను. అట్లు ప్రతీక్షించుచుండిన సమయము సహిత మాపయినెలలోనే తటస్థించెను. యోగినిగాను భక్తురాలుగాను నుండి యొక సంపన్న గృహస్థునిచేత పూజింపఁబడుచుండిన యొక యామె తా నొక యేకాదశినాఁడు బొందెతో స్వర్గమునకుఁ బోయెదనని చెప్పి యానాటిరాత్రి యెవ్వరును జూడకుండఁ బోయి గోదావరిలోఁ బడఁబోయెను. మహానుభావులని పేరు పడయుటకయి కొంద ఱాత్మహత్యకయిన సాహసింతురుగదా. గోదావరియొడ్డున పడవమీఁదఁ గూర్చున్న యతఁ డొకఁడు చూచి యామెను బట్టుకొని లోఁతునీటిలోనుండి దరి కీడ్చుకొని వచ్చి యింటికడఁ జేర్చెను. ఈసంగతి నుపవిలేఖకుఁ డొకఁడు వివేకవర్ధనికి వ్రాసెను. ఆలేఖ ప్రకటింపఁబడఁగానే కన్నెఱికముచేఁ బ్రసిద్ధి కెక్కిన మాన్యాయవాదిగా రాయోగినియందు భక్తితాత్పర్యములుగల పూర్వోక్తసంపన్న గృహస్థునిపక్షమున తమకాయుప విలేఖకునిపేరు వెంటనే తెలుపవలసిన దనియు లేనియెడల మాననష్టమున కయి యభియోగము తేఁబడుననియు నా పేర వ్రాసిరి. ఉపవిలేఖకుని పేరు తెలుపుటకు వలనుపడదని బదులు వ్రాసి, అభియోగము తెచ్చెడుపక్షమున స్వసంరక్షణార్థమయి యావ్యవహారమును ఋజువు పఱుచుటకు వలయుసాక్ష్యమును సమకూర్చితిని. వ్యవహారమునకు దిగినయెడల సత్యము బయలఁబడునని భయపడి ప్రతిపక్షు లభియోగము తేక యూరకుండిరిగాని తన్మూలమున ధవళేశ్వరములో నున్న యాసంపన్న గృహస్థునిమిత్రులకును నాకును వైమనస్యము సంభవించెను.

నేను ధవళేశ్వరములో నున్న కాలమునం దనఁగా 1875వ సంవత్సరము జూలయి నెలలో బసవరాజు గవర్రాజు గారు రాజమహేంద్రవరమునుండి నాయొద్దకు వచ్చి తాము నూతనము గా స్థాపింపఁబోవుచున్న "రాజమహేంద్రవర దేశాపాఠశాలాసమాజ" (Rajahmundry Provincial School Club) ప్రారంభదినమున నన్నక్కడకు రమ్మని యాహ్వానముచేసిరి. ఆయన రాజమహేంద్రవరములో మావీధినే నివసించువా రయినను, మాయిరువుర పెద్దలకును మైత్రియు భాంధవమును గలిగియున్నను, వీధిలో నొండొరులను జూచుచుండుటయేకాని మా కంతగా పరిచితిలేదు. ఆప్రథమసందర్శనదినము


బసవరాజు గవర్రాజుగారు.

మొదలుకొని మాయిరువురకును మైత్రి యారంభమై దినదినాభివృద్ధి నొందుచు రాఁగా, ఆయన యావజ్జీవనమును నాతోడిబద్ధసఖ్యము గలవారయి నేను బూనిన సమస్తకార్యములయందును నాకు సహాయులయి నాకుడిభుజమువలె నుండెడివారు. ఆయన యప్పటికి ప్రథమశాస్త్రపరీక్షయందుఁ గృతార్థులయి యానూతనసమాజమునకు కార్యదర్శిత్వము వహించిరి. ఆసామాజికులయొక్క ముఖ్యోద్దేశములు నీతివిషయములనుగూర్చి ప్రసంగించుటయు నుపన్యసించుటయు తా మాప్రకారముగా నడుచుకొనుటయు నితరుల నారీతిని నడిపించుటయు నయి యున్నవి. నే నాసమాజములో నొక సామాజికుఁడనుగాఁ జేరి, 1875 వ సంవత్సరము ఆగష్టు నెల 15 వ తేదిని "ఐకమత్యము" నుగూర్చి యుపన్యసించితిని. నాఁడు మొదలుకొని తప్పక ప్రతిభానువారము నాఁడును మధ్యాహ్నము మూడుగంటలకు ధవళేశ్వరమునుండి నాలుగుమైళ్లు రాజమహేంద్రవరమునకు నడచిపోయి సాయంకాల మాఱుగంటలకు సభ ముగిసినతరువాత మరల నొంటిగా ధవళేశ్వరమునకు నడచిపోవుచుండెడివాఁడను. జనోపయుక్తములైన సభలన్న నాకప్పుడంత యుత్సాహజనకములుగా నుండెడివి.

లౌక్యాధికారధూర్వహులయి యున్న వారిదుష్ప్రవర్తనములను వెల్ల డి చేయుచు వచ్చుటచేత నాకు విరోధు లంతకంత కెక్కువ కాఁ జొచ్చిరి. ఆకాలమునందు వేశ్యాప్రియులసంఖ్య మేర మీఱి యుండెను. ఆవిషయమయి నేను పత్రికలో మొట్ట మొదట పరుషము కాకుండ వ్రాసినదానిలోనికొన్ని పంక్తుల నిట నుదాహరించెదను జూడుఁడు - "ఈకాలముననో జారిణీసంభోగమే సత్కృత్యమని కొనియాడబడుచున్నది ; కట్టుకొన్న యాలిని దుఃఖపెట్టి, పరాంగనలఁ గవియువారు గథణీయులుగా నెన్నఁబడకున్నారు; మఱి లంజెలు లేనివారు పెద్దమనుష్యులే కారని గణింపఁ బడుచున్నారు; మీఁదు మిక్కిలి యేకభార్యావ్రతస్థులు పురుషులే కారనియు; నపుంసకులనియుఁ బరిహసింపఁబడుచున్నారు. ఎల్లరచే గొప్పవారని గౌరవింపఁబడుచున్న ధనికులయిన యధికారసులే వేశ్యలకింటిబంటు లయి, వారికి వశవర్తు లయి, యా బోగముచానల నాశ్రయించినవారినే గారవించుచుండుటచేత నాధనికుల యనుగ్రహము నపేక్షించి వారివలన బాగుపడఁ దలఁచి యాశ్రయించుచున్న వారందఱును ఆచెడుపడఁతుకలయడుగులకు మడుగు లొత్త వలసినవారు గా నున్నారు." - ఈవ్రాఁత యిప్పుడు కొందఱి కతిశయోక్తిగా తోఁచవచ్చునేమో కాని యప్పు డది మారాజమహేంద్రవర విషయమున స్వభావోక్తి యనుట కణుమాత్రమును సందేహము లేదు. అప్పటి వేశ్యావలంబులగు మహాపురుషుల నిచ్చటఁ బేర్కొనుట యనావశ్యకము. అప్పుడు న్యాయాధిపత్యము మొదలగు మహోన్నతపదములయం దున్న మనవా రందఱు నించుమించుగా వేశ్యాదర పరాయణులయి యుండిరని చెప్పుటయే మనప్రస్తుతాంశమునకుఁ జాలియుండును. లౌక్యాధికారధురీణులయి యున్న వారితో పనిలేనివా రెవ్వరోకాని యుండరు. ఆయధికారులయిండ్లకు స్వకార్యార్థము పోయినప్పుడు వేశ్యల నుంచుకొన్నవారి కెక్కువ గౌరవము ; ఉంచుకోనివారికి తక్కువ గౌరవము. న్యాయసభలలో సహితము వారకాంతావల్లభులైన న్యాయవాదులవాదమునం దాదరము ; కేవలకులకాంతావల్లభులైన న్యాయవాదుల వాదమునం దనాదరము. అందుచేత ప్రభుసమ్మానముచే ధనార్జనముచేయ నపేక్షించిన న్యాయవాదు లనేకులు వేశ్యలను జేరఁ దీయవలసినవారయిరి. కొన్ని సమయములయం దీయధికారులే శ్లాఘనపూర్వకముగా నొక్కొక్క వేశ్య నొక్కొక్క న్యాయవాది కనుగ్రహించుచు వచ్చిరి. అందుచత మారాజమహేంద్రవరములోనున్న వేశ్యలు చాలకపోఁగా, పడపుపడఁతులకయి ప్రసిద్ధి పడసిన రామచంద్రపురము మొదలైనగ్రామములనుండి క్రొత్తవేశ్యలు రప్పింపఁ బడిరి. ఆకాలమునందు రాజమహేంద్రవరములో పాఠశాల యనఁగా వేశ్యల చదువుకూట మనియే యర్థము. వేశ్యలనృత్తగీతాదులకై పెట్టింపఁబడిన పాఠశాల లప్పు డాపురమునం దెన్నియోయుండెను. వేదపాఠశాలలకును శాస్త్రపాఠశాలలకును చిల్లిగవ్వ యియ్య నొల్లని శుద్ధశ్రోత్రియులు సహిత మధికారుల మెప్పునకయి యీ వేశ్యలపాఠశాలలకు నెల కయిదులు పదులు రూపాయలు చందా లిచ్చుచుండిరి. ఈ బోగముమేళములు తమతమ పేరులతో వ్యవహరింపఁబడక - నాయఁడుగారిమేళము, - పంతులుగారిమేళము, - శాస్త్రిగారిమేళము, అని పిలువఁబడుచుండెను. ఎవ్వరి యింటనైన శుభకార్యము వచ్చినపక్షమున, ఈప్రముఖులు తమతమమేళములను బెట్టవలసినదని సందేశములను బంపుచుండిరి. పత్రికావిలేఖత్వము పైని బడినందున, ఇట్టిబలవంతుల కప్రియముగా నీదుర్వ్యాపారమునుగూర్చి పలుమాఱు వ్రాయవలసి వచ్చినది. కొన్ని సమయములయం దాప్రముఖులు దురాగ్రహావేశపరవశు లయి పత్రికను గొనవలదని చందాదారులతోఁ జెప్పియు, దూషణోక్తులు పలికియు, నన్నేమో చేసెదమనియు చేయించెదమనియు బెదరించియు, నానావిధముల నన్ను నాపూనికనుండి మరలింపఁ జూచిరి గాని యీశ్వరానుగ్రహమువలన వారికోరికలు సఫలములయినవికావు. ఒక్కటితక్క వేశ్యలపాఠశాలలన్నియు నల్పకాలములోనే తీసివేయఁబడినవి. దురభిమానముచేత నిలుపఁబడిన యా యొక్కపాఠశాలయు వేశ్యలమూలమునఁ దదభిమానికి సంభవించిన యాపద వలన నశించినది. పొరుగూళ్ళనుండి వచ్చినవేశ్యలు తమప్రవాసక్లేశమును విడిచి మరల స్వగ్రామములకుఁ బోయి సుఖింపవలసినవారయిరి. ఇట్లు దుర్బలునిచే నవలంబింపఁబడినదయ్యు ధర్మమే కడపట జయమునొందినను, వేశ్యావలంబులకు నాపయినిగలిగిన కోపముమాత్ర మంతశీఘ్రముగా పోలేదు. అప్పుడు నా కెవ్వరి కోపమును గణనచేయ నక్కఱలేని స్వతంత్రస్థితియం దుండవలె నన్న చింత దృఢఃముగాఁ గలిగెను. ఉపాధ్యాయత్వము సాధారణముగా స్వతంత్రత కలదే యయినను, స్వదేశస్థులు పాఠశాలాకార్యనిర్వాహకులై యున్న ప్పుడదియుఁ బరతంత్రమైనదనియే నాకభిప్రాయము కలిగెను. అందుచేత నుపాధ్యాయత్వమును సహితము విడిచి, పత్రికను నిర్వహించుచు గ్రంథకర్తనయి స్వతంత్రుఁడను గావలెనన్న బుద్ధి నాకప్పు డుదయించెను.

పత్రికాధిపత్యమువలన స్వతంత్రజీవనము చేయఁదగినంత ధనాగమము కలుగునని నా కెప్పుడును నమ్మకములేదు. నాగ్రంథములను పత్రికావిలేఖకులు మొదలైనవారు శ్లాఘించుచు వచ్చుటచేతను, నేను రచించినపుస్తకములను బహుపాఠశాలలలో పాఠపుస్తకములనుగాఁ బెట్టుటచేతను, గ్రంథకర్తృత్వము వలన స్వతంత్రజీవనోపాయము కలుగు నన్నధైర్యము కలిగినది. నావ్యాకరణమువలన రెండుమూడుమాసములలో నిన్నూఱు రూపాయలు వచ్చినవి; నా నీతిచంద్రికవిగ్రహతంత్రమువలన వేయిరూపాయలు వచ్చినవి. అయినను పత్రికను విడువ వలెనన్న బుద్ధి నా కెప్పుడును పుట్టలేదు. పత్రికా ప్రకటనమునకును గ్రంథముద్రణమునకును వలయు ముద్రాయంత్రమును నెలకొల్పవలయు నన్న యభిలాషము నాకు విశేషముగానుండెను. నామిత్రులైన చల్లపల్లి బాపయ్యపంతులుగారును నేనును గలిసి నూఱేసిరూపాయలచొప్పున భాగము లేర్పఱిచి ముద్రాయంత్రమును దెప్పింపవలె నని ప్రయత్నించి ప్రకటన పత్రికలను ముద్రింపించి ప్రచురించితిమికాని భాగస్థులు తగినంతమంది చేర లేదు. ధవళేశ్వరములో నుండఁగా మున్నూటయేఁబదేసి రూపాయలచొప్పున నాఱుభాగములు వేసికొని ముద్రాయంత్రమును రాజమహేంద్రవరమునఁ బ్రతిష్ఠింపవలెనని మరలఁ బ్రయత్నించితిమి. ఈప్రయత్నము నామిత్రు లైన చల్లపల్లి రంగయ్యపంతులవారి ప్రోత్సాహమువలన నెఱ వేఱినది. అందులో నే నొక భాగస్థుఁడనయి నాసహపాఠియు మిత్రుఁడును లక్కవరపు సంస్థానాధిపతియు నైన శ్రీరాజామంత్రిప్రగడ దుర్గామల్లికార్జున ప్రసాదరావులబహదరుగారి నొకభాగస్థునిగాఁ జేర్చితిని. రంగయ్యపంతులుగారు తమయన్న గారైన రామబ్రహ్మముగారిని, సరిపల్లె గోపాలకృష్ణమ్మ గారిని, నాళము కామరాజు గారిని, పందిరి మహాదేవుఁడుగారిని, భాగస్థులనుగాఁ జేర్చిరి ఇట్లు భాగస్థులేర్పడినతరువాత వేసవికాలపు సెలవులలో నేనొకసారి చెన్న పట్టణమునకుఁ బోయితిని. నేను నీతిచంద్రిక విగ్రహతంత్రమును రచించుటచేత మిక్కిలి సంతుష్టులైన శ్రీమాన్ బహుజనపల్లి సీతారామాచార్యులవారు మొదలైన పండితులు నన్ను మిక్కిలి యాదరించి, నాకయిన వ్యయముల నన్నిటిని దామే భరించి, ఒకనాఁడు సభచేసి నాఛాయాప్రతిమను దీయించి నా కొక వెండిపాత్రమును బహుమానము చేసిరి. నే నిప్పుడు మంచినీరు త్రాగుట కుపయోగించునది యప్పుడు వారిచ్చిన రజతపాత్రమే. నేను చెన్న పురిలోనున్న కాలములో వారు నాయుపచారము నిమిత్తమయి బ్రహ్మశ్రీ మన్నవ బుచ్చయ్యపంతులుగారిని నాకప్పగించిరి. అప్పటినుండి నాకాయనతోడిమైత్రి కలిగి నానాట వర్ధిల్లినది. పచ్చప్పగారి శాస్త్రపాఠశాలలో తెలుఁగుపండితులుగా నున్న మ-రా-శ్రీ, కార్మంచి సుబ్బరాయలు నాయఁడు గారు నాకుఁ జెన్నపురిలోఁ గావలసినవన్నియుఁ గొనిపంపుచుండుటకు వాగ్దానము చేసిరి. నేను మరల ధవళేశ్వరమునకు వచ్చినతరువాత ముద్రాయంత్రమును ముద్రాక్షరములను గొనుటలోను పనివాండ్రను కుదిర్చి పంపుటలోను నా కాయనే సర్వ విధములఁ దోడుపడెను. స్వతంత్రుఁడనుగా నుండవలెనన్న యభిలాషముచే తను, పాఠశాలాకార్యనిర్వాహకసభ్యులలో నొకరికిని నాకును వైమనస్యము కలుగుటచేతను, మఱి కొన్ని కారణములచేతను, నేను ధవళేశ్వరములోని యుపాధ్యాయత్వమును మానుకొని 1876 వ సంవత్సరారంభమున స్వస్థలమగు రాజమహేంద్రవరమునఁ బ్రవేశించితిని.

నేను రాజమహేంద్రవరమునకు రాకమునుపే ముద్రాయంత్రము వచ్చి యున్నను, అక్షరములు మొదలగునవి నేను వచ్చిన కొలఁదికాలమునకుఁగాని రాలేదు. అక్షరములు రాఁగానే యేప్రిల్ నెల మధ్యనుండి పని మొదలు పెట్టి మాయింటనే నెలకొల్పఁబడిన స్వీయముద్రాయంత్రమునందే వివేకవర్ధనిని ముద్రింపింప నారంభించితిమి. మాభాగస్వాము లొక్కొక్కరిచ్చిన మున్నూటయేఁబదేసి రూపాయలును చాలకపోయినందున, ముద్రాయంత్రపరికరములు కొనుటకయి నే నియ్యవలసినదానికంటె నూఱు రూపాయలను మొదటనే హెచ్చుగానిచ్చితిని. ముద్రాయంత్రకార్యనిర్వాహకత్వమును నేను వహించి పనిచేయుటకును, నేను పడిన శ్రమనిమిత్తమయి వచ్చిన యాయములో నెనిమిదవపాలు నేనుపుచ్చుకొనుటకును, వచ్చెడు చందాధనము వివేకవర్ధనీ పత్రికావ్యయములకు చాలకపోయెడుపక్షమున శేషమును ముద్రాయంత్రాదాయ మునుండి పెట్టుటకును, పనివాండ్రజీతములు మొదలైనవ్యయములు పోఁగా మిగిలినలాభమును భాగస్థులాఱుగురును సమముగా పంచుకొనుటకును, మొట్టమొదట మాలో మే మేర్పాటు చేసికొంటిమి. అయినను మే మనుకొన్నట్టు గా ముద్రాయంత్రమువలన లాభము రాలేదు. వచ్చిన యాయమును వివేకవర్ధనికి వచ్చినచందాలమొత్తమును గలిపినను పనివాండ్రజీతములకే చాలిచాలక యుండెను. ఒక్కొక్క నెలలో మాచేతొసొమ్ము సహిత మిచ్చుకోవలసి వచ్చుచుండెను. అప్పుడు స్థలనిధిసంఘముల వారియొక్కయు పురపారిశుద్ద్యవిచారణసంఘముల వారియొక్కయు అచ్చుపను లన్నియు దొరతనమువారి ముద్రాయంత్రములోనే జరగవలసియుండుటచేత మాకాపని యేదియురాలేదు. ఇతరులును వివాహాదులయందు శుభలేఖలు వేయించుకొనుటతప్ప మాకు వేఱుపని యేదియు నియ్యలేదు. అయినను వివేకవర్ధనిని ముద్రించుకొనుట కాను కూల్య మధికముగాఁ గలిగినందున నాకదియే లాభముగానుండెను. ఆరంభదశలో భాగస్థులందఱునుగూడి రెండుసారులు లెక్కలు చూచికొనిరిగాని లాభము లేక చేతిసొమ్మే తగులుచున్నట్టు కనఁబడినందునఁ దామేమైన మరల నిచ్చుకోవలసివచ్చునని తరువాత వారుపేక్షించి యారకుండుచు వచ్చిరి. నేను వివేకవర్ధనిని బ్రకటింపఁ జొచ్చినపిమ్మట నరసాపురములో నా మిత్రులగు మీర్ షుజాయతల్లీఖాన్ సాహేబుగారు 'విద్వన్మనోహారిణి' యను తెలుఁగు మాసపత్రికను బ్రకటింప నారంభించిరి. మాయిరువురకు 1874 వ సంవత్స రాంతమునుండి మైత్రియారంభమై యంతకంతకు వృద్ధినొందెను. శ్రీ వివేకవర్ధని నొకసంవత్సరము నడపినతరువాత విద్వన్మనోహారిణిని దానితోఁ గలిపి వేసి వివేకవర్ధనిలో నింగ్లీషుకూడఁజేర్చి యింగ్లీషుభాగ మాయన వ్రాయుచుండుటకును తెలుఁగుభాగము నేను వ్రాయుచుండుటకును ఏర్పాటు చేసికొంటిమి.

1876 వ సంవత్సరమధ్యము (జూలయి నెల)నుండి వివేకవర్ధనిని పక్షపత్రికనుజేసి నడపఁజొచ్చితిని. ఆనెలలోనే "హాస్యసంజీవని"యనుపేర హాస్య రసప్రధానమైన యొకమాసపత్రికనుగూడ వివేకవర్ధని కనుబంధముగాఁ బ్రచు రింప నారంభించితిని. బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులవారికిని నాకును వాగ్వివాదము ముదిరి యన్యోన్యదూషణముక్రింద దిగెనని యీవఱకే చెప్పితినిగదా. ఆయన పూర్వనాగరికుఁడును, నేను నవనాగరికుఁడను, అగుట తప్ప మాయిరువురకును వివాదకారణము వేఱేదియులేదు. వివేకవర్ధని యంత కంతకు వృద్ధియై దేశాభివృద్ధికి భంగకరములైన పూర్వాచారములను పూర్వ పక్షము చేయుచు, దేశాభివృద్ధికరములైన నూతనాచారములను సిద్ధాంతము చేయఁ గడఁగినది. ఆపని పూర్వాచార పరాయణులైన వారి కెవ్వరికిని దుస్సహముగా నుండకపోదు. అట్లయినప్పుడు పూర్వాచారస్థాపన దీక్షాదక్షులలో నెల్ల నగ్రగణ్యులై యపూర్వపత్రికానిశితాసిపుత్రికను చేత ధరించియున్న పంతులవారికి నాపత్రికను రూపుమాపఁ దలంపు గలుగుట వింత కాదు. మా పట్టణములోని ప్రముఖులు ప్రయత్నించి విడిచిపెట్టిన యాపనిని పంతులవారు దూరమునుండి నిర్వహింపఁ బూని వివేకవర్ధనిని పరిహసించి తలకొట్లు కలిగించుటకై 'హాస్యవర్ధని' యను నామధేయముతో నొక మాసపత్రికను సంజీవని కనుబంధముగా 1875 వ సంవత్సరాంతమున వెలువఱిచి పంపిరి. ఆపత్రికాముఖపత్రముపైని దంతిముఖుఁడై విఘ్నేశ్వరుఁ డిరుపార్శ్వములయందును మూషకములు తన్ను సేవింప నిలుచుండి తాండవమాడుచుండెను. మా వివేకవర్ధని వారిసంజీవనికంటె వయస్సున చిన్న దగుటచేత బాల్యచాపల్యమును బూని సాహసముచేసి చలింపక తానును పౌరుషముచూప నుపక్రమించెను. అందుచేత 'హాస్యవర్ధని'తోఁ బ్రతిఘటించి పోరాడుటకొఱకయి యాంధ్రభాషాసంజీవనికి విరోధముగా నప్పుడుదయించిన పత్రికాపుత్రికయే యీహాస్యసంజీవని. హాస్యసంజీవనిలో "కోదుభాషా సంజీవని" యను భాగ మొకటికూడ నుండెను. కోదులనఁగా కొండలయందు వసించెడు భిల్లులవంటి యనాగరికులైన యొక జాతి కొండవాండ్రు. ఈపత్రికాముఖపత్రముపైని సింహముఖుఁడై విఘ్నేశ్వరేశ్వరుఁ డిరుపార్శ్వములయందును మార్జాలములు తన్ను సేవింప నిలుచుండి తాండవమాడుచుండెను. ఆవిగ్రహముక్రిందఁ గూర్పఁబడినశ్లోక మిది.

             "శ్లో. సింహవక్త్రం మహాకాయం, విఘ్నేశ్వరవరాధిపమ్
                 పశ్య సంజీవనీనాథం, మార్జాలయుగళాశ్రితమ్."

నాబ్రాహ్మవివాహ మీపత్రికయందే ప్రథమమున వెలువడ నారంభించెను. అట్టి వ్రాఁతకదియే తెలుఁగుభాషయందు మొద లగుటచేత నాదినముల యం దెక్కడఁ జూచినను మూఁకలు గట్టి జనులు హాస్యసంజీవనిని ముఖ్యముగా నందులో బ్రాహ్మవివాహమును జదివి యానందించుచు వచ్చిరి. రెండేండ్లకుఁ దరువాత నే నొకసారి బందరుపురమునకుఁ బోయినప్పు డొకబ్రాహ్మణ బాలిక బ్రాహ్మవివాహమును మొదటినుండి తుదవఱకును నప్పగించి నాకాశ్చర్యము కలిగించినది. తనరెండవయేట హాస్యవర్ధని యదృశ్యముకాఁగా మా హాస్యసంజీవనియు పుస్తకరూపమున నదృశ్యమై వివేకవర్ధనిలో నంతర్భాగముగాఁ బ్రవేశించి దురాచారదుర్నీ తిభంజనమునం దెంతో పనిచేసినది. ఈ యుపకారమునకు హేతుభూతులు శ్రీ పంతులవారేయైనందున నేను వారికిఁ గృతజ్ఞతా పూర్వకములైన యభినందనశతము లర్పించుచున్నాను. ఆంధ్రభాషాసంజీవనిలోని పూర్వాచార పోషకవ్యాసముల హేతుదౌర్బల్యమును ప్రకాశముచేయుట కనఁగా "స్త్రీలకు విద్యకూడదు" అను నిట్టివ్యాసము లాపత్రికయందు పొడచూపఁగానే తోడనే తత్ఖండనముగా నందలియుక్తులనే గైకొని "పురుషులకు విద్యకూడదు" అను నిట్టివ్యాసములను వ్రాసి మొదటి దాని యందలిహేత్వాభాసములను లోకమునకుఁ బ్రకాశముచేయుట కోదుభాషా సంజీవనియొక్కపనిగా నుండెను. స్త్రీలకు విద్యకూడదన్న దానికి ప్రతిగాఁ బ్రకటింపఁబడిన యొక చిన్న వ్యాసమును చూడుఁడు. -

"పురుషులకు విద్యకూడదు - మాపూర్వు లెప్పుడున్నూ విద్య చదువు కోలేదు. కాఁబట్టి విద్యాభ్యాసము పూర్వాచారవిరుద్ధము. పూర్వాచారవిరుద్ధమైన పని యెన్నటికిన్ని చెయ్యరాదు. యుక్తిచేత చూచినా, విద్యనేర్చుకోవడంవల్ల చాలనష్టాలు కనఁబడుతూవున్నవి. ఇప్పుడు కోర్టులలోపుట్టే తప్పు దస్తావేజులున్నూ దొంగపత్రములున్నూ చదువు మూలంగానేకదా పుట్టుతూ వున్నవి. ఎవరూ చదువుకోని పక్షమున తప్పుదస్తావేజు లేలాగుపుట్టునో బుద్ధిమంతుల కందఱకూ తెలుసును. కాఁబట్టి మేము యీవిషయములో విస్తరించి వ్రాయవలసినపనిలేదు. ఈవక్కదృష్టాంతమే పురుషులకు విద్యా కూడదనుటకు చాలినంతప్రబలయుక్తిగానున్నది. విద్య చదువుకోవడంవల్ల ప్రయోజనమేమి? పూర్వకాలపువారందఱూ విద్యచదువుకోక పోయినందుచేత చచ్చి పోయినారా ? చదువుకోకపోతే జీవనంజరగదా? కాలిమీఁద కాలువేసుకొని కలిగిన మాత్రంతో సుఖంగా కాలక్షేపం చెయ్యలేక, తీరికూర్చుండి విద్యపేరు పెట్టుకుని వృధాగా శ్రమపడడం యెందుకు? దొరతనంవారు మనగ్రామాలలో బళ్ళు పెట్టించి పిల్ల వాళ్ళను పాడుచేస్తూవుండగా దేశాభిమానంగల వారందఱూ చూస్తూ వూరుకోవడం న్యాయమా ? దొరతనంవారికి అందరూచేరి మాకు విద్యవద్దని మహజరు అర్జీలను పంపించుకోరాదా ? పెద్దలందఱూ సభచేరి, మనశిష్టాచారానికి విరోధంగా చదువుకొనేవారిని వెలివేస్తామని గట్టిగా కట్టుదిట్టములు యేర్పఱిచి విద్యమాన్పరాదా ? ఇంగ్లీషువారు చదువుకొని బాగుపడలేదా అంటారేమో, వారు తెల్లనివారు; మనము నల్లనివాళ్ళము. మనకు విద్యయెందుకు ? హిందువులందరూ చదువుకోవడంలేదా అంటే, వారికీ మనకూ చాలా భేదంవున్నది. వారు గ్రామాలలో వుండేవారు; మనము కొండలలో వుండేవాళ్ళము. కాఁబట్టి మనకు చదువుపనికిరాదు. పూర్వపువాళ్ళు యీమాత్రం యెరగకనే విద్యమానివేసినారా ? వారికంటె యిప్పటివాళ్ళు మహాబుద్ధిమంతులా ? ఇటువంటివిపరీతబుద్ధులు పుట్టుచున్నవిగనుకనే యీ కాలపువాళ్ళందరూ అల్పాయుష్మంతులుగా వుంటూవున్నారు."

నేను ధవళేశ్వరమును విడిచి వచ్చినతరువాత మరలఁ బనిలోఁ బ్రవేశింపవలెనన్న యుద్దేశము లేకపోయినను, 1876 వ సంవత్సరము నవంబరునెల మొదటితేదిని రాజమహేంద్రవరమునందలి రాజకీయశాస్త్రపాఠశాలలో నెల కిరువదియైదు రూపాయల జీతముగల యాంధ్ర ద్వితియోపాధ్యాయపదము నందుఁ గుదురవలసినవాఁడ నైతిని. మొట్టమొదట నా కీపనిని దయచేసెద మని మెట్కాపుదొరగారు మ-రా-శ్రీ, ఫారసీ శ్రీనివాసరావు పంతులుగారి చేత వర్తమానము పంపినప్పుడు నాకక్కఱ లేదని నిరాకరించితిని. ఈసంగతి తెలిసి నాబంధువులును మిత్రులును నన్ను చీవాట్లు పెట్టి, స్వస్థలములోనున్న యాపని కొప్పుకొ మ్మని బలవంత పెట్టిరి. తరువాత వారిహితబోధ యుక్త మయినదని భావించి, పని యిచ్చెదమన్నప్పుడు వలదని నిరాకరించిన నేనే మరలఁబోయి యాపనిని నా కీయవలసినదని ప్రార్థించితిని. నాప్రార్థన యంగీకరింపఁబడినది. అప్పు డాపాఠశాలలో ప్రథమశాస్త్రపరీక్షతరగతి మాత్రమే యుండెను. నేను పనిలోఁ బ్రవేశించినతరువాత రెండుమాసములకు 1877 వ సంవత్సరారంభమునందు మాపాఠశాలలో పట్టపరీక్షతరగతికూడ పెట్టఁబడెను. నాయుపాధ్యాయత్వమునుగూర్చి నేను జెప్పుకొనవలసిన దేదియులేదు. నా కప్పుడు పలువురు క్రొత్తమిత్రు లయిరి. ఈవఱకున్న వారు గాక పత్రికా నిర్వహణాదికమునందు నాకు నూతనముగా మిత్రులైన బుర్రా రాజలింగము శాస్త్రిగారును తోడుపడఁ దొడఁగిరి. నాబాల్యసఖులైన చల్లపల్లి బాపయ్య పంతులుగారును, ధవళేశ్వరములో నున్న కాలములో మిత్రులైన బసవరాజు గవర్రాజుగారును ధవళేశ్వరములోనున్నప్పుడు నాయొద్దకుఁ దఱచుగా వచ్చుచు నాతో మైత్రివాటించిన యేలూరి లక్ష్మీనరసింహముగారును, నాకాప్తులును పత్రికానిర్వహణమునందు సహాయులు నగుచుండిరి. విశాఘపట్టణమండలమునుండి క్రొత్తగావచ్చి మామండలన్యాయసభలో న్యాయవాదు లైన చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రిగారును నాకు మిత్రులయి పత్రిక కెప్పుడైన వ్రాయుచుండెడివారు. నాకు మిత్రు ల నేకులున్నను, ఒక్క పాఠశాలలో నుండుటచేత నేనును బసవరాజు గవర్రాజుగారును బుర్రారాజలింగముశాస్త్రి గారును ఏలూరి లక్ష్మీనరసింహముగారును సదా కలసిమెలసియుండి యత్యంతమైత్రిగలవారమయి పత్రికలో వ్రాయు విషయములను గూర్చియు మాన్పవలసిన దురాచారములనుగూర్చియు నాలోచించుకొనుచుండెడివారము. ఈనలుగురిలోను నేను నాయకుఁడను. వారిలో నిరువురు కొంతకాల ముపాధ్యా యులుగా నూండినను, అప్పుడు తక్కిన మువ్వురును విద్యార్థులుగాను నే నొక్కఁడనే యుపాధ్యాయుఁడను గాను ఉంటిమి. పత్రికలో మేము వ్రాసిన దానివలన మనసు నొచ్చినవా రందఱును మమ్ము దుష్టచతుష్టయమని పిలుచుచువచ్చిరి. ఆకాలమునందు మావివేకవర్ధని చేసినపనుల నన్నిటిని వివరింపఁ బూనినచోఁ బుస్తకములు నిండవలసియుండును. కాఁబట్టి వానినన్నిటిని విడిచి పెట్టి వానిలోని రెండుమూఁడు ముఖ్యాంశములను మాత్ర మిం దుదాహరించెదను.

వసూళ్లు వేయుట యనఁగా వివాహాదిశుభకార్యములయం దాహూతులయి చూడవచ్చిన పెద్దమనుష్యులందఱును బోగముమేళమునకు రూపాయకు తక్కువకాకుండ నొసఁగు లొసఁగెడియాచార మాకాలమునందు మాప్రాంతములలో సర్వసాధారణమైయుండెను. ఎవ్వరైనను తాంబూలములకు వచ్చిన వారు వేశ్యల కొసఁగులు వేయకుండుట యెంతో యవమానకరముగా నుండు చుండెను. కాఁబట్టి పెద్దకుటుంబమును భరింపవలసినవాఁడయి రిక్తుఁడుగా నున్నవాఁడు సహిత మెంత తక్కువ జీతములోనున్నను చెంబో ముంతో తాకట్టు పెట్టి యప్పుచేసి తెచ్చియైనను రూపాయకు తక్కువకాకుండ బోగముమేళమునకు తప్పక ముడుపు చెల్లించి రావలెను. కొందఱొకానొకప్పుడు వేశ్యలకొసఁగులు సమర్పింపశక్తులుగాక యేవో సాకులు పెట్టి మిత్రబంధుబృందముల మందిరములకు శుభకార్యములకుఁ బోవక తప్పించుకోఁగలిగినను, అట్టి వారు సహితము తప్పించుకో శక్తులుగాక యధికారపిశాచావేశమత్తు లయిన వారియిండ్లకు తప్పకపోయి వేశ్యలకు కట్నములను సమర్పించి రావలసినవారుగానుండిరి. పిలిచినప్పు డధికారులయిండ్లకుఁ బీనిపక్షమున సన్న గాండ్ర కాబలవంతులముందఱ గ్రామములో కాపురముచేయుటయే దుర్ఘటముగా నుండెను. అది యెట్లందురేమో వినుఁడు. ఆకాలమునందు మాపట్టణమునందే యొకదండవిధాయి యుండెను. అతఁడే వేవోమిషలు కల్పించి నెలకు రెండుసారులైనను తనయింట బొగముమేళములు పెట్టి గానవినోదము ననుభవించుటకై యూర నున్నవారి నందఱి నాహ్వానము చేయకుండెడివాఁడు కాఁడు. ఆసభల కెవ్వరైనను పోకయుండిరా, మఱునాఁడు వారియింటిముందఱ పెంటయున్నదనియో ముఱికినీరు వీధిలోనికి వచ్చినదనియో యామందభాగ్యు లేదో యభియోగము పైని సభలకీడ్వఁబడి కొన్నాళ్లు పనిచెడి తిరిగినమీఁదట వేశ్యల కియ్యవలసిన యొక్క రూపాయకు బదులుగా నాలుగురూపాయలు ధనదండన మిచ్చుకోవలసినవారగుచుండిరి. ఇటువంటి యధికారులు కొందఱు తమయింట వచ్చెడు వసూళ్లలో సగముమాత్రమే వేశ్యల కిచ్చుటకును తక్కిన సగమును తామే గైకొనుటకును వేశ్యలతో నేర్పాటుచేసికొని యీవిధముగా నెల కిన్నూఱో మున్నూఱో గడించుచుండిరి. పదిరూపాయలపనిలో నున్నవారు కొన్ని సమయములయందొక్క నెలలో నాలుగోయైదో రూపాయ లధికారులయిండ్లలో వేశ్యలనిమిత్తమ పాత్రనిర్బంధధానములుచేసి యా నెలలోభార్యాపుత్రాదులతో నింట నర్థభోజనముతోఁ దృప్తినొందవలసినవా రగుచుండిరి. ఈదుచారమును నివారించుటకయి సభలు చేయించి మావివేకవర్ధని యెంతో పనిచేసినది. ఆసభలలో కడపటిదానినిగూర్చి 1878 వ సంవత్సరము జనవరిపత్రికలోఁ బ్రకటింపఁ బడినపర్యవసానుము నిందుఁ బొందుపఱుప ననుజ్ఞ వేఁడుచున్నాను -

"కడపట నిఁక ముందు వివాహాదులయందుఁ దాంబూలములకు వచ్చువారు వసూళ్లు వేయుదురాచారమును మాన్పించుట ముఖ్యకార్యమని నిశ్చయింపఁ బడినది. అప్పు డాసభకు వచ్చిన పెద్దమనుష్యు లందఱును తా మిఁక ముం దెక్కడకు తాంబూలములకు వెళ్లినను వసూళ్లు వేయమనియు, తమ యిండ్లలో శుభకార్యములు జరగినయెడల నితరులు వసూళ్లు వేయకుండు ప్రయత్నముం జేయుదుమనియు, వాగ్దానము చేయుటయేకాక యీసమాజములోఁ జేరినవారెవ్వరును వసూళ్లు వేయఁగూడదనియు, ఎవ్వరైనను వేసిన యెడల వారిని తమయిండ్లకు తాంబూలములకుఁ బిలువఁగూడదనియు వారి యిండ్లకు తాము తాంబూలములకు వెళ్లఁగూడదనియు, ఎవ్వరైనను వెళ్లిన పక్షమునను పిలిచిన పక్షమునను ఆవెళ్లిన పిలిచినవారివిషయములోఁగూడ నా ప్రకారమే జరిగించవలసినదనియు, అట్టివారిలో నెవ్వరైనఁ బశ్చాత్తప్తులయి మరల నీసమాజములోఁ జేర నిచ్ఛించినయెడల సామాజికులలోఁ బదిమందికి తక్కువ కాకుండఁ జేరినసభలో క్షమార్పణము చెప్పుకొనుదు రేని మొదటి పర్యాయము సమాజములో మరలఁ జేర్చుకోఁబడవచ్చుననియు నిబంధనలను వ్రాసికొని దానిక్రిందఁ దమచేవ్రాళ్లను జేసి, ఈపద్ధతులను గ్రమమగా నడిపించువిషయమైన శ్రద్ధను పుచ్చుకొనుటకును ఆయాసమయములయందు విశేష సభలు కూడవలసినయెడల సభికులకుయుక్తకాలమునఁ దెలిపి వారిని రప్పించుటకును, ఈ పత్రికాధిపతినే కార్యదర్శిఁగా నియమించిరి."

మనవారిలో ననేకులు వాగ్దానము నెంతశీఘ్రముగాఁ జేయుదురో యంతశీఘ్రముగానే దాని నతిక్రమింతురు. వసూళ్లవిషయమున మే మొడంబడిక చేసికొన్న కొన్ని దినములలోనే మాయూర నొక గొప్పగృహస్థుని యింట నుపనయనమహోత్సవము నడచినది. మాసమాఖ్యలో సంతకము చేసిన వారే యొక రాయుత్సవమునకుఁ బోయి యచ్చట బోగముమేళమునకు వసూలు చదివించి వచ్చిరి. నా కాసంగతి మాపాఠశాలలోని విద్యార్థులవలనఁ దెలిసినది. నేను సాయంకాల మైదుగంటల కింటికి రాఁగానే యాగృహస్థునకు నేను విన్న వార్తను దెలుపుచు, నేను విన్నదే నిజమైనయెడల మనయొడంబడికలోని దండననిబంధనలను ప్రవృత్తికిఁ దీసికొని రావలసియుండునని వ్రాసిపంపి సాయంతనవిహారమునకుఁ బోయితిని. మాకట్టుపాటును మీఱినయతఁడు దైవికముగా నగరపారిశుద్ధ్యవిచారణసంఘసభ్యులలో నొకరగు బెజగము సోమయ్యగారును పెద్దకోమటి యగుట తటస్థించినందున, నాప్రకటనపత్రికవలనఁ గలుగవలసినసత్ఫలము తోడనే కలిగినది. నాపత్రికను జూడఁగానే యతఁడు భయపడి, నేను రాత్రి యేడుగంటల కింటికి మరల వచ్చునప్పటికి మావీధియరుగుమీఁదఁ గూరుచుండియుండెను. నన్నుఁ జూడఁగానే యతఁ డరుఁగు దిగి నిలుచుండి దండము పెట్టి, తా నొడంబడికను బుద్ధిపూర్వకముగా నతిక్రమింపలేదనియు, అందలి నిబంధన లెప్పటినుండి వ్యవహారములోనికి రావలయునో కాలనిర్ణయ మేర్పఱుపఁబడి యుండక పోవుటచేత నట్టి యేర్పాటు జరిగినదినమునుండి వసువులొసఁగుట మానవలెననుకొంటిననియు, సమాధానముచెప్పి క్షమింప వేఁడుకొనెను. ఆరంభదశలో నెక్కువ తీవ్రతను గనఁబఱచినయెడల నున్న బెట్టుకూడఁ జెడునని మనస్సులో నెంచుకొని ఆతఁడుచెప్పిన సమాధానమును క్షమార్పణమును కాగితముమీఁద వ్రాయించి పుచ్చుకొని, జరిగిన వృత్తాంతమంతయుఁ దరువాత సమావేశమైనసభలో సభవారికి నివేదించితిని, మీఱినయెడలఁ దమవిషయమునఁగూడ నిట్లే జరగునన్న భయముచేత మాయొడంబడికలో వ్రాలు చేసినవారెవ్వరును తరువాత నొసఁగు లియ్య లేదు. మాప్రతిపక్షులైన వేశ్యాప్రియులు వసూళ్లుండ వలసిన యావశ్యకమునుగూర్చి మాసభలలో ప్రసగించుటయేకాక యందు విఫలమనోరథులైనతరువాతఁ దమలోఁ దాము వేఱుగ సభచేసి, మేముచెప్పిన యుక్తుల నాక్షేపించుచు నొక పత్రికను వ్రాసి, వసూళ్లు వేయుట కర్తవ్యమని సిద్ధాంతము చేసి, దానియందు సంతకములు చేయుటకయి తగుమనుష్యులకుఁ బంపిరి. ఈపనిలో మావివేకవర్ధనికి హాస్యసంజీవని తోడయి ప్రతివాదుల యుక్త్యాభాసములను బరిహసించి, మాప్రతిపక్షులైన వేశ్యాజనాభిమాన మాననీయులను సిగ్గుపడునట్లు చేసెను. పలువురు వసూళ్ళు మాని ధనలాభము నొందుచున్నప్పుడు కొందఱుమాత్రము వసూళ్ళు వేయుట గౌరవముగాఁ గాక కేవలవ్యర్థ వ్యయముగాఁ గనఁబడినందున, క్రమక్రమముగా మొదట మాలోఁ జేరనివారు సహితము సభలలో వేశ్యలకు వసువు లొసంగుట మానివేసిరి. ప్రతిపక్షుల యుక్తిరత్నములును మాహాస్యసంజీవని ప్రత్యుక్తులును గొందఱకుఁ గొంతవినోదకరముగా నుండ వచ్చు నని మామండలన్యాయసభలోని యొక మొదటితరగతి న్యాయవాదిగారు చేసినప్రకటనలోని కొంతభాగము గల హాస్యసంజీవనీ వ్యాసము నొకదాని నిందుఁ జూపుచున్నాను. -

సదాచారప్రతిష్ఠాపనము

ఈమధ్య వసూళ్ళు వేయుపద్దతి పోయినందున వేశ్యలకు కలిగిననష్టమునుబట్టి జగత్ప్రళయము సంభవించుననిభయపడి, లోకోపకారార్థము దయార్ద్ర హృదయులయిన వేశ్యాభిమానులగు పూజ్యులు కొందఱు పూర్వాచారమును మరల నుద్ధరించి శాశ్వతకీర్తిని సంపాదింపవలెనని, స్వవాదోపబలార్థముగా నేడుపుటలగ్రంథమును వ్రాసి దానిక్రింద తమపక్షమువారిచేత సంతకములు చేయించుచున్నారు. ప్రశ్నోత్తర రూపముగా వారు వ్రాసిన గ్రంథము మహా సముద్రముంబోలె నున్నందున హాస్యసంజీవని సమగ్రముగా దాని నెల్లరకును జూపలేకపోయినను, దానియందలి హేతురత్నములఁ గొన్నిటి నేరి వా రలంకరించిన మృదువచోభూషణములతోనే యెల్ల వారల చూడ్కులను మిఱుమిట్లు గొలుప నెంచినది. ధీరులారా ! జడిసికొనకుఁడు. -

పంచరత్నములు.

"బ్రాంహ్మడికి గాని పండితులకు గాని యిస్తేఫలంగాని భోగం వాళ్లకు యివ్వడం పుణ్యమా పురుషార్ధమా అగత్యంవుంటే రహశ్యంగా యివ్వకూడదా" "బ్రాంహ్మణులు వగయిరాలకు శుభాఅశుభకార్యములకు యేదయినా ఫలం దొర్కుతుంది. యీభోగం వాళ్ళకు శుభకార్యంకుమాత్రమే దొర్కుతుంది. యితర వర్నములు వార్కిసహా ధర్మం చేస్తూ యిచ్చేవార్నికూడా భోగంవాళ్ళకు వద్దు అనడం న్యాయం కాదు. గొప్ప ఘరానాగల మనిష్యరహస్యంగా యివ్వడం యట్లా తటస్తమవుతుంది? కాదు."
"యీప్రకారం కొన్ని గ్రామాదులలో యట్లారద్దుఅయ్నిది" "యేగ్రామం పద్ధతి ఆగ్రామంకు జర్గవలశ్నిది. వకరు జబ్బుపనిచేస్తే రెండోవారుకూడా జబ్బుపని శాయవలశ్నిదా. యిదిగ్కా వారు యేహేతువచ్తానయినా రద్దు పర్చినయెడల అంద్కు తగిన ప్రతిఫలం కనపర్చె వుందురు."
"బోగంవాళ్ళు లేక పోతే కార్యములుకావా" "భజంత్రీలు లేకపోయినా అవుతవి. బోగంవాళ్ళు లేకపోతే సంసార్లు చెడిపోతారు. గుడిశేటివాళ్ళు విస్తరిస్తారు. రేపుకెజులు యడల్ ట్రీకెజ్లు విస్తరించుతవి."
"బోగంవాళ్ల యందు యింత్త అభిమానం యెంద్కు వుండవలశ్నిది. వక బ్రాహ్మడి యందువుండకూడదా. వీళ్లకులవృత్తివల్ల విశేషంగా సంపాదించడమ్కు అవకాశం కల్గివుండగా వస్గులు యంద్కు యివ్వవలశ్నిది." "వీళ్ళకులవృత్తివల్ల వీళ్ళకు జీవనంజర్గదు. మనలో సహా వక గ్రహస్తుకు యీనాంలున్ను నవుఖరిన్ని వ్యవహారమున్ను వున్నప్పటికి సాలు 1 కి 3, 4 చొప్పున యిటువంటి వస్గులు యివ్వడముకే యిబ్బంది అని ఆలోచిస్తూ వున్నాము. యిటువంటిసంగతిలో బోగంవాళ్ళకు రెండోవృత్తి అనగా యీవస్గులవల్ల జరిగే ఆధారంపోతే యట్లా వాళ్లు జీవిస్తారు. వాళ్ళకుటుంబాలు యట్లా వృద్ధి అవుతవి. ఇదిగాక వాళ్ళకులవృత్తివల్ల వచ్చే ఖాయిలాలకె అటువంటిసొంమ్ము చాలదు. పూర్వపుమామూల్కు వ్యతిరేకంవస్తుందేమో అని గాని వాళ్ళయందు భక్తివుండికాదు. యిదిగ్కా వుత్సవములు పడిపోకుండా వుండడమ్కున్ను కారణం."
"బోగంవాళ్ళు లేక పోతె యేమినష్టం." "అనేకఖర్చులు చేశే వక గొప్పగ్రహస్తు సాలు 1 కి వస్గులకింద రు 3, 4 ఖర్చు చేస్తే యేమినష్టం. అట్లా నష్టంలేదు సరేకదా బంధువుల్కు విరోధములు వుండవు. క్షెమాపణలు వుండవు. బోగంవాళ్ళ విద్యలు వృద్ధిచేసినవారము అవుతాము. యిదిగ్కా గుడిశేటి వాళ్ళు విస్తరించ్చరు. గన్కు బోగంవాళ్ళు వృద్ధి కాకపోతె యిదేనష్టం."

ఈపయిని తీసికొన్న హేతువులే మంచివని మేమిందు గ్రహింప లేదు. వారు వ్రాసిన యిరువది నాలుగు హేతువులును ఒకదాని నొకటి మించియే యున్నవి. కాఁబట్టి వానిలో నేవి గైకొనవలెనో తోచక, అన్నిటిని గైకొన స్థలము చాలక ఈయయిదింటిని మాత్ర మిందు పొందుపరచినాము. - హాస్యసంజీవని 1878 వ సం॥ మార్చి.

వాతేస్‌దొరగారు మా కప్పుడు మండలన్యాయాధిపతిగా నుండిరి. ఆరంభదశలో నొకరిద్దఱు ప్రాడ్వివాకులు తమ్మాశ్రయించియున్న వారికిఁ గొం దఱికి న్యాయవాది పట్టాలనిమ్మనివ్రాసిరికాని పరీక్షాసిద్ధులుకారన్న కారణముచేత మామండలన్యాయాధిపతిగారు వారికిపట్టాలనియ్యలేదు. అయినను మామండలన్యాయాధిపతిగా రటుతరువాత పరీక్షాసిద్ధులు కానివారికి కొందఱికి పట్టాల ననుగ్రహించిరిగాని యొకప్రాడ్వివాకుఁడు వ్రాసినమీఁదట నిచ్చిన పట్టాలను మరల లాగుకొనిరి. అంతట నొక క్రొత్త సిరస్తాదారు వచ్చెను. ఈయనమంత్రిత్వకాలములో న్యాయవాదిపట్టా లెల్లవారికిని కొల్లలుగా నీయఁబడఁ జొచ్చెను. మొట్టమొదట న్యాయవాదులయొద్ది లేఖకులకు మాత్రమే పట్టా లియ్యఁబడెను; తరువాత న్యాయవాదులయొద్దినుండి యోగ్యతాపత్రికలను దెచ్చుకొన్నవారి కందఱికిని పట్టా లియ్యఁబడెను. ఇట్లు కొన్ని మాసములలో దాదాపుగా నెనుబదిమందికి పట్టాలను బడయుభాగ్యము లభించెను. వీరిలో నొక్కరును పరీక్ష నిచ్చినపాపమునఁబోయినవారు లేరు; పెక్కండ్ర కింగ్లీషు భాషావాసన యైనను లేదు. ఇట్లు పదిమందికి మండల న్యాయసభలోను, డెబ్బదిమందికి ప్రాడ్వివాకన్యాయసభలలోను పట్టాలు లభించినవి. ఎక్కడనో యెవ్వరోకాని లోకములో సాధారణముగా లాభములేనిపనిలోఁ బ్రవేశించువా రుండరు. అందుచేత మామండలన్యాయసభలోని న్యాయవాదులు కొందఱు తా మావఱ కంతగా ధనార్జనము చేయఁగలిగినవారు కాక పోయినను యోగ్యతాపత్రికాప్రదానమూలమున ధనసంపాదనము చేయఁగల వా రైరి. దేవుఁడు వర మిచ్చినను పూజారి వర మియ్యఁడన్న సామెత సుప్రసిద్ధమే కదా ! పైయట్లు చౌకగా యోగ్యతాపత్రికలను సంపాదించుకొనిన వారికిసహితము కొందఱకు పట్టాలు రాకుండెను. వారివిన్నపములు దొరగారిని జేరుటకయి మధ్య నింకొకముడుపు చెల్లింపవలసి యుండెను. ఈరెండవ ముడుపును చెల్లింపనివారిపేరులు మండలన్యాయాధిపతి గారి సమక్షమునకుఁ బోనే పోవు. ఈయక్రమమును సహింపక మావివేకవర్ధని పరీక్షాసిద్ధులు కాని వారికి పట్టాల నిచ్చుట యన్యాయమని ఘోషింప నారంభించెను. దాని మొఱ్ఱను విని 1878 వ సంవత్సరాం తమున నున్న తన్యాయసభవా రట్లు పట్టా లేల యియ్యఁబడినవో తెలుపవలసినదని మామండలన్యాయాధిపతిగారి నడిగిరి. న్యాయవాదిపట్టాలవిషయమునఁ గొన్ని ముఖ్యాంశములను దెలుపుటకయి 1879 వ సంవత్సరము జనవరినెల 23 వ తేది మధ్యాహ్నము మూడుగంటలకు తమన్యాయసభకు రావలసినదని మామండలన్యాయాధిపతిగారు గతదినము మధ్యాహ్నమున నా కాజ్ఞాపత్రమును బంపిరి. పట్టాలవిషయమున నేమో చెప్పవలసియుండునని నా కాయాజ్ఞాపత్రికవలన బోధపడినను, ఉన్నతన్యాయసభవా రావిషయమున మండలన్యాయాధిపతిగారి నడిగినవార్తగాని నేను చెప్పవలసినవిషయ మేమో యదిగాని నాకుఁ దెలియలేదు. అందుచేత నే నేమి చెప్పవలెనో యేమి చేయవలెనో నాకేమియుతోఁచలేదు. ఇంగ్లీషుభాగమునకు ముఖ్యముగా వ్రాయుచు నాకుఁ బ్రాణమిత్రులుగా నుండిన గవర్రాజు గారైనను నాకాలోచనచెప్పుట కప్పుడు పట్టణములో లేక పట్టపరీక్ష నిచ్చు నిమిత్తమయి చెన్న పట్టణమునకుఁ బోయి యుండిరి. గవర్రాజుగారు గాక యింగ్లీషుభాగమున కేలూరి లక్ష్మీనరసింహముగారును, అప్పుడప్పుడు చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రులుగారును వ్రాయుచుండిరి. నాకాజ్ఞాపత్రిక వచ్చినసంగతి యూరనంతటను ప్రకటనముకాఁగా నన్నుఁ జూచుటకయి నా మిత్రులైన కన్నమురెడ్డి పార్థసారథినాయఁడుగారును ఏలూరి లక్ష్మీనరసింహముగారును మాయింటికి వచ్చిరి. మేము ముగ్గురమును గలసి యప్పుడు చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రిగారి యింటికిఁబోయితిము. ఆజ్ఞాపత్రికను జూచి యాయనయు విస్మయపడెనే కాని నా కేమియు తగిన యాలోచన చెప్పలేకపోయెను. అప్పటికి సాయంకాలమైనది. పోఁతగట్టుమీఁద గోదావరియొడ్డున నడువవలెనని మేము నలుగురమును బైలుదేఱితిమి. తాత్కాలికముగా మండలన్యాయసభలో సిరస్తాదారుగా నుండినకాజ రామకృష్ణారావుగారు దారిలో మా కెదురుపడిరి. ఆవఱ కాయన నాకు పరమమిత్రుఁడుగానుండినందున, ఆయనవలన సర్వమును దెలియునన్న నమ్మకముతో నే నాయనను బలుకరించితిని. ఆయన నామాట వినిపించుకోక యజ్ఞన్న శాస్త్రి గారివంకఁజూచి "నే నిప్పుడు మంత్రిస్థానమునందున్న యధికారినగుటచేత వీండ్రకడ నేమియుఁ బ్రచురము చేయఁగూడదు. ఇప్పుడు సర్వమును అగ్ని హోత్రముఖమునఁబడి మండుచున్నది. వీండ్రిప్పుడు మీయాలోచనను గోరవలసినదే" అని పలుకుచు నిలువక గర్వముతో నడచిపోయెను. ఆమధ్యాహ్నమున నాకుఁ బంపఁబడిన యాజ్ఞాపత్రికవ్రాఁత యీయనదే. నాఁడు సూర్యగ్రహణమగుటచే న్యాయసభకు సెలవు. అందుచేత నీయనయే యాజ్ఞా పత్రికను దొరగారియింటివద్ద స్వయముగావ్రాసి సంతకము చేయించి నాకుఁ బంచివచ్చి యిట్లు సాయంకాలసంచారార్థము వెడలెను. ఈయన నాటిప్రాతఃకాలమువఱకు ప్రతిదినమును తప్పక మాయింటికి వచ్చుచు, నాకుఁ బరమాప్తునివలె నటించి యన్ని సంగతులను నావలనఁ దెలిసికొనుచు, నాతోఁ గలిసిమెలసి తిరుగుచుండెను. నేనే పత్రికాధిపతినని చెప్పి దొరగారికి కోపము తెప్పించి యాజ్ఞాపత్రికను వ్రాయించి పంచిన మహానుభావుఁ డితఁడే. వివేకవర్ధినికి భయపడి పైకి మిత్రులవలె నటించుచు లోపల ద్వేషించుచు సమయము వచ్చినప్పుడు నాకు చెఱుపు చేయఁగోరుచుండెడు కపటనాటకు లీయనవలెనే యనేకులుండెడివారు. నే నందఱిని నిజమయినమిత్రులనియే నమ్మెడివాఁడను. దండవిధాయులు న్యాయాధిపతులు మొదలయినవారిమీఁద వ్రాసిన నూరక పోవునా, ఎప్పుడో యొకప్పుడు చిక్కు రాకుండునా, అని తమలోఁ దామనుకొనుచు నాకేదో యాపద వచ్చినట్లు భావించుచు నూర నెల్లవారును నాఁడును మఱునాఁడును ఈ విషయమునే సంభాషించుచుండిరి. సమస్తమునకును న్యాయాధిపతులకెల్లను న్యాయాధిపతియైన యాశ్వరునియందే భారమువైచి నే నారాత్రి నిర్విచారముగా నిద్రపోయి, మఱునాఁడు భోజనముచేసి యథాపూర్వముగాఁ బాఠశాలకుఁబోయిపనిచేసి, రెండుగంటలయినతరువాత సెలవు పుచ్చుకొని యక్కడినుండియే తిన్నగా మండలన్యాయసభకు నడచిపోయితిని. సరిగా మూడు గంటలకు దొరగారును సభకువచ్చిరి. పత్రికాధిపతి వచ్చెనని సిరస్తాదారుగారు దొరగారితో మనవిచేయఁగా ఆయన నాకు కుర్చీయిచ్చి కూర్చుండఁబెట్టి తమపెట్టెలోనుండి వివేకవర్ధనీపత్రికను దీసి నాచేతి కిచ్చి, న్యాయవాది పట్టాలనుగూర్చిన వ్యాసమును జూపి, "ఇది మీరే వ్రాసితిరా ?" అని యడిగెను. ఉన్నతన్యాయసభవారిముద్రతో నున్న యాపత్రికను జూడఁగానే యందలితత్త్వమంతయు నా కవగత మయ్యెను. న్యాయసభాభవనమంతయు వేడుక చూడవచ్చిన పౌరులతోను క్రొత్తపట్టాల నొందిన న్యాయవాదులతోను నిండియుండెను. వెంటనే కర్తవ్యము నాలోచించి లేచి నేను "మీ ప్రశ్న కుత్తరము చెప్పుటకు ముందు నా కీయాజ్ఞాపత్రిక యేరాజశాసనాను సారముగాఁ బంపఁబడినదో యెఱుఁగ వేఁడెదను" అని బదులు చెప్పితిని. న్యాయాధిపతి యేమియు తోఁచనివానివలె నించుక యాలోచించి తా నడిగినప్రశ్నమును నే నిచ్చినయుత్తరమును కాగితముమీఁద వ్రాసి, "ఈపత్రికను మీరే ప్రకటించెదరా?" అని మఱియొకప్రశ్న వేసెను. "నేనడిగినదాని కుత్తరము చెప్పరైతిరి. మీప్రశ్నల కుత్తరములు చెప్పుటకుఁ బూర్వము నేను బదులు చెప్పుటకు బద్ధుఁడనో కానో తెలియఁగోరెదను." అని నేను మరలఁ బలికితిని. "మే మడిగినదాని కుత్తరము చెప్పుట మీకిష్టములేదు కాఁబోలును" అని దొరవారు నవ్వుచుఁ బలికిరి. "నేనుత్తరము చెప్పుటకు బద్ధుఁడనైనపక్షమునఁ జెప్పుట కిష్టమున్నది." అని నేనంటిని. "ఈదశలో మీరు బద్ధులైయున్నారని మేము చెప్పఁజాలము. మీకిష్టమున్నచోఁ జెప్పవచ్చును." అని న్యాయాధిపతిగా రనిరి. "నేను బద్ధుఁడను గానిపక్షమున బదులు చెప్పుటకు నాకిష్టము లేదు." అని నేను తెలియఁబలికితిని. ఈప్రశ్నోత్తరముల నన్నిటిని వ్రాసికొని "ఇఁక మిమ్మట్టేయుంచుట నాకిష్టము లేదు." అని దొరవారనిరి. "సంతోషము" అని చెప్పి నే నీవలికి వెడలివచ్చితిని. ఈకథ యంతయు నైదునిమిషములలో ముగిసినది. రామకృష్ణారావుగారు లోపలికిఁ బోయి "న్యాయాధిపతి తెలివితక్కువవాఁడు గనుక సరిపోయినదిగాని యిటు వంటియవినయోక్తులు పలికినందున కింకొకఁడైన సభాతిరస్కారముక్రింద దండించి యుండఁడా?" అని తనక్రిందియుద్యోగస్థులవద్ద కేకలువేసెను. నా ధైర్యమునకు సంతోషించి, నా కావఱ కమిత్రుఁడుగా నుండినయొక న్యాయవాది నాతో వెలుపలికి వచ్చి నన్నా లింగనము చేసికొని, మరల మిత్రభావమునుజూపెను. నేను మరలి యింటికిఁ బోవుచుండఁగా నే నాదినమున కారాగృహమునకుఁ బంపఁబడుదునని నమ్మి వింత చూచుటకయి గుంపులుగుంపులుగా న్యాయస్థానమునకుఁ బోవుచున్న మూఢజనులు దారిపొడుగునను నా కెదురుపడి నావంక నివ్వెఱఁగంది చూడఁ జొచ్చిరి. నేను సభవిడిచి వచ్చినతరువాత నామీఁద మాననష్టమున కయి యభియోగము తేవలసియున్నదని మాన్యాయాధిపతిగారు దండవిధాయికి వ్రాయఁగా, ఆతఁ డది వ్యావహారికవిషయమయినందున ముందుగా దొరతనమువారియంగీకారము పొంది యభియోగము తేవలసియుండునని బదులు వ్రాసెను. అప్రతిష్ఠ కలిగించినందునకయి నాపయి నభియోగము తెచ్చుటకు సెల వియ్యవలసిన దని దొరగారు దొరతనమువారికి వ్రాసికొనిరిగాని వా రంగీకరింపరైరి. ఈలోపల నున్నతన్యాయసభవారును దొరతనమువారును ఇచ్చినపట్టాల నెల్ల మరల నూడఁదీసికోవలసినదని మామండలన్యాయాధిపతిగారి కుత్తురువు చేసిరి. ఆయన పైవారియుత్తరువును చెల్లింపఁగా, క్రొత్తగా నంగీలు కుట్టించుకొని నాలుగునెలలభొగ మనుభవించిన నవీనన్యాయవాదులు తమధనమును పట్టాలునుగూడఁ గోలుపోయి కొంతలము నన్నును మావివేకవర్ధినిని శపించుచుండిరి.

ఆకాలమునందు వేశ్యనుంచుకోనివాఁ డరసికుఁ డనియు పౌరుషహీనుఁ డనియు భావింపఁబడుచుండినట్టే లంచములు పుచ్చుకోనివాఁ డప్రయోజకుఁ డనియు బుద్ధిహీనుఁడనియు పరిగణింపఁబడుచుండెను. అప్పుడు లంచములు స్వీకరింప నొల్లని ధర్మపరులయిన రాజకీయోద్యోగులు సహిత మందందుఁ గొందఱుండుచువచ్చిరిగాని యట్టివారిసంఖ్య యత్యల్పమయియుండెడు. లంచములు గైకొనుట యుద్యోగధర్మమని యెల్లవారును దలఁచియుండుటచేత నిచ్చువారుగాని పుచ్చుకొనువారుగాని దానిని తప్పుగాఁ దలఁపకుండిరి. రహస్యమన్నదిలేక బంటుమొదలుకొని మంత్రివఱకును రాజపురుషులందఱును బహిరంగముగానే యుత్కోచస్వీకరణము చేయుచుండిరి. దొరలవద్ద క్రింది యుద్యోగములలో నున్నంతకాలమును లంచములు పుచ్చుకొనుచుండినవారే యైనను, తాము స్వతంత్రులయి ప్రాడ్వివాకపదము నొంది న్యాయకర్తలయిన తరువాత ననేకులు లంచములు మానుచుండిరి. 1878 వ సంవత్స రారంభమున పోలూరి శ్రీరాములుగా రనునతఁడు కొంతకాలము రాజమహేంద్రవరమునకు ప్రాడ్వివాకుఁడు (డిస్ట్రిక్టు మనసబు)గావచ్చెను. ఆయనచెల్లెలిని మామండల న్యాయసభలో దొరతనమువారి న్యాయవాదిగా నుండిన చిత్రపు కామరాజు గారికుమారున కిచ్చివివాహముచేసినందున వారిరువురు నా ప్తబంధులును పరమ మిత్రులునయి యుండిరి. క్రొత్తగా ప్రాడ్వివాకపదమునకు వచ్చినయాఘనుఁడు చిన్నతనమునుండియు చవిగొనుచుండి లంచములు మరగి యున్న వాఁ డగుటచేత నిప్పు డెక్కువయవకాశము కలుగఁగానే తా నచ్చటనున్న కాలములోనే సాధ్యమైనంత యధికధనార్జనము చేయ నిశ్చయించుకొనెను. కాఁ బట్టి యతఁడు వాది, ప్రతివాది, దరిద్రుఁడు, ధనికుఁడు, న్యాయము, అన్యాయము, అని చూడక సర్వభక్షకుఁడైన యగ్ని హోత్రునివలెఁ దన్నుఁజేరినవారి కడనెల్లను ద్రవ్యభక్షణము చేయఁబూనఁగా, ధనంజయునకు ప్రభంజనుఁడు తోడుపడునట్లుగా మహాబలుఁడైన చిత్రపు కామరాజు గా రాయనకు సహాయులయి నిలిచిరి. అందుచేత నాబ్రాహ్మణప్రభువు నిర్భయుఁడయి, ధర్మ దేవతను గోవునుగా మనపూర్వులు వర్ణించియుండుటచేత విపణివీధిలో గోవును విక్రయించునట్టే బహిరంగముగా న్యాయసభలోనే ధర్మమును పాటపాడించి విక్రయింపఁ జొచ్చెను. కాఁబట్టి యీయనకాలములో న్యాయ మెక్కువ పాట పాడినవారిసొమ్మే యగుచుండెను. అప్పుడీన్యాయవిక్రయమునకయి వ్యావహారిక పరిభాష యొకటి క్రొత్తగా నేర్పడవలసివచ్చెను. ఈపారిభాషిక వ్యవహారశాసనమునుబట్టి న్యాయవాదులకు వాదిప్రతివాదులపక్షమున యుక్తులుచెప్పి వాదింపవలసిన శ్రమము తప్పిపోయి పని సులభమయ్యెను. వారు వేఱువాదముతో పనిలేక యానూతనవ్యవహారశాసనముయొక్క ప్రకరణసంఖ్య ను పేరుకొనుటయే వారివాదమునకుఁ జాలియుండెను. న్యాయాధిపతిగారు వారుదాహరించినప్రకరణబలమును రహస్యమున విచారించి తాముతృప్తిపొందిన పిమ్మట వ్యవహారము నేదో యొకపక్షమున తీర్చుచుండిరి. ఆనూతనశాసనములో దశసంఖ్యలును తద్గుణితసంఖ్యలును గలప్రకరణములే కాని వానినడిమి యంకెలు గలప్రకరణములేవియు లేవు. వాదిపక్షమున వచ్చినన్యాయవాది "ఏలినవారు 100 వ ప్రకరణమును చిత్తగించి న్యాయము దయచేయింప వలెను" అని వేఁడఁగా, ప్రతివాదిపక్షమున వచ్చినన్యాయవాది "ఆప్రకరణము పనికిరాదు. ఏలినవారు 150 వ ప్రకరణమును చిత్తగించి న్యాయము దయచేయింప వలెను." అని మనవి చేసికొనును. ఆపయి నొకరితరువాత నొకరుగా 160, 170, 180, 190, 200 అని యుభయపక్షముల న్యాయవాదులును నూతన న్యాయశాసనముయొక్క ప్రకరణముల నుదాహరించుచు రాఁగాఁ గడపట నెక్కడనో యొక సంఖ్యకడ పాట నాటికి నిలిచిపోవును. "మంచిది. ఆలోచించెదము. అప్రకరణార్థము నీరాత్రి సావధానముగా చిత్తగించి రేపు సభలో తీర్పుచెప్పెదము" అని చెప్పియాప్రకరణసంఖ్యను వ్రాసికొని యా గ్రంథమునప్పటి కంతటితో ముగించి, మునసబుగారు మఱియొకగ్రంథనకు దిగి యీప్రకారముగా దినమున కెన్ని యోవ్యవహారములను విచారించి తీర్చు చుండిరి. పెద్దప్రకరణమును జూపి యెక్కువపాట పాడినన్యాయవాది యా రాత్రి యాన్యాయపరిపాలకునియింటికిఁ బోయి యాప్రకరణార్థమును కన్నులకుఁ గట్టినట్టుగా దీపము వెలుతురున విశదముగాఁ జూపినపక్షమున మఱునాఁ డాపక్షమునమునసబుగారు న్యాయసభలో తీర్పువినిపించు చుందురు. నూఱవప్రకరణమనఁగా నూఱురూపాయలనియు, నూటయేఁబదవ ప్రకరణమనఁగానూట యేఁబదిరూపాయలనియు, ఆనూతనశాసనము యొక్కపారిభాషికప్రకరణము లన్నియు వాగ్రూపములుగాక ధనరూపము లయినవని నాకు వివరింపవలసిన శ్రమ యియ్యకయీవఱకే బుద్ధిమంతులయిన మాచదువరులు తమంతనే గ్రహించి యుందురు. ఇట్లధికారులకు లంచములిచ్చి తాములాభము పొందుచుండుట కాకాలపున్యాయవాదులలో ననేకు లలవాటుపడిన వారేయయినను, ఈయపూర్వ న్యాయాధికారియొక్క వ్యవహారనిర్ణయప్రకారము వారికి సహితము దుర్భరమయ్యెను. ఇప్పుడు న్యాయాధిపతియే బోసినోటిపులి యయి సర్వమును దానే గుటుక్కున మ్రింగువాఁడయినందున, అధికారుల పేరులు చెప్పి యెక్కువ పుచ్చుకొని తక్కువ యిచ్చు చుండువారికి వీసమో పరకోగాని హెచ్చుమిగుల కుండెను. మామునసబుగారు గొప్పగొప్ప మొత్తములను స్వీకరింప వలెనన్న యత్యాశచేత వరుస తప్పించి పెద్దమొత్తములుగల వ్యాజ్యములను ముందుగా విమర్శించి తీర్ప నారంభించిరి; అంతేకాకతామున్న యల్పకాలములోనే విశేష పొత్తము సంపాదింపవలెనన్న దురాశచేత నేకకాలమునందే రెండుమూఁడు వ్యాజ్యములలో సాక్షులవిచారణ చేయుచు, తామొక్కవ్యవహారములో సాక్షులవిమర్శచేయుచు నింకొకవ్యవహారములో సాక్షులవిమర్శ చేయుటకు గుమాస్తాల కప్పగించుచుండిరి; ఒక్క సారిగా నన్ని వ్యాజ్యముల గ్రంథమును సాక్షివాగ్మూలములను ప్రతిదినమును జదివి తీర్పులు వ్రాయుట యొక్కరికి దుర్భరముగానఁ దాము కొన్ని వ్యాజ్యముల గ్రంథమును జదివి స్వయముగా తీర్పులు వ్రాయుచు, మఱికొన్నిటిని తమచుట్టమైన చిత్రపు కామరాజుగారి కప్పగించి యాయనచేత చిత్తితీర్పులు వ్రాయించి తాము వానికి శుద్ధప్రతులను వ్రాసికొనుచు యథేచ్ఛముగా విహరింపఁ జొచ్చిరి. ఇట్లాతఁడు విచ్చలవిడిగా లంచములు పుచ్చుకొని ప్రజలను దోఁచి యన్యాయము చేయుచుండినను, పయియధికారియైన మామండలన్యాయాధిపతిగా రాయన కేవల న్యాయమూర్తియనియే భావించుచుండిరి. న్యాయవాది పట్టాలసత్రమును వేసిన వాలేసుదొరగారే మాకప్పుడు మండలన్యాయాధిపతిగా నుండిరి.

అప్పు డీయధికారియొక్కదుర్న యము నేలాగుననయినఁదుదముట్టింప వలెనని నిస్ఛయించుకొని మావివేకవర్ధని ధర్మస్థాపనదీక్షవహించి కార్యసిద్ధి కయి సాక్ష్యాన్వేషణ ప్రయత్నములో నుండెను. ఇంతలో బాధ నొందిన ప్రజలును వారిపక్షమునఁ బనిచేయున్యాయవాదులు కొందఱును ప్రాడ్వివాక శిఖామణియొక్క దౌర్జన్యములనుగూర్చి మొఱ్ఱపెట్టుకొన నారంభించిరిగాని వారిలో నొక్కరును తాము లంచము లిచ్చినట్టు గాని మునసబు లంచములు పుచ్చుకొనుచున్నట్టుగాని బహిరంగముగా సాక్ష్యమిచ్చుటకు సిద్ధపడినవారు కనఁబడలేదు. రాజకీయశాసనములనుబట్టి లంచము లిచ్చినవారును పుచ్చుకొన్న వారునుగూడ సమానముగానే దోషులయి దండనమునకుఁ బాత్రులగు చుండుటచేత నెవ్వరును మేము లంచ మిచ్చితిమని పైకి వచ్చుటకు సాహసింపకుండిరి. లంచములనుగూర్చి నాతోఁ బలుమాఱు చెప్పుచు వచ్చిన కొందఱు న్యాయవాదులు మాత్రము తాము లంచములిచ్చినట్టు ప్రత్యక్షముగాఁ జెప్పకపోయినను సమయమువచ్చినప్పుడు పయియక్రమములు జరుగుచున్నట్టు చెప్పి సాక్ష్యమిచ్చెదమని వాగ్దానముచేసిరి. నేను వెంటనే నామిత్రులైన చల్లపల్లి బాపయ్యపంతులుగారిని చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రి గారిని మాయింటికి రప్పించి, పయిన్యాయవాదు లావఱకు నాతోఁ జెప్పినదాని నెల్లను మరల వారియెదుటఁ జెప్పించి, మేము మువ్వురమును గలిసి మునసబు లంచములు పుచ్చుకొనుచున్నాఁడన్న యర్థము సూచన యగునట్లుగా చైత్రమాసపత్రిక కింగ్లీషున నొకవ్యాసమును వ్రాసితినమి. ఆవ్యాసము పత్రికలోఁ బ్రకటింపఁబడుటకుముందుగా లంచములు పుచ్చుకొను విషయమును మాత్రము విడిచి తక్కిన విషయముల నొకకాగితముమీఁద వ్రాసి చేవ్రాళ్లుచేసి నాకిచ్చెదమని యన్యాయవాదు లప్పుడొప్పుకొనిరి. ఆవ్రాఁతను బ్రచురపఱుపక నాయొద్దనే యుంచుకొనుటకును సమయము వచ్చినప్పు డాన్యాయవాదులు తద్విరుద్ధముగా సాక్ష్యమిచ్చినప్పుడుమాత్రమే నేను దాని నుపయోగించుటకును నే నొప్పుకొంటిని. నాతోఁజెప్పిన న్యాయవాదులలోఁ గొందఱప్పు డచ్చట లేనందునఁ దరువాత నందఱును జేరివ్రాసి చేవ్రాళ్లు చేసినకాకితమును నాయొద్దకుఁ బంపెద మనిచెప్పి వచ్చినన్యాయవాదులు వెడలిపోయిరి. వ్రాసిన వ్యాస మచ్చుకూర్పఁబడి ప్రకటనమునకు సిద్ధమయ్యెనుగాని న్యాయవాదులు పంపెదమనివాగ్దానము చేసినలేఖమాత్రము నాకు చేరలేదు. మఱునాఁడు పత్రిక ప్రకటింపఁబడు ననఁగా గతసాయంకాలమున నే నాన్యాయవాదుల కడకు వారిమిత్రునినొక్కనిని లేఖనిమిత్తము పంపితిని. వారులేఖను మఱుసటి దినమునఁ బంపెదమని నాకు బదులు పంపి, తా మీవ్యవహారములోఁ దగులుకొనఁగూడదనియు పత్రికావిలేఖకులు తగులుకొని చిక్కులు పడుచుండఁగాఁ దాము పయినుండి వేడుక చూడవచ్చుననియు తమలోఁ దామోలోచించు కొనిరఁట. ఆవార్తతెచ్చినయతఁడు మాటలధోరణిని వారిరహస్యమును నాకడ వెలిఁబుచ్చెను. జరగినమోసమునకు నేనాశ్చర్యవిషాదముల నొందియు నణుమాత్రమును నిరుత్సాహుఁడను గాక మనోవికారమేమియు ముఖచిహ్నములవలనఁ గానరానీక శాంతభావముతో, వారు వేఱుగ వ్రాసియియ్యవలసినయా వశ్యకమే లేదనియు, పెద్దమనుష్యుల యెదుటఁ జెప్పియుండుటచేత నాకాసంగతులను దెలిపినవారిపేరులుకూడ పత్రికలోవేసి ప్రకటించెదననియు, ఆతనితోఁ జెప్పి నట్టుగాఁజెప్పితిని. ఆతఁడప్పుడే నాయొద్దనుండి పోయి తనకాప్తుఁడయినయొక న్యాయవాదితో నే నన్నమాటలు చెప్పెను. ఆతఁడుతమ పేరులు వెల్లడియగునని భయపడి తక్కిన న్యాయవాదులకడ కాలోచనకుఁ బోయెను. రాత్రి భోజనములయినతరువాత వారు స్వగృహములయందు దొరకరు. వారి నప్పుడు సందర్శింపవలె నన్న పక్షమున వేశ్యాగృహములలోనె వెదకవలెను. తాము వేశ్యలయిండ్లనుండి శృంగారవేషములతో వచ్చుచుండగా నాకంటఁబడుట నాకవమానకరమని యెంచి, పగలు పదిగంటలకు నేను పాఠశాలకు నడచిపోవు చుండునప్పుడు నారాక వేచియుండి పాఁచిముఖములతో తాంబూలములు నమలుచు బోగముదానియింటినుండి రావలె నని పూర్వము నా కెదురుపడు చుండినమహానుభావులును వారిలోనొకరిద్దఱుండిరి. నాఁటిరాత్రివారెట్లో నిశాసమయమున కందఱునొక్కచోట సమావేశమయిరి. నడిరేయి రెండుజాముల వేళనెవ్వరో మావీధితలుపులు గుద్దుచున్నట్టును నన్ను గట్టిగాఁ బిలుచుచున్నట్టును సందడివినఁబడఁగా, నేను గాఢనిద్రలో నులికిపడి లేచి మేడదిగి వచ్చి తలుపు తీయునప్పటికి మాన్యాయవాదు లందఱును నాకుఁబ్రత్యక్షమైరి. వారు మహాసత్యసంధులవలెను ధర్మమూర్తులవలెను నటించుచు నన్నుఁజూచి, నే నేమో తమవిషయమున నిష్కారణముగా సందేహపడినట్టు తెలియవచ్చెననియు పద్దమనుష్యులనోటినుండి మాటవచ్చినతరువాత ప్రపంచ మట్టిట్టయినను తప్పిపోవుట యుండదనియు, ఏమేమో నీతివాక్యములు పలికి తాము వాగ్దానము చేసినలేఖ నప్పుడు వ్రాసి యిచ్చెదమని చెప్పిరి. వారావఱకు వ్రాసి యిచ్చెదమన్న విషయములను మాత్రమే కాక నాతో వారు జెప్పినమఱికొన్ని విషయములను గూడ వారిచేత నప్పుడు వ్రాయించి పుచ్చుకొని వారి నిండ్లకుఁబంపివేసితిని. మనలోని పెద్దమనుష్యులు సహితము సమయము వచ్చినప్పుడు బొంకుటకును వంచించుటకును సంశయింపరని చూపుటకయి యింతకుఁ బూర్వము నడచిన యొకచిన్న వృత్తాంతము నీసందర్భమునఁ దెలిపెదను.

రాజమహేంద్రవరమున మావీధికి రెండవవీధిలోఁ గొంతచూపరియు జవ్వనియు నయినయొక వైశ్యకాంత యుండెను. భర్త కురూపియు వృద్ధుఁడు నయియుండుటచేత నాతరుణి కొంత పయియాటల మరగినదయ్యెను. అందుచేత యువజను లనేకు లామెకు వశ్యులయి యుండిరి. ఆకోమటిజవరాలికిని పొరుగింటనే వసించియుండిన యొకబ్రాహ్మణయువతికిని జగడముతటస్థించినప్పు డావైశ్యాంగన 'నిన్నేమి చేయించెదనో చూడు' మని యాబ్రాహ్మణాంగనను బెదరించెనఁట. ఆబ్రాహ్మణయువతి పదునాఱేండ్లప్రాయముగలది; అత్తవారియూరినుండి నవరాత్రములపండుగకు వితంతుమాత పిలుచుకొని రాఁగా పుట్టినింటికి వచ్చియుండినది. ఆతరుణు లిరువును తగవులాడిన మఱునాఁడురాత్రి పదునొకండుగంట లయినతరువాత ముగ్గూరారక్షకభటులాబ్రాహ్మణ గృహముకడకు వచ్చి తలుపు తట్టి కేకలువేసి యాచిన్న దానిని పేరు పెట్టిపిలిచిరి. నిద్రలో కేకలు విని యెవ్వరో తలుపువద్దఁ బిలుచుచున్నారని లేచి వచ్చి తలుపు తీసినయాపడుచును చేయిపట్టుకొని వాండ్రు వీధిలోనికి లాగి, 'నీవు ఆత్మహత్య చేసికొనఁబోవుచున్నావని మాకు సమాచారము తెలిసినది; ఆరక్షకస్థానమునకు నడువుము' అని బలాత్కారముగా నీడ్చుకొని పోయి కొంతదూర మరిగినతరువాత దారిలో నొకయరుగుమీఁద నామెను గూర్చుండఁబెట్టి యామె నెందునకో నిర్బంధింపఁ జొచ్చిరఁట. అంతట నా చిన్న దానిభాగ్యముచేత నాత్రోవను బోవఁ దటస్థించిన యొక పెద్దమనుష్యు డామెయేడుపువిని చేరరాఁగా భటులు భయపడి పడుచును విడిఁచిపాఱి పోయిరఁట. తచ్ఛాఖవాఁడైన యాబ్రాహ్మణగృహస్థుఁ డాయువతివలన జరగిన వృత్తాంత మంతయు విని యామెను వెంటఁబెట్టుకొని యింటికిఁ గొనిపోయి కొమార్తెనిమిత్త మేడ్చుచున్న తల్లి కప్పగించి పోయెను. అట్లు విడిపించి యా తరుణిమానమును కాపాడినయా పెద్దమనుష్యుఁడు మఱునాఁడు ప్రాతఃకాలముననే నాయొద్దకువచ్చి గతరాత్రిజరగినయారక్షకభటులదౌర్జన్యమును నాతో జెప్పి పత్రికలోఁబ్రకటింపుమని కోరెను. నేనారెండుస్థలములకును బోయి విచారింపఁగా నేను విన్న దంతయు వాస్తవమయినట్టు స్పష్టపడెను. నే నాదుర్నయమునుగూర్చి వివేకవర్ధనిలో వ్రాసిప్రకటించితిని. ఆరక్షకమండలాధ్యక్షుడు పత్రికలో వ్రాయఁబడిన విషయమునుగూర్చి విచారణముచేయ నారంభింపగా, నేను విన్న కన్న సంగతులను సరిగాఁ జెప్పితిని; నాతోఁ జెప్పిన పెద్ద మనుష్యుఁడు తానావిషయమే యెఱుఁగననియు, నాతో నేమియు జెప్ప లేదనియు, సాక్ష్యమిచ్చెను; ఆచిన్న దానితల్లి తమయింట నేమియునల్లరిజరగ లేదనియు, తనకూఁతురారాత్రి తెల్లవాఱినదాఁక తనయొద్దనే పరుండియుండె ననియు, తెలియఁజేసెను; పరిభవపఱుఁబడినయాపడుచు తన్నె వ్వరునువీధిలోని కీడ్చుకొని పోలేదనియు, తానింటసుఖముగా నిద్రించు చుంటి ననియు చెప్పెను. అయిననుఁ, ఆరక్షకభటాధ్యక్షుఁడు నామాటయందు విశ్వాసము కలవాఁడయి, ఆభటులపేరులు తరువాత నావలనఁ దెలిసికొని వారి ననారోగ్యకరమైన మన్నెపుప్రదేశమునకుఁ బంపి శిక్షించెను. పిమ్మట మొదట నాతోఁ జెప్పినపెద్దమనుష్యుఁడు మరల నాయొద్దకువచ్చి, నిజము చెప్పినయెడల స్త్రీలు కార్యస్థానములవెంటఁ దిరుగవలసివచ్చునని తానట్లు కల్ల లాడవలసివచ్చె ననియు, స్త్రీలవిషయమున బొంకిన ననృతదోషము లేదనియు, చెప్పి క్షమా ర్పణముచేసెను. లిఖితపూర్వకమయినసాక్ష్యము లేక పెద్దమనుష్యులమాటలను నమ్మి పని చేయఁ బూనుట యీదేశములో క్షేమకరము కాదని నా కప్పుడు మొట్టమొదట బోధపడినది.

ఇఁక మరల మనము మనమునసబుగారి వ్యవహారమునకు వత్తము. నా ప్రాణమిత్రులైన బసవరాజుగవర్రాజుగారు పత్రికానిర్వహణాదులయందు నాకత్యంతసహాయులుగానుండినను, ఆయన కామరాజు గారితోడియల్లుఁ డగుటచేత నే నే యాయన కీవ్యవహారములో నేమియు పని పెట్టకుంటిని. అయినను గవర్రాజు గారుమాత్రము బంధుత్వమును బట్టి కామరాజుగారిపక్షమే చేరవలసినవా రయినను న్యాయైకపక్షావలంబముచేతను స్నేహభావముచేతను నాపక్షమునే వహించి యుండి నేనొకవేళ కామరాజుగారికి విరోధముగా పనిచేయ నియమించినను చేయుటకు సంసిద్ధులయియే యుండిరి. మేమాకాలము నందు ప్రజాక్షేమమునిమిత్తమయి పనిచేయవలసివచ్చినప్పుడు స్వజాతివాఁడనియు బంధువనియు మిత్రుఁడనియుఁ జూచెడివారముకాము. నేనొక నాఁడు ప్రాడ్వివాకన్యాయస్థానమునకుఁ బోయి ప్రచ్ఛన్నముగా నొకమూలఁ గూరుచుండి యాఘనునివర్తన మంతయు సావకాశముగాఁ జూచి వచ్చితిని. నేను వచ్చితినని వినియు వివేకవర్ధనిలోఁ దనమీద వ్రాయఁబడినదానిని జదివియు మొదట నతఁడించుక సంచలించెనుగాని లంచములయం దాఱితేఱిన దైర్యశాలి యగుటచేతను పట్టణములో నత్యంతప్రబలుఁడుగా నుండిన చిత్రపు కామరాజు గారు తనకుమంత్రియయి సహయుఁడయి యుండుటచేతను జంకక లంచములకుఁ గొంకక యెప్పటివలెనే వ్యవహారము నడపసాఁగెను. అంతేకాక వా రిరువును తత్పక్షమువారును జేరి నాకు చెఱుపు చేయ యత్నించుచుండిరి. ఉద్యోగస్థులందఱును వారిపట్టగుటచేత నాకప్పుడు సహాయులు గానుండువారు న్యాయసభలలో నెవ్వరును లేరు. బంటు మొదలుకొని ప్రభువువఱకు నెల్లరును ప్రతిపక్షులకే సహాయులు గా నుండిరి. వివేకవర్ధనిని జదివియు మామండల న్యాయాధిపతిగా రెంతమాత్రమును విచారణ చేయక యుపేక్షించి యూర కుండిరి. మంత్రాంగమును నడపెడిక్రిందియుద్యోగస్థులు ప్రాడ్వివాకు లగు పోలూరి శ్రీరాములు గారు కేవలధర్మమూర్తులనియు వారిపైని దోషారోపణము చేయు మాబోటు లీర్ష్యాపరు లగు నీతిమాలినదుష్టులనియు మామండల న్యాయాధిపతిగారికి దృఢఃవిశ్వాసము కలుగునట్లు చేసిరి. మండలన్యాయసభలోని యప్పటి రాజసేవకులలో పదిరూపాయల జీతముగల లేఖకుఁడైన బయపునేడి వేంకటజోగయ్యగా రొక్కరుమాత్రము నాకుమిత్రులయి నాపక్షమవలంబించి యుండిరి. ఆయనవలననే నాకప్పుడు న్యాయస్థానమునందు జరగు కుతంత్రములు కొన్ని యప్పుడప్పుడు తెలియుచుండెను. ఈవిధముగా నధికారబలమును మనుష్యబలమును మాప్రతిపక్షులపక్షముననే యున్నను సత్యబలమును దైవబలమునుమాత్రమే మాకు సహాయములయి యుత్సాహజనకములుగా నుండెను. దుర్బలపక్షమైన మాకపజయము తప్పక కలుగునని యెల్లవారును బ్రతీక్షించుచుండిన యాకాలములో నీశ్వరుఁడు మా కొక్కయాధారమును గనఁబఱిచెను. చిత్రపుకామరాజుగారు మునసబుగారినిమిత్తము వ్రాసినచిత్తుతీర్పు కాగితములను శుద్ధప్రతులు వ్రాయఁబడినతరువాత చించివేసి యాముక్కులను చింపివేయఁబడినయితరమైన కాగితపుముక్కలను గలిపి తమయింటి కెదురుగా నుండిన పాడుదొడ్డిలోని పెంటకుప్పలలోఁ బాఱవేయించు చుండిరి. అందులో తీర్పుముక్కలున్నవని మాకప్పుడు తెలియకపోయినను వారియింటి కెదుటింటిలోఁ గాపురమున్న యొకన్యాయవాది వచ్చి వారేవో కాగితపుముక్కలు పాఱవేయుచున్నారని నాతోఁజెప్పెను. అవియెందులకైనను బనికి రావచ్చునని తలఁచి వీధులు తుడుచుదాని కేమైననిచ్చి యాముక్క లెత్తించి తీసికొని రావలసినదని నే నాన్యాయవాదితోఁ జెప్పితిని. అతఁడట్లుచేయించి రెండుబుట్టలతో ముక్కలను మాయింటికడఁ జేర్చెను. ఆముక్క లే మైన నతికి చదువఁదగియుండునేమో యని యొకదానితోనొకటి చేర్చి ప్రయాసపడి యతికింపఁ జొచ్చితిని. శ్రమపడి యతికించినవానిలోఁ గొన్ని కరగ్రాహి మొదలైనవారికి వ్రాయఁబడిన యుత్తరములయి యెందునకుఁ బనికిరానివయి పోయెను. ముక్కలు సంగ్రహించి తెచ్చినన్యాయవాది యతికించినవానిలో రెండుకాగితములు చేరి పూర్ణముగా నొకతీర్పయ్యెను. పడిన ప్రయాసము వ్యర్థమయిపోలేదని నా కప్పు డపరిమితసంతోషము కలిగినది. ఆవ్యాజ్యమును గోలుపోయినవాఁ డొకమహమ్మదీయుఁడు. నాసహపాఠియు రెండవతరగతి న్యాయవాదియునైన దామరాజు నాగరాజుగారిచేత నామహమ్మదీయునిఁ బిలిపించి మాటాడఁగా, అతఁడు కామరాజుగారు లంచ మిమ్మని తన్నడిగినప్పుడు బీదవాఁడగుటచేతఁ దానియ్య లేకపోయితిననియు ప్రతివాదియొద్ద లంచముపుచ్చుకొని మునసబు వానిపక్షమున తీర్పుచేసెననియు చెప్పెను. ఆ సంగతులనే తెలుపుచు మహమ్మదీయునిసమ్మతితో మండలన్యాయాధిపతిపేర విన్నపమొకటి వ్రాయించి దానిలోవానిచేతవ్రాలు చేయించి, చిత్తుతీర్పు యొక్క సగముభాగము నందుతోఁ జేర్చికుట్టించి మండలన్యాయసభలోఁ బెట్టించితిమి. నాగరాజుగారియొద్ద లేఖకుఁడుగానుండిన మిర్తిపాటి రామయ్యగా రావిన్నపములోఁ బేర్కొనఁబడిన సాక్షులలో నొకఁడు. ఈవిన్నపము సంగతి తెలియఁగానే మహాతాంత్రికుడైన కామరాజుగా రామహమ్మదీయుని రహస్యముగాఁ దనయింటికి రప్పించి, వానికి వాజ్యపు మొత్తమునకు ద్విగుణముగా ధనమిచ్చి వానియొద్దనున్న తీర్పుముక్కల నపహరించెను. అన్ని రూపాయలొక్కసారిగా చేతఁబడఁగానే యామహమ్మదీయుఁడు పట్టరాని సంతోషముతోఁ దనమిత్రులకు విందు చేసెను. ఈవిందువలన ముక్కలుపోయినట్టుమాకుఁ దెలిసినది. ఈలోపల మఱిమూడునాలుగుతీర్పుల ముక్కలనుగూడ మేమతికి పూర్తిచేసితిమి. ముక్కలు పోయినసంగతితెలియఁగానే సాక్షియైన మిర్తిపాటి రామయ్యగారిచేత మహమ్మదీయుఁడు చిత్రపుకామరాజుగారివద్దసొమ్ము పుచ్చుకొనితిరిగిపోయి ముక్కలిచ్చివేసెననియు, కామరాజుగారు మునసబుగారికి లంచములు కుదుర్చుచున్నట్టును దీర్పులువ్రాసియిచ్చు చున్నట్టును ఋజువు చేయుటకు తనయొద్ద నాధారము లున్నవనియు, మహమ్మదీయునితీర్పుయొక్క సగముముక్క తనయొద్దనున్నదనియు, మండల న్యాయసభలో నొకవిన్నపము పెట్టించితిమి. ఇంతలో కామరాజుగా రా మహమ్మదీయునిచేత తనవిన్నపములోనిసంగతు లేవియుఁ దా నెఱుఁగననియు, ఒక న్యాయవాది (దామరాజు నాగరాజుగారు) మోసము చేసి తనచేత నందులో సంతకముచేయించెననియు, తనవిన్నపమును విమర్శింపనక్కఱలేదనియు, మఱియొక విన్నపమును బెట్టించెను. అందుపైని మండలన్యాయాధిపతి గారా న్యాయవాదిని మహమ్మదీయునిని బిలిపించి వారు చెప్పినసంగతులను వ్రాసికొనిరిగాని పిమ్మట నేమియుఁజేయక యూరకుండిరి. మిర్తిపాటి రామయ్యగారిచ్చిన విన్నపముపైని మామండలన్యాయాధిపతిగారు మహమ్మదీయునితీర్పు యొక్క సగముముక్కను బుచ్చుకొని, సాక్షులపేరులను తక్కిన యాధారములను ప్రదర్శింపవలసినదని యుత్తరువిచ్చిరి. నాయొద్ద నింకను తనవ్రాతఁతో నున్న ముక్కలున్నవని కనిపెట్టి నాయొద్దనున్న ముక్కలనన్నిటిని నిచ్చి వేసినపక్షమున నైదువేలరూపాయల నిచ్చెదమని చిత్రపు కామరాజు గారు నాకు సందేశమును బంపిరి. ఆసందేశము నప్పుడు నేను తిరస్కారభావముతో నిరాకరించితిని. ఇప్పటికైదుతీర్పులముక్కలను మేము పూర్ణముగా నతికింపఁ గలిగితిమి. అతికింపఁబడినవానిలో నొక్కతీర్పునుమాత్రము నాయొద్దనుంచుకొని తక్కిన నాలిగింటి ముక్కలను ఒక్క కాగితపుసంచిలోఁబెట్టి నా యుంగరముతోనే లక్కముద్రవేసి, మిర్తిపాటి రామయ్యగారిని నావెంట మండలన్యాయసభకుఁదీసికొనిపోయి, ఆముక్కలసంచిని విమర్శదినమువఱకును న్యాయాధిపతి సొంతపెట్టెలోనే యుంచుకొనునట్లు విన్నపము వ్రాయించి, వానిని దొరవారికిఁ బ్రదర్శింపించితిని. ఇంకను మేము క్రొత్తతీర్పుల నతికించుటకయి పాటుపడుచునే యుంటిమి. పనికిమాలినవని తీసివేసినముక్కలు పోఁగా నింకను బుట్టెడుముక్కలు నాయొద్దమిగిలియుండినవి. వానిలో నేవైన సరిగా నతుకునేమో చూచుటకయి యాబుట్టను నేను దామరాజు నాగరాజు గారియొద్దనుంచితిని. ఆమఱునాడుఁదయమున జాముప్రొద్దెక్కిన తరువాత నొకరెండవ తతగతిన్యాయవాది నాగరాజుగారి యింటి యొద్దినుండి మా యింటిదారిని బోవుచు వీధిలోనిలువఁబడియున్న నాతో మాటాడుటలో మునసబుగారును కామరాజుగారును నాగరాజుగారియింటి కేదోపనిమీఁదదన్నుఁ బంపినట్లు పొరపాటునఁ గొన్నిమాటలు జాఱవిడిచెను. నేనాయనను బంపివేసి వెంటనే నాగరాజుగారియింటికిఁబోయి యాముక్కలబుట్టను దీసికొనివచ్చి నాపెట్టెలోఁబెట్టి తాళము వేసితిని. ముక్కలనిచ్చినచోఁదనకేనూఱుపాయ లిచ్చెదమని సందేశము పంపిరనియుఁదాను నిరాకరించితిననియు నాగరాజు గారు తరువాతనాతోఁ జెప్పిరి. అటుపిమ్మట రెండుమూడుదినములలో నాకు మొదటముక్కలను దెచ్చియిచ్చినన్యాయవాది మాయింటికివచ్చి తనకాదినమున న్యాయసభలో పనిలేదనియు బుట్టతీసికొనిపోయి తీర్పుల నతికించెద ననియుఁజెప్పెను. నే నామాటనమ్మి ముక్కలబుట్ట నిచ్చివేసితిని. కామరాజుగారేదో మాయోపాయము పన్ని ముక్కలబుట్ట నపహరించిరని నాటిసాయంకాలమే పట్టణములో నొకప్రవాదము కలిగెను. కామరాజుగారు ధనకాములయినవారికి ధనమిచ్చియు స్త్రీ కాములయినవారికి స్త్రీలను సంధించియు వివిధమాయోపాయములచేత స్వకార్యమును సాధించుకొనెడు పరమ సామర్థ్యముగలవారు. ముక్కలబుట్ట ప్రతిపక్షులను జేరిన దన్న వార్తనాచెవిని బడఁగానే నేనాన్యాయవాదికడకుఁబోయి యడుగఁగానతాఁడాబుట్టలో పనికి వచ్చుముక్కు లేవియు లేనందున వానిని కాల్చి వేసితినని చెప్పెను. అంతటితో నన్ని ముక్కలును పోయినవని యెల్లవారును దలఁచియుండిరేగాని నా యొద్ద నింకొక్కతీర్పు మిగిలియున్నదని నామిత్రులు సహిత మెఱుగరు. కామరాజుగారు గూఢాచారులనుబెట్టి నేనెక్కడెక్కడకుఁ బోవుచుందునో యెవ్వరెవ్వరితో మాటాడుచుందునో యేమేమిపనిచేయుచుందునో నావర్తనము సర్వమును గనిపెట్టుచుండెడివారు.

మిర్తిపాటి రామయ్యగారి విన్నపముపైని మండలన్యాయాధిపతిగారు విమర్శకు జూన్ నెల 26 వ తేది నిర్ణయించి, సాక్షులకాహ్వానములు పంపి, ఆయావ్యాజ్యెముల గ్రంధములు పంపుమని ప్రాడ్వివాకున కుత్తరువు చేసిరి. విమర్శదినము రాకమునుపే యేలాగుననోకాని మండలన్యాయాధిపతి గారి పెట్టెలోని తీర్పులముక్కలు సిరస్తాదారుగారిచేతిలోనికి వెళ్ళినవి. అత్యంత సమర్థుఁడును పరమతాంత్రికుఁడును మాయోపాయవిశారదుఁడు నైన చిత్రపు కామరాజుగా రాముక్కల నేలాగుననైన నపహరింపవలెనని సర్వవిధములఁ బ్రయత్నించుచుండిరి. అప్పుడు మండలన్యాయసభలో సిరస్తాదారుగా నుండిన రొజారియోదొరగారివద్ద లంచములవ్యవహారములలో దండశాఖాలేఖ్యరక్షకుఁడైన (Criminal Record-Keeper) బొల్లాప్రగడ వెంకన్న గారు మంత్రిగా నుండిరి. ఈమంత్రిమణిగారు నూఱురూపాయలు లంచము మాటాడినప్పుడు పాతికరూపాయలతోనే సిరస్తాదారుని తృప్తిపఱిచి తక్కిన ముప్పాతికరూపాయలను తనకష్టమునకై తానే స్వీకరించుచుండెడి శక్తియుక్తులు గలవాఁడని వాడుక. అనుదినమును సూర్యనమస్కారములు చేయుచు నిష్ఠాపరుఁడయి యుండెడి యీమంత్రిశిఖామణికి మున్నూఱురూపాయ లిచ్చి చిత్రపు కామరాజుగారు తీర్పులముక్కలను తీసివేయించుట కేర్పాటు చేసిరఁట. ఈమొత్తములో నిరువదియైదురూపాయలును రెండుసారాబుడ్లును దక్క సిరస్తాదారుగారికి మఱేమియు దక్కలేదఁట. న్యాయసభలో మండలన్యాయాధిపతిగారిసమక్షమునఁ బ్రదర్శింపఁబడినముక్కలను దీసివేయుట యెట్లా యని గొప్పవిచారముపుట్టినది. ముక్కలను దొంగ లెత్తుకొనిపోయినట్టు కనఁబఱుపవలెనని వారు మొట్టమొదట నాలోచించి సరి యనుకొనిరి. ఆయాలోచననుబట్టి తెల్లవాఱి విమర్శ యారంభ మగు ననఁగా 25 వ తేది రాత్రి న్యాయసభాభవనముయొక్క గోదావరివైపున నున్న తలు పొకటి తెఱవఁబడి, సిరస్తాదారునియొక్కయు నొక లేఖకునియొక్కయు వ్రాఁత పెట్టెలు పగులఁగొట్టఁబడి, కాగితములు చిందరవందఱగా నేలమీఁద చిమ్మివేయఁబడినవి. సొమ్ము పెట్టెసమీపముననే యున్నను దాని నెవ్వరును ముట్టుకోనేలేదు. కామరాజుగారి వ్యవహారముతో సంబంధించిన కాగితములను న్యాయసభాభవనములో దొంగలుపడి యెత్తుకొనిపోయిరని పట్టణమున గొప్ప ప్రవాదము పుట్టినది. నాఁడు విచారణదిన మగుటచేత సాక్షులును పౌరులును పగలు పదిగంటలు కాకమునుపే సభా భవనమునకుఁ బోయి యుండిరి. సాక్షి నయి యుండుటచేత నేనును మిత్రులతోడ సభామందిరమునకు ముందుగానే పోయియుంటిని. అప్పటికి సభాభవనములో నొక వింత నడుచుచున్నది. ఆవఱకే సిరస్తాదారుగారును క్రిమినల్ రికార్డుకీపరుగారును వచ్చి యొకగదిలో తలుపులు వేసికొని కూర్చుండి రహస్యముగా నేదో పనిచేయుచుండిరి. నేనును నామిత్రులును తాళముచెవిపెట్టుతలుపుసందులోనుండి యొకరొకరుగా లో పలఁ జూచితిమి. సిరస్తాదారుగారును బొల్లాప్రగడ వెంకన్న గారును ఒక చోటఁగూరుచుండి కాగితపుముక్కల నొకకాగితపుసంచిలో వేయుచుండిరి. వారిపార్శ్వమున దీపము వెలుఁగుచుండెను. ముద్రవేయుటకుఁ గాఁబోలును లక్కకణిక వెంకన్న గారిచేతిలో నుండెను. ఇంతలో న్యాయాధిపతిగారును సభకు విజయంచేసిరి. ఆయన స్వపీఠము నధిష్ఠింపఁగానే మిర్తిపాటి రామయ్య గారు వచ్చి తనచేత నర్పింపఁబడిన ముక్కలు మార్పఁబడుచున్న వనియు, వెంటనే తనముక్కలను దనకుఁ జూపవలసినదనియు, న్యాయాధిపతిగారి ముందఱ మొఱ్ఱపెట్టుకొనెను. కొంచెముసేపటికి సిరస్తాదారు వచ్చి యతికించి యుండనిముక్కలను గొన్నిటినిదెచ్చి న్యాయాధిపతిగారి బల్లమీఁదఁబెట్టెను. శోధించి చూచి యవితాను కాగితపుసంచిలోఁ బెట్టియిచ్చిన ముక్కలు కావనియు, సిరస్తాదారు ముక్కలను మార్చుచుండఁగా చూచినసాక్షులున్నా రనియు వెంటనే విమర్శ చేయవలసినదనియు, మిర్తిపాటి రామయ్యగారు బహువిధముల న్యాయాధిపతిగారిని బ్రార్థించెను. ముక్కలు పోయినందుకుఁ దాముచేయవలసినపని లేదని న్యాయాధిపతిగారు సెలవిచ్చిరి. అంతేకాక మామండలన్యాయాధిపతిగారు మిర్తిపాటిరామయ్యగారినిపిలిచి, నీ వపకారము నొందిన వాదిప్రతివాదులలోఁ జేరినవాఁడవు కావు గావున నీవిన్న పమును విమర్శింప వలనుపడదని చెప్పి పంపి వేసిరి. మండల న్యాయసభలోని న్యాయ విచారణ నాటి కీవిధముగా ముగిసినది. ఆవఱకు కామరాజుగారును తత్పక్షా వలంబులును నయమున భయమున బుజ్జగించియు బెదరించియు మిర్తిపాటి రామయ్యగారినే వశ్యుని జేసికొని తమపక్షమునకుఁ ద్రిప్పుకోవలెనని కృషి చేసిరికాని సఫలమనోరథులు కాలేకపోయిరి. "బలవంతులతో నేల విరోధ పడియెదవు ? ఈపనివలన నీకు వచ్చెడులాభమేమి !" అని యడిగెడివారితో నెల్ల నతఁడు తా నావఱకుఁ బొందిన యుపదేశానుసారముగా ప్రజా క్షేమము (Public good) కొఱకని చెప్పుచు వచ్చెను. అందుచేత జను లతనిని గొంతకాలము "పబ్లీక్‌గుడ్డుగాఁ" డను వినోదనామముతో కోడిగములకుఁ బిలుచుచుండిరి. ముక్కలు దొంగలెత్తుకొనిపోయిరని చెప్పుటకయి మొట్ట మొదట రాత్రివేళ తలుపుతెఱచి కాగితములను తాఱుమాఱుగా పాఱవైచినను, కాగితములనిమిత్తమే దొంగలు పడిరన్నచో నేరము చిత్రపుకామరాజు గారిమీఁదనో మునసబుగారిమీఁదనో సిరస్తాదారుగారిమీఁదనో మోపఁబడునని భయపడి వారు తరువాత ముక్కలు పోలేదని పలుకుచు చిత్రపు కామరాజుగారి వ్రాఁతలో నున్న పనికిమాలినముక్కలను దెప్పించి గదిలోఁ గూరుచుండి రహస్యముగా వానిని పూర్వపుముక్కలను మాఱుగా నొకకాగితపు సంచిలోవేసి ముద్రవేసిరి. ముక్కలుపోలేదని సిరస్తాదారుగారు కడపట మండలన్యాయాధిపతిగారిముందు పెట్టి చూపినవి యీక్రొత్తముక్కలే. ఈ ప్రకారముగా ముక్కలుపోయినను వ్యవహార మంతటితో పోలేదు.

రాజమహేంద్రపురారక్షక పర్య వేక్షుఁడు (Police Inspector) ఈన్యాయమునువిని విచారపడి నన్ను మండలారక్షకాధ్యక్షుని (District Police Superintendent) కడకుఁ గొనిపోయి మాటాడెను. ఆరక్షకాధ్యక్షుఁడు జరిగినదంతయువిని మనసు కరఁగినవాఁడయి యీ వ్యవహారములో తనచేతనైన పనియంతయుఁ జేసెదనని చెప్పి, న్యాయసభలో జరగిన చౌర్య విషయమయి విచారణ జరపుటకు సెలవియ్యవలసినదనియు, పోయినముక్కల విషయమయి సిరస్తాదారునియొక్క యాలోచనమీఁదనే యీపని జరగినట్టనుమానింపఁ దగియున్నదనియు మండలన్యాయాధిపతి కుత్తరమువ్రాసెను. అట్టివిచారణ యావశ్యకము లేదనియు, వస్తువులేవియు పోలేదనియు, ముక్కల దొంగతనమునుగూర్చి తనసిరస్తాదారువిషయమయి సందేహపడుట కవకాశము లేశము లేదనియునతఁడు బదులువ్రాసెను. అందుపైని మండలారక్షకాధ్యక్షుఁడు జరగిన సంగతి యంతయు నా చేత వ్రాయించి పుచ్చుకొని నామిత్రుల నొకరిద్దఱినిగూడ విచారించి తాను వెంటనే కాకినాడకుఁ బోయి మండలదండవిధాయితో నడచినకథయంతయు విన్న వించి, సిరస్తాదారుని క్రిమినల్ రికార్డు కీపరును పట్టుకొనుట కయి యాయనయొద్దనుండి యధికారపత్రములను (Warrants) గొనివచ్చెను. ఆమఱునాఁడు రొజారియోదొరవారును బొల్లా ప్రగడ వెంకన్న గారును భోజనములు చేసి న్యాయస్థానమునకుఁ బోవునిమిత్తము బట్టలు కట్టుకొనుచున్న సమయములో నారక్షకభటులు వారియిండ్లకుఁ బోయి వారినిరువురను బట్టుకొని యారక్షకస్థానమునకుఁ గొనిపోయి కొట్లలోఁ బెట్టిరి. ఈసంగతి తెలియఁగానే యూరంతయు నల్లకల్లోలమయ్యెను. ఎల్లవారును పురమున నెక్కడఁ జూచినను ఈవిషయము నే ముచ్చటించుచుండిరి. ప్రతిపక్షులపక్షమువారు తోడనే పరుగెత్తుకొనిపోయి యావై పరీత్యమును మండలన్యాయాధిపతిగారితో మనవిచేసిరి. ఆయన యద్భుతపడి సిరస్తాదారుని వెంటనే విడిచి పెట్టవలసినదనియు, అతఁడు నిర్దోషియనియు, అతఁడు లేకపోవుటచేత న్యాయస్థానకార్యముల కడ్డంకి కలుగుచున్నదనియు, ఆరక్షకాధ్యక్షునిపేర లేఖవ్రాసెను. ఆరక్షకశాఖవారు దానిని మన్నింపక యా సాయంకాలమే వారినిరువురను పడవ యెక్కించి కాకినాడ మండలదండ విధాయియొద్దకుఁ దీసికొనిపోయిరి. సాక్ష్యమిచ్చుటకు మేమును వారితోడనే పోయితిమి. మండలదండవిధాయిగారు ప్రథమవిచారణచేసి మావలన సాక్ష్యములను గైకొని, రాజమహేంద్రవరమునకు వచ్చి చౌర్యము జరిగినస్థలమును జూచి, మండలన్యాయాధిపతిగారివలన వాగ్మూలమును గైకొని, బొల్లాప్రగడ వెంకన్న గారిని విడిచిపెట్టి సిరస్తాదారుగారినిమాత్ర మంతిమవిచారణనిమిత్తము మండలదండాధికారికార్యస్థానమునకుఁ బంపిరి. మామండలదండాధికారియు న్యాయాధిపతియునయిన వాలేసుదొరగా రీవ్యవహారములో సాక్షియయి యుండినందున చెన్నపురి యున్నతన్యాయసభవారు విచారణనిమిత్త మీవ్యవహారమును కృష్ణామండలదండాధికారికార్యస్థానమునకుఁ బంపిరి. అక్టోబరు నెలలో నక్కడ విచారణజరగెను. ఈమూడుమాసములును మాసిరస్తాదారు గారు కారాగృహమునందే యుండవలసినవా రయిరి. మాసిరస్తాదారుగారిస్థితి మిక్కిలి శోచనీయమైనదిగా నుండెను. ఆయన యీవ్యవహారములోఁ బొందినలాభ మత్యల్పము. ఆయన కెనమండుగురో తొమ్మండుగురో బిడ్డలు. ఏనెలజీతమా నెలలోనే యన్న పానములక్రింద వ్యయపడుచుండుటచేత నింట పదిదినములగ్రాసమున కైననునిలువలేదు. ఆయనస్థితిని విచారించినచో విచారణచేసిన మండలదండాధికారిగారికిని ప్రతిపక్షులమై యున్న మాకునుగూడ పరితాపకరముగా నుండెను. విచారణ జరిగినమీఁదట కృష్ణామండలదండాధికారిగా రగు కెల్సాలుదొరగారు సరియైనముక్కలు మండలన్యాయసభలో నర్పింపఁబడినందుకు లేశమైనను సందేహము లేదనియు, ఆముక్కలుపోయి వానిస్థానమున వేఱుముక్కలు వచ్చుట నిశ్చయమేయైనను సిరస్తాదారే వాని నపహరించినట్టు సాక్ష్యములేనందున నతఁడు నిర్దోషియనియు, వ్రాసి రొజారియోదొరగారిని విడుదల చేసిరి.

ఈలోపల మావివేకవర్ధనిలో వ్రాయఁబడినయంశమును జూచి చెన్నపురి దొరతనమువా రున్నతన్యాయసభవారికి వ్రాయఁగా, వారు విమర్శ చేసి పర్యవసానము తమకుఁ దెలుపవలసినదని మామండలన్యాయాధిపతిగారి కుత్తరు విచ్చిరి. అప్పుడు మండల న్యాయాధిపతిగారు మేలుకొని నన్నును మఱి కొందఱిని పిలిపించి విమర్శ కారంభించిరి. విచారణారంభదినమున మాప్రతిపక్షులైన చిత్రపు కామరాజుగారు మొదలగువారు మహోల్లాసముతో సభకు వచ్చి నవ్వు మొగములతో సావజ్ఞముగా నావంకసారెసారెకుఁ జూచుచు నా కెదురుగా కుర్చీల నలంకరించి కూరుచుండిరి. ఈవిచారణలో నేను తప్పక కారాగృహమునకుఁ బంపఁబడుదునని వారికిమాత్రమేకాక యెల్ల వారికిని గట్టి నమ్మకము కలిగి యుండెను. నాయొద్దనుండిన తీర్పులముక్క లన్నియు పరుల పాలయి భగ్నములైపోయినవి; వాని నన్యాక్రాంతము చేసిన సిరస్తాదారుగారు మండలసభలో నిర్దోషులుగా నెన్నఁబడి విమిక్తులయిరి; విచారణకుఁ బూనిన మండలన్యాయాధిపతిగారు నాపైని సదభిప్రాయము లేనివారయి ప్రతి పక్షులపక్షము నవలంబించినవారుగా నుండిరి. ఇట్లు నిమిత్తములన్నియు పైకి నాకు ప్రతికూలముగాఁ గనఁబడుచుండినను కడపట సత్యము జయింపకపోదని మాత్రము ధైర్యముండెను. నాయొద్ద నింకొకతీర్పుముక్క మిగిలియున్నదని నామిత్రులకుఁ గాని యమిత్రులకుఁగాని తెలియదు. అన్ని ముక్క లట్లు విఫలములయి పోయినప్పుడు డీయొక్క ముక్కమాత్రము సఫలమగునని యూహించుట కంత యవకాశము లేకపోయినను, ఇల్లు వెడలునప్పుడు నే నాతీర్పుకాగితమును చొక్కాసంచిలో వేసికొనియే న్యాయసభకుఁ బోయితిని. మండలన్యాయాధిపతి గారు తమప్రక్క నే క్రింద నా కొక్కకుర్చీని వేయించి కూర్చుండ సెలవిచ్చిరి. విచారణయారంభమగుటకు ముందుగా నే నొకకాగితముమీఁద నావద్ద కామరాజుగారివ్రాతతో నున్న చిత్తుతీర్పింకొకటి యున్నదనియు, ఆవ్యాజ్యెపుగ్రంథమును వెంటనే తెప్పించెడిపక్షమున దాని సంఖ్యను దెలిపెదననియు, వ్రాసి న్యాయాధిపతిగారిచేతి కిచ్చితిని. సంఖ్య చెప్పవలసిన దని నావ్రాఁతక్రిందనే వ్రాసి యాయన యా కాగితమును నా చేతి కిచ్చెను. దానియడుగున సంఖ్యను వ్రాసి కాగితమును మరల నేను దొరగారి కిచ్చితిని. ఆయన తత్క్షణమే యొకయుత్తరపు కాగితమునందుకొని దాని పై నేమోవ్రాసి యాలేఖ నొక కాగితపుసంచిలోవేసి జిగురంటించి చెంత నున్న భటుని బిలిచి పరుగెత్తుకొనిపోయి నీ విది ప్రాడ్వివాకసభలోనిచ్చి వారిచ్చినది గొనిరమ్మని యాజ్ఞాపించెను. నాకును దొరగారికిని నడచినయుత్తర ప్రత్యుత్తరము లేవో యితరుల కెవ్వరికిని దెలియలేదు. ప్రాడ్వివాకసభ యా యావరణములోనే యుండినందున పోయినభటుఁ డరగంటలోపలనే యా వ్యాజ్యపుగ్రంథమును గొనివచ్చి దొరవారిచేతి కిచ్చెను. అప్పుడు నాజేబు లోనికాగితమును పైకిఁదీసి దొరగారిచేతి కిచ్చితిని. దొరతనమువారిన్యాయ వాది యగుటచేత కామరాజుగారివ్రాఁత యందఱకుఁ దెలిసినదిగా నుండెను. నే నిచ్చినచిత్తుకాగితములో హంసపాదములు తుడుపులు ననేకములున్నవి. వ్యాజ్యెపుగ్రంథములోనితీర్పు సరిగా దానికి శుద్ధప్రతిగా నున్నది. ఆరెంటిని జూడఁగానే దొరగారికి మునుపున్న యభిప్రాయమంతయు నొక్కసారిగా మాఱిపోయినది. ఆయన యాచిత్తుతీర్పునుదీసి కామరాజుగారిచేతి కిచ్చి యిది నీవ్రాఁతయగునా కాదా యని యడిగెను. ఆకస్మికముగాఁ జూపఁబడుటచే నాలోచించుకొనుట కవకాశములేక చేతులు వడఁక గద్గదస్వరముతో "నా వ్రాఁతవలెనే యున్నది" అని యాయన బదులు చెప్పెను. "ఇది తప్పక నీ వ్రాఁతయే. సత్యము నా కిప్పుడు బోధపడినది. (నన్నుఁజూపి) ఇతఁడు న్యాయస్థుఁడు. సిస్తాదారును మీరును గలిసి యీతనిపై నాకు దురభిప్రాయమును గలిగించితిరి. ఈవఱకు పోయిన ముక్కలన్నియు నిజమైనవే. ఆ ముక్కలను సిరస్తారునకు లంచమిచ్చి మార్పించినవాఁడవునీవే. విమర్శనిమిత్తము ఱేపటిదినము నిన్ను దండవిధాయి యొద్దకుఁ బంపెదను. అని కోపముతోఁ బలికి, మామండలన్యాయాధిపతిగారు కాగితమును కలమును గై కొని సిరస్తాదారును క్రిమినల్ రికార్డు కీపరును పనిలోనుండి తొలఁగించినట్టు వ్రాసి చదివి వినిపించెను. నాటికి సభముగిసినది. నవ్వుమొగములతో సభనుప్రవేశించిన మాప్రతిపక్షులు తొంటియుత్సాహమును గోలుపోయి యేడుపు మొగములతో సభను విడిచిరి. సత్యము తెలిసినతరువాత సహితము తమపూర్వాభిప్రాయమును మార్చుకోనొల్లని మనవారిలో ననేకులవలెఁ గాక యూరపియనులు సాధారణముగా తాము పడినయభిప్రాయము తప్పని తెలియఁగానే దానిని మార్చుకొందురు. కామరాజుగారు సభనుండి యింటికిఁ బోయి తా మవమానము నుండి తప్పించుకొనుట కిఁక మార్గములేదని విచారించి తనసొత్తువిషమయి మరణశాసనమును వ్రాసి ముగించి యారాత్రియే విషముత్రాగి యాత్మ హత్యచేసికొనిరి. నాఁడు తెల్లవారుజామున నాలుగుగంటలకు గవర్రాజు గారు మాయింటికి వచ్చి నన్ను లేపి తన్మరణవార్తను దెలిపినప్పుడు నా కతివిస్మయమును విచారమును గలిగినవి. మండలన్యాయాధిపతిగారు రొజారియో గారిని బొల్లాప్రగడ వెంకన్న గారినికూడ పనిలోనుండి తొలఁగింపఁగా, వారున్నత న్యాయసభవారికిని దొరతనమువారికిని విజ్ఞాపనపత్రములను బంపుకొనిరి గాని వానివలనఁ గార్యము లేకపోయెను. సిరస్తాదారుగానుండిన రొజారియోగా రన్న వస్త్రములకు లేక బాధపడుచు యాచించుటకయి నా యొద్దకు సహితము వచ్చుచుండెడి వాఁడు. అల్పకాలములోనే యతఁడు మతి చాంచల్యము నొంది కడపట పిచ్చివాండ్ర వైద్యశాలలో దుర్మరణము నొందెను. ఉన్నతన్యాయసభవారు పోలూరి శ్రీరాములుగారినికూడ లంచములు పుచ్చుకొన్నందునకు విమర్శ చేయవలసినదని మండలన్యాయాధిపతి కుత్తరు వియ్యఁగా, విమర్శమధ్యముననే యాకస్మికముగా నతఁడును దేహవియోగము నొంది యిహలోకదండనమును తప్పించుకొనెను. ఆయన మరణమునకును గారణ మాత్మహత్యయే యని జను లప్పు డనుకొనుచు వచ్చిరి. ఆయన లంచములమూలమున సంపాదించిన ధన మంతయు నీవ్యవహారములో వ్యయపడుటయేకాక మునుపున్నదికూడ పోయెనఁట. ఈశ్వరబలముముందఱను సత్యబలముముందఱను మనుష్యబలమును ధనబలమును గవ్వకును కొఱగావు. ఈశ్వరబల మున్నపక్షమున పూరిపుడకయు వజ్రాయుధ మగును; ఈశ్వరబలము లేనిచో వజ్రాయుధము సహితము పూరిపుడక యగును. ఈశ్వరబలమును సత్యబలమును ధర్మబలమును గలిగియుండఁబట్టియేకదా యెందునకును బనికిరానిదని పెంటలో పాఱవేయఁబడిన చింపిరికాగితపుముక్క లుత్తమసాధనములయి సాక్ష్యమిచ్చి యిందఱిప్రాణములను మానములను ధనమును జీవనమును గొనఁగలిగినవి ! లోకములో సత్యబలమును ధర్మబలము నే బలములు గాని యవి లేని యధికారబలమును విత్తబలమును బలములు కావు.

ఆకాలమునందు శరీరప్రయాసముగాక నాకును గొన్ని కష్టములు వచ్చినవి. మూఢజనులు వానిని గొప్పవారితో వైరము పెట్టుకొన్న నాయవివేక మున కారోపింపఁ దొడఁగిరి. నే నవలంబించినపక్షము న్యాయపక్ష, మనియు నీశ్వరప్రీతికర మనియు నాదృఢనిశ్చయ మయినందున నామనశ్శాంతి కెప్పుడును భంగము కలుగ లేదు. ఇట్టిచిక్కులలోఁ జిక్కుకొని యున్న కాలములోనే సెప్టెంబరు నెల 8 వ తేదిని మేము మొట్టమొదట రాజమహేంద్రవరమున సంఘసంస్కారసమాజమును స్థాపించి పని చేయ నారంభించితిమి. ఆసమాజములో మొదట నుపన్యాసము లియ్యవలసినభారము నామీఁదనే పడెను. ప్రథమోపన్యాససమయమునకు నాప్రియమాతకు వ్యాధి ప్రబలి ప్రాణముమీఁదికి వచ్చినందున నే నాయుపన్యాసమును కడవఱకును వ్రాయలేక కొంత వాగ్రూపముననే చెప్పవలసినవాఁడ నైతిని. 1878 వ సంవత్సరము సెప్టెంబరు నెల 22 వ తేదిని నాపాలనే పడిన రెండవయుపన్యాసము నియ్య వలసినవంతు వచ్చునప్పటికి నన్నుఁ బెంచి పెద్దవానిని జేసి విద్యాబుద్ధులు చెప్పించి సమస్తవిధములఁ బ్రాణపదముగాఁ గాపాడిన ప్రాణాదికురా లయిన నాప్రియజనని నన్ను విడనాడి లోకాంతరగతు రాలయి నన్ను దుఃఖసముద్రములో ముంచిపోయినది. ఆమెయుత్తరక్రియలు ముగిసినతోడనే యాదుఃఖములోనే నేను రొజారియోగారివ్యవహారములో సాక్ష్య మిచ్చుటకు బందరుపురమునకుఁ బోవలసినవాఁడ నైతిని. దుర్న యపరులదుర్య్వాపారములను మాన్పుట కయి ప్రయత్నించుటచే నా కెందఱితోనో వైరములు సంభవించెను గాని యాయల్పాంశము లన్నియు నిచ్చట వివరింపవలసినవి కావు. 1878 వ సంవత్స రాంతమునఁ బ్రకటింపఁబడిన వివేకవర్ధనిలో నిట్లు వ్రాయఁగలిగితిని - "మే మీపనిని (పత్రికాప్రకటనమును) పూనుకొనుట దేశముయొక్కయు ప్రజలయొక్కయు క్షేమలాభములకొఱకేకాని ధనలాభమున కాశపడి కాదు. లౌక్యాథికారధూర్వాహు లయి యున్న కొందఱిదుశ్చేష్టలను వెల్ల డి చేయుట వలన, అట్టివారు మాకు శత్రువులుగా నేర్పడిరి. అయినను ఒకరి యనుగ్రహమున కపేక్షపడిగాని, ఒకరినిగ్రహమునకు వెఱచిగాని పత్రికావిలేఖకత్వము ననుసరించి మాకు విధిగా నేర్పడినకృత్యమునుండి తొలగకుండుట మాపూనిక గాన, కొందఱితో విరోధపడి యైనను జనసంఘమునకు మేలుచేయఁ గలిగితిమి గదా యని యానందించుచున్నాము." - దూరమున నున్న రాజధానీపరిపాలకులను రాజప్రతినిధిని హిందూదేశరాజ్యకార్యదర్శినిని తుదకు మహారాజచక్రవర్తిని తప్పు లెన్ని దూషించుట నిరపాయకర మయినపనిగాని తాను వసించు తావున నుండు ననుగతదండవిధాయిపైని గాని యారక్షకభటునిపైని గాని తప్పెన్ని వ్రాయుట యనపాయకర మయిన పనికాదు. అయినను తప్పు చేసినప్పు డనుగతదండవిధాయినిగాని మండలదండవిధాయిని గాని యారక్షకభటాధ్యక్షునిగాని ధర్మాధికారినిగాని మఱి యే యధికారినిగాని ఖండింపక మావివేకవర్ధని విడిచిపెట్టి యూరకుండలేదు. వివేకవర్ధనియొక్క యాక్షేపములకుఁ బాత్రులైన యధికారు లనేకు లనేకవిధముల దానిని రూపు మాపుట కయి ప్రారంభదశలోఁ బ్రయత్నములు చేసిరి గాని వారికృషి సఫలము కాలేదు. చిత్రపు కామరాజుగారి వ్యవహారమువంటి వ్యవహారములలో మహాప్రబలు లయినయధికారులే పరాభవము నొందవలసినవా రయినమీఁదట వివేకవర్ధనిపేరే భయంకర మయి దుష్టాధికారులకు గర్భనిర్భేదక మయ్యెను. అటు తరువాత దండవిధిచేత వివేకవర్ధనిని భంజింప విజృంభించినవారు కానరాలేదు. దండోపాయముచేత వివేకవర్ధనిని నిగ్రహించుట యసాధ్యమని తోఁచినతరువాత కొందఱు బుద్ధిమంతులు సామోపాయముచేత దానిని సాధింపఁ జూచిరి. నా కప్పుడు రాజమహేంద్రవర రాజకీయశాస్త్రపాఠశాలలో నెల కిరువది యైదురూపాయల జీతము. ఆరంభములోనే నెల కిరువదియైదురూపాయల పనిని కరగ్రాహికార్యస్థానములో నిచ్చునట్లు నేను కోరకయే నా కొకవాగ్దానము వచ్చెను. విమోహకరమైనయాపని నప్పు డంగీకరించియుండినయెడల నే నొకవేళ గొప్ప లౌక్యాధికారిపదము నొందియుందు నేమోకాని నాస్వతంత్రభావమును పారమార్థికచింతను మనశ్శాంతిని తప్పక కోలుపోయి యుందును. నా కప్పు డుపకారము చేయఁ బూనినవారు సచ్చింతతోనే చేసి యుండవచ్చునుగాని, వారు వివేకవర్ధని నడఁచి వేయవలెనను తలంపుతోనే నాయం దట్టినిర్హేతుకప్రేమను బూనిరని యెందుచేతనో నాకప్పు డొకదురూహతోఁచెను. ఆపని నంగీకరించినపక్షమున నే నెట్టివారిక్రింద కొలువు చేయవలెనో నేనెఱుఁగుదును. మాపాఠశాలయందుఁ బరీక్షాసిద్ధులయి నూ నూగుమీసములతోను శృంగారతిలకములతోను జాఱుగోఁచులు గలచలువవలువలతోను స్వచ్ఛందవృత్తిని విహరింపమరగినవిద్యార్థు లట్టికొలువులలోఁ బ్రవేశించినయల్పకాలములోనే మీసములు గొఱిగించుకొని ముఖమున విభూతిరేఖలు దీర్చి బిళ్లగోచులుపెట్టి నీరుకావిదోవతులు కట్టుకొని యానవాలు పట్టరానిమాఱువేషములతో చరించుచుండుట నేను దినదినమును జూచుచుండెడివాఁడను. ధనాశచే నట్టిపని కొడబడినయెడల వారి యవస్థయే నాకును బట్టునని భయపడి నాహితులు చెప్పినబుద్ధి వినక యాపని నిరాకరించితిని. అప్పుడు కృష్ణామండలములో నుండిన చల్లపల్లి రంగయ్య పంతులుగారును గంజాముమండలములో నుండిన దివాన్ బహదూర్ వల్లూరి జగన్నాథరావు పంతులుగారునుకూడ నిర్వ్యాజమైన సదుద్దేశముతోడనే నా కాశాఖలో మంచిపనులు చెప్పించి నన్నున్నతదశకుఁ దేఁ జూచిరిగాని నేను మొదటినుండియు నధికారమునందును ధనార్జనమునందును విశేషకాంక్ష గలవాఁడను గాకపోవుటచేత నే నావిషయమున నంతగా నాదరమును జూపలేదు.

ఆకాలమునందు జరగిన యొక ముఖ్యాంశమునుమాత్రము సంక్షేపించి చెప్పి యీప్రకరణమును ముగించుచున్నాను. నేనును నామిత్రులు కొందఱును గూడి యప్పుడప్పుడు భగవత్ప్రార్థనలు చేసికొనుచుండెడివారము గాని యావఱకు రాజమహేంద్రవరములో వారవారమును మానసికముగా ఈశ్వరోపాసనముచేయు సమాజము లేకుండెను. అట్టిసమాజము నొకదానిని స్థాపింప వలసినదని నామిత్రులయిన బుర్రా రాజలింగముగారు నన్న డిగిరి. ముఖ్యముగా ఆయన ప్రార్థనముమీఁదనే ప్రార్థనసమాజమును 1878 వ సంవత్సరములో మొదట మాగృహమున స్థాపించితిమి. అప్పుడు నేనును, బుర్రా రాజలింగము గారును, బసవరాజు గవర్రాజుగారును, ఏలూరి లక్ష్మీనరసింహముగారును, బయపునేడి వేంకటజొగయ్యగారును, కన్నమురెడ్డి పార్థసారథి నాయఁడు గారును, సమాజముగాఁ జేరితిమి. సమాజము పేరు విని పెద్దమనుష్యులు సహితము పరిహసించువా రగుటచేత మేము ప్రతివారమును ప్రాతఃకాలమున మా మేడపైని తలుపులు వేసికొని కూరుచుండియే ప్రార్థనలు చేసికొనుచుండెడి వారము. అప్పుడు పార్థసారథి నాయఁడుగారు కీర్తనలుపాడుచుండెడివారు; నేను చిన్న ధర్మోపదేశము వ్రాసి చదివెడివాఁడను. నేనప్పుడు చేసిన ధర్మోపదేశములు 1879 వ సంవత్సరపు వివేకవర్ధనిలోఁ బ్రకటింపఁబడినవి. కొన్ని నెలలైనతరువాత మామిత్రులను గొందఱను ప్రార్థనా సమయములయందు రానిచ్చెడువారము. సంవత్సర మైనతరువాత సమాజమును బహిరంగముగా విజయనగరము మహారాజుగారి బాలికాపాఠశాలకుఁ గొనిపోయితిమి. ఇప్పుడీప్రార్థనసమాజమునకు స్వకీయమైనమందిరమే యేర్పడియున్నది ఈప్రార్థనాసమాజ మెన్నియో సత్కార్యములకును, ఎందఱివర్తనమునో చక్కఁబఱుచుటకును, కారణమైనదని నిస్సందేహముగాఁ జెప్పవచ్చును. దీనివలన బాగుపడినవారిలో నొక్కరి నిందుఁ బేర్కొనెదను. మాపట్టణమున నండూరి జగ్గరాజుగారని నియోగిబ్రాహ్మణుఁ డొకఁ డుండెడివాఁడు. ఆయనకు విధవలతో సంబంధ ముండెననియు, తన్మూలమున ధనార్జనము చేయుచుండెననియు, చెడ్డపే రుండెను. ఆయన యొకనాఁ డొకమిత్రునితోఁగూడి ప్రార్థనసమాజమునకు వచ్చి మాప్రార్థనలను ధర్మోపన్యాసమును విని నాటినుండి క్రమముగా ప్రార్థనలకు వచ్చుచుండెను ; తన వెనుకటి దుర్వర్తనమును విడిచి సన్మార్గము నవలంబించెను. అది చూచి విగ్రహారాధకు లాతనితల్లియొద్దకు బోయి దుస్సహవాసముచేత సమాజమునకుఁబోయి నీకొడుకు చెడిపోవుచున్నాఁడని చెప్పిరి. సమాజమునకుఁ బోవలదని తల్లి యతనికి బుద్ధిచెప్పఁ జొచ్చెను. అతఁ డొకనాఁడు తనతల్లిని రహస్యముగా బాలికాపాఠశాలకుఁ గొనివచ్చి నేను ధర్మోపదేశము చేయుస్థానమునకు వెనుక తలుపుచాటునఁ గూర్చుండఁబెట్టెను. ఆమె నాటి యుపాసనమునుజూచి యానందించి ప్రతివారమును తన్నక్కడకుఁ గొనిపొ మ్మని కొడుకును బతిమాలఁ దొడఁగెను. ప్రార్థనాసమయమునందు వందలకొలఁది జనులువచ్చి ప్రతివారమును ప్రార్థనలు విని యానందించి పోవుచుండెడి వారు. కొందఱు కోమటులు సహితము తమయంగళ్ళను కట్టిపెట్టి వచ్చి యాసక్తితో ప్రార్థనలను వినుచుండెడివారు. ఈసమాజమువలననే పూర్వా చారపరాయణులకు సహితము గుడ్డివాండ్రు కుంటివాండ్రు మొదలైన వికలాంగులకుఁ జేసినదే యుత్తమదాన మనుజ్ఞానము కలిగినది. ఈసమాజ మూలముననే బీదలకు రాత్రిపాఠశాలలు మొదలైనవి మొదట స్థాపింపఁబడినవి.


  1. " I am doing well in the College and may, by God's grace, expect to pass F.A. this year with the little bit of Knowledge I have, of which the foundation stone was laid by you whom I cannot but honour in my life." - Letter dated 23rd June 1876, Madras.