సాహిత్య మీమాంస/రెండో ప్రకరణము

వికీసోర్స్ నుండి

రెండో ప్రకరణము

_______

సాహిత్యమున రక్తపాతము

రక్తపాతమును గురించి అలంకారికుల మతము -

ఆర్యాలంకారికులు కావ్యములను దృశ్యము లనియు శ్రవ్యము లనియు రెండు తరగతులుగా విభజించిరి. ఒకరు పఠించగా వినుటకును స్వయముగా అధ్యయనము చేయుటకును రచింపబడిన కావ్యములు శ్రవ్యములు. కావ్యకల్పన మభినయ రూపమున వ్యవహారమున పరిణమింపజేసి పదిమందియెదుట ప్రదర్శింపవలసినవి దృశ్యములు; కావ్యమునకు రూప మారోపించుటచే వీటికి రూపకములని పేరు పెట్టినారు. సాహిత్యదర్పణకారుడు "వాక్యం రసాత్మకం కావ్యమ్" "రసవంతమైన వాక్యము కావ్యము" అని లక్షణము నిరూపించెను. మానసమున ప్రేమకాని ఆనందము కాని జనింపనేరనిది రసము కాదు. సహృదయుల హృదయ ములయందు కరుణేత్యాది *[1] స్థాయీభావ విభావములచేత పరిపుష్టినొందిన లోకోత్తరానంద జనకము రసము. కావ్యమునకు రస మాత్మవంటిది. కావ్యమును పఠించునప్పుడున్నూ దాని ప్రదర్శము జూచునప్పుడున్నూ కోవిదుల మానసము లందు ఆనందోదయ మగునటుల కవి కావ్యమును రచింప వలయును. ఇది కావ్యమునకు ప్రధానగుణము. ఇది గాక యింకేదైనా ఫల ముండిన నుండ వచ్చుబు.

"శరీరం తావ దిష్టార్థ వ్యవచ్ఛిన్నా పదావళీ" అనగా ఏదైనా విశిష్టాభీష్టార్థ ముండిన పదావళియే కావ్యమునకు శరీరము కాదగునని దండి మహాకవి చెప్పెను. అభీష్టము లేక ఏకార్యమూ మొదలుపెట్టము. ఆయభీష్టము విశిష్ట మైనచో అందుకు తగిన పదచయమును కవి కూర్పవలయు నని మహాకవి దండి అనుశాసనము. అభీష్టార్థ మెట్టి దంటే "సహృద హృదయవేద్యోర్థ: -" పండితులహృదయము లెరుగ దగినది. కావ్యమునకు రెండులక్షణము లుండవలెను - మొదట అది ప్రీతి కలిగింపవలెను; పిమ్మట ఇష్టార్థసిద్ధికి సాధనము కావలయును. ఎవరియిష్టము? సహృదయులది. సహృదయు లెట్టివారు? సురుచుసంపన్నులు, కావ్యరసాస్వాదనసమర్థులు; వీరే విద్వాంసులు. ఇందుకే కాళిదాసు -

"ఆపరితోషా ద్విదుషాం నసాధు మన్యే ప్రయోగవిజ్ఞానమ్"

తలప నాదుప్రయోగకౌశలము నుంచి|దంచుపండితుల్ సంతోషమందువరకు

అని చెప్పెను.

కావ్యము శ్రవ్య మైనా దృశ్య మైనా రసమును పుట్టించ వలెను. లోకుల రుచులు భిన్నములు కావున కావ్యముల నేకరీతుల రచింప బడవలయును. శ్రవ్యకావ్యము పఠనమునకు వినుటకును నిర్మింపబడినది, కావున సురుచిసంపాదనమున దానికి కావలసినంత స్వేచ్ఛ కలదు. దృశ్యకావ్యమునం దా స్వాతంత్ర్యము చెల్లుబడికాదు. దృశ్యకావ్య మభినయింపదగినది కావున తన్మూలమున ఆకావ్యమునకు జీవము పోయవలెను - యుద్ధము, రాజ్యవిప్లవము, కొట్లాట మొదలగునవి శ్రవ్య కావ్యమున యథేచ్ఛముగా జొన్పవచ్చును, కాని దృశ్య కావ్యములం దట్టివి కూర్చరాదు. రంగస్థలమున కత్తివ్రేటులు కల్పించినచో చూపఱకు ప్రీతి జనింపదు సరేకదా, ప్రమాదములుకూడా ఘటిల్లవచ్చును. ఇట్లే శ్రవ్యకావ్యములకన్న దృశ్యకావ్యములందు ఎక్కుడు నియమములు పాటింపవలయును.

కేవల పఠనముననే ఆనందజనకమగుదానిని కార్య క్షేత్రమున అభినయిస్తే కథ కన్నులకు కట్టును గాని ఆనందము అంతగా కలుగబోదు, కావున ఆనందోదయమునకు విఘ్న మొనర్చు కార్యముల నాటకకర్త లతిజాగరూకతతో విడువ వలయును. శిష్టాచారములకు విరుద్ధములు, సహృదయుల రుచులకు ప్రతికూలములు, లజ్జావహములు నగు కార్యములు నాటకకవులు త్యజింప వలయును. ఇట్టి వాటిని "సాహిత్య దర్పణ" కారు డొక్కచోట చేర్చెను: -

               దూరాధ్వానం వధో యుద్ధం రాజ్యదేశాదివిప్లవ:
               వివాహో భోజనం శాపోత్సర్గౌ మృత్యు రతి స్తథా
               దంంతచ్ఛేద్యం నఖచ్ఛేద్య మన్య ద్ర్వీడాకరంచయత్
               శయనాధరసానాది నగరాద్యుపరోధనమ్
               స్నానానులేపనేచేభి ర్వర్జితో నాతివిస్తర:||

ఈశ్లోకములభావము సుగమము కావున నిట విస్తరింప పనిలేదు. ఆర్యలాక్షణికులు నాటకములయందు హత్య నిషేధించిరి. రంగస్థలమున అది ప్రదర్శించిన నెవరి కానంద ముదయించును ? అంతే కాదు, వెగటుకూడా పుట్టును, కొన్ని వేళల రోతాయు రోషమూ జనించును. అందుచే నాటకములోని హత్యకు తోడు బయటకొట్లాటలు జరుగును. హత్యా విడంబనము ఉద్వేగజనకము కావడముచేత దానిని కన్నులార గాంచినచో ఎవరు ధైర్యము చిక్కబట్ట గల్గుదురు?

షేక్స్‌పియరు రవించిన ఒథెలోనాటకమందలి యీ దృశ్యమును పరికింపుడు : -

  • [2]డెస్‌డెమొనా..........నాథా, నన్ను వెడల గొట్టుము, చంపవద్దు.

ఒథెలో.............చాల్చాలు - జారిణీ!

డెస్...............రేపు చంపుము, ఈరాత్రి ప్రాణములతో నుండనిమ్ము.

ఒథె.............లేదు. అడ్డుచెప్పితివా -

డెస్...............అరగంటసే పోర్చుము.

ఒథె...............అంతలో నేమగును? ఇప్పు డాగను.

డెస్..............ఒక్క సారి దేవుని ప్రార్థింప నిమ్ము.

ఒథె..............ఇప్పటికే జాగయ్యె...........(నులిమిచంపును.)

రంగభూమిని రక్తపాతము : -

పై నుదహరించిన దృశ్యము డెస్‌డెమొనా దోష రహిత అని స్పష్టమైన పిమ్మట ప్రదర్శింపబడును. నిరపరాధిని, సరళస్వభావ, విశుద్ధప్రేమమగ్న, పతిపరాయణయునగు సాధ్వీతిలకమును సందేహ పిశాచా యతచిత్తుడును, అవిశ్వాసి, మూర్ఖుడు నగు పతి అంతశీఘ్రముగా మాటైనా వినిపించుకొనక ముందువెన్క లారయక గొంతునొక్కి ఘోరహత్య చేయుట సహృదయులు స్థిరచిత్తముతో చూడగలరా? వారి కాతనిపై పట్టరాని కోపమురాదా? మొద్దువలె ఎదుట నిలిచిన మోరకుని జూచి ఊరుకుందురా? అతడు ప్రతారితుడౌట నిజము, అసూయచే ఆతని మానసము పొరపడినది; స్తీస్వభావము చపలమౌట నిజము, కాని విచక్షణలేక విలయ మొందింపదగునా? ఎన్ని విధముల సరిపుచ్చుకొన్నా నిరపరాధిని యగు స్త్రీ నిధనము నిర్భరము - ఘోరపాతకియైనా మన కళ్ళయెదుట చంపబడుట చూస్తేనే గుండె చెదరును. ఇక స్త్రీహత్య విషయము వేరే చెప్పవలయునా? పత్ని పాపకలిత యైనచో ఆమెను పరిత్యజించుట న్యాయము. హిందువుల ఆదర్శములయందును, ప్రకృత సహృదయరుచుల ననుసరించియు హిందూధర్మానుశాసన విధానమునను, వారి సంఘచట్టముల ___________________________________________________________________________

Desdem..................But half an hour

Oth..................Being done, there is no pause,

Des.................But while I say one prayer.

Oth.................It is too late. (He smothers her) ప్రకారమును స్త్రీహత్య, అయోగ్యకర్మగా భావింపబడుచున్నది. అట్టియెడ అమాయిక నిరపరాధిని యగు అబలహత్య అత్యాహితముకాదా! అందుమూలమున చూపఱహృదయముల కానందము చేకూరదు సరేకదా, మాలిన్యముకూడా సంక్రమించును. అట్టి దృశ్యముల నాటకములందు కూర్చుట పాపహేతువు, కావుననే ఆర్యనాటకకవులు వాటిని బహిష్కరించిరి. [3]

హిందువుల ఆదర్శము.

స్త్రీహత్యను రంగస్థలమున ప్రయోగించుట అనర్థ దాయకము హిందూధర్మాపేతమని వక్కా ణించితిమి. వేలామువెర్రిచే నాటక కవులు దీని నుపయోగించి రా, రంగస్థలము నర కముగా పరిణమించును. అందువలన లోకము మాలిన్యకలితమగును. కావున ఆర్య నాటక కర్తలు హత్యలు విసర్జించిరి. యూరపు దేశమందలి వియోగాంత నాటకము*[4]లవంటినాటకములు సంస్కృతమున లేవు. హిందూధర్మాదర్శములకు విపరీతము లగుటచే అవి మన సాహిత్యాదర్శములకు ప్రతికూలములు. అట్టివి మనదేశమున పుట్టుకుండుటవల్ల వాటియనర్థములు మనల దాపరించలేదు.

యూరోపీయ వియోగాంతనాటకములఉత్పత్తి, వాటి ప్రకృతి

మనసంస్కృతనాటకసాహిత్యమందలి ఉచ్చాదర్శము లన్నియూ మన ధర్మానుసారము అనుమోదనీయములు. అవి మనహృద్భావములతోడను సురుచులతోడనూ చక్కగా మేళవించును. యూరోపీయ సాహిత్యమున నిట్టివి మృగ్యములు. సాహిత్యదర్పణమున నుదహరించిన నిషిద్ధకార్యమాలను బట్టి మననాటకాదర్శము స్పష్టము కాగలదు.

యూరపుఖండమున ప్రప్రథమమున గ్రీసుదేశమందు నాటకములు వెలువడినవి. ఆయాదర్శములనే ఇతర దేశస్థులు తమ రుచుల ననుసరించి పరివర్తనములుచేసి వారివారి ధర్మముల కనుకూలించుకొనిరి. అవి మన ధర్మాదర్శములకు సరిరావు. వాటియందు కూడా రుచివైచిత్ర్యము పొడగట్టు చున్నను తద్రుచులు మనధర్మాదర్శములకు బహిర్భూతము లగుట మనసాహిత్యా దర్శములందు కానరావు. ఆజాతులు రుధిరప్రియములు సహజకఠినములు నగుటచే వారి నాటకములు తదనుగుణముగా నుంటవి.

గ్రీసుదేశేతిహాసము చదివినవారికి స్పార్టానగరనియమము లెంతనిష్ఠురములో తెలుసును. ఏధెన్సుపురవాసులు గొప్పగొప్ప నాగరికులయెడ నిర్దయ జూపుచుండిరి - పరమ ధార్మికుడగు సోక్రటీసుకు విషమిచ్చి చంపిరి. ఆదృశ్యము వారి కెంత ఆనందదాయక మాయెనో! క్షమాగుణము మచ్చున కైన వారియందు లేకుండెను. తద్దేశీయనియమము లమితనిర్దయాపూరితములు. అట్టి పరిస్థితులలో వ్రాయబడిన నాటకములు వియోగాంతములు కాకున్న వారికి రుచించునా? లోకులయం దట్టి నిర్మమత్వము నిర్దయము ప్రబలుచుండే కాలమున వియోగాంతనాటకములు ఉత్పన్నము లగుట వింతకాదు.

ఇక నీనాటకము లనుకరించిన వారిస్వభావము లెట్లుండెనో కొంచెము విచారింతము. చాలాకాలము క్రిందట యూరపుఖండమున వేండలు లనీ (Vandals) గాథుల (Goths) నియూ బర్బరజాతులవారు నివసించుచుండిరి. వా రమిత నిర్దయాస్వాంతులు. అట్టివారిరక్తము ఆధునిక ఐరోపీయజాతులరక్తనాడులలో నిప్పటికీ ప్రవహిస్తూంది. కౄర కర్మములయెడ ప్రసన్నతవహించుట ఇప్పటికిని కొన్ని ఐరోపీయజాతులవారికి సహజము. స్పార్టనుల నిర్దయాచరణములు రోమీయుల కోలీషియమ్ పోట్లాటలు (Gladiatorial fights) నిందకు ప్రమాణములు.

మధ్యకాలీ (Middle Ages) నేతిహాసములుకూడా భయంకరరక్తపాతముచే నిండియున్నవి. మతయుద్ధములు*[5] (Crusades) మతాంతహన్‌త్యలు †[6] (Inquisition) ను విన్న ఒళ్ళు గగురుపొడుచును. యూదుల (Jews) మూల ముట్టుగా నాశనముచేయు ప్రవృత్తి, భూతవైద్యులకు సోదె గాండ్రకు సత్యాన్వేషణపరులగు శాస్తజ్ఞులకు ఐరోపీయులు విధించిన మరణశిక్షలూ ఇంకొకజాతివారియందు కాన రావు. ఇంతయేల? ఐర్లాండువృత్తాంతము, ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, స్కాటులును కావించిన అన్యోన్యరక్తప్రవాహము లును ప్రబల మైనసాక్ష్యము నిచ్చును. అమెరికాఖండము నాక్రమించుకొన్నప్పుడు స్పెయినుదేశీయు లెంతనీచముగా ప్రవర్తించిరి? ఇవన్నీ పరిశీలించినచో యూరోపీయజాతుల పరిస్థితులు క్రూరోపకరణములచే సంఘటిత మైనవని స్పష్టమగును. అట్టియెడ కోమలప్రవృత్తులు వారి హృదయములం దుద్భవించు టెట్లు? క్రైస్తవధర్మ మున్నతమైనదే కాని యూరపుఖండమందు అది నిష్ఫల మాయెను, తత్ఖండవాసుల క్రూరత డిందు పరిచి సరళప్రవృత్తుల నాటలేక పోయింది.

'What is bread in the bone cannot come out of the flesh'

"శల్యగతమైన నైజంబు చలితమగునె?"

యూరోపీయ జాతులయందు ప్రకృతిమూలక మైన యీదోషము వారి యితిహాసములనే కాక సాహిత్యమును కూడ కలుషిత మొనర్చింది.

వియోగాంతనాటకములు చదిన ఫలము

క్రూరప్రకృతులు రక్తప్రియులు నగు యూరోపీయులు గ్రీకువారి వియోగాంతనాటకముల నమితాదరముతో అనుమోదించి అనుకరించిరి. వారి ప్రకృతలకూ రుచులకు తగిన వాటిని వా రామోదించుట అబ్బురమా? వీరి మూలమున ఆంగ్లేయ సాహిత్యమున ఆనాటకములు ప్రవేశించెను. అవి వారి కమితానందదాయకములగుట నిస్తుల ప్రతిభావంతుడగు షేక్స్‌పియరు కూడా ఆయానందవార్థి నోలలాడుచు, వాటి యందలి ఆదరమహిమచే దోషమును పెకలింపజాలక తన రచనాచాతురి నందే ఓతప్రోతము కావించెను. అతని వియోగాంతనాటకములు జనవశీకరణ సామర్థ్యమును సంపాదించి ప్రపంచమున అనుపమగ్రంథము లని కొనియాడబడు చున్నవి. అందరూ ఆమహామహుని ప్రతిభాప్రసూతనాటక రాజము లనే బంగారుకత్తితో గొంతుక కోసుకొన నుద్యమించిరి. ఇప్పటికీ మనలో ననేకులు షేక్స్‌పియరువంటి కవిసార్వభౌముడు వాటిని రచియించె ననుభక్త్యావేశమున తత్పయోముఖవిష కుంభములయందలి అమృతమును మనసార గ్రోలుచున్నారు. సాహిత్యము సర్వగుణసంపన్నముగనూ, తతశోభాయుతముగనూ, అనంతమాధుర్యకలితముగనూ, కావించిన కాళిదాసు కావ్యములు మనవారి కిప్పుడు రుచించుట లేదు, భవభూతి రచించిన అనఘన్ మగు ఉత్తరరామచరితము ఎక్కడో పాతర వడినది, వ్యాసవాల్మీకిరచితము లగు మహాకావ్యములకు వ్యాప్తియే లేదు. ఆంగ్లవిద్య నభ్యసించువారి కాంగ్లకవిత రుచించుట ఆశ్చర్యమా! షేక్స్‌పియరు నాటకసమాలోచకులే (Critics) మనకు పథప్రదర్శకు లగుచున్నారు. మన రుచులు వారిపాల బడినవి. విస్సన్న చెప్పినదే వేదము. వారి రుచులే సభ్యములు, వారి అభిప్రాయములే ప్రశంసనీయములు, వారి ఆదర్శములే మన కాదరణీయము లగుటచేత మన జాతీయసుకుమారరుచులు జర్జరితములై అత్యుత్కృష్టాదర్శము లడుగంటు చున్నవి, వాటియందు మనకు గౌరవము క్రమ ముగా తగ్గు చున్నది. ఆంగ్లసాహిత్యమే ఉత్కృష్టసాహిత్యమనియు, ఆంగ్లకవులే ఉత్తమకవు లనియు, వియోగాంత నాటకములే ప్రశంసాహన్‌ములు, పఠనీయగ్రంథము లనీ దృఢవిశ్వాసము మనవారి మానసముల నాటుకొను చున్నది.

మనవా రిప్పుడు తరుచుగా షేక్స్‌పియరు రచించిన ఉత్తమవియోగాంతనాటక చతుష్టయము నాడుచున్నారు. కవులు మన దేశభాషలలో వియోంతనాటకములను వ్రాయ మొదలుపెట్టుచున్నారు, అస్త్రశస్త్రములను ఇతర ప్రాణాపాయసాధనములను రంగస్థలమున ఝళిపించి అనాథలను అమాయికులను నరుకుచు రక్తపాతమునకు ప్రచారము కల్పించుటచే సభ్యత అని యెంచు చున్నారు. అందుచే రంగస్థలములయందు రక్తపిసాస నానాటికి హెచ్చు చున్నది. ఇది ఇంతతో నాగునో, లేక బయటికికూడ దుముకునో విచారణీయము.

అ ట్లగుటయే సంభవమని స్ఫురించుచున్నది. ఆంగ్ల సాహిత్యమున ఏనాటకము గాని, నవలగాని, కావ్యము గాని కథ గాని చదువగా చదువగా వియోగాంతకార్యములు మనచిత్తముల నాకర్షించును. ప్రతికల్పనమునా రక్తము ప్రవహించు చుండుటయే యుక్తమని తోచుచుండును. ఎప్పుడూ చిత్త మక్కడే జొత్తిలి యుండడముచేత రక్త మన్న రోత పోవును, పాపభీతు తొలగును; బలవీరులే మనమానసముల నెలకొని యుందురు, రక్తపాతమును పృథులముగా నొనర్చువారే గౌరవమునకు పాత్రు లగుదురు. మన కాదర్శరూపులు వారే అగుటవల్ల మనముకూడా వారి ననుకరింపవలయునను ఔత్సుక్యము జనించి, కలహము, రక్తపాతము, విజయము అను మార్గత్రయమందే పౌరుష మున్నదనే భావన కలుగును, రక్తపాతమున వెగటు పోయి అనురక్తి జనించును. "కొత్త వింత, పాత రోత" అను సామెతప్రకారము ఈ మార్గమే గౌరవనీయ మని యెంచబడును. ప్రాచి క్రమముగా ప్రతీచి అగును.

ఇంకొక విశేషము - పాశ్చాత్యులయం దిప్పుడిప్పుడు రక్తానురక్తి శిథిలమగుచున్నది. - ప్రతీచి ప్రాచ్యాదర్శముల గౌరవించుచున్నప్పుడు మనవారియందలి రుచివిప్లవము విపరీతముగానే కనబడు చున్నది.

ఆర్యసాహిత్యమందలి వియోగాంతము రక్తపాతశూన్యము

ఆర్యసాహిత్యమున వియోగాంతఘటనాసంచయము లేకపోలేదు, కాని అందు రక్త పాతము శూన్యము. యూరపునందలి వియోగాంతనాటకముల రెండవ ప్రధానగుణమైన కరుణారసము ఆర్యసాహిత్యమున గానవచ్చు చున్నద్ఫి. షేక్స్‌పియరు రచించిన డెస్‌డెమోనా పాత్రము చూచి ఎంత వ్యథ చెందెదమో సీత, దమయంతి, ద్రౌపది, శకుంతల, మహాశ్వేత మొదలగు పాత్రముల చూచిన అంతకాన్న నెక్కువ వ్యధకు భాజనుల మగుదుము; ఐనను డెస్‌డెమోనా వలె వా రెవరును వధింపబడ లేదు. వాల్మీకి అతి సుందర దృశ్యకల్పనమున సీతను అంతర్ధాన మొనర్చెను. సరళస్వభావ పాపవిదూరయు అగు డెస్‌డెమోనా నిష్ఠురరూపమున నిహితయై స్వర్గముచేర, సీత వాల్మీకికల్పితవిమానరూఢయై, ఆనందధ్వనులు చెలగుచూ పుష్పవృష్టి గురియు చుండ స్వర్గారోహణ మొనర్చెను. కాని జన్మదు:ఖినియగు సీతా లలామదు:ఖము మనహృదయమున పాదుకొని ఆమెయెడ నిరంతర సానుభూతి పుట్టించు చున్నది.

సీతదు:ఖము చూచి గుండె లవిసి ప్రతిఘట్టమున వాల్మీకితో కన్నీరోడ్చి, ఆమె పూతచరిత అని విశ్వసించి, తచ్ఛీల మాహాత్మ్యము మన హృదయములు నుద్బోధింప తత్సుగుణపుంజమున పక్షపాతము జనించి, అశోకవనమున ఆమె సజీవ యై యుండుట ఎరిగి పరమత్రిజటలతో సంతసించి, వనవాస మామె సల్పునెడ లక్ష్మణునితో విలపించి ఆమె జగన్మోహనమూర్తి మన మనో మందిరముల నెల్ల కాలము అచ్చొత్తి యుండుటచే ఆమె గుణములనే ప్రశంసిస్తూ సదా జపించు చుందుము.

ఈ విషయమున వ్యాసవాల్మీకులతో షేక్స్‌పియరు సరి రాడు. అతని కవితయందు మఱపురాని గుణము లనేకములున్నవి. అతడు మహాకవి, కాని శోకరసమున గూర్చి చర్చించునపుడును, సంతాపము స్థాయీభావముగా నుండదగు పట్టులయందున్నూ కవిత్వముమాట తలప పనిలేదు. ఇది రసస్ఫూర్తివిషయము; కవిత్వము ప్రత్యేకవిషయము.

సీతవిషయమున చెప్పిన దంతయు దమయెంతియెడ కూడ వర్తించును. నిరంతరదు:ఖాక్రాంతలగుటచే వారి పతిభక్తి పరమపవిత్ర మయ్యెను. చిరదు:ఖభాజనములు కావుననే వారు మానవహృదయముల బట్టుకొని యుందురు. నిహతులు కాకున్నా వారి వియోగదశ దుర్నిరీక్ష్యమయి చిరసంతాప కారి యగుటచే వారిని చూచి జాలిపడనివా రుండరు. హత్య లేకయే సంతాపమూ శోకమూ స్థాయీభావ మొందు చున్నవి.

హత్యయందు బీభత్స సంచారము

డెస్‌డెమోనా యెడ జాలిపుట్టదా? ఆమెనుచూడ గుండె లవియవా? ఆహా! తప్పక అట్లేజరుగును; కాని ఈ హత్యాకాండమున నుదయించిన అశ్రుధారలకును సీతావియోగమున ప్రభవించిన కన్నీటికాలువలకున్నూ సామ్యమే లేదు. దీనిగూర్చి ప్రత్యేక చర్చ చేదాము.

షేక్స్‌పియరు నాటకాళియందు ఇమోజన్, డెస్‌డెమోనావంటి ప్రేమపూరితలూ పతివ్రతలూ అరుదుగా నున్నారు. డెస్‌డెమోనా ప్రేమ జూలియట్‌ప్రేమవలె హృదయోన్మాది కాక అత్యంత గంభీరము, హృదయపూరితము, శాంతమైనా అది యుగ్రము ప్రబలము నగును - దాని యుద్రేకమున కళ్లు పొరలు కప్పవు; దానిచే నలంకృతయై డెస్‌డెమోనా స్వీయ హృన్మాధుర్యప్రభావమున అందరిమన ముల నలరించును. అట్టి దొండపండును కాకి ముక్కున గట్టి ఒథెలో చరితమునకు మహత్వము తేవలెనని పత్నీఘాత యను కుచక్రమును కవి పన్నెను. పాఠకులు ప్రేక్షకులును ఆ కుచక్రమున దగిలి హత్యావ్యాపారమున మగ్నులవుదురు. నిష్కారణముగా నిర్దయుడగు మోరకుడామెను బలవన్మరణముపాలు జేసెను. ఈవ్యాపారమెంత బీభత్సమో యోచించండి. కవి ఆమెను సృజించిన దట్లు చంపించుట కేనా? ఇట్టి హత్యాకాండమును చూడంజూడ కన్నులు నీరుగ్రమ్మవా? కాయమెల్ల క్రోధవశమున కంపింపదా? డెస్‌డెమోనా వధా నంతరము ఎమీలియా వధింపబడునప్పుడు ఆకత్తి మనగుండెలోపొడిచి నట్లగును. ఎంత భయానకము! ఏమి బీభత్సము!

వియోగాంతమా, కసాయికొట్టమా?

షేక్స్‌పియర్ రచించిన మేక్‌బెత్ నాటకమున ఇంతకన్న బీభత్సమెక్కువ. అది హత్యతో ప్రారంభించి హత్యతో బెరిగి హత్యతోడనే ముగియును. మొదట డంకన్, నడుమ బాంకో, తుదిని మేక్‌బెత్ హతులగుదురు. నాటకమంతా కసాయిఖానా! అందును రాణీమేక్‌బెత్‌వచ్చి "నాచేతి రక్తము వీడునదికాద"ని చెప్పినప్పటినుండి రక్తవృష్టి అతిశయించును. ఇట్టియెడ అక్కడక్కడ అనుతాప తుషారము ప్రారంభించునుకాని కాలుచున్న యింటిని కన్నీటితో నార్పతరమా? ఆవీచికలు హత్యాకాండ జనితపృధుల రక్తప్రవాహమున నెచటికో కొట్టుకొని పోవును. బిందెడు విషమున నొకపాల చుక్క! దారుణమగు హత్యాపరంపరను అనుతాపము మరుగుపరచ గలదా? కొత్తనీరు పాతనీటిని గొనిపోవునట్లు రక్తప్రవాహ సంసర్గమున అనుతాపబాష్పస్రవంతి కలకబారి హత్యకాండమునకే అంతగౌరవము నాపాదించును. అంతట వ్యాపించి యున్నది హత్య, ఆచ్చటచ్చటా పొడచూపునది అనుతాపము; ఇది అంతరించుట అబ్బురముకాదు. మానవ హృదయముల మచ్చికచేయుటకు హత్యాకాండము పెట్టు మచ్చుమందు ఆ యనుతాపము!

షేక్స్‌పియరు ప్రసిద్ధ నాటకములందెల్ల బీభత్సజనక మగు నీహత్యావ్యాపారము ఆవిర్భవించియే యుంది. హేమ్‌లెట్ నాటకమున తుదియంకము కసాయి కొట్టమే. రిచర్డ్ నాటకములు, జాన్, లియర్, కొరొయొలేనస్‌ ప్రభుతులన్నీ రక్తాక్తాంతములు-జూలియస్‌సీజర్ నందలి (Beware the ides of March) అను హెచ్చరిక సీజరు మరణా నంతరమున గుండె దిగులువెట్టును. ఈనాటకములందు కరుణరస మేదీ? మేక్‌బెత్ పేరు విన్నతోడనే ఇప్పటికీ ఒళ్ళు జలదరించునే! మూడవ రిచర్డ్ నాటకమందు రోత ముమ్మరించును. అది చదివినా రంగస్థలమున చూచినా ఇక వియోగాంతములజోలికి పోరా దనిపించును.

రక్తపాతము, విదేశీయ రుచులు

ఖడ్గవ్యాపారము షేక్స్‌పియరు వియోగాంతము లందే కాక ఆతని సంయోగాంతముల (Comedy) యందుకూడా కాన్పించును, "వెనిసు వర్తకుడు" (merchant of venice) నాటకమందు కత్తిపోటుచేతనే కసియు గౌరవమూ కడతేఱు చుండును. నాటకములు కసాయిఖానాలు చేయుట పాశ్చాత్యుల సనాతన ధర్మమా? అట్లనరాదు. యూరపునందు కూడా శిష్టానుసారము అట్టిపని జుగుప్సాహర్‌ముకాని ప్రశంసనీయముకాదు. సురుచిసంపన్నుడూ సుప్రసిద్ధుడునగు Addison అను విమర్శకుని అభిప్రాయము వినండి : -

Among all our methods of moving pity or terror, there is none so absurd and barbarous, and which more exposes us to the contempt and ridicule of our neighbours, than that dreadful butchering of one another, which is so frequent upon the English stage. To delight in seeing men stabbed, poisoned, racked, or impaled, is certainly the sign of a cruel temper; and as this is often practised before the British audience, several French critics, Who think these are grateful spectacles to us, take occasion from them to represent us as a people that delight in blood. It is indeed very odd to see our stage strewed with carcasses in the lost scenes of a tragedy, and to see in the wardrobe of the play-house several daggers, poniards. Wheels, bowls for poisin and many of the instruments of death."

కరుణయు భయమును కల్గింపవలెనన్న మన కనేక సాధనము లున్నవి. అందు భయానకహత్యాకాండ మొకటి. దానిని మన (ఆంగ్లేయ) రంగస్థలమున తరుచుగా ప్రదర్శించు చున్నారు, కాని అది కడునిష్ఠురము, అసభ్యము. దాని మూలమున ఇరుగు పొరుగు జాతులవారిచే మనము ఘృణితులమై పరిహాసాస్పదుల మగుచున్నాము. భీషణమగు మానవ హత్య, విషప్రయోగము, కారావరోధము, త్వగ్విదారణము మొదలగు దృశ్యముల జూచి సంతసించుట క్రూరప్రకృతి ధర్మము. వాటిని ఆంగ్లప్రేక్షకుల ఎదుట కన్పరచుటచే కొందరు పరాసువిమర్శకులు మన వినోదము లిట్టివని యెంచి మనల రక్తప్రియులనీ క్రూరకర్మానిష్టులనీ గేలిసేయుదురు. వియోగాంతనాటకము ముగియుసరికి రంగస్థలమున పీనుగుల పెంట, నేపథ్యమున కత్తులు, కఠారులు, బాకులు, పిస్తోలులు, విష పాత్రలు ఇతర ప్రాణాపహరణోపకరణములును జూచుట రోతగా నుండును."

రంగస్థలమున రక్తపాతము హేయమనియు, అసభ్యమనియూ ఆంగ్లవిమర్శకులే వాక్రుచ్చుచున్నారు, కావున హత్యాకాండము ఆనందజనకము కాదనే వారి మతము. నాటకము నవరసాశ్రయము; వియోగాంతనాటకము కరుణ భయానకముల నెక్కువగా నుపయోగించును. భయానక రసపరిణామము హత్యయు రక్తపాతము కానక్కరలేదు; రసస్ఫూర్తి కలుగుటకు రస మానందదాయకము కావద్దా? ఆనంద జనకము కానిచో రసము స్ఫూర్తిచెందడ మెట్లు? తళతళ లాడుచున్న కత్తిని తనువున గ్రుచ్చుటచూచి తనియు వారుందురా? దానివలన జుగుప్స ఆవహిల్లునా? లేక సంతస ముదయించునా? హత్యాపరంపర అమర్చినచో భయానక రసమునకు భంగము వాటిల్లును. నాటకమును కసాయిఖానాగా నొనర్చుట వలన రసము పరిపక్వము కాబోదు. అట్టినాటక కవిత హానికరము రసభంగజనకమునై దోషదూషితమగును. కసాయి కర్మ కవిత కాదు. (Butchery is not poetry)

షేక్స్‌పియరు నాటకములందు కవిత లేదనరాదు. హత్యచేయకున్న కరుణరసస్ఫూర్తి కానేరదా? అట్లు చేయ నేరని కవులు విభావాది అంగములచే రసపరిపాకము రచింప నేరనివా రన్నమాట. వా రారసము జోలికి పోకుండుటయే శ్రేయము. హత్య నైసర్గికముగా జుగుప్సాజనకము. దానికి కేదీ జోడింపనక్కరలేదు. హత్యయెడ వెగటుపుట్టించడానికి నాట్యసాహిత్యమున దాని నెలకొల్ప యత్నించినచో ఫలము వికటించును. ఒక్కొక్కతరి చాలా హత్యలు జరుగును. యుద్ధములమాట యటుంచి రాజ్యలోభమున ఔరంగజేబొనర్చిన హత్యల స్మరింపుడు. ఒథెలో వంటివా రెందరున్నారు? కవియే ఆతని పెద్దజేసి అస్వాభావికవ్యక్తిగ నొనరించెను. మానవుడు అందు నభిజాతుడగు వీరుడు అంతటి వెంగలివిత్తగునా? ఇది సంశయాస్పదమే. జాన్‌నాటకమున హ్యూబర్టు మండుచున్న లోహశలాకను తెచ్చి ఆర్తరు కన్నుల కాల్చుట కుద్యమించిన తోడనే జుగుప్సు పుట్టును. కన్ను లట్లు పోకుండుట మేలయ్యె. ఆనిష్ఠురకర్మ నోరువలేక పాప మా రాజపుత్రుడు కారాగారకుడ్యమునుండి దుమికి కాలధర్మము నొందెను. అట్టి ఆత్మహత్య మానవహృదయముల వేధింపదా? ఆబీభత్స దృశ్యములకు ఫలమేమి? రాజ్య లోభము గహర్య్‌పాపమని చిత్రించుట కే కదా అవి యవతరించెను. అట్లు పాపగహుర్య్‌లగు వారెంద రుందురు? అట్టి రాజ్యలోభము నరికట్ట జాలువా రెవరు? అట్టి అసాధారణ వ్యక్తుల చరిత మందరికళ్ళయెదుట కట్టుటవల్ల ప్రయోజన మేమి? నాటక మితిహాసమా? ఇతిహాససౌభాగ్యము ఇతిహాసమున నుండనీ, నాటకములలో దానిని దూర్చడ మెందుకు?

హత్యలేకుండానే వియోగాంతముల రచించిన పట్టుల షేక్స్‌పియరు తప్పక ప్రశంసాహున్‌డు. అతని నాటకములలో కొన్ని వియోగాంతములయ్యు సంయోగాంతములనే వాడబడుచున్నవి. కాని వాటిని వియోగాంతములుగా గణించుటయే శ్రేయము. ఇమోజిన్ సీతాదమయంతులవలె ఘోరకష్టములపాలు కాలేదు, అందుచే వారితో సమగౌరవమునకు పాత్రము కాజాలదు - సింబెలీన్ నాటకము వియోగాంతమై ఇమోజిన్ లియోనిటసులకు సమాగమము ప్రాప్తించెనా, ఆమెను జూచి యందరు క్షోభచెంది యుందురు. సీతా రాములకు సమాగమము లేనందుచేతనే వారి వనవాసమూ వియోగమూ అధిక కరుణాస్ఫూర్తములయ్యెను. సీత పుట్టిల్లు చేరినచో ఆమెయెడ ఇప్పటి జాలిపుట్టునా? ఆమె వనవాసము కావ్యమందలి కరుణను కడ్డముట్ట జేసింది. ఆరసము స్థాయీ భావము నొందుటచేతనే ఉత్తర రామచరిత్రకు విశిష్ట గౌరవము ప్రాప్తించింది. ఛాయాంకమున నిది ప్రకటితమగును. వియో గముచేత కరుణ జనించును; హత్యావళిచేతనో, బీభత్స ముత్పన్నమై కరుణను కమర్చును. డెస్‌డెమోనా తలపునకు రాగానే జాలిపుట్టును గాని, ఆమెహత్య తలంచినతోడనే వెగటు పుట్టి కరుణరసమునకు భంగము కలుగును.

హోరెస (Horace)ను గ్రీకు విమర్శకుడు "రంగస్థల మందు ప్రకాశముగా హత్యాదికముల ప్రదర్శించుట తప్పు? గాని అప్రకాశముగా కన్పఱచిన దోషముండదని" వచించెను. ఇది "గుడ్డిలోమెల్ల" అని యెంచరాదు. హత్య అనుమాట వినగానే మనసులో దడబుట్టును. గొప్పగొప్ప పట్టణములలో జరిగెడు హత్యల నందరము కళ్ళతో చూచినామా? వినుకలిమాత్రమున నవి కండ్లకు గట్టినట్లు తోచవా? కల్పనా మాత్రముననే ఆదృశ్యములు ప్రత్యక్షములుకావా? బాలహత్య, స్త్రీహత్య, స్వామిహత్య, పితృహత్య, మాతృహత్య అన్న మాటలు వినగానే ఒళ్ళు జలదరించి ఆహత్యా కాండము మనయెదుట జరుగునట్లుండును. కావున హత్య అన్న మాటయే నాటకములనుండి బహిష్కరించుట మేలు; అదిప్రత్యక్షమైనను పరోక్షమైనను రసభంగము కాకతీరదు. అందున్నూ అనాధల, అమాయికుల, సద్గుణశీలుర హత్యల మాట చెప్పవలయునా? గ్రీకు సాహిత్య మీముప్పును సృజింప ఇతర ఐరోపీయ సాహిత్యములు దానికి దోహద మొనర్చినవి; ఆ విషవృక్షఫలములన్నియూ కురుచి భరితములు, జన సామాన్యమందలి సురుచు లందు చేరజాలవు; ఆఫలములు దోషకలితములని యెరిగియు భారతీయకవులు వాటినే ఆరగించుచూ తమసాహిత్యము పేరుప్రతిష్ఠల విడనాడదగునా? ఇతర సాహిత్యముల ననుకరింపవచ్చును, కాని తద్దోషముల పరిహరింపవలదా? ఆర్యసాహిత్యము చూడండి - దానియందిట్టి దోషము కానరాదే! స్వదేశీయమైన అనర్ఘ రత్న భాండారమును అధ:కరించి అవలక్షణరేఖా సమన్వితములగు విదేశీయమణులవిడంబింపనేల? తన్మూలమున మన సాహిత్యమునకు ఇంటావంటాలేని దోష మావహింప జేయనేల.

వియోగాంత నాటకముల దుష్పరిణామము

ఆంగ్లవిద్యాభ్యాసకుల మనముల నలరించు కవి షేక్స్‌పియర్. అతని నాటకములలో వియోగాంతములే మిన్నలు, వాటిని చదివిన జనసంఖ్య తక్కిన నాటకములకు లభింపదు - కళాశాలలలో నున్నప్పుడే యువకుల రుచులు వాటిచే కలుషితములగును. పరీక్షలలో కడతేరని విద్యార్థుల దృష్టి సాధారణముగా ఆత్మహత్యదెసకు బోవును. కాలక్రమమున దానియెడ వెగటు తగ్గుటచే అది పాపమనే తోచదు. షేక్స్‌పియరు గ్రంథములయందు ఆత్మహత్య మహాపాపమని ఎచ్చటను విశదముగా వివరింపబడలేదు, సరేకదా అది గౌరవదాయక మనియే ప్రశంసింపబడియెను. *[7] భగ్నకృషులు కావింపవలసినది ఆత్మహత్యయని ఆనాటకములు దృష్టాంతీ కరించును. ఇది కన్నవారికీ విన్న వాళ్ళకూ ఆత్మహత్యయం దాదారము కల్గుట ఆశ్చర్యముకాదు. ఆత్మహత్య అనహన్ మని ఆర్యసాహిత్యము పలుమా రుపదేశించును. ఇట్టి సంప్రదాయమునకు విపరీతములు ప్రతికూలములు నగు బోధన లాంగ్లసాహిత్యమందు కలవని నానమ్మకము.

ఆంగ్లసాహిత్యమందలి పక్షపాతము.

ఆంగ్ల సాహిత్యమందలి అభిమానముచే అది చెడ్డదన్న మాట మనవారు పెడచెవిని పెట్టుచున్నారు. నింద్యమగు దానిని నిందిస్తే సైపజాలక, అట్టి నింద్యవిషయములు ఆర్యసాహిత్యమున నేమూలనైనా ఉన్న వేమో అని ప్రయాసపడి వెదకుతారు. మన సాహిత్యమునం దట్టి దోషము లున్నవనుకొన్నా, అంతమాత్రమున ఆంగ్లసాహిత్యమందలి ఆదోషములు పరిహరింపబడునా? తనకంటిలో పువ్వున్న వాడు ఎదుటి వాని కంటిలోని కాయనుచూపినంతనే తనలోపమునుండి తప్పుకొనజాలునా? హలధరునియందు దోషము నెంచినంత మాత్రాన జలధరుని యందలిదోషము తగ్గునా? "వెనిసు వర్తకుడను" నాటకములోని ఛురికావ్యాపారము దోషకలితమన్నతోడనే మహాశయు డొకడు రామాయణములోని అగ్నిప్రవేశము దోషముకాదా అని ఆక్షేపించెను. అగ్ని పరీక్ష కేవలపరీక్షయే - ఆయగ్ని చ్ఛటల సీత భస్మీభూత కాలేదు. ఏనాటకమందైనా నాయకుడోనాయికో నిప్పులోబడి నీరయితే, అట్టి పరీక్ష భయప్రదమై పై నుదహరించిన ఛురికా వ్యవహారము వలె బీభత్సావహముగ నుండి యుండును. భారతమున లక్షాగృహ దహనము లేదా అని యడుగవచ్చును. ఉంది, కాని అదిప్రహసన ప్రాయము - ఖాండావదహనముంది, కాని అది రాజ్యమున శాంతి నెలకొల్పుటకు నిర్మింప బడింది. ఇందేదీ నాటకమందు కానరాదు. శ్రవ్యకావ్యములలో నిట్టివుండుట దోషము కాదు. పుర్రాణేతిహాసములలో ఎన్నియో అద్భుత వ్యాపారములు కల్పింపబడియుండును. ఇది సాహిత్యమునకు లోపముకాదు. నాటకములయం దవి ఉండగూడదు.

నాటక పర్యవసానము -

ఆంగ్ల సాహిత్యమందలి హత్యాకాండము సమర్థింప బూని అవి స్వాభావికములని వాదించేవారు సీతాస్వర్గారోహణము అస్వాభావికమనియు అద్భుతమనియు ఎట్లువాదింతురో? వియోగాంత నాటకము లందలి గోరహత్యాకాండమును కన్నులార జూచి యూరకుండుట స్వాభావికమని అనలేము. మనుష్యులయందు పాపము స్వాభావికమే, కాని యిట్టి హత్యాకాండము ఎట్టిపాపశైలశిఖరమును కూడా ముంచును. హత్యకన్న నీచతరమును గహ్న్యము నగు పాప మింకొకటి కలదా? ఇట్టి అస్వాభావికవ్యాపారముల నాటకములలో జొన్పుటకు ఆవశ్యకత యేమి? నాటకకళాకౌశల మందమా? సీతాస్వర్గారోహణము, పాతాళ ప్రవేశము శ్రీరాముడు సరయూనదిలో నంతర్ధానమగుట, పాండవులు హిమాలయమున నంతరించుట మొదలగు కల్పనల మూలమున ఆర్యకవులు హత్యల బహిష్కరించిరి - హత్యలవలన పాత్రములు అంత మొందించుట కంటె యీ తెరగున వాటి నపసరింపజేయుట నూరుమడుగులు మేలుగదా? హత్యలచేత పాత్రాపసరణము చేయుటే నాటకకౌశలమా? ఉపాయాంతర మేమీ కానరాదా? ఆర్యసాహిత్యమందలి స్వర్గారోహణాదులు కల్పించుటా కౌశలమే. "మధురేణ సమావయేత్" అను కావ్యసూత్రము ననుసరించి అట్టికల్పన చేయబడెను. హత్యాసంచయముతోనే గ్రంథసమాప్తియైతే పరిణామము బీభత్సము కాకతీరదు. అట్టిపర్యవసాన మతినింద్యము కావు ననే ఆర్యకవులు దానిని వర్జించినారు.

"హత్యాకాండ మంతటా రాదు, ఆవశ్యకమగు చోటనే అవతరించును. డెస్‌డెమోనాహత్య అవశ్యంభౌవి వ్యాపారము, ఒథెలో కథాంతర్గతము, అదిలేకున్న ఆతని పాత్ర పోషింపబడదు. ఘటనాక్రమమున ఆనాటక మట్లే పరిణమించవలయున"ని కొందరి అభిప్రాయము. తథాస్థు, కాని ఇది "విషయనిర్వాచన" మను దోషమని యెంచనగును. ఘటనాచక్రమును పరివర్తనము చేయనేరని కవిప్రతిభ ప్రశంసనీయముకాదు. షేక్స్‌పియరు ప్రతిభ అట్టిదనుట సాహస మందురా? ఆతనిప్రతిభ ఇట్లు మొక్కపోవుటకు ఆతని రుచి దోషమే హేతువు. హత్యాకాండము ఆనందదాయకమని యెంచే రుచి సురుచి కానేరదు. కృష్ణకాయునొకని నిర్దయునిగనూ పామరునిగనూ చిత్రించి శ్వేతముఖుడు పరమానంద భరితుడాయెను. ఇందు షేక్స్‌పియ రొక్కడే దోషి కాడు, ఆతని సమకాలీనులందరూ అట్టి రసికులే. ఇప్పటికినీ అట్టి రోచకులు మనలో లేకపోలేదు. ఈరుచి గిట్టని వారప్పుడూ ఉండియుందురు, కాని వారిమాటల పాటించు వారెవరు? ప్రతిభావంతులు పరోపదేశమును పాటింతురా?

ఆర్యనాటకములలో వేణీసంహారమున కీ "విషయ నిర్వాచన" దోషమే పట్టింది. భీముడు "ప్రల్లదు దుస్ససేను రుధిరంబు సురంబునువ్రచ్చి త్రావు" చున్నానన్నప్పుడును, "ప్రెళ్ళుమనన్ సుయోధనుని పెందొడలన్ గదనుగ్గుచేసి" తద్రక్తాక్తములగు చేతులతో "ఏరక్షస్సునుగాను" అంటూరంగ స్థలమున ప్రవేశించి అతడు ద్రౌపదీ వేణీసంహార మొనర్చునప్పుడున్నూ ఈదోషముందని ఒప్పుకొనవలయును.

                1. తల్లడ మంద కౌరవశతంబును పట్టి అనిన్మధింపనా?
                   ప్రల్లచు దుస్ససేను రుధిరంబు నురంబును వ్రచ్చిత్రావనా?
                   పెళ్ళుమనన్ సుయోధనుని పెందొడలన్ గద నుగ్గు సేయనా?
                   ...........................................................................

               2. ఏరక్షస్సునుగాను భూతమునుగా నేలామృతేభాశ్వవి
                  స్తారాంగంబులక్రింద దాగ? హతశేషక్ష్మాపులారా! ద్విష
                  చ్ఛారీరక్షతజాభిషిక్తతనుడన్ సంలంఘితోరు ప్రతి
                  జ్ఞారత్నాకరుడైన క్షత్రియుడనే శంకింప మీ కేటికిన్.

పార్సీనాటక సంఘములు - వారి రంగస్థలస్థితి;

పార్సీనాటకసంఘముల మూలమున మన దేశమున వియోగాంతనాటకముల కెక్కువప్రచారము కల్గింది. వా రా నాటకముల ప్రదర్శింప వేనవేలుప్రజ లతికుతూహలమున చూచి సంతసిస్తారు. నాటకములు చదివేటప్పటికన్న రంగస్థలముల యందు చూచేటప్పుడు కురుచులు జనుల మనములందు చక్కగా కుదురుపడతవి. మనవారిప్పటి నూతన సారస్వతో జ్జీవనమున రచించు నాటకములయందు, నవలల యందు, అపరాధపరిశోధక కథలయందునూ విషప్రయోగములు, హత్యలు యధేచ్ఛముగా గుప్పుతూన్నారు. వియోగాంత నాటకము లంతగా మనలో ప్రబలలేదు. అది కొంత మేలు. వాటిప్రభావవీచిక లంతటా వీచుచుండుటచే గ్రంథములయందు ఆత్మహత్యలు నవిరళముగా పరిఢవిల్లుచున్నవి, వాటియెడ వెగటు తగ్గుచున్నది. ధర్మభీరుత, పాప భీతియు పాడుపడుతూన్నవి. పురుషులయందేకాక స్త్రీలయందు కూడా కురుచులువ్యాపిస్తూన్నవి. *[8] నాటకదర్శన కౌతూహలము నానాటికిహెచ్చి, విదేశీయాదర్శము లాబాలగోపాలము ఆమోదనీయము లవుటవల్ల ఇతరభాషలయందును, సాహిత్యముల యందును ప్రబలియున్న కురుచులు మనభాషలయందు కూడా ప్రవేసిస్తూన్నవి. ఇంటింటా పిన్నలు పెద్దలు వాటినే ప్రశంసిస్తున్నారు.

మహాభారత రామాయణములు చదివిన ఫలము

ఆంగ్లసాహిత్య పక్షపాతులు ఆర్యసాహిత్యమున మాత్రము హత్యలు మొదలగు హానికరములగు కృత్యములు లేవా అని యందురేమో? లేకేమి? పుష్కలముగా నున్నవి. కురుక్షేత్రసంగ్రామమున, రామరావణయుద్ధమున, ఉపపాండవుల వధయందు, శిబికర్ణదధీచుల దానములయందున్నూ హత్యలు తక్తపాతములును కలవు, కాని మన దృశ్యకావ్యములం దట్టివి కానరావు. శ్రవ్యములకూ దృశ్యములకూ ఈవిషయమున చాలాభేదమున్నది. ఇట్టిదృశ్యము లార్యదృశ్య కావ్యములలో లేకుండుటచే కురుచిప్రచార మార్య సాహిత్యదర్శమున లేదని చెప్పవచ్చును.

రామాయణ మహాభారతములు పఠించుటవల్ల ఫల మత్యంత శుభావహము. ప్రకృతమున మనసంఘమున ప్రబలియున్న ధర్మప్రభావము ఈగ్రంథములు చదువుటవలన కలిగిందని నిశ్చయించవచ్చును. ఈ రెండుగ్రంథముల జీవరూప మగు ధర్మతేజము ధర్మబలమున్నూ మనసంఘమునకు మూలాధారములై బరగుచున్నవి. దానవీరులు పుత్త్రబలి నొసగడము జూచునపుడు మన మానసములను ధర్మప్రభావ మావేశించి తదితరభావముల డిందుపరచును. వారి దాన వీర్యము ధర్మాసక్తియు మనల భక్తిపరవశుల జేయును. ధర్మానురక్తిచే సర్వము త్యజించువారికి పుత్త్రబలి లెక్కా? ఆ బలిమూలమున త్యాగమందు గౌరవము, ధర్మభావమును పరిపూర్ణత నొందడమే గాక మన కావీరులయెడ సానుభూతి జనించి వారివలనే ధర్మాసక్తీ విషయపరాఙ్ముఖతయూ మన హృదయముల మట్టుకొనును. అట్టియెడ పుత్త్రబలి పూరికైన సాటికాదు.

ఆర్యధర్మానురక్తి కేవల ఋషి చరితములందే కాక క్షాత్త్రవీరులందున్నూ కనబడును; పురాణములు చదివిన ఈవిషయము విశదమగును. కౌరవపక్షమున సమరా వేశుడై యుండుతరినికూడా కర్ణుడు దానవీరుడు కావున ధర్మ పాలనమున అకుంఠితుడై, అమోఘములగు తన కవచకుండలములను ప్రతివీరపక్షపాతియు వంచకుడునగు ఇంద్రున కిచ్చెను. ఇది విన్నవారికి థార్మికోత్తేజనము కల్గదా? ధర్మాను రక్తి అతిశయింపదా? దీనిమూలమున మానవప్రకృతి దోషాయత్త మగునా? లేక ఉన్నతధర్మాసక్త మగునా? ధర్మమునకును దానవీర్యమునకును మానవుడు సర్వస్వపరిత్యాగ మొనర్పవలయు నను విధి నిర్ధారితము కాలేదా?

ఇక ఉపపాండవుల హత్య - ఇది దుర్యోధనుని ఆసుర ప్రకృతియందు జనించిన పాపవ్యాపారము. ఇది ఘోరమనియు తామసికమనియు వ్యాసుడే వ్యక్తీకరించెను. ఈఘటనను పరివర్తన మొనర్చి పాపసమ్మార్జనము చేసి శిక్షాప్రదమగునట్లు కొందరు కావించిరి. ఆత్రమున జరిగెను కదా అని దుర్యోధనుడుకూడా పశ్చాత్తప్తు డాయెను. యుద్ధసమయములందు మోసము, వంచన, భ్రాంతి మొదలగువాటిచే చోదితములగు కృత్యములు ఎన్నో జరుగుచుండును. అంత:కలహము లాపజ్జనకములని చూపుటకు కవులిట్టి ఘోరకర్మల కల్పింతురు. మహాభారతము ఇతిహాసమ (History)ని యెంచేవారి కివి అసంబద్ధములని తోచదు. అది యొక కావ్యమని యెంచేవాళ్ళకే. ఇట్టి కార్యపరంపర భయంకరవ్యాపారమని తట్టును. జ్ఞాతివిరోధమున భయంకరపరిణామము చేకూరుతుందని వారు తెలుసుకొందురు.

భారతము పురాణమని యెరుంగునది. జనులయందు ధర్మబీజముల నాటి సంఘములయందు ధర్మబుద్ధి ప్రబలునట్లు చేయడమే పురాణముల ముఖ్యోద్దేశము. అట్లు చేయబూనునపుడు కొన్నిచోట్ల హత్యాకాండము అవసరమగును, కాని ప్రధానాంశము కాకపోవడముచేత అది యేమూలనో మట్టుపడియుండును. దృశ్యకావ్యములం దట్టివి కల్పిస్తే అవి ప్రదానములగును, కావున ధర్మబుద్ధిని మట్టుపరచును. పురాణములందన్నననో అవి ప్రక్కలకొరిగి ధర్మానురాగోదయమును అరి కట్టవు. పుష్కలకార్యప్రపంచమున వీటికి ప్రాముఖ్య ముండదు. ధర్మానురక్తి జనుల జీవితముల నియమితములుగను సుశిక్షితములుగనూ చేయును.

  1. * విభావానుభావసంచారీభావములచే స్థాయీభావము వ్యక్తము కాగా రసోత్పత్తి యగును. భావనను విశిష్టముగా స్పష్టీకరించునది "విభావము", ఇది రెండువిధములు : - ఆలంబనము, ఉద్దీపనము. దేని ఆశ్రయమున రస ముదయించునో అది "ఆలంబనము". దేనివల్ల రసము అతిశయించునో అది "ఉద్దీపనము" రసానుభూతిని కావించుభావము "అనుభావము" సాత్విక, కాయిక, మానసికములని అనుభావము మూడురకములు. రసమున సంచరించుభావము "సంచారి" యగును, స్థిర మగుభావము "స్థాయి" అనబడును. వచ్చుచూ పోవుచుండునని సంచారిభావములు; ఎప్పటికిని స్థిరముగా నుండునది స్థాయీభావము. రతి (అనురాగము) హాసము, శోకము, క్రోధము, ఉత్సాహము, భయము, గ్లాని, ఆశ్చర్యము, నిర్వేదము లని తొమ్మిది స్థాయీభావములు - వీటినుండి శృంగారము, హాస్యము మొదలగు తొమ్మిదిరసములూ క్రమముగా పుట్టును. రసములన్నిటికీ ఉత్పత్తి విభావానుభావసంచారీస్థాయీభావము లుండితీరును. వీటినిగూర్చి విపులముగా నెఱుగ దలచువారు దశరూపకాది ఆలంకారిక గ్రంథముల చూడనగును.
  2. *Desdemona.......O,banish me, my lord, but kill me not. Othello...........Down, Strumpet ǃ Desdem..........Kill me tomorrow, let me live tonight. Othello..........Nay, if you strive' -
  3. ఈయభిప్రాయము బొత్తిగా తోసివేయదగినది కాకున్నా కొంతవఱకు అతిశయోక్తి అనక తీఱదు. ఇప్పటి నాటకములలో నిట్టిదృశ్యములు తరుచుగా గుప్పుచుండుటచేత ప్రేక్షకుల గుండెలు దిట్టబడుచున్నవి. కాలగతి మారుచుండుటచే ఇట్టి దృశ్యములు అనుభవ సిద్ధములగుచున్నవి. అసూయావేశమున కదా ఒథెలో నిదర్శన మేదియులేక నిరపరాధినియగు కాంతపై నిందమోపి నిధన మొనర్చెను.ఇట్లే యెన్నో హత్యలు ఇప్పుడూ జరుగుచున్నవి. ఈర్ష్య మానవులకన్ను గప్పి కార్యాకార్య విచక్షణను క్రమక్రమముగా తగ్గించును, కనుక ప్రేక్షకులకు ఒథెలోయెడ కొంత సానుభూతి జనింపవచ్చును. సాత్త్వికచిత్తులకును అస్థిరభావులకు, నిర్భోధులగు బాలకులకు ఇట్టి దృశ్యములు గర్భనిర్భేదకము లనుటకు సందియములేదు. నిరపరాధులు బాముల బడుచుండ జూచి యోర్వలేక తత్కారకుల శిక్షింప ప్రేక్షకులు కొన్నివేళల క్రోధావేశులై రంగస్థలమున కురుకుటయు, ఒకరిద్దరు ఉన్మాదు లగుటకూడా తటస్థించును.
  4. * ఇట వియోగాంతశబ్దము Tragedy అనుశబ్దమునకు పర్యాయపదముగా వాడబడినది, కాని రెండునొకటికావు. వియోగము అనేక విధముల ఘటిల్ల వచ్చును, Tragedy వాటిలోనొక భంగి. ఉత్తరరామచరితము వియోగాంతమే కాని Tragedy కాదు Tragedy యందలి వియోగము కొట్లాట రక్తపాతము లేక కాబోదు. ఇవిలేకపోయినా నాటకము వియోగాంతము కావచ్చును కదా; అయినను ఈరెండుశబ్దములు సమానార్థమున వ్యవహరింపబడు చుండుటచేత ఈగ్రంథమునకూడ అవిపర్యాయపదములు గానే వాడబడినవి.
  5. * Crusades అనునవి క్రైస్తవులకు మహమ్మదీయులకు జరిగిన మతయుద్ధములు క్రైస్తవుల పుణ్యభూమియగు జెరూసలెమ్ మహమ్మదీయులవశమునుండి తప్పించిటయే వీటి యుద్దేశము యూరపుఖండ మందలి ప్రతిదేశస్తులు (నిందు పోరాడి మడియు చుండిరి.)
  6. † (Inquisition) అనునది క్రైస్తవలయందలి శాఖలలో నన్యోన్యము కలుగుచుండిన హత్యలు. ఇవి అతిభయంకరములు, హృదయ దారకములు.
  7. * కొన్నిచోట్ల ఆత్మహత్య ఆచరింపగూడదని లేకపోలేదు, అది మాటవరుస కన్నదేకాని సేనామంది ఆత్మగౌరవము నిలువబెట్టుటకు ఆత్మహత్య అవలీల కావించినారు.
  8. * ఇప్పు డిప్పుడు సినిమాలు ఊరి కొకటిచొప్పున వ్యాపిస్తూన్నవి. వాటిలోనూ హత్యలు పరిపాటే, ఆదర్శములు అవనతములు, రుచుల నాగరకములునై ప్రేక్షకుల మనస్సులందు విషబీజములను నాటుతూన్నవి.