Jump to content

సాహిత్య మీమాంస/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

మొదటి ప్రకరణము

________

సాహిత్యాదర్శము

ఆర్యసాహిత్యప్రకృతి

ధర్మమే ప్రాణమని యెంచు ఆర్యజాతివారు తమ సాహిత్యమున ధర్మజయఘోషణమే కావించిరి. మహాభారతమున వేదవ్యాసుడు పతివ్రతాశిరోమణియగు గాంధారిచే నిట్లు పలికించును.

"యతోధర్మస్తతోజయ:"

ధర్మముండెడు చోటనే తనరు జయము

ఆమెయే శ్రీకృష్ణుని స్తుతించుచు నిట్లనెను: -

"జయోస్తు పాండుపుత్రాణాం యేషాంపక్షే జనార్దన:"

వాసుదేవుండు తమప్రక్క వరలుగాన

విజయమగు గాతమా పాండవేయులకును*[1]

భగవంతు నాశ్రయించు వారికి జయము తప్పదని ఇందలి సారాంశము. ఇది మాటవరుస కన్నదికాదు, ఇందలి యాథార్థ్యమందరికీ తెలుసును. భారతయుద్ధమున ధర్మపక్షము అనగా భగవదాశ్రితులపక్షమే ప్రబలెను. భారతమున కౌరవపక్షరూపమున మానవులపాపచిత్రము అతివిశదముగా ప్రకటింపబడెను. సాక్షాద్భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణు నాశ్రయించి ధర్మానుసారము ప్రవర్తించిన పాండవపక్ష మంతకన్న నెక్కువగా విశదీకరింపబడినది. ఈచిత్రమందలి సమజ్వలప్రభముందు ఆచిత్రమందలి పాపాంధకారము పటాపంచమగును. వెలుగు ముందర చీకటివెలయగలదా? అందుకే ధర్మక్షేత్రమగు కురుక్షేత్రమున పాపము భస్మీకృత మాయెను.

వాల్మీకి రచించిన మహాకావ్యము శ్రీమద్రామాయణము భక్తిరసపూరిత మహాసముద్రము. అందున్నూ ధర్మమునకే జయము ప్రాప్తించి తద్విజయపతాకము అయోధ్య మొదలు లంకవరకూ ఎగురుచుండెను.

రాక్షసకులము ప్రబలమే కాని భగవద్భక్తిస్రోతమందలి తరళతరంగములలో లీనమయి, శ్రీరాముపక్ష మందలి పుణ్యవంతమగు రాజ్యము అయోధ్యనుండి లంకాపురమువరకు ప్రతిష్ఠితమయ్యెను. రామునిరాజ్య పాలనమున హిమాలయము నుండి కన్యాకుమారివరకును లంకాద్వీప మందున్నూ పుణ్యము స్థాపింపబడెను. దండకారణ్యమున రాక్షసభయము రూపు మాపెను, ఏమూలనో తపము జేయుచున్న శూద్రుడును రామచంద్రుని పుణ్యశస్త్రస్పర్శచే నిష్పాపుడై ముక్తుఁడయ్యెను. *[2]

పౌరాణికములగు ఈగ్రంథములను వీడి సాహిత్య క్షేత్రమున కవతరింతము. దానికధ్యక్షులగు కాళిదాసు, భవభూతి, మాఘుడు, శ్రీహర్షాదిమహాకవులందరూ తమగ్రంథ లందు ధర్మసూక్ష్మములనే బోధించి యున్నారు. కాళిదాసు తన అపూర్వరచనా కౌశలమున కుమారసంభవ మందు ధర్మమయమగు చిత్రమునే రచించెను - పార్వతి తపమూ హిమవంతుని శివానురాగమూ అసాధ్యసాధనలు కావా? వీటి యుజ్వలాభాసముచే ఆకావ్య మలౌకిక మగుచున్నది. ఇక శకుంతల - భువన విఖ్యాతనాయకి - గూర్చి చెప్పే దేమి? జగన్మోహన మగు ఆనాటకమందు ఋష్యాశ్రమము చిత్రింపబడెను. అందలి పశుపక్షిసముదాయములు శకుంతలయెడ ప్రేమపూరితములాయెను. ఏమి ఆశకుంతల సహృదయత! ఆమెప్రేమ ప్రబలి పతిభక్తిగా పరిణమించి ఆమెను తపస్వినిగా పరిపక్వ మొందించెను. ఇక దుష్యంతుని ధర్మా సక్తి వీక్షింపుడు. ధర్మమందలి అనురాగము చేతనేకదా తన యెదుటపడి పతిభిక్ష నిడుమని యాచించిన శకుంతలను ఆతడు ప్రత్యాఖ్యాన మొనర్చెను. అసమలోభనీయమగు నామెయెడ నిట్టి ఆచరణము అన్యులందు సంభవ మగునా? తరువాత ఆమె వృత్తాంతము జ్ఞప్తికిరాగా ధర్మకాతర దగ్ధ హృదయముతో నాతడు పెట్టిన మొర లెవని హృదయమును కరిగింపజాలవు? ఈధర్మానుతాపమును "చిత్రదర్శన" ♦[3] అంకమున ఉజ్వలరూపమున కవి రచించెను. ఇంతకన్న ఉజ్వలతరమగు ధర్మానుతాపమును గాంచవలెనన్న భవభూతిరచితమైన ఛాయాదర్శనా*[4]౦కమున లభింపగలదు. అందుశ్రీరాముని భగ్నహృదయము ప్రతిబింబించును. ఇట్టి చిత్రముల నవలోకించినవారు ఆర్యసాహిత్యమును పఠించుటచేత వారి హృదయములు ధర్మానురాగ పరిపూరితము లగునో కావో యించుక తెలియచేయుదురుగాక. మానవహృదయము లెక్క లేని కళంకములచే కలుషిత మయినను ఆర్యసాహిత్యపఠనము దానియందు ధర్మానురాగము నుత్పన్నము జేయకుండునా? ధర్మముదెస ఆహృదయ మించుకేని ప్రసరింపదా? * [5] ఆర్య సాహిత్యాధ్యయన ఫల మెంత సుందరమో, ఎంత ఉత్కృష్టమో, ఎంతశాంతిదాయకమో ఎంతవిశుద్ధమో చూచినారా?

ఆర్యాంగ్లేయ సాహిత్యములు.

ఆంగ్లసాహిత్యమును కాని తదితర ఐరోపీయ సాహిత్యములనుగాని పఠించిన ప్రాప్తించు ఫలమిదేనా? ఆర్యసాహిత్యమునకు శిరోభూషణములై సర్వాంగసౌందర్యమును సమకూర్చి తత్ప్రాణపదములు గౌరవదాయకములూ ధర్మనైతిక సుందరములునగు నున్నతాదర్శములు ఆంగ్లేయ సాహిత్యమున లభించునా? లభింపవు. అందు మానవసంఘాముల యొక్కయు నూనవవ్యక్తులయొక్కయు చిత్రములు లేక పోలేదు, కాని అవి ఆర్యసాహిత్య చిత్రములవలె ధర్మగౌరవ పూర్ణములుకావు. ధర్మగౌరవ మందందు చిత్రింపబడెనేకాని ప్రస్ఫుటితముగాక ప్రచ్ఛన్నముగానున్నది. నిబిడారణ్యమున నేమూలనో కుసుమితమగు మాలతీలత తనసౌరభ్యమును వ్యర్థపరుచు నట్లూ కంటకిత కాననమున సహకారము తన మనోహరతను ప్రకటింపజాలనట్లూ, హింస్రమృగముల భయా నకరవభరితమగు వనస్థలిని గండుకోయిల తనమధురగానమును వినిపించజాల నట్లూ అచ్చటచ్చట విరళముగా వర్ణింపబడిన ధర్మసౌందర్య మాంగ్ల సాహిత్యమున వన్నె కెక్క లేదు, దానిమర్మమువిస్పష్టము కాలేదు.

ప్రకృతి చిత్రకారులమని ఐరోపీయుల కొక అహమిక కలదు. ప్రాచ్యసాహిత్యమున మెచ్చదగు ప్రకృతిచిత్రణమే లేదని వారియూహ. ఆచిత్రణము రెండింటియందును కలదు గాని వాటిలో కొంత భేదమున్నది. ఆంగ్లసాహిత్యమున నగ్నరూపము ధరించిన ప్రకృతిమూర్తి ఆర్యసాహిత్యమున సాలంకృత యగు చున్నది. మానవప్రకృతి యందలి పాశవ ఆసుర ప్రవృత్తులకు ఆంగ్లసాహిత్యమున గౌరవము చెల్లుచుండ ఆర్యసాహిత్యమున దైవికభావములకే గౌరవము కల్గుచున్నది. దైవికప్రవృత్తిసమున్నతిచే మానవజాతికి చెందదగు మాననీయత ఆర్యచరితములందు వర్ణింపబడుటచేత ఆసౌందర్య ప్రభలలో ఆసుర ప్రవృత్తులు ప్రచ్ఛన్నము లైనవి.

ఆంగ్లేయ సాహిత్యమున నీవిషయమున వైపరీత్యము గానవచ్చుచున్నది. అందు మానవప్రకృతి యందలి పాశవ భావములు, ఇంద్రియ ప్రవృత్తులును ప్రధానవర్ణనీయాంశము లగుటవల్ల దైవభావములు దాగియుండును. విదేశసాహిత్యమున ప్రధానపదమునొంది ఆంగ్లజాతికి గర్వోన్నతినాపాదించు షేక్స్‌పియర్ నాటకవిమర్శనమున ఈవిషయము స్పష్టమగును. ఇతరాంగ్లేయ కావ్యసమాలోచన మనవసరము. ఆనాటక రాజ ములను పఠించుటచే నెట్టిభావము లుత్పన్నములవునో యిందు వివరింపబడును.

మానప్రకృతి - షేక్స్‌పియర్.

పాశ్చాత్య జగమునందలి జనసంఘముల యొక్కయు మానవ వ్యక్తులయొక్కయు ప్రవృత్తులు అద్వితీయప్రతిభతో చిత్రించిన మహాకవి షేక్స్‌పియర్. అచ్చటి ఆచారవ్యవహారములు రీతినీతులు మొదలుగాగల విషయములను పురస్కరించుకొని ఆతడు రచించిన సజీవచిత్రములు ప్రశస్తములు, యథార్థములు, మర్మోద్ఘాటనము లగుటచే రూపగ్రహణయంత్రమున(Photographic Camera) తీసిన పటములవలె తోచును. అతని నాటకములందలి పాత్రములన్నియు సజీవములు, అట్టి చిత్రణ మసాధారణశక్తి కలితమనుట అతిశయోక్తికాదు. ఆకవి కీర్తి యంతయు వియోగాంతనాటకము (Tragedy)*[6]ల యందు నిక్షిప్తమై యున్నది. అందాతని అలౌకికప్రజ్ఞ విశదము కాగలదు. ఆతడు కేవల చిత్రకారునివలె అనుకారికాక, జాజ్వల్యమాన సృష్టివిభవ సంపన్ను డనికూడా స్పష్టమగును.

ఆనాటకములు కావ్యనాటక రసనిష్యందములూ సృష్టి చాతుర్య ప్రదర్శకములూ అగుటచేతనే పాశ్చాత్య సాహిత్య గ్రంథములలో మేలుబంతులై కవికీర్తిస్తంభములై, పృధ్వీతలమున నెల్లకడల నాటుకొనియున్నవి. సంయోగాంతనాటక (Comedy) రచనయందున్నూ అతడు సిద్ధహస్తుడే, అంతవాడు ఐరోపీయ కవివరులలో లేడు.

జగద్విదితములు సర్వమాన్యములగు నాతని వియోగాంతనాటకములే విమర్శింతాము. మానవప్రకృతిని చిత్రించుటలో నాతడెంతవరకు కృతకృత్యుడాయెనో, అన్ని విషయముల నాతడు సఫలీకృతుడాయెనో లేదో చర్చింప తల పెట్టలేదు. తత్ప్రకృతి చిత్రణమున నాతడనన్యసామాన్యప్రజ్ఞావంతుడని మొదటనే చెప్పితిమి. ఆతని కౌశలమును ప్రశంసిస్తూ విమర్శకు డొకడిట్లనియె -

                      O Natureǃ O Shakespeareǃ Which
                            of ye drew from the other?
                         ప్రకృతిదేవత! షేక్స్‌స్పియ! ర్పలుకరాదె?
                         ఎవరెవరికి ప్రతిబింబ మిట్టి సృష్టి?

మానవప్రకృతిని తత్తుల్యరూపమున చిత్రించినాడు గాన ఆతని చిత్రములెట్టివో పరిశీలింతాము. ఈప్రకృతి గుణావగుణ సంకలితమని అందరెరుగుదురు. ఇందు పశుత్వమూ, మానుషత్వమూ, దేవత్వమూఅని మూడుప్రవృత్తులున్నవి. ఆహారము, నిద్ర, రోగము, శోకము, కామక్రోధాద్యరివర్గముతో కూడియుండుటచే మానవుడు పశుతుల్యుడు; బుద్ధి, విద్య, వివేచన, మొదలగు శక్తులచే సంపన్నుడగుట నాతనికి మానుషత్వము సిద్ధించెను; దయ, దాక్షిణ్యము, భక్తి మొదలగు గుణవిభూతి గల్గుటచే నాతడు దేవసమాను డవుతున్నాడు. ఈమూడు గుణములు - తమస్సు, రజస్సు, సత్వము కలిసి యుండుట చేతనే మానవప్రకృతి మిశ్రప్రవృత్తి సంఘటిత మయింది.

క్రైస్తవమత సిద్ధాంతములు మానవులయందు పాపాంశ మెక్కువగానున్నదని ఘోషిస్తూన్నవి. "జనసమాజమందు ప్రాయికముగా పాపాంశమెక్కువగానున్నది. శ్రేష్ఠగుణములు తక్కువ, తామసిక రాజసిక ప్రవృత్తులు బలవత్తరములు, అందుచే చాలామంది నిర్మలచరిత్రులుకారు" అని వాటి వాదము. అందుచేత ఆసామాజిక చిత్రములూ వ్యక్తి చిత్రములూ రచించు కవులు ఆరెండు గుణములకూ ప్రాధాన్య మివ్వవలసి ఉంటుంది. అట్లుచేయకున్న ఆచిత్రములు వారి మతధర్మానుసారము తత్తుల్యములు యథార్థములును కానేరవు. కావున ఐరోపీయకవివరేణ్యుల చిత్రములయం దాయా జాతులయం దెట్టి గుణవిశేషములుండునో వాటియందు రజస్త మోగుణంబులెట్లు వికాసముచెందెనో తెల్పబడును. షేక్స్‌పియర్ రచించిన చిత్రములు ప్రకృతికి యధార్థప్రతిబింబములే ఐనచో పాశ్చాత్యమానవవ్యక్తిప్రకృతియందూ జనసంఘము నందూగల ఆలోకాంధకారములు దోషములున్నూ వాటి వాటి పరిణామమున ప్రతిబింబితములై యుండితీరును; హెచ్చు తగ్గు లుండనేరవు అనగా యూరోపీయ జనసంఘములందును తల్లోకచరిత్రమందును విశిష్టదోషము లేతీరున నుండునో వాటికి షేక్స్‌పియరు రచన ప్రతికృతియై యుండును. ఆ మత సిద్ధాంతముల చొప్పున మానవ ప్రకృతి ఎంతపాపకలితమని యెంచబడెనో ఆమాలిన్యమాతని రచనయందు గన్పట్టవలెను. కాని ఆతడు కేవలానుకారికాడనియు సృష్టికర్తయగు మహాకవి యనియు చెప్పియుంటిమికదా, అతని సృష్టియెట్టిదో పరిడీలింతాము.

ప్రాచ్యపాశ్చాత్యకవుల సృష్టిలోని భేదము.

జనసమాజమును తుత్తునియలుగ చేసి పర్యవేక్షణ మొనర్చి దాని ప్రకృతరూపమును ప్రతిబింబింప సమకట్టువారి కందలి దోషములే ఎక్కువ పొడగట్టును. ప్రపంచమునకు సద్బోధ మొనర్చువారిలో కవి యొకడు, కావున జనసంఘ మందలి పుష్కలదోషభావములను తగ్గించి సత్వగుణమును సంక్రమింపజేయు ప్రక్రియల నిర్ణయించి వాటిని తన బోధనచే జగమున వ్యాపింపజేయువాడే మహాకవి; కావుననే కవులు జగద్గురులని భావింపబడుచున్నారు. ఈయుపాయోపదేశమున ప్రాచ్యులకూ పాశ్చాత్యులకూ చాలాభేదమున్నది. ఆకవుల సృష్టి వారివారిబోధన కనుగుణముగ నుంటుంది, కావున సృష్టి మూలమున బోధనజేయుటలో - "ప్రాచి ప్రాచి, ప్రతీచి ప్రతీచి" అను కవివాక్య మన్వర్థము. పాశ్చాత్యులు సృజించిన తీరున ప్రాచ్యులు సృజింపలేదు. ఒకరు సంఘమందలి రజస్తమోగుణముల నుజ్వలరీతిని గన్పరచి వాటి ఫలములు ఘోరణయానకము లని దృష్టాంతములతో వర్ణింప, ఇంకొకరు సత్వగుణమును సముజ్వల రూపమున చిత్రించి దాని నవలంబించినవారి జీవితము సుఖాగారమౌనని దృష్టాంతములతో బోధించి మానవమానసముల నావంక కాకర్షింప యత్నించిరి. ఒకరు నరకయాతనల సృజించి, అవి నిర్భరములని నిరూపించి, జనసమూహముల పాపదూరులుగ జేయ సమకట్ట, రెండవవారు స్వర్గసుఖముల సౌందర్యము నభివర్ణించి సుఖ లిప్సయెడ నందరి దృష్టుల నాకర్షించి ఇహమున పరసుఖము ననుభవింపజేసిరి. పాశ్చాత్యకవిశేఖరు డగు షేక్స్‌పియర్ నరకమూ దాని యాతనా సృజింప ఆర్యకవిశేఖరులగు వ్యాస వాల్మీకులు పుణ్యవంతము పవిత్రమునగు స్వర్గమును సృజించిరి. అసాధారణ కౌశలమున ఇరుతెగలవారూ ఇట్టి సృష్టి చాలాకాలము క్రిందట నొనర్చిరి. అందెవ రెక్కుడు కృతకృత్యులో తత్ఫలాఫలముల వీక్షించినచో నిశ్చయింపవచ్చును. హిందూసంఘమునను యూరోపీయ జనసంఘములయందు నెవ్వరధికతరధర్మశీలురు ఎవ్వరధికతర సాత్వికభావసంపన్నులు - ఎవరు దయ, దాక్షిణ్యము, క్షమ, భక్తి మొదలగు సుగుణో పాసకులు? వారిలో నెవరియందు ధర్మప్రవృత్తి ప్రబలము? - ఈప్రశ్నలకిచ్చే సమాధానములబట్టి తత్కవుల సృష్టి పలాఫలములు చదువరులు నిర్ణయించుకొందురు గాక.

షేక్స్‌పియర్ సామగ్రి యాతని సృష్టి కనుకూలముగ నున్నది. వియొగాంత నాటకములే ఆతని ప్రధానసాధనసంచయము. అందలి రచనాప్రణాళి నరకమును సృజించి తద్దు:ఖాగ్నిని యాతనానిచయమును కన్నులకు కట్టునట్లు చేయగలదు. ఆసురసృష్టి కా నాటకము లుపచరించునట్లు దైవీసృష్టి కుపచ రింపవు. మానవులయందలి ప్రచండ పాశవప్రవృత్తుల ప్రబల రూపమున చెలరేగనిస్తే రక్తపాతము పరిణమించి తీరును, ఈప్రవృత్తులు పెరిగి పెరిగి తుదక మానుష. చర్యలగుటకూడా సహజము. ఈలోకమున వైరమెంత ప్రబలినా ఎక్కడో కాని రక్తపాతమున పరిణమింపదు, అదీ అతివిరళముగా గన్పట్టు చుండును. రక్తపాతమున కనువగు నవస్థలు జనులలో చాలా తక్కువ; జనసంకులములగు ప్రదేశములందుగూడా సాలుకు మూడో నాలుగో హత్యలు జరుగుచుండును. అట్టి బీభత్సకర్మలకు లోభమో, ద్వేషమో, వైరనిర్యాతనమో, స్త్రీయెడ సందేహజనిత క్రోధమో కారణమగుచుండును. ఇట్టి లౌకికావస్థలజూచి షేక్స్‌పియర్ వియోగాంతనాటకములు రచించెను. *[7]మేక్‌బెత్, ఒథెలో, ఇయాగో, రోమియో, బ్రూటస్, మూడవరిచర్డ్, జూలియట్, మేక్‌బెట్ రాణి మొదలగు అమానుషపాత్రముల సృష్టించి వియోగాంతనాటకముల నాతడు రచించెను. ఈపాత్రముల యందు యంత్రణ దు:ఖాగ్నియూ కలవు, తద్రచనయం దంతశ్శత్రుప్రాబల్యము మానవప్రకృతిని దాటి అసురసీమకు దాపగును.

శ్లెగెల్ అను జర్మను విమర్శకుడు మేక్‌బెత్ రాణిని "రంపెలాడి" అని నిర్వచించెను; అట్టి సాహసము, కృతఘ్నత నిర్దయా రాక్షసులకు చెల్లునుకాని మానవులందు కానరావు, ఆమె ఒకానొకచోట - "అవసరమైనచో నేను పాలిచ్చి పెంచిన పసిపాపశిరము ముక్కముక్కలుగ చెక్కగల" ననెను. మన భాగవత మందలి పూతన యిట్టిదేకదా ! ఆమెకూడ శ్రీకృష్ణుని పాలిచ్చి చంప నుద్యుక్తురాలు కాలేదా ! ఇద్దరియందును కృతఘ్నత, ధర్మద్రోహమును సమానమే. ఆసురీప్రేమ పిచ్చియెత్తించ జూలియట్ అనేకవిధముల వాక్ఛలమున తన అంతరంగమును, యవ్వనలాలనయు రోమియో కెరిగించెను. అదే శ్రీరామునివంటివానిమ్రోల కావించెనేని రెండవ శూర్పణఖ అవతరించి యుండును. ఇద్దరికీ అనురాగ భేదము లవమైన కానరాదు. ప్రత్యాఖ్యానమున శూర్పణఖా విధిప్రేరితమున జూలియటూ విఫలమనోరథ లైరి. ఆమె సమరాగ్నిని ప్రజ్వలింపజేయ ఈమె ఆత్మఘాతకావించు కొనెను. సామాన్యకారణముచే ప్రేరితుడైన ఇయాగోచాతురి మానుషసీమను దాటి అన్న దాతయు ప్రభువునగు ఒథెతో హస్తములను స్త్రీహత్యాపామున పంకిల మొనర్చెను. ఇక మూడపరిచర్డిట్లనెను: -

                    since I cannot prove a lover .........I
                    am determined to prove a villain.
                    వలపుజనియింపజేయగ బడుగునౌట
                    అసురగుణముల తప్పకే నభ్యసింతు.

అతని యనంతరచర్య యీవాక్యమును స్థిరపరుచునట్లు కవి వాని నసురునిగా సృజించెను. ఇట్టి యాసురికాదర్శ మొక షేక్స్‌పియరు నాటకములందేకాక ఆంగ్లశ్రవ్యకావ్యములకు తలమానికంబన జెల్లు Paradise Lost అను గ్రంథమున మహాకవి మిల్టన్ రచనయందుకూడ రాజిల్లుచున్నది. ఈగ్రంథమున కొంత భాగమేని చదువని ఆంగ్లభాషాభ్యాసకు లుండరు. అట్టివా *[8] రాగ్రంథమును చదివినపిమ్మట సైతాను (satan) ఆసురిక భీమప్రకృతి వారిహృదయములం దచ్చుపడినట్లు ఇంకొక చిత్రము నాటుకొనజాలదు. ఆకావ్యమున కాతడు నాయకునివలె సర్వశక్తుడై అన్ని కార్యములూ నిర్వహించుచుండును. స్వర్గమర్త్యపాతాళము లాతని కర్మక్షేత్రములు. అతనిబలము కౌశలమును అపరిమేయములై పరమేశ్వరుని సృష్టియందు ఘోరవిప్లవమును జనింపజేసెను. సర్వజ్ఞుడు సర్వశక్తుడని పేరు వడసిన సర్వేశ్వరు డేమూల దాగియున్నాడో ఎఱుగజాలము. సైతానుని ప్రచండవిక్రమము, ఆసురశక్తి, భీషణదేవద్వేషమును కావ్యమందెల్ల ప్రాదుర్భవించును. దేవద్రోహి యగు సైతాను చేతి కీలుబొమ్మలయి, అతని ప్రలోభనమున బడి ఆదము అవ్వయు పాపానురక్తులై తత్ ఫలమె ట్లనుభవించిరో, పాపపరిణామ మెంత విషాక్తమో చూపుట కేమిల్ట నీరచనకు గడంగెనందురు. ఆకవివరుని మానసమున మానవప్రకృతియం దలి తమోమయ మలినభావములు సాక్షాత్కరించిన తెరగు ప్రకటించుట కా కావ్యము నాతడు రచియింప సమకట్టెను. అట్టిచో దేవభావముల నాత డేల చిత్రింపబూనును? ప్రబలమగు నాసురప్రవృత్తిని పెంపొనర్చి నైతికశాసన ప్రభావమును దరిజేరనీయని దుర్దమనీచ ప్రవృత్తియగు పాపమయప్రకృతి నామహాకవి చిత్రించెను.

మహాభారతమున గదాధారియగు నాసురప్రకృతి దుర్యోధనరూపమున నంతట తానేయైప్రబలి, తన యా వేగమున మహాత్ములగు ద్రోణకర్ణులను లోభవాగురులలోని కీడ్చి వారి ప్రతాపమంతయు సమరమున సమయజేసి, నైతికశాసనమును గానీ ఉత్తమపరామర్శమును గాని చెంతజేరనీయక - గాంధారి, విదుర, భీష్మ, ధృతరాష్ట్రుల హితబోధనను పూరికైన గొనక - కురుపక్షమున దేవద్రోహముచేయ కంకణముగట్టి, కురుక్షేత్రమందు ధర్మవిరుద్ధముగా ఘోరసంగ్రామము కల్పించి పృథ్వీతలమంతయు నెట్లు గడగడలాడించెనో, అట్టి ఆసుర బలమే మిల్టను తనకావ్యమున సైతానురూపమున చిత్రించెను. ఈరెండును బింబప్రతిబింబము లనజెల్లును.

ఆర్యసాహిత్యమున సృష్టిసంపూర్ణత

పాపపూరితమగు ప్రపంచమును చిత్రించుట ప్రయాస జనకముకాదు. ఎటుజూచినా అదే ప్రత్యక్షము; కనబడు దానిని చిత్రించుట కష్టముకాదు. కావున షేక్స్‌పియర్ ఇట్టి చిత్రముల నచ్చొత్తుటతోనే తృప్తిపొందలేదు. తద్రచన యందు సొంతనేరుపుకానితనము కూడా చూపెను. ఆతడు చిత్రించిన మేక్‌బెత్ రాణివంటి స్త్రీ అలౌకికపాత్రమే, అనగా పృథ్వియందట్టి వ్యక్తి పొడచూపదు.

ఆర్యకవు లీమార్గమునకు వ్యతిరేకముగా తమరచనను సాగించి ధార్మికులలో అసాధారణ మూర్తులు నిరూపించిరి. ఎల్లెడ బరగుచున్న ధార్మిక మూర్తుల చిత్రించుటవలన ప్రయోజనమేమి అని యడుగవచ్చును; కాని ధార్మికవ్యక్తులంతటా కుప్ప తెప్పలుగా నున్నారని యెంచవద్దు. అదీకాక సాహిత్యమున చిత్రింపబడిన వ్యక్తివిశేషములు స్థిరరూపమున నిల్చిపోవును, కావున కవి వాటియం దసామాన్య రూపసమావేశ మొనర్చుచుండును. అట్టి రూపసృష్టి చేయునపుడు సర్వసామాన్య చిత్రరూపములు మదిలో నుంచుకొనవలయు. ఆర్యకవులు అసామాన్య శరీర సౌష్టవమునకు తిలోత్తమ నాదర్శముగా కల్పించి, బాహ్యసౌందర్యమున నామె యెట్టి అసామాన్య సృష్టియో, అందు కనుగుణముగ మానసికసౌందర్యముగల పాత్రములు కూడా తమ సాహిత్యము నందు చిత్రించిరి. తిలోత్తమవంటి అనుపమ శారీరకరచన షేక్స్‌పియర్ చేయక పోలేదు. ఆతని యాదర్శములు మిరాండా ( Of every creature's best=రత్నము) *[9] రోసలిండ్, హెర్మి యోన్;...కాని తత్త్యుల్యమానసిక సౌందర్యాదర్శమును సృజించుటలో నాతడార్యకవివరులకు వెనుకబడెను - అతని మిరాండా శకుంతలకు తీసిపోయినది; రోసలిండ్, హెర్మియోన్, ఇసబెలా, హెలీనాలు అసామాన్య సౌందర్యమూర్తులు కాజాలరు. వియోగాంత నాటకములయం దాతడు తిలోత్తమవంటిదాని చేయబూని మేక్‌బెత్ రాణి వంటి అసురసృష్టి నొనరించెను. రోమియో, ఇయాగో, మేక్‌బెత్ రాణి, మూడవరిచర్డ్ వంటివారు లేకుంటే భయంకరచిత్రసమన్వితములూ రక్తపాతపరిణతములూ అగు నాటకము లెట్లు వెలువడ గలవు?

ఆర్యసాహిత్యమునా ఇట్టి భయావహమగు సృష్టి లేక పోలేదు, కాని అట్టివారి కసురులనియే పేరు; వారి వ్యక్తులు మానవేతరములు, ధర్మద్వేషమందును దేవద్రోహమందును వారు సుప్రసిద్ధులు. మిల్టన్ కావ్యమందిట్టి ప్రచండ రాక్షస సృష్టి సైతా నొక్కడే కలడు, కాని ఆర్యసాహిత్యము నందట్టివారు లెక్కలేనంతమందికలరు. వృత్రాసురుడు, హిరణ్యకశిపుడు మొదలగు వారెందరో దేవద్రోహులై అనేకములగు నుత్పాతముల కాధారభూతులైరి. వారితోకూడా అసురనాశకులగు దేవతలూ గంధర్వులే కాక ఎందరో ధర్మ వీరులున్నూ సృజింపబడుటచేత చదువరుల దృష్టి అసురుల వంకకు బోకుండా దేవతలయందే నిలుచును. మొత్తముపై ధర్మమునకే జయము తనరుచుండును; అందుచేత ఆర్య సాహిత్యము ధర్మజయమునే ప్రశంసించును. అంతర్వైరోన్మాదము, పాపపరాక్రమమునూ మూర్తివంతములగునట్లు రచించుట మహాకవులకు చక్కని రాజమార్గ మగునేని దీనికి తోడుగ జితేంద్రియత్వము, ధర్మ వీర్యమును మూర్తీభవింపజేసిన వారిప్రకర్ష వాడిపోవునా? మానవప్రకృతి కొకప్రక్క సముజ్వలరీతిని చిత్రించుట ఉచితమైతే, రెండవప్రక్కగూడా చిత్రించుట అనుచితమగునా? అదీకాక ప్రపంచమును ప్రతిబింబించుపట్ల అసురప్రవృత్తి మాత్రమే వ్యక్తీకరించిన లాభమేమి? దానికితోడు పరమేశ్వరుని *[10] అష్టవిభూతుల నమర్చి శోభావంతమగు ఆతని సౌమ్యమూర్తిని కూడా చిత్రించుట యుక్తము - అప్పుడు సమగ్రబ్రహ్మాండమున్నూ జాజ్వల్య మానశోభాయుతము భీషణమునగు మూర్తిద్వయము దాల్చును. ఆర్యసాహిత్యమున నిట్టి సంపూర్ణమూర్తి చిత్రింపబడినది. ప్రకృతికి ప్రక్కనే పురుషుడుండును కావున మూర్తిద్వయము సమానోజ్వల భావమున రాజిల్లుచుండును. శరీరమం దంగ ప్రత్యంగములు తత్తత్సమాన పరిమాణములతో వికాసమానములగుట చూస్తున్నాము. శిరస్సులేని మొండెమును కానీ అంగప్రత్యంగములులేని శిరస్సునుగానీ చిత్రిస్తే ఆప్రతిమ సంపూర్ణ మగునా?

షేక్స్‌పియరున్నూ అసురనాశకధర్మవీరుల చిత్రము లను రచించెను. కాని అవి ఉజ్వలరూపమున పెంపొదక పోవడముచేత అసురచిత్రములను మించలేకపోయెను. మేక్‌బెత్ కు ప్రతిగా మేక్‌డఫ్ బాంకోలున్నారు, కాని వారసమర్థులు - రిచర్డ్, జాన్ మొదలగువారికి ప్రతియోగులే లేరు. కావున ఆనాటకములందు ఆసురిక చిత్రములు ప్రబలమై తత్ప్రతియోగి చిత్రముల నడగ ద్రొక్కినవి. *[11]

పుణ్యాదర్శముల ఆవశ్యకత, ఉత్కర్ష -

గహ్యన్‌మైనపాపమూర్తి తద్భీషణపరిణామమున్నూ ప్రత్యక్షమయ్యేటట్లు రచియించి మానవుల దుర్మార్గదూరుల జేయు నుపాయ ముత్తమము గనుక ఐరోపీయ వియోగ నాటకముల యందలి ఆసురసృష్టిని కొంతవరకూ సమర్థింప వచ్చును. అలాగే కానీ. వాటిమూలమున పాప మెంతవరకు నివారింపబడినదను వాదమును విడిచి వియోగాంతనాటకములు చదివి రంగస్థలముపై వాటిని చూడడమువల్ల మంచి ఫలము చేకూరుననే ఒప్పుకొందాము. అంతమాత్రనా ఏమగును? మానవులను పాపమార్గమునుండి నివృత్తుల జేసినంతమాత్రమున పూర్ణసిద్ధి అయిందా? వారి చిత్తముల యందలి పరమార్థక్షుధను పరిమార్చ నక్కరలేదా? పార మార్థికచింతచేతనే కదా మానవుడు ప్రపంచమును పెద్ద జేయును; అట్టి చింతచేతనేకదా శాంతివృష్టిని కల్పించి అమృతధారల ప్రవహింపజేయును. ఈలాలసేకదా మానవప్రకృతికి ప్రబల మగు నిధానము-దయ, దాక్షిణ్యము, ప్రేమ, స్నేహము, భక్తి మొదలగు వాటి కాటపట్టు మానవాంత: కరణమేకదా? దీనిని పరితృప్తి చేయుటయందే మానవు డెల్లప్పుడును వ్యగ్రుడై యుండును. అట్టివానికి నరకయాతనా ప్రదర్శన మెట్లు లాభకారి కాగలదు? పాపభీతి కల్గినంత మాత్రాన పుణ్యప్రవృత్తి అలవడునా? మానవులయందు ధర్మాసక్తి వెలయింపవద్దా? సద్వృత్తుల తృప్తిచేయు సాధన మేది? ధార్మికాదర్శముల సృష్టింపవద్దా? ఒకపుణ్యాత్ముని పవిత్రచరితమును పఠిస్తే అది మనమానసముల నాకర్షించును, తన్మూలమున పరమానందము కల్గును. ఇట్టి యానందము పాపచరితముల పఠించి తద్భీషణపరిణామములకు భయపడునప్పుడు కల్గునా? పుణ్యఖనులయొక్కయు మానధనులయొక్కయు ఉదారత, దానవీరుల మహత్వమున్నూ మన మానసముల నలరించి అంత:కరణముల యందు సత్స్ఫూర్తి పరిఢవిల్లజేయును. ఇట్టి కార్యసిద్ధి యింకొక తెరగున ఘటిల్లునా? పాపకంటకములు దూరమునకు తోసి పుణ్యబీజములు మానవమానసములయందు నాటుటకు పుణ్యాత్ముల సౌశీల్యమున్నూ ధార్మికుల ఆదర్శోన్నతీ చిత్రించుటే పరమసాధనము. పాపమూర్తులు పలుమారు చూస్తే మానసము పాపావిల మవునట్లు ధర్మజ్యోతిని పలుమారు చూస్తే పాపము దూరమగుటే కాక మన హృదయములందు పుణ్యము నెలకొనును. ధర్మమూర్తులగు యుధిష్ఠరశ్రీరాముల చరితములు పలుమారు పరిశీలనము చేస్తే మన మానసము పవిత్రమవుతుంది. అందరియందు నట్టి సౌశీల్య ముండదు. మానవుల చిత్తవృత్తు లెంత పుణ్యమయములై అసాధారణసౌందర్యమున విలసిల్లుచున్నా, శ్రీరామయుధిష్ఠిరుల వృత్తములు వారి కున్నతి చేకూర్చునే కాని అవనతి కల్గింపవు. పుణ్యాత్ముల ఆకర్షణశక్తి, పవిత్రశీలుల సౌందర్యము, ధార్మికుల ప్రభావము, మానవమానసముల నాకర్షింపక యుండలేవు; కావున అందు కనుకూలమగు తీరున సంఘములను కవులు చక్క జేయవలయును. ప్రకృతిచేతనే మానవులయందు దైవీ ప్రవృత్తిబీజము లున్నవని చెప్పియుంటిమి. అందుకే అనేక శతాబ్దములక్రిందట ఆర్యసాహిత్యమందు సంచిత మొనర్చిన ధర్మబలము ఇప్పటికిన్నీ హిందూసంఘముల నడిపించుతూ, అందలి పవిత్రప్రవృత్తుల రక్షణ చేయుచూ, అసాధారణ ధార్మికప్రవృత్తుల నతిశయింపజేయుచున్నది. చూచితిరా పుణ్యాదర్శముల ప్రభావము!

సాహిత్యమున అలౌకిక సాధన -

సర్వసాధారణము కానిది అలౌకికము. అసామాన్యములు అలౌకికములు కాకుండుటచేతనే సాధారణమానవుల జీవితము లూరూ పేరూ లేక నశించును, వారచిరకాలమున మరపు వత్తురు. ఎప్పుడూ కన్నులయెదుట నుండే వాటికి చిత్తాకర్షణశక్తి యలవడదు - "అతిపరిచయమున అవజ్ఞ" అనన్యసమానులు, అద్భుతవ్యక్తులున్నూ చిత్తము నాకర్షించి అందు నెలకొని స్మృతిపథమునుండి త్వరలో తొలగరు. కవుల సృష్టిలోనివా రిట్టివారే, కావున తత్సృష్టి అద్భుతావహ మగును. ఇట్టి అద్భుతవ్యక్తులను చిరస్మరణీయుల చేయడముకోసము కవులు తమ రచనయందు ప్రకృతిసీమను కొంచెము దాటవలసి వచ్చును. అంతట నాచిత్రములకు అలౌకికత అలవడును. మేక్‌బెత్ రాణి యిట్టి అలౌకిక చిత్రమున కొక దృష్టాంతము. ఒథెలో, రిచర్డ్, గోనరిల్, జాన్ మొదలగు పాత్రము లన్నియూ ఇట్టివే. ఇట్టి యమానుషకల్పనలు మహాకావ్యములం దావశ్యకములు; అత్యంతాద్భుతములు కాకపోతే అవి చిరస్మరణీయములు కాలేవు.

మిల్టన్ రచించిన సైతానుపాత్ర మత్యంతాద్భుతరసపూరితము కావుననే కల్పనాజగమున సర్వాధికారము చలాయిస్తూన్నది. ఆదము అవ్వల సరళతయు పవిత్రతయు నద్భుతములే. అతడు రచించిన నరకచిత్ర మత్యద్భుతమూ సువిస్తృతమే కాని ఆతని స్వర్గసృష్టికిమాత్ర మాగుణ మబ్బలేదు; అందుకే ఆస్వర్గముకన్న ఆనరకమే చిరస్మరణీయమైంది.

అమానుషిక పాపచిత్రములం దొక దోష మంది. మిల్టన్ సైతాను పాత్రమువలె వాటి విశాలత, ఉన్నతి, గాంభీర్యమూ మన హృదయములందు వెరగు విస్మయమును పొడమజేసి అనురాగము నంకురింపజేయుటచేత పూర్ణభావమున దానియెడ రోతపడము. ఎందుకంటే పైనుదహరించిన గుణసమృద్ధిచేత ఆపాత్రయందు లేశమైనా అనురక్తియు, సానుభూతియు ప్రభవింపకతీరవు. దానిని జూచి యెంత రోయుదా మనుకొన్నా చిత్త మాదెసకే పారుచుండును. పాపకలిత మని మన మెఱిగినా ఆపాపము మన కగుపడదు. అలౌకికపుణ్యచిత్రముల కీమచ్చయుండదు. పుణ్యచిత్రము స్వాభావికముగా మనోరంజకము, అందద్భుతరసము మేళవించినచో ఫలము ద్విగుణించును. అట్టి చిత్రమును జూచి యానందించువారు అది లౌకికమో అలౌకికమో చర్చింపనేలేరు. తత్పవిత్రాంబుధిపుణ్యవీచికల దూగుచూ, తద్దివ్యకథాసుధారసము గ్రోలుచూ, ఆశ్చర్యవిహ్వలత వారి మానసములు తథ్యమిథ్యావివిక్తిని కోలుపోవును. ముగ్థుల కట్టి వివేక ముండునా? తత్పవిత్రగంగాప్రవాహమున సంశయపంకము తుడుచుకొనిపోవును.

కామక్రోధాదులు పశువృత్తిబీజము లనియూ దయా దాక్షిణ్యాదులు దైవీప్రవృత్తిబీజము లనియూ చెప్పినాము కదా? మొదటివి చేర్చి రచించిన అద్భుతకల్పన ఆసురము, రెండోవి జేర్చి రచించిన అద్భుతకల్పన దైవీకల్పన. పాశ్చాత్యసాహిత్యమున ఆసురసృష్టి సమృద్ధిగా నున్నందున దాని ఆధి క్యమువల్ల దైవీకల్పన ప్రచ్ఛన్నమూ మలినమాయెను. ఆర్య సాహిత్యమున దివ్యప్రకృతిసుందరప్రభాచ్ఛటలమధ్య అందలి పాశవప్రకృతి ప్రజ్వరిల్లదు. శ్రీరాముని పుణ్యచిత్రప్రభావమున రావణుని పాపచిత్రము పాతువడింది; శ్రీరామభరతుల గాఢ స్నేహప్రభావమున కైకేయీ మందరల పాపచిత్రములు రూపుమాసినవి. ఆపాపకల్పన శ్రీరామభరతచిత్రములను కౌసల్యాసీతల చిత్రములనూ ఉజ్వలప్రభాభాసమానములుగ జేసి తాను నిబిడాంధకారమున విలీన మైనది.

శ్రీరామయుధిష్ఠిరులందు అలౌకికధర్మాదర్శము లుండిన లాగున తక్కినరాఘవులయందునూ పాండవులందునూ అలౌకిక భాతృప్రేమ కద్దు; పురు పరశురాములందు అలౌకిక పితృభక్తికద్దు. పరశురాముడు పితృభక్తి ప్రేరితుడౌటనే కదా తండ్రియాజ్ఞను మన్నించి తల్లి తల ద్రెవ్వనేసెను? ఆమెను తిరిగీ జీవింపజేయు సామర్థ్య మాతనియందు లేదు, అట్లు జరుగు నను ఆశయు నున్నట్లు తోచదు. ఆతని చరితమును విన్న వారి హృదయములందు పితృభక్తి గౌరవ మినుమడింపదా? కవి యుద్దేశము సఫలము కాలేదా? మహాకావ్యరచనాచాతుర్యము చూపుట కిట్టి ఘటనాసమావేశ మొనర్పవలయును, అట్లు చేయకున్న రసస్ఫూర్తి గాంభీర్యమున్నూ జనింపవు. పితృభక్త్యావేశముననేకదా ఇరువదియొకసారి యాశూరుడు క్షత్రియకులనాశ మొనర్చెను. పితృ దేవతలను సుఖపెట్టుటకు భగీరథుడెంత కష్టసాధ్యమైన కార్య మొనర్చినాడు! పంచ పాండవులు మాతృభక్త్యవతారము లనవచ్చును. అలౌకికపతిభక్తి:కుదహరణములనేకములుకలవు. సతి, పార్వతి, గాంధారి, ద్రౌపది, సీత, సావిత్రి, కౌసల్య, దమయంతి, అరుంధతియు ఆర్యసాహిత్యమున ఆదర్శపతివ్రతలు. వారి అలౌకికప్రేమ పతిభక్తిగా పరిణమించింది. కర్ణుడు, బలి, హరిశ్చంద్రుడును దానవీరులు; శ్రీరాము డలౌకికసత్యపాలకుడు; లక్ష్మణు డసామాన్య బ్రహ్మచారి,

ఇట్టి పవిత్ర ధర్మాదర్శము లొకచాయ ఆసురప్రతిమ లింకొక చాయ ఆర్యసాహిత్యము నలంకరించుచున్నవి; రెండూ అలౌకికములే. పాపదమన మొకవంక పుణ్యోదయ మొకవంక పరిఢవిల్లుచుండ, ద్వివిధసంపదచే ఆసాహిత్యము పాపనివృత్తి నొనర్చుటేకాక పుణ్యపథప్రవృత్తి నాపాదిస్తూన్నది. ఇంతకన్న ఉన్నతాదర్శములు భావనాతీతములు.

ఇందలి యా థార్థ్యమునకు చిన్నదృష్టాంతము నవలోకింతాము - భీమసేనుని గదాప్రహారమున దుర్యోధను మారుభంగ మాయెను. దృప్తారుల బాకు దెబ్బలచేత శరీరము రక్తసిక్తమై రారాజు అడవి మొఱలిడుచుండ అశ్వత్థామ చేరవచ్చి, అనునయించి, ప్రభువునకు సంతసము గూర్ప పృథ్వి నపాండవ మొనర్తునని నమ్మించి, ప్రతిన జేసి సేనాధిపతి అయ్యెను. పిమ్మట నిశీథమున పాండవ శిబిరము జొచ్చి ఆత్రమున పాండవు లను భ్రాంతిచే ఉపపాండవులైదుగురి గొంతుకలు కోసెను. అట్టి అసురకార్యనిర్వహణము విని ఆపాదమస్తకము అడలనివారూ ఆశూరమ్మన్యు నేవగింపనివారూ ఉందురా! దుర్యోధనుడుమాత్రము సంతసించెనా? పాండవులు చావరైరికదా అని పల్లటిల్లి ప్రాణములు విడిచెను. కౌరవవీరుల ఈభయానకబీభత్సపై శాచిక ప్రవృత్తిని గాంచి రోతపడనివా డెవడు? దీని యనంతరసృష్టిని తిలకింపుడు - పుత్త్రశోకోపహతచిత్తయై ద్రౌపది కన్నీరు మున్నీరుగా నేడ్చుచుండ ఆదు:ఖ మపనయించి ఆమెకు సంతసము చేకూర్ప "దేవీ, నీపుత్రఘాతకుని శిరము ఖండించినీ కుపాయనముగా కొనివచ్చెదను; ఇదే యీఘోరపాతకమునకు తగిన ప్రతీకారము" అని అర్జునుడు ప్రతిన జేసి శ్రీకృష్ణ సహాయుడై అశ్వత్థామను కట్టితెచ్చి ద్రౌపది మ్రోల బడవైచెను. పుత్రశోకాతురయగు ఆసాధ్వీమణి నీసందర్భమున శ్రీమద్భాగవతమున వ్యాసభట్టారకు డిట్లు వర్ణించెను : - పశువువలె త్రాటం గట్టబడి తానొనర్చిన ఉత్కటపాపమునకు ఫల మిహముననే లభించెగదా అని బాలవధజనిత పరమలజ్జాప రాఙ్ముఖు డైన అశ్వత్థామకునమస్కరించి పరమసాధ్వినిట్లనియె. "నాథా? ఈబ్రాహ్మణకుమారుడు గురుతుల్యుడు మీరు సాంగధనుర్వేదమూ నిస్తులాస్త్రవిద్యాగూఢమర్మములునూ ఈమహాత్ముని జనకు లగు ద్రోణాచార్యులయొద్ద నభ్యసించి జగదేక శూరులైతిరికాదె? భగవత్స్వరూపు డగు ఆమహాత్ముని కేకపుత్రు డీతడు - పతివ్రతాతిలక మగు నీతని జనని వీరమాతకృపి యీతని కొరకుకాదె సహగమన మాచ రింపలేదు. అట్టి లోకోత్తరమగు గురుకులమును పూజించి తత్ప్రతిష్ఠ లోకమున వ్యాపింపజేయుట న్యాయము కాని, దాని కవమానము సంధింజేయుట మీవంటివారి కర్హముకాదు. గౌతమపుత్రి సాథ్వియునైన మీ గురుపత్నికి పుత్త్రశోకము తెచ్చిపెట్టినానన్నరట్టు నాకేల? దాన నాపరితాప మారునా? మనతోగూడ ఆమె పుత్రశోకానలమున మడియ నేల? ఇప్పటికే బంధువియోగానలమున సంతప్తమగుచున్న మనకులము గురుకులతిరస్కారశోక దవానలమున దహింపబడ నేల? ఇతడు చిరజీవియై యుండి ఈతని తల్లి నావలె కడుపుదు:ఖమున కమలకుండుగాక" అని పల్కి అశ్వత్థామను విడిచిపుచ్చెను. <>

      1. భూసురుఁడవు, బుద్థిదయా| భాసురుఁడవు; శుద్ధవీరభటసందోహా
         గ్రేసరుఁడవు, శిశుమారణ| మాసురకృత్యంబు ధర్మమగునే తండ్రీ?
     2. ఉద్రేకంబునరారుశస్త్రధరులై| యుద్ధావనిన్ లేరు, కిం
         చిద్రోహంబును నీకుఁజేయరు బలో| త్సేకంబుతో చీఁకటిన్
         భద్రాకారుల, చిన్న పాపల, రణ| ప్రౌఢక్రియాహీనులన్,
         నిద్రాసక్తుల సంహరింప నకటా ! నీచేతులెట్లాడెనో?.......
     3. ద్రోణునితో శిఖింబడక| ద్రోణకుటుంబిని యున్న దింట, స
         క్షీణతనూజ శోకవివ| శీకృతనై విలపించుభంగి, నీ
         ద్రౌణి దెరల్చి తెచ్చుటకు| దైన్యము నొందుచు నెంతపొక్కునో,
         ప్రాణవియుక్తుడైన నతి| పాపము బ్రాహ్మణహింస మానరే.

</> పుత్రశోకోద్వేగావిలమానస యగు ఆమానినీమణి ధర్మానురక్తి ఎవరిమనము నక్కజపరుపదు? ఇట్టి అలౌకిక సహృదయత, క్షమ, ధర్మప్రీతిగుంఫితచిత్రము అశ్వత్థామ నింద్యచిత్రమును మరుగుపరచి, ఉదారమూ శాంతము నగు రసముచే చిత్తము నార్ద్ర మొనర్చి, ధర్మానురాగ ముదయింపజేయుటచే ఎట్టి పాపచిత్రమైనా చిత్తమునుండు తొలగి అంత:కరణమున ధర్మబల ముద్భవించును. అట్టి బలసంపద చేతనేకదా అబలారత్నమగు యాజ్ఞసేని గర్భశత్రువగు అశ్వత్థామను గాంచినతోడనే శోకతాప మార్పుకొనజాలెను.

సాహిత్యమున రసక్షేత్రములు -

వియోగాంత నాటకములగొప్ప భయానక కరుణా రసములం దున్నది; కాని పరిణామము రక్తపాత మయినచో బీభత్సరస ముత్పన్నమై పెచ్చుపెరిగి పైరెండు - రసముల నణగ ద్రొక్కి తానే రాజవుతుంది. రక్తపాతము చూచినా, విన్నా, తుదకు స్మరించినా కూడా బీభత్స ముదయించి గుండె తటతటలాడి, తనువెల్ల కంపించి చిత్తము క్షోభజెందును. ఆభావము రూపుమాసేదాకా దయాదాక్షిణ్యములు పొడచూప జాలవు. ఎవరిపైదయ? చంపబడినవానిపై సాధారణముగా దయపుట్టదు. ఒకడు మఱొక పాతఘాతకుని జంపినచో పురాతనమారకునియెడ జాలిపుట్టక నవీనుడే దయకు పాత్రుడగును. ఎట్లన, పినతండ్రిని హేమ్‌లెట్ పిల్కుమార్చెనే, ఇందెవరిపై దయ పుట్టును? నిస్సంశయముగా అందరూ చిన్న హేమ్‌లెట్ నే మెచ్చుకొందురు. మేక్‌బెత్ ప్రభువు మ్రందిన పిదప దయకు పాత్రుడవునా? కీచకదుశ్శాసనుల హత్యానంతరము వారియెడ అనుకంప జనించునా? ధార్మికులు నిగ్రహింపబడిననూ నిహతులయిననూ వారియెడ దయ పుట్టుట సహజము - సావిత్రి, సీత, దమయంతి, శకుంతల, ఉత్తర, డెన్‌డెమొనా, కాన్‌స్టెన్స్, ఒఫీలియా, పాండవులు, లియర్ మొదలగువారే ఇందుకు ప్రమాణము. వియోగాంతనాటకముల సంకీర్ణక్షేత్రము పాపపూరిత నరకకుండము; అందు పాపము కాలక్రమమున భయావహయై దుర్నిరీక్ష్యావస్థల బొందుతుంది; దాని చిత్రించుటకు కావలసిన ఉపాయము లన్నియూ అందు సంచితములగును - అటులనే పుణ్య మేయే అవస్థలయం దేలాగు విజృంభించునో చూపడమున కందవకాశము లేదు. లియర్‌నాటకమున ఇట్టి రచనకు వీలులేక పోవుటచే నిగృహీతుడైన కథానాయకు డొకడే దయకు పాత్రుడయ్యెను. ఒకవంక కార్డీలియా ఇంకొకవంక నామె అక్కలు - వీరి జీవితవైషమ్యములు నిరూపించుటకే రాజుగారి పాత్రము కల్పించబడింది. శ్రీరామయుధిష్ఠిరుల చరితము లెట్టి దురవస్థయందున్నూ తామరమొగ్గలవలెవికసించి క్రమముగా స్ఫూర్తివహించి ఉన్నతధర్మాదర్శముల కునికిపట్టులై శాంత రసమును ప్రసరింపజేయును. అట్టి ఉపాయసంచయము ఆర్యసాహిత్యాంతర్గత మహాకావ్యములయం దమరింది. కాని వియోగాంత నాటక సాహిత్యమున నట్టి దనువుపడదు. దుష్యంతుడు ధర్మానురక్తిని శ్రీరామధర్మతనయుల కోడి పోవును. షేక్స్‌పియరు నాటకములందే కాక ఇతర ఆంగ్లసాహిత్యగ్రంథములందున్నూ ఇది అసంభవ మాయెను. లాటిన్ గ్రీకు సాహిత్యములందు కూడా ఇట్టి చిత్రములు మృగ్య ములు; అందు శౌర్యవీరుల చిత్రములు కరవుతీర కలవు. ధర్మవీరుల ప్రతిమ లెందునూ కానరావు. శ్రీరామ ధర్మ నందనులు మానవ కల్పనాసీమనెల్ల కప్పియున్నారు. ఇం కేది చేర్చుటకూ సూదిముల్లు మోపు చోటైనా లేదు. వారిచరిత మందలి అనల్పకల్పన మానవ హృదయములందు భక్తి శ్రద్ధల పుట్టించి వాటిని శాంతరస ముద్రితముల జేయును.

డెన్‌డెమోనాపాత్ర మనల్పకృపాపాత్రము: లియర్ తన అవివేకముచే తెచ్చి పెట్టుకొన్న కష్టములు పాషాణ హృదయము నైనా కరిగింపగలవు. పతివియోగమున ఉత్తరవలె సుతవియోగమున కాన్‌స్టెన్స్ మనో వైకల్యము చెంది ఊరడిల్లుటకు ఉపాయాంతరము లేనందున పిచ్చియెత్తి తానేడ్చి యితరుల నేడ్పించినది. అంతతో ఆమెపని సరి. వియోగాంత నాటకనీరంధ్రనిబిడాంధకారమున డెన్‌డెమొనా చిన్న నక్షత్రమువలె మినుకులాడుచున్నది. చండభానుడు కేతుగ్రస్తుడై నప్పుడు దివసమంధకారమయమై మట్టమధ్యాహ్నమున చీకటి గ్రమ్మును. అప్పుడు కొన్ని నక్షత్రములు గగనమున పొడచూపును; డెన్‌డేమొనా అట్టిచుక్క. నాటకబీభత్సాంధకార మామె స్వచ్ఛజ్యోతి నాచ్ఛాధించినా, దయకించుక తావుంచినది. వియోగాంతనాటకములం దిదే వరుస - ధర్మజ్యోతి ఆ నాటకముల పాపాంధకారమున బడి వెలుగుదామని ఎంత యత్నించినా, సముద్రమున బడు వర్షధారలవలె స్వీయనిర్మల రుచిని నిల్పుకొనజాలదు. ఆనాటకములందు ధర్మాభాస ముండునే కాని ధర్మవ్యాప్తికి తావుండదు. ఇది ప్రబలెనా నాటకము వియోగాంతము కానేరదు. అట్టి నాటకములందు స్థాయీభావము నొందదగినది భయానకరసము; పరిణామమున నుండదగినది కరుణరసము. ఈ రసోద్రేకములందు ధర్మ వికాసమునకు వీలులేదు. ఒకవేళ ధర్మవిన్యాస మొనర్ప యత్నిస్తే వెంటనే శాంతరస మవతరించవలెను, అప్పుడు వియోగాంతమునకు రసభంగము కల్గును. అందుచేతనే వియోగాంతనాటకములు శాంతరసముజోలికి బోవు. శాంతరస ప్రాబల్యము చూడవలెనంటే ఆర్యసాహిత్యమందలి మహా కావ్యములూ నాటకములూ చదువవలయును.

సాహిత్యమున వీరత్వము -

ఆంగ్లవియోగాంతనాటకములలో పాపచిత్రణ మెట్లు ప్రబలెనో, పాపగతి యెట్లౌన్నత్యము వహించెనో, అట్లే ఆర్యసాహిత్యమున ధర్మచిత్రణము బ్రబలి ధర్మగతి ఔన్నత్యము నొందెను. మిల్టనుకృతియందు పాపవీర్యము తద్విజయమును ప్రకటింపబడినరీతిని ఆర్యకృతులయందు ధర్మవీరత్వము తద్విజయమును బ్రకటింపబడెను. ఆవీరత్వమును పెంపొనర్చుటకు దానితో నింక రెండు తెరగుల వీరత్వము జోడింపబడి వికాసము నొందెను. అందొకటి బలవీరత్వము, రెండవది చాతురీవీరత్వము - భీముని బలవీర్యము ధర్మాధీనము; దుర్యోధనుని దట్లు కాదు. భీము బాహాబలమును మహాశక్తియు దుర్యోధనునందూ కలవు; కావున వారిద్దరూ ప్రతియోగులు. అర్జునునకు ప్రతియోగి కర్ణుడు; ధృష్టద్యుమ్నుని ప్రతియోగి ద్రోణుడు; కర్ణుని ఆసురవీరత్వమునకు ప్రతియోగి ఘటోత్కచుడు; భీష్మునకు పాండవులందరూ ప్రతియోగులైనలాగున నభిమన్యునికి కురువీరు లందరును ప్రతియోగులు - యుధిష్ఠిరునకు ప్రతియోగి యెవరు? భీమార్జునులవలె దేహబలమున గాని సమరచాతురని గాని అతడు ప్రధానవీరుడు కాడు. సమరమున రాధేయున కోడి కాందిశీకుడు కాలేదా! అతని యందు ప్రధానవీరత్వము ధర్మవీరత్వము; ఈవిషయమున భీమార్జును లాతని యెదుట తలవంచుకొనవలయును. కురుపక్షమున ధర్మవీరత్వము భీష్మునియందును విదురునియందును కలదు. పాపపక్షమున నుంటచే వారివీరత్వము ప్రస్ఫుటితమగుటకు పూర్ణావకాశము చిక్కింది. పాండవపక్షమున ధర్మతేజోతిశయము మెండుకొన్నది; ప్రశాంత ధర్మాదర్శమన్ననిదే.

ఇంకొక విలక్షణమగు ఆదర్శము శ్రీకృష్ణుడు. అతని చరితమును విమర్శిస్తే తేలే సారాంశ మిది - పాపపక్షము నందలి బలము కౌశలమూ ఎంతఉన్నా దైవబలకౌశలములకు చాలదు. దైవబలమే సర్వోన్నతమగు బలము, తత్పక్షమే ఉత్కృష్టబలిష్ఠము, మానవపరాక్రమముకన్న దైవపారాక్రమమే దృఢము; అందుచే దైవబలమే సర్వదా విజయ మొందును, ధర్మము దైవబలము నాశ్రయించి యుండును. పార్థివబలమునాధారముచేసుకొన్న కురుపక్షము ధర్మబలమునూ దైవబలమునూ నమ్ముకొని యున్న పాండవపక్షమునకు సమకక్షియై నిలువ గలదా? కురుపక్షమున ధర్మవీరులు లేరు; దైవసహాయము లేదు; కనుకనే దానికి సర్వనాశము సంభవించెను.

సాహిత్యమున దేవత్వము -

మహాభారతమునకు నాయకు డెవఁడు? భీముడా? అర్జునుడా? వారిరువురూ యుధిష్ఠిరుని యధీనమందలివారు కావున నాయకులు కాజాలరు. యుధిష్ఠిరుడా? ఆతడు శ్రీకృష్ణు నధీనమున నుండె కావున అతడూ కాజాలడు. శ్రీకృష్ణునే నాయకునిగా నెంచవలయును. విశ్వమున కంతకు అధీశ్వరుడై బ్రహ్మాండమున కెల్ల నాయకుడై, సర్వశక్తుడు, సర్వవ్యాపియునగు భగవత్స్వరూపుడు శ్రీకృష్ణుడే భారతకథానాయకుడు. అతడు ధనస్సు ధరింపకున్నా అందరి యంత:కరణములందును అన్ని చోటులను అతనిశక్తియు కౌశలమును అఖండ రూపమున తేజరిల్లుచుండెను. అయుతసంఖ్యాకులు అస్త్రశస్త్రధారు లగు వీరులు నిరస్త్రుడగు నాతనికి సాటిరారు. అతని శక్తి కౌశలములకు ఇరువీడుల వీరశిఖామణులు "జితోస్మ:" అనవలసినవారే. మహాభారతమున అడుగడుగున ఆతని ప్రభావమున కచ్చెరువు వడుచుందుము. ఇట్టి చిత్ర మాంగ్లసాహిత్యమున లభించునా? కల్ల. మిల్టన్ రచించిన మహాకావ్యమున భగవంతుడు నిర్జీవప్రతిమవలె ఏమూలనో నిమిడి యుండును. శ్రీమద్రామాయణమున కూడా అట్లే, కాని భేదమిది - అందు వీరత్వములకెల్ల ఆధారభూతుడు శ్రీరాముడే. భీము బలము, విజయు కౌశలము, ధర్ంజు ధర్మగౌరవమును శ్రీరామునియందు కేంద్రీకృతము లగుటచే వా రందరికన్న ఆత డధికుడు. ఈ మూడింటికితోడు శ్రీకృష్ణుని ప్రభావ మాతనియందు దేదీప్యమానమై వెలుగుచున్నది. శ్రీరాముని యందు సమష్టిచెందిన శక్తులు వ్యష్టిరూపమున శ్రీకృష్ణపాండవుల చిత్రములందు గాంచనగును. శ్రీరాము డాకావ్యమున సర్వశక్తుడు, సర్వవ్యాపి; అతని బోలు వ్యక్తి యింకొకడందు లేడు. అనంతశక్తి, అసమబలము, అద్వితీయవీర్యము నొక్కచోట కూర్చి శ్రీరాముని పాత్రము చిత్రింపబడి యుండనోపు. త్రివిథవీరత్వము శ్రీరామునియందు ముప్పిరిగొన్నదిచూడండి - ధనుర్భంగ మొనర్చునపుడును రాక్షసుల దునుమాడునప్పుడును భీమబలము, పరశురామ గర్వభంగమున రావణకుంభకర్ణనిధనమందు విజయకౌశలమును, మొదటినుండి తుదవఱకు ధర్మవీరత్వమును ప్రకటిత మగును. రాఘవులందరు ధర్మ వీరులే; కాని శ్రీరాముడు వారిలో నాయకమణి. నిండోలగమునుండి నిర్జనాటవులకు బోవునప్పుడు, వనవాసులగు మునుల యార్తి తొలగించునపుడు, సుగ్రీవునితో సఖ్య మొనర్చునపుడు, విభీషణునకు శరణు నొసగునపుడును శ్రీరాముని ధర్మాసక్తి ఈరేడుజగముల కెగబ్రాకును. ఇం దాతని తుల్యుడు ఆర్యసాహిత్యము నెల్ల శోధించినా కానరాడు. మందోదరి తన పతిని శ్రీరామునితో సంధిచేసుకొమ్మని పలుమారు నిరోధించుటకు హేతు వేమి? శ్రీరాముడు లోకైక వీరుడు గాన అతని బలమునకూ చలమునకూ వెఱచియా? కాదు కాదు. ఆతని యం దొక విలక్షణమైన శక్తి అనగా దైవబల మున్నదని ఆమహాసాధ్వి గుర్తించింది. అతనియందట్టి తేజు గాంచి తత్ప్రభావమును సాక్షాత్కరించుకొన్నది కావున ఆమె "నాధా! శ్రీరాముడు జననమరణ రహితుడు; సర్వశక్తుడు; సర్వాంతర్యామి; ప్రకృతిప్రవర్తకుడు; సనాతనుడు; పరమపురుషుడును కానోవు. శ్రీవత్సాంకుడు; అక్షరుడు; పరిణామ శూన్యుడు; సత్యపరాక్రముడు, అజయుడు; సర్వలోకేశ్వరుడు; లక్ష్మీపతియు నగు విష్ణువు సమస్తజగత్కళ్యాణ సంధాయి కావున తాను మానవరూపముదాల్చి దేవతల నందరిని వానరుల గమ్మని, భూభారనిర్వహణార్థము మహాబలసంపన్నులు అమిత పరాక్రములు, లోకవిద్రావణులు, త్రిలోక భీకరప్రవృత్తులు నగుమిమ్ము సమూలము సమయింప జేయుటకు వచ్చియున్నాడని నాకు *[12] పొడగట్టు చున్నద"ని మొఱపెట్టెను.

శ్రీరాముని చరితము పార్థివదైవబలస్ఫూర్తియుతమగు అద్వితీయవీరత్వ సంపదచే విలసిల్లుచున్నది. ఆత డపరసృష్టి యని చెప్పియుంటిమికదా వియోగాంత నాటకము లం దిట్టి సృష్టి అసంగతము. అవి ధర్మమునకు యధాహన్ మగు పదవిని కల్పించనేరవు. ఇరుతెరగుల బలవీర్యము కల్పింపజాలిన మిల్టన్ కూడా ఇట్టి రచన చేయ మొదలుపెట్టి గర్భనిర్భేద మగు అసురసృష్టితో ముగించెను. లాటిన్ గ్రీకు సాహిత్యములందు పార్ధివబలము ఆసుర వీర్యమూ కలిపి చేసిన కల్పన లెన్నో యున్నవి; కాని వాల్మీకి రచనవంటి సుందర చిత్రణ మెందున్నూ కానరాదు. ఇట్టి ధర్మాదర్శములకూ వీరత్వసృష్టికి దివ్యశోభకూ లీలాక్షేత్రములు రామాయణ మహాభారతములే. ఆమహాసముద్రముల యందలి బిందువులగొని కవులు చిన్న చిన్న గ్రంథములకు, పెద్ద పెద్ద కావ్యములను రచించి చదలేటిని భూమిపై ప్రవహింప జేసిరి. ఆప్రవాహమున మున్గినవారు తదమృతరసా స్వాదన మొనర్చి సుఖు లయ్యెదరు. ఆ దివ్యసుధ యింకొక సాహిత్యమున లభింపదు, భారతవర్షమునకది అమూల్యనిధి; తదపూర్వ దివ్యసుందర సృష్టి ననుభవించిన వా రెల్ల తద్గాంభీర్యము పవిత్రతయు గాంచి మ్రాన్పడుదురు.

  1. *క. ఎక్కడనడచును సత్యం బెక్కడధర్మంబు పరగు నెక్కడగలుగుం జక్కటినిలుచుం గృష్ణుండక్కడ నతడున్న కతన నగుజయ మధిపా|| తిక్కన - ఉద్యో||పర్వ||
  2. * శ్రీమద్రామాయణము మహాభారతమును కేవల ధర్మోపదేశమునకై రచించినగ్రంథములేకావు. వాటియందు రాజనీతి, సాంఘికనీతి, ధర్మనీతి, లోకనీతియు గానవచ్చుచున్నవి. ఇవి కేవల మహాకావ్యములే యనరాదు, యుగయుగాంతరములనాటి సమాదరణీయసామగ్రి అందున్నది కావున వీటిని భారతవర్షేతిహాసము లననొప్పు పితరులయెడ సంతానమున కుండదగిన అణకువ, సోదరులయెడ జూపదగు ఆత్మత్యాగము, ప్రజల యెడ రాజుకుగల కర్తవ్యము, బ్రాతృవిరోధమున ఘటిల్లు దుష్పరిణామము, రాజ్యేషణ, అసాధారణాధ్యవసాయము, ఉచితమార్గానుసరణము మొదలగునవి దృష్టాంతసహితముగా కన్పరుపబడినవి. వీటిప్రాబావమున వేయిసంవత్సరములక్రిందట భారతవర్షమున ఎట్టిశాంతి నెలకొల్పబడెనో యిప్పటికి అట్టిశాంతియే పరిడవిల్లుతూంది. గ్రంథకర్తలధర్మవిషయికోపదేశము లచ్చటచ్చట పొడగట్టుచుండుట చేత ఇవి కేవల ధర్మోపదేశగ్రంథములని పాఠకు లూహింపరాదు.
  3. ♦ శాకుంతలమున ఆరోఅంకము.
  4. * ఉత్తరరామచరితమున మూడోఅంకము.
  5. * కేవలము ధర్మము దెసకేగాదు, వర్ణాశ్రమమర్యాదవంక కూడా ప్రసరింపగలదు. సంయములూ ధీరులూ సచ్చరితులూ అగు పురుషులనూ, దయ. వాత్సల్యముమున్నగు మధురభావావేశులగు స్త్రీలనూ అనుసరించుకోర్కె, తప్పక చదువరుల హృదయముల నెలకొనును.
  6. * ఈపదమున కర్థము దిగువ వ్యక్తీకరించబడును.
  7. * ఇవి షేక్స్‌పియరు నాటకములలో ముఖ్య పాత్రములు - ఈకథలన్నియు ఆంధ్రమున ననువదింపబడినవి కావున వానిచదువుట ఆవశ్యకము.
  8. * ఈమహాకావ్య మత్యద్భుతము, అమితరోచకము; కథ విచిత్రము; ధర్మవ్రతులగు ఆదము అవ్వయూ (Adam-Eve) అందు ప్రధానపాత్రములు; సృష్ట్యాదియందలి మానవవ్యక్తులందు వర్ణింపబడిన వందురు.
  9. * జాతౌ జాతౌ యదుత్కృష్టం తద్రత్నమితి కథ్యతే జాతికెల్లను మిన్నయై చనెడుదాని రత్నమందురు........
  10. * అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ వశిత్వములు అష్టవిభూతులు.
  11. * ఇది లోకమర్యాదననుసరించి చేసిన సృష్టిగాని లోకోత్తరము కాకాలదు - సర్వ సాధారణముగా అధర్మమునకు ధర్మమూ పాపమునకు పుణ్యమూ అసురులకు దివ్యులూఅణగియే యుందురు. పాపజీమూతము ధర్మకాంతి నాచ్ఛాదించును.
  12. * శ్రీమద్రామాయణము యుద్ధకాండము 113 అధ్యాయము చూడండి. అతని యం దన్ని రకముల వీరత్వమూ అన్నివిధముల బలమూ పుంజీ భూతమై యున్నది. ఇతర వీరులయందివి కొన్ని మాత్రమే ఉండును.