సాహిత్య మీమాంస/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సాహిత్య మీమాంస

ఉపోద్ఘాతము

సాహిత్య మన నేమి

సాహిత్యశబ్దార్థము జటిల మైనది. దీనిని పలువురు వేర్వే రర్థముల యందు వాడుచున్నారు గావున దీని యర్థ నిర్థారణ మావశ్యకము. అది తెలియకపోతే సాహిత్యమీమాంసయెట్లు చేయగలము?

"సాహిత్య గ్రంథములు" అను పదము వినినతోడనే సాహిత్యదర్పణము, కావ్యప్రకాశము, రసగంగాధరము మున్నగునవి స్ఫురించును. రఘువంశము, కుమారసంభవము కావ్యములని పరగుచున్నవి. ఇవి సాహిత్యగ్రంథములు కావా? అని ప్రశ్నించిన ఉత్తరము తక్షణ మాలోచనీయమగును. మొదట వివరించిన మూడు గ్రంథములయందూ ప్రతి పాద్యమైన విషయ మొక్కటే అయినా వాటిపేళ్ళలో సాహిత్యము, కావ్యము, రసము నను మూఁడుశబ్దములు వాడఁబడియున్నవి. రఘువంశాదులు కావ్యములుకదా వాటిని సాహిత్యగ్రంథము లనఁగూడదా? సాహిత్యమూ కావ్యమూ వేరయితే భేదమెట్టిది? దీనికి జవాబిది: - సాహిత్యశబ్దము రసము, గుణము, రీతి, అలంకారము మొదలగు విషయము లను నిర్ణయించు (లక్షణ) గ్రంథములపట్ల రూఢిగా ఉపయోగింప బడుటచేత రఘువంశాదికావ్యములకు సాహిత్యశబ్దమును వాడరు.

కావ్యశబ్దమునకున్నూ ఈదశయే పట్టినది. కావ్యమనగా ప్రాయికముగా పద్యగ్రంథ మని తలంతురు. కొన్ని కావ్యములయందు గద్యపద్యములు యథేష్టముగా వాడఁబడుచున్నా కేవల గద్యమయగ్రంథమును కావూ మనుట లేదు. ఇంకొక విశేషము. ఏవో కొన్ని పదములుచేర్చి పద్యము లల్లినట్టయినా దానియందు భావము శూన్యమైనా దానికి కావ్య మనుపేరు చెల్లుతుంది. ఇక గద్య మెంత రసవంతము, సుందరము ఎంతభావభరిత మైనా దానిని కావ్య మనరు. అది రచించినవారిని కవులనరు.

ఈ సంప్రదాయముచిరకాలీనమై వస్తూన్నది. వస్తుత: కావ్య మన్నను సాహిత్య మన్నను ఒకటే, భేదము నామ మాత్రమే. భాష యెట్లున్నను, శైలి యెట్లున్నను, గద్యము కానీ, పద్యముకానీ, గీతముకానీ రసవంత మైనచో దానిని సాహిత్యమనికాని కావ్య మనికాని అనవచ్చును.

ఇక సాహిత్య మెట్టిదో విచారింతము. "సహిత" శబ్దమునకు ష్యఞ్ (అ) ప్రత్యయము చేర్చితే "సాహిత్య" అను పదము నిష్పన్నమవుతుంది. ఈశబ్దమునకు పక్రరణానుసార మీక్రింది యర్థములు ఏర్పడినవి. 1 సాహిత్యం మేలనమ్.

2 పరస్పరసాపేక్షాణాం తుల్యరూపాణాం యుగపదేకక్రియాన్వయిత్వమ్. (శ్రాద్ధవివేక:)

3 తుల్యవ దేకక్రియాన్వయిత్వం, వృద్ధివిశేషవిషయిత్వం వా సాహిత్యమ్. (శబ్దశక్తిప్రకాశికా)

4. మనుష్యకృత శ్లోకమయగ్రంధవిశేష: సాహిత్యమ్ (శబ్దకల్పద్రుమమ్)

సాహిత్యశబ్దమున కిన్ని యర్థములున్నా ప్రాయికముగా నిర్దోషశబ్దార్థగుణ రసాలంకారరీతివిశిష్ట విషయమునే సాహిత్య మని వాడుతారు. దీనికే కావ్యమని యింకొక పేరు. మొదటి తరగతికి చెందినవి కావ్యప్రకాశాదులు, రెండవదానికి చెందినవి రఘువంశాదులు; అవి అనుశాసకములు, లక్షణగ్రంథములు, ఇవి అనుశిష్టములు లక్ష్యగ్రంథములు. మొదటివాటికి సాహిత్యశబ్దమున్నూ, రెండవవాటికి కావ్య శబ్దమున్నూ, ఉపయోగింపఁబడుతూన్నవి.

సాహిత్య శబ్దమునకు సర్వసాధారణముగా నీయర్థము స్ఫురించును. "సహితస్య భావ: సాహిత్యమ్" అనగా వెను వెంట నున్నవాని భావము "సాహిత్యము". అనగా సంయుక్తుఁడై, మిళితుఁడై, పరస్పరాపేక్షితుఁడై, సహగామియై యున్నవాని భావము "సాహిత్యము". "సహిత" శబ్దమున కొక యర్థము "సహగమనము" అని గ్రహించితిమి.

కాని యింకొక అర్థము కలదు. హి తేన సహవర్త తేతి సహిత : _ అనగా హితము కోరువాఁడు, హితము చేయువాఁడును "సహితుడు" వాని భావము "సాహిత్యము." ఇందు 'సహిత' అను శబ్దమునందలి ఉపసర్గము వేరు చేయ బడినది. (స+హిత) ఈయర్థమును గ్రహించితి మేని మనకు హితము చేయువాని భావము సాహిత్యమగును. హితము చేయువస్తువు (గ్రంథము) అనికూడా అన్వయించుకోవచ్చును. ఆలాగైతే కావ్యములు, ఇతిహాసములు శాస్త్రములు, కోశములు, మొదలగు నవన్నియు సాహిత్యమున చేరును. ఇతిహాసములం దీయర్థమే కనబడుచున్నది. అప్పుడు "వాఙ్మయ" మనునది "సాహిత్య" పదమునకు పర్యాయ మగును.

ఇక సాహిత్యమునుగూర్చి యించుక చర్చింతాము. మన ఆత్మ చిదానందస్వరూపము. ప్రీతి, స్నేహము, దయ, భక్తియు సాత్వికభావావస్థలు. ఈభావములను వ్యక్తీకరించుట యందు కావ్యములు మనకు సాయము చేయును. వాటిని పఠించి తద్గతభావములను హృద్యము చేసుకొని కోశత్రయాత్మకమగు సూక్ష్మశరీరమునందు సద్భావములను సంగ్రహింతుము. కావ్యములు లోకోత్తరానందము నిచ్చును. దర్శనాదులచే మనము జ్ఞానోపార్జనము చేయఁజాలినమా మనకానందము గలుగఁజేసి సౌందర్య సామ్రాజ్యముకు దారి చూపేవి కావ్యములే.

దర్శనములూ, శాస్త్రములూ సాహిత్యగ్రంథములలో జేరినా సాహిత్యశబ్దము వాటియందు వర్తింపదు. ఎందు కంటే, జ్ఞానబోధకన్న ఆనందోత్పాదనమే సాహిత్యగ్రంథములకు విశిష్టధర్మముగా గణింపబడుతూన్నది. సత్యమే భావరూపమున హృదయమున ప్రస్ఫుట మవును, సత్యము, శివము, సుందరమూ ఐనదానిని అంత:కరణమున మానవుఁ డనుభవించును. జ్ఞాన మానందానుభవోపాయములు జూపగా భావములే దాని ననుభవించును. మనకు లోకోత్తర జ్ఞానప్రాప్తికి సాధనములు భావములే కాని జ్ఞానము కానేరదు. "ఆనందమే జ్ఞానమందలి సారమ"ని వేదవాక్యము. ఆనందమయకోశము విజ్ఞానమయకోశములోపల ఉండును. అట్టి యానందమునకు మూలకారణము భావము. భావవ్యంజకములగుటచేతనే మనకావ్యముల కగ్రస్థానము దొరికింది. దర్శనములూ, శాస్త్రములూ, ఇతిహాసములూ, కావ్యములకువెనుక బడవలసినవే. శ్రేష్ఠభావములే మనసూక్ష్మ శరీరములను పోషింపఁగలవు. భావముల మూలాన జ్ఞాన ముత్పన్నమగును, వాటిమూలానే జ్ఞానము పరిణత మవుతుంది. భావప్రాప్తికి భావన ఆవశ్యకము; చూడండి.

                       "యాదృశీ భావనాయస్య సిద్ధి ర్భవతి తాదృశీ"

                       "ఎవరి కెరీతి భావన లెసగుచుండు
                        వారి కారీతి తగుసిద్ధి వఱలుచుండు"

శ్రేష్ఠ భావములే మనల వెన్నంటియుండి శ్రేయోదాయకము లవును. సుందరభావము లెందు సంగ్రహింపఁబడునో అట్టివే కావ్యములు, అవే మనకు సాహిత్య మగును. ఆభావములే మనకు హితకరములు. సుకవుల గ్రంథములు సద్భావ రత్నగ్రథితములు. తదుపాదేయములగు ఆధ్యాత్మికభావములను సంగ్రహించి మన సూక్ష్మశరీరములను పోషించు కొందుము; కావున అట్టి గ్రంథములే సాహిత్యమగును.

ఏయే భావములు సంగ్రహించి ఉత్తమపథానువర్తులమై ఉన్నతపదవిని సాధింపగలమో, వేటి నవలంబించి పరమపురుషార్థదాయకమగు త్రోవను ముందంజ వేయగలమో, వేటిని పూనుకొనియుండుటవల్ల మనుష్యధర్మములు మన కలవడునో, అట్టి భావసంచయము మనచిత్తమున కానందమూ, నైర్మల్యమూ, చేకూర్చి క్రమముగా ఉత్కృష్టలాభము నొందజేయును. దీనికే సాహిత్య మనిపేరు. అట్టి సాహిత్యమే మన కిప్పు డావశ్యకము.

ఒక జాతి సాహిత్యముతో నింకొకజాతి సాహిత్యమున కెట్టి సంబంధము నుండదు. ఒకవేళ ఉన్నా అది నామమాత్రమే. ప్రతిజాతిజ్ఞానమును, ప్రతిసంఘభావభాండారమును భిన్నముగా నుండును. జాతినిబట్టి సాహిత్యము సంఘటిత మవును. ఒకజాతి నీచోన్నతుల నెఱుంగవలె నంటే దాని సాహిత్యము చదివితే తెలియును. ఈగతులకూ సాహిత్యమునకూ దృఢమైన సంబంధ ముండును. సాహిత్యగ్రంథముల యందు జాతియొక్క సుఖదు:ఖములు, ఉచ్చతావనతులు మంచిచెడ్డలూ స్పష్టముగా ప్రతిబింబితము లవును. మన జాతీయభావములు నశింపకుండా ఉండవలెనంటే మన జాతీయ సాహిత్యరక్షణ చేయవలయును. జాతీయజీవనమునకు జాతీయ సాహిత్యరక్షణ మత్యంతావశ్యకము.

_________