Jump to content

సాహిత్య మీమాంస/మూడో ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడో ప్రకరణము

________

సాహిత్యమున దివ్యప్రేమ.

సీతాదేవి ప్రేమ -

సాహిత్యమున ప్రేమమాహాత్మ్యము గాంచవలె నన్న సీతాదేవిచరితమును పరికించవలయును. ఆమె రాజర్షి యగు జనకుని ప్రశాంతవంశమున పుట్టి, లాలనపాలన శిక్షల నొంది, ప్రేమమూర్తి యైన శ్రీరాముని చెట్టబట్టింది, కావున అద్వితీయప్రేమమూర్తి అయింది. శ్రీరాముడు సింహాసనాధీశుడై నప్పుడు తాను మహారాణి నౌదుననే ఔత్సుక్యముతోనున్న సీత, అతనికి వనవాస మబ్బినతోడనే వెంటబోవుటకు సిద్ధ పడెను; అందు కాత డొప్పుకొనలేదు, ఆమె మాత్రము ముందంజ వేసినది. ఘోరాటవుల గ్రుమ్మరుట అమిత భయావహమనీ కష్టదాయక మనీ రాముడెంత బోధించినా ఆమె నిరుత్సాహపడక, నిర్భయముగా పతి వెన్నంటెను, దీనికి కారణము ఆతని యందలి ప్రేమయే. పతిచెంతనున్నచో ఆమె కెట్టి కష్టములూ కష్టములుగా తోచలేదు, భీతి అసలే లేదు. ఋష్యాశ్రమముల వీక్షించు నపుడు శ్రీరామున కెట్టి యానంద ముదయించెనో సీతకు కూడా అట్టి యానందమే కలుగుతూండెను. ఆర్యుల మతమున సతి పతికి నీడ వంటిది. అతనికి సుఖావహమయినవన్నీ ఆమెకు సుఖావహములు - ఆశ్రమవాసుల కష్టముల తొలగించి శ్రీరాముడు వనస్థలుల యందు శాంతిని నెలకొల్ప, అతని నాశ్రయించిన ప్రేమలత సీత ప్రేమకుసుమముల వెదచల్లుతూ అచ్చటి మునిపత్నులను మునికన్యలనూ ప్రేమాలాప ప్రేమాచరణపాశములచేత బంధిస్తూండెను - దండకారణ్యమున గ్రుమ్మరువేళల శ్రీరాముడు శాంతి సముద్రమున నోలలాడుచుండ, సీత ప్రేమస్రోతమున నీదుచుండెను.

సీత ప్రేమదూత అననొప్పు; ఆమె ప్రేమ విశ్వవ్యాపి - శ్రీకృష్ణుని ప్రేమ రాధారూపము ధరించినట్లు శ్రీరాముని ప్రేమ సీతారూపము గైకొనెను. అశోకవనియందలి క్రూర రాక్షసులు సయిత మా ప్రేమకు వశులై చేతులు జోడించి ఆమెకు మ్రొక్కసాగిరి. ప్రేమప్రభావమున శత్రులు మిత్రులౌట చూచినారా? ఆమె ప్రేమయొక్క నిజస్వరూపము గోదావరితీరమందలి పంచవటియందు కనబడును. అచ్చటి పర్ణశాలను సీత నందనవనముగా నొనర్చుట వల్ల తజ్జీవకోటి ఆమెను అనుపమప్రేమతో గారవిస్తూండెను. హరి ణము లామె చేతుల యందలి పూరినిమేయుచుండ, మయూరము లామెవేయు తాళము ననుసరించి నృత్యము చేయు చుండెను; పావురములూ గువ్వలును ఆమెతో ప్రేమాలాపములు సల్పుచుండెను. క్రూరమృగములు సయితము హింసా ద్వేషముల నుజ్జగించి ఆమె నిర్మించిన ఉద్యానమున విచ్చల విడిగా విహరించుచుండెను. ఆప్రేమ కాననమున శాంతిసుమములు వెల్లివిరియుచుండెను. సీతప్రేమ అపారమని గోదావరి ధీరమందస్వనమున చాటుతూ అమృతరసధారల వెల్లివొడుచు చుండెను. జనస్థాన మంతా ఆమె యందలి ప్రేమచే పుష్పవృష్టి కురియగా ఆలతాంతరాసులతో వనదేవతలను ప్రియ దేవతయగు పతిని ఆమె పూజిస్తూండెను. ఇందుచే అయోధ్య యందు రాజసింహాసనమున నుండడము రామున కెక్కుడు సుఖదాయక మో, లేక పంచవటియందలి కుసుమోద్యానమున నుండుట ఎక్కుడు సుఖదాయకమో నిర్ణయించడము సులభము కాదు. ఆకుసుమ కాననమున సీత రామునకు స్వర్గసుఖము చేకూర్చిందని ఇదివరకే చెప్పి యుంటిమి కదా? పంచవటి సీత నిర్మించిన ప్రేమ రాజ్యము. ఆ దంపతుల నిస్తుల సుఖజీవనము చూచువారికి "ముందున్నది ముసుళ్ళ పండుగ" అని స్ఫురించక మానదు.

కవికులతిలకుడగు వాల్మీకి మహాముని అపూర్వమగు ఈప్రేమ చిత్రమును రచించెను. కణ్వాశ్రమమందలి శకుంతల పంచవటియందలి సీతయొక్క నకలువలె తోచును. మిల్టన్ రచించిన ఆదము అవ్వల ప్రేమచిత్రము ఈ రచనముం దేపాటి? పుట్టినదాది స్వర్గమందున్నవారికి భూలోకమందలి సుఖదు;ఖములూ, హింసాద్వేషములూ తెలియవు. వారు ఐహికజ్ఞాన రహితులు; అజ్ఞానాంధమసావిష్టులకు ప్రేమ రస తేజస్స్ఫురణము అసంభవము కాదా? కావున వారిప్రేమ ప్రేమకాదు, వారిసుఖము సుఖముకాదు. సీతారాముల ప్రేమకును వారి ప్రేమకును స్వర్గపాతాళముల కున్నంత అంతరముంది. సీత దు;ఖమయకాననమును ప్రేమసుఖమయ మగునట్లు చేయ, అవ్వ సుఖమయకాననమును వసించుటకు అహన్‌త గడించలేక అధోగతిని కూలత్రోయబడెను. పాపకలితమగు పృధ్వీఖండము సీత పుణ్యవంతమగా చేయ, పుణ్యవంతమగు స్వర్గమున అవ్వ పాపకంటకము నాటి హింసాద్వేషముల మొలిపించింది.

రాధాప్రేమ -

ఆర్యుల భక్తిశాస్త్రమున నింకోమాదిరి ప్రేమా దర్శము పొడచూపుచున్నది. మానవుల యందలి సాత్విక ప్రేమకది మూలప్రతిమ అనవచ్చును. ఆప్రేమ మూర్తీభవించి రాధారూపమును దాల్చింది, గోపికలామె సహచరులు; దంపతుల ప్రేమ చెందదగిన చరమసీమను మీరి రాధికాప్రేమ కృష్ణభక్తిగా మారెను, కావున దానిని ప్రేమభక్తి అననొప్పును, దంపతీప్రేమకు పరమావధి భగవదర్పణమే. భగవంతుడే జగమునకెల్ల నాధుడు. రాధయు గోపికలూ తప్ప వేరెవ్వరును "భగవంతుడు మాకు ప్రాణవల్లభు"డని చెప్పుకొన జాలరు. సత్యభామ అట్లే అనుకొనుచుండెను కాని రాధామనోవల్లభుడగు శ్రీకృష్ణు డామెకు గర్వభంగ మొనర్చెను. ఆమెప్రేమను దృప్తభక్తి అనదగును. ఆత్మ సమర్పణమున పరిణతి చెందిన రాధాప్రేమభక్తి కిది సాటి కాదు. రుక్మిణిభక్తి దాంపత్యప్రేమ మాధురీసంఘటిత మవుటచేత దానికి యోగ్యపరిణతి ప్రాప్తించింది. ప్రేమ భక్త్యుల్లాసమున శ్రీకృష్ణలీలాతరంగిణులయందు అభిమాన విలాసములతో రాధ ఓలలాడుతూ ఉండడముచేత ఆమెకు శ్రీకృష్ణుని ప్రేమయే లోకము, ఆమె సర్వస్వ మదే. శ్రీకృష్ణుడే ఆమెధనము, ఆతడే ఆమె సుఖము, అతడే ఆమెచింత; అతని ప్రేమయే ఆమె కునికిపట్టు, అతని తోడునీడగా నుండి ఆమె యితరమును మరచెను; ఆమెకు శ్రీకృష్ణునితోడి విరహ మెక్కడిది? అతని ధ్యానమున సదా మగ్నయై ఎప్పుడూ ఆతనినే విలోకిస్తూ ఉండును. శ్రీకృష్ణునెడ క్షణమైనా విముఖత చెందక, తద్రూపమయ బృందావనమున తత్కధామృత రసపానము చేస్తూ ఆమె కాలము పుచ్చుచుండెను. రాధా కృష్ణులు ఎల్లప్పుడూ కదంబమూలమున విరాజిల్లుతూంటే రాధ శ్రీకృష్ణునుండి వేరుపడు టెట్లు?

సీత ప్రేమయందలి ఐకాంతికము

సీతా విరహ మింకొక మాదిరి; సుఖాలవాలమగు బృందావనమున అది జనింపలేదు - అశోక వనియం దుండునెడ ఆకారాగారమును ఆమె శ్రీరామమయ మొనర్చెను. రామనామస్మరణయే ఆమె కప్పుడు సంజీవి - రాక్షసకాంతల తర్జనభర్జనముల కోడి ఆమె మనసు ఏకాంతమున శ్రీరాముని శరణు జొచ్చింది. భయముచేత భక్తి పెరిగి పతి ప్రేమను పరిపుష్ట మొనర్చెను. అహోరాత్రములు శ్రీరాముని నీలమేఘశ్యామలమూర్తిని ధ్యానించుటచేత ఆమె పతి పరాయణత పరమావధి చేరెను. సరమతో ఎల్లప్పుడూ శ్రీరాముని చరితమునేవల్లెవేయుచుండు ఆమెకు వేరొక చింత యెట్లుండును? లంకా విజయానంతరము ఆమె పాతివ్రత్యము అగ్నిచే పరీక్షింపబడినది.

శ్రీరాముని అంకమునుండి విగళితయై లంకావాసము చేయునెడ తిరిగీ పతిసమ్మేళనమున దానిని పొందగల్గుదు నను ఆశచే ఆమె ప్రాణములు బిగబట్టెను, కాని లక్ష్మణుడామెను గంగా తీర కాననముల విడిచినప్పుడు ఆమెకిట్టి ఆశయెక్కడిది? ఐన నామెశ్రీరామునియందలి భక్తిని వదలలేదు, ఆతనిమేలు కోరడము మానలేదు. సహకారము నాశ్రయించిన మాధవీలతను తెంచి పారవేయు మాడ్కి ఆతడామెను వనభూములకు పారదోలెను. వాల్మీకి యాశ్రమము అశోకవనము వంటిది కాకున్నా ఆమె పాలిటికి అంతకన్న భయావహ మాయెను: రావణుని వశమున ఆమె యుండునపుడు వైర నిర్యాతన మొనర్చడమునకు శ్రీరాముడు తనచెర విడిపించి తీరుననే ఆశయుండెను, కాని యిప్పుడట్టి ఆశలేదు, కావున ఆమెప్రేమ నైరాశ్యభరితము. ఇప్పుడు శ్రీరాముడు స్వయముగా ప్రజానురంజన కామెను బలియిచ్చెను. ఇక పునస్సమ్మేళన మసంభవము - ఈవియోగమున ఆమె శ్రీ రాము నుద్దీప్త ప్రేమకు ప్రబలాధారమయ్యెను. ఆప్రేమ వలన సీతకు లేశమైనా గర్వముకాని గుండెనిబ్బరముకానీ కల్గగలేదు, దానిమూలమున అందరికీ ఆమెయెడ సానుభూతీ అతులాదరమున్నూ ప్రబలినవి. ఆప్రేమయే సీతకన్నులనుండి బాష్పధారావృష్టిని ప్రభవిల్ల చేసెను. తనబిడ్డలను జూచి పతి రూపము స్మరించి దానినెల్లప్పుడు ఆరాధిస్తూ ఉండేది. సుతుల మోముల తిలకించి శ్రీరామచంద్రుని లోచనరాజీవముల స్మరించి కన్నీటి కాల్వలచే కాననభూమిని తడుపుతూ ఉండి, శ్రీరాముని ప్రేమమునే జీవాధారము చేసుకొని నిర్భరములగు ప్రాణములు నిల్పుకొన గలిగింది.

ఆశ్రమావాసమున పెరిగిన ఆమెగాఢప్రేమ పాతాళ ప్రవేశసమయమున ప్రకటితమాయెను. శ్రీరాముని నోట పున:పరీక్షాప్రసంగము వెలువడగానే సీత గుండె పటీలున బద్దలయింది. పితృకల్పుడగు వాల్మీకి, ఇతర గురుజనము, పుత్రులు, ఎందరో సభాసదులు - అందరిముందర మర్మభేదకమగు ఆవార్త విని ఆమె సహింపగలదా? భూమి దారి యిచ్చినవెంటనే శ్రీరాముని ముఖమునందే దృష్టినిల్పి ప్రేమ ప్రతిమ యగు సీతాసతీమణి మాతురంకమును జేరి మరి కనబడలేదు. సతీప్రేమ పవిత్రప్రతిమ అంతటితో నస్తమించినది!

సతీత్వ గౌరవము

పతియెడ సతికుండ దగిననుప్రేమ అలౌకిక మనుటకు సీతయే దృష్టాంతము. పతిభక్తికిని సతీత్వమునకును చూడాంత నిదర్శనమగు ప్రేమస్ఫీత సీత అపూర్వకవిసృష్టి అనకతీరదు - ఇట్టి సతీత్వము పాతివ్రత్యమును ఆర్యసాహిత్య మెక్కువగా కొనియాడబట్టి యీరెండు ధర్మములూ ఆర్య నారీజనమునకు మూలబలమని యెంచనగును. 'సతి' అను మాట వినగానే ఒడలు గరుపారును - పతినే మననము చేయుచూ ఆతనినే సేవించుచూ ధ్యానించుచూ తదితరము నెరుగనట్టి నారీమణి, 'సతి', యనబడును. సతీదేవి పతినింద చెవిని బడినతోడనే అగ్నిలో నురికింది - సావిత్రి పతిశరీరము నంటి యుండుటచేతనే కదా యము డామే నంటవెరచెను! సుమతి పతిరోగదళిత కళేబరమును తప్తకాంచన నిభముగా నొనర్చగల్గెను. సావిత్రి యముని చేతబడిన పతిప్రాణముల నార్జింపగల్గెను - వీరిట్లు చేయగల్గుటకు సతీత్వ పాతివ్రత్యములే ముఖ్యసాధనములు - సతీత్వమును గౌరవించినన్నాళ్ళు ఆర్యలలనామణులు అధికశక్తియుతలై విరాజిల్లుచుందురు. సతి అనుదానికి పతివ్రత అనునది పర్యాయపదము - సతి మనకు దేవీతుల్య, ఆమెకు పతి దేవతుల్యుడు, అట్టి భావముతోనే ఆమె అతని నర్చించుచుండును. ఇట్టి సతీగౌరవమును స్థాపించినవి ఆర్యశాస్త్రములు - ఆర్యావర్తము పుణ్యభూమీ, ఆర్యధామములు పవిత్రములూ అగుటకు సతులే ముఖ్యాధార ములు - వారిని గౌరవించు నాచారము మన కుగ్గుపాలతో ఉపదేశింపబడును. గాంధారి తనభర్త అంధుడని యెరిగిన వెంటనే కళ్ళకు గుడ్డకట్టుకొని అంధీభూత అయ్యెను. సావిత్రి తండ్రియిచ్చిన భూషణాంబరాది రాజచిహ్నములవీడి నారచీరకట్టి గురువుల సేవించుతూ పత్యవసానదినమున యముని మెప్పించి పతిని పునర్జీవితు గావించుకొంది.

ఇట్టి సతీగౌరవమున గ్రాలుచున్న భారతవర్షమున సీత సర్వజనసమాదరణమునొంది ఎల్లకడల పూజింపబడుతూ ఉన్నది - ఒక్కసీత అననేల? పతివ్రతలందరూ ఆమెవలె పరమపూజనీయ లయినారు - సతి, పార్వతి, అరుంధతి, సావిత్రి, గాంధారి, చంద్రమతి, దమయంతి, మొదలుగా గల నారీమణుల పేర్లు విన్నతోడనే ప్రతిభారతీయుని శిరము గర్వముచే ఉన్నతమై, చిత్తమునకు శుద్ధియు, శీలమునకు పవిత్రతయు అలవడును.

ఏ పాతివ్రత్యగౌరవము ఆర్యసాహిత్యమున పురాణములయందు, కావ్యములందు, నాటకములందు, నవలలందును అవిరళముగా ప్రస్తుతింప బడెనో, ఏ పాతివ్రత్యబలము నాధారము చేసుకొని భారతరమణులు ధైర్యము, క్షాంతి, అధ్యవసాయము, కార్యచాతుర్యము, వైదగ్ధ్యము, సహిష్ణుత మొదలగు సుగుణముల నభ్యసించి నారీరత్నములని బరగు చున్నారో, ఏసతీధర్మాచరణమునవారు పవిత్రశీలలు, పూత చరితలు నగుచున్నారో, అట్టిపాతివ్రత్యధర్మగౌరవమును ఆర్యకవు లనేకోపాయముల తమ సాహిత్యమున జొన్పినారు చూడండి : _

1. పురాణశ్రవణము - పాటలు

మనదేశమున పురాణశ్రవణము లోకులకిప్పుడు రుచింపకున్నా అచ్చటచ్చట ఇది చెలగుచుండ బట్టి మధురవాక్యములతో కూర్పబడిన దృష్టాంతసహిత వ్యాఖ్యానముల యందును, వీధులలోనూ ఇండ్లలోనూ పాడుచున్న పాటలు, వింటూన్న హరికథలు, గీతములూ, కనుచున్న వీధినాటకములు బొమ్మలాటలు మొదలగు వాటియందున్నూ కీర్తింపబడు సతీధర్మము, పాతివ్రత్యప్రభావమును స్త్రీల మానసము లందు గాఢముగా నాటి వారి జీవితముల శుభోదర్కము లగునట్లు ఒనర్చుచున్నవి. శ్రీమద్రామాయణము మహాభారతమును నాటకములుగాను పాటలుగాను రచింప బడుటచేత కొంతవర కీ ఫలమే సిద్ధిస్తూన్నది. వీటిని విన్నతరువాత పతితపావనమగు నిర్మలధర్మప్రవాహము మానసములందు పారుచునే ఉంటుంది. గాయకులు, నటులు "కాలక్షేపముల" చేయువారును వివిధశబ్దార్థాలంకారముల కూర్చి వారివారి వాక్చాతురి, కళాకౌశలమున్నూ వెలయునట్లు ఈరెండు ధర్మములను అధికముగా ప్రకటిస్తూన్నారు.

2. ఇళ్ళలో చెప్పుకునే కథలు.

మనలో వృద్ధులు (స్త్రీపురుషులు) అనుశృతిగా కథలు చెప్పుతూ పాటలుపాడుతూంటే చదువుకొన్నవాళ్లు చిన్న చిన్న పుస్తకముల ద్వారా ఈధర్మముల నన్నిదిక్కుల వ్యాపింపజేస్తున్నారు.

3. వ్రతములు - నోములు.

పుణ్యకథల రచించుటతోనూ వినుటతోనూ తనివితీరక పిల్లలచే ఆధర్మముల నాచరింప జేయుటకు ఋషు లనేకవ్రతములను నిర్మించిరి. సత్యభామా సావిత్రియూ ఎట్టివ్రతముల నాచరించి పతిపూజ ప్రతిష్ఠించినారో వాటినే మనవారిప్పటికీ చెప్పుకోవడమే కాక తామాచరించి కోడళ్ళచేతను కూతుళ్ళ చేతను ఆనోములు పట్టిస్తూన్నారు. ప్రతివ్రతము నోము తుదనొక కథ యుండును. అందు కొనియాడబడునవి పైరెండు ధర్మము లే.

4. దృష్టాంతములు

బోధనచేయడమే కాక తామాతీరున ఆచరిస్తూన్న పెద్దలు దృష్టాంతరూపులై బాలకులచిత్తములందు ధర్మ ప్రవృత్తి పాదుకొల్పుచున్నారు. ఈధర్మములను వట్టి బోధన వల్ల సాధించుట దుష్కరము, ఇందు దృష్టాంతములే ముఖ్య సాధనములు.

ఇన్ని రీతుల ఉపాయములచేత స్త్రీలకు మనపూర్వులు విద్యనేర్పుతూండిరి. ఇదే యోగ్యమైన బోధన. ఈవిద్యా ప్రభావముననే మనస్త్రీల కనేక సుగుణములు అలవడుచుండేవి. విదేశ శిక్షాప్రచారములేని చోట్ల ఈశిక్షా ఫక్కియందలి ఫలము నేటికిన్నీ తెల్లమగుచున్నది. సతీత్వపాతివ్రత్యగౌర వోజ్వలమగు పౌరాణిక సాహిత్యమును పఠించుటవల్లనే అట్టి సుగుణము లలవడును, కాని విదేశీయగ్రంథముల చదువుటచే ఎన్నడును అబ్బవు. ఇట్టివిద్య కథలు వినుట, దృష్టాంతములు కనుట, ఆచరణముల చేయుట వలన లభించునంత సుళువుగా వట్టి గ్రంథపఠనము వలన లభింపదు. ఈనాల్గుసాధనముల చేతను తరుణతరళములగు మన కులకామినుల హృదయములందు పాతివ్రత్య సంస్కారము వేరుదన్ని నిలుచును. తన్మూలమున వారు ధర్మగౌరవమున మదిన్నిల్పి తమ జీవికను సార్థకమొనర్చుకొందురు.

పై నుదహరించిన ఆర్యశిక్షాప్రణాళి కాలవశమున తారుమారయి, ప్రస్తుతమున ఆ సుందరపథమునకు మారుగా విదేశశిక్షాపరిపాటి ఉపక్రమింపబడుతూన్నది. ఆసాహిత్యమున మన సతీత్వపతివ్రతాధర్మములు లేక పోవడమేకాక తద్వ్యతిరేక రీతి కాన్పిస్తూంది. పతిప్రేమరసాయనము గ్రోలుతూ తదేకనిష్ఠతో జన్మమంతా గడుపుట భారతీయసతికి విధి. పాశ్చాత్యసంఘమునం దిట్టి ఆదర్శము లేదు. వారి ఆదర్శ విధానము కొంచెము వివరింతాము -

1. వారిలో స్త్రీలు తమ కిష్టమైన వారిని పెండ్లి యాడుదురు, వారి యిచ్ఛప్రబలము, తదనుసారము కార్యముల నిర్వర్తింతురు; వారికి స్వాతంత్ర్యమూ స్వేచ్ఛయూ ఉన్నవి.

2. వారిలో స్త్రీలు పలుమారు పెండ్లి యాడ వచ్చును. పతిగతించిన పిదపనే కాక పతిజీవించియున్నా ఆతని త్యజించి (Divorce) వేరొకని పెండ్లియాడు ఆచారము కూడా వారిలో కద్దు.

ఆర్యస్త్రీలు తమ పెద్దలు నిర్ణయించిన వానిని పతిగా వరించి, యావజ్జీవము ఆతనినే దైవముగా నారాధిస్తూ, తదేకనిష్ఠతో అతని యిచ్ఛానుసారము వర్తింపవలెను. ఈ యాచారము పాశ్చాత్యస్త్రీలకు నిర్బంధముకాదు. పతిజీవిత కాలములో వేరొకని పెండ్లియాడుట కలలోనైన ఆర్యస్త్రీ తలపగూడదు.

ఇందువలన ఆర్యసతీత్వాదర్శమునకూ పాశ్చాత్యాదర్శమునకూ సామ్యమేలేదు; సరేకదా మీదు మిక్కిలి వైషమ్యము కూడా కద్దు. రెండూ పరస్పర విరుద్ధ ధర్మములు.

సాహిత్యమున పాతివ్రత్యము -

మన పూర్వులు మనుష్యోచిత వ్యవహారమును సంస్థాపిత మొనర్చి, దానికన్న ఇంచుక భిన్నమగు సతీత్వాదర్శమును నిర్మించి, సాహిత్యమున నెల్ల కడల ఉపపాదించిరి. యూరోపీయ సతీత్వమున లోకవ్యవహారోచితపథము కన్న విశేష మేమియు లేకుండుటచే తదాదర్శవర్ణనము ఆసాహిత్యమున కానరాదు. ఎచ్చట చూచినా ఆర్యాదర్శము వంటి ఉత్కృష్టాదర్శవర్ణన మాసాహిత్యమున లేకుండుటచే దానిని పదేపదే చదివే మన స్త్రీలకు మన సతీత్వాదర్శము అసంభావ్యమని తోచి దానియందు గౌరవాదరములు కలుగనేరవు. మన స్త్రీవిద్యావిధానము పాశ్చాత్యవిధానముకన్న భిన్నమని చెప్పినాముకదా. మన స్త్రీలుకొంచె మక్షరజ్ఞానము కలగగానే పురాణములు మొదలగు మన గ్రంధముల పఠించి మన ఆదర్శములను అనుమోదించి వాటి ననుకరింప మొదలు పెట్టుదురు. విద్యాభ్యాసమునకును, శ్రవణము, ఆచరణము, (వ్యవహారము) దృష్టాంతములను పైనిచెప్పిన నాల్గుసాధనములకును సామంజస్యముండుటచే, చదువుకొన్న స్త్రీలు సతీత్వ ధర్మము, పాతివ్రత్యధర్మమును గౌరవిస్తారు. ఇట్టి స్త్రీ విద్య ప్రమాదజనకము కాదు. "అధీతి బోధాచరణప్రచారణము" లకు చక్కని సామంజస్య మున్నందున ఇదేఉత్తమవిద్య.

యూరోపీయాచారములు మన ఆదర్శముల కనురూపముగానుండవు. పాశ్చాత్యసాహిత్య మభ్యసించి విదేశాచారముల నుపక్రమించిన మనస్త్రీలకు ఆర్యపతివ్రతాధర్మముల యెడ గౌరవము సమసిపోయి వాటికి వారు దూరులగుటే కాక పాశ్చాత్య సతీధర్మములందా సక్తి పుట్టును. వీటికీ మన ఆచారవ్యవహారములకూ సరిపడదు. ఆసంఘమున నవి చెల్లుబడి యౌనుగాని మన వ్యవస్థలకు పనికిరావు. మన సాహిత్యమున నుపపాదింపబడిన ధర్మముల నాశ్రయించుట చేతనేకదా మన స్త్రీలకు కొన్ని సుగుణములు అలవడునని చెప్పియుంటిమి. ఆధర్మములు పాశ్చాత్యసాహిత్యమున అక్కడక్కడ ఇంచుకించుకగా స్ఫురించును, కాని ఉజ్వలరూపమున కానబడవు. కావున దాని పఠించువారి కా సుగుణము లబ్బవు. అందుచేత అసలే గిట్టవు. ఇట్టి దృష్టాంతము లిప్పుడిప్పుడు కాన్పించుచున్నవి. ఇవి ప్రబలకపూర్వమే పాశ్చా త్యవిదాఫణితి మన వారికి ప్రమాదజనకమని యెరుంగుట మేలు. బోధనకును ఆచరణమునకును సానుకూలత లేనందున విద్యాభ్యాసము విఫలమగును; ఎద్దు ఎండకూ పోతునీడకూ లాగితే బండి నడుచుటెట్లు?

ప్రాచీనభారతవర్షమున స్వేచ్ఛాచరణము

యూరోపీయ సంఘములందు ప్రస్తుతమున బరగుచున్న సతీలక్షణములు సభ్యతాప్రాథమికావస్థయందు అన్ని సంఘములందూ ఉండెను. ప్రాచీనభరతఖండమున అచ్చటచ్చట ఇట్టి ఆచారవ్యవహారములు ప్రబలియుండెనని తలంచుటకు నిదర్శనములు కానవస్తూన్నవి - దిగ్విజయ సందర్భమున సహదేవుడు ప్రాచీన మాహిష్మతీ నగరమున కేగినప్పుడు అచటి స్త్రీలు వుంశ్చలులై స్వేచ్ఛావిహారము సల్పుచుండి రట.

"పూర్వకాలమున మనదేశమున స్త్రీలకు అంత:పుర నిర్బంధము (ఘోషా) లేక వారు ఇచ్ఛానుసారము వర్తించు చుండిరి. ఒకరి యధీనమున కాలక్షేపము సేయు నక్కర వారికి లేకుండెను - విషయవ్యాపారములందు తిర్యగ్జంతువుల లీల వారు విహరించుచుండిరి. ఉత్తరకురుభూములందలి వారిప్పటికిని ఆ రీతినే వర్తించుచున్నా" రని పాండురాజు కుంతితో చెప్పెను.

పిమ్మట శ్వేతకేతు వృత్తాంతమును స్త్రీలకు తిర్యగ్జం తువులవలె స్వాతంత్ర్యమూ, స్వేచ్ఛాచరణమూ తత్పూర్వ ముండెననియు, అట్టి యాచారముల నుజ్జగించి భారతీయులు ఉన్నతప్రపత్తి ననుసరించి దివ్యత్వమును సాధించిరనియు అతడే చెప్పెను.

మనము అట్టి దేవత్వమును కోలువోయి నీమ్న వ్యాపారముల ననుమోదించుట ధర్మమా? యుక్తకర్మమా?

ఆర్య సతి పవిత్రత

యూరోపీయ సాహిత్యమున మానవప్రకృతియందలి నైసర్గిక స్వేచ్ఛాచరణమునకు ప్రాబల్యము కానవచ్చుచున్నది. ఆర్యసాహిత్యమున ప్రేమ ఉదయింది మానవప్రకృతిని పవిత్రిత మొనర్చి దాని కున్నతి చేకూర్చింది. మహాశ్వేత*[1]ప్రేమ ఇట్లే పవిత్రితమై దైవారాధానముగ పరిణమించెను. ఆమె మూర్తీభవించిన దైవారాధన, ప్రకృతిరూపముగొన్న పవిత్ర ప్రేమ అననొప్పు. అచ్ఛోదసరస్తీరకాననాభ్యంతరమున దైవారాధన చేయుచుండు ఆసతీమణీ దేవీమూర్తియో మానవీమూర్తియో నిర్ణయించుట కష్టము. దేవపూజా చ్ఛలమున మానసమునకు ఏకాగ్రత కల్పించి ఆమె యెవ్వని పూజించుచున్నది? అప్పుడామె పతిని ప్రేమించుచున్న దందామా? లేక పూజించుచున్న దందామా? బాణభట్ట నిర్మితయగు మహాశ్వేతవలెనే కాళిదాస నిర్మితయగు పార్వతియు పూతచరితయే. అప్సరస్సంభవయైన శకుంతలయు తుద కిట్టి పవిత్రమూర్తిగానే పరిణమించింది. ఇట్టి నారీమణుల సంసర్గమున మానవప్రకృతి పవిత్రితమైన దన వచ్చును.

ఆర్యసతి యాత్మోత్సర్గము

పత్యనురాగము ప్రబలినకొద్దీ సతి తన అస్తిత్వమే మరచిపోవును. ప్రేమావేశమున ఆత్మవిస్మృతినొంది సర్వవిషయముల తన పతితో సాయుజ్య మొందును. ఆతని సుఖమే తన సుఖమనియు, ఆతని దు:ఖమే తన దు:ఖమనియు, భావించడమే దాంపత్యప్రేమకు పరమావధి అని ఇందువల్ల విదితమగును. ఆర్యకుటుంబములందు పతికీ సతికిన్నీ స్వార్థ మొకటి, సుఖమొక్కటి, స్వర్గమొక్కటి; ఇట్టి ఐక్యత అలవడనిచో దాంపత్యమే సిద్ధింపదు.

పాశ్చాత్యదంపతుల స్వార్థములు వేరు, రుచులు వేరు, పారలౌకికేష్టసాధనలు వేరు; తత్పరిస్థితులు పతిపత్నీ విచ్ఛేదకారకములౌట వారియందు భారతీయ దాంపత్య మందలి ఏకాగ్రత, ఏకనిష్ఠ, ఆత్మోత్సర్గమూ సిద్ధించు నవకాశ మంతగా లేదు. భారతరమణు లేకాగ్రమనస్కలై పతుల ననుగమించుచు సహధర్మిణీసౌభాగ్య మనుభవింతురు; పాశ్చాత్యనారీమణుల కిట్టి సౌకర్యము లభింపదు, ఇష్టవస్తు విభేదము వారిని పతులనుండి వేరుచేయును.

ఆర్యసతీమణులయందలి ప్రగాఢప్రేమ వారియం దుండజాలదు, అందుచే "ధర్మపత్ను" లను ఆర్యపదము వారియందు చెల్లదు. ధర్మపత్నుల కుచితమగు సతీచరిత్రము పాశ్చాత్యసాహిత్యమున లభింపదనుట నిర్వివాదాంశము. సహధర్మిణీచిత్రమును సావకాశముగా నెఱుంగవలెనన్న ఆర్యసాహిత్యమునే పఠించవలయును. ఆర్యసతి కోరేది యీజన్మమునమాత్రమే పత్యనుసరణము జేసి అతనితో సాయుజ్య మొందవలెనని కాదు; ఇహమున పరమునా పత్యనుసరణమే పరమధర్మమని యెంచి సచ్ఛీలబలమునా ధర్మాచరణ ప్రభావముననూ పతితోగూడ దేవత్వము అమరత్వము నొందడమే ఆమెకు పరమావధి. అందుచేతనే ఆమె "అర్ధాంగి" యగుచున్నది.

పతిప్రేమనుండి విశ్వపతి ప్రేమ

ఆత్మోత్సర్గముతో సతి అభ్యసించు పతిభక్తియే భగవద్భక్తికి మొదటి మెట్టు. ఈరీతిని భక్తుడు భగవంతుని యందు లీనముగాకున్న భగవద్భక్తి అతని కలవడనట్టే. పతిభక్తిచే సతి పతియందు లీనమగునట్లు భక్తుడు భగవంతుని యందు లీనుడై తచ్చరణములకు తన స్వాస్థ్యమును సమర్పింపవలెను. దీని నంతయు పరికించి చూస్తే సతియొక్క పతిభక్తి భక్తుని దైవభక్తికి నకలని తోచును. పతినే భగవంతునిగా భావించి వానిలో లీనమగుటకు నెంచుటచే సతి దేవ్యవతారమగుచున్నది. సీతయు రాధయు ఈరెండుతెరగుల ప్రేమాదర్శములై పరస్పరప్రతిబింబము లవుచున్నారు. సీత పతిప్రేమ అత్యుజ్వలము కావున అందు దేవభక్తి దాగియుంది; రాధ భగవత్ప్రేమ ఉజ్వలమగుటచే పార్థివమగు పతిప్రేమ అందు లీనమైంది; పతిప్రేమయే భగవత్ప్రేమగా పరిణమించింది, కావుననే రాధయొక్కభక్తి "ప్రేమభక్తి" అనిపించుకొంటుంది. ఇట్టి ప్రేమపరిణితియే ఆర్యసాహిత్యమున గాంచనగును. ఒక్క సాహిత్యముననే కాదు, ఆర్యసంఘమున కూడా ఇట్టి ప్రక్రియ తోచుచుండును. వైధవ్య మొందిన ఆర్యసతికి జగత్పతియే పతి, కావున ఆమె పతిభక్తియూ దాంపత్యప్రేమయూ సహజముగా భగవద్భక్తిలో పరిణమించవలెను. అట్టివా రార్యసంఘమందలి రీతినీతుల ననుసరించి సువాసినులభంగి పతిభక్తి నాచరిస్తూ తన్మూలమున దైవభక్తి నభ్యసింతురు. భగవంతునే పతిగా మదిలో నిల్పి, ఆతనినే ప్రణయభాజనునిగా నెంచి సేవిస్తూ, సతీధర్మము నాచరింతురు. అనురాగ మంతా భగవంతునియందు నిక్షిప్తము చేసి వా రాచరించే భక్తి పతిభక్తియు జగత్పతిభక్తియు నగును. అట్టివారు పతినారాధించవలెనంటే భగవంతునారాధింపవలయును. పతి జీవించియున్నప్పుడే రాధ అతడు భగవంతుడని తలంచిన తీరున, వీరు పతి గతించినవెన్క భగవంతుడే పతియని తలంచవలయును. రాధాపతి జననమరణ రహితుడు జగత్పతియు కావున పతి లేనివారు అతనినే పతిగా భావింపవలయును.

  1. * బాణకవి రచితమైన కాదంబరి అను గద్యకావ్యమున నొక నాయకి.