Jump to content

సాహిత్య మీమాంస/నాల్గో ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాల్గో ప్రకరణము

________

సాహిత్యమున పాశవప్రేమ

సతీప్రేమ - కామానురాగము, ప్రేమ

ఆర్యకవులు నిర్మించిన ఆదర్శములలో సతీచరితమున నెట్టి ప్రేమాదర్శమును కల్పించినారో పూర్వప్రకరణమున వివరించినాము. ఎందు చూచినా సతిప్రేమ గోపికాప్రేమను పోలియుండును. నిస్స్వార్థభావము, ఏకనిష్ఠ, స్వామిగౌరవమున్నూ రెండింటియందు నొకతీరుననే ఉండునని స్పష్టమైంది. ఇట్టి భావోదయము కల్గుటచేతనే పతిభక్తి దైవభక్తిగా పరిణమించి మానవునకు దేవత్వము సిద్ధింప జేయును.

సతీప్రేమను పర్యాలోచిస్తే ప్రేమతత్త్వము చక్కగా బోధపడుతుంది : _

కామానురాగమునకూ (lust) ప్రేమకున్నూ (Love) కున్నూ కావలసినంత భేదమున్నది. పతిని సుఖపెట్టి తాను సుఖింప సమకట్టు; ఇల్లాలు సతి. వాత్సల్యప్రేమకూ సతీ ప్రేమకూ లక్షణమొకటే. సంతానమును సుఖపెట్టి పితరులు తాము సుఖింప జూచునట్లు పతియెడ సతి అనురక్త అవుతుంది. నిసర్గప్రేమస్వసుఖాభిలాషి కానేకాదు. ప్రణయభాజనమగు ఇతరవ్యక్తి సుఖమే దానికి పరమాపేక్షణీయము. ప్రేమ అట్టి సుఖమునే కాంక్షించుచుండును.

కామానురాగమం దిట్టి ధర్మదృష్టి కానరాదు. అ దెప్పుడూ ఇతరుల ద్వారా తాను సుఖింప సమకట్టును. ఇంద్రియ లాలస పరితృప్తి నొందగానే కామము చరితార్థమగును. ప్రేమ స్వసుఖనిఒరభిలాషి, పరార్థకాంక్షి; కామము కేవల స్వార్థకాంక్షి, పరసుఖపరాఙ్ముఖి.

ప్రేమ పరార్థపర మవుటచేతనే సతి పతియందు గుణదోషములు పరికింపదు; గుణములగాంచి ప్రేమించువారు దోషములగాంచి ద్వేషింతురు. దోషము లందరియందున్నూ తోచును, కావున రూపగుణనివిష్టమగు అనురాగము స్థిరము కానే కాదు. నిసర్గప్రేమ గుణదోషపక్షపాతి కాదు. తల్లి దండ్రులు తమ సంతానమునందలి గుణదోషములు తడవక వారి నాదరించి ప్రేమించునట్లు సతియు తనపతి యెట్టి వాడైనా వానినే ప్రేమించును. ఇట్టి గుణదోషపక్షపాత రాహిత్యమే సతీప్రేమ కాదర్శము. కనుకనే "పతి యెంత దోషకలితుడైనా సతికి పరమ పూజ్యు" డని మనువు శాసించెను. మనువేకాదు మహాభారతాది ఆర్యగ్రంథము లెల్ల ఇట్లే ఉపదేశిస్తూన్నవి.

కామానురాగము ప్రేమవలె ఉన్నతదశ నొంద జాలదు. అది గుణరూపముల ననుసరించి యుండును, గుణములు దోషమిశ్రితములు కాకయుండవు, రూపము కాలక్రమమున కడచనును,

ఇదిగాక రూపగుణముల తారతమ్య మస్థిరము, నేడు నచ్చిన రూపమూ గుణమూ రేపు నచ్చవు. కావున తత్పాత్రములు కాలవశమున అపాత్రములగును.

మరియు రూపగుణసంపద నొకరి నొకరు మింతురు, కావున కామమునకు కడలేదు.

ఈ మూడు కారణములచేతనూ కామానురాగమెల్లప్పడూ ఏకపాత్రనిక్షిప్తము కాజాలదు. అతిచంచల మగుటచే దానికి స్థాయీభావ మలవడదు.

ప్రేమకు సహజధర్మము స్థాయీభావము; అది ఏక నిష్ఠము, నిశ్చలము; గుణములు జూచి కూడరాదు, దోషములు గాంచి తొలగిపోదు. అందువల్లనే ఆర్యసతీప్రేమ అత్యంతానురాగపూరితము, స్థిరము, నిశ్చలము, ఏకనిష్ఠము నగును; కామాంధుల అనురాగము కాలానుగుణముగా మారుచుండును.

నిస్స్వార్థమగుటచే నిసర్గప్రేమ ఆకాంక్షారహితమగును. దోషగుణముల నపేక్షింపక, ఇతరుల మూలమున తాము సుఖింపనెంచనట్టి వారికి ఆకాంక్ష యెక్కడిది?

సతీప్రేమ వ్యవసాయము కాదు కావున మారుకోరదు. "నీవు నన్ను ప్రేమించిన, నేను నిన్ను ప్రేమింతు" ననేది కాదు, ఇచ్చిపుచ్చుకోవడ మందుండదు, వినిమయవ్యాపారము కానరాదు. లతలను, వృక్షములను, పశుపక్ష్యాదికమును సోదరభావమున ప్రేమించిన శకుంతల బదులుకోరెనా? పతిప్రేమానుసారము ప్రశంసనీయము, పతి తనయెడ ప్రేమ జూపెనా పత్ని ధన్యయే; కాని పతిప్రేమ నాసించియే పత్ని పతిని ప్రేమింపనెంచితే అది నిసర్గప్రేమ కానేరదు. పరస్పర ప్రేమ సమకూడినదా మణికాంచన సంయోగమయినట్లు, కింశుకమున సౌరభము వెలసినట్లు, చంపకము శూన్యకంటకమయినట్లు, చందనతరువు పుష్పించినట్లు, చెరకు పండినట్లున్నూ రాణించును. ఇట్లు జరుగకున్నా సతి పతిని ప్రేమింపకతీరదు : _

సతీలక్షణము నొకకవి యిట్లు వర్ణంచెను : _

           *[1] నీవు నన్ను ప్రేమింతు వటంచును, నేను నిన్ను ప్రేమింతునొకో?
             నిన్ను వీడి యెన్నను నే నన్యుని, నియమమిద్ది సతి నే నౌటన్

వాత్సల్యప్రేమలాగ దంపతీప్రేమకూడా ని:స్వార్థము కావలెను. పసిపాపలు పెద్దవారై తమ్ము సంరంక్షు రనియా తలిదండ్రులు వారి నాబాల్యము అతిగారాబముతో పెంతురు? వారి కపత్యప్రేమప్రతీక్షయే యుండదు, ఐనా ప్రాణములకన్న నెక్కువగా పిల్లల ప్రేమింతురు. పసితనమందే పరుసకొసంగబడి అత్తవారిల్లు చొచ్చినప్పటినుండీ పతిప్రేమ నపేక్షించుట సతీధర్మము, కాదు.పతి తన్నెప్పుడు ప్రేమించునో, అప్పుడు తా నాతని ప్రేమింపవలయుననీ సతి యెన్నటికి తలపరాదు. పెళ్ళియైనప్పటినుండీ పతిని ఆదరిస్తూ ఆతడే తనకు సర్వమని యెంచి త్రికరణశుద్ధిగా నాతని ప్రేమిస్తూండవలెను. పెళ్ళియాడిన వానినేప్రేమించుట (Love whom you marry) ఆర్య సతీధర్మముకాని, ప్రేమించినవానిని పెండ్లియాడుట(Marry whom you love) కాదు. సతికి జీవితసర్వస్వము పతియే. అట్లామె భావిస్తే పతియూ ఆమెను ప్రేమించితీరును. అతడున్నూ పెండ్లినాటినుండీ ఆమె తన్ను ప్రేమించునను ప్రతీక్షలేకనే ఆమెయం దనురక్తుడై యుండును. ధర్మ మాచరించునెడ నిద్దరూ సమభాగినులు కనుక సతి "సహధర్మిణి" అనిపించుకొనును. "ధర్మపత్ని", "అర్ధాంగి" అను పదములు సార్థకములగునంత సాంద్రసంబంధము పాశ్చాత్యదంపతులలో గానరాదు. వారి దాంపత్యము చిరకాలికము కావలె ననే నిర్భంధము లేదు; పాశ్చాత్యదాంపత్యసంప్రదాయము ననువర్తించువారియం దట్టిప్రేమయే అవతరించుచుండును.

ఆర్యదాంపత్యప్రేమ వినిమయ విహీనము, ఆకాంక్షా రహితమనియు, కామానురాగ మందుకు విపరీతమనియు చెప్పియుంటిమి. వినిమయప్రతీక్షచేతనే పశుపక్షిగణములో ప్రేమ జనిస్తుంది. కామానురాగము పరముఖాపేక్షి, ఇతరులు మనపై వలపుగొనకున్న మనకామ ముద్దీప్తము కానేరదు. నిసర్గ ప్రేమవలె నది నిరాకాంక్షము కానేరదు. విషయవ్యాపారము సర్వజంతువులకు సామాన్యము కావున దీనిని "పాశవప్రేమ" అందాము.

ప్రేమకు కామానురాగమునకూ మరో తేడా ఉంది. సతి పతిగౌరవ పరిపూర్ణ, వేరొకవ్యక్తియందు సతి చిత్తము ప్రసరింపనోపదు. వ్రజబాలికలకు శ్రీకృష్ణునితో సమగౌరవ భాజనుడు లేనట్లే సతికి పతితుల్యు డుండడు.

తల్లికి సంతానముపై ప్రేమ అత్యధికము, తల్లియూ సంతానమున కమితప్రేమగౌరవభాజనము. కావున నిసర్గప్రేమ మహత్వజ్ఞానపూరితము. అసమానపదస్థులయెడ ప్రేమ జనింపబోదని కొంద రందురు, కాని ఆది సరికాదు. సేవకుడు ప్రభువును, ప్రభువు సేవకుని ప్రేమించడము లేదా? గురువు శిష్యుని శిష్యుడు గురువుని ప్రేమింపగూడదా? పదవియందలి నిమ్నోన్నతములు ప్రేమోదయమునకు బాధాకరములు కాజాలవు. ప్రేయసులకు ప్రేమపాత్ర మత్యంతప్రియము, వారికి దానియం దాదరము మెండు. ఒరు లేలాగైనా దాని నధ:కరింపనెంచితే వారు సహింపజాలక ఆవస్తువును పెద్ద జేసి "దీనికి సరియేది?" అని వాదింతురు, అది వారికి కొంగుబంగారము; పరుసవేదివలె ప్రేమ తానుసోకినదాని నెల్ల పసిడిగా పరిణమింపజేయును.

కామానురాగము స్వతంత్రవ్యవహర్త; వాస్తవిక నీచోచ్చముల గణించక నీచ ముచ్చమును, ఉచ్చము నీచమును చేయుసామర్థ్యము దానికి కలదు. చిన్నదానిని పెద్దజేయునప్పుడు పెద్దదానిని చిన్నబుచ్చునప్పుడును కామమునకు సంచారీభావము సమకూరును.

ప్రేమకూ కామానురాగమునకూ ఇంకొక తేడా ఉంది. ప్రేమ తనప్రభావముచేత మానవునకు దేవత్వ మాపాదింప, కామానురాగ మాతనియందు పశుత్వమును సంక్రమింపజేయును. ప్రేమ భగవదవతారము కావున ఈదేవాంశమును మానవు డెంత అభివృద్ధినొందిస్తే భగవత్సాన్నిధ్యము నంతవేగముగా చెందగలడు. పిమ్మట సాయుజ్యము సులభ మగును. అట్లుచేయక కామపరతంత్రుడై కాలముపుచ్చు చుండునా, తనప్రకృతిని పశుభావమున పరిణతము చేయుచూ మోక్షమునకు దూరుడగును.

ఆర్యసాహిత్యమున కామము

ఆర్యసాహిత్యమున సతీప్రేమాదర్శము, కామానురాగ స్వభావము నెట్లు చిత్రింపబడెనో సూచించితిమి. ఇంద్రియ లాలసాచిత్రములూ వాటిరీతులూ కూడ ఆ సాహిత్యమున వివరింపబడినవి. పశుత్వకలితములగు పాపరూపములూ కన్నులకుకట్టినట్లు చిత్రింపబడినవి, అందలి మంచిచెడ్డలు మరుగుపడలేదు. ముక్కోటిదేవతల కధీనాథుడగు ఇంద్రుడూ శపింపబడెను, ఆతనిపై మరులుగొన్న అహల్యయూ పాపఫల మనుభవించెను. తారాశశాంకుల పాశవకృత్యమునకు తగినశాస్తి అయింది. దేవతలని వారికిమాత్రము పాపకళంకము తప్పిందా? మహాకార్యముల సాధించునప్పుడు తప్పనిసరి యైనపట్ల కామోదయము కల్పింపబడినది, కాని చెడుతలంపుచే కాదు. మహాత్ము లవతరించుటకూ కామోదయము కావలయునే! అభీష్టసిద్ధి యగునంతవర కవి ప్రబలి పిమ్మట అంతరించును.

ఆసక్తియు లాలసయు నుండుచోట్ల పాప ముండితీరును, కాని ఆసక్తి హీనమగు కార్యము పాపపంకిలము కానేరదు. అట్టి కార్యమునకు ఫలముండదు; అది పాపముగానీ పుణ్యముగానీ కానేరద(Non-moral)ని భగవద్గీతలయందు చెప్పబడినది. కేవలస్వభావజనితకార్యములన్నీ దైహికములు. అవి ఆసక్త్యనురాగ సహితము లయినప్పుడే పాపపుణ్యఫల మిచ్చేవి కాగలవు. ఈధర్మసూక్ష్మము మనశాస్త్రములందు పెక్కుతావుల నుదహరింపబడినది. దీనిని దృష్టాంతీకరించుటకే దేవతలయందూ మానవులయందున్నూ కామప్రవృత్తులు కల్పింప బడ్డవి. మహాభారతము గీతలయందలి ధర్మసూక్ష్మములకు విపులవ్యాఖ్యానము. నైసర్గికము, ఆసక్తిశూన్యము, పుణ్య పాపరహితము నగు దైహికకర్మయే వేదవ్యాసునిపుట్టుకకు హేతువు. అట్టిమహనీయుడు పుట్టడముకోసమే ఋషిసత్తముడగు పరాశరునికి మత్స్యగంధిసంపర్కము సంభవించెను, అదీ క్షణికము. ఇట్లే భరతుడు, శకుంతల, కార్తికేయుడును జనించుటకు ధుష్యంతుడు, విశ్వామిత్రుడు, శంకరుడు మొదలగు మహాత్ముల చిత్తములందు కామము క్షణికావిర్భావమొంది నది. ఈధర్మసూక్ష్మమునే పాండురాజు కుంతి కుపదేశించి దేవతాప్రభావమున పాండవుల నావిర్భవింపజేసెను; బలిరాజు అంధుడగు మునిమూలమున అంగ వంగ కళింగాది పుత్త్ర సంచకమును పొందగల్గెను. అంధునకు రూపమునం దాసక్తి యుండుట అసంభవము. ఇప్పు డుదహరించినవన్నీ పాపకలిత మగు కామమున కుదాహరణములు కానేరవు. అవి పాప రహితములు.

ఆర్యసాహిత్యమున గాంధర్వవివాహముచిత్రింపబడుటచే పూర్వకాలమున పడతులు తాముకోరిన వరులను పొందుచుండిరని స్పష్టమగును; అందుచేత అప్పటిస్త్రీలకు స్వచ్ఛ యుండెననుట తెల్లము కాదా అని అడుగవచ్చును. నిజము - స్వయంవర వివాహములు పూర్వకాలమున లేకపోలేదు. కాని అట్టి యాచారము క్షత్త్రియజాతులయందే ఉండేది; సాధారణసంఘమున నది యున్నట్లు దృష్టాంతములు కానరావు. రాజకన్యల కట్టి స్వాతంత్య్ర ముండుట నిక్కము. వీరుల కెక్కువ గౌరవ మాపాదింపబడు ఆ కాలమున అది రాజనీతిగా చెలగుచుండెను, ఆ నీతినే ఆంగ్లకవియొక డిట్లు తెల్పెను : _

           "None but the brave deserves the fair"
                "పొందదగు వీరుడే సుందరాంగులను"

సుందరినొకతెను వరించి స్వయంవరమునకు వచ్చిన రాజుల గుణములు సభలో వర్ణింపబడుచుండును. ఇట్టి వర్ణ నము చేతనేకదా సునంద ఇందుమతిచే అజుని వరింపజేసింది. శివధనుర్భంగము చేయనేరని వీరుడు సీతను, మత్స్యయంత్రమున లక్ష్యభేదము సేయనేరని వీరుడు ద్రౌపదిని పెండ్లియాడుటకు తగరు. సభయందు రూపవీర్యగుణవర్ణన చేసినంత మాత్రాన కార్యసిద్ధి సమకూరెనా? సుందరీరత్నము లభించినవారు ఏ పోరులేక ఆమె నింటికి గొనిపోవ సాధ్య మాయెనా? స్వయంవరమున నామేచే తిరస్కృతి వడసిన వారెల్ల పెళ్లికొడుకుతో పెనుగులాడేటప్పుడు అతడు వారి నందరిని జయింపవలయును, లేకుంటే ఆమె యతనికి దక్కదు. ఈగెల్పు అసాధారణకార్యము.

స్వయంవరమున జయము పొందినవారి గుణములను వర్ణించుటేకాక ఓడినవారి మొగము లెట్లు చిన్నవోవు చుండెనో, వా రెట్లు లజ్జాభిభూతులగుచుండిరో, అదికూడా ఆర్యకవులు వర్ణించుచుండిరి. స్వయంవరముల యందు వివాహమే ముఖ్యవిషయముకాదు, వీరత్వముకూడా పరీక్షింపబడుచుండెను. కావున అవి పరాక్రమనికషపాషాణములని యెంచదగును. ఈవర్ణనములు చదువువారి చిత్తములు అందలి వీరరౌద్రరసములచే నాకర్షింపడును, కాని ఇంద్రియ లాలసయు, కామానురాగమును వారి కనుభూతములు కావు.

ఆర్యకవులు కామానురాగమునకును నిసర్గప్రేమకును గల తారతమ్యమును నిర్ణయించి మొదటిదానియందలి మచ్చను రెండవదానియందలి మెచ్చును విపులముగా వర్ణించిరి. కామమున కెట్టి సందర్భములందు పాపము సోకునో ఎట్టియెడ సోకకుండునో వారు చక్కగా తెలియపరచిరి. సూక్ష్మదృష్టికలవారు కావున ధర్మసూక్ష్మమును స్పష్టముగా నిరూపింపగల్గిరి. ఇట్టి నిరూపణమును వారు చేయగడంగినప్పుడు పలురకముల కామానురాగమును రచనచేయవలసి వచ్చెను. పాపకలితమగు దానిని కళంకయుతముగనే వర్ణించిరి. ఇట్టి చిత్రరచనచేత సాహిత్య గౌరవము తగ్గకుండా ఇతరరస సమ్మేళన మొనర్చి తన్మూలమున గౌరవ మినుమడించిరి.

సఖ్యప్రేమ

ఆర్యసాహిత్యమందలి ధార్మికదంపతీప్రేమ పాశ్చాత్యసాహిత్యమున దుర్లభము. అం దింకొకవిధమైన ప్రేమ చిత్రింపబడియున్నది. ఇద్దరు మిత్రులకు, ఇద్దరు సఖులకు ఇద్దరు సమానుల కన్యోన్యమూ ప్రబలు ఈమధురప్రేమను సఖ్యప్రేమ అనదగును. ఇదీ మెచ్చదగినదే. ఆర్యసతులయం దిట్టిప్రేమా లేక పోలేదు. సతికి పతియు, పతికి సతియు పరమ సఖులు, కావున వారిరువురూ ఆప్రేమయందు నిమగ్నులగుదురు. వా రన్యోన్యాదరపాత్రములై మధురాలాపములతోనూ, ప్రణయచేష్టలతోనూ, కాలము వెళ్ళబుస్తూ, ఒకరి వృత్తము నొక రనుమోదిస్తూ ఉందురు. ఇందు సతీపరతంత్రత పతిదేవత్వమును మిళితము కావడముచేత వీటిసాంగత్య మున సఖ్యప్రేమయందలి సౌందర్య మినుమడించును; వీటికితోడు భక్తి ఉదయించుటచేత ఆప్రేమ పరమపవిత్రమగును. సఖ్యభావమున మాధుర్యమూ, భక్తిభావమున పవిత్రతయూ, మేళవించుటచేతనే ఆర్యనారులు కమనీయశీల లగుచున్నారు. శుశ్రూష సల్పునెడ పతి దైవమును, సల్లాపము సల్పునెడ సఖుడు నగును. ఆర్యనారిగౌరవము గరుపమును సత్యవలంబనమున ప్రభవించు లక్షణములు. మానినియగు భార్యకన్న భర్త కెక్కు డాదరపాత్రమగు పదార్థము లేదు.

సతి కుపిత అయ్యెనా ఏలాగైనా ఆమె నూరడించడము పతికి విధ్యుక్తధర్మము. అందుచేతనే రాజప్రసాదముల యందు రాణుల కోపగృహములు ప్రత్యేకముగా నిర్మింప బడుచుండెను. రాణి అలిగినచో రాజ్యమిచ్చియైన ఆమె ననునయించుట రాజధర్మము కావడముచేత కైకకోపోపశమమునకై దశరథుడు ప్రాణాధికుడు సర్వజనాభిరాముడునగు శ్రీరాముని ఘోరాటవుల కంపెను. దురపిల్లు వై దేహిని సమాశ్వసింప శ్రీరాము డంత:పురమునకు చనెననియు, పిమ్మట చిత్రదర్శనముననూ మధురాలాపములచేతనూ ఆమె దు:ఖ మపనయించి వెనుకటి దాంపత్యసుఖమును జ్ఞప్తికిదెచ్చి సుఖానుభూతి సమకూర్చెనని ఉత్తరరామచరితమందు కనబడుతూన్నది. లంకావిజయానంతరము కుబేరపుష్పకముపై అయోధ్యకు పోవుచూ శ్రీరాముడు సరస సల్లాపములచేతను తన కీర్తిపరిచయముచేతను సీతహృదయమున కానందము గూర్ప యత్నించిన రీతిని కాళిదాసు రఘువంశమున అతి మనోహరముగ వర్ణించెను (పదమూడవసర్గ.) దాంపత్యప్రేమ సఖ్యభావమాధుర్యమిళితమైనచో తత్సుఖ మపూర్వమై నిర్వర్ణనీయమగును. ఆసుఖమును ఆనందమును జూరగొను నాసతో భక్తురాలు భగవంతుని సమ్మానపూర్వకముగ అర్చించునట్లు సీత భర్త నారాధింప నుద్యుక్తురాలగును. దారుణములగు ప్రతిజ్ఞావాగురుల దశరథు బడద్రోసి రూక్ష వచనముల నాతని అలయించిన కైక తత్పూర్వము దేవకార్య నిర్వహణమున ఆతనికి సాయమొనర్చి ప్రసన్నునిచేసుకొని ఆతనికృపచే రెండువరముల గడించింది. శ్రీకృష్ణుడు రాధ పాదముబట్టి అలకదీర్ప ఆతడు సాక్షాద్భగవంతుడని ఆమె పూజించును. భక్తిసమ్మిశ్రితమగు సఖ్యప్రేమమూలమున దాంపత్యసుఖ మనుభవించు యోగ్యత భారతరమణుల కబ్బెను. కావున తచ్చిత్ర మార్యసాహిత్యమున కల్పింపబడి దానికి వన్నె తెచ్చింది. ఈ యాదర్శసౌందర్యమున స్వర్గమందలి పవిత్రత నందనవనమందలి శోభ, మధుమాసమందలి మాధుర్యమును వెలయుచున్నవి.

పాశ్చాత్యప్రేమ స్వభావము

పాశ్చాత్య సాహిత్యమందలి ప్రేమ యెట్టిది? అది కేవల సఖ్యప్రేమయే. అం దార్యసతీప్రేమయందలి భక్తి, నిస్స్వార్థము, ఏకనిష్ఠ, ఆకాంక్షారాహిత్యము, గౌరవస్ఫూర్తియు కానరావు; ప్రేమాలాపము, మాధురి, దర్పము, స్వాభిమానము మాత్రమే ఉండును. ఎన్నియున్నా భక్తిమయైకనిష్ఠ, పుణ్యప్రతిచ్ఛవియు లేనందున ఆప్రేమ పవిత్రము దివ్యమునూ కాజాలదు. అందు మానవప్రకృతియందలి మాధురి ఉందిగాని దివ్యప్రకృతియందలి సౌందర్యము లేదు. మాధుర్యమునకూ ఆనందమునకూ తోడు నిర్మలశోభా వికాసము లేకున్న ప్రేమకు సర్వాంగసౌందర్య మలవడదు.

పాశ్చాత్యసాహిత్యమందలి ప్రేమసౌందర్యము ప్రాయికముగా ఇంద్రియలాలసావిలాసక్షేత్రమున ప్రస్ఫుటితమగుచుండును. ఆక్షేత్రములే దేశదేశములందు కళంకబీజముల నాటుచున్నవి. నిసర్గప్రేమసవంతి కామాసక్తి అను పంకముచే కలుషితముకాగా అంత:శత్రువిరోధము దాని గమనమును మందగించి పెక్కుచోటుల సరికట్టుచుండుటచేత షడ్రిపు ప్రభుత్వమే సర్వత్ర సాగుచున్నది. మానవులయందు పాశవ ప్రవృత్తి మితిమీరితే వారియందలి మానవత్వమునే కాక దేవత్వమును కూడా నశింపచేయును.

ఆర్యసాహిత్యమందలి సీతవంటి సతీమణిని పాశ్చాత్య సాహిత్యమున గాంచనగునా? హోమరు రచితయగు హెలెన్ సీతకు ప్రతియోగిని (సాటి)గా చేయవచ్చును, కాని అట్లెంచుట స్వర్గమునకు నరకమును సాటితెచ్చుటే! ఇక షేక్స్‌పియరుసృష్టిని తిలకించితిమా, మనము వెదకపోవు ప్రేమ మందునకైన కానరాదు. రోమియో మొదట రోసలీన నునామెను చూచి, మోహపరవశుడై, నిద్రాహారములుమాని చిత్తశాంతి శిథిలముకాగా, వేడి నిట్టూర్పులతో వేడికన్నీరోడ్చుచూ ఉండగా, జూలియట్ ఆతని దృష్టిపథమున బడెను. అంతట నాతనిలక్ష్యమూ అవస్థయూ ఒక్కరాత్రిలో మారెను. పిమ్మట జూలియటుపై మరులుకొని వికలచిత్తుడై, ఆమెయింటిచుట్టూ తిరుగుతూ పొంచిపొంచి కిటికీదగ్గరకు బోవును. డెమెట్రియస్ హెర్మియాను చూచి యిట్లే చిత్తవైకల్యమునొంద, అంతవరకూ ఆతనిహృదయమున నెలకొన్న హెలెనా అపసరిల్లింది. ఇట్టిప్రేమ పాశ్చాత్యులకు చెల్లునే కాని మనకు చెల్లదు. దీనిని మనము ప్రేమగా గణించక "లాలస" అందుము.

వాల్మీకి ధర్మవీరుని చిత్రింపనెంచి శ్రీరాముని పాత్రమును నిర్మించి మానవుల ముగ్ధుల నొనర్చెను. పిమ్మట అందుకు ప్రతిగా ఇంద్రియపరాయణుడగు రావణుని పాత్రమును సృజించెను. ధర్మవీర్యవివశీకృతులై అందరూ రావణుని గర్హింతురు. అదేరీతిని మొదట పవిత్రము సుందరమునగు సీతపాత్రమును నిర్మింప, తచ్చిత్రముగ్ధులై అందరునూ ఇంద్రియపరాయణ, కామమోహిత, లజ్జాహీనయునగు శూర్పణఖను చూచి గర్హించి, ఆమె ముక్కు చెవులు లక్ష్మణుడు కోయునప్పుడు ఆపని మెచ్చి అతని ప్రశంసింతురు. ఆర్య సాహిత్యమందలి చిత్రము లిట్టివి.

షేక్స్‌పియరు నాటకరచనయందలి పరిణామ మిట్లుండదు. వాటియందు మొట్టమొదటనే దుర్దమాంత:శత్రుచిత్ర ములు కానవచ్చును, - రావణునిబోలు మత్తమాతంగములు, స్వర్ణప్రసువగు లంకాద్వీపము, ఇంద్రభోగమును, మానసముల నాకర్షింప, వాటి మహత్వప్రకాశమున కన్నులు మూతపడును. క్లియొపేట్రారూపము జగన్మోహనము, మేక్ బెత్ రాణిని దలచినతోడనే లోభప్రబోధమగును; ఇయాగోచాతురి మానసమును మ్రాన్వడజేయును; ఇట్టిపాత్రములు చిత్తమున జొత్తిల్లి తత్ప్రతిబింబములం దచ్చుపడిన వెన్క సంయోగాంతములందలి పాత్రములకు సందేది? సర్వసామాన్యములగుటచే వాటియందు తారతమ్యము కన్పట్టదు. షేక్స్‌పియరు కల్పనాప్రపంచమున ఈ రెండువిధముల పాత్రములే కనబడును. - అదంతయు షడ్రిపుసంక్షుభితమగు మానవప్రకృతి. విషయాభిభూతములగు పాత్రములయం దాసక్తులగు వారి చిత్తములకు తద్విరుద్ధ స్వభావపాత్రములు రుచించునా? పాత్రగణనాప్రసంగమున వియోగాంతముల నాయికానాయకులు అగ్రస్థానము నలంకరింతురు, వారివెన్క వియోగ సంయోగాంత (Tragi - Comedy)ముల పాత్రములు, ఆవెన్క సంయోగాంతపాత్రములును మెప్పు వడయుచుండును.

అంతశ్శత్రుప్రాబల్యము, ఇంద్రియ లాలసాప్రాధాన్యము అంతటా వెలయుచున్నా, కొన్నిచోటుల నది తగ్గును. రోమియోజూలియటుల బోలు సాంఘాతికరిపూచ్ఛ్వాసము సంయోగాంతములం దుండక తద్బలము క్షీణించియున్నా యౌవనోన్మాదము, అధీరత, లాలసా వేగమున్నూ ఉండి తీరును. బెనిడిక్ మానసకాసారమున ప్రేమతరంగము లుత్పన్నములైనతోడనే జనించిన ఆధీరత ఏమని చెప్పను? అతడు బియాట్రిస్‌కన్న ఎక్కుడు పిరికివాడగును. యువానురాగోన్మత్తయై రోసలిం డార్లెండోను చూడక క్షణమేని నిల్వలేకుండెను. సంయోగాంతములందు ప్రేమచిత్రములు, యౌవనోన్మాదేంద్రియ లాలసా కళంకితమూర్తులును కలవు, గాని, అవి ప్రేమచిత్రములలో లేక లాలసాచిత్రములలో నిర్ణయింప నలవికాదు. మదోద్రేకమున నాయికానాయకులు సాంఘికవ్యవస్థలను, కుటుంబనీతిబంధములను, తెంచుకొని యధేచ్ఛముగా వ్యవహరింతురు. డెస్‌డెమొనా యవ్వనమదమున విజాతీయుని, విమతస్థుని వరించి రహస్యముగా నింటినుండి లేచిపోయి, నిండోలగమున సిగ్గువీడి తనవృత్తాంతము ప్రకటించి, తన్నే లోకమనియెంచు తండ్రిగుండెలు పగులగొట్టి, ఆతని పరలోక ప్రాప్తికి హేతుభూతురా లయింది. జూలియట్ ఇమోజెన్లు కూడా పితురాజ్ఞోల్లంఘన మొనర్చినవారే. హెర్మియా లైసాండరుతో లేచిపోయి, అడవిపట్టి, తన్మూలమున పిత్రాజ్ఞకే కాక రాజనియమములకునూ వెలియైనది.

ప్రణయాలాపములు యువకుల కత్యంతప్రియము లనుటకు సందేహములేదు. ఆంగ్లనాటకములం దిట్టి వనేకము లున్నవి; వాటియందెల్ల యౌవనోన్మాదమే కాన్పించును. ఉన్మత్తులకు నియమోల్లంఘనము పరిపాటియ కదా! వారు నైతికశాసనములు లెక్కసేయరు, పాపమునకు వెరవరు. దుర్దాంతప్రేమావిలమానస అగుటచేతనే కదా జెసికా నిర్ధనుడగు జనకునికంట దుమ్ముజల్లి, బెల్మాంటునందలి లారెన్స్ దగ్గరకు పరుగెత్తిపోయినది! ఇట్టిపనులు యూరపునందు సర్వసాధారణముగా జరుగుచుండుటచేత షేక్స్‌పియరు వీటిని తననాటకములందు తరుచుగా వాడెను. హోమరు మహాకావ్యమందును హెలెన్ పారిసుతో లేచిపోయెను. ఇట్టి పాప చిత్రములను నవయువకులగు మనవిద్యార్థులఎదుట సతతము నిలువనిచ్చిన వారిభావములు దూష్యములుకావా? ఇక శృంగారరసపూరితములగు నవలలమాట వేరె చెప్పనేల? యూరోపీయ సంఘధర్మముల ననుసరించిన షేక్స్‌పియరు నాటకములయం దిట్టిపాపచిత్రములకు కొదవ యుండునా?

ఆజనసంఘములందు ఆదర్శప్రేమ నిర్దిష్టములగు నాటకములు లేకపోలేదు, కాని ప్రేమసౌందర్యమును వివరించునవి మాత్రము చాలాతక్కువ. ఆంగ్లకావ్యములు, నాటకములు నవలలు మొదలగు వాటియం దీలోపము సర్వసాధారణముగా కనబడుచుండునే, వాటివలన మానవప్రకృతి ఉజ్వలితమగునా? పాశ్చాత్య నాటకకవిసార్వభౌముని నాటకములయందు అచ్చటి ప్రజల రీతినీతులు యథార్థరూపమున చిత్రింపబడి యుండుట చేత అవి వారి కాదర్శములైనవి. రూపగుణమోహమువలన ఉత్పన్నమగు అనురాగము యౌవనమున నెట్లు దుర్దాంతమగునో కనవలెనన్న పాశ్చాత్యసాహిత్యము పఠించ వలయును. శకుంతలా దుష్యంతుల అనురాగము రూపజ మనవచ్చును, కాని ప్రత్యాఖ్యానము చేసేటప్పుడు రాజు ఉత్కృష్టమగు ఆత్మసంయమన మగపరచి పాశవప్రకృతి నణగదొక్కెను. అతని మనస్సులోని శకుంతలరూపానురాగము బయట పడకుండ కవి లజ్జయను తెర మరుగుజేసి మాధుర్యము చేకూర్చెను. ఇట్టి మాధుర్యము పాశ్చాత్యప్రేమయందు కానరాదు. లజ్జ కేవల మాధుర్యమును కూర్చుటేకాక అనురాగమందలి పాపకళంకమును పరిమార్జించెను. రూపానురాగము విధివిపరీతమై క్రోధాదులయందు పరిణతమయితే పాపసంకులమగును. శకుంతలానురాగము ప్రబలాసక్తిగా పరిణమించక పూర్వమే దుష్యంతు డామెను పెండ్లియాడి తదనురాగము విధ్యనుకూలమగున ట్లొనరించెను. గాంధర్వ వివాహము క్షత్రియుల కుచితమే కావున పాపము దూరమాయెను.

ప్రాచ్య పాశ్చాత్య ప్రేమ చిత్రణము

అభిజ్ఞానశాకుంతల మారంభించునపుడే అపూర్వమగు ప్రేమచిత్రము ప్రాదుర్భవించును. శకుంతల ఆశ్రమతరులతాదులయెడ సోదరభావమూని, వాటి కుపచారము చేస్తూ, సఖులతో నిస్సంకోచముగా ప్రణయసల్లాపము సల్పుతూండును. వారు ముగ్గురూ సహకారమునకూ మాధవీలతకును పెళ్లిజేసి క్రీడాకౌతుకము కావించుకొనుచుండ, దుష్యంతుడు ప్రవేశించును. అతనిమ్రోలనున్న శకుంతల లజ్జాభరము మౌనమును ప్రకృతిసంగతముగా వర్ణింపబడినవి, యూరోపీయ సతులయందలి దిట్టతనము, ఆగడము, వాచాలత కానరావు. నిర్లజ్జాకలితప్రౌఢ యైనచో రాజుప్రేమకు పాత్రము కాకపోవును. భావవ్యంజకనీరవత ప్రౌఢల కుండునా? యువతులకు లజ్జ మౌనమూ భూషణములు. క్రెసిడాయందలి ఛలము, ప్రేమ ప్రకాశకవాక్యసరణి, క్రియాకలాపము, జూలియట్, ఇమోజెన్, హెలెన్ హెర్మియాల ధృష్టవ్యాపారములును ఆర్యయువతుల మితభాషిత్వముకు సాటిరావు. కులాంగనలయందు ధృష్టత అసంగతము అసంభవమని ఆర్యులసిద్ధాంతము. ప్రేమ నంగడినమ్ము పాశ్చాత్యులయం దిట్టివి చెల్లును. ప్రేమభిక్షా ప్రార్థనము (Court-ship) వారిలో సదాచారము, దీముమాట లాడియూ మక్కువసేతల చేసియూ మరులుకొల్పి కాంతల కరగతల చేయుటయే దీని ముఖ్యోద్దేశము. ఆర్లెండో రోసలిండు నెడ అవలంబించిన దీ ప్రక్రియయే; దీనిని పతిపత్నులవేట యననొప్పు. వనితలను వలలో వేసుకొన దలచినవారు మనసులోనున్న దానికన్న నెక్కుడుప్రేమ నటింపవలయును. *[2] ఇది ప్రేమవిడంబన మగునుగాని నిజమైన ప్రేమకాదు. ప్రేయసుల ప్రసంగము విన్నవారికీ చదివినవారికిన్నీ హాస్యాస్పదముగా నుండును. మురిపెంపుమత్తు ముగియువరకూ ప్రణయవచన ప్రవాహము పారుచునే యుండును. ఇట్టి మధురప్రసంగమున మౌఖికప్రేమ యెంతో హార్దిక మెంతయో నిర్ణయించుట సులభసాధ్యము కాదు. ఇంకొక చిత్రము - ఒక కాంతను చూచినవెనుక జనించిన మోహసాగరము ఇంకొకకాంతను చూచినతోడనే ఎండిపోవును; ప్రేమాంధులకు యుక్తాయుక్త వివేచనము శూన్యమనుట అందరూ ఎరిగినదే. అర్హ వివేచనము చేసి పాత్రాపాత్రనిర్ణయమొనర్చి వివాహమొనర్పవలెనన్న యౌవనము తగిన యదను కాదని ఒప్పుకొనక తీరదు, ఏలయన రిపుషట్కప్రలోభనము రూపమదమున్నూ మితిమీరి చెలరేగు కాలమిది. ఇప్పటి ఎన్నిక లోనిగొంగలమోసము. షేక్స్‌పియ రీవిషయమునే యోగి (Friar) చే రోమియో కిట్లు చెప్పించెను.

                  అంతమక్కువ వలచితి వింతలోనె, రోజలీనును వీడితే? రోతవడితొ?
                  యువకులకు ప్రేమ కన్ను లందుండుఁగాని, హృదయమందున నుండబో దిదినిజంబు*[3]

హెర్మియావివాహము చేయనెంచి ఆమెతండ్రి డెమెట్రియసును వరునిగా నిశ్చయించగా ఆమె లైసాండరును వరించినది, వారిట్లు ప్రసంగింతురు : _

హెర్మి - **[4] అయ్యయో! నాదు జనకుండు నరయడాయె నాదు కన్నుల (యోగ్యుఔనాధుడెవడొ)

తీసి - (అంధవీవేది గన నీకు నక్షియుగము?) నాదు బుద్ధిని గొని నీదు నాధునేర్చు.

వివేచనలేనప్పుడును లోనిపగతురు ప్రబలునప్పుడున్నూ తలిదండ్రుల యెన్నికకు తనయలు సహమతులగుట ఉచితమని షేక్స్‌పియర్ ఒప్పుకొన్నట్లే. అందుననే ఆర్యజాతుల యందు వధూవరుల నిర్ణయించుభారము జననీజనకులో, లేక సువిజ్ఞులైన అభిభావుకులో వహించుట అనాదినుండియు నా చారమై యున్నది. యువకులు వివాహభారమును తమ నెత్తుల కెత్తుకొనకుంటే ప్రణయాఖేటనాచారమునకు అవసర ముండదు. ప్రేమ క్రయవిక్రయసామగ్రి కానేరదు. అప్పుడు స్త్రీలకు లజ్జయే నిసర్గభూషణ మయి వారు జాతికీ సంఘమునకూ ఖ్యాతి తెచ్చెదరు. ఇట్టిశీలమే శకుంతలకు కల్పింప బడినది.

శకుంతల - మిరాండా

నాగరికప్రపంచముతో నెట్టిసంసర్గమూ లేక నిర్జనమగు ఋష్యాశ్రమమున శకుంతల పెరిగినట్లే, మిరాండాకూడా జనశూన్యారణ్యమున జనకునిచే పోషింపబడెను. శకుంతలహృదయమున ప్రేమోద్రేక ముదయించు ప్రాయమున దుష్యంతు డామెకంట బడెను. ఆమెకప్పు డుదయించిన ముగ్ధత్వము లజ్జనుగూర్చి ముచ్చటించితిమి. మిరాండా తండ్రినితప్ప ఇతరులనుచూడనేలేదు; కాని ఫెర్డినెండ్ ఆమెకంట బడడముతోనే ప్రౌఢనాయకివలె మాటలాడుటకు మొదలుపెట్టింది! శకుంతలను చూచిందిమొదలు రాజే భోగట్టాఅంతా కనుక్కొని వివాహప్రసంగము చేసెనుగాని ఆమె ఆసంగతి యెత్తనేలేదు.

ఇక మిరాండా వృత్తమును పరికించండి : _

  • [5]మిరా - నాపై నీకు ప్రేమ ఉన్నదా ? ఫెర్డి - అఖిల దేవతలు పృథ్వియు సాక్షులుగా శపథ మొనర్చి చెప్పుతూన్నాను. నేను నిన్ను ప్రేమించుటే కాదు, కులీనవలె సమ్మానింతును, గౌరవింతును.

మిరా - నవ్వు రాదగినచోట నా కేడ్పు వస్తూన్నదే!

ఫెర్డి - కారణ మేమి?

మిరా - నాహీనత దీనతయు తలంచి ఏడ్చు చున్నాను. నే నీయదలచినదానిని ఇవ్వజాలను. (నీవు స్వీకరింతువనే ఆశ లేదు) నాకేది లభించకున్న నేను జీవించనో దానిని నీ విచ్చెదవో లేదో? (ఇచ్చెదవనే ఆశ లేదు) అందుకే ఏడుపు వస్తూన్నది. ఇది స్వల్పవిషయము. నేను దేనిని మరుగుజేయ యత్నిస్తున్నానో అది బయటి కుబుకుచున్నది. లజ్జ వగలారా, నన్ను వీడి పొండు. ఆర్జనమా! అమాయికత్వమా! నాకు బాసటై నిలవండి. నీవు నన్ను పెండ్లియాడెద వేని నీకు పత్నినై మెలంగెదను, లేకున్న నీకు దాసినై మనియెదను. నన్ను పెళ్ళియాడెదవో లేదో నీచిత్తము, నీకు దాసి నగుటకు నీ వొప్పుకొన్నా మానినా నేను మానను.

ఫెర్డి - నీవు నాకు ప్రాణములకన్న ప్రియతరవు, నేను నీదాసుడను.

మిరా - నాకు భర్త వగుదువా ?

ఫెర్డి - మనస్ఫూర్తిగా-ఇదే బాసచేస్తున్నాను.

మిరా - ఇదే నీ దాసు రాలను.

చాతురీభరితములగు నిట్టిమక్కువమాటలు మిరాండా ఎక్కడ నేర్చుకొంది? అంతకుపూర్వము పురుషులనే కాంచ లేదు, మూడేళ్ళవయస్సున నిర్జనద్వీపమున నిర్వాసితురాలయి పండ్రెండేళ్ళు తండ్రినిగాక ఇతరుల నెరుగదు. ఘోరాట విని గ్రుమ్మరునామె కిట్టి వాగ్రచనాచాతురి ఎలాగబ్బింది? శకుంతలకు ఇతరజన సాంగత్యమైనా కద్దు - ఋషికుమారు లుండిరి, కణ్వునిజూడ పలువురు వస్తూ పోతూ ఉండిరి; ఆమె నోట నిట్టి చతురవాక్యములు రాలేదు! పెండ్లిమాట నెత్తుటకైనా ఆమెకు సాహసము లేకపోగా, దుష్యంతుడే ఆప్రస్తావముపక్రమించెను; అప్పటికీ ఆమె ఇట్టికౌశలమున ఆత్మోన్మీలన మొనర్పలేక తూష్టీంభావమున తలవంచి నిలువబడినది. మానవప్రకృతి అంతటా ఒకతీరుననే ఉండునుకదా, సంఘ సంసర్గమే లేని మీరాండా నాగరక ప్రౌఢభావము తనకు నిసర్గముగ నావిర్భవించినట్లు వ్యహరించె ననుట వింతకాదా? జూలియట్, రోసలిండ్, బియాట్రిన్, ఇమోజెన్, డెస్‌డెమొనా మొదలగు నాగరికప్రౌఢల మనోభావములు మిరాండాకు సహజములగునట్లు కవి సృష్టించెను. శకుంతలయందలి సారళ్యము, వ్రీడ, నిసర్గయువతీప్రేమయు పాశ్చాత్య యువతీ సంఘమును గాలించి వెదకినా గానరావు; అట్టికల్పన పాశ్చాత్యులకు అసలే స్ఫురించదు, ఏకవేళ స్ఫురించినా వారిప్రకృతి ప్రతిరూపము కానందున వా రట్టిరచన చేయనే చేయరు. మానవప్రకృతియందలి ఆ మెచ్చు ఆర్యసాహిత్యమునకే తగును.

మీరాండాసరళతయందు సాహసము మిళితమయినందున లజ్జయెట్టిదో శమమెట్టిదో ఆమె యెరుగక పోవడముచేత మనసులోని మాటలు వెలిపుచ్చెను. మనోభావములను మాటలతో నెరిగించుటయే సరళత యైనచో ఫెర్డినెండుతోడి ప్రణయసల్లాపమున మిరాండా సరఖస్వభావ అనకతీరదు. హృదయోద్వేగమున వెడలు మాటలు అకృత్రిమములు సరళము లనుటకు సందేహములేదు. మిరాండావ్యవహారము స్వాభావికమని ఒప్పుకొన్నా, అది యెంతవరకు సంభవమో పరీక్షించవలెను. ఆమెనోట వెడలు చతురవాక్సరణి, వివాహ కాతరత, ప్రౌఢభావములూ మానవసంఘమునకు వెలియైన మానినిమానసమున నెట్లుదయించగలవో తెలియదు; అట్టి చాతుర్య మామెకు శోభాదాయకమూ కాదు. యువజన సులభములగు హృదయావేగము ఇంద్రియాలాలసయు, ఆ సల్లాపమున ప్రకటితము లైనవి. మిరాండాఫెర్డినెండుల కిద్దరికీ వివాహోత్సుకత సమానమే, కాని అతనికన్న ముందు ఆమె తనకోర్కె వెలిపుచ్చినది. ఈ విషయమున శూర్పణఖకూ ఆమెకూ భేదమేమి? ఆంగ్లకవిసార్వభౌముని రచన యందు యౌవనోన్మాదమునకు ఉత్సుకతకున్నూ మిరాండా పాత్రము ఉత్తమోదాహరణము.

కవిరచితమైన ఆదర్శ సృష్టి

కామక్రోధలోభ మోహహింసాద్వేష ప్రభృతులగు ఆసురిక పాశవ ప్రకృతుల అలౌకికచిత్రములను షేక్స్‌పియరు రచించినట్లే, ప్రేమదయాదాక్షిణ్యక్షమా ప్రభృతులగు ధర్మ ప్రవృత్తుల ఉత్కర్షను ఆర్యకవులు రచించిరి. ప్రపంచమున నిట్టి ఉదాహరణములు అరుదుగా లభించును. మేక్‌బెత్ రాణివలెనే సీతాసావిత్రిలూ దృశ్యప్రపంచమున దుర్లభ వ్యక్తులు, కావ్యప్రపంచముననే వారిని గాంచవచ్చును. కల్పనా రాజ్యమున ఆదర్శసృష్టిచేసి మానవోత్కర్షను కవి చూపును. ఇట్టి సృష్టిచేయుటే కావ్యరచనకు ముఖ్యోద్దేశము. అనుదినమూ చూస్తూన్న విషయములను చిత్రించుటకు కవి సృష్టి కావలయునా? ముంజేతికంకణమ్మున కద్దమేల? కనబడే దానికన్న ఘనతరమగుదానినే కవి కల్పిస్తూ ఉండును. అది మానవహృదయముల నాకర్షించి వాటిని శుద్ధిచేసి తత్ప్రవృత్తుల సత్పథమున వర్తిల్లజేయును. వీటినే ఆదర్శము లందుము. సీతా సావిత్రీ పాత్రము లిట్టివే.

అంతశ్శత్రుప్రాబల్య మతిశయిస్తే వర్ణాశ్రమధర్మబంధములు తెంచకతీరదు, అంతతోగాని అది చరితార్థము కాదు. ఇందుకు డెస్‌డెమొనా జూలియట్ పాత్రములే తార్కాణములు. సంసారబంధములు, రాజ సంఘ శాసనములు మొదలగువాటిని ఉల్లంఘించకుండా ప్రేమ యెంతవరకూ స్పందించునో, అట్టి ప్రేమయందు నైతికసౌందర్య మెట్లు నెలకొనునో ఆర్యకవులు నిదర్శనములతో చూపిరి. కామక్రోధాదులు సర్వజంతుసామాన్యములు, అవి మితిమీర విజృంభింపకుండా చేయుటయే మానుషము, ఆర్యసాహిత్యమున నెల్లెడ నిట్టిమానవపాత్రరచనయే కాన్పించును.

  1. * ప్రేమ్ తుమ్‌హారే కర్నేహీనే మై భీ కహో కరూంగీ ప్రేమ్? యుమ్‌హే ఛోడ్క-ర్ ఔర్ న జానూం యహీ హై మేరా నేమ్.
  2. * Ferd - Full many a day I have eyed with best regard, and many a time The harmony of their tongues hath into bondage Brought my too diligent ear; for several virtues Have I liked several woman; never any With so full soul, but some defect in her Did quarrel with the noblest grace she owed, And put it to the foilː but you, O you, So perfect, and so peerless, are created Of every creature's best. (The Tempest Act III)
    • పలువుఱ బొలతుల బాగుగనే నారసినవాడ, నావాడివినికి వారి మాటతేనియ పెక్కుమార్లు దాసింజేసి; నానావిధస్త్రీల కేను వివిధ గుణములబట్టి మక్కువపడినాడను; గాని యెవ్వతెకైన గల్గినట్టి చెలువుతో జగడముచేసి దానిన్‌బాడుచేయులోపం బెద్దియూ యొనరెడు గనుక నామనసార నేకల్కినైన నేను మోహించ లే దెన్నడైనగాని; నీవెపరిపూర్ణురాలవునిరుపమముగ, సలుపబడితివెల్లరి! మెఱుగులమొనపయి ఆ|| నా || దా||
  3. * Is Rosaline, whom thou didst love so dear, So soon forsaken ? Young men's love then lies Not truly in their hearts, but in their eyes. (Romeo and Jiuliet Act III)
  4. ** Herm - I would my father look'd but with my eyes. Thseus - Rather your eyes must with his Judgment look. (Mid-Nig-Dream)
  5. * Mir - Do you love me? Fer - O heavenǃ O Earth bear witness to this sound, Beyond all limit of what else in the world, I Do love, prize, honor you. Mir - I am a fool To weep at what I am glad of. Fer - wherefore weep you ? Mir - At mine unworthiness. that dare not offer What I desire to give; and much less take What I shall die to want, But this is trifling; And all the more it seeks to hide itself The bigger bulk it shows - Hence, bashful cunningǃ And prompt me, plain and holy innocenceǃ I am your wife, if you will marry me; If not, I'll die your maidː to be your fellow You may deny me, but I'll be your servant Whether you will or no. Fer - My mistress, dearest; And I thus humble ever. Mir - My husband, then ? Fer - Ay, here is my hand. Mir - And mine, with my heart in it. (Tempest Act III)