Jump to content

సాహిత్య మీమాంస/ఐదో ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఐదో ప్రకరణము

______

సాహిత్యమున మానవప్రేమ

మనుష్యత్వ నిర్వచనము

ఆర్యసాహిత్యమందలి ప్రేమాదర్శమున దేవత్వమూ పాశ్చాత్యసాహిత్యమందలి ప్రేమాదర్శమున పశుత్వమూ ఎట్లు రచింపబడినవో తెల్పితిమి. పాశవప్రవృత్తులకును దేవ ప్రవృత్తులకును మానవప్రకృతియే లీలాభూమి. మనుజులందు దేవత్వము విజృంభించినకొద్దీ పశుత్వ మంతరిస్తూండును. సూర్యోదయము కాగానే అంధకారము నశించునట్లు పుణ్యోదయ మయినతోడనే పాపము నశించును. యూరోపీయ సాహిత్యము పాశవప్రవృత్తి నడచుమార్గములను మాత్రమే బోధించును, మన సాహిత్యమువలె దేవప్రవృత్తి నుత్తేజిత మొనర్చు శక్తి దానికిలేదు.

ఆర్యసాహిత్యమున పాశవప్రవృత్తిదమనమునకు రెం డుపాయములు సూచింపబడినవి : _ పాపమందలి భీషణపరిణామముల పరికించి దానివిడనాడుట మొదటిది, పుణ్యస్ఫూర్తి సంపాదించి పాపమునకు దూరగులగుట రెండోది; ఇంతేకాక, పుణ్యము ప్రబలినకొద్దీ పాపము తనంతన తరిగిపోవు ననుటకు ప్రత్యక్షనిదర్శనముల జూపిస్తూ, పుణ్యమందును దేవత్వమునను ఉన్నతాదర్శముల నెదుటనిల్పి పాపమును పరిహరింప జేయుటయందు ఆర్యకవులు మంచి నిపుణత జూపిరి. అట్టి యాదర్శములయందు చిత్తమును జొత్తిలజేయుటే మనుష్యత్వ మనబడును.

మానవప్రకృతియందు పాశవప్రవృత్తులు ప్రబలియుండుటచే మనుజుడు స్వాభావికముగా వాటి నుపాసించుచున్ననూ, దేవత్వము వానిని తనవై పాకర్షించడము మానదు. పాశవ ప్రవృత్తులు దు:ఖభాజనములు, దేవప్రవృత్తులు సుఖాగారములు; మొదటివి క్షణికసుఖమే ఒనగూర్పకలవు, రెండోవి చిరస్థాయియగు సుఖమును చేకూర్చును: అవి సుఖదు:ఖముల కాకరములకును, ఇవి కేవల సుఖ మాపాదించి చిత్తముకు శాంతిని ప్రసాదించును. ఈ శాంతికై దేవురించు మానవుడు పాశవప్రవృత్తిని పరిత్యజించి, చింతనవల్లా వివేచనాశక్తిచేతా నిర్మలచేతస్కుడై ఎప్పుడును తత్సదుపాయములనే వెతకుచుండును. వీటిని పరిశీలించి వశపరచుకొనుటయందే వాని మనుష్యత్వము విదితమగును; పశుసీమ నాతడు దాటుటకు ముఖ్యసాధన మిదే. దేవతల కిట్టి సదుపాయములు వాటికవే ప్రాప్తించును, మనుజున కవి యత్న సాధ్యములగును; కావుననే మానవుడు దేవతలకన్న తక్కువవాడు. ఇట్టి యుపాయావలంబనము ఎవరికి సహజసిద్ధమౌనో వారియందు దేవత్వము వికసించును; ఇందు కనుకూలములగు నయరీతులు నియమములు హిందూసంఘమున కలవు; ఆ శిష్టాచారముల ననుసరించుటవలన మానవునకు పశుత్వపరిత్యాగము దేవత్వప్రాప్తియూ సిద్ధించును. వీటి నలవడజేయు సంయమమే హిందూ సంఘమునకు ప్రధానబలము; ఇది అతిశయించినకొద్దీ దేవత్వ ప్రతిష్ఠ ఉత్కృష్టమగును. హిందూసంఘ శిష్టాచారములు దేవత్వప్రాప్తికి కారణభూతము లగుటచే వాటిని త్యజించుట దేవత్వమును తొరగుట కాదా? *[1] ఈబంధములకు లోబడి సంయములు కాగలవాళ్ళు దివ్యత్వమున కహున్‌లవుదురు. ఇట్టి సంయమము సిద్ధించుటకు సానుకూలమగు సాధనయే మానవవిశిష్ట ధర్మమగును. ఇట్టి మనుషత్వమే ఆర్యసాహిత్యమున చిత్రింపబడినది.

సతీగౌరవము - తద్ధర్మబలము

పూర్వకాలమున భారతరమణులు సతీత్వగౌరవపరిపూర్ణలై వీరతయు సంయమమును వెల్లడిజేసిరని ఆర్యసాహిత్యము దెలుపుచున్నది. ఆ గౌరవస్ఫూర్తిచేతనే తమపవిత్ర శీలమును నిల్పుకొనుటకై వారు ప్రాణములవీడుటకు సయితము వెనుదీయలేదు. శత్రువుల వెఱపుచే నెందరో రాజపుత్ర మానినులు సర్వభక్షకున కాహుతులైరి. సతీత్వగౌరవాపేక్ష చేతనే హిందూసుందరులు పతుల యనంతరమున జీవింప నొల్లక వారితో సహగమనము సల్పుచుండిరి. కోరి అగ్నిలో బడువారి గౌరవనిష్ఠయు అంతరంగబలమును సర్వసామాన్యము లనజెల్లునా? ఆ బలము నాధారము గావించుకొని వా రలౌకిక సంయమ మగపరచి పతుల యోగక్షేమములకై పడరాని పాట్లుపడి, సకలదు:ఖముల సహించి, సర్వమున్నూ విడుచుటకు సన్నద్ధులై యుండిరి.

ఇప్పుడు సతీత్వగౌరవము సన్నగిల్లింది కావున మన స్త్రీల కంతరంగబల మంతరిస్తూన్నది. పూర్వుల ప్రవర్తనము కన్న ప్రబలోత్తేజన సాధన మింకొకటి మనము సృజింపగలమా? అట్టిచో సాటిలేని పురాతన సతీత్వగౌరవమును పోషిం చుట మన కవశ్యకర్తవ్యము. తదుత్తేజనమున మనస్త్రీజాతికి రానున్న బలము ధైర్యమున్నూ మేరు మందర సమానములు. నిర్లంఘ్యమగు ఆ బలము మనస్త్రీల కబ్బితే వారి కితరనైతిక ధర్మములతో ప్రసక్తిలేదు. కావున పురాతనసతీత్వగౌరవము నుద్ధరించు నుపాయముల కల్పించుకొని తత్ప్రతికూల సాధనముల బహిష్కరించుట మనకు విధి.

స్త్రీల సంయమబలము.

సతీత్వగౌరవము నిలువబెట్టుకొనుటకు కౌసల్య అపూర్వాత్మసంయమ మగపరిచింది. తనభర్త కై కేయికి పూర్ణముగా వశుడగుటచే సవతియు ఆమెచెలికత్తెలూ అన రాని మాట లనుచుండ, అవి, శల్యములవలె ఆమెమనసున నాటి అగ్నికన్న నెక్కుడుగ దహింప జొచ్చెను. అప్పటికేనా ఆమె పతియెడ ప్రేమ విడువక శ్రీరాముడు రాజగునప్పుడు తన దు:ఖములన్నీ అంతరించునను ఆసతోనుండి అట్టి సమయ మాసన్నమై ఆమె లోలోన సంతసించుచుండ, శ్రీరాము డామెను చేరంజని వనములకుబోవ అనుమతి వేడెను. ఆమె గుండె అప్పుడు శతధావ్రయ్యలై దృష్టిపథ మంధకారావృత మాయెను. వెంటనే హృదయమున శిశువాత్సల్య ముద్బోధ మగుటచే ప్రాణములకన్న ప్రియతరుడగు పుత్రుని వనమున కంపి అయోధ్యయం దామె ఉండజాలనని నిశ్చయించి, రామునితో వనమున కేగుటయే శ్రేయమని యెంచి, ప్రయాణోన్ముఖి యై ఎవ రేమిచెప్పినా పెడచెవిని బెట్టింది, కాని శ్రీరా ముడు సతీధర్మమును జ్ఞప్తికితెచ్చి, పతి నింటవిడిచి సతి వనముల కరుగుట అసంగతమని చెప్పగా మారుమాటాడక హృదయావేగమును కర్తవ్యనియమబలముచే నదిమింది. పతి ప్రేమయు పుత్రవాత్సల్యమును ఇరువంకల నామెహృదయము నాకర్షింప, డోలాందోళిత చేతస్కయై, కర్తవ్య మాత్మసంయమమునకు తోవజూప పతిని వీడి ఆ సతీమణి పదము పెట్టజాల కుండెను. పతిప్రేమతరంగము పుత్రవాత్సల్యతరంగము నణచెను, కావున పుత్రుని వీడ్కొని పతిసేవాపరాయణయై అయోధ్య యందే నిలువగల్గెను.

తండ్రియానతిచొప్పున రామునకు వనవాసమబ్బెను కాని లక్ష్మణు డేల నాతని వెంబడింప వలయు ? అ ట్లాతడేగిన వెన్కనైన సుమిత్ర అలమటింపదాయె! కౌసల్యకన్న ఈమె ధైర్య మెంతయెక్కుడో ఊహింప వశమా? ఆత్మసంయమ గాంభీర్యము రూఢ మగుటచేత ధైర్యము చిక్కబట్టి పుత్రుని వీడ్కొని పతిసేవాపరాయణ ఆయెను.

పాశ్చాత్యసాహిత్యమున ఆత్మశాసనప్రభావ మరయవలెనన్న షేక్స్‌పియర్ రచించిన ఇనబెలా చరిత్రము చూడండి. ఆమె ఐహికప్రేమ సర్వేశ్వరార్పిత మొనర్చెను. ఆర్య వితంతువు పత్యను రాగమును భగవదర్పణము చేయుచాడ్పున ఇనబెలా తన అనురాగమంతయు పరమేశ్వరునిపరము చేసి దైవప్రేమభరితయై బ్రహ్మచర్యము బూని ధర్మమఠము (convent) న ప్రవేశింపనెంచెను. ఆమె ధర్మానురాగ మత్యంత దర్శనీయము. ఇట్టి చిత్రము కాథోలిక్ మతధర్మముననే కవి చూపెను. ఆధునికవిమర్శకు లీమఠములను బౌద్ధమఠములతో పోల్చెదరు. ఆ తపస్విని తన సోదరుడగు క్లాడియస్ ప్రాణావనోత్సాహినియై అర్ధ రాత్రమున నొంటరిగా ఏంజిలో చెంత కేగ, అతడు కామనిశాతశరాహతుడై నిజహృదయ మామె కెరిగింప, ఆమెరోతగించి ధర్మకోపమున (righteous indignation) "నాసోదరుని ప్రాణముకు మారు నాప్రాణముల నిచ్చెదగాని, వాటిని నిల్పుటకు నేను ధర్మధ్వంస మొనర్చి నాశీలమునకు కళంకము సోకనీయన"నెను*[2] పిమ్మట ఆ సోదరుడు మృతియందలి భీతిచే "పాపప్రవృత్తురాలవై నాప్రాణము గాపాడితివేని అది పుణ్యమే యగున"ని నిరోధింప ఆమె గురుగంభీరస్వరమున "ఓరీ, పశువా ! దురాచారుడా! పిరికిపందా ! నీ సోదరీశీలమునకు కళంకమద్ది నీప్రాణము లుండ జూచుకొందువా? ఇది ఘోరపాతకముకాదా? సోదరిమాన మమ్మి నీప్రాణములుగొనజూచెదవా ? ఇట్టి తుచ్ఛుడు త్వరలో చచ్చుట మేలు," అని వెడలిపోవును. ఇసబెలా తనసతీత్వము పవిత్రతయు నిల్పుకొని ఆత్మసంయమ మాచరించెను. ధర్మానురాగపూరితయు పరమపూతచరితయు నగునామె ఏంజిలోను తిరస్కరించుట ఒక వింతయా ? ధర్మపరాయణ యగు నామెముందర పాపా కులచిత్తుడగు ఏంజిలో నిల్వగలడా ?*[3] ఇట్టియాదర్శము లిక కొన్ని షేక్స్‌పియరు నాటకముల యందుండిన కవి గౌరవ మధికతరమై యుండును.

కీచకునిప్రలోభనమున ద్రౌపది యిట్టి ఆత్మసంయమ మగుపరిచెను. ఈవిషయమున నీ సతీమణులిద్దరూ సమానముగా తులతూగుదురు.

పురుషుల సంయమము.

భరతునిసంయమము చూడండి. అయోధ్యాసింహాసన మాతని ప్రతీక్షించుచుండెను; తన్మార్గమును చక్కజేసి కైక దానిని భరతుని అరచేతిలో బెట్టెను: కాని గద్దియ నాతడాక్రమింప నియ్యకొనెనా? లేదు, తల్లిముచ్చటలు ముక్కలుచేసినాడు. రామలక్ష్మణులకు వనవాస మబ్బినందునకదా సింహాసన మాతనికి జిక్కెను ! తండ్రిగారు తరలిరి, కుటుంబమంతయు శోకాబ్ధిని కూలియుండెను, అయోధ్యయందు హాహారవ ముదయించెను, సామ్రాజ్యమంతటా సంతస మస్తమించెను; అట్టివేళ నాతడు సింహాసన మధిష్ఠింప దలచునా ? పోనీ - ఆ సద్దణగిన వెన్కనైన గద్దియ నారోహింపనెంచునా? కల్ల. హృదయము నలమియున్న భ్రాతృభక్తి ప్రబుద్ధమగుటచేత నాతడు తల్లిని దూషించి సింహాసనలోభమును త్యజించెను. పిమ్మట తా నెన్ని విధముల అనునయ వినయములచే శ్రీరాము నయోధ్యకు గొంపోవలయునని యత్నించినా ఆతడు రాకుండుటచే ఆతనిపాదుకలు సింహాసనమున నుంచి వాటి నర్చించుచూ అనాసక్తుడగు కింకరునివలె రాజ్యపాలన మాచరించుచుండెను. ఆత్మసంయమబలముచే ఆతడు అయోధ్యాసింహాసనమునే కాదు అమరేంద్రు సింహాసనమునైనా అధిరోహించుటకు అర్హత సంపాదించెను. అఖిలభూతముల హృదయపీఠ మలంక రించి విరాజమానుడు కావలసినవాడు అయోధ్యకు రాజు కాగోరునా? భ్రాతృభక్తిభరమున నతనికి మానుషత్వము తొలగి దివ్యత్వము సిద్ధించెను.

కచుని సంయమము కనండి. మృతసంజీవినీవిద్య నభ్యసింప నాతడు శుక్రాచార్యునొద్ద శిష్యుడుగాచేర ఆచార్యుని కూతురగు దేవయాని అతనియందు బద్ధానురాగ అయింది. ఎప్పుడు నొకచోట నుండుటచే ఆతనియెడ నామె రూపగుణ ముగ్ధయై నాల్గుసారు లాతని పునర్జీవితుని చేసింది; అప్పటికీ ఆతడు మరులుకొనలేదు. ఆమె తన్ను వలచినదని ఎరిగియూ గురుపుత్త్రికగాన నామెయెడ సోదరీభావ మూనియుండెను. విద్యాపూర్తి యైనతోడనే ఆతడింటికి మగుడ నుద్యుక్తుడగు నప్పుడు ఆమె మోహము నాపుకొనలేక వెల్లడించినా కచు డామె నొల్లడాయె. ఆదినుండియు నాతనియం దాత్మసంయమ మగుపడుచుండెను. ఆతడు ప్రత్యాఖ్యాన మొనర్చినపిదప దేవయానియం దాశక్తి ఆవిర్భవించింది.

చంద్రుడు, తార, ఇమోజిన్, హెలెనా, డెస్‌డెమొనా, జూలియట్ మొదలగువారియందు లేని ఆత్మనిరోధము కచ దేవయానుల చరిత్రములను దివ్యసౌందర్యకలిత మొనర్చెను. తద్దీప్తిచే ఇంద్రియలాల సాంధకార మంతర్ధానమాయెను. ఇట్టిదివ్యచిత్రములు పాశ్చాత్యసాహిత్యమున లభింపవు దేవత్వము పశుత్వమును శాసింపనేరదు; అట్టిసామర్థ్యము ఇంద్రియనిగ్రహమునకు మానుషత్వమునకు మాత్రమేఉన్నది.

భక్తిసంయతమైన ప్రేమ

ఆర్యసాహిత్యమందలి ప్రేమచిత్రము లన్నియు ఆత్మసంయమ ప్రభావగౌరవాన్వితములు. భక్తిచేతను ఆత్మనిగ్రహముచేత నెట్లు ప్రేమ సంయతమగునో చూడవలెనన్న ఒక్క కౌసల్యాపాత్రమునే కాక వాల్మీకి రచితములగు సీతాసుమిత్రల పాత్రములను కూడా పరిశీలించవచ్చును. వేదవ్యాసరచితములగు కుంతి, ద్రౌపది, గాంధారి, అరుంధతి, సావిత్రి, దమయంతి మొదలగు పాత్రము లన్నియూ ఉత్కృష్టోదాహరణములు. పురుషులలో రాఘవులు, దుష్యంతుడు, ద్రౌపదీవస్త్రాపహరణదృశ్యమున పాండవులూ అగుపరచిన ఇంద్రియనిగ్రహము అనిర్వచనీయము. భీముడు కోపావేశమున పండ్లుకొరుకుచు యుధిష్ఠిరునిపై దృష్టునినిల్పి ఆత డించుక కనుసన్న చేసెనేని ధార్తరాష్ట్రుల నందరినీ మట్టిలో కలిపివేయుటకు సిద్ధుడై యుండెను; జగదేకవీరుడగు విజయుడును కనులెఱ్ఱజేసి ధర్మజు నాజ్ఞను ప్రతీక్షించుచు దాయలనస్త్రాగ్ని కాహుతి జేయ సింసిద్ధుడై యుండె; ఈదృశ్యమున ఎట్టి ధైర్యము, ఎట్టి ఆత్మనిగ్రహము, ఎట్టి భ్రాతృభక్తియు ప్రతిఫలిస్తూన్నవో చూడండి. గుణవతియు, పతివ్రతయు నగు ద్రౌపది కెట్టి ఆపద ఘటిల్లినదో చూడండి! పాండుకుమారుల బలవిక్రమముల నూహించండి ! వారియొడళ్ళు ప్రతిక్రియాగ్నిచే భగ్గున మండుచుండుటచేత ఉష్ణరక్తము ప్రతిరోమకూపమును నించినది, శత్రువులు అధికారగర్వమున నవ్వుతూ గేలి చేస్తున్నారు, అవమానవహ్ని పరితప్తయగు యాజ్ఞసేని భీమార్జునులపై దీనదృష్టులు సారిస్తూన్నది, ఐనను భ్రాతృభక్తి, ధైర్యము, ఆత్మనిగ్రహమును కోపాంబునిధికి చెలియలకట్టయై వారి సర్వాంగముల నరికట్టుటచే ద్రౌపది అనాథయై

               శ్లో|| "హా కృష్ణా ద్వారకావాస క్వాసి యాదవనందన?
                     ఇమా మవస్థాం సంప్రాస్తా మనాథాం కిము పేక్షసి?"

అని మొరలిడుచు భగవంతుని శరణువేడ ఆత డామె మానమును సంరక్షించెను. ఈదృశ్యమందలి ఆత్మనిగ్రహ మింకొకదేశసాహిత్యమున గాంచనగునా?

ఆర్యసాహిత్యమున నిట్టి ఆదర్శము లెన్నో కలవు. వాటియందలి ప్రేమభక్తి సమున్నతము, స్నేహార్ద్రము. సీత ప్రేమ పతిభక్తియందు విలీనమగుటచే ఆమె చేసిన చేతలు, ఆడినమాటలును పతిభక్తిద్యోతకములు, అట్టిభక్తి అదృష్ట శ్రుతపూర్వము. భరతునియందును లక్ష్మణునియందును దోచున దిట్టిభక్తి యనవచ్చు. "ఉత్తర రామచరితము"న ప్రథమాంకమున సీత ప్రేమయు భక్తియు నిరూపించ బడినవి. తృతీయాంకమున శ్రీరాము డాప్రేమచే కాతరు డగును. సీతావియోగానంతరము తత్స్వర్ణ ప్రతికృతినే ధర్మపత్నిగా నిల్పి మనోవ్యాధిగ్రస్తుడై కాలము పుచ్చునపుడు ఆప్రేమయే ఆతనికి జీవాధారము. చతుర్థాంకమున కౌసల్యా జనకులప్రేమ కనబడును. ఈరీతిగా సీత వనమందున్నా కుటుంబప్రేమ తరంగములలో తేలియాడుచుండుటచే ఆప్రేమ ఉజ్వలతరమై ఆమెను శ్రీరామునకు ప్రేమసర్వస్వముగను, జనకున కాదరసామగ్రిగను, కౌసల్యాదులకు గృహలక్ష్మిగ నొనరించెను.

హిందువులలో స్త్రీలు అత్యంతాదరపాత్రములు, గృహలక్ష్ములు; తత్కుటుంబముల మానమర్యాదలకు వారే ఆధారములు; పతులను, నత్తమామల భక్తితో గొల్చుతూ పుత్రులను, మఱదులను స్నేహముతో నాదరింతురు. ఇంత ప్రాముఖ్యత చెందియూ వారు స్వాతంత్ర్యము, స్వేచ్ఛాచరణము నపేక్షింపరు. వారికదిలేని లోటులేదు. చూడండి.

               శ్లో|| "పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే
                     పుత్రస్తు స్ధవిరేకాలే స్త్రియోనాస్తి స్వతంత్రతా||"*

                     తండ్రి రక్షించు కౌమారదశను యవ్వ
                     నమున పెన్మిటి యోగక్షేమముల నరయు
                     ముసలితనమున పెంచును ముద్దుబిడ్డ
                     డుండ బోవదు స్వాతంత్ర్య మువిద కెపుడు.

సంతానమును తొమ్మిదినెలలును మోసి కని వారిని సదా లాలించి పాలింపవలయును గాన వారికి పరాధీనత స్వభావ సిద్ధము, ప్రాపంచికబంధము లెక్కుడు; భక్తి ప్రేమ స్నేహములచే కుటుంబములోని వారల బంధించి వారి ప్రేమపాశముల తాము తగులువడుదురు. ఈపరస్పరప్రేమ బంధమే హిందూకుటుంబసంస్థల దృఢపరచుచున్నది. అందువలననే అన్యోన్యప్రేమ పెరిగి సాంద్రము కాగా దానికిని భక్తికిని సమ్మేళనము సంభవించుచున్నది. ఇట్టి సమ్మిళన సూత్రము సంసారాంతర్వర్తి యగుట మనసాహిత్యా దర్శములందే కాంచనగును.

హిందూకుటుంబ నియమములు

ఆర్యసాహిత్యమున రచింపబడిన ప్రేమాదర్శముల యందు నాయికా నాయకులు పరస్పరమూ "నేను నిన్ను వలతును, దైవసాక్షిగా చెప్పుచున్నాను. నిన్ను తప్ప అన్యుల తలచను - ముమ్మాటి కిది నిజము, నీ వొకక్షణము కనబడకుంటే నాగుండె పగిలి ప్రాణములు నన్ను విడిచి పోవును." అని సంభాషించుట కానరాదు. ఇట్టి క్రయవిక్రయ సామగ్రిరూపమగు ప్రేమ హిందువులకు రుచించదు. తత్సంఘనియమానుసారము ఎవరి కేది కర్తవ్యమో, వారు దానిని ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించుటచేతనే యావత్స్నేహము, మమత, దయ, దాక్షిణ్యము, భక్తి, ప్రేమయు ప్రకటితము లగును. వివాహభారము మాత్రమే పెద్దలది, కాని తదనంతరమున భార్యాభర్తలు ఎవరికర్తవ్యమునకు వారు మనసార పూనుకొందురు. రూపపిపాస ఇంద్రియలాలసయు చరితార్థమొనర్చుటే ఆర్యవివాహమునకు ముఖ్యోద్దేశముకాదు గనుక పెళ్ళి వధూవరుల వశమున నుండదగదు. పతియాజ్ఞకు సతి సతియాజ్ఞకు పతిబద్ధులై యుండవలెనను కుటుంబనియమమునకు వారినిద్దరినీ బద్ధులను జేయుటకే వివాహము సృజింప బడినది; నీతిదాయకమూ ఉభయతారకమూ నగు ఈసంసార శృంఖలమున వారిని త్వరగా బద్ధులను చేయడమునకు పెద్దలు పిన్న వయసుననే బాలకులకు వివాహ మొనర్తురు. యవ్వన స్రోతముప్రవహించి రిపుషట్కముప్రబలునప్పటికే దంపతులు సంసారశృంఖాలాబద్ధు లయ్యెదరు, ఆ సంకెళ్లు తెంచుటకు తగినసామర్థ్యము వారి కలవడదు - అన్నివైపులా ఆలానములే, వాటి నూడబెరుకుట సామాన్యులకు వశము కాదు; పరమ భాగవతు లట్లు చేయగలరే కాని ఇతరుల కది చేతకాదు. ఇట్టి నిర్బంధమే లేకుంటే హిందూకుటుంబము లొక్క అడుగు ముందుకు వేయలేవు. యౌవన మంకురించినతోడనే యథేచ్ఛాచరణ మలవడుట హిందూసంఘమం దసంగతము. ఇట్టి కట్టుబాటులతో విలసిల్లు సంఘమున ప్రేమను దండోరా వేసి చాట నక్కరలేదు. అది బాల్యముననే అంకురించి, యౌవనమున వెలుగొంది, సంఘనియమానుసారము అభివృద్ధి చెందుతూ సంసారమను మహాయజ్ఞమున సంపూర్ణవికాసము నొందును. దంపతీప్రేమ పిన్ననాడే అంకురించి, నిరంతరమూ కలిసిమెలసి యుండుటచేతనూ, గృహకృత్యముల నిర్వహించుచుండుట వల్లనూ, సంతానము కని పెంచుచుండుటచేతా కాలక్రమమున పెంపొంది, బంధుసంపర్కము సాంద్ర మైనకొద్దీ మమత హెచ్చి రోగము, శోకము, సేవ, యత్నము మొదలగువాటిచే పరిపూర్తి చెందును. ఇది ఒకటి రెండు వత్సరములలో అంతరించేది కాదు, యావజ్జీవము సాగుచుండ వలసిందే!

ఐరోపీయ సంఘములం దిట్లుండదు. స్త్రీపురుషులు యవ్వనవంతు లగుదాకా వారికి వివాహము కాదు, సంసార ధర్మము లుండవు, స్వచ్ఛందులై వారు జీవములను గడుపుచుందురు. ఇంద్రియలాలస వారియందు ప్రబలముగా నున్నా దానికి తగిన వ్యవస్థ లేర్పడియుండవు, కుటుంబనియమము లుండవు. సాధారణులకు ధర్మము కానీ, కర్తవ్యజ్ఞానము కానీ లేవు, ఉండినా అవశ్యాచరణీయములు కాకుండుటచే ఆత్మనిగ్రహమున కనుకూలపడవు. అందుచే యౌవనప్రవాహమున కొట్టుకొనిపోతూ ఎవ రెక్కడ తేలుదురో టికానా లేదు. ఇంద్రియప్రాబల్యము నణచడము సులభసాధ్యము కాదు గాన సంసారనియమములు దృఢముకానిచోట్ల యువకులు స్వేచ్ఛాచరణు లగుట సంభవింపక తీరదు.

హిందూ కుటుంబప్రేమ వికాసము

ఆర్యప్రేమాదర్శమున దంపతీప్రేమ పరమశాంతమయ్యు వర్థిష్ణువై తరంగిత మగుచున్నది. అది పూర్వానురాగబలమున వృద్ధిచెందును. అల్పవయస్కులగు దంపతుల ప్రేమయందు పూర్వానురాగప్రవాహము అంతర్వాహినియై వెల్లివిరియ యత్నించునప్పుడు ఆప్రేమస్రోతాభాసమును గని పెద్ద లానందింతురు. అది బైట కెక్కడ ఉబుకునో అను భీతిచేత నవోఢ లెంతో కష్టమున దానిని దాచయత్నిస్తారు, కాని అణచినకొద్దీ అతిశయించి మెరుపుమెరసినట్లు అప్పుడప్పు డది తేటబడుచుండును. అది అప్రకాశ మగుటచేతనే అతి ప్రశాంతముగనూ ఈషన్మాత్రసంకేతరూపముననూ హిందూసాహిత్యమున చిత్రింపబడినది. నవోఢానురాగము రానురాను ప్రౌఢమై ముగ్ధను ప్రౌఢగా నొనర్చి గృహిణిని చేయును. సంసారమంతా గృహిణీప్రేమ పూరితము; ఆప్రేమ కుటుంబమంతటా వ్యాపించి, మరిది, అత్త, మామ, బావ, పుత్రుడు, పుత్రికలయందు సంక్రమించును. ఇట్టి చిత్రము లనేకములు ఆర్యసాహిత్యమున కలవు. కౌసల్య, గాంధారి, సుమిత్ర, కుంతి, సీత, ద్రౌపది మొదలగు పాత్రము లిట్టి చిత్రములే. వయసుమీరిన ఆర్యవనితలెల్ల సంసారమాయా మోహబద్ధులగుట కిదే హేతువు. వారిహృదయములు స్నేహసముద్రములు కావుననే కుటుంబమంతా వారికి వశమగును. గౌతమీ కౌసల్యల వాత్సల్య మిట్టిదే; వారి మాట నెవ్వరూ జవదాటరు.

ఆర్యసాహిత్యమున శృంగారము

ఈప్రేమను వర్ణించుటకు కాళీదాసప్రభృతి మహాకవులు శృంగారరసము నవతరింపజేసి దాని కనేక భావ భంగులు నిరూపించిరి. ఈవర్ణనలు చూపి చాలామంది ఆర్యసాహిత్యమున ఇంద్రియలోలత్వము వర్ణింపబడలేదా అని ప్రశ్నిస్తారు. అది లే దనము. చంద్రునియందు కళంకమువలె ఆవర్ణన లాసాహిత్యమునకు శోభాయమానములని యెరుగవలెను.

                 "మలినమపి హిమాంశోర్లక్ష్మ లక్ష్మీంతనోతి" కాళిదాసు
                 "చలువల రేనికిం జెలువొసంగు మలీమసమయ్యు నంకము."

ఆర్యసాహిత్యమున సుధానిధివలె కావ్యరసము వెల్గుచున్నది, కావున అట్టి కళంక మొక వ్యాఘాతము కాదు. చంద్రుడే లేనిచోట కళంకము కళంకమువలె నుండిపోవును.

ఆర్యవాఙ్మయమున శృంగారరసము పెక్కుచోట్ల వర్ణింపబడినది. మనకవులు రసస్వభావము చక్కగా నెరిగిన వారౌటవల్ల ఏరసముచే హృదయము కరిగింపవలెనో కావ్య సమాప్తి యగుసరికి ఏరసము స్థాయీభావము చెందవలయునో, నిపుణతతో గుర్తించి కావ్యముల రచింతురు. అందుచేత కొన్నిటియందు వీరరసము, కొన్నిటియందు కరుణ, మరికొన్నిటియందు మరికొన్ని రసములున్నూ ప్రాధాన్యము చెందినవి. వీటిలో ఒకటిగాని రెండుగాని ప్రధానముగా నెంచి వాటికి తోడు మరికొన్ని రసములు కూర్చి, అంతర్విరోధము ఘటిల్లకుండునట్లు రచనచేస్తే కావ్యము భిన్నరసాలంకృత మయి, అది పరిసమాప్తి యగుసరికి చిల్లరరసములన్నీ మాటుపడి స్థాయీభావము నొందిన ప్రధానరసమే నిలిచియుండును. అందుకే "వాక్యం రసాత్మకం కావ్యమ్" అని ఆలంకారికులు నిర్వచనము చేసిరి.

స్త్రైణ శాసనము

హిందూకుటుంబములయందు దంపతీప్రేమ వ్యవస్థానుసార మెట్లు పెరుగునో దిఙ్మాత్రముగ వివరించితిమి. పతియెడ పత్ని కనురాగము ఏకనిష్ఠమై అతిశయించినకొద్దీ పతికికూడా పత్నియెడ అనురాగము పెరుగుచుండును, కాని అట్టి దృష్టాంతములు తరచుగా కనబడవు. సీత రాముని ప్రేమించినట్లే శ్రీరాముడున్నూ సీతను గాఢముగా ప్రేమించెను. పతియెడ ఏకానురక్తయై కాలముపుచ్చుచుండుట సతికి సానుకూలమే, కాని పత్నీప్రణయపాశైకబద్ధుడై తదితరకర్తవ్యముల నుపేక్షించుట పతికి తగినపని కాదు. పత్నియెడ మిక్కుటమగు అనురాగము పక్షపాతమున్నూ చూపుట స్త్రీలోలత్వ మనిపించుకొనును.*[4] అట్లొనరించినయెడల సంఘమున కల్లోలమావిర్భవించి తీరును. గృహస్థు భరింపవలసినది కేవలమతని భార్యయే కాదు, కుటుంబమంతటినీ అతడే భరింపవలయును. రాజైనచో విశాలసామ్రాజ్యమందలి ప్రజలకెల్ల పతి యగును, వారి నుద్ధరించుభార మాతనిపై బడును. పత్నీకర్తవ్యము కుటుంబసీమను దాటిపోదు, పతికర్తవ్యమో, ప్రపంచమంతటా ప్రాకును. ఇట్టి కర్తవ్యతాజ్ఞానమును మదిని నిల్పి భార్యాసక్తిని తనవశమం దుంచుకోవడ మత్యావశ్యకము. ఇట్లు చేయుటకు శక్తి లేకపోవుటచేతనే మేఘదూత యందలి యక్షునకు కుబేరుడు దేశాంతరవాసశిక్ష విధించెను. యక్షుని అగాధపత్నీప్రేమ అజరామరమగు కాళిదాసు లేఖినిచే కావ్యరూపమున చిత్రింపబడినది. ఇంకొక దిక్కున చూడండి - శ్రీరామచంద్రుడు ప్రజానురాగమునకు వశవర్తియై సీతను వనముల కంపెనుకదా, భార్యపై ఆతనికి ప్రేమ లేదనుకోవచ్చునా?... ఆర్యసాహిత్యమున గాఢమైన పతిప్రేమకు పతిభక్తి అనిపేరు; అగాధమగు పత్నీప్రేమ పత్నీభక్తి కాదు, స్త్రైణత అనబడును, ఇదే స్త్రీలోలత్వము. హిందూ సంఘమున నియమరక్షణార్థ మేర్పరుపబడిన వ్యవస్థల పాటించుటే మనుష్యత్వ మనబడును.

స్వాధీనత - స్వేచ్ఛావృత్తి

హిందూసంఘ నిర్మాణమునుబట్టి మానవప్రకృతి యందలి పశుభావము వికాసము చెందనేరదని మనమూహింప వచ్చును. దేశాచారములన్నీ మనుష్యత్వము దేవత్వమూ పోషించుట కనుకూలించును గనుక వాటియధీనమున నుండుటే మానుషత్వ దేవత్వముల అధీనమున నుండుట. స్త్రీపురుషులు మానుషత్వసీమను దాటకుండునట్లు వారిని నియమబంధములలో నిల్పి యుంచడమే సంఘనీతికౌశలము పశుత్వమువీడి దేవభావా శ్రయముననుండడము చేతనేమానవులకు ఆత్మనిగ్రహమలవడుతుంది. దీనికితోడు పరమార్థపరతంత్రత సిద్ధించిందా మనుష్యునకు స్వాధీనత చిక్కినట్టే. ఆత్మపరమార్థపర మగునప్పుడే నిజమైన స్వేచ్ఛ (Freedom, Liberty) అలవడిన దన్నమాట. ఇట్టి స్వాధీనత పోగొట్టుకొని ఇంద్రియములకు వశులై వాటిచిత్తమువచ్చిన రీతిని మెలగువారు స్వాధీనులు కారు, ఇంద్రియేచ్ఛాధీనులు. ఇది నిజమైన స్వేచ్ఛా కాదు, శ్రేయోదాయకమూ కాదు. దీనికి స్వైరవిహారము (License) అని పేరుపెట్టవచ్చును. ఇట్టి స్వచ్చందవిహారమును విడిచి శ్రేయోదాయకము ప్రకృతిసిద్ధమునగు స్వాధీన పథమున సంచరించువారు మానుషత్వమునకు తగినవారు. మనదేశాచారముల ననువర్తించుటచేతనే ఇది సిద్ధిస్తుంది - అట్టి పదవికి సాధనభూతమైన ప్రేమప్రవృత్తి హిందూసంఘనియమములం దంతటా కద్దు, ఆర్యసాహిత్యమున కలదు.

ఆర్యసాహిత్యమున ప్రేమగౌరవము

ఆర్యసాహిత్యమున ప్రేమవికాసము భక్తియందు తేట బడును; అందే పుట్టి, అందే పెరిగి, అందే పరిణతి చెందును. ఇట్టి గౌరవము పాశ్చాత్యసాహిత్యమున గానరాదు. పతిభక్తి, భ్రాతృభక్తి, పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, వాత్సల్యము, భార్యానురాగము, శిష్యానురాగము మొదలగు ప్రేమవికాస భావములు అందు లేవు. సీత, లక్ష్మణుడు, శ్రీరాముడు, యుధిష్ఠిరుడు వంటివా రున్న చోటులందే ప్రేమగౌరవ ముండును.

బాల్యవివాహముల పరిణామము

ఆర్యుల ప్రేమాదర్శములయందు ప్రేమగౌరవమే కాక ప్రేమసౌందర్యము కూడా కలదు. సీతాపాత్రము సుందరమని ఒప్పుకొంటే ప్రేమసౌందర్యమహిమను మెచ్చుకొన్నట్లే. అట్టి నిసర్గప్రేమచిత్రములు మన సాహిత్యమున అనేకము లున్నవి. స్త్రీలయందు నిసర్గ ప్రేమను పాదుకొల్పుటకే హిందువులందు బాల్యవివాహము లేర్పడినవి. కోమలమతులగు బాలికల నూత్నానురాగము భర్తలయందూ గురుజనము నందున్నూ చిన్నప్పటినుండీ నిక్షిప్తమగును. హృదయమందు ప్రేమకళిక దరవికసితము కాకపూర్వమే కోమలస్వాంతలగు కన్యలు యోగ్యులగు పతుల కర్పించబడుదురు. ఆప్రేమ నానాటికి వికసించి యౌవనప్రాదుర్భావమున నుదయించు అనురాగముచేత వృద్ధిచెంది పత్యర్పిత మగును. కిశోరావస్థ నుండీ అత్తవారింట లాలనపాలనముల నొందుచుండుటచేత అచ్చటివారియందు మమతభక్తి పెరిగి పెద్దలను సేవించునిచ్ఛ ప్రబలమగును. అందుచేత ఆర్యకుటుంబములు స్త్రీజనమునకు ప్రేమాలవాలములు, శాంతినికేతనములయి వారిమానసములందు చాలాసద్గుణములు సంచితము లగును. పాతివ్రత్యము, ప్రేమ, స్నేహము, మమత, భక్తి, సారళ్యము, సత్యానురక్తి, దయ, క్షాంతి, ధైర్యము, శాంతి, దాంతి, కోమలత్వము, అణకువ, సాజపుసిగ్గు, ఓపిక మొదలగు గుణ ములచేత వారు భూషిత లగుదురు. *[5] మన సాంఘిక వ్యవస్థలకూ, శిక్షకూ, బాల్యవివాహములకూ పరిణామ మిది ఈ వ్యవస్థలను తారుమారు చేస్తే ఫలము వికటించును, కావున ఈ యాచారమునకు భంగము వాటిల్లకుండా మనము పాటుపడ వలయును. **[6]

విదేశీయప్రేమయందలి పతిపత్నీ సామ్యభావము

హిందూసంఘములయందును, కుటుంబముల యందున్నూ దృఢబంధమై గానవచ్చెడు భక్తి అను అపూర్వ పదార్థము విదేశీయసంఘములందు లేనందున తత్సాహిత్యమునందు కూడా అది మృగ్య మగుచున్నది. వారి దాంపత్యమునం దెచ్చుతగ్గులూ, ఒక రొకరియధీనమున నుండుటయూ లేవు. ఆప్రేమ అంతా వినిమయము - ఇచ్చి పుచ్చుకొనుట. "నీవు నన్ను ప్రేమించితివా నేను నిన్ను ప్రేమించెదను. అట్లుకాదేని నీవు వేరు, నేను వేరు; నీదారి నీది, నాదారి నాది." ఇది వారి దాంపత్యసరణి! పతిపత్నీ త్యాగము, స్త్రీలకు బహువివాహములు, యౌవనమున స్వేచ్ఛాచరణమును వారికి సదాచారములు కావున స్వచ్ఛందవృత్తి, పతిపత్నీసమత్వము వారియందు ప్రబలమై యుండును. ఆ సాహిత్యమందున్నూ ఆరెండుధర్మములే ద్యోతకము లగుటచేత దానినే సదా పఠించువారి మానసములందు స్త్రీలు పురుషులకు లొంగి తిరుగ నేల? పురుషులకంటె వారి తక్కువ ఏమి? ఇది అన్యాయము, పతిపత్నీ సామ్యభావము న్యాయము, అను రూఢాభిప్రాయము కలుగును. ఇట్టి భావములు మన సాహిత్యమునా ఇప్పుడిప్పు డవతరిస్తూన్నవి, నవనాగరికు లీ నూతనాదర్శములను పొగడుచున్నారు. మన సంఘనియమము లనుకరించు మన సాహిత్యమున ఈభావమునకు చోటులేదు, ఒకవేళ మనము చేర్చినా అది తక్కినవాటిలో యిముడదు; ఆచరణ మోలాగు అభిప్రాయ మోలాగూ ఉంటే ఉపద్రవము వచ్చితీరును. వివాహబంధమున తారుమారులులేక పతిపత్నీ సంబంధము జీవావధియై, భక్తి ప్రేమసూన్యతమై, సతీత్వలీలాక్షేత్రమైన ఆర్యసంఘమున సరళత, ప్రేమ, కోమలత, లజ్జ, దయ, ఓరిమి మొదలగు గుణములు స్త్రీజనమున కలంకారములుగ నున్నవి కావున పతిపత్నీసమత ప్రబలిందా ఆచారవిప్లవము తప్పక సంభవించును. మనసంఘమున ఎచ్చుతగ్గులూ, ఆత్మనిగ్రహమూ (స్వాధీనత) ఉండవలెను. పాశ్చాత్యసంఘములందున్నది స్వేచ్ఛాచరణము.

ఆర్యసాహిత్యసమాలోచ నావశ్యకత

ప్రాచీనప్రతిష్ఠితములు, భక్తిప్రేమపూరితములు నగు మన సంఘరీతు లంతరించి పాశ్చాత్యసంఘమర్యాద మనదేశమున ప్రతిష్ఠితము కావలెనని కోరువారుందురా? ఈరెండింటి ఘటనాప్రణాళులు విపరీతములనీ, తత్ప్రేమాదర్శములు విషమములనీ ఉదాహరణలతో నిదివరలో వివరించియుంటిమి. ఆర్యప్రేమాదర్శమున భక్తిశ్రద్ధాది ఉత్కృష్టప్రవృత్తుల ఉత్తేజనము, స్పూర్తి, ధర్మనీతిప్రాబల్యము నున్నవి, పాశ్చాత్యాదర్శమున షడ్రిపుప్రాధాన్య ముంది; రిపుషట్కము అస్థిరమగు నింద్రియసుఖానుకూలము. మన ఆదర్శమున ధర్మ నీతిశాసనాధీనత యుంది, వారి యాదర్శమున స్వార్థపరత్వము పతిపత్నీ సమతా యున్నవి. ఇందు యథార్థమైన స్వాధీనత, అందు స్వేచ్ఛావృత్తియు నున్నవి. ఇట్టివైషమ్యము గల ఆదర్శములకు ఏకత్ర సమావేశ మెన్నటికీ సరిపడదు. మన ఆదర్శములను మాని వారి యాదర్శముల నవలంబిస్తే కొత్త భావములు మనహృదయములందు నాటి కాలక్రమమున స్వదేశగౌరవము సన్నగిల్లును. పవిత్రము సుప్రతిష్ఠితము నగు మనసంఘమును దోషసంకులమగు విదేశాచార సంసర్గమున పంకిలము చేయరాదు. దేవత్వమానుషత్వముల వీడి పశుత్వమున పడగోరు వీరిడి యుండునా?

మనయాచారములలో లోపములున్న కాలానుసారముగా వాటిని దిద్దుకోవలయు గాని సరికొత్త పుంతలలో జన కూడునా? ఇట్టి యాపద లక్కడక్కడ పొడచూపుచున్న వే, అవి తొలగుటెట్లు? విదేశసాహిత్యపఠనము మనకు తప్పనిసరి యైనది; పొట్టపోసుకొనుటకే కాదు, అది చదువుకున్న చాలా విషయములకు మనము వెలియగుదుము. కావున తత్పఠన మొనర్చుచూ అందలి నీచభావములు మనహృదయములందు కుదురుకొనకుండా జాగరూకతతో గమనించవలెను. విదేశ సాహిత్యముతో బాటు మనసాహిత్యముకూడా పఠించడమే ఆ విషమునకు విరుగుడు. రెండోది మన కుటుంబాచారములను విదేశదురాచారపన్నగము కరవకుండునట్లు నడపవలెను. అనాదినుండీ ఏ సాహిత్యపఠనమున మనసంఘమునకు సద్గుణము లలవడి అది వీఇతము సుశిక్షితము నయ్యెనో, అట్టి సాహిత్యమునకు విముఖులము కాకుంటే మనకు తప్పక శుభము చేకూరును. అందలి సాధుత్వము, పవిత్రత, సంయ మము, వినయము, నీతిసౌందర్యము, మహోపదేశములూ మనమానసములయందు బాగా నాటితే విదేశదుర్భావములను బహిష్కరించి మనసంఘము విధ్వస్తము కాకుండునట్లు జాగ్రత్తపడవచ్చును.


  1. * వేదవిహితంబులును శాస్త్రవిహితములును శిష్టచరితంబులునుననజెప్పనొప్పి ధర్మములు మూడువిధముల దనరుచుండు కడగి యిన్నియు సద్గతికారణములు

                         దానంబు సత్యంబు తపము యజ్ఞము నార్జవము కామలోభాది వర్జి తంబు గురుజన శుశ్రూష క్రోధరాహిత్యంబు దమము సంతోష మధ్యయననిరతి దాంబికత్వములేమిదైన్యంబువొరయమి, అనసూయ అనహంక్రియాభియుక్తి తలపంగ నాద్యమైతనరు ధర్మమునెప్డుకొని యాట నాస్తికగోష్టి జనమి శీలసంరక్ష తీర్థసంసేవ శౌచ మఖిలభూతంబులందు దయార్ద్రుడగుట మితహితోక్తులు సంశ్రిత మిత్రగుప్తి ఇన్నియును శిష్టచరితంబు లిద్ధ చరిత. అనయంబున్ శమవంతుడై వినుత శిష్టాచార మార్గంబులం జను పుణ్యాత్ముడు దుర్గతుల్ గడచి ప్రజ్ఞాహర్మ్య సంరూఢుడై కనుచుండుం బటు మోహపంకజల మగ్నంబైన లోకంబు వీ కనధోభాగమునందు డింది కడుదు:ఖం బొందగా నవ్వుచున్|| .........నన్నయ

  2. * Isabella - Oǃ were it but my life, I'd throw it down for your deliverance As frankly as a pin............ And shamed life is hateful. Claudius - Sweet sister, let me liveː What sin you do to save a brother's life, Nature dispenses with the deed so far. That it becomes a virtue. Isabella.... O you beast ǃ O faithless coward ǃ O dishonest wretch ǃ Wilt thou be made a man out of my vice ? Is't not a kind of incest, to take life From thine own sister's shame? ........................................ O fie, fie, fie ǃ Thy sin is not accidental, but a trade, 'T is best that thou diest quickly. Measure for measure Act III
  3. * But virtue, as it never will be moved Though lewdness court it in a shape of heaven, So lust, though to a radiant angel linked Will sate itself in a celestial bed And prey on garbage. అలమి పోకిరితనము స్వర్గాకృతిగొని కోరిన చలింపబడదు సుగుణ మొకప్డు దివ్యమూర్తిని గలిసియున్ దృప్తిపడక గుహ్యచాపల్య మెంగిలికూళ్లుగుడుచు. ఆ|| నా|| దా|| Hamlet Act I
  4. * ఈ వాక్యమును చదివినవారు నాపై కోపగింతురేమో? ఈ అభిప్రాయము అత్యంత సంకుచితము (Narrow) పక్షపాతపూరిత మందురు కాబోలు? కాని పతిపత్నులు అన్యనభావసంకలితులైనట్టైతే ఇతర ధార్మిక, సాంఘిక, నైతిక వ్యవస్థలు నిర్వహింపబడనేరవు.అత్యధిక భావానురక్తి ఆపజ్జనకము. "అనాసక్తః సుఖం సేవేత్" అని కావ్యముల సదుపదేశము. దుష్యంతుడు శకుంతలపై మొట్టమొదట అత్యధికానురాగము ప్రకటించెననే మనము భావింపవచ్చును. కాని అప్పుడైనా అతడు కర్తవ్యము మరచెనా? చూడండి__ అనసూయ __ వయస్య, బహువల్లభా రాజానః శ్రూయంతే. యథా అవయోః ప్రియసఖీ బంధుజనశోచనీయా నభవతి తథా నిర్వాహయ. రాజా__భద్రే, కిం బహునా__

               పరిగ్రహబహు త్వేపి ద్వే ప్రతిష్ఠే కులస్య మే
               సముద్రరశనా చోర్వీ సఖీ చ యువయో రియమ్.

    అన___వయస్యా, రాజులు బహువల్లభల పరిగ్రహించువారని వినికి, మా ప్రియసఖి బంధుజనశోచనీయ గాకుండు విధ మాచరింపవలయును.

    రాజు__కళ్యాణీ, పెక్కుమాట లేల?

    క. కలిగిన బహుభార్యలు, మత్కులప్రతిష్ఠలుగ నుండుదురు వీరిరువుల్,
    జలనిధి మేఖలయయితగు నిలయును స్మరజీవనాడి యీ మీ చెలియున్.

    చూచితిరా? రాజులకు బహుభార్య లుందురు, వారిలో నెవ్వరికీ ఏ లోటూ రాకుండా చరించుట చాలా కష్టము. ఐనా, మా శకుంతల కేలోపమూ లేకుండా మీరు కనిపెట్టిచూడండి అని అనసూయ వ్యంగ్యముగా రాజులు స్త్రీలోలులు కాకతప్పదని నిర్ధారణ సూచించింది. అది గ్రహించి తనకులగౌరవము నిలువపెట్టుకొనడానికి - "నాకు చాలామంది కాంతలున్నా అందు ముఖ్య లిద్దరే - మొదటిది భూమి, రెండవది మీ శకుంతల అని జవా బిచ్చి నాడు - దీని అర్థ మిది - రాజుకు ప్రథమగణ్యము రాజ్యము, దానిని సరిగా పాలించుట అతనికి ముఖ్యవిధి - భార్య - తదితర స్త్రీలి, భోగములూ గౌణములు (Secondary) గాని ముఖ్యములు కావు - రాజ్యపాలనము వెనకబెట్టి భార్యలూ భోగములూ సర్వమని భావించుట తప్పు అని సూచించి రాజులు స్త్రీలోలురను వాదమును ఖండించి పూర్వపక్షము చేసినాడు -

    పురుషుడు స్త్రీకి వశుడయ్యెనా ప్రాచ్యపాశ్చాత్యసంఘములకు భేదమే యుండదు. హిందువులారా, పాశ్చాత్యరీతుల ననుసరింపకుడు, మన పురాణములోని శ్రీకృష్ణుని స్త్రీలోలత్వము ననుసరింపక శ్రీరాము నాదర్శముగా గొనుడు. కామినీవాగురుల జిక్కి కర్తవ్యమును త్యజింపకుడు.

  5. * పడతులు అత్తింట నేర్చుకొనదగు నంశముల నన్నిటిని కాళిదాసు కణ్వమహర్షిచే నిట్లుచెప్పించెను -

                   శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియసఖీవృత్తిం సపత్నీ జనే
                   భర్తుర్విప్రకృతాపి రోషణతయా మాస్మ ప్రతీపంగమ:
                   భూయిష్ఠం భవ దక్షిణాపరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
                   యాంత్యేవం గృహిణీపదం యువతయో వామా:కులస్యాధయ:||

                   పనివిని కొల్వు పెద్దల; సపత్నులచోట ప్రియాళివృత్తిగై
                   కొను; పతియల్గ నల్గి ప్రతికూలవుగాకుము; భోగభాగ్యముల్
                   గనుగొని పొంగబోకు, దయకల్గుము సేవకులందు, నాతి గాం
                   చును గృహిణీపదం బిటులు; చూడగ లాతి కులాధియే సుమీ.

  6. ** ఈ యభిప్రాయము సమంజసమని నాకు తోచదు. బాల్యవివాహమున గుణమున్నది, దోషము లున్నవి; దోషములే ఎక్కువని చెప్పవచ్చును. వాటిని రూపుమాపకుంటే బాల్యవివాహము దురాచారమనే నాతలంపు. దోషము లందరికీ స్పష్టమగుటచేత ఇక్కడ విస్తరింపలేదు. ప్రౌఢవివాహము లాచరణములోనికి వచ్చేదాకా యువకులచెవులను బాల్యవివాహదూషణము సోకనీయరాదు. మొదటనుండీ సత్సహవాసము, నైతికశిక్ష, సద్గ్రంథపఠనము మొదలగు పరిస్థితులను సమకూర్చుట యుక్తము. యువకులు బ్రహ్మచర్యము పాలింపలేక, అభిభావుకు లందుకు తగిన ఏర్పాటులను చేయనేరనిచో బాల్యవివాహము లొనర్చుటయే మేలు