Jump to content

సాహిత్య మీమాంస/ఆరో ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఆరో ప్రకరణము.

______

సాహిత్యమున వీరత్వము.

వీరుల ఆదర్శము

ఆర్యకవికులగురువగు వాల్మీకి సీతపాత్రమున సతీత్వ పరమావధి నిరూపించినట్లు శ్రీరామపాత్రమున వీరత్వపరమావధి నిరూపించెను. ఆర్యలలనాసౌందర్యము, ప్రేమ, భక్తి, దేవత్వమూ సీతయం దగుపడును; ఆర్యపౌరుషము, గౌరవము, వీరత్వము, రాజవైభవదివ్యతేజమున్నూ శ్రీరాముని యందు గాంచనగును. కులమునకూ జాతికీ గౌరవము తేవడమే ఆర్యుని ముఖ్యకర్తవ్యము, శ్రీరామునియం దిదే కనబడును. ఆతడు రఘుకులతిలకుడు, క్షత్రియశేఖరుడు. అట్టి గౌరవ మగపరచుటకే వాల్మీకి మొదట దశరథుని పాత్రమును చిత్రించి అందు సౌర్యము, రాజ్యశాసనచాతురి, ప్రభుత్వము, యశము, మంత్రణ, కార్యకౌశలము, సంపద, సహృదయత, దుర్గసంపత్తి, చతురంగబలము, ధర్మపరాయణత, తపస్సు, విద్య, వివేకమున్నూ వర్ణించి చూపెను. అయోధ్య యందలి అప్పటి సుఖము, సంపద, సౌందర్యమునూ గాంచి చకితుల మగుదుము, అతనికి సముడు మరొకరాజు లే డనిపించును. కాని అనంతరము ఆతనికన్న నుజ్జ్వలతరమగు నక్షత్ర మారాజకులాకాశమున పొడుచును, తత్ప్రభావమును విశ్వామిత్రు డందరికీ ఎరిగించును. రఘుకులమం దుదయించిన ఆ వీరశిఖామణి "కూకటిముడికినై కురులు కూడని నాడె" ఋష్యాశ్రమములందలి రాక్షసపీడయు తపోవిఘ్నములు నంతరింపచేయగలడని ఆ ముని జ్ఞానదృష్టిచే గాంచగల్గెను, కనుకనే నిండోలగమున తనవెంట శ్రీరాముని పంపుమని దశరథుని ప్రార్థించునప్పుడు శ్రీరాముని ప్రభావము విదితమై మన కాతనియెడ గౌరవము పుట్టును; ఆ దివ్యనక్షత్రప్రభ అప్పుడు మనకళ్ళకు గట్టును. ఈలాగే పరమభాగవతుడగు నారదముని మూలాన శ్రీకృష్ణప్రభావము లోకమునకు విదితమగును.

వీర కార్యనిర్వహణముకోసము విశ్వామిత్రుడు శ్రీరాముని కొనిపోయినపిమ్మట అత డాకఠినకర్మయందు కనపరచిన వీర్యశౌర్యములు వాల్మీకి చక్కగా వర్ణించెను. అంతతో నాగక అంతకన్న వీరత్వనికషపాషాణమగు వేరొకచోటి కారాణ్ముని కోదండపాణిని గొంపోయెను. మిథిలలో సీతా స్వయంవరసభకు వీరాధివీరు లెందరో పోయి శివధనువు నెక్కుపెట్టలేకపోగా శ్రీరాము డాపనికి బూని అనాయాస ముగా నావిల్లు నెక్కిడి తన అమానుషవిక్రమమును యశో విస్తారమును భరతఖండ మంతటా ప్రకటించెను. ఇంతతోసహా సంతుష్టి చెందక దీనికన్న కఠినతరకార్యమునకు శ్రీరాముడు పూనుకొనవలసివచ్చెను. వివాహానంతరమున "అయోధ్యకు పోవు దారిలో నృపవైరియైన పరశురాముడు కారుమొయిలు కరణి చాపధరుడై, కాలమృత్యువో యన" నరికట్టెను.ఇరువైయొకసారి పుడమిని క్షత్రశూన్యముజేసిన మహావీరుడు, నిరుపమానవీరత్వసంపదచే గ్రాలు కార్తవీర్యుని పీచమడచిన భీమబాహాబలుడు, రాజనువానినెల్ల రాసి విడిచిన ఆప్రతిమ ప్రతాపవంతుడు కయ్యానికి కాలుదువ్వి హరధనువును మించిన హరిధనుస్సు నొకదాని "నెక్కిడుము లేకున్న చంపెద" నని శ్రీరామున కందించెను. అనర్ఘ రాఘవు డాధనువు నవలీల నెక్కుపెట్టి పరశురాముని మించిన వీరుడని ప్రకటించిన తోడనే "భండనప్రచండపండితుండ" వని పరశురాముడు మెచ్చుకొనెను;* [1]తనయుని అద్భుతశౌర్యమునకు లోలోన తనిసి దశరథుడు ప్రపుల్ల చిత్తమున తనపట్టణమును చేరెను.

బాల్యమున నిట్టి నిస్తులవీరత్వసంపద గూర్చి వాల్మీకి శ్రీరాముని చిత్రించుటగాంచి అతని నతిక్రమింపనెంచి వ్యాసుడు కృష్ణలీలల కల్పించెను. పిమ్మట శ్రీరాముని గౌరవోన్నతి నిలువబెట్టదలచి కాళిదాసు రఘువంశము నంతయు వర్ణించెను. ఇందలి చిత్రము లతివిచిత్రములు, రచనా నైపుణియు అనన్యసామాన్యము. మొదట దిలీపుని చరితము, పిమ్మట దానిని క్రిందుసేయు రఘుమహారాజు చరిత్ర వర్ణించి, కులగౌరవమును పెద్దచేసి కులముకంతటికీ కీర్తితెచ్చుటకు అతని పేర నావంశము బరగజేసెను. ఇంతతో నాగక కుల పురుషులందరిలో ఘనుడై గౌరవనీయుడైన శ్రీరాముని చరిత్ర వర్ణించెను. అప్పటికి రాఘవుడన్న శ్రీరాముడే అని రూఢిఅయ్యెను. ఒక్క రఘుకులమునకేకాక సూర్యవంశమునకే తిలకాయమానుడగు శ్రీరామచంద్రునిముందు తక్కిన రాజు లెల్ల తారలైరి; కులగౌరవమున కాతడు ఉనికిపట్టాయెను.

పృథ్వియం దేరాజవంశమూ ధారావాహికాక్రమమున ఇట్టి ఉత్తరోత్తరోత్కర్షలాభము గనుట వినలేదు చూడలేదు. దిలీపుడు, రఘువు, అజుడు, దశరథుడు, శ్రీరాముడు నొకరితరువాత నొక రయోధ్య నేలినారు. శ్రీరామునితో నావంశము పరమావధిని చేరింది. తరువాత కుశుశు, అతిథి, సుదర్శనుడు మొదలగు రాజులందరూ దివిటీముందర దీపాలై శ్రీరాముని ఉత్కర్షనే ప్రతిపాదించిరి. అతనికి సముడే లేనప్పుడు అతని మించిన వారెట్లుందురు? స్కాట్లెండ్ ఇంగ్లెండుల సీమాంత (Border) ప్రదేశీయులగు రాజుల రక్త రంజితవీరత్వ యశోగానమున సర్ వాల్టర్ స్కాట్ పరమానంద భరితుడై నట్లు రఘువంశరాజుల యశోగానమున కాళిదా సపరిమితానందభరితు డాయెను.

శ్రీరాముని నిరతిశయభుజబలము క్షాత్రతేజము నభివర్ణిస్తూ వాల్మీకి అతనియం దింకోవిధమైన వీరత్వము కల్పించెను. హరిహరధనుర్భంగములయందును రాక్షసకులనాశన మందును అతని బాహ్యవీరత్వమును ప్రకటించెనుకదా. ఈవీరత్వ సంపదచేత చాలామంది రాజులు దిగ్విజయ మొనర్చి యశస్సాంద్రులైరి. అందుచేత శ్రీరామునియం దింకొక ఉత్కర్ష నుంచెను. అందు భరతఖండమందలివీరులే కాక ప్రపంచమందలి వీరులెల్ల అతనికి తీసిపోవుదురు. అది అభ్యంతరిక వీర్యము, దానిని వాల్మీకి రామాయణము మొదటిభాగమున వర్ణించనేలేదు. రెండురకముల వీరత్వమును గూర్చి ముచ్చటింతాము.

అసుర వీరత్వము

ఆర్యసాహిత్యమున మనుష్యత్వ మెట్లు చిత్రింపబడినదో చూచితిరి కదా ? పశువుతో సమానుడు కాక తద్వృత్తి నతిక్రమించినవానికే మనుష్యత్వ మలవడుతుంది. పశువువలె కామక్రోధాదులకు వశుడై మానవుడు మతి పోగొట్టుకొంటే ఆతడు పశుతుల్యు డౌట నిస్సందేహము. ఇంద్రియనిగ్రహము కావించినవాడు పౌరషవంతుడగు మానవుడౌను, చూడండి;

                 కామక్రోధ సమాయుక్తో హింసాద్వేష సమన్విత:
                 మనుష్యత్వా త్పరిభ్రష్ఠ స్తిర్యగ్యోనౌ ప్రసూయతే
                 తిర్యగ్యోన్యా: పృథగ్భావో మనుష్యార్థే విధీయతే.
                                               ........ భారతము.
                 లోనిశత్రువులకు లొంగిన నరుడు
                 మానుషత్వము నేది మను పశువౌచు
                 జంతుజన్మము వీడ జను మానవునకు.

ఇందుకు నహుషుడు ప్రమాణము. వేదాంతము (ఉపనిషత్తు) లందు సూక్ష్మరూపమున సూచింపబడిన ఈ విషయము పురాణములందూ కావ్యములందున్నూ స్థూలరూపమున విశదీకరింపబడింది. స్థూలకల్పన ప్రత్యక్షప్రతీతి చెందుతుంది గనుక తత్సంస్కారము మనస్సులో నిలుస్తుంది. అందుకే రాజర్షియైన నహుషుడు రిపుషట్కమునకు లొంగుట చేత స్వర్గభ్రష్ఠుడై సర్పమై జన్మించెను. శచీదేవి నభిలషించి అధికార మదము తలకెక్క సప్తర్షులచేత పల్లకి మోయించి నందుకు అగస్త్యుని శాపమను ప్రతిఫలము ముట్టింది.

అంతశ్శత్రుప్రాబల్యమూ తన్మూలమున గలిగే అధ:పతనమున్నూ ఓరోపీయ వియోగాంతనాటకములయందున్నూ ఐతిహాసిక వీరులయందున్నూ కనబడును. ఆ నాటకముల యందలి ముఖ్యపాత్రములు అరిషడ్వర్గపాటవమునకు లొంగి ఉన్మాదులై నరరూపరాక్షసు లనదగి ఎట్టి దుష్కార్యముల నాచరించిరో ఒకటో ప్రకరణమందు వివరించినాము. ఆ ఖండమున ఆ నాటకముల ప్రభ హెచ్చి ఆ పాత్రములకు గౌరవ మెక్కువాయెను. అట్టివారే వీరులని ఆ ఖండవాసుల అభిప్రాయము. జనుల కల్పనాప్రపంచమున నెట్టివాళ్ళు కుదుట పడతారో వారికే సాహిత్యమున చోటు దొరుకును. దానిని పఠించువారు ఆ వీరుల చూచి రోతపడక పైపెచ్చు వారినే ప్రశంసింతురు. లోభాంధవశత మేక్‌బెత్ రాణి వీరవనిత యైనది. కామద్వేషములు కన్నుగప్ప ఒథెలో యున్నూ, కౌశలవ్యూహమును పన్ని ఇయాగోయున్నూ వీరులైరి. వియోగాంతనాటకములయందలి వీరు లందరూ ఇట్టివారే!

ఈనాటకములయందు ప్రతిష్ఠింపబడిన వీర్యమే ఇతిహాసములయందెల్ల గౌరవింపబడుతూన్నది. కామపిపాసాపీడితులై, సర్వగ్రాసియైన లోభలాలసకు లొంగి అహంకారమదమున పృథ్వియెల్ల తుచ్ఛమని భావించి, అత్యాశాపరతంత్రత రణావేశులై, విజయోల్లాసమున దానవుల విడంబించి దేశమందెల్ల రక్తస్రోతముల ప్రవహింపజేసి నిజప్రభుత్వమును స్థాపించినవీరులే విఖ్యాతయశులై సర్వజనాదరణీయులయినారు. సికందర్, సీజర్, నెపోలియన్, హానిబాల్ ప్రముఖు లిట్టివీరులే; వీరే వియోంగాతనాటకముల నాయకులకు మేలుబంతులు. వీరందరూ పృథ్వీమండలమున రక్తవాహినుల ప్రవహింపజేసిన వారే. ఆర్యసాహిత్యమందుకూడా అసురు లప్పుడప్పుడు ప్రాదుర్భవించి క్రామక్రోధాదులకు వశులై పృథ్వీపై రక్తవృష్టుల గురిపించిన ట్లున్నది. వియోగాంతములయందలి వీరులకును ఆర్యసాహిత్యమందలి అసురులకున్నూ కొంచెమైనా తేడా లేదు, కాని సాహిత్యమందు వీరికి కలిగెడు గౌరవమున సేవాభేద మున్నది. పాశాత్యవీరులు దేవోపములై ఆయా జాతులకెల్ల తలమానికంబుల (Heroes of the Nations)ని సదా గౌరవింపబడుచుండ అసురుల దర్పము చూర్ణీకృతమై, గర్వము ఖర్వమై, లోభము నివారితమై, తేజస్సు ఉపసంహృతమై, ప్రభుత్వప్రతాపములు నామావశేషము లయ్యెను. శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలగు దేవాంశసంభూతులు వారిమద మణచిరి. షడ్రిపుప్రాబల్యమున మానవులకు సంక్రమించిన ఆసురవీర్యమును నాశముచేయు సామర్థ్యము ఇంద్రియ యనిగ్రహవశమున దేవత్వము సాధించిన వీరులకే కలదు.

వియోగాంతనాటకములయందలి నాయకులూ, పాశ్చాత్యసాహిత్యమందలి వీరులూ, ఆర్యసాహిత్యమందలి అసుర నాయకులున్నూ ఒక్క అచ్చున పోసిన బొమ్మలని చెప్పితిమి కదా. వీరిలో నొకరిచరితము చదివితే చాలు; తక్కినవారి చరిత లామచ్చుగానే ఉండును. ఆర్యకవివరేణ్యు లీగుణముల నెల్ల కేంద్రీకరించి మహాభారతమున దుర్యోధనుని శ్రీమద్రామాయణమున రావణునీ చిత్రించిరి. భోగపరాయణత క్షణక్షణప్రవర్ధమానమై నరుని వశపర్చుకొను ననుటకు లోభవాగురుల జిక్కి దాయలకు సూదిమొన మోపునంత ధరణి నొసంగని దుర్యోధనుడు సాక్షి; ఇంద్రియలాలస పెచ్చు పెరిగి మానవుని నశింపజేయు ననుటకు రావణుడే దృష్టాంతము. ఈరెండుపాత్రముల నతినిపుణతతో నిర్మించి అంతతో నూర కుండలేదు. ఆ వీరులచరిత్రము మాత్రమే పఠించుటవల్ల విష ఫలము ప్రాప్తించితీరును. పాపచరితములనే పఠించుటచేత కల్పనాశక్తి పంకిలమగును; అందుచే వీటికి ప్రతిగా వేరొకజాతి వీరుల చిత్రించిరి. ఆధర్మవీరులు తమ ఉజ్వలాలోకమహిమచే పశువీరుల అంధకారమున అణగద్రొక్కి, వారే చదువరుల కల్పనాశక్తి నాకర్షించి, దానిని ధర్మస్యూతముగా నొనరింతురు. ఈ వీరులే మన కావ్యములందు ఇతిహాసములందును నుతిగన్నవారు. రావణదుర్యోధనుల చరితములు మాత్రమే చదివినవారికి ఐరోపీయవీరుల చరితములు చదివిన ఫలమే చేకూరును, కాని భారతరామాయణములు సాంతముగా చదివిన వారి కల్పనాశక్తి దోషసంకలితము కానేరదు.

పాశ్చాత్యసాహిత్యమున షార్ల మేన్, సికిందర్, సీజర్, నెపోలియన్, ఫ్రెడెరిక్, ఐదవచార్లెస్, తైమూర్ మొదలగు వారు దిగ్విజయములు చేసి ఘనత కెక్కిన మహావీరులు. ఆర్య సాహిత్యమందున్నూ ఇట్టివారు లేకపోలేదు - రఘువు, శ్రీరాముడు, పాండురాజు, అర్జునుడు, కర్ణుడు మొదలగువారుకూడా దిగ్విజయ మొనర్చినారు, కాని యీ రెండు తెగలవారియందు తేడా యున్నది. రఘుమహారాజు విశ్వజిద్యాగమునకును శ్రీరాము డశ్వమేధముకోసము, పాండవులూ కర్ణుడున్నూ రాజసూయముకొరకున్నూ దిగ్విజయ మొనర్ప, ఐరోపీయులు లోభమునకు వశులై సర్వమూ కబళించుటకు రక్తప్రవాహములు కల్పించిరి. దిగ్విజయమువల్ల ఆర్జించిన ధనము నార్యులు యాగములందు దానముజేసిరి. పారమార్థికచింతతో కావించిన ధనసంగ్రహ మంత నింద్యము కాదు.

బ్రహ్మక్షత్రియ వీరత్వము

యుద్ధము లేకుంటే పురుషునకు ప్రతిష్ఠ రాదు, విజయుడు కాకున్న వీరునకు వికాస ముండదు - యౌవనమున రిపుషడ్వర్గము ప్రబలియుండునప్పుడు జితేంద్రియులు సంయములు నైన ఆర్యులు తపోబలసాహాయ్యమున దానిని జయించి అభ్యంతరిక వీరత్వమును ప్రతిష్ఠించుచుండిరి. ఈ సమరమున వారిచిత్తమున కేకాగ్రత ఇంద్రియముల కేక నిష్ఠయు చేకూరి విజయమును వారికి కరగత మౌనట్టులొనర్చు చుండెను. తపశ్శక్తిచేత వారికి జయము లభింపగా వారు బ్రహ్మవీరులై దేవత్వము నార్జింపగలిగిరి. అధ్యయనము దమము, ఆర్జవము, ఇంద్రియనిగ్రహము, సత్యమున్నూ బ్రాహ్మణునకు నిత్యధర్మములై యుండెను. అంతర్యజ్ఞానుష్ఠాన మొనర్చుచున్న నారాయణుడు పాశవప్రకృతిసిద్ధములగు అంతశ్శత్రువు లను పశువుల బలియిచ్చినట్లు సామవేదమున చెప్పబడింది. ఈ యంతర్యాగము (సమరము)న జయము లభించుటచేత బ్రహ్మవీర్యము ప్రకటిత మవును. యౌవరాజ్య పట్టాభిషేకమునకు సిద్ధపడుచున్న రామభద్రు డెక్కడ? అతని కరణ్యావాసశిక్ష యెక్కడ? మహైశ్వర్యము, రాజభోగములు - వీటియెడ స్రీరామున కెంతలో నిస్స్పృహ జనించెను, ఎంతలో నారచీరలు గట్టి ఆ యువరాజు అడవికి పోవు టకు సిద్ధపడెను! పదునాల్గేళ్ళు నాతిగల బ్రహ్మచర్యము ననువర్తించి ధర్మైకనిష్ఠుడై బ్రహ్మవీరత్వ పరమావధి నెట్లు చేరెనో యోచించండి! అరిషడ్వర్గము కానీ, రాజభోగములు కానీ ఆతని చిత్తమునకు చాంచల్యము కల్గించెనా? బ్రహ్మచర్యనిష్ఠకు ఉత్కృష్టోదాహరణమైన భీష్ముడు బలవిక్రమ సంపద నద్వితీయుడైన మహావీరుడు. ఆజన్మబ్రహ్మచర్యము ననుష్ఠించిన శ్రీశుకుడు అమానుషసంయమమున కే కోదాహరణము. సనాకాదుల బ్రహ్మచర్యనిష్ఠ క్షత్రియులయందున్నూ కనగలము - హిందువులం దసంఖ్యాకులగు బాలవితంతువులు బ్రహ్మచర్యము సల్పి మహాశ్వేతవలె భగవంతున కాత్మసమర్పణ మొనర్చు చున్నారు. ఇట్టి సంయమమే హిందువుల కబ్బిన మహాశక్తి. శ్రీరాముడు నిజపౌరుషము క్షత్రియ శౌర్యము నెరిగినవాడు కావుననే సీతతోగూడ వనవాసము చేయ సిద్ధపడెను. బ్రహ్మచర్యానుష్ఠానమున కావశ్యకమగు ధైర్యము, ఇంద్రియనిగ్రహము, సహిష్ణుత, సీతను రక్షించుకొన గలనను నమ్మకమూ కలవాడు కావుననే దండ కాటవికి ప్రయాణించినాడు. వనవాసమువల్ల అభ్యంతరికబలమూ క్షాత్రవీర్యమూ ప్రకటితము లాయెను.

శ్రీరామునియందు బ్రహ్మక్షత్రవీరత్వములు రెండూ ప్రాధాన్యము చెందెను. అరిషడ్వర్గము నదిమి అంతరింద్రియములను వశపరచుకోవడముచేత బ్రహ్మవీర్యమూ, బాహ్య శత్రువుల నదిమి బాహ్యేంద్రియముల వశపరచుకోవడమువల్ల క్షాత్రవీర్యమున్నూ ప్రకటితము లాయెను. కామక్రోథాదులు ప్రబలమూర్తుల ధరించి రావణదుర్యోధనరూపముల పృధ్వి నెల్ల అడలగొట్టి భూభారము నభివృద్ధి నొందించగా, వారిని నిర్మూలించి జయము గాంచడము క్షాత్రవీర్యము - ఇది బాహ్య సమరము, మన పురాణములయందు విస్తృతరూపమున వర్ణింపబడింది. శ్రీరామచంద్రుడు తన పౌరుషము నిలువబెట్టుకొనుటకున్నూ భూభారము తగ్గించుటకున్నూ రావణునితో యుద్ధ మొనర్చి కుల నిర్మూలము చేయడమువల్ల అతనిపే రాచంద్రార్కము సంస్మరణీయ మవుచున్నది. వనవాసదీక్షయం దాతని వశిత్వము వన్నె కెక్కినదని చెప్పితిమికదా?

ఈ ద్వివిధవీరత్వ మాతని కలవడుటకు అతని విద్యాభ్యాసము తపశ్చర్యమున్నూ ముఖ్యహేతువులు. అతనియందు ధైర్యము, శాంతి, విద్యాబుద్ధు లున్నట్లే అధ్యవసాయము, సాహసము, కర్మనిష్ఠ, వీరత్వమున్నూ కలవు. దశరథుని యందలి ధర్మపరాయణత, సత్యవ్రతమూ చూచి, వసిష్ఠాది ఋషులు తనకు నేర్పిన సంయమబలముచేత వినయసంపన్నుడై బ్రహ్మవీర్యప్రాప్తికి యోగ్యు డయ్యెను; అనన్యసామాన్యబల విక్రమసంపన్నుడై ధనుర్విధ్యాపారంగతు డౌటవల్ల క్షాత్ర వీర్యమున కునికిప ట్టాయెను. పూర్వకాలమున మనలో క్షత్రియుల కీరెండురకముల శిక్షయూ ఒసగుచుండేవారు, కావుననే రాజర్షు లనేకులు వెలువడుచుండిరి. సంజయుడు పుత్రశోక కాతరహృదయుడై యున్నప్పుడు తపస్స్వాధ్యాయ నిరతుడైన నారదమహాముని ఆరాజర్షుల ఇతిహాసములను వివరించి అతనికి చిత్తశాంతి చేకూర్చెను.

క్షత్రియులలో ననేకులు బ్రహ్మవీర్యసంపన్ను లైనట్లే పరశురాముడు, ద్రోణుడు మొదలగు బ్రాహ్మణశ్రేష్ఠులు క్షాత్రవీర్యము నార్జించి యశస్సంపన్ను లైరి. ముచుకుందు డను రాజశ్రేష్ఠుడు ఒక వంక మంత్రశక్తి, తపోబలమూ, వేరొక వంక అస్త్రబలము, బాహుబలమున్నూ ఊతగా గొని ప్రతాపార్జిత పృథ్వీఖండమును పాలిస్తూండెనని భీష్ముడు చెప్పెను. ప్రజాపాలనమున వసిష్ఠుని బ్రహ్మబలము ముచుకుందుని క్షాత్రబలమునకు సహాయ మవుచుండెనట. వాస్తవముగా అప్పటి హిందూరాజులకు రెండుతెరగుల బలమూ ఆవశ్యకమై యుండెను. "అనలున కనిలుడు సాయపడితే అరణ్యమంతా అరగడియలో దగ్ధమగులాగున బ్రాహ్మణులు క్షత్రియు లేకమైనయెడల శత్రుచయము నంత మొందింప వచ్చు"నని సనత్కుమారు డన్నాడు. శ్రీరామునియం దిట్టి రాజాదర్శము చిత్రింపబడెను. యూరపుఖండమున నిట్టి యాదర్శ మెక్కడిది? రోము రాజ్యము వీడి కొందరు రాజులు సరళజీవయాత్ర సల్పినారు, కాని అది రాజ్యాభిషేకసమయమున కాదు. శ్రీరాముని సంయమము తపోబలమును వేరొకచోట కానరావు. అతని కతనే సాటి.

వీరత్వమున సమరము రక్తపాతము

బ్రహ్మవీర్యము, క్షాత్రవీర్యము, అసురవీర్యము - ఈ మూడురకాల వీరత్వము ప్రదర్శించుపట్ల ఒకానొకప్పుడు రక్తపాత మావశ్యక మగును. బ్రహ్మవీర్య మార్జించునెడ కొన్ని వేళల ఘోరసంగ్రామ ముపస్థితమై అందు రక్తపాత మావహిల్లును. తపశ్శక్తియందు కర్తవ్యనిష్ఠ, బుద్ధిబలము, విక్రమమున్నూ చూపట్టును. ఇట్టి కర్తవ్యపాలనమున తత్పరుడై శిబిచక్రవర్తి డేగనోటనుండి పావురమును రక్షింప నుద్యమించెను. అతనికర్తవ్యనిష్ఠ ధర్మ తేజ:ప్రాబల్యము నందు గాంచవచ్చును. ఆతని చరితము చదువునప్పు డదిసత్యమా కాదా అను ప్రశ్న పుట్టనే పుట్టదు. అతని త్యాగము, తపస్సు, కర్తవ్యనిష్ఠ, ధర్మపరాయణతయున్నూ మానసముల నలరించ కల్పనాశక్తి ప్రబలమై వివేచనాశక్తిని మరుగుపరుచును. ధర్మ తత్పరత సర్వవ్యాపి యగును. కావ్యకల్పనమున ఇట్టి ఇంద్రజాలప్రభావము ననుభవింపచేయడము పాశ్చాత్యకవులకు చేతకాదు. మానవ చరితమున ధర్మతేజ:ప్రభావ మెంత యున్నతి చెందునో, వీరపటిమ ఎంతవరకూ పెరుగునో ఆ కవు లూహింపలేకపోయిరి. అందుచేతనే షేక్స్‌పియర్‌కి తగిన వీలు చిక్కినా ఇంతటి మహత్తు కల్పించలేకపోయెను. డేగను బోలు షైలాక్ పట్టెడు మాంసఖండమును లోభించునప్పుడు కవి రక్తపాతము కావింపనేరకపోయెను. కారణ మేమన కావ్యప్రారంభమునుండీ కవి ధర్మానురాగము జొన్పనే లేదు. అందుచేత ఆ ఘటనాపరంపరయందు రక్తము స్రవించినా అది యాత్మబలి కానేరదు. అందుకే మారువేషమున పోర్షియాను ప్రవేశపెట్టి రంగరహస్యమును కల్పించి కావ్య కల్పన సమాప్త మొనర్చెను.

రక్తపాతము చూడదలచినవారు పరశురాముని మాతృహత్య చూడండి - అతడు మాతృహత్య కెందుకు కడంగినాడు? పితృవాక్య పరిపాలనమునకే కదా ? మన శాస్త్రములయందు కర్తవ్యాదేశము రెండు విధములు - శాస్త్రాదేశ మొకటోది, గురుజనా దేశము రెండోది. శాస్త్రాదేశము రెండింటిలో బలవత్తరము. శాస్త్రజ్ఞానపటిష్ఠ చేకూరేదాకా గురుజనాదేశము నిర్వహించి తీరవలెను, అంతవరకూ పిత్రాజ్ఞ అవశ్యాచరణీయము. దీనిని దృష్టాంతీకరించుటకు పరశురాము డట్లొనర్చెను.*[2] బ్రహ్మతేజము పరశురాముడై అవతరింప క్షాత్రతేజము శ్రీరాముడై అవతరించెను. బ్రహ్మతేజ మాభ్యంతరిక సమరమందున్నూ క్షాత్రవీర్యము బాహ్యసమరముననూ ప్రజ్వరిల్లునని చెప్పియుంటిమి. అందుకే బాహ్యసమరమున పరశురాముడు శ్రీరామునకు తీసిపోయెను.

ధర్మార్థము బలిదానము

ఆర్యసాహిత్యమున వృథారక్తపాత ముండదు, రక్తస్రావ మున్నచోట్ల ధర్మనిర్వహణ ముండితీరును; దేవకార్యార్థము చేసిన రక్తపాతము "బలి" అనిపించుకొనును. బలిదానము పవిత్రకర్మ అని షేక్స్‌పియర్ కూడా ఒప్పుకొన్నాడు. సీజరును చంపవలెనని లోభముగ్ధుడై కాసియన్ రోమనువీరుల కుచక్రము (Conspiracy) లేవదీసెను. తన చాతురి వినియోగించి బ్రూటసునుకూడా మందలో చేర్చెను. అతడు చేరుకున్న ఆకార్యమునకు గౌరవము చేకూరదని కాసియ సెరుగును, బూట్ర సాకర్యము ధర్మనిబద్ధము కావున బలియగునని వారి కిట్లు బోధించెను: _

                  "Our course will seem too bloody, Caius Cassius,
                    To cut the head off and then hack the limbs.
                    Like wrath in death and envy afterwards;
                    For Antony is but a limb of Caesarː
                    Lat us be sacrificers, but not butchers, Caius.
                    We will stand up against the spirit of Caesar;
                    And in the spirit of men there is no bloodː
                       * * * * *
                    Let us carve him as a dish fit for gods
                    Not hew him as a carcass fit for hounds
                               * * * This shall make
                    Our purpose necessary, and not envious;
                    Which so appearing to the common eyes,
                    We shall be called purgers, not murderers*[3]

ధర్మసంస్థాపనమునకై ఒనర్చిన రక్తపాతము అవశ్యం భావి అవుతుంది కాని విద్వేషవశమున నొనర్చే దట్లు కాదు; రామ రావణయుద్ధము కురుక్షేత్రసంగ్రామము నిందుకు ప్రశస్తమైన దృష్టాంతములు. రక్తపాతమును తప్పించుటకు శ్రీరామునిపక్షమున అంగదుడూ, రావణునిపక్షమున విభీషణాదులూ, పాండవపక్షమున శ్రీకృష్ణుడూ కౌరవపక్షమున భీష్మాదిధర్మపరాయణలూ ఎన్నో ప్రయత్నములను కావించిరి, కాని అవి నిష్ఫలమాయెను. పోరుపొసగక సీతనొసంగనని రావణుడూ "వాడిములు మోపిమనంతైన వసుధ" నివ్వనని రారాజూ పట్టుబట్టిరి కావున యుద్ధ మావశ్యకమాయెను.

షేక్స్‌పియరునాటకమున యుద్ధమా కాలేదు, సీజరును వధించుట అత్యావశ్యక మూకాదు. అతని వధింప కాసియస్ మొదలగువారు దళబద్ధులై దృఢప్రతిజ్ఞ కావించుకొనిరి. వారి యుత్తేజనమునకు మూలమగు చిత్తవృత్తి యెట్టిది? "మనము చేసేపనిలో క్రోధముగాని హింసగాని ఉండరాద"ని బ్రూట సన్నాడు. ఆక్రూరకృత్యముపైని ధర్మమను తెరవేసి క్రోధమున్నూ హింసయూ దాచవలెనని బ్రూటస్ యత్నించెను. సీజరును ధర్మమునకు బలిగా నొసంగుచున్నామని జను లనుకొనవలెనని ఆతని తలంపు. ఆతని చిత్తవృత్తి స్వదేశాభిమానముచేత ఉత్తేజితమైనదట! కాసియస్‌మాటో? లోభహింసావేశులై ఆతడున్నూ మరికొందరు వీరులున్నూ సీజరును చంపదలచినారని బ్రూట సెరుగునా? ఎరుగడు. "ఎలాగో బ్రూటన్ మనలో కలిసినాడు. అతడేమి చేసినా చేయకపోయినా సీజరుచావు తప్పదు" అనుకొని కాపురుషు డైన కాసియస్ కసాయివానిలాగు చెల రేగి సీజరును చంపెను. "దీన నందరు వైరప్రధానమనరు, మనపని అవశ్యకర్తవ్య మనుచు దోచు"అని బ్రూటస్ సమాధానమిచ్చెను. ఇది సరిగా నున్నదా? సీజరును చంపకుండా దేశమునకు హితముకూర్చు మార్గములను అత డాలోచింపనేలేదే! మొదటనే చంపనిశ్చయించి పిమ్మట ప్రజల కెట్లు సమాధాన మివ్వవలెనో ఆలోచించుకొనెను. ఇట్టియెడ రక్తపాత మావశ్యక మని నిర్ణయించడ మేలాగు? కావున ఈరక్తస్రావ మవశ్యంభావి కాదు, అది బలి యనుట వట్టి భ్రాంతి.

ఇట్టివృత్తాంతములే గ్రీకువియోగాంతనాటకములకు ఉత్పత్తిహేతువులు. ధర్మార్థము బలి నొసంగడమే ఆధారము చేసుకొని వియోగాంతనాటకము లుత్పన్నము లాయెను. ఈస్కైలస్, యూరిపిడీస్ అను గ్రీకుకవుల నాటకము లిట్టివే. థర్మార్థము బలినొసంగుట ధర్మగౌరవహేతువనే వారి యూహ - అట్టి బలి నొసంగకూడ దని ఆర్యసాహిత్యమూ అనదు. కర్ణుడూ శిబిన్నీ ఆత్మజులను బలియిచ్చుటకుకూడా వెనుదీయలేదు - ఇట్టిసందర్భముననే మయూరధ్వజుడు తన దక్షిణబాహువును అతిథికి కోసియిచ్చెను. ఇట్టి రక్తపాతము మనసాహిత్యమున మాయాకల్పిత మనబడును. ఇందు బలియైనవారు పునర్జీవులైరి - థర్మమునకు గౌరవ మాపాదించడము కోసము భగవద్భక్తి నభివృద్ధిచేయడమునకూ ఇట్టి అలౌకిక వ్యాపారములు మనపురాణములయందు కల్పింపబడినవి. వీటి మూలాన భక్తులభక్తి పరీక్షచేయబడడమేకాక భగవంతుని మాహాత్మ్యముకూడా ప్రకటింపబడును.

గ్రీకుసాహిత్యమందలి ధర్మబలికి పునర్జీవప్రాప్తి లేదు. అదుంటే నాటకము వియోగాంతము కాదు. వియోగాంత నాటకాలకు తుదను నిర్దయాజనితమైన రక్తపాతముండవలెను. దానివల్ల మనస్సులో దడపుట్టునా, లేక ధర్మగౌరవముచేత ఒళ్ళు పులకరించునా? వియోగాంతమున రక్తపాత మావశ్యకమా కాదా అనునంశ నిదివరకే చర్చింపబడింది.

వీరుని ప్రతిజ్ఞా బలము

ఆర్యుడు ధర్మరక్షణార్థము తనకు కర్తవ్యమయిన దొనర్తునని దృఢప్రతిజ్ఞ చేసి సంకల్పసిద్ధు డగును. బ్రాహ్మణులయొక్కయు క్షత్రియులయొక్కయు మనుష్యత్వమున కీ ప్రతిజ్ఞాబలమే నిదర్శనము. ఇట్టికార్యము లార్యసాహిత్యమున వేనవే లున్నవి. మానవునకు మనుష్యత్వమూ వీరునకు వీరత్వమూ సిద్ధించడమున కిదే మూలము. కర్తవ్యప్రతిపాలన మందు బ్రాహ్మణు డెన్నడూ పరాఙ్ముఖుడు కాలేదు. పితృభక్తిప్రేరితుడైన పరశురాముడు పితృవధప్రతిశోధప్రతిజ్ఞచేసి క్షత్రియరక్తమున పితృతర్పణ మొనర్చి కృతకృత్యుడయ్యెను. ప్రతినపట్టినవా రెంత దుర్ఘటమైన కార్యమైనా నెరవేర్చితీరుతారు; చెరనున్న సీతను ముక్తురాలను చేయడముకోసము శ్రీరాము డెన్ని అసాధ్యపు పనుల నెరవేర్చెను! తండ్రిని తనియింప ప్రతినపట్టి భీష్ముడు రాజ్యమును భోగములున్నూ విడిచి యావజ్జీవబ్రహ్మచర్య మాచరింపలేదా? అర్జునుని వధింతునని కర్ణుడు ప్రతినపట్టిననాడు పాండవు లెంత గడగడ లాడిరి! ఆప్రతిజ్ఞ కోసమే బ్రహ్మాస్త్రము సంపాదింపవలెనని ద్రోణు నాశ్రయించి అవమానింపబడి మహేంద్రగిరినున్న పరశురామునికి శిష్యుడై పూనికతో నతని సేవించి, మెప్పించి ఎంతోకష్టముతో దాని నాతడు సంపాదించెను. అర్జునుడో, కర్ణుని వధింతునని ప్రతిజ్ఞచేసి శివునర్చించి పాశుపతమున్నూ దేవతల దర్శించి మరికొన్ని అస్త్రాలున్నూ సంగ్రహించెను. అభిమన్యువధానంతరము సూర్యుడస్తమించకుండా జయద్రధు (సైంథవు)ని చంపెదనని అర్జునుడు ప్రతిజ్ఞచేస్తే ఇరు వాగుల వీరులు మానసములూ తల్లడిల్లెను. అది నెరవేరకుండా కౌరవు లెంత ఆయోజన మొనర్చిరి! దుశ్శాసనుని గుండె పగులగొట్టి రక్త పానము చేయుటవల్ల భీముడు, ద్రోణవధచేత ధృష్టద్యుమ్నుడూ, ఉపపాండవుల జంపి అశ్వత్థామా నిర్వర్తితప్రతిజ్ఞులయినారు. ప్రతిజ్ఞాబద్ధుడౌటనే హంసధ్వజుడు తనకొడుకు సుధన్వుని కాగుచున్న నూనెలో తోసెను. ఈవిషయములం దెల్ల రక్తస్రావమున్నా మానవప్రతిజ్ఞాపాటవము స్థిరపడుచున్నది. ఇట్టిశక్తి వీరులయం దుండునంతవరకూ దేశము సురక్షితమని యెంచవచ్చును. పూర్వకాలపు క్షత్రియుల యందూ బ్రాహ్మణులయందున్నూ ఈశక్తి ప్రబలముగా ఉండేది. ఇప్పు డది సన్నగిల్లి పటిమ పల్చనైయింది - ప్రతిజ్ఞా బలముచేతనే వీరునకు వీరత్వము, మానవునకు మనుష్యత్వము సిద్ధించును.

రక్తపాతములేని సత్యపాలనము

సత్యవాక్పాలనమున ప్రతిజ్ఞాప్రాభవ ముంది. శ్రీరాముడు వనవాసదీక్ష గొని కొంచెమైనా జంకినాడా? పితురాజ్ఞా పాలనమే విధి అని యెంచిన ఆతనియందు తల్లిగాని, భార్యగాని, బంధువులుగాని, కులగురువుగాని యించుకైనా బిగువు తగ్గింపగల్గిరా? భరతుడెంత బతిమాలినాడు! శ్రీరాముడు వ్రతభంగము సల్పెనా? ఇట్టి దిట్టతనమునకు ధర్మనిష్ఠయే కదా కారణము! ఆనిష్ఠచేతనే రాజభోగములవీడి వనముల కేగెను. రాజ్యసుఖములు తుచ్ఛములని భావించుటలో నిస్స్పృహ, పదునాల్గేళ్ళు వనవాసము చేయుటలో చిత్త స్థైర్యమున్నూ స్పష్టము కాలేదా? సుఖము, కోర్కె, భోగమున్నూ విడిచిపెట్టుట అనితరసులభకార్యము కాదా? సత్యపాలనమున కిట్టి మనోదార్ఢ్యమే కావలయును. విధినిర్వర్తనమున శ్రీరాముని హృత్పాటవము కనవలెనంటే సీతను వనముల కంపునపుడు చూడండి - ప్రజాపాలనము చేయుచున్న రాజునకు తనకోర్కెల కొనసాగజేయు ఆవశ్యకత యెక్కడిది? తనసుఖములను త్యజింపవలయు, ప్రజలయానతి మన్నింపవలయును, అందుకే సీతనుకూడా పరిత్యజించెను. ఇదే రాజ నీతికి ఉత్కృష్టాదర్శము, అసమాన రాజధర్మము. కావుననే ప్రతిజ్ఞానిర్వహణనిష్ఠుడై దశరథుడు శ్రీరాముని వనముల కంపి తాను మృతుడాయెను, రాజధర్మనిష్ఠుడై శ్రీరాముడు సీతను వనములకంపి తాను మృతప్రాయుడాయెను. తండ్రికి తగిన కొడుకు! తనభార్యకిచ్చిన వరములు దశరథుడు క్రమ్మరింప గలడు, కాని అట్లు చేయనొల్లడాయెను.

సత్యపాలన సామాన్యవ్రతము కాదు. బాసయిచ్చినది స్త్రీకైన నేమి, పురుషునకైన నేమి, దేవునకైన నేమి? అది నిల్పుకొనుటే సత్యవ్రతి కావశ్యకము, అదే ఆవ్యక్తికి జీవనము. సర్వసామాన్యములయిన విషయములందుకూడా యుధిష్ఠిరుని సత్యనిష్ఠ విదిత మగుచుండును. జూదమున రాజ్యసర్వస్వము నాత డోడెను - రాజ్యమే కాదు - ఐశ్వర్యము, సోదరులు, ధర్మపత్నియు పరుల పాలాయెను. పిదప పన్నెండేళ్ళు వనవాసము చేయుటకు పందెమొడ్డి అదీ వీగి అంతా విడిచి అరణ్యమున కేగెను. ఎందుకు ? సత్యవాక్పాలమున కేనా? ధర్మరా జొక ప్రతిజ్ఞ జేసెనా, దానికి భంగము రాకూడదు. ప్రపంచమంతా తారుమారైనా అత డన్నమాట తప్పడు. శ్రీరాముడు విజయ మొందిన ఆంతరికయుద్ధమును తుములముగా రచించుటకే వ్యాసుడు ద్రౌపదీవస్త్రాపహరణము కల్పించెను. అట్టి ఘోరయుద్ధమున కూడా ధర్మరాజు స్థిరుడై నిలిచెను. తనసర్వస్వ మొకకడ, సత్య మొకకడ నుండ ధర్మజుని మనమున యుద్ధము ప్రారంభించెను, అం దాత డచలుడై నిలిచెను. ఈయుద్ధమున స్థిరుడౌటచేతనే అతనికి యుధిష్ఠిరుడని పేరువచ్చెను. శత్రుసభయం దాతని సామర్థ్యము పరీక్షింప బడెను, ఆత డుత్తీర్ణుడై సత్యవాక్పాలనాజయఘోషము చెలగజేసెను.

రక్తపాతములేని బ్రాహ్మణప్రతిజ్ఞాపాలనము

గురుదక్షిణ అర్పించుటకు బ్రాహ్మణులు పలుబాముల పడవలసివచ్చింది. బ్రహ్మచర్య మాచరించుతూ విద్యాభ్యాసమొనర్చునపుడు శిష్యుని కెట్టిధైర్యము, ఎట్టి సంయమము, తితిక్ష అలవడ్డవో పరీక్షించుటకు పూర్వకాల మందలి గురువులు దుస్సాధ్యమైన గురుదక్షిణ కోరుచుండేవారు. తపోధనుడగు ఉతంకుడు గురుదక్షిణ నిచ్చుటకు గౌతమ మహర్షి ఆజ్ఞానుసారము అహల్య చెంతకేగెను. ఆమె ముందు వెన్క లారయక సౌదాముడను రాజు పట్టపురాణి కర్ణకుండలద్వయమును తెచ్చి యిమ్మనెను. తదాజ్ఞానుసారము ఉతంకుడు ఎట్టికష్టములకు లోనయ్యెనో మహాభారతమున అశ్వమేధపర్వమున విశదముగా వర్ణింపబడినది. అబోధుడగు ఆబ్రాహ్మణవటువు గౌతమమహర్షి కృపచేతనూ తన తపోబలముచేతను వసిష్ఠుని శాపవశమున రాక్షసిరూపము ధరించిన ఆమహారాణి కర్ణకుండలముల నతికష్టమున సంపాదించి గురువుగారి ఆశ్రమమునకు తిరిగి వచ్చుచుండ ఆకుండలముల నొకపాము నాగలోకమునకు ఎత్తుకొనిపోయెను. ఆతడు ధైర్యము విడువక వాటిని తిరిగి సంపాదించి అహల్య కర్పించెను. గురుకులమున నాత డభ్యసించిన ఆంతరికబలము తత్కఠినకార్యనిర్వహణమున వినియోగపడుటచేత అతడు కృతార్థు డాయెను. ఇట్టి ఉదాహరణము లెన్నో కలవు.

మహాకావ్యములయందలి వీరత్వము

ఆర్యసాహిత్యమున నన్ని తెరగుల వీరత్వాదర్శము లున్నవని రామాయణ భారతములు చదివినా రెరుగగలరు. ఈచిత్రములను వేర్వేర వివరించిన నొక్కొక్కగ్రంథ మగును. వాటికి వ్యాఖ్యాన మొనర్చుట కీచిన్నపుస్తకము చాలదు. ఒక్కభారతమందే ఇవి కుప్పలుగా నున్నవి. మన వాఙ్మయమున ప్రేమమాధుర్య మున్నట్లే వీరత్వమందలి తేజుస్నూ కలదు. సరస్వతీనదివలె ప్రేమ శాంతరూపమున ప్రవహింప, వీర్యతరుంగిణి బ్రహ్మపుత్రానదివలె గర్జిస్తూ ప్రవహించును. కాళిదాసూ భవభూతిన్నీ ప్రేమలహరుల ప్రవహింప జేయ వాల్మీకీ వ్యాసులూ వీరప్రవాహముల నతివేగమున పారించి ఉత్తాళతరంగముల జనింపజేసినారు. కురుక్షేత్ర సంగ్రామమున వీరరసమందలి ఉన్మత్తత స్పష్టపడి ఓజస్విని యైన భాషచే ఆ రసము చిప్పిలజేసి సమగ్రభరతఖండమునందు ముంచెను.

మూడు రకముల వీర్యము

ప్రేమకున్న మూడుగతులూ బీరమునకు గూడా ఉన్నవి. మానవునియం దప్పుడప్పుడు పాశవవీరత, ఉన్మాదమూ కనబడుచుండును, ఒకప్పుడు దివ్యవీరత్వమూ మరొకప్పుడు మానవవీరతయు ప్రకాశించుచుండును.

మానవుని షడ్రిపువర్గము అత్యంతప్రబలమై - లోభము పృథ్వినంతా మ్రింగజూచునప్పుడు, కామము అనింద్యచరిత్ర యగు సతీమణిని చెరపజూచునప్పుడు, దర్పము దశదిశల ప్రజ్వరిల్లునప్పుడు, క్రోధము ప్రపంచమునెల్ల కంపింపజేసి రక్తసంసిక్తము చేయనెంచునప్పుడున్నూ - ఆతని వీరత్వము "పాశవ" మనబడును. ఉ|| రావణుడు, దుర్యోధనుడు.

సద్గుణరాశిచేత వీరత్వమును సాధించి మానవుడు విశ్వప్రేమచేతనూ దయచేతనూ దానవీరుడై, బలిచక్రవర్తివలె పృథ్వినంతా ఒరులకిచ్చినా తృప్తిలేక, రఘుమహారాజువలె తన నిధులనన్నిటిని యాచకులకు పంచియిచ్చినప్పుడున్నూ, యుధిష్ఠిరునివలె దానమందు, దయయందు, ధర్మమందున్నూ, పరమావధి చేరునప్పుడున్నూ, ద్రౌపదివలె పుత్రహంతనైన క్షమించునప్పుడున్నూ, ఆశ్రితులయెడ శిబివలె త్రాణపరాయణత కన్పరుచునప్పుడూ, భీష్మునిలాగు యావజ్జీవబ్రహ్మచర్య మాచరించునప్పుడున్నూ, స్వధర్మజ్ఞానముచే ఉదారుడై సుయోధనుని రీతి తనసర్వస్వము నితరుల కర్పింపబూనునప్పుడున్నూ, కర్ణునివలె శత్రువునకైనా తన జీవనసర్వస్వము ధారపోయునప్పుడున్నూ "దివ్యవీరత్వము" కనబడును.

మానవుడు సత్యవాక్పాలనా నిరూఢప్రతిజ్ఞుడై, స్వధర్మము, కులము, మానము, మర్యాదయు నిల్పుకొనుటకు రిపుకులమును రూపుమాపి, ధర్మసంస్థాపనార్థము ధరిత్రీ భారము తగ్గింపబూని, ఋషులు మొదలగు శిష్టుల పీడల తొలగించుటకు దుష్టుల శిక్షించి, ప్రజానురంజనమునకై భార్యనైన విడుచుటకు జంకక, యుద్ధమున నెట్టివా రెదుర్కొన్నా, ఓలమాసగొనక నడుముకట్టి నిలిచి, స్వధర్మానుసారము స్వదేశమునుగాని స్వరాజ్యమునుకాని రక్షించుకొనుటకు బభృవాహనునివలె తండ్రితోనైన తలపడి, కర్తవ్యనిష్ఠయు ధర్మానురక్తియు నిలువబెట్టుకొనునప్పుడున్నూ "మానవవీరత్వ" మగపడును. స్వదేశస్వధర్మ రక్షణార్థము ప్రాణముల నర్పించు భక్తులు (Patriots and Martyrs) మానవవీర్యమున నుజ్వల మూర్తులు. వారు మానవజాతికెల్ల గౌరవాపాదకులు.

ఆర్యవీర్యమందలి విశేషము

ఐరోపీయవీరులకన్న ఆర్యవీర్యుల ఆధిక్యత యేమి? వ్యాసు డీవిషయమును విశదముగా వర్ణించెను. పాశ్చాత్యేతి హాసమున గృహకలహముల వర్ణన మనము చదివియుందుము. కాని సమరసమయాన హృద్వేదనచేత అర్జునునివలె అస్త్రశస్త్రములను విడిచి యుద్ధవిముఖుడగు వీరుని అందు చూడము. యుద్ధోన్ముఖుడై కిరీటి వచ్చుసరికి ఎదురుగా భీష్మద్రోణాది గురుజనము సమరోద్యతమగుట చూడగానే, అతని మానసమున శ్రద్ధాభక్తులు ప్రబలమాయెను. యుద్ధమున కాహూతుడగునప్పుడు జంకుట వీరధర్మము కాదు, కాని గురుజనము, బంధుకోటితో పోరుట యుక్తకర్మ అగునా? అర్జునుని హృదయమున అంతర్యుద్ధము ప్రారంభమయ్యెను. బాహ్యయుద్ధమునకు కడంగుటకుముందు ఆంతరికసమర మంతయు కావలిసెను. వీరవరేణ్యుల కిట్టి సంశయ మెప్పుడైనా కలిగెనా? దీని ఫలితార్థమేమి? ఆర్యవీరుల కెట్టి విద్య గరపబడెనో దీనివల్ల వ్యక్తమైనదా? వారికి నేర్పేది కేవలాస్త్రశస్త్రచాతుర్యమే కాదు, అంతతో ముగిస్తే ఆభ్యంతరిక తపోబలము వారి కలవడదు, వారు జితేంద్రియులు కాలేరు. విద్య నభ్యసించునపుడు వారి భుజబల మభివృద్ధి చెందినట్లే ప్రేమ, భక్తి, శ్రద్ధ, అనుశీలము కూడా అభివృద్ధి నొందవలెను. బాహ్య శత్రువుల జయించుటకు వా రస్త్రవిద్యయం దారి తేరినట్లే అంతశ్శత్రువుల జయించు సామర్థ్యముకూడా వారు సంపాదించు చుండిరి. అస్త్రబలమున యుద్ధకౌశలమునందున్నూ అసురులను సంహరించుట నేర్చుకొన్నట్లే వారు శమాదిషట్కసంపదచేత కామాదుల జయింప నేర్చియుండిరి. ఈరెండు తెరగుల విజయము పొందగలిగిన వీరుడే నిజమైన వీరుడని గణింపబడుచుండెను. బాహ్యశత్రువులను మాత్రమే జయింపగల్గి అంతశ్శత్రువుల నదుమలేనివారికి సుఖమూ లేదు శాంతీ యుండదు. పృథ్వియంతా చేజిక్కినా వారి దు:ఖము తొలగదు, చిత్తములకు శాంతి చేకూరదు.

వీరుల సంపద

అంతరంగసమరమున విజయమొంది చిత్తమునకుశాంతి చేకూర్చుకొనువానికి పృథ్వీతలమంతా వశమైనట్లే. అతడు కోరదగు కోర్కెలుండవు - దేవేంద్రుని సింహాసనము, కుబేరుని నవనిధులూ అతనికి కరగతమగును. నిస్స్పృహావిష్టుడగు నాతని చిత్తమున మోహమూ లోభమూ పుట్టించ దగు వస్తు వే లేదు. తనకబ్బిన రాచగద్దియ భరతుడు త్యజించలేదా? కురుక్షేత్రసంగ్రామమున నెంతో శ్రమపడి జయమునొందిన ధర్మజుడు సింహాసనాసీనుడగుటకు సమ్మతించెనా? వ్యాసుడు అతనికి వైరాగ్యమూ, ఇతరపాండవులకు జ్ఞానమున్నూ ఉపదేశించి అంతశ్శత్రువుల నరికట్టుట శ్రేష్ఠతమమగు కార్యమను విశ్వాస ముదయింపజేసెను. కావున పంచపాండవులు ద్రౌపదితోకూడా భోగసుఖములు త్యజించి సంసారము రాజధర్మమున్నూ నిర్వహింపవచ్చునని నిశ్చయించుకొని, జ్ఞానబలమే నిజమైన వీరత్వమని నమ్మిరి. ఈశక్తి మూలమున జితేంద్రియులై, చిత్తవశీకరణ నిపుణులై, జీవితము సార్థకమొనర్చువారికి భుజబలమున గాని, సైన్యబలమున గాని, సహాయసంపదయందుగాని యేలోటూ ఉండదు. వశిష్ఠవిశ్వామిత్రులు తమ తపో మహిమచేత తండోపతండములగు సేనలు కూర్చలేదా? ఇట్టి సామర్థ్యమున్నా విశ్వామిత్రుడు వశిష్ఠునితో సమానశక్తిశాలి కాలేకపోవుటచేత సంగ్రామమున జితుడై బ్రహ్మర్షి కావలెనని దృఢప్రతిజ్ఞచేసి తీవ్రమైన తపస్సువల్ల జ్ఞానబలము సంపాదించి బ్రహ్మత్వము పొందగల్గెను.

ఆదర్శ రాజ్యము

యుద్ధభూమిని ప్రాణములు బాసినవారికి వీరస్వర్గము లభించునని ఆర్యుల విశ్వాసము. అవసానకాలమున దుర్యోధనుడు కృష్ణునితో నిట్లనెను.

                 1. అధీతం విధివద్దత్తం భూ: ప్రశా స్తం ససాగరా
                    మూర్ధ్నిస్థిత మమిత్రాణాం కోను స్వంతతరో మయా||

                2. యదిష్టం క్షత్ర బంధూనాం స్వధర్మ మనుపశ్యతామ్
                    తదిదం నిధనం ప్రాప్తం కోను స్వంతతరో మయా||

                3. ససుహృ త్సానుగశ్చైవ స్వర్గం గంతాహ మచ్యుత
                   యూయం నిహత సంకల్పా: శోచంతో వర్తయిష్యథ||

               1. చదివితి నెల్లవేదములు జన్నము లొప్పగ జేసితిన్ రమా
                  స్పదమగు వృత్తి బొల్చి నరపాలకు లెల్లను గొల్వ గంటి దు
                  ర్మదరిపు గాఢగర్వ పరిమర్దనకేళి యొనర్చితిం దగం
                  దుది నని మిత్రబాంధవులతో త్రిదివంబున కేగు టొప్పదే?

              2. సమరము శమంతపంచక సమీపమున ధర్మవృత్తి సలుపగ నత్యు
                  త్తమలోకము సమకూరెను విమలాత్ముడనైతి నింక వేయును నేలా?
                                                                      ....తిక్కన

పాండవులూ శ్రీకృష్ణుడున్నూ ఈలోకమును స్వర్గముగా నొనర్చిరనీ, వారికి స్వర్గమునకు పోవలయునన్న ఆందోళనమే లేక, స్వర్గముకన్న నెక్కువగు బ్రహ్మపదమును వారు పొంద యత్నించుచున్నారనీ ఆత డెరుగడు. మహాత్ముడగు ముద్గల ముని స్వర్గమునుండి వచ్చిన విమానము తుచ్ఛమని యెంచి జ్యోతిర్మయమగు బ్రహ్మపదము నాశించి జ్ఞానము శమము నవలంబనములుగా నొనర్చుకొనెను. అట్టి జ్ఞాన మార్జింపవలెననే పాండవులు ప్రాణములు బాయలేదు. ఇంకా వారు రాజర్షులు కాలేదు. జనక చక్రవర్తి వలెనే సంసారము వీడి భగవత్ప్రేమాసక్తులై, సిద్ధి పొందలేదు. అందుకే సకలరాజర్షి వృత్తాంతము శ్రీకృష్ణుడు ధర్మరాజు కుపదేశించెను, అట్టి యాదర్శము లనే భీష్ముడున్నూ బోధించి తనువు చాలించెను. భగవద్గీత లందు శ్రీకృష్ణు డుపదేశించిన నిష్కామనివృత్తిమార్గమూ విశ్వప్రేమయూ పాండవు లింకాపొందలేదు, నిష్కామభావమున వారు యుద్ధ మొనర్పలేదు, అట్టి యత్నమూ చేయలేదు. అట్టివారు శ్రీరామజనకాదులవలె నిర్లిప్తభావమున రాజ్యము చేయగలరా? క్షత్రియాదర్శమగు ఉన్నత రాజ ధర్మమును వా రనువర్తింపలేదు, విశ్వప్రేమ చూపించనేరని క్షత్రియులు రాజ్యశాసనమున కహున్‌లు కారు. ఇట్టి ప్రేమాన్వితులైన దశరథ శ్రీరామపాత్రములను నిర్మించి వాల్మీకి సింహాసనాసీనుడయిన రాజు ప్రేమరాజ్యమును స్థాపించు తెరగు రామరాజ్యదృష్టాంతమున లోకమునకు వెల్లడిచేసెను. మహారాజాధిరాజైన రాముడు ప్రజానురంజసతత్పరుడై ప్రాణాధిక యగు సీతను పరిత్యజించెను; లోకహితము కూర్ప తనసుఖము బలియొసగెను. అట్టిరాజ్య మెచ్చటనైన తిరిగీ స్థాపించబడునా? అట్టి రాజశేఖరుడు తిరిగీ అవతరించునా?

  1. *

                 నావిల్లెక్కిడినప్పుడ, నీవు చతుర్భుజుడవౌట నిక్కము, మదిలో
                 భావించి కంటి, నితరుల కీవిక్రమబాహుశక్తు లెందును గలవే?
                 ఉల్లమున లజ్జదోపదు, ముల్లోకములేలు దేవముఖ్యునిచే నే
                 నిల్లీల భంగపడ, నుద్యల్లలిత కృపాభిరామ దశరథరామా.
                                                             ......రామాయణము.

  2. * శాస్త్రజ్ఞానము దృఢమై, పెద్దల యానతి అందుకు విపరీతమైనప్పుడు గురువుల మాట పెడచెవిని బెట్టి శాస్త్రాదేశమునే అనుసరించ వలయును. ఇందుకు ప్రహ్లాదుఁడు, భీష్ముడు నుత్త మోదాహరణములు.తండ్రియైన హిరణ్యకశిపు, తల్లి లీలావతి, ఎంత నొక్కిచెప్పినా ఉభయ తారకమగు హరిభజనము ప్రహ్లాదుడు మానడాయె. పరమభాగవతోత్తము డగు నారదుని ఉపదేశమునం దతనికి దృఢమైన నమ్మకము కుదిరింది. సర్వశాస్త్రోపదేశసారము భగవద్భిక్తియే, చూడండి -

                      "ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పున:పున:
                        ఇదమేకంతు నిష్పన్నంధ్యాయే న్నారాయణం సదా
                        చదివి చర్చించిన సకల శాస్త్రములు
                        భక్తియౌ ముక్తికి పరమసాధనము."

    అంబుజోదరు దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్తచిత్తుడు కాబట్టి ప్రహ్లాదుడు తండ్రియాజ్ఞ నుల్లంఘించెను.

    అంబను పెళ్ళిజేసుకొమ్మని గురు వెంత బోధించినా భీష్ముడు - బహుశాస్త్రవేత్త - బ్రహ్మచర్యవ్రతము పూనుటకు ప్రతిజ్ఞ చేసినవాడు గనుక గుర్వాజ్ఞోల్లంఘనము చేసెను.

    ఈయిద్దరును శాస్త్రచోదితాచారవివేక ధనులు... కాబట్టి పెద్దల మాటలు పెడచెవిని పెట్టిరి, వీరిని ప్రమాణముగాగైకొని ప్రతీవారూ పెద్దలమాట జవదాటరాదు.

  3. * కిట్టి కోపాన, పిమ్మట కిట్టకుంటవలెను, తలత్రెంచి కాలుసేతులునుకోయ కయసుకాస్యస, మనమహాకార్య మపుడు ఘోరతరమగు కనుగొనువారికెల్ల అంతొ నీ సీజరుని అవయవమకాడె? చంపవలసెకదా అను చంపుతోడ చంపుదముకాని, పచ్చికసాయివాండ్రభంగి నరవంగ మడుపుటపాడిగాదు. సీజరుని అంతరాత్మనే చిక్కబట్ట మనము దలతము; మానవాత్మలకు రక్తపూరఘోరత లేదు. .................................................................................................................................................................................... దేవతాచక్రమునకు బలిని పెట్టుద మతనియెమ్ములను; గాని కుక్కలకు నక్కలకు తినగూడునట్లు చిద్రుపలుగా వాని చెక్కజనదు.

    దీన నందరు వైరప్రధాన మనరు మనపని అవశ్యకర్తవ్య మనుచుతోచు: జనుల చూడ్కికి ఈరీతి కనబడగనె హంతలనరు మార్జకులందు రమెకాని. వా||వా||శాస్త్రి.