సాహిత్య మీమాంస/ఏడో ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏడో ప్రకరణము

_______

సాహిత్యమున దేవత్వము

సతీత్వాదర్శము

ఆర్యకవులు రచించిన ఆదర్శములలో కర్త్రాదర్శములే కాక కార్యాదర్శములు కూడా ఉన్నవి. వీటితో తక్కినకవుల ఆదర్శములు తులతూగనేరవంటే మనకవుల కల్పనాశక్తి విరివీ ఉన్నతి తెలియగలవు. సతీప్రతిమ నేకవి రచించినా అది సీత ప్రతిమకు వెనుకబడుతుంది; పతివ్రతాప్రతిమ నిర్మిస్తే అది దమయంతికి సాటిరాదు. ఆవిరి యోడలముందు చేపలబట్టు చిన్న చిన్న కలముల తీరున, దివిటీముందర దీపాల లాగున, హనుమంతునెదుట కుప్పిగంతులపోలికను వ్యాసవాల్మీకులు నిర్మించినఆదర్శ చరితములముందు ఇతరకవిచిత్రములు రాణించ నేరవు. కాళిదాసు, భవభూతి, శ్రీహర్షుడు మొదలగు కవులు పైని చెప్పిన కవిద్వయము ననుసరించి వారి యాదర్శములనే పుష్టిచేసి అలంకరించి చెన్ను వహింపజేసినారే కాని నూతనా దర్శములను సృజింపలేదు.

విద్య

మానవప్రకృతిలో స్వాభావికముగా పశ్వంశ ప్రధానమయి యుండును, కావున దానిని పోగొట్టుటే విద్యయొక్క ముఖ్యోద్దేశము. పశుత్వమునకు ప్రాధాన్యము తగ్గించి మనుష్యత్వ దేవత్వములకు ప్రాధాన్యము సిద్ధింపజేసేదే క్రమమైనవిద్య. ఇట్టివిద్య మనసంఘముయొక్కయు, కుటుంబముల యొక్కయు రీతినీతులమూలాన సిద్ధిస్తుంది. స్త్రీజాతిని అడ్డుఆజ్ఞలులేక దానిచిత్తమువచ్చినట్లు పెంపొందనిస్తే అదెంత నింద్యస్థితికి వచ్చునో, క్రమమైన విద్యాప్రభావమువల్ల అది దివ్యత్వము నెట్లుపొందునో మనశాస్త్రములందు వర్ణింపబడి ఉంది. బాల్యమునుండీ సుపరిష్కృతము కాకుంటే మానవప్రకృతియొక్క సౌందర్యము భాసమానము కాదు. అందుకే మనయిళ్లలో బాలులతో పాటు బాలికలకున్నూ చిన్నప్పటినుండీ క్రమశిక్ష ప్రారంభింపబడును. ఈ శాసనప్రణాళి కఠినము - పితృగృహము విడిచి గురుకులము ప్రవేశించేదాకా బాలులకు నయశిక్ష ఒసగినట్లు బాలికలకు కూడా పుట్టినిల్లు వదలి మెట్టినిల్లు చేరేవరకూ నయశిక్ష నొసగుచుండేవారు. సుశీలలగుటకు తరుణావస్థయందే వారి నత్తింటి కంపేవారు - బాలుడు గురుకులమున్నూ బాలిక అత్తిల్లూ ఇంచుమించుగా ఒకయీడునే చేరేవారు, కాబట్టి యిద్దరికీ పిత్రాలయమందు మొదలుపెట్టిన విద్య అన్యగృహమున పెంపొంది సమాప్తమయ్యేది - తరళమతులైన బాలకులను తగినరీతిని శాసించి భావజీవితమున కుపయోగించే గుణములు గురు వేలాగు నేర్పునో, ఆలాగే అబోధలగు బాలికలను అహన్‌రీతిని శాసించి గృహిణీధర్మములు అత్తింటి పెద్దలు నేర్పుతూండేవారు. ఇట్టిశిక్ష స్వగృహమున కొనసాగక పోవడము చేతనే మనసంఘమున పైనుదహరించిన వ్యవస్థ యేర్పడింది - దానివల్ల బాలికాబాలకులు సుశిక్షితులై సంసార సంబంధములగు పనిపాట్లలో నిపుణులై సుఖముగా జీవించు చుండిరి - వీరు గృహస్థులుగా పెరిగి నప్పుడు తమబిడ్డల కిట్టిశిక్షే యొసంగుతూ సంసారవృక్షమును నలువైపులా వ్యాపింపచేసి తత్ఫలముల ననుభవించుచుండేవారు - మనవాళ్ళు తమ మానుషత్వము నభివృద్ధిచేసుకొని స్త్రీపురుషులయందు దానిని పెంపొందించి సంసారముల నేలాగు సాగిస్తూ ఉండిరో, ప్రమచేతను స్నేహముచేతనూ అందరి నెట్లు ప్రసన్నుల చేయగల్గినారో దానికి ప్రత్యక్షనిదర్శనములును మనగ్రంథములలో చూడవచ్చును.

సంసారాశ్రమములు ప్రవృత్తిమార్గమునకు విస్తృత క్షేత్రములు. తద్ఘోర లహరులయందు నిరాటంకముగా కొట్టుకొనిపోయేవాళ్ళు ఆ తరంగములయందు మునుగుతూ తేలుతూ, కాలవశమున పోటుదెబ్బలు తింటూ, ఆ ప్రవృత్తి స్రోతమున ఒక సంసారతరంగము నుంచి ఇంకొక తరంగమునకు కొట్టుకొనిపోయి, జన్మజన్మాంతరములా వాత్యాచక్రమున తిరుగుతూ ఉందురు. సంసారమందలి సుఖదు:ఖములే వారికి భోగభాగ్యములు. ఆసుఖ మెంతహెచ్చినా దు:ఖము దూరము కాక క్రమముగా పెరుగుతూ ఉండును. ఇట్టి పయోముఖ విషకుంభమునుంచి వెలువడే మార్గము మనఋషులు చూపినారు; అదే నివృత్తిమార్గము. ప్రవృత్తివేగమును అరికట్టడము వల్లనే సంసార గతిరోధము ఘటిల్లును. ఇది సంభవమా? సంసారాంబుధిలో లోతుగా మునిగినవారికిన్నీ విషయసుఖములను నాచులో చిక్కుకొన్నవారికిన్నీ ఇది అసంభవము - కనుకనే మనము కూడా అట్టి లోతైన గోతులలో కూరిపోకుండా ఏదైనా ఆసరా దొరకబుచ్చుకోకుంటే కృతార్థుల మగుట సున్న. పూర్వోక్తశిక్షాప్రభావ మనే ప్రాపు దొరకొన్న వాళ్లు సంసృతిప్రవాహమున కెదు రీదగలరు. యోగ్యమైన విద్యకు ఫలములు మూడు: _ అరిషడ్వర్గము లొంగదీయుట, యౌవనోన్మాదము నరికట్టుట, భగవంతు నారాధించుట - బాలికల కిట్టి చిత్తశుద్ధి కల్గడమునకే సతీత్వాదర్శమూ శిక్షావ్రతమూ కల్పింపబడినవి; బాలకులు గురుకులమున శుశ్రూషచేస్తూ వేదాధ్యయనము, శాస్త్రపఠనము చేసేటప్పుడు నివృత్తిమార్గ చోదకములైన శమదమాదిగుణగణము *[1]నభ్యసించకతప్పదు. అధ్యయనము, శాస్త్రపఠనమున్నూ క్రమమైనశిక్షకు కేవల సహాయములు (auxiliaries), మానవులు సచ్చరిత్రులు కావడమే విద్యయొక్క ముఖ్యోద్దేశము.

మైత్రి

సతీధర్మమే స్త్రీల కుత్కృష్టాదర్శము, కావున సతీత్వ నిర్వహణమునకు సాధనమగు విద్యయే వాళ్ళకి నేర్పేవారు. ఇదిగాక ఉత్తమఫల మింకొకటుంటే దానికి తగిన విద్య నేర్పియుందురు. బాలులకు గురుకులవాస విద్యాప్రణాళి విధి బద్ధము చేసినట్లే మనువు స్త్రీశిక్షాప్రణాళిని కూడా నిర్ణయించి యుండును. సీత మన కాదర్శసతీమణి కదా? అయోధ్య నామె ప్రవేశించునప్పటికి పుట్టింటిచదువు పూర్తియై యుండును. ఆవిద్యాక్రమము వాల్మీకి వర్ణింపలేదు, కాని తద్ద్వారా ఆమె కలవడిన గుణసంచయమునుబట్టి ఆమెకు నేర్పిన విద్యావిశేషమును మన మూహించవచ్చును. పుట్టింట రాజర్షియైన జనకమహారాజుయొక్క సాంసారికవ్యవస్థకు తగిన శిక్ష ఆమె కబ్బియుండును. అచ్చట సుశీలలగు సతుల దృష్టాంతముల నామె చూచియుండవలెను. వ్రతములు, నియమములు, పాతివ్రత్యము, సంయమము, గురుభక్తి, దైవభక్తియూ చిన్నతనమునుండీ ఆమె నేర్చియుండును. ఇట్టిభక్తితోనే పతి తన జీవనసర్వస్వమని భావించియుండును. భక్త్యావేశమున ఏకనిష్ఠ, నిస్స్వార్థత, నిరాకాంక్షయున్నూ కలదై పతిసేవ చేయగల్గు సతీమణి అట్టి భావములతో భగవంతుని కొలువ గలదన్న వింతా? పసితనమునుండీ గురువులకు శుశ్రూష చేస్తూ దేవతలను భక్తితో నారాధించుతూ ఉన్న బాలకు పాతివ్రత్యపాలన మొకలెక్కా ? బాల్యమునుండీ భక్తి శ్రద్ధలం దారితేరినవాళ్ళు వయోవృద్ధి నొందినకొద్దీ వాటిని పెంపొందించగలరు; బంధువులయెడ వాళ్ళుచూపే అనురాగమూ ప్రేమయున్నూ అట్లే దినదినాభివృద్ధి నొందును.

వేదశాస్త్రజ్ఞానము లభించినివారికి భక్తే ఉత్తమ మార్గమూ ప్రధానవిద్య తపస్సు నగును. బాలిక బాల్యావస్థ యందే పత్యా రాధనము నేర్చుకొనును. అశిక్షితులైనవాళ్ళకు ప్రత్యక్షదైవమే అధికతమభక్తి పాత్రము. ప్రత్యక్షదేవతారాధనము భగవదారాధనముకు తొలిమెట్టు; భక్తిమార్గ మవలంబించేవాళ్ళు స్థూలదేవతలనే మొదట పూజింతురు, తరువాత అది సూక్ష్మదేవతారాధనముగా పరిణమించుతుంది; ఇందుకే పతిప్రేమ పెంపొంది జగత్పతిప్రేమ అవుతుందని చెప్పితిమి! జగత్పతిప్రేమ పూర్ణమై విస్తృతముకాగానే విశ్వవ్యాపి యగును. క్షాంతి, దానము, ధర్మము మొదలైనవాటి చేత ప్రాశస్త్యము పొంది నారీప్రేమ ప్రకటిత మవుతుంది. అతిథులు, అభ్యాగతులు భగవద్రూపులని యెంచి వారిని సత్కరించుటవల్ల ఔదార్యము హెచ్చును. పతియందలి అనురాగము భగవత్సృష్టమైన జంతుజాలమున ప్రసరించును. జీవులయెడ దయజూపకున్న అనగా భూతదయ లేకుంటే భగవత్పూజ సార్ధకముకాదు. చూడండి : _

                "....................................................................దయావిహీనతన్
                 చేసినకర్మముల్ ఫలము జెందునె? కర్మము లెన్నియేనియున్
                 చేసినవాని సద్గతియె చేకురు భూతదయార్ద్రబుద్ధినో......"
                                           ...............................అ|| పెద్దన్న

మొట్టమొదట సంసారమున సంకీర్ణభావమున బయలు దేరిన ప్రేమ క్రమముగా విశ్వవ్యాప్త మవుతుంది. విశ్వవ్యాప్తమైన ప్రేమను "మైత్రి" అంటాము, దాని నభ్యసించిన సతీమణి పతివెంట దుర్గమారణ్యముకైనా ప్రయాణముచేయ సిద్ధపడుతుంది. యాజ్ఞవల్క్యుని భార్యలలో మైత్రేయి మాత్రమే ఇట్టి ఉదారప్రేమపథగామిని అయింది. కావుననే ఆత్మజ్ఞానము పొంద నామె కహన్‌త కద్దని యెంచి - "నీవు నీపతిని ప్రేమించుచున్నంత మాత్రాన అతడు నీకు ప్రేమ పాత్రముకాడు, నీ వాత్మను ప్రేమిస్తూన్నావు కావుననే నీపతి నీకు ప్రేమాస్పదు డవుచున్నాడు: ధనమును నీవు వలచుచున్న హేతువుచేత అది నీకు ప్రియము కాదు; నీ వాత్మను ప్రేమించుటచేతనే ధనము నీకు ప్రేమపాత్ర మగుచున్నది; నీపుత్రుని నీవు ప్రేమించడముచేత వాడు నీకు ప్రేమస్థానము కాడు, నీ వాత్మను ప్రేమిస్తున్నావు కనుక వాడు నీకు ప్రియతము డవుచున్నాడని: *[2] యాజ్ఞవల్క్యుడు ఆమెకు బోధించెను. ఇట్టి మైత్రిని సాధింపగలిగినందుకే గార్గి ఆత్మజ్ఞానోపదేశమున కహున్‌రా లయింది. పాతివ్రత్య మాచరించి దివ్యత్వము సాధించిన సతీమణి ముక్తినిదానమైన ఆత్మజ్ఞానమున కధికారము పొందగలదు. అందుకే పాతివ్రత్యము స్త్రీలకు ముక్తిమార్గమని మన శాస్త్రములు చెప్పుచున్నవి. పాతివ్రత్యము గౌణరూపమున ముక్తిసాధన మవుతుంది, పతియే సతికి ముక్తిసాధనము. ఇట్టి దివ్యాదర్శనమున కిప్పటి హిందూనారీమణు లెంతదూరమున నున్నారో కొంచెము పరికించండి. దివ్యాదర్శములను ధిక్కరించినవారు పతితులౌట సహజమే!

దేవతాదర్శము

ఉజ్వలమైన దేవతాదర్శ మెప్పుడూ మనస్త్రీల కళ్లకు కట్టినట్లుండును. లక్ష్మి, సరస్వతి, గౌరియూ నిట్టి ఆదర్శ దేవతలు. సిరుల తులతూగుచున్న స్త్రీ లక్ష్మివలె మార్దవము, ధైర్యము, పతిభక్తియూ అభ్యసిస్తూండును; బుద్ధిమతియైన స్త్రీ సరస్వతిని బురుడించును. గౌరివలె పత్యనురక్త లవుట కందరూ కోరుచుందురు. పతిపరాయణ, ధీర, శాంతస్వభావ సుశీలయు నగు నవలామణిని లక్ష్మియని గుణవతిని సరస్వతియనీ, అందరియెడ దయచూపి సాధ్విని అన్న పూర్ణయనీ భావిస్తూంటాము. దీనికి హేతువేమి? ఈ దేవతాదర్శములు మనహృదయఫలకములందు చెక్కియుండబడుటచేతనే గదా! నారీజనమునకు దివ్యత్వము సిద్ధించు సూక్ష్మమార్గము మహాభారతమున "నత్యాద్రౌపదీసంవాదమం"దు వివరింపబడింది. పంచపాండవు లొకరొకరికంటె ద్రౌపదియందు అనురక్తులౌట అత్యద్భుతమని యెంచి సత్యభామ ద్రౌపది నిట్లడిగెను. నగుమొగంబులేకాని నాతీ, నీదెస నెప్పుడూ పతులకు కిన్క లేదు. ఇది -

                  *వ్రతము పెంపొమంత్రౌషధవైభవంబొ సరస నైపథ్యకర్మకౌశలమొ చతుర
                   విభ్రమోల్లాసరేఖయొ వెలది నీ విశేషభాగ్య హేతువు సెపుమ నాకు.

అనేటప్పటికి ద్రౌపదికి వచ్చినకోపము నడచుకొని యిట్లనెను : _

               1. అలయక మంత్ర తంత్ర వివిదౌషధభంగుల జేసి ఎంతయుం
                  వలతురు నాథులంట మగువా కడు బేలతనంబు, దానమున్
                  గలిగిన ప్రేమయుం బొలియు, గాని యొకండును సిద్ధిబొంద, ద
                  ప్పొలతులతోడి మన్కి అహిపొత్తుగ చూచు విభుం డెరింగినన్
                  పాండవులయెడ నే నెట్టిదాననై యిట్టి సౌభాగ్యంబు నందితినో

అది నీ కెరిగించెద వినుము : _

              2. పతులకు నెప్పుడు కావింపందగదు కపటకర్మంబులు త
                  ద్భావ మెరిగి వశవర్తినియై వనిత చరింపనదియయగు నెల్లవియున్||

              3. పతులాత్మ నొండొక పడతులగలిసిన, నలుగ నెయ్యడలనహంకరింప
                  మదముప్రమాదంబు మాని వారికిచిత్త, మేక ముఖంబుగ నెల్లప్రొద్దు
                  భక్తి సేయుదు, చూపు పలుకులు కోర్కెయు జెయ్వులు వింతగా చేయ సెపుడు.
                  అమరగంధర్వయక్షాదులందైనను, బురుషు నన్యుని తృణంబుగదలంతు
                  స్నానభోజనశయనాదిసంప్రయోగమర్థి పతులకుమున్నెందునాచరింప

                పతులు వచ్చిన నాసనపాద్యవిధుల భక్తితో నేన కావింతు పనుప నొరుల||

            4. అత్తకుభక్తిగల్గి మది నాయమ సెప్పినమాడ్కి చేటికా
                వృత్తము లాచరింతు గురువిప్రసురాతిథిపూజనంబు ల
                త్యుత్తమభక్తి నేన తగనోపి యొనర్తు ప్రియంబు తాల్మియున్
                మెత్త దనంబు సంతతము మేలుగ దాల్తు సమస్త భంగులన్||
                .............సకలభృత్యజనంబుల జీవితంబుల నరసి వేన నడుపుదును,
                
                పాండునందనులు తమకుటుంబభారంబు సర్వంబును నాయంద నిల్పి వారు నిర్భరులై యిష్టవిహారంబుల నుందురు. రే నెల్ల వెంట నప్రమత్తనై వర్తింతును.
   
            6. పతి గడవంగ దైవతము భామల కెందునులేదు ప్రీతుడై
                పతి కరుణించెనేని కులభామిని భాసురభూషణాంబరా
                న్వితధనధాన్యగౌరవము విశ్రుతసంతతియున్ యశంబు స
                ద్గతియును గల్గు నొండుమెయి గల్గునె యిన్ని తెరంగు లారయన్||

ద్రౌపది గృహకృత్యములందు అత్యంతధీరయు, వ్యవహారమున అత్యంతనమ్రయు, అభ్యర్థనమున సంభాషణయందున్నూ వినయవతియు వంటింట దమయంతియు, అతిథిసంతర్పణమున అన్నపూర్ణగానూ వర్తించడము చూచి చాల అచ్చెరు వొంది సత్యభామ "ఆహా! ఈమె సాక్షాల్లక్ష్మి, దశభుజయగు లోకమాత" అని నుతించి పతివశీకరణమంత్రమూ ఔషధమున్నూ కన్నులారగాంచి సంతసించి ద్వారక కేగెను.

ఆదర్శ దంపతులు.

ఆర్యసాహిత్యమున సత్యాదర్శము చిత్రించినట్లే కవులు పత్యాదర్శనమును కూడా నిరూపించినారు. అనాదినుండీ పత్యనురక్తలగు ఆర్యసతీమణుల చరితము ననుసరించి సత్యాదర్శము నిర్మింపబడింది. దివ్యాదర్శములే అవశ్యా నుసరణీయములు, మన యాదర్శము లట్టివే. వీటిలో భవాని యొకర్తె, ఆమె స్త్రీరూపధారిణియగు ప్రకృతి.

పురుషాదర్శ మెట్లు లభించును? ప్రకృతి పురుషులు సృష్టిలోని మూలతత్వములు. పురుషుని సత్త ప్రేమయం దుండును, ప్రేమయే సంసారమునకు మూలభిత్తి; వ్యక్తులు కలియుటకూ వేరగుటకూ ప్రేమ ప్రధానకారణము. పురుషుని ప్రేమమయమూర్తే ప్రకృతి. ప్రకృతి పురుషు లనాదినుండీ పరస్పరాసక్తులు, వారిద్దరికీ సత్త ఒకటే. ప్రకృతి పురుషు నాశ్రయించుటచేతనే అతనికి విశ్వేశ్వరుడనీ ఆమెకు విశ్వేశ్వరి అనీ పేర్లు వచ్చినవి. ఆతడు ప్రకృతిలో చొచ్చి విలాసార్థము విశ్వమంతా సృజించి రక్షించి ధ్వంసము చేయుచుండును. విశ్వమే లేకుంటే ప్రకృతిపురుషులకు నెలవేదీ? ఈలోకమంతా మాయామయము. విశ్వప్రకృతి మహామాయ, ఆమె పురుషుని ప్రేమాధీనయై యుండును. సతి పతిని విడుచునా? ఆమె కతడే సర్వస్వము, ఏకాశ్రయము. ఆమె కాతనితోటే సంసారము, ఆతని పరిచర్యయే ప్రధానలక్ష్యము. ఆతనియెడ నామె యాసక్తి రూఢము, ఎప్పుడు నుండు పదార్థము సత్, దాని నాశ్రయించి యుండునది సతి.

ఆదర్శరూపుడగు పతి

పైనివివరించిన సతి ఆర్యుల కాదర్శరూపుణియైన సతి, ఆమె భర్త ఆదర్శరూపుడగు పతి. ఆ జగత్పితరుల ననుక రించి ఆర్యదాంపత్యము సంఘటిత మయ్యెను. ఆదర్శదంపతులు ఉమామహేశులు, వారి కవినాభావసంబంధ మేర్పరచబడినది చూడండి -

                  వాగర్థావివ సంపృక్తా..............
                 "జగత:పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ".....కాళిదాసు

ఆర్యబాలికలు తమభర్తలు సదాశివులనీ, సదాశివుడు పార్వతియెడ నెట్టి యాసక్తితో మెలగెనో తమ భర్తలుకూడా తమపై నట్టి అనురాగము చూపవలెననీ కోరుతూ బాల్యమునుండీ శివునారాధిస్తూ "జన్మజన్మాంతరములందు నిన్ను బోలు పతిని సమకూర్చుమని" ప్రార్థింతురు. ఇట్టి కౌమారీ వ్రతమునే కాళిదాసుగౌరికి నిర్మించెను, ఆ గౌరీపూజే ఇప్పటికీ పెళ్ళికూతుళ్ళు వివాహకాలమున చేయుదురు.

పసితనమందే సతీదేవి శివు నర్చించి ప్రసన్నుని చేసుకొని పెళ్ళియాడి సుఖముగా నుండెను, ఆమె మరణించి తిరిగీ సదాశివునే పతిగా బడయవలెనని పార్వతియై కౌమారీవ్రత మాచరించెను, ఈ తపోదృశ్య మతిసుందరము మనోహరమగునట్లు కాళిదాసు వర్ణించెను - పార్వతి శివుని పూజించుటకు కావలసిన పువ్వులు కైలాసగిరిని పూస్తూఉంటే వాటితో తన్నర్చించినందుకు శివుడు సంతసించి తత్పూజాఫలముగా నామెను భార్యగా గైకొనెను.

1. ప్రేమమయుడు (భోలానాధుడు)

ఆర్యనారీమణులకు నిరూపించిన వ్రత మీతపశ్చరణమే. పార్వతి శివునర్చించినతీరుననే సతులందరూ సృష్టికర్త నారాధి స్తూఉంటారు. సృష్టికర్త ప్రేమమయుడూ ప్రేమాధారుడని చెప్పనేచెప్పితిమి. ఆప్రేమవల్లనే నారీమణుల హృదయమును తనవైపు లాగుకొని అత్యాదరముతో నాప్రేమను వృద్ధిచేయును. ప్రేమప్రభావమున నారీమణులు తమ్ముతాము మరచి ప్రేమించువారియందు మనస్సు లగ్నముచేసి ఏకనిష్ఠతో వారికి తోడునీడలై వర్తింతురు. పత్నియెడ అనూనాదరము, ప్రేమయు చూపి ఆదర్శరూపుడగు పతి ఆమెకు స్వర్గసుఖము చేకూర్చును. అందుచేత ఆమె కాతడు ప్రేమమయుడగు దైవ మగును. అట్టివానియం దేకనిష్ఠ సహజముగా కుదురును. పతిప్రేమ నిరాకాంక్షము, నిస్స్వార్థము, ఏకనిష్ఠము, గౌరవపూర్ణము కావున ఆమె తనప్రేమను కూడా అట్లే యొనరించి పత్యనురక్త యగును. ఇట్టిపతి ఆదర్శపతియని మనువు శాసించెను. వశిష్ఠుడు, మంద పాలుడూ ఇట్టి పతులే. అతినికృష్టమగు కులమునపుట్టిన అక్షమాలను సారింగిని మాన్యులూ సతులు నగు లలనామణులుగా గావించినారు - సత్యవతి మొదలగు నిమ్నజాతి నారీమణులు పతుల గుణసంపదచేత గుణవతులై సతులైరి. స్త్రీల నుద్ధరింప సమకట్టువాళ్ళు వారిమూలముననే తమవంశము, చారిత్రము, ధర్మమును రక్షించుకొందురని మానవధర్మ శాస్త్రమం దున్నది. కులనారులు గుణవతులౌటవల్ల వారి కులము, శీలము, ధర్మమున్నూ ఉద్ధరించడమునకు సందేహములేదు. మహాదేవుడు సతీప్రేమను మెచ్చి దానికి వశుడయ్యె ననుటకు ప్రత్యక్షప్రమాణ మాతడు అర్ధనారీశ్వరుడు కావడమే ఇట్లైనచో నిక ఆ దంపతులకు వియోగ మెక్కడిది?

2. ఆశుతోషుడు (ఉబ్బులింగడు)

శివు డాదర్శపతి కావడము నిస్తులపత్నీ ప్రేమయున్నూ పత్నీ రక్షణచేతనే కాదు. రూపగుణసంపదచేతకూడా అత డార్య యువతీవతంసముల మానసము లకర్షించును. రూపమున నాత డద్వితీయుడు, ప్రేమస్వరూపుడు, సర్వాంగసుందరుడు. రాధకళ్ళకు శ్యామసుందరుడు మదనమోహనుడు, భవానికన్నులకు పరమేశ్వరుడు లోకైకసుందరుడు; ఇద్దరూ వారివారి భార్యలకు జగన్మోహనసౌందర్యసారరూపులు. అట్టి ప్రేమమయుడగు పతి తనకు లభించవలెనని ప్రతిహిందూబాలికయూ కోరుచుండును. పతిప్రేమను బడసినవెన్క తదితరప్రపంచమంతా సోరహీన మనిపించజాలు పతిలబ్ధికై మంచిమంచివ్రతములూ నోములూ సల్పుదురు. ప్రేమమయుడగు భర్త ఎట్టివాడు? శివుని గుణములే అతని కందము తెచ్చెను. అందు ముఖ్యమైనది సహజప్రసన్నత. ఆశుతోషున కన్యములగు అందములేల? అవగుణములెన్ని ఉన్నా ఆశుతోషణ మఖిలసుగుణముల కాకరము. అల్పసంతుష్టుడగువాని సరసనుండుట సకలసుఖములను జూరగొనుటయే; అతడు: సంతతప్రపుల్లుడు, అనవరత ప్రసన్నుడు; అట్టివానితోటి కాపురము అమిత సుఖావహము; అల్పసంతోషి నారాధించుట అతిసుకరము, సుఖకరము-అందు చేతనే ఉబ్బులింగనివంటిభర్త తమకు ప్రాప్తించుగాక అని యెల్లప్పుడూ హిందూబాలిక లాశవహించి యుందురు.

3. ఆనందమయుడు (నిత్యానందుడు)

అల్పసంతోషి దినమంతా పాటుబడి యింటికి వచ్చి తనకోసము తగిన ఏర్పాటులు తక్కినవాళ్ళు చేసినందుకు చాలా సంతసించును. జీవనోపాధి నార్జించడమునకు పగలెల్ల శ్రమపడి చీకటిపడేటప్పటి కింటికి వచ్చేసరికి వానిభార్య ఇల్లంతా శుభ్రముగానుంచి సామాను సర్ది వంటచేసి ఎప్పుడువచ్చునా అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమె నట్లుచూచి సదానందుడైన భర్త సంతసమున గెంతును. అతనిపాలి కామె గృహలక్ష్మి! లక్ష్మి యున్న చోట సౌఖ్యమునకు కొదవా? అందున్నూ గృహిణి సానుకూల యైనట్లైతే సంతుష్టి కేమి తక్కువ! అట్టి దంపతు లాదర్శదంపతులని మానవధర్మశాస్త్రమందుంది - తృప్తి సకలసద్గుణములకు నిధానము; చూడండి.

                1. సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు, సంతోషి కెప్పుడు జరుగు సుఖము.
                   సంతుష్టి గాకున్న సంసారహేతువు, సంతసంబున ముక్తిసతియు దొరుకు,
                   పూటపూటకు జగంబున యదృచ్ఛాలాభ తుష్టిని తేజంబుతోన పెరుగు
                   పరితోష హీనత ప్రభ చెడిపోవును జలధార ననలంబు సమయునట్లు.....
                   ..................................................................భాగవతము.

              2. My crown is in my heart, not on my head;
                  Not decked with diamonds and Indian stones.
                  Nor to be seen ː my crown is called Content;
                  A crown it is, that seldom kings enjoy.
                                                      ....................Shak

                 నాకిరీటము నాదు డెందమున నుండు, నాతలన్గాదు, వివిధరత్నముల జెక్క
                 బడగలే, దద్దియున్గావ బడగబోదు, తనివి నామౌళి;దొర లదికనుటయరుదు.
                                                                                        ... ఆ|| నా|| దా||

4. అవ్యభిచారి (ఏకపత్నీ వ్రతస్థుడు)

"యావజ్జీవమూ అవ్యభిచారులై యుండుట స్త్రీపురుషుల ధర్మము; వివాహితులగు దంపతులు వియోగములేక త్రికరణశుద్ధిగా వ్యభిచారులు కాకుండా వర్తింపవలె" నని మన ధర్మశాస్త్రము శాసిస్తూన్నది. ఆదర్శపతి ప్రేమమయుడూ, ఆశుతోషుడూ, సదానందుడూ, పత్నిని గృహలక్ష్మిగా భావించువాడు నౌటచేత వ్యభిచారలిప్తుడై భార్యను బాధించడు. స్త్రీలు దుస్సాంగత్యమువల్ల చెడిపోదురని అతనికి తెలుసును. దుష్టచారిత్రయైన స్త్రీ పుట్టింటికీ అత్తింటికీ కూడా ముప్పుతెచ్చును. అంతేకాదు.

                  "స్త్రీషు దుష్టాసు కాంతేయ జాయతే వర్ణసంకర:,"...భగవద్గీత
                    వర్ణసంకర మయ్యెడు వనిత చెడిన

కావున చెడుసావాసమునుండి చేడియను కాపాడవలెను.

భార్యాభర్తలు కలిసి గృహకృత్యములను నిర్వహిస్తూంటే వా రన్యోన్యశాసితులౌటే కాక అన్యోన్యప్రీతిపాత్రములై ఒకరిమాట నొకరు జవదాటరు. ప్రేమమయుని ఒళ్ళో ప్రేమమయి సంతసమున నుండును, ఆమె తన్ను సేవించుతూ ఉంటే గృహస్థు స్వర్గసుఖ మనుభవిస్తూ ఉండును. వారి కిహమే పర మవుతుంది, వారు దివ్యులౌతారు.

వ్యభిచారమునకు కారణములు-మద్యపానము, దుస్సాంగత్యము, భర్తృవిరహము, ఇల్లిల్లుతిరుగుట, అకాలనిద్ర, పరగృహవాసమనునారని మానవధర్మశాస్త్రమం దున్నది. ఇవి స్త్రీపురుషులకు వర్తించును. ఈ పరిస్థితులను రూపుమాపుట వలన వ్యభిచారము కొంత తగ్గును. మేల్కొని యున్నంతకాలమూ పురుషుడు కుటుంబపోషణమునా స్త్రీ గృహకృత్యనిర్వహణమునందున్నూ కాలము వినియోగించవలెను. చేతినిండా పని ఉంటే చెడుతలంపుల కవకాశ ముండదు. పైని చెప్పిన సాధనముకన్న ఉత్కృష్టమైనది భార్యాభర్తల పరస్పరానురాగము. ఇది హెచ్చినకొద్ది వ్యభిచార మేహ్య మనిపించును. వృధావాగ్వాదమువల్లనూ చికిలిజగడములవల్లనూ కలహములను పెంచుకొని మనసు విరుచుకొనక క్షాంతి, దాంతుల నభ్యసించి సమానురాగులై యున్న దంపతుల చెంత వ్యభిచారము చేరనేరదు.*[3]

5. ధర్మాశ్రయము

దోషనివారణ మెంత ఆవశ్యకమో భక్తి ప్రేమపోషణమంత ఆవశ్యకము, కావున ఆదర్శరూపుడగుపతి తన భార్యను ధర్మానుష్ఠానమున సహ కారిణిగా నొనర్చుకొనును. బ్రహ్మయజ్ఞమునందు తప్ప ఇతర యజ్ఞములందు భార్యాసహాయ మావశ్యకము - పితృ, దేవ, భూత, మనుష్యయజ్ఞములలో సర్వమూ నిర్వహించేది సతి. అతిథిసేవ అన్నదానము లామె లేకుంటే జరుగనే జరుగవు.

ఈ యజ్ఞములవల్ల పురుషుని భక్తిప్రవృత్తులే చరితార్థము లగునా? స్త్రీచిత్తమున వీటి ప్రసారమే లేదా? హిందువుల గృహములే ధర్మక్షేత్రములు, అందు పతిపత్నులే కాక ఇతరులున్నూ పాల్గొందురు - కుటుంబమంతా ధర్మాసక్తమగును. ఇట్టి ధర్మ ప్రభావము లేని గృహములు హిందూగృహము లనిపించుకొనవు. మనయిళ్లలో నిత్య నైమిత్తిక మాసిక వాత్సరిక ధర్మానుష్ఠానము జరుగుచుండుటచేతనే భక్తి, శ్రద్ధ, ప్రేమ, క్షాంతి మొదలగు ఉత్కృష్టప్రవృత్తులు స్ఫూర్తిచెందును. ధర్మ మెంతశ్రద్ధతో ఆచరిస్తే అంతత్వరలో గుణస్ఫూర్తి వర్ధిల్లుచుండును. ధర్మానుష్ఠాన మెప్పుడూ నిరర్థకము కాజాలదు, దానిమూలాన యింటివారందరూ భగవద్భక్తు లగుదురు. మహత్కార్యముల ఫలము వాటి నొనరించిన వారికే కాక ఇతరులకు కూడా చెందుచుండును. గృహస్థులగు దంపతుల ప్రేమప్రవాహము సంసారసాగరమున పడును. భగీరథుడు శివుని జటాజూటమునుండి గంగను భూలోకమునకు తేగా గంగా యమునలు కలిసి కపిలాశ్రమ మందలి ఋషులచే పూతములై సగరకుమారుల నుద్ధరించి సాగరమున బడెను. సంసారమున పుట్టిన పతిపత్నుల ప్రేమ పవిత్రమై విశ్వరూపుడగు భగవంతునియందు చొచ్చి సర్వప్రాణుల యందున్నూ సంక్రమించును. దీనినే "మైత్రి" అంటాము. యాజ్ఞవల్క్యమహర్షి తన సహధర్మచారిణియైన మైత్రేయ ప్రేమను భక్తి మార్గమునుంచి తప్పించి మైత్రిగా పరిణమింప జేసెను. ఆప్రేమ ఋషి పూతము, యాజ్ఞవల్క్యుడు సంసారమందుండి తాను ఋషియగుటే కాక తన భార్యకు కూడా ఋషిత్వము ప్రాప్తింపజేసెను.

దేవతల సంసారము

హిందూ దేవతలకు కూడా సంసారబంధము కల్పించబడినది. ఈ ప్రపంచమే వారిల్లు, ఇందలి కృత్యములే వారి గృహధర్మములు, పరబ్రహ్మ మొకటైనా ఈశ్వరుడు ఈశ్వరి అని రెండువ్యక్తు లయ్యెను. సహజముగా నిర్గుణమైన పదార్థము సగుణమైనది; నిర్లిప్తుడు సంసారలిప్తు డయ్యెను - త్రిపాదు డగు విరాట్పురుషుడు ఒకపాదమున సంసారలిప్తు డాయెనని ఋగ్వేదమున నుంది. మహేశ్వరుడు సంసారియూ సన్యాసియు నై వెలయుచున్నాడు. దుర్గ సంసారిణి, త్రైలోక్యతారిణి ప్రేయిమయియు నైన వైష్ణవి. ఈ రెండవమూర్తియే మహిషాసురమర్దని యని పిలువబడుచున్నది. మహిషాసురుడు సగము మానవుడు సగము పశువు; దుర్గాదేవి వాని పశుత్వము బాపెను. దేవబలము పశుబలమును నిర్జింపగలదు - పశుబలము నెదుట భగవతి అపరాజిత యగును. జగద్రక్షిణివైష్ణవి యైన శక్తి ఈ ప్రపంచమందలి పాపమును తొలగించును. శివప్రేరణమున నామె ఈ సంసారమున తగులువడనెంచి మహాశక్తి రూపమున నవతరించింది - అందుచేతనే -

                    "యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
                      సర్వభూతములందు శక్తిరూపంబున నిలిచియుండును దేవి నీలవర్ణ"

అని ఋషివాక్యము. ఈశక్తియందు నిరతుడై మహాదేవుడు నిర్లిప్తుడగు సంసారి అనిపించుకొనెను. అతని సంసృతి నిష్కామపవిత్రక్షేత్రము. ఇట్టి విశ్వపతి హిందువుల కాదర్శ రూపుడగు పతి. అనగా ఆదర్శరూపుడగు హిందువుడు గృహస్థాశ్రమము ప్రవేశించి ధర్మాచరణమున దేవత్వము సాధింపవలెను. ఈధర్మములు శిష్టాచారములని విశదముగా వర్ణింపబడ్డవి - 118 వ పేజి చూడండి -

6. గురుజన సేవ - (శుశ్రూష)

దేవత్వ మెట్లు లాభకరము? హిందూగృహము గొప్ప ధర్మక్షేత్రమని చెప్పియుంటిమి, అచ్చటనే దేవత్వము ప్రాప్తించుటకు వీలుంది. హిందూకుటంబములయందు పతిపత్నులు మాత్రమే ఉండక వారి ఆత్మీయులు, కుటుంబము, పరిజనము, గురుజనమూ కాక ఇరుగుపొరుగువారు, ఆశ్రితులు, అతిథులు, పశుపక్ష్యాదికమున్నూ ఆకుటుంబము నాశ్రయించుకొని యుండును - వీరందరూ గృహస్వామి ప్రేమకు పాత్రులు కావున అందరికీ అతని ప్రేమ పంచబడును. ఐరోపీయ కుటుంబముల కింత పరివార ముండదు - హిందూగృహస్థు తనప్రాపు గొన్నవారియెడ నిష్పక్షపాతబుద్ధితో వర్తించవలెను. ఒకదెస దారపుత్రాదుల ప్రేమరజ్జువుతో బంధించి ఇంకొకదెస వృద్ధులౌ జననీజనకుల సుఖపెట్టవలయును. ఇం దెవరి నుపేక్షించినా మూర్ఖు డనిపించుకొనును, అట్టివాని నందరు నేవగింతురు. స్నేహ మధోగామి, భక్తి ఊర్ధ్వగామి. పైకెగయు టెంత కష్టమో క్రిందికిజారు టంతసులభము. హిందూగృహ స్థెప్పుడూ పైకెగుర జూస్తూండవలయును. ఐరోపీయులలో నిట్లుకాదు. తలిదండ్రులు పుత్రులతో కలియరు, వీరి గాహన్‌స్థ్యముతో వారి కెట్టిసంబంధ ముండదు. ఇద్దరి కుటుంబములూ వేరుగా నుండును. గృహిణి పతిమరణానంతరము ఆ సంతానము వీడి యింకొకని చెట్టబట్టవచ్చును, కావున ఎవరిసంతానము వారిదే. హిందూగృహస్థునివలె ఐరోపీయుడు ఇంటనున్నవారినెల్ల సమదృష్టితో చూడనక్కరలేదు.

భార్యాపుత్రాదులను మాత్రమే ప్రేమశృంఖలమున తనకు బద్ధులుగా చేసుకొన్నంతమాత్రాన గృహస్థు దేవత్వమును, సాధించగలడా? కల్ల. భార్యాపుత్రుల తగులాటము కేవల పశ్వంశ, దీనిని తెంచినగాని దేవత్వలబ్ధి కానేరదు. హిందువుల గాహన్‌స్థ్య మత్యంత కఠినము, ఇది కేవల మైహిక సుఖసాధనమే కాదు, పరమం దక్షయస్వర్గసౌఖ్య మబ్బుటకు కూడా గాహన్‌స్థ్యధర్మాచరణ ముపయోగపడును. ఇందు సంయమ మత్యావశ్యకము, కావున ఇంద్రియదౌర్బల్యముకల వా రీఆశ్రమనియమపాలన మాచరింపలేరు. స్త్రీసాంగత్యమున ప్రాబల్యము నొందిన రిపుషడ్వర్గమును సద మదము చేయవలెను. ఇందు దాంతి చేకూరినపిదప గురుజనమును సేవిస్తూ తపశ్చరణ మాచరించవలెను. "తలిదండ్రులు, తదితర గురుజనమూ జీవించి యున్న న్నాళ్ళు గృహస్థు ధర్మకర్మాచరణమున నెట్టిస్వాతంత్ర్యమూ వహింపరాద"ని మనువు శాసించెను. వారికి శుశ్రూషచేస్తూండే టప్పుడువిఘ్నము లేవీ రాకుండా చూచుకొని, పారలౌకికకర్మ నా చరింపవలసినప్పుడు వారికి నివేదించితీరవలయును. పితృసేవ, ఐహిక పారమార్థిక ధర్మా చరణమూ అను మూడుపనులు చేయుటవల్ల పురుషజన్మ సార్థక మవును, ఇదే పరమధర్మము, తక్కినవన్నీ ఉపధర్మములు.

ఇట్టి కఠినతపశ్చరణమువల్ల దేవత్వము సాధించవలెను, అట్టి సాధనలో పత్ని పతికి తగినసాయము చేయును; అట్లు చేసేటప్పుడు సంతానముపై మోహము విడిచి, స్వార్థము త్యజించి, భక్తికి స్నేహమును, దేవతలకుసంసారాసక్తియున్నూ బలిచేయవలెను. ఇది సులభమైన పని కాదు - పిమ్మట గురుజనమును సేవించుటవల్ల ప్రేమ పరార్థపరమై భక్తిగా పరిణత మవును. పసితనమునుండీ దేవతల నారాధించువారియెడ భక్తి గన్పరుస్తూ, త్రికరణశుద్ధిగా దేవతారాధనము చేస్తూ సర్వమున్నూ వారి కర్పించి అనురాగమంతా వారియందే నిక్షిప్తము చేయవలెను. "విశ్వమున కంతటికీ పతి సర్వేశ్వరుడు, మే మతనివారమ"ని అందరూ భావించవలెను. ఇట్టిపరార్థప్రేమకూ గురుజన సేవకూ నుతికెక్కిన దృష్టాంతములు శ్రీరాముడు, భీష్ముడు, ధర్మరాజు, తండ్రిని తనియించుటకు శ్రీరాముడు సింహాసనము వీడి వనములందు వసింపబోయెను; అట్టి సందర్భముననే భీష్ము డాజన్మబ్రహ్మచర్యవ్రతము సల్పెను - ధర్మరాజుకూడా పితృ సేవాపరాయణత చూపెను. కురుక్షేత్రసంగ్రామమున కులమెల్ల నశింప వృద్ధదంపతులగు గాంధారీధృతరాష్ట్రులను పోషించు భారము ధర్మరాజునిపై బడినప్పుడు వారి సత్యాదరముతో నాతడు గౌరవించెనని భారతమున నున్నది - ఇం దాతని ధర్మపరాయణత స్పష్టము కాలేదా? ఇట్టి యుదారచరితము ఐరోపీయులలో గాంచబోము.

7. ధర్మాచరణము.

గురుశుశ్రూషయందు ద్యోతకమైనట్లు దానధర్మముల యందున్నూ ప్రేమ ప్రకటిత మగును. వీటిమాహాత్మ్యము మన గ్రంథములయందు పుష్కలముగా కీర్తింపబడినది. వివిధదానముల నొసగుటచేత మానవుని హృదయము ఉదార మగును. అతిథిసంతర్పణమువల్ల నాతడు పుణ్యాత్ము డగును. ధర్మజునకు దానమాహాత్మ్యము విను కౌతూహలము హెచ్చు; దాతకాని వాని కిదియుండదు. ఆర్తరక్షణముకూడా దానమని చెప్పవచ్చును. ప్రాచీనార్యుల గృహములు దానలీలాభూములు, అతిథిసేవాలయములు. ఆర్తత్రాణపరాయణులగు వీరులు మనలో చాలామంది కలరనుటకు మనవాఙ్మయమే సాక్షి.

8. క్షమ

గృహస్థునిప్రేమ గృహధర్మముల ద్వారా పెంపొంది విశ్వవ్యాపిని యగునని తెల్పియుంటిమి. ఇట్టి భావన యిప్పటికీ పూర్తిగా నశించక మన సంఘమున నచ్చటచ్చటకద్దు. పురాతన సంప్రదాయము లింకా సమసిపోలేదు, మూలనియమాలు మూలబడక ఆచరణలో నున్నవి. ప్రాచీనకుటుంబవ్యవస్థలగు బంధువులు, దాసదాసీజనము, అతిథ్యభ్యాగతు లింకా పాడువడలేదు. హిందువుల కివన్నీ ప్రేమభాజనములే అప్పటివలె కాకపోయినా గాహన్‌స్థ్యధర్మములు ఇప్పటికీ అచ్చటచ్చట నిర్వహింపబడుతూ ఉన్నవి. అందు శ్రద్ధ, భక్తి, ప్రీతి, మమతయున్నూ ఇప్పుడూ ఆచరింపబడుతూ తన్మూలమున క్షాంతి అభ్యస్థమగుచున్నది. క్షమాశీలుడు కాకుంటే గృహస్థు పనికిరాడు. గాహన్‌స్థ్యమం దందరికీ ఆదర మున్నది; అందుచేతనే చనువుహెచ్చి కుటుంబములోని చాలామంది స్థిరచిత్తులు కానందున పొరపాటు లెన్నో చేయుచుందురు, వాటి నన్నిటినీ యజమాని క్షమించవలెను; లేకుంటే ఎవ్వరూ వానిదరికి చేరరు, అట్టివారిని ప్రేమచేత వశులను చేసుకొను టెట్లు తన్నాదరించనివారిని తా నాదరించుట సంభవ మగునా? ఆదరించనివారియెడ ప్రేమజూపుటకు వీలేది? ఆదరముంటేనేకదా ప్రేయసుల దోషములు లెక్కకు రావు. ప్రేమ, శ్రద్ధ, దయ, భక్తి, ఇవి నరుని పక్షపాతిగా నొనర్చును. బందుగులయెడ నెట్లో భగవంతునియెడ నట్లే, హిందూకుటుంబమువంటి క్షమారాజ్య మింకొకచోట నుండబోదు. క్షమ మానవునకు సుభాషణము. *[4]

శ్రీరామునియందలి క్షాంతి చూడండి - కైకేయి ఆతని నెంత బాధించినది ! వనవాసము తెచ్చి పెట్టడమే కాక తండ్రిని కూడా చంపింది - శ్రీరాముని వియోగము ప్రాప్తించి నప్పటినుంచీ పాప మాదశరథుడు విషాదసాగరమునబడి మరి తరింపనేలేక మృత్యువువాత పడినాడు. దీని కంతటికీ హేతు వామెయే కదా ! క్షమాశీలుడగు శ్రీరాముడు దాని నెంత మాత్రము సరకుచేయలేదు, ఆమెను పల్లెత్తుమాటాడలేదు, సరేకదా లక్ష్మణుడు కోపోద్రేకమున నామెను నిందింప జొచ్చిన ఆతని మందలించెను. క్షాంతిచేత ఆతని చిత్తమునకెట్టి శాంతి చేకూరెనో, అది యెంత స్థిరమైయుండెనో కొంచెము భావించండి.

ధర్మరాజునందు కూడా ఇట్టి క్షాంతే కానవచ్చును. పుత్రప్రేమచేత వివేకదూరుడై తండ్రిలేని పాండవులయెడ ధృతరాష్ట్రు డొనర్చిన దుండగముల గూర్చి ధర్మజుడు పెదవి కదల్ప లేదు, ఆతనియెడ ననాదరము గానీ ఔదాసీన్యముకానీ చూపలేదు; అతని ఆగడములు సైరించుటే కాక అతనిని దైవమువలె నారాధించు చుండెను. భీష్ముడు ధీరోత్తముడు, సత్యవాది, దానశీలుడు, క్షాంతిపరుడు. శ్రీకృష్ణుడు శిశుపాలు నెడ చూపిన క్షాంతి అందరూ ఎరిగినదే. ఆర్యులలో పురుషులు మాత్రమేకాక స్త్రీలుకూడా క్షమాసంపన్నలే, పుత్రశోకోప హతమానసయైన ద్రౌపది అశ్వత్థామయెడ నెంత క్షాంతి వహించెనో వినియున్నారు. సౌదానుడనురాజు వశిష్ఠునిపై కనలి శపింప నుద్యుక్తు డగునప్పుడు ఆతనిసతి వారించెనని రామాయాణమున నున్నది.

హిందూసంఘమున క్షమ సర్వసాధారణధర్మము కాని అలౌకికము కాదు. మానవధర్మము లలో నిది ప్రధానము ఆధర్మమున కంగములు పది : _ ధృతి, క్షమ, దమము, అస్తేయము, శౌచము, శమము, బుద్ధి, విద్య, సత్యము, అక్రోధము - అని మానవధర్మశాస్తమం దున్నది. పూర్వమున ఆర్యు లందరూ (విశేషించి బ్రాహ్మణులు) ఈ పదిగుణములూ కలిగి యుండేవారు. ఇప్పటికీ నవనాగరికత చొరకున్న హిందూ గృహములందు కుటుంబసమష్టికి క్షమయే మూలబలముగా నున్నది - యూరోపీయ సంఘముల శిక్షాప్రణాళి, సంఘనిర్మాణమూ స్వతంత్రము లగుటపట్ల క్షాంతి కందు చోటులేదు. వారి నీతిశాస్త్రానుసారము శమము క్షాంతీ అలౌకికధర్మములు గా గణింపబడినవి చూడండి - 178 పేజి -

                  To err is human, to forgive is divine
                  తప్పుచేయుట మానవధర్మ మగును, క్షాంతి ధర్మంబు స్వర్గవాస్తవ్యులకును.

మనము శాంతిని క్షాంతిని మానవధర్మములుగా గణింప వారవి దేవతాధర్మములందురు. వారిమతప్రవర్తకుడు ఏసుక్రీస్తు అవసానకాలమున - "తండ్రీ, నా హంతకుల క్షమింపుము, వారనేది వారే ఎరుగర"ని సర్వేశ్వరుని ప్రార్థించెను.

ఐరోపీయసాహిత్యమున క్షమాగుణభూషితుల చరితము లత్యంతదుర్లభములు - పోర్షియా ఇసబెలాలు క్షమాగుణ దివ్యశోభను హృద్యముగా కీర్తింతురు, ఇది వినువారలను క్షణకాలము వెరగుపడ జేయునేకాని వారిమానసములందు నెలకొనదు - ఇట్లు కావలెనంటే ఆగుణమును మానవచరితములందు చేర్చి కల్పన చేయవలెను. ధనలుబ్ధుడగు షైలాకు చరితమున తరువుకానితనము, నిర్దయ, మాటపట్టుదలయు, ఏంజిలో చరితమున దండనీతికఠోరనియమ పాలనమున్నూ కూర్ఛినట్లే, క్షమాగుణము నేపాత్రమునందైనా షేక్స్‌పియరు రచించెనా ? షైలాకు భీషణకౄరత నిర్దయల సరస పోర్షిఆ వక్తృత మధురముగా నుండును కాని, అది క్షణికము కావున ఆరస మంతతో ముగియును. ఆదృశ్య మంతమగుసరికి నింద్యుడగు యూదుని చరితము మరింత నీచముగా నొనరించుటకు క్రైస్తవునిచే క్షమాభిక్షను కవి అడిగించెనని తోచును. అట్టి క్షమను క్రైస్తవులు యూదులయెడ గన్పరచినారా ? అదే జరిగియుంటే ఆ రెండుజాతుల కంతపగ పుట్టనే పుట్టియుండదు సొమ్ము పుచ్చుకోవాలని షైలాకు కోర్టుకు రాలేదు - క్రైస్తవుల దుష్కృతములచేతనూ, అత్యాచారముల చేతనూ పీడితులై క్రోధావేశులైన యూదుల కసి తీర్చుకొను ఉద్దేశముతో నతడు వచ్చెను. క్రైస్తవుల పక్షమున వాదించుటకు వకీ లుండెనుకాని యూదుల పక్షమువా డేడీ? యూదుడే ఆనాటకము వ్రాసినట్టైతే ఘటనాచక్రము మారి యుండదా ? షైలాకు పాత్రమున మానవుని యందలి పశ్వంశ ప్రబల రూపమున చిత్రింపబడినది. తగవు తీర్చుటకు క్రైస్తవు లందరూ గుమిగూడినారు. యూదుని కెదురుగా విజాతీయు లందరూ దళబద్ధులైనారు కాని షైలాకుపక్షమువారిని కవి దళబద్ధులను చేయలేదేమి? ఇది పాత్రరచనయందు పక్ష పాతము కాదా ? క్రైస్తవకవి నాటకకర్త కావున యూదుని నింద్యచరిత్రునిగా నిర్మించి అతనిపక్షమున వాదించువాని నైనా నియమించలేదు. పోర్షియా దయావిషయికోపన్యాస మిచ్చునప్పుడు యూదులు ప్రతివాదించుటకు సబబు లేదా! "క్రైస్తవులగు మీరు హింసాపరులై సంతతమూ మమ్ము పీడించుచున్నారు; ప్రస్తుత మొక్కసారి మీయెడ మేము కౄరత వహించేటప్పటికి మీకు ఆశ్చర్యమూ దిగులూ పుట్టినవా ? మే మెన్నో ఏళ్ళనుంచి సైరిస్తూన్న దానిని మీ రొకనాడు సహింపలేరా ? నేటికి పన్నెం డేళ్ళనుంచి ఎంటోనియో మా షైలాకును గహిన్‌ంచుచుండెనే! ఇంతకాలమూ అతనిని తిట్టడము చాలక నేడుకూడా మానడాయె మమ్మేవగించి కనబడినచోటులనెల్ల అవమానించక మానరు. ఈనాటికి మీచేయి క్రిందయినదని దయాసరణిగురించి శ్రీరంగనీతు లాడజొచ్చినారు! పోనీ, ఇట్టిదయ మీరెన్నడైన మాయెడ చూపినారా? మీదయాపరత్వము మే మెరుగమా ? అట్టి మీపై మాకు జాలిపుట్టునా ? చాల్చాలు! మీమాటలు విన్న నెవ్వరైన నవ్విపోదురు" అని యూదులు ఎత్తిపొడువ జాలరా ?

షైలా కంత పట్టుబట్టడానికి హేతు వేమి ? అతని కంత అసహన మెందుకు పుట్టింది ? అదంతా క్రైస్తవులు యూదులయెడ కన్పర్చిన ధిక్కారము, బాధలయొక్కయూ పర్యవసానము. కవి మాత్రము వారియెడల గన్పరచిన కరుణ యెట్టిది ? దావాతీర్పును బట్టి ఎంటోనియో శిక్షింపబడలేదు సరేకదా షైలాకుప్రాణముమీదికి వచ్చింది. తగవంతా తబ్బిబైనది. న్యాయాధికారి దయతలచి షైలాకుప్రాణము నిల్పెనుగాని, జీవనాధారము, గౌరవదాయకము నైన అతని సొత్తంతా తన అధీనము చేసుకొనెను. యూదులు క్రైస్తవ న్యాయస్థానముల కెక్కినందులకు లభించే ఫలము చూడండి!

పోర్షియానోట వెలువడిన దయా వాక్యములు మూడు కారణములచేత పొల్లువోయెను : _

1. క్షమాచిత్రము మనసు కెక్కునట్లు కవి చిత్రింప లేదు.

2. షైలాకుపక్షమున చెప్పవలసిన విషయములు స్ఫురణకు వచ్చును.

3. విచారణానంతరముకూడా షైలాకునెడ క్రైస్తవులు నిర్దయచూపుదురు.

క్షమాగుణమును వృద్ధిచేయడము కవిఉద్దేశ్యముకానే కాదు, మానవుడు ఒకరిని వంచింపబోయి త్రవ్విన గోతిలో తానే పడునని నిదర్శనము చూపదలచినట్లున్నది; అందు కృతకృత్యు డాయెను.

8 - 9 అక్రోధము - అహింస

క్రోధము నణగదొక్కకున్న క్షమ ఉద్రేకింపదు. స్నేహము, మమత, ప్రేమయున్నూ విన్యాసము చెందినట్లైతే క్రోధము తనంతనే ఉడిగిపోవును. క్రోధమునకు తగిన విరుగడు ప్రేమయే. ఇందుచేతనే హిందూగృహమం దక్రోధము నభ్యసించుటకు తగిన పరిస్థితు లేర్పరచి యుండును; ఋషి ప్రతిష్ఠితమగు నచ్చోటు దేవత్వము సాధించుటకు ముఖ్యావ లంబనము. ఇది నిర్వహించు తెరం గీవిధమున మహాభారత మం దున్నది : _

                 తత్ర వై మానుషాల్లోకా ద్దానాదిభి రతంద్రిత:
                 అహింసార్థ సమాయుకై: కారణై: స్వర్గమశ్నుతే||
                 దా నాదుల పూనికతో నేనరు డర్థార్థియై యహింసా యుక్తిన్
                 తా నభ్యసించుచుండును, వానికి దేవత్వ మొగిని వశమౌ నిలలోన్||

దానధర్మము లభ్యసించుటవల్ల అక్రోధము, క్షమా అలవడి హింసాప్రవృత్తి హీనమగును. సామాన్యప్రేమ ప్రసారమున అహింస యావహిల్లదు. ఇతరునిసుఖము చూచి తాను సుఖించడమే ప్రేమ. హింస స్వసుఖాభిలాషిణి - ప్రేమ పరసుఖాభిలాషిణి - ప్రేమలోక ప్రసార మతిశయించినకొద్ది హింసాధకారప్రసారము సంకుచిత మగును. ప్రేమ పొంగి వెల్లివిరిసి విశ్వవ్యాపిని కాగా సమదృష్టి యవతరించి హింసా పరత్వమును సమయించును. ఇట్టి సమత్వము మైత్రేయికి లభించినతోడనే "సంసారమందు నీకు ప్రేమ కల్గినంతమాత్రమున నది నీకు ప్రేమపాత్రమని యెంచకు, ఆత్మ నీ కత్యంత ప్రీతిపాత్రమగుటచేతనే సంసారము ప్రేమాస్పదమయ్యెను." అని యాజ్ఞవల్క్యు డామె కుపదేశించెను. తోడనే వారు సంసారమును త్యజించి వనములందు వసింపనేగిరి, స్వర్గము వారికి కరగతమౌటచేత ఈలోకమునుండియే వారు ముక్తులైరి, బ్రహ్మప్రాప్తికై సన్యాసమార్గము నవలంబింపవలసి వచ్చెను. అహింసాప్రశస్తి ఆర్యసాహిత్యమున నన్నికడల నావరించియున్నది. శ్రీకృష్ణుని చరితమున నీధర్మ ముజ్వలరూపమున గాంచనగును. భీష్మవిదురాదులు హింసాహీనులు, శ్రీశుకుడు నారదుడు మొదలగు ఋషులచరితములం దహింస ప్రత్యక్షరూపమున పరిఢవిల్లుచున్నది. ఇదే హిందువులకు ప్రధానధర్మము, దానిచేతనే వారి ప్రకృతి కోమలతరము నమ్రతరము నగుచున్నది. అది వారిని క్షమాశీలురను కావించి వారిగృహములను శాంతినికేతనముల నొనర్చుచున్నది. శాంతిమయమైన అహింసావతారమే బుద్ధదేవుడు, అతని కహింస నేర్పినది, హిందూమతము; అహింసామహాధర్మము నుపదేశించుటవల్లనే బుద్ధుడు జినుడును శాంతిస్థాపనాసమర్థులైరి. క్రైస్తవులం దీధర్మమునకు తగినంత ఆధారము దక్కలేదు, అందుకే ఐరోపీయసాహిత్యమున నది అరుదుగా దోచును. ఆమతమున న్యాయపరతకు లభించిన ప్రాచుర్యము ప్రాముఖ్యతా క్షమాగుణమునకు చిక్కలేదు. కఠినశిక్షా విధాన మార్యసాహిత్యమందూ కద్దు. ధర్మక్రోధ మెచ్చునపుడు పాపమునకు కఠినశిక్ష ప్రాప్తించకపోదు. కాని దీనికి తోడుగా క్షమయూ పుణ్యజ్యోతిన్నీ ఆయాచోట్ల స్ఫురణ వహించి యుండును.

స్వర్గము

శ్రద్ధ, భక్తి, ప్రేమ, క్షమ, అక్రోధము, అహింస మొదలగు గుణములచే పూరితములైన దేవతాదర్శములు ఆర్యసాహిత్యమున కొల్లులుగా నున్నవి. దేవతల కునికిపట్టగు స్వర్గము సౌఖ్యమునకు పాదు. అచ్చటికి పోవుమార్గ మతిసంకీర్ణమే (Strait is the gate to Heaven) కాని శ్రద్ధా భక్తు లలవడినవాళ్ల కది సుగమము. స్నేహ మమత లను దిగువమెట్టులపై నుండి గురుజనులను భక్తితో నర్చించువారి దృష్టులను దేవతలు తమవై పాకర్షింతురు. దేవతలను మూర్తివంతుల నొనర్చి ఆర్యకవులు మానవాభివృద్ధికి మార్గము చూపిరి. లక్ష్మి కమనీయ స్వర్ణప్రతిమ, వేదమాతయైన సరస్వతి జగన్మోహినియగు శ్వేతమూర్తి, అసురవిజయినియగు పార్వతి దశభుజ, శక్తిరూపిణి, నీలమూర్తి. జగదుత్పత్తికి కారణభూతుడు సూర్యుడు; దాని నావరించియుండువాడు వరుణుడు; తేజమున కాధారభూతుడు అగ్ని; జగత్ప్రాణస్వరూపుడు వాయువు. అద్వితీయుడగు భగవంతు డన్ని జీవులయందూ వర్తించును. అనంతవిభూతి కాధారుడై స్వర్గమున రాజిలుచుండు దేవదేవుడు స్వప్రకాశవికాసమున అనంతబ్రహ్మాండమం దంతహిన్‌తుడై యుండియు సామాన్యదృష్టికి గోచరుడు కాడు. అతని విభూతివికాసము గనకున్న అతని నారాధించు టెట్లు? ఆతడు విశ్వవ్యాపి కావున అనంతమూర్తు లం దతని జూచి అనంతు డనుకొనవలెను.

                  యచ్చ కించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పి వా
                  అంత ర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ: స్థిత:||
                  కన్న జగ మెల్ల మరియును విన్న జగము నిండియంతటనారాయణుండు వెలయు

ఇట్టి విశ్వరూపసందర్శన మర్జునునికి లభించినది. దివ్యాదర్శములను రచించి ఆర్యకవులు తమకావ్యములకు దివ్యసౌందర్యమును గడనచేయగల్గిరి. వాటిని పఠించువారిఎదుట దివ్యాదర్శములు సాక్షాత్కరించి యుండుటచేత వారువాటిని పూజించి, ఆ మోహనరూపసందర్శమున తనిసి స్వర్గప్రాప్తికై ఎల్లప్పుడు నాకాంక్షింతురు. శూరులు యుద్ధభూమి నురుకజూచుట కిదే హేతువు. వీరస్వర్గము నాశించే కదా కురుపాండవులు ఘోరసంగ్రామ మొనర్చిరి! సతులు సహగమనము చేయుట - బలిచక్రవర్తి పాతాళమునకు కుంగుట - శిబి తనమేనికండలు చెండియిచ్చుట, బృహదర్భకుడు తన సుతుని బ్రాహ్మణసేవకు బలిగా నొసంగుట - మొదలగు కృత్యముల కన్నిటికీ స్వర్గకాంక్షయే ప్రధానము. స్వర్గసభను నారదుడు ధర్మజు నెదుట వివరముగా వర్ణించెను. అష్టదిక్పాలుర ఐశ్వర్య మత్యధికముగా నందు విలసిల్లుచుండును. ఇంద్రుని కాపదవి ఎట్లు లభించెను? నిస్తులపరాక్రమసంపన్నుడగు నాతడు దేవతల కధీశ్వరత్వము లభింప బ్రహ్మచర్య మాచరించెనని మహాభారతమం దున్నది. జితేంద్రియులకుగాని దేవత్వము ప్రాప్తించదు. ఆసురప్రవృత్తి నణగదొక్కి జితేంద్రియులై సంయమివ్రతాచరణ పరులకు మాత్రమే స్వర్గము కరగతమగును.

ప్రాణ ప్రతిష్ఠ (దేవతావాహనము)

దేవతాదర్శముల నన్నిటినీ ఆర్యకవులు సజీవములు మూర్తివంతములుగా నొనర్చి రంటిమి. దేవత లట్టిమూర్తులే, ఈయాదర్శములను మరచినవాళ్ళు దైవోపాసన చేయలేరు; ఒకవేళ చేసినా అది ధర్మసంగతము కానేరదు. ఆదర్శములను త్యజించినట్టైయితే దేవతలు నిర్జీవు లగుదురు. ప్రాణ ప్రతిష్ఠ కావింపబడిన దేవతాప్రతిమలందు దివ్యశక్తిని గాంచువారే దేవాదర్శముల గాంచగలవారు. ప్రాణప్రతిష్ఠామంత్రము చేత దేవాదర్శము సజీవమగును. ప్రాణప్రతిష్ఠ యన నేమి? శక్తివంతము సజీవమూ అగు దేవతామూర్తిని ధ్యానించి అనుభవములోనికి దెచ్చుకొనుట. ఇట్టిమూర్తులనే మనవా రుపాసింతురు.

దేవతాచరితము

ప్రాణప్రతిష్ఠచేసిన దేవతాప్రతిమ అనంతదివ్యశక్తులకు నిధానమని భక్తులు భావింతురు. ఈ శక్తులే దాని విభూతి యనబడును. ఒక్కొక్కదేవత ఒక్కొక్క విభూతిరూపమున ఉపాసకుల హృదయములందు నిహితమగును. దివ్యప్రేమ, దివ్యనిగ్రహము, దివ్యబలము, దివ్యవిభూతియూ ఆర్యసాహిత్యమున దేదీప్యమానముగా వర్ణింపబడినవి. అన్నిమూర్తులూ సగుణేశ్వరుని రూపములే. ప్రేమమూర్తి ఒకప్పుడు ప్రచండరూపము ధరించి అధర్మపరులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మసంస్థాపనము చేయుచుండును.

                 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
                 ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే|| భ|| గీ||
                 రక్షింపగ సజ్జనులను శిక్షింపగ దుష్టజనుల సేమమెలర్పన్
                 వీక్షింపధర్మువాహన దక్షా నేనవతరింతు దగ యుగ యుగమున్
                                                                            టా|| ల|| న||

ఒకప్పు డదే జగన్మోహనమగు శ్రీకృష్ణరూపమున గోపికలను భక్తుల తృప్తినొందించుచుండును, అన్నపూర్ణరూపమున విశ్వాత్మ ప్రేమను జీవరాసులకు పంచిచ్చును. ఇట్టి అనంతకరుణామయమగు రూపము ఆర్యసాహిత్యమున శ్రీరామ కృష్ణావతారములదాల్చి విలసిల్లుచున్నది. ఇతరసాహిత్యములందు ఇట్టి భగవదవతారములే కానరావు. చిత్తవశీకరణములగు నవతారములు భగవంతుని అలౌకికవ్యాపారములు. భీతిగాంభీర్యములు మానవచిత్తములయందు భాసమానమగు నట్లు అలౌకికశక్తివంతుడగు భగవంతుడు పృథ్వి కవతరించి మానవులతోపాటు వ్యవహరించెనని విదేశసాహిత్యమున నెచ్చటా చెప్పబడలేదు. ప్రేమమయుడగు పరమాత్ముడు లోకసంగ్రహార్థముపృథ్వీ నవతరించి ఎట్టికార్యముల నాచరించుచుండునో మన మెరుగలేము. పాపులను శిక్షించి పాప నివారణ మొనర్చి, పుణ్యాత్ములకు దర్శనమిచ్చి వారిని స్వర్గమునకు కొనిపోవునని మనగ్రంథములం దున్నది. మానసమున భావించిన యీ ఉదాహరణములు కావ్యములయందు ప్రత్యక్షమగును.

ప్రపంచపరిపాలనానియమములను గని నివ్వెరపడ నివారుండరు. అట్టి యాదర్శముల నభివర్ణించిన కావ్యములు సఫలములు కావా? ఈవర్ణనలందు కల్పనాశక్తికి కావలసినంత అవకాశము లభించును. భగవంతుని అద్భుతలీలలూ అపురూపక్రియాకలాపమున్నూ గాంచినతోడనేమానవుడు చకితు డగును. భగవత్ప్రేమరస మార్యసాహిత్యమున కావలసినంత కలదు. హోమర్, వర్జిల్, డాంటే, మిల్టన్ మొదలగు కవులు తమకావ్యములయందు భగవదవతారములు రచింపనే లేదు, వాటిని చదువుటవల్ల దైవభక్తిప్రభావమే యెరుకపడదు; భగవంతునిప్రభావజ్ఞానమే కలుగదు. బ్రహ్మజ్ఞానము మన వేదములం దుండినట్లు విదేశగ్రంథములయందు కానరాదు, వైదికజ్ఞానము కొంచెము ప్రసరించిన దేశములయందుకూడా అది రూఢము కాలేదు, కావున ఇతరదేశీయులకు బ్రహ్మజ్ఞానము ప్రాప్తించలేదు. కావ్యసృష్టికి కావలసిన సాధనసంచయము మన వేద వేదాంతములందు విపులముగా నుంది. వేదములన్నీ దివ్యుల విపుల రాష్ట్ర మనవచ్చును, దివ్యసుందర కాంతి అం దుజ్వలరూపమున భాసిల్లుచున్నది; వేదాంతము (ఉపనిషత్తు) లందు దేవతలూ లేరు, స్వర్గమూ కానరాదు, అందు నిర్మలము పవిత్రము నగు చైతన్యమూర్తి భాసిల్లుతూ ఉండును. వేదములు కర్మప్రధానములు, వాటి ఫలము స్వర్గప్రాప్తి; వేదాంతములు జ్ఞానప్రధానములు, వాటి పరిణామము ముక్తి.

ఋషి చరితము

ఆర్యసాహిత్యమున వెలయు దేవతాదర్శములు మానవులకు సిద్ధించునా? మానవుల కవి అప్రాప్యములని ఏసుక్రీస్తు అభిప్రాయము, కాని వైదికార్యు లని ప్రాప్యములనే చెప్పిరి; మానవులందు దేవత లంతహిన్‌తులై యున్నారనీ, బాహ్యా చ్ఛాదనములను తొలగించినతోడనే దేవతారూపములు వ్యక్తములగుననిన్నీ మనఋషులు చెప్పినారు. మానవదేహము లందాత్మ రూపమున పరమేశ్వరుడు వర్తిస్తూన్నాడు, మోహావరణము తొలగించగానే తద్దివ్యజ్యోతి ప్రకాశించును. మనుష్యులు దేవత్వమును పొందగలరనుటకు ఋషులు ప్రమాణముల నిచ్చినారు, తపోబలమున ఎట్టి అసాధ్యమైన పనియైనా సాధ్యమగును. సామాన్యులందు దైవశక్తి ఆవిర్భవించు మార్గములను సూచించడానికే కవులు మనసాహిత్యమున ఋషిచరితములను జొన్పినారు. ఆచరితములు చదివితే మనుష్యులకు దేవత్వము సాధ్యాతీతము కాదని స్పష్టపడును. రామాయణమున భారతమునా దివ్యశక్తుల నార్జించిన ఋషులనేకు లీయభిప్రాయమును దృఢపరుస్తున్నారు.

మానవ చరితము

దేవతలయొక్కయు ఋషులయొక్కయు చరితములే కాక అనేకమంది భక్తులు సాధకులు మొదలగువాళ్ల చరిత్రములూ మనసాహిత్యమున కలవు. ఒకవంక దేవతలమహిమావంతములు ఉన్నతములగు నాదర్శములు, వేరొకవంక తప:ప్రభావమున దివ్యశక్తుల నార్జించి దేవత్వసిద్ధి గాంచిన ఋషుల చరితములు కలవు, ఇంకొకవంక తపశ్చరణ మొనర్చుచుండు మానవులు కానవత్తురు. అరిషడ్వర్గమును వశపరచుకొని చిత్తమును తపముచే నాయత్తపరుప సంయమిత్వము సిద్ధించును. ఇట్టి తపోబలమువల్లనే ధృవుడు తరించెను. దానిచేతనే ప్రహ్లాదుడు పరమభాగవతోత్తముడై చిరస్మరణీయు డయ్యెను. ఆత్మగౌరవాహంకారములు ప్రబలుటచేతనే కదా యయాతి స్వర్గభ్రష్టుడై మర్త్యలోకమున కొంతకాలము తపస్సుచేసెను. యుధిష్ఠిరు డెంతో తపస్సుచేసి భీష్మునిచేత ధర్మతత్వ ముపదేశింపబడినా అహమిక పూర్తిగా నశించకపోవడముచేతనే శ్రీకృష్ణుని కటువాక్యములు వినవలసివచ్చెను. ధర్మరాజుచరితమంతా ఉగ్రమైన ధర్మతపశ్చరణమందు లగ్నమైనట్లు తోచును. అతడు సంతతము బ్రాహ్మణుల సంసర్గముచేతా ఋషుల ఉపదేశముల మూలానా చిత్తశాంతి చిత్తశుద్ధిన్నీ సమకూర్చుకొనడానికి యత్నిస్తూ ఉండెను. తప: ప్రభావము వల్లనే ధర్మవ్యాధుడు దివ్యత్వము పొందెనని మహాభారమందుంది. ఆతడు వృద్ధులగుతలిదండ్రుల దేవతలవలె పూజిస్తూ ప్రేమవ్రతము నాచరించెను, కావున కౌశికునకు దేవతాదర్శ రూపమగు పితృభక్తి మచ్చు చూపగల్గెను. ఆవృద్ధదంపతులు ప్రేమకున్నూ భక్తికిన్నీ నిధానములై ప్రత్యక్షదేవత లయినారు. ధర్మవ్యాధుని చూచినవెంటనే కౌశికునికి కూడా తన పితరుల పూజించు నిచ్ఛ వొడమింది. సతీమతల్లియైన బ్రాహ్మణుని భార్య యిందుకే కౌశికుని అక్కడికి పంపింది. ఆమె ఏకాంతచిత్తముతో సతీవ్రత మాచరిస్తూ ఉన్న సాధ్వీమణి. కుంతి గాంధారి మొదలగు పతివ్రత లిట్టి తపస్వినులే.

ఆర్యసాహిత్యమున చిత్రింపబడిన మానవపాత్రములు సామాన్యములు కావు. అందరూ దేవత్వము లభించడమునకై తపోవ్రతధారులై యత్నించేవారే. వారిప్రకర్ష చక్కగా కనబడుటకు వారిప్రక్కనే దైత్య దానవ రాక్షసుల చిత్రము లమర్చబడ్డవి. ఈ పాపచిత్రములు కూడ మానుష చిత్రములే కాని వాటిలో అరిషడ్వర్గము అత్యధికముగా చెల రేగింది. ఇంద్రియవశుడైన మానవుడు సంయమము కోలుపోవడము వానికి స్వేచ్ఛాచరణము స్వాభావికము కావడమున్నూ దానవచరితములందు స్పష్టమగును. ఆర్యసాహిత్యమున చిత్రితులైన స్త్రీపురుషులను నాలుగు తెగలుగా విభజింప వచ్చును : _ దేవతలు - ఋషులు - మనుష్యులు - దానవులు.

ఈ మనుష్యచిత్రములే యథార్థమైన మానవపాత్రములు. అంతశ్శత్రుప్రాబల్య విశిష్టమగు సాధారణమానవచరితముల కన్న అవి ఉత్తమములు. అందు క్రమముగా దేవత్వము వికాస మొందును. వారు ఇంద్రియ నిగ్రహముచేత చిత్తైకాగ్రతను సాధించి విశ్వప్రేమ నతిశయింప జేయుదురు. దేవతలున్నూ సంసారులే, వారికీ పుత్రమిత్రకళత్రాదులు కల్పింప బడ్డారు, సంసారులైనావాళ్లప్రేమ విశ్వవ్యాపిని కావడముచేత వాళ్ళెప్పుడూ విశ్వరక్షణమందు వ్యగ్రులై ఉంటారు. వాళ్ల చరిత్రలే మానవుల కాదర్శములు. ప్రేమను సర్వజంతువులకూ సమముగా పంచి యివ్వడమే దేవత్వము సాధించడము. ఇది కఠినవ్రతము, దీని ప్రభావముచేతనే ప్రేమభక్తిమిశ్రితమై పెద్దలందు ప్రవర్తించును. దీనినే పాశ్చాత్యులు Hero Worship అంటారు. పెద్దలు లోకాంతరగతులైన వెన్క తర్పణములు, శ్రాద్ధములు మొదలగు కర్మలమూలాన వారు మృతజీవు లగుదురు. గురుజనమందు లగ్నమైనప్రేమ భగవదర్పితమై తద్వారా సర్వభూతములందున్నూ వ్యాపించును. భగవంతుడు సర్వాంతర్యామియైనట్లు జ్ఞానదృష్టికి ప్రత్యక్షు డగునప్పుడు భక్తు డిట్టు స్తుతించును : _

                 పశ్యామి దేవాం స్తవ దేవ దేహే సర్వాం స్తథా భూతవిశేష సంఘాన్
                 బ్రహ్మాణ మీశం కమలాసనస్థ మృషీంశ్చ సర్వా సురగాంశ్చ దివ్యాన్||
                 అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో నంత రూపమ్
                 నాంతం నమధ్యం నపున స్తనాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప|
                                                                           భగవద్గీత.
                 కనియెద దేన నీదు ఘనకాయమునందు సమస్త దేవతా
                 లిని, మరి పల్దెరంగుల వెలింగెడునట్టి అశేషభూతకో
                 టిని, సభ పద్మపీఠమున ఠీవిని దీర్చినయట్టి బ్రహ్మదే
                 వుని, తగ దివ్యమౌ నురగపుంజము, సర్వమునిప్రపంచమున్.

                 పెక్కుచేతులు పెక్కు కడ్పులు పెక్కు మోములు నేత్రముల్
                 పెక్కు దాలిచి కానిపించెదు పెక్కురూపుల నెల్లెడన్
                 నిక్కమిప్పుడు విశ్వరూపుడ నీకు నంతము మధ్యమౌ
                 యిక్క యాదియు గానిపింపన యెందు నో జగదీశ్వరా -
                                              ..................తా||ల||న||

సమాప్తము.

  1.              *Tis beauty that doth oft make women proud;
                   Tis virtue that doth make them most-admired;
                   Tis government that makes them seem divine.
                                                     ... ... ... Shak

                   స్త్రీల తరుచుగ గర్వింప జేసెడునది
                   సొగసు, వారల మిక్కిలి పొగడబడగ
                   సలుపునది సద్గుణంబు, వేల్పులుగవారు
                   తెలియబడజేయునది జితేంద్రియత చూవె.
                                                    అ|| నా|| దా||

  2. * వ్యక్తమైన ప్రతిపదార్థమందున్నూ అవ్యక్తమైన ఆత్మ నిహితమై యున్నదనిన్నీ, "ఏకమే నాద్వితీయ"మ్మని మనమెరిగి ప్రేమించవలసిన పదార్థ మదే అనియు, ప్రతివస్తువునకు సత్తా దానివల్లనే కలుగుననియు, వస్తువునందు మనకుగల ప్రేమ ఆత్మయందు నిహిత మొనర్చవలెననియు ఋషి అభిప్రాయము.
  3. * వ్యభిచారమునుగూర్చి మనవారు చేసిన కట్టడి చాలా గట్టిది. ఇది కేవలము కాయికముగానే తలపబడలేదు. మనసులోనూ మాటయందైనా స్త్రీపురుషుల చిత్త మన్యాయత్తము కాగూడని మనవారి నియమము... స్త్రీలను మూడు తెగలుగా భాగించవచ్చును: _ కలలోనైన అన్యపురుషుని దలపక, సర్వము పతియే అని భావించు నారీమణి "సతి" అత్యుత్తమురాలు. పతినిగాక అన్యుల దలచినా వారి నందరినీ సోదరభావమున జూచునామె ఉత్తమురాలు. ఇతరులయెడ నింత ఉత్కృష్టభావనలేక అందరూ ఏమనుకుందురో అను బిడియము చేతకాని వీలు చిక్కకపోవడముచేతకాని వ్యభిచరించనిది మధ్యమ. పతిని పూరికైన కొనక ఇతరులతో సంచరించునది అధమురాలు. పతి నగౌరవపరచు కాంత పశువుతో సమానము. ఈ పద్ధతి పురుషులకుకూడా వర్తించును.
                        Not the king's crown, nor the deputed sword,
                        The marshal's truncheon, nor the Judge's robe,
                        Become them with one half so good a grace
                        As mercy does....................................Shak.

                        కాదునృపాలమౌళియును, కాదధికారికిగల్గు కత్తియున్,
                        కాదుచమూనియంతృగద, కాదుసభాపతిమేని అంగియున్.
                        కాదరవీసమైన దయకైవడి శ్రేష్ఠవిభూషణంబు.
                        ...........................................................
                                                               ఆ|| నా|| దా||