సత్యశోధన/రెండవభాగం/3. మొదటి కేసు
3. మొదటి కేసు
నేను బొంబాయిలో ఒక వంక హిందూ లా చదవడం, మరోవంక భోజనం విషయంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. మిత్రుడు వీరచంద్‌గాంధీ నాకు సహకరించాడు. మా అన్నగారు నాకోసం కేసుల్ని తీసుకువచ్చేందుకు కృషి చేయసాగారు.
హిందూ లా చదవడం విసుగు పని. సివిల్ ప్రొసీజరు కోడ్ నాకు నడవలేదు. ఎవిడెన్సు ఆక్టు విషయం వేరు. వీరచంద్ గాంధీ సొలిసిటర్ పరీక్షకు చదువుతూ వున్నాడు. అతడు బారిస్టర్ వృత్తిని గురించీ, వకీళ్లను గురించి రకరకాల గాధలు చెబుతూ వుండేవారు. లా శాస్త్రంలో అగాధమైన విజ్ఞానమే ఫిరోజ్ షా గారి యోగ్యతకు నిపుణతకు కారణం. ఆయనకు ఎవిడెన్సు ఆక్టు పూర్తిగా బట్టీ. 32వ సెక్షనులోని ప్రతి కేసు ఆయనకు కంఠోపాఠం. బదరుద్దీన్ తయాబ్జీగారి వాదనా పటిమ చూచి జడ్జీలు నివ్వెరబోయేవారు. యిట్టి అతిరధుల మహారథుల గాధలు విని నా గుండె నీరైపోతూ వుండేది.
ఇంకా “కొత్త బారిస్టర్లకు అయిదారు మాసాల పాటు పని ఏమీ వుండదు. యిదిఅందరికీ తెలిసిన విషయం. అందువల్లనే నేను సొలిసిటర్ జనరల్ కోర్సు చదువుతున్నాను. నీవు యింకా మూడు నాలుగు మాసాలలో డబ్బు సంపాదించగలిగితే అదృష్టమే.” అని అన్నాడు. నెలనెలకు ఇంటి ఖర్చు పెరిగిపోతున్నది. ఇంటి బయట బారిష్టరు అని బోర్డు కట్టి, ఇంటి లోపల కూర్చొని బారిష్టరు వృత్తికి కృషిచేయడం నాకు నచ్చలేదు. యీ విధమైన పరిస్థితి వల్ల గ్రంథపఠనంలో మనస్సు లీనంకాలేదు. ఎవిడెన్సు ఆక్టుమీద బలవంతాన ఆసక్తి పెంచుకున్నాను. మైస్‌గారు రచించిన “హిందూలా” ను ఉత్సాహంతో చదివాను. కాని కోర్టులో వాదించేందుకు గుండె చాలలేదు. యిక నా కష్టం ఆ దేవుడికే ఎరుక. అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలికంటే నా పని కనాకష్టమైపోయింది. ఈ వయసులోనే మమీబాయి అను ఆమె కేసు ఒకటి తీసుకున్నాను. అది స్మాల్ కాజుకు సంబంధించినది. మధ్య దళారి కొంత సొమ్ము కమీషను యిమ్మని అడిగాడు. నేను పైస కూడా యివ్వనన్నాను. “ఫలానా పెద్ద లాయరు నెలకు మూడు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయనే కమీషను సొమ్ము యిస్తాడు కదా!” “ఆయనతో నాకు పోటీ లేదు. నాకు మూడు వందల రూపాయలు చాలు. మా నాయన అంతకంటే ఎక్కువ సంపాదించలేదు.” “అది ఇక్ష్వాకుల కాలం. బొంబాయిలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ప్రపంచాన్ని అర్ధం చేసుకొనిమెలగడం మంచిది.” కాని నేను మెత్తబడలేదు. అయినా ఆమె కేసు నాకే వచ్చింది. అది చాలా తేలిక వ్యవహారం. ముప్పది రూపాయల ఫీజు తీసుకున్నాను. ఒకరోజు కన్న ఆ కేసుకు ఎక్కువ సమయం పట్టదు.
స్మాల్ కాజ్ కోర్టులో ఇదే నాకు మొదటి కేసు. ‘హరిః ఓమ్’ అన్న మాట. నేను ప్రతివాది పక్షం. అందువల్ల వారి తరఫు సాక్షుల్ని క్రాస్ చేయాల్సి వచ్చింది. కోర్టులో లేచి నుంచున్నాను. గుండె దడదడలాడింది. తల తిరిగిపోయింది. కోర్టంతా తిరిగిపోతున్నట్లనిపించింది. ప్రశ్నలు అడుగుదామంటే నోరు తెరుపుడు పడలేదు. జడ్జి నవ్వి వుంటాడు. తోటి వకీళ్లకు కూడా నవ్వు వచ్చి వుంటుంది. కాని నేను యిదంతా పట్టించుకునే స్థితిలో లేను. నేను కుర్చీలో కూర్చుండిపోయాను. ఏజంటును పిలిచి “ఈ కేసును వదిలేస్తున్నాను. మరొక పటేలును పెట్టుకోండి. నాకిచ్చిన రుసుం ముప్పది రూపాయలు తిరిగి ఇచ్చివేస్తాను” అని చెప్పి సొమ్ము యిచ్చి వేశాను. వాళ్లు యాభై రూపాయలకు పటేలును కుదుర్చుకున్నారు. ఆ కేసు ఆయనకు బహు సులభం.
నేను గబగబా యింటికి వెళ్లాను. ఆ కేసు ఏమైందో నాకు తెలియదు. నాకు మాత్రం చాలా సిగ్గువేసింది. యిక కేసులు తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చాను. దక్షిణ ఆఫ్రికా పోనంతవరకు ఆ కేసుల వైపు చూడలేదు. యీ విధమైన నిర్ణయం మంచిదికాదు కాని ఆ సమయంలో అది మంచిదే అయింది. ఓడిపోయేందుకై నాకు ఎవ్వడూ కేసులు యివ్వడుకదా!
బొంబాయిలో నా దగ్గరికి మరో కేసు వచ్చింది. అయితే అందు కేవలం అర్జీ మాత్రమే వ్రాయాలి. పోరుబందరులో నిరుపేదయగు ఒక తురకవాని భూమిని సంస్థానం వారు జప్తు చేశారు. మా తండ్రి గారి గౌరవాన్ని బట్టి అతడు నా సాయం కోరాడు. అతని వాదంలో బలం లేదు. అయినా అర్జీవ్రాసి యిచ్చేందుకు అంగీకరించాను. దానికి అయ్యే ఖర్చు అతడే భరించాడు. చిత్తు వ్రాసి మిత్రులకు వినిపించాను. బాగున్నదని వారంతా అన్నారు. దానితో యిట్టి అర్జీలనైనా వ్రాయగలననే ధైర్యం కలిగింది. అది నిజం కూడా.
డబ్చు పుచ్చుకోకుండా యీ విధంగా అర్జీలు వ్రాసి పెట్టడానికి సమయం బాగా పట్టేది. కాని బండి సాగాలికదా! అందువల్ల ఉపాధ్యాయ వృత్తి ఏదైనా దొరుకుతుందేమోనని చూచాను. నాకు ఇంగ్లీషు భాష వచ్చు. అందువల్ల మెట్రిక్యులేషన్ పిల్లలకు ఇంగ్లీషు నేర్పే ఉపాధ్యాయ పదవి లభిస్తే మంచిదని యింటి ఖర్చులకు కొంత సరిపోతుందని భావించాను. పత్రికలలో ఒక విజ్ఞాపన “ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు కావాలి. ఒక గంట ఇంగ్లీషు బోధించాలి. జీతం నెలకు 75 రూపాయలు” అని వెలువడింది. అది అక్కడి ఒక ప్రసిద్ధ హైస్కూలు వారి విజ్ఞాపన. వారికి అప్లికేషన్ పంపాను. వారు వచ్చి కలవమని జాబు వ్రాశారు. నేను సంతోషంతో వెళ్లాను. బి ఏ ప్యాసు కాలేదు. గనుక నీవు మాకు పనికిరావని ఆ స్కూలు హెడ్‌మాస్టరు చెప్పివేశాడు.
‘నేను లాటిన్ ద్వితీయ భాషగా ఇంగ్లాండులో మెట్రిక్యులేషన్ పరీక్ష పాసైనాను.‘ “నిజమే కాని మాకు కావలసింది బి.ఏ." ఆ ఉద్యోగం దొరకలేదు. బాధపడ్డాను. మా అన్నగారుకూడా చాలా బాధపడ్డారు. యిక బొంబాయిలో వుండటం అనవసరమని నిర్ణయానికి వచ్చాను. నేను రాజకోటలో వుండటం మంచిది. అక్కడ మా అన్నగారు చిన్న వకీలు. ఆయన అర్జీలు వ్రాసేపని నాకు అప్పగించగలడు. రాజకోటలో సంసారం వున్నది. బొంబాయిలో సంసారం ఎత్తివేస్తే ఖర్చులు తగ్గిపోతాయి కనుక బొంబాయిలో ఆరు నెలల నివాసానికి స్వస్తి చెప్పాను.
బొంబాయిలో నేను ప్రతిరోజు హైకోర్టుకు వెళుతూ వుండేవాణ్ణి. కాని అక్కడ నాకేమీ ప్రయోజనం కలుగలేదు. ఎక్కువ నేర్చుకుందామనే ఆసక్తి కూడా కలుగలేదు. అక్కడ నడిచే కేసులు అర్థం కాక చాలాసార్లు నిద్ర వచ్చేది. నాతోబాటు యింకా కొంతమంది నిద్రబోయే వకీళ్ళు కూడా వున్నందున నేను సిగ్గుపడలేదు. తరువాత హైకోర్టులో కూర్చొని నిద్రపోవడం కూడా దర్జాయే అని భావించి సిగ్గుపడటం పూర్తిగా మానివేశాను.
నడిచి వెళ్లడం, యింటికి రావడం అలవాటు చేసుకున్నాను. నడిచి వెళ్లడానికి నలభై అయిదు నిమిషాలు పట్టేది. వచ్చేటప్పుడూ అంతే. ఎండకు తట్టుకునేవాణ్ణి. అందువల్ల ఖర్చు బాగా తగ్గింది. నా మిత్రులు చాలామంది జబ్బుపడుతూ వుండేవారు. కాని నేను మాత్రం జబ్బు పడలేదు. డబ్బు రావడం ప్రారంభమైన తరువాత కూడా నేను నడిచే వెళుతూ వున్నాను. ఆనాటి ఆ అలవాటు యొక్క సత్ఫలితం నేను యీనాటికీ పొందుతున్నాను.