సత్యశోధన/రెండవభాగం
రెండవ భాగం
1. రాయచంద్ భాయి
బొంబాయి రేవు దగ్గర సముద్రం అల్లకల్లోలంగా వున్నదని గత ప్రకరణంలో వ్రాశాను. జూన్, జూలై మాసాల్లో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా వుండటం సహజం. ఓడలో వాళ్ళంతా జబ్బుపడ్డారు. నేను మాత్రం జబ్బు పడలేదు. డెక్ మీద వుండి సముద్రంలో రేగిన తుఫానును చూస్తూ వున్నాను. ప్రొద్దుటి భోజనంలో నాతోబాటు యిద్దరు ముగ్గురు పాల్గొన్నారు. పళ్లాలు జాగ్రత్తగా పట్టుకొని వరిగల పిండితో తయారైన గంజి త్రాగుతున్నాము. పళ్లెం జాగ్రత్తగా పట్టుకోకపోతే అది తన దారి తాను చూచుకొనే స్థితిలో వుంది. తుఫాను అంత తీవ్రంగా వుందన్నమాట.
బయటి తుఫానుకు, నాలో వీస్తున్న తుఫానుకు భయపడని నేను లోపలి తుఫానుకు చలించనని పాఠకులకు బోధపడేవుంటుందని భావిస్తున్నాను. బొంబాయి చేరి ఇంటికి వెళ్లగానే కుల బహిష్కారం సిద్ధంగా వున్నది. ప్లీడరు వృత్తికి నేను తగనని గతంలో వ్రాశాను. నేను సంస్కర్తను. కనుక ఏఏ విషయాలు ఏఏ విధంగా సంస్కరించాలా అని ఆలోచించసాగాను. కాని తర్కానికి కొరుకుడు పడని కొన్ని సమస్యలు నాకోసం ఎదురుచూస్తున్నాయి.
నన్ను కలుసుకునేందుకు మా పెద్దన్నగారు బొంబాయి రేవు దగ్గరకు వచ్చారు. డా. మెహతాగారితోను, వారి పెద్దన్నగారితోను ఆయనకు అదివరకే పరిచయం ఏర్పడింది. డా. మెహతాగారు తమ ఇంటికి రమ్మని గట్టిగా పట్టు పట్టడం వల్ల మేమంతా వారి ఇంటికి వెళ్ళాము. ఆంగ్లదేశంలో ఏర్పడిన మా పరిచయం వృద్ధి అయింది. ఇక్కడ గల వారి కుటుంబానికీ, మా కుటుంబానికీ సంబంధాలు బాగా పెరిగాయి.
మా “అమ్మ”ను త్వరగా చూడాలని తహతహప్రారంభమైంది. కాని ఆమె లోకాన్ని వీడిపోయిందను వార్త మా అన్నగారు ముందు నాకు తెలియచేయలేదు. ఓడ దిగిన తరువాత చెప్పారు. నేను సూతక స్నానం చేశాను. నేను ఇంగ్లాండులో వున్నప్పుడే ఆమె చనిపోయింది. యీ సంగతి తెలిస్తే బాధపడిపోతానని మా అన్నగారు నాకు తెలియజేయలేదు. యి వార్త విన్నప్పుడు నాకు అపరిమితమైన దుఃఖం కలిగింది. ఏడుపు పెల్లుబికింది. కాని యిప్పుడు యిక ఆ గాధ అప్రస్తుతమే కదా! మా తండ్రిగారు గతించినప్పుడు కలిగిన వ్యధకంటే యిది అత్యధికం. నా కోరికలన్నీ గొంతెమ్మ కోరికలే అయ్యాయి. కాని అప్పుడు దుఃఖానికి కళ్ళెం వేసుకున్నట్లు గుర్తు. నేను కంట తడిబెట్టలేదు. మా అమ్మగారు చనిపోనట్లే వ్యవహరించి, నా వ్యవహారాలు నేను చక్కదిద్దుకోసాగాను. డా. మెహతాగారు చాలామందిని నాకు పరిచయం చేశారు. వారిలో దేవాశంకర్ జగజీవన్‌గారు ఒకరు. వారి మైత్రి యావజ్జీవిత మైత్రిగా మారింది. అప్పుడే మెహతాగారు నాకు రాయచంద్ కవి లేక రాజచంద్ర కవిగారిని పరిచయం చేశారు. వీరు డా. మెహతాగారి పెద్దన్న గారి అల్లుడు. దేవా శంకర్ జగజీవన్‌గారి నగల దుకాణంలో భాగస్వామి. నాకు వారితో పరిచయం కలగడం పెద్ద విశేషం. వారికి అప్పుడు ఇరవై అయిదేండ్లు. చూడగానే వారు నిర్మల చరిత్రులని, విద్వాంసులని తెలుసుకోగలిగాను. వారు శతావధానులు. డా. మెహతా గారు రాజచంద్ర కవిగారి ధారణా పటిమను కొంచెం చూడమని చెప్పారు. నాకు వచ్చిన పాశ్చాత్య భాషాపాండిత్యాన్ని అధికంగా ఆయన ముందు ఉపయోగించాను. నేనెట్లా చదివితే రాజచంద్ర కవిగారు అట్లా చదివారు. ఆయన సామర్ధ్యం చూచి నేను తట్టుకోలేకపోయాను. ధారణ, శతావధానం, అను శక్తులకు నేను ముగ్ధుడిని కాలేదు. నన్ను ముగ్ధుణ్ణి చేసిన విశేషం తరువాత బోధపడింది. అది వారి విశాల శాస్త్రజ్ఞానం. నిర్మలమైన వారి నడత. ఆత్మజ్ఞానం యెడ వారికి గల తీవ్రమైన తపన, యీ చివరి దానికోసమే వారు తన జీవితాన్ని వినియోగించారని తరువాత తెలిసింది. శ్రీముక్తానందుడు రచించిన క్రింది ఛందం ఆయన సదా స్మరిస్తూ వుండేవారు. వారి హృదయంలో యీ గేయం అంకితమై పోయింది.
హనుతాం రమతాం ప్రగట హారి దేఖుంరే, మారుం జీవ్యూం సఫల తవ లేఖుంరే,
ముక్తానందనో, నాధ విహారీరే. ఓధా జీవనదోరీ అమారీరే.
(నవ్వుతూ ఆడుతూ పాడుతూ ప్రతిపనిలో హరిని దర్శించితేనే నా జీవితం ధన్యమని భావిస్తాను. నా ప్రభువు భగవంతుడే. ఆయనే నా జీవితానికి సూత్రం. యిది ముక్తానందుని కథనం). ఆయన వ్యాపారం లక్షలమీద సాగుతున్నది. ముత్యాల, వజ్రాల, రత్నాల వ్యాపారమందతని ప్రజ్ఞ అసామాన్యం. ఎంతటి చిక్కు సమస్యనైనా యిట్టే పరిష్కరించగల శక్తి ఆయనకు వుంది. కాని నిజానికి బుద్ధి లౌకిక వ్యవహారాల్లో చిక్కుకొని వుండిపోలేదు. ఆయన ఎప్పుడూ పురుషార్ధం, ఆత్మ సాక్షాత్కారం, హరిదర్శనం అంటూ ఆ భావనలో లీనమైయుండేవాడు. ఆయన వ్రాత బల్లమీద చిఠ్ఠాలతో పాటు ఏదో ఒక వేదాంత గ్రంథం, దినచర్య (డైరీ) వ్రాసుకొనే పుస్తకం వుండేవి. వ్యవహారం ముగియగానే ఆ రెండిటిలో ఒక పుస్తకం తీసుకొనేవారు. యీ డైరీ నుంచి సమీకరించి ఆయన పలు గ్రంథాలు ప్రకటించారు. ఆయన లక్షల కొద్ది వ్యాపారస్తులతో లావాదేవీలు జరిపిన తరువాత ఆత్మజ్ఞానానికి సంబంధించిన గూఢ విషయాలు వ్రాస్తూ వుండేవారు. ఆయన సామాన్య వర్తకుడు కాడు. జ్ఞానకోటి లోనివాడు. దుకాణంలో వ్యాపారం సాగుతూ వుండగా ఆయన ధ్యానమగ్నుడై పుండటం అనేక పర్యాయాలు నేను చూచాను. ఆయన అందరితోను సమానంగా వ్యవహరించేవాడు. ఆయనకు నా విషయంలో స్వార్థం ఏమీలేదు. వారితో గాఢ పరిచయం కలిగింది. నేను అప్పటికి పనిపాటలు లేని బారిస్టరును. నేను వారి దుకాణానికి వెళ్ళినప్పుడు వేదాంత చర్చ దప్ప మరో చర్చ జరిగేదికాదు. నాకు అప్పటికి వేదాంత విషయాల్లో అంతగా ప్రవేశం లేదు. అయినా వారి మాటలే నాకు మంత్రాలుగా వుండేవి. తరువాత నేను అనేకమంది మతాచార్యుల్ని దర్శించాను. ప్రత్యేకించి విశేష ప్రజ్ఞ కలిగిన ఆచార్యుని కోసం అన్వేషించాను. కాని రాయచంద్‌భాయి యిచ్చే ఉపదేశాల వంటివి ఎక్కడా లభించలేదు. వారి ఉపదేశం సూటిగా హృదయంలో నాటుకునేది. వారి బుద్ధి యెడ, వారి ప్రామాణికత్వం యెడ నాకు అపారమైన ఆదరణ ఏర్పడింది. ఆయన నన్ను అన్యమార్గానికి తీసుకుపోడనే నమ్మకం నాకు కలిగింది. తన హృదయంలో వుండే భావాలు కొన్ని నాకు ఆయన చెబుతూ వుండేవాడు. భగవంతుణ్ణి గురించి తెలిసీ తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన అండగా కనిపించేవాడు. రాయచంద్‌భాయి యెడ నాకు యింత గౌరవం వున్నా ఆయనను ఆధ్యాత్మిక గురువుగా నేను భావించలేకపోయాను. నా హృదయమందలి ఆ సింహాసనం యింకా ఖాళీగానే వున్నది. నా అన్వేషణ యింకా సాగుతూనే వున్నది.
హిందూ వేదాంతం గురువు అను పదానికి ఎంతో మహత్తు కల్పించింది. దాన్ని నేను అంగీకరిస్తాను. గురువు లేనిదే ముక్తిలేదన్న విషయం సత్యం. అక్షర జ్ఞానం కలిగించే గురువు అజ్ఞాని అయినా ఫరవాలేదు. కాని ఆధ్యాత్మిక గురువు అసమర్ధుడైతే సాగదు. గురువు పదవికి పూర్ణ జ్ఞానియే అర్హుడు. జ్ఞానప్రాప్తి కోసం సదా సర్వదా శోధన ఆవసరం. శిష్యుని యోగ్యతననుసరించి గురువు లభిస్తాడు. తన తన యోగ్యతను బట్టి ప్రతి సాధకుడు ప్రయత్నించవచ్చు. అట్టి అధికారం అతనికి వుంటుంది. ఫలితం ఈశ్వరాధీనం. నేను రాయచంద్‌భాయిని నా ఆధ్యాత్మిక గురువుగా భావించక పోయినప్పటికీ ఎన్నోసార్లు ఆయన నాకు మార్గదర్శకుడుగాను, సహాయకుడుగాను తోడ్పడి సహకరించారు. ఆ వివరం రాబోయే ప్రకరణాల్లో మీకు తెలుస్తుంది. నా జీవితంలో తమ గాఢముద్రను హత్తిన వారు ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు ఆధునిక యుగానికి చెందినవారే. రాయచంద్‌భాయి ప్రత్యక్షసాంగత్యం వల్ల నా హృదయంలో నాటుకుపోయారు. రెండవవారు టాల్‌స్టాయి. వారు రచించిన “వైకుంఠం నీ హృదయంలోనే” (the kingdom of God is within you) అను గ్రంధం ద్వారాను, మూడవవారు రస్కిన్. తాము రచించిన ‘సర్వోదయం’ (unto this last) అను పుస్తకం ద్వారాను నా హృదయంలో నిలిచిపోయారు. సమయ, సందర్భాలను బట్టి వివరాలు తరువాత చెబుతాను.
2. జీవనయాత్ర
మా అన్నగారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయనకు ధనం, కీర్తి, పదవి, మూడూ కావాలి. ఆయన దోషాల్ని క్షమించగల విశాల హృదయుడు. దానికి తోడు నిరాడంబరమైన ప్రవర్తన కలవాడు. అందువల్ల ఆయనకు మిత్రులు ఎక్కువగా వుండేవారు. తన యీ మిత్రుల సహాయంతో నాకు కేసులు తెప్పించాలని ఆయన భావించాడు. నా ప్లీడరు వృత్తి బాగా సాగుతుందని భావించి ఇంటి ఖర్చులు బాగా పెంచివేశాడు. నా ప్రాక్టీసు కోసం ఆయన ఎంతో కృషి చేశాడు.
నా సముద్రయానపు తుఫాను యింకా వీస్తూనే వుంది. మా కులంలో రెండు పక్షాలు బయలుదేరాయి. ఒక పక్షంవారు నన్ను వెంటనే కులంలో కలుపుకున్నారు. రెండో పక్షం వారు యింకా కుల బహిష్కారం మీద పట్టిన పట్టు విడువలేదు. మమ్మల్ని కులంలో కలుపుకున్న వారిని సంతోష పెట్టడం కోసం మా అన్న నన్ను నాసికకు తీసుకుపోయి అక్కడ నదీస్నానం చేయించాడు. రాజకోట చేరగానే మా కులం వారికి భోజనాలు ఏర్పాటు చేశాడు. అందుకు నా మనస్సు అంగీకరించలేదు. కాని మా అన్నగారికి నామీదగల ప్రేమ అపారం. వారి యెడ నాకు భక్తి అపారం. అందువల్ల ఆయన చెప్పింది మంత్రంగా భావించి ఏం చేయమంటే అది చేశాను. యీ విధంగా జరిగిన తరువాత వెలిని గురించి యిక ఎవ్వరూ మాట్లాడలేదు. వారిమీద ఈర్ష్య ద్వేషం పెంచుకోలేదు. వారిలో కొందరు నన్ను ఏవగించుకునేవారు. కాని నేను వారి జోలికి పోకుండా జాగ్రత్తగా వుండేవాణ్ణి. వెలికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లను నేను పాటించేవాణ్ణి. మా అత్తమామలుగాని, అక్కబావలుకాని నన్ను భోజనానికి పిలిస్తే వాళ్లను వెలివేయవచ్చు. అందువల్ల నేను వాళ్ళ యిళ్ళలో మంచి నీళ్ళు కూడా పుచ్చుకొనేవాణ్ణి కాదు. మావాళ్లు చాటుమాటుగా మాతో కలుద్దామని చూచేవారు కాని నేను అంగీకరించేవాణ్ణి కాను. ఏది చేసినా బహిరంగంగా చేయాలిగాని చాటుమాటుగా చేయకూడదని నా అభిప్రాయం.
నేను జాగ్రత్తగా వున్నందువల్ల కులం వాళ్లు నా జోలికి రాలేదు. నన్ను వెలివేసిన వారిలో చాలామందికి నేనంటే అమిత ప్రేమ. మా కులానికి ఏదో చేస్తానని భావించకుండానే వారు నా ప్రయత్నానికి ఎంతగానో సహకరించారు. నా పనుల వల్ల యిట్టి సత్ఫలితం కలిగిందని నా విశ్వాసం. వెలివేసిన వారికి వ్యతిరేకంగా నేను వ్యహరించినా, స్వపక్షీయుల్ని కలుపుకొని రగడ ప్రారంభించినా వ్యవహారం ముదిరేదే. ఆంగ్ల దేశాన్నుంచి రాగానే యీ గొడవల్లో పడివుంటే నేను ఏదో కపటవేషం వేయక తప్పేదికాదు.
మా దాంపత్యం యింకా నేననుకున్నట్లు కుదుటపడలేదు. నేను ఆంగ్లదేశం వెళ్లిన తరువాత కూడా నా ద్వేష దుష్ట స్వభావం నన్ను విడిచి పెట్టలేదు. అడుగడుగునా తప్పులెన్నో జరిగాయి. నా స్వభావం యధాప్రకారంగానే వున్నది. అందువల్ల నా కోరిక నేరవేరలేదు. నా భార్యకు చదువు గరపాలి. కాని నా కామోద్రేకం అందుకు అడ్డుగా వున్నది. లోపం నాది. కాని కష్టం అనుభవించింది ఆమె. ఒకసారి ఆమెను పుట్టింటికి పంపివేయడానికి కూడా సిద్ధపడ్డాను. అనేక కష్టాలపాలు చేసిన తరువాతనే ఆమెను దగ్గరకు రానిచ్చాను. కొంత కాలానికి తప్పంతా నాదేనని గ్రహించాను.
మా బాలుర విద్యాభ్యాసాన్ని సంస్కరించాలని పూనుకున్నాను. మా అన్నగారికి పిల్లలు వున్నారు. ఆంగ్లదేశం వెళ్లక పూర్వం నాకు పిల్లవాడు పుట్టాడు. వాడికి యిప్పుడు నాలుగేండ్లు. వీళ్ల చేత కసరత్తు చేయిoచి వీళ్లను వజ్రకాయుల్ని చేయాలని, ఎప్పుడూ నా కనుసన్నల్లో వాళ్లను వుంచుకొని పెంచాలని భావించాను. మా అన్నగారు అందుకు అంగీకరించారు. అందువల్ల యీ విషయంలో నాకు సాఫల్యం లభించింది. పిల్లలతో కలసి వుండటం నాకు యిష్టం. పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో నవ్వులాడటం అంటే నాకు యిప్పటికీ యిష్టమే. నేను పిల్లలకు మంచి ఉపాధ్యాయుణ్ణి కాగలిగానని నా విశ్వాసం.
అన్నపానీయాల విషయంలో సంస్కరణ అవసరమని భావించాను. మా యింట్లో కాఫీ, టీలు ప్రవేశించాయి. నేను ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చేసరికి మా ఇంటికి ఆంగ్ల దొరల గృహ పోలికలు ఏర్పడేలా చూడాలని మా అన్నగారు భావించారు. అందుకోసం ఇంట్లో పింగాణీ సామాను పెరిగిపోయింది. కాఫీ, టీలకు బదులు కోకో, వరిగ పిండి జావల్ని ప్రవేశ పెట్టాను. పేరుకు మాత్రమే యీ మార్పుగాని, యివి కూడా కాఫీ టీలకు తోడయ్యాయి. మేజోళ్లు ముందే ప్రవేశంచాయి. యిక నేను కోటు, ఫాంటు ధరించి మా ఇంటిని పావనం చేశాను.
దానితో ఇంటి ఖర్చు పెరిగిపోయింది. ప్రతిరోజూ ఏవేవో క్రొత్త వస్తువులు రాసాగాయి. తెల్ల ఏనుగు చందాన మా పరిస్థితి మారింది. కాని ఆ తెల్ల ఏనుగుకు మేత కావాలి కదా? అది ఏదీ? రాజకోటలో వృత్తి ప్రారంభించడం నాకు యిష్టం లేదు. వకీలుకు వుండవలసిన జ్ఞానం నాకు లేదని తెలుసు. ఫీజు మాత్రం పెద్ద వకీళ్లంతగా లాగాలని ఉబలాటం. వ్యాజ్యానికి నన్ను కుదుర్చుకునే మూర్ఖుడెవడు? ఒకవేళ ఎవడైనా వున్నా నా తెలివి తక్కువకు తోడు నా అహంకారాన్ని కూడా కలిపి మొత్తం భారం నెత్తిన వేసుకోవాలిగదా !
బొంబాయి వెళ్లి అక్కడ హైకోర్టులో కొంత అనుభవం గడిస్తూ, హిందూలా చదువుతూ, వ్యాజ్యాలతో, కొంతకాలం గడపడం మంచిదని మిత్రులు సలహా యిచ్చారు. ఆ ప్రకారం నేను బొంబాయి వెళ్లాను.
ఇల్లు తీసుకున్నాను. వంటవాణ్ణి పెట్టుకున్నాను. నాకు అతడు తగినవాడే. బ్రాహ్మణుడు. అతణ్ణి నేను నౌకరుగా భావించలేదు. కుటుంబంలో ఒకడిగా భావించాను. అతడు లింగం మీద నీళ్లు పోసినట్లు ఒంటిమీద నీళ్లు పోసుకునేవాడు. ఒళ్లు తోముకోడు. మడిపంచ మురికిగా వుండేది. జందెం మడ్డిగా వుండేది. శాస్త్రజ్ఞానం శూన్యం. నాకు యింతకంటే మంచి వంటవాడు ఎట్లా దొరుకుతాడు?
“ఏమండీ రవిశంకర్‌గారూ! మీకు వంట చేతకాకపోతే మానె. రెండు సంధ్యావందనం ముక్కలైనా రాకపోతే ఎలాగండీ!”
“అయ్యా! సంధ్యావందనమా! నాకు నాగలే సంధ్య. ఫాఆరే నిత్య కర్మ, ఏదో మాదిరి బ్రాహ్మణ్ణి. మీ అనుగ్రహం వల్ల బ్రతుకుతున్నాను. మీరు కాదంటే నాచేతి ముల్లుకర్ర మళ్లీ పుచ్చుకుంటాను.”
నేను రవిశంకర్‌కు గురుత్వం వహించాను. నాకు అంతా తీరికేగదా! సగం వంట నేనే చేసేవాణ్ణి. శాకాహారం తయారుచేయడంలో దొరల పద్ధతిని ప్రవేశ పెట్టాను. ఒక స్టౌ కొన్నాను. ఎవరితోనైనా సరే సహపంక్తి భోజనానికి నేను సిద్ధమే. రవిశంకర్‌కూ యిబ్బంది లేదు. మా యిద్దరికీ జోడు కుదిరింది. అయితే ఒక చిక్కు వచ్చిపడింది. మడ్డి గుడ్డలు విడవననీ, అన్నం పరిశుభ్రంగా వుంచననీ రవిశంకరుని ప్రతిజ్ఞ. దాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకొంటూ వున్నాడు, బొంబాయిలో నాలుగైదు మాసాల కంటే ఎక్కువకాలం వుండటానికి వీలుపడలేదు. అక్కడ ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ.
ఈ విధంగా సంసార సాగరంలో ఈత ప్రారంభించి వకీలు వృత్తి మంచిది కాదనే నిర్ణయానికి వచ్చాను. యిది కేవలం చూపుడు గుర్రమే. పైన పటారం, లోన లొటారం. ఇక నా కర్తవ్యం ఏమిటా అని ఆలోచనలో పడ్డాను.
3. మొదటి కేసు
నేను బొంబాయిలో ఒక వంక హిందూ లా చదవడం, మరోవంక భోజనం విషయంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. మిత్రుడు వీరచంద్‌గాంధీ నాకు సహకరించాడు. మా అన్నగారు నాకోసం కేసుల్ని తీసుకువచ్చేందుకు కృషి చేయసాగారు.
హిందూ లా చదవడం విసుగు పని. సివిల్ ప్రొసీజరు కోడ్ నాకు నడవలేదు. ఎవిడెన్సు ఆక్టు విషయం వేరు. వీరచంద్ గాంధీ సొలిసిటర్ పరీక్షకు చదువుతూ వున్నాడు. అతడు బారిస్టర్ వృత్తిని గురించీ, వకీళ్లను గురించి రకరకాల గాధలు చెబుతూ వుండేవారు. లా శాస్త్రంలో అగాధమైన విజ్ఞానమే ఫిరోజ్ షా గారి యోగ్యతకు నిపుణతకు కారణం. ఆయనకు ఎవిడెన్సు ఆక్టు పూర్తిగా బట్టీ. 32వ సెక్షనులోని ప్రతి కేసు ఆయనకు కంఠోపాఠం. బదరుద్దీన్ తయాబ్జీగారి వాదనా పటిమ చూచి జడ్జీలు నివ్వెరబోయేవారు. యిట్టి అతిరధుల మహారథుల గాధలు విని నా గుండె నీరైపోతూ వుండేది.
ఇంకా “కొత్త బారిస్టర్లకు అయిదారు మాసాల పాటు పని ఏమీ వుండదు. యిదిఅందరికీ తెలిసిన విషయం. అందువల్లనే నేను సొలిసిటర్ జనరల్ కోర్సు చదువుతున్నాను. నీవు యింకా మూడు నాలుగు మాసాలలో డబ్బు సంపాదించగలిగితే అదృష్టమే.” అని అన్నాడు. నెలనెలకు ఇంటి ఖర్చు పెరిగిపోతున్నది. ఇంటి బయట బారిష్టరు అని బోర్డు కట్టి, ఇంటి లోపల కూర్చొని బారిష్టరు వృత్తికి కృషిచేయడం నాకు నచ్చలేదు. యీ విధమైన పరిస్థితి వల్ల గ్రంథపఠనంలో మనస్సు లీనంకాలేదు. ఎవిడెన్సు ఆక్టుమీద బలవంతాన ఆసక్తి పెంచుకున్నాను. మైస్‌గారు రచించిన “హిందూలా” ను ఉత్సాహంతో చదివాను. కాని కోర్టులో వాదించేందుకు గుండె చాలలేదు. యిక నా కష్టం ఆ దేవుడికే ఎరుక. అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలికంటే నా పని కనాకష్టమైపోయింది. ఈ వయసులోనే మమీబాయి అను ఆమె కేసు ఒకటి తీసుకున్నాను. అది స్మాల్ కాజుకు సంబంధించినది. మధ్య దళారి కొంత సొమ్ము కమీషను యిమ్మని అడిగాడు. నేను పైస కూడా యివ్వనన్నాను. “ఫలానా పెద్ద లాయరు నెలకు మూడు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయనే కమీషను సొమ్ము యిస్తాడు కదా!” “ఆయనతో నాకు పోటీ లేదు. నాకు మూడు వందల రూపాయలు చాలు. మా నాయన అంతకంటే ఎక్కువ సంపాదించలేదు.” “అది ఇక్ష్వాకుల కాలం. బొంబాయిలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ప్రపంచాన్ని అర్ధం చేసుకొనిమెలగడం మంచిది.” కాని నేను మెత్తబడలేదు. అయినా ఆమె కేసు నాకే వచ్చింది. అది చాలా తేలిక వ్యవహారం. ముప్పది రూపాయల ఫీజు తీసుకున్నాను. ఒకరోజు కన్న ఆ కేసుకు ఎక్కువ సమయం పట్టదు.
స్మాల్ కాజ్ కోర్టులో ఇదే నాకు మొదటి కేసు. ‘హరిః ఓమ్’ అన్న మాట. నేను ప్రతివాది పక్షం. అందువల్ల వారి తరఫు సాక్షుల్ని క్రాస్ చేయాల్సి వచ్చింది. కోర్టులో లేచి నుంచున్నాను. గుండె దడదడలాడింది. తల తిరిగిపోయింది. కోర్టంతా తిరిగిపోతున్నట్లనిపించింది. ప్రశ్నలు అడుగుదామంటే నోరు తెరుపుడు పడలేదు. జడ్జి నవ్వి వుంటాడు. తోటి వకీళ్లకు కూడా నవ్వు వచ్చి వుంటుంది. కాని నేను యిదంతా పట్టించుకునే స్థితిలో లేను. నేను కుర్చీలో కూర్చుండిపోయాను. ఏజంటును పిలిచి “ఈ కేసును వదిలేస్తున్నాను. మరొక పటేలును పెట్టుకోండి. నాకిచ్చిన రుసుం ముప్పది రూపాయలు తిరిగి ఇచ్చివేస్తాను” అని చెప్పి సొమ్ము యిచ్చి వేశాను. వాళ్లు యాభై రూపాయలకు పటేలును కుదుర్చుకున్నారు. ఆ కేసు ఆయనకు బహు సులభం.
నేను గబగబా యింటికి వెళ్లాను. ఆ కేసు ఏమైందో నాకు తెలియదు. నాకు మాత్రం చాలా సిగ్గువేసింది. యిక కేసులు తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చాను. దక్షిణ ఆఫ్రికా పోనంతవరకు ఆ కేసుల వైపు చూడలేదు. యీ విధమైన నిర్ణయం మంచిదికాదు కాని ఆ సమయంలో అది మంచిదే అయింది. ఓడిపోయేందుకై నాకు ఎవ్వడూ కేసులు యివ్వడుకదా!
బొంబాయిలో నా దగ్గరికి మరో కేసు వచ్చింది. అయితే అందు కేవలం అర్జీ మాత్రమే వ్రాయాలి. పోరుబందరులో నిరుపేదయగు ఒక తురకవాని భూమిని సంస్థానం వారు జప్తు చేశారు. మా తండ్రి గారి గౌరవాన్ని బట్టి అతడు నా సాయం కోరాడు. అతని వాదంలో బలం లేదు. అయినా అర్జీవ్రాసి యిచ్చేందుకు అంగీకరించాను. దానికి అయ్యే ఖర్చు అతడే భరించాడు. చిత్తు వ్రాసి మిత్రులకు వినిపించాను. బాగున్నదని వారంతా అన్నారు. దానితో యిట్టి అర్జీలనైనా వ్రాయగలననే ధైర్యం కలిగింది. అది నిజం కూడా.
డబ్చు పుచ్చుకోకుండా యీ విధంగా అర్జీలు వ్రాసి పెట్టడానికి సమయం బాగా పట్టేది. కాని బండి సాగాలికదా! అందువల్ల ఉపాధ్యాయ వృత్తి ఏదైనా దొరుకుతుందేమోనని చూచాను. నాకు ఇంగ్లీషు భాష వచ్చు. అందువల్ల మెట్రిక్యులేషన్ పిల్లలకు ఇంగ్లీషు నేర్పే ఉపాధ్యాయ పదవి లభిస్తే మంచిదని యింటి ఖర్చులకు కొంత సరిపోతుందని భావించాను. పత్రికలలో ఒక విజ్ఞాపన “ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు కావాలి. ఒక గంట ఇంగ్లీషు బోధించాలి. జీతం నెలకు 75 రూపాయలు” అని వెలువడింది. అది అక్కడి ఒక ప్రసిద్ధ హైస్కూలు వారి విజ్ఞాపన. వారికి అప్లికేషన్ పంపాను. వారు వచ్చి కలవమని జాబు వ్రాశారు. నేను సంతోషంతో వెళ్లాను. బి ఏ ప్యాసు కాలేదు. గనుక నీవు మాకు పనికిరావని ఆ స్కూలు హెడ్‌మాస్టరు చెప్పివేశాడు.
‘నేను లాటిన్ ద్వితీయ భాషగా ఇంగ్లాండులో మెట్రిక్యులేషన్ పరీక్ష పాసైనాను.‘ “నిజమే కాని మాకు కావలసింది బి.ఏ." ఆ ఉద్యోగం దొరకలేదు. బాధపడ్డాను. మా అన్నగారుకూడా చాలా బాధపడ్డారు. యిక బొంబాయిలో వుండటం అనవసరమని నిర్ణయానికి వచ్చాను. నేను రాజకోటలో వుండటం మంచిది. అక్కడ మా అన్నగారు చిన్న వకీలు. ఆయన అర్జీలు వ్రాసేపని నాకు అప్పగించగలడు. రాజకోటలో సంసారం వున్నది. బొంబాయిలో సంసారం ఎత్తివేస్తే ఖర్చులు తగ్గిపోతాయి కనుక బొంబాయిలో ఆరు నెలల నివాసానికి స్వస్తి చెప్పాను.
బొంబాయిలో నేను ప్రతిరోజు హైకోర్టుకు వెళుతూ వుండేవాణ్ణి. కాని అక్కడ నాకేమీ ప్రయోజనం కలుగలేదు. ఎక్కువ నేర్చుకుందామనే ఆసక్తి కూడా కలుగలేదు. అక్కడ నడిచే కేసులు అర్థం కాక చాలాసార్లు నిద్ర వచ్చేది. నాతోబాటు యింకా కొంతమంది నిద్రబోయే వకీళ్ళు కూడా వున్నందున నేను సిగ్గుపడలేదు. తరువాత హైకోర్టులో కూర్చొని నిద్రపోవడం కూడా దర్జాయే అని భావించి సిగ్గుపడటం పూర్తిగా మానివేశాను.
నడిచి వెళ్లడం, యింటికి రావడం అలవాటు చేసుకున్నాను. నడిచి వెళ్లడానికి నలభై అయిదు నిమిషాలు పట్టేది. వచ్చేటప్పుడూ అంతే. ఎండకు తట్టుకునేవాణ్ణి. అందువల్ల ఖర్చు బాగా తగ్గింది. నా మిత్రులు చాలామంది జబ్బుపడుతూ వుండేవారు. కాని నేను మాత్రం జబ్బు పడలేదు. డబ్బు రావడం ప్రారంభమైన తరువాత కూడా నేను నడిచే వెళుతూ వున్నాను. ఆనాటి ఆ అలవాటు యొక్క సత్ఫలితం నేను యీనాటికీ పొందుతున్నాను.
4. మొదటి ఎదురుదెబ్బ
బొంబాయి వదిలి రాజకోట చేరాను. ఒక ఆఫీసు పెట్టుకున్నాను. యిక్కడ పని బాగానే సాగింది. అర్జీలు, దరఖాస్తులు వగైరాలు వ్రాసి పెట్టడం వల్ల నెలకు మూడొందల రూపాయలు రాసాగాయి. అయితే యీ పని దొరకటానికి కారణం నా యోగ్యత కాదు. మా అన్నగారు, మరో వకీలు ఉమ్మడిగా పనిచేస్తున్నారు. ఆ వకీలుకు ప్రాక్టీసు ఖాయం అయిపోయింది. అవసరమైనవీ, ముఖ్యమైనవీ అని తాను భావించిన అర్జీలు పెద్ద బారిష్టర్ల దగ్గరికి అతడు పంపేవాడు. బీద క్లైంట్ల అర్జీలు మాత్రం నేను వ్రాసేవాణ్ణి.
“ఎవ్వరికీ సొమ్ము యివ్వను అని బొంబాయిలో నేను పట్టుబట్టానే కాని, రాజకోటలో మాత్రం ఆ విషయమై కొంత మెత్తబడవలసి వచ్చింది. యీ రెండు చోట్ల వ్యవహారం వేరని విన్నాను బొంబాయిలో దళారులకు సొమ్ము చెల్లించాలి. యిక్కడ వకీళ్లకు సొమ్ము చెల్లించాలి. రాజకోటలో ప్రతి వకీలు యిలా చెప్పారు! చూడు! నేను మరో వకీలుతో భాగస్వామిని కదా! నీవు చేయగల పనులు నీకు వచ్చేలా నేను చూడగలను. అట్టి మనిద్దరం అవిభక్తులం. కనుక నీకు వచ్చిన ఫీజంతా మన ఉమ్మడి సొమ్ము! అంటే అందులో నాకు భాగం వున్నట్లే! మరి నా భాగస్వామి అయిన వకీలు విషయం యోచించు. యీ కేసులు మరో వకీలుకిస్తే అతడికి రావలసిన సొమ్ము రాదా?
మా అన్నగారి మాటలకు నేను లొంగిపోయాను. బారిష్టరు వృత్తిలో వుంటూ యిట్టి పట్టుపట్టరాదని భావించాను. నాకు నేను సరిపుచ్చుకున్నానే గాని యిది ఆత్మవంచనే. అయితే ఏ కేసుల్లోను ఎవ్వరికీ రుసుం యివ్వలేదనే గుర్తు.
ఈ విధంగా జీవితం సాఫీగా వెళ్లబారుతూ వుండగా నా జీవితానికి మొదటి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెల్ల అధికారుల ప్రవర్తనను గురించి విన్నానే గాని అట్టి అనుభవం నాకు అప్పటివరకు కలుగలేదు.
చనిపోయిన పోరుబందరు రాణాగారు గద్దె ఎక్కే పూర్వం నాటి మాట. ఆయనకు మా అన్నగారు మంత్రిగాను, సలహాదారుగాను వుండేవారు. ఉద్యోగంలో వుంటూ రాణాగారికి కుట్ర సలహా యిచ్చాడని మా అన్నగారి మీద నేరం మోపబడింది. అది పొలిటికల్ ఏజంటుదాకా వెళ్లింది. ఆయన మా అన్నగారి మీద కక్ష కట్టాడు. నేను ఇంగ్లాండులో వున్నప్పుడు అతనికి నాకు పరిచయం వుండేది. స్నేహం కూడా వుండేది. ఆ స్నేహాన్ని ఉపయోగించి అతనికి తనపై గల కక్షను పోగొట్టేలా చేయమని మా అన్నగారు నన్ను కోరారు. నాకు యిట్టి వ్యవహారం నచ్చదు. ఎక్కడో ఇంగ్లాండులో యాదృచ్ఛికంగా ఏర్పడిన పరిచయాన్ని, స్నేహాన్ని యీవిధంగా ఉపయోగించడం నాకు యిష్టం లేదు. నిజంగా మా అన్న దోషం చేసియుంటే యీ నా ప్రయత్నం వల్ల ఫలితం ఏముంటుంది? దోషం చేయకపోతే నిర్భయంగా రాచబాటన అర్జీ పంపి విజయం సాధించవచ్చు కదా! మా అన్నగారు యిందుకు అంగీకరించలేదు. “నీకు కఠియావాడు తెలియదు. నీకు ప్రపంచ జ్ఞానం తక్కువ. యిక్కడ పలుకుబడికే ప్రాధాన్యం. నేను నీకు సోదరుణ్ణి. ఆ తెల్లదొర నీకు స్నేహితుడు. అతడికి నచ్చచెప్పి నాపై గల అతని కక్షను తొలగింపచేయడం నీ ధర్మం” అంటూ ఆయన వత్తిడి చేశారు.
ఇక నేను కాదనలేక ఆ దొరను కలవడానికి నిర్ణయించుకున్నాను. అతని దగ్గరకు వెళ్లి, యీ విషయం చెప్పడం నాకు తగినపని కాదని తోచింది. అయినా తప్పలేదు. ఆయన దగ్గరకు జాబు పంపి కలుసుకునేందుకు సమయం కోరాను. ఆయన యిచ్చిన సమయానికి వెళ్లి ఆయనను కలిసి గతంలో యిరువురి స్నేహాన్ని గురించి జ్ఞాపకం చేశాను, కాని కఠియావాడుకు, ఇంగ్లాండుకు ఎంతో భేదం కనబడింది. సెలవులో వున్న ఉద్యోగి వేరు. పనిలో వున్న ఉద్యోగి వేరు, ఆ పొలిటికల్ ఏజంటు మా స్నేహాన్ని అంగీకరించాడు. కాని మా అన్నగారి విషయం ఎత్తేసరికి ఆతడు కరుకు బారాడు. అదా విషయం! ఆ స్నేహాన్ని పురస్కరించుకొని అనుచిత లాభం పొందాలని చూస్తున్నావా? అన్న భావం ఆయన కండ్లలో నాకు గోచరించింది. అయినా నా పాట నేను మొదలు పెట్టాను. దానితో ఆ దొర చిరాకుపడి “మీ అన్న చాలా కుట్రదారు. నేనేమీ వినను. నాకు అవకాశం తక్కువ. ఏమైనా చెప్పుకోవాలనుకుంటే మీ అన్ననే వచ్చి చెప్పుకోమను అని అన్నాడు. నిజానికి ఆ సమాధానం నాకు చాలు. నేను చెప్పిన దానికి సరియైన సమాధానం యిచ్చినట్లే గదా! కాని నా అవసరం నాది. నేను మానకుండా యింకా చెబుతూనే వున్నాను. ఆయన లేచి “ఇక వెళ్లు” అని అన్నాడు.
నా మాటలు పూర్తిగా వినమని పట్టుబట్టాను. దానితో అతనికి కోపం వచ్చింది. నౌకరును పిలిచి “వీనికి త్రోవ చూపించు” అని ఆదేశించాడు. నేను గొణుగుతూ వున్నాను. నౌకరు నా రెండు భుజాలు పట్టుకొని బైటకి పంపివేశాడు. రొప్పుతూ రొప్పుతూ లోనికి వెళ్లి ఒక జాబు వ్రాశాను. “మీరు నన్ను అవమానించారు. నౌకరు ద్వారా నన్ను బయటకి నెట్టించారు. యిందుకు సముజాయిషీ చెప్పుకోకపోతే మీమీద కోర్టులో మాననష్టం దావా వేస్తాను” అని ఆ జాబులో వ్రాశాను. ఆ దొర వెంటనే ఒక గుర్రపు రౌతు ద్వారా పత్రం పంపించాడు. “మీరు నా దగ్గర అసభ్యంగా వ్యవహరించారు. నేను వెళ్లమని చెప్పినా మీరు వెళ్లలేదు. గత్యంతరం లేక మిమ్మల్ని నౌకరు ద్వారా బయటికి పంపక తప్పలేదు. నౌకరు పొమ్మన్నా మీరు పోలేదు. అందువల్ల మిమ్ము బైటకి పంపించుటకు బలం ఉపయోగించక తప్పలేదు. మీరేం చేసుకున్నా సరే” అని ఆ పత్రంలో వ్రాశాడు.
ఆ పత్రం జేబులో పెట్టుకొని తలవంచుకొని యింటికి చేరాను. జరిగిందంతా మా అన్నగారికి తెలియజేశాను. ఆయన చాలా బాధపడ్డాడు. నన్ను ఎలా శాంతపరచాలో ఆయనకు బోధపడలేదు. ఆ దొర మీద కేసు పెట్టాలని నా భావం. ఆ విషయమై మా అన్న కొందరు వకీళ్ల సలహా తీసుకున్నారు. సరీగా ఆ సమయానికి సర్ ఫిరోజ్ వచ్చారు. వారిని క్రొత్త బారిష్టరు కలవడం సాధ్యం కాదు గదా! అందువల్ల వారిని తీసుకొని వచ్చిన వకీలుకు యీ వివరమంతా వ్రాసిన పత్రం యిచ్చి మెహతా గారి సలహా అర్థించాను. వకీలు నా పత్రం మెహతా గారికి అందజేశారు.
“ఇప్పుడు చాలామంది బారిష్టర్లకు, వకీళ్లకు యిట్టి అనుభవాలే కలుగుతున్నాయి. అతడు ఆంగ్ల దేశం నుండి యిప్పుడే వచ్చాడు కదా! అందువల్ల ఉడుకుపాలు ఎక్కువగా వుంది. ఆంగ్ల దొరల స్వభావం యింకా అతనికి తెలియదు. ధనం బాగా సంపాదించ కోరితే, జీవితం సుఖంగా గడపాలని భావిస్తే యిటువంటి అవమానాల్ని దిగమ్రింగవలసిందే. యీ తెల్లదొరతో కలహం పెట్టుకుంటే నష్టమేగాని లాభం కలుగదు. గాంధీజీకి యింకా లోకజ్ఞానం అవసరం.” అని ఫిరోజ్‌గారు ఆ వకీలు ద్వారా నాకు సలహా పంపారు.
వారి సలహా నాకు విషప్రాయంగా తోచింది. కాని మ్రింగక తప్పలేదు. అందువల్ల కొంత ప్రయోజనం కూడా కలిగింది. ఇక భవిష్యత్తులో యిలాంటి పనులు చేయకూడదని, స్నేహాన్ని యీ విధంగా వినియోగించుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను. అప్పటి నుండి ఆ నిర్ణయాన్ని అతిక్రమించలేదు. తత్ఫలితంగా నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది.
5. దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణం
నేను ఆ అధికారి దగ్గరికి వెళ్ళడం పూర్తిగా తప్పు. అయితే అతడి తొందరపాటు, అతి ఔద్ధత్యం ముందు నా తప్పు చిన్నదైపోయింది. నన్ను గెంటించనవసరం లేదు. అతని సమయాన్ని అయిదు నిమిషాల కంటే నేను వ్యర్థం చేయలేదు. అతడు నా మాటలు వినడానికే సిద్ధం కాలేదు. నన్ను మంచిగా వెళ్లమని చెప్పవచ్చు. కాని అతనికి అధికార దర్పం పెచ్చు పెరిగిపోయింది. అసలు సహనం తక్కువ అని కూడా ఆ తరువాత తెలిసింది వచ్చిన వాళ్లనందరినీ తృణీకరించి పంపుతూ వుంటాడని. కొంచెం కష్టం తోస్తే మండిపడుతూ వుంటాడని తెలిసింది.
అయితే నా పని అంతా అతగాడి ముందే అతడిని త్రోవకు తేవడం కష్టం ఆశ్రయించడం నాకు యిష్టం లేదు. మాననష్టం దావా వేస్తానని వ్రాసి ఆ తరువాత వూరుకోవడం నాకు యిష్టం లేదు.
ఈ సమయంలో మా రాష్ట్రమందలి చిన్న చిన్న రాజకీయాలు నాకు తెలిశాయి. కాఠియావాడు చిన్న చిన్న రాజ్యాల కూటమి. అందువల్ల రాజకీయవేత్తలు అక్కడ అధికం. సంస్థానానికి సంస్థానానికి పడదు. అనేక కుట్రలు, పలుకుబడి కోసం ఉద్యోగుల్లో ఉద్యోగులికి మధ్య కుట్రలు. సంస్థానాధిపతులు సులభులు. వాళ్లు దొరగారి నౌకర్లకు కూడా సులభులే. ఇక శిరస్తాదారు. ఆయన దొరగారికంటే ఎక్కువ. శిరస్తాదారే దొరగారికి కన్ను, చెవి. అతడే దొరగారికి దుబాసి. అందువల్ల శిరస్తాదారు మాటే మాట. అతడి రాబడి దొరగారి రాబడికంటే అధికం. అతడికి వచ్చే జీతం కంటే అతడికి అయ్యే ఖర్చు చాలా అధికం. యిందు అతిశయోక్తి ఏ మాత్రమూ లేదు.
ఈ దేశమంతా విషవాయుమయం అని అనిపించింది. విషవాయువు తగలకుండా స్వాతంత్ర్యాన్ని రక్షించుకుంటూ ఉండటం ఎలా అనే దిగులు నన్ను పట్టుకుంది.
నాకు ఉత్సాహం తగ్గిపోయింది. యీ విషయం మా అన్నగారు గ్రహించారు. ఎక్కడైనా ఉద్యోగం దొరికితే కుట్ర నుండి బయట పడవచ్చునని తోచింది. కుట్ర చేయకపోతే మంత్రి పదవిగాని, జడ్జి పదవిగాని లభించదు. పైగా ఆ దొరకు నాకు ఏర్పడ్డ వైమనస్యం మా యిద్దరి మధ్య పెద్ద అగాధం సృష్టించింది. అప్పుడు పోరుబందరు సంస్థానం తెల్లవారి ప్రభుత్వాధికారానికి లోబడి వుంది. ఆ సంస్థానాధిపతికి కొన్ని అధికారాలు సంపాదించి పెట్టే ఉద్యోగం ఒకటి ఉంది. ఇది కాక మేరులు అను ఒక జాతివారి మీద విధించబడ్డ హెచ్చు పన్నులను గురించి కూడా ఆ రాష్ట్రాధికారిని కలవవలసిన అవసరం ఏర్పడింది. అతడు హిందువే. కాని దురహంకారంలో తెల్లదొరల తాత అని తెలిసింది. అతడు సమర్థుడు. కాని అతడివల్ల రైతులకు ప్రయోజనం ఏమీ కలుగలేదు. నేను సంస్థానాధిపతికి కొన్ని కొత్త అధికారాలు సంపాదించి పెట్టగలిగానే గాని మేరులకు మేలు చేయలేకపోయాను. వారి విషయమై పూర్తిగా శ్రద్ధ వహించలేదని అనిపించింది.
అందువల్ల యీ వ్యవహారంలో కూడా నిరాశపడ్డాను. నా క్లయింట్లకు న్యాయం జరగలేదు. న్యాయం కలిగించగల సాధనం నా దగ్గర లేదు. చివరికి పొలిటికల్ ఏజంటుకో లేక గవర్నరుకో అర్జీ పెట్టుకోవాలి. అలా చేస్తే దీనితో మాకేమీ సంబంధం లేదని వాళ్లు త్రోసి పుచ్చేవాళ్లు, చట్టం ఏమైనా వుంటే అవకాశం వుండేది. కాని యిక్కడ దొరగారి మాటే చట్టం, అదే శాసనం.
ఈ విధంగా నేను ఉక్కిరి బిక్కరికావలసి వచ్చింది. ఇంతలో పోరుబందరు నుండి మేమన్ దుకాణం వారు మా అన్నగారికి జాబు వ్రాశారు. “మాకు అక్కడి కోర్టులో పెద్ద దావా వున్నది. అది నలభైవేల పౌండ్ల దావా. చాలా కాలాన్నుండి నడుస్తున్నది. మేము అందుకు పెద్ద వకీళ్లను, బారిష్టర్లను పెట్టాము. మీ తమ్ముణ్ణి పంపితే అతడు మాకు ఉపయోగపడతాడు. అతడికీ ఉపయోగం కలుగుతుంది. అతడు క్రొత్త దేశం చూస్తాడు. క్రొత్త అనుభవాలు పొందుతాడు” అని ఆ జాబులో వారు వ్రాశారు.
ఈ విషయం మా అన్నగారు నాకు చెప్పారు. అక్కడ నేను చేయాల్సిన పనేమిటో తెలియదు. అయితే వెళ్లాలనే కోరిక కలిగింది. “దాదా అబ్దుల్లా అండ్ కో లో భాగస్వామియగు సేఠ్ అబ్దుల్ కరీం జావేరీ గారికి (తరువాత గతించారు) మా అన్న నన్ను చూపించారు. ఆయన యిదేమి కష్టం కాదు అని నచ్చచెప్పి “అక్కడ మాకు పెద్ద పెద్ద తెల్లవాళ్లు మిత్రులుగా వున్నారు. వారితో మీకు పరిచయం కలుగుతుంది. దుకాణంలో మీరు మాకు ఉపయోగపడతారు. మా వ్యవహారమంతా ఇంగ్లీషులో పుంటుంది. దానికి మీరు పనికి వస్తారు. ఆ దేశంలో వున్నంత కాలం మీరు మాకు అతిథులు. అందువల్ల విడిగా మీకు ఖర్చు ఏమీ ఉండదు” అని చెప్పాడు, “ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ పట్టదు. రాకపోకలకు మీకు ఫస్టు క్లాసు టిక్కెట్టు యిస్తాం. నూట అయిదు పౌండ్ల సొమ్ము యిస్తాం” అని అన్నాడు. ఇంత కొద్ది సొమ్ము కోసం దక్షిణ ఆఫ్రికా వెళ్లడం బారిస్టరు చేయవలసిన పని కాదు. పైగా దాస్యం చేయాలి. అయినా ఏదో విధంగా యీ దేశాన్ని విడిచి వెళదామనే కోరిక ఎక్కువైపోయింది. క్రొత్త దేశం చూద్దామని, క్రొత్త అనుభవం పొందుదామని అభిలాష కలిగింది. యిదిగాక ఆ నూట అయిదు పౌండ్లు మా అన్నగారికి పంపవచ్చు. కుటుంబ ఖర్చులకు ఆ సొమ్ము వినియోగపడుతుంది. యీ రకమైన అభిప్రాయాలతో యిక మారు మాటాడకుండా సరేనని చెప్పి దక్షిణ ఆఫ్రికా ప్రయాణానికి సిద్ధపడ్డాను.
6. నేటాల్
ఆంగ్ల దేశానికి వెళ్లినప్పుడు కలిగిన వియోగ దుఃఖం దక్షిణ ఆఫ్రికాకు వెళ్లుతున్నప్పుడు నాకు కలుగలేదు. మా అమ్మగారు యిప్పుడు లేరు. నాకు లోకానుభవంతో బాటు సముద్రయానానుభవం కూడా కలిగింది. బొంబాయి రాజకోటలకు తరచుగా రాకపోకలు సాగిస్తూ వున్నాను.
ఈసారి భార్యను విడిచి వెళ్లడానికి కొంచెం కష్టం కలిగింది. ఇంగ్లాండు నుండి వచ్చిన తరువాత ఒక పిల్లవాడు పుట్టాడు. మా ప్రేమ యింకా కామవాంఛ నుండి విడివడలేదు. కాని మెల్లమెల్లగా మెరుగుపడసాగింది. ఇంగ్లాండు నుండి వచ్చిన తరువాత మేము కలిసి కొద్ది కాలం వున్నాము. ఆమెకు ఉపాధ్యాయుడనై ఏదో విధంగా కొన్ని సంస్కారాలు నేర్పడానికి పూనుకున్నాను. ఆ శిక్షణ పూర్తికావాలంటే ఇద్దరం కలిసి వుండటం అవసరం అని అనుకున్నాము. కాని దక్షిణ ఆఫ్రికాకు వెళ్లే మహోత్సాహంలో వియోగ దుఃఖం అంతగా బాధించలేదు. ఒక సంవత్సరంలో మళ్లీ కలుద్దామని చెప్పి భార్యను ఊరడించి రాజకోట నుండి బొంబాయికి బయలుదేరాను.
దాదా అబ్దుల్లా కంపెనీ వారి ఏజంటు ద్వారా టిక్కెట్టు రావాలి. ఓడలో కాబిన్ ఖాళీగా లేదు. యిప్పడు బయలుదేరి వెళ్లకపోతే ఒక మాసం రోజులు బొంబాయిలోనే వుండాలి. మేము మొదటి తరగతి టిక్కెట్టు కోసం చాలా ప్రయత్నం చేశాము. కాని లాభం లేకపోయింది. మీరు వెళ్లదలచుకుంటే డెక్ మీదనే వెళ్ళాలి. మొదటి తరగతి భోజనం మాత్రం ఏర్పాటు చేశాము. ఆ ఏజంటు చెప్పాడు. అవి నా మొదటి తరగతి ప్రయాణం రోజులు. బారిస్టరు డెక్ మీద ప్రయాణం చేయడమా? అందుకు నేను అంగీకరించలేదు. మొదటి తరగతి టిక్కెట్లు సంపాదించాలని నేను నిర్ణయించుకున్నాను, నేను ఓడ మీదకు వెళ్లి ముఖ్యాధికారిని కలిసి మాట్లాడాను. అతడు దాపరికం లేకుండా యిలా చెప్పాడు. “మా ఓడలో యిదివరకెన్నడూ యింత వత్తిడి లేదు. మొజాంబిక్ గవర్నరు గారు యీ ఓడలో వస్తున్నారు. బెర్తులన్నీ వారే పుచ్చుకున్నారు.” “ఏదో విధంగా నాకు ఒక్కడికి చోటు చేయలేరా” అని అడిగాను. అతడు నన్ను ఎగాదిగా చూచాడు. చిరునవ్వు నవ్వి “ఒక్క ఉపాయం ఉంది. నాగదిలో మరొక బెర్తు ఉంది. అది ప్రయాణీకులకిచ్చేది కాదు. అయినా నీకిస్తాను.” అని అన్నాడు. నేనందుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళి ఏజంటును వెంట తీసుకొని వచ్చాను. 1893 ఏప్రిల్ నెలలో దక్షిణ ఆఫ్రికాలో నా అదృష్టం ఎలా వుంటుందో అని యోచిస్తూ మహోత్సాహంతో బయలుదేరాను.
మొదటి రేవు లామూ. అక్కడికి వెళ్లడానికి 13 రోజులు పట్టింది. త్రోవలో నేను, ఓడ కెప్టెను మంచి స్నేహితులమైనాము. అతనికి చదరంగమంటే యిష్టం. క్రొత్తగా నేర్చుకున్నాడు అందువల్ల అతనితో ఆడటానికి మరొక సరిక్రొత్త వాడు కావాలి నన్ను పిలిచాడు. నేను చదరంగాన్ని గురించి చాలా విన్నాను. కాని ఆట ఎరుగను. చదరంగంలో తెలివితేటలు చాలా అవసరం అని నేర్పరులు చెప్పగా విన్నాను. ఆ కెప్టెను నాకు నేర్పుతానన్నాడు. నాకు ఓర్పు వుండటం వల్ల మంచి శిష్యుడు దొరికాడని అతడు చాలా సంతోషించాడు. ప్రతి ఆటలోను నేనే ఓడిపోతూ వున్నాను. ఓడిన కొద్దీ నాకు బోధించేందుకు అతనికి ఎక్కువగా ఉత్సాహం కలుగుతూ వున్నది. నాకు ఆ ఆట యెడ అభిరుచి కలిగింది. కాని ఆ ఓడ దిగిన తరువాత ఆ అభిరుచి నిలవలేదు. చదరంగంలో నా ప్రవేశం రాజును, మంత్రిని నడుపుట కంటే మించలేదు. లామూ రేవులో ఓడ మూడు లేక నాలుగు గంటలు ఆగింది. నేను రేవు చూద్దామని దిగాను. కెప్టెను కూడా దిగాడు. “యిక్కడి ఈ సముద్రం దగాకోరు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మీరు వెంటనే తిరిగి వచ్చివేయండి” అని కెప్టెను గట్టిగా చెప్పాడు. .
ఆ రేవు చాలా చిన్నది. నేను పోస్టాఫీసుకు వెళ్లి అక్కడ గుమాస్తాలుగా పనిచేస్తున్న హిందూదేశం వాళ్లను చూచాను. నాకు సంతోషం కలిగింది. వాళ్లతో మాట్లాడాను. ఆఫ్రికా వాసులు కొంతమంది కనబడగా వారి యోగక్షేమాల్ని గురించి అడిగి తెలుసుకున్నాను. యీ పనులకు కొంత సమయం పట్టింది.
డెక్ మీద ప్రయాణం చేస్తున్న కొందరితో అక్కడ పరిచయం కలిగింది. వారు ఒడ్డున తీరికగా వంట చేసుకొని భోజనాలకు కూర్చున్నారు. వారు ఓడ దాక పోవడానికి ఒక నావ కుదుర్చుకొనగా నేను కూడా దానిలోకి ఎక్కాను. యింతలో హఠాత్తుగా సముద్రంలో పోటు హెచ్చింది. రేవు అల్లకల్లోలం అయింది. మేమెక్కిన నావ మీద బరువు పెరిగింది. ఓడ నిచ్చెనకు మా నావను కట్టి నిలపడానికి వీలు లేనంత బలంగా నీరు పొంగుతూ వుంది. నావ నిచ్చెన దగ్గరకు వెళ్లేసరికి నీటి ప్రవాహం వచ్చి నావను దూరంగా నెట్టివేస్తూ వుంది. ఓడ బయలుదేరుటకు మొదటి ఈల అప్పుడే మోగింది. నాకు తొందర పెరిగింది. కెప్టెను పైనుండి మా అవస్థ చూచాడు. మరో అయిదు నిమిషాలు ఓడను ఆపమని ఆదేశించాడు. నా మిత్రుడొకడు ఓడ దగ్గరగా వున్న ఒక నావవాడికి పదిరూపాయలిచ్చి నన్ను తీసుకురమ్మనగా ఆ నావవాడు దగ్గరకు వచ్చి నన్ను బలవంతాన తన నావలోకి లాక్కున్నాడు. అప్పటికి ఓడ పైకి ఎక్కి వెళ్లే నిచ్చెనను తొలగించి వేశారు. దానితో ఒక మోకు పట్టుకొని నేను పైకి ప్రాకవలసి వచ్చింది. ఓడ వెంటనే బయలుదేరింది.
మొదటి నావలో వున్న సహ యాత్రీకులంతా అక్కడే దిగబడిపోయారు. కెప్టెను మాటలకు గల విలువ ఏమిటో ఇప్పుడు బోధపడింది.
లామూ దాటిన తరువాత మొంబాసా చేరాము. తరువాత జాంజిబారు. అక్కడ ఓడ పదిరోజులు వరకు వుంటుందని, అక్కడ మరో ఓడలోకి మారాలని తెలిసింది.
కెప్టెనుకు నాపై గల ప్రేమ వర్ణనాతీతం అయితే ఆ ప్రేమ మరో వికృత కార్యానికి కారణభూతమైంది. తన వెంట ఆయన నన్ను, మరో తెల్లవాడిని రమ్మన్నాడు. మేము ముగ్గురం ఆయన నావ మీద తీరానికి చేరాం. విహారానికి వెళదాం అన్నాడు. విహారమంటే వాళ్ల భావం ఏమిటో నాకు బోదపడలేదు. ఆ విషయంలో నేనెంత తెలివితక్కువవాడినో ఆయనకు తెలియదు. ఒక తార్పుడుగాడు మా ముగ్గురినీ నీగ్రో స్త్రీల పేటకు తీసుకు వెళ్లాడు. ముగ్గురికి మూడు గదులు చూపించాడు. నేను గదిలో స్త్రీని చూచి సిగ్గుతో కుంచించుకుపోయాను. పాపం, ఆమె నన్ను గురించి ఏమనుకొన్నదో ఆ దేవునికి తెలియాలి. కెప్టెను కొంత సేపైన తరువాత నన్ను పిలిచాడు. నేను వెళ్లిన వాణ్ణి వెళ్లినట్లు బయటకి వచ్చాను. నా చేతగానితనాన్ని అతడు పసిగట్టాడు. మొదట కొంచెం నాకు చిన్నతనంగా వుంది కాని ఆ తర్వాత ఆ విషయం తలచుకుంటేనే భయం వేసింది. ఆడది ఎదురుగా వుంటే జారిపోకుండా వుంచమని భగవంతుణ్ణి ప్రార్థించాను. హృదయ దౌర్బల్యాన్ని తలచుకొని బాధపడ్డాను. ముందే గదిలోకి వెళ్లనని ధైర్యంగా చెప్పి యుంటే బాగుండేది కదా” అని అనుకున్నాను నా జీవితంలో యిది మూడో అనుభవం. కల్లాకపటం ఎరుగని చిన్నవాళ్లు సాపలిప్తులవుతారు. అయినా నేను లోపలికి వెళ్లడం తప్పుగదా! లోపలికి వెళ్లి ఊరుకోవడం పురుషార్ధం కాదు. ముందే వెళ్లనని చెప్పి బయటనే వుండి వుంటే అది నిజంగా పురుషార్ధం. యీ ఘట్టం భగవంతుని మీద గల నా విశ్వాసాన్ని బాగా పెంచిందని చెప్పగలను. ఈ రేవులో ఏడు రోజులకు పైగా వుండవలసి రావడం వల్ల నేను పట్టణంలో బసచేసి చుట్టుప్రక్కల చూచి వచ్చాను. జాంజిబారు వృక్షాలకు నిలయం. మలబారులా వుంటుంది. అక్కడి చెట్ల ఎత్తును, ఆ చెట్లకు కాచే పండ్ల నిగనిగల్ని చూచి ఆశ్చర్యపడ్డాను.
తరువాత మా ఓడ మొజాంబిక్‌లో ఆగింది. మే నెలాఖరుకు నేటాలు చేరుకున్నాము.
7. కొన్ని అనుభవాలు
నేటాలు దేశానికి రేవు పట్టణం దర్బన్. దానికి పోర్టు నేటాల్ అని కూడా పేరు వుంది. అబ్దుల్లా సేఠ్‌గారు నన్ను తీసుకు వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. నేటాలు వాళ్లు చాలామంది తమవాళ్లను తీసుకొని వెళ్లేందుకు వచ్చారు. హిందూదేశస్థుల ఎడ అక్కడి వాళ్లకు ఆదరం వున్నట్లు కనిపించలేదు. అబ్దుల్లా సేఠ్‌ను అంతా తేలికగా చూడటం గమనించాను. ఆ స్థితి చూచి నా ప్రాణం చివుక్కుమన్నది. కాని అబ్దుల్లా సేఠ్‌కు యీ విషయంలో బాగా అనుభవం వున్నట్లనిపించింది. అంతా నా వంక వికారంగా చూచారు. తతిమ్మా హిందూదేశస్థుల కంటే నా వేషం వేరుగాను వింతగాను వుంది. ఫ్రాంక్ కోటు బెంగాలీల పగడీ వంటి తలపాగా ధరించాను.
అబ్దుల్లా గారు నన్ను ఇంటికి తీసుకువెళ్లాడు. తన గదికి ప్రక్కనే వున్న గదిని నా కోసం ఏర్పాటు చేశాడు. నా సంగతి వారికి, వారి సంగతి నాకు తెలియదు. తన తమ్ముడు నా చేతికిచ్చి పంపిన కాగితాలు చదివి కొంత గడబిడ పడ్డాడు. తన తమ్ముడు హిందూ దేశాన్నుండి ఒక తెల్ల ఏనుగును తన వద్దకు పంపించాడని ఆయన భావించాడు. నా వేషభాషలు చూచి దొరలకయ్యేటంత వ్యయం నాకోసం అవుతుందని భావించాడు. అప్పుడు ప్రత్యేకించి నాకు అప్పగించడానికి సరియైన పని కూడా లేదు. వారి వ్యవహారం ట్రాన్సువాలులో సాగుతున్నది. వెంటనే నన్నక్కడికి పంపడంలో అర్థం లేదు. పైగా నా శక్తిని, సామర్థ్యాన్ని, యోగ్యతను గురించి ఆయనకు ఏమీ తెలియదు! నాకోసం తాను ఎప్పుడూ ప్రిటోరియాలో వుండవలసి వస్తుంది. అది ఆయనకు వీలుపడని పని. ప్రతివాదులు ప్రిటోరియాలోనే వున్నారు. వాళ్లు నన్ను తమవైపుకు త్రిప్పుకుంటారేమోనని ఆయనకు భయం. అయితే ఆ దావా కాకపోతే నాకు అప్పగించే పని యింకేముంది.
మిగతా పనులన్ని నాకంటే ఆయన గుమాస్తాలే బాగా చేయగలరు. ఆ గుమాస్తాలు తప్పు చేస్తే వాళ్లను దండించవచ్చు. కాని నేను తప్పు చేస్తే దడించేదెలా? ఆ దావాలో ఏదో పని అప్పగించకపోతే ఊరికే కూర్చోబెట్టి మేపవలసి వస్తుంది.
అబ్దుల్లా గారికి అక్షర జ్ఞానం తక్కువే కాని జ్ఞానం ఎక్కువ. ఆయన బుద్ధి చాలా చురుకైనది. బ్యాంకు మేనేజర్లతో వ్యవహారం నడుపుకొనుటకు తెల్ల వర్తకులతో వ్యవహారం గడుపుకొనుటకు, వకీళ్లకు తన వ్యవహారాలు చెప్పుటకు తగినంత ఇంగ్లీషు ఆయనకు నచ్చు. భారతీయులకు ఆయనంటే గౌరవం. వారి వ్యాపార సంస్థ అక్కడి వ్యాపార సంఘాలన్నింటిలోకి పెద్దది. హిందూ దేశస్థుల వ్యాపార సంఘాలన్నింటిలోకి పెద్దది. అన్నీ వున్నాయిగాని ఒక లోటు మాత్రం ఆయనలో వుంది. ఆయనది అనుమాన స్వభావం.
ఆయనకు ఇస్లాం మతమంటే అమిత అభిమానం. తత్వ జ్ఞానాన్ని గురించి మాట్లాడాలనే తపన ఆయనకు వుంది. ఖురాన్ షరీఫు మరియు తదితర ఇస్లాం మత గ్రంధాలలో ఆయనకు కొద్దిగా ప్రవేశం వుంది. మాట్లాడేప్పుడు అనేక ప్రమాణ వాక్యాలు అమితంగా ఉపయోగిస్తూ వుంటాడు. ఆయనను కలియడం వల్ల ఇస్లాం మతం విషయమై నాకు కొంత పరిజ్ఞానం కలిగింది. మా మనస్సులు కలిసిన కొద్దీ ఇస్లాం తత్వ విషయాలను గురించి చర్చించడం ప్రారంభించాడు.
నేనచ్చటికి వెళ్లిన రెండవరోజునో, మూడవరోజునో అబ్దుల్లా సేఠ్ నన్ను దర్బను కోర్టుకు తీసుకువెళ్లాడు. తమ మిత్రులను నాకు పరిచయం చేశాడు. కోర్టులో తన వకీలు ప్రక్కనే నన్ను కూర్చోబెట్టాడు. మొదటినుండి మేజిస్ట్రేటు నావంక మిర్రి మిర్రిగా చూడటం ప్రారంభించాడు. చివరకు తలపాగాను తీసి వేయమని ఆదేశించాడు. తలపాగా తీయను అని చెప్పి కోర్టునుంచి బయటకు వచ్చివేశాను.
ఇక్కడ కూడా తగవు మొదలైందని భావించాను. భారతీయులచే తలపాగాలు తీసివేయించుటకు గల కారణాలు అబ్దుల్లా వివరించి చెప్పారు. మహమ్మదీయ ఆచారాలు కలవారు తలపాగాలు పెట్టుకోవచ్చు. కాని కోర్టుకు వచ్చే మిగతా హిందూ దేశం వారు మాత్రం తలపాగా ధరించరాదని శాసనం, యీ సూక్ష్మ భేదం తెలుసుకునేందుకు ఇంకొంచెం లోతుకు వెళ్లాలి. అక్కడికి చేరిన మూడు నాలుగు రోజుల్లోనే అక్కడి భారతీయులు రకరకాలుగా విభాజితులై వున్నారని బోధపడింది. ఒకరు తురక వర్తకులు. వీరు తాము అరబ్బులమని చెప్పుకుంటున్నారు. మరొకరు హిందూ గుమాస్తాలు లేక పారసీ గుమాస్తాలు. పారసీ గుమాస్తాలు మేము పారశీకులం అని చెప్పుకుంటారు. యిక హిందూ గుమాస్తాలు అటూగాక, ఇటూగాక వుండిపోయారు. యీ మూడురకాల వారికీ సాంఘిక సంబంధాలు వున్నాయి. వీళ్లందరినీ మించిన మరో తెగ వున్నది. ఆ తెగలో అరవవారు, తెలుగువారు, ఉత్తర హిందూస్థానమునుండి ఇన్‌డెన్‌చెర్డు కూలికి వచ్చినవారు వున్నారు. ఇన్‌డెన్‌చెర్డు కూలీలంటే అయిదేండ్లు నేటాలు దేశంలో పనిచేసేందుకు అంగీకారం కుదుర్చుకున్న కూలివారన్నమాట. వీరికి గిర్మిటియాలని పేరు. యీ శబ్దం అగ్రిమెంట్ అను పదానికి అపభ్రంశమగు గిర్మిట్ అను పదము నుండి ఉత్పన్నమైనది. పై మూడు తెగలవారు కూడా యీ గిర్మిటియాలతో కూలిపని విషయమైదప్ప వేరు సంబంధం పెట్టుకోరు. దొరలంతా వీళ్లను కూలీలు అని అంటారు. భారతీయులలో ఎక్కువ మంది కూలి చేసుకొనేవారే. ‘సామీ’ అని మరో పేరు కూడా వీళ్లకు వున్నది. సామి అను పదం సామాన్యంగా అరవవారి పేర్లకు చివర వుంటుంది. స్వామిన్ అను సంస్కృత పదానికి యిది వికృతి. సామి అని పిలుస్తున్నావు సరేకాని సామి అంటే అధికారి అని అర్ధం, నేను నీకు అధికారిని కాదు కదా! అందువల్ల ఆ శబ్దం నాకు వాడకు అని చెబుతారు. కొందరు ఏమీ మాట్లాడకుండా వుండిపోతారు. మొత్తంమీద సామి శబ్దం నీచార్ధకంగా ప్రచలితం అయిపోయింది.
నాకు కూలి బారిస్టరు అని పేరు వచ్చింది. వర్తకులకు కూలి వర్తకులని పేరు. ఈ విధంగా కూలీ అంటే అసలు అర్ధంపోయి కూలీలంటే భారతీయులు అను అర్ధం రూఢి అయిపోయింది. తురక వర్తకులకిది గిట్టదు. వాళ్లు మేము అరబ్బులం అనో, లేక మేము బేహారులం అనో చెప్పుకుంటూ వుంటారు. తెల్లవాడు మంచి వాడైతే కూలీ అన్నందుకు క్షమాపణ కోరతాడు.
ఇట్టి పరిస్థితుల్లో నేను తలపాగా పెట్టుకోవడం తప్పుగా భావించబడిందన్న మాట. అందువల్ల ఎందుకొచ్చిన గోల అని భావించి తలపాగా తీసివేసి ఇంగ్లీషు వాళ్ల హేటు పెట్టుకొందామనే నిర్ణయానికి వచ్చాను. దానితో యీ తగాదా పోతుందని అనుకున్నాను.
కాని అబ్దుల్లా సేఠ్‌గారు ఒప్పుకోలేదు. “నీవు యీ పని చేస్తే మరీ ప్రమాదం. నీవు యిట్లా చేస్తే తలపాగా ధరించాలని భావించే వారందరినీ మోసగించినట్లవుతుంది. అదీగాక మనదేశం తలపాగా మీకు బాగుంటుంది. ఇంగ్లీషు వాళ్ల హేటు పెట్టుకుంటే ఇంగ్లీషు వాళ్ల హోటళ్లలో పనిచేసే నౌకరని అంతా అనుకుంటారు.” అని అబ్దుల్లా నన్ను హెచ్చరించాడు.
ఆయన బోధలో తెలివి, దేశభక్తి వున్నాయి. అందలి తెలివి స్పష్టం, దేశభక్తి లేందే అటువంటి మాటలు నోట రావు. హోటల్లో పనిచేసే వారి యెడ నైచ్యభావం వుండటం వల్ల తేలికభావం వ్యక్తమవుతూ వుంది. గిర్మిటియాలలో హిందువులు, తురకలు, క్రైస్తవులంతా మతం పుచ్చుకున్న గిర్మిటియాల సంతతివారే. 1893 నాటికే వారి సంఖ్య భాగా పెరిగింది. వాళ్లలో చాలామంది దొరల వేషం ధరించి హోటళ్లలో పనిచేస్తున్నారు. అబ్దుల్లాగారు హేటు విషయంలో తేలికగా మాట్లాడిందీ వీళ్ళను గురించే. హోటళ్లలో చేసే సేవకత్వం ఎంతో దైన్యంగా వున్నదన్నమాట. నేటికీ చాలామందికి అట్టి చులకన భావం పోలేదు.
మొత్తం మీద అబ్దుల్లా గారి సలహా నాకు నచ్చింది. యీ తలపాగా వ్యవహారం మొదలైన తరువాత నేను నా పక్షాన్ని సమర్ధిస్తూ పత్రికల్లో వ్యాసం వ్రాశాను. దానితో తలపాగాను గురించి పత్రికల్లో బాగా రగడ జరిగింది. “అన్‌వెల్‌కం విజిటర్” పిలువని పేరంటగాడు అని నాకు పత్రికల్లో పేరు వచ్చింది. తత్ఫలితంగా మూడు నాలుగు రోజుల్లో నా పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. కొందరు నా పక్షాన్ని సమర్థించారు. కొందరు నా పొగరుబోతుతనాన్ని నోరార తిట్టారు.
నేను దక్షిణ ఆఫ్రికాలో కొంత కాలం తలపాగా తొలగించలేదు. అది నా తల పైనే వున్నది. అయితే తరువాత ఎందుకు తొలగించవలసి వచ్చిందో, నేను ఎందుకు తొలగించానో రాబోయే ప్రకరణాల్లో పాఠకులకు తెలియజేస్తాను.
8. ప్రిటోరియా వెళ్ళేదారిలో
దర్బనులో నివసిస్తున్న భారతీయ క్రైస్తవులతో నాకు పరిచయం ఏర్పడింది. కోర్టులో దుబాసిగా వున్న పాల్ గారు రోమన్ కేథలిక్. మాయిద్దరికీ స్నేహం కుదిరింది. ప్రొటెస్టెంట్‌మిషన్‌లో బోధకుడుగా వున్న సుభాన్‌గ్రాండ్‌ఫ్రే గారితో స్నేహం ఏర్పడింది. వీరు యిటీవలే గతించారు. దక్షిణ ఆఫ్రికా భారతీయ ప్రతినిధి సంఘ సభ్యులుగా నిరుడు ఇండియాకు వచ్చిన జేమ్స్‌గాడ్‌ఫ్రే గారికి వీరు జనకులు. ఇదే విధంగా పార్సీ రుస్తుం గారితోను, అదంజీ మియాఖాన్ గారితోను మైత్రి ఏర్పడింది. వీరిద్దరూ యిటీవలే గతించారు. వ్యాపార వ్యవహారంలో దప్ప యిక ఎన్నడూఒకరి ముఖం మరొకరు చూచుకోని వీరంతా ఏవిధంగా గాఢ మిత్రులైనారో తరువాత వివరిస్తాను. ఈ విధంగా నా పరిచితుల సంఖ్య పెరిగిపోసాగింది. యింతలో అబ్దుల్లాగారి వకీలు నుంచి వారికి ఒక సమాచారం అందింది. ఇక కేసుకు సిద్ధం కావాలి. అందువల్ల అబ్దుల్లాగారే రావడమో, లేక వారి తరపున మరొకరినెవరినైనా పంపడమో చేయమని ఆ సమాచార సారాంశం. అబ్దుల్లాగారు నాకా లేఖను చదవమని యిచ్చి ప్రిటోరియాకు వెళతారా అని అడిగారు. “నేను ఆ వ్యవహారమంతా క్షుణ్ణంగా తెలుసుకొని వెళతాను. అక్కడ ఏం చేయాలో నాకిప్పటికి తెలియదు.” అని నేను చెప్పాను. అప్పుడు ఆయన ఆ విషయం నాకు బోధపరచమని కొందరు గుమాస్తాలను ఆదేశించాడు.
ఆ కేసును కొంత ఆకళింపు చేసుకున్న తరువాత అసలు యీ కేసును ఓం నమఃశ్శివాయతో ప్రారంభించవలసియున్నదని అర్థం చేసుకున్నాను. జాంజిబారులో వున్న కొద్ది రోజులు అక్కడి కోర్టుకు వెళ్ళి వివరాలు తెలుసుకున్నాను. పార్శీ వకీలొకడు ఒక సాక్షి ఖాతాలోగల జమా ఖర్చులను గురించి అడుగుతూ వుండటం గమనించాను. జమాఖర్చులంటే నాకు అంతా అడవి గొడవ. నేను హిందూదేశపు స్కూళ్ళలోగాని, ఆంగ్లదేశంలో గాని జమా ఖర్చులను గురించి నేర్చుకోలేదు.
దక్షిణ ఆఫ్రికాకు ఏకేసును గురించి నేను వచ్చానో అదంతా ఖాతాలకు సంబంధించిందే. జమా ఖర్చుల లెక్కలలో నిపుణుడైన వాడే వాటి వివరాలు తెలుసుకోగలడు. ఇతరులకు తెలుపగలడు. గుమాస్తా యిది జమ, ఇది ఖర్చు అని చెప్పుకు పోతూ వుంటే నాకంతా గందర గోళంగా వుంది. పి.నోటు అంటే ఏమిటో నాకు బోధపడలేదు. ఇంగ్లీషు నిఘంటువును తిరగవేశాను. ఆ శబ్దం ఎక్కడా కనబడలేదు. నా యిబ్బంది ఆగుమాస్తాకు తెలియజేశాను. ఆ గుమాస్తా వెంటనే పి. నోటు అంటే ప్రాంశరీ నోటు అని చెప్పాడు. అప్పుడూ జమా ఖర్చులకు సంబంధించిన పుస్తకం ఒకటి కొని చదివాను. దానితో కొంత ధైర్యం వచ్చింది. ఆదావా నాకు అర్థమైంది. అబ్దుల్లాసేఠ్ జమా ఖర్చులు ఎలా వ్రాయాలో ఎరుగడు అయినా ఎంత చిక్కులెక్కనైనా చిటికెలో విడదీసి చెప్పగల అనుభవం ఆయన గడించాడని నేను తెలుసుకున్నాను. “ప్రిటోరియా వెళ్ళడానికి యిప్పుడు నేను సిద్ధం” అని అన్నాను.
“మీరెక్కడ బస చేస్తారు?” “మీరు ఎక్కడ బస చేయమంటారో చెప్పండి.” “నేను మన వకీలుకు జాబు వ్రాస్తాను. ఆయన మీకు విడిది ఏర్పాటు చేస్తాడు. ప్రిటోరియాలో నాకు మేమన్ మిత్రులున్నారు. వాళ్ళకి కూడా వ్రాస్తాను. అయితే మీరు వారి ఇంట్లో బస పెట్టవద్దు. మన ప్రతిపక్షులకు అక్కడ మంచి పలుకుబడి వుంది. మన రహస్య పత్రాలు వారిలో ఎవరైనా చూచారో, కొంప మునుగుతుంది. వారికి మీరు ఎంత దూరంగా వుంటే అంత మంచిది. “మీ వకీలు ఎక్కడ వుండమంటే అక్కడే వుంటాను. లేకపోతే నేను వేరే బస ఏర్పాటు చేసుకుంటాను. దాన్ని గురించి మీరు విచార పడవద్దు. మన రహస్యం పిట్టకైనా తెలియనీయనని పూర్తిగా నమ్మండి. అయితే నేను వాళ్లతో కలిసిమెలిసి వుంటాను. ప్రతివాదులతో స్నేహం చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఏమాత్రం అవకాశం వున్నా కోర్టుకు పోకుండా చూస్తాను. ఇంతకూ తయబ్‌సేఠ్ చుట్టమే కదా?”. నిజానికి ప్రతివాది స్వర్గీయ సేఠ్ తైయబ్జీహాలీ ఖాన్ మహమ్మద్‌గారు కూడా అబ్దుల్లా సేఠ్‌గారికి దగ్గరి చుట్టమే.
రాజీ మాట వినగానే అబ్దుల్లాగారు కలవరపడటం గమనించాను. అయితే దర్బాను చేరి ఆరే రోజులైనప్పటికీ మేమొకరి హృదయం మరొకరం అర్ధం చేసుకున్నాం. నన్ను తెల్ల ఏనుగుగా భావించిన రోజులు గడిచిపోయాయి. అందువల్ల వెంటనే అందుకొని “మేము రక్తబంధువులం. రాజీద్వారా వివాదం పరిష్కారం అయితే మంచిదే. మేమిద్దరం ఒకరి నొకరం బాగా ఎరుగుదుము. తైయబ్ సేఠ్ త్వరగా పరిష్కారం కానీయడు. ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం రహస్యం పసిగట్టినా మనల్ని అధఃపాతాళానికి తొక్కి వేస్తాడు. అందువల్ల ఏమరచకుండా తెలివిగా వ్యవహరించండి.” అని చెప్పారు అబ్దుల్లా సేఠ్.
“ఈ విషయంలో తొట్రుబాటు బడను. దావా విషయమై తైయబ్ సేఠ్‌తోగాని, మరొకరితోగాని మనకేంపని? ఎప్పుడైనా కలిస్తే మాత్రం డొంక తిరుగుడు గొడవలు మాని ఏదో ఒక దారికి రమ్మని చెబుతాను” అని అన్నాను. వచ్చిన ఏడో రోజునో, ఎనిమిదో రోజునో నేను దర్బాను నుంచి బయలుదేరాను. నాకు మొదటి తరగతి టిక్కెట్టు కొనియిచ్చారు. పరుపు కావాలంటే అదనంగా అయిదు షిల్లింగులు అక్కడ చెల్లించాలి. పరుపు తీసుకోమని అబ్దుల్లాగారు మరీమరీ చెప్పారు. కాని అనవసరంగా పట్టుదలకు పోయి, పరుపు తీసుకోకూడదని అనుకున్నాను. అయిదు షిల్లింగులు మిగల్చాలనే భావం కూడా నాలో అప్పుడు పని చేసింది. అయినా అబ్దుల్లా సేఠ్ నన్ను సముదాయిస్తూ “చూడండి! ఇది హిందూ దేశం కాదు. అల్లా అనుగ్రహంవల్ల మనకు తినడానికి కట్టడానికి, ఇతరులకు సాయం చేయడానికి తగినంత సిరిసంపదలు లభించాయి. మీరు సంకోచించకండి. అవసరమైన ఖర్చు చేయండి.” అని నచ్చచెప్పాడు.
నేను ధన్యవాదాలు పలికి పరవాలేదని చెప్పాను. రైలు నేటాలు ముఖ్య పట్టణం మారిట్జుబర్గుకు రాత్రి తొమ్మిది గంటలకు చేరింది. పడుకునే వాళ్ళకు యిక్కడే పరుపులిస్తారు. రైలు జవాను వచ్చి పరుపు కావాలా అని అడిగాడు. నాదగ్గర వుంది. పరుపు అక్కర్లేదని చెప్పాను. అతడు వెళ్లిపోయాడు. ఇంతలో ఒక ప్రయాణీకుడు లోనికి వచ్చి నన్ను ఎగాదిగా చూచాడు. నేను నల్లవాణ్ణి. అతడు సహించలేక పోయాడు. పెట్టెదిగి వెళ్లి ఒకరిద్దరు ఉద్యోగుల్ని తీసుకువచ్చాడు. వారు వెటకారంగా నిలబడ్డారు. ఇంతలో మరో ఉద్యోగి వచ్చి “లేవయ్యా, లే, నీవు వెనుక పెట్టెలో కూర్చోవాలి. లే” అని గద్దించాడు.
“నా దగ్గర మొదటి తరగతి టిక్కెట్టు ఉన్నది. నా మాట మీరు వినండి. దర్బనులో నన్ను యిక్కడ కూర్చోనిచ్చారు. నేనిక్కడే వుంటాను.”
“అయితే పోవా? నీవు వెళ్లకపోతే పోలీసును పిలిచి నెట్టించి వేస్తాను.”
“సరే! అతడు వచ్చి నెట్టితే నెట్టనీ! నేను మాత్రం పోను.”
పోలీసువాడు వచ్చి నా చెయ్యి పుచ్చుకొని బయటికి దించివేశాడు. నా సామాను కూడా బయటికి విసరి వేశాడు. నేను మాత్రం వెనక పెట్టెలోకి పోనని భీష్మించాను. రైలు వెళ్లిపోయింది. నేను చేతిసంచి పుచ్చుకొని వైటింగు రూములోకి వెళ్లి కూర్చున్నాను. సామాను పడిపోయిన చోటనే వుంది, రైల్వేవారు దాన్ని కాపాడుతూ వున్నారు.
అది చలికాలం. దక్షిణ ఆఫ్రికాలోని పర్వత ప్రాంతలలో చలి అధికం. మారిట్జుబర్గు మరీ ఎత్తు మీద వున్నందున చలి మరీ ఎక్కువగా వుంది. నా ఓవర్ కోటు సామానులో వుంది. దాన్ని యిమ్మని కోరితే మళ్లీ అవమానిస్తారేమోనను భయంతో అడగలేకపోయాను. వణుకు పట్టుకున్నది. ఆగదిలో దీపంలేదు. అర్ధరాత్రి ఒక ప్రయాణీకుడు అక్కడికి వచ్చాడు. అతడు నన్ను పలకరించాలని భావించాడేమో కాని నేను మాట్లాడే స్థితిలో లేను.
ఇక ఏం చేయాలి అని ఆలోచించాను. నా హక్కుకోసం పోరాడాలా? లేక నోరుమూసుకొని ఇండియా దారి పట్టాలా? వచ్చిన పని పూర్తి చేయకుండా వెళితే అవమానం కదా. పిరికితనం కూడా. యిప్పుడు నేను పడ్డ కష్టం కొద్దే. ఇది మహారోగానికి బాహ్యచిహ్నం మాత్రమే. యీ మహారోగం వర్ణానికి అంటే రంగుకు సంబంధించింది. సామర్ధ్యం వుంటే యీ రోగమూలాన్ని పెరికి పారవేస్తాను. ఎన్ని కష్టాలైనా యిందు కోసం సహిస్తాను. వర్ణద్వేషానికి సంబంధించిన యీ జాడ్యాన్ని తొలగించేందుకై ఎంత కృషి అయినా సరే చేస్తాను. యీ విధంగా ఆలోచించి తరువాత వచ్చే రైల్లో ప్రిటోరియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మర్నాడు రైల్వే జనరల్ మేనేజరుకు ఒక పెద్ద టెలిగ్రాం పంపాను. అబ్దుల్లా సేఠ్ వెంటనే జనరల్ మేనేజర్ని కలిసి మాట్లాడాడు. యీవిషయం నాకు తెలిసింది. “యిందు రైల్వేవారి దోషం ఏమీలేదు. అయినా వెంటనే గాంధీకి సాయం చేయమని స్టేషను మాష్టరుకు తంతి పంపాను” అని ఆయన అబ్దుల్లాగారికి చెప్పాడు. అబ్దుల్లాగారు వెంటనే మారిట్జుబర్గులోని హిందూదేశపు వర్తకులకు మరికొందరికి తంతి పంపి రైలు స్టేషనులో వున్న గాంధీకి సాయం చేయమని కోరాడు. వారంతా రైలు స్టేషనుకు వచ్చి నన్ను కలిశారు. తమకు జరిగిన యిలాంటి అవమానాల్ని గురించి వారు నాకు చెప్పడం మొదలు పెట్టారు.
ఈ దేశంలో యిది క్రొత్తకాదని చెప్పి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఫస్టు, సెకండు క్లాసుల్లో ప్రయాణం చేసే భారతీయ ప్రయాణీకులు ఏ రైలు ఉద్యోగుల చేతుల్లోనో, ఏ తెల్లవారి చేతుల్లోనో యిట్టి కష్టాలు పడేందుకు సిద్ధపడి వుండాలన్నమాట. ఆ రోజంతా మనవాళ్ల కష్టగాధలు వినడంతో సరిపోయింది. రాత్రి రైలు వచ్చింది. అందులో నా కోసం ఒక బెర్తు రిజర్వు చేయబడివుంది. దర్బానులో వద్దన్న పరుపు టికెట్టును మాత్రం యీ రోజున మారిట్జుబర్గులో కొన్నాను. ఆ రైలు నన్ను చార్లెస్ టౌనుకు తీసుకు వెళ్లింది.
9. నేను పడిన కష్టాలు
ప్రొద్దుటికి రైలు ఛార్లెస్ టౌను చేరింది. ఆ రోజుల్లో చార్లెస్ టౌనుకు, జోహాన్సుబర్గుకు మధ్య రైలు లేదు, రాక పోకలకు గుర్రపు బండ్లు వున్నాయి. గుర్రపు బండి త్రోవలో స్టాండర్టన్ అను ఊళ్లో రాత్రి పూట ఆగుతుంది. నా దగ్గర గుర్రపు బండి టిక్కెట్టు వుంది. మారిట్జుబర్గులో ఒక రోజు నేను వుండిపోయాను. ఆ టిక్కెట్టు రద్దుకాలేదు. అబ్దుల్లాసేఠ్ చార్లెస్ టౌనులోగల గుర్రపు బండ్ల ఏజంటుకు తంతి కూడా పంపాడు.
కాని ఆ ఏజంటు సరియైన వాడుకాడు. వాడు నన్ను దండుకోవాలని భావించాడు. నీ టిక్కెట్టు చెల్లదని అన్నాడు. నేను అందుకు తగిన సమాధానం చెప్పాను. బాటసార్లకు బండిలో చోటు యివ్వాలి. లోపల చోటువున్నా వాడు నన్ను బాధించాలనే భావంతో వ్యవహరించాడు. లీడర్ అను గుర్రపు బండ్ల అధికారి నన్ను తెల్లవారితోబాటు బండిలో కూర్చోనీయకూడదని అనుకున్నాడు. ఆ బండికి ముందుభాగాన రెండు వైపుల రెండు సీట్లు వున్నాయి. లీడరు ఆ రెండు సీట్లలో ఒకదాని మీద కూర్చుంటాడు. కాని యివాళ అతడు లోపలి సీట్లో కూర్చొని నాకు బయట తన సీటును చూపించాడు. అది శుద్ధ అన్యాయమనీ, అవమానకరమనీ నాకు బోధపడింది. కాని అవమానం మ్రింగడమే మంచిదని భావించాను. బలవంతం చేసి లోపల దూరడానికి వీలు వుండదు. నేను అక్కడ కూర్చోను అని అంటే అతడు నన్ను అక్కడే వదలి బండి తోలుకుపోతాడు. అక్కడ నేను వుండిపోతే ఆ రోజంతా వృధాయే. మర్నాడు ఏమవుతుందో ఆ భగవంతుడికే ఎరుక. కాబట్టి మనసులో ఎంత గుంజాటన పడుతూవున్నా నోరుమూసుకొని బండితోలేవాడి ప్రక్కన కూర్చున్నాను.
సుమారు మూడు గంటలకు బండి పార్డీకోవుకు చేరింది. అక్కడ ఆ గుర్రపు బండి అధికారికి నేను కూర్చున్నచోటున కుర్చోవాలని బుద్ధి పుట్టింది. అతడు సిగరెట్ కాల్చుకోవాలి. అతడికి తెరపగాలి కావాలి. అతడు బండి తోలేవాడి దగ్గర ఒక మైల గోనె సంచి తీసుకున్నాడు. దాన్ని నేను కూర్చున్న సీటు ముందు క్రింద పరిచాడు. “సామీ! నీవు దీని మీద కూర్చో. నేను బండి తోలు వాడి సీటు ప్రక్కన కూర్చుంటా” అని అన్నాడు. నేను ఆ అవమానం భరించలేక పోయాను. భయపడుతు భయపడుతు “లోపల కూర్చోవలసిన నన్ను యిక్కడ కూర్చోబెట్టావు. నేనెట్లో సహించాను. నీవు యిక్కడ కూర్చొని సిగరెట్ కాల్చుకునేందుకు నన్ను నీ కాళ్ల దగ్గర కూర్చోమంటున్నావు. నేను యిక్కడ కూర్చోను. బండి లోపలికి వెళ్లి కూర్చుంటాను.” అని అన్నాను.
ఈ మాటలు నానోటి నుండి బయటికి వచ్చాయో లేదో వాడు వెంటనే నా గూబ పగల కొట్టసాగాడు. నాచేయి పట్టుకుని క్రిందికి ఈడ్చి వేయడానికి ప్రయత్నించాడు. నేను ఆ బండి చువ్వల్ని గట్టిగా పట్టుకున్నాను. మణికట్లు విరిగినా సరే చువ్వల్ని వదలకూడదని నిర్ణయించుకున్నాను. వాడు బండబూతులు తిట్టాడు. క్రిందకి పడత్రోసేందుకు ప్రయత్నించాడు. నేను మాత్రం బండి చువ్వల్ని వదలలేదు. అతడు బలిష్టుడు. నేను దుర్బలుణ్ణి. నా బాధ చూచి ప్రయాణీకులకు దయ కలిగింది. వారు కల్పించుకొని “పాపం, అతడిని విడిచి పెట్టు. అతడు చెప్పింది నిజం. అతని తప్పులేదు. అక్కడ కాకపోతే మాదగ్గరికి లోపలికి పంపు. మాకేమీ యిబ్బంది లేదు. లోపల సీట్లో కూర్చుంటాడు.” అని గట్టిగా అన్నారు. దానితో అతనికి అవమానమైంది. నన్ను కొట్టడం మానివేశాడు. “ముందున్నది ముసళ్ల పండగ, పద నీ అంతు తేలుస్తా” అంటూ అప్పుడు నన్ను వదిలి పెట్టాడు. బండికి ఆవలి ప్రక్కన కూర్చున్న సేవకుణ్ణి ఆ గోనె మీద కూర్చోబెట్టి అతని చోట తాను కూర్చున్నాడు.
ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్నారు. ఈల మ్రోగింది బండి కదిలింది. నా గుండె దడదడ కొట్టుకున్నది. ప్రాణాలతో ఆ ఊరు చేరగలనా అని సంశయం కలిగింది. నడుమ వాడు నావంక కొరకొర చూస్తూ స్టాండర్టన్‌లో దిగు! అక్కడ నిన్నేమి చేస్తానో చూద్దుగాని, అని చిర్రు బుర్రులాడుతూ వున్నాడు. నేను మౌనం వహించి కూర్చున్నాను. దైవమా! సాయపడు అని లోలోన భగవంతుణ్ణి ప్రార్ధించసాగాను,
చీకటి పడింది. బండి స్టాండర్టన్ చేరింది. అక్కడ హిందూదేశస్థుల ముఖాలు కొన్ని కనబడ్డాయి. నా గుండె దడ కొద్దిగా తగ్గింది. నేను బండి దిగగానే వాళ్లు నాదగ్గరికి వచ్చి “మేము మీకోసమే వచ్చాము. ఈసా సేఠ్‌గారి దుకాణానికి వెళదాం. అబ్దుల్లా సేఠ్ గారు మాకు తంతి పంపారు.” అని అన్నారు. నాకు ఎంతో సంతోషం కలిగింది. సేఠ్ ఈసా హాజీసుమర్‌గారి దుకాణానికి వెళ్లాము. ఆ సేఠ్, ఆయన గుమాస్తాలు నాచుట్టూ మూగారు. నేను జరిగిందంతా చెప్పాను. వాళ్లు విచారం వెలిబుచ్చారు. తాము పడ్డ కష్టాలన్నీ చెప్పి నన్ను ఓదార్చ ప్రయత్నించారు.
గుర్రపు బండ్ల కంపెనీ ఏజంటుకు జరిగిందంతా వ్రాసి పెద్దజాబు పంపించాను. లీడరు చేసిన దురాగతాన్ని గురించి, వాడి బెదిరింపును గురించి కూడా వ్రాశాను. మరుసటి రోజు బండిలో సరియైన ఏర్పాటు చేయమని వ్రాశాను. అందుకు వెంటనే ఆ ఏజంటు సమాధానం పంపాడు. “ఇక్కడి నుండి మీరు బయలుదేరిన బండి కంటే పెద్దబండి రేపు వస్తుంది. దాన్ని నడుపువాడు క్రొత్తవాడు. మిమ్ము బెదిరించినవాడు రేపు రాడు, మీరు బండి లోపలే కూర్చోవచ్చు.” అని అతడు పంపిన సమాధానంలో వుంది. నాకు బెంగ సగం తీరిపోయింది. నన్ను కొట్టిన వాడి మీద కేసు పెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. అందువల్ల యీ వ్యవహారం అంతటితో ముగిసిపోయింది.
మర్నాడు ప్రొద్దున్నే ఈసా సేఠ్ గారి నౌకరు వచ్చి నన్ను గుర్రపు బండి ఎక్కించాడు. లోపల మంచి సీటు లభించింది. ఆ రాత్రికి సుఖంగా జోహాన్సుబర్గు చేరాను.
స్టాండర్టన్ చిన్న వూరు. జోహాన్సుబర్గుకు నారాకను గురించి తంతి యిచ్చారు. అచ్చట మహమ్మద్ కాసిం కమరుద్దీన్ గారి నౌకరు నన్ను తీసుకు పోయేందుకు వచ్చాడు. కాని నేను అతడిని చూడలేదు. అతడు నన్ను పోల్చలేదు. కమరుద్దీన్ గారి దుకాణం చిరునామా వివరం అబ్దుల్లాగారు నాకు తెలియజేశారు. యిక ఏదైనా హోటలుకు వెళదామని భావించాను. ఆ పట్టణంలోని కొన్ని హోటళ్ల పేర్లు నాకు తెలుసు. బండి కుదుర్చుకొని గ్రాండ్ నేషనల్ హోటలుకు వెళ్లాను. హోటలు మేనేజర్ని కలిసి ఒక గది యిమ్మని కోరాను. అతడు కొద్ది సేపు నన్ను ఎగాదిగా చూచి వినమ్రంగా గదులు ఖాళీ లేవు అని చెప్పి సలాం కొట్టి వెళ్లిపోయాడు. అప్పుడు కాసింకమరుద్దీన్ గారి దుకాణానికి వెళ్లాను. అచ్చట నా కోసం ఎదురు చూస్తున్న అబ్దుల్‌గనీ సేఠ్ గారిని కలుసుకున్నాను. వారు నన్నెంతో ఆదరించారు. నాకు హోటల్లో జరిగిన మర్యాదను గురించి చెప్పాను. ఆయన పకపకనవ్వి ‘హోటల్లో మీకు ప్రవేశం ఎలా లభిస్తుందని అనుకున్నారు?’ అని ప్రశ్నించారు.
“అదేమిటి?”
“ఇక్కడ కొన్నాళ్లుంటే మీకే అర్థమవుతుంది. మేము యీ దేశంలో గతిలేక వుంటున్నాము. కేవలం డబ్బు మీదగల ఆశచే ఎన్ని అవమానాలైనా సహించి యిక్కడ పడివుంటున్నాం.” అని దక్షిణ ఆఫ్రికాలో భారత దేశస్థులు పడుతున్న కష్టాల్ని గురించి వివరించారు.
అబ్దుల్ గనీ గారిని గురించి ముందు యింకా వివరంగా వ్రాస్తాను.
ఆయన మళ్లీ ఇట్లన్నారు - “ఈ దేశం మీబోటి వారు వుండడానికి తగిందికాదు. రేపు మీరు ప్రిటోరియాకు బయలుదేరుతారు కదా! ఇక మూడో తరగతి బండిలోనే వెళ్లవలసి వుంటుంది. నేటాలులోను యింతే. ట్రాన్సువాలులో మరీ అధ్వాన్నం. యిక్కడ ఒకటి రెండు తరగతుల టిక్కెట్లు హిందూ దేశస్థులకి యివ్వరు.”
“మీరు అందుకు వ్యతిరేకంగా తగిన ప్రయత్నం చేయలేదా?” “చేయకేం చేశాము. ఎన్నో అర్జీలు పెట్టాం. కాని మనవాళ్లే ఆ తరగతుల్లో ప్రయాణించేందుకు ఒప్పుకోరు.”
నేను రైల్వే నిబంధనలు చదివి చూచాను. అందొక లోపం వుంది. ట్రాన్సువాలు శాసనాల భాష సరిఅయింది కాదు. స్పష్టంగా వుండదు. ముఖ్యంగా రైల్వే నిబంధనలు “నాడు మొదటి తరగతిలోనే ప్రయాణం చేద్దామని వుంది. వీలుకాకపోతే ప్రిటోరియాకు సరాసరి గుర్రపు బండి కుదుర్చుకుంటాను. ముప్పది ఏడు మైళ్ళే కదా!” అని సేఠ్ గారితో అన్నాను.
బండి మీద వెళితే ఎంత సమయం, ధనం వ్యర్ధమవుతుందో ఆయన వివరంగా చెప్పారు. మొదటి తరగతిలోనే వెళ్లమని చెప్పారు. వెంటనే స్టేషను మాష్టరుకు “నేను బారిస్టరును. ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణం చేస్తాను. రేపు ప్రిటోరియాకు మొదటి తరగతిలో ప్రయాణం చేయదలిచాను. నేను వచ్చి మిమ్ము కలుస్తాను, టిక్కెట్టు సిద్ధం చేసి వుంచండి.” అని వ్రాశాను “క్షమించండి” అని సమాధానం వ్రాస్తాడని భయం పట్టుకున్నది. నేను బారిస్టరు వేషంలో టిప్‌టాప్‌గా వెళ్లి ఇంగ్లుడు ఇంగ్లీషులో మాట్లాడితే టిక్కెట్టు తప్పక యిచ్చేస్తాడని భావించాను. ఫ్రాంక్ కోటు తొడుక్కున్నాను, నెక్ టై కట్టుకున్నాను. టీకుటాకుగా వెళ్లి బల్లమీద “కాసు” పెట్టి టిక్కెట్టు యిమ్మని కోరాను. నా వ్యవహారం గమనించి ఆయన జాలిపడ్డాడు. “అయ్యా! నేను ట్రాన్సువాల్ నివాసిని కాను. హాలండు నివాసిని. నాకు మీరు చెప్పిన మాటలు అర్థమైనాయి. మీ ఎడ మాకు సానుభూతి వుంది. మీకు ఫస్టుక్లాసు టిక్కెట్టు యిస్తాను. కాని త్రోవలో గార్డు వచ్చి దిగిపొమ్మంటే మీరు దిగి మూడో తరగతిలో కూర్చోవాలి. అలా అయితేనే టిక్కెట్టు యిస్తాను. ఆ తరువాత మీరు రైల్వే వారి మీద దావా వేయకూడదు.” అని చెప్పి మొదటి తరగతి టిక్కెట్టు నాచేతిలో వుంచాడు. నేను ఆయనకు ధన్యావాదాలు తెలిపి మీ మాటకు బద్ధుణ్ణి అని కూడా చెప్పాను. సేఠ్ అబ్దుల్‌గనీ గారు నన్ను పంపడానికి స్వయంగా స్టేషనుకు వచ్చారు. జరిగినదంతా విని ఆశ్చర్యపడ్డారు. యిలా అన్నారు. “ఇంత వరకు బాగానే వుంది. కాని త్రోవలో గార్డు మిమ్ము చూచి దించివేస్తాడు. ఒకవేళ గార్డు దించకపోతే తోటి తెల్లజాతి ప్రయాణీకులు ఊరుకోరు. దించివేస్తారు.”
నేను మొదటి తరగతి పెట్టె ఎక్కాను. రైలు బయలుదేరింది. జర్నిస్టస్ స్టేషనులో గార్డు టిక్కెట్టు పరిశీలించేందుకై వచ్చాడు. నన్ను చూడగానే మండిపడ్డాడు. వెంటనే లేచి మూడో తరగతి పెట్టెలోకి పొమ్మని వ్రేలితో సౌంజ్ఞ చేశాడు. నేను నా టిక్కెట్టు చూపించాను. “అయితే ఏం? మూడో తరగతి పెట్టెలోకి పో” అంటూ గద్దించాడు.
ఆ పెట్టెలో ఒక్క తెల్లవాడే వున్నాడు. ఆయన గార్డును ప్రతిఘటించి “ఎందుకు పెద్ద మనిషిని బాధిస్తావు? మొదటి తరగతి టిక్కెట్టు కొన్నాడు. కనబడటం లేదా? వారి ప్రక్కన కూర్చునేందుకు నాకు యిబ్బందేమీ లేదు.” అని నావంక చూచి “అక్కడే హాయిగా కూర్చోండి” అని అన్నాడు. “కూలీతో కూర్చునేందుకు మీకే యిబ్బంది లేకపోతే నాకా యిబ్బంది!” అంటూ గొణుగుతూ గార్డు వెళ్లిపోయాడు.
రాత్రి ఎనిమిది గంటలకు రైలు ప్రిటోరియా చేరింది.
10. ప్రిటోరియాలో మొదటి రోజు
దాదా అబ్దుల్లా గారి వకీలు ప్రిటోరియా స్టేషనుకు ఎవరినైనా పంపి నన్ను తీసుకు వెళతారని భావించాను. నన్ను కలుసుకునేందుకు యితర భారతీయులెవ్వరూ రారని నాకు తెలుసు. ఎందుకనగా ప్రిటోరియాలో భారతీయుల యింట్లో బస చేయనని నేను అబ్దుల్లా గారికి వాగ్దానం చేసి వచ్చాను. ఆదివారం గనుక ఎవ్వరినీ స్టేషనుకు పంపడానికి వీలుపడలేదని వకీలు ఆ తరువాత చెప్పాడు. అప్పుడు మాత్రం నాకేమీ తోచలేదు. ఎక్కడికి వెళ్లడం? హోటళ్లలో నన్ను ఉండనీయరు.
1893 నాటి ప్రిటోరియా స్టేషను 1914 నాటి ప్రిటోరియా స్టేషను కాదు. దీపాలు మసక మసకగా వున్నాయి. ప్రయాణీకులు కూడా ఎక్కువమంది లేరు. అందరూ వెళ్లాక టిక్కెట్టు కలెక్టరు దగ్గరకు వెళ్లి టిక్కెట్టు యిచ్చి ఎక్కడ బసచేయవచ్చునో అడుగుదామని ఆగాను. ఎక్కడా కుదరకపోతే ఆ రాత్రి రైలు స్టేషనులోనే వుందామని భావించాను. యీ విషయం అడిగితే అవమానిస్తాడేమోనని భయం పట్టుకున్నది. స్టేషను శూన్యం అయింది. చివరికి నా టిక్కెట్టు యిచ్చి అదీ యిదీ మాట్లాడసాగాను. అతడు వినయంతో సమాధానం యిచ్చాడు, కాని ప్రయోజనం శూన్యం. యింతలో మా ప్రక్కనే నిలబడియున్న ఒక అమెరికా నీగ్రో మా మాటలు విని యిలా అన్నాడు . “మీరీ వూరికి క్రొత్తవారిలా వున్నారు. యిక్కడ మీకు మిత్రులెవ్వరూ లేనట్లుంది. నాతో రండి. మిమ్ము ఒక చిన్న హోటలుకు తీసుకువెళతాను. హోటలు యజమాని అమెరికావాడు. వారిని నేను బాగా ఎరుగుదును. అతడు మీకు వసతి కల్పిస్తాడు రండి.”
ఈ పిలవని పేరంటం చూచి మొదట నేను సందేహించాను. కాని తరువాత అతనికి ధన్యవాదాలు చెప్పి అంగీకరించాను. అతడు నన్ను జాన్సటన్ గారి హోటలుకు తీసుకువెళ్లాడు. అతణ్ణి చాటుకు తీసుకుపోయి నా సంగతి చెప్పాడు. జాన్‌స్టన్ అంగీకరించాడు. కాని ఒక్క నియమం పెట్టాడు. అందరితో గాక నా భోజనం నా గదిలోనే చేయాలన్నది అతడు పెట్టిన నియమం. “నలుపు తెలుపు భేదాలు నేను పాటించను. కాని మా హోటలుకు వచ్చే వాళ్లంతా తెల్లవాళ్లే. మిమ్మల్ని వాళ్లతోబాటు కూచోబెడితే వాళ్లు అవమానంగా భావిస్తారేమో. వాళ్లు లేచిపోతారేమో. అది ప్రమాదం. అందుకని యిలా అంటున్నాను.” అని జాన్‌స్టన్ స్పష్టం చేశాడు.
“ఈ రాత్రి ఉండనిచ్చినందుకు ధన్యవాదాలు. యీదేశ పరిస్థితులు కొద్ది కొద్దిగా తెలిశాయి. మీ కష్టం ఏమిటో బోధపడింది. నాగదిలో భోజనం చేసేందుకు నాకు యిబ్బంది లేదు, రేపు మరోచోట ఏర్పాటు చేసుకుంటాను” అని అన్నాను. గది చూపించాడు. లోపలికి వెళ్లాను. ఒక్కడినే వున్నాను. ఏదో ఆలోచిస్తున్నాను. భోజనం కోసం ఎదురు చూస్తుంటే జాన్‌స్టన్ స్వయంగా వచ్చి “మిమ్మల్ని గదిలోనే భోజనం చేయమని చెప్పినందుకు విచారిస్తున్నాను. భోజనశాలకు అంతా వచ్చారు. వారితో మీ విషయం చెప్పాను. మాకేమీ అభ్యంతరం లేదని వారంతా చెప్పారు. రండి భోజనశాలలో అందరి సరసన కూర్చొని భోజనం చేయండి. హోటల్లో మీరెన్నాళ్లున్నా ఎవ్వరికీ ఏమీ యిబ్బంది లేదు.” అని అన్నాడు. ఆయనకు మళ్లీ ధన్యవాదాలు చెప్పి భోజనశాలకు వెళ్లి తృప్తిగా కడుపు నిండా భోజనం చేశాను.
మరునాడు ప్రొద్దునే వెళ్లి వకీలు శ్రీ బేరుగారిని దర్శించాను. అబ్దుల్లా సేఠ్ ఆయనను గురించి అదివరకు కొద్దిగా చెప్పాడు. అందువల్ల ఆయన నాకు చేసిన ఆదరణ చూచి నేను ఆశ్చర్యపడలేదు. ఎన్నో కుశల ప్రశ్నలు వేశారు. అమితంగా ఆదరించారు. నా సంగతంతా ఆయనకు సవివరంగా చెప్పాను. అంతా విని ఆయన “బారిస్టరుగా మీరు చేయవలసింది యిక్కడ ఏమీలేదు. లోగడనే మేము మంచి వకీళ్లను నియమించి వుంచాము. యీ దావా చాలా కాలాన్నుంచి నడుస్తున్నది. యిది చిక్కుల మారి దావా. అందువల్ల అవసరమైనచోట్ల మీ సాయం తీసుకొంటాను. మా క్లయింటుకు మాకు ఉత్తర ప్రత్యుత్తరాలలో జరుగుతున్న కష్టాలు మీరు తొలగించవచ్చు. వారి దగ్గరనుండి రావలసిన వివరాలు నేను మీనుండి పొందుతాను. యిది చాలా ప్రయోజనకరమైన విషయం. మీ బసను గురించి యింతవరకు నేను అడగలేదు. పరిచయం అయిన తరువాత అడుగుదామని అనుకున్నాను. యిక్కడ వర్ణ వైషమ్యం విపరీతంగా వుంది. అందువల్ల మీ బోటి వారికి తేలికగా బస దొరకదు. అయితే నేనొక పేదరాలిని ఎరుగుదును. ఆమె రొట్టెలు అమ్ముకొని జీవించు యిల్లాలు. ఆమె మీకు అవకాశం కల్పిస్తుంది. కొద్దిగా డబ్బు తీసుకుంటుంది. అక్కడికి పోదాం. దయచేయండి” అని అంటూ లేచి నిలబడ్డాడు.
ఇద్దరం ఆమె ఇంటికి వెళ్లాం, ఆమెతో చాటుగా ఏదో మాట్లాడాడు. వారానికి 35 షిల్లింగులు తీసుకొని భోజనం పెట్టడానికి ఆమె అంగీకరించింది.
బేకరు మంచి వకీలే గాక మతబోధకుడు కూడా. ఆయన యిప్పటికీ జీవించే యున్నాడు. ఆయన పని యిప్పుడు మత ప్రచారం చేయడమే. వకీలు వృత్తి మానివేశాడు. సిరిసంపదలు బాగా వున్నాయి. యిప్పటికీ మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ వున్నాయి. ఆయన విశ్వాసం, వాదన ఒకటే. క్రైస్తవ మతమే ప్రశస్తమైనది. జీససు ఈశ్వరుని ఏకైక పుత్రుడు. మనుష్యుల్ని తరింపచేసే తారకుడు. యిట్ట విశ్వాసం వల్ల పరమ ప్రశాంతి లభిస్తుంది. యిదే ఆయన బోధకు సారం.
ప్రథమ దర్శనమప్పుడే ఆయనకు తత్వబోధన గురించిన నా భావాలు చెప్పివేశాను. నేను చెప్పిన దానికి సారం - “నేను పుట్టుకచే హిందువును. అయినా నాకు హిందూ మతమంటే ఎక్కువగా తెలియదు. ఇతర మతాలను గురించి అసలే తెలియదు. నిజానికి నా స్థితి ఏమిటో నాకు తెలియడు. ఎలా వుండాలో కూడా తెలియదు. మా మతాన్ని గురించి చదవాలని అనుకుంటున్నాను. యథాశక్తి యితర మతాలను కూడా పఠిస్తాను.”
దాపరికం లేని నా మాటలు విని బేకరు చాలా సంతోషించాడు. “దక్షిణ - ఆఫ్రికాయందలి జనరల్ మిషనుకు నేనొక డైరెక్టరును. నేను స్వయంగా ఒక చర్చి కట్టించాను. అక్కడ నియమిత సమయాన మత విషయాలను గురించి ప్రస్తావిస్తూ వుంటాను. నాకు రంగు తెగులు లేదు. నాతోబాటు యింకా మత ప్రచారకులు వున్నారు. మేము ప్రతిరోజు ఒంటిగంటకు అక్కడ చేరి శాంతి మరియు జ్ఞానోదయం కోసం ప్రార్థన చేస్తూ వుంటాము. మీరు అక్కడికి వస్తే సంతోషిస్తాను. మా వారందరకీ మిమ్ము పరిచయం చేస్తాను. వాళ్లు మీ పరిచయం పొంది సంతోషిస్తారు. మీకు చదవడం కోసం కొన్ని పుస్తకాలు యిస్తాను. క్రైస్తవ మత గ్రంధాలలో కెల్లా గొప్పది బైబిలే, దాన్ని చదవమని సిఫారసు చేస్తున్నాను.” అని అన్నాడు.
బేకరు గారికి ధన్యవాధాలు చెప్పి ఒంటి గంట ప్రార్ధనకు తప్పక వస్తానని చెప్పాను. “అయితే రేపు మీకోసం యిక్కడనే వేచి వుంటాను. యిక్కడి నుండి మనిద్దరం ప్రార్ధనా మందిరానికి కలిసే వెళదాం.” అని అన్నాడు. నేను సెలవు తీసుకున్నాను.
ఆలోచించేందుకు యిప్పటి దాకా నాకు అవకాశం చిక్కలేదు. జాన్‌స్టన్ గారి దగ్గరకు వెళ్లాను. వారికి డబ్బు చెల్లించి క్రొత్త యింటికి వెళ్లాను. అక్కడే భోజనం చేశాను. ఆమె మంచి యిల్లాలు. ఆమె నాకోసం శాకాహారం సిద్ధం చేసింది. వారి కుటుంబంతో కలిసి పోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు.
తరువాత నేను అక్కడి నుండి అబ్దుల్లా గారి స్నేహితుణ్ణి చూచేందుకు వెళ్లాను. అబ్దుల్లా వారికి చీటీ వ్రాసి యిచ్చాడు. నేను వెళ్లి ఆ చీటీ యిచ్చాను. మాకు పరిచయం అయింది. ఆయన అక్కడ హిందూ దేశస్థులు పడుతున్న కష్టాలు చెప్పారు. తన యింట్లో వుండమని ఆయన నన్ను బలవంతం చేశారు. నేను ధన్యవాదాలు చెప్పి యిదివరకే బస ఏర్పాటు చేసుకున్నానని మనవి చేశాను. “మీకేమి కావాలన్నా అడగండి. సంకోచించకండి” అని ఆయన మరీ మరీ చెప్పారు.
సంధ్యాసమయం దాటింది. యింటికి చేరి భోజనం చేశాను. విశ్రమించి దీర్ఘాలోచనలో మునిగిపోయాను. ప్రస్తుతం చేయడానికి పనేమీ లేదు. ఈ విషయం అబ్దుల్లా గారికి తెలియజేశాను. బేకరుగారు నాతో యింత స్నేహం చేయడానికి కారణం ఏమిటి? వారి సహచరుల పరిచయం వల్ల ఒనగూడేదేమిటి? క్రైస్తవ మతాన్ని గురించి ఎంతని చదవగలను? హిందూమతానికి సంబంధించిన గ్రంధాలు ఎక్కడ దొరుకుతాయి! నా మతాన్ని గురించి తెలుసుకోలేకపోతే క్రైస్తవ మతాన్ని గురించి ఏం తెలుసుకోగలను? యోచించి యోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాను,
“నా చదువంతా నిష్పాక్షికంగా వుండాలి. ఈశ్వరుడు చూపించిన త్రోవన బేకర్ మిత్రుల బృందంతో బాటు సంచరించాలి. నా మతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోనిదే యితర మతాన్ని అంగీకరించను. అట్టి ఆలోచనే పెట్టుకోను.” ఈ విధంగా ఆలోచిస్తూ వుండగా నిద్ర వచ్చేసింది.
11. క్రైస్తవులతో పరిచయం
మర్నాడు ఒంటి గంటకు బేకరుగారి చర్చికి వెళ్లాను. హారీస్ కుమారితోను, గాబ్ కుమారితోను, కోట్సు మొదలగు వారితోను పరిచయం అయింది. అంతా ప్రార్ధన కోసం మోకరిల్లారు. నేను వారిని అనుకరించాను. తమ కోరికలను గురించి ఈశ్వరుని వేడుకోవడం అక్కడి ప్రార్ధనా విశేషం. “ఈ దినం శాంతంగా గడుచుగాక అనిగాని, ఓ పరమేశ్వరా! నా హృదయద్వారాన్ని తట్టుదువుగాక” అనిగాని ప్రార్ధించడం అక్కడ మామూలు. కాని ఆ రోజున మాత్రం వారంతా “క్రొత్తగా వచ్చిన మా మిత్రునకు మార్గం చూపుము ఓ ప్రభూ! మాకు కలిగించిన శాంతినే అతనికి కూడా కలిగింపుము. మమ్ము రక్షించిన ఏసు రక్షకుడే ఇతనిని కూడా రక్షించుగాక. ఏసునాథుని పేరనే మేము యీ ప్రార్ధనలు చేస్తున్నాము.” అని వారంతా పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. ఈ సమాజంలో భజన కీర్తనలు లేవు. సంగీతం లేదు. ప్రతిదినం ప్రార్థన కాగానే అంతా వెళ్లిపోయేవారం. సరిగ్గా అది భోజనాల సమయం, ప్రార్ధనకు అయిదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టేది కాదు.
హారిస్, గాబ్ అను యిద్దరూ పెండ్లికాని ప్రౌఢలు. కోట్సుగారు క్వేకరు తెగవారు. పై స్త్రీలిద్దరూ ఒకేచోట నివసిస్తూ వుండేవారు. ప్రతి ఆదివారం నాలుగు గంటలకు తన యింట టీ త్రాగడానికి నన్ను ఆహ్వానించారు. ఆదివారాలందు కోట్సుగారూ, నేనూ కలిసినప్పుడు ఆవారం నేను చదివిన గ్రంధాల జాబితా తెలుపుతూ వుండేవాణ్ణి. వాటిని గురించి నా అభిప్రాయాలు కూడా తెలుపుతూ వుండేవాణ్ణి. కోట్సు హృదయం పరిశుద్ధమైనది. అతడు బోళావాడు, పట్టుదల గలవాడు. ఈయనకు నాకు స్నేహాం కలిసింది. తరుచు మేమిద్దరం కలిసి షికారుకు వెళుతూ వుండేవారం. ఆయన ద్వారా నాకు చాలామంది క్రైస్తవులతో పరిచయం కలిగింది. మా పరిచయం పెరిగిన కొద్దీ నా అల్మారాలో ఆయనిచ్చిన గ్రంధాల సంఖ్య పెరగసాగింది. ఆయన ఎడ గల శ్రద్ధ వల్ల వాటి నన్నింటినీ చదువుతూ వున్నాను. చదివి అందలి విషయాన్ని గురించి ఆయనతో చర్చిస్తూ వుండేవాణ్ణి. 1893లో అట్టి గ్రంధాలు చాలా చదివాను. వాటి పేర్లన్నీ యిప్పుడు నాకు గుర్తు లేవు. ‘సిటీ టెంపుల్’ అను గ్రంధాన్ని గురించి పార్కరుగారు వ్రాసిన వ్యాఖ్యానం, పియర్సన్ గారు వ్రాసిన “ఇన్‌ఫొలిబిల్ ప్రూఫ్స్” బట్లరుగారు వ్రాసిన ‘అనాలజీ’ మొదలగునవి కొన్ని గుర్తువున్నాయి. ఈ గ్రంథాల్లో కొన్ని భాగాలు నాకు అర్థం కాలేదు. కొన్ని నచ్చాయి. కొన్ని నచ్చలేదు. నా ఉద్దేశ్యాలు కోట్సుగారికి తెలుపుతూ వుండేవాడిని. బైబిల్ మతం పరమ ప్రమాణం అనడమే ఇన్‌పాల్‌బిల్ ప్రూఫ్ గ్రంధకర్త ఉద్దేశ్యం. యీ పుస్తకం నాకు నచ్చలేదు. పార్కరుగారి టీక నీతి వర్ధకమే గానీ ప్రచారంలో నున్న ఏసు మతం మీద విశ్వాసం లేని వారికది నిష్ప్రయోజనం. బట్లరుగారి అనాలజీ క్లిష్టమైన గంభీరమైన గ్రంథం. దీన్ని అయిదారుసార్లు చదవాలి. నాస్తికులను ఆస్తికులుగా మార్చడం యీ గ్రంధోద్దేశ్యం అని అనుకుంటాను. దేవుడు కలడు అని చెప్పే గ్రంధాలు నాకు లాభకారి కావు. నేను నాస్తికావస్థలో లేను. ఏసు ఒక్కడే అద్వితీయమైన అవతార పురుషుడనీ, అతడే మానవులకు, ఈశ్వరునకు సంధానకర్తయనీ చెప్పే సిద్ధాంతాలు నాకు హృదయంగమం కాలేదు.
కోట్సుగారు అంత మాత్రాన అపజయం అంగీకరించే రకం కాదు. ఆయనకు నాపై అమిత ప్రేమ ఏర్పడింది. ఒకనాడు ఆయన నా మెడలో తులసి దండ చూచాడు. చూచి ఖిన్నుడయ్యాడు. “ఈ గ్రుడ్డి నమ్మకం నీకు తగదు. దండ త్రెంపి ఇలా యివ్వండి” అని అన్నాడు.
“చూడండి యిది మా అమ్మగారి ప్రసాదం. అందు నమ్మకం వుందా లేదా నాకు అనవసరం. అందలి రహస్యం నాకు తెలియదు. దాన్ని ధరించకపోతే కీడు కలుగుతుందని నేను భావించను. ఆమె నా శ్రేయస్సు కోరి ప్రేమతో వేసిన యీ దండను ప్రబలమగు కారణం లేనిదే తీసివేయను. కాలం పక్వమై, అది జీర్ణమై తనంతటతాను తెగిపోతే మరోతులసిదండ వేసుకుందామనే లోభం నాకు లేదు. కాని దీన్ని మాత్రం తెంచడానికి వీలు లేదు.” అని చెప్పివేశాను. ఆయనకు నా వాదం నచ్చలేదు. నన్ను అజ్ఞాన కూపాన్నుండి బయటకు తీయటానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. మతాంతరములందు కొంత సత్యం వున్నా పూర్ణ సత్యం ఏసు మతమందే కలదనీ, ఆ మతం స్వీకరించనిచో మోక్షం చేకూరదనీ, ఏసునాధుడు మధ్యవర్తియై అడ్డుపడకపోతే పాపప్రక్షాళనం జరగదనీ, పుణ్యకర్మలతో ఏమీ ప్రయోజనం లేదనీ అతడు వాదించి నన్ను ఒప్పించాలని ప్రయత్నిస్తూనే వున్నాడు. గ్రంధాలతో బాటు అతడు ఏసుభక్తుల్ని కూడా చాలామందిని నాకు పరిచయం చేశాడు. ఇట్టి పరిచయస్థులలో ప్లీమత్ బ్రదరన్ కుటుంబం కూడా ఒకటి.
ప్లీమత్ బ్రదరన్ అనునది ఒక ఏసు సంప్రదాయం. కోట్సుగారి ద్వారా నాకు పరిచయమైన వారంతా బాగా చదువుకున్నవారు. పాపభీరువులు. కాని యీ కుటుంబంలో ఒకరు యీ క్రింది విధంగా వాదించారు.
“మా మత సౌందర్యం నీవెరుగవు. మానవుడు తన పాపాలకు ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నీ వాదన అయితే జీవితమంతా ప్రాయశ్చిత్తాలతోనే గడిచిపోతుంది. ఎడతెగని యీ కర్మకాండ నుంచి ఎలా ముక్తి లభిస్తుంది? ఎన్నటికీ శాంతి లభించదు. మనమందరం పాపులం అని నీవూ అంటున్నావు. చూడు మాకెంత విశ్వాసమో! మన ప్రయత్నాల వల్ల ముక్తి వ్యర్ధం కాకూడదు. యీ పాపభారం ఎలా మోయగలం? దానిని ఏసుమీద వేయాలి. అతడొక్కడే పాపరహితుడు. అతనొక్కడే భగవానుని కుమారుడు. ఎవరు తనను నమ్ముదురో వారి పాపాలు పటాపంచలయిపోతాయని ఆయన వరం యిచ్చాడు. అది దేవుని అగాధమగు ఉదారతత్వం. ఏసు ముక్తి నీయగలడని నమ్ముదుమేని పాపాలు మనకంటవు. మనం పాపం చేయక తప్పదు. యీ ప్రపంచంలో పాపస్పర్శ తగలకుండా వుండేదెలా? కావున ఏసు ఒక్కడే రక్షకుడు అని నమ్మిన వానికే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. కావున శాంతి మీకా! మాకా?”
ఈ వాదం నాకు నచ్చలేదు. “నేను యీ ఏసు మతాన్ని అంగీకరించలేను. పాపాలు చేసి తత్ఫలం నాకంటరాదని నేనెన్నడూ ప్రార్ధించను. పాపకర్మ నుండి, పాప ప్రవృత్తినుండి విముక్తుడనగుటకు ప్రయత్నిస్తాను. అట్టి స్థితి చేకూరేదాకా నాకు అశాంతియే ప్రీతికరం” అని అన్నాను. అతడు బదులు చెబుతూ - “ఇదంతా నిష్ప్రయోజనం. మళ్లీ నేను చెప్పిన మాటల్ని బాగా ఆలోచించు.” అని అన్నాడు. పాపం అతడు బుద్ధిపూర్వకంగా పాపాల్ని అనుష్టించాడు. అంతటితో ఆగక వాటివల్ల తన మనస్సునకేమీ చింత లేదని మరీ మరీ చెప్పాడు.
ఇట్టి సిద్ధాంతాలు క్రైస్తవులందరికీ సమ్మతం కాదని వీరితో పరిచయం కాక పూర్వం నుండే నాకు తెలుసు. కోట్సు పాపభీరుడు. నిర్మలుడు. సాధనచే హృదయం శుద్ధమగునని అతని నమ్మకం. ఆ కుమారికల నమ్మకం కూడా అదే. నేను చదివిన గ్రంధాల్లో కొన్ని భక్తిపరమైనవి. ప్రీమత్ సోదరుని ప్రసంగం వల్ల నా బుద్ధి ఎలా మారునోయని కోట్సు భయపడ్డాడు. కాని అట్టి భయానికి అవకాశం లేదనీ, అతడేదో అన్నాడని ఏసు మతం మీద నాకు ఈర్ష్యాద్వేషాలు కలుగవని నచ్చచెప్పాను. నాకు గల తపన బైబిలును గురించియే, దాని తత్వార్ధాన్ని గురించియే.
12. భారతీయులతో పరిచయం
క్రైస్తువులను గురించి వ్రాసే పూర్వం అప్పటి నా యితర అనుభవాల్ని గురించి కూడా కొంచెం వివరిస్తాను.
నేపాలు రాష్ట్రంలో దాదా అబ్దుల్లా గారెంతో ప్రిటోరియాలో సేఠ్ తైయబ్ హాజీ ఖాన్‌గారంత. అందరికీ ఉపయోగపడే ఏ ధర్మ కార్యమైనా ఆయన లేకుండా జరుగదు. నేను అక్కడికి వెళ్లిన మొదటి వారంలోనే వారిని పరిచయం చేసుకున్నాను. “నాకు ప్రిటోరియా యందలి భారతీయులందరితోను పరిచయం పెంచుకోవాలని వున్నది. యిక్కడి హిందూదేశస్థుల ఆనుపానులు నాకు తెలుసుకోవాలని వుంది. అందుకు మీ సాయం కావాలి.” అని నేను అనగానే అన్ని విధాల సహకరిస్తానని మాట యిచ్చాడు.
భారతీయులందరినీ ఒకచోట సమావేశపరిచి వారి స్థితిగతులు వారికి అవగతం చేయడం అవసరమని నాకు తోచింది. సేఠ్ హాజీ మహమ్మద్ అను వారి పేరట కూడా నా దగ్గర పరిచయ పత్రం వున్నది. సభను సేఠ్‌గారి ఇంట్లో ఏర్పాటు చేశాం. సభికులంతా మేమన్ వర్తకులు. హిందువుల సంఖ్య బహు స్వల్పం ప్రిటోరియాలో స్థాయి గల హిందువులు మాత్రం వచ్చారు.
నా జీవితంలో యిదే మొదటి ఉపన్యాసం. ఆ ఉపన్యాసం కోసం నేను చాలా కష్టపడ్డాను. ఉపన్యాసంలోని విషయం సత్యం. కాని వాణిజ్యంలో సత్యం నడవదు, అసంభవం అని కొందరు వర్తకులు నాతో వాదించారు. నేను అప్పుడు వారి వాదాన్ని విశ్వసించలేదు యిప్పుడూ విశ్వసించలేదు. సత్యం, వ్యాపారం రెంటికీ పొంతన కుదరదు. అనే వర్తకులు యిప్పటికీ పున్నారు. వ్యవహారం వేరు, ధర్మం వేరు యిదీ వారి వాదన. వ్యవహారమందు శుద్ధ సత్యం అశక్యం, యధాశక్తి సత్యమాడటం శక్యం అని వారి అభిప్రాయం. నేను నా ఉపన్యాసంలో యీ విషయాన్ని గురించి కూలంకషంగా చర్చించి వాణిజ్య వేత్తలు రెండింతలు సత్య ప్రపర్తన గలిగి వుండాలని చెప్పాను. స్వదేశంలో కంటే విదేశంలో సత్య నిష్ఠ ఎక్కువగా వుండాలనీ, అందుకు విశేషకారణం వుందనీ, విదేశంలో కొద్దిమంది భారతీయుల అసత్య ప్రవర్తనను చూచి భారతదేశంలో గల కోటాను కోట్ల భారతీయులంతా యిదే రకమని యిక్కడి జనం భావిస్తారనీ, నొక్కి వక్కాణించాను. నేను తెల్లవారిని ఉదాహరణగా చెప్పి నల్లవారు ఎంత అశుచిగా వుంటారో, ఎంత దుష్టంగా ప్రవర్తిస్తారో వివరించాను. పారశీకులు, క్రైస్తవులు, మరాఠీ, గుజరాతీ, మదరాసీ, పంజాబీ, సింధీ, కచ్ఛీ, సూరతీ మొదలుగా గల భేదాలు మరిచిపొమ్మని ఉద్భోదించాను. ఒక సంఘాన్ని స్థాపించి, భారతీయులు పడుతున్న కష్టాల గురించి అర్జీలు పంపవలసిన అవసరం ఎంతైనా వుందని చెప్పి అట్టి సంఘంలో జీతం తీసుకోకుండా నేను పని చేస్తానని చెప్పి నా ప్రసంగాన్ని ముగించాను. నా ఉపన్యాసం సభను ఆకట్టుకొని ప్రభావితం చేసిందని గ్రహించాను. దానిపై చర్చలు జరిగాయి.
తమ తమ కష్టాల్ని చెప్పడానికి కొందరు ముందుకు వచ్చారు. నాకు కూడా ఉత్సాహం కలిగింది. వారిలో ఇంగ్లీషు వచ్చిన వారు కొద్దిమందే. యీ పరదేశంలో ఇంగ్లీషు రావడం అవసరమనీ, ప్రయోజనకరమనీ వారికి చెప్పాను. పెద్దవారైనా సరే చదువుకోవచ్చునని చెప్పి కొందరి పేర్లు ఉదాహరణగా పేర్కొన్నాను. మీరు ఇంగ్లీషు నేర్చుకొంటానంటే నేను బోధిస్తాను, మీకు తీరిక వున్న సమయం తెలిపితే నేనే స్వయంగా వచ్చి మీకు ఇంగ్లీషు నేర్పుతానని చెప్పాను. కొందరు నేర్చుకునేందుకు ముందుకు వచ్చారు. వారిలో యిద్దరు మహమ్మదీయులు. ఒకరు మంగలి, ఒకరు గుమాస్తా, మూడవ వాడు హిందువు. ఒక చిన్న దుకాణదారు. నేనందరికీ అనుకూలుడనైనాను. బోధన చేయగలిగాను. కాని నా శిష్యుల్లో కొందరు ఏమరుపాటు చూపించారు. కాని నేను మాత్రం ఓర్పుతో వ్యవహరించాను. వారి గృహాలకు వెళ్లాను. కాని వారికి సమయం చిక్కలేదు. ఇంగ్లీషులో పండితులు కావాలని వాళ్లకు కోరిక లేదు. అయినా యిద్దరు మాత్రం ఎనిమిది నెలలకు కొంత తేలారు. జమా ఖర్చులు వ్రాయడం, రాతకోతలు నేర్చారు. తన ఖాతాదారులతో కొంచెం ఇంగ్లీషుతో మాట్లాడగలిగితే చాలని మంగలి ఉద్దేశ్యం. వారిలో యిద్దరు ఇంగ్లీషు నేర్చుకొని ధనార్జన చేయసాగారు కూడా.
సభ వల్ల కలిగిన యీ ప్రయోజనం చూచి నాకు సంతోషం కలిగింది. అట్టి సభలు ప్రతి వారమూ ప్రతినెలా జరపాలని నిర్ణయం చేశాం. మొత్తం మీద మేమనుకున్నట్లుగా సభలు జరుగుతూ వున్నాయి. యీ సభలలో ఒకరి అభిప్రాయం మరొకరు తెలసుకోగలిగేవారు. యీ కారణం వల్ల ప్రిటోరియలో గల ప్రతి భారతీయునితో నాకు పరిచయం ఏర్పడింది. తెలియని వారంటూ ఎవ్వరూ లేరు. అందువల్ల యిక అక్కడ వున్న బ్రిటిష్ ఏజంటుతో పరిచయం పెంచుకోవాలని భావించాను, వారిని దర్శించాను. ఆయన పేరు జాకోబ్స్ డీనెట్. హిందూ దేశస్థులపై ఆయనకు మంచి అభిప్రాయం వున్నది. కాని అతనికి అక్కడ తగిన పరపతి లేదు. సమయం వచ్చినప్పుడు సాయపడతాను, అవసరం అయినప్పుడు వచ్చి నన్ను కలవమని ఆయన చెప్పాడు.
ఇక రైల్వే వారితో చర్చలు ప్రారంభించాను. మీ నియమాల ప్రకారం హిందువులకు కష్టాలు కలుగకుండ చూడమని వాళ్లను కోరాను. సరియైన వేష భాషలుంటేనే పెద్ద తరగతి టిక్కెట్లు యివ్వబడతాయని రైల్వే వారినుండి సమాధానం వచ్చింది. అయితే వీని వల్ల ప్రయోజనం చేకూరదు. వేష భాషలు సరిగా వున్నాయా లేదా అని నిర్ణయించే అధికారి ఎవరు? స్టేషను మాస్టరే అట్టి అధికారి. అందువల్ల ప్రయోజనం శూన్యం అని ప్రకటించాను.
హిందువులకు సంబంధించిన కొన్ని పత్రాలు బ్రిటీష్ ఏజంటు చదవమని నాకు యిచ్చాడు. ఇట్టివి కొన్ని తైయబ్జీ గారి దగ్గర కూడా నాకు లభించాయి. ఆరెంజి ఫ్రీస్టేటు నుండి భారతీయులు ఎంత నిర్దయగా వెళ్లగొట్టబడ్డారో ఆ కాగితాలు చదవడం వల్ల నాకు తెలిసింది.
ట్రాన్సువాలు ఫ్రీ స్టేటుల్లోని భారతీయుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు సమస్తం నాకు బోధపడ్డాయి. వీటిని చదవడం వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం కలుగుతుందని అప్పుడు నేను ఊహించలేదు.
ఆ ఏడు గడిచిన తరువాత, దావా వ్యవహారం తేలిపోగానే ఇంటికి వెళ్లాలని నా భావన. కాని దైవేచ్ఛ వేరుగా వుంది.
13. కూలి వృత్తి
ట్రాన్సువాలు ఆరెంజి ఫ్రీస్టేటులోని భారతీయుల స్థితిగతులను గూర్చి పూర్తిగా వ్రాయడానికిది తావు కాదు. తెలుసుకోదలచినవారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర చదవడం మంచిది. ఆరెంజి ఫ్రీ స్టేటుయందు 1888వ సంవత్సరంలోనో లేక అంతకు ముందో పుట్టిన ఒక శాసనం వల్ల భారతీయుల స్వాతంత్ర్యమంతా హరించిపోయింది. ఒకవేళ భారతీయులెవరైనా అచ్చట వుండదలిస్తే హోటళ్లలో సేవకులుగానో లేక మరేదైనా బానిస వృత్తియో చేస్తే వుండవలసిందే. పేరుకు మాత్రం కొద్దిగా ముదరా యిచ్చి భారతీయ వ్యాపారస్థుల్ని వెళ్లగొట్టారు. వారు అర్జీలు పెట్టుకున్నారు. ప్రార్ధనా పత్రాలు పంపుకున్నారు. కాని వినిపించుకునే నాధుడు లేడు. 1885వ సంవత్సరంలో ఒక కఠిన శాసనం అమలుచేశారు. 1886లో అందులో కొద్దిగా మార్పు చేశారు. ఆ శాసనం ప్రకారం భారతీయులు ట్రాన్సువాలులో ప్రవేశించాలంటే మూడు పౌండ్లు టాక్సు చెల్లించాలి. ప్రత్యేకించిన స్థలాల్లో తప్ప మరెక్కడా వారికి భూములు వుండకూడదు. భూములున్నా వాటిమీద హక్కు ఉండదు. వారికి వోటు హక్కు లేదు. ఆసియా ఖండ వాసుల కోసం యిట్టి శానసం చేయబడింది. తదితర శ్వేతేతర జాతుల వారి కోసం నిర్మించబడ్డ శాసనాలు కూడా ఆసియా ఖండవాసులపై ప్రయోగించసాగారు. యీ శాసనం ప్రకారం భారతీయులు రోడ్డు మీద నడవకూడదు. రాత్రి తొమ్మిది గంటల తరువాత భారతీయులెవ్వరూ బయటకి పోకూడదు. తిరగకూడదు. భారతీయులపై ఒక్కొక్కప్పుడు యీ శాసనం ప్రయోగించ బడుతూ వుండటం, ఒక్కొక్కప్పుడు ప్రయోగించకుండా వుండటం కూడా కద్దు. యీ పరిస్థితిలో కొందరు భారతీయ మహమ్మదీయులు తాము అరబ్బులమని చెప్పుకొని తప్పించుకునేవారు. భారతీయులకు అనుమతి కావలసివస్తే పోలీసుల దయాధర్మం మీద ఆధారపడవలసిందే.
ఈ శాసనాల్ని చదవవలసిన అవసరం కలిగింది. నేను రాత్రులందు కోట్సుగారితో కలిసి షికారుకు పోతూ వుండేవాణ్ణి. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి పదిగంటలయ్యేది. పోలీసులు పట్టుకుంటే యిక నాగతి ఏమిటి ? యీ విషయంలో నాకంటే కోట్సుగారే ఎక్కువ విచారపడుతూ వుండేవారు. ఆయన తన దగ్గర పనిచేసే నీగ్రో సేవకులకు పాసు యివ్వగలడు. అది చెల్లుతుంది. కాని నాకు యివ్వలేడు. వాస్తవానికి అతడు సేవచేసే వారికి అనుజ్ఞా పత్రం యివ్వవచ్చు. కాని అది నా విషయంలో చెల్లదు.
అందువల్ల కోట్సుగారో, వారి మిత్రులో నన్ను క్రౌజ్‌గారి దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయన ప్రభుత్వ వకీలు. మేము సహాధ్యాయులం. ఒకరి ముఖం మరొకరం ఎరుగుదుము. ఒక్క “ఇగ్” కు సంబంధించిన బారిస్టర్లం. తొమ్మిది గంటలు దాటితే నాకు పాసు అవసరం అని విని ఆయన బాధపడ్డాడు. నా బాధలో కొంత తానూ పంచుకున్నాడు. నాకు పాసు యివ్వడానికి బదులు ఒక చేఉత్తరం వ్రాసి యిచ్చాడు. దానితో నాకు తిరిగేందుకు స్వేచ్ఛ లభించింది. పోలీసుల బెడద తగ్గింది. ఆ ఉత్తరం నా దగ్గర వుంచుకున్నాను. అయితే దాని అవసరం కలుగలేదు. ఆ విధంగా అవసరం కలుగకపోవడం కేవలం దైవికమే.
డాక్టర్ క్రౌజు తన యింటికి నన్ను ఆహ్వానించాడు. మాకు స్నేహం కుదిరింది. నేను తరచు వారి యింటికి వెళుతూ వుండేవాణ్ణి. వారి ద్వారా ప్రసిద్ధికెక్కిన వారి సోదరుని పరిచయం కలిగింది. వారి సోదరుడు జోహాన్స్‌బర్గ్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటరు. బోయర్ యుద్ధంలో ఒక ఉద్యోగిని ఖూనీ చేయుటకు కుట్ర పన్నాడని నేరం మోపి ఆయనకు ఏడేండ్ల కారాగార శిక్ష విధించారు. ఆయన పట్టా కూడా రద్దు చేశారు. యుద్ధం ముగిసిన తరువాత ఆయనను విడుదల చేశారు. తిరిగి ఆదరించి ఆయనను కోర్టులో చేర్చుకున్నారు. ఆయన మళ్లీ ప్లీడరు పని చేయసాగారు.
ఈ పరిచయాలు తరువాత ప్రజాసేవ చేయడానికి పూనుకున్నప్పుడు నాకు ఉపయోగపడ్డాయి.
రోడ్డు మీద నడుచుటకు సంబంధించిన శాసనం కూడా ఎంతో యిబ్బంది కలిగించింది. నేనెప్పుడూ ప్రెసిడెంటు వీధికి ఆవలనున్న మైదానానికి షికారుకు పోతూ పుండేవాణ్ణి. యీ వీధిలోనే ప్రెసిడెంట్ క్రూగరు గారి గృహం ఉంది. ఆ గృహం నిరాడంబరంగా వుండేది. దాని చుట్టు తోటగాని, దొడ్డిగాని లేదు. సామాన్య గృహంలా వుండేది. ప్రిటోరియాలో కోటీశ్వరుల యిండ్లు దివ్య భవనాలు. వాటియందు నందనవనాలు అధికంగా వుండేవి. కాని ప్రెసిడెంటుగారు నిరాడంబరులు. ఆ యింటి ముందు పోలీసుల కాపలా వుండటం వల్ల అది రాజ్యాధికారి గృహమని తెలుస్తుంది. నేనెప్పుడూ ఆ పోలీసుల ప్రక్కగా వెళుతూ వుండేవాణ్ణి. అయితే ఆ పోలీసులు ఎప్పుడూ నా జోలికి రాలేదు.
అక్కడ వంతుల ప్రకారం పోలీసులు మారుతూ వుంటారు. ఒకనాడు ఒక పోలీసు నన్ను చూచాడు. కనీసం ముందుగా హెచ్చరిక అయినా చేయకుండా తిన్నగా మీదికి వచ్చి కొట్టి నన్ను నెట్టివేశాడు. నేను నివ్వెరబోయాను. దెబ్బలు తగిలాయి. నేను ఆ పోలీసును ఏమీ అనలేదు. ఇంతలో గుర్రం మీద అటుగా వెళుతున్న కోట్సు దొర అక్కడకు వచ్చి “గాంధీ! నేనంతా చూచాను. నీవు వీనిపై కేసు పెట్టు. నేను సాక్ష్యం యిస్తాను. నీమీద యితడు చెయ్యి చేసుకున్నందుకు విచారిస్తున్నాను” అని అన్నాడు.
“ఇందు విచారించనవసరం లేదు. పాపం ఆ పోలీసు వాడికేమి తెలుసు? అతడికి నల్లవాళ్ళంతా సమానులే. అతడు నామీద చెయ్యి చేసుకున్నట్లే నీగ్రోల మీద కూడా తప్పక చెయ్యి చేసుకుంటాడు. నాకు ఏ అపాయం కలిగినా కోర్టుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల యితని మీద కేసు పెట్టను” అని అన్నాను.
“నీ పద్ధతి నీదే. ఆలోచించుకో. ఇట్టివాడికి ఒక్క పర్యాయం శాస్తి చేయడం అవసరం” అని కోట్సుగారన్నాడు. ఆ తరువాత ఆయన పోలీసువాణ్ణి కోప్పడ్డాడు. పోలీసు డచ్చివాడు. వారిద్దరు డచ్చి భాషలో మాట్లాడుతున్నారు. నాకు వారి మాటలు అర్థంకాలేదు. చిట్ట చివరికి ఆ పోలీసు నన్ను క్షమాపణ కోరాడు. కాని అతడు క్షమాపణ కోరనవసరమే లేదు. నేను అతణ్ణి మొదటనే క్షమించి వేశాను.
అటు తరువాత నేనా వీధికి పోలేదు. అయినా మిగతా పోలీసులకు యీ విషయం తెలియదు కదా! వాళ్ల చేతుల్లో నేను దెబ్బలు తినడం ఎందుకు అని భావించి యితర వీధులగుండా షికారుకు పోవడం ప్రారంభించాను.
ఈ విషయమై భారతీయులను గురించి లోతుగా ఆలోచించడం ప్రారంభించాను. ఈ శాసనాన్ని గురించి బ్రిటిష్ ఏజంటుతో మాట్లాడదామనీ, అవకాశం చిక్కితే ఒక దావా వేసి చూద్దామనీ భారతీయులతో చర్చించాను. యీ విధంగా భారతీయుల బాధల్ని గురించి వినడం చదవడమే గాక స్వయంగా కూడా నేను వాటిని అనుభవించాను. ఆత్మగౌరవం నిలుపుకోవాలని భావించే భారతీయులకు దక్షిణ ఆఫ్రికా అనువైన చోటు కాదనే నిర్ణయానికి వచ్చాను. ఈ పరిస్థితిని ఎలా మార్చడం?
అయితే ప్రస్తుతం నా కర్తవ్యం ఏమిటి? దాదా అబ్దుల్లాగారి దావా వ్యవహారం చూడటమేకదా! కనుక అందుకు పూనుకున్నాను.
14. దావా వేయుటకు ఏర్పాట్లు
ప్రిటోరియాలో నేను ఒక సంవత్సరం వున్నాను. నా జీవితంలో ఆ సమయం అమూల్యమైనది. ప్రజాసేవ చేయాలనే తలంపు నాకు కలిగింది. అందుకు అక్కడే శక్తి చేకూరింది. నాకు మతం విషయమై ఆసక్తి అక్కడే కలిగింది. ప్లీడరు పనిని గురించి సరియైన జ్ఞానం అక్కడే కలిగింది. క్రొత్త బారిస్టర్లు పాత బారిస్టర్ల దగ్గర నేర్చుకోగలిగినది నేను అక్కడే నేర్చుకున్నాను. ప్లీడరు పనికి కొంచెం పనికి వస్తానని నేను అక్కడే తెలుసుకున్నాను. ప్లీడరు పనికి తాళంచెవి అక్కడే నాకు దొరికింది.
దాదా అబ్దుల్లా గారి దావా చిన్నదికారు. నలభై వేల పౌండ్లకు, అంటే ఆరు లక్షల రూపాయలకు సంబంధించిన దావా అది. యిది వ్యాపారానికి సంబంధించిన దావా. అందువల్ల లెక్కల చిక్కులు అపరిమితంగా వున్నాయి. ప్రాంశరీ నోట్లకు, నోటు వ్రాసి యిస్తామన్న నోటి నూటలకు కూడా యీ దావాతో సంబంధం వుంది. యీ దావాకు యిదే ఆధారం. ప్రాంశరీ నోట్లు మోసం చేసి వ్రాయించుకోబడ్డాయనీ, వాటికి తగిన ఆధారాలు లేవని ప్రతివాదుల వాదన. మొత్తం మీద దావా పూర్తిగా చిక్కుల మయం. వాది ప్రతివాదులు సమర్ధులైన సొలిసిటర్లను, బారిస్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. వారి దగ్గర పని తెలుసుకొనేందుకు నాకు మంచి అవకాశం లభించింది. వాది యొక్క వాదమంతా సిద్ధం చేయడం, సొలిసిటరుకు పరిశీలన కోసం అందజేయడం దావాకు అనుకూలమైన విషయాల్ని వెతకడం నా పని. నేను తయారుచేసిన వివరాలలో సొలిసిటరు ఎంత స్వీకరిస్తున్నాడో, ఎంత త్రోసివేస్తున్నాడో, ఆ సొలిసిటరు తయారుచేసిన వివరాలలో బారిస్టరు ఎంత స్వీకరిస్తున్నాడో తెలుసుకోవడం వల్ల గొప్ప పాఠం నేను నేర్చుకున్నట్లయింది. దావా వేయడం కోసం అవసరమైన శక్తి పెరిగిందని చెప్పవచ్చు.
ఈ దావాలో నాకు అభిరుచి కలిగింది. నేను అందు నిమగ్నమైనాను. సంబంధించిన కాగితాలన్నీ చదివాను. నాక్లయింటు చాలా తెలివిగలవాడు. నామీద అతనికి అపరిమితమైన విశ్వాసం. అందువల్ల నా పని సులువైంది. నేను బుక్‌కీపింగు అంటే ఖాతా లెక్కలకు సంబంధించిన సూక్ష్మాంశాలు కూడా బాగా తెలుసుకున్నాను. అందు గుజరాతీ పత్రాలు ఎక్కువగా వున్నాయి. వాటికి అనువాదకుణ్ణి నేనే, అందువల్ల అనువాదం చేయగల శక్తి కూడా పెరిగింది.
ఈ దావా వ్యవహారంలో పూర్తిగా మునిగిపోయాను. మత సంబంధమైన చర్చలన్నా, ధర్మకార్యాలన్నా నాకు యిష్టం. అయినా అప్పుడు అవి దావా వ్యవహారాల ముందు ప్రధానమైనవిగా తోచలేదు. దావా వ్యవహారమే నాకు ముఖ్యం. అవసరమైనప్పుడల్లా లా చదవడం, కేసును పఠించడం నా పని. వాది ప్రతివాదుల కాగితాలు నా దగ్గర వుండటం వల్ల వారికి కూడా తెలియని విషయాలు కొన్ని నాకు తెలుసునని చెప్పగలను.
కీ.శే. పిన్‌కట్‌గారు చెప్పిన ఒకమాట అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. దక్షిణ ఆఫ్రికాలో గొప్ప బారిస్టరు, కీర్తిశేషులు ఆయిన లియోనార్డ్ అనువారు దాన్ని సమర్ధించారు. “యదార్ధాలే, ముప్పాతిక భాగం” అని వారన్నారు. అప్పుడు నాదగ్గర ఒక కేసు వుంది. ఆ కేసులో యదార్ధాలననుసరించి న్యాయం మాకు అనుకూలంగా వుంది. కాని ‘లా’ మాకు వ్యతిరేకంగా వుంది. చివరికి నిరాశపడి నేను లియోనార్డ్ గారి సాయం కోరాను. వారికి కూడా దావా యందలి విషయాలన్నీ అనుకూలంగా వున్నాయని తోచింది. “గాంధీ! నాకు ఒక్క విషయం తోస్తున్నది. కేసులో గల యదార్ధ విషయాలను గురించి మనం జాగ్రత్తగా వుందాం. అప్పుడు న్యాయం దానంతట అదే జరుగవచ్చు. యీ కేసుకు సంబంధించిన విషయాలన్నీ తిరిగి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. అప్పుడు నా దగ్గరకి రండి” అని లియోనార్డ్ అన్నారు. వారి మాట ప్రకారం తిరిగి ఆ కేసంతా నేను నిశితంగా పరిశీలించాను. అది ఎంతో అపూర్వంగా వుంది. అటువంటిదే దక్షిణ ఆఫ్రికా కేసు మరొకటి నా మనస్సులో నాటుకుంది. ఆ విషయం లియోనార్డ్ గారికి తెలియజేశాను. ఇక మనం యీ కేసు గెలవగలం. అయితే బెంచీ మీదకు ఏ జడ్జీ వస్తాడో చూడాలి.” అని ఆయన అన్నాడు.
దాదా అబ్దుల్లా కేసులో పని చేస్తున్నప్పుడు యదార్ధ విషయాలకు యింత మహత్తు వుంటుందని తెలియదు. యదార్థ విషయం అంటే సత్యమన్నమాట. సత్యాన్ని మనం గ్రహించినప్పుడు న్యాయం దానంతట అదే మనకు అనుకూలిస్తుందన్నమాట. మా వాది దావాలో యదార్ధ విషయాలు బలవత్తరంగా వున్నాయి. అందువల్ల ‘లా’ మా వాది పక్షం అయి తీరుతుందని భావించాం.
ఈ కేసును యిలాగే సాగనిస్తే బంధువులు మరియు ఒకే పట్టణంలో నివశిస్తున్న వాది ప్రతివాదులు యిద్దరూ పూర్తిగా నష్టపడిపోతారను విషయం బోధపడింది. చివరికి దావా ఎవరి పక్షం అవుతుందో తెలియదు. కోర్టులో దీన్ని సాగనిస్తే ఎంతకాలం సాగుతుందో కూడా తెలియదు. అందువల్ల ఉభయ పార్టీలకు ప్రయోజనం కలుగదు. కనుక వీలైతే త్వరగా దీన్ని తేల్చి వేసుకోవడం మంచిదని అనిపించింది.
నేను తైయబ్ సేఠ్‌కు వివరమంతా చెప్పి రాజీ పడమనీ, అందుకు మీ వకీలును సంప్రతించమనీ, వాది ప్రతివాదులు ఒక నమ్మకస్తుడగు మధ్యవర్తి చెప్పినట్లు నడుచుకుంటే కేసు తేలికగా పరిష్కారం అవుతుందనీ చెప్పాను. యీ కేసులో నిజానికి వాది ప్రతివాదులిద్దరూ వర్తక ప్రముఖులే. కాని ప్లీడర్ల కోసం వారిరువురు పెడుతున్న ఖర్చును చూస్తే త్వరలోనే వారి ధనం విపరీతంగా ఖర్చయ్యే ప్రమాదం వున్నది. యీ కేసు గొడవలో పడినందున మరో పని చేసుకొనే అవకాశం కూడా వారికి దొరకడం లేదు. దీనితోనే సరిపోతున్నది. మరో వైపున ఒకరిమీద మరొకరికి వైమనస్యం విపరీతంగా పెరిగిపోతూ వుంది. వకీలు వృత్తిని గురించి యోచించిన కొద్దీ నాకు ఆ వృత్తి యెడ ఏవగింపు పెరిగిపోసాగింది. ఒకరి నొకరు ఓడించుకోవడం కోసం లా పాయింట్లు వెతుక్కోవడం లాయర్ల పని. పెట్టిన ఖర్చులన్నీ గెలిచిన వాడికి వస్తాయా అంటే అదీ లేదు. ఒకరు మరొకరికి ఖర్చు చెల్లించాలంటే దానికి “కోర్టు ఫీజు రెగ్యులేషన్” ప్రకారం ఒక పద్ధతి వుంది. అయితే లాయర్ల కిచ్చే ఫీజు ఆ ప్రకారం లభించే సొమ్ము కంటే ఎంతో అధికం. యీ విషయాలన్నీ మొట్ట మొదటి సారి తెలుసుకున్నాను.
ఇక సహించలేకపోయాను. ఈ దావాను పరిష్కరించడం నా కర్తవ్యమని భావించాను. రాజీ వ్యవహారం ముందుకు సాగిస్తున్నప్పుడు నా ప్రాణాలు పోయినంత పని అయింది. చివరికి తైయబ్ సేఠ్ రాజీకి అంగీకరించాడు. ఒక మధ్యవర్తి నియమించబడ్డాడు. దావా ఆ మధ్యవర్తి ముందు నడిచింది. దాదా అబ్దుల్లా గెలిచాడు.
అయినా నాకు తృప్తి కలుగలేదు. మధ్యవర్తి తీర్పును దాదా అబ్దుల్లా వెంటనే అమలుబరిస్తే తైయబ్ హాజీఖాన్ మహమ్మద్ అన్ని రూపాయలు ఒక్కసారిగా తెచ్చి కుమ్మురించలేడు. దక్షిణ - ఆఫ్రికాలో నివసిస్తున్న పోరుబందర్ వర్తకుల్లో వ్రాయబడని శాసనం ఒకటి వుంది. దివాళా కంటే చావు మేలు అనేదే ఆ శాసనం. తైయబ్ సేఠ్‌గారు ఒక్కసారిగా 37 వేల పౌండ్లు ఖర్చుల క్రింద చెల్లించలేడు. ఆయన పైసలతో సహా బాకీ తీర్చివేసేందుకు సిద్ధమే. కాని దివాళా తీశాడనే అపవాదు రాకూడదు. ఇందుకు ఒక్కటే ఉపాయం, వాయిదాల మీద సొమ్ము తీసుకొనేందుకు దాదా అబ్దుల్లా ఒప్పుకోవాలి. ఆ ప్రకారం దీర్ఘకాలపు వాయిదాల మీద సొమ్ము పుచ్చుకోవడానికి ఉదారబుద్ధితో దాదా అంగీకరించాడు. రాజీకి ఉభయుల్ని ఒప్పించడానికి పడ్డ శ్రమ కంటే వాయిదాల మీద సొమ్ము చెల్లింపుకు అంగీకరింపచేయడానికి నేను పడ్డ శ్రమ ఆ భగవంతుడికే ఎరుక. అయితే ఇదంతా జరిగాక ఇద్దరూ సతోషించారు. యిద్దరికీ గౌరవం పెరిగింది. నాకు అపరిమితంగా ఆనందం కలిగింది. వకీలు పని ఏమిటో, దాని సత్యస్వరూపం ఏమిటో అప్పుడు నాకు బోధపడింది. మనిషిలోని గుణాల్ని, వారి సత్పక్షాన్ని తెలుసుకోగలగటం ఎలాగో తెలుసుకోగలిగాను. విడిపోయిన వాది ప్రతివాదుల్ని కలవడమే వకీలు యొక్క పరమ ధర్మమని గ్రహించాను. ఈ సత్యం నాలో బాగా నాటుకు పోయింది. అందువల్ల తరువాత 20 ఏండ్ల బాటు నేను సాగించిన ప్లీడరు వృత్తిలో వందలాది కేసుల్ని కోర్టుకు ఎక్క కుండానే పరిష్కరించగలిగాను. అందువల్ల నాకు నష్టమేమీ కలగలేదు. రాబడిని కోల్పోలేదు. ఆత్మతృప్తి కలిగింది. అంతకంటే యింకేమి కావాలి?
15. నేను పడ్డ మధన
క్రైస్తవ మిత్రుల వల్ల నాకు కలిగిన అనుభవాల్ని వివరిస్తాను.
బేకరు గారికి నా భవిష్యత్తును గురించి ఆతురత ఎక్కువైంది. ఆయన నన్ను వెల్లింగ్టన్ పట్టణంలో జరిగిన సభకు తీసుకువెళ్లారు. ప్రొటెస్టెంట్ తెగవారు ధర్మ ప్రభోదానికి, ఆత్మ పరిశుద్ధికి, కొన్ని సంవత్సరాలకు ఒక్కో పర్యాయం అట్టి సమ్మేళనాలు జరుపుతూ వుంటారు. ఇవి ధర్మపునరుద్ధరణకు, ధర్మ పునః ప్రతిష్టకు నిర్దేశింపబడిన సమ్మేళనాలు. దానికి అధ్యక్షుడు రివరెండు ఆండ్రూమురే. ఆయన ఆ పట్టణంలో ప్రధాన మతాచార్యుడు. ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. ఆ సమ్మేళనంలో జరిగే మతప్రబోధం, అచ్చటికి వచ్చేవారి మహోత్సాహం, దాని పవిత్రత మొదలగు వాటిని చూచి నేను ఏసుమతంలో తప్పక కలిసిపోతానని బేకరుగారు భావించారు.
బేకరుగారికి ప్రార్ధనా బలమే మహాబలం. ప్రార్ధనపై ఆయనకు అమిత విశ్వాసం, హృదయ పూర్తిగా చేయబడే ప్రార్ధనను భగవంతుడు తప్పక వింటాడని ఆయన విశ్వాసం. ఐహిక సంబంధమైన కోరికలు కూడా ప్రార్ధన వల్ల నెరవేరుతాయని నమ్మే బ్రిస్టల్ నివాసి జార్జి ముల్లర్ వంటి వారిని ఆయన ప్రమాణంగా పేర్కొంటారు. ప్రార్ధనా మహిమను గురించి ఆయన చెబుతూ వుంటే నేను తటస్థభావంతో వినేవాణ్ణి. అంతరాత్మ గనుక ప్రబోధిస్తే నేను తప్పక ఏసు మతంలో చేరతాననీ, అట్టి స్థితిలో ప్రపంచమందలి ఏ శక్తీ నన్ను ఆపలేదని బేకరు గారికి చెప్పాను. యీ విధమైన వాగ్దానం చేయుటకు నేను సందేహించలేదు. అప్పటికే నేను అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకోవడం ప్రారంభించాను. అంతరాత్మ చెప్పిన రీతిగా నడుచుకోవడమంటే నాకు ఆనందంగా వుండేది. వాస్తవానికి విరుద్ధాచరణ కష్టదాయకం. దుఃఖప్రదం కూడా.
మేము వెల్లింగ్టన్ పట్టణం వెళ్లాము. నా వంటి నల్లవాడిని వెంటబెట్టుకు వెళ్లడం వలన బేకరు గారికి చాలా కష్టాలు కలిగాయి. దారిలో ఆయనకు ఎన్నో ఇబ్బందులు కలిగాయి. మధ్యలో ఆదివారం వచ్చినందున మా ప్రయాణం ఆగిపోయింది. బేకరు గారు, వారి బృందంలోని వారు ఆదివారం నాడు ప్రయాణం చేయరు. మేము ఒక స్టేషనులో ఆగాము. అక్కడి హోటలు యజమాని వాద ప్రతివాదాలు జరిగిన తరువాత నాకు భోజనం పెట్టేందుకు అంగీకరించాడు. అయితే భోజనశాలలో అందరి సరసన కూర్చోనిచ్చేందుకు అతడు అంగీకరించలేదు. బేకరుగారు సామాన్యంగా మెత్తబడే రకంకాదు. హోటలుకు వచ్చే అతిధుల హక్కుల్ని గురించి ఆయనను నిలదీశాడు. బేకరు గారికి కలిగిన కష్టం నాకు బోధపడింది. వెల్లింగ్టన్ పట్టణంలో కూడా నేను బేకరుగారితోనే వున్నాను. నా వల్ల తను పడుతున్న కష్టాలు నాకు తెలియకుండా వుంచాలని ఆయన తపన. కాని నాకు అవన్నీ తెలుస్తూనే వున్నాయి.
ఈ సభలో పాల్గొన్న క్రైస్తవులందరూ చాలా శ్రద్ధాళువులు. వారి భక్తి నాకు ఎంతో ఆనందం కలిగించింది. నేను రివరెండు ముర్రే గారి దర్శనం చేసుకున్నాను. అక్కడ చాలామంది నా కోసం భగవంతుణ్ణి ప్రార్ధించడం చూచాను. వారి భజనలు కొన్ని మధురాతి మధురంగా ఉన్నాయి.
వెల్లింగ్టన్‌లో సభ మూడు రోజులపాటు జరిగింది. అచ్చటికి వచ్చిన వారి మత విశ్వాసం నేను బాగా గమనించాను. కాని అంతమాత్రాన నా మత విశ్వాసాన్ని నేనెందుకు పరిత్యజించాలి? ఏసు మతంలో కలియకపోతే స్వర్గం గాని, ముక్తిగాని కలుగవు అని అనడం, దాన్ని నమ్మడం సరికాదు. క్రైస్తవ మిత్రులకు నేనీ విషయం చెప్పేసరికి వారి ప్రాణాలు ఎగిరిపోయినంత పని అయింది. కాని అందుకు నేనేం చేయగలను?
నా కష్టాలు యింకా పెరిగాయి. జీససు దేవుని ఏకైక పుత్రుడని అనడం, వారిని నమ్మిన వారికే అమృతత్వం కలుగుతుందని అనడం నా విశ్వాసానికి మించిన మాటలు. నిజానికి దేవునికి పుత్రులే గనుక వుంటే మనమంతా ఆయనకు పుత్రులమే గదా! జీససు భగవత్సముడు గాని లేక సాక్షాత్తు భగవంతుడే అయితే మనమంతా భగవత్సములమే లేక భగవంతులమే కదా! జీససు తన మృతిచేత, మరియు తన రక్తము చేత జగత్తు నందలి పాపాల్ని కడిగివేశాడను వాక్యాల అర్ధం నాకు బోధపడలేదు. వ్యంగ్యార్ధం కొంత సత్యం కావచ్చును. క్రైస్తవ మత ప్రకారం మనుష్యునికే ఆత్మ వుంటుంది. జంతువులు మొదలుగా గల వాటికి ఆత్మ వుండదు. వాటికి చావుతో సరి. యీ విషయం నాకు నచ్చలేదు.
జీససు త్యాగి, మహాత్ముడు, మహాగురువు అంగీకరిస్తాను. కాని అతడొక అద్వితీయ పురుషుడు కాడు. సిలువపై ఆయన ప్రపంచానికి ఒక మహా దృష్టాంతం. కాని ఆయన మృతి యందు ఏదో రహస్యం లేక చమత్కారం లేక ప్రభావం వున్నదని చెబితే నా హృదయం అంగీకరించదు. ఇతరులీయజాలని ఏ మహాప్రసాదము క్రైస్తవుల పవిత్ర జీవితాలు నాకు ప్రసాదించలేదు. ఇతర ధర్మాలలో కూడా నాకు క్రైస్తవ సంస్కారాలు కనబడ్డాయి. సిద్ధాంత దృష్టితో పరిశీలిస్తే ఏసు సిద్ధాంతాలలో అలౌకికత నాకు కనబడలేదు. త్యాగంలో హిందువులు క్రైస్తవులను ఎన్నో రెట్లు మించిపోతారని నాకు విశ్వాసం కలిగింది. క్రైస్తవ మతమే సంపూర్ణమని ఇతర మతాల కంటే శ్రేష్టమైనదని నాకు నమ్మకం కలుగలేదు.
సమయం దొరికినప్పుడల్లా క్రైస్తవ మిత్రులకు నా హృదయంలో సాగిన యీ మధనను గురించి వివరించాను. వారిచ్చిన సమాధానాలు నాకు సంతోషం కలిగించలేదు.
ఈ విధంగా క్రైస్తవ మతం శ్రేష్టమైనదని కూడా నాకు నమ్మకం కలగలేదు. హిందూమత మందలి దోషాలు నా కండ్లకు కనబడసాగాయి. అస్పృశ్యత హిందూమతంలో ఒక భాగమైతే, అది జీర్ణమై పోయిన భాగం లేక అత్యాధునిక దురాచారం. ఇన్ని వర్ణాలు, ఇన్ని శాఖలు ఎందుకో నాకు బోధపడలేదు. వేదాలు అపౌరుషేయాలు అయితే బైబిలు, ఖురానులు అపౌరుషేయాలుకావా?
క్రైస్తవ మిత్రులు నన్ను ఏసు మతంలో కలపాలని ఎలా ప్రయత్నించారో, అలాగే మహమ్మదీయులు తమ మతంలో కలుపుకునేందుకు ప్రయత్నించారు. అబ్దుల్లా సేఠ్ మాటిమాటికీ ఇస్లాం మత గ్రంధాలు చదవమని మరీమరీ చెబుతూ వుండేవాడు. ఆయన ఎప్పుడూ ఇస్లాం మత ప్రాశస్త్యాన్ని గురించి చెబుతూ వుండేవాడు.
ఈ విషయాలన్నీ కవిరాయచంద్ భాయీకి జాబు ద్వారా తెలియజేశాను. భారత దేశమందున్న యితర విద్వాంసులకు కూడా జాబులు వ్రాశాను. సమాధానాలు కూడా చాలా వచ్చాయి. రాయచంద్‌భాయి వ్రాసిన జాబు నాకు కొంత సంతృప్తిని కలిగించింది, “ఇంకా లోతుగా హిందూమతాన్ని తెలుసుకో” అని రాయచంద్ వ్రాశారు. “పక్షపాతం మాని పరిశీలిస్తే హిందూమత సిద్ధాంతాల యందున్న సూక్ష్మత, గాంభీర్యం, ఆత్మ వివేకం, దయ, ధర్మ నిర్ణయం వంటి విశేషాలు ఇతర మతాల్లో కనబడవు” అని కూడా ఆయన వ్రాశారు.
సెల్‌గారి ‘ఖురాను’ అనువాదం చదివాను. మరికొన్ని ఇస్లాం మత గ్రంథాలు కూడా సంపాదించాను. ఇంగ్లాండు నందలి క్రైస్తవ మిత్రులకు ఉత్తరాలు వ్రాయసాగాను. ఆ మిత్రులలో ఒకరు నాకు ఎడ్వర్డు మెయిట్లండుగారిని పరిచయం చేశారు. వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. అన్నా కింగ్స్‌ఫోర్డు గారును, తానును కలిసి వ్రాసిన “ది పరఫెక్ట్ వే” అను గ్రంధం ఆయన నాకు పంపించారు. ఇప్పుడు ప్రచారంలో వున్న క్రైస్తవ మత ఖండన ఆ గ్రంధంలో వుంది. మెయిట్లండు గారు ‘ది న్యూ ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ బైబిల్’ అను గ్రంధం హిందూమత విధానంలో వుంది. టాల్‌స్టాయి గారి “ది కింగ్‌డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు” అను గ్రంథం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఆ గ్రంథం నా మనస్సులో అంకితమై పోయింది. అందలి స్వతంత్ర్య యోచనా విధానం, ప్రౌఢ విధానం, శుద్ధ సత్యం వీటిని బట్టి పరిశీలించి చూస్తే యీ గ్రంధం ఎదుట కోట్సుగారిచ్చిన గ్రంధాలన్నీ దండుగేనని అనిపించింది.
ఆ గ్రంధ పఠనం వల్ల నేను క్రైస్తవ మిత్రులెన్నడును ఊహించని దారిలో పడ్డాను. మెయిట్లండుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు చాలాకాలం నడిచాయి. శాశ్వతంగా కన్ను మూయనంతవరకు రాయచంద్‌భాయి గారికి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. వారు పంపిన గ్రంధాలు చదివాను. వాటిలో పంచీకరణం, మణిరత్నమాల, యోగవాసిష్ఠమునందలి “ముముక్షు ప్రకరణం” హరిభద్రసూరి విరచిత “షడ్దర్శన సముచ్ఛయం” మొదలగు గ్రంధాలు పేర్కొనదగినవి.
నేను నా క్రైస్తవ మిత్రులు ఉహించని దారిని పడినప్పటికీ వారి సాంగత్యం వల్ల నాకు కలిగిన ధర్మ జిజ్ఞాస అధికం. అందుకు నేను వారికి రుణపడ్డానని చెప్పగలను. వారి పరిచయం నాకు సదా గుర్తుంటుంది. మధురం, పవిత్రం అయిన యిట్టి స్నేహ బంధాలు క్రమంగా పెరుగుతూ వున్నాయే కాని తరగలేదు.
16. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు ?
అబ్దుల్లా సేఠ్‌గారి కేసు పరిష్కారం అయింది. ఇక నాకు ప్రిటోరియాతో ఏం పని? దర్బనుకు వెళ్లి ఇంటికి ప్రయాణం అవుదామనే ప్రయత్నం ప్రారంభించాను. కాని అబ్దుల్లా సేఠ్ వీడ్కోలు విందు చేయకుండా నన్ను విడిచి పెడతాడా? నన్ను గౌరవించేందుకూ ఆయన సిడెన్ హోములో ఒక విందు ఏర్పాడు చేశాడు.
ఆ రోజంతా విందుతో కాలక్షేపం చేయాలని నిర్ణయం. నా దగ్గర కొన్ని వార్తా పత్రికలు వున్నాయి. వాటిని తిరగవేస్తూ కూర్చున్నాను. ఒక పత్రికలో ఒక మూల “ఇండియన్ ఫ్రాంచైజ్” అను శీర్షికతో కొన్ని వాక్యాలు నా కంటబడ్డాయి. నేటాల్ శాసన సభలో సభ్యుల్ని ఎన్నుకొనుటకు భారతీయులకు హక్కు లేకుండా చేసేందుకు ఒక బిల్లును గురించి చర్చలు సాగుతున్నాయి. ఈ కొద్ది వాక్యాలు ఆ చర్చకు సంబంధించినవే. నాకు ఆ చట్టాన్ని గురించి ఏమీ తెలియదు. విందుకు వచ్చిన అతిథులెవ్వరికీ తెలియదు. దాన్ని గురించి అబ్దుల్లా సేఠ్‌తో ప్రస్తావించాను. “ఈ వ్యవహారాలు మాకేం తెలుస్తాయి? వ్యాపారానికి సంబంధించినవైతే మాకు తెలుస్తాయి. అరెంజి ఫ్రీస్టేటులో మా వ్యాపారమంతా నీట కలసిన విషయం నీకు తెలుసు. ఆ విషయమై మేము కొంత కలకలం రేపాము. కాని ఏం లాభం? చదువురాదు గనుక మేము అసమర్ధులం. బజారు ధరలు తెలుసుకోవడానికి మాత్రం మేము పత్రికలు చదువుతాము. చట్టాల గొడవ మాకేం తెలుస్తుంది? ఆ తెల్ల వకీళ్లే మాకు కండ్లు, చెవులూను” అని అబ్దుల్లా సేఠ్ అన్నాడు. భారతీయ క్రైస్తవులను గురించి వివరంగా అబ్దుల్లా సేఠ్ చెబుతూ “వారా? వారికి మేమంటే అలుసు. వారంటే నిజానికి మాకూ అలుసే. క్రైస్తవులు కనుక వారు తెల్లవారికి బానిసలు. ఆ తెల్లఫాదరీలు ప్రభుత్వానికి బానిసలు” అని అన్నాడు. వారి మాటలు నా కండ్లు తెరిచాయి. ఈ శాఖ మనకు సంబంధించింది. వారూ మనమూ ఒకటే అని తెలియజేయడం అవసరం అని అనిపించింది. ఏసు మతానికి యిదా అర్థం? వారి మతం మార్చుకున్నంత మాత్రాన భారతీయులు కాక విదేశీయులైపోతారా?
అయితే నేను మన దేశానికి రాబోతూ వున్నాను. అందువల్ల నా ఈ అభిప్రాయం వారికి చెప్పలేదు. అబ్దుల్లా సేఠ్‌గారితో “ఈ బిల్లు శాసనం అయితే మనవాళ్ల కష్టాలకు అంతే వుండదు. ఇది భారతీయులకు ప్రధమ ఉచ్చాటన మంత్రం. మన ఆత్మగౌరవానికి వేరు పురుగు” అని చెప్పాను. “కావచ్చును. కాని ఫ్రాంచైజుకు మూలం ఏమిటో చెబుతాను. మాకు మొదటిదాన్ని గురించి ఏమీ తెలియదు. ఎస్కాంబీగారిని మీరు ఎరుగుదురు కదా! అతడు మనకు పెద్ద వకీలు. ధీరుడు. అతడే మొదట ఈ విషయం మా బుర్రల కెక్కించాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎంస్కాంబీ పెద్ద యోధుడుకూడా. అయనకు మరియు వారుద్ ఇంజనీరుకు మధ్య పడేది కాదు. అందువల్ల ఆ ఇంజనీయరు తన వోట్లన్ని పుచ్చుకొని ఎన్నికల్లో ఎక్కడ ఓడిస్తాడో అని ఎస్కాంబీ దిగులు పడ్డాడు. అప్పుడాయన ఆ విషయం మాకు చెప్పాడు. ఆయన ప్రోత్సాహంతో మేమంతా మా పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చాము. ఎన్నికల్లో ఎస్కాంబీ గారికి మా ఓట్లు యిచ్చాం. అంతేగాని మా ఓట్లకు మేమే విలువ ఇవ్వడం లేదు. యిది స్పష్టం. అయితే మీ మాటలు మాకు అర్ధం అవుతాయి. మీ సలహా ఏమిటో చెప్పండి” అని అబ్దుల్లా సేఠ్ అన్నాడు. ఇతర అతిధులంతా మా మాటలు శ్రద్ధగా విన్నారు. వారిలో ఒకరు అందుకొని “ఏమండీ మీరు ఈ స్టీమరుకు బయలుదేరకండి. ఒకటి రెండుమాసాలు యిక్కడే వుండిపోండి. మీరు ఎలా చెబితే అలా చేస్తాం” అని అన్నాడు. “నిజం నిజం! అబ్దుల్లా సేఠ్! మీరు గాంధీ భాయిని ఆపివేయండి” అని మిగతా వారంతా గట్టిగా అన్నారు.
అబ్దుల్లా సేఠ్ మంచి ఇనుభవజ్ఞుడు. “ఇక గాంధీని ఆపగల అధికారం నాకు లేదు. ఇప్పుడు నాకెంత అధికారం వుందో మీకూ అంతే అధికారం వుంది. మీరు చెబుతున్నదంతా సత్యం. మనమంతా కలసి వారిని ఆపుదాం. కాని ఆయన బారిస్టరు. వీరి ఫీజు మాటేమిటి?” అని అన్నాడు. ఫీజు మాట ఎత్తేసరికి నాకు మనస్సు చివుక్కుమంది. నేను వెంటనే “సేఠ్‌గారూ! దీనికీ ఫీజుకూ సంబంధం లేదు. ప్రజాసేవకు ఫీజా? అసలు నేను వుంటే ప్రజా సేవకుడిగానే వుంటాను. వీరందరితో నాకు యిదివరకు పరిచయం లేదు. వీరంతా నాకు సాయం చేస్తారనే నమ్ముకం మీకు వుంటే నేను ఒక్క మాసం యిక్కడ వుంటాను. కాని ఒక్కమాట. మీరు నాకేమి యివ్వనవసరం లేదు. అయితే మనం చేయదలచుకున్న పనికి కొంత మూలధనం అవసరం. టెలిగ్రాములు పంపాల్సి వస్తుంది. అక్కడికి ఇక్కడికీ తిరగవలసిపస్తుంది. ఆయా వకీళ్ళతో సంప్రదింపులు జరపవలసి వస్తుంది. నాకు మీ “లా” రాదు కనుక కొన్ని ‘లా’ గ్రంధాలు నాకు కావాలి. అందుకు ధనం అవసరమవుతుంది. యీ పనికి ఒక్క మనిషి సరిపోడు, పలువురి సాయం కావాలి” అని అన్నాను. నా మాటలు వారందరినీ ప్రభావితం చేశాయి. “అల్లా దయవల్ల ధనం దానంతట అదే సమకూరుతుంది. జనం కావలసినంత మందిమి వున్నాం. మీరు మాత్రం “వుండిపోతాను, అని అనండి. చాలు” అని ఒక్కసారిగా అంతా అన్నారు. నాకు వీడ్కోలు యివ్వడానికి వచ్చిన అతిధి బృందం కార్యనిర్వాహక బృందం అయింది. తొందరగా విందు ముగించి ఇళ్ళకు వెళదామని అన్నాను. నేను నా మనస్సులో యిక ముందు చేయవలసిన సమరానికి రేఖలు గీచుకున్నాను. వోటరు జాబితాలలో చేరియున్నవారి పేర్లను తెలుసుకున్నాను. మరో నెలరోజులపాటు అక్కడ వుండటానికి నిశ్చయించు కున్నాను.
ఈ విధంగా భగవంతుడు దక్షిణ ఆఫ్రికాలో నా జీవితానికి పునాది వేసి ఆత్మ సన్మాన సంగ్రామానికి నాంది పలికాడు.
17. అక్కడే ఉన్నాను
1893వ సంవత్సరంలో హాజీ మహమ్మద్ సేఠ్ నేటాల్ రాష్ట్రంలో నివసించే భారతీయులలో ప్రముఖుడుగా భావించబడి వారికి నాయకుడుగా ఎన్నుకోబడ్డాడు. సంపదలో హాజీ మహమ్మద్ సేఠ్‌గారికే అంతా ప్రథమ స్థానం యిస్తూ ఉండేవారు. అందువల్ల వారి ఆధిపత్యాన ఒక సభ అబ్దుల్లా సేఠ్‌గారి ఇంట్లో ఏర్పాటుచేశారు. ఆ సభలో ఫ్రాంచైజు బిల్లును ప్రతిఘటించాలని తీర్మానం చేయబడింది .
స్వచ్ఛంద సేవకుల దళం ఏర్పాటు చేయబడింది. నేటాలులో పుట్టి పెరిగిన భారతీయులు, భారతీయులగు క్రైస్తవులలో పిన్నవారినందరినీ యీ సభకు ఆహ్వానించారు. దర్బను కోర్టులో దుబాసీగా వున్న పాల్‌గారు, మిషన్ హైస్కూలు హెడ్‌మాష్టరు సుభాన్ గాడ్‌ఫ్రేగారు కూడా వచ్చి ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభకు భారతీయ క్రైస్తవులు ఎక్కువగా వచ్చి పాల్గొనుటకు వీరే కారకులు అయ్యారు. వారంతా స్వచ్ఛంద సేవకుల దళంలో చేరారు.
ఆ చుట్టుప్రక్కల గల వర్తకులలో చాలామంది స్వచ్ఛంద సేవకుల బృందంలో చేరారు. అట్టివారు చిరస్మరణీయులు. దావూద్ ముహమ్మద్, మహమ్మద్ కాసిం, కమర్‌ఉద్దీన్, ఆదంజీమియాఖాన్, ఏ.కొలందవేలు పెళ్ళై, సి.లచ్చీరాం, రంగస్వామి, పడియాచి, ఆమోదజీవ మొదలుగువారు వారిలో ముఖ్యులు. పార్సీ రుస్తుంజీ వుండనే వున్నారు. జోషీ, సరసీరాం మరియు దాదా అబ్దుల్లా కంపెనీ మొదలగు కంపెనీల గుమాస్తాలు స్వయం సేవకులుగా చేరారు. అందరికీ ఉపయోగపడే యిట్టి కార్యక్రమం వారికి క్రొత్త అందువల్ల అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ విధంగా సభకు ఆహ్వానింపబడటం, సభలో అంతా వచ్చి పాల్గొనడం, వారికి నూతనానుభవం. ఈ మహావిపత్తులో పెద్దలు, పిన్నలు, ధనికులు, పేదలు, సేవ్యులు, సేవకులు, హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, పారశీకులు, గుజరాతీలు, మద్రాసీలు, సింధీలు మొదలుగాగల భేదాలు, తరతమ భేదాలు అన్నీ తొలగిపోయాయి. అందరూ భారత దేశ బిడ్డలే. అందరూ సేవకులే. బిల్లు రెండవసారి ప్యాసు అయిందోలేదో మరి కాబోతున్నదో కూడా భారతీయులు తెలుసుకోవడం లేదనీ, యిందువల్ల భారతీయులు వోటుహక్కు అక్కర్లేదని తామే ప్రకటించుకుంటున్నారనీ నేటాలు అధికారులు ప్రసంగాలు చేయడం ప్రారంభించారు.
నేను సభలో యీ విషయం చెప్పాను. వెంటనే బిల్లు చర్చ ఆపవలసిందని అసెంబ్లీ ప్రెసిడెంటుకు తంతి పంపించాము. ప్రధానమంత్రి సర్ జాన్ రాబిన్సన్ గారికి కూడా ఇట్టి తంతినే మరొకదాన్ని పంపాము. మరో తంతి అబ్దుల్లా సేఠ్‌గారి మిత్రుడు ఎస్కాంబీగారికి పంపాము. అసెంబ్లీ ప్రెసిడెంటు మా తంతికి జవాబు పంపుతూ బిల్లుపై చర్చ రెండురోజులు ఆపబడిందని తెలియజేశాడు. అది చూచి మాకందరికీ ఆనందం కలిగింది.
శాసనసభకు పంపవలసిన పిటీషను వెంటనే తయారుచేశాము. దానికి మూడు నకళ్లు అవసరమైనాయి. పత్రికలకు పంపడానికి మరో ప్రతి కావలసి వచ్చింది. ఈ ప్రతులన్నిటిపైన వీలైనన్ని సంతకాలు చేయించాలని నిర్ణయించాం. ఇదంతా ఒక్క రాత్రిలో జరగాలి. ఇంగ్లీషు తెలిసిన స్వయం సేవకులు రాత్రంతా కూర్చొని నకళ్ళు వ్రాయసాగారు. నకళ్ళు వ్రాయడంలో మంచి నేర్పరియగు ఆర్ధర్ అను వృద్దుడు మొదటి పిటీషన్ ప్రతి సిద్ధం చేశాడు. దాన్ని ఒకరు చదువుతూ వుంటే ఒకేసారి అయిదుగురు అయిదు ప్రతులు వ్రాశారు. ఇలా అయిదు ప్రతులు తయారయ్యాయి. ఈ అర్జీ మీద అందరి సంతకాలు చేయించేందుకై చాలామంది తమ స్వంత బండ్లలోను, కిరాయిబండ్లలోను బయలుదేరి వెళ్లారు. త్వరగా యీ పని పూర్తి అయింది. వెంటనే అర్జీలు బట్వాడా చేయబడ్డాయి. పత్రికలలో సాభిప్రాయాలతో సహా అర్జీ ప్రకటించబడింది. శాసన సభలో చర్చ జరిగింది. శాసనాన్ని సమర్ధిస్తున్న వాళ్లు అర్జీ యందలి విషయాలకు సమాధానాలు యిచ్చారు. అవి కుంటి సమాధానాలు. ఏమి చెబితే ఏం? చివరికి బిల్లు ప్యాసయింది
ఇట్లా జరుగుతుందని మేము ముందే అనుకున్నాం. కాని యీ ఆందోళన నల్ల భారతీయుల్లో ఒక నూతన జీవం ఆవిర్భవించింది. మనమంతా ఒక్కటే. వ్యాపార విషయాలలో కొద్దిహక్కులు సాధించి రాజకీయంగా కూడా కొన్ని హక్కులు సాధించాలనే తహతహ భారతీయుల్లో బయలుదేరింది.
ఆ కాలంలో రిప్పన్‌గారు కాలనీల సెక్రటరీ. ఒక పెద్ద అర్జీ ఆయనకు పంపవలెనని నిర్ణయం గైకొనబడింది. అది అంత తేలికైన పనికాదు. ఒక్క రోజులో జరిగే పని కూడా కాదు. స్వచ్ఛంద సేవకులు మా దళంలో చేర్చుకోబడ్డారు. అందరూ తమకు చేతనైనంత సహాయం చేశారు.
అర్జీని తయారు చేయుటకు నేను చాలా శ్రమ పడవలసి వచ్చింది. అందుకు సంబంధించిన కాగితాలు, పుస్తకాలు పూర్తిగా చదివాను. హిందూ దేశంలో మాకు ఒక విధమైన ఓటు హక్కు వుంది కనుక నేటాలులో కూడా వోటు హక్కు ఉండితీరాలని నా వాదం. ఈ ఓటు హక్కును ఉపయోగించగల భారతీయుల జనాభా తక్కువేగనుక దాని నివ్వడం తేలికయే అని కూడా నా వాదం. ఈ విషయాన్ని మధ్య బిందువు చేశాను. పదిహేను రోజుల్లో పదివేల సంతకాలు చేయించాము. ఈ విధంగా జనం చేత సంతకాలు చేయించడం స్వయం సేవకులకు క్రొత్త. వాళ్లు రాష్ట్ర మంతట తిరిగి యింతమంది చేత సంతకాలు చేయించడం చిన్న విషయం కాదు “అర్జీలో గల విషయం తెలుసుకోకుండా సంతకం చేయకూడదు” అను నిబంధన మేము పెట్టినందున అర్జీలో గల విషయాన్ని విడమర్చి చెప్పగల స్వయం సేవకులనే యీ కార్యానికి ఎన్నిక చేసి పంపవలసి వచ్చింది. అక్కడ గ్రామాలు దూర దూరాన వున్నాయి. వెళ్లి సంతకాలు చేయించాలంటే ఎంతో శ్రమపడాలి. అట్టి శ్రమకు పూనుకునే స్వయం సేవకులు లభించారు. వారంతా తమకు అప్పగించిన కార్యాన్ని ఉత్సాహంతో పూర్తిచేశారు. ఈ పంక్తులు వ్రాస్తున్నప్పుడు నా కండ్ల ఎదుట దావూద్ మహమ్మద్, సేఠ్ రుస్తుంజీ, అదంజీమియాఖాన్, ఆమోదజీవ మొదలగువారు కనబడుతున్నారు. అందరి కన్న ఎక్కువ సంతకాలు చేయించుకొని వచ్చిన దావూద్ సేఠ్ రోజంతా సంతకాల కోసం బండిలోనే ప్రయాణం చేశారు. ఇది అమూల్యమైన సేవ. దీనికోసం ఒక్కరు కూడా దమ్మిడీ పుచ్చుకోలేదు. అంతా తమ ఖర్చులు తామే భరించారు. దాదా అబ్దుల్లా గారి గృహం కార్యస్థానమే గాక ధర్మసత్రం కూడా అయింది. నాకు సహకరించిన మిత్రులందరి భోజనం వారి యింట్లోనే, మొత్తం మీద అందరూ ఎన్నో వ్యయప్రయాసలకు వోర్చి కార్యాన్ని సాధించారు.
చివరికి అర్జీ దాఖలు చేశాం. వెయ్యి ప్రతులు ముద్రించి పంచి పెట్టాం. భారతదేశ ప్రజలకు యీ దరఖాస్తు వల్ల నేటాలుతో ప్రధమ పరిచయ కలిగింది. నాకు తెలిసిన పత్రికలకు, ప్రసిద్ధులకు పత్రికా విలేఖరులకు కూడా ఆ అర్జీ ప్రతులు పంపించాను.
టైమ్సు ఆఫ్ ఇండియా పత్రిక భారతీయుల కోరికలను సమర్ధిస్తూ సంపాదకీయ వ్యాసం వ్రాసింది. ఇంగ్లాండులో అన్ని తెగల పత్రికలకు నకళ్లు పంపాం. లండన్ టైమ్సు పత్రిక కూడా మా వాదాన్ని సమర్థిస్తూ వ్రాసింది. ఇక బిల్లు మంజూరు కాదని మాకు ఆశ కలిగింది.
నేను నేటాలు నుండి కదలడానికి వీలు లేకపోయింది. భారతీయ మిత్రులంతా మీరు యిక్కడే వుండమని ప్రార్ధించారు. నాకు గల కష్టాలు వారికి వివరించి చెప్పాను. ఇతరుల ఖర్చుల మీద ఆధారపడి వుండకూడదని నిర్ణయానికి వచ్చాను. ప్రత్యేకంగా వుండడానికి ఇల్లు అవసరమని భావించాను. మంచి చోట ఒక ఇల్లు తీసుకోవాలని, బారిస్టరు హోదాకు తగినట్లుగా ఇల్లు వుండాలనీ, అప్పుడే నా సంఘానికి గౌరవం తేగలుగుతాననీ నిర్ణయానికి వచ్చాను. అయితే అట్టి గృహానికి సాలీనా మూడు వందల పౌండ్లు ఖర్చువుతుందని తేలింది. అంత రాబడికి అవసరమయ్యే కేసులిచ్చేందుకు హామీ పడితేనే అక్కడ వుంటానని వాళ్లకు తెలియజేశాను. “ప్రజాహిత కార్యాలకు మీరు చెప్పినంత పైకం యిస్తాం. అంత సొమ్ము మేము తేలికగా వసూలు చేయగలం. మీ ప్రాక్టీసుకు, దీనికి సంబంధం పెట్టవద్దు.” అని వాళ్లు అన్నారు. “అట్లా వీల్లేదు. నేను ప్రజాహిత కార్యాలు నిర్వహిస్తూ అందు నిమిత్తం మీ దగ్గర డబ్బు తీసుకోను. ఇందుకు బారిస్టరు తెలివితేటలు పనిచేయనవసరం లేదు. మీ చేత పనిచేయించుతూ, నాకోసం మీదగ్గర డబ్బు తీసుకోవడమా? సార్వజనిక కార్యాలకు జనం దగ్గర చందాలు పుచ్చుకోవలసి వస్తుంది. అట్టి ధర్మ నిధి నుండి నేను జీతం పుచ్చుకుంటూ, మిమ్మల్ని చందాలు ఎలా కోరగలను? అలా చేస్తే చివరికి బండి ఆగిపోతుంది. ధర్మకార్యాలకు సాలుకు మూడు వందల పౌండ్ల కంటే ఎక్కువ కావలసి వస్తుంది” అని చెప్పాను.
“కొంతకాలం నుండి మిమ్మల్ని చూస్తున్నాం. మీ సంగతి మాకు తెలిసింది. కావలసిన దానికంటే ఒక్క కానీ కూడా మీరు ఎక్కువ పుచ్చుకోరు. మేము మిమ్మల్ని యిక్కడ ఆపినప్పుడు మీకు అవసరమయ్యే ధనం యివ్వవద్దా?”
“ప్రేమతోను, ఉత్సాహంతోను మీరు యిలా అంటున్నారు. ఈ ప్రేమ, యీ ఉత్సాహం స్థిరంగా వుంటాయని భావించగలమా? మిత్రుని వలె, సేవకుని వలె కొన్ని సమయాల్లో నేను కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. అప్పుడు మీ ఆదరణకు ఎంతగా పాత్రుడనవగలనో ఆ భగవంతునికే ఎరుక. ధర్మకార్యాలకు మీ దగ్గర భృతి తీసుకోవడం కల్ల. అందువల్ల మీ కోర్టు వ్యవహారాలు నాకు అప్పగించండి చాలు. దీనివల్ల మీకు యిబ్బంది కలుగునని నాకు తెలుసు. నేను తెల్ల బారిస్టరును కాను! కోర్టు నన్నెంత వరకు ఆదరిస్తుందో కూడా తెలియదు. పైగా లాయరుగా నేను ఎంత వరకు పనికివస్తానో కూడా తెలియదు. నాకు రిటైనర్లు (ఇంకొకరి కేసు పుచ్చుకోకుండా తమకేసుకోసం పని చేయించుకొనుటకు బారిస్టరు మొదలగు వారికి ముందుగా యిచ్చే ఫీజు) ఇచ్చినందున మీకు ఇబ్బందులు కలగవచ్చు. అయినా ఆ కొద్ది సొమ్ము కూడ ప్రజా సేవకు ప్రతిఫలమే అవుతుంది.” అని అన్నాను.
ఈ చర్చానంతరం 20 మంది వర్తకులు ఒక సంవత్సరం వరకు నాకు రిటైనర్లు యిచ్చేందుకు సిద్ధపడ్డారు. నేటాలు విడిచి వెళ్లేటప్పుడు దాదా అబ్దుల్లా సేఠ్ నాకు కానుకగా కొంత సొమ్ము యివ్వదలిచాడు. ఆ సొమ్ముతో నాకు కావలసిన కుర్చీలు, బెంచీలు మొదలగునవి కొనిపెట్టాడు. ఈ విధంగా నేను నేటాలులో వుండిపోయాను.
18. వర్ణద్వేషం
కోర్టు ఒక త్రాసు వంటిది. ఈ త్రాసును సమానంగా ఒక వృద్ధ వనిత పట్టుకుంటుంది. ఆమెకు పక్షపాతం ఉండదు. ఆమె గ్రుడ్డిది కూడా. ఆమెది కుశాగ్రబుద్ధి. బ్రహ్మ ఆమెను గ్రుడ్డిదాన్నిగా చేసినందువల్ల ముఖం చూచి ఆమె ఎవ్వరికీ బొట్టు పెట్టదు. యోగ్యతను బట్టి మాత్రమే బొట్టు పెడుతుంది. కాని నేటాలు నందలి వకీళ్ల సభ అందుకు విరుద్ధంగా ముఖం చూచి బొట్టు పెట్టమని సుప్రీంకోర్టును ఉసి కొల్పింది. కాని కోర్టు మాత్రం ఈ సందర్భంలో తన త్రాసుకు సరిపోవు పనే చేసింది.
సుప్రీం కోర్టులో అడ్వకేటుగా చేరేందుకై అర్జీ పంపాను. బొంబాయి హైకోర్టు వారి అనుజ్ఞా పత్రం నా దగ్గర వున్నది. నేను బొంబాయి హైకోర్టులో ప్రవేశించినప్పుడు నా ఇంగ్లీషు సర్టిఫికెట్టు మూలప్రతి దాఖలు చేయవలసి వచ్చింది. నేటాలు సుప్రీంకోర్టులో ప్రవేశానికి యోగ్యతకు సంబంధించిన రెండు ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలి. తెల్లవారి ప్రమాణ పత్రాలకు ఎక్కువ విలువ వుంటుందని భావించాను. అబ్దుల్లా సేఠ్‌గారి ద్వారా పరిచితులు, ప్రసిద్ధులు అయిన ఇద్దరు తెల్లవారి దగ్గర ప్రమాణ పత్రాలు తీసుకొని అర్జీ దాఖలు చేశాను. ఒక వకీలు ద్వారా అర్జీ దాఖలు చేయడం కోర్టు విధి. సామాన్యంగా యీ అర్జీలను అటార్నీ జనరల్ ఫీజు పుచ్చుకోకుండానే దాఖలు చేసుకోవడం పరిపాటి. అబ్దుల్లా సేఠ్‌గారి కంపెనీకి సలహాలిచ్చే ఎస్కాంబిగారే అటార్నీ జనరల్. నేను వారి దర్శనం చేసుకున్నాను. ఆయన సంతోషంతో నా దరఖాస్తును మంజూరుచేశారు.
ఇంతలో హఠాత్తుగా వకీళ్ల సభవారు నాకు నోటీసు పంపారు. నా దరఖాస్తుతో బాటు ఇంగ్లీషు సర్టిఫికెట్ మూలప్రతి జత పరచకపోవడం లోపమని వ్రాశారు. అడ్వకేట్లను చేర్చుకొనుటకు నియమావళి తయారుచేసినప్పుడు నల్లవారిని చేర్చుకోవచ్చునా చేర్చుకోకూడదా అని వారు విచారించలేదు. ఇదే వారి వ్యతిరేకతకు ప్రధాన కారణం. నేటాలు దేశపు అభివృద్ధికి తెల్లవారే ముఖ్య కారణం. అందువల్ల వకీళ్లలో తెల్లవారి ఆధిక్యతను సంరక్షించడం తన కర్తవ్యమని వారు భావించారు. నల్లవాళ్లను చేర్చుకుంటే వారి సంఖ్య పెరిగిపోయి తెల్లవారి సంఖ్య తగ్గిపోతుందని, తెల్లవారి ఆధిక్యత తగ్గిపోతుందని వారి తపన.
నా అర్జీ మంజూరు కాకుండా చూచేందుకై వాళ్లు ఒక ప్రసిద్ధుడైన వకీలును నియమించారు. అతనికి అబ్దుల్లా సేఠ్‌గారి కంపెనీతో సంబంధం వుంది. అందువల్ల తనను ఒకసారి కలుసుకోమని ఆయన నాకు కబురు పంపాడు. నేను వెళ్లి ఆయనను కలిశాను. ఆయన నిష్కపటంగా నాతో మాట్లాడి నా వృత్తాంతం తెలుసుకున్నాడు. “మీకు వ్యతిరేకంగా నేనేమీ చేయను. మీరు కాలనీలో పుట్టిన రకమేమోనని భయపడ్డాను. మీ అర్జీతో బాటు ఇంగ్లీషు సర్టిఫికెట్టు లేకపోవడం వల్ల నా అనుమానం పెరిగింది. మరింకొకరి సర్టిఫికెట్టు చూపించేవాళ్లు కూడా వుంటారు. మీరు యిక్కడ తెల్ల దొరల దగ్గర ప్రమాణ పత్రాలు తీసుకున్నారు. అవి నాలుక గీచుకోడానికి కూడా పనికిరావు. మీ యోగ్యతను గురించి వారేం ఎరుగుదురు? వారెంత కాలం నుండి మిమ్మల్ని ఎరుగుదురో చెప్పండి” అని ఆయన అడిగాడు.
“ఇక్కడి వాళ్లంతా నాకు క్రొత్తవాళ్లే. ఇచ్చటికి రాక ముందు అబ్దుల్లా సేఠ్‌గారు కూడా నన్నెరుగరు” అని జవాబిచ్చాను.
“అబ్దుల్లా సేఠ్‌గారిది మీ ఊరే అని అన్నారుగదా! మీ తండ్రిగారు దివాను గారు గదా! సేఠ్ వారిని బాగా ఎరిగే వుంటారు. కనుక అబ్దుల్లా సేఠ్ గారి నుండి ఒక అఫిడవిటు తీసుకురండి. ఇక మిమ్మల్ని ఏమీ అడగవలసిన పని వుండదు.” అని ఆయన అన్నాడు. ఆ మాటలు వినగానే నాకు చాలా కోపం వచ్చింది. కాని కోపాన్ని అణుచుకున్నాను. నేను మొదటగానే అబ్దుల్లా సేఠ్ గారి దగ్గర ప్రమాణ పత్రం తీసుకొని దాఖలు చేసి యుంటే, యిది పనికి రాదు, తెల్లవారి ప్రమాణ పత్రం కావాలని అనేవారు. అయినా నన్ను అడ్వకేటుగా అంగీకరించేందుకు నా పుట్టుపూర్వోత్తరాలతో పనేమిటి? నా తల్లిదండ్రులు చెడువారు కావచ్చు లేక మంచివారు కావచ్చు. వారి మంచిచెడులతో నా అడ్వకేట్ వృత్తికి సంబంధం ఏమిటి? ఈ విధంగా లోలోన మధన పడి యోచనల్ని అదుపులో పెట్టుకొని యిలా అన్నాను. “నా వకీలు వృత్తి కోసం వకీళ్ల సభవారి యిట్టి భావాల్ని నేను అంగీకరించను. అయినా మీరు చెప్పిన ప్రకారం అఫిడవిట్ తప్పక దాఖలు చేస్తాను" అని అన్నాను.
అబ్దుల్లా సేఠ్ గారి దగ్గర అఫిడవిట్ తీసుకొని తెల్ల వకీలుకు అందజేశాను. ఆయన తాను సంతృప్తిపడ్డానని చెప్పాడు కాని వకీళ్ల సభ వాళ్లు తృప్తిపడలేదు. వారు నా దరఖాస్తును వ్యతిరేకించారు. కాని కోర్టు వారు అటార్నీ జనరల్ పని లేకుండానే వకీలు సభవారి ఆక్షేపణల్ని త్రోసిపుచ్చారు. ప్రధాన న్యాయాధీశుడు కల్పించుకొని “అర్జీదారు ఇంగ్లీషు సర్టిఫికెట్టు చూపలేదను ఆక్షేపణ యుక్తిపరమైంది కాదు. అతడు అబద్ధపు సర్టిఫికెట్టు పంపియుంటే అతనిపై నేరం మోపవచ్చు. ఆ నేరం నిజమని రుజువైతే అతని పేరు వకీలు పట్టిక నుంచి తొలగించవచ్చు. శాసనాలకు నలుపు తెలుపు అను భేదం లేదు. కావున గాంధీ గారిని చేర్చుకొనకుండా వుండుటకు కోర్టుకు హక్కు లేదు. అందువల్ల అతని దరఖాస్తును మేము మంజూరు చేస్తున్నాము. గాంధీ గారూ! మీరు ప్రమాణం చేసి అడ్వొకేటుగా చేరండి” అని అన్నాడు. నేను లేచి రిజిస్ట్రారు దగ్గరకు వెళ్లి ప్రమాణం చేశాను. నేను ప్రమాణం చేయగానే ప్రధాన న్యాయాధీశుడు నన్ను సంబోధించి “గాంధీగారూ! మీరు యిక తలపాగా తీసివేయాలి. ప్రాక్టీసు చేయు బారిస్టర్లు కోర్టు వారు నిర్ణయించే వేష నియమాలను పాటించాలి. కోర్టు నియమాలకు మీరు లోబడాలి.” అని అన్నాడు. నాకు నా మర్యాద తెలుసు. జిల్లా మేజిస్ట్రేటు కోర్టులో పాగా తీసేయమంటే నేను నిరాకరించాను. ఇప్పుడు సుప్రీం కోర్టువారి ఆదేశం ప్రకారం పాగా తీసివేశాను. నేను వారి ఆదేశాన్ని నిరాకరించవచ్చు. అట్లా చేయడం సమ్మతం కూడా. కాని నేను చేయాల్సిన పోరాటాలు చాలా వున్నాయి వాటికోసం నా శక్తిని అదుపులో వుంచుకోవాలని భావించాను. తలపాగా తొలగించ కూడదనే పట్టుదల బట్టితే ప్రయోజనం? ఇంతకంటే పెద్ద కార్యాలు నేను ఎన్నో చేయాల్సిన అవసరం వుందికదా!
నేనిట్లా లోబడినందుకు (ఇది లోబడటమా?) అబ్దుల్లా సేఠ్‌గారు, తదితర మిత్రులు ఆక్షేపించారు. కోర్టులో ప్రాక్టీసు చేసేటప్పుడు తలపాగా ధరించాలనే ధైర్యం వహించితే బాగా వుండేదని వారి భావం. వారికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. “దేశాన్ని బట్టి ఆచారాలు” మారాలని వారికి తెలియజేసేందుకు ప్రయత్నించాను. “హిందూ దేశంలో తెల్ల అధికారి తలపాగా తీసివేయమని ఆదేశిస్తే దానికి లోబటడం సిగ్గుచేటు. కాని నేటాలు కోర్టులో ఆ కోర్టు ఆచారాల్ని నియమాల్ని నిరాకరించకూడదు” అని చెప్పాను.
నేను చెప్పిన కారణాలు వారికి నచ్చలేదు. అయినా కొద్దిగా శాంతించారు. ఒక విషయాన్ని వివిధ సందర్భాలను బట్టి వివిధ రకాలుగా చూడవలసి వస్తుందన్న సంగతిని వారిచే ఒప్పించలేకపోయాను. నా జీవితమందంతట సత్యము యెడగల పట్టుదలయే రాజీ యొక్క సౌందర్యాన్ని నా చేత ఆస్వాదింప చేయగలిగింది. ఈ పద్ధతి సత్యాగ్రహము నందు అనివార్యమని నా తరువాతి జీవితంలో తెలుసుకోగలిగాను. ఆ పద్ధతి నా ప్రాణాలకు ముప్పుగా కూడా పరిణమించేది. అంతేగాక మిత్రుల అసంతోషానికి మూలమయ్యేది. దాన్ని కూడా సహించవలసి వచ్చేది. సత్యం వజ్రం పలె కఠోరం కుసుమం వలె కోమలం గదా! నేటాలు నందలి వకీళ్ల సభవారి ప్రతిఘటన వల్ల దక్షిణ ఆఫ్రికాలో మరో మారు నా పేరు మారు మ్రోగింది. చాలా పత్రికల వాళ్లు ఆక్షేపణల్ని ఖండించారు. వారి వ్యతిరేకతకు కారణం ఈర్ష్యయే అని ప్రకటించారు. ఈ ప్రసిద్ధి వల్ల నా కార్యక్రమాల్లో కొన్ని అంశాలు సరళమయ్యాయి.
19. నేటాలు ఇండియన్ కాంగ్రెస్
న్యాయవాద వృత్తి నిజంగా నాకు అప్రధానం. చివరివరకూ అప్రధానంగానే వుండిపోయింది. నేటాలు రాష్ట్రంలో నా నివాసం సార్ధకం కావాలంటే నేను ప్రజాసేవలో లీనం కావాలి. అర్జీలు పంపినంత మాత్రాన ఫ్రాంచైజు పని పూర్తికాదు. ఇల్లలుకగానే పండగ కాదు గదా! ఎప్పుడూ అలజడి జరుపుతూ వుండాలి. అప్పుడు యీ విషయం వలన రాజ్యాల కార్యదర్శికి తెలుస్తుంది. అలా జరగాలంటే అందుకు ఒక శాశ్వతమైన సంస్థ అవసరమని అనిపించింది. అబ్దుల్లా సేఠ్ గారితోను, మిగతా మిత్రులతోసు సంప్రదించి ఒక శాశ్వత సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాను.
ఈ సంస్థకు పేరు ఏమని పెట్టడం? చాలా ధర్మ సందేహాలు కలిగాయి. అది ఏ పక్షం వైపుకు మొగ్గకూడదు. కాంగ్రెస్ అను పేరు ఇంగ్లాండు నందలి కన్సర్వేటివు పార్టీ వారికి రుచించదని నాకు తెలుసు. కాని హిందూ దేశానికి కాంగ్రెస్ ప్రాణం. నేటాలులో శక్తిని వృద్ధి చేయాలని భావించాను. ఆ పేరుకు భయపడటం పిరికితనం అని తోచింది. ఈ కారణాలన్నీ తెలియజేసే ఈ సంస్ధకు “నేటాలు ఇండియన్ కాంగ్రెస్” అని పేరు సూచించాను. అంతా అంగీకరించారు. 1894 వ సంవత్సరం మే 22వ తేదీన నేటాలు ఇండియన్ కాంగ్రెస్ ఆవిర్భవించింది.
ఆనాడు విశాలమైన అబ్దుల్లా సేఠ్‌గారి గది క్రిక్కిరిసి పోయింది. సభ్యులంతా కాంగ్రెసుకు స్వాగతం చెప్పారు. కాంగ్రెసు నియమాలు తక్కువే కాని చందా మాత్రం ఎక్కువ. నెలకు అయిదు షిల్లింగులు చెల్లిస్తేనే సభ్యులవుతారు. శక్తివంచన లేకుండా ధనికులు చందాలు యిమ్మని ప్రోత్సహించాము. అబ్దుల్లాగారు మొదటి పద్దుగా రెండు పౌండ్ల విరాళం ప్రకటించారు. తరువాత యిద్దరు మిత్రులు అంత పద్దు చేశారు. “నేను ఏం చేయడమా?” అని ఆలోచించి ఆ తరువాత ఒక పౌను విరాళం నేను వ్రాశాను. యిది నా శక్తికి మించిన పని. అయితే సంపాదన ప్రారంభమైతే యీ మాత్రం యివ్వగలనని నేను సాహసించాను. ఈశ్వరుడు అందుకు సహకరించాడు. ఈ విధంగా నెలకు ఒక్క పౌను చొప్పున యిచ్చే సభ్యులు ఎక్కువగా చేరారు. నెలకు పది షిల్లింగుల చొప్పున యిచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. ఇదిగాక విరాళాలు చాలా మంది తమ శక్తిని బట్టి ప్రకటించారు.
ఈ వ్యవహారం చూచాక అడిగినంత ఎవ్వరూ విరాళం యివ్వరని నాకు బోధపడింది. దర్బానుకు ఆవలి ప్రాంతాల్లో వున్న వారిని మాటిమాటికి చందా అడగటం కష్టం. ఆరంభశూరత్వం ఎలా వుంటుందో కూడా బోధపడింది. దర్బను వాళ్లు ఎన్నిసార్లు తిరిగినా చందాలు యిచ్చేవారు కాదు.
నేను కార్యదర్శిని. అందువల్ల చందాలు పోగుచేసే పని నాది. వసూళ్లకై నాలుగు మాసాలు రోజంతా తిరగవలసి వచ్చేది. ఈ అనుభవం వల్ల నెల చందాలకు బదులు వార్షిక చందాలు, ముందుగానే వసూలు చేసేలా ఏర్పాటుచేయడం మంచిదని భావించాను. అందుకోసం సభ ఏర్పాటు చేశాను. నెలకు బదులు ఏడాదికి ఒక్క సారి చందా వసూలుచేయాలని, మూడు పౌండ్లు కనీసపు పద్దుగా వుండాలని అంతా నిర్ణయించారు. ఈ విధంగా నిర్ణయించినందున చందాల వసూలు పని సులభమైపోయింది.
అప్పు తెచ్చి ప్రజల కార్యాలు చేయకూడదని మొదటి నుండి నా అభిప్రాయం. డబ్బు తప్ప మిగతా ఏ విషయాల్ని గురించి, ఏ వాగ్దానాలనైనా అంగీకరించవచ్చునని అనుభవం మీద తెలిసింది. వాగ్దానం చేసిన వాళ్లు తిరిగి దాన్ని అదేవిధంగా బాధ్యతగా నేరవేర్చడం తక్కువ. నేటాలు భారతీయులు కూడా అంతే. డబ్బు చూచుకొని గాని కార్యక్రమాలకు నేను పూనుకోలేదు. అందువల్ల నేటాల్ కాంగ్రెస్ అప్పులపాలు కాలేదు.
నా సహచరులు క్రొత్త సభ్యుల్ని చేర్చాలని ఉత్సాహపడ్డారు. దానితో వారికి కూడా చాలా అనుభవాలు కలిగాయి. చాలామంది సంతోషంతో ధనం యివ్వడం ప్రారంభించారు. దూర ప్రదేశాలకు గ్రామాలకు ఉద్యమాన్ని వ్యాప్తం చేయడం కష్టమైపోయింది. ప్రజా సేవ అంటే ఏమిటో అక్కడి వాళ్లకు ముందు తెలియదు. చాలామంది ధనికులు మమ్మల్ని పిలిచి విరాళాలు యివ్వడం ప్రారంభించారు.
ఈ యాత్రలో ఒకసారి పెద్ద కష్టం ముంచుకు వచ్చింది. ఒక దాత ఆరు పౌండ్లు యిస్తాడని అనుకున్నాం. కాని అతడు మూడు పౌండ్లు కంటే మించి యివ్వనని భీష్మించాడు. మేము ఆ కొద్ది సొమ్ము ఆయన దగ్గర తీసుకుంటే మిగతా వారంతా అంతే యిస్తారు. అందువల్ల సొమ్ము ఎక్కువ వసూలు కాదు. ఆ రోజు రాత్రి ప్రొద్దుపోయింది. మాకందరికీ బాగా ఆకలివేస్తూ వున్నది. అనుకున్న మొత్తం రానిదే భోజనం ఎలా చేయడం? ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం కలగలేదు. దాత పట్టిన పట్టు విడవలేదు. పట్టణంలో వుండే వర్తకులంతా చెప్పి చూచారు. మేమంతా రాత్రంతా ఆయనతో గడిపాము. అయినా ఆయన లొంగలేదు. మేము కూడా మెత్తబడలేదు. నా సహచరులలో చాలామందికి కోపం వచ్చింది. అయినా సౌజన్యాన్ని వదలలేదు. తూర్పున ఉషోదయ కిరణాలు తొంగి చూడసాగాయి. అప్పుడు ఆయన ఆరు పౌండ్లు యిచ్చాడు. మాకందరికీ విందు కూడా చేశాడు. ఇది టోంగాటా పట్టణంలో జరిగిన ఘట్టం. అయితే ఈ వార్త ఉత్తర దిక్కున గల స్టేంగల్ పట్టణం మొదలుకొని దేశం మధ్యన చార్లెస్ టౌను వరకు ప్రతిధ్వనించింది. దీని వల్ల చందా వసూళ్ల పని మాకు తేలిక అయింది.
కాని మా పని ధనం వసూలు చేయడమేకాదు. అవసరాన్ని మించి ధనం మన దగ్గర వుంచవద్దని నేను నా సహచరులందరికీ ముందే చెప్పి వుంచాను. అవసరాన్ని బట్టి వారానికి ఒకసారి, నెలకొకసారి సభలు జరుపుతూ వచ్చాం. ప్రతి సభలోను వెనుక జరిగిన కార్యక్రమ వివరమంతా చెప్పడం జరుగుతూ వుండేది. ఇట్టి చర్చల్లో డొంక తిరుగుడు లేకుండా మాట్లాడటం అక్కడి వారికి తెలియదు. సభల్లో ప్రసంగించడానికి అంతా సంకోచించసాగారు. అయితే మాట్లాడవలసిన తీరు, చర్చల సరళి గురించి వారికి వివరిస్తూ వుండేవాణ్ణి. వారు ఆ ప్రకారం ప్రసంగించడం ప్రారంభించారు. వారు ఉపన్యసించడం ఒక విద్య అని తెలుసుకున్నారు. ఉపన్యాసం అంటే ఏమిటో తెలియని వారు కూడా ఆలోచించి ఉపన్యసించసాగారు.
ప్రజల కార్యక్రమాల్లో చిల్లర ఖర్చులు మితిమీరి పోవడం నేనెరుగుదును. మొదట రసీదు పుస్తకాలు అచ్చు వేయవద్దనుకున్నాను. నా దగ్గర సైక్లోస్టయిలు మిషసు వుంది. దానిమీద రశీదుల, రిపోర్టుల ప్రతులు తీయించసాగాను. కాంగ్రెస్‌లో డబ్బు ఎక్కువగా వుండి, సభ్యుల సంఖ్య అధికమైనప్పుడు మాత్రమే యిట్టి వాటిని అచ్చు వేయించేవాణ్ణి. పొదుపు చేయాలను తలంపే అందుకు కారణం. అయినా చాలా చోట్ల యిలా జరగలేదు. సంస్థ చిన్నదైనా పెద్దదైనా అందరికీ యీ విషయాలు తెలియాలనే తలంపుతో వివరంగా యిక్కడ వ్రాశాను.
జనం డబ్బు యిచ్చి రసీదులడిగే వారు కారు. కాని మేము మాత్రం రసీదులివ్వడం అవసరమని భావించాం. ఆవిధంగా ప్రతి దమ్మిడీకి రసీదులు యిచ్చాం. పైసపైసకు లెక్క వ్రాస్తూ వున్నాం. ఆ విధంగా వ్యవహరించడం వల్ల యీనాడు పరీక్షించి చూచినా 1894 నాటి నేటాలు ఇండియన్ కాంగ్రెస్ లెక్కలు కరెక్టుగా వుంటాయి. ఆ విషయం యీ నాటికీ గట్టిగా నొక్కి వక్కాణించగలను. ఏ సంఘానికైనా తప్పులు లేని లెక్కలే ప్రాణం. లెక్కలు సరిగా లేకపోతే సంఘానికి పెద్ద అపకీర్తి వస్తుంది. లెక్కల్ని సరిగాను శుద్ధంగాను ఉంచకపోతే సత్యాన్ని సరిగాను, శుద్దంగాను రక్షించలేము.
ఆ దేశంలో పుట్టి పెరిగి విద్యావంతులైన భారతీయులకు సేవ చేయడం ఈ కాంగ్రెస్ యొక్క రెండవ పని. అందుకోసం “కలోనియల్ బారన్ ఇండియన్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్” అను ఒక సంఘాన్ని స్థాపించాము. ఇందలి సభ్యులంతా విద్యాధికులైన పిన్నవారే. వారు కొద్దిగా చందాలు యిస్తూ వుండేవారు. వారి కష్టాల్ని ప్రజలకు చెప్పడం, వారి తెలివి తేటల్ని పైకి తీయడం, వారికి హిందూ దేశపు వర్తకులకు సత్సంబంధం కల్పించడం, వారికి సేవచేసే విధానం తెలపడం. ఇవీ ఈ సంఘం పని. ఇది ఒక విధంగా చర్చలు జరుపు సమితి అన్నమాట. అందలి సభ్యులు అనేక విషయాలపై తప్పనిసరిగా చర్చలు చేస్తూ వుండేవారు. ఈ సంఘం కోసం చిన్న గ్రంధాలయం కూడా ఏర్పాటు చేశాం.
ప్రచారం చేయడం కాంగ్రెస్ మూడో పని. దక్షిణ ఆఫ్రికాలోను, ఇంగ్లాండులోను ఉన్న ఆంగ్లేయులకు, భారతీయులకు నేటాలులో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు తెలుపడం అవసరం. ఈ దృష్టితో రెండు కర పత్రాలు తయారుచేశాను. “దక్షిణ ఆఫ్రికాలోని బ్రిటీష్ వారికి ఒక విన్నపం” (An appeal the every briton in South Africa) అను కరపత్రం ఒకటి. యిందు నేటాలు నందలి భారతీయుల స్థితిగతుల్ని గురించి సవివరంగా వ్రాశాను. “భారతీయుల ఓటు హక్కును గురించి ఒక విన్నపం” The Indian Franchise An Appeal అనునది రెండో కరపత్రం. ఇందు భారతీయుల ఓటు హక్కును గురించి కూలంకషంగా వివరించి వ్రాశాను. ఈ రెండు కర పత్రాలు తయారుచేయటానికి నేను ఎంతో శ్రమించాను. అంత శ్రమ పడినందుకు ఫలితం ఊహించనంతగా లభించడం గొప్ప విశేషం. వాటికి ఎంతో ప్రచారం లభించింది.
ఈ అలజడి వల్ల దక్షిణ ఆఫ్రికాలోని భారతీయులు నాకు మంచి మిత్రులైనారు. ఇంగ్లాండునందు, హిందూ దేశమునందును గల అన్ని పార్టీల వారి ఆదరము మాకు లభించింది. ఇక ముందు చేయాల్సిన పనికి రాజమార్గం ఏర్పడింది.
20. బాలసుందరం
“యాదృశీ భావనీ యత్ర సిద్ధిర్బవతితాదృశీ” (ఎవరికి ఎటువంటి తలంపు కలుగునో అతనికి అటువంటి ఫలం కలుగును) అనునది అనేక విషయాలలో నాకు అనుభవం అయింది. పేదలకు సాయపడటం నాకు ఎంతో యిష్టం. ఆ అభిలాష నన్ను ఆ పేదలతో కలిపి వాళ్లతో మంచి సంబంధం కలిగించింది.
నేటాలు కాంగ్రెస్‌లో అక్కడి భారతీయులు, ఉద్యోగులు సభ్యులుగా చేరారు. కాని గిరిమిటియాలు మాత్రం అందు చేరలేదు. “కాంగ్రెస్ యింకావారి పరం కాలేదు. వాళ్లు చందాలు చెల్లించి మెంబర్లుగా చేరలేదు. మరి కాంగ్రెసు అట్టి వాళ్లకు సాయం చేయాలి! అప్పుడు వాళ్లంతా దాంట్లో తప్పక చేరతారు” అని అనుకుంటూ వుండగా ఒక ఘట్టం అనుకోకుండా ఒక పర్యాయం జరిగింది. ఆ ఘట్టం అప్పుడే జరుగుతుందని నేను గాని, కాంగ్రెస్ వాళ్లు గాని ఎవ్వరు ఊహించలేదు. నేను ప్లీడరు వృత్తి చేపట్టి అప్పటికి మూడు నాలుగు నెలల కాలం గడిచింది. అప్పటికి కాంగ్రెసుకు యింకా శైశవం తీరలేదు. ఒకనాడు ఒక తమిళుడు తలగుడ్డ తీసి చేతబుచ్చుకొని ఏడుస్తూ వచ్చి నా ముందు నిలబడ్డాడు. అతడు చినిగిపోయిన బట్టలు ధరించి యున్నాడు. అతని శరీరం వణుకుతున్నది. ఎదటి రెండు పళ్లు ఊడిపోయాయి. ఆ పళ్ల చిగుళ్ల నుండి రక్తం కారుతున్నది. యజమాని అతణ్ణి చావబాదాడన్నమాట. నా గుమాస్తా తమిళుడు. అతని ద్వారా ఆ వచ్చిన వ్యక్తి కథంతా తెలుసుకున్నాను. అతని పేరు బాలసుందరం. దర్బలులో ప్రసిద్ధుడైన ఒక తెల్ల యజమాని దగ్గర యితడు ఇండెంచెర్డు కూలి అన్నమాట. యజమానికి ఏదో మాట మీద కోపం వచ్చింది. ఒళ్లు తెలియకుండా బాలసుందరాన్ని బాదాడు. ఆ దెబ్బలకు బాలసుందరం ఎదుటి రెండు పళ్లు ఊడిపోయాయి.
బాలసుందరాన్ని వెంటనే డాక్టరు దగ్గరకు పంపించాను. అప్పుడక్కడ తెల్ల డాక్టరు వున్నారు. బాలసుందరానికి తగిలిన దెబ్బల్ని గురించి డాక్టరు సర్టిఫికెట్టు తీసుకొని మేజిస్ట్రేటు వద్ద అఫిడవిట్టు దాఖలు చేయించాను. మేజిస్ట్రేటు అఫిడవిట్టు చదివి కోపంతో వెంటనే ఆ యజమానికి సమన్లు పంపించాడు.
యజమానికి శిక్ష వేయించడం నా లక్ష్యం కాదు. ఎలాగైనా బాలసుందరాన్ని ఆ యజమాని బారినుండి తప్పించాలన్నదే నా లక్ష్యం. ఇండించెర్డ కూలీలను గురించి చట్టమంతా క్షుణ్ణంగా చదివాను. ఏ కూలివాడైనా చెప్పకుండా లేచి వెళ్లిపోతే యజమాని సివిల్ కోర్టులో దావా వేయవచ్చు. ఇండించెర్డు కూలివాడు అలా లేచి వెళ్లిపోతే యజమాని పూర్తిగా మరో చర్య గైకొనవచ్చు. వానిమీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు. నేరం రుజూ అయితే కూలీకి శిక్ష కూడా పడవచ్చు. సర్ విలియం హంటరుగారు “ఇండించెర్డు కూలిపని, బానిసత్వం ఒక్కటే” అని అన్నారు. యజమానికి బానిస ఏవిధంగా ఆస్థిగా పరిగణింపబడతాడో అదే విధంగా ఇండించెర్డు కూలివాడు కూడా యజమాని ఆస్థిగా పరిగణింపబడతాడని దాని అర్ధం.
బాలసుందరం విడుదలకు రెండే రెండు మార్గాలు వున్నాయి. ఇండెంచెర్డు కూలివాళ్ళకు ప్రొటెక్టరు అనగా రక్షకుడు ఒకడు వుంటాడు. అతనితో చెప్పి కట్టడినుండి తప్పించవచ్చు. లేదా మరొక యజమాని దగ్గరకు బదలీ చేయించవచ్చు. ఒప్పుదల మీద బాలసుందరాన్ని యజమాని చేతనే విడుదల చేయించవచ్చు. ఇదంతా ఆలోచించి ఆ యజమానితో “మీ మీద నేరం మోపి మిమ్ము శిక్షింపచేయడం నా లక్ష్యం కాదు. మీరు అతణ్ణి క్రూరంగా కొట్టారు. మీరు ఆ విషయం గ్రహించేయుండవచ్చు. మీరు కరారునామాను మరొకరికి మార్చండి చాలు” అని అన్నాను.
నా మాటలు వినిన వెంటనే అతడు అందుకు అంగీకరించాడు. తరువాత నేను ప్రొటెక్టరును చూచాను. అతడు కూడా అంగీకరించాడు. కాని క్రొత్త యజమాని కావాలి కదా!
ఒక తెల్ల యజమాని కోసం వెతికాము. అప్పుడు భారతీయులు ఇండెంచెర్డు కూలీలను భరించే స్థితిలో లేరు. అప్పటికి నాకు కొద్దిమంది తెల్లవారితో పరిచయం ఏర్పడింది. ఒకరికి యీ సంగతి తెలియజేశాను. అతడు దయతో ఒప్పుకున్నాడు. నేనాతనికి కృతజ్ఞతలు తెలియజేశాను. మేజిస్ట్రేటు బాలసుందరం అను కూలీ తన యజమానిపై నేరం మోపి తన కరారునామాను మరొకరికి బదలీ చేయుటకు అంగీకరించారని రికార్డు చేశాడు.
బాలసుందరం కేసు సంగతి కూలీలందరికీ తెలిసింది. నాకు “గిరిమిటియా బంధువు” అని పేరు వచ్చింది. నాకీ సంబంధం వల్ల ఎంతో ఆనందం కలిగింది. ఇక ప్రతిరోజు మా ఆఫీసుకు గిరిమిటియాలు అపరిమితంగా రాసాగారు. వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు నాకు మంచి అవకాశం లభించింది.
ఈ కేసు విషయం దూరాన ఉన్న మద్రాసు రాష్ట్రంలో కూడా ప్రతిధ్వనించింది. మద్రాసు నుంచి నేటాలు వచ్చిన గిరిమిటియాలు తమ గిరిమిటియా సోదరుల వల్ల యీ విషయం తెలుసుకున్నారు. ఈ కేసు గొప్పదేమీకాదు. కాని నేటాలులో తమకు న్యాయం సాధించగల వాడొకడు బయల్దేరాడను వార్త గిరిమిటియాలకు ఉత్సాహం కలిగించింది.
బాలసుందరం నా దగ్గరకు వచ్చినప్పుడు తలపాగా తీసి చేత పట్టుకొని వున్నాడని నేను ముందే తెలియజేశాను. అసలు ఈ దృశ్యంలో ఒక విచిత్రమైన కరుణరసం మరియు నైచ్యం నిండి వున్నాయి. జడ్జి నా తలపాగాను తీసివేయమన్నప్పటి ఘట్టాన్ని గురించి మొదట వ్రాశాను. తెల్లవాణ్ణి చూడటానికి వెళ్లినప్పుడు గిరిమిటియా గాని, క్రొత్త భారతీయుడు గాని తన తలపాగా తీసి చేతులతో పట్టుకోవాలి. రెండు చేతులు జోడించి నమస్కరించినా అది తక్కువే. బాలసుందరం నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అలాగే చేయాలని అనుకున్నాడు. ఈ రకమైన చర్యను చూడటం నాకు యిదే ప్రథమం. ఈ చర్య నాకు చిన్నతనం అనిపించింది. నేను బాలసుందరాన్ని తలపాగా చుట్టుకోమని చెప్పాను. అతడు ఎంతో సంకోచిస్తూ పాగాను తలకు చుట్టుకున్నాడు. అయితే అప్పుడు అతడి ముఖంమీద సంతోషం తొంగిచూచింది.
తను తోటి మానవులను నీచపరచడం వల్ల తమకేదో గౌరవం చేకూరుతుందని భావించేవారి ఉద్దేశం ఏమిటో నాకు బోధపడదు. అట్టి తత్వం సరికాదని నా నిశ్చితాభిప్రాయం.
21. మూడు పౌండ్ల పన్ను
బాలసుందరం కేసుతో గిరిమిటియాలతో నాకు సంబంధం పెరిగింది. అటు ప్రభుత్వం కూడా ఎక్కువ పన్నులు వసూలు చేసి వారిని బాధించడం ప్రారంభించింది. అందువల్ల వారిని గురించి చదువవలసి వచ్చింది.
1894వ సంవత్సరంలో నేటాలు ప్రభుత్వం వారు గిరిమిటియాలు సాలీనా తలకు 25 పౌండ్ల చొప్పున అంటే 375 రూపాయలు పన్ను కట్టాలని బిల్లు తయారుచేశారు. దీన్ని చూచి నిర్విణ్ణుడనయ్యాను. ఈ విషయం కాంగ్రెస్ సమావేశంలో చర్చకు ప్రవేశ పెట్టాను. అందు యీ బిల్లును వ్యతిరేకంగా గట్టి ప్రయత్నం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించబడింది.
ఈ పన్నుకు అసలు కారణం ఏమిటో యిక్కడ కొద్దిగా వివరిస్తాను. 1860లో నేటాలు నందలి తెల్లవారు అక్కడి భూములు కొన్నారు. అక్కడి భూములు చక్కెర తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే కూలీలు దొరకడం కష్టమైంది. ఆ దేశంలో కూలివాళ్లను రప్పించడం అవసరమని భావించారు. అందువల్ల నేటాలు ప్రభుత్వం వారు బ్రిటిష్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి భారత దేశాన్నుండి కూలివారిని వలస తీసుకొనిపోయేందుకు అనుమతి సంపాదించారు. ఈ కూలి జనం నేటాలులో అయిదేండ్లు పని చేయుటకు అంగీకరిస్తూ గిరిమిటు మీద (కరారునామా) సంతకం చేయాలి. గడువు దాటిన తరువాత వారి యిష్టం. అంటే అక్కడే నివసించదలిస్తే నివసించవచ్చు. శక్తి వుంటే భూమి కొనుక్కోవచ్చు. ఈ విధంగా తెల్లవాళ్లు గిరిమిటీలకు ఆశ పెట్టారు. అయిదు సంవత్సరాల తరువాత కూడా భారతదేశ కూలీలు కాయకష్టంచేసి ప్రయోజనం పొందవచ్చునని తెల్లవాళ్లు ప్రకటించారు.
అయితే భారతీయులు తెల్లవారనుకున్న దానికంటే ఎక్కువ లాభం పొందారు. వారు రకరకాలైన కూరగాయలు విరివిగా పండించసాగారు. ఇండియా నుండి మంచి కూరగాయల విత్తనాలు వెంటతీసుకొని వెళ్లి తద్వారా బాగా కూరగాయలు పండించి అక్కడ చవుకగా జనానికి అందచేశారు. మామిడితోటలు పెంచారు. వర్తకం కూడా చేయడం ప్రారంభించారు. ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు కొన్నారు. కొందరు కూలీలు భూస్వాములైనారు. భారతదేశపు వర్తకులు కొందరు వీరితోబాటు వెళ్లి అచ్చట పాతుకుపోయారు. ఇట్టివారిలో కీ.శే, సేఠ్ అబుబకర్ అమద్ గారు ప్రధములు. వారు కొద్ది కాలంలోనే తమ వ్యాపారాన్ని వృద్ధికి తెచ్చారు.
ఇదంతా చూచి తెల్లవ్యాపారస్థులు కంగారుపడిపోయారు. నల్లవాళ్లను పిలుచుకు వెళ్లినప్పుడు తెల్లవాళ్లకు వీళ్ల వ్యాపార రహస్యాలు తెలియవు. భారతీయులు వ్యవసాయదారులైతే ఫరవాలేదుగాని వ్యాపారంలో సైతం పోటీకి దిగేసరికి తెల్లవాళ్లు సహించలేకపోయారు. భారతీయుల యెడ అసూయ కలగడానికి ఇదే ముఖ్య కారణం. దీనికి మరిన్ని ఇతర కారణాలు కూడా తోడు అయ్యాయి. నల్లవారి రకరకాల జీవన పద్ధతులు, కొంచెం వ్యయమైనా మప్పితంగా గృహ నిర్వహణ కావించుకోగల స్థితి, అల్ప లాభ సంతోషం, ఆరోగ్య నియమాలను గురించిన ఉదాసీనత, చుట్టుప్రక్కల్ని శుచిగా వుంచుకోవడంలో అశ్రద్ధ, ఇండ్లను మరమ్మత్తు చేయించి బాగా వుంచుకొనడంలో పిసినారితనం మొదలుగా గల వ్యవహారాలన్నింటి వల్ల వర్ణ ద్వేషమనే చిచ్చు బాగా రేగింది. ఈ ద్వేషం తరువాత వోటు హక్కు తొలగించే బిల్లు రూపంలోను, ఆ తరువాత గిరిమిటియాలు మూడు పౌండ్ల తలసరి పన్ను చెల్లించే బిల్లు రూపంలోను ప్రత్యక్షమైంది. ఈ శాసనాలే గాక అనేక చిక్కులు అదివరకే ఏర్పడి వున్నాయి. గిరిమిటియాలను, గిరిమిటియా కాలం అయిదేండ్లు ముగియక మునుపే ఆ గడువు ముగిసినట్లు భావించి బలవంతంగా పంపివేయడానికి పూనుకున్నారు. కాని అందుకు ఇండియా ప్రభుత్వంవారు అంగీకరించలేదు. తరువాత కొన్ని షరతులు ప్రవేశ పెట్టబడ్డాయి.
(1) గిరిమిటియాలు తమ నియమిత కాలం పూర్తికాగానే ఇండియాకు వెళ్లిపోవాలి. అలా వెళ్లని యెడల
(2) రెండేండ్లకు ఒక్కసారి క్రొత్త ఒడంబడిక వ్రాస్తూ వుండాలి. ఒడంబడిక వ్రాయబడినపుడు జీతం కొంచెం కొంచెం పెంచబడుతూ వుంటుంది.
(3) క్రొత్త ఒడంబడిక వ్రాయక, ఇండియాకు తిరిగిపోకుండా నేటాలులోనేవుంటే సాలుకు 25 పౌండ్లు అనగా 375 రూపాయలు పన్ను రూపంలోచెల్లిస్తూ వుండాలి.
ఈ షరతుల్ని ఇండియా ప్రభుత్వం వారిచే అంగీకరింపచేయుటకు సర్ హెన్రీ బిన్, మిస్టర్ మేసను అనువారు ఇండియాకు వచ్చారు. అప్పుడు లార్డ్ ఎల్గిన్ ఇండియా వైస్రాయిగా వున్నారు. అతడు 25 పౌండ్ల పన్ను అంగీకరించాడు. ఇది వైస్రాయి చేసిన పెద్ద తప్పిదం. అప్పుడూ యిప్పుడూ కూడా నా అభిప్రాయం ఇదే. ఈ విధంగా నిర్ణయించి అతడు ఇండియాకు ఈషణ్మాత్రమైనా మేలు చేయలేదు. నేటాలు తెల్లవాళ్లకు ఆ విధంగా లాభం చేకూర్చడం వైస్రాయికి పాడిగాదు. మూడు నాలుగేండ్లలో ప్రతి గిరిమిటియా తనకు, తన భార్యకు, పదహారేండ్ల కొడుక్కు, పదమూడేండ్ల కుమార్తెకు మూడు మూడు పౌండ్ల చొప్పున పన్ను చెల్లించాలి. నెలకు వారి ఆదాయం 14 షిల్లింగులు మాత్రమే. అంతకంటే మించి సంపాదించని భార్యాభర్తలకు, వారిద్దరి పిల్లలకు కలపి కుటుంబానికి సాలుకు 12 పౌండ్లు అంటే 180 రూపాయల పన్ను వేయడం ఏ దేశంలోను కనీవినీ ఎరుగని అత్యాచారమే.
ఈ పన్నును ప్రతిఘటిస్తూ మేము ఉద్యమం ప్రారంభించాము. ఈ విషయంలో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ మౌనం వహించియుంటే ఇండియా వైస్రాయి 25 పౌండ్లు మంజూరు చేసియుండేవాడే. 25 పౌండ్లు 2 పౌండ్లకు తగ్గడం కూడా నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారు జరిపిన ఉద్యమ ప్రభావమే కావచ్చు లేక నా భావం పొరపాటే కావచ్చు. కాంగ్రెసువారు ఉద్యమం నడిపినా నడపకపోయినా ఇండియా ప్రభుత్వం వారు 3 పౌండ్ల పన్ను మంజూరు చేసియుందురని అనవచ్చు. ఏది ఏమైనా ఇది భారతీయుల యెడ అనుచిత చర్యయే. భారతదేశ యోగక్షేమాలను పరిరక్షించవలసిన వైస్రాయి అమానుషమైన యిట్టి పన్నును మంజూరు చేసి యుండకూడదు. ఈ పన్ను 25 పౌండ్ల నుండి అనగా 375 రూపాయల నుండి 3 పౌండ్లకు అనగా 45 రూపాయలకు తగ్గింపబడినా అది నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారికి గౌరవప్రదం కాదు! గిరిమిటియాలకు ఏమీ మేలు జరగలేదను విషయం స్పష్టం. అది నిర్వివాదాంశం. ఈ పన్నును రద్దు చేయించి ముదరా యిప్పించాలని కాంగ్రెసు వారి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని వారు ఎన్నడూ విడిచి పెట్టలేదు. అయితే యీ నిర్ణయం నెరవేరడానికి ఇరవై సంవత్సరాల కాలం పట్టింది. ఒక్క నేటాలు నందలి భారతీయులేగాక దక్షిణ ఆఫ్రికాలో నివసిస్తున్న భారతీయులంతా కలిసి ఏకోన్ముఖంగా పెద్ద ఉద్యమం నడిపితేనే గాని ఆ పన్ను రద్దుకాలేదు. గోఖలే గారికి రద్దు చేస్తామని మాట యిచ్చి కూడా చివరికి నెరవేర్చక పోయేసరికి తుది సమరం ప్రారంభించవలసి వచ్చింది. ఆ సమరంలో గిరిమిటియాలంతా పూర్తిగా పాల్గొన్నారు. ప్రభుత్వం వారు తుపాకులు కాల్చినందున చాలామంది గిరిమిటియా భారతీయులు ప్రాణాలు అర్పించారు. పదివేల మందికి పైగా నిర్బంధింపబడి జైళ్లకు వెళ్లారు.
అయితే చివరికి సత్యమే జయించింది. భారతీయుల బాధల రూపంలో సత్యం అక్కడ ప్రత్యక్షమైంది. అచంచలమైన ఓర్పు, నమ్మకం, విసుగు విరామం లేని పట్టుదల, పూనిక వల్ల ఆ యుద్ధంలో జయం లభించింది. లేకపోతే జయం లభించియుండేది కాదు. ఆ పోరాటం జరుపకుండా మానివేసివున్నా, లేక నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ వారు ఆ విషయం మరిచిపోయినా తల పన్ను గిరిమిటియాల మీద పడియుండేదే. ఆనాటి నుండి ఈనాటి వరకు భారతీయ గిరిమిటియాలు చెల్లిస్తూ వుండేవారే. ఆ అపయశస్సు దక్షిణ ఆఫ్రికా యందు నివసిస్తున్న భారతీయులకే గాక భారతదేశంలో నివసిస్తున్న సమస్త భారతీయులకు కూడా ఆపాదించి యండేది.
22. ధర్మ నిరీక్షణ
ఈ విధంగా నేను పూర్తిగా ప్రజా సేవలో లీనమైపోయాను. అందుకు కారణం ఆత్మ సాక్షాత్కారాభిలాషయే. ప్రజాసేవ వల్ల ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందనే విశ్వాసంతోనే నేను సేవా ధర్మాన్ని స్వీకరించాను. భారతసేవ నాకు సహజంగా లభించింది. నాకిది ఎంతో ఇష్టం. కోరుకోకుండా యిది నాకు లభ్యమైంది. నేను పర్యటనా కాంక్షతోను, కాఠియావాడులో జరుగుతున్న కుట్రల బారి నుండి తప్పించుకోవాలనే కోరికతోను జీవిక కోసం దక్షిణ ఆఫ్రికా చేరాను. కాని నేను యిక్కడి ప్రజాసేవలో లీనమై ఈశ్వరాన్వేషణ మరియు ఆత్మదర్శనమునందు నిమగ్నమై పోయాను. ఏసు మిత్రులు నా ధర్మ జిజ్ఞాసను తీవ్రం చేశారు. అది ఏవిధంగాను శాంతించలేదు. నేను దాన్ని శాంతింపచేయాలని ప్రయత్నించాను. కాని ఏసు మిత్రులు శాంతపడనీయలేదు. అప్పుడు దర్బనులో దక్షిణ ఆఫ్రికా జనరల్ మిషనుకు అధ్యక్షులు స్పెన్సరు వాలటన్‌గారు. వారు నన్ను పసికట్టారు. దాదాపు నేను వారి కుటుంబంలో ఒకడినైపోయాను. ఈ సంబంధానికి కారణం ప్రిటోరియా పరిచయం. వాల్‌టన్‌గారి స్వభావం విచిత్రమైంది. ఆయన నన్నెన్నడు ఏసు మతంలో చేరమని చెప్పినట్లు గుర్తులేదు. కాని అతడు తన జీవితం సమస్తం నా ముందు ఉంచి తన మంచి చెడ్డల్ని నిరీక్షించు అవకాశం నాకు కల్పించాడు. అతని సతీమణి ఎంతో వినయవంతురాలు, వివేకవంతురాలు.
ఆ దంపతులు ప్రవర్తన నాకు సంతోషం కలిగించింది. మా యిద్దరికీ గల అభిప్రాయభేదం యిద్దరికీ తెలుసు. ఎటువంటి తీవ్రచర్చ కూడా మా యిద్దరి అభిప్రాయాల్ని ఏకం చేయలేదు. అయినను ఎచట ఉదారత, సహిష్ణుత, సత్యం ఉంటాయో అచట భేదాలు కూడా లాభదాయకాలే అవుతాయి. ఆ దంపతుల వినమ్రత, ఉద్యమశీలత, కార్యపరాయణత నాకు సంతోషం కలిగించాయి. అందువల్ల ఇద్దరం తరుచు ఒకచోట కలుస్తూ వుండేవాళ్లం.
ఈ సంబంధం నన్ను మత విషయంలో జాగ్రత్తపడేలా చేసింది. మతాన్ని గురించి చింతన చేసేందుకు ప్రిటోరియాలో నాకు లభించిన అవకాశం యిక్కడ లభించలేదు. అయినా లభించిన స్వల్ప సమయాన్ని గ్రంథ పఠనానికి వినియోగించ సాగాను. ఈ విషయమై మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభమైనాయి. రాయచంద్ భాయి నాకు యీ విషయంలో త్రోవ చూపుతూ వున్నారు. నర్మదా శంకరుని (గుజరాతుకు చెందిన ఒక ప్రసిద్ధ కవి) ‘ధర్మ విచార్’ అను గ్రంథం ఒక మిత్రుడు పంపగా దాని పీఠిక నాకు ఎంతో ఉపయోగపడింది. నర్మదా శంకరుని విశృంఖల జీవితాన్ని గురించి వినియున్నాను. ఈ పీఠికలో అతడు తన శీలాన్ని ఎలా దిద్దుకోగలిగాడో వివరించాడు. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. నాకు ఆ గ్రంథం యెడ ఆదరం పెరిగింది. దాన్ని అతిశ్రద్ధగా చదివాను. మాక్సు ముల్లర్ గారి ‘India, what can it teach us’ అను గ్రంథాన్ని, దివ్యజ్ఞాన సమాజం ప్రకటించిన ఉపనిషత్తులు అనువాదాన్ని శ్రద్ధగా చదివాను. వీటన్నింటివల్ల నాకు హిందూమతంపై ఆదరణ పెరిగి, నానాటికి దాని గొప్పతనం అమితంగా కనబడసాగింది. అయితే అందువల్ల యితర మతాల యెడ వైముఖ్యం కలుగలేదు. వాషింగటన్ ఇర్వింగ్ గారి “Life of Mahamd and His successars” అను గ్రంథాన్ని, కార్లయిలుగారి మహమ్మదు స్తుతిని చదివాను. దీనిచే నాకా మత ప్రవక్త యెడ ఆదరం పెరిగింది. “the sayings of zarthustra” అను గ్రంథం కూడా చదివాను. ఈ విధంగా వివిధ మతాల్ని గురించి కొద్దిగానో గొప్పగానో తెలుసుకున్నాను. దీనివల్ల ఆత్మ నిరీక్షణ పెరిగింది. చదివిన దానిలో మంచిదని తోచిన అనుభవాన్ని ఆచరణలో పెట్టసాగాను. యిదేవిధంగా యోగ సంబంధమైన గ్రంథాల్ని కూడా చదివి సాధన ప్రారంభించాను. కాని ఎక్కువ కాలం ఆ సాధన సాగించలేకపోయాను. భారతదేశం వెళ్లిన తరువాత ఒక గురువు దగ్గర అభ్యసించాలని భావించాను. కాని ఆ కోరిక ఈనాటి వరకు నెరవేరలేదు.
టాల్‌స్టాయి పుస్తకాలు అధికంగా చదివాను. వారి “The Gospels in Brief, What to do?” మొదలగు గ్రంథాలు నా హృదయానికి హత్తుకున్నాయి. విశ్వప్రేమ మనిషిని ఎంత పైకి తీసుకొని వెళ్లగలదో తెలుసుకోగలిగాను. ఈ సమయంలోనే నాకు మరో ఏసు కుటుంబంతో పరిచయం కలిగింది. వారి మాట ప్రకారం ప్రతి ఆదివారం వెస్లియస్ చర్చికి వెళ్లసాగాను. అచ్చటికి వెళ్లినప్పుడల్లా వారింట్లోనే విందు తీసుకోమని ఒక్కసారే నాకు వారు చెప్పివేశారు. ఆ చర్చిలో ప్రవచనం నిస్సారంగా వుండేది. అచటి మండలి భక్త మండలి కాదు. వారంతా ఐహిక చింతకులు. లోకాచారం కోసం, విశ్రాంతి కోసం వారు చర్చికి వెళ్లేవారు. నాకు అక్కడ నిద్ర వస్తూ వుండేది. అలా నిద్రపోవడం నాకు చిన్నతనంగా వుండేది. కాని నాతోబాటు కునుకు తీసే మిత్రులు కొందరుండటంవల్ల నా చిన్నతనం తగ్గిపోయింది. ఈ స్థితి నాకు నచ్చలేదు. చివరికి అక్కడికి వెళ్లడం మానుకున్నాను.
నడుస్తు నడుస్తూ వున్న ఆ కుటుంబం పొత్తు అంతటితో ఆగిపోయింది. యిక రావద్దని ఆ కుటుంబం వారు చెప్పినట్లు భావించవచ్చు. ఆ ఇల్లాలు చాలా మంచిది. రుజువర్తన కలది. అయితే ఆమెది సంకుచిత స్వభావం. మా పని ఎప్పుడూ మత చర్చయే. నేనప్పుడు ఆర్నాల్డుగారి “Light of Asia” చదువుతూ వున్నాను. అప్పుడు ఒక పర్యాయం బుద్ధునికి, ఏసుకు గల తారతమ్యాన్ని గురించి చర్చ వచ్చింది. నేను యిలా అన్నాను.
“అమ్మా! చూడు బుద్ధునిదయ! అది మనుష్యులతో ఆగక సకల భూతముల దాకా వ్యాపించింది. అతని భుజం మీద సంతోషంతో కూర్చున్న మేకపిల్ల చిత్తరువు కండ్ల యెదుట కనబడితే హృదయం ప్రేమతో నిండిపోతుంది. కాని ఏసులో యీ విధమైన సర్వభూత వ్యాప్తమగు దయ కనబడదు.” ఆమె మనస్సు చివుక్కుమంది. నేను యిది గ్రహించాను. ప్రసంగం అంతటితో ఆపివేశాను. భోజనానికి లేచాము. ఆమె కుమారుడు ఐదేండ్లవాడు. నవ్వు ముఖం గలవాడు. అట్టి పిల్లవాడు దగ్గరవుంటే నాకు మరొకరితో మాట్లాడనవసరం ఉండదు. మేమిద్దరం చిరకాల మిత్రులం. పిల్లవాడి పళ్ళెంలో మాంసం ముక్క వుంది. దాన్ని చూచి నేను అతణ్ణి ఎగతాళి పట్టించాను. నా చేతిలో వున్న రేగుపండు అతనికి చూపించి “చూడు యిది దానికంటే ఎంత బాగుందో” అని అన్నాను. ఆ బాలుడు అమాయకుడు. అతడు నాతో కలిసిపోయాడు. నీ పండే బాగుంది అని అంటూ నాతో అనడం, యిద్దరం నవ్వుకోవడం ప్రారంభించాం.
ఇది చూచి ఆ పసివాడి తల్లి నొచ్చుకుంది. నాకు హెచ్చరిక లభించినట్లనిపించింది. వెంటనే ప్రసంగం మార్చివేశాను. మరుసటి ఆదివారం కూడా జంకుతూ జంకుతూనే వారింటికి వెళ్లాను. నేను అక్కడికి పోవడం మానుకోదలచలేదు. అది మంచిదని నేననుకోలేదు. కాని ఆమె నా పనిని తేలికచేసింది. ఆమె యిలా అన్నది “గాంధీ! నేనొక్క మాట చెబుతాను. వేరే విధంగా భావించవద్దు. నీ స్నేహం మా పిల్లవాడికి కూడదు. యిప్పుడు వీడు ప్రతిరోజూ మాంసం తిననని మారాం చేస్తున్నాడు. నీ వాదాన్ని ప్రతిసారి చెప్పి పండ్లు తెచ్చి పెట్టమని అంటున్నాడు. దీన్ని నేను సహించలేకపోతున్నాను. మాంసం తినకపోతే జబ్బు చేయదు కాని చిక్కి శల్యమైపోతాడు. నేను అట్టి స్థితిని భరించగలనా? నీవు యిట్టి చర్చలు పెద్దవాళ్లమైన మాతో చేయడం మంచిది కాని పిల్లవాడితో చేయవద్దు. దీనివల్ల పిల్లలు పాడైపోతారు”
ఆమె మాటలు వినేసరికి నాకు బాధ కలిగింది. యిలా అన్నాను - “అమ్మా! నాకు చాలా విచారంగా వుంది. నాకూ పిల్లలున్నారు. తల్లిదండ్రుల భావాలు నాకు తెలియవా? యిక మీకు యిట్టి కష్టం కలుగనీయను. ఇది చాలా సులభం కూడా. నేను చెప్పిన మాటల కంటే నేను తినే వస్తువులు తినకుండా వదిలివేసే పదార్ధాలు చూచినప్పుడు పిల్లవాని మనస్సుకు అవి హత్తుకుంటాయి. అందువల్ల యీనాటి నుండి నేను మీ యింటికి రావడం మానుకుంటాను. అదే యిందుకు తగిన చికిత్స అని అనిపిస్తూ వుంది. అయితే దీనివల్ల మన స్నేహానికి భంగం రాదు, రాకూడదు”
“మీ మాటలు చాలా బాగున్నాయి” అలాగే చేయండి అని ఆ గృహిణి అమిత సంతోషంతో అన్నది. 23. ఇంటి వ్యవస్థ
ఇంటి వ్యవస్థ చక్కదిద్దడం ఇంటి భారం వహించడం నాకు క్రొత్త కాదు. అయితే బొంబాయి, లండను యందలి కాపురానికీ, నేటాలు యందలి నా కాపురానికి వ్యత్యాసం వుంది. నేటాలులో గృహవ్యయం పూర్తిగా ప్రతిష్టకోసం ఇండియన్ బారిస్టరు ప్రతిష్టకు తగినట్లు, భారతీయుల ప్రతినిధికి తగినట్లు చేయవలసి వచ్చింది. అందువల్ల పట్టణంలో మంచి చోట ఒక అందమైన చిన్న గృహం అద్దెకు తీసుకున్నాను. అవసరమైన ఉపకరణాలన్నీ అందులో వున్నాయి. భోజన వ్యయం మితం చేయాలని భావించాను. కాని అప్పుడప్పుడు ఆంగ్ల మిత్రుల్ని, నాతో బాటు పనిచేసే భారతీయుల్ని విందుకు పిలుస్తూ వుండటం వల్ల ఖర్చు అధికంగా జరగుతూ వుండేది.
ప్రతి సంసారంలోను ఒక పనివాణ్ణి నియమించుకోక తప్పదు. అయితే ఎవరినైనా ఒక వ్యక్తిని సేవకునిలా ఎలా వుంచాలో నాకు యిప్పటికీ తెలియదు. నాతోబాటు ఒక మిత్రుడు వుండేవాడు. మరో వంటవాడు ఇంటివానివలె వుండేవాడు. ఆఫీసులో గుమాస్తాలు మా గృహంలో భోజనం చేసి నివసిస్తూ వుండేవారు.
మా సంసారం యీ విధంగా బాగానే సాగిందని చెప్పగలను. అయినా మా సంసారంలో కొన్ని కటు అనుభవాలు కూడా కలిగాయి. నా మిత్రుడు మంచి తెలివి గలవాడు. నా యెడ విశ్వాసం కలవాడని నేను అతణ్ణి పూర్తిగా నమ్మాను. కాని నేనే మోసపోయాను. ఆఫీసు గుమాస్తా ఒకడు నా గృహంలో వుండేవాడు. నా మిత్రునికి అతనిపై అసూయ పుట్టింది. నా గుమాస్తా మీద నాకు అనుమానం కలిగేలా మిత్రుడు ఒక పన్నాగం పన్నాడు. ఆ గుమాస్తాది విచిత్రమైన స్వభావం. నేను తనను అనుమానిస్తున్నానని అతడు గ్రహించి పని మానటమే గాక నా యింటికి రావడం కూడా మానుకున్నాడు. నాకు అతని విషయమై విచారం కలిగింది. అతనికి అన్యాయం చేశానేమోనన్న భావం నాకు కలిగింది.
ఇంతలో మా వంటవాడు ఏకారణం చేతనో సెలవు తీసుకున్నాడు. మిత్రుల సేవా శుశ్రూషల కోసం నేను మరో వంటవాణ్ణి నియమించాను. ఆతడు సెలవులో వెళ్లినందున మరొకణ్ణి నియమించవలసి వచ్చింది. ఈ క్రొత్తవాడు అల్లరివాడు అని తరువాత తెలిసింది. కాని నా దృష్టిలో అతడు దేవుడు పంపిన దూతయే.
నా యింట్లో నాకు తెలియకుండా జరుగుతున్న దుష్కార్యాలను వచ్చిన రెండు మూడు రోజుల్లోనే గ్రహించి క్రొత్త వంటవాడు నన్ను హెచ్చరించడానికి పూనుకొన్నాడు. మంచివాడనని, ఎవరేం చెబితే అది నమ్ముతానని నాకు పేరు వచ్చింది. అట్టి నా యింట్లోనే దుర్గంధం వ్యాప్తి కావడం చూచి మా వంటవాడు ఆశ్చర్యపడిపోయాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు నా భోజనం. ఆఫీసు నుండి ఆ సమయానికి యింటికి వెళ్లడం నాకు అలవాటు.
ఒకనాడు పన్నెండుగంటల వేళ ఆ వంటవాడు ఆఫీసుకు రొప్పుకుంటూ వచ్చి “ఒక తొందర పని వుంది. మీరు వెంటనే యింటికి రావాలి” అని అన్నాడు “ఇప్పుడెట్లా? పనేమిటో చెప్పు. ఆఫీసు వదలి యింటికి రావలసిన అవసరం ఏం వచ్చిందో చెప్పు” అని అన్నాను.
“మీరిప్పుడు యింటికి రాకపోతే తరువాత ఎందుకు వెళ్లకపోతినా అని విచారపడతారు. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను”.
అతడంత గట్టిగా చెప్పేసరికి ఇంటికి బయలుదేరాను. వంటవాడు ముందు నడిచి నన్ను మేడ మీదకు తీసుకువెళ్లాడు. నా మిత్రుని గదిని చూపించి తలుపులు తెరచి మీరే చూడండి ఏం జరుగుతున్నదో అని అన్నాడు.
నాకు అంతా బోధపడిపోయింది. తలుపుతట్టాను. సమాధానం ఎలా వస్తుంది? గట్టిగా తలుపు మీద బాదాను. గోడలు కూడా కదలిపోయినంత పని అయింది. తలుపులు తెరచుకున్నాయి. లోపల ఒక వేశ్య. వెళ్లిపో యిక ఎప్పుడూ యీ గుమ్మం తొక్కవద్దు అని చెప్పి ఆమెను పంపించివేశాను.
“ఈ క్షణాన్నుండి నీతో నా కెట్టి సంబంధం లేదు. నేను బుద్ధి మాంద్యం వల్ల మోసపోయాను. నా విశ్వాసాన్ని యిలా పటాపంచలు చేశావు” అని అరిచాను. నాయీ మాటలకు పశ్చాత్తాప పడవలసిన మిత్రుడు తద్విరుద్ధంగా వ్యవహరించి చూడు! నీ రహస్యాలన్నీ బయట పెడతా అని బెదిరించాడు. “నాకు రహస్యమేమీ లేదు. నా సంగతంతా చాటిచెప్పు. నీవు తక్షణం ఇల్లు విడిచి వెళ్లిపో” అని గద్దించాను.
అతడు యింకా కొంచెం బిరుసెక్కాడు. అతణ్ణి సంబాళించడం కష్టమని భావించాను. క్రింద వున్న గుమాస్తాను పిలిచాను. నీవు వెంటనే పోలీసు సూపరింటెండెంటు గారి దగ్గరకి వెళ్లి నా నమస్కారం తెలియజేయి. నా యింట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి విశ్వాసఘాతుకం చేశాడు. అతడు నా యింట్లో వుండటం నాకు యిష్టంలేదు. కాని అతడు యిక్కడి నుండి కదలడం లేదు. తమ మద్దతు కోరుతున్నాను అని నా ప్రార్ధనగా చెప్పు అని అన్నాను. అంతవరకు లొంగని అపరాధి యిక తనను పోలీసులకు అప్పగిస్తానని గ్రహించాడు. తప్పు అతణ్ణి భయపెట్టింది. అతడు శరణు జొచ్చి పోలీసులకు చెప్పవద్దని బ్రతిమిలాడడమే గాక, ఇల్లు వదిలి వెళతానని అన్నాడు. తరువాత ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.
ఈ ఘట్టం నన్ను మేల్కొలిపింది. ఆ దుష్ట మిత్రునివల్ల మోసపోయానను విషయం అప్పటికి గాని నాకు బోధపడలేదు. మంచికి పోయి చెడ్డను కొని తెచ్చుకున్నట్లయింది. తుమ్మ కొమ్మన గులాబీ పూలు పూస్తాయని భావించానన్న మాట. అతని నడవడి మంచిది కాదని నాకు తెలుసు. అయినా నా దగ్గర తప్పు చేయడని భావించాను. అతని నడవడిని బాగు చేద్దామని భావించి నేను చెడులో పడిపోయాను. ఈ విషయమై నాశ్రేయోభిలాషులు చెప్పినా నేను వినలేదు. మోహంలో పడి గ్రుడ్డి వాడినయ్యాను.
ఈ దుర్ఘటన నా కళ్లు తెరిపించింది. లేకపోతే నాకు సత్యం బోధపడేది కాదు. నేనతని వలలో పడిపోయివుంటే నేనిప్పడు తలపెట్టిన ఏకాంత జీవనం ప్రారంభించి యుండేవాణ్ణి కాదు. నా సమయమంతా అతని కోసం ఖర్చు చేసేవాణ్ణి. నన్ను అంధకారంలోకి నెట్టి చెడ్డ మార్గం పట్టించగల శక్తి అతనికి వుంది. కాని దేవుడు రక్షించిన వాణ్ణి ఎవడేమి చేయగలడు? నా మనస్సు పరిశుద్ధం కావున తప్పు చేసినప్పటికీ రక్షణ పొందాను. మొట్టమొదటనే కలిగిన యీ అనుభవం భవిష్యద్విషయాలలో నన్ను జాగరూకుణ్ణి చేసింది.
భగవంతుడే యీ వంటవానిని ప్రేరేపించి యుండవచ్చు. అతడు నిజానికి వంట చేయలేడు. అతడెంతో కాలం నా యింట్లో వుండలేడు. అతడు దప్ప మరొక రెవ్వరూ నా కండ్లు తెరవలేరు. ఆ వేశ్య యిక్కడికి రావడం యిది మొదటిసారి కాదట. అంత ధైర్యం ఆ వంటవానికి తప్ప మరెవ్వరికీ లేదు. ఆ మిత్రునిపై నాకు అపరిమిత విశ్వాసమనీ, ఆ నా విశ్వాసానికి అవధులు లేవని అందరికీ తెలుసు. వంటవాడు యీ విషయం తెలుపుటకే కాబోలు నా దగ్గరకు వచ్చి “అయ్యా నేను మీ యింట్లో వుండలేను. మీరు సులభంగా మోసపోతారు. యిది నాకు తగిన చోటుకాదు.” అని చెప్పి వెంటనే వెళ్లిపోయాడు.
నేను కూడా అతణ్ణి వుండమని పట్టుపట్టలేదు. వెనక వెళ్ళిపోయిన గుమాస్తా మనస్సును విరిచింది కూడా ఈ మిత్రుడే అని నాకు అప్పుడు తెలిసింది. ఆ గుమాస్తాకు నేను చేసిన అన్యాయాన్ని తొలగించుటకు చాలా ప్రయత్నించాను. అతని విషయంలో నేను చేసిన దానికి ఇప్పటికీ నాకు విచారమే. నేను గుమాస్తాను సంతృప్తిపరచలేక పోయాను. ఎంత సరిచేద్దామన్నా అతుకు అతుకేగదా!
24. తిరుగు ప్రయాణం
నేను దక్షిణ ఆఫ్రికాకు వచ్చి మూడేండ్లు గడిచిపోయాయి. నాకు అక్కడి ప్రజల సంగతులు బాగా తెలిశాయి. 1896వ సంవత్సరంలో ఆరు నెలల సెలవు కావాలని కోరాను. అక్కడ చాలా కాలం నేను ఉండవలసియున్నది. నాకు అక్కడ మంచి ప్రాక్టీసు కూడా వున్నది. అక్కడి వాళ్లకు నాతో చాలా పని పడింది. అందువల్ల నేను ఒక పర్యాయం యింటికి వెళ్లి భార్యాపిల్లల్ని చూడాలి. దక్షిణ - ఆఫ్రికా భారతీయుల స్థితిగతులను గురించి బాగా ప్రచారం చెయ్యాలి. అందువల్ల భారతీయుల అభిమానం సంపాదించడానికి వీలు చిక్కుతుంది. మూడు పౌన్ల పన్ను వ్యవహారం పెద్ద వ్రణం వంటిది. అది మానేదాకా శాంతించుటకు వీలులేదు. అయితే యిక్కడ నేను లేని సమయంలో కాంగ్రెస్ వ్యవహారాలు, విద్యాసంఘం పని ఎవరు చూస్తారు? నా దృష్టిలో ఇద్దరు వ్యక్తులు వున్నారు ఒకరు ఆదంజీ మియాఖాన్, రెండవవారు పార్సీ రుస్తుంజీ. అప్పటికి వర్తకుల్లో చాలామంది కార్యకర్తలు బయలుదేరారు. కాని కార్యదర్శి భారం నియము పూర్వకంగా నిర్వహించువారు, దక్షిణ - ఆఫ్రికా భారతీయుల అభిమానానికి పాత్రులైనవారు వీరిద్దరే. కార్యదర్శికి ఆంగ్ల భాషాజ్ఞానం అవసరం. నేను ఆదంజీ మియాఖాన్ గారి పేరు కాంగ్రెస్ వారికి సూచించాను. వారు అతణ్ణి కార్యదర్శిగా అంగీకరించారు. అతణ్ణి కార్యదర్శిగా ఎన్నుకోవటం అత్యుత్తమమైన విషయమని అనుభవం వల్ల తేలింది. ఆదంజీమియాఖాన్ గారి ఉద్యోగదక్షత, వారి ఉదార హృదయం, వారి మంచితనం, వారి వివేకం కార్యదర్శి పదవికి వారిని అర్హునిగా చేశాయి. ఆ పదవికి ఏ బారిష్టరో లేక ఇంగ్లీషు వచ్చిన ఏ గొప్పవాడో అవసరమన్న భావాన్ని కూడా వారి నియామకం తొలగించి వేసింది. 1896 వ సంవత్సరంలో నేను కలకత్తాకు బయలుదేరిన పోన్‌గోలా స్టీమరెక్కి ఇండియాకు బయలుదేరాను.
ఆ స్టీమరులో ఎక్కువమంది ప్రయాణీకులు లేరు. వారిలో ఇద్దరు ఇంగ్లీషు యాత్రికులు వున్నారు. వారితో నాకు మైత్రి ఏర్పడింది. ఒకనితో రోజూ నేను ఒక గంట సేపు చదరంగం ఆడుతూ వున్నాను. ఆ స్టీమరులోని డాక్టరు తమిళ భాషా శిక్షణ అను పుస్తకం యిచ్పాడు. దానిని చదవడం ప్రారంభించాను.
నేటాలులో వుండగా మహమ్మదీయులతో పరిచయం ఏర్పరచుకొని ఉర్దూ భాష, మదరాసు వారితో పరిచయం చేసుకొని తమిళ భాష నేర్చుకోవాలని భావించాను. ఉర్దూ నేర్చుకోవాలని భావించి డెక్కుమీద నున్న యాత్రికుల్లో ఉర్దూ మున్షీ ఎవరైనా వున్నారేమోనని విచారించాను. ఒక మున్షీ దొరకగా ఆయన వద్ద మా ఉర్దూ చదువు బాగానే సాగింది. నాతోబాటు ఒక ఆంగ్ల ఉద్యోగి కూడా ఉర్దూ నేర్చుకోవడం ప్రారంభించాడు. అతడి జ్ఞాపకశక్తి గొప్పది. ఉర్దూ అక్షరాలు గుర్తించటం నాకు కష్టమైంది. కాని అతడు ఒక్క సారి అక్షరం చూచాడో యిక దాన్ని మరచిపోడు. నేను చాలా కష్టపడ్డాను, కాని అతణ్ణి మించలేకపోయాను.
అరవం నాకు బాగానే వచ్చింది. గురువులేడు. అయినను గురువు అవసరం లేనంతగా ఆ తమిళ భాషా శిక్షణ వ్రాయబడింది. ఇండియాకు వచ్చిన తరువాత తమిళం బాగా నేర్చుకోవాలని భావించాను. కాని సాధ్యం కాలేదు.
1893వ సంవత్సరం దాటిన తరువాత నేను పనులన్నీ జైళ్లలోనే చేశాను. అరవం దక్షిణ ఆఫ్రికా జైల్లో నేర్చుకున్నాను. ఉర్దూ యరవాడ జైల్లో నేర్చుకున్నాను. అరవం మాత్రం మాట్లాడే అభ్యాసం నాకు కలుగలేదు. చదవడం వచ్చినా వాడకం లేనందున అది తుప్పు పట్టినట్లు అయింది. ఇందుకు కడు విచారంగా వుంది. దక్షిణ ఆఫ్రికాయందలి మద్రాసు సోదరులకు నేనంటే ప్రాణం. నాకు వారెల్లప్పుడూ గుర్తుకు వస్తూ వుంటారు. ఎక్కడైనా తమిళుడుగాని, తెలుగువాడు కాని కనిపించితే వారిశ్రద్ధ, వారి స్వార్ధ త్యాగం గుర్తుకు రాకుండా వుండవు. వారంతా నిరక్షరులు. అక్షరం రానివారే అక్కడి పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాటం బీదల కోసం సాగింది. పోరాటం జరిపినవారు పూర్తిగా బీదవారే.
అమాయకులు, యోగ్యులగు భారతీయుల హృదయాన్ని చూరగొనడానికి నాడు వారి భాష రాకపోవడం అడ్డంకి కాలేదు. వారికి హిందుస్తానీ ఇంగ్లీషు కొద్దికొద్దిగా వచ్చు. అందువల్ల మా పనికి అడ్డంకి కలుగలేదు. వారి ప్రేమకు బదులుగా అరవం నేర్చుకోవాలని భావించాను. నాకు అరవం కొంత కొంత అర్ధం అవుతుంది. ఇండియాలో తెలుగు నేర్చుకుందామని ప్రయత్నించాను. కాని తెలుగులో అక్షరాలు దాటి చదువు ముందుకు సాగలేదు.
ఈ విధంగా అరవం, ఆంధ్రం చక్కగావచ్చే భాగ్యం నాకు కలుగలేదు. బహుశా యిక నేర్చుకోలేనుకూడా. కనుక ద్రావిడులు హిందుస్తానీ, నేర్చుకోగలరని ఆశ పెట్టుకున్నాను. దక్షిణ ఆఫ్రికాలోని మద్రాసు ద్రావిడులు కొద్దిగానో, గొప్పగానో హిందీ మాట్లాడతారు. అయితే దేశభాషాపఠనం వల్ల తమ ఆంగ్ల భాషా జ్ఞానానికి ఇబ్బంది కలుగుతుందేమోనని ఇంగ్లీషు వచ్చినవాళ్లు మాత్రమే భావిస్తున్నారు. దేశ భాషల్ని వారే ఆదరించడం లేదు. శాఖాచంక్రమణం చేశాను. సింహావలోకనం చేసి నాప్రయాణ కథను ముగిస్తాను. పొంగోలా స్టీమరు కెప్టెనును గురించి చెప్పడం మిగిలివుంది. మేము మిత్రులం అయ్యాము. అతడు ప్లీమత్ సోదర సంప్రదాయం వాడు. సముద్రయానాన్ని గురించిన ప్రసంగం కంటే ఆధ్యాత్మిక ప్రసంగమే మా మధ్య జరుగుతూ వుండేది. అతడు నీతికి, జ్ఞానానికి (ధర్మానికీ) భేదం కల్పించేవాడు. అతని దృష్టిలో బైబిలు బోధ శిశుక్రీడ వంటిది. భాషా సౌలభ్యాన్ని బట్టి దాని గొప్పతనం అపారం. బాలురుగాని, స్త్రీలుగాని, పురుషులు గాని జీససునందును, అతని బలిదానము నందును విశ్వాసం వుంచితే వారి పాపాలు నశించిపోతాయి. యిది ఆయన మాటల సారం. అతని పరిచయం ప్రెటోరియాలోని ప్లీమత్ సోదరుణ్ణి గుర్తుకుతెచ్చింది. నీతి యెడ విధి నిషేధాలు గల ఏమతమైనా అతని దృష్టిలో పనికిమాలినదే. ఇంత చర్చకు కారణం శాకాహారమే. మాంసం, ముఖ్యంగా గోమాంసం నేనెందుకు తినకూడదు? భగవంతుడు శాకాల వలెనే పశు పక్షుల్ని కూడా మనుష్యుని ఆనందం కోసం, ఆహారం కోసం సృజించలేదా? ఇట్టి ప్రశ్నల వల్ల మేము ఆధ్యాత్మిక ప్రసంగంలోకి దిగక తప్పలేదు.
ఈ విధంగా 24 రోజులు నా ఆనందయాత్ర సాగింది. హుగ్లీనది సౌందర్యం చూచుటకు కలకత్తా రేవులో ఓడదిగాను. ఆనాడే రైల్లో బొంబాయి బయలుదేరాను.
25. హిందూదేశంలో
కలకత్తా నుండి బొంబాయికి వెళ్లేదారిలో మధ్య ప్రయాగ ఉంది. అక్కడ రైలు 45 నిమిషాలు ఆగుతుంది. ఆ సమయంలో పట్నం చూడాలని కోరిక కలిగింది. అదీగాక ఒక మందు కావలసి వచ్చింది. మందులు అమ్మే కెమిస్టు అర్ధ నిద్రావస్థలో వున్నాడు. మందివ్వడానికి బాగా ఆలస్యం చేశాడు. నేను స్టేషను చేరేసరికి రైలు బయలుదేరింది. ఆ స్టేషను మాష్టరు మంచివాడు. నాకోసం ఒక్క నిమిషం సేపు రైలును ఆపివుంచాడు. అయితే నేను రాకపోవడం చూచి నా సామాను క్రిందికి దింపించివేశాడు.
కెల్‌సర్ హోటల్లో ఒక గది తీసుకొని ఆ పట్నంలో వెంటనే నా పని ప్రారంభించాను. ప్రయాగయందలి “పయోనీర్” అను పత్రిక యొక్క ఖ్యాతిని గురించి వినియున్నాను. భారతీయుల కోరికలకు వ్యతిరేకంగా ఆ పత్రిక వ్రాస్తూ వుంటుందని విన్నాను. అప్పుడు డాక్టరు చేజనీగారు ఆ పత్రికకు ఉపసంపాదకులని గుర్తు. అన్ని పక్షాల వారి సాయం నాకు అవసరమని భావించి ఆయనకు ఒక చీటీ పంపించాను. రైలు బండి యివాళ తప్పిపోయిందనీ, రేపు వెళ్లడం అవసరమనీ, అందువల్ల యీ రోజు అవకాశం యిస్తే తప్పక మీ దర్శనం చేసుకుంటానని ఆ చీటీలో వ్రాశాను. మంచిది రండి అని వెంటనే సమాధానం వచ్చింది. నాకు సంతోషం కలిగింది. ఆ ఆంగ్లేయుడు నా మాటలన్నీ విన్నాడు. “మీరు వ్రాసినదంతా చదివి నేను నా పత్రికలో టిప్పణి వ్రాస్తాను. అయితే మీ విధానాన్నంతటినీ నేనంగీకరించలేను. ఎందువల్లననగా నేటాలులోని భారతీయుల కోరికలను గురించి, అక్కడి తెల్లవారి అభిప్రాయాలను కూడా నేను పూర్తిగా తెలుసుకోవాలిగదా!” అని అన్నాడు.
‘మీరు విషయాలన్నింటిని సంపూర్తిగా చదివి మీ పత్రికలో చర్చిస్తే చాలు. న్యాయం తప్ప నాకు మరొకటి అవసరం లేదు’ అని నేను అన్నాను. మిగిలిన సమయం త్రివేణీ సంగమ సౌందర్యం గురించి యోచించుటకు గడిచిపోయింది. పయోనీరు అధికారితో నా యీ ఆకస్మిక కలయికయే నేటాలు రాష్ట్రంలో నేను పడిన యాతనలకు బీజారోపణం చేసిందని తరువాత తెలిసింది.
అక్కడినుండి బొంబాయిలో దిగకుండా తిన్నగా రాజకోటకు వెళ్లాను. దక్షిణ - ఆఫ్రికాయందు నివసిస్తున్న భారతీయుల్ని గురించి ఒక చిన్న పుస్తకం వ్రాయాలని నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకం వ్రాయడానికి, ప్రచురించడానికి ఒక మాసం పట్టింది. దాని పైన పచ్చరంగు అట్ట వుండటం వల్ల దానికి పచ్చ పుస్తకం అని పేరు వచ్చింది. అందు దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులన్నీ వర్ణించాను. కావాలని చాలా విషయాలు తగ్గించి వ్రాశాను. గతంలో వ్రాసి ప్రకటించిన రెండు కరపత్రాల కంటే యిందు సరళభాషను ఉపయోగించాను.
పదివేల ప్రతులు ప్రకటించాను. హిందూదేశంలోని అన్ని పత్రికలకు, అన్ని పక్షాల నాయకులకు పంపించాను. అందరికంటే ముందు పయోనీరు పత్రికాధిపతి తన సంపాదకీయ వ్యాసంలో దీన్ని గురించి చర్చించాడు. ఆ వ్యాస సారాంశం రూటరు ద్వారా ఇంగ్లాండు చేరింది. అక్కడ నుండి ఆ సారాంశానికి సారాంశం నేటాలు కూడా చేరింది. అందు మూడు పంక్తుల కంటే ఎక్కువలేదు. నేటాలులోని భారత ప్రజలు పడుతున్న భాధలను గురించి నేను వ్రాసిన వ్యాసానికి అది కొద్ది సంస్కరణ అన్నమాట. అందలి శబ్దాలు నావికావు. ఈ వార్త నేటాల్లో ఎంతపని చేసిందో తరువాత మీకు బోధ పడుతుంది. పేరున్న పత్రికలన్నింటిలో నా వ్యాసాన్ని గురించి టీకలు, టిప్పణీలు ప్రకటితమయ్యాయి. ఈ పుస్తకాలన్నింటికి కాగితాలు చుట్టి పోస్టులో పంపడం శ్రమతో కూడిన పని. ధనవ్యయం కూడా అధికం. అందుకు ఒక ఉపాయం కనిపెట్టాను. చుట్టుప్రక్కల గల పిల్లల్ని పిలిచాను. బడిలేని ప్రొద్దుటి పూట నాకు సాయం చేయమని వారిని కోరాను. వారు అంగీకరించారు. వారి శ్రమకు బదులుగా ముద్ర కొట్టిన తపాళా బిళ్లలు, ఆశీర్వాదాలు అందజేస్తానని చెప్పాను. పిల్లలు ఆడుతూ పాడుతూ ఆ పని పూర్తిచేశారు. చిన్న చిన్న పిల్లల్ని స్వయం సేవకులుగా తయారుచేయడం నా జీవితంలో యిదే ప్రథమం. ఆనాటి బాలమిత్రులలో ఇద్దరు నాతోబాటు యిప్పటికీ పనిచేస్తున్నారు.
ఆ రోజుల్లో బొంబాయిలో విపరీతంగా ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఎటు చూచినా గగ్గోలే. రాజకోటలో కూడా యిది ప్రవేశించిందని భయం పట్టుకున్నది. ఆరోగ్య విషయంలో మంచి నిపుణుణ్ణి అని నా భావం. నేను స్వచ్ఛంద సేవ చేస్తానని తెలియజేశాను. ప్రభుత్వం వారు వెంటనే అంగీకరించి నన్ను రోగపరీక్షా సంఘంలో ఒక సభ్యునిగా నియమించారు. పాకీ దొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని నేను గట్టిగా చెప్పాను. బీదవాళ్ళు తమ పాకీ దొడ్లు పరీక్షించుటకు వ్యతిరేకంగా లేరు. మేము సూచించిన సంస్కరణలన్నింటినీ జనం అమలులోకి తెచ్చారు. యిక ధనవంతుల విషయం. మేము వారి దొడ్లు పరీక్షిస్తామంటే వాళ్లు అంగీకరించలేదు. యిక సంస్కరణలు ఎలా జరుగుతాయి? ధనికుల పాకీదొడ్లు పాడుగా వున్నాయని అనుభవంవల్ల తెలిసింది. అంతా చీకటిమయం. తేమ ఊరుతూ వుంటుంది. దుర్గంధం విపరీతం. కూర్చునే చోట లుకలుకలాడుతూ పురుగులు. జీవితంలో యిదే నరకం అని అనిపించింది. అమిత బాధ కలిగింది. మేము చెప్పిన సంస్కరణలు బహుసులభం. మలం నేల మీద పడకుండా బొక్కెనలు వుంచమని చెప్పాం. నేల మీద పడి తేమ పుట్టించకుండా మూత్రం మరో బొక్కెనలో నింపమని చెప్పాం. పాకీ దొడ్లకు బయటి గోడలకు మధ్యగల కట్టడాలను కూల్పించివేశాము. గాలి, వెలుగు పాకీ దొడ్లలోకి బాగా వచ్చేలా చేసి శుభ్రం చేసేందుకు పాకీ వారికి సౌలభ్యం కలిగించాం. అయితే చాలామంది ధనికులు చివరి సలహాను అంగీకరించలేదు. కొంతమంది ధనికులు అసలు సంస్కరణలు అమలు చేయుటకు సిద్ధ పడలేదు.
ఈ సంఘం మాల పల్లెలకు కూడా వెళ్లి వాళ్ల దొడ్లను చూడాలని నిర్ణయించింది. ఎవ్వరూ మావెంట రావటానికి సిద్ధం కాలేదు. ఒక్కడు మాత్రం నాతోబాటు రావడానికి అంగీకరించాడు. మాలపల్లెకు వెళ్లడం, అక్కడి పాకీదొడ్లు చూడటం అంటే అందరికీ ఒక విధమైన ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయం ఎవ్వరూ కలలోనైనా ఊహించి యుండరన్నంత పని అయింది. మాలవాడకు వెళ్లడం నాకు అదే మొదలు. వాళ్ల యిళ్లు చూచి నేను నివ్వెరబోయాను. వాళ్లు కూడా మమ్మల్ని చూచి ఆశ్చర్యంతో చకితులైనారు. మీ పాకీ దొడ్లు చూచేందుకు వచ్చాం అని నేను అన్నాను. “మాకేమిటి పాకీ దొడ్లేమిటి. మేము బయటకి పోతాం. మీ వంటి గొప్పవారికేనండీ పాకీ దొడ్లు” అని వాళ్లన్నారు. “మేము మీ ఇల్లు చూడవచ్చునా?” “అయ్యా. తప్పక చూడవచ్చు. అడ్డులేదు. మీకిష్టమొచ్చిన చోట చూడండి. అయ్యా, మా ఇళ్లా? యివన్నీ బొరియలండీ బొరియలు” అని అన్నారు.
నేమ లోపలికి వెళ్లి వాళ్ల యిళ్లు ముంగిళ్లు చూచాను. ఇళ్లు ఆవు పేడతో అలికి వున్నాయి. కుండలు, చట్లు అన్నీ శుభ్రంగా వుండి నిగనిగలాడుతూ వున్నాయి. ఈ ప్రదేశంలో ప్లేగు భయం లేదు. ఇక గొప్పవారి పాకీ దొడ్లను గురించి వర్ణించడం అవసరం. అది ఒక భాగ్యశాలిది. ప్రతి గదికి తూములు వున్నాయి. వీటి తూములు, మూత్రపు తూములు కూడా అవే. అందువల్ల దుర్గంధం అపరిమితంగా ఉన్నది. ఇంట్లో మేడ మీద పడక గది వుంది. దానికి ఒక తూము వుంది. మల మూత్రాలకు అది ఒక్కటే మార్గం. ఆ తూము నుండి నేలకు ఒక గొట్టం అమర్చబడింది. ఇక్కడ నిలబడితే ముక్కు పగిలిపోవలసిందే. ఆ యింట్లో వాళ్లు అక్కడ ఎలా వుంటున్నారో ఎలా నిద్రిస్తున్నారో పాఠకులే ఊహించుకొందురుగాక.
మా బృందంవారు వైష్ణవాలయం కూడా చూచేందుకు వెళ్ళారు. అక్కడి పెద్ద పూజారికి, గాంధీ కుటుంబానికి చాలా కాలం నుండి స్నేహ సంబంధాలు వున్నాయి. దేవాలయమంతా చూపించడానికి, సంస్కరణల్ని అమలుపరచడానికి ఆయన అంగీకరించాడు. ఆ దేవళంలో ఆయన కూడా ఎన్నడూ చూడని ఒక చోటు మా కంటబడింది. పుల్లాకులు, ఊడ్చిన పెంట అక్కడ పడవేస్తారు. కాకులకు, గ్రద్దలకు అది నిలయం. పాకీ దొడ్లు పాడుగా వున్నాయని చెప్పనక్కరలేదు. రాజకోటలో ఎంతోకాలం నేను వుండలేదు, అందువల్ల ఆయన దాన్ని ఎంత వరకు బాగుచేయించాడో నాకు తెలియదు.
దేవాలయంలో దుర్గంధం చూచి చాలా బాధపడ్డాను. దేవాలయం పవిత్రమైనదని మనం భావిస్తాం. అక్కడ ఆరోగ్య విధులు పాటింపబడాలని ఆశిస్తాం. స్మృతి కర్తలు బాహ్యాంభ్యంతర శుద్ధి అత్యావశ్యకమని ఎంతగానో ఉద్ఘోషించారు. ఆ విషయం సర్వులకు తెలియడం ఎంత అవసరమో అప్పుడు బోధపడింది. 26. రాజభక్తి
నాకు రాజభక్తి అధికం. అంతటి రాజభక్తి మరొకరికి వుందని నేను అనుకోను. సత్యం మీద నాకు గల స్వాభావికమగు ప్రేమయే యిట్టి రాజభక్తికి కారణమని భావిస్తున్నాను. ఇట్టి రాజభక్తి విషయంలోగాని, మరే విషయంలో గాని నటన అనునది నాకు చేతకాదు. నేటాలులో నేను పాల్గొనే ప్రతి సభలోను జనం గాడ్ సేఫ్ ది కింగ్ అను పాట పాడి వెళ్లిపోతూ వుండేవారు. వారితో కలిపి పాడటం నా విధియని భావించేవాణ్ణి. బ్రిటిష్ పరిపాలనా దోషాలు నాకు తెలుసు. బ్రిటీష్ పరిపాలకుల యొక్క నీతి మొత్తం మీద మేలైనదని భావించేవాణ్ణి.
దక్షిణ - ఆఫ్రికాలో గల వర్ణద్వేషం బ్రిటీష్ వారి సంప్రదాయం కాదని నా భావం. అందువల్ల రాజభక్తిలో తెల్లవారిని కూడా మించిపోయాను. గాడ్ సేవ్ ది కింగ్ అను పాట కూడా నేర్చుకున్నాను. అందరూ లేచిపాడుతూ వున్నప్పుడు నేను కూడా లేచి నిలబడి ఆ పాట పాడుతూ వుండేవాణ్ణి. రాజభక్తి అవసరమని ప్రతి సమయంలోను నేను స్పష్టంగా ప్రకటిస్తూ వున్నాను.
జీవితంలో నేను ఎన్నడూ నా రాజభక్తిని అమ్ముకోలేదు. దాని ద్వారా ఎన్నడూ స్వప్రయోజనం సాధించాలని భావించలేదు. రాజభక్తి ఒక విధియని భావించాను. దానివల్ల ప్రతిఫలం నేనెన్నడూ ఆశించలేదు. పొందలేదు. నేను ఇండియాకు వచ్చిన రోజుల్లో విక్టోరియా రాణి “డైమండ్ జూబ్లీ” మహోత్సవం ఆరంభమైంది. రాజకోటలో ఏర్పాటుచేయబడ్డ ఒక సంఘంలో చేరమని నాకు పిలుపు వచ్చింది. నేను అంగీకరించాను. ఆ ఉత్సవం కూడా పైన పటారం లోన లొటారమే. అంతా మోసం. చాలా బాధపడ్డాను. ఆ సంఘంలో సభ్యునిగా వుండటమా, మానడమా అను ప్రశ్న బయలుదేరింది. చివరికి యోచించి యోచించి ‘పనిలో మాత్రం సత్యంగా వ్యవహరిద్దాం’ అను నిర్ణయానికి వచ్చాను.
ఆ ఉత్సవాల్లో చెట్లు నాటటం ఒక కార్యక్రమం. చాలా మంది డాబు కోసం, పై అధికారుల మెప్పుకోసం, మొక్కలు నాటుతూ వున్నారని తెలిసింది. చెట్లు నాటడం ఒక విధి కాదు, అందువల్ల దీనికి బదులు మరో కార్యక్రమం చేపట్టమని వారికి మరీ మరీ చెప్పి చూచాను. కాని వాళ్ళు నా మాటను పట్టించుకోలేదు. నా పాలబడిన మొక్కను మాత్రం జాగ్రత్తగా నాటి, నీరు పోసి పెంచినట్లు గుర్తు. మా పిల్లలకు కూడా గాడ్ సేవ్ ది కింగ్ అను పాటను నేర్పాను. రాజకోట యందలి ట్రైనింగ్ కళాశాల విద్యార్థులకు కూడా యీ పాట నేర్పినట్లు గుర్తు. కాని అది జూబిలీలోనో లేక ఎడ్వర్డు పట్టాభిషేక సమయంలోనో సరిగా చెప్పలేను. కాని తరువాత ఆ పాటను నేను వ్యతిరేకించాను. నా మనస్సునందు ఆ హింసను గురించి చర్చ అధికమైన కొద్దీ నేను జాగ్రత్తపడ్డాను.
“రాజ శతృవులను చంపుము ఆ మోసగాండ్ర మోసాలను ద్రుంపుము” అను పాటయందలి వాక్యాలు నాకు గిట్టలేదు. నా మిత్రుడు డాక్టరు బూధ్ గారికి నాయీ సంశయం తెలియజేశాను. ఆయన కూడా అంగీకరించి అహింసావాది ఎవ్వరూ ఇందుకు అంగీకరించరని, అట్టివారు దీన్ని పాడటం కష్టమని అన్నారు. ఈ పాటలో శతృవులని ఊహించబడిన వారు మోసగాండ్రని ఎలా అనగలం? శతృవులైనంత మాత్రాన తప్పంతా వారిదేనా? పరమేశ్వరుని వద్ద మనకు న్యాయం లభించును కదా! డాక్టరు బూధుగారు నా వాదాన్ని సమర్ధించడమే గాక వారి సమాజంలో ఈ పాటకు బదులు మరో పాటను రచించి గానం చేయసాగాడు.
రాజభక్తితో బాటు రోగులకు ఉపచారం చేయడం నాకు అలవాటు అయిపోయింది. మిత్రులైనా, పరులెవరైనా వారికి ఉపయోగపడటమంటే నాకు ఎంతో ప్రీతి.
రాజకోటలో దక్షిణ - ఆఫ్రికాను గురించి కరపత్రం వ్రాస్తున్నప్పుడు నేను ఒక పర్యాయం బొంబాయి వెళ్లవలసి వచ్చింది. పెద్ద పెద్ద పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి యీ విషయమై ప్రజాభిప్రాయం సేకరించాలని నా అభిలాష. అందుకు ముందుగా బొంబాయిని ఎన్నుకొన్నాను. జడ్జీ రేవడేగారిని కలసి మాట్లాడాను. నేను చెప్పిందంతా విని, చివరికి ఫిరోజ్‌షా మెహతాగారిని చూడమని చెప్పారు.
తరువాత జడ్జీ బదురుద్దీన్ తైయబ్జిగారిని చూచాను. వారు కూడా అదే విధంగా చెప్పి “రేనడేగారు, నేనూ ఏమీ చేయలేము. మాస్థితి నీకు తెలుసు. ప్రజా వ్యవహారాల్లో మేము కల్పించుకోకూడదు. నీ పనికి మేము అనుకూలురం. యీ విషయంలో నీకు సాయం చేయగల వారు ఫిరోజ్ షా మెహతాగారొక్కరే” అని చెప్పారు.
నేను ఫిరోజ్ షా మెహతా గారి దర్శనం చేసుకోవాలని మొదటనే భావించాను. ఈ పెద్దలు వారి సాయం పొందమని చెప్పడం వల్ల ప్రజల్లో వారికి ఎంత పలుకుబడి వున్నదో బోధపడింది. నేను వారి దగ్గరికి వెళ్లి వారిని కలిశాను. వారిని చూచేసరికి కళ్లు మిరిమిట్లుగొన్నంత పని అయింది. వారి పేరుతో బాటు ప్రచారంలో వున్న బిరుదులు చాలా విన్నాను. బొంబాయి కేసరి అని, మకుటంలేని బొంబాయి పాదుషా అని బిరుదులు వారికి పున్నాయి. కాని బొంబాయి పాదుషా అనుకున్నంత భయంకరంగా లేడు. పితృవాత్సల్య భావంతో ఎదిగిన కుమారుణ్ణి ఆదరించినట్లు ఆయన నన్ను ఆదరించాడు. మేమిద్దరం వారి గదిలో కూర్చున్నాం. మిత్రులు, అనుయాయులు ఆయన చుట్టూ ఉన్నారు. వారిలో డి ఇ వాచాగారొకరు. కామాగారు మరింకొకరు. ఆ యిద్దరికీ నేను పరిచయం చేయబడ్డాను. లోగడ వాచాగారిని గూర్చి విని వున్నాను. అతడు మెహతాగారికి కుడిభుజం. ఆయన లెక్కల్లో గట్టివాడని వీరచంద్ గాంధీ చెప్పారు. మనిద్దరం కలిసి మాట్లాడాలి అని వాచాగారన్నారు.
రెండు నిమిషాల్లో యిదంతా జరిగింది. మెహతాగారు నేను చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు. నేను రనడే గారిని, తైయబ్జీగారిని చూచానని వారికి చెప్పాను. “గాంధీ! ముందుగా ఒక పని జరగాలి. నీ పనికి నేను తప్పక సహాయం చేస్తాను” అని మెహతాగారు వెంటనే తన కార్యదర్శి మున్షీగారిని పిలిచి సభాదినం నిర్ణయించమని అన్నారు. సభాదినం నిశ్చితమైంది “సభ రేపు జరుగుతుందనగా నీవు నాకొక్కసారి కనపడు” అని మెహతాగారు నన్ను పంపివేశారు. వారి సంభాషణ విన్న తరువాత నాకు భయం పోయింది. సంతోషంతో ఇంటికి చేరాను.
మా బావ బొంబాయిలోనే వున్నాడు. ఆయనను చూచేందుకు వెళ్లాను. ఆయన జబ్బుపడి వున్నాడు. బీదవాడు. నా సోదరి వల్ల ఆయనకు ఉపచారం జరగడం కష్టంగా వుంది. నాతో రాజకోటకు రమ్మని అన్నాను. అతడు అంగీకరిచాడు. నా సోదరిని, బావను తీసుకొని రాజకోట చేరాను. వ్యాధి ఎక్కువైంది. రాత్రింబవళ్ళు ఆయనకు ఉపచారం చేశాను. రాత్రిళ్లు మేలుకొని వుండవలసి వచ్చింది. ఆయనకు ఉపచారం చేస్తూనే దక్షిణ ఆఫ్రికాను గురించి వ్రాస్తూ వున్నాను. చివరికి ఆయన కన్నుమూశాడు. తుదికాలంలో ఆయనకు ఉపచారం చేసే అవకాశం లభించినందున నా మనస్సుకు శాంతి లభించింది.
ఈ విధంగా రోగులకు ఉపకరించాలనే కోరిక ముందు ముందు బాగా ఎక్కువైంది. రోగుల సేవలో వున్నప్పుడు నా మిగతా పనుల విషయంలో జాగ్రత్తపడుతూ వుండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు నా భార్యనేగాక యింటివారందరినీ ఆ పనులకు వినియోగిస్తూ వుండేవాణ్ణి. ఈ ప్రవృత్తిని నేను కోరిక అని అంటాను. ఏ మంచిపని అయినా సకాలంలో ఉపయోగపడితే అది తక్షణం ఆనందం కలిగిస్తుంది. అది నా అనుభవం. దంభంతో లేక పరభీతితో చేసే పని చివరికి అతణ్ణి అణచివేస్తుంది. అట్టివాళ్లు మాసిపోతారు. ఏ సేవ హృదయానికి ఆనందం కలిగించదో అది సేవచేసేవానికి, సేవ చేయించుకొనే వానికి కూడా ఆహ్లాదం కలిగించదు. సేవ ముందు భోగాలు, ధనోపార్జన మొదలుగా గల కోరికలన్నీ తుచ్ఛమైనవిగా తోస్తాయి.
27. బొంబాయిలో
మా బావ కన్నుమూసిన మరునాడే నేను బొంబాయి వెళ్లవలసి వచ్చింది. ఉపన్యాసం సిద్ధం చేసేందుకు తగినంత వ్యవధి దొరకలేదు. రాత్రింబవళ్ళు నిద్రలేకపోవడం వల్ల నాకు ఒంట్లో బాగుండలేదు. గొంతు బొంగురుపోయింది. అయినా దేవుడి మీద భారం వేసి బొంబాయికి బయలుదేరాను. ఉపన్యాసం వ్రాసుకు వెళ్లాలని నేను కలలోనైనా ఊహించలేదు.
సర్ ఫిరోజ్‌షా మెహతాగారి ఆదేశానుసారం సభకు ఒకరోజు ముందు అయిదు గంటలకు ఆఫీసులో వారి దర్శనం చేసుకున్నాను.
“గాంధీ! నీ ఉపన్యాసం వ్రాసి సిద్ధం చేశావా?” అని అడిగారు. “లేదు ఆశువుగా ఉపన్యసిస్తాను” అని బెదురుతూ జవాబిచ్చాను. “బొంబాయిలో యిది చెల్లదు. పత్రికలకు, దేశ దేశాంతరాలకు ఉపన్యాస విషయం పంపేవారు వారి యిష్టానుసారం మార్చి పంపుతారు. మన సభవల్ల ప్రయోజనం జరగాలంటే ఉపన్యాసం వ్రాసి సిద్ధం చేసుకోవడం అవసరం. ఆ ఉపన్యాసాన్ని తెల్లవారే లోగా ముద్రించాలి. అయితే యీ రాత్రికి ఉపన్యాసం సిద్ధం కాదా?” అని అడిగారు. నేను కంగారుపడ్డాను. తరువాత చిత్తం అని అన్నాను.
“వ్రాత ప్రతి కోసం మున్షీగారిని మీ దగ్గరకి ఎన్ని గంటలకు పంపమంటారో చెప్పండి” అని బొంబాయి కేసరి అడిగారు. “రాత్రి 11 గంటలకు” అని సమాధానం యిచ్చాను. మెహతాగారు మున్షీని పిలిచి రాత్రి 11 గంటలకు గాంధీ దగ్గరకు వెళ్లి ఉపన్యాస ప్రతి తీసుకో, ప్రెస్సులో ముద్రణకు యిచ్చి తెల్లవారేసరికి ముద్రిత ప్రతులు మన చేతుల్లో ఉండేలా చూడు అని ఆజ్ఞాపించి నన్ను యింటికి పంపించివేశారు.
మర్నాడు సభకు వెళ్ళాను. ఫిరోజ్‌షా మెహతాగారు ఉపన్యాసం వ్రాసి చదువమని ఎంత దూరదృష్టితో చెప్పారో నాకు బోధపడింది. ఫ్రాంజీకావన్‌జీ ఇన్‌స్టిట్యూట్ హాలులో సభ జరిగింది. ఫిరోజ్‌షా మెహతాగారి సభ జరిగితే నిలబడడానికి కూడా హాలులో చోటు దొరకదని విన్నాను. వారి ఉపన్యాసం అంటే విద్యార్థులు చెవి కోసుకుంటారు.
అంతమంది జనంతో కిటకిటలాడిన సభను చూడటం నాకు అదే మొదటిసారి. నా కంఠధ్వని ఎవ్వరికీ వినబడలేదు. భయపడుతూ భయపడుతూ కంఠం పెద్దది చేశాను. ఫిరోజ్‌షాగారు బిగ్గరగా, ఇంకా బిగ్గరగా అని అంటూ నన్ను మధ్య మధ్య ప్రోత్సహించారు. వారు ప్రోత్సహించిన కొద్దీ నా కంఠం కుంచించుకుపోసాగింది.
ఇంతలో నా పాత మిత్రుడు కేశవరావు దేశపాండే గారు వచ్చి ఆదుకున్నారు. నా ఉపన్యాసం వారి చేతుల్లో వుంచాను. అతని కంఠం సభకు సరిపోయే రకంగా లేదు. సభ్యులెవరు వింటారు? “వాచా, వాచా” అని కేకలు సభలో వినబడ్డాయి. అప్పుడు వాచాగారు లేచి దేశపాండేగారి చేతిలోని కాగితాలు తీసుకొని నా పని పూర్తిచేశారు. సభ నిశ్శబ్దం అయింది. శ్రోతలు చివరివరకు శ్రద్ధగా విన్నారు. విషయాన్ని బట్టి ‘సిగ్గు, సిగ్గు’ అని అరిచారు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. నాడు ఎంతో సంతోషం కలిగింది.
సర్‌ఫిరోజ్‌షా మెహతాగారు నా ఉపన్యాసాన్ని ప్రశంసించారు. నాకు గంగాస్నానం చేసినట్లనిపించింది. దేశ పాండేగారు, మరో పారసీ గృహస్తుడు నాకు పూర్తిగా సాయం చేయటానికి సిద్ధపడ్డారు. ఆ పారసీ మిత్రుడు పెద్ద ప్రభుత్వ ఉద్యోగి. అందువల్ల ఆయన పేరు వ్రాయడానికి జంకుతున్నాను. యీ యిద్దరూ దక్షిణ - ఆఫ్రికాకు వస్తామని మాట యిచ్చారు. కాని అప్పుడు స్మాల్ కాజ్ కోర్టు జడ్జియగు సి.ఎం ఖర్‌సేర్‌జీ వీరి మాటల్ని బూటకం చేశారు. దీనికి కారణం ఒక పారసీ మహిళ. అతడు ఆమెను పెండ్లి చేసుకోవడమే మంచిదని భావించాడు. యీ మిత్రుని వాగ్దాన భంగానికి నేటాలులోని పారసీ రుస్తుంజీ ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. యిప్పుడు అనేకమంది పారసీ మహిళలు ఖద్దరు ప్రచారానికి పూనుకొని ఆ పారసీకుని దోషానికి తాము ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. నేనా దంపతుల్ని సంతోషంతో అభినందించాను. యిక దేశపాండే గారికి పెండ్లి ఆశలేదు. కాని అతడు కూడా రాలేకపోయాడు. నేడు అతడు కూడా అందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు.
నేను దక్షిణ - ఆఫ్రికాకు బయలుదేరినప్పుడు జింజాబిరులో ఒక తైయబ్జీ వంశజుడు కనబడ్డాడు. అతడు కూడా నాకు సాయపడతానని అన్నాడు. కాని అలా చేయలేదు. అందుకు అబ్బాస్ తైయబ్జీగారు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. యీ విధంగా బారిస్టరు మిత్రులను దక్షిణ - ఆఫ్రికాకు తీసుకొని వెళ్లాలని నేను చేసిన మూడు ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సందర్భంలో సేస్తన్‌జీ పాదుషాగారు నాకు బాగా గుర్తు వస్తున్నారు. నేను ఇంగ్లాండులో వున్నప్పటి నుండి మా యిద్దరికీ స్నేహం. మేము మొదట లండనులో ఒక శాకాహారశాలలో కలుసుకున్నాము. యితని తమ్ముడు బరజో-రజీపాదుషా గారిని నేను ఎరుగుదును. అతనికి వెర్రివాడని పేరు వచ్చింది. మేమెన్నడూ ఒకచోట ఉండలేదు. మిత్రులు అతనికి చక్రం (నిలకడలేక గిర్రున తిరిగే చక్రం వంటి వాడు) అని పేరు పెట్టారు. గుర్రాల బగ్గీ ఎక్కడం తప్పని భావించి ఇతడు ట్రాము బండి ఎక్కడం కూడా మానుకున్న రకం. శతావధానికి అవసరమైన ధారణాశక్తి వున్నప్పటికీ ఏ డిగ్రీ అతడు పుచ్చుకోలేదు. స్వయంకృషితో స్వాతంత్ర్యం అలవరచుకున్నాడు. పుట్టింది పారసీకుల్లోనైనా, పేరులేదు. ఇతని బుద్ధి వైభవం ప్రఖ్యాతం. ఇంగ్లాండులో కూడా ఇతనికి మంచి ప్రఖ్యాతి ఉండేది. మా ఇద్దరి మైత్రికి మూలకారణం శాకాహారమే. అతనితో బుద్ధి వైభవంలో పోటీ పడటం నా తరం కాదు.
అతని చిరునామా బొంబాయిలో వెతికి సంపాదించాను. పేస్తన్జీ హైకోర్టులో ఉద్యోగం చేస్తూ వున్నాడు. అప్పుడతడు పెద్ద గుజరాతీ నిఘంటువు తయారుచేస్తున్నాడు. దక్షిణ - ఆఫ్రికాలోని ఉద్యమానికి సహాయపడమని ఎంతో మందిని కోరాను. పేస్తవన్జీ పాదుషా తాను ఎట్టి సాయం చేయనని చెప్పడమేగాక, నీవు కూడ తిరిగి దక్షిణ ఆఫ్రికాకు వెళ్లవద్దని గట్టిగా చెప్పాడు.
“నేను నీకు సాయం చేయలేను. నీవు తిరిగి దక్షిణ - ఆఫ్రికా వెళ్లడం మంచిది కాదని నా అభిప్రాయం. మనదేశంలో చేయవలసిన పని కరువైందా? మనం మాతృభాషకు చేయవలసిన పని తక్కువగా వున్నదా? నేనిప్పుడు విజ్ఞాన శాస్త్రానికి భాష వెతుకుతున్నాను. మనం చేయవలసింది ఎంతో వుంది. దాని ముందు దక్షిణ - ఆఫ్రికా వ్యవహారం ఎంత? లొడితెడు. దేశ దారిద్ర్యం చూడు. దక్షిణ ఆఫ్రికాలో భారతీయులు చిక్కుల పాలై వుండటం యదార్థమే, కాని నీ వంటివాడు దానికి బలి కావడం నాకు ఇష్టంలేదు. మనం స్వరాజ్యం సంపాదిద్దాం. అప్పుడు దక్షిణ - ఆఫ్రికాలో వున్న భారతీయులకు తేలికగా సహాయపడవచ్చు. నిన్ను మార్చలేనని నాకు తెలుసు. కాని నీతోపాటు మరొకరిని తీసుకొనిపోవడం నాకు సమ్మతం కాదు” అని స్పష్టంగా చెప్పివేశాడు.
నాకీ ఉపదేశం రుచించలేదు. కాని యీ సంభాషణ వల్ల ఆయన యెడ నాకు ఆదరం పెరిగింది. అతని దేశప్రేమ మరియు భాషా ప్రేమను చూచి ముగ్దుడనయ్యాను. ఈ ప్రసంగం వల్ల మా మైత్రి యింకా సుదృఢమైంది. ఆయన ఉద్దేశ్యం నేను గ్రహించాను. కాని నేను దక్షిణ - ఆఫ్రికా ఉద్యమం మానుకోవడానికి బదులు మరికొంచెం ఉధృతం చేశాను. ఏ దేశభక్తుడూ దేశసేవలో ఏ దేశాన్ని మరువలేడు కనుకనే నాకు క్రింది గీతాశ్లోకం సదా జ్ఞాపకం వస్తూ వుండేది.
"శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్
స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః"
(గీత. 3వ అధ్యాయం 35 వ శ్లోకం)
“పరధర్మాన్ని అనుష్టించడం కంటే గుణములేనిదైనను స్వధర్మాన్నే అనుష్టించడం మంచిది. స్వధర్మం నిర్వహిస్తూ చచ్చినా మేలే, పరధర్మం భయావహం”
28. పూనాలో
సర్ ఫిరోజ్‌షా మెహతా గారు నా పనిని సులభం చేశారు. బొంబాయి నుండి నేను పూనా వెళ్లాను. పూనాలో రెండు పక్షాలున్నాయని నాకు తెలుసు. నాకు అన్ని పక్షాలవారి సాయం అవసరం. లోకమాన్యుని దర్శించాను. “అన్ని పక్షాల సాయం కావాలని నీవు భావించడం మంచిది. ఈ విషయంలో ఎవ్వరికీ అభిప్రాయ భేదం వుండదు. కాని యిందుకు సభాపతిగా తటస్థుడు కావాలి. మీరు ప్రొఫెసర్ భండార్కరు గారిని దర్శించండి. వారు యిప్పుడు సభలకు రావడం మానుకున్నారు. ఏ సభలకూ రావడం లేదు. కాని మీ సభకు అంగీకరిస్తారని భావిస్తున్నాను. వారిని కలిసాక పర్యవసానం ఏమైందో నాకు తెలుపండి. నేను సంపూర్తిగా మీకు సాయం చేయాలని కోరుతున్నాను. మీరు ప్రొఫెసరు గోఖలేగారి దర్శనం చేయండి. నన్ను చూడటం అవసరం అయితే మీకు వీలు అయినప్పుడల్లా తప్పక వచ్చి నన్ను కలవండి” అని లోకమాన్యుడు అన్నారు. లోకమాన్యుని చూడటం నాకు అదే ప్రథమం. వారు యింత లోకప్రియులెట్లా అయినారో అప్పుడు నాకు తెలిసింది.
అక్కడ నుండి నేను గోఖలేగారి దగ్గరకి వెళ్లాను. వారు పెర్గుజన్ కాలేజీలో పున్నారు. నన్ను అమిత ఆప్యాయంగా చూచారు. ఆత్మీయుణ్ణి చేసుకున్నారు. వారితో పరిచయం కూడా ప్రథమ పర్యాయమే. నాకు ప్రధమ పర్యాయమే పరిచయం ఆయినా అది ప్రథమ పరిచయం అనిపించలేదు. ఎప్పటినుండో పరిచయం ఉన్నట్లు అనిపించింది. సర్‌ఫిరోజ్‌షా మెహతాగారు హిమాలయం, లోకమాన్యుడు సముద్రం, గోఖలే గంగ. ఇందు స్నానం చేయడం సులభం. హిమాలయంపై ఎక్కడం కష్టం. సముద్రంలో దిగాలంటే భయం కాని గంగ ఒడిలో ఆడుకోవచ్చు. దానిలో నావమీద పయనించవచ్చు. బడిలో చేర్చుకునేప్పుడు పిల్లవాణ్ణి పరీక్షించినట్లు గోఖలేగారు నన్ను పట్టి పట్టి పరీక్షించారు. ఎవరెవరి దర్శనం చేయాలో, ఎట్లా చేయాలో వివరంగా చెప్పారు. నా ఉపన్యాసం ఒకసారి చూస్తానని అన్నారు. కాలేజీ అంతా చూపించారు. “మీరు యిష్టం వచ్చినప్పుడు వచ్చి నన్ను కలవండి. ప్రొఫెసరు భండార్కరు గారిని కలసిన తరువాత ఏమైందో నాకు చెప్పండి అని సెలవిచ్చారు. గోఖలేగారు జీవించియున్నంత కాలం రాజనీతి విషయాల్లో నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించారు. కన్నుమూసిన తరువాత కూడా వారు ఆ విధంగా నా హృదయాన్ని ఆక్రమించేవున్నారు. మరెవ్వరూ ఇంతగా నా హృదయాన్ని ఆక్రమించలేదు. కుమారుణ్ణి తండ్రి ఏవిధంగా ఆదరిస్తాడో ఆవిధంగా ప్రొఫెసర్ భండార్కరు గారు నన్ను ఆదరించారు. రెండు జాములప్పుడు నేను వెళ్లి వారిని కలిశాను. శాస్త్రాలలో పరిశ్రమ చేసిన ఆ పండితునికి నేను ఆ సమయంలో కూడా పని చేయడం ఆనందం కలిగించింది. తటస్థుడైన సభాధ్యక్షుడు కావలయునను నా పట్టుదలను విని అది మంచిది మంచిది అను మాటలు వారి నోట సహజంగా వెలువడ్డాయి.
నా మాటలు పూర్తి అయ్యాక వారు యిట్లా అన్నారు. “నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టడం లేదని ఎవర్ని అడిగినా చెబుతారు. కాని మిమ్మల్ని విముఖుణ్ణి చేయలేను. మీ వాదం న్యాయమైనది. మీ ఉద్యమం స్తుత్యం. మీ సభకు నేను రాను అని అనలేను. శ్రీయుతులు తిలక్‌గారిని, గోఖలే గారిని దర్శించారు. మంచిపని చేశారు. ఈ యిరుపక్షాలవారూ నన్ను ఆహ్వానిస్తే వస్తాను. సమయ నిర్ణయానికి నన్ను అడగవలసిన పని లేదు. వారికెప్పుడు అనుకూలమో నాకు అప్పుడే అనుకూలం. మీకు ధన్యవాదాలు, ఆశీర్వాదాలు”
చడీచప్పుడు గాకుండా ఆడంబరం లేకుండా ఆ విద్వాంసులు, ఆ మహాత్యాగులు సభ జరిపి నన్ను ప్రోత్సహించి పంపారు.
నేనక్కడి నుండి మద్రాసు వెళ్లాను. మద్రాసు ప్రజలు నా రాక విషయం తెలిసి ఎంతో సంతోషించారు. బాల సుందరం కథ సభను ఆకట్టుకుంది. నా ఉపన్యాసం పెద్దదైంది. అంతా ముద్రిత ఉపన్యాసమే. సభ ఒక్కొక్క శబ్దాన్ని మనస్సుకు పట్టించుకొని విన్నది. సభ ముగిసిన తరువాత పచ్చ పుస్తకం కోసం జనం ఎగబడ్డారు. మద్రాసులో అవసరం అవుతుందని భావించి కొన్ని మార్పులు చేసి మరో 10 వేల ప్రతులు ముద్రింపచేశాను. అవన్నీ వేడి వేడి రొట్టెల్లా అమ్మకం అయ్యాయి. పదివేల ప్రతులు అవసరం లేదనిపించింది. ప్రజల ఉత్సాహం మీదనే నేను ఎక్కువగా ఆధారపడ్డాను. నా ఉపన్యాసం ఇంగ్లీషు వచ్చిన వారికోసం గదా! వారికిన్ని ప్రతులు అక్కరలేదని నా అభిప్రాయం. మద్రాసులో స్టాండర్డు పత్రికా సంపాదకులు, కీర్తి శేషులునగు పరమేశ్వరన్ పిళ్లెగారు నాకు అక్కడ ఎంతగానో సాయం చేశారు. వారు విషయాన్ని చక్కగా చదివారు. అనేకసార్లు తమ ఆఫీసుకు నన్ను తీసుకువెళ్లారు. సలహాలు యిచ్చారు. హిందూ పత్రికాధిపతులు జి. సుబ్రహ్మణ్యంగారి దర్శనం చేసుకున్నారు. డాక్టరు సుబ్రహ్మణ్యం గారి దర్శనం, సానుభూతి లభించింది. పరమేశ్వరన్ పిళ్లెగారు తమ పత్రికల్లో వెంటనే రమ్మని పిలుపు, ఈ విషయాన్ని గురించి నా యిష్ట ప్రకారం వ్రాయుటకు అంగీకరించారు. నేను కూడా వారొసంగిన సౌకర్యాన్ని బాగానే వినియోగించుకున్నాను. సభ పచ్చయప్ప హాల్లో జరిగినట్లు డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు అధ్యక్షత వహించినట్లు గుర్తు.
ఉపన్యాసం ఎక్కువగా ఇంగ్లీషులో జరిగినా, స్వగృహంలో లభించే ప్రేమ, ఉత్సాహం మద్రాసులో నాకు లభించాయి. ప్రేమ, ఛేదించలేని బంధం ఏమీ ఉండదు గదా?
29. వెంటనే బయలుదేరిరమ్మని పిలుపు
మద్రాసు నుండి కలకత్తా వెళ్లాను. కలకత్తాలో నా కష్టాలకు అంతు లేదంటే నమ్మండి. ఆచట గ్రేట్ ఈస్టరన్ హోటల్లో దిగాను. నేనక్కడ ఎవర్నీ ఎరగను. హోటల్లో డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికా ప్రతినిధి మిస్టర్ ఎల్లర్ థార్పుతో పరిచయం కలిగింది. వారి బస బెంగాల్ క్లబ్బులో. వారు నన్ను అచ్చటికి రమ్మని చెప్పారు. అచటి డ్రాయింగ్ రూములో భారతీయులకు ప్రవేశం లేదను సంగతి వారికి తెలియదు. అప్పుడే వారికి ఆ నిషేధం విషయం తెలిసింది. నన్ను వారు తమ గదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ నల్లవారి మీద తెల్లవారు చూపే ఈర్ష్యకు వారు విచారం వ్యక్తం చేశారు. నన్ను లోపలికి తీసుకొని వెళ్లజాలనందుకు క్షమించమని అన్నారు.
వంగ దైవం సురేంద్రనాధ బెనర్జీగారిని దర్శించాలి. వారి దర్శనానికి వెళ్లాను. అప్పుడు వారి చుట్టూ చాలామంది ఉన్నారు. వారు యిట్లా అన్నారు. “మీ మాట యిక్కడ ఎవ్వరూ వినరని నా భయం. మా పాట్లన్నీ మీరు చూస్తున్నారు గదా! అయినా కొద్దో గొప్పో ప్రయత్నించి చూడాలి. యిందుకు మీకు మహారాజుల మద్దతు అవసరం. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధిని చూడండి రాజాసర్ ప్యారమోహన్ ముఖర్జీగారిని, మహారాజా టాగోరు గారిని కలవండి. వీరిరువురు ఉదారులు. సార్వజనిక కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటూ వుంటారు.” అని అన్నారు. నేను ఆసజ్జనుల్ని సందర్శించాను. కాని అక్కడ పప్పులుడకలేదు. యిద్దరూ కలకత్తాలో సభ చేయడం సులభసాధ్యం కాదనీ, ఏమైనా చేయగలిగితే శ్రీ సురేంద్రనాధ బెనర్జీ గారే చేయగలరని చెప్పారు. నా పని కష్టతరం కాసాగింది. అమృత బజార్ పత్రిక ఆఫీసుకు వెళ్లాను. అక్కడ నన్ను చూచిన సజ్జనులంతా నేనొక దేశ దిమ్మరినని భావించారు. వంగవాసి ప్రతికాధిపతి ఇంకో మెట్టు పైకెక్కాడు. అక్కడ ఒక గంట సేపు వేచి వుండవలసి వచ్చింది. ఆయనతో మాట్లాడటానికి చాలామంది వచ్చారు. వాళ్లనందరినీ పంపించిన తరువాత కూడా వారు నన్ను కన్నెత్తి చూడలేదు. ఒక గంట సేపు ఆవిధంగా గడిపాను. చివరికి గత్యంతరం కనబడక నా విషయం చెప్పివేద్దామని ఉద్యుక్తుడనయ్యాను. వెంటనే ఆయన అందుకొని “నాకు ఎన్ని పనులున్నాయో మీకు కనిపించడం లేదా? మీవంటి వాళ్లు యిక్కడ వేలకు వేలు. మీరిక్కడ నుండి వెళ్లిపోవడం చాలా మంచిది. మీ మాట నేను వినదలుచుకోలేదు” అని అన్నాడు. నాకు కొంచెం కోపం వచ్చింది. కాని ఆ సంపాదకుని అవస్థ అర్ధం చేసుకున్నాను. వంగవాసి పత్రికా ఖ్యాతిని గురించి విన్నాను. అక్కడికి వచ్చి పోయే జన ప్రవాహాన్ని కూడా చూచాను. ఆ వచ్చిపోయేవారంతా ఆయనకు పరిచితులు. వారి పత్రికకు వార్తల లోపం లేదు. ఆరోజుల్లో దక్షిణ ఆఫ్రికాను గురించి చాలామంది వినియుండలేదు కూడా. ప్రతిరోజు చాలామంది వచ్చి తమ తమ కష్టాల్ని వారికి వినిపిస్తూ వుండేవారు. ఎవరి కష్టం వారికి ముఖ్యంగదా! వచ్చిన వారంతా సంపాదకునికి ఎదురుగా కూర్చుంటారు. వాళ్లందరినీ ఊరడించడం ఎలా? వారు పత్రికా సంపాదకుని మాటకు గొప్పశక్తి కలదని భావిస్తారు. కాని గడపదాటితే తన మాట చలామణి కాదని ఆ పత్రికా సంపాదకునికి బాగా తెలుసు.
నేను అధైర్యపడలేదు. యితర పత్రిక సంపాదకుల్ని వెళ్లి కలిశాను. నా అలవాటు ప్రకారం ఆంగ్లో ఇండియన్ పత్రికా సంపాదకుల్ని కూడా కలిశాను. నేను వారితో చాలా సేపు మాట్లాడాను. నేను మాట్లాడిందంతా వారు తమ పత్రికలలో ప్రకటించారు. ఇంగ్లీషుమన్ పత్రికా సంపాదకుడు సాండర్సు గారు నన్ను తన మనిషిగా చూచుకున్నారు. తన ఆఫీసును, తన పత్రికను నా వశం చేశారు. దక్షిణ - ఆఫ్రికాను గూర్చి ప్రధాన వ్యాసాల్లో నా యిష్టం వచ్చినట్లు మార్పులు చేయుటకు అంగీకరించారు. వారికి నాకు గొప్ప స్నేహం కుదిరిందని చెప్పడం అతిశయోక్తి కానేరదు. వారు తమ శక్తి కొద్దీ నాకు సాయం చేస్తామని మాట యిచ్చారు. దక్షిణ - ఆఫ్రికాకు వెళ్ళిన తరువాత కూడా తమకు జాబు వ్రాయమని చెప్పారు. నాకు చేతనైనంత చేస్తాను. అని వారు మాట యిచ్చారు. తమ మాటను తుచ తప్పకుండా పాటించారు. ఆరోగ్యం చెడిపోనంతవరకు నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే వున్నారు. నా జీవితంలో అనుకోకుండా ఏర్పడిన ఇటువంటి తీయని స్నేహాలు ఎన్నో వున్నాయి. నా మాటల్లో అతిశయోక్తులు లేకపోవడం, సత్యపరాయణత్వం నిండివుండటం సాండర్సు గారి స్నేహానికి కారణం. వారు నన్ను శల్య పరీక్ష చేశారు. దక్షిణ - ఆఫ్రికాలోని తెల్లవారి దోషాలు ఖండించడంలోను, సుగుణాలు చెప్పడంలోను కూడా నేను వెనుకాడలేదని వారికి బోధపడింది.
ప్రతి పక్షికి న్యాయం చేయడం వల్ల మనం త్వరగా న్యాయం పొందగలమని నా అనుభవం చెబుతూ వున్నది. ఇట్లా తలవని తలంపుగా సాయం చేకూరడం వల్ల కలకత్తాలో కూడా సభ జరుపవచ్చుననే ఆశ కలిగింది. అందుకోసం కృషి చేస్తుండగా దర్బను నుండి ఒక టెలిగ్రాం వచ్చింది. “జనవరిలో పార్లమెంటు సమావేశం జరుగుతున్నది వెంటనే బయలుదేరి రండి” అని ఆ టెలిగ్రాంలో వుంది. ఆ కారణం వల్ల వెంటనే దక్షిణ - ఆఫ్రికా వెళ్లవలసి వున్నదని పత్రికలో ప్రకటించి కలకత్తా విడిచి పెట్టాను. మొదటి స్టీమరులో నాకు ప్రయాణ సౌకర్యం కల్పించమని దాదా అబ్దుల్లా గారి ఏజంటుకు బొంబాయికి తంతి యిచ్చాను. దాదా అబ్దుల్లా గారు “కుర్‌లేండ్” అను స్టీమరు కొన్నారు. దానిలో కిరాయి లేకుండా నన్ను నా కుటుంబ సభ్యుల్ని తీసుకు పోతామని పట్టుపట్టారు. నేను ధన్యవాదాలు చెప్పి అందుకు అంగీకరించాను. కుర్‌లేండ్‌లో నా ధర్మపత్నిని, నాయిద్దరు పిల్లల్ని కీర్తిశేషుడగు మా బావగారి కుమారుణ్ణి తీసుకొని రెండవసారి దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరాను. యీ స్టీమరుతో బాటు “నాదరీ” అను మరో స్టీమరు దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరింది. దీనికి కూడా ఏజంటు దాదా అబ్దుల్లాయే. ఈ రెండు స్టీమర్లలో మొత్తం ఎనిమిది వందల మంది యాత్రికులు వున్నారు. అంతా ట్రాన్సువాలు వెళ్లేవారే.
* * *