సత్యశోధన/మొదటిభాగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మొదటి భాగం

1. జననం

గాంధీ కుటుంబం వారు మొదట పచారు దినుసులు అమ్ముకునేవారని ప్రతీతి. కాని మా తాతగారి పూర్వపు ముగ్గురు పురుషులు కాఠియావాడ్ కు చెందిన కొన్ని సంస్థానాల్లో మంత్రులుగా పని చేశారు. మాతాతగారి పేరు ఉత్తమచంద్ గాంధీ. ఆయనకు ఓతాగాంధీ అని మరో పేరు కూడా ఉండేది. ఆయన గట్టి నియమపాలకుడని ప్రతీతి. తత్ఫలితంగా కొన్ని రాజకీయ కుట్రలకు గురై పోరుబందరు దివాన్ గిరీ విడిచిపెట్టి జునాగఢ్ అను సంస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. అక్కడ ఆయన నవాబుకు ఎడమ చేత్తో సలాం చేశాడట. యీ అవిధేయతకు కారణం ఏమిటని ప్రశ్నించగా కుడిచేయి యిదివరకే పోరుబందరుకు అర్పితమై పోయిందని సమాధానం యిచ్చాడట.

భార్య చనిపోగా ఓతాగాంధీ రెండో పెండ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురు కొడుకులు, రెండవ భార్యకు యిద్దరు కొడుకులు పుట్టారు. ఓతాగాంధీ కొడుకులంతా ఏక గర్భ సంజాతులు కారని బాల్యంలో నాకు తెలియదు. ఆ విషయం యితరుల వల్ల బాల్యంలో తెలుసుకున్నానని కూడా చెప్పలేను. ఆ ఆరుగురు అన్నదమ్ముల్లో అయిదవవాడు కరంచంద్ గాంధీ. ఆయనకు కబాగాంధీ అని మరో పేరు కూడా వున్నది. ఆరవవాడు తులసీదాసు గాంధీ. యీ అన్నదమ్ములిద్దరూ ఒకరి తరువాత ఒకరు పోరుబందరుకు దివానులుగా పనిచేశారు. కబాగాంధీ మా తండ్రి. పోరుబందరు ప్రధానామాత్య పదవిని త్యజించిన తరువాత ఆయన స్థానిక కోర్టులో సభ్యుడుగా పనిచేశారు. తరువాత రాజకోట దివానుగాను, ఆ తరువాత బికానేరుకు దివానుగాను పనిచేశారు. యావజ్జీవితం రాజకోట సంస్థానంలో పింఛను పుచ్చుకున్నారు.

కబాగాంధీకి నాలుగు పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి భార్యకు, రెండో భార్యకు యిద్దరు కూతుళ్ళు పుట్టారు. నాలుగో భార్య పుత్తలీబాయి. ఆమెకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు పుట్టారు. వారిలో నేను చివరివాణ్ణి. నా తండ్రి కులాభిమాని, సత్యప్రియుడు, శూరుడు, ఉదారుడు. కానీ కోపిష్టి. కొంచెం విషయలోలుడని చెప్పవచ్చు. ఎందుకంటే నలభై ఏళ్ళు గడిచాక నాలుగో పెళ్ళి చేసుకున్నారు కదా! ఆయన లంచగొండికాదనీ, ఇంటాబయటా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించే న్యాయశీలి అని ఖ్యాతి గడించారు. ఆయన సంస్థానాభిమానం సర్వవిదితం. ఆయన ప్రభువగు రాజకోటరాజును అసిస్టెంట్ పొలిటికల్ ఏజెంటు ఒకనాడు తూలనాడే సరికి కబాగాంధీ ఆయన్ని ఎదిరించాడు. ఆ ఏజెంటుకు కోపం వచ్చింది. పొరపాటు చేశానని ఒప్పుకొని శరణువేడితే క్షమిస్తానని అన్నాడు. కాని కబాగాంధీ అందుకు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఆయన్ని కొన్ని గంటలపాటు నిర్భందించి ఉంచారు. అయినా ఆయన భయపడలేదు. ఆ తరువాత ఆయనను విడిచి పెట్టారు.

మా తండ్రికి డబ్బు నిల్వ చేద్దామనే తలంపు లేదు. అందువల్లనే మాకు బహు తక్కువ ఆస్థి మిగిలింది. మా తండ్రి చదివింది అయిదవ తరగతి వరకే. చరిత్ర భూగోళం ఆయన ఎరగడు. కాని ఆయన గొప్ప అనుభవజ్ఞుడు. వ్యవహారజ్ఞానంలో దిట్ట. చిక్కు సమస్యల్ని తేలికగా పరిష్కరించడంలో మేటి. కనుకనే వేలాదిమంది జనాన్ని పరిపాలించగల సామర్థ్యం ఆయన గడించాడు. మత సంబంధమైన వాదాలు వినడం వల్ల చాలా మంది హిందువుల వలెనే ఆయనకు ధర్మ పరిజ్ఞానం కలిగింది. మా కుటుంబానికి ఆప్తుడైన ఒక బ్రాహ్మణునిచే ప్రేరణ పొంది చివరి రోజుల్లో గీతా పారాయణం ప్రారంభించారు. ప్రతిరోజూ శ్లోకాలు పఠిస్తూ వుండేవారు.

మా అమ్మ పరమసాధ్వి. ఆ విషయం బాల్యం నుంచే నా హృదయంలో నాటుకుంది. ఈమెకు దైవచింతన అధికం. ప్రతిరోజు పూజ చేయకుండా భోజనం చేసేది కాదు. వైష్ణవ దేవాలయం వెళ్లి రావడం ఆమె నిత్య కార్యక్రమం. ఆమె చాతుర్మాస్య వ్రతం (వర్షరుతువునందు నాలుగు మాసాలు ఒక పూట భోజనం చేయు వ్రతం) మానడం నేను ఎన్నడూ చూడలేదు. ఎన్నో కఠినమైన నోములు నోచి వాటిని నిర్విఘ్నంగా నెరవేరుస్తూవుండేది. జబ్బు చేసినప్పుడు దానిని సాకుగా తీసుకొని నోములు మానడం ఎరుగదు. ఒక పర్యాయం ఆమె చాంద్రాయణం చంద్రుని పెరుగుదలను బట్టి భోజన పరిమాణం పెంచడం, తగ్గించడం అనువ్రతం ప్రారంభించి మధ్యలో జబ్బు పడింది. జబ్బు ఏమాత్రం తగ్గలేదని నాకు గుర్తు. రెండు మూడు రోజుల ఉపవాసమంటే ఆమెకు లెక్కలేదు. చాతుర్మాస్య వ్రతపురోజుల్లో ఒక పూట మాత్రమే భుజించడం ఆమెకు అలవాటు. అంతటితో ఆగక ఒక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి ఒక రోజు ఉపవాసం ప్రారంభించింది. మరొక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి రోజు విడిచి రోజు ఉపవాసం ప్రారంభించింది. మరొక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి సూర్యుని చూచిగానీ భోజనం చేయనని నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో సూర్యదర్శనం అయిందని మా అమ్మకు చెప్పేందుకై పిల్లలమంతా సూర్యుని కోసం నిరీక్షిస్తూ డాబా మీద నిలబడి హఠాత్తుగా సూర్యుడు కనిపించినప్పుడు గబగబా మా అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి “అమ్మా, అమ్మా! సూర్యుడు వచ్చాడు” అని చెప్పిన రోజులు నాకు గుర్తు వున్నాయి. సూర్య దర్శనం కోసం ఆమె పరుగు పరుగున బయటకు వచ్చేది. అంతలో మాయదారి సూర్యుడు మబ్బుల చాటున దాక్కునేవాడు. “ఇవాళ నేను భోజనం చేయడం ఈశ్వరునికి యిష్టం లేదు కాబోలు అని అంటూ ఆమె సంతోషంగా వెళ్ళి ఇంటి పనుల్లో లీనమైపోయేది.

మా అమ్మకు వ్యవహారజ్ఞానం అధికం. సంస్థానానికి సంబంధించిన విషయాలు ఆమెకు బాగా తెలుసు. రాణివాసంలో గల స్త్రీలు మా అమ్మ తెలివితేటల్ని మెచ్చుకునేవారు. బాల్యం తెచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని నేను కూడా మా అమ్మ వెంట తరచు రాణివాసానికి వెళుతూ వుండేవాణ్ణి. రాజమాతకు, మా అమ్మకు మధ్య జరుగుతూ వుండే సరస సంభాషణలు ఇప్పటికీ నాకు గుర్తువున్నాయి. కబాగాంధీ పుత్తలీబాయి దంపతులకు సుదామాపురి అను పోరుబందరులో 1869 అక్టోబరు 2వ తేదీన (శుక్ల సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం) నేను జన్మించాను. పోరుబందర్లో నా శైశవం గడిచింది. నన్ను బడిలో చేర్చడం నాకు గుర్తు ఉంది. ఎక్కాలు వల్లించాలంటే నాకు ఇబ్బందిగా వుండేది. అప్పుడు తోటి పిల్లలతో బాటు మా పంతుల్ని తిట్టడం తప్ప నేను నేర్చిందేమీ గుర్తులేక పోవడాన్ని తలచుకుంటే నా బుద్ధి మందమైనదనీ, నాకు జ్ఞాపకశక్తి తక్కువనీ స్పష్టంగా చెప్పవచ్చు. పిల్లలమంతా అప్పడం పాట పాడేవాళ్ళం. ఆ పాటను ఇక్కడ ఉటంకిస్తున్నాను.

ఒకటే ఒకటి అప్పడం ఒకటి
అప్పడం పచ్చి ... కొట్టో కొట్టు ...

మొదటి ఖాళీ చోట పంతులు పేరు, రెండవ ఖాళీ చోట తిట్టు వుండేవి. వాటిని వ్రాయను.

2. బాల్యం

నా తండ్రి పోరుబందరు వదిలి ప్రభుత్వం వారి స్థానిక కోర్టు సభ్యునిగా రాజకోటకు వెళ్ళినప్పుడు నాకు ఏడేండ్ల వయస్సు. నన్ను అక్కడ ఒక ప్రైమరీ స్కూల్లో చేర్చారు. అక్కడ నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లు, ఇతర విషయాలు నాకు గుర్తు వున్నాయి. పోరుబందరు వలె ఇక్కడ కూడా నా చదువును గురించి వ్రాయవలసిన విషయాలేమీ లేవు. నేను ఒక సామాన్య విద్యార్ధిగా వున్నాను. ఈ స్కూలు నుండి సబర్బను స్కూల్లోను. అక్కడ నుండి హైస్కూల్లోను చేరాను. అప్పటికి నాకు పన్నెండేళ్ళు. ఈ కాలంలో అటు ఉపాధ్యాయులతో కానీ, ఇటు తోటి విద్యార్థులతో కాని అబద్ధాలాడిన గుర్తు లేదు. నాకు సిగ్గు ఎక్కువ. అందువల్ల సమాజాన్ని తప్పించుకు తిరిగేవాణ్ణి. నా పుస్తకాలు, నా పాఠాలు, నా జతగాళ్ళు, వేళకు బడికి పోవడం, బడి మూసివేయగానే పరిగెత్తుకుని ఇంటికి చేరడం ఇదే నా నిత్య కార్యక్రమం. నిజంగా నేను పరిగెత్తేవాణ్ణి. ఇతరులతో మాట్లాడటం అంటే కష్టంగా వుండేది. ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో అని భయంగా వుండేది. హైస్కూల్లో చేరిన మొదటి సంవత్సరం పరీక్షా సమయమప్పుడు జరిగిన ఒక విషయం వ్రాయడం అవసరం. విద్యాశాఖకు చెందిన జైయిల్స్ అను పేరుగల ఒక ఇన్‌స్పెక్టరు మా స్కూలుకు ఇన్‌స్పెక్షన్ కై వచ్చాడు. అతడు మా పిల్లల అక్షరజ్ఞానాన్ని పరీక్షించేందుకై ఐదు శబ్దాలు ఇచ్చాడు. వాటిల్లో కేటిల్ (Kettle) అను శబ్దం ఒకటి. నేను దాన్ని తప్పుగా వ్రాశాను. ఇది గమనించి ఉపాధ్యాయుడు తన బూటుకాలుతో నొక్కి తప్పు దిద్దుకోమన్నట్లు సైగ చేశాడు. కాని నేను దిద్దలేదు. ఎదురుగా వున్న పిల్లవాడి పలక చూచి తపుదిద్దుకోమని సైగ చేశాడు. కాని నేను దిద్దలేదు. ఎదురుగా వున్న పిల్లవాడి పలక చూచి తప్పు దిద్దుకోమని మాష్టారు సైగ చేస్తున్నారన్న విషయం తెలుసుకోలేక పోయాను. ఒకరి పలక మరొకరు చూచి వ్రాయకుండా వుండేందుకే మాష్టారు అక్కడ వున్నారని నా భావం. మిగతా పిల్లలంతా వ్రాసిన ఐదు శబ్దాలు సరిగా వున్నాయి. నేను ఒక్కణ్ణి మాత్రం దద్దమ్మనైనాను. తరువాత మాస్టారు నా మూర్ఖత్వాన్ని నాకు తెలియజేశారు. కానీ ఆయన మాటలు నా మీద పని చేయలేదు. ఇతరుల్ని చూచి వ్రాయడం నేను ఎప్పుడూ నేర్చుకోలేకపోయాను. అయితే ఈ ఘట్టం ఉపాధ్యాయుని పట్ల నాకు గల వినయాన్ని ఏమాత్రం తగ్గించలేదు. పెద్దల దోషాల్ని చూచి కళ్ళు మూసుకోవడం నా స్వభావం. తరువాత కూడా ఆ ఉపాధ్యాయుణ్ణి గురించిన దోషాలు నా దృష్టికి వచ్చాయి. కానీ ఆయన ఎడ నాకు వినయం తగ్గలేదు. నేను పెద్దల ఆజ్ఞ పాలించడమే నేర్చాను గాని వారి పనుల్ని గురించి తర్కించడం నేర్చుకోలేదు. అప్పటి మరో రెండు విషయాలు నా మనస్సుకు హత్తుకుని వుండిపోయాయి. బడి పుస్తకాలు తప్ప యితర పుస్తకాలు చదువుదామనే కోరిక నాకు వుండేది కాదు. రోజువారి పాఠాలు చదవాలి గదా! ఉపాధ్యాయుణ్ణి మోసగించడమంటే నాకు ఇష్టం వుండేదికాదు. ఆయనచే మాట పడడం నాకు ఇష్టం లేక పాఠాలు బాగా వల్లించేవాణ్ణి. అయితే నా మనస్సు మాత్రం పాఠాల మీద నిలిచేది కాదు. యీ విధంగా నా పాఠాలే నాకు సరిగా రానప్పుడు పుస్తకాలు చదవడం సాధ్యమా? ఒకసారి మా తండ్రిగారు కొని తెచ్చిన ఒక పుస్తకం నా కంటపడింది. అది శ్రవణ పితృభక్తి నాటకం. శ్రద్ధగా ఆ పుస్తకం చదివాను. ఆ రోజుల్లో చెక్కల బాక్సుకు అమర్చిన అద్దంలో చిత్రాలు చూపిస్తూ కొందరు ఇంటింటికి తిరుగుతూ వుండేవారు. వాళ్ళు చూపించిన చిత్రాల్లో అంధులగు తన తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోబెట్టుకొని యాత్రకు వారిని మోసుకుపోతున్న శ్రవణుని బొమ్మ నా హృదయం మీద చెరగని ముద్ర వేసింది. అతణ్ణి లక్ష్యంగా పెట్టుకున్నాను. శ్రవణుడు చనిపోయినప్పుడు అతని తల్లిదండ్రుల కరుణవిలాపం యిప్పటికీ నాకు జ్ఞాపకం వున్నది. ఆ లలిత గీతం నన్ను ద్రవింప చేసింది. నా తండ్రిగారు కొని ఇచ్చిన వాద్యం మీద ఆ గీతాన్ని ఆలపించాను కూడా. అప్పుడే ఒక నాటక కంపెనీ అక్కడికి వచ్చింది. వాళ్ళ నాటకం చూచేందుకు నాకు అనుమతి లభించింది. అది హరిశ్చంద్ర నాటకం. ఆ నాటకం నాకు బాగా నచ్చింది. కాని ఎక్కువ సార్లు ఎవరు చూడనిస్తారు! అయినా నా మసస్సులో ఆ నాటకం ప్రదర్శితం అవుతూ వుండేది. కలలో హరిశ్చంద్రుడు కనపడుతూ వుండేవాడు. అందరూ సత్య హరిశ్చంద్రులు ఎందుకు కాకూడదు అని అనుకునేవాణ్ణి. హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు తలచుకుని ఎన్ని ఆపదలు వచ్చినా అంతా సత్యం పలకవలసిందేనని అనుకునేవాణ్ణి. నాటకంలో హరిశ్చంద్రుడు అనుభవించిన కష్టాలన్నీ యదార్థమైనవేనని అనుకొని, హరిశ్చంద్రుని దుఃఖం చూచి, దాన్ని జ్ఞాపకం పెట్టుకుని నేను బాగా ఏడ్చేవాణ్ణి. అతడు ఐతిహాసిక పురుషుడు కాడని యిప్పటికీ నాకు అనిపిస్తుంది. నా హృదయంలో యిప్పటికీ శ్రవణుడు, హరిశ్చంద్రుడు జీవించే వున్నారు. ఆ నాటకం చదివితే యిప్పటికీ నా కండ్లు చమరిస్తాయనే నా నమ్మకం.

3. బాల్య వివాహం

ఈ ప్రకరణం వ్రాయకుండా వుండటం నాకెంతో యిష్టం. కాని కథాక్రమంలో యిట్టి చేదు మాత్రలు ఎన్నో మ్రింగవలసి వచ్చింది. సత్యపూజారిని కదా! వేరే మార్గం లేదు. వ్రాయక తప్పదు. సుమారు పదమూడోయేట నాకు పెండ్లి అయింది. యీ విషయాలు గ్రంథస్థం చేయవలసి వచ్చినందుకు విచారంగా వుంది. అయినా విధి అని భావించి వ్రాస్తున్నాను. నా రక్షణలో వున్న పన్నెండు లేక పదమూడు ఏండ్ల బాలబాలికల్ని చూస్తూ వుంటే నా పెండ్లి సంగతి జ్ఞాపకం వచ్చి నా మీద నాకే జాలికలుగుతూ వుంటుంది. నాకు పట్టిన దౌర్భాగ్యం వాళ్ళకు పట్టలేదు. కనుక వాళ్ళను అభినందించాలని వుంటుంది. పదమూడేళ్ళ వయస్సులో జరిగిన ఈ పెళ్ళిని సమర్థించుకునేందుకు నైతిక కారణం ఒక్కటి కూడా లేదు.

ప్రధానం గురించి వ్రాస్తున్నానని పాఠకులు గ్రహించాలి. కాఠియావాడ్ లో వివాహమంటే ప్రధానం కాదు. ఇద్దరు బాలబాలికలకు పెండ్లి జరపాలని వాళ్ళ తల్లిదండ్రులు చేసుకునే నిర్ణయాన్ని లేక ఒడంబడికను ప్రధానం అని అంటారు. ప్రధానం అనుల్లంఘనీయం కాదు. ప్రధానం అయిన తరువాత పెండ్లికి పూర్వం పిల్లవాడు చనిపోతే ఆ బాలిక వితంతువైపోదు. ప్రధానానికి సంబంధించినంతవరకు వరుడికి, వధువుకి మధ్య సంబంధం ఉండదు. అసలు తమకిరువురికీ ప్రధానం జరిగిందను విషయం కూడా వాళ్ళకు తెలియదు. ఈ విధమైన ప్రధానాలు నాకు వరుసగా మూడు జరిగాయని విన్నాను. అవి ఎప్పుడు జరిగాయో నాకు తెలియదు. ప్రధానం జరిగిన తరువాత ఇద్దరు కన్యలు చనిపోయారని నాకు చెప్పారు. మూడో ప్రధానం ఏడేండ్ల వయస్సులో జరిగినట్లు నాకు గుర్తు. అయితే ప్రధానం జరిగినప్పుడు నాకు ఎవరైనా ఏమైనా చెప్పారో లేదో గుర్తులేదు. పెండ్లి జరిగినప్పుడు వరుడు, వధువు అవసరం అవుతారు. కొన్ని విధులు వారు నిర్వర్తించవలసి వుంటుంది. అట్టి వివాహాన్ని గురించే వ్రాస్తున్నాను. నా పెండ్లికి సంబంధించిన కొన్ని వివరాలు నాకు గుర్తు వున్నాయి.

మేము ముగ్గురు అన్నదమ్ములమని పాఠకులకు గతంలో తెలియజేశాను. మాలో అందరికంటే పెద్దవాడికి పెండ్లి అయిపోయింది. రెండవవాడు నా కంటె రెండు మూడు సంవత్సరాలు పెద్ద. అతడికీ, వయుస్సులో నా కంటే ఒకటి లేక ఒకటిన్నర సంవత్సరం పెద్దవాడైన మా పినతండ్రి చివరికొడుక్కి, నాకు ముగ్గురికీ ఒకేసారి పెండ్లి జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ విషయంలో మా మేలును ఎవ్వరూ ఆలోచించలేదు. మా యిష్టాయిష్టాలను గురించి యోచించే అవకాశమే లేదు. పెద్దవాళ్ళు తమ సౌకర్యం గురించి, పెండ్లి ఖర్చులు తగ్గించడాన్ని గురించి మాత్రమే యోచించారు.

హిందూ సమాజంలో వివాహమంటే సామాన్య విషయం కాదు. వరుడు, వధువుల తల్లిదండ్రులు ఆర్థికంగా తరచు కూలిపోతూ వుంటారు. డబ్బును, సమయాన్ని వ్యర్థం చేస్తారు. పెండ్లి ఏర్పాట్లు ఎన్నో నెలల ముందునుంచే ప్రారంభిస్తారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు సమకూరుస్తారు. విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. పిండి వంటల విషయంలో పోటాపోటీలు ప్రారంభమవుతాయి. కంఠం సరిగా వున్నా లేకపోయినా లెక్క చేయకుండా స్త్రీలు పాటలు పాడి పాడి గొంతు పోగొట్టుకుంటారు. జబ్బు కూడా పడతారు. ఇరుగుపొరుగువాళ్ళ శాంతికి భంగం కలిగిస్తారు. అయితే ఇరుగుపొరుగువాళ్ళు కూడా తమ ఇళ్ళలో శుభకార్యలు జరిగినప్పుడు ఇలాగే చేస్తారు. అందువల్ల గందరగోళం జరిగినా, ఎంగిలిమంగలం అయినా, మురికి పేర్కొన్నా పట్టించుకోరు. సహించి వూరుకుంటారు. ఇంత గొడవ, గందరగోళం మూడుసార్లు జరిపేకంటే ఒక్క పర్యాయమే జరిపితే సౌకర్యం కదా! డబ్బు ఖర్చు తగ్గినా దర్జాకు లోటు వుండదు. మూడు వివాహాలు ఒకే పర్యాయం జరపడం వల్ల డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయవచ్చు. మా తండ్రి, పినతండ్రి ఇద్దరూ వృద్ధులు. మేము వారి చివరి బిడ్డలు. అందువల్ల మా వివాహాలను పురస్కరించుకొని హాయిగా ఆనందించి తమ వాంఛల్ని నెరవేర్చుకోవాలని వారు అనుకోవడం సహజం. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముగ్గురి వివాహాలు ఒకేసారి చేయాలనే నిర్ణయానికి మా పెద్దలు వచ్చారు. ఇంతకు ముందు వివరించినట్లు కొన్ని మాసాల ముందునుంచే ఏర్పాట్లు ప్రారంభమైనాయి.

వాటిని చూచి మా వివాహాలు జరుగుతాయను విషయం ముగ్గురు సోదరులం తెలుసుకున్నాం. కొత్త బట్టలు ధరించడం, మేళతాళాలు మ్రోగడం, గుర్రం మీద ఎక్కడం, రకరకాల పిండిపంటలు తినడం, ఆటలకు, వినోదాలకు ఒక క్రొత్త పిల్ల దొరకడం ఇవి తప్ప మరోరకమైన వాంఛ మాకు వున్నట్లు నాకు గుర్తులేదు. భోగవిలాసాన్ని గురించిన భావం తరువాత కలిగింది. ఎలా కలిగిందో సవివరంగా తరువాత చెబుతాను. కానీ అట్టి జిజ్ఞాస పాఠకులు తగ్గించుకొందురు గాక. నాకు కలిగిన బిడియాన్ని కొంతవరకు దాచుకుంటాను. చెప్పదగిన కొన్ని విషయాలు చెబుతాను. ఆయితే ఆ వివరాలు వ్రాస్తున్నప్పుడు నా అభిప్రాయాన్ని గమనిస్తే అందు విషయవాసనలు తక్కువేనని తేలుతుంది.

మా అన్నదమ్ములిద్దరినీ రాజకోట నుంచి పోరుబందరు తీసుకువెళ్ళారు. అక్కడ మా ఒంటికి నూనె రాశారు. పసుపు మొదలుగా గలవి పూశారు. నలుగు పెట్టారు. మనోరంజకంగా వున్నా అవి వదిలివేయదగినవి. మా తండ్రి దివాను అయినప్పటికీ నౌకరే గరా! రాజుగారికి విశ్వాసపాత్రుడు. అందువల్ల మరింత పరాధీనుడన్నమాట. చివరి నిమిషం వరకు రాజుగారు మా తండ్రికి వెళ్ళడానికి అనుమతి నీయలేదు. రెండు రోజుల తరువాత అనుమతించారు. మా ప్రయాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ విధి నిర్ణయం మరో విధంగా వుంది. రాజకోట పోరుబందరుకు మధ్య 60 క్రోసుల దూరం. ఎడ్లబండి మీద అయిదురోజుల ప్రయాణం, రాజుగారు గుర్రపు బగ్గి ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రయాణం మూడురోజుల్లో ముగుస్తుంది. కాని చివరి మజిలీ దగ్గర గుర్రం బగ్గీ బోర్లపడిపోయింది. మా నాన్నగారికి గట్టి దెబ్బలు తగిలాయి. చేతులకు కట్లు, వీపుకు కట్లు కట్టించుకుని పోరుబందరు చేరారు. దానితో పెండ్లి ఆనందం సగం తగ్గిపోయింది. అయినా వివాహాలు జరిగాయి. పెండ్లి ముహూర్తాన్ని ఆపడం ఎవరితరం? నేను పెండ్లి సంతోషంలో మా తండ్రిగారికి తగిలిన దెబ్బల దుఃఖం మరిచిపోయాను. చిన్నతనం కదా! నేను పితృభక్తికలవాణ్ణి. దానితోపాటు విషయవాంఛలకు కూడా భక్తుణ్ణి అయ్యాను. విషయాలంటే ఇంద్రియాలకు సంబంధించినవని కూడా గ్రహించాలి. తల్లిదండ్రుల యెడ గల భక్తికోసం సర్వమూ త్యజించాలను జ్ఞానం తరువాత నాకు కలిగింది. నా భోగాభిలాషకు దండన విధించడం కోసమనేమో అప్పుడు ఒక ఘట్టం జరిగింది. అప్పటినుండి ఆ ఘట్టం నన్ను బాధిస్తూనే వుంది. ఆ వివరం ముందు తెలుపుతాను. నిష్కలానందుడు చెప్పిన “త్యాగ్ న టకేరే వైరాగవినా, కరీయే కోటి ఉపాయ్ జీ” “కోటి ఉపాయాలు పన్నినా, విషయవాంఛల యెడ వైరాగ్యం కలుగనిచో త్యాగభావం అలవడదు సుమా” అను గీతం చదివినప్పుడు ఆ గీతం ఎవరైనా చదువగా విన్నప్పుడు కటువైన ఆ ఘట్టం చప్పున జ్ఞాపకం వచ్చి నన్ను సిగ్గులో ముంచేస్తుంది.

మా తండ్రి గాయాలతో బాధపడుతూ కూడా నవ్వు ముఖంతో వివాహ కార్యాలు నిర్వహించారు. మా తండ్రి ఏఏ సమయంలో ఎక్కడెక్కడ కూర్చున్నదీ అప్పటికీ నాకు బాగా గుర్తు. నాకు బాల్య వివాహం చేసినందుకు తరువాత నా తండ్రిని తీవ్రంగా విమర్శించాను. కాని పెండ్లి సమయంలో ఆ విషయం నాకు తోచలేదు. అప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. అంతా మనోహరంగా కనిపించింది. పెండ్లి ఉబలాటంలో అప్పుడు నా తండ్రి చేసినదంతా మంచే అని అనిపించింది. ఆ విషయాలు యిప్పటికీ నాకు గుర్తు వున్నాయి.

పెండ్లి పీటల మీద కూర్చున్నాం. సప్తపది పూర్తి అయింది. ఒకే పళ్ళెంలో కంసారు అనగా గోధుమరవ్వ, చక్కెర, కిస్ మిస్, ఎండుద్రాక్షలతో తయారు చేసే జావ తాగాం. ఒకరికొకరం తినిపించుకున్నాం. ఇద్దరం కలిసిమెలిసి వున్నాం. ఆ విషయాలన్నీ కండ్లకు కట్టినట్లు ఇప్పటికీ నాకు కనబడుతున్నాయి. ఆహా! మొదటి రాత్రి. అభం శుభం తెలియని యిద్దరు పిల్లలం. సంసార సాగరంలోకి ఉరికాము. మొదటి రాత్రి ఏం చేయాలో, కొత్త ఆడపిల్లతో ఎలా వ్యవహరించాలో మా వదిన బోధించింది. నీ వెవరి దగ్గర నేర్చుకున్నావని ఆ రాత్రి నా ధర్మపత్నిని అడిగినట్లు గుర్తులేదు. యిప్పటికీ అడుగవచ్చు. కాని నాకు అట్టి ఇచ్ఛలేదు. ఒకరిని చూచి ఒకరం భయం భయంగ వున్నామని పాఠకులు గ్రహించవచ్చు. బాగా సిగ్గుపడ్డాం, ఎట్లా మాట్లాడాలో నాకేం తెలుసు? నేర్చుకున్న పాఠాలు జ్ఞాపకం వుంటాయా? అసలు అవి ఒకరి దగ్గర నేర్చుకునే విషయాలా? సంస్కారాలు బలంగా వున్నచోట పాఠాలు పనిచేయవు. మెల్లమెల్లగా ఒకరినొకరు అర్థం చేసుకోసాగాం. మాట్లాడుకోసాగాం. మేమిద్దరం సమవయస్కులం. అయినా భర్తగా అధికారం చలాయించడం ప్రారంభించాను.

4. భర్తగా

నాకు పెండ్లి అయిన రోజుల్లో దమ్మిడీకో, కాణీకో, చిన్న చిన్న పత్రికలు అమ్ముతూ వుండేవారు. వాటిలో భార్యభర్తల ప్రేమ, పొదుపు, బాల్యవివాహాలు మొదలుగా గల విషయాలను గురించి వ్రాస్తూ వుండేవారు. చేతికందినప్పుడు వాటిని పూర్తిగా చదివేవాణ్ణి. నచ్చని విషయాల్ని మరిచిపోవడం, నచ్చిన విషయాల్ని ఆచరణలో పెట్టడం నాకు అలవాటు. ఒకసారి ఒక పత్రికలో ఏకపత్నీవ్రతం ధర్మం అను వ్యాసం ప్రకటించారు. శ్రద్ధగా చదివాను. ఆ విషయం నా మనస్సులో నాటుకుపోయింది. సత్యమంటే నాకు మక్కువ, అట్టి స్థితిలో భార్యను మోసగించడం నావల్ల సాధ్యం కానిపని. అందువల్ల మరో స్త్రీ యెడ మక్కువ కూడదని నాకు బోధపడింది. చిన్న వయస్సులో ఏకపత్నీవ్రత భంగం అయ్యే అవకాశం తక్కువేనని చెప్పవచ్చు.

కాని ఒక ముప్పు కూడా కలిగింది. నేను ఏకపత్నీవ్రతం అవలంబించితే ఆమె కూడా పాతివ్రత్యాన్ని పాటించాలి. యీ రకమైన యోచన నన్ను ఈర్ష్యపడే భర్తగా మార్చివేసింది. పాటించాలి అని అనుకున్న నేను “పాటింపచేయాలి” అనే నిర్ణయానికి వచ్చాను. ఆమెచే పాటింపచేయాలంటే నేను జాగ్రత్త పడాలి అని భావించాను. నిజానికి నా భార్యను శంకించవలసిన అవసరం లేనేలేదు. కానీ అనుమానం పెనుభూతం వంటిది కదా. నా భార్య ఎక్కడికి పోతున్నదీ నేను తెలుసుకోకపోతే ఎలా? నా అనుమతి లేనిదే ఆమె ఎక్కడికీ వెళ్ళకూడదు. దానితో మా మధ్య ఎడమొహం పెడమొహం ప్రారంభమైంది. అనుమతి లేకుండా ఎక్కడికీ పోకూడదంటే ఒక విధమైన జైలేకదా! అయితే కస్తూరిబాకి యిలాంటి జైలు బంధాలు గిట్టవని తేలిపోయింది. నేను వెళ్ళొద్దని వత్తిడి తెచ్చిన కొద్దీ వెళ్ళసాగింది. దానితో నాకు చిరచిర ఎక్కువైంది. పిల్లలమైన మా మధ్య మాటలు కూడా ఆగిపోయాయి. కస్తూరిబా తీసుకున్న స్వాతంత్ర్యం నిజానికి దోషరహితం. మనస్సులో ఏ విధమైన దోషం లేని బాలిక దైవదర్శనానికో, మరెవరినైనా కలుసుకోవడానికో వెళ్ళడాన్ని అంగీకరించక అధికారం చెలాయిస్తే సహిస్తుందా? నేను ఆమె మీద దర్పం చూపిస్తే ఆమె కూడా నా మీద దర్పం చూపించవచ్చుకదా! అయితే యీ విషయం కాలం గడిచాక బోధపడింది కానీ అప్పుడో! భర్తగా అధికారం చలాయించడమే నా పని. నా గృహ జీవితంలో మాధుర్యం లోపించిందని పాఠకులు అనుకోవద్దు. నా వక్రపోకడకు మూలం ప్రేమయే. నా భార్యను ఆదర్శ స్త్రీగా తీర్చిదిద్దాలని నా భావం. ఆమె స్వచ్ఛంగా, శుద్ధంగా వుండాలనీ. నేను నేర్చుకున్న దాన్ని ఆమె నేర్చుకోవాలనీ, నేను చదివిందాన్ని ఆమె చదవాలనీ, యిద్దరం ఒకరిలో ఒకరం ఏకం అయిపోవాలన్న యోచన తప్ప మరో యోచన నాకు లేదు.

కస్తూరిబాకి కూడా నా మాదిరి యోచన వున్నదో లేదో నాకు తెలియదు. ఆమెకు చదువురాదు. స్వభావం మంచిది. స్వతంత్రురాలు, కష్టజీవి. నాతో తక్కువగా మాట్లాడేది. చదువుకోలేదను చింత ఆమెకు లేదు. చదువుకోవాలనే స్పందన ఆమెలో చిన్నతనంలో నాకు కనబడలేదు. అందువల్ల నా యోచన ఏకపక్షమైనదని అంగీకరిస్తున్నాను. నేను ఆమెను అమితంగా ప్రేమించాను. అలాగే ఆమె కూడా నన్ను ప్రేమించాలని కోరాను. ఆ విధంగా అన్యోన్య ప్రేమ లేకపోయినా, ప్రేమ ఏకపక్షంగా వుండిపోయినా అది మాకు బాధాకరం కాలేదు. నా భార్య మీద నాకు మక్కువ ఎక్కువగా వుండేది. స్కూల్లో కూడా ఆమెను గురించిన ధ్యాసే. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడెప్పుడు యిద్దరం కలుస్తామా అని ఆరాటపడుతూ వుండేవాణ్ణి. వియోగాన్ని సహించలేని స్థితి. రాత్రిళ్ళు నిరర్ధకమైన మాటలతో నేను కస్తూరిని నిద్రపోనిచ్చేవాణ్ణి కాదు. ఎంతటి ఆసక్తితో బాటు కర్తవ్యనిష్ఠ లేకపోతే నేను అప్పుడు రోగగ్రస్థుడనై మృత్యువు కోరల్లో చిక్కుకుపోయేవాణ్ణి. ప్రపంచానికి భారమైపోయేవాణ్ణి. తెల్లవారగానే నిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వుండేవాణ్ణి. మరొకరిని మోసగించడం ఎరగనివాణ్ణి. కనుకనే అనేక పర్యాయాలు చిక్కుల్లో పడకుండా రక్షణ పొందాను.

కస్తూరిబా చదువుకోలేదని మొదటే వ్రాశాను. ఆమెకు చదువు చెప్పాలనే కోరిక నాకు వుండేది. కాని విషయవాంఛ అందుకు అడ్డుపడేది. ఆమెకు బలవంతంగా చదువు చెప్పవలసిన పరిస్థితి. అది కూడా రాత్రిపూట ఏకాంతంగా వున్న సమయంలోనే సాధ్యపడేది. గురుజనుల ఎదుట భార్యవంక చూడటానికి కూడా వీలు లేని రోజులు. అట్టి స్థితిలో ఆమెతో మాట్లాడటం సాధ్యమా? కాఠియావాడ్ లో పనికిమాలిన మేలిముసుగు అనగా పర్దా రివాజు అమలులో వుండేది. యిప్పటికీ ఆ రివాజు అక్కడక్కడా అమలులో వుంది. ఈ కారణాలవల్ల కస్తూరిబాకు చదువు చెప్పేందుకు అవకాశం చిక్కలేదు. యౌవ్వన సమయంలో భార్యకు చదువు చెప్పడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్ధమయ్యాయని అంగీకరిస్తున్నాను. విషయవాంఛల నుంచి మేల్కొని బయటపడేసరికి ప్రజాజీవితంలో బాగా లీనమైపోయాను. ఇక ఆమెకు చదువు చెప్పేందుకు సమయం దొరకనేలేదు. ఉపాధ్యాయుణ్ణి పెట్టి చదువు చెప్పిద్దామని చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఏతావాతా కస్తూరిబా చదువరి కాలేదు. ఆమె కొద్దిగా జాబులు వ్రాయగలదు. సామాన్యమైన గుజరాతీ అర్థం చేసుకోగలదు. ఆమె యెడ నాకుగల ప్రేమ వాంఛామయం కాకుండా వుండివుంటే యీనాడు ఆమె విదుషీమణి అయివుండేదని నా అభిప్రాయం. చదువు యెడ ఆమెకు గల నిర్లిప్తతను జయించి వుండేవాణ్ణి. శుద్ధమైన ప్రేమవల్ల జరగని పని అంటూ ఏదీ వుండదని నాకు తెలుసు.

భార్య మీద భోగవాంఛ అమితంగా పెంచుకున్నప్పటికీ నన్ను కాపాడిన విషయాల్ని గురించి వ్రాశాను కదా! మరో విషయం కూడా చెప్పవలసిన అవసరం వుంది. ఎవరి నిష్ఠ పవిత్రంగా వుంటుందో వారిని పరమేశ్వరుడు రక్షిస్తూ వుంటాడను సూక్తి మీద అనేక కారణాల వల్ల నాకు విశ్వాసం కలిగింది. అతి బాల్య వివాహం పెద్ద దురాచారం. దానితోబాటు అందలి చెడుగుల్ని కొంత తగ్గించడానికా అన్నట్లు హిందువుల్లో ఒక ఆచారం వుంది. తల్లిదండ్రులు నూతన దంపతుల్ని ఎక్కువ కాలం కలిసి ఒక చోట వుండనీయరు. నూతన వధువు సగం కాలం పుట్టింట్లో వుంటుంది. ఈ విషయంలో అలాగే జరిగింది. మాకు పెండ్లి అయిన అయిదేళ్ళ కాలంలో (13వ ఏట నుండి 18 వరకు) మేము కలిసియున్న కాలం మొత్తం మూడేండ్లకు మించదు. ఆరు నెలలు గడవకుండానే పుట్టింటినుండి కస్తూరిబాకి పిలుపు వచ్చింది. ఆ విధంగా పిలుపు రావడం నాకు యిష్టం వుండేది కాదు. అయితే ఆ పిలుపులే మమ్ము రక్షించాయి. 18వ ఏట నేను ఇంగ్లాండు వెళ్లాను. అది మాకు వియోగకాలం. ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చాక కూడా మేము ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కాపురం చేయలేదు. అప్పుడు నేను రాజకోట నుండి బొంబాయికీ, బొంబాయినుండి రాజకోటకు పరుగులు తీస్తూ వుండేవాణ్ణి. తరువాత నేను దక్షిణ ఆఫ్రికా వెళ్ళవలసి వచ్చింది. ఈ లోపున నేను పూర్తిగా మేల్కొన్నాను.


5. హైస్కూల్లో

పెండ్లి జరిగినప్పుడు నేను హైస్కూల్లో చదువుతూ వున్నానని ముందే వ్రాశాను. మేము ముగ్గురు సోదరులం ఒకే హైస్కూల్లో చేరి చదువుతున్నాము. మా పెద్దన్నయ్య పెద్ద తరగతిలో వున్నారు. పెండ్లి వల్ల ఒక సంవత్సరం పాటు మా చదువు ఆగిపోయింది. మా అన్న పని మరీ అన్యాయం. ఆయన బడి మానివేశాడు. మా అన్నవలె ఎంతమంది పిన్న వయస్సులో యీ విధంగా చదువు మానివేశారో ఆ భగవంతునికే ఎరుక. ఈనాటి మన హిందూ సమాజంలో విద్య, వివాహం రెండూ వెంట వెంట నడుస్తున్నాయి. నా చదువు మాత్రం ఆగిపోలేదు. హైస్కూల్లో నాకు మొద్దబ్బాయి అని పేరు రాలేదు. ఉపాధ్యాయులకు నా యెడ వాత్సల్యం మెండు. పిల్లవాడి నడతను గురించి, అతని చదువును గురించి ప్రతి సంవత్సరం స్కూలు నుండి ఒక సర్టిఫికెట్ తల్లిదండ్రులకు పంపుతూ వుంటారు. వాళ్లు ఎప్పుడూ నా నడతను గురించిగానీ, నా చదువును గురించి గానీ వ్యతిరేకంగా వ్రాయలేదు. రెండో తరగతి తరువాత నేను బహుమతులు కూడా కొన్ని సంపాదించాను. అయిదవ, ఆరవ తరగతుల్లో నెలకు నాలుగు రూపాయలు ఆ తరువాత పది రూపాయల చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. యిందు నా తెలివితేటల కంటే నా అదృష్టం ఎక్కువగా పనిచేసిందని నా అభిప్రాయం. యీ వేతనాలు విద్యార్థులందరికీ లభించేవి కావు. సౌరాష్ట్ర ప్రాంతం మొత్తంలో ఫస్టు వచ్చిన వాళ్ళకు యిట్టి వేతనం లభించేది. 40 లేక 50 మంది గల తరగతిలో అప్పుడు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు బహు తక్కువ.

నాకు తెలిసినంతవరకు తెలివితేటల్ని గురించిన గర్వం నాకు వుండేదికాదు. బహుమతులు లేక స్కాలర్షిప్పులు లభించినప్పుడు ఆశ్చర్యం కలిగేది. కాని నడతను గురించి మాత్రం జాగ్రత్తగా వుండేవాణ్ణి. ఆచరణలో దోషం కనబడితే ఏడుపు వస్తూ వుండేది. ఉపాధ్యాయులు నన్ను మందలించటం గానీ, అట్టి పరిస్థితి ఏర్పడటం గానీ నేను సహించలేకపోయేవాణ్ణి. నాకు బాగా జ్ఞాపకం. ఒక పర్యాయం నేను దెబ్బలు తినవలసి వచ్చింది. దెబ్బలు తగిలినందుకు నేను విచారించలేదు, దండనకు గురి అయినాననే బాధ అమితంగా కలిగింది. బాగా ఏడ్చాను. మొదటి తరగతిలోనో లేక రెండో తరగతిలోనో ఇలా జరిగింది. అప్పుడు దొరాబ్జీ ఎదల్జీగిమీ హెడ్ మాష్టరు. ఆయన విద్యార్థులకు యిష్టుడు. తాను నియమబద్ధంగా పనిచేస్తూ ఇతరులచేత పనిచేయించేవాడు. చదువు బాగా చెప్పేవాడు. పెద్ద తరగతి విద్యార్థులకు వ్యాయామం, క్రికెటు అనివార్యం చేశాడు. నాకు అవి యిష్టంలేదు. నేను వాటిలో పాల్గొనేవాణ్ణి కాదు. నా అయిష్టం సరికాదని యిప్పుడు నాకు అనిపిస్తుంది. ఆ రోజుల్లో చదువుకు, వ్యాయామానికి ఏ మాత్రం సంబంధం లేదని నేను అనుకునేవాణ్ణి. విద్యార్జనతో బాటు అనగా మానసిక శిక్షణతోబాటు వ్యాయామం శారీరక శిక్షణ కూడా, విద్యార్థికి అవసరమని తరువాత బోధపడింది. అయినా వ్యాయామంలో పాల్గొనక పోవడం వల్ల నాకేమీ నష్టం కలుగలేదని చెప్పగలను. తెరపగాలిలో వాహ్యాళి ఎంతో ప్రయోజనకర మైనదని చదివాను. ఆ సలహా నాకు నచ్చింది. దానిలో పెద్ద తరగతుల్లో చదువుకునేటప్పటి నుండి నాకు కాలినడకన వాహ్యాళికి వెళ్ళడం అలవాటైపోయింది. చివరివరకు ఈ అలవాటు నన్ను వదలలేదు. కాలినడకన తిరగడం కూడా మంచి వ్యాయామమే. అందువల్ల నా శరీరంలో కొంచెం బిగువు వచ్చింది. నా తండ్రికి సేవ చేయాలనే తలంపు కూడా వ్యాయామంలో పాల్గొనకపోవడానికి మరో కారణం. స్కూలు మూసివేయగానే యింటికి చేరి తండ్రికి సేవ చేసేవాణ్ణి. స్కూల్లో వ్యాయామాన్ని అనివార్యం చేయడం వల్ల తండ్రిగారి సేవకు విఘ్నం ఏర్పడింది. గనుక స్కూలు వ్యాయామంలో పాల్గొనకుండా వుండుటకు అనుమతి నొసంగమని అర్జీ పెట్టుకున్నాను. కాని గీమీగారు అంగీకరిస్తారా? ఒక శనివారం నాడు స్కూలు ఉదయం పూట నడిపారు. సాయంకాలం మేఘాలు కమ్మాయి. అందువల్ల టైము ఎంత అయిందో తెలియలేదు. మేఘాలవల్ల మోసపోయాను. క్లాసుకు వెళ్ళాను. ఎవ్వరూ లేరు. రెండో రోజున గీమీగారు హాజరు పట్టిక చూచారు. నేను పాల్గొనలేదని తేలింది. కారణం అడిగారు నేను నిజం చెప్పాను. నేను చెప్పింది నిజం కాదని ఆయన భావించారు. ఒకటో లేక రెండో అణాల (ఎంతో సరిగా జ్ఞాపకం లేదు) జుర్మానా వేశారు. నేను అబద్ధం చెప్పలేదని రుజువు చేయడం ఎలా? ఉపాయం ఏమీ కనబడలేదు. వూరుకున్నాను. బాగా ఏడ్చాను. నిజం మాట్లాడేవారు, నిజాయితీగా వ్యవహరించేవారు. ఏమరచి వుండకూడదని గ్రహించాను. చదువుకునే రోజుల్లో అజాగ్రత్తగా వుండటం అదే ప్రధమం, అదే అంతిమం కూడా. చివరికి ఆ జుర్మానాను మాఫీ చేయించుకోగలిగానని జ్ఞాపకం. స్కూలు మూసివేయగానే నా సేవకు మా అబ్బాయి అవసరం అని మా తండ్రి హెడ్మాష్టరుకు జాబు వ్రాశారు. దానితో నాకు ముక్తి లభించింది.

వ్యాయామానికి బదులు వాహ్యాళికి వెళ్ళడం అలవాటు చేసుకున్నందువల్ల అనారోగ్యం బారినుండి తప్పించుకోగలిగాను. కాని మరో పొరపాటు వల్ల కలిగిన ఫలితం నేను ఈనాటికీ ఆనుభవిస్తున్నాను. చదువుకునేటప్పుడు అందంగా వ్రాయడం నేర్చుకోవలసిన అవసరం లేదనే తప్పు అభిప్రాయం నా బుర్రలో ఎలా దూరిందో తెలియదు దూరిపోయింది. విదేశానికి బయలుదేరేంతవరకు ఆ అభిప్రాయం మారలేదు. కాని దక్షిణాఫ్రికాకు వెళ్ళిన తరువాత, అక్కడి వకీళ్ళు అక్కడి ప్రజలు ముత్యాల్లాంటి అందమైన అక్షరాలు వ్రాస్తూ వుంటే చూచి సిగ్గుపడ్డాను. వంకరటింకర అక్షరాలు అసంపూర్ణ విద్యకు చిహ్నంగా భావించాలనే భావం అప్పుడు నాకు కలిగింది, తరువాత నా అక్షరాల్ని అందంగా వ్రాద్దామని ఎంతో ప్రయత్నించాను. కాని వ్యవహారం చేయి దాటి పోయింది. దస్తూరి మార్చుకోలేకపోయాను. నన్ను చూచి ప్రతి బాలుడు, బాలిక జాగ్రత్తపడాలని కోరుతున్నాను. మంచి దస్తూరి విద్యలో భాగమని అందరూ గుర్తించాలి. అక్షరాలు దిద్దించుటకు ముందు బాలురకు చిత్రలేఖనం నేర్పటం అవసరమని నాకు అనిపించింది. పూవులు, పిట్టలు మొదలుగా గల వాటిని పరిశీలించి చిత్రించినట్లే అక్షరాల్ని కూడా పరిశీలించి వ్రాయడం అవసరం. వస్తువుల్ని చూచి గీయడం నేర్చుకున్న తరవాతే వ్రాత నేర్వడం మంచిది. అప్పుడు అక్షరాలు అందంగా వుంటాయి. ఆనాటి మా బడిని గురించిన రెండు విషయాలు చెప్పవలసినవి వున్నాయి. వివాహం వల్ల నా ఒక సంవత్సర కాలం వ్యర్థమైపోయింది. దాన్ని సరిచేసేందుకు ఉపాధ్యాయుడు నన్ను పై క్లాసులో చేర్పించాడు. కష్టపడి చదివే వాళ్ళకు అట్టి అవకాశం లభిస్తూ వుండేది. అందువల్ల నేను మూడో తరగతిలో ఆరు నెలలు మాత్రమే వుండి ఎండాకాలపు సెలవులకు పూర్వం జరిగే పరీక్షలు పూర్తి అయిన తరువాత నాలుగో తరగతిలో చేర్చబడ్డాను. నాలుగో తరగతి నుండి పాఠ్య విషయాలు ఎక్కువభాగం ఇంగ్లీషులో బోధించబడేవి. నాకు నడిసముద్రంలో వున్నట్లు అనిపించేది. రేఖాగణితం నాకు క్రొత్త. ఇంగ్లీషులో రేఖాగణితం బోధించడం వల్ల నా పాలిట అది గుదిబండ అయింది. ఉపాధ్యాయుడు పాఠం బాగా చెప్పేవాడు. కాని ఏమీ బోధపడేది కాదు. పాఠాలు కష్టంగా వుండటం వలన నా మనస్సు కలత చెంది తిరిగి మూడో తరగతిలోనే చేరదామని భావించాను. రెండేండ్ల చదువు ఒక సంవత్సరంలో పూర్తి చేయడం కష్టమనిపించింది. కాని నాకంటే కూడా నా ఉపాధ్యాయునికి యిలా తిరిగి నేను మూడో తరగతిలో చేరడం అవమానమనిపించింది. నా చదువు మీద గల విశ్వాసంతో ఆయన నన్ను నాలుగో తరగతిలో చేర్పించాడు. యింతగా శ్రమపడిన తరువాత తిరిగి మూడో తరగతిలో నేను చేరడం సబబా? అందువల్ల నేను నాలుగో తరగతిలోనే ఉండిపోయాను. బాగా కష్టపడి చదవడం ప్రారంభించాను. యూక్‌లిడ్‌లో 13వ ప్రోపొజిషన్ వరకు రాగా అక్కడి నుండి రేఖాగణితం సులభంగా బోధపడిపోయింది. తెలివితేటల్ని ఉపయోగించి సరళప్రయోగాలు చేస్తూ కృషి చేస్తే ఏ విషయమైనా తప్పక బోధపడుతుంది. అప్పటినుండి నాకు రేఖాగణితం యెడ అభిరుచి పెరిగింది.

సంస్కృతం బాగా కష్టమనిపించింది. రేఖాగణితంలో బట్టీ పట్టవలసిన అవసరం వుండేది కాదు. కాని సంస్కృతం అంతా బట్టీపట్టడమే. అందుకు ధారణాశక్తి అవసరమనిపించింది. నాలుగోతరగతికి చేరేసరికి సంస్కృత పాఠాలు మరీ కష్టమనిపించాయి. సంస్కృత ఉపాధ్యాయుడు పిల్లలకు సంస్కృతాన్ని నూరిపోద్దామని అనుకునేవాడు. సంస్కృత ఉపాధ్యాయుడికీ, ఫారసీ ఉపాధ్యాయుడికీ పడేది కాదు. ఫారసీ మౌల్వీ సౌమ్యుడు. ఫారసీ తేలిక అని ఫారసీ మౌల్వీ పిల్లల్ని ప్రేమగా చూస్తాడని పిల్లలు చెప్పుకునేవారు. ఆ మాటలు నన్ను ఆకర్షించాయి. ఒకసారి ఫారసీ క్లాసులో కూర్చున్నాను అది చూచి సంస్కృత ఉపాధ్యాయుడు చాలా బాధపడ్డాడు. నన్ను పిలిచి “అబ్బాయీ! నీవు ఎవరికొడుకువో ఆలోచించుకో. నీ ధార్మిక భాష సంస్కృతం. దాన్ని నీవు నేర్చుకోవా? సంస్కృతం రాకపోతే నా దగ్గరికి రావచ్చుకదా? శక్తి కొద్దీ పిల్లలకు సంస్కృతం నేర్పడం నా లక్ష్యం. ముందు ముందు సంస్కృతం తేలిక అవుతుంది. అధైర్యపడవద్దు. వచ్చి సంస్కృత క్లాసులో కూర్చో” అని మంచిగా చెప్పాడు.

ఆయన చూపిన మంచితనాన్ని కాదనలేకపోయాను. గురుప్రేమను తిరస్కరించలేకపోయాను. ఆయన పేరు కృష్ణశంకర పాండ్యా, యిప్పుడు వారిని, వారు చెప్పిన పాఠాల్ని గుర్తు చేసుకుంటే నా హృదయం వారి ఉపకారాన్ని మర్చిపోలేక కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆనాడు వారిదగ్గర ఆ కొద్దిపాటి సంస్కృతం నేర్చుకొని వుండకపోతే ఆనందించలేకపోయేవాణ్ణి. నిజానికి నేను సంస్కృతం ఇంకా ఎక్కువ నేర్చుకోలేకపోయాననే బాధ యిప్పుడు నాకు కలుగుతూ వుంటుంది. ప్రతి హిందూ బాలుడు, బాలిక సంస్కృతం చక్కగా నేర్చుకోవడం అవసరమని తరువాత గ్రహించాను.

నా అభిప్రాయం ప్రకారం భారతదేశపు ఉన్నత విద్యా ప్రణాళికలో మాతృభాషతో పాటు హిందీ, సంస్కృతం, ఫారసీ, అరబ్బీ, ఇంగ్లీషు భాషలను పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ సంఖ్యను చూచి భయపడవలసిన అవసరంలేదు. మనకు బోధించబడుతున్న విద్యను క్రమబద్ధం చేసి పరాయి భాషలో పాఠ్యాంశాలు నేర్చుకోవలసిన అవసరం లేకుండా చేసి, ఆ భారం తగ్గించితే పిల్లలు తేలికగా ఈ భాషలు నేర్చుకోగలుగుతారని. వాళ్ళకు ఆనందం కలుగుతుందని నా అభిప్రాయం. ఒక భాషను శాస్త్రీయంగా అభ్యసిస్తే మిగతా భాషలు సులభతరం అవుతాయి. అసలు హిందీ, గుజరాతీ, సంస్కృత భాషలు ఏకభాషలేనని చెప్పవచ్చు. అదే విధంగా ఫారసీ, అరబ్బీ భాషలు ఏకభాషలే. ఫారసీ భాష ఆర్య భాషకు చెందినది. అరబ్బీ భాష హీబ్రూకు చెందినది. అయినా ఈ రెండింటికీ దగ్గరి చుట్టరికం వుంది. ఈ రెండు భాషలు ఇస్లాం మతంతోబాటు అభివృద్ధి చెందాయి. ఉర్దూ భాష వేరు అని నేను అంగీకరించను. హిందీ వ్యాకరణాంశాలు అందు వుండటం, ఫారసీ, అరబ్బీ పదాలు అందు వుండటం అందుకు కారణం. గుజరాత్, హిందీ, బెంగాలీ, మరాఠీ, మొదలుగా గల మన భాషల్లో మంచి ప్రవేశం కలగాలంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా అవసరం. అలాగే ఉర్దూలో మంచి ప్రవేశం కలగాలంటే ఫారసీ, అరబ్బీ భాషలు అభ్యసించాలి. 

6. దుఃఖకరమైన ప్రకరణం - 1

హైస్కూల్లో వేరు వేరు సమయాల్లో నాకు యిద్దరు స్నేహితులు వుండేవారు. వారిలో ఒకడితో మైత్రి ఎక్కువకాలం సాగలేదు. నేను మాత్రం ఆ మిత్రుణ్ణి పరిత్యజించ లేదు. మరొకనితో నేను స్నేహంగా వుండటం యిష్టం లేక అతడు నన్ను వదిలివేశాడు. యిక రెండోవానితో స్నేహం చాలా కాలం సాగింది. అది ఎంతో దుఃఖకరమైన ప్రకరణంగా మారింది. అతణ్ణి సంస్కరించాలనే భావంతో నేను అతనితో స్నేహం చేశాను

అతడు మొదట మా రెండో అన్నయ్యకు మిత్రుడు. వాళ్ళిద్దరూ సహాధ్యాయులు. అతనిలో కొన్ని దోషాలు వున్నాయి అని నాకు తెలుసు. అయినా అతడు విశ్వసనీయుడనే భావించాను. మా అమ్మ, పెద్దన్నయ్య, నా భార్య కూడా యీ చెడు సహవాసం వద్దని హెచ్చరించారు. అభిమానం గల భర్తనైన నేను భార్య మాటల్ని పాటిస్తానా? కాని మా అమ్మ, పెద్దన్నయ్య మాటల్ని వినడం తప్పనిసరి. “మీరు చెప్పిన దోషాలు అతనిలో వున్నవూట నిజమే. కాని అతనిలోగల సుగుణాలు మీకు తెలియవు. అతడు నన్ను చెడగొట్టలేడు. మంచిదారికి తీసుకొని వచ్చేందుకే అతనితో స్నేహం చేస్తున్నాను. తన దోషాల్ని సరిచేసుకుంటే అతడు ఉత్తముడవుతాడు. అందుకే అతనితో చేతులు కలిపాను. నన్ను గురించి మీరు విచారపడవద్దు” అని అమ్మకు, పెద్దన్నయ్యకు నచ్చజెప్పాను. నా మాటలు మా వాళ్ళకు నచ్చాయని అనలేను కాని యిక వాళ్ళు నన్నేమీ అనలేదు. నాదారిన నన్ను పోనిచ్చారు.

తరువాత నాదే పొరపాటని తేలింది. యితరుల్ని సంస్కరించడం కోసం మరీ లోతుకు పోకూడదని గ్రహించాను. స్నేహంలో అద్వైత భావం వుంటుంది. సమాన గుణాలు కలిగిన వారి స్నేహమే శోభిస్తుంది, నిలుస్తుంది. మిత్రుల ప్రభావం ఒకరిపై మరొకరిది తప్పక పడుతుంది. అందువల్ల స్నేహితుల్ని సంస్కరించడం కష్టం. అసలు అతి స్నేహం పనికిరాదని నా అభిప్రాయం. సామాన్యంగా మనిషి సుగుణాల కంటే దుర్గుణాల్నే త్వరగా గ్రహిస్తాడు. ఆత్మీయమైత్రిని, భగవంతుని మైత్రిని కోరుకునేవాడు ఏకాకిగా వుండాలి. లేదా ప్రపంచమంతటితో స్నేహంగా వుండాలి. యీ నా అభిప్రాయాలు సరైనవో, కాదో తెలియదు. కాని నా ఆ స్నేహప్రయత్నం మాత్రం ఫలించలేదు.

ఆ వ్యక్తితో స్నేహం చేసినప్పుడు రాజకోటలో సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగుతున్నది. మా ఉపాధ్యాయుల్లో చాలామంది చాటుగా మద్యమాంసాలు సేవిస్తున్నారని ఆ స్నేహితుడు నాకు చెప్పాడు. సుప్రసిద్ధులైన రాజకోటకు చెందిన కొందరు ప్రముఖుల పేర్లు కూడా చెప్పాడు. అట్టివారిలో హైస్కూలు వాళ్ళు కూడా కొంతమంది వున్నారని చెప్పాడు.

ఇదంతా నాకు వింతగా తోచింది. తరువాత బాధ కూడా కలిగింది. వాళ్ళు, అలా ఎందుకు చేస్తున్నారని అడిగాను. “మనం మాంసం తినం. అందువల్ల మనజాతి దుర్భలమై పోయింది. తెల్లవాళ్ళు మాంసభోజులు. అందువల్లనే వాళ్ళు మనల్ని పరిపాలించగలుగుతున్నారు. నన్నుచూడు. బలశాలిని. చాలా దూరం పరిగెత్తగలను. ఈ విషయం నీకు తెలుసు. నేను మాంసాహారి కావడమే అందుకు కారణం. మాంసాహారులకు కురుపులు లేవవు, గ్రంధులు ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా వెంటనే మానిపోతాయి. మన ఉపాధ్యాయులు, రాజకోట ప్రముఖులు వెర్రివాళ్ళు కాదు. వాళ్ళు మాంసం ఎందుకు తింటున్నారనుకుంటున్నావు? మాంసం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో వాళ్ళకు బాగా తెలుసు. నువ్వు కూడా వారిలాగే మాంసం తిను. కృషితో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. మాంసం తిని చూడు నీకే తెలుస్తుంది. ఎంత బలం వస్తుందో అని నన్ను ప్రోత్సహించాడు.

ఇవి అతడు ఒక్క పర్యాయం చెప్పిన మాటలు కావు. అనేక పర్యాయాలు సమయాన్ని, సందర్భాన్ని బట్టి అతడు చెప్పిన మాటల సారం. మా రెండో అన్నయ్య యిది వరకే అతని మాటల్లో పడిపోయాడు. పైగా ఆ స్నేహితుని వాదనను సమర్ధించాడు కూడా. ఆ మిత్రుని ముందు, మా రెండో అన్నయ్య ముందు నేను దోమ వంటివాణ్ణి. వాళ్ళిద్దరూ బలిష్టులు. దృఢగాత్రులు. నా స్నేహితుని పరాక్రమం చూచి నివ్వెరపోయాను. ఎంత దూరమైనా సరే రివ్వున పరుగెత్తగలడు. ఎత్తు మరియు దూరం దూకడంలో అతడు మేటి. ఎన్ని దెబ్బలు కొట్టినా కిమ్మన్నడు. సహిస్తాడు. తరచుగా తన పరాక్రమాన్ని నా ముందు ప్రదర్శిస్తూ వుండేవాడు. తనకు లేని శక్తులు యితరుల్లో చూచి మనిషి ఆశ్చర్యపడడం సహజం. అందువల్ల నేను అతగాణ్ణి చూచి ఆశ్చర్యపోయేవాణ్ణి. అతని వలె బలశాలి కావాలని ఆశ నాకు కలిగింది. నేను దూకలేను. పరిగెత్తలేను. అతనిలా దూకాలి, పరిగెత్తాలి అనుకోరిక నాకు కలిగింది.

నేను పిరికివాణ్ణి. దొంగలన్నా, దయ్యాలన్నా, తేళ్ళన్నా, పాములన్నా నాకు భయం. రాత్రిళ్ళు గడపదాటాలంటే భయం. చీకట్లో ఎక్కడికీ పోలేను. ఒక దిక్కునుండి దయ్యాలు వచ్చి మ్రింగివేస్తాయని, మరోదిక్కు నుండి పాములు వచ్చి కరిచి వేస్తాయని భయం వేసేది. గదిలో దీపం లేకుండా పడుకోలేను. నా ప్రక్కనే పడుకొని నిద్రిస్తున్న యౌవనదశలోనున్న నా భార్యకు నా భయం గురించి ఎలా చెప్పను? నా కంటే ఆమెకు ధైర్యం ఎక్కువ అని నాకు తెలుసు. నాలో నేను సిగ్గుపడ్డాను. ఆమెకు పాములన్నా, దయ్యాలన్నా భయం లేదు. చీకట్లో ఎక్కడికైనా నిర్భయంగా వెళుతుంది. ఈ విషయాలన్నీ నా స్నేహితునికి తెలుసు. “పాముల్ని చేత్తో పట్టుకుని ఆడిస్తా. దొంగల్ని తరిమికొడతా, దయ్యాల్ని లెక్క చెయ్యను” అంటూ వుండేవాడు. అది అంతా మాంసాహార ప్రతాపమేనని తేల్చేవాడు.

ఆ రోజుల్లో నర్మదకవి వ్రాసిన క్రింది గుజరాతీ పాట పిల్లలంతా పాడుతూ వుండేవారు.

“అంగ్రేజో రాజ్యకరే, దేశీరహే దబాయీ
  దేశీరహేదబాయి జోనే బేనాం శరీర్ భాయీ
  పేలో పాంచ్ హాథ్ పూరో, పూరో పాంచ్‌సే సే

(దేశీయులను దద్దమ్మలుగా చేసి ఆంగ్లేయులు రాజ్యం చేస్తున్నారు. యిద్దరి శరీరాల్ని పరికించి చూడు. మన అయిదువందల మందికి అయిదు అడుగుల ఆంగ్లేయుడొక్కడు చాలు)

వీటన్నిటి ప్రభావం నా మీద బాగా పడింది. మాంసాహారం మంచిదని అది నాకు బలం చేకూర్చి, వీరుణ్ణి చేస్తుందని, దేశ ప్రజలంతా మాంసం తింటే తెల్లవాళ్ళను జయించవచ్చుననే విశ్వాసం నాకు కలిగింది. మాంసభక్షణకు ముహూర్తం నిర్ణయమైంది. అది రహస్యంగా జరగాలి అనే నిర్ణయానికి వచ్చాం. గాంధీ కుటుంబాలవారిది వైష్ణవ సంప్రదాయం. మా తల్లిదండ్రులు పరమవైష్ణవులు. వాళ్ళు ప్రతిరోజు దేవాలయం వెళతారు. మా కుటుంబంలో ప్రత్యేకించి ప్రతి విషయంలో ఆ సంప్రదాయ ఆధిక్యత మెండు. జైనులు, వైష్ణవులు మాంసభక్షణకు పూర్తిగా వ్యతిరేకులు. అంతటి మాంస వ్యతిరేకత హిందూదేశంలో గాని, మరో దేశంలోగాని గల యితర సంప్రదాయాల వాళ్ళకు లేదని చెప్పవచ్చు. యిది పుట్టుకతో వచ్చిన సంప్రదాయ సంస్కారం.

నేను నా తల్లిదండ్రుల పరమభక్తుణ్ణి. నేను మాంసం తిన్నానని తెలిస్తే వాళ్ళ స్థితి ఏమవుతుందో నాకు తెలుసు. అప్పటికే సత్యనిరతి నాలో అధికంగా వుంది. నేను మాంసభక్షణ ప్రారంభిస్తే నా తల్లిదండ్రుల్ని మోసం చేయవలసి వస్తుందను విషయం నాకు తెలుసు. అట్టి స్థితిలో మాంసం తినడం ఎంత భయంకరమైన విషయమో వేరే చెప్పనక్కరలేదు. కాని నా మనస్సంతా సంస్కారదీక్ష మీద కేంద్రీకృతమైంది. నేను మాంసం తింటున్నది రుచి కోసం కాదు. మాంసం రుచిగా వుంటుందని నాకు తెలియదు. నాకు బలం కావాలి. పరాక్రమం కావాలి. నా దేశ ప్రజలంతా పరాక్రమ వంతులు కావాలి. అప్పుడు తెల్లవాళ్ళను జయించి హిందూ దేశాన్ని స్వతంత్ర్యం చేయవచ్చు. ఇదే నా కోరిక. స్వరాజ్యం అను శబ్దం అప్పటికి నా చెవిన పడలేదు. కాని స్వతంత్ర్యం అంటే ఏమిటో నాకు తెలుసు. సంస్కారపు పిచ్చి నన్ను అంధుణ్ణి చేసింది. రహస్యంగా మాంసభక్షణం చేసి, తల్లిదండ్రులకు యీ విషయం తెలియనీయకుండా రహస్యంగా వుంచాలి. యిలా చేయడం సత్యపథాన్నుండి తొలగడం కాదనే నమ్మకం నాకు కలిగింది.

7. దుఃఖకరమైన ప్రకరణం - 2

నిర్ణయించిన రోజు రానే వచ్చింది. ఆనాటి నా స్థితిని గురించి వర్ణించలేను. ఒకవైపు సంస్కరణాభిలాష. మరోవైపు జీవితంలో గొప్ప మార్పు వస్తుందనే భావం. యింకోవైపు దొంగలా చాటుగా యీ పని చేస్తున్నాననే బిడియం, బాధ. వీటిలో ప్రాధాన్యం దేనిదో చెప్పలేను. ఏకాంత ప్రదేశం దొరికింది. అక్కడ జీవితంలో మొదటిసారి మాంసం చూచాను. నాన్‌రొట్టె కూడా తెచ్చాం. రెండిటిలో ఒక్కటి కూడా రుచించలేదు. మాంసం తోలులా బిరుసుగా వుంది. మింగడం సాధ్యం కాలేదు. కక్కు వచ్చినంత పని అయింది. మాంసం పరిత్యజించవలసి వచ్చింది.

ఆ రాత్రి కష్టమైపోయింది. ఏవేవో పీడకలలు రాసాగాయి. కన్నుమూతబడేసరికి నా కడుపులో బ్రతికియున్న మేక ‘మే మే’ అని అరిచినట్లనిపించడం, త్రుళ్ళిపడి లేవడం, ఇష్టపడే మాంసం తిన్నాను గదా అని ఊరట చెందడం, యిదీ వరస.

నా మిత్రుడు అంతటితో నన్ను వదలలేదు. మాంసంతో రకరకాల పాకాలు వండి తేవడం ప్రారంభించాడు. నదీతీరాన తినడం మాని గొప్ప భవనంలో తినడం ప్రారంభించాము. భోజనశాలలో మేజా బల్లలు. కుర్చీలు, అన్నీ వున్నాయి. అక్కడి వంటవాణ్ణి మంచి చేసుకుని మిత్రుడు ఆ దివ్య భవనంలో స్థానం సంపాదించాడు.

మిత్రుని ప్లాను బాగా పనిచేసింది. నాన్‌రొట్టెమీద నాకు రోత పోయింది. మేకల మీద జాలి గూడా తగ్గిపోయింది. వట్టి మాంసం కాకుండ, మాంసంతో తయారుచేసిన రకరకాల పాకాలు తినసాగాను. యీ విధంగా ఒక సంవత్సరం గడిచింది. మొత్తం ఆరు మాంసపు విందులు ఆరగించాను. తక్కువసార్లు తినడానికి కారణం ఆ రాజభవనం మాటిమాటికీ దొరక్కపోవడమే. రుచిగల మాంసపు వంటకాలు మాటిమాటికీ సిద్ధం చేయడం కూడా కష్టమే. పైగా యీ సంస్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన సొమ్ము నా దగ్గర లేదు. మిత్రుడే డబ్బు తెచ్చి ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఎక్కడనుండి అంత డబ్బు తెచ్చేవాడో తెలియదు. నన్ను మాంసాహారిగా మార్చాలని, భ్రష్టుణ్ణి చేయాలని దీక్ష వహించినందున మిత్రుడే డబ్బు ఖర్చు పెడుతూ వుండేవాడు. అతనికి మాత్రం మాటిమాటికీ అంత డబ్బు ఎట్లా లభిస్తుంది? అందువల్ల మా మాంసాహార విందుల సంఖ్య తగ్గిపోయింది.

దొంగతనంగా విందులు ఆరగించిన తరువాత నాకు ఆకలి వేసేది కాదు. యింటికి వచ్చి ఆకలి లేదని చెప్పవలసి వచ్చేది. మా అమ్మ అన్నానికి పిలిచేది. ఆకలి లేదంటే కారణం అడగకుండా వూరుకునేది కాదు “అన్నం అరగలేదు ఆందువల్ల ఆకలి కావడం లేదని” అబద్ధం చెప్పవలసి వచ్చేది. ఈ విధంగా అబద్ధాలు చెబుతున్నప్పుడు బాధగా వుండేది. అమ్మకు అబద్ధం చెబుతున్నాను అని కుమిలిపోయేవాణ్ణి. మా బిడ్డలు మాంసాహారులైనారని తెలిస్తే మా తల్లిదండ్రుల గుండెలు బ్రద్దలైపోతాయని నాకు తెలుసు. ఈ విషయాలన్నీ తలుచుకుని బాధపడుతూ వుండేవాణ్ణి.

మాంసభక్షణను గురించి హిందూదేశంలో ప్రచారం చేయడం ఎంతో అవసరం అన్నమాట నిజమే. కాని తల్లిదండ్రుల్ని మోసగించడం, వారికి అబద్ధం చెప్పడం సబబా? అందువల్ల వారు జీవించియున్నంతవరకు ఇక మాంసం తినకూడదు. నేను పెద్దవాణ్ణి అయిన తరువాత బహిరంగంగా తింటాను. ఈ లోపల మాంసభక్షణ విరమించి వేస్తాను అను నిర్ణయానికి వచ్చాను.

నా యీ నిర్ణయాన్ని మిత్రునికి తెలియజేశాను. తమ కొడుకులిద్దరూ మాంసాహారులైనారను విషయం మా తల్లిదండ్రులకు తెలియదు. మా తల్లిదండ్రుల ముందు అబద్ధాలాడకూడదని నిర్ణయించుకొని మాంసభక్షణ మానివేశానే కాని నా ఆ మిత్రుని సావాసం మాత్రం నేను మానలేదు. యితరుల్ని సంస్కరించాలనే కోరిక నన్ను నిలువునా ముంచి వేసింది. చివరకు ఆ సావాస ఫలితం యింతగా హానికారి అవుతుందని నేను అప్పడు ఊహించలేదు.

అతని స్నేహం నన్ను వ్యభిచార రంగంలోకి కూడా దింపేదే. కాని తృటిలో ఆ ప్రమాదం తప్పిపోయింది. ఒకరోజున అతడు నన్ను ఒక వేశ్య యింటికి తీసుకొనివెళ్ళాడు. కొన్ని వివరాలు చెప్పి నన్ను వేశ్య గదిలోకి పంపాడు. అవసరమైన ఏర్పాట్లు అదివరకే అతడు చేశాడు. యివ్వవలసిన సొమ్ము అదివరకే యిచ్చివేశాడు, నేను పాపపు కోరల్లో చిక్కుకుపోయాను. కాని భగవంతుడు నన్ను రక్షించాడు. ఆ పాపపు గుహలో నాకు కండ్లు కనబడలేదు, నోటమాట రాలేదు. పరుపు మీద నేను ఆమె ప్రక్కన కూర్చున్నాను. నా నోరు మూసుకుపోయింది. ఆమె చాలాసేపు ఓపిక పట్టింది. యిక పట్టలేక తిట్టడం ప్రారంభించింది. ద్వారం చూపించి వెళ్ళిపొమ్మంది. నా మగతనానికి అవమానం  కలిగినట్లనిపించింది. సిగ్గుపడిపోయాను. భూమి తనలో నన్ను ఇముడ్చుకోకూడదా అని అనిపించింది. అయితే ఆ ఆపద నుండి నన్ను రక్షించినందుకు భగవంతుణ్ణి ప్రార్ధిస్తూవున్నాను. నా జీవితంలో ఇటువంటి ఘట్టాలు నాలుగు పర్యాయాలు జరిగాయి. అదృష్టం వల్ల వాటి నుండి బయటపడ్డాను. నా ప్రయత్నం కంటే నా అదృష్టమే తోడ్పడిందని చెప్పవచ్చు. యివన్నీ తప్పుడు పనులే. నా పతనానికి కారణం విషయవాంఛలే. ఈ వ్యవహారంలో అవే ఎక్కువగా పనిచేశాయి. నేను వాటికి లొంగిపోయాను. నిజానికి క్రియ ఎట్టిదో, అందుకు తోడ్పడే భావం కూడా అట్టిదే. కాని లౌకిక దృష్టితో చూస్తే నేను నిర్దోషిని. దేవుని అనుగ్రహం వల్ల కర్తకు, అతనికి సంబంధించిన వారికి తప్పిపోయే కర్మలు కొన్ని వుంటాయి. ఆ విధంగా ఆపద తప్పిపోయిన తరువాత జ్ఞానం కలిగిన వెంటనే దేవుని అనుగ్రహాన్ని గురించి మానవుడు యోచిస్తాడు. మనిషి వికారాలకు లోనవడం అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా భగవంతుడు అడ్డుపడి ఆ వికారాల్ని తొలగించి మనిషిని రక్షిస్తూ వుండటం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఎలా జరుగుతున్నది? మానవుడు ఎంతవరకు స్వతంత్రుడు? ఎంతవరకు పరతంత్రుడు? పురుష ప్రయత్నం ఎంతవరకు పనిచేస్తుంది? భగవదేచ్ఛ ఎప్పుడు రంగంలో ప్రవేశిస్తుంది? యిది పెద్ద వ్యవహారం.

ఇక విషయానికి వద్దాం. యింత జరిగినా నా స్నేహితుని దుస్సాంగత్యాన్ని గురించి నా కండ్లు మూసుకొనే వున్నాయి. ఊహించి యెరుగని అతని దోషాలు ప్రత్యక్షంగా యింకా నేను చూడలేదు. అతని దోషాల్ని కండ్లారా చూచినప్పుడు కాని నా కండ్లు తెరుపుడుపడలేదు. అప్పటివరకు ఆ దోషాలు అతనిలో లేవనే భావించాను. వాటిని గురించి తరువాత వివరిస్తాను.

అప్పటి మరో విషయం వ్రాయడం అవసరమని భావిస్తున్నాను. మా దంపతుల మధ్య ఏర్పడిన విభేదాలకు జరిగిన కలహాలకు కారణం కూడా అతడి స్నేహమే. మొదటే వ్రాశాను నేను నా భార్య యెడ మిక్కిలి ప్రేమ కలవాణ్ణని. దానితోపాటు ఆమె యెడల నాకు అనుమానం కూడా ఏర్పడింది. యిందుకు కారణం ఆ స్నేహమే. మిత్రుడు చెప్పిన మాటల్ని నిజాలని పూర్తిగా నమ్మాను. మిత్రుని మాటలు నమ్మి నా భార్యను కష్టాలపాలు చేశాను. నేను ఆమెను హింస పెట్టాను. అందుకు నన్ను నేను క్షమించుకోలేను. యిలాంటి కష్టాలు హిందూస్త్రీయే సహిస్తుంది. అందువల్లనే స్త్రీని నేను ఓర్పుకు, సహనశక్తికి ప్రతీక అని భావిస్తాను. నౌకరును అపోహతో అనుమానిస్తే అతడు ఉద్యోగం మానుకొని వెళ్ళిపోతాడు. కన్నకొడుకుని అవమానిస్తే ఇల్లు వదలి  వెళ్ళిపోతాడు. స్నేహితులలో అనుమానం పెరిగితే స్నేహం దెబ్బతింటుంది. భర్త మీద అనుమానం కలిగితే లోలోన భార్య కుమిలిపోవలసిందే. కాని భార్య మీద భర్తకు అనుమానం కలిగితే పాపం ఆమె ఏం చేస్తుంది? ఆమె ఎక్కడికి వెళుతుంది? పెద్ద కులాలకు చెందిన హిందూ స్త్రీ కోర్టుకెక్కి విడాకులు కోరగల స్థితిలో కూడా లేదు. యీ విధంగా స్త్రీ విషయంలో న్యాయం ఏకపక్షంగా వున్నది. నేను కూడా అట్టి న్యాయాన్నే అనుసరించాను. అందువల్ల కలిగిన దుఃఖం ఎన్నటికీ పోదు. అహింసను గురించి పూర్తి జ్ఞానం కలిగిన తరువాతే అనుమాన ప్రవృత్తి నాలో తగ్గింది. అంటే బ్రహ్మచర్య మహత్తు నేను తెలుసుకున్న తరువాత, భార్య, భర్తకు దాసి కాదనీ, అతడి సహచారిణి అనీ, సహధర్మచారిణి అనీ యిద్దరూ సుఖదుఃఖాలలో సమాన భాగస్వాములనీ, మంచి చెడులు చూచే స్వాతంత్ర్యం భర్తకు వున్నట్లే భార్యకు కూడా వున్నదనీ నేను తెలుసుకోగలిగాను. తరువాతనే అనుమాన ప్రవృత్తి తొలగిపోయింది. అనుమానంతో నేను వ్యవహరించిన కాలం జ్ఞాపకం వచ్చినప్పుడు నా మూర్ఖత్వం, విషయవాంఛల ప్రభావం వల్ల కలిగిన నిర్ధాక్షిణ్యం మీద నాకు కోపం వస్తుంది. మిత్రుని మీద కలిగిన మోహాన్ని తలుచుకున్నప్పుడు నా మీద నాకే జాలి కలుగుతుంది.

8. దొంగతనం - ప్రాయశ్చిత్తం

మాంసభక్షణ ప్రారంభించిన కాలంనాటి మరికొన్ని దోషాలు కూడా వివరించవలసినవి వున్నాయి. అవి నా వివాహం కాకపూర్వం నాటివి, ఆ తరువాతవి కూడా.

నా ఒక బంధువు సావాసంలోపడి సిగరెట్టు తాగాలని నాకు సరదా కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు, సిగరెట్టు త్రాగితే కలిగే ప్రయోజనం ఏమిటో, దాని వాసనలో గల మజా ఏమిటో మా యిద్దరిలో ఎవ్వరికీ తెలియదు. కాని పొగ ఊదుతూ వుంటే మజాగా వుండేది. మా పినతండ్రికి ఆ అలవాటు వున్నది. ఆయన, మరో కొంతమంది పొగపీల్చి సుతారంగా బయటికి వదులుతూ వుండటం చూచి మాకు కూడా ఒక దమ్ము లాగుదామునే కోరిక కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. అందువల్ల మా పినతండ్రి కాల్చిపారేసిన సిగరెట్టు ముక్కలు ఏరి కాల్చడం ప్రారంభించాము. అయితే అవి అనుకున్నప్పుడల్లా దొరికేవి కావు. దొరికినా ఎక్కువ పొగ వచ్చేది కాదు. అందువల్ల నౌకర్ల డబ్బు దొంగిలించి బీడీలు కొనడం ప్రారంభించాము. అయితే వాటిని ఎక్కడ దాచడమా అను సమస్య వచ్చింది. పెద్దవాళ్ళ ముందు ఎలా కాల్చడం? అందువల్ల దొంగిలించిన డబ్బుతో దేశవాళీ సిగరెట్లు కొని రహస్యంగా త్రాగడం ప్రారంభించాం. కొన్ని మొక్కల కాడలకు (పేరు జ్ఞాపకం లేదు) సన్నని బెజ్జాలు వుంటాయనీ, వాటిని సిగరెట్ల మాదిరిగా కాల్చవచ్చనీ విన్నాము. దీనితో మాకు తృప్తి కలుగలేదు. మా పారతంత్ర్యాన్ని గురించి యోచించి చాలా దుఃఖించాము. పెద్దల అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోతున్నందుకు విచారించాము. చివరికి విసిగిపోయి ఆత్మహత్యకు పూనుకున్నాము. అయితే ఆత్మహత్య ఎలా చేసుకోవడం? విషం ఎలా దొరుకుతుంది? ఉమ్మెత్త గింజలు విషం అని తెలుసుకున్నాము. వాటి కోసం వెతుక్కుంటూ అడవికి వెళ్ళి వాటిని తెచ్చాము. సాయంకాలం వాటిని తినాలని ముహూర్తం నిర్ణయించుకున్నాం. కేదారేశ్వరుని దేవాలయానికి వెళ్ళి, దీపం ప్రమిదలో నెయ్యి పోశాం. దైవదర్శనం చేసుకున్నాం. మారుమూల వున్న చోటుకోసం వెతికాం. అయితే వెంటనే ప్రాణం పోకపోతే? చస్తే ఏమి లాభం? ఏమి సాధించినట్లు? స్వాతంత్ర్యం లేకుండా బ్రతకకూడదా? ఈ రకమైన ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. ధైర్యం తగ్గిపోసాగింది. అప్పటికి రెండు మూడు ఉమ్మెత్తగింజలు మ్రింగివేశాము. తరువాత సాహసించలేకపోయాము. మాయిద్దరికీ చావంటే భయం వేసింది. కుదుటపడేందుకు, ప్రాణాలు నిలుపుకునేందుకు రామమందిరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఆత్మహత్య చేసుకోవడం తేలిక వ్యవహారం కాదని అప్పుడు నాకు బోధపడింది. అప్పటినుండి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటానని అంటే నాకు వాళ్ళ మాటమీద విశ్వాసం కలుగకుండా పోయింది.

ఈ ఆత్మహత్యా సంకల్పం మాకు మరో విధంగా తోడ్పడింది. సిగరెట్టు పీకలకు ఒక సలాం చేసేందుకు, సిగరెట్ల కోసం నౌకర్ల డబ్బులు దొంగిలించకుండా వుండేందుకు ఎంతగానో సహకరించింది.

పెరిగి పెద్దవాడినైన తరువాత సిగరెట్లు తాగాలనే వాంఛ ఎన్నడూ నాకు కలుగలేదు. అది చాలా అనాగరికం, హానికరం, రోత వ్యవహారం అను నిశ్చయానికి వచ్చాను.

ప్రపంచంలో సిగరెట్ల కోసం యింత మోజెందుకో నాకు అర్థం కాదు. పొగ త్రాగేవాళ్ళతో రైలు ప్రయాణం నేను చేయలేను, నాకు ఊపిరాడదు.

అంతకంటే మరో పెద్ద తప్పు చేశాను. నాకు 13 ఏండ్ల వయస్సులో (అంతకంటే తక్కువ వుండవచ్చు) మొదట సిగరెట్లకోసం డబ్బులు దొంగిలించాను. తరుపోత 15వ ఏట పెద్ద దొంగతనం చేశాను. మాంసం భక్షించే మా అన్న చేతికి వుండే బంగారుమురుగు నుండి కొంచెం బంగారం దొంగిలించాము, మా అన్న ఇరవై రూపాయలు అప్పుబడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చడమా అని మేమిద్దరం ఆలోచించాము. అతని చేతికి బంగారు మురుగు వుంది. దానిలో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం ఆ పని చేశాం. అప్పు తీర్చాం. కాని ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయితే నా మనస్సు శాంతించలేదు. తండ్రిగారికి చెప్పవలెనని అనిపించింది. కాని ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పేందుకు సాహసం కలుగలేదు. వారు కొడతారనే భయం కలుగలేదు. తన బిడ్డలనెవ్వరినీ మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే మనస్తాపంతో క్రుంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా పరవాలేదని భావించాను.

చివరికి ఒక చీటీ మీద చేసిన తప్పంతా వ్రాసి క్షమించమని ప్రార్థించాలి అను నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద జరిగినదంతా వ్రాశాను. వెళ్ళి మా తండ్రిగారికి యిచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగినవిధంగా శిక్షించమని, యిక ముందు దొగతనం చేయనని శపధం చేశాను. ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి యిస్తున్నప్పుడు వణికి పోయాను. మా తండ్రి భగందర రోగంతో బాధపడుతూ మంచం పట్టి వున్నారు. ఆయన బల్లమీద పడుకుని వున్నారు. చీటీ వారిచేతికి యిచ్చి ఎదురుగా నిలబడ్డాను.

వారు చీటీ అంతా చదివారు. వారి కండ్ల నుండి ముత్యాలవలె కన్నీరు కారసాగింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషము సేపు కండ్లు మూసుకుని ఏమో యోచించారు. తరువాత చీటీని చింపివేశారు. మొదట చీటీ చదివేందుకు ఆయన పడకమీద నుంచి లేచారు. ఆ తరువాత తిరిగి పడుకున్నారు. నాకు కూడ ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడనైతే ఈ రోజున కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నది. వారి ప్రేమాశృవులు నా హృదయాన్ని కడిగివేశాయి. అనుభవించిన వారికే ఆ ప్రేమ బోధపడుతుంది.

“రామబాణ్ వాగ్యాంరే హొయ్ తే జేణే” రామబాణం మహిమ ఆ బాణం తగిలిన వాడికే తెలుస్తుంది. అని దాని అర్థం. ఆ ఘట్టం నాకు మొదటి అహింసా పాఠం అయింది. పితృవాత్సల్యం అంటే ఏమిటో అప్పుడు నాకు బోధపడలేదు. కాని ఈనాడు ఆలోచిస్తే అదంతా అహింస మహిమేనని అనిపిస్తుంది. అట్టి అహింస అంతటా వ్యాప్తమైనప్పుడు దాని స్పర్శ తగలకుండా వుండదు. అహింసా శక్తి అమోఘం. అంతటి శాంతం ఓర్పు వాస్తవానికి మా తండ్రి స్వభావానికి విరుద్ధం. ఆయన కోప్పడతారనీ, దూషిస్తారనీ లేక తల బ్రద్దలు కొట్టుకుంటారనీ భావించాను. కాని ఆయన ప్రదర్శించిన శాంతితత్వం అద్భుతం. అందుకు కారణం దోషాన్ని అంగీకరించడమేనని నా విశ్వాసం. మళ్లీ యీ విధమైన దోషం చేయను అని శపథం చేశాను. దాని అర్థం గ్రహించగలవారి ముందు వుంచాను. ఆదే సరియైన ప్రాయశ్చిత్తమని నా అభిప్రాయం. నేను దోషం అంగీకరించి యిక చేయనని శపథం చేసినందువల్ల మా తండ్రి నన్ను విశ్వసించారు. వారికి నా మీద వాత్సల్యం ఇనుమడించిందని నాకు బోధపడింది.

9. పితృ నిర్యాణం - నా వల్ల జరిగిన మహాపరాధం

అప్పుడు నాకు పదహారో ఏడు. మా తండ్రిగారు రాచకురుపుతో బాధపడుతూ మంచం పట్టారని పాఠకులకు తెలుసు. మా అమ్మగారు, ఒక పాత నౌకరు, నేను మా తండ్రిగారికి ముఖ్య పరిచారకులం. నర్సుపని, అనగా కట్టు విప్పి తిరిగి కట్టు కట్టడం, మందులు ఇవ్వడం, అవసరమైనప్పుడు మందులు నూరడం, మందులు కలపడం మొదలగు పనులు నాకు అప్పగించారు. ప్రతి రాత్రి వారి కాళ్ళు పిసికి, వారు చాలు అన్నప్పుడు విరమించేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు వారు నిద్రించేంతవరకు కాళ్ళు పిసుకుతూ వుండేవాణ్ణి. ఈ విధంగా తండ్రికి సేవ చేయడం నాకు ఎంతో ఇష్టంగా వుండేది. ఈ విషయంలో నేను ఎప్పుడూ ఏమరచి వుండలేదని గుర్తు. నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు అవసరమైన సమయం మినహా, మిగతా సమయమంతా బడికి వెళ్ళిరావడం, తండ్రికి సేవ చేయడంలో గడుపుతూ వుండేవాణ్ణి. నాకు మా తండ్రి సెలవు యిచ్చినప్పుడు వారికి కొంచెం నయంగా వున్నప్పుడు మాత్రమే నేను సాయంత్రం వాహ్యాళికి వెళుతూ వుండేవాణ్ణి. ఆ ఏడే నా భార్యకు నెల తప్పింది. యిప్పుడు ఆ విషయం తలచుకుంటే సిగ్గువేస్తుంది. నేను విద్యార్థి దశలో వుండికూడా బ్రహ్మచర్యాన్ని పాటించలేదు. నాకు కలిగిన సిగ్గుకు అదొక కారణం. విద్యా వ్యాసంగం నా విధి. పైగా చిన్నప్పటి నుంచి శ్రవణుడంటే నాకు గురి. పితృసేవ అంటే నాకు ఆసక్తి. అయినా నా భోగవాంఛ వీటన్నింటినీ మించిపోయిందన్నమాట. నా సిగ్గుకు యిది రెండో కారణం. ప్రతిరోజు రాత్రిపూట నా చేతులు మా తండ్రి పాదాలు వత్తుతూ వున్నా నా మనస్సు మాత్రం పడకగది మీద కేంద్రీకరించి యుండేది. ధర్మశాస్త్రం, వైద్యశాస్త్రం, లోకజ్ఞానం మూడింటి దృష్ట్యా స్త్రీ సంగమం నిషేధించబడిన సమయంలో నా మనఃస్థితి యిలా వుండేది. వదిలి పెడితే చాలు వెళదామని తొందరగా వుండేది. అనుమతి లభించగానే మా తండ్రి గారికి నమస్కరించి తిన్నగా పడకగదికి వడివడిగా వెళ్ళేవాణ్ణి. సరిగ్గా ఆ రోజుల్లోనే మతండ్రిగారికి క్రమక్రమంగా వ్యాధి ఎక్కువ కాసాగింది. ఆయుర్వేద వైద్యుల పూతలు, హకీముల పట్టీలు, నాటు వైద్యుల ఔషధాలు అన్నీ పూర్తి అయ్యాయి. ఒక అలోపతీ డాక్టరు కూడా వచ్చి తన శక్తిని వినియోగించి చూచాడు. శస్త్ర చికిత్స తప్ప వేరే మార్గం లేదని డాక్టరు చెప్పివేశాడు. కాని అందుకు మా కుటుంబ వైద్యుడు అంగీకరించలేదు. మా వైద్యుడు సమర్థుడు, సుప్రసిద్ధుడు కూడా. అందువల్ల ఆయన మాట నెగ్గింది. శస్త్రచికిత్స జరుగలేదు. అందుకోసం కొన్న మందులన్నీ మూలబడ్డాయి. కుటుంబవైద్యుడు శస్త్రచికిత్సకు అంగీకరించియుంటే వ్రణం నయమైపోయేదని నా తలంపు. ఆ శస్త్రచికిత్స బొంబాయిలో ప్రసిద్ధుడైన ఒక గొప్ప డాక్టరు చేత చేయించాలని భావించాం. కాని ఈశ్వరేచ్ఛ అనుకూలం కాలేదు. మృత్యువు నెత్తిమీదకు వచ్చిపడినప్పుడు మంచి ఉపాయం ఎవ్వరికీ తోచదుకదా! తరువాత శస్త్రచికిత్స పరికరాలన్నింటిని వెంట పెట్టుకుని మా తండ్రిగారు బొంబాయి నుండి ఇంటికి వచ్చేశారు. ఆయనకు యిక జీవించననే విశ్వాసం కలిగింది. క్రమంగా ఆయన నీరసించిపోయారు. మంచంమీదనే అన్ని పనులు జరగవలసిన స్థితి ఏర్పడింది. కాని మా తండ్రిగారు అందుకు అంగీకరించలేదు. పట్టుపట్టి చివరివరకు ఏదో విధంగా లేచి అవతలకి వెళుతూ వుండేవారు. బహిర్శుద్ధి విషయంలో వైష్ణవ ధర్మంలో విధులు అంత కఠినంగా వుండేవి. అట్టి శుద్ధి అవసరమే, కాని రోగికి బాధ కలగకుండా, మంచం మీద మైలపడకుండ, పరిశుభ్రంగా నిత్యకృత్యాలు, మంచం మీదనే ఎలా జరపవచ్చునో పాశ్చాత్య వైద్యశాస్త్రం మనకు నేర్పింది. ఈ విధమైన పారిశుద్ధ్యాన్నే నేను వైష్ణవ ధర్మమని అంటాను. కాని రోగతీవ్రతలో సైతం మా తండ్రిగారు స్నానాదుల కోసం మంచం దిగవలసిందేనని పట్టుబట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది. లోలోపల వారిని మెచ్చుకునేవాణ్ణి. ఒకనాడు ఆ కాళరాత్రి రానే వచ్చింది. మా పినతండ్రి రాజకోటలో వుండేవారు. మా తండ్రి అపాయస్థితిలో వున్నారని తెలిసి ఆయన రాజకోటకు వచ్చారని నాకు కొద్దిగా గుర్తు. వారిరువురి మధ్య సోదర ప్రేమ అధికంగా వుండేది. మా పినతండ్రి పగలంతా మా తండ్రిపడక దగ్గరే కూర్చుండి, రాత్రిపూట మమ్మల్నందరినీ నిద్రపొమ్మని పంపివేసేవాడు. తాను మా తండ్రి మంచం ప్రక్కనే పడుకునేవాడు. అది చివరిరాత్రి అని ఎవ్వరం ఊహించలేదు. అయితే ఎప్పుడూ భయం భయంగా వుండేది. ఆ రాత్రి 10.30 లేదా 11గంటలైంది. నేను మా తండ్రిగారి కాళ్ళు పిసుకుతూ వున్నాను. “నువు వెళ్ళు నేను కూర్చుంటాను” అని మా పినతండ్రి అన్నారు. ఆ మాటలు విని నేను సంతోషించాను. తిన్నగా పడకగదిలోకి వెళ్ళిపోయాను. పాపం నా భార్య గాఢనిద్రలో వుంది. నేను ఆమెను నిద్రపోనిస్తానా? ఆమెను లేపాను. అయిదు ఆరు నిమిషాల తరువాత మా నౌకరు వచ్చి దబదబ తలుపు తట్టాడు. కంగారు పడిపోయాను. నాన్నగారికి జబ్బు పెరిగిందని బిగ్గరగా అన్నాడు. బాగా జబ్బులో వున్నారను విషయం నాకు తెలుసు అందువల్ల జబ్బు పెరిగందనేసరికి విషయం నాకు బోధపడింది. పక్క మీద నుంచి క్రిందికి దూకాను.

“సరిగా చెప్పు ఏమైంది?”

“తండ్రిగారు చనిపోయారు” అని సమాధానం వచ్చింది. ఆ మట విని క్రుంగిపోయాను. పశ్చాత్తాపపడితే ప్రయోజనం ఏమిటి? ఎంతో విచారం కలిగింది. తండ్రిగారి దగ్గరికి పరుగెత్తాను. భోగవాంఛ నన్ను అంధుణ్ణి చేసింది. అందువల్లే చివరి క్షణంలో మా తండ్రిగారి శాశ్వత ప్రయాణ సమయంలో నేను వారి దగ్గర వుండలేక పోయాను. వారి వేదనలో పాలుపంచుకోలేకపోయాను. ఆ అదృష్టం మా పినతండ్రి గారికి దక్కింది. మా పినతండ్రి తన అన్నగారికి పరమ భక్తుడు. అందువల్ల ఆయనకే అంత్యకాలంలో సేవ చేసే అదృష్టం లభించింది. మరణం ఆసన్నమైందని మా తండ్రి గ్రహించారు. సైగ చేసి కలం, కాగితం తెప్పించి దాని మీద ఏర్పాటు చేయండి అని వ్రాశారు. తరువాత తన దండకు కట్టియున్న తాయిత్తును, మెడలో వున్న బంగారపు తులసీ తావళాన్ని తీసి క్రింద పెట్టారు. వెంటనే కన్నుమూశారు. కన్న తండ్రి ప్రాణం పోతున్నప్పుడు కూడా నా భార్యపై కలిగిన మోహం నాకు మాయరాని మచ్చ తెచ్చింది, నాకు తల్లి, తండ్రి యెడగల భక్తి అపారం. వారికోసం నా సర్వస్వం ధారపోయగలను. కాని అందు యింకా కొరత వుందని ఈ ఘట్టం వల్ల తేలింది. ఏ సమయంలో నేను మేల్కొని వుండాలో ఆ సమయంలో నా మనస్సు భోగవాంఛలకు లోబడింది. అందువల్ల ఎన్నటికీ క్షమించరాని దోషం చేశాను. ఏకపత్నీవ్రతుణ్ణి అయినా కామాంధుణ్ణి అని భావించక తప్పదు. కామవాంఛను అదుపులో పెట్టడానికి చాలాకాలం పట్టింది. దాన్ని అదుపులో పెట్టుకునేలోపున అనేక గండాలు గడిచాయి.

రెండు కారణాల వల్ల నేను సిగ్గుపడవలసి వచ్చింది. ఈ ప్రకరణం ముగించే ముందు మరో విషయం వివరించడం అవసరం. తరువాత నా భార్య ప్రసవించింది. శిశువు మూడు నాలుగు రోజుల కంటె మించి బ్రతకలేదు. చేసిన తప్పుకు శిక్షపడినట్లే కదా! బాల్య దంపతులందరికి యిది ఒక హెచ్చరిక వంటిది. దాన్ని గమనించి బాల్యంలో పెండ్లి అయిన దంపతులు మేల్కొందురుగాక.

10. మతంతో పరిచయం

ఆరవ ఏట నుంచి ప్రారంభించి పదహారు సంవత్సరాల వయస్సు వచ్చేదాక విద్యాధ్యయనం కావించాను. కాని పాఠశాలలో అప్పటిదాకా మతాన్ని గురించిన బోధ జరుగలేదు. కాని అక్కడి వాతావరణం వల్ల అట్టి కొత్త శిక్షణ లభించింది. ఇక్కడ ధర్మం అంటే ఆత్మబోధ లేక ఆత్మజ్ఞానమను విశాల అర్థాన్ని పాఠకులు గ్రహించుదురు గాక. వైష్ణవ సంప్రదాయంలో జన్మించడం వల్ల దేవాలయం వెళ్ళే అవకాశం నాకు తరచుగా లభిస్తూ ఉండేది. కాని ఆ కోవెల అంటే నాకు శ్రద్ధ కలుగలేదు. దాని వైభవం నాకు బోధపడలేదు. అచట కొంత అవినీతి జరుగుతున్నదని విని దాని యెడ ఉదాసీనత ఏర్పడింది.

అయితే నాకు అక్కడ అబ్బని విశేషం ఒకటి మా కుటుంబమందలి దాసివల్ల అబ్బింది. ఆమె నా యెడ చూపించిన వాత్సల్యం ఇప్పటికీ నాకు గుర్తు వున్నది. భూత ప్రేతాదులంటే నాకు భయం అని మొదట వ్రాశాను. మా కుటుంబదాసి పేరు రంభ. ఆమె భూత ప్రేతాదుల భయానికి రామ నామ స్మరణం మంచి మందు అని చెప్పింది. ఆమె చెప్పిన మందు మీద కంటే ఆమె మీద నాకు అమిత నమ్మకం ఏర్పడింది. దానితో అప్పటినుండి భూత ప్రేతాదుల భయం పోయేందుకై రామనామ జపం ప్రారంభించాను. ఆ జపం ఎక్కువ కాలం చేయలేకపోయినా చిన్ననాట హృదయంలో నాటుకున్న రామనామమును బీజం తరువాత కూడో చెక్కు చెదరకుండా ఆలాగే హృదయంలో వుండిపోయింది. ఈనాడు రామనామం నా పాలిట దివ్యౌషధం. ఆనాడు అది రంభ చాటిన విత్తనమే.

ఆ రోజుల్లో మా పినతండ్రి కొడుకు యొక్క సాహచర్యం మాకు లభించింది. అతడు రామభక్తుడు. మా అన్నదమ్ములిద్దరికీ అతడు రామరక్షాస్తోత్రం నేర్పే ఏర్పాటు చేశాడు. ఆ స్తోత్రం మేము కంఠోపాఠం చేశాము. ప్రతిరోజు ప్రాతఃకాలం స్నానం చేసిన తరువాత రామనామ స్తోత్ర జపం చేయడం అలవాటు చేసుకున్నాం. పోరుబందరులో వున్నంత కాలం మా జపం నిర్విఘ్నంగా సాగింది. రాజకోట వాతావరణం వల్ల కొంత సడలిపోయింది. ఈ జపం మీద నాకు శ్రద్ధ కలుగలేదు. మా పినతండ్రి కుమారుని యెడగల ఆదరభావం వల్ల రామరక్షాస్తోత్రం శుద్ధమైన ఉచ్చారణతో సాగుతూ వుండేది.

రామాయణ పారాయణం ప్రభావం నా మీద అమితంగా పడింది. మా తండ్రి గారు జబ్బు పడ్డప్పుడు కొంతకాలం పోరుబందరులో ఉన్నాం. అక్కడ గల రామాలయంలో రోజూ రాత్రిపూట రామాయణం వింటూ వుండేవాణ్ణి, రామభద్రుని పరమభక్తుడు భీలేశ్వర్‌కు చెందిన లాఘాముహారాజ్ రామాయణం వినిపిస్తూ వుండేవాడు. ఆయనను కుష్టురోగం పట్టుకుందట. ఆ రోగానికి ఆయన ఏ మందూ వాడలేదు. భీలేశ్వర్‌లో గల మహా శివునికి బిల్వ పత్రాలతో భక్తులు పూజ చేస్తూ వుండేవారు. ఆ విధంగా శివుని స్పర్శ పొందిన బిల్వపత్రాల్ని ఆయన కుష్ఠు సోకిన అవయవాలకు కట్టుకునేవాడు. రామనామ జపం చేస్తూ వుండేవాడు. దానితో అతని కుష్ఠురోగం పూర్తిగా నయమైపోయిందని ఆబాలగోపాలం చెప్పుకునేవారు. అది నిజమో కాదో మాకైతే తెలియదు. కాని ఆయన నోట రామాయణం వినేవారమంతా అది నిజమేనని నమ్ముతూ వుండేవారం. రామాయణగానం ప్రారంభించినప్పుడు ఆయన ఆరోగ్యంగా వున్నాడు. ఆయన కంఠం మధురంగా ఉన్నది. ఆయన రామాయణానికి సంబంధించిన దోహాచౌపాయిలు పాడుతూ వాటి అర్థం చెపుతూ అందులో తను లీనమైపోయేవాడు. శ్రోతలు తన్మయత్వంతో ఆయన గానం వింటూ వుండే వారు. అప్పుడు నాకు పదమూడు సంవత్సరాల వయస్సు. ఆయన రామకథ వినిపిస్తూ వుంటే ఆనందంతో వింటూ వుండేవాణ్ణి, యిప్పటికీ నాకు ఆ విషయం గుర్తు వుంది. ఆనాటి రామాయణ శ్రవణం వల్ల నాకు రామాయణం యెడ ప్రేమ అంకురించిన మాట నిజం. తులసీదాసు రామాయణం సర్వోత్తమమైన గ్రంధం.

కొద్దినెలల తరువాత మేము రాజకోటకు వచ్చాము. అక్కడ రామాయణ కాలక్షేపానికి అవకాశం చిక్కలేదు. కాని ప్రతి ఏకాదశి నాడు భాగవత పారాయణం జరుగుతూ వుండేది. నేను అప్పుడప్పుడు భాగవతం విందామని వెళ్ళేవాణ్ణి. ఆ పౌరాణికుడు జనాన్ని ఆకర్షించలేకపోయాడు. భాగవతం భక్తి ప్రధానమైనదని తెలుసుకున్నాను. నేను దాన్ని గుజరాతీ భాషలో తన్మయుడనై చదివాను. మూడు వారాలపాటు నేను ఉపవాసదీక్ష వహించిన సమయంలో పండిత మదన మోహన మాలవ్యాగారు మూలంలోని కొన్ని ఘట్టాలు చదివి వినిపించారు. మాలవ్యావంటి మహాభక్తుని నోట భాగవతం వినే అదృష్టం నాకు కలిగింది. అట్టి అదృష్టం బాల్యంలోనే కలిగియుంటే దానిపై గాఢమైన ప్రీతి కలిగియుండేది కదా అని అనుకున్నాను. బాల్యంలో శుభాశుభ సంస్కారాల ప్రభావం అమితంగా హృదయం మీద పడుతుంది. అందువల్ల బాల్యకాలంలో అటువంటి గ్రంథాలు ఎక్కువగా వినలేక పోతినను విచారం నాకు కలుగుతూ వుంటుంది.

రాజకోటలో వున్నప్పుడు సర్వమత సంప్రదాయాలయెడ సమత్వభావం సునాయాసంగా ఏర్పడింది. హిందూమతమందలి అన్ని సంప్రదాయాల యెడ నాకు ఆదరభావం కలిగింది. మా తల్లిదండ్రులు ఇక్కడ రామాలయానికి శివాలయానికి వెళుతూవుండేవారు. మమ్మల్ని కూడా తమతో పాటు అక్కడికి తీసుకుని వెళుతూవుండేవారు. అప్పుడప్పుడు మమ్మల్ని పంపుతూ వుండేవారు. జైన ధర్మాచార్యులు తరచుగా మా తండ్రిగారి దగ్గరకు వస్తూవుండేవారు. వారు మా తండ్రిగారితో ధర్మాన్ని గురించి, తదితర విషయాల్ని గురించి చర్చిస్తూవుండేవారు. ఇంతేగాక మా తండ్రికి మహమ్మదీయులు, పారశీకులు చాలామంది మిత్రులు వుండేవారు. వారు తమ తమ మతాల్ని గురించి చెపుతూ వుండేవారు. మా తండ్రి వారి మాటలు శ్రద్ధతో వింటూ వుండేవారు. మా తండ్రిగారికి ‘నర్సు’ గా వున్నందువల్ల వాళ్ళ మాటలు వినే అవకాశం నాకు లభిస్తూ వుండేది. ఈ విధంగా వివిధ మతాలను గురించిన విషయాలు వింటూ ఉండడం వలన వాటన్నిటియెడ సమత్వభావం నాకు కలిగింది. అందుకు ఆ చర్చలు దోహదం చేశాయి.

ఇక క్రైస్తవ మతం మాత్రమే మిగిలింది. దాని యెడ నాకు అభిరుచి కలుగలేదు. పైగా అరుచి ఏర్పడింది. ఆ రోజుల్లో క్రైస్తవమత బోధకులు కొందరు మా హైస్కూలు దగ్గర ఒక మూల నిలబడి హిందువుల్ని వారి దేవుళ్ళను నిందిస్తూ ఉపన్యాసాలు చేస్తూ వుండేవారు. నేను ఆ నిందను సహించలేకపోయేవాణ్ణి. వాళ్ళను వినడానికి నేను ఒక పర్యాయం మాత్రమే అక్కడ నిలబడ్డాను. ఇక నిలబడి వినవలసిన అవసరం లేకుండాపోయింది. ఆ రోజుల్లోనే సుప్రసిద్ధుడగు ఒక హిందువు క్రైస్తవమతంలో కలిసిపోయాడనీ, అతడు గోమాంసం తినవలసివచ్చిందనీ, మద్యం సేవించవలసి వచ్చిందని, వేషం కూడా మార్చవలసి వచ్చిందనీ తరువాత హ్యాటు, బూటు, కోటు వగైరా పాశ్చాత్య దుస్తులు ధరించి తిరగవలసి వచ్చిందనీ ఊరూ వాడా మారుమ్రోగిపోయింది. ఈ విషయం విని నేను బాధపడ్డాను. గోమాంసభక్షణం, మద్య సేవనం, పాశ్చాత్య వేషధారణం ఇట్టి విధులు విధించు మతం మతమనిపించుకోదను భావం నాకు కలిగింది. క్రొత్తగా మతం పుచ్చుకున్న ఆ వ్యక్తి అప్పుడే హిందూమతాన్ని, హిందూ దేవుళ్ళను, ఆచారాలను, చివరకు హిందు దేశాన్ని సైతం విమర్శిస్తున్నాడని విన్నాను. ఇట్టి విషయాలన్నీ క్రైస్తవ మత మంటే నాకు అరుచి కలిగించాయి.

ఇతర మతాల యెడ సమభావం కలిగిందంటే నాకు దేవుని మీద పూర్తిగా శ్రద్ధ ఏర్పడిందని అనుకోకూడదు. యిదే సమయంలో మా తండ్రిగారి దగ్గరగల గ్రంథ సముదాయంలో మనుస్మృతి అను గ్రంధం కనబడింది. అందు లిఖించబడిన విషయాలు నాకు శ్రద్ధ కలిగించలేదు. కొద్ది నాస్తికత్వం కలిగించాయి. మా రెండో పినతండ్రి కుమారుని తెలివితేటల మీద నాకు విశ్వాసం కలిగింది. నా సందేహాల్ని  అతనికి తెలియజేశాను. అతడు నా సందేహనివృత్తి చేయలేకపోయాడు. “పెద్దవాడవైన తరువాత సందేహ నివృత్తి నీవే చేసుకోగలుగుతావు. చిన్నపిల్లలు ఇటువంటి ప్రశ్నలు వేయకూడదు.” అని అతడు అన్నాడు. మనస్సుకు శాంతి లభించలేదు. మనుస్మృతి, అందు ఖాద్యాఖాద్య ప్రకరణం, తదితర ప్రకరణాలలో ప్రచలిత విధానాలకు విరుద్ధమైన కొన్ని విషయాలు వ్రాసివున్నాయి. యీ విషయమై కలిగిన సందేహానికి సమాధానం కూడా అదే పద్ధతిలో లభించింది. పెద్దవాడవైన తరువాత చదివి తెలుసుకుంటానమి మనస్సుకు నచ్చచెప్పకున్నాను.

మనుస్మృతి చదివిన ఆ సమయంలో నాకు అహింసా బోధ కలుగలేదు, మనుస్మృతిలో మాంసాహారానికి సమర్థన లభించింది. పాములు, నల్లులు మొదలుగా గల వాటిని చంపడం నీతి బాహ్యం కాదని తోచింది. ఆ రోజుల్లో ధర్మమని భావించి నల్లుల్ని నేను చంపాను. ఆ విషయం యిప్పటకీ నాకు జ్ఞాపకం వున్నది.

ఒక్క విషయం మాత్రం గాఢంగా నా హృదయంలో నాటుకున్నది. ఈ ప్రపంచం నీతిమీద నిలబడి వున్నది. నీతి అనేది సత్యంతో కూడివుంది కనుక సత్యాన్వేషణ జరిపితీరాలి అను భావం నాలో గట్టిపడింది. రోజురోజుకి సత్యం యొక్క మహత్తు నా దృష్టిలో పెరిగిపోసాగింది, సత్యాన్ని గురించిన వాఖ్య నా దృష్టిలో విస్తరించింది. యిప్పటికీ విస్తరిస్తూ ఉంది.

నీతికి సంబంధించిన ఒక ఛప్పయ్ ఛందం హృదయంలో చోటు చేసుకున్నది. ఆ పద్యంలో చెప్పబడిన అపకారానికి ప్రతీకారం అపకారం కాదు, ఉపకారం సుమా! అను సూత్రం నా జీవితానికి మూలమైంది. ఆ సూత్రం నా మనస్సుపై రాజ్యం చేసింది. అపకారికి మేలుకోరడం, మేలు చేయడం అంటే అనురాగం పెరిగింది. ఈ విషయమై ఎన్నో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను. ఆ మహత్తరమైన ఛప్పయ్ ఛందస్సు క్రింద ఉటంకిస్తున్నాను.

పాణీ ఆపనే పాయ్, భలుం భోజన్ తో దీజే
ఆనీ నమానే శీశ్, దండవత్ కోడే కీజే
ఆపణ ఘూసే దామ్, కామ్ మహోరో నుం కరిఏ
గుణ కేడేతో గుణ దశగణో, మన వాచా కర్మేకరీ
అవగుణ కేడేజే గుణకరే, తేజగమాంజీత్యో సహీ.

“జలమును మీకీయగలవాని కెందేని నొసగుమీ కడుపార నోగిరంబు
వందనంబును జేయువానికిజేయుమీ భుక్తిమై సాష్టాంగవందనంబు



దమ్మిడినీకిచ్చు ధన్యాత్మునకు మాఱుగా నిమ్ము నీ నెమ్మేనినేని కోసి
ఒకటియొసగిన బదిరెట్టులొసగవలయు
చెట్టు చేసిన మేలును జేయవలయు
ప్రాతఃకాలము నాటి యీ చేతలెల్ల
అనుపూర్విగ సత్యరహస్యమరయ”
(తెలుగు సేత - శతావధాని వేలూరి శివరామశాస్త్రి)


11. సీమకు ప్రయాణ సన్నాహం

1887 వ సంవత్సరంలో నేను మెట్రిక్యులేషన్ పరీక్షకు కూర్చున్నాను. అప్పుడు అహ్మదాబాదు, బొంబాయి, పరీక్షాకేంద్రాలు. దేశంలో దారిద్ర్యం ఎక్కువగా వుండటంవల్ల కాఠియావాడ్ విద్యార్థులు తమకు దగ్గరలో వున్న కొద్ది ఖర్చుతో పని జరిగే అహ్మదాబాదు కేంద్రానికి వెళ్ళేందుకు ఇష్టపడేవారు. మా కుటుంబ ఆర్థికస్థితి కూడా అంతంతమాత్రంగానే వుంది. అందువల్ల నేను ఆ కేంద్రానికే వెళ్ళవలసి వచ్చింది. రాజకోట నుండి అహ్మదాబాదు ఒంటరిగా మొదటిసారి ప్రయాణం చేశాను.

మెట్రిక్యులేషన్ పూర్తి అయిన తరువాత కాలేజీలో చదవమని మా పెద్దలు ప్రోత్సహించారు, భావనగర్ మరియు బొంబాయిలో కాలేజీలు వున్నాయి. భావనగర్‌లో ఖర్చు తక్కువ అందువల్ల అక్కడి శ్యామలదాస్ కాలేజీలో చేరాను. కాని అక్కడంతా అడవి గొడవ. ఉపాధ్యాయులు చెప్పేది నాకు బోధపడలేదు. అది వారి లోటు కాదు. నా లోటే. ఆరు నెలలు గడిచాయి. ఇంటికి వెళ్ళాను. “మావుజీదవే” అనువారు మా కుటుంబానికి పాత మిత్రులు. మాకు మంచి చెడులు చెబుతూ వుండేవారు. ఆయన బ్రాహ్మణులు, విద్వాంసులు. వ్యవహారదక్షులు. మా తండ్రిగారు గతించిన తరువాత కూడా మా కుటుంబ కష్టసుఖాల్ని గురించి తెలుసుకుంటూ వుండేవారు. సెలవుదినాల్లో వారు మా ఇంటికి వచ్చారు. మా అమ్మగారితోను, మా పెద్దన్నగారితోనూ మాట్లాడుతూ నా చదువును గురించి అడిగారు. నేను శ్యామలదాసు కాలేజీలో చేరి చదువుతున్నానని తెలుసుకున్నారు. కొంత సేపు యోచించి వారు ఈ విధంగా అన్నారు. “ఇప్పుడు కాలం మారింది. తగిన చదువు లేందే మీలో ఎవ్వరూ ఇప్పుడు మీ నాన్నగారు పొందిన పదవి, హోదా పొందలేరు. ఈ పిల్లవాడు చదువులో ముందడుగు వేస్తున్నాడు. కనుక ఇతడు ఈ హోదాను నిలుపుకునేలా చూడండి. బి.ఏ. ప్యాసు కావాలంటే ఇంకా నాలుగేళ్ళ సమయం పడుతుంది. ఎంత తంటాలుపడ్డా నెలకు 50 లేదా 60 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతాడు. దివాను మాత్రం కాలేడు. మా కుమారుని వలె లాయరు కావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ పిల్లవాడు లాయరు అయ్యేనాటికి దివాన్ పదవి కోసం చాలామంది లాయర్లు తయారవుతారు. అందువల్ల మీ పిల్లవాణ్ణి ఇంగ్లాండు పంపడం మంచిదని నా అభిప్రాయం. అక్కడ బారిష్టరు కావడం తేలిక అని మా అబ్బాయి కేవలరామ్ చెప్పాడు. మూడేళ్ళలో తిరిగి రావచ్చు. నాలుగైదు వేల రూపాయలు ఖర్చు అవుతాయి. బారిష్టరై తిరిగివచ్చిన ఆ క్రొత్తవాణ్ణి చూడండి ఎంత దర్జాగా వుంటాడో, అతడు అడిగితే చాలు దివాన్‌గిరీ ఇచ్చేలా వున్నారు. కనుక ఈ సంవత్సరమే మోహనదాస్‌ను ఇంగ్లాండు పంపడం మంచిది. మా అబ్బాయి కేవల్‌రామ్‌కు ఇంగ్లాండులో మిత్రులున్నారు. వారికి పరిచయ పత్రాలిస్తాడు. అందువల్ల పిల్లవాడికి అక్కడ యిబ్బంది కలుగదు” ఈ విధంగా మా వాళ్ళకు చెప్పి జోషీగారు (దవేగారిని మా కుటుంబీకులు జోషీగారని అనేవారు) మేము అంగీకరించినట్లు భావించి నావంకకు తిరిగి “నీవు ఇక్కడ చదవడం కంటే ఇంగ్లాండులో చదువుకునేందుకు అభిలషింపవా?” అని అడిగారు. వారి మాటలు విన్న నాకు సంతోషం కలిగింది. కాలేజీలో సాగుతున్న కఠినమైన విద్యాబోధన వల్ల నేను విసిగిపోయివున్నాను. అందువల్ల వారి ఈ మాట వినగానే ఆనందపడి “ఎంత త్వరగా నన్ను పంపితే అంత మంచిది” అని అనివేశాను. పరీక్షలు త్వరగా ప్యాసు కావడం కష్టం. అందువల్ల నన్ను వైద్య చదువుకు పంపకూడదా అని అడిగాను.

మా అన్నగారు నా మాటకు అడ్డువచ్చి “నాన్నకు వైద్యమంటే ఇష్టం లేదు. మనం వైష్ణవులం. పీనుగుల్ని కోయడం మనకు పాడికాదు అని నాన్నగారు నిన్ను దృష్టిలో పెట్టుకుని అనేవారు. నీవు వకీలు కావడం నాన్నగారికి ఇష్టం” అని అన్నాడు.

వెంటనే జోషి మ అన్నగారి మాటల్ని సమర్థిస్తూ ఇలా అన్నారు. “నేను మీ నాన్నగారిలా వైద్యవృత్తిని ద్వేషించను. వైద్యవృత్తిని శాస్త్రం కూడా నిషేధించలేదు. నీవు వైద్యపరీక్ష ప్యాసైనా దివాన్ పదవి పొందలేవు. నీవు దివాన్ కావాలి. చేతనైతే అంత కంటే పెద్ద పదవి సంపాదించాలి. అప్పుడే ఈ పెద్ద కుటుంబాన్ని పోషించగలుగుతావు. రోజులు త్వరగా మారిపోతున్నాయి. రోజులు గడిచేకొద్దీ కష్టాలు పెరుగుతాయి. అందువల్ల బారిష్టరు కావడమే అన్నివిధాలా మంచిది” అని చెప్పి మా అమ్మగారి వంక తిరిగి “ఇక నాకు సెలవీయండీ. నేను చెప్పిన విషయాన్ని గురించి యోచించండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఇంగ్లాండు ప్రయాణానికి సన్నాహాలు జరుపుతూ వుండండి. నేను చేయగల సాయం ఏమైనా వుంటే తప్పక చేస్తా” అంటూ జోషీ లేచి వెళ్ళిపోయారు. నేను ఆకాశ సౌధాలు నిర్మించసాగాను. మా అన్నగారు ఆలోచనా సాగరంలో మునిగిపోయారు. నన్ను ఇంగ్లాండు పంపడానికి డబ్బు ఎక్కడినుంచి తేవడం? ఒంటరిగా ఉన్నవాణ్ణి ఇంగ్లాండుకు ఎలా పంపడం? ఈ మధనలో అన్నగారు పడ్డారు

మా అమ్మగారు కూడా చింతలో పడిపోయింది. నన్ను విడిచి వుండలేదు. నా ఎడబాటు ఆమె సహించలేదు. అందువల్ల ఒక ఉపాయం ఆమెకు తట్టింది. “మన కుటుంబ పెద్దలు మీ పినతండ్రిగారున్నారు కదా! మొదట వారితో సంప్రదిద్దాం. వారు అంగీకరిస్తే తరువాత ఆలోచిద్దాం” అని ఆమె అన్నది.

మా అన్నగారికి మరో ఊహ కలిగింది. “పోరుబందరుపై మనకు కొంత హక్కు వున్నది. అక్కడ లేలీగారు పెద్ద అధికారి. మన కుటుంబమంటే వారికి గౌరవం. మన పినతండ్రిగారంటే వారికి ప్రత్యేక అభిమానం. నీ విద్యా వ్యయానికి సంస్థానం పక్షాన కొంత సహాయం అందజేసి వారు తోడ్పడవచ్చు” అని నాతో అన్నారు.

వారి మాటలు నాకు నచ్చాయి. పోరుబందరుకు ప్రయాణమైనాను. ఆ రోజుల్లో రైళ్ళు లేవు. ఎద్దుబండిమీద ప్రయాణం చేయాలి. నాకు పిరికితనం ఎక్కువ అని ముందు వ్రాశాను. అయితే ఇంగ్లాండుకు వెళ్ళాలనే ఉత్సాహం కలగడం వల్ల దాని ముందు నా పిరికితనం పటాపంచలైపోయింది. ధోరాజీ వరకు ఎడ్లబండిలో వెళ్ళాను. ఒంటెమీద ప్రయాణం సాగించాను. ఒంటె ప్రయాణం మొట్టమొదటిసారి చేశాను.

పోరుబందరు చేరాను. మా పినతండ్రిగారికి సాష్టాంగప్రణామం చేశాను. విషయమంతా వారికి చెప్పాను. వారు అంతా విని కొంచెం సేపు ఆలోచించి యిలా ఉన్నారు. “ఇంగ్లాండులో స్వధర్మ రక్షణ సాధ్యపడుతుందని నాకు అనిపించడంలేదు. నేను విన్న విషయాల్ని బట్టి అక్కడ స్వధర్మరక్షణ అసంభవమని భావిస్తున్నాను. అక్కడికి వెళ్ళివచ్చిన బారిష్టర్లను చూస్తున్నాను. వీళ్ళకు ఆ తెల్లవాళ్ళకు భేదం కనబడటం లేదు. ఆహారం విషయంలో వారికి నిషేధాలు లేవు. చుట్ట ఎప్పుడూ వారి నోట్లో ఉండవలసిందే. ఇంగ్లీషువాళ్ళ దుస్తులు సిగ్గులేకుండా ధరిస్తారు. అది మన కుటుంబ సంప్రదాయం కాదు. నేను కొద్దిరోజుల్లో తీర్ధయాత్రకు బయలుదేరుతున్నాను. నేను యిక ఎన్నాళ్ళో బ్రతకను. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్న నేను సముద్రయానానికి అంగీకరించలేను. కాని నేను నీ దారికి అడ్డం రాను. ఈ విషయంలో నిజంగా కావలసింది మీ అమ్మగారి అనుమతి. ఆమె అంగీకరిస్తే బయలుదేరు. నేను అడ్డురానని ఆమెకు చెప్పు. నేనూ ఆశీర్వదిస్తాను.

“నాకు కావలసింది అదే. మా అమ్మగారి అనుమతి కోసం ప్రయత్నిస్తాను. మీరు లేలీగారికి సిఫారసు చేయండి” అని అడిగాను “నేను ఎలా చేస్తాను? అయితే అతను మంచివాడు. నీవే ఉత్తరం వ్రాయి. మన కుటుంబాన్ని గురించి తెలిస్తే తప్పక అనుమతిస్తాడు. సహాయం కూడా చేయవచ్చు.” అని అన్నారు

నేను సిఫారసు చేయమని అడిగితే మా పినతండ్రి ఎందుకు అంగీకరించలేదో నాకు బోధపడలేదు. సముద్రయానానికి ప్రత్యక్షంగా సాయం చేయడం ఆయనకు ఇష్టం లేదని నాకు గుర్తు.

లేలీగారికి జాబు వ్రాశాను. వారి అనుమతి తీసుకుని కలుద్దామని వెళ్ళాను. మేడమీద ఎక్కుతూ ఆయన నన్ను చూచాడు. బి.ఏ. పూర్తిచేయి. తరువాత వచ్చి కలు. నీకు ఇప్పుడు ఏమీ సాయం లభించదు. అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నేను ఆయనను చూడడానికి బాగా తయారైవచ్చాను. వారికి చెప్పాలని కొన్ని మాటలు కూడా వ్రాసుకుని బాగా వల్లించాను. వంగి వంగి రెండు చేతులతో సలాం చేశాను. కాని అంతా వృధా అయిపోయింది.

తరువాత ఆలోచించాను. నా భార్య నగలపైనా దృష్టి పడింది మా అన్నగారిమీద నాకు అపరిమిత విశ్వాసం. ఆయన ఉదార హృదయుడు. ఆయనకు నాపై పుత్రవాత్సల్యం. నేను పోరుబందర్ నుండి రాజకోటకు వచ్చాను. జరిగినదంతా చెప్పాను. జోషీగారితో కూడా మాట్లాడాను. అవసరమైతే అప్పు చేసైనా ఇంగ్లాండు వెళ్ళమని ఆయన సలహా ఇచ్చాడు. నా భార్య నగలు అమ్మితే రెండు మూడు వేల రూపాయలు వస్తాయనీ, వాటిని అమ్మి ఇంగ్లాండుకు వెళతానని అన్నాను. మా అన్నగారు ఏదో విధంగా డబ్బు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు.

కాని మా అమ్మకు ఇష్టం లేదు. ఆమె ఏవో వంకలు చెప్పడం మొదలు పెట్టింది. ఇంగ్లాండు వెళ్ళే యువకులు చెడిపోతారని ఎవరో ఆమెకు చెప్పారు. అక్కడి వాళ్ళు గోమాంసం తింటారని, మద్యం త్రాగందే బ్రతకలేరని కూడా చెప్పారు. “ఇదంతా ఏమిటి?” అని ఆమె నన్ను అడిగింది. “అమ్మా! నన్ను నమ్మవా? నేను నీకు అబద్ధం చెబుతానా? నేను వాటిని ముట్టుకోను. ఒట్టు పెట్టుకుంటాను. నిజానికి అటువంటి అపాయమేవుంటే జోషీగారు వెళ్ళమని చెబుతారా?” అని అన్నాను. “నాయనా! నాకు నీమీద నమ్మకం ఉన్నది. కానీ దూరదేశం కదా! ఎట్లా నమ్మడం? నాకు ఏమీ తోచడం లేదు. బేచర్జీ స్వామిని అడిగిచూస్తాను” అని ఆమె అన్నది.

బేచర్జీ స్వామి మోఢ్ వైశ్యులు. మధ్యలో ఆయన జైన సాధువుగా మారారు. జోషీగారివలెనే వారు కూడా మా కుటుంబహితైషి. వారిని కలిశాము. “ఇతని చేత మూడు వాగ్దానాలు చేయించి ఇంగ్లాండుకు పంపవచ్చు” అని చెప్పి “మద్యం, మాంసం, మహిళ” లను ముట్టనని నా చేత ప్రమాణం చేయించారు. అప్పుడు మా అమ్మ అంగీకారం తెలిపింది.

హైస్కూల్లో నాకు వీడ్కోలు సభ జరిగింది. రాజకోటకు చెందిన ఒక పిన్న వయస్కుడు ఇంగ్లాండు వెళ్ళడం అక్కడ అసాధారణ విషయమైపోయింది. నేను నా కృతజ్ఞతలు తెలిపేందుకు మూడు నాలుగు వాక్యాలు ముందుగా వ్రాసి పెట్టుకున్నాను. వాటిని చదివేసరికి నాకు చెమటలు పట్టాయి. శరీరం వణికింది. ఆనాటి ఆ విషయం యిప్పటికీ నాకు బాగా గుర్తు ఉన్నది.

పెద్దల దీవెనలతో బొంబాయికి బయలుదేరాను. బొంబాయికి ఇదే నా ప్రథమ యాత్ర. మా అన్న నా వెంట బొంబాయి వచ్చారు. కాని ఇల్లు అలకగానే పండుగ అవుతుందా? బొంబాయిలో కొన్ని గండాలు దాటవలసి వచ్చింది.

12. కుల బహిష్కరణ

మా అమ్మ ఆజ్ఞను, ఆశీస్సులను పొంది పసిపాపను, భార్యను విడిచి అమితోత్సాహంతో బొంబాయికి బయలుదేరాను. జూన్, జూలై మాసాల్లో హిందూ మహాసముద్రం సామాన్యంగా ఒడిదుడుకులుగా ఉంటుంది. “మీ తమ్ముడికి ఇది మొదటి ప్రయాణం కదా! నవంబరు వరకు సముద్రప్రయాణం ఆపుకోండి. ఈ మధ్యనే తుఫాను వల్ల ఒక స్టీమరు కూడా మునిగిపోయింది” అని కొందరు మిత్రులు మా అన్నగారికి చెప్పారు. దానితో ఆయన కంగారుపడి సముద్ర ప్రయాణానికి అంగీకరించలేదు. అక్కడే ఒక మిత్రుని ఇంట్లో నాకు బస ఏర్పాటు చేసి తాను రాజకోటకు వెళ్ళి ఉద్యోగంలో చేరారు. నాకు కావలసిన ప్రయాణ వ్యయం మా బావ దగ్గర వుంచారు. వెళ్ళేప్పుడు ఇమ్మని చెప్పడమే గాక, అవసరమైన సహాయం చెయ్యమని మిత్రులకు కూడా చెప్పి మా అన్న ఇంటికి వెళ్ళిపోయారు.

బొంబాయిలో ప్రొద్దుపోవడం లేదు. రాత్రింబవళ్ళు ఎప్పుడూ ఇంగ్లాండుకు వెళ్ళే కలవరింతలే. ఇంతలో మా కులంవారిలో కలవరం బయలుదేరింది. అంతవరకు మా కులంవారైన మోఢ్‌వైశ్యులెవ్వరూ సీమ ప్రయాణం చేయలేదు. నేను సీమ వెళుతున్నాను గనుక నన్ను కులాన్నుంచి బహిష్కరించాలని కొందరికి ఆవేశం కలిగింది. అందుకోసం ఒక సభ ఏర్పాటు చేశారు. కులస్థులు చాలామంది వచ్చారు. నన్ను పిలిపించారు. నాకు అంత సాహసం ఎలా వచ్చిందో నాకే తెలియదు. నేనాసభకు నిర్భయంగ వెళ్ళాను. ఆ కులం పెద్ద అయిన సేఠ్ కు మా తండ్రిగారికి పరిచయం వున్నదట. ఆయన మాకు దూరబంధువుకూడానట. “కులధర్మాన్ని బట్టి నీవు సీమకు వెళ్ళడం సరిగాదు. సముద్రయానం మనకు నిషిద్ధం. అక్కడ ధర్మపాలనం సాధ్యంకాదు” అని సేఠ్ అన్నాడు. “సీమకు వెళ్ళడం ఎంతమాత్రం ధర్మేతరం కాదు. నేను అక్కడికి విద్య కోసం వెళుతున్నాను. మీరు భయపడుతున్న వస్తువుల్ని తాకనని మా అమ్మ దగ్గర ప్రతిజ్ఞ చేశాను. అది నన్ను కాపాడుతుంది” అని సమాధానం చెప్పాను.

“నీవు అక్కడికి వెళితే ధర్మపాలన జరగదు. మీ తండ్రిగారికి నాకు ఎంతటి స్నేహమో నీకు తెలుసా? కావున నా మాటవిను. సీమ ప్రయాణం విరమించుకో” అని సేఠ్ చెప్పగా, “అయ్యా నాకు తెలుసును. మీరు నా తండ్రివంటి వారు. సీమకు వెళ్ళాలనే నా నిర్ణయం మార్చుకోను. మా తండ్రిగారికి మిత్రులు, విద్వాంసులు అగు బ్రాహ్మణులు సీమకు వెళ్ళమని ప్రోత్సహించారు. వారికి దోషం ఏమీ కనబడలేదు. మా అమ్మగారు, మా అన్నగారు కూడా అంగీకరించారు. అందువల్ల నేను వెళతాను” అని సమాధానం ఇచ్చాను.

“అయితే కుల పెద్దల ఆజ్ఞను మన్నించవా?”

నాకు వేరే మార్గం లేదు. కులం పెద్దలు ఈ విషయంలో కల్పించుకోకూడదని స్పష్టంగా చెప్పివేశాను. దానితో సేఠ్‌గారికి కోపం వచ్చింది. చివాట్లు పెట్టాడు. నేను నిబ్బరంగా కూర్చున్నాను.

“నేను ఇతణ్ణి కులం నుంచి వెలివేస్తున్నాను. ఇతనికి సహాయం చేసేవారికి ఇతణ్ణి సాగనంపేందుకు హార్బరు దగ్గరకు వెళ్ళేవారికి ఒక రూపాయి పావలా (సాలి గ్రామదానం) జరిమానా విధిస్తున్నాను.” అని సేఠ్ తన నిర్ణయం ప్రకటించాడు. నేను ఏమీ చలించలేదు. సేఠ్ దగ్గర సెలవు తీసుకొని తిరిగి వచ్చేశాను. మా అన్నగారికి ఈ విషయం తెలిస్తే వెళ్ళవద్దు తిరిగి వచ్చేయమంటారేమోనని భయపడ్డాను. కాని మా అన్నగారు ఆ విధంగా అనలేదు సరికదా, కులంవారు వెలివేసినా భయపడనవసరం లేదు, నీవు నిర్భయంగా సీమకు వెళ్ళు అని జాబు వ్రాశారు. అది నా అదృష్టం. ఇదంతా జరిగిన తరువాత నాకు తొందర ఎక్కువైంది. ఇలాంటి వారి వత్తిడివల్ల మా అన్నగారి మనస్సు మారుతుందేమోనన్న భయం నన్ను పట్టుకున్నది. ఇంతలో జునాగఢ్ వకీలు ఒకరు ఇంగ్లాండుకు బారిష్టరు పరీక్ష కోసం సెప్టెంబరు నాలుగోతేదీన వెళుతున్నారని తెలిసింది. నేను ఈ వార్తను మా అన్నగారి మిత్రులకు తెలియజేశాను. ఇట్టి అవకాశం పోగొట్టుకోకూడదని వారంతా భావించారు. సమయం తక్కువగా వున్నందున తంతి ద్వారా ఈ విషయం మా అన్నగారికి తెలియజేశాను. ఆయన అందుకు అంగీకరించాడు. మా బావగారికి తెలిపి పైకం అడిగాను. ఆయన “సేఠ్ ఆజ్ఞను గురించి చెప్పి నేను నీకు డబ్బు ఇవ్వను” అని అన్నాడు. అప్పుడు నేను మా కుటుంబమిత్రులు ఒకరి దగ్గరకు వెళ్ళి విషయం అంతా చెప్పి నా ప్రయాణానికి అవసరమైన సొమ్ము ఇచ్చి సాయం చేయమనీ, మా అన్నగారిదగ్గర ఆ పైకం తీసుకోవచ్చుననీ విన్నవించాను. ఆయన నా విన్నపం అంగీకరించడమే కాక నన్నెంతో ప్రోత్సహించారు. వారికి కృతజ్ఞతలు తెలిపి అవసరమైన డబ్బు తీసుకొని వెళ్ళి ఓడ టిక్కెట్టు కొన్నాను. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడి మిత్రులు అనుభవజ్ఞులు. నాకు అవసరమయ్యే దుస్తులు తయారు చేయించారు. ఆ దుస్తులు విచిత్రంగా ఉన్నాయి. వాటిలో కొన్ని నాకు బాగున్నాయి. కొన్ని బాగాలేవు. ఇప్పుడు నేను ధరించేందుకు అంగీకరించిన నెక్‌టైని ఆనాడు అసహ్యించుకున్నాను. పొట్టి చొక్కా (జాకెట్) ధరిస్తుంటే సిగ్గు వేసింది అయితే ఇంగ్లాండు వెళ్ళాలనే ఉత్సాహం ముందు ఈ చిన్న వ్యవహారాలు నిలువలేదు. ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు అధికంగా సమకూర్చుకున్నాను. జునాగఢ్ వకీలు త్ర్యంబకరాయ్ మజుందార్‌గారు కేబిన్‌లోనే నా మిత్రులు నాకు ఒక బెర్తు తీసుకున్నారు. వారికి నన్ను పరిచయం చేశారు. ఆయన పెద్దవాడు, లోకానుభవం గలవాడు నాకు అంత లోకానుభవం లేదు. పద్దెనిమిదేండ్లవాణ్ణి. ఇతణ్ణి గూర్చి మీరేమీ భయపడవద్దని నన్ను సాగనంపడానికి వచ్చినవారందరికీ మజుందార్ చెప్పాడు. ఈ విధంగా 1888 సెప్టెంబరు 4వ తేదీనాడు బొంబొయినుండి ఓడలో ఇంగ్లాండుకు బయలుదేరాను.

13. చివరికి సీమ చేరాను

సముద్రయానం వల్ల అందరికీ సామాన్యంగా వచ్చే వాంతులు మొదలగు వ్యాధులు నాకు రాలేదు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ నాకు ఆరాటం పెరుగుతూ ఉంది. స్టుఅర్డు ఆనగా నౌకరుతో మాట్లాడటానికి కూడా నాకు సంకోచంగా ఉండేది. నాకు ఇంగ్లీషులో మాట్లాడే అలవాటు లేదు. రెండవ సెలూన్‌లో ఒక్క మజుందారు తప్ప తక్కిన వారంతా ఆంగ్లేయులే. వారితో నేను మాట్లాడలేను. వారు ఇంగ్లీషులో ఏమి మాట్లాడారో నాకు తెలిసేది కాదు. తెలిసినప్పుడు బదులు చెప్పలేకపోయేవాణ్ణి. సమాధానం చెప్పదలిస్తే ముందు ప్రతివాక్యం లోపల కూడబలుక్కోవలసి వచ్చేది. భోజన సమయంలో ముల్లు గరిటెలు వాడటం నాకు చేతకాదు. ఆహార పదార్థాలలో మాంసం కలవని వస్తువులేమిటి అని అడగడానికి ధైర్యం చాలేది కాదు. అందువల్ల భోజనశాలకు వెళ్ళి పదిమందితో కలిసి కూర్చొని నేనెప్పుడూ భోజనం చేయలేదు. నా గదిలోనే వుండి నేను వెంట తెచ్చుకున్న చిరుతిండ్లు, పండ్లు తింటూ ఉన్నాను. మజుందారుగారికి ఇట్టి బాధలేదు. ఆయన అందరితోను కలిసి స్టీమరు పైభాగాన తిరుగుతూ వుండేవారు. కాని నేను పగలంతా నా గదిలోనే వుండి సాయంత్రం జనం తక్కువగా వున్నప్పుడు ఓడ పైకి వెళ్ళి తిరుగుతూ వుండేవాణ్ణి. మజుందారు నీవు కూడా ప్రయాణీకులందరితో కలసిమెలసి వుండమనీ, సిగ్గుపడవద్దనీ చెబుతూ వుండేవాడు. లాయర్లు బాగా మాట్లాడుతూ వుండాలని కూడా చెప్పి తన అనుభవాలు వినిపిస్తూ వుండేవాడు. అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతూ వుండమనీ, తప్పులు వచ్చినా భయపడవద్దని కూడా చెప్పేవాడు. కాని నాకు మాత్రం ధైర్యం చాలలేదు.

ఒక ఆంగ్లేయుడు దయతో నన్ను మాటల్లోకి దింపాడు. అతడు నాకంటే పెద్దవాడు. నీవు ఏమి తిన్నాపు? నీకేం పని? నీవెక్కడికి వెళుతున్నావు? నీకీ మొగమాటం ఎందుకు? ఈ రకమైన ప్రశ్నలు వేశాడు. అందరితోబాటు భోజనానికి రమ్మని ప్రోత్సహించాడు. మాంసం ముట్టకూడదన్న నా దీక్షను గురించి విని నవ్వాడు. ఓడ ఎర్ర సముద్రంలో ప్రవేశించినప్పుడు స్నేహితుడిలా సలహా యిస్తూ “బిస్కే సముద్రం చేరేటంతపరకు నీవు చెప్పిన విధంగా శాకాహారం తీసుకోవచ్చు. కాని తరువాత నీ ఆహార నియమాన్ని మార్చుకోక తప్పదు. ఇంగ్లాండులో చలి అధికం. అందువల్ల మాంసం తినక తప్పదు అని చెప్పాడు.

“అక్కడ మాంసం తినకుండా కూడా జనం ఉండవచ్చని విన్నానే” అని అన్నాను. “అసంభవం, నాకు తెలిసినంతవరకు ఆ విధంగా వుండే వారెవ్వరూ లేరు. నేను మద్యం తాగుతున్నాను, నిన్ను తాగమని చెప్పానా? కాని మాంసం తినక తప్పదు. తినకపోతే అక్కడ బ్రతకడం కష్టం” అని అన్నాడు.

మీ ఉపదేశానికి ధన్యవాదాలు. నేను మా అమ్మగారి ఎదుట మాంసం ముట్టనని ప్రమాణం చేశాను. అందువల్ల ఏది ఏమైనా సరే నేను మాంసం తినను. ఒకవేళ కుదరకపోతే తిరిగి మాదేశానికి వచ్చేస్తాను. అదే మంచిదని నా అభిప్రాయం అని చెప్పాను.

ఓడ బిస్కే సముద్రంలో ప్రవేశించింది. కాని అక్కడ మద్య మాంసాల జోరు కనబడలేదు. నేను బయలుదేరేటప్పుడు నీవు మాంసం ముట్టలేదని తెలిసిన వారి దగ్గర సర్టిఫికేటు తీసుకోమని మిత్రులు నాకు చెప్పారు. ఆ విషయం నాకు జ్ఞాపకం వున్నది. నాకు ఒక సర్టిఫికేటు ఇమ్మని వారిని కోరాను. అతడు సంతోషంతో ఇచ్చాడు. నేను కొంతకాలం ఆ సర్టిఫికేటును జాగ్రత్తగా కాపాడాను కాని ఆ తరువాత మాంసం తినేవాళ్ళు కూడా మాంసం తినడం లేదని సర్టిఫికెట్లు పుచ్చుకోవడం చూచాను. దానితో ఈ విధమైన సర్టిఫికెట్ల మోజు తగ్గిపోయింది. మాటకు విలువ వుండాలే గాని ఈ విధమైన సర్టిఫికెట్ల వల్ల ప్రయోజనం ఏముంటుందని అనిపించింది.

ప్రయాణం ముగించుకొని మేము సౌదెంప్టన్ చేరాం. ఆనాడు శనివారం అని గుర్తు, నా మిత్రులు తెల్లని ఉన్ని సూటు (ఫాంటు, కోటు, వెస్టుకోటు) తయారు చేయించి ఇచ్చారు. ఓడలో నల్ల సూటు ధరించాను. రేవులో దిగినప్పుడు తెల్ల సూటు బాగుంటుందని భావించి దాన్ని ధరించాను. అవి సెప్టెంబరు మాసం చివరి రోజులు. నేను తప్ప మరెవ్వరూ అటువంటి సూటు ధరించలేదు. చాలామంది తమ సామాను, తాళం చెవుల్తో సహా గ్రిండ్లే కంపెనీ ఏజంటుకు అప్పగించడం చూచి నేను కూడా ఆలాగే నా సామాను వారికి అప్పగించాను.

డాక్టర్ ప్రాణ్ జీవన్ మెహతా. దలపత్‌రాం శుక్ల, రణజిత్ సింగ్ మహారాజ్, దాదాభాయి నౌరోజీ గార్ల పేరిట మిత్రులు ఇచ్చిన సిఫారసు పత్రాలు నా దగ్గర వున్నాయి. లండనులో విక్టోరియా హోటలులో బస చేయమని ఒకరు ఓడలో మాకు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం నేను, మజుందారు యిద్దరం విక్టోరియా హోటలుకు వెళ్ళాం. తెల్ల దుస్తుల్లో వెలివేసినట్లు నేనొక్కణ్ణే అక్కడ కనబడుతూ వుండటం వల్ల బాధపడ్డాను. మర్నాడు ఆదివారం. అందువల్ల గ్రిండ్లే కంపెనీ వారు సామను ఇవ్వరని తెలిసి చిరాకు పడ్డాను.

సౌదెంప్టస్ నుంచి డాక్టర్ మెహతాగారికి నేను తంతి పంపాను. అది వారికి అందింది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు హోటలుకు వచ్చి నన్ను కలిశారు. నన్ను ఎంతో ఆదరంగా చూచారు. నా ఉన్ని దుస్తుల్ని చూచి ఆయన నవ్వారు. మాటల సందర్బంలో అయాచితంగా వారి హేట్‌ను చేతిలోకి తీసుకున్నాను. దాని మృదుత్వాన్ని పరిశీలిద్దామని చేతితో దాన్ని అటూ ఇటూ త్రిప్పి దానిమీద గల రోమాల్ని నిమరడం ప్రారంభించాను. మెహతాగారు కొంచెం చిరాకు పడి నన్ను వారించారు. కాని అప్పటికే నా వల్ల పొరపాటు జరిగిపోయింది. ఇది మొదటి మందలింపు. పాశ్చాత్య దేశంలో యిది నేను నేర్చుకున్న మొదటి పాఠం. ఆ దేశ విశేషాల్ని గురించి మెహతాగారు చెబుతూ “ఇతరుల వస్తువుల్ని తాకకూడదు. హిందూ దేశంలో వలె ఇక్కడ ప్రథమ పరిచయం కాగానే ఎవ్వరినీ ప్రశ్నలు వేయకూడదు. హిందూ దేశంలో ఎదుటివారిని మనం అయ్యా అని సంబోధిస్తాం, ఇక్కడ ఆవిధంగా సంబోధించకూడదు. ఇక్కడ  యజమానుల్ని నౌకర్లు మాత్రమే అయ్యా అని సంబోధిస్తారు. హోటల్లో ఉంటే ధనం బాగా ఖర్చువుతుంది. కావున ఏదో కుటుంబంలో చేరడం మంచిది.” అని చెప్పాడు. సోమవారం నాడు ఒక నిర్ణయానికి వద్దామని భావించాం.

శ్రీ మజుందారు గారికీ, నాకు కూడ హోటలు ఖర్చు అధికమనిపించింది. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సింధు మిత్రుడు మాతోబాటు ప్రయాణించాడు. ఆయనకీ మజుందారుగారికీ స్నేహం కలిసింది. ఆయనకు లండను కొత్త కాదు. లండనులో మీకు అద్దె గదులు యిప్పిస్తానని ఆయన మాకు చెప్పాడు. మేము అంగీకరించాము. సోమవారంనాడు గ్రిండ్లే కంపెనీ వారు మా సామాన్లు మాకు అందజేశారు. హోటలు వాళ్ళకు ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చి వేశాము. మా సింధు మిత్రుడు మా కోసం చూచి పెట్టిన గదుల్లో ప్రవేశించాం. హోటలు గదికి చెల్లించాల్సిన అద్దె క్రింద నా వంతు సొమ్ము మూడు పౌండ్లు చెల్లించివేశాను. నేను బిల్లు చూచి నివ్వెరపోయాను. ఇంత సామ్ము చెల్లించి కూడా ఆకలితోనే వున్నాను. హోటలు భోజనం రుచించలేదు. ఒక వస్తువు తీసుకొని రుచి చూచాను. అది రుచించలేదు. మరో వస్తువు తీశాను. రెండిటికీ సొమ్ము చెల్లించవలసి వచ్చింది. బొంబాయి నుండి వెంట తెచ్చుకున్న తినుబండారాల మీదనే ఆధారపడవలసి వచ్చింది.

ఈ క్రొత్తగదుల్లో కూడా నాకు ఏమీ తోచలేదు. నా మనస్సు ఎప్పుడూ దేశం మీద, ఇంటిమీద, అమ్మమీద కేంద్రితమై వుండేది. బెంగగా వుండేది. రాత్రి ఇంటి సంగతులు జ్ఞాపకం వచ్చేవి. ఒకటే ఏడుపు. రాత్రిళ్ళు నిద్రలేదు. నా కష్టం ఇంకొకరితో చెప్పుకునేది కాదు. చెప్పి ఏం ప్రయోజనం? అంతా క్రొత్త. పాశ్చాత్య దేశాచారాలు నాకు క్రొత్త. ఎంతో జాగ్రత్తగా వుండాలని భావించాను. పైగా శాకాహారం గురించి నేను చేసిన ప్రతిజ్ఞ ఒకటి. అక్కడి ఆహార పదార్థాలు రుచిగా లేవు. ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యిగా మారింది నా పని. ఇంగ్లాండులో వుండలేను. తిరిగి ఇండియాకు వెళ్ళలేను. మధనలో పడిపోయాను. చివరకు ఈ మూడు సంవత్సరాలు ఇక్కడ గడపవలసిందే అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది నాకు కలగిన అంతరాత్మ ప్రబోధం.

14. నా అభిరుచి

డాక్టర్ మెహతా నన్ను కలుసుకునేందుకై విక్టోరియా హోటలు వెళ్ళారు. అక్కడ మా అడ్రసు తెలుసుకుని మా బసకు వచ్చారు. ఓడ మీద ప్రయాణిస్తున్నప్పుడు మూర్ఖంగా వ్యవహరించి ఒంటికి తామర తగిలించుకొన్నాను. అక్కడ ఉప్పు నీళ్లలో స్నానం చేయవలసి వచ్చింది, ఆ నీళ్లలో సబ్బు కరగదు. నేను సబ్బు రుద్దుకోవడం సభ్యతా లక్షణమని భావించాను. తత్ఫలితంగా శరీరం శుభ్రపడటానికి బదులు జిగటలు సాగింది. దానితో తామర అంటుకున్నది. డాక్టరు మెహతాగారికి చూపించాను. ఆయన మంటలు రేగే యాసిటిక్ యాసిడ్ అను మందు ఇచ్చారు. ఆ మందు నన్ను బాగా ఏడిపించింది.

డాక్టరు మెహతా మా గదులు వగైరా చూచారు. తల త్రిప్పుతూ “ఇలా నడవదు. చదువుకంటే ముందు ఇక్కడి జీవనసరళి తెలుసుకోవడం ముఖ్యo”. అందుకోసం ఏదేని కుటుంబంతో కలిసి వుండటం అవసరం. అయితే అందాకా కొంచెం నేర్చుకొనేందుకు, ఫలానా వారి దగ్గర నిన్ను ఉంచాలని అనుకొన్నాను. ఆయన వచ్చి నిన్ను తీసుకొని వెళతాడు అని చెప్పారు. వారి మాటను కృతజ్ఞతా భావంతో శిరసావహించాను. ఆ మిత్రుని దగ్గరకు వెళ్ళాను. ఆయన నన్ను ఆదరించాడు. తన తమ్ముడిలా నన్ను చూచాడు. ఆంగ్ల పద్ధతులు, అలవాట్లు నేర్పాడు. ఇంగ్లీషు మాట్లాడే విధానం కూడా నేర్పాడు.

నా భోజన వ్యవహారం సమస్యగా మారింది. ఉప్పు, మసాలాలు లేని కూరలు రుచించలేదు. ఇంటి యజమానురాలు పాపం నా కోసం యింకా ఏం చేస్తుంది? ఉదయం వరిగల పిండితో జావ చేసేది. దానితో కడుపు కొద్దిగా నిండేది. కాని మధ్యాహ్నం, సాయంత్రం తినడానికి ఏమీ ఉండేది కాదు. పొట్ట ఖాళీ. మాంసం తినమని రోజూ స్నేహితుల ఒత్తిడి పెరిగింది. ప్రతిజ్ఞ సంగతి చెప్పి మౌనం వహించేవాణ్ణి. వాళ్ళ తర్కానికి సమాధానం చెప్పడం కష్టంగా ఉండేది. మధ్యాహ్నం రొట్టె, కూర మురబ్బాతో పొట్ట నింపుకొనేవాణ్ణి. సాయంత్రం కూడా అదే తిండి. రెండు మూడు రొట్టె ముక్కలతో తృప్తి పడేవాణ్ణి. మళ్ళీ అడగాలంటే మొగమాటం. బాగా కడుపునిండా తినే అలవాటు గలవాణ్ణి. ఆకలి బాగా వేస్తూ వుండేది. తిన్నది చాలేది కాదు. మధ్యహ్నం, సాయంత్రం పాలు లభించేవి కావు. అడగటానికి బిడియం. నా యీ పద్ధతి చూచి మిత్రుడు చికాకు పడ్డాడు. “నీవు నా సోదరుడవు అయి వుంటే ఈ పాటికి మూట ముల్లె కట్టించి పంపివేసి వుండేవాణ్ణి. యిక్కడి పరిస్థితులు తెలియక, చదువురాని నీ తల్లి దగ్గర చేసిన ప్రమాణానికి విలువ ఏమిటి చెప్పు! అది లా ప్రకారం అసలు ప్రమాణమే కాదు. అట్టి ప్రమాణానికి బద్ధుడవైయుండటం అజ్ఞానం. ఇదిగో చెబుతున్నా, ఈ పట్టుదల నీకు యిక్కడ ఏమీ ఒరగదు. పైగా నీవు గతంలో మాంసం తిన్నానని, అది రుచించిందని కూడా చెప్పావు. అవసరం లేని చోట మాంసం తిని, అవసరమైన చోట తిననంటున్నావు. ఇది దురదృష్టకరం” అని గట్టిగా అన్నాడు.

ఇట్టి తర్కం రోజూ జరుగుతూ వుండేది. వంద రోగాలకు “తినను” అనే మందు నా దగ్గర వుంది. మిత్రుడు వత్తిడి చేసే కొద్దీ నా పట్టుదల పెరగసాగింది. రోజూ రక్షించమని దేవుణ్ణి ప్రార్ధిస్తూ వుండేవాణ్ణి. ఆ రోజు రక్షణ జరుగుతూ వుండేది. దేవుడంటే ఏమిటో, ఎవరో నాకు తెలియదు, కాని ఆనాడు “రంభ” చేసిన బోధ నాకు ఎంతో మేలు చేసింది. చేస్తూ ఉన్నది.

ఒకనాడు మిత్రుడు ‘బెంధమ్’ వ్రాసిన పుస్తకం నా ఎదుట చదవడం ప్రారంభించాడు. ఉపయోగాన్ని గురించిన అధ్యాయం అది. భాష, విషయం రెండూ గంభీరంగా వున్నాయి. అర్థం గ్రహించడం కష్టం. ఆయన వివరించి చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు “క్షమించండి. యింతటి సూక్ష్మ విషయాలు నాకు బోధపడవు, మాంసాహారం ఆవశ్యకమని అంగీకరిస్తాను. కాని నేను చేసిన ప్రమాణాన్ని జవదాటను. దాన్ని గురించి వాదించను. నేను మీతో వాదించి జయం పొందలేనని ఒప్పుకుంటున్నాను. అజ్ఞానిననో, పెంకి వాడననో భావించి నన్ను వదలి వేయండి. మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. మీరు నా హితైషులని నాకు తెలుసు. మీరు నా మంచి కోరి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారని తెలుసు. కాని నేను నా నియమాన్ని ఉల్లంఘించలేను. ప్రతిజ్ఞ ప్రతిజ్ఞయే. ఇది అనుల్లంఘనీయం” అని స్పష్టంగా చెప్పివేశాను.

నా మాటలు విని మిత్రుడు నిర్ఘాంతపోయాడు. అతడు ఆ పుస్తకం మూసి “మంచిది, యిక వాదించను” అని అన్నాడు. నేను సంతోషించాను. అతడు మళ్ళీ ఎన్నడూ ఆ విషయమై వాదించలేదు. అయితే నన్ను గురించి బాధపడుతూ వుండేవాడు. అతడు పొగత్రాగే వాడు. మద్యం సేవించేవాడు. నాకు అవి గిట్టవని చెప్పివేశాను. అతడు ఎన్నడూ వాటిని త్రాగమని నాకు చెప్పలేదు. అయితే మాంసం తినకపోతే మూలబడతావని, ఈ విధంగా వుంటే ఇంగ్లాండులో వుండలేవని, వచ్చిన పని పూర్తి చేసుకోలేవని ఆయన చెబుతూ వుండేవాడు.

ఒక నెల ఈ విధంగా గడిచింది. ఆయన ఇల్లు రిచ్‌మండ్‌లో ఉంది. అందువల్ల వారానికి రెండు మూడుసార్ల కంటే లండను వెళ్ళడం కష్టంగా వుండేది. ఇది చూచి డా‖ మెహతాగారు, దలపత్‌రాం శుక్లాగారు మరో కుటుంబం చూచారు. నేను అక్కడ వుండడం మంచిదని భావించారు. వెస్టు కెన్నింగ్టన్‌లో వున్న ఒక ఆంగ్లో ఇండియన్ కుటుంబంతో కలిసి వుండటానికి శ్రీ శుక్లాగారు ఏర్పాటు చేశారు. ఆ ఇంటి యజమానురాలు వితంతువు. ఆమెకు నా ప్రమాణాన్ని గురించి తెలియజేశాను. ఆమె నన్ను జాగ్రత్తగా చూస్తానని మాట ఇచ్చింది. నేను అక్కడ ప్రవేశించాను. కాని అక్కడ కూడా మాకు కటిక ఉపవాసమే. తినుబండారాలు కొద్దిగా పంపమని ఇంటికి వ్రాశాను. అవి యింకా రాలేదు. ఏ వస్తువు తినడానికి రుచిగా వుండేదికాదు. ఆమె పదార్థం వడ్డించి యిది బాగుందా అని అడుగుతూ వుండేది. కాని ఆ పదార్థం గొంతు దిగేది కాదు. ఆమె చేయగలిగింది మాత్రం ఏముంటుంది? నాకు బిడియం తగ్గలేదు. వడ్డించిన దానికంటే మించి యింకా వడ్డించమని అడగటానికి బిడియంగా వుండేది. ఆమెకు ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళు చెరొక రొట్టెముక్క బలవంతాన నా ప్లేటులో వుంచేవారు. అయితే అంతకు రెండింతలైతే గాని నా ఆకలి తీరదని పాపం వాళ్ళకు తెలియదు.

కొంతకాలానికి నాకు నిలకడ చిక్కింది. ఇంకా నేను, చదువు ప్రారంభించలేదు. శుక్లా గారి ధర్మమా అని వారిచ్చిన వార్తాపత్రికలు చదవడం ప్రారంభించాను. ఇండియాలో ఎప్పుడూ అట్టి పని చేయలేదు. ఇక్కడ ప్రతిరోజూ వార్తా పత్రికలు చదివి వాటి యందు అభిరుచి కలిగించుకున్నాను. డైలీ న్యూస్, డైలీ టెలిగ్రాఫ్, పాల్‌మాల్ గెజెట్ రోజూ చూడసాగాను. వాటిని చదవడానికి గంట కంటె ఎక్కువ సమయం పట్టేది కాదు.

ఇక ఊరు తిరగడం ప్రారంభించాను. మాంసం లేని హోటల్ళు ఎక్కడ వుంటాయా అని అన్వేషణ ప్రారంభించాను. మా ఇంటి యజమానురాలు అట్టివి కొన్ని వున్నాయని చెప్పింది. రోజూ పది, పన్నెండు మైళ్ళు తిరిగి చవుక రకం దుకాణాల్లో కడుపు నిండ రొట్టె తినడం ప్రారంభించాను. అయినా తృప్తి కలుగలేదు. ఇలా తిరుగుతూ వుంటే ఒక రోజున ఫారింగ్‌డన్ వీధిలో శాకాహారశాల (vegetarian restaurant) ఒకటి కనబడింది. తనకు కావలసిన వస్తువు దొరికినప్పుడు పిల్లవాడికి ఎంత ఆనందం కలుగుతుందో నాకు అంత ఆనందం కలిగింది. లోపలికి అడుగు పెట్టే పూర్వం ద్వారం దగ్గర గాజు కిటికీలో అమ్మకానికి పెట్టిన పుస్తకం ఒకటి కనబడింది. అది సాల్ట్ రచించిన “అన్నాహారసమర్థన” అను పుస్తకం. ఒక షిల్లింగు ఇచ్చి ఆ పుస్తకం కొన్నాను. తరువాత భోజనానికి కూర్చున్నాను. ఇంగ్లాండు వచ్చాక ఇవాళ కడుపు నిండా మొదటిసారి హాయిగా భోజనం చేశాను. దేవుడు నా ఆకలి తీర్చాడు.

సాల్ట్ రచించిన ఆ పుస్తకం చదివామ. నా మీద ఆ పుస్తక ప్రభావం బాగా పడింది. ఆ పుస్తకం చదివిన తరువాత అన్నాహారం మంచిదనే నిర్ణయానికి వచ్చాను. మా అమ్మగారి దగ్గర నేను చేసిన ప్రతిజ్ఞ నాకు ఎంతో ఆనందం కలిగించింది. జనమంతా మాంసాహారులైతే మంచిదని ఒకప్పుడు భావించేవాణ్ణి. తరువాత కేవలం ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం మాంసం త్యజించాను. భవిష్యత్తులో బహిరంగంగా మాంసం తిని ఇతరులను కూడా మాంసం తినమని చెప్పి ప్రోత్సహించాలని భావించాను. కాని ఇప్పుడు శాకాహారిగా ఇతరులను కూడా శాకాహారులుగా మార్చాలనే కోరిక నాకు అమితంగా కలిగింది.

15. ఆంగ్ల వేషం

రోజురోజుకి నాకు శాకాహారం మీద నమ్మకం పెరగసాగింది. సాల్ట్‌గారి పుస్తకం చదివిన తరువాత ఆహార విషయాలను గురించిన పుస్తకాలు చదవాలనే కాంక్ష పెరిగింది. దొరికిన పుస్తకాలన్నీ చదివాను. హోవర్డు విలియమ్స్‌గారు వ్రాసిన “ఎతిక్స్ ఆఫ్ డైట్” అను గ్రంథం వాటిలో ఒకటి. అందు ఆదికాలం నుండి నేటి వరకు మనుష్యుల ఆహారాన్ని గురించిన చర్చ విస్తారంగా వుంది. పైథాగరస్, జీసస్ మొదలుకొని నేటి వరకు వున్న మతకర్తలు, ప్రవక్తలు అంతా ఆకులు, కూరలు, అన్నం తినేవారని రుజువు చేయబడింది. డాక్టర్ ఎల్లిన్‌సన్ గారు ఆరోగ్యాన్ని గురించి వ్రాసిన రచనలు ఉపయోకరమైనవి. ఆయన రోగుల ఆహార పద్ధతులను నిర్ధారించి తద్వారా రోగాల్ని కుదిర్చే ప్రణాళికను ఒక దానిని రూపొందించాడు. అతడు శాకం, అన్నం తినేవాడు, తన దగ్గరికి వచ్చిన వారందరికీ ఆ ఆహారమే నిర్ధారించేవాడు. ఈ గ్రంథాలన్నీ చదవడం వల్ల ఆహార పరీక్ష నా జీవితంలో ప్రధాన స్థానం ఆక్రమించింది. ప్రారంభంలో ఆరోగ్యమే ఆహార పరీక్షకు ప్రధాన కారణం అయినా తరువాత ఈ శాకాహార విధానానికి ధర్మ దృష్టియే ప్రధాన లక్ష్యం అయింది.

అయినా నా మిత్రునికి నా ఆహారాన్ని గురించి బెంగపోలేదు. మాంసం తినకపోతే చిక్కిపోయే ప్రమాదం వుందనీ, ఇంగ్లీషువారితో కలిసి వుండలేకపోవచ్చుననీ భావించి నన్ను మాంసం తినమని వత్తిడి చేయడం ప్రారంభించాడు. నాయందు గల ప్రేమాధిక్యం వల్లనే ఆయన ఈ విధంగా చేశాడు. శాకాహార గ్రంథాలు విస్తారంగా చదవడం వల్ల నాకు చెడు జరుగుతుందేమోనని భయపడ్డాడు. ముఖ్యమైన అసలు చదువు మాని ఆహార పదార్థాలను గురించిన గ్రంధాలు చదువుతూ కాలమంతా వ్యర్థం చేసుకొంటాడేమోనను భావం ఆయనకు కలిగింది. దానితో చివరి ప్రయత్నం గట్టిగా చేయాలని నిర్ణయించుకొన్నాడు. ఒకనాడు నన్ను నాటకానికి రమ్మంటే వెళ్ళాను. నాటకం చూడబోయే ముందు హాల్‌బర్న్ రెస్టారెంటులో భోజనం ఏర్పాటు చేశాడు. అది నాకు ఒక నగరంలా కనబడింది. విక్టోరియా హోటలును ఖాళీ చేసిన తరువాత ఇంత పెద్ద హోటలును నేను చూడలేదు. విక్టోరియా హోటల్లో నేను ఏవిధమైన ప్రయోగమూ చేయలేదు. అచ్చట ఉన్నన్ని రోజులు ఏమి చేయడానికీ తోచలేదు. కాని ఈ హోటలుకు నన్ను తీసుకురావడానికి ఆయన ఒక ఎత్తు ఎత్తాడని తరువాత బోధపడింది. ఈ హోటలులో చాలామంది భోజనం చేస్తూ ఉంటారు. మధ్యలో మాట్లాడటానికి వీలు ఉండదు. కిక్కురుమనకుండా పెట్టింది తినవలసి వస్తుందనే భావం ఆయనకు కలిగిందన్న మాట. మేము చాలామందిమి ఒక బల్ల దగ్గర కూర్చున్నాము. మొదటి వాయిసూప్, అది దేనితో చేశారా అని నాకు సందేహం కలిగింది. మిత్రుణ్ణి అడగటానికి వీలు లేదు. వడ్డించేవాణ్ణి పిలిచాను. అతణ్ణి ఎందుకు పిలుస్తున్నావని మిత్రుడు గట్టిగా నన్ను అడిగాడు. అంతటితో ఆగక “నీవు ఈ సమాజంలో ఉండగలవు, ఎలా మెలగాలో తెలియకపోతే ఇంకొక హోటలుకు వెళ్ళి భుజించు. నేను వచ్చేదాకా హోటలు బయట వేచి ఉండు” అని కోపంగా అన్నాడు.

ఆయన మాటలు వినగానే నాకు లోలోన సంతోషం కలిగింది. వెంటనే లేచి, బయటికి వచ్చేశాను. దగ్గరలోనే ఒక శాకాహారశాల ఉంది. ప్రొద్దుపోయినందున దాన్ని మూసివేశారు. ఆపూట నాకు తిండిలేదు. తరువాత ఇద్దరం నాటకం చూచేందుకు వెళ్ళాము. ఈ ఘట్టాన్ని గురించి ఆయన ఎన్నడూ నా దగ్గర ఎత్తలేదు. ఎత్తవలసిన అవసరం నాకు లేదు గదా! మా మిత్రకలహం చివరిది ఇదే. అయితే దానివల్ల మా స్నేహానికి ఆటంకం కలగలేదు. ఆయన పడ్డ తపనకు మూలం ప్రేమే. ఆచరణలోను, ఆలోచనలోను వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆయనంటే నాకు అమిత గౌరవం ఏర్పడింది.

మాంసం తినకపోయినా మిగతా విషయాల్లో ఆంగ్లసమాజంలో సరిగా మసల గలనని ఆయనకు తెలియజేయాలని భావించాను. అందుకోసం అశక్యం అనుకొన్న ఆంగ్ల పద్ధతుల్ని అవలంబించ ప్రారంభించాను.

నేను ధరించే దుస్తులు బొంబాయిలో తయారైనవి. అవి ఇంగ్లీషు వారి సమాజానికి పనికిరావని తెలుసుకొని, ఆర్మీ అండ్ నేవి స్టోర్సులో తయారుచేయించాను. పందొమ్మిది షిల్లింగులు పెట్టి చిమ్నీ పాట్‌హాటు కొన్నాను. ఆ రోజుల్లో నేను ఆ హాట్ కోసం ఎక్కువ ధర చెల్లించాను. అంతటితో ఆగక నాగరికతకు నడిగడ్డ అయిన బాండ్ వీధిలో ఒక ఈవెనింగ్ సూటు కోసం పది పౌండ్లు వెచ్చించాను. మా అన్నగారికి జేబులో వ్రేలాడే రెండు పేటల బంగారు గొలును పంపమని వ్రాస్తే ఆయన వెంటనే ఎంతో దయతో పంపించారు, టై కట్టుకోవడం నేర్చుకొన్నాను. మనదేశంలో క్షవరం నాడే అద్దం చూచే అలవాటు వుండేది. కాని ఇక్కడ నిలువెత్తు అద్దం ముందు నిలబడి టై సరిచేసుకోవడం మొదలుగాగల పనులకు ప్రతిరోజూ పది పదిహేను నిమిషాలు వ్యర్ధం అవుతూ ఉండేవి. నా జుట్టు మృదువుగా వుండేది కాదు. అందువల్ల దాన్ని సరిగా దువ్వుకోవడానికి బ్రష్‌తో నిత్యము కుస్తీ పట్టాల్సి వచ్చేది. హేటు ధరించినప్పుడు, తొలగించినప్పుడూ పాపిట చెడిపోకుండా చెయ్యి దానిమీదనే వుంటూ వుండేది. అంతేగాక సభ్యుల మధ్య కూర్చున్నప్పుడు ఎప్పుడూ చెయ్యి పాపిట మీదనే వుంటూ వుండేది.

ఈ టిప్పుటాపులు అంతటితో ఆగలేదు. ఆంగ్లేయుల వేషం వేసుకున్నంత మాత్రాన సభ్యుడవటం సాధ్యమా? ఇంకా సభ్య లక్షణాలు నేర్చుకోవలసినవి చాలా వున్నాయి. డాన్సు చేయడం నేర్చుకోవాలి. ఫ్రెంచి భాష బాగా నేర్చుకోవాలి. ఇంగ్లాండుకు పొరుగున వున్న ఫ్రాన్సు దేశపు భాష ఫ్రెంచి. యూరప్ పర్యటించాలనే కోరిక నాకు ఉండేది. అంతేగాక సభ్య పురుషుడు ధారాళంగా ఉపన్యసించడం కూడా నేర్చుకోవాలి. నేను డాన్సు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక క్లాసులో చేరాను. ఒక టరముకు మూడు పౌండ్లు ఫీజుగా చెల్లించాను. మూడు వారాలలో ఆరు తరగతులు జరిగి వుంటాయి. తాళానికి అనుగుణ్యంగా అడుగుపడలేదు. పియానో మోగుతూ ఉండేది. కానీ అదిఏమి చెబుతున్నదో బోధపడేది కాదు. ఒకటి, రెండు, మూడు అంటూ వాయిద్యం ప్రారంభమయ్యేది. కాని వాటి మధ్య గల అంతరాళం అర్థం అయ్యేది కాదు. ఇక ఏం చేయాలి? చివరికి నా వ్యవహారం కౌపీన సంరక్షణార్థం అయంపటాటోపః అన్న చందానికి దిగింది. వెనకటికి ఒక సన్యాసి తన గోచీని కొరకకుండ ఎలుకల్ని ఆపడానికి ఒక పిల్లిని పెంచాడట. పిల్లిని పెంచడానికి ఒక ఆవు. ఆవును కాచేందుకు ఒక కాపరి, ఈ విధంగా గోచీని రక్షించుకోవడం కోసం సంసారం ఏర్పడిందట.

పాశ్చాత్య సంగీతం నేర్చుకునేందుకై ఫిడేలు నేర్చుకోవాలని నిర్ణయించాను. ఫిడేలుకు మూడు పౌండ్ల సొమ్ము ఖర్చయింది. ఫిడేల్ నేర్చుకోడానికి కొంత ఖర్చు పెట్టక తప్పలేదు. ఉపన్యాస ధోరణి నేర్చుకొనేందుకు మరో గురువుకు ఒక గిన్నీ ప్రవేశ రుసుం క్రింద చెల్లించాను. అందుకోసం బెల్ రచించిన స్టాండర్డ్ ఎలోక్యూషనిస్ట్ అను గ్రంథం కొన్నాను. అందలి ఫిట్‌గారి ఉపన్యాసంతో అభ్యాసం ప్రారంభించాను.

కాని ఆ బెల్ అను ఆయన నా చెవిలో (బెల్ అనగా) గంట వాయించడంతో మేల్కొన్నాను. నేను ఇంగ్లాండులో ఎల్లకాలం వుంటానా? ధారాళంగా ఉపన్యసించడం నేర్చుకొని ఏం చేయాలి? డాన్సులు చేసి సభ్యుడినవుతానా? ఫిడేల్ మనదేశంలో లేదా? అక్కడ నేర్చుకోవచ్చుకదా! నేను విద్యార్థిని, విద్యాధనం సేకరించేందుకు నేను వచ్చాను. వృత్తి కోసం నేను సిద్ధం కావాలి, సదాచారాల ద్వారా సభ్యుడనని గుర్తించబడితే చాలు. అంతేకదా కావలసింది? ఇంక ఎందుకీ వ్యామోహం?

ఈ విధమైన భావాలను వెల్లడిస్తూ ఒక జాబు ఉపన్యాస కళను నేర్పే గురువు గారికి వ్రాసి పంపాను. ఆయన దగ్గర రెండు మూడు పాఠాలు మాత్రమే నేను నేర్చుకున్నాను. డాన్సు మాష్టరుకు కూడా అదేవిధమైన జాబు వ్రాశాను. ఫిడేల్ నేర్పే గురువుగారి దగ్గరికి ఫిడేలు పుచ్చుకొని వెళ్ళాను. ఎంత వస్తే అంతకు దీన్ని అమ్మివేయమని చెప్పాను. ఆయనతో అప్పటికే కొద్దిగా స్నేహం ఏర్పడింది. అందువల్ల నాకు కలిగిన మోహభ్రమల్ని గురించి ఆయనకు చెప్పాను. డాన్సుల జంజాటం నుండి నేను బయటపడటానికి ఆయన ఇష్టపడ్డాడు.

సభ్యుడు కావాలనే వ్యామోహం సుమారు మూడు మాసాల పాటు నన్ను వదలలేదు. అయితే ఆంగ్ల వేషానికి సంబంధించిన పటాటోపం మాత్రం కొన్ని సంవత్సరాల వరకు సాగింది. అయినా విద్యార్థిగా మారానని చెప్పవచ్చు.


16. మార్పులు

ఆట పాటల్లో పడి నేను ఇష్టం వచ్చినట్లు కాలం గడిపానని ఎవ్వరూ తలంచవద్దు. అప్పుడు కూడా ఒళ్ళు తెలిసే వ్యవహరించానను విషయం పాఠకులు గ్రహించియే యుందురని భావిస్తున్నాను. కొంత ఆత్మశోధన జరిగిన తరువాతనే ఆ వ్యామోహం తొలగిపోయింది. నేను ఖర్చు పెట్టిన ప్రతి పైసా లెక్క వ్రాశాను. ప్రతి చిన్న వ్యయం అనగా కారు ఖర్చు, తపాలా ఖర్చు, వార్తా పత్రికల నిమిత్తం వెచ్చించే ఒకటి రెండ పౌండ్లు మొదలుగా గల వాటినన్నింటిని, పుస్తకంలో వ్రాసి పడుకునే ముందు వాటిని సరిచూచుకునే వాణ్ణి. ఆ అలవాటు యిప్పటికీ నాకు వున్నది. దీనివల్ల అనేక ప్రయోజనాలు కలిగాయి. లక్షలాది రూపాయల ధర్మాదాయం నా చేతుల మీదుగా ఖర్చవుతూ వుండేది. శాఖోపశాఖలుగా అనేక విషయాలకు ధనం ఖర్చు పెడుతున్నా మితంగాను, సరిగాను ఖర్చు చేశాను. ప్రతిరోజు మిగులు చూపానే గాని, తగులు చూపలేదు. ఈ విషయం ప్రతివారు శ్రద్ధతో గమనించి తనకు వచ్చే ప్రతి పైసకి, తాను ఇచ్చే ప్రతి పైసకి లెక్క వ్రాసి పెడితే చివరికి నావలెనే తప్పక మేలు పొందగలరు. ఇది తథ్యం. ఎంతో జాగ్రత్తగా ఆదాయ వ్యయాలు వ్రాస్తూ వున్నందున ఖర్చు తగ్గించుకోవడం అవసరమని తెలుసుకోగలిగాను. పద్దు పుస్తకం చూచుకుంటే అందు బాడుగలు ఎక్కువగా కనిపించాయి. నేను ఒక కుటుంబంతో కలిసి వుంటున్నందున, వారికి ప్రతి వారం కొంత డబ్బు ఇవ్వవలసి వచ్చింది. మర్యాద కోసం ఆ కుటుంబం వారితో కలిసి డిన్నర్లకు వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు ఖర్చు నేను భరించవవలసి వచ్చేది. అందుకు కారణం ఆ దేశంలో డిన్నర్లకు పిలిచిన ఆమె స్త్రీ అయితే పురుషుడే వ్యయం భరించాలి. ఆ కుటుంబం వారికి ప్రతివారం ఇచ్చే సొమ్ములో ఆ డిన్నరు ఖర్చు తగ్గించుకోరు. అదనంగా ఆ ఖర్చు భరించవలసిందే. లెక్కలు చూచాక ఈ ఖర్చు తగ్గించవచ్చునని తోచింది. ఈ విధంగా దుబారా ఖర్చు చేస్తున్నందున నేను ధనికుడననే అపోహ కూడా జనానికి కలుగుతున్నదని తోచింది.

ఈ కుటుంబంతో పాటు ఇక వుండకుండా ప్రత్యేకంగా గదులు అద్దెకు తీసుకొని వుండాలని నిర్ణయించుకున్నాను. నేను చేయవలసిన పనులకు అనుకూలంగాను, సమీపంలోను వుండే చోటుకు మారాలని భావించాను. దానివల్ల అనుభవం గడించవచ్చునని అనుకున్నాను. పనివున్న చోటుకు తేలికగా గంటలో నడిచి వెళ్ళేందుకు వీలుగా దగ్గరలో గదులను అద్దెకు తీసుకున్నాను. అందువల్ల కార్ల బాడుగ వగైరా వ్యయం తగ్గింది. ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్ళేవాణ్ణి. అందుకు బాడుగ క్రింద కొంత సొమ్ము ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఇప్పుడు అది తగ్గింది. కాని నడిచి వెళ్ళాలంటే కొంత కాలం పడుతున్నది. ఈ విధంగా ప్రతిరోజు చాలా దూరం నడుస్తుండటం వల్ల నాకు జబ్బులు రాకపోవడమే గాక చాలావరకు శరీర దారుఢ్యత కూడా కలిగింది. నేను రెండుగదులు కిరాయికి తీసుకున్నాను. ఒకటి కూర్చునేందుకు, రెండవది పడుకునేందుకు, నేను చేసిన మార్పుల్లో ఇది రెండవ దశ అని చెప్పవచ్చు. మూడో మార్పు కూడా త్వరలోనే వస్తుంది. ఈ విధంగా ఖర్చు సగం తగ్గిపోయింది. కాని సమయమో! బారిష్టరు పట్టాకోసం ఎక్కువగా చదవవలసింది ఏమీ వుండదని తెలిసి ధైర్యం కలిగింది. కాని నా ఇంగ్లీషు భాషాజ్ఞానం సరిగాలేదు. అందుకు బాధగా ఉండేది. “బీ.ఏ. పూర్తి చేసుకో, ఆ తరువాత రా” అని శ్రీ లేలీగారు అన్న మాటలు గ్రుచ్చుకుంటున్నాయి, బారిష్టరు కావడం కోసం ఇంకా అదనంగా చదవాలి. ఆక్స్‌ఫర్డు కేంబ్రిడ్జి కోర్సులను గురించి తెలుసుకున్నాను. చాలామంది మిత్రుల్ని కలిశాను. అక్కడికి వెళితే ఖర్చు చాలా అవుతుందనీ, పైగా కోర్సు చాలా పెద్దదనీ, కాలం బాగా లాగుతుందని తెలిసింది. మూడు సంవత్సరాలకంటే మించి నేను ఇంగ్లాండులో వుండటానికి వీలులేదు. “నీవు పెద్దపరీక్ష ప్యాసవాలనుకుంటే లండను మెట్రిక్యులేషన్‌కు కూర్చో. అయితే బాగా కష్టపడవలసి వస్తుంది. సామాన్యజ్ఞానం బాగా పెరుగుతుంది. ఖర్చు ఏమీ వుండదు” అని ఒక మిత్రుడు చెప్పాడు. ఈ సలహా నాకు నచ్చింది. కాని కోర్సు చూచేసరికి భయం వేసింది. లాటిన్ మరియు మరో భాషా జ్ఞానం చాలా అవసరం. లాటిన్ తెలిసినవాడు లా గ్రంథాల్ని తేలికగా ఆర్థం చేసుకుంటాడు. అంతేగాక ‘రోమన్ లా’ పరీక్షయందు ఒక ప్రశ్న పత్రం పూర్తిగా లాటిన్ భాషలోనే వుంటుంది. లాటిన్ నేర్చుకున్నందువల్ల ఇంగ్లీషు భాష మీద మంచి పట్టు లభిస్తుంది. అని కూడా ఆ మిత్రుడు చెప్పాడు. ఆయన మాటల ప్రభావం నా మీద బాగా పడింది. కష్టమైనా, సులభమైనా లాటిన్ నేర్చుకోవలసిందేనని నిర్ణయానికి వచ్చాను. ఫ్రెంచి నేర్చుకోవడం అదివరకే ప్రారంభించాను. దాన్ని పూర్తి చేయాలి. అందువల్ల రెండో భాషగా ఫ్రెంచి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. ప్రైవేటుగా నడుస్తున్న ఒక మెట్రిక్యులేషన్ క్లాసులో చేరాను. ఆరు నెలలకు ఒక్క పర్యాయం పరీక్ష నడుస్తుంది. అయిదు మాసాల గడువు వున్నది. శక్తికి మించిన పని అని అనిపించింది. సభ్యుడు కావాలని కృషి చేస్తున్న నేను చివరికి కష్టపడి చదివే విద్యార్థిగా మారిపోయాను. టైంటేబులు తయారు చేసుకున్నాను. ఒక్కొక్క నిమిషం మిగుల్చుకోసాగాను. అయితే ఇతర విషయాలతో బాటు లాటిన్ మరియు ఫ్రెంచి భాషల్లో సైతం నైపుణ్యం సంపాదించగలంతటి బుద్ధి వికాసం నాకు కలగలేదు. పరీక్షకు కూర్చున్నాను. లాటిన్‌లో తప్పిపోయాను. విచారం కలిగింది. కాని అధైర్యపడలేదు. లాటిన్ విషయంలో ఆసక్తి పెరిగింది. సైన్సులో మరో విషయం తీసుకుందామని నిర్ణయించాను. రసాయన శాస్త్రం ఒకటి ఉంది. ఆ సబ్జక్టు మీద ఆసక్తి బాగా పెంచుకోవాలని భావించాను. కాని ప్రయోగాలకు అవకాశం లేనందున అది కుదరలేదు. ఇండియాలో రసాయన శాస్త్రం కూడా నేను చదివాను. అందువల్ల లండను మెట్రిక్ కోసం రసాయన శాస్త్రం చదవాలని భావించాను. ఈ పర్యాయం ‘వెలుగు, వేడి’ అను విషయాలు ఎన్నుకున్నాను. అది తేలికేనని అనిపించింది.

పరీక్ష కోసం తయారీ ప్రారంభించాను. దానితోపాటు జీవితంలో సరళత్వం తేవడం ఇంకా అవసరమని భావించాను. నా కుటుంబ బీద పరిస్థితులకు ఇక్కడి నా జీవనసరళి అనుగుణ్యంగా లేదని తెలుసుకున్నాను. మా అన్నయ్య బీదతనాన్ని ఆర్థికంగా అతడు పడుతున్న బాధను గురించి తలుచుకునేసరికి విచారం కలిగింది. కొందరికి విద్యార్థి వేతనం లభిస్తూ ఉండేది. నా కంటే సాదాగా జీవనం గడుపుతున్న విద్యార్థులు కూడా నాకు తటస్థపడ్డారు. అటువంటి చాలా మంది బీద విద్యార్థులతో నాకు పరిచయం ఏర్పడింది. ఒక బీద విద్యార్థి లండన్ నగరంలో “బీదమహల్” లో వారానికి రెండు షిల్లింగుల చొప్పున సొమ్ము చెల్లించి ఒక గదిలో ఉండేవాడు. లోకార్టులో వున్న చవుక కోకో దుకాణంలో రెండు పెన్నీలకు “కోకో, రొట్టె” తీసుకొని పొట్ట నింపుకునేవాడు. అతడితో పోటీపడగల శక్తి నాకు లేదు. అయితే రెండు గదులు ఎందుకు? ఒక్క గదిలో వుండవచ్చుకదా! ఒక పూట భోజనం స్వయంగా తయారు చేసుకుంటే నెలకు అయిదు లేక ఆరు పౌండ్లు మిగులుతాయి. సాదా జీవనసరళిని గురించి పుస్తకాలు చదివాను. రెండు గదులు వదిలి ఒక గది మాత్రమే అద్దెకు తీసుకున్నాను. వారానికి ఎనిమిది షిల్లింగులు చెల్లించాలి. ఒక కుంపటి కొన్నాను. ఉదయం భోజనం స్వయంగా చేసుకోసాగాను. ఇరవై నిమిషాల సమయం వంటకు పట్టేది. వరిగల సంకటికి, కోకో కోసం నీళ్లు వెచ్చ పెట్టడానికి అంతకంటే ఎక్కువ సమయం అనవసరం కదా! మధ్యాహ్నం పూట బయట భోజనం చేసేవాణ్ణి, సాయంత్రం మళ్ళీ కోకో తయారు చేసుకొని రొట్టెతో బాటు పుచ్చుకునేవాణ్ణి. ఈ విధంగా ఒకటి లేక ఒకటిం పావు షిల్లింగ్‌తో రోజూ పొట్టనింపుకోవడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఎక్కువ సమయం చదువుకు ఉపయోగించసాగాను. జీవనం సరళం అయిపోయినందున సమయం ఎక్కువ మిగిలింది. రెండో పర్యాయం పరీక్షకు కూర్చొని ప్యాసయ్యాను.

సాదాతనం వల్ల నా జీవితంలో నీరసం వచ్చిందని పాఠకులు భావించకుందురు గాక. ఈ విధమైన మార్పుల వల్ల నా అసలు జీవితానికీ, బాహ్య జీవితానికీ సరియైన సమన్వయం కుదిరింది. కుటుంబ పరిస్థితులకు అనుగుణ్యంగా నా నడవడికలో నా నిత్య వ్యవహారాలలో మార్పు వచ్చింది. జీవితం సత్యమయం అయింది. నాకు ఆత్మ తృప్తి కలిగింది.


17. ఆహారంలో మార్పులు - ప్రయోగాలు

నేను లోతుగా పరిశీలించసాగాను. బాహ్యాంభ్యంతరాలైన ఆచారాలు మార్చుకోవలసిన ఆవశ్యకత గోచరించింది. నిత్య వ్యవహారాలలోను, వ్యయం విషయంలోను మార్పు చేయడంతోపాటు ఆహారంలో కూడా మార్పులు ప్రారంభించాను. శాకాహారం గురించి పుస్తకాలు వ్రాసిన ఆంగ్ల రచయితలు నిశితంగా శోధన చేశారు. మత వైద్య ప్రకృతి శాస్త్రాల కనుగుణ్యంగా ఆచరణకు అనుకూలంగా లోతుగా పరిశీలించి వ్రాశారు, “మానవుడు జంతువులకంటే అధికుడు. అందువల్ల వాటిని కాపాడటం అవసరం. ఒక మనిషి మరో మనిషికి ఏవిధంగా సహాయం చేస్తాడో అదే విధంగా మిగతా ప్రాణులకు కూడా సహాయం చేయాలి” అని వ్రాసి అది మానవుని నైతిక ధర్మమని నిర్ధారించారు. మనిషి తినడానికి రుచే ప్రధానం కాదని, బ్రతకడానికేనని ప్రకటించి ఇది సత్యమని నిర్ధారించారు. ఆ గ్రంథ రచయితల్లో చాలామంది మాంసాన్నేగాక, గ్రుడ్లను పాలను కూడా నిషేధించారు. వారు స్వయంగా ఆ విధంగా నడుచుకున్నారు. కొందరు మానవశరీర నిర్మాణాన్ని బట్టి వండిన పదార్థాలు సరిపడవనీ, పళ్ళు వచ్చేవరకు పిల్లలకు తల్లిపాలు త్రాగించాలనీ, తరువాత పండ్లు ఫలాలు తినిపించాలని వ్రాశారు. వైద్యశాస్త్ర ప్రకారం ఊరగాయలు, పచ్చళ్ళు, పోపులు, మసాలాలు మొదలగు వాటిని పరిత్యజించాలని చెప్పారు. శాకాహారం అందరికీ అందుబాటులో వుంటుందనీ, ఖర్చు కూడా తక్కువ అవుతుందని నిర్ణయించారు. ఈ నాలుగు విషయాలు నా అనుభవంలోకి కూడా వచ్చాయి. శాకాహార భోజనశాలల్లో ఈ నియమాల్ని పాటించేవారిని చాలామందిని కలుసుకున్నాను. ఆంగ్లదేశంలో శాకాహార ప్రచార సంఘాలు కూడా చాలా ఉన్నాయి. వారు ఒక వారపత్రికను ప్రకటిస్తున్నారు. నేను ఆ సంఘంలో చేరాను. ఆ పత్రికకు చందాదారుణ్ణి అయ్యాను. కొద్ది రోజులకే ఆ సంఘ కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా ఎన్నికైనాను. శాకాహార నియమాన్ని నిష్టతో అమలుపరిచే చాలామంది ప్రముఖులతో నాకు పరిచయం కలిగింది. ఆహారం విషయంలో ప్రయోగాలు మొదలుపెట్టాను,

ఇంటి నుండి తెప్పించిన చిరుతిండ్లు, ఊరగాయలు తినడం మానివేశాను. మనస్సు మారినందున వాటిపై నాకు విరక్తి కలిగింది. వెనక రిచ్‌మండులో వున్నప్పుడు నా జిహ్వకు చప్పగా వున్న మసాలా లేని స్పెనక్ (బచ్చలి) ఇప్పుడు రుచిగా ఉంది. ఈ విధమైన ప్రయోగాలవల్ల ఆహార పదార్థాల రుచి విషయంలో మనస్సు ప్రధానం గాని, జిహ్వ కాదని తేలింది. ఆర్థిక దృష్టి కూడా నా విషయంలో బాగా పనిచేసింది. ఆ రోజుల్లో కొందరు కాఫీ, టీలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని భావించి కోకో పుచ్చుకోవడం ప్రారంభించారు. నేను కూడా తిండి శరీర నిర్వహణకేనని నిశ్చయించి టీ, కాఫీలు మానివేసి కోకో పుచ్చుకోసాగాను.

శాకాహార భోజనశాలలో రెండు విభాగాలు ఉండేవి. ఒక విభాగంలో కావలసిన పదార్థాలు తిని, తిన్న పదార్థాలకు మూల్యం చెల్లించాలి. పూటకు మనిషికి రెండు షిల్లింగులు దాకా ఖర్చు అవుతుంది. ఈ విభాగానికి డబ్బు గలవాళ్ళు వెళతారు. రెండో విభాగంలో తొమ్మిది పెన్నీలకు ఒక రొట్టెముక్క. మరో మూడు పదార్థాలు పెడతారు. నేను ఖర్చు తగ్గించుకోవాలని ప్రయత్నం ప్రారంభించినప్పటి నుండి రెండో విభాగంలోకే వెళ్ళి ఆహారం పుచ్చుకోవడం ప్రారంభించాను. ఈ ప్రయోగాలతో పాటు కొన్ని చిన్న ప్రయోగాలు కూడా ప్రారంభించాను. కొంత కాలం గంజి పదార్థాలు మానివేశాను. కొంతకాలం రొట్టె, పండ్లు మాత్రమే తింటూ వున్నాను. కొంతకాలం జున్ను, పాలు, గ్రుడ్లు పుచ్చుకుంటూ వున్నాను. ఈ చివరి ప్రయోగం పదిహేనురోజులకంటే మించి సాగలేదు. గంజిలేని పదార్థాలు తినాలని బోధించిన సంస్కర్త గ్రుడ్లు తినడం మంచిదని, అది మాంసాహారం కాదని సమర్థించాడు. గ్రుడ్లు తింటే జీవ జంతువులకు హానికలుగదు అని మొదట భావించాను. అందువల్ల కొంచెం కక్కుర్తి పడ్డాను. అయితే ఈ విధానం ఎక్కువ కాలం సాగలేదు. నా ప్రమాణానికి క్రొత్త వ్యాఖ్యానం ఎలా చెప్పను? ప్రమాణం చేయించిన మా అమ్మగారి ఉద్దేశ్యం నాకు తెలియదా? గ్రుడ్లు కూడా మాంసమనే మా అమ్మ ఉద్దేశ్యం. ఈ ప్రమాణంలో దాగియున్న సత్యం గ్రహించి వెంటనే గ్రుడ్లను, వాటికి సంబంధించిన ప్రయోగాల్ని విరమించుకున్నాను.

ఇంగ్లాండులో మాంసాన్ని గురించిన మూడు లక్షణాలు తెలుసుకున్నాను. మొదటి లక్షణం ప్రకారం పశు, పక్షుల మాంసమే మాంసం. ఈ లక్షణాన్ని గుర్తించిన శాకాహారులు అట్టి మాంసం త్యజించి చేపల్ని తినడం ప్రారంభించారు. ఇక గ్రుడ్లు కూడా పుచ్చుకునే వారిని గురించి చెప్పనవసరం లేదనకుంటాను. రెండవ లక్షణం ప్రకారం చేపల్ని కూడా తినకూడదు. కాని గ్రుడ్లు తినవచ్చు. ఇక మూడవ లక్షణం ప్రకారం సమస్త జీవజంతువుల మాంసం, వానివల్ల ప్రభవించే పదార్థాలు అంటే గ్రుడ్లు, పాలు మొదలైనవి కూడా మాంసం క్రింద లెక్కే. ఇందు మొదటి లక్షణం అంగీకరిస్తే నేను చేపలు కూడా తినవచ్చు. అయితే మా అమ్మ అభిప్రాయమే సరియైనదని నిర్ణయానికి వచ్చాను. ఆమె ఎదుట చేసిన ప్రయాణం ప్రకారం నేను గ్రుడ్లు కూడా తినకూడదు. అందువల్ల గ్రుడ్లు తినడం మానివేశాను. దీనివల్ల నాకు బాగా శ్రమ కలిగింది. సూక్ష్మంగా లోతుకు దిగి పరిశీలించి చూస్తే శాకాహారశాలల్లో లభించే చాల ఆహార పదార్థాలలో గ్రుడ్లు కలుస్తాయని తేలింది. అందువల్ల గ్రుడ్లు వాడిందీ లేనిదీ తెలుసుకోవడం కోసం వడ్డన చేసేవాణ్ణి పిలిచి అడగలవలసిన అవసరం కలిగింది. కేకుల్లోను, పుడ్డింగుల్లోను గ్రుడ్లు కలుస్తూ ఉండటం వల్ల అలా అడిగి తెలుసుకోవలసి వచ్చింది. దానితో ఇంకా కొన్ని చిక్కులు తొలిగాయి, సాదా పదార్థాలు మాత్రమే తినవలసిన ఆవశ్యకత ఏర్పడింది. నాలుక రుచి మరిగిన అనేక ఆహార పదార్థాలను మానుకోవలసి వచ్చింది, కష్టమనిపించింది. అయితే ఈ కష్టం క్షణికమేనని తేలింది. ప్రతిజ్ఞను నెరవేర్చాలనే స్వచ్ఛమైన, సూక్ష్మమైన, స్థిరమైన రుచి, నాలుక మరిగిన క్షణిక రుచి కంటే గొప్పదని తోచింది. అయితే అసలు పరీక్ష మరొకటి వుంది. చేసిన ప్రతిజ్ఞలో అదీ ఒక భాగమే. భగవంతుని రక్షణ పొందిన వాడికి ఎవ్వరూ చెరుపు చేయలేరు కదా!

ఈ ప్రకరణం ముగించేముందు ప్రతిజ్ఞ యొక్క అర్థాన్ని గురించి చెప్పడం అవసరమని భావిస్తున్నాను. మా అమ్మ ఎదుట నేను చేసిన ప్రతిజ్ఞ అలా నిలబడే ఉంది. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం వల్లనే ప్రపంచంలో చాలా అనర్థాలు కలుగుతూ ఉంటాయి. ప్రమాణ పత్రం ఎంత స్పష్టంగా వ్రాసుకోబడ్డా తమకు నప్పే విధంగా మాటలకు అర్థం చెబుతూనే ఉంటారు. స్వార్థం మనిషిని గ్రుడ్డివాణ్ణి చేస్తుంది. గోడమీద పిల్లివాటంగా మూలానికి అర్థాలు చెప్పి, ఆత్మ వంచన చేసుకుని, లోకాన్ని దైవాన్ని మోసగించే ప్రయత్నం చేస్తూ వుంటారు. అసలు ప్రమాణం చేసినవారు ప్రమాణం చేయించినవారు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఇది ఉత్తమ విధానం. రెండు అర్థాలు చెప్పుటకు వీలున్నచోట దుర్భలుడిమాట అంగీకరించడం మంచిది. ఈ రెండు పద్ధతుల్ని అనుసరించకపోతే కలహాలు, అనర్థాలు తప్పవు, సత్యపథం అనుసరించేవాడు ఉత్తమ పద్ధతినే అవలంబించాలి. క్రొత్త అర్థాలు తీసే విద్యావంతులతో అతనికి పని ఉండకూడదు. మాంసానికి సంబంధించినంతవరకు మా అమ్మ ఉద్దేశ్యమే నాకు ప్రధానం. ఇందు నా అనుభవానికిగాని, పాండిత్య గర్వానికిగాని తావులేదు.

ఇంగ్లాండులో ఆర్థిక దృష్టితోను, ఆరోగ్య దృష్టితోను నా పరిశోధనలు జరిగాయి. దక్షిణాఫ్రికాకు వెళ్ళక పూర్వం ఈ విషయమై పరిశోధించలేదు. కాని ఆ తరువాత బాగా పరిశోధనలు చేశాను. ఆ వివరాలు రాబోయే ప్రకరణాల్లో తెలుపుతాను. ఏది ఏమైనా ఆహారం విషయమై ప్రయోగాల బీజం ఇంగ్లాండులోనే నా హృదయంలో పడింది. అసలు మొదటినుండీ మతంలో వున్న వాళ్ళకంటే క్రొత్తగా మతంలో చేరినవాళ్ళకు ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లాండులో శాకాహార విధానం సరిక్రొత్త, నాకూ అది అంతే. మొదట మాంసాహారం మంచిదని నేను నమ్మేవాణ్ణి. కాని తరువాత శాకాహారంలోనికి మారాను. నాకు అబ్బిన ఈ క్రొత్త శాకాహార ప్రవేశానుభవంతో నేను నివసిస్తున్న బేసువాటర్‌పేటలో ఒక శాకాహార క్లబ్బు పెట్టదలచి, అక్కడ కాపురం వున్న సర్ ఎడ్విన్ ఆర్నాల్డుగారిని ఉపాధ్యాక్షునిగా వుండమని కోరాను. వెజిటేరియన్ పత్రికా సంపాదకుడు ఓల్డ్ ఫీల్డు గారు అధ్యక్షులు. నేను కార్యదర్శిని. కొంతకాలం ఆ క్లబ్బు బాగా నడిచింది. కాని ఆ తరువాత కొద్దినెలలకు మూతబడింది. నేను కొద్దికాలం తరువాత మరో చోటుకి బస మార్చుకుంటూ వుండేవాణ్ణి. ఆ ప్రకారం ఆ ప్రదేశాన్నుండి నా నివాసాన్ని మార్చాను. కాని ఈ కొద్ది అనుభవం కొన్ని సంస్థలు స్థాపించి ప్రచారంలోకి తేగల శక్తి నాకు ప్రసాదించింది.


18. బిడియం డాలుగా పనిచేసింది

అన్నాహారమండల కార్యనిర్వాహక సమితికి మెంబరుగా ఎన్నుకోబడి ప్రతి మీటింగుకి హాజరవుతూ వుండేవాణ్ణి. కాని మాట్లాడటానికి నోరు తెరుపుడు పడేదికాదు. డాక్టర్ ఓల్డ్‌ఫీల్డు ఈ విషయం గమనించి “నీవు నాతో బాగా మాట్లాడతావు కాని సమావేశంలో ఎన్నడూ నోరు తెరవవు. అందువల్ల నీకు మొగతేనెటీగ అను పేరు పెట్టవచ్చు” అని అన్నాడు. నాకు ఆయన వ్యంగ్యం అర్థమైంది. ఆడతేనెటీగలు ఎప్పుడూ శ్రమపడుతూ ఉంటాయి. కాని మొగతేనెటీగ తినడం తాగడమే కాని పనిచేయదు. సోమరిపోతన్నమాట. కమిటీ మీటింగులో అంతా తమ తమ అభిప్రాయాలు చెబుతూ వుండేవారు. కాని నేను మాత్రం నోరు తెరిచేవాణ్ణి కాదు. మాట్లాడాలనే కాంక్ష లేక కాదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడాలి! నాకంటే మిగతా మెంబర్లంతా ఎక్కువ తెలిసిన వారుగా కనపడేవారు. ఒక్కొక్కప్పుడు విషయం మీద మాట్లాడాలని సిద్ధపడేవాణ్ణి కాని ఇంతలో మరో విషయం మీద చర్చ ప్రారంభమయ్యేది.

ఈ పద్ధతి కొంతకాలం దాకా నడిచింది. ఒక పర్యాయం గంభీరమైన సమస్య కమిటీ ముందుకు వచ్చింది. ఆ సభకు వెళ్ళకపోవడం అనుచితం. ఏమీ మాట్లాడకుండా వోటు ఇవ్వడం పిరికితనం. థేమ్స్ ఐరన్ వర్క్సు కంపెనీ అధ్యక్షుడు హల్స్‌గారు ఆ సభకు అధ్యక్షులు. అతడు నీతివాది. ఆయన ఇచ్చే ధనసహాయంతోనే ఆ సంఘం నిలచియున్నదని చెప్పవచ్చు. సభ్యుల్లో చాలామంది ఆయన గొడుగు నీడలో వుండునట్టివారే. శాకాహార విషయంలో ప్రసిద్ధికెక్కిన అల్లిన్సన్ గారు కూడా కార్యవర్గ సభ్యులు. డాక్టర్ అల్లిన్సన్ గారికి సంతాన నిరోధం ఇష్టం. దాన్ని గురించి జనానికి ప్రబోధిస్తూ వుండేవాడు. ఈ పద్ధతులు నీతివంతమైనవి కావనీ హిల్స్‌గారి అభిమతం. ఈ శాకాహార సంఘం కేవలం శాకాహారాన్ని గురించియే గాక నీతిని గురించి కూడా ప్రచారం చేయాలని ఆయన ఉద్దేశ్యం. విపరీత భావాలుగల అల్లిన్సన్‌గారి వంటి వారి నీతి బాహ్యాలైన ఉద్దేశ్యాలు కలవారు సంఘంలో వుండరాదని హిల్స్‌గారి తలంపు. కావున అల్లిన్సన్‌గారిని ఆ సంఘాన్నుంచి తొలగించాలనీ ఒక ప్రతిపాదన తెచ్చారు. ఈ చర్య నా హృదయాన్ని ఆకర్షించింది. సంతానం కలగకుండ ఉపాయాలు చేయాలని అల్లిన్సన్‌గారి ఉద్దేశ్యం భయంకరమైనదని నేను భావించాను. అయితే హిల్స్‌గారు నీతివాదియగుట వలన అల్లిన్సన్‌గారికి వ్యతిరేకం కావడం కూడా సరియేయని భావించాను. హిల్స్‌గారి ఔదార్యం చూచి వారియెడ నేను ఆదరణ కలిగి యుండేవాణ్ణి. అయితే నీతి విషయంలో అభిప్రాయ భేదం ఏర్పడినంత మాత్రాన ఒక పెద్ద మనిషిని శాకాహార సంఘాన్నుంచి తొలగించడం మంచిది కాదని అభిప్రాయపడ్డాను. హిల్స్‌గారు నీతివాది కావడం వల్ల ఇటువంటి అభిప్రాయాన్ని వ్యతిరేకించవచ్చు. కాని దానికీ, శాకాహార సంఘ ఉద్దేశ్యానికీ సంబంధం లేదని నా అభిప్రాయం. శాకాహార సంఘ లక్ష్యం శాకాహార విధానాన్ని ముమ్మరం చేయడమే కాని నీతివాదాన్ని ప్రచారం చేయడం కాదు. అందువల్ల నీతికి సంబంధించిన అభిప్రాయాలు ఎలా వున్నప్పటికీ శాకాహార సంఘాన్నుంచి ఒకరిని తొలగించకూడదనే నిర్ణయానికి నేను వచ్చాను.

ఈ విషయంలో సంఘ సభ్యుల్లో ఎక్కువమంది నాతో ఏకీభవించారు. అయితే ఈ విషయం నేనే సమావేశంలో మాట్లాడాలని భావించాను. అది ఎలా సాధ్యం? నాకు సాహసం లేదు. అందువల్ల కాగితం మీద వ్రాసుకొని వెళ్లాను. దాన్ని చదవడానికి కూడా సాహసం చాలక అధ్యక్షుడికి ఆ కాగితం అందజేశాను. ఆయన నా కాగితం ఇంకొకరిచేత చదివించాడు. డాǁ అల్లిన్సన్‌గారి పక్షం ఓడిపోయింది. ప్రథమ ప్రయత్నంలో నాకు అపజయం కలిగింది. అయినా నా అభిప్రాయం సరియైనదేనను అభిప్రాయం కలిగి నాకు తృప్తి కలిగింది. తరువాత నాకు ఆ సమితిలో సభ్యత్వం వద్దని కోరినట్లు గుర్తు. ఆంగ్లదేశంలో వున్నంతకాలం నన్ను సిగ్గు బిడియం వదలలేదు. మిత్రుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు కూడా పదిమంది చేరితే నోరు మెదపలేకపోయేవాడిని.

నేను ఒకసారి వెంటసన్ అను ఊరు వెళ్ళాను. నా వెంట మజుందార్ కూడా వున్నాడు. ఒక శాకాహారి ఇంట్లో బసచేశాం. “ది ఎతిక్స్ ఆఫ్ డైట్” అను గ్రంథం రచించిన హోవర్డుగారు కూడ అక్కడే నివసిస్తున్నారు. ఇది రేవు పట్టణం. ఆరోగ్యవంతమైన ప్రదేశం. మేము హోవర్డుగారిని కలిసి మాట్లాడాము. ఆయన శాకాహార ప్రవర్తక సభలో ఉపన్యసించమని మమ్మల్ని ఆహ్వానించారు. అట్టి సభలో వ్రాసుకొని వెళ్ళి చదవడం తప్పుకాదని తెలుసుకున్నాను. పరస్పర సంబంధం పోకుండా వుండేందుకు, ప్రసంగం క్లుప్తంగా వుండేందుకుగాను చాలామంది అట్లా చేస్తారని తెలిసింది. ఆశువుగా ఉపన్యసించడం అసంభవం. అందువల్ల అనుకున్న విషయమంతా వ్రాసి తీసుకువెళ్లాను. ఒక ఫుల్‌స్కేపు టావు కంటే అది ఎక్కువగా లేదు. కాని లేచి నుంచునేసరికి కళ్ళు తిరిగాయి. వణుకు పట్టుకుంది. అప్పుడు మజుందార్ నా కాగితం తీసుకొని చదివారు. ఆయన ప్రత్యేకించి ఉపన్యాసం కూడా చేశారు. అపుడు శ్రోతలు కరతాళ ధ్వనులు చేశారు. నాకు బాగా సిగ్గు వేసింది. నా అసమర్ధతకు విచారం కూడా కలిగింది. ఆంగ్ల దేశం విడిచి వచ్చేటప్పుడు చివరి ప్రయత్నం కూడా చేశాను. అప్పుడు కూడా అంతా అస్తవ్యస్తం అయింది. శాకాహారులగు మిత్రులకు హర్‌బర్న్ రెస్టారెంటులో డిన్నరు ఏర్పాటు చేశాను. అది శాకాహార రెస్టారెంటు కాదు. అయినా దాని యజమానికి చెప్పి శాకాహారమే తయారుచేయించాను. నా మిత్రులీ క్రొత్త పద్ధతికి చాలా సంతోషించారు. డిన్నర్లు చాలా వైభవంగాను, సంగీతాలతోను, ఉపన్యాసాలతోను జరుగుతాయి. నేను ఏర్పాటు చేసిన ఆ చిన్న డిన్నరులో కూడా అట్టి కార్యక్రమాలు కొన్నింటిని ఏర్పాటు చేశాను. కొన్ని ఉపన్యాసాలు జరిగాయి. నా వంతు రాగానే నేను లేచి నిలబడ్డాను. ఆలోచించి ఆలోచించి మాట్లాడదలచిన విషయాన్ని కొన్ని వాక్యాల్లో ఇముడ్చుకొని మాట్లాడడం ప్రారంభించాను. మొదటి వాక్యంతో ప్రసంగం ఆగిపోయింది. గతంలో అడిసన్‌గారిలా అయింది. హౌస్ ఆఫ్ కామర్సులో ఆయన ఉపన్యసించాలని లేచి నిలబడ్డారు. “నేను కనుచున్నాను. నేను కనుచున్నాను. నేను కనుచున్నాను” అంటూ ఆగిపోయారు. ఇక మాటలు పెగలలేదు. అది చూచి ఒక వినోదప్రియుడు లేచి నిలబడి “వీరు మూడుసార్లు కన్నారుగాని ఏం పుట్టిందో కనబడటం లేదు?” అని అన్నాడు. ఆ ఘట్టం నాకు జ్ఞాపకం వచ్చింది. హాస్య పద్ధతిలో మాట్లాడాలని భావించాను. అందుకు శ్రీకారం చుట్టాను కూడా. కాని వెంటనే ఉపన్యాసం ఆగిపోయింది. రెండో వాక్యం నోట వెలువడలేదు. అంతా మరిచిపోయాను. అందర్నీ నవ్వించాలని భావించి నేను నవ్వుల పాలైనాను. చివరికి తమరు దయతో విచ్చేసినందుకు వందనాలు అంటూ ముగించివేశాను.

నన్ను ఈ బిడియం చాలా కాలం వదలలేదు. దక్షిణాఫ్రికా వెళ్ళిన తరువాత అక్కడ చాలావరకు తగ్గిపోయింది. ఆశువుగా నేను మాట్లాడలేను. కొత్తవారిని చూస్తే నాకు సంకోచం కలుగుతుంది. మాట్లాడకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించేవాణ్ణి. ఇప్పటికి కూడా గాలి పోగుచేసి మాట్లాడటం నాకు చేతగాదు.

అప్పుడప్పుడు పరిహాసానికి పాల్పడటమే గాని దానివల్ల నాకు కలిగిన హాని ఏమీ లేదని చెప్పగలను. అప్పుడు విచారం కలిగించిన ఆ పద్ధతి తరువాత ఆనందం కలిగించింది. మితంగా మాట్లాడటం, అంటే తక్కువ పదాల్ని ప్రయోగించడం జరిగిందన్నమాట. నా నోటినుండి కాని, నా కలాన్నుండిగాని పొల్లుమాట ఒక్కటి కూడా వెలువడలేదని నాకు నేను సర్టిఫికెట్టు ఇచ్చుకోగలను. నా మాటలోగాని, నా వ్రాతలో గాని తప్పు దొర్లడం జరగలేదని గుర్తు. సత్యారాధకునికి మౌనం అవసరమని నాకు కలిగిన అనుభవం. సామాన్యంగా అబద్ధం చెప్పడం, తెలిసో తెలియకో అతిశయోక్తులు పలకడం, సత్యాల్ని మెరుగుపరచడం మనిషికి కలిగే సహజ దౌర్బల్యం. అయితే మితభాషి అర్థం లేని మాటలు మాట్లాడడు. ప్రతి మాట ఆచి తూచి మాట్లాడతాడు. మాట్లాడటానికి ఆరాటపడేవారిని మనం చూస్తుంటాము. మేమంటే మేము అని ఉపన్యాసాలిచ్చేందుకై అధ్యక్షుణ్ణి వత్తిడి చేస్తుంటారు. అనుమతి ఇవ్వగానే వక్త సామాన్యంగా సమయాన్ని అతిక్రమించడం జరుగుతుంది. ఇంకా సమయం కావాలని కోరుతూ ఉంటారు. అనుమతి ఇవ్వకపోయినా ఉపన్యసిస్తూనే ఉంటారు. ఇలా మాట్లాడేవారివల్ల మేలేమీ జరగదు. పైగా కాలహరణం జరుగుతుంది. అందువల్ల బిడియం నాకు డాలుగా పనిచేసింది. సత్యశోధనకు అది ఎంతగానో సహకరించింది.


19. అసత్యవ్రణం

నలభై ఏండ్ల క్రితం ఆంగ్ల దేశంలో హిందూ దేశ విద్యార్థుల సంఖ్య ఈ కాలాన్ని బట్టి చూస్తే చాలా తక్కువ. వారు వివాహితులైయుండి కూడా అక్కడ అవివాహితులమని చెప్పేవారు. అందుకు ఒక కారణం ఉంది. ఇంగ్లాండులో ప్రతి విద్యార్థి బ్రహ్మచారియే. వివాహో విద్యనాశాయ అను సూక్తి ననుసరించి ఇక్కడి వాళ్ళు విద్యార్థి దశలో పెండ్లి చేసుకోరు. పూర్వం మనదేశంలో కూడా మనం బ్రతికి యున్న కాలంలో విద్యార్థికి బ్రహ్మచారి అనే పేరు ఉండేది. మనకు బాల్య వివాహాలు వచ్చిపడ్డాయి. కాని ఇంగ్లాండులో బాల్య వివాహం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. భారతీయ విద్యార్థులు ఇంగ్లాండు వెళ్లిన తరువాత తమకు పెండ్లి అయిందని సిగ్గువల్ల అక్కడ చెప్పకోరు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఆ దేశంలో పెండ్లి అయిన మొగవాళ్ళు పెండ్లి కాని ఆడపిల్లలతో కలిసి మెలిసి తిరగకూడదు. తాము బసచేస్తున్న ఇళ్లవారికి తమకు పెండ్లి అయిందని తెలిస్తే వాళ్ళు తమ ఆడపిల్లలతో కలిసి మెలిసి తిరగనీయరు. కులాసాగా కబుర్లు చెప్పుకునేందుకు అవకాశం లభించదు. ఆ ఆమోద ప్రమోదాలు చాలావరకు దోషరహితంగా వుంటాయి. తల్లిదండ్రులకు కూడా ఈ విధమైన ఆమోద ప్రమోదాలు సమ్మతాలే. అక్కడ వరుడే తగిన వధువును వెతుక్కుంటాడు. అందువల్ల కన్యలు, యువకులు కూడా కలిసి మెలిసి ఉంటారు. అది అక్కడ స్వాభావికం. ఇంగ్లాండుకు వెళ్ళగానే హిందూదేశ యువకులు అక్కడి కన్యల మోహంలో పడి పెండ్లి కాలేదని చెబితే దాని పరిణామం భయంకరంగ ఉంటుంది. అట్టి గొడవలు అక్కడ అనేకం విన్నాను. భారతీయ యువకులు అసత్యం పలికి అక్కడి కన్యల వెంటబడి అసత్య జీవితం గడిపేందుకు సిద్ధపడతారు. ఆంగ్లేయులు అందుకు అంగీకరించరు. భారతీయులు ఇలా చేయడానికి సాహసిస్తారు. నేనూ ఇలాంటి వలలో పడ్డాను. నాకు పెండ్లి అయ్యింది. ఒక బిడ్డకూడా పుట్టాడు. అయినా అక్కడ బ్రహ్మచారిగా వున్నాను. అట్టి నటన వల్ల నాకేమీ ఆనందం కలుగలేదు. అయితే సిగ్గు, బిడియాలు నన్ను కాపాడాయి. నేను మాట్లాడకుండా వుంటే నాతో ఎవతె మాట్లాడుతుంది? మొగవాడు ముందుడుగు వేస్తేనే గదా ఆడమనిషి కూడా ముందుకు వచ్చేది.

నాకు పిరికితనంతో బాటు బిడియం కూడా అధికంగా వుండేది. వెంటనర్‌లో నేను వున్న కుటుంబంలో ఇంటి యజమానురాలి కూతురు, తమ అతిథుల్ని షికారుకు తీసుకువెళుతూ వుండేది. అది అక్కడి ఆచారం. ఆమె ఒకనాడు నన్ను దగ్గరలోనే వున్న గుట్టల మీదకు తీసుకువెళ్ళింది. అసలు నాది వడిగల నడక. ఆమెది నా కన్నా ఎక్కువ వడిగల నడక. ఆ మాటలు యీ మాటలు చెబుతూ సన్ను వడివడిగా లాక్కు వెళ్ళసాగింది. నేనూ కబుర్లు చెబుతూనే ఉన్నాను. ఒకప్పుడు ఔను అని, మరొకప్పుడు కాదు అని, ఇంకొకప్పుడు ఆహా! ఎంత బాగా ఉంది? అంటూ ఆమె వెంట నడుస్తున్నాను. ఆమె పిట్టలా తుర్రున పోతూ ఉంది. ఇంటికి పోయేసరికి ఎంత సేపవుతుందోనని ఆలోచనలో పడ్డాను. అయినా నేను వారించకుండా ఆమె వెంటపడి పోతూనే ఉన్నాను. ఒక పర్వత శృంగం మీదకు ఎక్కాం. మడమల జోడు తొడుక్కుని ఇరవై లేక ఇరవై అయిదేళ్ళు వయస్సులో నున్న ఆ యువతి రివ్వున క్రిందికి దిగసాగింది. క్రిందికి దిగడానికి నేను క్రిందుమీదులవుతూ వున్నాను. నా బాధ ఆమె కంట బడుతుందేమోనని నాకు సిగ్గు. ఆమె వెనక్కి తిరిగి నవ్వుతూ ఇటు దిగు, అటు దిగు అంటూ ఊతం ఇచ్చి దింపనా అంటూ రెచ్చగొట్టసాగింది. అసలే ఎక్కడపడతానో అని భయం. అయినా ఆమె పట్టుకుంటే నేను ఆమె ఊతంతో దిగటమా? చివరికి అతికష్టం మీద కొన్నిచోట్ల పాకి, కొన్నిచోట్ల కూర్చొని ఏదో విధంగా క్రిందికి ఊడిపడ్డాను. ఆమె శభాష్ శభాష్ అంటూ బిగ్గరగా నవ్వి నన్ను బాగా సిగ్గుపడేలా చేసింది.

అయితే అన్ని చోట్ల ఇలా ఆమె బాహువుల్లో పడకుండా తప్పించుకోవడం సాధ్యమా? అయితే భగవంతుడు నా అసత్య వ్రణాన్ని మాన్పాలని భావించాడు. నన్ను రక్షించాడు. బ్రైటన్ అను గ్రామం వెంటనర్ గ్రామం మాదిరిగ సముద్రం ఒడ్డున గల పర్యటనా కేంద్రం. అక్కడికి ఒక పర్యాయం నేను వెళ్ళాను. ఇది వెంటనర్ వెళ్ళడానికి ముందు జరిగిన ఘట్టం. నేను బ్రైటన్‌లో గల ఒక చిన్న హోటలుకు వెళ్ళాను. అక్కడ సామాన్య స్థితిగతులు కలిగిన వృద్ధ వితంతువు కనబడింది. ఇంగ్లాండులో ఇది నాకు మొదటి సంవత్సరం. అక్కడ ఆహారపదార్థాల వివరమంతా ఫ్రెంచి భాషలో వున్నది. నాకు బోధపడలేదు. ఆ వృద్ధురాలి బల్ల దగ్గరే నేనూ కూర్చున్నాను. ఇతడు క్రొత్తవాడు. గాబరా పడుతున్నాడని ఆమె గ్రహించింది. ఆమె మాటలు ప్రారంభించింది.

“నీవు క్రొత్తవాడిలా వున్నావు. సంకోచిస్తున్నట్లున్నావు. తినేందుకు ఇంత వరకు నీవు ఆర్డరు ఇవ్వలేదు. కారణం?” అని అడిగింది. నేను ఆహారపదార్థాల పట్టిక చూస్తున్నాను. వడ్డన చేసేవాణ్ణి పిలిచి మాట్లాడదామని అనుకొంటున్నప్పుడు ఆమె మాట్లాడింది. ఆమెకు ధన్యవాదాలు సమర్పించి “ఈ పట్టికలో ఆహారపదార్థాలను గురించి వివరం తెలుసుకోలేకపోతున్నాను. నేను శాకాహారిని. అందువల్ల వీటిలో ఏమేమి మాంసం కలవనివో తెలుసుకో కోరుతున్నోను” అని అన్నాను.

“ఇదా విషయం! నేను నీకు సహాయం చేస్తాను. పదార్థాల వివరం చెబుతాను. నీవు తీసుకోగల పదార్థాలు చెబుతాను.” అని అన్నది. నేను అందుకు అంగీకరించాను. అప్పటినుండి మాకు దగ్గర సంబంధం ఏర్పడింది. నేను ఆంగ్లదేశంలో వున్నంతవరకే గాక, అక్కడ నుండి వచ్చిన తరువాత కూడా మా సంబంధం చాలాకాలం వరకు చెక్కు చెదరలేదు. ఆమెది లండను. అక్కడి తన అడ్రసు నాకు ఇచ్చింది. ప్రతి ఆదివారం భోజనానికి తనింటికి రమ్మని ఆహ్వానించింది. ఇతర సమయాల్లో కూడా నన్ను భోజనానికి ఆహ్వానిస్తూ ఉండేది. నాకు గల సిగ్గును బిడియాన్ని పోగొట్టేందుకు బాగా సహకరించింది. యువతులను పరిచయం చేసింది. వాళ్ళతో మాట్లాడమని నన్ను ప్రోత్సహించింది. ఒక స్త్రీ ఆమె దగ్గరే ఉండేది. ఆమెను నా దగ్గరకు పంపి ఆమెతో మాట్లాడమని నన్ను ప్రోత్సహించింది. అప్పుడప్పుడు మమ్మల్ని ఇద్దరినీ ఒంటరిగా ఉండనిచ్చేది.

ప్రారంభంలో ఈ తతంగం నాకు నచ్చలేదు. ఏం మాట్లాడాలో తోచేది కాదు. ఎగతాళి మాటలు ఏం మాట్లాడను? ధైర్యం చెబుతూ ఉండేది. అంటే నేను స్త్రీ సాంగత్యానికి “సిద్ధం” చేయబడుతున్నానన్నమాట. ఆదివారం కోసం ఎదురు చూడటం ప్రారంభించేవాణ్ణి. ఆ స్త్రీతో మాట్లాడటం ఎంతో ఇష్టంగా వుండేది.

వృద్ధురాలు కూడా నన్ను స్త్రీ వ్యామోహంలోకి నెట్టసాగింది. మా యీ సాంగత్యం ఆమెకు కూడా ఇష్టమేనన్నమాట. మా ఇద్దరి మేలు ఆమె కూడా కోరియుంటుంది. ఇక నేను ఏం చేయాలి? నాకు పెండ్లి అయిందని ఇదివరకే చెప్పివుంటే బాగుండేది కదా! అప్పుడు ఆమె నా వంటివాడి పెండ్లి విషయం యోచించేదా? ఇప్పటికీ సమయం మించిపోలేదు. నిజం తెలియజేస్తే ముప్పు తప్పిపోతుంది గదా! ఈ విధంగా యోచించి పూర్తి వివరాలు తెలుపుతూ ఆమెకు ఒక జాబు వ్రాశాను. జ్ఞాపకం వున్నంతవరకు నేను రాసిన జాబు సారాంశం క్రింద తెలుపుతున్నాను.

“బ్రైటన్‌లో కలిసినప్పటి నుండి మీరు నన్ను ప్రేమగా చూస్తున్నారు. తల్లి తన బిడ్డను చూచే విధంగా మీరు నన్ను చూస్తున్నారు. నాకు పెళ్ళి అవడం మంచిదనే భావంతోనే యువతుల్ని నాకు పరిచయం చేస్తున్నారు. ఈ వ్యవహారం ముదరక ముందే మీ ఈ ప్రేమకు నేను తగనని తెలియజేయడం నా కర్తవ్యమని భావిస్తున్నాను. నాకు ఇదివరకే పెళ్ళి అయిపోయిందని నేను మీతో పరిచయం అయినప్పుడే చెప్పి వుండవలసింది. హిందూ దేశంలో పెండ్లి అయి ఇక్కడ చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు తమకు పెళ్ళి అయిందని చెప్పరనే విషయం నాకు తెలుసు. నేను కూడా ఆ విధానాన్ని పాటించాను. అయితే ఇప్పుడు ఆ విషయం చెప్పి వుండవలసిందని నాకు బోధపడింది. బాల్యంలోనే నాకు వివాహం అయిపోయిందనీ, నాకు ఒక కొడుకు కూడా కలిగాడని ముందుగానే చెప్పియుంటే బాగుండేది. మీకు చెప్పకుండా దాచి ఉంచినందుకు నేను విచారిస్తున్నాను. అయితే ఇప్పటికైనా మీకు నిజం తెలియజేయాలనే ధైర్యం భగవంతుడు నాకు ప్రసాదించాడు. అందుకు సంతోషిస్తున్నాను. మీరు నన్ను క్షమించండి. మీరు నాకు పరిచయం చేసిన యువతితో ఏ విధమైన అక్రమసంబంధం నేను పెట్టుకోలేదని మీకు తెలుపుతున్నాను. మీరు నా యీ మాటను నమ్మవచ్చు. హద్దు దాటగూడదను విషయం నాకు తెలుసు నాకు మూడుముళ్ళు పడాలనే భావం మీకు కలదని నాకు తెలుసు. ఈ భావం ఇంకా మీ మనస్సులో వ్రేళ్ళూనగూడదనే భావంతో నిజాన్ని ఈ జాబు ద్వారా తెలియజేస్తున్నాను.

ఈ జాబు అందిన తరువాత నేను మీ దగ్గరకు రా తగనివాడినని మీరు భావిస్తే నేను బాధపడను. మీరు చూపిన స్నేహానికి సదా కృతజ్ఞుణ్ణి. మీరు నన్ను వదలి వేయకుంటే చాలా సంతోషిస్తాను. ఇంత జరిగినా మీరు నన్ను మీ దగ్గరకు రానిస్తే, అందుకు నేను తగుదునని మీరు భావిస్తే నాకు క్రొత్త స్పూర్తి లభిస్తుంది. మీ ప్రేమకు పాత్రుడనయ్యేందుకు సదా ప్రయత్నిస్తూ వుంటాను.

ఇంత పెద్ద జాబు త్వరగా వ్రాశానని పాఠకులు గ్రహించకుందురుగాక. ఎన్ని చిత్తులు వ్రాశానో పాఠకులు ఊహించుకోవచ్చు. ఈ జాబు ఆమెకు పంపి పుట్టెడు బరువు తీరిపోయినట్లు భావించాను. ఈ చర్య నాకు హాయి కలిగించింది. మరు టపాలో ఆ వృద్ధ మహిళ వ్రాసిన జాబు అందింది. అందులో ఈ విధంగా వుంది. “నీవు నిర్మల హృదయంతో రాసిన జాబు అందింది. మా ఇద్దరికీ సంతోషం కలిగింది. ఇద్దరం బాగా నవ్వుకున్నాం. నీవు అసత్యానికి పాల్పడ్డావు. అది క్షమించడానికి అర్హమైన తప్పిదమే. నీవు నిజం తెలుపడమే ఆ అర్హతకు కారణం. నీకు స్వాగతం. నా ఆహ్వానం నీకు ఎప్పుడూ వుంటుంది. వచ్చే ఆదివారంనాడు నీ కోసం మేమిద్దరం ఎదురు చూస్తూ ఉంటాము. నీ బాల్య వివాహం గురించి వివరాలు వింటాము. నిన్ను ఎగతాళి చేసి ఆనందం పొందుతాము. మన స్నేహం ఎప్పటిలాగానే స్థిరంగా ఉంటుంది. పూర్తిగా నమ్మవచ్చు,

నాలో ముదిరిన అసత్యమనే ఈ వ్రణాన్ని తొలగించుకుని నయం చేసుకోగలిగాను. తరువాత ఇలాంటి వ్యవహారం జరిగినప్పుడు నా వివాహం సంగతి ముందే చెప్పివేయగల ధైర్యం నాకు కలిగింది.


20. మతాలతో పరిచయం

ఆంగ్లదేశంలో వున్న రెండవ ఏడు చివరిభాగంలో ఇద్దరు దివ్యజ్ఞాన సామాజికులతో నాకు పరిచయం కలిగింది. వారు సోదరులు, అవివాహితులు. భగవద్గీత చదవమని వారు నన్ను ప్రోత్సహించారు. వారు సర్ ఎడ్విన్ అర్నాల్డుగారు గీతకు చేసిన ఆంగ్లానువాదం చదువుతున్నారు. తమతో కలిసి సంస్కృతం గీత చదువుదాము రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను సిగ్గుపడ్డాను. దాన్ని అంతవరకు చదవకపోవడం. కనీసం గుజరాతీ అనువాదాన్ని అయినా చదవకపోవడమే అందుకు కారణం. ఈ విషయం సంకోచిస్తూనే వారికి చెప్పాను. నాకు సంస్కృతం ఎక్కువగా రాదు. అయితే మూలానికి అనువాదానికి తేడా వస్తే ఆ వివరం చెప్పగలను అని చెప్పి వారితో బాటు గీత చదవడం ప్రారంభించాను. ద్వితీయ ఆధ్యాయంలో రెండు శ్లోకాలున్నాయి.

“ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే!
సంగాత్సంజాయతేకామః కామాత్ క్రోధోభిజాయతే
                           సాంఖ్యయోగం - శ్లోకసంఖ్య 62
క్రోధాద్భవతి సంమోమః సమ్మోహాత్ స్మృతి విభ్రమ:
స్మృతి భ్రంశాద్బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి
                           సాంఖ్యయోగం. శ్లోక సంఖ్య 63

(శబ్దాది విషయాలను సదా ధ్యానిస్తూ వుంటే మనిషికి వాటియందు ఆకర్షణ కలుగును. దానివలన కోరిక పుట్టును. కోరిక ద్వారా కోపము కలుగును.

కోపం వల్ల అవివేకమావహించును. అవివేకం వల్ల మతి భ్రమ కలుగును. దాని వల్ల బుద్ధి నశించును. బుద్ధి నశించినచో సమస్తము హతమగును.) ఈ రెండు శ్లోకాలు నా మనస్సునందు నాటుకున్నాయి. ఇప్పటికీ వాటి ధ్వని నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది. భగవద్గీత అమూల్యమైన గ్రంథమను విశ్వాసం రోజురోజుకు నాలో పెరగసాగింది. తత్వజ్ఞానంలో దానితో సమానమైన గ్రంథం మరొకటి లేదను నమ్మకం నాకు కలిగింది. నా మనస్సు చెదిరినప్పుడు భగవద్గీత నాకు ఎంతో సహాయం చేసింది. ఆంగ్లగీతానువాదాలన్నింటిని దరిదాపుగా నేను చదివాను. అర్నాల్డుగారి ఆంగ్లగీతానువాదమే ఉత్తమమైనదని నా అభిప్రాయం. అతడు మూలానుయాయి. అది అనువాదంలా వుండదు. ఆ మిత్రులతో కలిసి గీత చదివానే గాని క్షుణ్ణంగా అర్థం చేసుకొని చదివానని చెప్పలేను. ఆ తరువాత కొంతకాలానికి నాకు అది నిత్యపారాయణ గ్రంథం అయింది,

ఆర్నాల్డుగారు “లైట్ ఆఫ్ ఏషియా” (బుద్ధచరితం) చదవమని చెప్పారు. అంతకు ముందు ఆర్నాల్డుగారు ఒక్క గీతనే ఆంగ్లంలోకి అనువదించారని అనుకున్నాను. కాని బుద్ధ చరిత్రను మాత్రం క్రింద పెట్టడానికి మనస్సు అంగీకరించేది కాదు. వారు ఒకనాడు నన్ను బ్లావట్‌స్కీగారికీ, అనిబిసెంట్ సతిగారికి పరిచయం చేశారు. బిసెంట్‌గారు అప్పుడు దివ్య జ్ఞానసమాజంలో చేరారు. అప్పుడు ఆమెను గురించి పత్రికల్లో చమత్కారంగా చర్చలు జరుగుతూ ఉండేవి. నేను ప్రతిచర్చను ఆసక్తితో చదువుతూ వున్నాను. వారు నన్ను దివ్యజ్ఞాన సమాజంలో చేరమని ఆహ్వానించారు. “నా మతాన్ని గురించే నాకు సరిగా తెలియదు. అట్టి స్థితిలో ఇతర మతాలలో ఎలా చేరడం? అని చెప్పి వినమ్రంగా ఆమె ఆహ్వానాన్ని నిరాకరించాను. వారు చెప్పినమీదట నేను “కీ టు థియాసఫీ” అను మదాం బ్లావట్ స్కీ రచించిన గ్రంథాన్ని చదివినట్లు గుర్తు. ఆ గ్రంథం చదివిన తరువాత హిందూ మతగ్రంథాలు చదవాలనే కోరిక నాకు కలిగింది. మూఢ నమ్మకాలమయం హిందూ మతం అని క్రైస్తవ మతబోధకులు చేసే ప్రచారం తప్పు అను నమ్మకం కూడా నాకు కలిగింది.

ఆ రోజుల్లోనే మాంచెస్టరు నుండి వచ్చిన ఒక మంచి క్రైస్తవుడు శాకాహారశాలలో నన్ను కలిసి క్రైస్తవమత ప్రాశస్త్యాన్ని గురించి వివరించాడు. రాజకోటలో నేనెరిగిన క్రైస్తవ పాదరీల బోధల్ని గురించి ఆయనకు చెప్పాను. అది విని ఆయన దుఃఖపడి “నేను శాకాహారిని. నేను మద్యం తాగను. నాతోటి క్రైస్తవులు మద్యం త్రాగుతున్నారు. మాంసం తింటున్నారు. కాని ఈ రెండింటిని తినమని బైబిలు చెప్పలేదు. బైబిలు చదివితే మీకే తెలుస్తుంది.” అని అన్నాడు. అందుకు నేను అంగీకరించాను. ఆయన నాకు ఒక బైబిలు గ్రంథం ఇచ్చాడు. ఆయనే బైబిలు అమ్మినట్లు, పటాలు, అనుక్రమణిక మొదలగునవి కల బైబిలు ప్రతి ఆయన దగ్గర నేను కొన్నట్లు గుర్తు. దాన్ని చదవడం ప్రారంభించాను. కాని ఓల్డ్ టెస్టామెంట్ (పాత నిబంధన) ముందుకు సాగలేదు. సృష్టిని గురించిన అధ్యాయాలు, తరువాతి అధ్యాయాలు చదువుతుంటే నిద్ర వచ్చింది. చదివాను అని అనిపించడం కోసం ఏదో విధంగా మొత్తం చదివాను. కాని ఏమీ రుచించలేదు. నంబర్స్ అను భాగం వెగటుగా వుంది.

న్యూటెస్టామెంట్ బాగా ఆకర్షించింది. ముఖ్యంగా అందలి “సెర్మన్ ఆర్ ది మౌంట్” (గిరి - ప్రవచనము) గీతకు ఇది సాటి అని అనుకున్నాను. “ఎవరు ఎట్లు చేయుదురో వారు అట్టి ఫలముననుభవింతురు. కాని అన్యాయంతో అన్యాయాన్ని పారద్రోలలేరు. ఎవరేని నీ కుడిచెంప మీద చెంపదెబ్బ కొడితే నీవు నీ ఎడమ చెంప కూడా వానికేసి త్రిప్పు. ఎవరేని నీ ఉత్తరీయం లాగుకుంటే నీ ఆంతర్యం కూడా యిచ్చవేయి.” అను వాక్యాలు నన్ను బాగా ఆకర్షించాయి. నాకు ఎంతో ఆనందం కలిగింది, శ్యామలభట్టు రచించిన చప్పయ్‌ఛందం జ్ఞాపకం వచ్చింది. నా బాలమనస్సు గీత, ఆర్నాల్డు రచించిన బుద్ధ చరితం, ఏసుక్రీస్తు ప్రవచనాలు ఈ మూడింటినీ ఏకీకృతం చేసింది. త్యాగమే ఉత్తమ మతమని నాకు తోచింది. ఈ గ్రంథపఠనం మెల్లగా ఇతర మతాచార్యుల జీవితాలు చదువుటకు నన్ను ప్రోత్సహించింది. కార్లయిట్ వ్రాసిన హీరోస్ అండ్ హీరో వర్షిప్ అను గ్రంథం చదవమని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అందు మహమ్మద్ జీవితం చదివి అతడి మహత్యాన్ని, వీరత్వాన్ని తపశ్చర్యను తెలుసుకున్నాను.

పరీక్షలు దగ్గర పడటం వల్ల ఇక ఏమీ చదవలేకపోయాను. కాని వివిధ మతాల్ని గురించి తెలుసుకోవాలని మాత్రం మనస్సులో నిర్ణయించుకున్నాను. నాస్తిక మతాన్ని గురించి కూడా తెలుసుకోవడం మంచిదని భావించాను. బ్రాడ్లాగారి పేరు, పేరుతోపాటు అతని మతాన్ని ప్రతి హిందువు ఎరుగును. నాస్తికతను గురించి నేనొక పుస్తకం చదివాను. దాని పేరు మాత్రం గుర్తులేదు. నాకది రుచించలేదు. అప్పటికే నేను నాస్తిక మరుభూమిని దాటాను. అప్పుడే బిసెంటుగారు నాస్తిక మతాన్నుండి ఆస్తిక మతంలోకి ప్రవేశించారు.

నాస్తికమతం యెడ నాకు కలిగిన అరుచికి అది కూడా ఒక కారణం. బిసెంటుగారు వ్రాసిన “హౌ ఐ బికేమ్ ఎ థియాసఫిస్ట్” (నేను ఎటుల దివ్యజ్ఞాన సమాజంలో చేరితిని) అను గ్రంథం నేను చదివాను. ఆరోజుల్లోనే బ్రాడ్లా గారు చనిపోయారు. వోకింగ్ సెమిట్రీలో ఆయనకు అంత్యక్రియలు జరిగాయి. అప్పుడు లండనులోని భారతీయులంతా ఆయన శవపేటికతో పాటు వెళ్ళారు. అంత్యక్రియలు చూద్దామని నేను, మరికొందరు పాదరీలతోబాటు వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు రైలు కోసం స్టేషనులో వేచి వున్నాము. అక్కడ ఒక నాస్తిక భావాలుగల వ్యక్తి, ప్రక్కనే వున్న పాదరీని చూచి దేవుడున్నాడా? అని ప్రశ్నించాడు. ఉన్నాడు అని పాదరీ జవాబిచ్చాడు. “భూమి చుట్టుకొలత 78,000 మైళ్లు అని మీరు అంగీకరిస్తారా” అని నాస్తికుడు పాదరీని పరాజయం పాలుచేయాలనే భావంతో అడిగాడు.

“అంగీకరిస్తాను” అని పాదరీ అన్నాడు.

అయితే అయ్యా చెప్పండి, భగవంతుని కొలత ఎంత? ఆయన ఎక్కడ ఉన్నాడు.

“ఆయన మనిద్దరి హృదయాల్లోనూ వున్నాడు. అయితే ఆయనను తెలుసుకోగలగాలి అంతే”

“ఏమండీ! యింకా పసివాణ్ణనే భావిస్తున్నారా? అంటూ తాను విజయం పొందినట్లు ఫోజు పెట్టి తలపంకించి చూచాడు. పాదరీ వినమ్రతతో మౌనం వహించి ఊరుకున్నాడు.

ఈ సంభాషణ కూడా నాకు నాస్తికమతం యెడగల అరుచిని పెంచింది.


21. నిర్బలుడికి బలం రాముడే

నాకు హిందూ మతంతోను ప్రపంచమందలి ఇతర మతాలతోను కొంచెం పరిచయం కలిగింది. కాని విషమ సమయంలో అజ్ఞానం ఉపయోగపడదని నేను గ్రహించలేదు. ఆపత్సమయంలో ఏ వస్తువు మనిషిని రక్షిస్తుందో ఆ వస్తువు మనిషికి కనబడదు. ఆపద తొలగడానికి అతని స్వభావమే కారణం అని కొందరు భావిస్తారు. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు యోచిస్తున్నారు. కాని రక్షణ పొందినపుడు మాత్రం తనను తన సాధనయే రక్షించిందో లేక మరొకడెవడైనా రక్షించాడో తెలుసుకోలేరు. కొందరు తమ నిష్ఠాబలం గొప్పదని భావిస్తారు. కాని నిష్ఠాబలం ఆపత్సమయంలో ఎందుకూ కొరరాదు. అట్టి సమయంలో అనుభవం లేని శాస్త్రజ్ఞానం వృధా అవుతుంది.

కేవలం శాస్త్రజ్ఞాన ప్రయోజనం నాకు కొంతవరకు అర్థమైంది. ఆంగ్లదేశంలో అంతకు ముందు జరిగిన విషయాలలో నాకు రక్షణ ఎలా కలిగిందో చెప్పలేను. అప్పటికి నేను చిన్నవాణ్ణి, కాని ఇప్పుడు నాకు ఇరవైఏళ్ళు. గృహస్థాశ్రమ అనుభవం కూడా కలిగింది. పెళ్ళాం వున్నది. పిల్లవాడు కూడా పుట్టాడు.

నాకు బాగా గుర్తు, ఆంగ్లదేశంలో నేనున్న చివరి సంవత్సరం ఆది. 1890 పోర్టు సుమత్‌లో శాకాహారసభ జరిగింది. నేను నా మిత్రుడు ఆ సభకు ఆహ్వానింపబడ్డాం. పోర్టు సుమతు సముద్రపు రేవు. ఆ ఊళ్ళో నావికజనం ఎక్కువగా వున్నారు. అచట చెడునడత గల స్త్రీలు వున్నారు. అయితే వాళ్ళు వేశ్యలు కారు. కాని వాళ్ళకు నీతి నియమం ఏమీలేవు. అట్టి వాళ్ళ యింట్లో మేము బస చేశాము. సన్మానసంఘం వారికి ఆ విషయం తెలియదు. ఎప్పుడో ఒకసారి పోర్టు సుమతు వంటి పట్టణానికి వచ్చి వెళ్లే మావంటి బాటసార్లకు అక్కడ ఏది మంచి బసయో, ఏది చెడు బసయో తెలుసుకోవడం కష్టం. సభలో పాల్గొని రాత్రి మేము ఇంటికి చేరాము. భోజనం అయిన తరువాత మేము పేకాట ప్రారంభించాము. ఆంగ్లదేశంలో గొప్పగొప్పవారి ఇళ్ళల్లో కూడా గృహిణిలు అతిథులతో పేకాట ఆడటం ఆచారం. సామాన్యంగా పేకాటలో అంతా ఛలోక్తులు విసురుకుంటూ వుంటారు. అయితే అందు దోషం ఉండదు. కాని మా పేకాటలో భీభత్స వినోదం ప్రారంభమైంది.

నా స్నేహితుడు ఇట్టి వ్యవహారంలో ఆరితేరినవాడని నాకు తెలియదు. నాకు కూడా ఈ వినోదంలో ఆనందం కలిగింది. నేను కూడా అందులో దిగాను. మాటలు దాటి వ్యవహారం చేతల్లోకి దిగింది. పేక ప్రక్కన పెట్టివేశాం. ఇంతలో భగవంతుడు నా స్నేహితుని హృదయంలో ప్రవేశించాడు. “నీవా! ఈ ఘోరకలిలోనా? ఈ పాపకూపంలోనా! నీకు ఇక్కడ చోటులేదు. పో! లేచిపో!” అని అరిచాడు. సిగ్గుతో నా తల వంగిపోయింది. అతడి ఆదేశాన్ని శిరసావహించాను. హృదయంలో అతడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మా అమ్మగారి ముందు చేసిన ప్రమాణం జ్ఞాపకం వచ్చింది. నేను లేచి బయటికి పరిగెత్తాను. నా గదిలోకి దూరాను. వేటగాని బారినుండి తప్పించుకున్న లేడిలా గుండె గజగజ వణికిపోయింది.

పరాయి ఆడదాని విషయంలో ఈ విధంగా ప్రధమ పర్యాయం నాకు వికారం కలిగింది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. అనేక ఆలోచనలు నన్నావహించాయి. ఈ ఇంటి నుంచి పారిపోనా? ఈ పట్టణం వదలి వెళ్ళిపోనా? నేనున్నదెక్కడ? నేను జాగ్రత్తగా వుండకపోతే నా గతి ఏమవుతుంది? ఈ రకమైన ఆలోచనలతో సతమతం అయి, తరువాత నుండి అతి జాగ్రత్తగా మసలుకోసాగాను, ఆ ఇంటినేగాక వెంటనే పోర్టు సుమతును వదలి వెళ్ళిపోవడం మంచిదని భావించాను. సభలు ఇంకా రెండు రోజులు జరుగుతాయని తెలిసింది. ఆ మర్నాడు సాయంత్రమే నేను పోర్టుసుమతును వదిలివేసినట్లు నామిత్రుడు మరికొంత కాలం అక్కడే ఉన్నట్లు గుర్తు.

ఆ సమయంలో నాకు మతాన్ని గురించి గాని, దేవుణ్ణి గురించిగాని, దైవసహాయాన్ని గురించిగాని తెలియదు. నన్ను అప్పుడు దేవుడే రక్షించాడని అనుకోవడం తెలిసీ తెలియని స్థితే. నిజానికి ఇక్కట్ల సమయంలో ఎన్నో పర్యాయాలు నన్ను భగవంతుడే రక్షించాడు. జీవితంలో అనేక రంగాల్లో ఇట్టి అనుభవం నాకు కలిగింది. “భగవంతుడు నన్ను రక్షించాడు” అను మాటకు సరియైన అర్థం ఇప్పుడు నాకు బాగా బోధపడింది. అయినా యింకా పూర్తిగా తెలుసుకోలేక పోతున్నానని కూడా నేను ఎరుగుదును. అనుభవం ద్వారా ఆ విషయం తెలుసుకోవడం అవసరం. ఎన్నో ఆధ్యాత్మిక ప్రయత్నాల యందును, లాయరు పనియందును, సంస్థల్ని నడపడంలోను, రాజకీయ వ్యవహారాల్లోను అనేక విషమ ఘట్టాలలోను భగవంతుడు నన్ను రక్షించాడని చెప్పగలను. ఉపాయాలు అడుగంటినప్పుడు, సహాయకులు వదిలివేసినప్పుడు, ఆశలుడిగినప్పుడు ఎటునుండో ఆ సహాయం అందుతుందని నా అనుభవం. స్తుతి, ఉపాసన, ప్రార్థన ఇవి గ్రుడ్డి నమ్మకాలు కావు. అవి ఆహార విహారాదుల కంటే కూడా అధిక సత్యాలు. అవే సత్యాలు, మిగతావన్నీ అసత్యాలే అని కూడా అనవచ్చు. అది అతిశయోక్తి కాజాలదు,

ఈ ఉపాసన, ఈ ప్రార్థన కేవలం వాక్ ప్రతాపం కాదు. దీనికి మూలం జిహ్వకాదు, హృదయం. అందువల్ల భక్తితో నింపి హృదయాన్ని నిర్మలం చేసుకుంటే మనం అనంతంలోకి ఎగిరిపోగలం, ప్రార్థనకు జిహ్వతో పనిలేదు. అది స్వభావానికి సంబంధించినది. అదొక అద్భుతమైన వస్తువు, విశాల రూపాలలో నున్న మలాన్ని, అనగా కామాది గుణాల్ని శుద్ధి చేయుటకు హృదయపూర్వకమైన ఉపాసన ఉత్తమ సాధనమని చెప్పుటకు నేను సందేహించను. అయితే అట్టి ఉపాసన అమిత వినమ్రతా భవంతో చేయాలి.


22. నారాయణ హేమచంద్రుడు

ఆరోజుల్లో నారాయణ హేమచంద్రుడు సీమకు వచ్చారని తెలిసింది. ఆయన మంచి రచయిత అని విన్నాను. నేషనల్ ఇండియన్ అసోసియేషన్‌కు సంబంధించిన మానింగ్ కన్యాగృహంలో వారిని కలిశాను. నేను ఇతరులతో కలిసి వుండలేనని మానింగ్ కన్యకు తెలుసు. నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరైనా మాట్లాడించితే తప్ప మౌనంగా వుండేవాణ్ణి. ఆమె ఆయనకు నన్ను పరిచయం చేసింది. ఆయనకు ఇంగ్లీషురాదు. ఆయనది వింతవాలకం. వికారంగా వుండే ఫాంటు అట్టిదే మడతలు బడిన మురికి బూడిదరంగు పార్సీ పద్ధతి కోటు ధరించివున్నాడు. నెక్‌టైగాని, కాలరుగాని లేదు. కుచ్చులు గల ఉన్ని టోపీ పెట్టుకున్నాడు. పొడుగుపాటి గడ్డం. బక్కపలుచని శరీరం, మనిషి పొట్టి. గుండ్రని ఆయన ముఖం మీద మశూచి మచ్చలు. ముక్కు కొన తేలిలేదు, మొద్దుబారీ లేదు. మాటిమాటికీ ఆయన చేత్తో గడ్డం నిమురుకుంటూ వుండేవారు.

నాగరిక సంఘం ఆయనను అంగీకరిస్తుందా? తప్పక వేలు పెట్టి చూపిస్తుంది,

“మిమ్మల్ని గురించి నేను విన్నాను. మీ గ్రంథాలు కొన్ని చదివాను. మీరు మా యింటికి దయచేయరా!” అని అడిగాను. ఆయన కంఠం కొంచెం బండబారి వుంది. నవ్వుతూ మీ బస ఎక్కడ? అనే ప్రశ్నించారు.

“స్టోరువీధిలో”

“అయితే మనం ఒక గూటివాళ్ళమే. ఇంగ్లీషు చదువుకోవాలని వుంది. నేర్పుతారా?” “నాకు తెలిసినంతవరకు మీకు నేర్పడం ఇష్టమే. నా శక్తి కొద్దీ నేర్పుతాను. మీరు సరేనంటే నేనే మీ దగ్గరకు వస్తాను.” అని అన్నాను. సమయం నిర్ణయించాం. త్వరలోనే మామధ్య మంచి స్నేహం కుదిరింది..

నారాయణ హేమచంద్రునికి వ్యాకరణం రాదు. ఆయన దృష్టిలో గుర్రం క్రియ, పరుగెత్తడం విశేష్యం. ఇట్టి ఉదాహరణలు చాలా వున్నాయి. ఆయన అజ్ఞానం నాకు బోధపడలేదు. నా స్వల్ప వ్యాకరణ జ్ఞానం ఆయన మీద పారలేదు. వ్యాకరణం రాలేదనే బాధ ఆయనకు లేదు, “నేనెన్నడూ మీ వలె స్కూలుకు వెళ్ళలేదు. నా అభిప్రాయం వెల్లడించవలసివచ్చినప్పుడు వ్యాకరణం ఆవశ్యకత నాకు కలుగులేదు. సరే గాని మీకు బెంగాలీ వచ్చా?” నాకు వచ్చు. నేను బెంగాలుదేశంలో తిరిగాను. మహర్షి దేవేంద్రనాథఠాకూరు గ్రంథాలు గుజరాతీ వారికి అనువదించి నేను ఇచ్చాను. ఇతర భాషల్లో వున్న మహద్గ్రంధాల్ని గుజరాతీలోకి అనువదించి ఇవ్వాలి. నేను చేసే అనువాదం మక్కికి మక్కి వుండదు, భావానువాదం మాత్రం చేస్తాను. నాకు అదే తృప్తి. నా తరువాతి వాళ్ళు యింకా సవివరంగా చేస్తారు. వ్యాకరణసాయం లేకుండా గ్రహించింది నాకు చాలు. తృప్తోస్మి. నాకు మరాఠీ, హిందీ, బెంగాలీ వచ్చు. ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకుంటున్నాను. నాకు కావలసింది శబ్దాల పట్టిక. అంతటితో నాకు తృప్తి లేదు. నేను ఫ్రాన్సు వెళ్ళాలి. ఫ్రెంచి నేర్చుకోవాలి. ఫ్రెంచి భాషలో మహద్గ్రంథాలు చాలా ఉన్నాయని విన్నాను. వీలైతే జర్మనీ వెళ్ళాలి. ఆ భాష నేర్చుకోవాలి.” ఇదీ ఆయన ధోరణి. భాషలన్నింటిని చుట్టబెట్టి మ్రింగివేయాలని ఆయన ఆశ. ఇతర దేశాలు తిరగాలనే ఆశ కూడా అధికంగా వుంది.

“అయితే మీరు అమెరికా కూడా వెళతారా?” “తప్పక వెళతాను. ఆ క్రొత్త ప్రపంచం చూడకుండా ఇండియాకు తిరిగి వెళతానా?” “అయితే డబ్బు?” “నాకు డబ్బుతో పనిలేదు. నాకు మీవలె అవసరాలు ఉండవు. నేను తినేదెంత?” నా పుస్తకాలిచ్చే డబ్బు నాకు చాలు. మిత్రులిచ్చేది చాలు. నేను మూడవ తరగతిలోనే ప్రయాణం చేస్తాను. అమెరికా వెళితే డెక్‌మీదే వెళతాను.

ఇదీ నారాయణ హేమచంద్రుని విధానం. ఆ విధానం ఆయన సొంతం. అందుకు తగిన మంచి మనస్సు ఆయనకుంది. గర్వం ఏమాత్రము లేదు. అయితే ఆయనకు తన శక్తిమీద మోతాదుకు మించిన విశ్వాసం ఉందని నా అభిప్రాయం.

మేము రోజూ కలిసేవాళ్ళం. మా పనుల్లో కొంత పోలిక ఉంది. మేమిద్దరం శాకాహారులం. తరచు మేమిద్దరం ఒకేచోట భోజనం చేసేవాళ్ళం. ఇంట్లో సొంతంగా వండుకొని నేను కాలం గడుపుతున్న రోజులవి. వారానికి 17 షిల్లింగులు మాత్రమే ఖర్చు అవుతున్నది. ఆయన గదికి నేను, నా గదికి ఆయన అప్పడప్పుడు వస్తూపోతూ వుండేవారం. నా వంటకం ఇంగ్లీషువారి మాదిరిది. ఆయనకు ఇది నచ్చదు. ఆయనకు హిందూ మాదిరి వంటకాలు కావాలి. పప్పులేందే ఆయనకు ముద్ద దిగదు. నేను ముల్లంగితో సూపు తయారు చేస్తే ఆయనకు గుటక దిగేది కాదు. ఒకనాడు ఎలా సంపాదించారో ఏమో వేరుశెనగ పప్పు తెచ్చి నాకు వండి పెట్టడానికి సిద్ధపడ్డారు. నేను లొట్టలు వేస్తూ ఆయన వంటకం తిన్నాను. ఈ విధంగా నాకు ఆయన, ఆయనకు నేను వంటచేసి పెట్టడం అలవాటు అయిపోయింది. ఆ రోజుల్లో కార్డినల్ మానింగ్ వారి పేరు ప్రతివారి నోటిమీద ఆడుతూ వుంది. నౌకాశ్రయంలో పనివాళ్ళు సమ్మెకట్టారు. జాన్ బరన్సు గారు, కార్డినల్ మానింగ్ గారు పూనుకొని ఆ సమ్మెని ఆపివేశారు. మానింగ్‌గారి నిరాడంబర జీవితాన్ని గురించి డిజరాలీ మంత్రిగారి అభినందనల్ని గురించి నేను హేమచంద్రునికి చెప్పాను. “నేనా సాధు పురుషుణ్ణి చూచితీరాలి”. అని అన్నారు. హేమచంద్రుడు.

“అతడు చాలా గొప్పవాడు. మీరెట్లా చూడగలరు?”

“తేలిగ్గా చూస్తా. దానికి మార్గం చెబుతా, నేనొక రచయితను. రచయితగా ఆయన పరోపకార పారీణతకు స్వయంగా కలిసి ధన్యవాదాలు చెబుతాననడం ఒక పద్ధతి. నాకు ఇంగ్లీషురాదు గనుక నిన్ను దుబాసీగా తీసుకు వస్తున్నట్లు కబురుచేద్దాం. నేను చెప్పినదంతా చేర్చి ఆయనకు నీవు ఒక జాబు వ్రాయి. తెలిసిందా?”

నేను ఆయన చెప్పినట్లు జాబు వ్రాశాను. రెండుమూడు రోజుల్లో సమయం నిర్ణయించ కలుసుకోవడానికి అంగీకారం తెలుపుతూ కార్డినల్ మానింగ్‌గారు మాకు జాబు వ్రాశారు. మేమిద్దరం వెళ్ళాం. నేమ పెద్దలను చూచేందుకు వెళ్ళేటప్పుడు ధరించాల్సిన దుస్తులు ధరించాను. నారాయణ హేమచంద్రుడు మాత్రం తన మామూలు దుస్తులే వేసుకున్నారు. మామూలు కోటు, మామూలు లాగు. నేను కొంచెం పరిహాసం చేశాను. ఆయన నా పరిహాసాన్ని చిటికెలో పరాస్తం చేస్తూ “మీరంతా నాగరికతా లక్షణాల కోసం అర్రులు చాచే పిల్లకాయలు, పిరికిపందలు. మహాపురుషులు హృదయాన్ని చూస్తారు గాని పైపై మెరుగులు చూడరు.” అని అన్నారు.

మేము కార్డినల్ గారి మహల్లో ప్రవేశించాం. అదొక పెద్దనగరంగా వుంది. మేము కూర్చోగానే ఒక బక్కపలుచగా వున్న పొడుగుపాటి వృద్ధుడొకడు వచ్చి కరస్పర్శ కావించాడు. ఆయనే కార్డినల్‌గారని తెలిసిపోయింది.

వెంటనే నారాయణ హేమచంద్రుడు అభివందనాలు సమర్పించి “నేను మీ సమయం అపహరించను. నేను మీ కీర్తిని గురించి చాలా విన్నాను. మీరు సమ్మె కట్టిన పనివాళ్ళకు ఉపకారం చేశారు. ఇక్కడకు వచ్చి మిమ్మల్ని అభినందించాలని బుద్ధి పుట్టింది. ప్రపంచంలో సాధు సజ్జనుల దర్శనం చేసుకోవడం నాకు అలవాటు. అందువల్ల మీకీ శ్రమ కలిగించాను.” అని గబగబా అన్నాడు.

ఆయన గుజరాతీ మాటల్ని నేను ఇంగ్లీషులోకి మార్చాను. “మీ రాకకు సంతోషిస్తున్నాను. మీకు ఇచట నివాసం సుకరం అవుగాక, భగవంతుడు మీకు మేలు చేయుగాక." అని ఆయన వెంటనే వెళ్లిపోయాడు.

ఒకరోజున నారాయణ హేమచంద్రుడు ధోవతి కట్టుకొని, షర్టు తొడుగుకొని నా బసకు విచ్చేశాడు. ఆ యింటి యజమానురాలు తలుపు తీసి చూడగానే దడుచుకున్నది. (నేను మాటిమాటికీ మకాం మారుస్తూ వుంటాననీ వ్రాశానుగదా! ఆ క్రమంలో ఈ మధ్యనే ఈ ఇంటికి వచ్చాను. ఈ ఇంటి యజమానురాలు నారాయణ హేమచంద్రుణ్ణి అదివరకు చూడలేదు) ఆమె తత్తరపడుతూ వచ్చి “ఎవరో పిచ్చివాడిలా వున్నాడు. మీ కోసం వేచివున్నాడు” అని చెప్పింది. నేను ద్వారం దగ్గరికి వెళ్ళాను. నారాయణ హేమచంద్రుడు నిలబడివున్నాడు. నివ్వెరపోయాను. ఆయన ఎప్పటిలాగానే నవ్వుతూ వున్నాడు.

“బజార్లో పిల్లలు మిమ్మల్ని చూచి అల్లరి చేయలేదా?”

“వాళ్ళు నావెంటబడ్డారు. కాని నేను వారివంక కన్నెత్తి చూడలేదు. దానితో వాళ్ళు వెళ్ళిపోయారు.”

లండనులో కొంతకాలం వుండి నారాయణ హేమచంద్రుడు తరువాత పారిస్ వెళ్ళిపోయారు. ఆయన ఫ్రెంచి భాష కొంచెం నేర్చుకున్నారు. కొన్ని ఫ్రెంచి గ్రంథాల్ని అనువదించడానికి పూనుకున్నారు కూడా. ఆయన అనువాదం సరిచూడగలిగినంత ఫ్రెంచి భాష నాకూ వచ్చు. అందువల్ల అనువాదం ఎలా వుందో చూడమని ఆయన నాకు ఇచ్చారు. అది నిజానికి అనువాదం కాదు. భావార్థం మాత్రమే.

అమెరికా వెళ్ళాలనే తన కోరికను కూడా తీర్చుకున్నారు. తంటాలుపడి చివరకు డెక్ టిక్కెట్టు సంపాదించారు. షర్టు, ధోవతి కట్టుకొని వెళ్ళడం అమెరికాలో అసభ్యతా లక్షణమట. ఆయన అవి ధరించి బజారుకు వెళ్ళగా అయన్ని అమెరికాలో ప్రాసిక్యూట్ చేశారట. తరువాత ఆయనను విడిచి వేసినట్లు గుర్తు.

23. పెద్ద సంత

1890వ సంవత్సరంలో పారిస్‌లో గొప్ప సంత జరిగింది. అందుకోసం పెద్ద ఏర్పాట్లు చేయబడుతున్నాయని పత్రికల్లో చదివాను. నాకు పారిస్ నగరం చూడాలనే కోరిక కలిగింది. రెండు పనులు కలిసి వస్తాయని భావించి పారిస్ వెళ్ళాలని నిర్ణయించాను. ఆ సంతలో ఏఫిల్ టవర్ (గోపురం) అనునది గొప్ప వింత. దాని పొడవు వేయి అడుగులు. కేవలం ఇనుముతో కట్టబడింది. ఇంకా అనేక వింతలు అక్కడ వున్నాయి. కాని ఆ గోపురం మాత్రం గొప్ప వింత. అంత ఎత్తుగల కట్టడం స్థిరంగా వుండదని అక్కడ అంతా అనుకుంటూ వుంటారు.

పారిస్‌లో శాకాహారశాల ఒకటి వున్నదని విన్నాను. అందొక గది నా కోసం ఏర్పాటు చేసుకున్నాను. ఏడురోజులు అక్కడ ఉన్నాను. తక్కువ ఖర్చుతో పారిస్ వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాను. పారిస్ నగర పటం ఒకటి, సంతకు సంబంధించిన వివరాలు తెలిపే పుస్తకం ఒకటి సంపాదించి దగ్గర పెట్టుకున్నాను. చాలా ప్రదేశాలకు నడిచే వెళ్ళాను. మ్యాపు సహాయంతో రాజవీధులకు, దర్శనీయ స్థానాలకు వెళ్ళడం తేలిక అయింది.

ఆ ప్రదర్శనశాల అంతగా గుర్తులేదు. దాని వైశాల్యం, వైవిధ్యం మాత్రం జ్ఞాపకం వున్నాయి. రెండు మూడు సార్లు ఎక్కడం వల్ల ఏఫిల్ టవర్ నాకు చక్కగా గుర్తు ఉంది. దాని మీద మొదటి మజిలీలో భోజనశాల ఉంది. అంత ఎత్తున భోజనం చేశానని చెప్పుకునేందుకుగాను దాని మొహాన ఏడు షిల్లింగులు పారవేశాను.

పారిస్ నగరంలో గల చర్చి గృహాలు జ్ఞాపకం వున్నాయి. వాటి భవ్యస్వరూపం, వాటిలోపల లభించే శాంతి మరిచిపోదామన్నా వీలులేనివి. నోటర్ డామ్ కట్టడపు పని, లోపలి చిత్తరువులు, అక్కడి చెక్కడపు పని చిరకాలం జ్ఞాపకం వుంటాయి. అట్టి విశాలమైన చర్చి దేవళాన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన వారి హృదయాంతరాళాలలో ఈశ్వర భక్తి ఎంతగా నిండి ఉందో వాటిని చూస్తే బోధపడుతుంది,

పారిస్ నగరపు ఫాషన్లను గురించి అక్కడి భోగవిలాసాల్ని గురించి చాలా చాలా చదివాను. ఇది ప్రతి వీధిలో మనకు కనబడుతుంది. కాని చర్చి దేవళాలు మాత్రం అద్భుతం. వాటిలోపల అడుగు పెట్టేసరికి బయట గొడవంతా మరిచిపోవలసిందే. మన ప్రవర్తన మారిపోతుంది. వర్జిన్ మేరీ దగ్గర మోకరించి యున్న వాళ్ళ దగ్గరగా నడిచి వెళుతున్నప్పుడు భయభక్తులు ఉత్పన్నమవుతాయి. మోకరిల్లుట, ప్రార్థించుట ఇవి గ్రుడ్డి నమ్మకాలు కావు అని ఆనాడు నాకు బోధపడింది. ఆ భావం నాలో రోజురోజుకు పెరుగుతూ వున్నది. వర్జిన్ మేరీ విగ్రహం ముందు భక్తి ప్రపత్తులతో మోకరిల్లుట రాతికి రప్పకు మోకరిల్లుట అని అనగలమా? వారుభక్తిచే తన్మయులై రాతినిగాక, దానియందలి దేవుణ్ణి కొలుస్తున్నారని చెప్పవచ్చు. వాళ్ళు ఈ విధంగా దేవుని మహిమను తగ్గించకుండా హెచ్చించుచున్నారని నేను భావించినట్లు గుర్తు.

ఏఫిల్ టవరును గురించి రెండు మూడు మాటలు వ్రాయడం అవసరం. దాని ఉపయోగం ఏమిటో నాకు బోధపడలేదు. కొందరు దాన్ని దూషించినట్లు, కొందరు భూషించినట్లు విన్నాను. దాన్ని నిందించిన వారిలో ప్రముఖుడు టాల్‌స్టాయ్ అని గుర్తు. అతడు ఏఫిల్ టవరు మానవుని విజ్ఞానానికి గాక అజ్ఞానానికి చిహ్నం అని పేర్కొన్నాడు.

“మాదక ద్రవ్యాలలో పొగాకు కడు నీచం. దానికి అలవాటు పడినవాడు త్రాగుడుకు అలవాటు పడిన వాళ్ళకంటే మించి నేరాలు చేస్తాడు. తాగుడువల్ల ఉన్మాదం కలుగుతుంది. కాని పొగాకు వల్ల బుద్ధి తమస్సులో పడిపోతుంది. పొగాకును ఉపయోగించేవాడు ఇలాంటి ఆకాశ సౌధాలు కట్టజూస్తాడని” టాల్‌స్టాయి చెప్పినట్లు గుర్తు. ఏఫిల్‌టవరు అట్టి వ్యసన పరిణామమే. ఏఫిల్ టవరు నందు శిల్పం లేదు. అది పారిస్‌లో ఏర్పాటు చేయబడిన గొప్ప సంతకు ఏవిధంగానూ అందం సమకూర్చి పెట్టలేదు. దాని క్రొత్తదనాన్ని, వింతకొలతల్ని చూచి జనం దాన్ని చూడటం కోసం మూగుతూ ఉంటారు. దాని మీదకు ఎక్కుతూ ఉంటారు. అది సంతలో ప్రదర్శన కోసం పెట్టబడ్డ బొమ్మ, బాలురమై వున్నంతవరకు బొమ్మలపై మోహం ఉంటుంది. ఎంతవరకు అట్టి మోహం ఉంటుందో అంతవరకు మనం బాలురమేనని ఈ ఏఫిల్ టవరు స్పష్టంగా చెబుతూ ఉంటుంది. అందుకు ఈ ఏఫిల్ టవరు ఉపయోగపడుతున్నదని చెప్పవచ్చును. 

24. పట్టా పుచ్చుకున్నాను - కాని ఆ తరువాత?

బారిష్టరు పట్టాకోసం గదా నేను ఆంగ్లదేశం వెళ్ళింది? దాన్ని గురించి కొంచెం వ్రాస్తాను. అందుకు ఇది మంచి తరుణం.

బారిష్టరు పరీక్షకు రెండు నియమాలు ఉన్నాయి. ఒకటి నిశ్చిత సమయపాలన. రెండవది - పరీక్షలు వ్రాయడం. నిశ్చిత సమయపాలనకు పట్టే సమయాన్ని పన్నెండు భాగాలుగా విభజించాలి. ఆ సమయపు ఒక్కొక్క భాగంలో జరిగే ఇరవై నాలుగు డిన్నర్లలో కనీసం ఆరు డిన్నర్లలోనైనా పాల్గొనాలి. (అంటే మూడు సంవత్సరాలకు పన్నెండు టరములు. సంవత్సరానికి నాలుగు టరములు. డిన్నర్లు తొంభై ఆరు అన్నమాట! విందుల్లో పాల్గొనడమంటే భోజనం చేయడం అని అర్థం కాదు. నిర్ణీత సమయంలో హాజరై విందు జరిగినంత సేపు ఉండటం అని అర్థం. సామాన్యంగా అంతా పక్వావ్నాలు భుజిస్తారు. కోరిన మద్యం సేవిస్తారు. ఒక్కొక్క విందు వెల రెండు మూడు పౌండ్లు. అది తక్కువే. హోటల్లో అయితే ఒక మద్యానికే అంత వెల చెల్లించవలసి వస్తుంది. నవనాగరికులు కాని హిందువులకు భోజనం కంటే, అందులో ఒక భాగమైన మద్యానికి అంత ధర వుంటుందని అంటే ఆశ్చర్యం కలుగుతుంది.

లండనులో నాకీ విషయం తెలిసినప్పుడు త్రాగుడుకు ఇంత డబ్బు పాడుచేస్తున్నారేమిటి అని బాధ కలిగింది. తరువాత అక్కడి డిన్నర్ల విషయం అర్థమైంది. నేను ఆ డిన్నర్లలో పాల్గొని తిన్నది ఏమీ లేదు. అయితే రొట్టె, బంగాళాదుంపలు, క్యాబేజీ కూర మాత్రం తినేవాణ్ణి. ప్రారంభంలో ఇష్టం లేక వాటిని తినలేదు. రుచి మరిగిన తరువాత యింకా వడ్డించమని అడగడానికి కూడా సాహసించాను.

అక్కడ విద్యార్థులకు పెట్టే ఆహారం కంటే ఉపాధ్యాయులకు పెట్టే ఆహారం మేలుగా వుండేది. నాతోబాటు శాకాహారి ఆయిన పార్సీ యువకుడు మరొకడు వుండేవాడు. మేము శాకాహారులం. అందువల్ల ఉపాధ్యాయులకు పెట్టే శాకాహార పదార్థాల్లో కొన్ని మాకు పెట్టమని విన్నవించుకున్నాం. మా విన్నపం అంగీకరించబడింది. మాకు కూడా శాకాలు, పండ్లు లభించసాగాయి.

నలుగురు విద్యార్థుల బృందానికి రెండు మద్యం సీసాలు ఇస్తారు. నేను మద్యం త్రాగను. అందువల్ల ప్రతివారు తమ బృందంలోకి రమ్మని నన్ను ఆహ్వానించేవారు. నేను వాళ్ళ బృందంలో కలిస్తే నా భాగం కూడా వారే త్రాగొచ్చు. ప్రతి ఇరవైనాలుగు డిన్నర్లకు ఒకటి చొప్పున పెద్ద డిన్నరు ఏర్పాటు చేసేవారు. దానికి గ్రాండ్‌నైట్ అని పేరు. అప్పుడు మామూలు మద్యాలతో బాటు షాంపేన్, ఫోర్‌టువైన్, షెర్రీ మొదలుగాగల మద్యాలు కూడా ఇచ్చేవారు. ఆనాడు నాకు ప్రత్యేక ఆహ్వానాలు బ్రహ్మాండంగా లభిస్తూ ఉండేవి.

అసలు ఈ రకం డిన్నర్ల వల్ల బారిష్టరగుటకు ఏవిధంగా అర్హత చేకూరుతుందో అప్పటికీ, ఇప్పటికీ నాకు బోధపడలేదు. విద్యార్థులు వెళుతూ వుండేవారనీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంభాషణకు చర్చకు అవకాశం లభించేదనీ, అక్కడ ఉపన్యాసాలు జరిగేవనీ, వాటివల్ల కొంత లోకజ్ఞానం, కొంత నాగరికత, ఉపన్యాస సమర్థత విద్యార్థులకు కలుగుతూ వుండేదనీ వినికిడి. నా టైము వచ్చేసరికి అవన్నీ పోయాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు దూరం దూరంగా కూర్చోసాగారు. అసలు ప్రయోజనం మృగ్యమైపోయి ఆచారం మాత్రం మిగిలింది. పూర్వాచారాల మీద ఆసక్తి కలిగియుండే ఇంగ్లాండు ఆ ఆచారాన్ని వదలలేదు.

బారిష్టరు పరీక్షకు అవసరమైన పుస్తకాలు తేలిక. అందుకే బారిస్టర్లకు అక్కడ డిన్నర్ బారిష్టర్లని పేరు వచ్చింది, డిన్నర్ బారిష్టర్లంటే తిండిపోతు బారిష్టర్లని అర్థం. పరీక్షలు పేరుకు మాత్రమేనని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో రెండు పరీక్షలు జరిగేవి. అవి రోమన్ లా, కామన్ లా పరీక్షలు. ఈ పరీక్షలకు పాఠ్యగ్రంథాలు ఉండేవి. విడివిడిగా చదివి విడివిడిగా పరీక్షలు వ్రాయవచ్చు. కాని ఎవ్వరూ పాఠ్యపుస్తకాలు చదివిన పాపాన పోరు. రెండు వారాలు రోమన్‌లాటీను బట్టీవేసి పరీక్షకు కూర్చుంటారు. రెండు మూడు నెలలు కామన్‌లాటీనును బట్టి వేసి పరీక్షకు కూర్చుంటారు. అటువంటి వాళ్ళను చాలామందిని చూచాను. ప్రశ్నలు తేలిక, పరీక్షకులు ఉదార స్వభావులు. రోమన్‌లా పరీక్షార్థుల్లో నూటికి 95 నుండి 99 మంది ప్యాసయ్యేవారు. పెద్ద పరీక్షలో నూటికి 75 మంది, అంతకంటే ఎక్కువమంది ప్యాస్. అందువల్ల పరీక్షా భయంలేదు. సంవత్సరానికి పరీక్షలు నాలుగుసార్లు జరుగుతూ ఉండేవి. ఇంత అనువుగా వున్న పరీక్షలు కష్టమనిపించవు.

నేను మాత్రం పుస్తకాలన్నీ చదవాలని నిర్ణయించుకున్నాను. పాఠ్యగ్రంథాలు చదవకపోవడం మోసమని నాకు అభిప్రాయం కలిగింది. నేను ఆ పుస్తకాల కోసం డబ్బు బాగా ఖర్చు చేశాను. రోమన్ లా ను లాటిన్ భాషలో చదవదలిచాను. నేను లండన్ మెట్రిక్యులేషన్ పరీక్ష కోసం లాటిన్ భాష అభ్యసించాను. అది ఇప్పుడు బాగా ఉపకరించిది. నేను చదివిన చదువుకు విలువ లేకుండా పోలేదు. దక్షిణాఫ్రికాలో అది నాకు బాగా ఉపయోగపడింది. దక్షిణాఫ్రికాలో రోమన్ డచ్చి భాషలు ప్రామాణికం. ఈ విధంగా లాటిన్ చదువు దక్షిణాఫ్రికా దేశపు చట్టాలను తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడింది.

ఇంగ్లాండు దేశపు కామన్‌లాను రాత్రింబవళ్ళు చదవడానికి నాకు తొమ్మిది నెలలు పట్టింది. బ్రూముగారి “కామన్‌లా” పెద్దది. కాని చదవడానికి బాగుండేది. కాలం మాత్రం చాలా పట్టింది. స్నెల్ గారి “ఈక్విటీ” అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. వైట్ ట్యూడర్ రచించిన “లీడింగ్ కేసెస్” అను గ్రంథంలో కొన్ని కేసులు తప్పనిసరిగా చదువతగ్గవి. ఆ గ్రంథం హృదయరంజకం, జ్ఞానదాయకం. విలియం ఎడ్వర్డ్‌గార్ల “రియల్ ప్రాపర్టీ” గుస్వ్ గారి “పర్సనల్ ప్రాపర్టీ” అని గ్రంథాలు సంతోషంతో చదివాను. విలియం గారి పుస్తకం చదవడానికి నవలగా వుంటుంది. మెయిన్‌గారి “హిందూ లా” ఎంతో అభిరుచితో చదివాను. హిందూదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఓడలో దాన్ని చదివినట్లు గుర్తు. హిందూ లా గ్రంథాన్ని గురించి విశ్లేషించడానికి ఇది తరుణం కాదు.

నేను పరీక్ష ప్యాసయ్యాను. ది 10 జూన్ 1891లో పట్టా చేతికందింది. 11వ తేదీన ఇంగ్లాండు హైకోర్టులో రెండున్నర షిల్లింగులు చెల్లించి పేరు రిజిష్టరు చేయించుకున్నాను. 12వ తేదీన ఇంటికి బయలుదేరాను.

ఇంత చదివిన తరువాత కూడా నన్ను పెద్ద బెంగ పట్టుకుంది. కోర్టులో వాదించడానికి నేను తగనని భయం వేసింది.

ఆ క్షోభను గురించి వర్ణించేందుకు మరో ప్రకరణం అవసరం.

25. నన్ను పట్టుకున్న పెద్ద బెంగ

బారిష్టరు అని అనిపించుకోవడం తేలికే గాని బారిష్టరీ చేయడం మాత్రం కష్టమని తోచింది. లా చదివాను గాని, వకీలు వృత్తి నేర్చుకోలేదు. లా లో అనేక ధర్మ సిద్ధాంతాలు చదివాను. అవి నాకు నచ్చాయి. కాని వాటిని వృత్తిలో ఎలా అమలుబరచాలో బోధపడలేదు. “ఇతరుల ఆస్థికి నష్టం కలుగకుండా నీ సర్వస్వాన్ని వినియోగించు” అనునది ధర్మవచనం. కాని వకీలు వృత్తికి పూనుకొని వాది విషయంలో ఈ సిద్ధాంతాన్ని ఎలా అమలుపరచగలమో బోధపడలేదు. ఈ సిద్ధాంతం అమలుబరచబడిన కేసుల వివరం చదివాను. కాని అ వివరంలో ఈ సిద్ధాంతాల్ని అమలుబరచిన ఉపాయాలు లభించలేదు.

నేను చదివిన చట్టాలలో హిందూదేశానికి సంబంధించిన చట్టాలు ఏమీ లేవు. హిందూ చట్టాలు ఇస్లాం చట్టాలు ఎలా వుంటాయో నేను తెలుసుకోలేకపోయాను. దావాలు ఎలా వేయాలో తెలియదు. పెద్ద బెంగ పట్టుకున్నది. ఫిరోజ్ షా మెహతాగారి పేరు విన్నాను. ఆయన కోర్టుల్లో సింహంలా గర్జిస్తాడని విన్నాను. ఆంగ్ల దేశంలో ఆయన ఏ విధంగా చదివారో తెలియదు. ఆయన లాంటి తెలివి ఈ జీవితంలో నాకు అబ్బదు అని అనిపించింది. ఒక వకీలుగా వృత్తి చేసుకుంటూ జీవనం గడుపుకునేందుకు అవసరమైన భృతి సంపాదించగలనా అని అనుమానం కూడా నన్ను పట్టుకుంది,

లా చదువుతున్న రోజుల్లోనే ఈ సంశయం కలిగి బాధపడ్డాను. మిత్రులతో ఈ విషయం చెప్పాను. దాదాభాయి నౌరోజీగారి సలహా తీసుకోమని ఒక మిత్రుడు చెప్పాడు. నేను ఇంగ్లాండుకు వెళ్ళేటప్పుడు శ్రీ దాదాభాయి నౌరోజీగారి పేరిట కూడా ఒక సిఫార్సు పత్రం తీసుకువెళ్ళానని గతంలో వ్రాశాను. చాలాకాలం తరువాత నేనా ఉత్తరాన్ని బయటికి తీశాను. ఆ మహా పురుషుని దర్శించటానికి నాకు గల అధికారం ఏమిటా అని యోచించాను. వారి ఉపన్యాసం జరుగుతుందని తెలియగానే నేను ఆ సభకు వెళ్ళి ఒక మూల కూర్చొని వారిని కండ్లారా చూచి వారి ఉపన్యాసం శ్రద్ధగా చెవులారా వినేవాణ్ణి. విద్యార్థుల బాగోగులను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక సంఘం స్థాపించారు. ఆ సభలకు నేను విధిగా వెళుతూ ఉన్నాను. నౌరోజీగారు విద్యార్థుల పట్ల చూపే ప్రేమ, వాత్సల్యం విద్యార్థులు వారి యెడ చూపే శ్రద్ధాభక్తులు చూచి ఎంతో ఆనందించాను. ఒకరోజు ధైర్యం తెచ్చుకొని సిఫార్సు ఉత్తరం పుచ్చుకొని వారి దగ్గరకు వెళ్ళాను. “నీ కిష్టమైనప్పుడల్లా వచ్చి నన్ను కలవవచ్చు” అని ఆయన అన్నారు. అయితే ఆ అవకాశం నేను ఉపయోగించుకోలేదు. అవసరం లేనప్పుడు వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేక ఆ సలహాను నేను అమలుచేయలేదు.

ఫెడరిక్ పిన్‌కట్ గారిని దర్శించమని ఆ మిత్రుడే సలహా యిచ్చాడో లేక మరో మిత్రుడే ఇచ్చాడో గుర్తులేదు. పిన్‌కట్‌గారు మితవాది. పూర్వాచారపరాయణుడు. భారతీయ విద్యార్థుల మీద ఆయన చూపే ప్రేమ నిర్మలం, నిస్వార్థమయం. విద్యార్థులు సలహా కోసం వారి దగ్గరకు వెళుతూ వుండేవారు. నేను కూడా వారి దర్శనం కోసం వెళ్ళాను. ఆ సంభాషణను నేను మరిచిపోలేను. ఒక మిత్రునితో సంభాషించినట్లు ఆయన నాతో మాట్లాడారు. నన్ను పట్టుకున్న బెంగను నవ్వుతూ పోగొట్టారు. “ఏమిటి? అంతా ఫిరోజ్ షా మెహతాలు అవుతారా? ఫిరోజ్‌షాలు, బదురుద్దీనులు కొద్దిమందే ఉంటారు. లాయరవడానికి గొప్పతెలివితేటలు ఉండాలని భావించకు. ప్రామాణికత్వం, శ్రద్ధ ఉంటే చాలు. తద్వారా అవసరమైనంత డబ్బు సంపాదించవచ్చు. దావాలన్నీ చిక్కులమయంగా ఉండవు అని చెప్పి, సరే, పాఠ్యపుస్తకాలు కాక ఇంకా ఇతర పుస్తకాలు ఏమేమి చదివావో చెప్పు!” అని అడిగారు. నేను చదివిన కొద్ది గ్రంథాల పేర్లు చెప్పాను. ఆయన కొంచెం నిరాశపడ్డారు. ఒక్క క్షణం సేపు అలా ఉండి చిరునవ్వు నవ్వుతూ “నీ క్షోభ నాకు అర్థం అయింది. నీకు ఇతర గ్రంథాల వల్ల కలిగిన జ్ఞానం కొద్దే. నీకు గల ప్రపంచజ్ఞానం కొద్దే. నీవు కనీసం హిందూ దేశచరిత్ర అయినా చదవాలి. మనిషి స్వభావం తెలుసుకోవాలి. మనిషి మొహం చూచి అతడెట్టివాడో తెలుసుకొనగలిగివుండాలి. ప్రతి హిందువు హిందూ దేశ చరిత్ర చదివి తీరాలి. లాయరుకు దానితో సంబంధం లేకపోయినా దాన్ని చదవాలి. విషయం తెలుసుకోవాలి. కే మరియు మాలెసన్‌గారు కలిసి వ్రాసిన 1857 సంవత్సరపు విప్లవ చరిత్ర కూడా నీవు చదవలేదు. వెంటనే ఆ పుస్తకం చదువు. మానవ స్వభావాన్ని గురించి తెలియజెప్పే ముఖ సాముద్రికాన్ని గురించి లావేటరు గారు, షెమ్మెల్ పెన్నిక్ గారు వ్రాసిన గ్రంథాలు సంపాదించు” అని చెప్పి ఆ గ్రంథాల పేర్లు కాగితం మీద వ్రాసి నాకు ఇచ్చారు.

వారికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. ఆయన ఎదుట నా భయం ఎగిరిపోయింది. కాని కాలు బయట పెట్టగానే మళ్ళీ బెంగ మొదలైంది. ముఖం చూచి మనిషి స్వభావం తెలుసుకోవడం ఎట్లా అని దారి పొడుగునా అనుకుంటూ ఆ రెండు పుస్తకాలను గురించి యోచిస్తూ ఇంటికి చేరాను. దుకాణంలో షెమ్మిల్ పెన్నిక్ గారి పుస్తకం దొరకలేదు. మర్నాడు లావేటరు గారి పుస్తకం చదివాను. అదీ స్నెల్‌గారి “ఈక్విటీ” కంటే కష్టంగా ఉంది. షేక్స్పియర్‌గారి ముఖసాముద్రికం చదివాను. కాని లండను వీధుల్లో క్రింది నుండి పైకి, పైనుండి క్రిందికి ఎంత తిరిగినా షేక్స్పియర్‌గారు చెప్పినట్లు ముఖసాముద్రికాన్ని గురించి తెలుసుకునే ప్రావీణ్యం నాకు కలుగలేదు.

లావేటరు గారి పుస్తకం నాకు ఉపయోగపడలేదు. కాని వారి స్నేహం నాకు ఎంతో ఉపయోగపడింది. వారి నవ్వుముఖం, ఉదారాకృతి నా హృదయానికి హత్తుకున్నాయి. మంచి లాయరు అయ్యేందుకు ఫిరోజ్‌షా మెహతా గారి నైపుణ్యం, ధారణాశక్తి అవసరంలేదు. కాని ప్రామాణికత, శ్రద్ధ, కష్టపడి పనిచేసే మనస్తత్వం అవసరమని వారిచ్చిన సలహా మీద నాకు విశ్వాసం ఏర్పడింది. ఆ ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించుకున్నాను. దానితో కొంచెం ఆశ చిగురించింది.

కే మరియు మాలెసన్ గారు కలిసి వ్రాసిన గ్రంధాల్ని చదవలేకపోయాను. సమయం దొరికితే ముందు ముందు వారి గ్రంథాల్ని చదవాలని నిర్ణయించుకున్నాను. ఆ నా కోరిక దక్షిణాఫ్రికాలో తీరింది. నన్ను పట్టుకున్న బెంగలో కొంత ఆశారేఖ గోచరించింది. దానితో అస్సాము అను స్టీమరు ఎక్కి బొంబాయి చేరాను. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. లాంచీలో ఒడ్డుకు చేరాను.

* * *

Public domain
ఈ కృతి భారత ప్రభుత్వ w:భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా, రచయిత/ముద్రాపకుల అనుమతితో ఆర్ధిక లావాదేవీలు లేకుండా స్కాన్ చేసి సర్వర్లపై వుంచడం ద్వారా 2007-2017 మధ్యకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంచబడింది. కొన్ని సమస్యలవల్ల DLI సర్వర్ తాత్కాలికంగా అందుబాటులో లేకున్నా ఈ కృతులు USA కేంద్రంగా పనిచేసే ఆర్కీవ్ లో లభ్యమవుతున్నాయి. హక్కుదారుల ఉద్దేశాన్ని గౌరవిస్తూ, DLI స్కాన్ కంటే మెరుగుగా యూనికోడ్ కు మార్చి ప్రజలకు అందుబాటులో చేయటానికి లాభనిరపేక్షంగా పనిచేసే తెలుగు వికీసోర్స్ సాయపడుతుంది కావున వికీసోర్స్ లో వుంచబడుతున్నది. ఈ కృతిని చదువుకోవటానికి తప్పించి వేరే విధంగా వాడుకొనేవారు సంబంధిత హక్కుదారులను సంప్రదించవలసింది. ఈ విషయమై హక్కుదారులు ఆక్షేపమేమైనా తెలిపితే వికీసోర్స్ నిర్వాహకులు కృతిని తొలగిస్తారు.