సత్యశోధన/రెండవభాగం/4. మొదటి ఎదురుదెబ్బ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4. మొదటి ఎదురుదెబ్బ

బొంబాయి వదిలి రాజకోట చేరాను. ఒక ఆఫీసు పెట్టుకున్నాను. యిక్కడ పని బాగానే సాగింది. అర్జీలు, దరఖాస్తులు వగైరాలు వ్రాసి పెట్టడం వల్ల నెలకు మూడొందల రూపాయలు రాసాగాయి. అయితే యీ పని దొరకటానికి కారణం నా యోగ్యత కాదు. మా అన్నగారు, మరో వకీలు ఉమ్మడిగా పనిచేస్తున్నారు. ఆ వకీలుకు ప్రాక్టీసు ఖాయం అయిపోయింది. అవసరమైనవీ, ముఖ్యమైనవీ అని తాను భావించిన అర్జీలు పెద్ద బారిష్టర్ల దగ్గరికి అతడు పంపేవాడు. బీద క్లైంట్ల అర్జీలు మాత్రం నేను వ్రాసేవాణ్ణి.

“ఎవ్వరికీ సొమ్ము యివ్వను అని బొంబాయిలో నేను పట్టుబట్టానే కాని, రాజకోటలో మాత్రం ఆ విషయమై కొంత మెత్తబడవలసి వచ్చింది. యీ రెండు చోట్ల వ్యవహారం వేరని విన్నాను బొంబాయిలో దళారులకు సొమ్ము చెల్లించాలి. యిక్కడ వకీళ్లకు సొమ్ము చెల్లించాలి. రాజకోటలో ప్రతి వకీలు యిలా చెప్పారు! చూడు! నేను మరో వకీలుతో భాగస్వామిని కదా! నీవు చేయగల పనులు నీకు వచ్చేలా నేను చూడగలను. అట్టి మనిద్దరం అవిభక్తులం. కనుక నీకు వచ్చిన ఫీజంతా మన ఉమ్మడి సొమ్ము! అంటే అందులో నాకు భాగం వున్నట్లే! మరి నా భాగస్వామి అయిన వకీలు విషయం యోచించు. యీ కేసులు మరో వకీలుకిస్తే అతడికి రావలసిన సొమ్ము రాదా?

మా అన్నగారి మాటలకు నేను లొంగిపోయాను. బారిష్టరు వృత్తిలో వుంటూ యిట్టి పట్టుపట్టరాదని భావించాను. నాకు నేను సరిపుచ్చుకున్నానే గాని యిది ఆత్మవంచనే. అయితే ఏ కేసుల్లోను ఎవ్వరికీ రుసుం యివ్వలేదనే గుర్తు.

ఈ విధంగా జీవితం సాఫీగా వెళ్లబారుతూ వుండగా నా జీవితానికి మొదటి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెల్ల అధికారుల ప్రవర్తనను గురించి విన్నానే గాని అట్టి అనుభవం నాకు అప్పటివరకు కలుగలేదు.

చనిపోయిన పోరుబందరు రాణాగారు గద్దె ఎక్కే పూర్వం నాటి మాట. ఆయనకు మా అన్నగారు మంత్రిగాను, సలహాదారుగాను వుండేవారు. ఉద్యోగంలో వుంటూ రాణాగారికి కుట్ర సలహా యిచ్చాడని మా అన్నగారి మీద నేరం మోపబడింది. అది పొలిటికల్ ఏజంటుదాకా వెళ్లింది. ఆయన మా అన్నగారి మీద కక్ష కట్టాడు. నేను ఇంగ్లాండులో వున్నప్పుడు అతనికి నాకు పరిచయం వుండేది. స్నేహం కూడా వుండేది. ఆ స్నేహాన్ని ఉపయోగించి అతనికి తనపై గల కక్షను పోగొట్టేలా చేయమని మా అన్నగారు నన్ను కోరారు. నాకు యిట్టి వ్యవహారం నచ్చదు. ఎక్కడో ఇంగ్లాండులో యాదృచ్ఛికంగా ఏర్పడిన పరిచయాన్ని, స్నేహాన్ని యీవిధంగా ఉపయోగించడం నాకు యిష్టం లేదు. నిజంగా మా అన్న దోషం చేసియుంటే యీ నా ప్రయత్నం వల్ల ఫలితం ఏముంటుంది? దోషం చేయకపోతే నిర్భయంగా రాచబాటన అర్జీ పంపి విజయం సాధించవచ్చు కదా! మా అన్నగారు యిందుకు అంగీకరించలేదు. “నీకు కఠియావాడు తెలియదు. నీకు ప్రపంచ జ్ఞానం తక్కువ. యిక్కడ పలుకుబడికే ప్రాధాన్యం. నేను నీకు సోదరుణ్ణి. ఆ తెల్లదొర నీకు స్నేహితుడు. అతడికి నచ్చచెప్పి నాపై గల అతని కక్షను తొలగింపచేయడం నీ ధర్మం” అంటూ ఆయన వత్తిడి చేశారు.

ఇక నేను కాదనలేక ఆ దొరను కలవడానికి నిర్ణయించుకున్నాను. అతని దగ్గరకు వెళ్లి, యీ విషయం చెప్పడం నాకు తగినపని కాదని తోచింది. అయినా తప్పలేదు. ఆయన దగ్గరకు జాబు పంపి కలుసుకునేందుకు సమయం కోరాను. ఆయన యిచ్చిన సమయానికి వెళ్లి ఆయనను కలిసి గతంలో యిరువురి స్నేహాన్ని గురించి జ్ఞాపకం చేశాను, కాని కఠియావాడుకు, ఇంగ్లాండుకు ఎంతో భేదం కనబడింది. సెలవులో వున్న ఉద్యోగి వేరు. పనిలో వున్న ఉద్యోగి వేరు, ఆ పొలిటికల్ ఏజంటు మా స్నేహాన్ని అంగీకరించాడు. కాని మా అన్నగారి విషయం ఎత్తేసరికి ఆతడు కరుకు బారాడు. అదా విషయం! ఆ స్నేహాన్ని పురస్కరించుకొని అనుచిత లాభం పొందాలని చూస్తున్నావా? అన్న భావం ఆయన కండ్లలో నాకు గోచరించింది. అయినా నా పాట నేను మొదలు పెట్టాను. దానితో ఆ దొర చిరాకుపడి “మీ అన్న చాలా కుట్రదారు. నేనేమీ వినను. నాకు అవకాశం తక్కువ. ఏమైనా చెప్పుకోవాలనుకుంటే మీ అన్ననే వచ్చి చెప్పుకోమను అని అన్నాడు. నిజానికి ఆ సమాధానం నాకు చాలు. నేను చెప్పిన దానికి సరియైన సమాధానం యిచ్చినట్లే గదా! కాని నా అవసరం నాది. నేను మానకుండా యింకా చెబుతూనే వున్నాను. ఆయన లేచి “ఇక వెళ్లు” అని అన్నాడు.

నా మాటలు పూర్తిగా వినమని పట్టుబట్టాను. దానితో అతనికి కోపం వచ్చింది. నౌకరును పిలిచి “వీనికి త్రోవ చూపించు” అని ఆదేశించాడు. నేను గొణుగుతూ వున్నాను. నౌకరు నా రెండు భుజాలు పట్టుకొని బైటకి పంపివేశాడు. రొప్పుతూ రొప్పుతూ లోనికి వెళ్లి ఒక జాబు వ్రాశాను. “మీరు నన్ను అవమానించారు. నౌకరు ద్వారా నన్ను బయటకి నెట్టించారు. యిందుకు సముజాయిషీ చెప్పుకోకపోతే మీమీద కోర్టులో మాననష్టం దావా వేస్తాను” అని ఆ జాబులో వ్రాశాను. ఆ దొర వెంటనే ఒక గుర్రపు రౌతు ద్వారా పత్రం పంపించాడు. “మీరు నా దగ్గర అసభ్యంగా వ్యవహరించారు. నేను వెళ్లమని చెప్పినా మీరు వెళ్లలేదు. గత్యంతరం లేక మిమ్మల్ని నౌకరు ద్వారా బయటికి పంపక తప్పలేదు. నౌకరు పొమ్మన్నా మీరు పోలేదు. అందువల్ల మిమ్ము బైటకి పంపించుటకు బలం ఉపయోగించక తప్పలేదు. మీరేం చేసుకున్నా సరే” అని ఆ పత్రంలో వ్రాశాడు.

ఆ పత్రం జేబులో పెట్టుకొని తలవంచుకొని యింటికి చేరాను. జరిగిందంతా మా అన్నగారికి తెలియజేశాను. ఆయన చాలా బాధపడ్డాడు. నన్ను ఎలా శాంతపరచాలో ఆయనకు బోధపడలేదు. ఆ దొర మీద కేసు పెట్టాలని నా భావం. ఆ విషయమై మా అన్న కొందరు వకీళ్ల సలహా తీసుకున్నారు. సరీగా ఆ సమయానికి సర్ ఫిరోజ్ వచ్చారు. వారిని క్రొత్త బారిష్టరు కలవడం సాధ్యం కాదు గదా! అందువల్ల వారిని తీసుకొని వచ్చిన వకీలుకు యీ వివరమంతా వ్రాసిన పత్రం యిచ్చి మెహతా గారి సలహా అర్థించాను. వకీలు నా పత్రం మెహతా గారికి అందజేశారు.

“ఇప్పుడు చాలామంది బారిష్టర్లకు, వకీళ్లకు యిట్టి అనుభవాలే కలుగుతున్నాయి. అతడు ఆంగ్ల దేశం నుండి యిప్పుడే వచ్చాడు కదా! అందువల్ల ఉడుకుపాలు ఎక్కువగా వుంది. ఆంగ్ల దొరల స్వభావం యింకా అతనికి తెలియదు. ధనం బాగా సంపాదించ కోరితే, జీవితం సుఖంగా గడపాలని భావిస్తే యిటువంటి అవమానాల్ని దిగమ్రింగవలసిందే. యీ తెల్లదొరతో కలహం పెట్టుకుంటే నష్టమేగాని లాభం కలుగదు. గాంధీజీకి యింకా లోకజ్ఞానం అవసరం.” అని ఫిరోజ్‌గారు ఆ వకీలు ద్వారా నాకు సలహా పంపారు.

వారి సలహా నాకు విషప్రాయంగా తోచింది. కాని మ్రింగక తప్పలేదు. అందువల్ల కొంత ప్రయోజనం కూడా కలిగింది. ఇక భవిష్యత్తులో యిలాంటి పనులు చేయకూడదని, స్నేహాన్ని యీ విధంగా వినియోగించుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను. అప్పటి నుండి ఆ నిర్ణయాన్ని అతిక్రమించలేదు. తత్ఫలితంగా నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది.