Jump to content

సత్యశోధన/రెండవభాగం/2. జీవన యాత్ర

వికీసోర్స్ నుండి

2. జీవనయాత్ర

మా అన్నగారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయనకు ధనం, కీర్తి, పదవి, మూడూ కావాలి. ఆయన దోషాల్ని క్షమించగల విశాల హృదయుడు. దానికి తోడు నిరాడంబరమైన ప్రవర్తన కలవాడు. అందువల్ల ఆయనకు మిత్రులు ఎక్కువగా వుండేవారు. తన యీ మిత్రుల సహాయంతో నాకు కేసులు తెప్పించాలని ఆయన భావించాడు. నా ప్లీడరు వృత్తి బాగా సాగుతుందని భావించి ఇంటి ఖర్చులు బాగా పెంచివేశాడు. నా ప్రాక్టీసు కోసం ఆయన ఎంతో కృషి చేశాడు.

నా సముద్రయానపు తుఫాను యింకా వీస్తూనే వుంది. మా కులంలో రెండు పక్షాలు బయలుదేరాయి. ఒక పక్షంవారు నన్ను వెంటనే కులంలో కలుపుకున్నారు. రెండో పక్షం వారు యింకా కుల బహిష్కారం మీద పట్టిన పట్టు విడువలేదు. మమ్మల్ని కులంలో కలుపుకున్న వారిని సంతోష పెట్టడం కోసం మా అన్న నన్ను నాసికకు తీసుకుపోయి అక్కడ నదీస్నానం చేయించాడు. రాజకోట చేరగానే మా కులం వారికి భోజనాలు ఏర్పాటు చేశాడు. అందుకు నా మనస్సు అంగీకరించలేదు. కాని మా అన్నగారికి నామీదగల ప్రేమ అపారం. వారి యెడ నాకు భక్తి అపారం. అందువల్ల ఆయన చెప్పింది మంత్రంగా భావించి ఏం చేయమంటే అది చేశాను. యీ విధంగా జరిగిన తరువాత వెలిని గురించి యిక ఎవ్వరూ మాట్లాడలేదు. వారిమీద ఈర్ష్య ద్వేషం పెంచుకోలేదు. వారిలో కొందరు నన్ను ఏవగించుకునేవారు. కాని నేను వారి జోలికి పోకుండా జాగ్రత్తగా వుండేవాణ్ణి. వెలికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లను నేను పాటించేవాణ్ణి. మా అత్తమామలుగాని, అక్కబావలుకాని నన్ను భోజనానికి పిలిస్తే వాళ్లను వెలివేయవచ్చు. అందువల్ల నేను వాళ్ళ యిళ్ళలో మంచి నీళ్ళు కూడా పుచ్చుకొనేవాణ్ణి కాదు. మావాళ్లు చాటుమాటుగా మాతో కలుద్దామని చూచేవారు కాని నేను అంగీకరించేవాణ్ణి కాను. ఏది చేసినా బహిరంగంగా చేయాలిగాని చాటుమాటుగా చేయకూడదని నా అభిప్రాయం.

నేను జాగ్రత్తగా వున్నందువల్ల కులం వాళ్లు నా జోలికి రాలేదు. నన్ను వెలివేసిన వారిలో చాలామందికి నేనంటే అమిత ప్రేమ. మా కులానికి ఏదో చేస్తానని భావించకుండానే వారు నా ప్రయత్నానికి ఎంతగానో సహకరించారు. నా పనుల వల్ల యిట్టి సత్ఫలితం కలిగిందని నా విశ్వాసం. వెలివేసిన వారికి వ్యతిరేకంగా నేను వ్యహరించినా, స్వపక్షీయుల్ని కలుపుకొని రగడ ప్రారంభించినా వ్యవహారం ముదిరేదే. ఆంగ్ల దేశాన్నుంచి రాగానే యీ గొడవల్లో పడివుంటే నేను ఏదో కపటవేషం వేయక తప్పేదికాదు.

మా దాంపత్యం యింకా నేననుకున్నట్లు కుదుటపడలేదు. నేను ఆంగ్లదేశం వెళ్లిన తరువాత కూడా నా ద్వేష దుష్ట స్వభావం నన్ను విడిచి పెట్టలేదు. అడుగడుగునా తప్పులెన్నో జరిగాయి. నా స్వభావం యధాప్రకారంగానే వున్నది. అందువల్ల నా కోరిక నేరవేరలేదు. నా భార్యకు చదువు గరపాలి. కాని నా కామోద్రేకం అందుకు అడ్డుగా వున్నది. లోపం నాది. కాని కష్టం అనుభవించింది ఆమె. ఒకసారి ఆమెను పుట్టింటికి పంపివేయడానికి కూడా సిద్ధపడ్డాను. అనేక కష్టాలపాలు చేసిన తరువాతనే ఆమెను దగ్గరకు రానిచ్చాను. కొంత కాలానికి తప్పంతా నాదేనని గ్రహించాను.

మా బాలుర విద్యాభ్యాసాన్ని సంస్కరించాలని పూనుకున్నాను. మా అన్నగారికి పిల్లలు వున్నారు. ఆంగ్లదేశం వెళ్లక పూర్వం నాకు పిల్లవాడు పుట్టాడు. వాడికి యిప్పుడు నాలుగేండ్లు. వీళ్ల చేత కసరత్తు చేయిoచి వీళ్లను వజ్రకాయుల్ని చేయాలని, ఎప్పుడూ నా కనుసన్నల్లో వాళ్లను వుంచుకొని పెంచాలని భావించాను. మా అన్నగారు అందుకు అంగీకరించారు. అందువల్ల యీ విషయంలో నాకు సాఫల్యం లభించింది. పిల్లలతో కలసి వుండటం నాకు యిష్టం. పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో నవ్వులాడటం అంటే నాకు యిప్పటికీ యిష్టమే. నేను పిల్లలకు మంచి ఉపాధ్యాయుణ్ణి కాగలిగానని నా విశ్వాసం.

అన్నపానీయాల విషయంలో సంస్కరణ అవసరమని భావించాను. మా యింట్లో కాఫీ, టీలు ప్రవేశించాయి. నేను ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చేసరికి మా ఇంటికి ఆంగ్ల దొరల గృహ పోలికలు ఏర్పడేలా చూడాలని మా అన్నగారు భావించారు. అందుకోసం ఇంట్లో పింగాణీ సామాను పెరిగిపోయింది. కాఫీ, టీలకు బదులు కోకో, వరిగ పిండి జావల్ని ప్రవేశ పెట్టాను. పేరుకు మాత్రమే యీ మార్పుగాని, యివి కూడా కాఫీ టీలకు తోడయ్యాయి. మేజోళ్లు ముందే ప్రవేశంచాయి. యిక నేను కోటు, ఫాంటు ధరించి మా ఇంటిని పావనం చేశాను.

దానితో ఇంటి ఖర్చు పెరిగిపోయింది. ప్రతిరోజూ ఏవేవో క్రొత్త వస్తువులు రాసాగాయి. తెల్ల ఏనుగు చందాన మా పరిస్థితి మారింది. కాని ఆ తెల్ల ఏనుగుకు మేత కావాలి కదా? అది ఏదీ? రాజకోటలో వృత్తి ప్రారంభించడం నాకు యిష్టం లేదు. వకీలుకు వుండవలసిన జ్ఞానం నాకు లేదని తెలుసు. ఫీజు మాత్రం పెద్ద వకీళ్లంతగా లాగాలని ఉబలాటం. వ్యాజ్యానికి నన్ను కుదుర్చుకునే మూర్ఖుడెవడు? ఒకవేళ ఎవడైనా వున్నా నా తెలివి తక్కువకు తోడు నా అహంకారాన్ని కూడా కలిపి మొత్తం భారం నెత్తిన వేసుకోవాలిగదా !

బొంబాయి వెళ్లి అక్కడ హైకోర్టులో కొంత అనుభవం గడిస్తూ, హిందూలా చదువుతూ, వ్యాజ్యాలతో, కొంతకాలం గడపడం మంచిదని మిత్రులు సలహా యిచ్చారు. ఆ ప్రకారం నేను బొంబాయి వెళ్లాను.

ఇల్లు తీసుకున్నాను. వంటవాణ్ణి పెట్టుకున్నాను. నాకు అతడు తగినవాడే. బ్రాహ్మణుడు. అతణ్ణి నేను నౌకరుగా భావించలేదు. కుటుంబంలో ఒకడిగా భావించాను. అతడు లింగం మీద నీళ్లు పోసినట్లు ఒంటిమీద నీళ్లు పోసుకునేవాడు. ఒళ్లు తోముకోడు. మడిపంచ మురికిగా వుండేది. జందెం మడ్డిగా వుండేది. శాస్త్రజ్ఞానం శూన్యం. నాకు యింతకంటే మంచి వంటవాడు ఎట్లా దొరుకుతాడు?

“ఏమండీ రవిశంకర్‌గారూ! మీకు వంట చేతకాకపోతే మానె. రెండు సంధ్యావందనం ముక్కలైనా రాకపోతే ఎలాగండీ!”

“అయ్యా! సంధ్యావందనమా! నాకు నాగలే సంధ్య. ఫాఆరే నిత్య కర్మ, ఏదో మాదిరి బ్రాహ్మణ్ణి. మీ అనుగ్రహం వల్ల బ్రతుకుతున్నాను. మీరు కాదంటే నాచేతి ముల్లుకర్ర మళ్లీ పుచ్చుకుంటాను.”

నేను రవిశంకర్‌కు గురుత్వం వహించాను. నాకు అంతా తీరికేగదా! సగం వంట నేనే చేసేవాణ్ణి. శాకాహారం తయారుచేయడంలో దొరల పద్ధతిని ప్రవేశ పెట్టాను. ఒక స్టౌ కొన్నాను. ఎవరితోనైనా సరే సహపంక్తి భోజనానికి నేను సిద్ధమే. రవిశంకర్‌కూ యిబ్బంది లేదు. మా యిద్దరికీ జోడు కుదిరింది. అయితే ఒక చిక్కు వచ్చిపడింది. మడ్డి గుడ్డలు విడవననీ, అన్నం పరిశుభ్రంగా వుంచననీ రవిశంకరుని ప్రతిజ్ఞ. దాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకొంటూ వున్నాడు, బొంబాయిలో నాలుగైదు మాసాల కంటే ఎక్కువకాలం వుండటానికి వీలుపడలేదు. అక్కడ ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ.

ఈ విధంగా సంసార సాగరంలో ఈత ప్రారంభించి వకీలు వృత్తి మంచిది కాదనే నిర్ణయానికి వచ్చాను. యిది కేవలం చూపుడు గుర్రమే. పైన పటారం, లోన లొటారం. ఇక నా కర్తవ్యం ఏమిటా అని ఆలోచనలో పడ్డాను.