Jump to content

సత్యశోధన/రెండవభాగం/24. తిరుగుప్రయాణం

వికీసోర్స్ నుండి

24. తిరుగు ప్రయాణం

నేను దక్షిణ ఆఫ్రికాకు వచ్చి మూడేండ్లు గడిచిపోయాయి. నాకు అక్కడి ప్రజల సంగతులు బాగా తెలిశాయి. 1896వ సంవత్సరంలో ఆరు నెలల సెలవు కావాలని కోరాను. అక్కడ చాలా కాలం నేను ఉండవలసియున్నది. నాకు అక్కడ మంచి ప్రాక్టీసు కూడా వున్నది. అక్కడి వాళ్లకు నాతో చాలా పని పడింది. అందువల్ల నేను ఒక పర్యాయం యింటికి వెళ్లి భార్యాపిల్లల్ని చూడాలి. దక్షిణ - ఆఫ్రికా భారతీయుల స్థితిగతులను గురించి బాగా ప్రచారం చెయ్యాలి. అందువల్ల భారతీయుల అభిమానం సంపాదించడానికి వీలు చిక్కుతుంది. మూడు పౌన్ల పన్ను వ్యవహారం పెద్ద వ్రణం వంటిది. అది మానేదాకా శాంతించుటకు వీలులేదు. అయితే యిక్కడ నేను లేని సమయంలో కాంగ్రెస్ వ్యవహారాలు, విద్యాసంఘం పని ఎవరు చూస్తారు? నా దృష్టిలో ఇద్దరు వ్యక్తులు వున్నారు ఒకరు ఆదంజీ మియాఖాన్, రెండవవారు పార్సీ రుస్తుంజీ. అప్పటికి వర్తకుల్లో చాలామంది కార్యకర్తలు బయలుదేరారు. కాని కార్యదర్శి భారం నియము పూర్వకంగా నిర్వహించువారు, దక్షిణ - ఆఫ్రికా భారతీయుల అభిమానానికి పాత్రులైనవారు వీరిద్దరే. కార్యదర్శికి ఆంగ్ల భాషాజ్ఞానం అవసరం. నేను ఆదంజీ మియాఖాన్ గారి పేరు కాంగ్రెస్ వారికి సూచించాను. వారు అతణ్ణి కార్యదర్శిగా అంగీకరించారు. అతణ్ణి కార్యదర్శిగా ఎన్నుకోవటం అత్యుత్తమమైన విషయమని అనుభవం వల్ల తేలింది. ఆదంజీమియాఖాన్ గారి ఉద్యోగదక్షత, వారి ఉదార హృదయం, వారి మంచితనం, వారి వివేకం కార్యదర్శి పదవికి వారిని అర్హునిగా చేశాయి. ఆ పదవికి ఏ బారిష్టరో లేక ఇంగ్లీషు వచ్చిన ఏ గొప్పవాడో అవసరమన్న భావాన్ని కూడా వారి నియామకం తొలగించి వేసింది. 1896 వ సంవత్సరంలో నేను కలకత్తాకు బయలుదేరిన పోన్‌గోలా స్టీమరెక్కి ఇండియాకు బయలుదేరాను.

ఆ స్టీమరులో ఎక్కువమంది ప్రయాణీకులు లేరు. వారిలో ఇద్దరు ఇంగ్లీషు యాత్రికులు వున్నారు. వారితో నాకు మైత్రి ఏర్పడింది. ఒకనితో రోజూ నేను ఒక గంట సేపు చదరంగం ఆడుతూ వున్నాను. ఆ స్టీమరులోని డాక్టరు తమిళ భాషా శిక్షణ అను పుస్తకం యిచ్పాడు. దానిని చదవడం ప్రారంభించాను.

నేటాలులో వుండగా మహమ్మదీయులతో పరిచయం ఏర్పరచుకొని ఉర్దూ భాష, మదరాసు వారితో పరిచయం చేసుకొని తమిళ భాష నేర్చుకోవాలని భావించాను. ఉర్దూ నేర్చుకోవాలని భావించి డెక్కుమీద నున్న యాత్రికుల్లో ఉర్దూ మున్షీ ఎవరైనా వున్నారేమోనని విచారించాను. ఒక మున్షీ దొరకగా ఆయన వద్ద మా ఉర్దూ చదువు బాగానే సాగింది. నాతోబాటు ఒక ఆంగ్ల ఉద్యోగి కూడా ఉర్దూ నేర్చుకోవడం ప్రారంభించాడు. అతడి జ్ఞాపకశక్తి గొప్పది. ఉర్దూ అక్షరాలు గుర్తించటం నాకు కష్టమైంది. కాని అతడు ఒక్క సారి అక్షరం చూచాడో యిక దాన్ని మరచిపోడు. నేను చాలా కష్టపడ్డాను, కాని అతణ్ణి మించలేకపోయాను.

అరవం నాకు బాగానే వచ్చింది. గురువులేడు. అయినను గురువు అవసరం లేనంతగా ఆ తమిళ భాషా శిక్షణ వ్రాయబడింది. ఇండియాకు వచ్చిన తరువాత తమిళం బాగా నేర్చుకోవాలని భావించాను. కాని సాధ్యం కాలేదు.

1893వ సంవత్సరం దాటిన తరువాత నేను పనులన్నీ జైళ్లలోనే చేశాను. అరవం దక్షిణ ఆఫ్రికా జైల్లో నేర్చుకున్నాను. ఉర్దూ యరవాడ జైల్లో నేర్చుకున్నాను. అరవం మాత్రం మాట్లాడే అభ్యాసం నాకు కలుగలేదు. చదవడం వచ్చినా వాడకం లేనందున అది తుప్పు పట్టినట్లు అయింది. ఇందుకు కడు విచారంగా వుంది. దక్షిణ ఆఫ్రికాయందలి మద్రాసు సోదరులకు నేనంటే ప్రాణం. నాకు వారెల్లప్పుడూ గుర్తుకు వస్తూ వుంటారు. ఎక్కడైనా తమిళుడుగాని, తెలుగువాడు కాని కనిపించితే వారిశ్రద్ధ, వారి స్వార్ధ త్యాగం గుర్తుకు రాకుండా వుండవు. వారంతా నిరక్షరులు. అక్షరం రానివారే అక్కడి పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాటం బీదల కోసం సాగింది. పోరాటం జరిపినవారు పూర్తిగా బీదవారే.

అమాయకులు, యోగ్యులగు భారతీయుల హృదయాన్ని చూరగొనడానికి నాడు వారి భాష రాకపోవడం అడ్డంకి కాలేదు. వారికి హిందుస్తానీ ఇంగ్లీషు కొద్దికొద్దిగా వచ్చు. అందువల్ల మా పనికి అడ్డంకి కలుగలేదు. వారి ప్రేమకు బదులుగా అరవం నేర్చుకోవాలని భావించాను. నాకు అరవం కొంత కొంత అర్ధం అవుతుంది. ఇండియాలో తెలుగు నేర్చుకుందామని ప్రయత్నించాను. కాని తెలుగులో అక్షరాలు దాటి చదువు ముందుకు సాగలేదు.

ఈ విధంగా అరవం, ఆంధ్రం చక్కగావచ్చే భాగ్యం నాకు కలుగలేదు. బహుశా యిక నేర్చుకోలేనుకూడా. కనుక ద్రావిడులు హిందుస్తానీ, నేర్చుకోగలరని ఆశ పెట్టుకున్నాను. దక్షిణ ఆఫ్రికాలోని మద్రాసు ద్రావిడులు కొద్దిగానో, గొప్పగానో హిందీ మాట్లాడతారు. అయితే దేశభాషాపఠనం వల్ల తమ ఆంగ్ల భాషా జ్ఞానానికి ఇబ్బంది కలుగుతుందేమోనని ఇంగ్లీషు వచ్చినవాళ్లు మాత్రమే భావిస్తున్నారు. దేశ భాషల్ని వారే ఆదరించడం లేదు. శాఖాచంక్రమణం చేశాను. సింహావలోకనం చేసి నాప్రయాణ కథను ముగిస్తాను. పొంగోలా స్టీమరు కెప్టెనును గురించి చెప్పడం మిగిలివుంది. మేము మిత్రులం అయ్యాము. అతడు ప్లీమత్ సోదర సంప్రదాయం వాడు. సముద్రయానాన్ని గురించిన ప్రసంగం కంటే ఆధ్యాత్మిక ప్రసంగమే మా మధ్య జరుగుతూ వుండేది. అతడు నీతికి, జ్ఞానానికి (ధర్మానికీ) భేదం కల్పించేవాడు. అతని దృష్టిలో బైబిలు బోధ శిశుక్రీడ వంటిది. భాషా సౌలభ్యాన్ని బట్టి దాని గొప్పతనం అపారం. బాలురుగాని, స్త్రీలుగాని, పురుషులు గాని జీససునందును, అతని బలిదానము నందును విశ్వాసం వుంచితే వారి పాపాలు నశించిపోతాయి. యిది ఆయన మాటల సారం. అతని పరిచయం ప్రెటోరియాలోని ప్లీమత్ సోదరుణ్ణి గుర్తుకుతెచ్చింది. నీతి యెడ విధి నిషేధాలు గల ఏమతమైనా అతని దృష్టిలో పనికిమాలినదే. ఇంత చర్చకు కారణం శాకాహారమే. మాంసం, ముఖ్యంగా గోమాంసం నేనెందుకు తినకూడదు? భగవంతుడు శాకాల వలెనే పశు పక్షుల్ని కూడా మనుష్యుని ఆనందం కోసం, ఆహారం కోసం సృజించలేదా? ఇట్టి ప్రశ్నల వల్ల మేము ఆధ్యాత్మిక ప్రసంగంలోకి దిగక తప్పలేదు.

ఈ విధంగా 24 రోజులు నా ఆనందయాత్ర సాగింది. హుగ్లీనది సౌందర్యం చూచుటకు కలకత్తా రేవులో ఓడదిగాను. ఆనాడే రైల్లో బొంబాయి బయలుదేరాను.