సత్యశోధన/రెండవభాగం/25. హిందూదేశంలో

వికీసోర్స్ నుండి

25. హిందూదేశంలో

కలకత్తా నుండి బొంబాయికి వెళ్లేదారిలో మధ్య ప్రయాగ ఉంది. అక్కడ రైలు 45 నిమిషాలు ఆగుతుంది. ఆ సమయంలో పట్నం చూడాలని కోరిక కలిగింది. అదీగాక ఒక మందు కావలసి వచ్చింది. మందులు అమ్మే కెమిస్టు అర్ధ నిద్రావస్థలో వున్నాడు. మందివ్వడానికి బాగా ఆలస్యం చేశాడు. నేను స్టేషను చేరేసరికి రైలు బయలుదేరింది. ఆ స్టేషను మాష్టరు మంచివాడు. నాకోసం ఒక్క నిమిషం సేపు రైలును ఆపివుంచాడు. అయితే నేను రాకపోవడం చూచి నా సామాను క్రిందికి దింపించివేశాడు.

కెల్‌సర్ హోటల్లో ఒక గది తీసుకొని ఆ పట్నంలో వెంటనే నా పని ప్రారంభించాను. ప్రయాగయందలి “పయోనీర్” అను పత్రిక యొక్క ఖ్యాతిని గురించి వినియున్నాను. భారతీయుల కోరికలకు వ్యతిరేకంగా ఆ పత్రిక వ్రాస్తూ వుంటుందని విన్నాను. అప్పుడు డాక్టరు చేజనీగారు ఆ పత్రికకు ఉపసంపాదకులని గుర్తు. అన్ని పక్షాల వారి సాయం నాకు అవసరమని భావించి ఆయనకు ఒక చీటీ పంపించాను. రైలు బండి యివాళ తప్పిపోయిందనీ, రేపు వెళ్లడం అవసరమనీ, అందువల్ల యీ రోజు అవకాశం యిస్తే తప్పక మీ దర్శనం చేసుకుంటానని ఆ చీటీలో వ్రాశాను. మంచిది రండి అని వెంటనే సమాధానం వచ్చింది. నాకు సంతోషం కలిగింది. ఆ ఆంగ్లేయుడు నా మాటలన్నీ విన్నాడు. “మీరు వ్రాసినదంతా చదివి నేను నా పత్రికలో టిప్పణి వ్రాస్తాను. అయితే మీ విధానాన్నంతటినీ నేనంగీకరించలేను. ఎందువల్లననగా నేటాలులోని భారతీయుల కోరికలను గురించి, అక్కడి తెల్లవారి అభిప్రాయాలను కూడా నేను పూర్తిగా తెలుసుకోవాలిగదా!” అని అన్నాడు.

‘మీరు విషయాలన్నింటిని సంపూర్తిగా చదివి మీ పత్రికలో చర్చిస్తే చాలు. న్యాయం తప్ప నాకు మరొకటి అవసరం లేదు’ అని నేను అన్నాను. మిగిలిన సమయం త్రివేణీ సంగమ సౌందర్యం గురించి యోచించుటకు గడిచిపోయింది. పయోనీరు అధికారితో నా యీ ఆకస్మిక కలయికయే నేటాలు రాష్ట్రంలో నేను పడిన యాతనలకు బీజారోపణం చేసిందని తరువాత తెలిసింది.

అక్కడినుండి బొంబాయిలో దిగకుండా తిన్నగా రాజకోటకు వెళ్లాను. దక్షిణ - ఆఫ్రికాయందు నివసిస్తున్న భారతీయుల్ని గురించి ఒక చిన్న పుస్తకం వ్రాయాలని నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకం వ్రాయడానికి, ప్రచురించడానికి ఒక మాసం పట్టింది. దాని పైన పచ్చరంగు అట్ట వుండటం వల్ల దానికి పచ్చ పుస్తకం అని పేరు వచ్చింది. అందు దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులన్నీ వర్ణించాను. కావాలని చాలా విషయాలు తగ్గించి వ్రాశాను. గతంలో వ్రాసి ప్రకటించిన రెండు కరపత్రాల కంటే యిందు సరళభాషను ఉపయోగించాను.

పదివేల ప్రతులు ప్రకటించాను. హిందూదేశంలోని అన్ని పత్రికలకు, అన్ని పక్షాల నాయకులకు పంపించాను. అందరికంటే ముందు పయోనీరు పత్రికాధిపతి తన సంపాదకీయ వ్యాసంలో దీన్ని గురించి చర్చించాడు. ఆ వ్యాస సారాంశం రూటరు ద్వారా ఇంగ్లాండు చేరింది. అక్కడ నుండి ఆ సారాంశానికి సారాంశం నేటాలు కూడా చేరింది. అందు మూడు పంక్తుల కంటే ఎక్కువలేదు. నేటాలులోని భారత ప్రజలు పడుతున్న భాధలను గురించి నేను వ్రాసిన వ్యాసానికి అది కొద్ది సంస్కరణ అన్నమాట. అందలి శబ్దాలు నావికావు. ఈ వార్త నేటాల్లో ఎంతపని చేసిందో తరువాత మీకు బోధ పడుతుంది. పేరున్న పత్రికలన్నింటిలో నా వ్యాసాన్ని గురించి టీకలు, టిప్పణీలు ప్రకటితమయ్యాయి. ఈ పుస్తకాలన్నింటికి కాగితాలు చుట్టి పోస్టులో పంపడం శ్రమతో కూడిన పని. ధనవ్యయం కూడా అధికం. అందుకు ఒక ఉపాయం కనిపెట్టాను. చుట్టుప్రక్కల గల పిల్లల్ని పిలిచాను. బడిలేని ప్రొద్దుటి పూట నాకు సాయం చేయమని వారిని కోరాను. వారు అంగీకరించారు. వారి శ్రమకు బదులుగా ముద్ర కొట్టిన తపాళా బిళ్లలు, ఆశీర్వాదాలు అందజేస్తానని చెప్పాను. పిల్లలు ఆడుతూ పాడుతూ ఆ పని పూర్తిచేశారు. చిన్న చిన్న పిల్లల్ని స్వయం సేవకులుగా తయారుచేయడం నా జీవితంలో యిదే ప్రథమం. ఆనాటి బాలమిత్రులలో ఇద్దరు నాతోబాటు యిప్పటికీ పనిచేస్తున్నారు.

ఆ రోజుల్లో బొంబాయిలో విపరీతంగా ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఎటు చూచినా గగ్గోలే. రాజకోటలో కూడా యిది ప్రవేశించిందని భయం పట్టుకున్నది. ఆరోగ్య విషయంలో మంచి నిపుణుణ్ణి అని నా భావం. నేను స్వచ్ఛంద సేవ చేస్తానని తెలియజేశాను. ప్రభుత్వం వారు వెంటనే అంగీకరించి నన్ను రోగపరీక్షా సంఘంలో ఒక సభ్యునిగా నియమించారు. పాకీ దొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని నేను గట్టిగా చెప్పాను. బీదవాళ్ళు తమ పాకీ దొడ్లు పరీక్షించుటకు వ్యతిరేకంగా లేరు. మేము సూచించిన సంస్కరణలన్నింటినీ జనం అమలులోకి తెచ్చారు. యిక ధనవంతుల విషయం. మేము వారి దొడ్లు పరీక్షిస్తామంటే వాళ్లు అంగీకరించలేదు. యిక సంస్కరణలు ఎలా జరుగుతాయి? ధనికుల పాకీదొడ్లు పాడుగా వున్నాయని అనుభవంవల్ల తెలిసింది. అంతా చీకటిమయం. తేమ ఊరుతూ వుంటుంది. దుర్గంధం విపరీతం. కూర్చునే చోట లుకలుకలాడుతూ పురుగులు. జీవితంలో యిదే నరకం అని అనిపించింది. అమిత బాధ కలిగింది. మేము చెప్పిన సంస్కరణలు బహుసులభం. మలం నేల మీద పడకుండా బొక్కెనలు వుంచమని చెప్పాం. నేల మీద పడి తేమ పుట్టించకుండా మూత్రం మరో బొక్కెనలో నింపమని చెప్పాం. పాకీ దొడ్లకు బయటి గోడలకు మధ్యగల కట్టడాలను కూల్పించివేశాము. గాలి, వెలుగు పాకీ దొడ్లలోకి బాగా వచ్చేలా చేసి శుభ్రం చేసేందుకు పాకీ వారికి సౌలభ్యం కలిగించాం. అయితే చాలామంది ధనికులు చివరి సలహాను అంగీకరించలేదు. కొంతమంది ధనికులు అసలు సంస్కరణలు అమలు చేయుటకు సిద్ధ పడలేదు.

ఈ సంఘం మాల పల్లెలకు కూడా వెళ్లి వాళ్ల దొడ్లను చూడాలని నిర్ణయించింది. ఎవ్వరూ మావెంట రావటానికి సిద్ధం కాలేదు. ఒక్కడు మాత్రం నాతోబాటు రావడానికి అంగీకరించాడు. మాలపల్లెకు వెళ్లడం, అక్కడి పాకీదొడ్లు చూడటం అంటే అందరికీ ఒక విధమైన ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయం ఎవ్వరూ కలలోనైనా ఊహించి యుండరన్నంత పని అయింది. మాలవాడకు వెళ్లడం నాకు అదే మొదలు. వాళ్ల యిళ్లు చూచి నేను నివ్వెరబోయాను. వాళ్లు కూడా మమ్మల్ని చూచి ఆశ్చర్యంతో చకితులైనారు. మీ పాకీ దొడ్లు చూచేందుకు వచ్చాం అని నేను అన్నాను. “మాకేమిటి పాకీ దొడ్లేమిటి. మేము బయటకి పోతాం. మీ వంటి గొప్పవారికేనండీ పాకీ దొడ్లు” అని వాళ్లన్నారు. “మేము మీ ఇల్లు చూడవచ్చునా?” “అయ్యా. తప్పక చూడవచ్చు. అడ్డులేదు. మీకిష్టమొచ్చిన చోట చూడండి. అయ్యా, మా ఇళ్లా? యివన్నీ బొరియలండీ బొరియలు” అని అన్నారు.

నేమ లోపలికి వెళ్లి వాళ్ల యిళ్లు ముంగిళ్లు చూచాను. ఇళ్లు ఆవు పేడతో అలికి వున్నాయి. కుండలు, చట్లు అన్నీ శుభ్రంగా వుండి నిగనిగలాడుతూ వున్నాయి. ఈ ప్రదేశంలో ప్లేగు భయం లేదు. ఇక గొప్పవారి పాకీ దొడ్లను గురించి వర్ణించడం అవసరం. అది ఒక భాగ్యశాలిది. ప్రతి గదికి తూములు వున్నాయి. వీటి తూములు, మూత్రపు తూములు కూడా అవే. అందువల్ల దుర్గంధం అపరిమితంగా ఉన్నది. ఇంట్లో మేడ మీద పడక గది వుంది. దానికి ఒక తూము వుంది. మల మూత్రాలకు అది ఒక్కటే మార్గం. ఆ తూము నుండి నేలకు ఒక గొట్టం అమర్చబడింది. ఇక్కడ నిలబడితే ముక్కు పగిలిపోవలసిందే. ఆ యింట్లో వాళ్లు అక్కడ ఎలా వుంటున్నారో ఎలా నిద్రిస్తున్నారో పాఠకులే ఊహించుకొందురుగాక.

మా బృందంవారు వైష్ణవాలయం కూడా చూచేందుకు వెళ్ళారు. అక్కడి పెద్ద పూజారికి, గాంధీ కుటుంబానికి చాలా కాలం నుండి స్నేహ సంబంధాలు వున్నాయి. దేవాలయమంతా చూపించడానికి, సంస్కరణల్ని అమలుపరచడానికి ఆయన అంగీకరించాడు. ఆ దేవళంలో ఆయన కూడా ఎన్నడూ చూడని ఒక చోటు మా కంటబడింది. పుల్లాకులు, ఊడ్చిన పెంట అక్కడ పడవేస్తారు. కాకులకు, గ్రద్దలకు అది నిలయం. పాకీ దొడ్లు పాడుగా వున్నాయని చెప్పనక్కరలేదు. రాజకోటలో ఎంతోకాలం నేను వుండలేదు, అందువల్ల ఆయన దాన్ని ఎంత వరకు బాగుచేయించాడో నాకు తెలియదు.

దేవాలయంలో దుర్గంధం చూచి చాలా బాధపడ్డాను. దేవాలయం పవిత్రమైనదని మనం భావిస్తాం. అక్కడ ఆరోగ్య విధులు పాటింపబడాలని ఆశిస్తాం. స్మృతి కర్తలు బాహ్యాంభ్యంతర శుద్ధి అత్యావశ్యకమని ఎంతగానో ఉద్ఘోషించారు. ఆ విషయం సర్వులకు తెలియడం ఎంత అవసరమో అప్పుడు బోధపడింది.