Jump to content

సత్యశోధన/రెండవభాగం/23. ఇంటి వ్యవస్థ

వికీసోర్స్ నుండి

23. ఇంటి వ్యవస్థ

ఇంటి వ్యవస్థ చక్కదిద్దడం ఇంటి భారం వహించడం నాకు క్రొత్త కాదు. అయితే బొంబాయి, లండను యందలి కాపురానికీ, నేటాలు యందలి నా కాపురానికి వ్యత్యాసం వుంది. నేటాలులో గృహవ్యయం పూర్తిగా ప్రతిష్టకోసం ఇండియన్ బారిస్టరు ప్రతిష్టకు తగినట్లు, భారతీయుల ప్రతినిధికి తగినట్లు చేయవలసి వచ్చింది. అందువల్ల పట్టణంలో మంచి చోట ఒక అందమైన చిన్న గృహం అద్దెకు తీసుకున్నాను. అవసరమైన ఉపకరణాలన్నీ అందులో వున్నాయి. భోజన వ్యయం మితం చేయాలని భావించాను. కాని అప్పుడప్పుడు ఆంగ్ల మిత్రుల్ని, నాతో బాటు పనిచేసే భారతీయుల్ని విందుకు పిలుస్తూ వుండటం వల్ల ఖర్చు అధికంగా జరగుతూ వుండేది.

ప్రతి సంసారంలోను ఒక పనివాణ్ణి నియమించుకోక తప్పదు. అయితే ఎవరినైనా ఒక వ్యక్తిని సేవకునిలా ఎలా వుంచాలో నాకు యిప్పటికీ తెలియదు. నాతోబాటు ఒక మిత్రుడు వుండేవాడు. మరో వంటవాడు ఇంటివానివలె వుండేవాడు. ఆఫీసులో గుమాస్తాలు మా గృహంలో భోజనం చేసి నివసిస్తూ వుండేవారు.

మా సంసారం యీ విధంగా బాగానే సాగిందని చెప్పగలను. అయినా మా సంసారంలో కొన్ని కటు అనుభవాలు కూడా కలిగాయి. నా మిత్రుడు మంచి తెలివి గలవాడు. నా యెడ విశ్వాసం కలవాడని నేను అతణ్ణి పూర్తిగా నమ్మాను. కాని నేనే మోసపోయాను. ఆఫీసు గుమాస్తా ఒకడు నా గృహంలో వుండేవాడు. నా మిత్రునికి అతనిపై అసూయ పుట్టింది. నా గుమాస్తా మీద నాకు అనుమానం కలిగేలా మిత్రుడు ఒక పన్నాగం పన్నాడు. ఆ గుమాస్తాది విచిత్రమైన స్వభావం. నేను తనను అనుమానిస్తున్నానని అతడు గ్రహించి పని మానటమే గాక నా యింటికి రావడం కూడా మానుకున్నాడు. నాకు అతని విషయమై విచారం కలిగింది. అతనికి అన్యాయం చేశానేమోనన్న భావం నాకు కలిగింది.

ఇంతలో మా వంటవాడు ఏకారణం చేతనో సెలవు తీసుకున్నాడు. మిత్రుల సేవా శుశ్రూషల కోసం నేను మరో వంటవాణ్ణి నియమించాను. ఆతడు సెలవులో వెళ్లినందున మరొకణ్ణి నియమించవలసి వచ్చింది. ఈ క్రొత్తవాడు అల్లరివాడు అని తరువాత తెలిసింది. కాని నా దృష్టిలో అతడు దేవుడు పంపిన దూతయే.

నా యింట్లో నాకు తెలియకుండా జరుగుతున్న దుష్కార్యాలను వచ్చిన రెండు మూడు రోజుల్లోనే గ్రహించి క్రొత్త వంటవాడు నన్ను హెచ్చరించడానికి పూనుకొన్నాడు. మంచివాడనని, ఎవరేం చెబితే అది నమ్ముతానని నాకు పేరు వచ్చింది. అట్టి నా యింట్లోనే దుర్గంధం వ్యాప్తి కావడం చూచి మా వంటవాడు ఆశ్చర్యపడిపోయాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు నా భోజనం. ఆఫీసు నుండి ఆ సమయానికి యింటికి వెళ్లడం నాకు అలవాటు.

ఒకనాడు పన్నెండుగంటల వేళ ఆ వంటవాడు ఆఫీసుకు రొప్పుకుంటూ వచ్చి “ఒక తొందర పని వుంది. మీరు వెంటనే యింటికి రావాలి” అని అన్నాడు “ఇప్పుడెట్లా? పనేమిటో చెప్పు. ఆఫీసు వదలి యింటికి రావలసిన అవసరం ఏం వచ్చిందో చెప్పు” అని అన్నాను.

“మీరిప్పుడు యింటికి రాకపోతే తరువాత ఎందుకు వెళ్లకపోతినా అని విచారపడతారు. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను”.

అతడంత గట్టిగా చెప్పేసరికి ఇంటికి బయలుదేరాను. వంటవాడు ముందు నడిచి నన్ను మేడ మీదకు తీసుకువెళ్లాడు. నా మిత్రుని గదిని చూపించి తలుపులు తెరచి మీరే చూడండి ఏం జరుగుతున్నదో అని అన్నాడు.

నాకు అంతా బోధపడిపోయింది. తలుపుతట్టాను. సమాధానం ఎలా వస్తుంది? గట్టిగా తలుపు మీద బాదాను. గోడలు కూడా కదలిపోయినంత పని అయింది. తలుపులు తెరచుకున్నాయి. లోపల ఒక వేశ్య. వెళ్లిపో యిక ఎప్పుడూ యీ గుమ్మం తొక్కవద్దు అని చెప్పి ఆమెను పంపించివేశాను.

“ఈ క్షణాన్నుండి నీతో నా కెట్టి సంబంధం లేదు. నేను బుద్ధి మాంద్యం వల్ల మోసపోయాను. నా విశ్వాసాన్ని యిలా పటాపంచలు చేశావు” అని అరిచాను. నాయీ మాటలకు పశ్చాత్తాప పడవలసిన మిత్రుడు తద్విరుద్ధంగా వ్యవహరించి చూడు! నీ రహస్యాలన్నీ బయట పెడతా అని బెదిరించాడు. “నాకు రహస్యమేమీ లేదు. నా సంగతంతా చాటిచెప్పు. నీవు తక్షణం ఇల్లు విడిచి వెళ్లిపో” అని గద్దించాను.

అతడు యింకా కొంచెం బిరుసెక్కాడు. అతణ్ణి సంబాళించడం కష్టమని భావించాను. క్రింద వున్న గుమాస్తాను పిలిచాను. నీవు వెంటనే పోలీసు సూపరింటెండెంటు గారి దగ్గరకి వెళ్లి నా నమస్కారం తెలియజేయి. నా యింట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి విశ్వాసఘాతుకం చేశాడు. అతడు నా యింట్లో వుండటం నాకు యిష్టంలేదు. కాని అతడు యిక్కడి నుండి కదలడం లేదు. తమ మద్దతు కోరుతున్నాను అని నా ప్రార్ధనగా చెప్పు అని అన్నాను. అంతవరకు లొంగని అపరాధి యిక తనను పోలీసులకు అప్పగిస్తానని గ్రహించాడు. తప్పు అతణ్ణి భయపెట్టింది. అతడు శరణు జొచ్చి పోలీసులకు చెప్పవద్దని బ్రతిమిలాడడమే గాక, ఇల్లు వదిలి వెళతానని అన్నాడు. తరువాత ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

ఈ ఘట్టం నన్ను మేల్కొలిపింది. ఆ దుష్ట మిత్రునివల్ల మోసపోయానను విషయం అప్పటికి గాని నాకు బోధపడలేదు. మంచికి పోయి చెడ్డను కొని తెచ్చుకున్నట్లయింది. తుమ్మ కొమ్మన గులాబీ పూలు పూస్తాయని భావించానన్న మాట. అతని నడవడి మంచిది కాదని నాకు తెలుసు. అయినా నా దగ్గర తప్పు చేయడని భావించాను. అతని నడవడిని బాగు చేద్దామని భావించి నేను చెడులో పడిపోయాను. ఈ విషయమై నాశ్రేయోభిలాషులు చెప్పినా నేను వినలేదు. మోహంలో పడి గ్రుడ్డి వాడినయ్యాను.

ఈ దుర్ఘటన నా కళ్లు తెరిపించింది. లేకపోతే నాకు సత్యం బోధపడేది కాదు. నేనతని వలలో పడిపోయివుంటే నేనిప్పడు తలపెట్టిన ఏకాంత జీవనం ప్రారంభించి యుండేవాణ్ణి కాదు. నా సమయమంతా అతని కోసం ఖర్చు చేసేవాణ్ణి. నన్ను అంధకారంలోకి నెట్టి చెడ్డ మార్గం పట్టించగల శక్తి అతనికి వుంది. కాని దేవుడు రక్షించిన వాణ్ణి ఎవడేమి చేయగలడు? నా మనస్సు పరిశుద్ధం కావున తప్పు చేసినప్పటికీ రక్షణ పొందాను. మొట్టమొదటనే కలిగిన యీ అనుభవం భవిష్యద్విషయాలలో నన్ను జాగరూకుణ్ణి చేసింది.

భగవంతుడే యీ వంటవానిని ప్రేరేపించి యుండవచ్చు. అతడు నిజానికి వంట చేయలేడు. అతడెంతో కాలం నా యింట్లో వుండలేడు. అతడు దప్ప మరొక రెవ్వరూ నా కండ్లు తెరవలేరు. ఆ వేశ్య యిక్కడికి రావడం యిది మొదటిసారి కాదట. అంత ధైర్యం ఆ వంటవానికి తప్ప మరెవ్వరికీ లేదు. ఆ మిత్రునిపై నాకు అపరిమిత విశ్వాసమనీ, ఆ నా విశ్వాసానికి అవధులు లేవని అందరికీ తెలుసు. వంటవాడు యీ విషయం తెలుపుటకే కాబోలు నా దగ్గరకు వచ్చి “అయ్యా నేను మీ యింట్లో వుండలేను. మీరు సులభంగా మోసపోతారు. యిది నాకు తగిన చోటుకాదు.” అని చెప్పి వెంటనే వెళ్లిపోయాడు.

నేను కూడా అతణ్ణి వుండమని పట్టుపట్టలేదు. వెనక వెళ్ళిపోయిన గుమాస్తా మనస్సును విరిచింది కూడా ఈ మిత్రుడే అని నాకు అప్పుడు తెలిసింది. ఆ గుమాస్తాకు నేను చేసిన అన్యాయాన్ని తొలగించుటకు చాలా ప్రయత్నించాను. అతని విషయంలో నేను చేసిన దానికి ఇప్పటికీ నాకు విచారమే. నేను గుమాస్తాను సంతృప్తిపరచలేక పోయాను. ఎంత సరిచేద్దామన్నా అతుకు అతుకేగదా!