సత్యశోధన/రెండవభాగం/22. ధర్మనిరీక్షణ

వికీసోర్స్ నుండి

22. ధర్మ నిరీక్షణ

ఈ విధంగా నేను పూర్తిగా ప్రజా సేవలో లీనమైపోయాను. అందుకు కారణం ఆత్మ సాక్షాత్కారాభిలాషయే. ప్రజాసేవ వల్ల ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందనే విశ్వాసంతోనే నేను సేవా ధర్మాన్ని స్వీకరించాను. భారతసేవ నాకు సహజంగా లభించింది. నాకిది ఎంతో ఇష్టం. కోరుకోకుండా యిది నాకు లభ్యమైంది. నేను పర్యటనా కాంక్షతోను, కాఠియావాడులో జరుగుతున్న కుట్రల బారి నుండి తప్పించుకోవాలనే కోరికతోను జీవిక కోసం దక్షిణ ఆఫ్రికా చేరాను. కాని నేను యిక్కడి ప్రజాసేవలో లీనమై ఈశ్వరాన్వేషణ మరియు ఆత్మదర్శనమునందు నిమగ్నమై పోయాను. ఏసు మిత్రులు నా ధర్మ జిజ్ఞాసను తీవ్రం చేశారు. అది ఏవిధంగాను శాంతించలేదు. నేను దాన్ని శాంతింపచేయాలని ప్రయత్నించాను. కాని ఏసు మిత్రులు శాంతపడనీయలేదు. అప్పుడు దర్బనులో దక్షిణ ఆఫ్రికా జనరల్ మిషనుకు అధ్యక్షులు స్పెన్సరు వాలటన్‌గారు. వారు నన్ను పసికట్టారు. దాదాపు నేను వారి కుటుంబంలో ఒకడినైపోయాను. ఈ సంబంధానికి కారణం ప్రిటోరియా పరిచయం. వాల్‌టన్‌గారి స్వభావం విచిత్రమైంది. ఆయన నన్నెన్నడు ఏసు మతంలో చేరమని చెప్పినట్లు గుర్తులేదు. కాని అతడు తన జీవితం సమస్తం నా ముందు ఉంచి తన మంచి చెడ్డల్ని నిరీక్షించు అవకాశం నాకు కల్పించాడు. అతని సతీమణి ఎంతో వినయవంతురాలు, వివేకవంతురాలు.

ఆ దంపతులు ప్రవర్తన నాకు సంతోషం కలిగించింది. మా యిద్దరికీ గల అభిప్రాయభేదం యిద్దరికీ తెలుసు. ఎటువంటి తీవ్రచర్చ కూడా మా యిద్దరి అభిప్రాయాల్ని ఏకం చేయలేదు. అయినను ఎచట ఉదారత, సహిష్ణుత, సత్యం ఉంటాయో అచట భేదాలు కూడా లాభదాయకాలే అవుతాయి. ఆ దంపతుల వినమ్రత, ఉద్యమశీలత, కార్యపరాయణత నాకు సంతోషం కలిగించాయి. అందువల్ల ఇద్దరం తరుచు ఒకచోట కలుస్తూ వుండేవాళ్లం.

ఈ సంబంధం నన్ను మత విషయంలో జాగ్రత్తపడేలా చేసింది. మతాన్ని గురించి చింతన చేసేందుకు ప్రిటోరియాలో నాకు లభించిన అవకాశం యిక్కడ లభించలేదు. అయినా లభించిన స్వల్ప సమయాన్ని గ్రంథ పఠనానికి వినియోగించ సాగాను. ఈ విషయమై మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభమైనాయి. రాయచంద్ భాయి నాకు యీ విషయంలో త్రోవ చూపుతూ వున్నారు. నర్మదా శంకరుని (గుజరాతుకు చెందిన ఒక ప్రసిద్ధ కవి) ‘ధర్మ విచార్’ అను గ్రంథం ఒక మిత్రుడు పంపగా దాని పీఠిక నాకు ఎంతో ఉపయోగపడింది. నర్మదా శంకరుని విశృంఖల జీవితాన్ని గురించి వినియున్నాను. ఈ పీఠికలో అతడు తన శీలాన్ని ఎలా దిద్దుకోగలిగాడో వివరించాడు. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. నాకు ఆ గ్రంథం యెడ ఆదరం పెరిగింది. దాన్ని అతిశ్రద్ధగా చదివాను. మాక్సు ముల్లర్ గారి ‘India, what can it teach us’ అను గ్రంథాన్ని, దివ్యజ్ఞాన సమాజం ప్రకటించిన ఉపనిషత్తులు అనువాదాన్ని శ్రద్ధగా చదివాను. వీటన్నింటివల్ల నాకు హిందూమతంపై ఆదరణ పెరిగి, నానాటికి దాని గొప్పతనం అమితంగా కనబడసాగింది. అయితే అందువల్ల యితర మతాల యెడ వైముఖ్యం కలుగలేదు. వాషింగటన్ ఇర్వింగ్ గారి “Life of Mahamd and His successars” అను గ్రంథాన్ని, కార్లయిలుగారి మహమ్మదు స్తుతిని చదివాను. దీనిచే నాకా మత ప్రవక్త యెడ ఆదరం పెరిగింది. “the sayings of zarthustra” అను గ్రంథం కూడా చదివాను. ఈ విధంగా వివిధ మతాల్ని గురించి కొద్దిగానో గొప్పగానో తెలుసుకున్నాను. దీనివల్ల ఆత్మ నిరీక్షణ పెరిగింది. చదివిన దానిలో మంచిదని తోచిన అనుభవాన్ని ఆచరణలో పెట్టసాగాను. యిదేవిధంగా యోగ సంబంధమైన గ్రంథాల్ని కూడా చదివి సాధన ప్రారంభించాను. కాని ఎక్కువ కాలం ఆ సాధన సాగించలేకపోయాను. భారతదేశం వెళ్లిన తరువాత ఒక గురువు దగ్గర అభ్యసించాలని భావించాను. కాని ఆ కోరిక ఈనాటి వరకు నెరవేరలేదు.

టాల్‌స్టాయి పుస్తకాలు అధికంగా చదివాను. వారి “The Gospels in Brief, What to do?” మొదలగు గ్రంథాలు నా హృదయానికి హత్తుకున్నాయి. విశ్వప్రేమ మనిషిని ఎంత పైకి తీసుకొని వెళ్లగలదో తెలుసుకోగలిగాను. ఈ సమయంలోనే నాకు మరో ఏసు కుటుంబంతో పరిచయం కలిగింది. వారి మాట ప్రకారం ప్రతి ఆదివారం వెస్లియస్ చర్చికి వెళ్లసాగాను. అచ్చటికి వెళ్లినప్పుడల్లా వారింట్లోనే విందు తీసుకోమని ఒక్కసారే నాకు వారు చెప్పివేశారు. ఆ చర్చిలో ప్రవచనం నిస్సారంగా వుండేది. అచటి మండలి భక్త మండలి కాదు. వారంతా ఐహిక చింతకులు. లోకాచారం కోసం, విశ్రాంతి కోసం వారు చర్చికి వెళ్లేవారు. నాకు అక్కడ నిద్ర వస్తూ వుండేది. అలా నిద్రపోవడం నాకు చిన్నతనంగా వుండేది. కాని నాతోబాటు కునుకు తీసే మిత్రులు కొందరుండటంవల్ల నా చిన్నతనం తగ్గిపోయింది. ఈ స్థితి నాకు నచ్చలేదు. చివరికి అక్కడికి వెళ్లడం మానుకున్నాను.

నడుస్తు నడుస్తూ వున్న ఆ కుటుంబం పొత్తు అంతటితో ఆగిపోయింది. యిక రావద్దని ఆ కుటుంబం వారు చెప్పినట్లు భావించవచ్చు. ఆ ఇల్లాలు చాలా మంచిది. రుజువర్తన కలది. అయితే ఆమెది సంకుచిత స్వభావం. మా పని ఎప్పుడూ మత చర్చయే. నేనప్పుడు ఆర్నాల్డుగారి “Light of Asia” చదువుతూ వున్నాను. అప్పుడు ఒక పర్యాయం బుద్ధునికి, ఏసుకు గల తారతమ్యాన్ని గురించి చర్చ వచ్చింది. నేను యిలా అన్నాను.

“అమ్మా! చూడు బుద్ధునిదయ! అది మనుష్యులతో ఆగక సకల భూతముల దాకా వ్యాపించింది. అతని భుజం మీద సంతోషంతో కూర్చున్న మేకపిల్ల చిత్తరువు కండ్ల యెదుట కనబడితే హృదయం ప్రేమతో నిండిపోతుంది. కాని ఏసులో యీ విధమైన సర్వభూత వ్యాప్తమగు దయ కనబడదు.” ఆమె మనస్సు చివుక్కుమంది. నేను యిది గ్రహించాను. ప్రసంగం అంతటితో ఆపివేశాను. భోజనానికి లేచాము. ఆమె కుమారుడు ఐదేండ్లవాడు. నవ్వు ముఖం గలవాడు. అట్టి పిల్లవాడు దగ్గరవుంటే నాకు మరొకరితో మాట్లాడనవసరం ఉండదు. మేమిద్దరం చిరకాల మిత్రులం. పిల్లవాడి పళ్ళెంలో మాంసం ముక్క వుంది. దాన్ని చూచి నేను అతణ్ణి ఎగతాళి పట్టించాను. నా చేతిలో వున్న రేగుపండు అతనికి చూపించి “చూడు యిది దానికంటే ఎంత బాగుందో” అని అన్నాను. ఆ బాలుడు అమాయకుడు. అతడు నాతో కలిసిపోయాడు. నీ పండే బాగుంది అని అంటూ నాతో అనడం, యిద్దరం నవ్వుకోవడం ప్రారంభించాం.

ఇది చూచి ఆ పసివాడి తల్లి నొచ్చుకుంది. నాకు హెచ్చరిక లభించినట్లనిపించింది. వెంటనే ప్రసంగం మార్చివేశాను. మరుసటి ఆదివారం కూడా జంకుతూ జంకుతూనే వారింటికి వెళ్లాను. నేను అక్కడికి పోవడం మానుకోదలచలేదు. అది మంచిదని నేననుకోలేదు. కాని ఆమె నా పనిని తేలికచేసింది. ఆమె యిలా అన్నది “గాంధీ! నేనొక్క మాట చెబుతాను. వేరే విధంగా భావించవద్దు. నీ స్నేహం మా పిల్లవాడికి కూడదు. యిప్పుడు వీడు ప్రతిరోజూ మాంసం తిననని మారాం చేస్తున్నాడు. నీ వాదాన్ని ప్రతిసారి చెప్పి పండ్లు తెచ్చి పెట్టమని అంటున్నాడు. దీన్ని నేను సహించలేకపోతున్నాను. మాంసం తినకపోతే జబ్బు చేయదు కాని చిక్కి శల్యమైపోతాడు. నేను అట్టి స్థితిని భరించగలనా? నీవు యిట్టి చర్చలు పెద్దవాళ్లమైన మాతో చేయడం మంచిది కాని పిల్లవాడితో చేయవద్దు. దీనివల్ల పిల్లలు పాడైపోతారు”

ఆమె మాటలు వినేసరికి నాకు బాధ కలిగింది. యిలా అన్నాను - “అమ్మా! నాకు చాలా విచారంగా వుంది. నాకూ పిల్లలున్నారు. తల్లిదండ్రుల భావాలు నాకు తెలియవా? యిక మీకు యిట్టి కష్టం కలుగనీయను. ఇది చాలా సులభం కూడా. నేను చెప్పిన మాటల కంటే నేను తినే వస్తువులు తినకుండా వదిలివేసే పదార్ధాలు చూచినప్పుడు పిల్లవాని మనస్సుకు అవి హత్తుకుంటాయి. అందువల్ల యీనాటి నుండి నేను మీ యింటికి రావడం మానుకుంటాను. అదే యిందుకు తగిన చికిత్స అని అనిపిస్తూ వుంది. అయితే దీనివల్ల మన స్నేహానికి భంగం రాదు, రాకూడదు”

“మీ మాటలు చాలా బాగున్నాయి” అలాగే చేయండి అని ఆ గృహిణి అమిత సంతోషంతో అన్నది.