సత్యశోధన/రెండవభాగం/19. నేటాల్ ఇండియన్ కాంగ్రెస్
19. నేటాలు ఇండియన్ కాంగ్రెస్
న్యాయవాద వృత్తి నిజంగా నాకు అప్రధానం. చివరివరకూ అప్రధానంగానే వుండిపోయింది. నేటాలు రాష్ట్రంలో నా నివాసం సార్ధకం కావాలంటే నేను ప్రజాసేవలో లీనం కావాలి. అర్జీలు పంపినంత మాత్రాన ఫ్రాంచైజు పని పూర్తికాదు. ఇల్లలుకగానే పండగ కాదు గదా! ఎప్పుడూ అలజడి జరుపుతూ వుండాలి. అప్పుడు యీ విషయం వలన రాజ్యాల కార్యదర్శికి తెలుస్తుంది. అలా జరగాలంటే అందుకు ఒక శాశ్వతమైన సంస్థ అవసరమని అనిపించింది. అబ్దుల్లా సేఠ్ గారితోను, మిగతా మిత్రులతోసు సంప్రదించి ఒక శాశ్వత సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాను.
ఈ సంస్థకు పేరు ఏమని పెట్టడం? చాలా ధర్మ సందేహాలు కలిగాయి. అది ఏ పక్షం వైపుకు మొగ్గకూడదు. కాంగ్రెస్ అను పేరు ఇంగ్లాండు నందలి కన్సర్వేటివు పార్టీ వారికి రుచించదని నాకు తెలుసు. కాని హిందూ దేశానికి కాంగ్రెస్ ప్రాణం. నేటాలులో శక్తిని వృద్ధి చేయాలని భావించాను. ఆ పేరుకు భయపడటం పిరికితనం అని తోచింది. ఈ కారణాలన్నీ తెలియజేసే ఈ సంస్ధకు “నేటాలు ఇండియన్ కాంగ్రెస్” అని పేరు సూచించాను. అంతా అంగీకరించారు. 1894 వ సంవత్సరం మే 22వ తేదీన నేటాలు ఇండియన్ కాంగ్రెస్ ఆవిర్భవించింది.
ఆనాడు విశాలమైన అబ్దుల్లా సేఠ్‌గారి గది క్రిక్కిరిసి పోయింది. సభ్యులంతా కాంగ్రెసుకు స్వాగతం చెప్పారు. కాంగ్రెసు నియమాలు తక్కువే కాని చందా మాత్రం ఎక్కువ. నెలకు అయిదు షిల్లింగులు చెల్లిస్తేనే సభ్యులవుతారు. శక్తివంచన లేకుండా ధనికులు చందాలు యిమ్మని ప్రోత్సహించాము. అబ్దుల్లాగారు మొదటి పద్దుగా రెండు పౌండ్ల విరాళం ప్రకటించారు. తరువాత యిద్దరు మిత్రులు అంత పద్దు చేశారు. “నేను ఏం చేయడమా?” అని ఆలోచించి ఆ తరువాత ఒక పౌను విరాళం నేను వ్రాశాను. యిది నా శక్తికి మించిన పని. అయితే సంపాదన ప్రారంభమైతే యీ మాత్రం యివ్వగలనని నేను సాహసించాను. ఈశ్వరుడు అందుకు సహకరించాడు. ఈ విధంగా నెలకు ఒక్క పౌను చొప్పున యిచ్చే సభ్యులు ఎక్కువగా చేరారు. నెలకు పది షిల్లింగుల చొప్పున యిచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. ఇదిగాక విరాళాలు చాలా మంది తమ శక్తిని బట్టి ప్రకటించారు.
ఈ వ్యవహారం చూచాక అడిగినంత ఎవ్వరూ విరాళం యివ్వరని నాకు బోధపడింది. దర్బానుకు ఆవలి ప్రాంతాల్లో వున్న వారిని మాటిమాటికి చందా అడగటం కష్టం. ఆరంభశూరత్వం ఎలా వుంటుందో కూడా బోధపడింది. దర్బను వాళ్లు ఎన్నిసార్లు తిరిగినా చందాలు యిచ్చేవారు కాదు.
నేను కార్యదర్శిని. అందువల్ల చందాలు పోగుచేసే పని నాది. వసూళ్లకై నాలుగు మాసాలు రోజంతా తిరగవలసి వచ్చేది. ఈ అనుభవం వల్ల నెల చందాలకు బదులు వార్షిక చందాలు, ముందుగానే వసూలు చేసేలా ఏర్పాటుచేయడం మంచిదని భావించాను. అందుకోసం సభ ఏర్పాటు చేశాను. నెలకు బదులు ఏడాదికి ఒక్క సారి చందా వసూలుచేయాలని, మూడు పౌండ్లు కనీసపు పద్దుగా వుండాలని అంతా నిర్ణయించారు. ఈ విధంగా నిర్ణయించినందున చందాల వసూలు పని సులభమైపోయింది.
అప్పు తెచ్చి ప్రజల కార్యాలు చేయకూడదని మొదటి నుండి నా అభిప్రాయం. డబ్బు తప్ప మిగతా ఏ విషయాల్ని గురించి, ఏ వాగ్దానాలనైనా అంగీకరించవచ్చునని అనుభవం మీద తెలిసింది. వాగ్దానం చేసిన వాళ్లు తిరిగి దాన్ని అదేవిధంగా బాధ్యతగా నేరవేర్చడం తక్కువ. నేటాలు భారతీయులు కూడా అంతే. డబ్బు చూచుకొని గాని కార్యక్రమాలకు నేను పూనుకోలేదు. అందువల్ల నేటాల్ కాంగ్రెస్ అప్పులపాలు కాలేదు.
నా సహచరులు క్రొత్త సభ్యుల్ని చేర్చాలని ఉత్సాహపడ్డారు. దానితో వారికి కూడా చాలా అనుభవాలు కలిగాయి. చాలామంది సంతోషంతో ధనం యివ్వడం ప్రారంభించారు. దూర ప్రదేశాలకు గ్రామాలకు ఉద్యమాన్ని వ్యాప్తం చేయడం కష్టమైపోయింది. ప్రజా సేవ అంటే ఏమిటో అక్కడి వాళ్లకు ముందు తెలియదు. చాలామంది ధనికులు మమ్మల్ని పిలిచి విరాళాలు యివ్వడం ప్రారంభించారు.
ఈ యాత్రలో ఒకసారి పెద్ద కష్టం ముంచుకు వచ్చింది. ఒక దాత ఆరు పౌండ్లు యిస్తాడని అనుకున్నాం. కాని అతడు మూడు పౌండ్లు కంటే మించి యివ్వనని భీష్మించాడు. మేము ఆ కొద్ది సొమ్ము ఆయన దగ్గర తీసుకుంటే మిగతా వారంతా అంతే యిస్తారు. అందువల్ల సొమ్ము ఎక్కువ వసూలు కాదు. ఆ రోజు రాత్రి ప్రొద్దుపోయింది. మాకందరికీ బాగా ఆకలివేస్తూ వున్నది. అనుకున్న మొత్తం రానిదే భోజనం ఎలా చేయడం? ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం కలగలేదు. దాత పట్టిన పట్టు విడవలేదు. పట్టణంలో వుండే వర్తకులంతా చెప్పి చూచారు. మేమంతా రాత్రంతా ఆయనతో గడిపాము. అయినా ఆయన లొంగలేదు. మేము కూడా మెత్తబడలేదు. నా సహచరులలో చాలామందికి కోపం వచ్చింది. అయినా సౌజన్యాన్ని వదలలేదు. తూర్పున ఉషోదయ కిరణాలు తొంగి చూడసాగాయి. అప్పుడు ఆయన ఆరు పౌండ్లు యిచ్చాడు. మాకందరికీ విందు కూడా చేశాడు. ఇది టోంగాటా పట్టణంలో జరిగిన ఘట్టం. అయితే ఈ వార్త ఉత్తర దిక్కున గల స్టేంగల్ పట్టణం మొదలుకొని దేశం మధ్యన చార్లెస్ టౌను వరకు ప్రతిధ్వనించింది. దీని వల్ల చందా వసూళ్ల పని మాకు తేలిక అయింది.
కాని మా పని ధనం వసూలు చేయడమేకాదు. అవసరాన్ని మించి ధనం మన దగ్గర వుంచవద్దని నేను నా సహచరులందరికీ ముందే చెప్పి వుంచాను. అవసరాన్ని బట్టి వారానికి ఒకసారి, నెలకొకసారి సభలు జరుపుతూ వచ్చాం. ప్రతి సభలోను వెనుక జరిగిన కార్యక్రమ వివరమంతా చెప్పడం జరుగుతూ వుండేది. ఇట్టి చర్చల్లో డొంక తిరుగుడు లేకుండా మాట్లాడటం అక్కడి వారికి తెలియదు. సభల్లో ప్రసంగించడానికి అంతా సంకోచించసాగారు. అయితే మాట్లాడవలసిన తీరు, చర్చల సరళి గురించి వారికి వివరిస్తూ వుండేవాణ్ణి. వారు ఆ ప్రకారం ప్రసంగించడం ప్రారంభించారు. వారు ఉపన్యసించడం ఒక విద్య అని తెలుసుకున్నారు. ఉపన్యాసం అంటే ఏమిటో తెలియని వారు కూడా ఆలోచించి ఉపన్యసించసాగారు.
ప్రజల కార్యక్రమాల్లో చిల్లర ఖర్చులు మితిమీరి పోవడం నేనెరుగుదును. మొదట రసీదు పుస్తకాలు అచ్చు వేయవద్దనుకున్నాను. నా దగ్గర సైక్లోస్టయిలు మిషసు వుంది. దానిమీద రశీదుల, రిపోర్టుల ప్రతులు తీయించసాగాను. కాంగ్రెస్‌లో డబ్బు ఎక్కువగా వుండి, సభ్యుల సంఖ్య అధికమైనప్పుడు మాత్రమే యిట్టి వాటిని అచ్చు వేయించేవాణ్ణి. పొదుపు చేయాలను తలంపే అందుకు కారణం. అయినా చాలా చోట్ల యిలా జరగలేదు. సంస్థ చిన్నదైనా పెద్దదైనా అందరికీ యీ విషయాలు తెలియాలనే తలంపుతో వివరంగా యిక్కడ వ్రాశాను.
జనం డబ్బు యిచ్చి రసీదులడిగే వారు కారు. కాని మేము మాత్రం రసీదులివ్వడం అవసరమని భావించాం. ఆవిధంగా ప్రతి దమ్మిడీకి రసీదులు యిచ్చాం. పైసపైసకు లెక్క వ్రాస్తూ వున్నాం. ఆ విధంగా వ్యవహరించడం వల్ల యీనాడు పరీక్షించి చూచినా 1894 నాటి నేటాలు ఇండియన్ కాంగ్రెస్ లెక్కలు కరెక్టుగా వుంటాయి. ఆ విషయం యీ నాటికీ గట్టిగా నొక్కి వక్కాణించగలను. ఏ సంఘానికైనా తప్పులు లేని లెక్కలే ప్రాణం. లెక్కలు సరిగా లేకపోతే సంఘానికి పెద్ద అపకీర్తి వస్తుంది. లెక్కల్ని సరిగాను శుద్ధంగాను ఉంచకపోతే సత్యాన్ని సరిగాను, శుద్దంగాను రక్షించలేము.
ఆ దేశంలో పుట్టి పెరిగి విద్యావంతులైన భారతీయులకు సేవ చేయడం ఈ కాంగ్రెస్ యొక్క రెండవ పని. అందుకోసం “కలోనియల్ బారన్ ఇండియన్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్” అను ఒక సంఘాన్ని స్థాపించాము. ఇందలి సభ్యులంతా విద్యాధికులైన పిన్నవారే. వారు కొద్దిగా చందాలు యిస్తూ వుండేవారు. వారి కష్టాల్ని ప్రజలకు చెప్పడం, వారి తెలివి తేటల్ని పైకి తీయడం, వారికి హిందూ దేశపు వర్తకులకు సత్సంబంధం కల్పించడం, వారికి సేవచేసే విధానం తెలపడం. ఇవీ ఈ సంఘం పని. ఇది ఒక విధంగా చర్చలు జరుపు సమితి అన్నమాట. అందలి సభ్యులు అనేక విషయాలపై తప్పనిసరిగా చర్చలు చేస్తూ వుండేవారు. ఈ సంఘం కోసం చిన్న గ్రంధాలయం కూడా ఏర్పాటు చేశాం.
ప్రచారం చేయడం కాంగ్రెస్ మూడో పని. దక్షిణ ఆఫ్రికాలోను, ఇంగ్లాండులోను ఉన్న ఆంగ్లేయులకు, భారతీయులకు నేటాలులో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు తెలుపడం అవసరం. ఈ దృష్టితో రెండు కర పత్రాలు తయారుచేశాను. “దక్షిణ ఆఫ్రికాలోని బ్రిటీష్ వారికి ఒక విన్నపం” (An appeal the every briton in South Africa) అను కరపత్రం ఒకటి. యిందు నేటాలు నందలి భారతీయుల స్థితిగతుల్ని గురించి సవివరంగా వ్రాశాను. “భారతీయుల ఓటు హక్కును గురించి ఒక విన్నపం” The Indian Franchise An Appeal అనునది రెండో కరపత్రం. ఇందు భారతీయుల ఓటు హక్కును గురించి కూలంకషంగా వివరించి వ్రాశాను. ఈ రెండు కర పత్రాలు తయారుచేయటానికి నేను ఎంతో శ్రమించాను. అంత శ్రమ పడినందుకు ఫలితం ఊహించనంతగా లభించడం గొప్ప విశేషం. వాటికి ఎంతో ప్రచారం లభించింది.
ఈ అలజడి వల్ల దక్షిణ ఆఫ్రికాలోని భారతీయులు నాకు మంచి మిత్రులైనారు. ఇంగ్లాండునందు, హిందూ దేశమునందును గల అన్ని పార్టీల వారి ఆదరము మాకు లభించింది. ఇక ముందు చేయాల్సిన పనికి రాజమార్గం ఏర్పడింది.