సత్యశోధన/రెండవభాగం/18. వర్ణద్వేషం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

18. వర్ణద్వేషం

కోర్టు ఒక త్రాసు వంటిది. ఈ త్రాసును సమానంగా ఒక వృద్ధ వనిత పట్టుకుంటుంది. ఆమెకు పక్షపాతం ఉండదు. ఆమె గ్రుడ్డిది కూడా. ఆమెది కుశాగ్రబుద్ధి. బ్రహ్మ ఆమెను గ్రుడ్డిదాన్నిగా చేసినందువల్ల ముఖం చూచి ఆమె ఎవ్వరికీ బొట్టు పెట్టదు. యోగ్యతను బట్టి మాత్రమే బొట్టు పెడుతుంది. కాని నేటాలు నందలి వకీళ్ల సభ అందుకు విరుద్ధంగా ముఖం చూచి బొట్టు పెట్టమని సుప్రీంకోర్టును ఉసి కొల్పింది. కాని కోర్టు మాత్రం ఈ సందర్భంలో తన త్రాసుకు సరిపోవు పనే చేసింది.

సుప్రీం కోర్టులో అడ్వకేటుగా చేరేందుకై అర్జీ పంపాను. బొంబాయి హైకోర్టు వారి అనుజ్ఞా పత్రం నా దగ్గర వున్నది. నేను బొంబాయి హైకోర్టులో ప్రవేశించినప్పుడు నా ఇంగ్లీషు సర్టిఫికెట్టు మూలప్రతి దాఖలు చేయవలసి వచ్చింది. నేటాలు సుప్రీంకోర్టులో ప్రవేశానికి యోగ్యతకు సంబంధించిన రెండు ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలి. తెల్లవారి ప్రమాణ పత్రాలకు ఎక్కువ విలువ వుంటుందని భావించాను. అబ్దుల్లా సేఠ్‌గారి ద్వారా పరిచితులు, ప్రసిద్ధులు అయిన ఇద్దరు తెల్లవారి దగ్గర ప్రమాణ పత్రాలు తీసుకొని అర్జీ దాఖలు చేశాను. ఒక వకీలు ద్వారా అర్జీ దాఖలు చేయడం కోర్టు విధి. సామాన్యంగా యీ అర్జీలను అటార్నీ జనరల్ ఫీజు పుచ్చుకోకుండానే దాఖలు చేసుకోవడం పరిపాటి. అబ్దుల్లా సేఠ్‌గారి కంపెనీకి సలహాలిచ్చే ఎస్కాంబిగారే అటార్నీ జనరల్. నేను వారి దర్శనం చేసుకున్నాను. ఆయన సంతోషంతో నా దరఖాస్తును మంజూరుచేశారు.

ఇంతలో హఠాత్తుగా వకీళ్ల సభవారు నాకు నోటీసు పంపారు. నా దరఖాస్తుతో బాటు ఇంగ్లీషు సర్టిఫికెట్ మూలప్రతి జత పరచకపోవడం లోపమని వ్రాశారు. అడ్వకేట్లను చేర్చుకొనుటకు నియమావళి తయారుచేసినప్పుడు నల్లవారిని చేర్చుకోవచ్చునా చేర్చుకోకూడదా అని వారు విచారించలేదు. ఇదే వారి వ్యతిరేకతకు ప్రధాన కారణం. నేటాలు దేశపు అభివృద్ధికి తెల్లవారే ముఖ్య కారణం. అందువల్ల వకీళ్లలో తెల్లవారి ఆధిక్యతను సంరక్షించడం తన కర్తవ్యమని వారు భావించారు. నల్లవాళ్లను చేర్చుకుంటే వారి సంఖ్య పెరిగిపోయి తెల్లవారి సంఖ్య తగ్గిపోతుందని, తెల్లవారి ఆధిక్యత తగ్గిపోతుందని వారి తపన.

నా అర్జీ మంజూరు కాకుండా చూచేందుకై వాళ్లు ఒక ప్రసిద్ధుడైన వకీలును నియమించారు. అతనికి అబ్దుల్లా సేఠ్‌గారి కంపెనీతో సంబంధం వుంది. అందువల్ల తనను ఒకసారి కలుసుకోమని ఆయన నాకు కబురు పంపాడు. నేను వెళ్లి ఆయనను కలిశాను. ఆయన నిష్కపటంగా నాతో మాట్లాడి నా వృత్తాంతం తెలుసుకున్నాడు. “మీకు వ్యతిరేకంగా నేనేమీ చేయను. మీరు కాలనీలో పుట్టిన రకమేమోనని భయపడ్డాను. మీ అర్జీతో బాటు ఇంగ్లీషు సర్టిఫికెట్టు లేకపోవడం వల్ల నా అనుమానం పెరిగింది. మరింకొకరి సర్టిఫికెట్టు చూపించేవాళ్లు కూడా వుంటారు. మీరు యిక్కడ తెల్ల దొరల దగ్గర ప్రమాణ పత్రాలు తీసుకున్నారు. అవి నాలుక గీచుకోడానికి కూడా పనికిరావు. మీ యోగ్యతను గురించి వారేం ఎరుగుదురు? వారెంత కాలం నుండి మిమ్మల్ని ఎరుగుదురో చెప్పండి” అని ఆయన అడిగాడు.

“ఇక్కడి వాళ్లంతా నాకు క్రొత్తవాళ్లే. ఇచ్చటికి రాక ముందు అబ్దుల్లా సేఠ్‌గారు కూడా నన్నెరుగరు” అని జవాబిచ్చాను.

“అబ్దుల్లా సేఠ్‌గారిది మీ ఊరే అని అన్నారుగదా! మీ తండ్రిగారు దివాను గారు గదా! సేఠ్ వారిని బాగా ఎరిగే వుంటారు. కనుక అబ్దుల్లా సేఠ్ గారి నుండి ఒక అఫిడవిటు తీసుకురండి. ఇక మిమ్మల్ని ఏమీ అడగవలసిన పని వుండదు.” అని ఆయన అన్నాడు. ఆ మాటలు వినగానే నాకు చాలా కోపం వచ్చింది. కాని కోపాన్ని అణుచుకున్నాను. నేను మొదటగానే అబ్దుల్లా సేఠ్ గారి దగ్గర ప్రమాణ పత్రం తీసుకొని దాఖలు చేసి యుంటే, యిది పనికి రాదు, తెల్లవారి ప్రమాణ పత్రం కావాలని అనేవారు. అయినా నన్ను అడ్వకేటుగా అంగీకరించేందుకు నా పుట్టుపూర్వోత్తరాలతో పనేమిటి? నా తల్లిదండ్రులు చెడువారు కావచ్చు లేక మంచివారు కావచ్చు. వారి మంచిచెడులతో నా అడ్వకేట్ వృత్తికి సంబంధం ఏమిటి? ఈ విధంగా లోలోన మధన పడి యోచనల్ని అదుపులో పెట్టుకొని యిలా అన్నాను. “నా వకీలు వృత్తి కోసం వకీళ్ల సభవారి యిట్టి భావాల్ని నేను అంగీకరించను. అయినా మీరు చెప్పిన ప్రకారం అఫిడవిట్ తప్పక దాఖలు చేస్తాను" అని అన్నాను.

అబ్దుల్లా సేఠ్ గారి దగ్గర అఫిడవిట్ తీసుకొని తెల్ల వకీలుకు అందజేశాను. ఆయన తాను సంతృప్తిపడ్డానని చెప్పాడు కాని వకీళ్ల సభ వాళ్లు తృప్తిపడలేదు. వారు నా దరఖాస్తును వ్యతిరేకించారు. కాని కోర్టు వారు అటార్నీ జనరల్ పని లేకుండానే వకీలు సభవారి ఆక్షేపణల్ని త్రోసిపుచ్చారు. ప్రధాన న్యాయాధీశుడు కల్పించుకొని “అర్జీదారు ఇంగ్లీషు సర్టిఫికెట్టు చూపలేదను ఆక్షేపణ యుక్తిపరమైంది కాదు. అతడు అబద్ధపు సర్టిఫికెట్టు పంపియుంటే అతనిపై నేరం మోపవచ్చు. ఆ నేరం నిజమని రుజువైతే అతని పేరు వకీలు పట్టిక నుంచి తొలగించవచ్చు. శాసనాలకు నలుపు తెలుపు అను భేదం లేదు. కావున గాంధీ గారిని చేర్చుకొనకుండా వుండుటకు కోర్టుకు హక్కు లేదు. అందువల్ల అతని దరఖాస్తును మేము మంజూరు చేస్తున్నాము. గాంధీ గారూ! మీరు ప్రమాణం చేసి అడ్వొకేటుగా చేరండి” అని అన్నాడు. నేను లేచి రిజిస్ట్రారు దగ్గరకు వెళ్లి ప్రమాణం చేశాను. నేను ప్రమాణం చేయగానే ప్రధాన న్యాయాధీశుడు నన్ను సంబోధించి “గాంధీగారూ! మీరు యిక తలపాగా తీసివేయాలి. ప్రాక్టీసు చేయు బారిస్టర్లు కోర్టు వారు నిర్ణయించే వేష నియమాలను పాటించాలి. కోర్టు నియమాలకు మీరు లోబడాలి.” అని అన్నాడు. నాకు నా మర్యాద తెలుసు. జిల్లా మేజిస్ట్రేటు కోర్టులో పాగా తీసేయమంటే నేను నిరాకరించాను. ఇప్పుడు సుప్రీం కోర్టువారి ఆదేశం ప్రకారం పాగా తీసివేశాను. నేను వారి ఆదేశాన్ని నిరాకరించవచ్చు. అట్లా చేయడం సమ్మతం కూడా. కాని నేను చేయాల్సిన పోరాటాలు చాలా వున్నాయి వాటికోసం నా శక్తిని అదుపులో వుంచుకోవాలని భావించాను. తలపాగా తొలగించ కూడదనే పట్టుదల బట్టితే ప్రయోజనం? ఇంతకంటే పెద్ద కార్యాలు నేను ఎన్నో చేయాల్సిన అవసరం వుందికదా!

నేనిట్లా లోబడినందుకు (ఇది లోబడటమా?) అబ్దుల్లా సేఠ్‌గారు, తదితర మిత్రులు ఆక్షేపించారు. కోర్టులో ప్రాక్టీసు చేసేటప్పుడు తలపాగా ధరించాలనే ధైర్యం వహించితే బాగా వుండేదని వారి భావం. వారికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. “దేశాన్ని బట్టి ఆచారాలు” మారాలని వారికి తెలియజేసేందుకు ప్రయత్నించాను. “హిందూ దేశంలో తెల్ల అధికారి తలపాగా తీసివేయమని ఆదేశిస్తే దానికి లోబటడం సిగ్గుచేటు. కాని నేటాలు కోర్టులో ఆ కోర్టు ఆచారాల్ని నియమాల్ని నిరాకరించకూడదు” అని చెప్పాను.

నేను చెప్పిన కారణాలు వారికి నచ్చలేదు. అయినా కొద్దిగా శాంతించారు. ఒక విషయాన్ని వివిధ సందర్భాలను బట్టి వివిధ రకాలుగా చూడవలసి వస్తుందన్న సంగతిని వారిచే ఒప్పించలేకపోయాను. నా జీవితమందంతట సత్యము యెడగల పట్టుదలయే రాజీ యొక్క సౌందర్యాన్ని నా చేత ఆస్వాదింప చేయగలిగింది. ఈ పద్ధతి సత్యాగ్రహము నందు అనివార్యమని నా తరువాతి జీవితంలో తెలుసుకోగలిగాను. ఆ పద్ధతి నా ప్రాణాలకు ముప్పుగా కూడా పరిణమించేది. అంతేగాక మిత్రుల అసంతోషానికి మూలమయ్యేది. దాన్ని కూడా సహించవలసి వచ్చేది. సత్యం వజ్రం పలె కఠోరం కుసుమం వలె కోమలం గదా! నేటాలు నందలి వకీళ్ల సభవారి ప్రతిఘటన వల్ల దక్షిణ ఆఫ్రికాలో మరో మారు నా పేరు మారు మ్రోగింది. చాలా పత్రికల వాళ్లు ఆక్షేపణల్ని ఖండించారు. వారి వ్యతిరేకతకు కారణం ఈర్ష్యయే అని ప్రకటించారు. ఈ ప్రసిద్ధి వల్ల నా కార్యక్రమాల్లో కొన్ని అంశాలు సరళమయ్యాయి.