సత్యశోధన/రెండవభాగం/17. అక్కడే ఉన్నాను.

వికీసోర్స్ నుండి

17. అక్కడే ఉన్నాను

1893వ సంవత్సరంలో హాజీ మహమ్మద్ సేఠ్ నేటాల్ రాష్ట్రంలో నివసించే భారతీయులలో ప్రముఖుడుగా భావించబడి వారికి నాయకుడుగా ఎన్నుకోబడ్డాడు. సంపదలో హాజీ మహమ్మద్ సేఠ్‌గారికే అంతా ప్రథమ స్థానం యిస్తూ ఉండేవారు. అందువల్ల వారి ఆధిపత్యాన ఒక సభ అబ్దుల్లా సేఠ్‌గారి ఇంట్లో ఏర్పాటుచేశారు. ఆ సభలో ఫ్రాంచైజు బిల్లును ప్రతిఘటించాలని తీర్మానం చేయబడింది .

స్వచ్ఛంద సేవకుల దళం ఏర్పాటు చేయబడింది. నేటాలులో పుట్టి పెరిగిన భారతీయులు, భారతీయులగు క్రైస్తవులలో పిన్నవారినందరినీ యీ సభకు ఆహ్వానించారు. దర్బను కోర్టులో దుబాసీగా వున్న పాల్‌గారు, మిషన్ హైస్కూలు హెడ్‌మాష్టరు సుభాన్ గాడ్‌ఫ్రేగారు కూడా వచ్చి ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభకు భారతీయ క్రైస్తవులు ఎక్కువగా వచ్చి పాల్గొనుటకు వీరే కారకులు అయ్యారు. వారంతా స్వచ్ఛంద సేవకుల దళంలో చేరారు.

ఆ చుట్టుప్రక్కల గల వర్తకులలో చాలామంది స్వచ్ఛంద సేవకుల బృందంలో చేరారు. అట్టివారు చిరస్మరణీయులు. దావూద్ ముహమ్మద్, మహమ్మద్ కాసిం, కమర్‌ఉద్దీన్, ఆదంజీమియాఖాన్, ఏ.కొలందవేలు పెళ్ళై, సి.లచ్చీరాం, రంగస్వామి, పడియాచి, ఆమోదజీవ మొదలుగువారు వారిలో ముఖ్యులు. పార్సీ రుస్తుంజీ వుండనే వున్నారు. జోషీ, సరసీరాం మరియు దాదా అబ్దుల్లా కంపెనీ మొదలగు కంపెనీల గుమాస్తాలు స్వయం సేవకులుగా చేరారు. అందరికీ ఉపయోగపడే యిట్టి కార్యక్రమం వారికి క్రొత్త అందువల్ల అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ విధంగా సభకు ఆహ్వానింపబడటం, సభలో అంతా వచ్చి పాల్గొనడం, వారికి నూతనానుభవం. ఈ మహావిపత్తులో పెద్దలు, పిన్నలు, ధనికులు, పేదలు, సేవ్యులు, సేవకులు, హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, పారశీకులు, గుజరాతీలు, మద్రాసీలు, సింధీలు మొదలుగాగల భేదాలు, తరతమ భేదాలు అన్నీ తొలగిపోయాయి. అందరూ భారత దేశ బిడ్డలే. అందరూ సేవకులే. బిల్లు రెండవసారి ప్యాసు అయిందోలేదో మరి కాబోతున్నదో కూడా భారతీయులు తెలుసుకోవడం లేదనీ, యిందువల్ల భారతీయులు వోటుహక్కు అక్కర్లేదని తామే ప్రకటించుకుంటున్నారనీ నేటాలు అధికారులు ప్రసంగాలు చేయడం ప్రారంభించారు.

నేను సభలో యీ విషయం చెప్పాను. వెంటనే బిల్లు చర్చ ఆపవలసిందని అసెంబ్లీ ప్రెసిడెంటుకు తంతి పంపించాము. ప్రధానమంత్రి సర్ జాన్ రాబిన్సన్ గారికి కూడా ఇట్టి తంతినే మరొకదాన్ని పంపాము. మరో తంతి అబ్దుల్లా సేఠ్‌గారి మిత్రుడు ఎస్కాంబీగారికి పంపాము. అసెంబ్లీ ప్రెసిడెంటు మా తంతికి జవాబు పంపుతూ బిల్లుపై చర్చ రెండురోజులు ఆపబడిందని తెలియజేశాడు. అది చూచి మాకందరికీ ఆనందం కలిగింది.

శాసనసభకు పంపవలసిన పిటీషను వెంటనే తయారుచేశాము. దానికి మూడు నకళ్లు అవసరమైనాయి. పత్రికలకు పంపడానికి మరో ప్రతి కావలసి వచ్చింది. ఈ ప్రతులన్నిటిపైన వీలైనన్ని సంతకాలు చేయించాలని నిర్ణయించాం. ఇదంతా ఒక్క రాత్రిలో జరగాలి. ఇంగ్లీషు తెలిసిన స్వయం సేవకులు రాత్రంతా కూర్చొని నకళ్ళు వ్రాయసాగారు. నకళ్ళు వ్రాయడంలో మంచి నేర్పరియగు ఆర్ధర్ అను వృద్దుడు మొదటి పిటీషన్ ప్రతి సిద్ధం చేశాడు. దాన్ని ఒకరు చదువుతూ వుంటే ఒకేసారి అయిదుగురు అయిదు ప్రతులు వ్రాశారు. ఇలా అయిదు ప్రతులు తయారయ్యాయి. ఈ అర్జీ మీద అందరి సంతకాలు చేయించేందుకై చాలామంది తమ స్వంత బండ్లలోను, కిరాయిబండ్లలోను బయలుదేరి వెళ్లారు. త్వరగా యీ పని పూర్తి అయింది. వెంటనే అర్జీలు బట్వాడా చేయబడ్డాయి. పత్రికలలో సాభిప్రాయాలతో సహా అర్జీ ప్రకటించబడింది. శాసన సభలో చర్చ జరిగింది. శాసనాన్ని సమర్ధిస్తున్న వాళ్లు అర్జీ యందలి విషయాలకు సమాధానాలు యిచ్చారు. అవి కుంటి సమాధానాలు. ఏమి చెబితే ఏం? చివరికి బిల్లు ప్యాసయింది

ఇట్లా జరుగుతుందని మేము ముందే అనుకున్నాం. కాని యీ ఆందోళన నల్ల భారతీయుల్లో ఒక నూతన జీవం ఆవిర్భవించింది. మనమంతా ఒక్కటే. వ్యాపార విషయాలలో కొద్దిహక్కులు సాధించి రాజకీయంగా కూడా కొన్ని హక్కులు సాధించాలనే తహతహ భారతీయుల్లో బయలుదేరింది.

ఆ కాలంలో రిప్పన్‌గారు కాలనీల సెక్రటరీ. ఒక పెద్ద అర్జీ ఆయనకు పంపవలెనని నిర్ణయం గైకొనబడింది. అది అంత తేలికైన పనికాదు. ఒక్క రోజులో జరిగే పని కూడా కాదు. స్వచ్ఛంద సేవకులు మా దళంలో చేర్చుకోబడ్డారు. అందరూ తమకు చేతనైనంత సహాయం చేశారు.

అర్జీని తయారు చేయుటకు నేను చాలా శ్రమ పడవలసి వచ్చింది. అందుకు సంబంధించిన కాగితాలు, పుస్తకాలు పూర్తిగా చదివాను. హిందూ దేశంలో మాకు ఒక విధమైన ఓటు హక్కు వుంది కనుక నేటాలులో కూడా వోటు హక్కు ఉండితీరాలని నా వాదం. ఈ ఓటు హక్కును ఉపయోగించగల భారతీయుల జనాభా తక్కువేగనుక దాని నివ్వడం తేలికయే అని కూడా నా వాదం. ఈ విషయాన్ని మధ్య బిందువు చేశాను. పదిహేను రోజుల్లో పదివేల సంతకాలు చేయించాము. ఈ విధంగా జనం చేత సంతకాలు చేయించడం స్వయం సేవకులకు క్రొత్త. వాళ్లు రాష్ట్ర మంతట తిరిగి యింతమంది చేత సంతకాలు చేయించడం చిన్న విషయం కాదు “అర్జీలో గల విషయం తెలుసుకోకుండా సంతకం చేయకూడదు” అను నిబంధన మేము పెట్టినందున అర్జీలో గల విషయాన్ని విడమర్చి చెప్పగల స్వయం సేవకులనే యీ కార్యానికి ఎన్నిక చేసి పంపవలసి వచ్చింది. అక్కడ గ్రామాలు దూర దూరాన వున్నాయి. వెళ్లి సంతకాలు చేయించాలంటే ఎంతో శ్రమపడాలి. అట్టి శ్రమకు పూనుకునే స్వయం సేవకులు లభించారు. వారంతా తమకు అప్పగించిన కార్యాన్ని ఉత్సాహంతో పూర్తిచేశారు. ఈ పంక్తులు వ్రాస్తున్నప్పుడు నా కండ్ల ఎదుట దావూద్ మహమ్మద్, సేఠ్ రుస్తుంజీ, అదంజీమియాఖాన్, ఆమోదజీవ మొదలగువారు కనబడుతున్నారు. అందరి కన్న ఎక్కువ సంతకాలు చేయించుకొని వచ్చిన దావూద్ సేఠ్ రోజంతా సంతకాల కోసం బండిలోనే ప్రయాణం చేశారు. ఇది అమూల్యమైన సేవ. దీనికోసం ఒక్కరు కూడా దమ్మిడీ పుచ్చుకోలేదు. అంతా తమ ఖర్చులు తామే భరించారు. దాదా అబ్దుల్లా గారి గృహం కార్యస్థానమే గాక ధర్మసత్రం కూడా అయింది. నాకు సహకరించిన మిత్రులందరి భోజనం వారి యింట్లోనే, మొత్తం మీద అందరూ ఎన్నో వ్యయప్రయాసలకు వోర్చి కార్యాన్ని సాధించారు.

చివరికి అర్జీ దాఖలు చేశాం. వెయ్యి ప్రతులు ముద్రించి పంచి పెట్టాం. భారతదేశ ప్రజలకు యీ దరఖాస్తు వల్ల నేటాలుతో ప్రధమ పరిచయ కలిగింది. నాకు తెలిసిన పత్రికలకు, ప్రసిద్ధులకు పత్రికా విలేఖరులకు కూడా ఆ అర్జీ ప్రతులు పంపించాను.

టైమ్సు ఆఫ్ ఇండియా పత్రిక భారతీయుల కోరికలను సమర్ధిస్తూ సంపాదకీయ వ్యాసం వ్రాసింది. ఇంగ్లాండులో అన్ని తెగల పత్రికలకు నకళ్లు పంపాం. లండన్ టైమ్సు పత్రిక కూడా మా వాదాన్ని సమర్థిస్తూ వ్రాసింది. ఇక బిల్లు మంజూరు కాదని మాకు ఆశ కలిగింది.

నేను నేటాలు నుండి కదలడానికి వీలు లేకపోయింది. భారతీయ మిత్రులంతా మీరు యిక్కడే వుండమని ప్రార్ధించారు. నాకు గల కష్టాలు వారికి వివరించి చెప్పాను. ఇతరుల ఖర్చుల మీద ఆధారపడి వుండకూడదని నిర్ణయానికి వచ్చాను. ప్రత్యేకంగా వుండడానికి ఇల్లు అవసరమని భావించాను. మంచి చోట ఒక ఇల్లు తీసుకోవాలని, బారిస్టరు హోదాకు తగినట్లుగా ఇల్లు వుండాలనీ, అప్పుడే నా సంఘానికి గౌరవం తేగలుగుతాననీ నిర్ణయానికి వచ్చాను. అయితే అట్టి గృహానికి సాలీనా మూడు వందల పౌండ్లు ఖర్చువుతుందని తేలింది. అంత రాబడికి అవసరమయ్యే కేసులిచ్చేందుకు హామీ పడితేనే అక్కడ వుంటానని వాళ్లకు తెలియజేశాను. “ప్రజాహిత కార్యాలకు మీరు చెప్పినంత పైకం యిస్తాం. అంత సొమ్ము మేము తేలికగా వసూలు చేయగలం. మీ ప్రాక్టీసుకు, దీనికి సంబంధం పెట్టవద్దు.” అని వాళ్లు అన్నారు. “అట్లా వీల్లేదు. నేను ప్రజాహిత కార్యాలు నిర్వహిస్తూ అందు నిమిత్తం మీ దగ్గర డబ్బు తీసుకోను. ఇందుకు బారిస్టరు తెలివితేటలు పనిచేయనవసరం లేదు. మీ చేత పనిచేయించుతూ, నాకోసం మీదగ్గర డబ్బు తీసుకోవడమా? సార్వజనిక కార్యాలకు జనం దగ్గర చందాలు పుచ్చుకోవలసి వస్తుంది. అట్టి ధర్మ నిధి నుండి నేను జీతం పుచ్చుకుంటూ, మిమ్మల్ని చందాలు ఎలా కోరగలను? అలా చేస్తే చివరికి బండి ఆగిపోతుంది. ధర్మకార్యాలకు సాలుకు మూడు వందల పౌండ్ల కంటే ఎక్కువ కావలసి వస్తుంది” అని చెప్పాను.

“కొంతకాలం నుండి మిమ్మల్ని చూస్తున్నాం. మీ సంగతి మాకు తెలిసింది. కావలసిన దానికంటే ఒక్క కానీ కూడా మీరు ఎక్కువ పుచ్చుకోరు. మేము మిమ్మల్ని యిక్కడ ఆపినప్పుడు మీకు అవసరమయ్యే ధనం యివ్వవద్దా?”

“ప్రేమతోను, ఉత్సాహంతోను మీరు యిలా అంటున్నారు. ఈ ప్రేమ, యీ ఉత్సాహం స్థిరంగా వుంటాయని భావించగలమా? మిత్రుని వలె, సేవకుని వలె కొన్ని సమయాల్లో నేను కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. అప్పుడు మీ ఆదరణకు ఎంతగా పాత్రుడనవగలనో ఆ భగవంతునికే ఎరుక. ధర్మకార్యాలకు మీ దగ్గర భృతి తీసుకోవడం కల్ల. అందువల్ల మీ కోర్టు వ్యవహారాలు నాకు అప్పగించండి చాలు. దీనివల్ల మీకు యిబ్బంది కలుగునని నాకు తెలుసు. నేను తెల్ల బారిస్టరును కాను! కోర్టు నన్నెంత వరకు ఆదరిస్తుందో కూడా తెలియదు. పైగా లాయరుగా నేను ఎంత వరకు పనికివస్తానో కూడా తెలియదు. నాకు రిటైనర్లు (ఇంకొకరి కేసు పుచ్చుకోకుండా తమకేసుకోసం పని చేయించుకొనుటకు బారిస్టరు మొదలగు వారికి ముందుగా యిచ్చే ఫీజు) ఇచ్చినందున మీకు ఇబ్బందులు కలగవచ్చు. అయినా ఆ కొద్ది సొమ్ము కూడ ప్రజా సేవకు ప్రతిఫలమే అవుతుంది.” అని అన్నాను.

ఈ చర్చానంతరం 20 మంది వర్తకులు ఒక సంవత్సరం వరకు నాకు రిటైనర్లు యిచ్చేందుకు సిద్ధపడ్డారు. నేటాలు విడిచి వెళ్లేటప్పుడు దాదా అబ్దుల్లా సేఠ్ నాకు కానుకగా కొంత సొమ్ము యివ్వదలిచాడు. ఆ సొమ్ముతో నాకు కావలసిన కుర్చీలు, బెంచీలు మొదలగునవి కొనిపెట్టాడు. ఈ విధంగా నేను నేటాలులో వుండిపోయాను.