Jump to content

సత్యశోధన/రెండవభాగం/20. బాలసుందరం

వికీసోర్స్ నుండి

20. బాలసుందరం

“యాదృశీ భావనీ యత్ర సిద్ధిర్బవతితాదృశీ” (ఎవరికి ఎటువంటి తలంపు కలుగునో అతనికి అటువంటి ఫలం కలుగును) అనునది అనేక విషయాలలో నాకు అనుభవం అయింది. పేదలకు సాయపడటం నాకు ఎంతో యిష్టం. ఆ అభిలాష నన్ను ఆ పేదలతో కలిపి వాళ్లతో మంచి సంబంధం కలిగించింది.

నేటాలు కాంగ్రెస్‌లో అక్కడి భారతీయులు, ఉద్యోగులు సభ్యులుగా చేరారు. కాని గిరిమిటియాలు మాత్రం అందు చేరలేదు. “కాంగ్రెస్ యింకావారి పరం కాలేదు. వాళ్లు చందాలు చెల్లించి మెంబర్లుగా చేరలేదు. మరి కాంగ్రెసు అట్టి వాళ్లకు సాయం చేయాలి! అప్పుడు వాళ్లంతా దాంట్లో తప్పక చేరతారు” అని అనుకుంటూ వుండగా ఒక ఘట్టం అనుకోకుండా ఒక పర్యాయం జరిగింది. ఆ ఘట్టం అప్పుడే జరుగుతుందని నేను గాని, కాంగ్రెస్ వాళ్లు గాని ఎవ్వరు ఊహించలేదు. నేను ప్లీడరు వృత్తి చేపట్టి అప్పటికి మూడు నాలుగు నెలల కాలం గడిచింది. అప్పటికి కాంగ్రెసుకు యింకా శైశవం తీరలేదు. ఒకనాడు ఒక తమిళుడు తలగుడ్డ తీసి చేతబుచ్చుకొని ఏడుస్తూ వచ్చి నా ముందు నిలబడ్డాడు. అతడు చినిగిపోయిన బట్టలు ధరించి యున్నాడు. అతని శరీరం వణుకుతున్నది. ఎదటి రెండు పళ్లు ఊడిపోయాయి. ఆ పళ్ల చిగుళ్ల నుండి రక్తం కారుతున్నది. యజమాని అతణ్ణి చావబాదాడన్నమాట. నా గుమాస్తా తమిళుడు. అతని ద్వారా ఆ వచ్చిన వ్యక్తి కథంతా తెలుసుకున్నాను. అతని పేరు బాలసుందరం. దర్బలులో ప్రసిద్ధుడైన ఒక తెల్ల యజమాని దగ్గర యితడు ఇండెంచెర్డు కూలి అన్నమాట. యజమానికి ఏదో మాట మీద కోపం వచ్చింది. ఒళ్లు తెలియకుండా బాలసుందరాన్ని బాదాడు. ఆ దెబ్బలకు బాలసుందరం ఎదుటి రెండు పళ్లు ఊడిపోయాయి.

బాలసుందరాన్ని వెంటనే డాక్టరు దగ్గరకు పంపించాను. అప్పుడక్కడ తెల్ల డాక్టరు వున్నారు. బాలసుందరానికి తగిలిన దెబ్బల్ని గురించి డాక్టరు సర్టిఫికెట్టు తీసుకొని మేజిస్ట్రేటు వద్ద అఫిడవిట్టు దాఖలు చేయించాను. మేజిస్ట్రేటు అఫిడవిట్టు చదివి కోపంతో వెంటనే ఆ యజమానికి సమన్లు పంపించాడు.

యజమానికి శిక్ష వేయించడం నా లక్ష్యం కాదు. ఎలాగైనా బాలసుందరాన్ని ఆ యజమాని బారినుండి తప్పించాలన్నదే నా లక్ష్యం. ఇండించెర్డ కూలీలను గురించి చట్టమంతా క్షుణ్ణంగా చదివాను. ఏ కూలివాడైనా చెప్పకుండా లేచి వెళ్లిపోతే యజమాని సివిల్ కోర్టులో దావా వేయవచ్చు. ఇండించెర్డు కూలివాడు అలా లేచి వెళ్లిపోతే యజమాని పూర్తిగా మరో చర్య గైకొనవచ్చు. వానిమీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు. నేరం రుజూ అయితే కూలీకి శిక్ష కూడా పడవచ్చు. సర్ విలియం హంటరుగారు “ఇండించెర్డు కూలిపని, బానిసత్వం ఒక్కటే” అని అన్నారు. యజమానికి బానిస ఏవిధంగా ఆస్థిగా పరిగణింపబడతాడో అదే విధంగా ఇండించెర్డు కూలివాడు కూడా యజమాని ఆస్థిగా పరిగణింపబడతాడని దాని అర్ధం.

బాలసుందరం విడుదలకు రెండే రెండు మార్గాలు వున్నాయి. ఇండెంచెర్డు కూలివాళ్ళకు ప్రొటెక్టరు అనగా రక్షకుడు ఒకడు వుంటాడు. అతనితో చెప్పి కట్టడినుండి తప్పించవచ్చు. లేదా మరొక యజమాని దగ్గరకు బదలీ చేయించవచ్చు. ఒప్పుదల మీద బాలసుందరాన్ని యజమాని చేతనే విడుదల చేయించవచ్చు. ఇదంతా ఆలోచించి ఆ యజమానితో “మీ మీద నేరం మోపి మిమ్ము శిక్షింపచేయడం నా లక్ష్యం కాదు. మీరు అతణ్ణి క్రూరంగా కొట్టారు. మీరు ఆ విషయం గ్రహించేయుండవచ్చు. మీరు కరారునామాను మరొకరికి మార్చండి చాలు” అని అన్నాను.

నా మాటలు వినిన వెంటనే అతడు అందుకు అంగీకరించాడు. తరువాత నేను ప్రొటెక్టరును చూచాను. అతడు కూడా అంగీకరించాడు. కాని క్రొత్త యజమాని కావాలి కదా!

ఒక తెల్ల యజమాని కోసం వెతికాము. అప్పుడు భారతీయులు ఇండెంచెర్డు కూలీలను భరించే స్థితిలో లేరు. అప్పటికి నాకు కొద్దిమంది తెల్లవారితో పరిచయం ఏర్పడింది. ఒకరికి యీ సంగతి తెలియజేశాను. అతడు దయతో ఒప్పుకున్నాడు. నేనాతనికి కృతజ్ఞతలు తెలియజేశాను. మేజిస్ట్రేటు బాలసుందరం అను కూలీ తన యజమానిపై నేరం మోపి తన కరారునామాను మరొకరికి బదలీ చేయుటకు అంగీకరించారని రికార్డు చేశాడు.

బాలసుందరం కేసు సంగతి కూలీలందరికీ తెలిసింది. నాకు “గిరిమిటియా బంధువు” అని పేరు వచ్చింది. నాకీ సంబంధం వల్ల ఎంతో ఆనందం కలిగింది. ఇక ప్రతిరోజు మా ఆఫీసుకు గిరిమిటియాలు అపరిమితంగా రాసాగారు. వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు నాకు మంచి అవకాశం లభించింది.

ఈ కేసు విషయం దూరాన ఉన్న మద్రాసు రాష్ట్రంలో కూడా ప్రతిధ్వనించింది. మద్రాసు నుంచి నేటాలు వచ్చిన గిరిమిటియాలు తమ గిరిమిటియా సోదరుల వల్ల యీ విషయం తెలుసుకున్నారు. ఈ కేసు గొప్పదేమీకాదు. కాని నేటాలులో తమకు న్యాయం సాధించగల వాడొకడు బయల్దేరాడను వార్త గిరిమిటియాలకు ఉత్సాహం కలిగించింది.

బాలసుందరం నా దగ్గరకు వచ్చినప్పుడు తలపాగా తీసి చేత పట్టుకొని వున్నాడని నేను ముందే తెలియజేశాను. అసలు ఈ దృశ్యంలో ఒక విచిత్రమైన కరుణరసం మరియు నైచ్యం నిండి వున్నాయి. జడ్జి నా తలపాగాను తీసివేయమన్నప్పటి ఘట్టాన్ని గురించి మొదట వ్రాశాను. తెల్లవాణ్ణి చూడటానికి వెళ్లినప్పుడు గిరిమిటియా గాని, క్రొత్త భారతీయుడు గాని తన తలపాగా తీసి చేతులతో పట్టుకోవాలి. రెండు చేతులు జోడించి నమస్కరించినా అది తక్కువే. బాలసుందరం నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అలాగే చేయాలని అనుకున్నాడు. ఈ రకమైన చర్యను చూడటం నాకు యిదే ప్రథమం. ఈ చర్య నాకు చిన్నతనం అనిపించింది. నేను బాలసుందరాన్ని తలపాగా చుట్టుకోమని చెప్పాను. అతడు ఎంతో సంకోచిస్తూ పాగాను తలకు చుట్టుకున్నాడు. అయితే అప్పుడు అతడి ముఖంమీద సంతోషం తొంగిచూచింది.

తను తోటి మానవులను నీచపరచడం వల్ల తమకేదో గౌరవం చేకూరుతుందని భావించేవారి ఉద్దేశం ఏమిటో నాకు బోధపడదు. అట్టి తత్వం సరికాదని నా నిశ్చితాభిప్రాయం.