సత్యశోధన/మొదటిభాగం/9. పితృ నిర్యాణం - నా వల్ల జరిగిన మహాపరాధం

వికీసోర్స్ నుండి

9. పితృ నిర్యాణం - నా వల్ల జరిగిన మహాపరాధం

అప్పుడు నాకు పదహారో ఏడు. మా తండ్రిగారు రాచకురుపుతో బాధపడుతూ మంచం పట్టారని పాఠకులకు తెలుసు. మా అమ్మగారు, ఒక పాత నౌకరు, నేను మా తండ్రిగారికి ముఖ్య పరిచారకులం. నర్సుపని, అనగా కట్టు విప్పి తిరిగి కట్టు కట్టడం, మందులు ఇవ్వడం, అవసరమైనప్పుడు మందులు నూరడం, మందులు కలపడం మొదలగు పనులు నాకు అప్పగించారు. ప్రతి రాత్రి వారి కాళ్ళు పిసికి, వారు చాలు అన్నప్పుడు విరమించేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు వారు నిద్రించేంతవరకు కాళ్ళు పిసుకుతూ వుండేవాణ్ణి. ఈ విధంగా తండ్రికి సేవ చేయడం నాకు ఎంతో ఇష్టంగా వుండేది. ఈ విషయంలో నేను ఎప్పుడూ ఏమరచి వుండలేదని గుర్తు. నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు అవసరమైన సమయం మినహా, మిగతా సమయమంతా బడికి వెళ్ళిరావడం, తండ్రికి సేవ చేయడంలో గడుపుతూ వుండేవాణ్ణి. నాకు మా తండ్రి సెలవు యిచ్చినప్పుడు వారికి కొంచెం నయంగా వున్నప్పుడు మాత్రమే నేను సాయంత్రం వాహ్యాళికి వెళుతూ వుండేవాణ్ణి. ఆ ఏడే నా భార్యకు నెల తప్పింది. యిప్పుడు ఆ విషయం తలచుకుంటే సిగ్గువేస్తుంది. నేను విద్యార్థి దశలో వుండికూడా బ్రహ్మచర్యాన్ని పాటించలేదు. నాకు కలిగిన సిగ్గుకు అదొక కారణం. విద్యా వ్యాసంగం నా విధి. పైగా చిన్నప్పటి నుంచి శ్రవణుడంటే నాకు గురి. పితృసేవ అంటే నాకు ఆసక్తి. అయినా నా భోగవాంఛ వీటన్నింటినీ మించిపోయిందన్నమాట. నా సిగ్గుకు యిది రెండో కారణం. ప్రతిరోజు రాత్రిపూట నా చేతులు మా తండ్రి పాదాలు వత్తుతూ వున్నా నా మనస్సు మాత్రం పడకగది మీద కేంద్రీకరించి యుండేది. ధర్మశాస్త్రం, వైద్యశాస్త్రం, లోకజ్ఞానం మూడింటి దృష్ట్యా స్త్రీ సంగమం నిషేధించబడిన సమయంలో నా మనఃస్థితి యిలా వుండేది. వదిలి పెడితే చాలు వెళదామని తొందరగా వుండేది. అనుమతి లభించగానే మా తండ్రి గారికి నమస్కరించి తిన్నగా పడకగదికి వడివడిగా వెళ్ళేవాణ్ణి. సరిగ్గా ఆ రోజుల్లోనే మతండ్రిగారికి క్రమక్రమంగా వ్యాధి ఎక్కువ కాసాగింది. ఆయుర్వేద వైద్యుల పూతలు, హకీముల పట్టీలు, నాటు వైద్యుల ఔషధాలు అన్నీ పూర్తి అయ్యాయి. ఒక అలోపతీ డాక్టరు కూడా వచ్చి తన శక్తిని వినియోగించి చూచాడు. శస్త్ర చికిత్స తప్ప వేరే మార్గం లేదని డాక్టరు చెప్పివేశాడు. కాని అందుకు మా కుటుంబ వైద్యుడు అంగీకరించలేదు. మా వైద్యుడు సమర్థుడు, సుప్రసిద్ధుడు కూడా. అందువల్ల ఆయన మాట నెగ్గింది. శస్త్రచికిత్స జరుగలేదు. అందుకోసం కొన్న మందులన్నీ మూలబడ్డాయి. కుటుంబవైద్యుడు శస్త్రచికిత్సకు అంగీకరించియుంటే వ్రణం నయమైపోయేదని నా తలంపు. ఆ శస్త్రచికిత్స బొంబాయిలో ప్రసిద్ధుడైన ఒక గొప్ప డాక్టరు చేత చేయించాలని భావించాం. కాని ఈశ్వరేచ్ఛ అనుకూలం కాలేదు. మృత్యువు నెత్తిమీదకు వచ్చిపడినప్పుడు మంచి ఉపాయం ఎవ్వరికీ తోచదుకదా! తరువాత శస్త్రచికిత్స పరికరాలన్నింటిని వెంట పెట్టుకుని మా తండ్రిగారు బొంబాయి నుండి ఇంటికి వచ్చేశారు. ఆయనకు యిక జీవించననే విశ్వాసం కలిగింది. క్రమంగా ఆయన నీరసించిపోయారు. మంచంమీదనే అన్ని పనులు జరగవలసిన స్థితి ఏర్పడింది. కాని మా తండ్రిగారు అందుకు అంగీకరించలేదు. పట్టుపట్టి చివరివరకు ఏదో విధంగా లేచి అవతలకి వెళుతూ వుండేవారు. బహిర్శుద్ధి విషయంలో వైష్ణవ ధర్మంలో విధులు అంత కఠినంగా వుండేవి. అట్టి శుద్ధి అవసరమే, కాని రోగికి బాధ కలగకుండా, మంచం మీద మైలపడకుండ, పరిశుభ్రంగా నిత్యకృత్యాలు, మంచం మీదనే ఎలా జరపవచ్చునో పాశ్చాత్య వైద్యశాస్త్రం మనకు నేర్పింది. ఈ విధమైన పారిశుద్ధ్యాన్నే నేను వైష్ణవ ధర్మమని అంటాను. కాని రోగతీవ్రతలో సైతం మా తండ్రిగారు స్నానాదుల కోసం మంచం దిగవలసిందేనని పట్టుబట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది. లోలోపల వారిని మెచ్చుకునేవాణ్ణి. ఒకనాడు ఆ కాళరాత్రి రానే వచ్చింది. మా పినతండ్రి రాజకోటలో వుండేవారు. మా తండ్రి అపాయస్థితిలో వున్నారని తెలిసి ఆయన రాజకోటకు వచ్చారని నాకు కొద్దిగా గుర్తు. వారిరువురి మధ్య సోదర ప్రేమ అధికంగా వుండేది. మా పినతండ్రి పగలంతా మా తండ్రిపడక దగ్గరే కూర్చుండి, రాత్రిపూట మమ్మల్నందరినీ నిద్రపొమ్మని పంపివేసేవాడు. తాను మా తండ్రి మంచం ప్రక్కనే పడుకునేవాడు. అది చివరిరాత్రి అని ఎవ్వరం ఊహించలేదు. అయితే ఎప్పుడూ భయం భయంగా వుండేది. ఆ రాత్రి 10.30 లేదా 11గంటలైంది. నేను మా తండ్రిగారి కాళ్ళు పిసుకుతూ వున్నాను. “నువు వెళ్ళు నేను కూర్చుంటాను” అని మా పినతండ్రి అన్నారు. ఆ మాటలు విని నేను సంతోషించాను. తిన్నగా పడకగదిలోకి వెళ్ళిపోయాను. పాపం నా భార్య గాఢనిద్రలో వుంది. నేను ఆమెను నిద్రపోనిస్తానా? ఆమెను లేపాను. అయిదు ఆరు నిమిషాల తరువాత మా నౌకరు వచ్చి దబదబ తలుపు తట్టాడు. కంగారు పడిపోయాను. నాన్నగారికి జబ్బు పెరిగిందని బిగ్గరగా అన్నాడు. బాగా జబ్బులో వున్నారను విషయం నాకు తెలుసు అందువల్ల జబ్బు పెరిగందనేసరికి విషయం నాకు బోధపడింది. పక్క మీద నుంచి క్రిందికి దూకాను.

“సరిగా చెప్పు ఏమైంది?”

“తండ్రిగారు చనిపోయారు” అని సమాధానం వచ్చింది. ఆ మట విని క్రుంగిపోయాను. పశ్చాత్తాపపడితే ప్రయోజనం ఏమిటి? ఎంతో విచారం కలిగింది. తండ్రిగారి దగ్గరికి పరుగెత్తాను. భోగవాంఛ నన్ను అంధుణ్ణి చేసింది. అందువల్లే చివరి క్షణంలో మా తండ్రిగారి శాశ్వత ప్రయాణ సమయంలో నేను వారి దగ్గర వుండలేక పోయాను. వారి వేదనలో పాలుపంచుకోలేకపోయాను. ఆ అదృష్టం మా పినతండ్రి గారికి దక్కింది. మా పినతండ్రి తన అన్నగారికి పరమ భక్తుడు. అందువల్ల ఆయనకే అంత్యకాలంలో సేవ చేసే అదృష్టం లభించింది. మరణం ఆసన్నమైందని మా తండ్రి గ్రహించారు. సైగ చేసి కలం, కాగితం తెప్పించి దాని మీద ఏర్పాటు చేయండి అని వ్రాశారు. తరువాత తన దండకు కట్టియున్న తాయిత్తును, మెడలో వున్న బంగారపు తులసీ తావళాన్ని తీసి క్రింద పెట్టారు. వెంటనే కన్నుమూశారు. కన్న తండ్రి ప్రాణం పోతున్నప్పుడు కూడా నా భార్యపై కలిగిన మోహం నాకు మాయరాని మచ్చ తెచ్చింది, నాకు తల్లి, తండ్రి యెడగల భక్తి అపారం. వారికోసం నా సర్వస్వం ధారపోయగలను. కాని అందు యింకా కొరత వుందని ఈ ఘట్టం వల్ల తేలింది. ఏ సమయంలో నేను మేల్కొని వుండాలో ఆ సమయంలో నా మనస్సు భోగవాంఛలకు లోబడింది. అందువల్ల ఎన్నటికీ క్షమించరాని దోషం చేశాను. ఏకపత్నీవ్రతుణ్ణి అయినా కామాంధుణ్ణి అని భావించక తప్పదు. కామవాంఛను అదుపులో పెట్టడానికి చాలాకాలం పట్టింది. దాన్ని అదుపులో పెట్టుకునేలోపున అనేక గండాలు గడిచాయి.

రెండు కారణాల వల్ల నేను సిగ్గుపడవలసి వచ్చింది. ఈ ప్రకరణం ముగించే ముందు మరో విషయం వివరించడం అవసరం. తరువాత నా భార్య ప్రసవించింది. శిశువు మూడు నాలుగు రోజుల కంటె మించి బ్రతకలేదు. చేసిన తప్పుకు శిక్షపడినట్లే కదా! బాల్య దంపతులందరికి యిది ఒక హెచ్చరిక వంటిది. దాన్ని గమనించి బాల్యంలో పెండ్లి అయిన దంపతులు మేల్కొందురుగాక.