సత్యశోధన/మొదటిభాగం/10. మతంతో పరిచయం
10. మతంతో పరిచయం
ఆరవ ఏట నుంచి ప్రారంభించి పదహారు సంవత్సరాల వయస్సు వచ్చేదాక విద్యాధ్యయనం కావించాను. కాని పాఠశాలలో అప్పటిదాకా మతాన్ని గురించిన బోధ జరుగలేదు. కాని అక్కడి వాతావరణం వల్ల అట్టి కొత్త శిక్షణ లభించింది. ఇక్కడ ధర్మం అంటే ఆత్మబోధ లేక ఆత్మజ్ఞానమను విశాల అర్థాన్ని పాఠకులు గ్రహించుదురు గాక. వైష్ణవ సంప్రదాయంలో జన్మించడం వల్ల దేవాలయం వెళ్ళే అవకాశం నాకు తరచుగా లభిస్తూ ఉండేది. కాని ఆ కోవెల అంటే నాకు శ్రద్ధ కలుగలేదు. దాని వైభవం నాకు బోధపడలేదు. అచట కొంత అవినీతి జరుగుతున్నదని విని దాని యెడ ఉదాసీనత ఏర్పడింది.
అయితే నాకు అక్కడ అబ్బని విశేషం ఒకటి మా కుటుంబమందలి దాసివల్ల అబ్బింది. ఆమె నా యెడ చూపించిన వాత్సల్యం ఇప్పటికీ నాకు గుర్తు వున్నది. భూత ప్రేతాదులంటే నాకు భయం అని మొదట వ్రాశాను. మా కుటుంబదాసి పేరు రంభ. ఆమె భూత ప్రేతాదుల భయానికి రామ నామ స్మరణం మంచి మందు అని చెప్పింది. ఆమె చెప్పిన మందు మీద కంటే ఆమె మీద నాకు అమిత నమ్మకం ఏర్పడింది. దానితో అప్పటినుండి భూత ప్రేతాదుల భయం పోయేందుకై రామనామ జపం ప్రారంభించాను. ఆ జపం ఎక్కువ కాలం చేయలేకపోయినా చిన్ననాట హృదయంలో నాటుకున్న రామనామమును బీజం తరువాత కూడో చెక్కు చెదరకుండా ఆలాగే హృదయంలో వుండిపోయింది. ఈనాడు రామనామం నా పాలిట దివ్యౌషధం. ఆనాడు అది రంభ చాటిన విత్తనమే.
ఆ రోజుల్లో మా పినతండ్రి కొడుకు యొక్క సాహచర్యం మాకు లభించింది. అతడు రామభక్తుడు. మా అన్నదమ్ములిద్దరికీ అతడు రామరక్షాస్తోత్రం నేర్పే ఏర్పాటు చేశాడు. ఆ స్తోత్రం మేము కంఠోపాఠం చేశాము. ప్రతిరోజు ప్రాతఃకాలం స్నానం చేసిన తరువాత రామనామ స్తోత్ర జపం చేయడం అలవాటు చేసుకున్నాం. పోరుబందరులో వున్నంత కాలం మా జపం నిర్విఘ్నంగా సాగింది. రాజకోట వాతావరణం వల్ల కొంత సడలిపోయింది. ఈ జపం మీద నాకు శ్రద్ధ కలుగలేదు. మా పినతండ్రి కుమారుని యెడగల ఆదరభావం వల్ల రామరక్షాస్తోత్రం శుద్ధమైన ఉచ్చారణతో సాగుతూ వుండేది.
రామాయణ పారాయణం ప్రభావం నా మీద అమితంగా పడింది. మా తండ్రి గారు జబ్బు పడ్డప్పుడు కొంతకాలం పోరుబందరులో ఉన్నాం. అక్కడ గల రామాలయంలో రోజూ రాత్రిపూట రామాయణం వింటూ వుండేవాణ్ణి, రామభద్రుని పరమభక్తుడు భీలేశ్వర్‌కు చెందిన లాఘాముహారాజ్ రామాయణం వినిపిస్తూ వుండేవాడు. ఆయనను కుష్టురోగం పట్టుకుందట. ఆ రోగానికి ఆయన ఏ మందూ వాడలేదు. భీలేశ్వర్‌లో గల మహా శివునికి బిల్వ పత్రాలతో భక్తులు పూజ చేస్తూ వుండేవారు. ఆ విధంగా శివుని స్పర్శ పొందిన బిల్వపత్రాల్ని ఆయన కుష్ఠు సోకిన అవయవాలకు కట్టుకునేవాడు. రామనామ జపం చేస్తూ వుండేవాడు. దానితో అతని కుష్ఠురోగం పూర్తిగా నయమైపోయిందని ఆబాలగోపాలం చెప్పుకునేవారు. అది నిజమో కాదో మాకైతే తెలియదు. కాని ఆయన నోట రామాయణం వినేవారమంతా అది నిజమేనని నమ్ముతూ వుండేవారం. రామాయణగానం ప్రారంభించినప్పుడు ఆయన ఆరోగ్యంగా వున్నాడు. ఆయన కంఠం మధురంగా ఉన్నది. ఆయన రామాయణానికి సంబంధించిన దోహాచౌపాయిలు పాడుతూ వాటి అర్థం చెపుతూ అందులో తను లీనమైపోయేవాడు. శ్రోతలు తన్మయత్వంతో ఆయన గానం వింటూ వుండే వారు. అప్పుడు నాకు పదమూడు సంవత్సరాల వయస్సు. ఆయన రామకథ వినిపిస్తూ వుంటే ఆనందంతో వింటూ వుండేవాణ్ణి, యిప్పటికీ నాకు ఆ విషయం గుర్తు వుంది. ఆనాటి రామాయణ శ్రవణం వల్ల నాకు రామాయణం యెడ ప్రేమ అంకురించిన మాట నిజం. తులసీదాసు రామాయణం సర్వోత్తమమైన గ్రంధం.
కొద్దినెలల తరువాత మేము రాజకోటకు వచ్చాము. అక్కడ రామాయణ కాలక్షేపానికి అవకాశం చిక్కలేదు. కాని ప్రతి ఏకాదశి నాడు భాగవత పారాయణం జరుగుతూ వుండేది. నేను అప్పుడప్పుడు భాగవతం విందామని వెళ్ళేవాణ్ణి. ఆ పౌరాణికుడు జనాన్ని ఆకర్షించలేకపోయాడు. భాగవతం భక్తి ప్రధానమైనదని తెలుసుకున్నాను. నేను దాన్ని గుజరాతీ భాషలో తన్మయుడనై చదివాను. మూడు వారాలపాటు నేను ఉపవాసదీక్ష వహించిన సమయంలో పండిత మదన మోహన మాలవ్యాగారు మూలంలోని కొన్ని ఘట్టాలు చదివి వినిపించారు. మాలవ్యావంటి మహాభక్తుని నోట భాగవతం వినే అదృష్టం నాకు కలిగింది. అట్టి అదృష్టం బాల్యంలోనే కలిగియుంటే దానిపై గాఢమైన ప్రీతి కలిగియుండేది కదా అని అనుకున్నాను. బాల్యంలో శుభాశుభ సంస్కారాల ప్రభావం అమితంగా హృదయం మీద పడుతుంది. అందువల్ల బాల్యకాలంలో అటువంటి గ్రంథాలు ఎక్కువగా వినలేక పోతినను విచారం నాకు కలుగుతూ వుంటుంది.
రాజకోటలో వున్నప్పుడు సర్వమత సంప్రదాయాలయెడ సమత్వభావం సునాయాసంగా ఏర్పడింది. హిందూమతమందలి అన్ని సంప్రదాయాల యెడ నాకు ఆదరభావం కలిగింది. మా తల్లిదండ్రులు ఇక్కడ రామాలయానికి శివాలయానికి వెళుతూవుండేవారు. మమ్మల్ని కూడా తమతో పాటు అక్కడికి తీసుకుని వెళుతూవుండేవారు. అప్పుడప్పుడు మమ్మల్ని పంపుతూ వుండేవారు. జైన ధర్మాచార్యులు తరచుగా మా తండ్రిగారి దగ్గరకు వస్తూవుండేవారు. వారు మా తండ్రిగారితో ధర్మాన్ని గురించి, తదితర విషయాల్ని గురించి చర్చిస్తూవుండేవారు. ఇంతేగాక మా తండ్రికి మహమ్మదీయులు, పారశీకులు చాలామంది మిత్రులు వుండేవారు. వారు తమ తమ మతాల్ని గురించి చెపుతూ వుండేవారు. మా తండ్రి వారి మాటలు శ్రద్ధతో వింటూ వుండేవారు. మా తండ్రిగారికి ‘నర్సు’ గా వున్నందువల్ల వాళ్ళ మాటలు వినే అవకాశం నాకు లభిస్తూ వుండేది. ఈ విధంగా వివిధ మతాలను గురించిన విషయాలు వింటూ ఉండడం వలన వాటన్నిటియెడ సమత్వభావం నాకు కలిగింది. అందుకు ఆ చర్చలు దోహదం చేశాయి.
ఇక క్రైస్తవ మతం మాత్రమే మిగిలింది. దాని యెడ నాకు అభిరుచి కలుగలేదు. పైగా అరుచి ఏర్పడింది. ఆ రోజుల్లో క్రైస్తవమత బోధకులు కొందరు మా హైస్కూలు దగ్గర ఒక మూల నిలబడి హిందువుల్ని వారి దేవుళ్ళను నిందిస్తూ ఉపన్యాసాలు చేస్తూ వుండేవారు. నేను ఆ నిందను సహించలేకపోయేవాణ్ణి. వాళ్ళను వినడానికి నేను ఒక పర్యాయం మాత్రమే అక్కడ నిలబడ్డాను. ఇక నిలబడి వినవలసిన అవసరం లేకుండాపోయింది. ఆ రోజుల్లోనే సుప్రసిద్ధుడగు ఒక హిందువు క్రైస్తవమతంలో కలిసిపోయాడనీ, అతడు గోమాంసం తినవలసివచ్చిందనీ, మద్యం సేవించవలసి వచ్చిందని, వేషం కూడా మార్చవలసి వచ్చిందనీ తరువాత హ్యాటు, బూటు, కోటు వగైరా పాశ్చాత్య దుస్తులు ధరించి తిరగవలసి వచ్చిందనీ ఊరూ వాడా మారుమ్రోగిపోయింది. ఈ విషయం విని నేను బాధపడ్డాను. గోమాంసభక్షణం, మద్య సేవనం, పాశ్చాత్య వేషధారణం ఇట్టి విధులు విధించు మతం మతమనిపించుకోదను భావం నాకు కలిగింది. క్రొత్తగా మతం పుచ్చుకున్న ఆ వ్యక్తి అప్పుడే హిందూమతాన్ని, హిందూ దేవుళ్ళను, ఆచారాలను, చివరకు హిందు దేశాన్ని సైతం విమర్శిస్తున్నాడని విన్నాను. ఇట్టి విషయాలన్నీ క్రైస్తవ మత మంటే నాకు అరుచి కలిగించాయి.
ఇతర మతాల యెడ సమభావం కలిగిందంటే నాకు దేవుని మీద పూర్తిగా శ్రద్ధ ఏర్పడిందని అనుకోకూడదు. యిదే సమయంలో మా తండ్రిగారి దగ్గరగల గ్రంథ సముదాయంలో మనుస్మృతి అను గ్రంధం కనబడింది. అందు లిఖించబడిన విషయాలు నాకు శ్రద్ధ కలిగించలేదు. కొద్ది నాస్తికత్వం కలిగించాయి. మా రెండో పినతండ్రి కుమారుని తెలివితేటల మీద నాకు విశ్వాసం కలిగింది. నా సందేహాల్ని అతనికి తెలియజేశాను. అతడు నా సందేహనివృత్తి చేయలేకపోయాడు. “పెద్దవాడవైన తరువాత సందేహ నివృత్తి నీవే చేసుకోగలుగుతావు. చిన్నపిల్లలు ఇటువంటి ప్రశ్నలు వేయకూడదు.” అని అతడు అన్నాడు. మనస్సుకు శాంతి లభించలేదు. మనుస్మృతి, అందు ఖాద్యాఖాద్య ప్రకరణం, తదితర ప్రకరణాలలో ప్రచలిత విధానాలకు విరుద్ధమైన కొన్ని విషయాలు వ్రాసివున్నాయి. యీ విషయమై కలిగిన సందేహానికి సమాధానం కూడా అదే పద్ధతిలో లభించింది. పెద్దవాడవైన తరువాత చదివి తెలుసుకుంటానమి మనస్సుకు నచ్చచెప్పకున్నాను.
మనుస్మృతి చదివిన ఆ సమయంలో నాకు అహింసా బోధ కలుగలేదు, మనుస్మృతిలో మాంసాహారానికి సమర్థన లభించింది. పాములు, నల్లులు మొదలుగా గల వాటిని చంపడం నీతి బాహ్యం కాదని తోచింది. ఆ రోజుల్లో ధర్మమని భావించి నల్లుల్ని నేను చంపాను. ఆ విషయం యిప్పటకీ నాకు జ్ఞాపకం వున్నది.
ఒక్క విషయం మాత్రం గాఢంగా నా హృదయంలో నాటుకున్నది. ఈ ప్రపంచం నీతిమీద నిలబడి వున్నది. నీతి అనేది సత్యంతో కూడివుంది కనుక సత్యాన్వేషణ జరిపితీరాలి అను భావం నాలో గట్టిపడింది. రోజురోజుకి సత్యం యొక్క మహత్తు నా దృష్టిలో పెరిగిపోసాగింది, సత్యాన్ని గురించిన వాఖ్య నా దృష్టిలో విస్తరించింది. యిప్పటికీ విస్తరిస్తూ ఉంది.
నీతికి సంబంధించిన ఒక ఛప్పయ్ ఛందం హృదయంలో చోటు చేసుకున్నది. ఆ పద్యంలో చెప్పబడిన అపకారానికి ప్రతీకారం అపకారం కాదు, ఉపకారం సుమా! అను సూత్రం నా జీవితానికి మూలమైంది. ఆ సూత్రం నా మనస్సుపై రాజ్యం చేసింది. అపకారికి మేలుకోరడం, మేలు చేయడం అంటే అనురాగం పెరిగింది. ఈ విషయమై ఎన్నో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను. ఆ మహత్తరమైన ఛప్పయ్ ఛందస్సు క్రింద ఉటంకిస్తున్నాను.
పాణీ ఆపనే పాయ్, భలుం భోజన్ తో దీజే
ఆనీ నమానే శీశ్, దండవత్ కోడే కీజే
ఆపణ ఘూసే దామ్, కామ్ మహోరో నుం కరిఏ
గుణ కేడేతో గుణ దశగణో, మన వాచా కర్మేకరీ
అవగుణ కేడేజే గుణకరే, తేజగమాంజీత్యో సహీ.
“జలమును మీకీయగలవాని కెందేని నొసగుమీ కడుపార నోగిరంబు
వందనంబును జేయువానికిజేయుమీ భుక్తిమై సాష్టాంగవందనంబు
దమ్మిడినీకిచ్చు ధన్యాత్మునకు మాఱుగా నిమ్ము నీ నెమ్మేనినేని కోసి
ఒకటియొసగిన బదిరెట్టులొసగవలయు
చెట్టు చేసిన మేలును జేయవలయు
ప్రాతఃకాలము నాటి యీ చేతలెల్ల
అనుపూర్విగ సత్యరహస్యమరయ”
(తెలుగు సేత - శతావధాని వేలూరి శివరామశాస్త్రి)